Thursday, April 9, 2026
దుర్భాష దుఃఖానికి చేటు
(విశ్వాసులారా!) వారు అల్లాహ్ ను వదలి ప్రార్థించే మిధ్యాదైవాల్ని మీరు దూషించకండి. అలాచేస్తే వారు బహుదైవారాధనను కూడా మించిపోయి, అజ్ఞానంతో అల్లాహ్ నే దూషించడానికి సిద్ధపడతారు. మేము ప్రతి వర్గానికీ వారు చేస్తున్న పనులనే ఆకర్షణీయమైనవిగా చేశాం. చివరికి వారు తమ ప్రభువు సన్నిధికే పోవలసి ఉంది. అప్పుడాయన గతంలో వారు చేస్తుండిన (తప్పుడు) పనులేమిటో వారికి తెలియజేస్తాడు. (అల్-అన్ఆమ్: 108)
ఆత్మ ఆరాటం అల్లాహ్ ను చేరాలని, శరీరం ఆరాటం భోగాలను ఆస్వాదించాలని. ఈ రెండు ఆరాటాల మధ్య పోరాటమే జీవితం. రెండు ఆరాటాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవిత పరమార్థం. చెడు అనటం, చెడును అనుసరించటం, తిట్ల పురాణం మొదలెట్టడం ఒక పరిపూర్ణ విశ్వాసికి ఏ విధంగానూ శోభించదు. మన మాటలో మన విశ్వాసం ప్రతిబింబించాలి. మన నోటి నుండి వెలువడే ప్రతి మాట అల్లాహ్ కు ఇష్టమైనదిగా, ఇతరులకు ఇంపుగా, వినసొంపుగా ఉండాలి. మన మాటలు సమాజాన్ని, సంసారాన్ని నిర్మించాలి గానీ, కూల్చకూడదు. అందుకే నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్టు దుర్భాషలను దూరంగా ఉంటూ, ప్రేమతో, సహనంతో, జ్ఞానంతో మాట్లాడే అలవాటును పెంపొందించుకోవడం ఎంతో అవసరం.
దుర్భాష - వ్యక్తిత్వాన్ని నాశనం చేసే విషం
మనిషికి ఇచ్చిన గొప్ప వరం మాట్లాడే శక్తి. అదే మాట అతని వ్యక్తిత్వాన్ని వెలిగిస్తుంది కూడా, చీకట్లో నెట్టేస్తుంది కూడా. ఆ మాటలు సంస్కారంతో, సహనంతో, గౌరవంతో ఉంటే వ్యక్తి ఎదుగుతాడు; అదే మాటలు దుర్భాషగా మారితే అతనే తన పతనానికి కారణమవుతాడు. నేడు దుర్భాషచాలా సాధారణ విషయంగా మారిపోయింది. చిన్నవారైనా, పెద్దవారైనా తమ కోపం, బాధ లేదా నిరాశను వ్యక్తపరచడానికి అసభ్య పదాలను పిసరంత బాధ్యత కూడా లేకుండా ఉపయోగిస్తున్నారు. తప్పు అని తెలిసినా చాలామంది “అందరూ మాట్లాడుతున్నారు కదా” అనే భావనతో ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. ఈ స్థితికి మనం ఎంతగా అలవాటుపడ్డాం అంటే, ఎవరు కఠినమైన లేదా అసభ్యకరమైన భాష వాడుతున్నారన్న విషయం కూడా మనకు అర్థం కావడం లేదు, లేదా అర్థం చేసుకోవడానికి మనం సిద్ధంగా లేము.
దుర్భాష అంటే కేవలం తిట్లు తిట్టడం మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తి గౌరవాన్ని కించపరచే మాట, అవమానించే ధోరణి, హేళన చేసే వ్యాఖ్య- ఇవన్నీ దుర్భాషకే చెందుతాయి. కొందరు చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని నోటికి వచ్చిన మాట మాట్లాడతారు. గోడకు తగిలితే గోడను తిడతారు, వాహనం స్టార్ట్ కాకపోతే దానిని తిడతారు, నెట్‌వర్క్ పని చేయకపోతే దానిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటారు. ఇలా అలవాటు అయిన దుర్భాష చివరికి మనిషి నడవడికలోనే భాగమైపోతుంది. ఎవరో ఒకర్ని తిట్టందే వారి పొద్దు గడవదు. వీరు ఎలాంటి వారాంటేనండి, తిట్టడం ఒక యోగం..తిట్టించడం ఒక భోగం..తిట్టలేకపోవడం... ఒక రోగం.. అనే రకం. న బూతో న భవిష్యత్తు వరకే ఆగరు నా బూతే నా భవిష్యత్తు వరకు సాగిపోతారు.
దుర్భాష మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని తగ్గించుకుంటున్నానని భావిస్తాడు, కానీ నిజానికి అతను తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నాడు. తిట్లు మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తికి తాత్కాలికంగా బాధ కలగవచ్చు, కానీ దీర్ఘకాలంలో నష్టం కలిగేది మాట్లాడేవాడికే. కుటుంబంలో అటువంటి వ్యక్తి ఉంటే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది, పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. కార్యాలయంలో ఉంటే ఉద్యోగులు భయంతో పని చేస్తారు, ప్రేమతో కాదు. సమాజంలో అతని మాటకు విలువ తగ్గిపోతుంది. తిట్టు తెచ్చే తంటా అంతా ఇంతా కాదు. దుర్భాష దైవాగ్రహానికి కారకం. దుర్భాష జనాగ్రహానికి ప్రేరకం. బూతులు తిడుతూ నీతులు వల్లించే బడా బాబులు మన మధ్య చాలానే ఉన్నారు. నోరు తెరిస్తే చాలు గబ్బు. వారి దృష్టిలో ఇతరుల కంపే కంపు., వారి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. దుర్భాష యేదైనను మన నోట రానీయకూడదు.
ఇస్లాం ధర్మం దుర్భాషను తీవ్రంగా నిషేధించింది. ఒక ముస్లింను తిట్టడం పాపం, అతని గౌరవాన్ని అవమానించడం అతి ఘోరమైన తప్పు అని బోధించింది. ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి జీవితమే దీనికి ఉత్తమ ఉదాహరణ. ఎంతటి బాధలు ఎదురైనా, ఎంతటి అవమానాలు ఎదురైనప్పటికీ, ఆయన నోటి నుంచి దుర్భాష ఎప్పుడూ వెలువడలేదు. సహనం, క్షమ, మృదుత్వమే ఆయన ఆయుధాలు. దుర్భాష మాట్లాడే వ్యక్తిని ప్రజలు గౌరవించినా, అది నిజమైన గౌరవం కాదు. అతని కోపం నుంచి తప్పించుకోవడానికి, అతని హాని నుంచి రక్షించుకోవడానికి మాత్రమే చూపించే గౌరవం అది. అటువంటి వ్యక్తిని హదీస్‌లో “అత్యంత చెడ్డవాడు”గా పేర్కొనడం మనకు గొప్ప హెచ్చరిక.
కాబట్టి మనం ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి-నోటి నియంత్రణ అంటే ఆత్మ నియంత్రణ. కోపం వచ్చినప్పుడు మాటను ఆపగలిగిన వాడే నిజమైన బలవంతుడు. తిట్లకు బదులు మౌనం, అవమానానికి బదులు సహనం, కోపానికి బదులు ప్రార్థన అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా పవిత్రమవుతుంది, మన చుట్టూ ఉన్నవారి జీవితాలూ ప్రశాంతంగా మారతాయి. మన మాటలే మన గౌరవానికి అద్దం. దుర్భాషను వదిలితే - వ్యక్తిత్వం వెలుగుతుంది.
గాళియోన్ కీ రవిష్ కో కమ్ కీజే / ఆప్ కీ చల్తీ హై జుబాన్ బహుత్
ఫారసీలో ఓ కవిత ఉంది
తా మర్ద్ సుఖన్ నగుఫ్తా బాషద్ / ఐబ్ ఓ హునర్ష్ నిహుఫ్తా బాషద్
మనిషి మాట్లాడనంత వరకూ, అతనిలోని లోపాలు మరియు ప్రతిభ (నైపుణ్యం) దాగి ఉంటాయి.
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “అశ్లీలతకు దూరంగా ఉండండి, అలాగే అశ్లీలంగా ప్రవర్తించడాన్ని కూడా విడిచిపెట్టండి. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలమైన మాటలు పలికేవారిని, అశ్లీలంగా ప్రవర్తించేవారిని ఇష్టపడడు .” (అబూ దావూద్)
ముమిన్ (విశ్వాసి) దూషణలు చేసే వాడు కాదు, శాపనార్థాలు పలికే వాడు కాదు, అశ్లీలమైన మాటలు మాట్లాడే వాడు కాదు, అలాగే అసభ్యంగా మాట్లాడే వాడు కూడా కాదు. (తిర్మిజీ)
దైవ ప్రవక్త దుర్భాషలాడేవారు కారు. అశ్లీలంగా మాట్లాడే వారు కాదు, అలాగే శాపనార్థాలు పలికే వారు కూడా కాదు. ఎవరిపై అయినా ఆయనకు అసంతృప్తి కలిగితే, ఆయన కేవలం ఇలా చెప్పేవారు: “ఇతనికి ఏమైంది? ఇతని నుదురు మన్నుతగులుగాక.” (సహీహ్ బుఖారీ)
జాబిర్ బిన్ సులైమ్ (రజి అల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: "నేను ఒక వ్యక్తిని చూశాను, ప్రజలందరూ ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు. ఆయన ఏమి చెప్పినా వారు దానిని అంగీకరిస్తున్నారు. 'ఈయన ఎవరు?' అని నేను అడిగాను. 'ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త ' అని వారు చెప్పారు. నేను ఆయన వద్దకు వెళ్లి, 'అలైకస్సలామ్ ఓ అల్లాహ్ ప్రవక్తా!' అని రెండుసార్లు అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు:'అలైకస్సలామ్ అని అనకు, ఎందుకంటే అది మరణించిన వారికి చెప్పే సలామ్. నువ్వు 'అస్సలాము అలైక' అని చెప్పు.' నేను అడిగాను: 'మీరు అల్లాహ్ ప్రవక్తనా?' ఆయన ఇలా సమాధానమిచ్చారు: 'అవును, నేను ఆ అల్లాహ్ ప్రవక్తను - ఎవరైతే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆయనను ప్రార్థిస్తే ఆ కష్టాన్ని తొలగిస్తాడో, కరువు కాటకాలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తే భూమి నుండి పంటను మొలిపిస్తాడో, మరియు ఎడారిలో నీ వాహనం తప్పిపోయి నప్పుడు నువ్వు వేడుకుంటే దానిని నీకు తిరిగి చేరుస్తాడో, ఆ అల్లాహ్ పంపిన ప్రవక్తను నేను.'
నేను 'నాకు ఏదైనా ఉపదేశం చేయండి' అని కోరాను. అప్పుడు ఆయన ఇలా బోధించారు:ఎవరినీ దూషించకు (తిట్టకు). (ఆ తర్వాత నేను ఎప్పుడూ ఏ స్వతంత్రుడిని, బానిసను, ఒంటెను లేదా మేకను కూడా దూషించలేదు). ఏ మంచి పనిని కూడా తక్కువగా చూడకు. నీ సోదరునితో చిరునవ్వుతో మాట్లాడటం కూడా ఒక మంచి పనే. నీ వస్త్రాన్ని (లుంగీ/ప్యాంటు) పిక్కల వరకు ఉంచుకో. అది వీలుకాకపోతే కనీసం చీలమండల వరకు ఉంచుకో. వస్త్రాన్ని నేలకి తగిలేలా వేలాడదీయకు (ఇస్బాల్), ఎందుకంటే అది అహంకారానికి, ఎచ్చుకి, బడాయికి గుర్తు. అల్లాహ్ అహంకారాన్ని ఇష్టపడడు. ఒకవేళ ఎవరైనా నిన్ను తిట్టినా, లేదా నీలో ఉన్న లోపాలను ఎత్తిచూపినా, నువ్వు మాత్రం వారిలో నీకు తెలిసిన లోపాలను ఎత్తిచూపకు. దాని వల్ల కలిగే పాపం వారికే చెందుతుంది." (అబూ దావూద్)
దుర్భాష వివిధ రూపాలు:
అల్లాహ్‌ను దూషించడం:
అల్లాహ్‌ను తిట్టడం లేదా దూషించడం వంటి దుర్వర్తన గల వ్యక్తి 'కాఫిర్' (అవిశ్వాసి) అవుతాడు. అలాగే అల్లాహ్ ఆయతులను (సూక్తులను), గ్రంథాలను మరియు ప్రవక్తలను దూషించడం లేదా ఆయన గుణగణాలను కించపరచడం కూడా కుఫ్ర్ (అవిశ్వాసం) కిందకే వస్తుంది.
ఇమామ్ ఇబ్న్ ఖుదామా (రహీమహుల్లా) వివరణ:"ఎవరైతే అల్లాహ్‌ను దూషిస్తారో, వారు కాఫిర్ అవుతారు-అది సరదాగా చేసినా లేదా సీరియస్‌గా చేసినా సరే. అదేవిధంగా అల్లాహ్ ను, ఆయన ఆయత్‌లను, ఆయన ప్రవక్తలను లేదా ఆయన గ్రంథాలను ఎగతాళి చేసేవారు కూడా కుఫ్ర్ చేసినట్లే."
అల్లాహ్‌ను దూషించడంలోని మరొక రూపం:
అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పడం కూడా ఆయన్ని దూషించడమే అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (ర) ఉల్లేఖించిన ఒక హదీసే ఖుద్సీలో ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ తాలా ఇలా అంటున్నాడు: "ఆదమ్ కుమారుడు (మనుషులు) నన్ను దూషిస్తున్నాడు, అలా చేయడం అతనికి తగదు. అతను నా మాటను సత్యమని నమ్మడం లేదు, అది కూడా అతనికి తగదు. నన్ను దూషించడం అంటే... 'నాకు సంతానం ఉంది' అని అతను అనడం. నా మాటను సత్యమని నమ్మకపోవడం అంటే, 'నేను అతన్ని మొదటిసారి సృష్టించినట్లుగా, మళ్ళీ పుట్టించలేను' అని అతను అనడం." (బుఖారీ)
అల్లాహ్కు బిడ్డలున్నారని అనటం ఎంత ఘోరమైన నేరమంటే, దానికి అల్లాహ్ అమితంగా ఆగ్రహిస్తాడు. వారి అపవాదుకు మిన్ను విరిగి మీద పడవచ్చు. భూమి ప్రకంపించ వచ్చు. పర్వతాలు బద్దలైపోవచ్చు. ఖుర్ఆన్ ఇలా ఉంది: కరుణామయుడు ఒకడ్ని తన కొడుకుగా చేసుకున్నాడని అంటున్నారు వారు. “మీరు చాలా ఘోరమయిన మాట కల్పించి చెబుతున్నారు. కరుణామయునికి సంతానం ఉందని చెప్పటం ఎంత తీవ్రమైన విషయమంటే దానివల్ల మిన్ను విరిగి పడవచ్చు; భూమి బ్రద్దలై పోవచ్చు; పర్వతాలు పగిలి ముక్కలై పోవచ్చు. సంతానం కలిగివుండటం కరుణామయునికి ఎంతమాత్రం శోభించదు. (అల్-మర్యమ్: 88-92)
ప్రవక్త ముహమ్మద్ ను దూషించడం:
ప్రవక్త ముహమ్మద్ (స) గురించి చెడుగా మాట్లాడటం, వారిని నిందించడం లేదా పరుష పదజాలాన్ని ఉపయోగించడం 'కుఫ్ర్' (అవిశ్వాసం). ఈ నేరానికి పాల్పడే వ్యక్తికి మరణశిక్ష విధించబడుతుంది. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్ ను , ఆయన ప్రవక్తను బాధిస్తున్నవారిని దేవుడు ప్రపంచంలోనూ, పరలోకం లోనూ (నశించాలని) శపిస్తున్నాడు. వారి కోసం అవమానకరమైన (నరక) యాతనలు సిద్ధంచేశాడు. విశ్వసించిన స్త్రీ పురుషుల్ని అన్యాయంగా వేధిస్తున్నవారు నిజానికి ఘోర మైన అపనిందను, స్పష్టమైన పాపభారాన్ని తమ నెత్తిమీద వేసుకుంటున్నారు. (అల్-అహ్జాబ్: 57-58)
సహాబాలను దూషించడం:
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సహాబాను గౌరవించడం ప్రతి ముస్లిం బాధ్యత. వారిని దూషించడం మహా చెడ్డ నేరం. ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: "ఎవరైతే నా సహాబాలను దూషిస్తారో, వారిపై అల్లాహ్ యొక్క, అల్లాహ్ దూతల మరియు మానవులందరి శాపం ఉంటుంది." (తబ్రానీ)
"నా సహాబాను దూషించకండి, నా సహాబాను దూషించకండి! నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను... మీలో ఎవరైనా 'ఉహుద్' పర్వతమంత బంగారాన్ని దానం చేసినా, అది వారు దానం చేసిన ఒక 'ముద్' (ఒక గుప్పెడు) ధాన్యానికి లేదా అందులో సగానికి కూడా సమానం కాదు." (బుఖారీ)
తల్లిదండ్రులను దూషించడం:
తల్లిదండ్రులు ఈ లోకంలో మనిషి జన్మించడానికి కారకులు. వారు తమ శక్తినంతటినీ సంతానం యొక్క బంగారు భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. తమ సొంత సుఖసంతోషాలను త్యాగం చేసి, పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అటువంటి వారిని నిందించడం లేదా దూషించడం చాలా పెద్ద పాపం. లేశమంత మానవత్వం లేని వ్యక్తి మాత్రమే ఇటువంటి పనికి ఒడిగడతాడు. ఇస్లాం ధర్మ ఆవిర్భావానికి పూర్వం కూడా గౌరవప్రదమైన వ్యక్తులు ఇలాంటి దిక్కుమాలిన పనిని ఊహించేవారు కాదు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ అమర్ (రజి) నివేదించిన కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు: "ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను దూషించడం మహా పాపాలలో ఒకటి." అప్పుడు సహాబా ఆశ్చర్యంతో ఇలా అడిగారు: "ఓ దైవప్రవక్త! ఎవరైనా తమ సొంత తల్లిదండ్రులను దూషిస్తారా?" దానికి ప్రవక్త (స) ఇలా సమాధానమిచ్చారు: "అవును, ఒక వ్యక్తి వేరొకరి తండ్రిని దూషించినప్పుడు, ప్రతిగా అతను ఇతని తండ్రిని దూషిస్తాడు. అలాగే ఒకరు వేరొకరి తల్లిని దూషించినప్పుడు, అతను ఇతని తల్లిని దూషిస్తాడు (అంటే ఇతరుల తల్లిదండ్రులను దూషించడం ద్వారా తన స్వంత తల్లిదండ్రులు దూషించబడటానికి ఇతనే కారణమవుతున్నాడు)." (బుఖారీ, ముస్లిం)
సంతానంపై తల్లిదండ్రుల హక్కు చాలా పెద్దది. ఆ హక్కులో కనీస మర్యాద ఏమిటంటే: వారిని గౌరవించడం, వారి ఉన్నత స్థానాన్ని గుర్తించి, ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ వారికి ఎటువంటి హాని కలిగించకుండా ఉండటం. తల్లిదండ్రులను దూషించడం లేదా తిట్టడం అనేది వారి పట్ల చూపే అవిధేయత, మరియు వారు చేసిన ఉపకారాలను విస్మరించడమే అవుతుంది. ఇది విన్న ప్రవక్త అనుచరులు ఆశ్చర్యపోయారు. ఎవరైనా తన సొంత తల్లిదండ్రులను ఎలా శపిస్తారు? అని వారు ప్రశ్నించారు. ఎందుకంటే మనిషి యొక్క సహజ స్వభావం తన తల్లిదండ్రులను శపించడానికి అంగీకరించదు. అప్పుడు ప్రవక్త (స) ఇలా వివరించారు:"ఒక వ్యక్తి వేరొకరి తండ్రిని దూషించినప్పుడు, ఆ అవతలి వ్యక్తి ప్రతిగా ఇతని తండ్రిని మరియు తల్లిని దూషిస్తాడు." అంటే, ఒక వ్యక్తి నేరుగా తన తల్లిదండ్రులను తిట్టకపోయినా, ఇతరుల తల్లిదండ్రులను దూషించడం ద్వారా తన తల్లిదండ్రులు తిట్లు తినడానికి తనే కారణం (తసబ్బుబ్) అవుతున్నాడు. తల్లిదండ్రులు దూషించబడటానికి కారణం కావడమే మహా పాపమైతే, ఇక నేరుగా వారిని దూషించడం, ద్వేషించడం, కొట్టడం, ఇంటి నుండి గెంటేయడం, వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం ఎంతటి ఘోరమైన పాపమో మనం అర్థం చేసుకోవచ్చు.
హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రజి) కథనం ప్రకారం ప్రవక్త (స) ఇలా అన్నారు: "తమ తండ్రిని దూషించేవాడు శాపగ్రస్తుడు.తన తల్లిని దూషించేవాడు శాపగ్రస్తుడు." (ముస్నద్ అహ్మద్)
పిల్లల్ని దీవించాలి, దూషించకూడదు
తల్లిదండ్రుల తిట్టు, దూషణ, శాపం కూడా దుఆనే అంటారు. ఇది కరెక్ట్ కాదు. అలాంటి ప్రమాణం ఎక్కడా లేదు. అవును, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ దూషించకూడదు (తిట్టకూడదు). ఇది పిల్లల మనస్తత్వంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వారు కూడా అమర్యాదగా ప్రవర్తించడం నేర్చుకుంటారు మరియు కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. ఇస్లామీయ బోధనల ప్రకారం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, గౌరవంతో మరియు మంచి మాటలతో పెంచాలి. ప్రతి ముస్లిం అపశబ్దాలు పలకకుండా ఉండటం ఒక బాధ్యత.
సానుకూల వాతావరణం (Positive Environment): ఇంట్లో తిట్లు, దూషణలు ఉంటే ద్వేషం మరియు విభేదాలు పెరుగుతాయి. పిల్లలు సరిగ్గా పెరగాలంటే ఇంట్లో ప్రేమతో కూడిన సానుకూల వాతావరణం ఉండాలి.
పిల్లలపై ప్రభావం: తల్లిదండ్రుల మాట తీరే పిల్లలకు ఆదర్శం. తల్లిదండ్రులు తిడుతుంటే, పిల్లలు కూడా అదే నేర్చుకుని బయట సమాజంలో అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఇస్లాం తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల కరుణ, మృదుత్వం మరియు మంచి సంభాషణను కలిగి ఉండాలని ఆదేశించింది. అశ్లీల పదజాలానికి దూరంగా ఉండాలని నొక్కి చెప్పింది.
తల్లిదండ్రులు ఏమి చేయాలి?
కరుణతో వ్యవహరించండి: పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు వారిని కోప్పడకుండా, ప్రేమగా ఆ తప్పును వివరించండి. శిక్షించడం కంటే సరైన శిక్షణ (తర్బియత్) ఇవ్వడం ముఖ్యం. మంచి పదజాలం వాడండి: మీ సంభాషణలో ఎప్పుడూ మృదువైన మరియు గౌరవప్రదమైన పదాలను మాత్రమే ఉపయోగించండి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే ప్రతిదీ నేర్చుకుంటారు. కాబట్టి, మీరు వారికి ఒక మంచి ఉదాహరణగా (Role Model) నిలవండి.అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏ పుణ్యకార్యం చేయలేము లేదా పాపం నుండి తప్పించుకోలేము. కాబట్టి, మన నాలుకను కాపాడుకోవడానికి అల్లాహ్ తౌఫీక్ ప్రసాదించాలని కోరుకుందాం.
భార్యాభర్తల మధ్య దూషణ:
మంచి కంటే చెడే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. వ్యక్తులే కాదు.. అనుబంధాలూ ఇలాగే ప్రభావితమవుతుంటాయి. ఇద్దరి మధ్యగొడవైనా, మూడో వ్యక్తి వల్ల సమస్య వచ్చినా.. చాలామంది విషయంలో భాగస్వామిని చూసే దృష్టి కోణం ఎప్పుడూ నెగెటివ్గానే ఉంటుంది. దీన్నే 'నెగెటివ్ సెంటిమెంట్ ఓవరైడ్ అంటున్నారు నిపుణులు. అదే ఆ క్షణికావేశం నుంచి బయటపడి.. అవతలి వారిలోని మంచిని చూడగలిగితే.. దంపతుల మధ్య వచ్చే ఎన్నో అభిప్రాయభేదాలకు ఆదిలోనే చెక్ పెట్టచ్చంటున్నారు. అనుబంధాన్ని పెంచుకోవాలన్నా, తెంచుకోవాలన్నా.. మనం భాగస్వామిని చూసే దృష్టి కోణం పైన ఆధారపడి ఉంటుందని, మన నోట వెలువడే మాట మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. తిట్టు నిన్ను నరకానికి నెట్టు అన్నట్టు కాపురంలో నిప్పులు పోస్తుంది. నూరు మంచిదయితే ఊరు మంచుదువుతుంది అన్నట్టు మన మాట అదుపు తప్పకుండా ఉంటే కాపురం కూడా బంగారమగు ఉంటుంది.
భార్యాభర్తల బంధం ప్రేమ, అనురాగం మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. భర్తను గౌరవించడం భార్య బాధ్యత అయితే, భార్యతో సత్ప్రవర్తనతో మెలగడం భర్త విధి. భార్య జీవిత భాగస్వామి, కాబట్టి ఆమె భావాలను గౌరవించాలని షరియత్ బోధిస్తోంది. అందువల్ల, భర్త తన భార్యను నిందించడం లేదా అసభ్య పదజాలంతో దూషించడం మానుకోవాలి. అలాగే భార్య కూడా భర్త విషయంలో, వారి బంధువుల విషయంలో నూరు పారేసుకోవడం మానుకోవాలి. దంపతులిద్దరూ పరస్పరం మృదువుగా మరియు ఉత్తమ నైతిక ప్రవర్తనతో వ్యవహరిం చాలి. ఇంటిగుట్టు రచ్చకీడ్చకూడదు. ఒకవేళ మీ కుటుంబ విషయాలు బయట వ్యక్తులతో ప్రస్తావించడం అంటే అది మిమ్మల్ని మీరే నవ్వుల పాలు చేసుకోవడమే అవుతుంది. ఒండొకరిని తిట్ల తాంబూలాలిచుకుంటే, పిల్లకు ఆ చెడ్డ అలవాటు సోకే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త! కాపురాలు నమ్మకంతో నిలబడతాయి, అనుమానం, పద దూషణంతో కాదు అన్న ఎరుకతో వ్యవహరించాలి.
భార్య భర్తల బంధం ప్రేమ, గౌరవం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మాటలు, పనులు అనుకోకుండా సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ప్రత్యేకించి భర్తలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న శ్రద్ధతో పరస్పరం గౌరవం పెరిగి బంధం మరింత బలపడుతుంది. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. ఈ బంధాన్ని సున్నితంగా ప్రేమతో ఒకరికొకరు గౌరవించుకుంటూ కొనసాగించాలి. ఒకరి మనసుకు నొప్పి కలిగించే మాటలు లేదా పనులు ఈ బంధాన్ని చెడగొట్టే ప్రమాదం కలిగి ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజం. కానీ అలాంటి సమయంలో కోపంగా మాట్లాడుతూ.. నీ పని చూసుకో, నోర్మూసుకో ... వంటి అవమానకర పదాలు ఎవారూ ఎవ్వరిని అనకండి. అవి మనసు నొప్పించి, ఒప్పించి చేసుకున్న మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి.
కార్మికులను మరియు సేవకులను దూషించడం:
సేవకుల పట్ల గౌరవం: మానవులందరూ ఆదమ్ (అలైహిస్సలాం) సంతానమే. అయితే, ఈ ప్రపంచ వ్యవస్థ సజావుగా సాగడానికి అల్లాహ్ ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను మరియు విభిన్న సామర్థ్యాలను కల్పించాడు. ఒకరిని యజమానిగా, మరొకరిని సేవకునిగా చేశాడు. సేవకులు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలని, అదే సమయంలో యజమానులు తమ కింద పనిచేసే వారి పట్ల సాధ్య మైనంత ఉత్తమంగా ప్రవర్తించాలని మరియు వారి విషయంలో అల్లాహ్‌కు భయపడి ఉండాలని ఆదేశించాడు. అందుకే, సేవకులను లేదా తన కింద పనిచేసే వారిని తక్కువ చేసి మాట్లాడటం లేదా దూషించడం నిషిద్ధం. ఒక విశ్వాసి తన కోసం తాను ఏది ఇష్టపడతాడో, తన సేవకుల పట్ల కూడా అదే ప్రవర్తనను కలిగి ఉండాలని ఇస్లాం బోధిస్తోంది.
హజ్రత్ అబూజర్ గిఫారి (రజి) ఉదంతం: మారూర్ బిన్ సువైద్ (రహ) కథనం ప్రకారం: "నేను 'రబ్జా' అనే ప్రదేశంలో హజ్రత్ అబూజర్ (రజి)ని కలిశాను. అప్పుడు ఆయన ఒక చక్కని వస్త్రాన్ని ధరించి ఉన్నారు, ఆయన సేవకుడు కూడా అచ్చం అటువంటి వస్త్రాన్నే ధరించి ఉన్నాడు. దీని గురించి నేను ఆయన్ని అడగగా, ఆయన ఇలా వివరించారు: 'గతంలో నేను ఒక వ్యక్తిని (సేవకుడిని) అతని తల్లిని ఉద్దేశించి తక్కువ చేసి దూషించాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు: ఓ అబూజర్! నీవు అతనిని అతని తల్లి పేరుతో అవమానించావా? నీలో ఇంకా అజ్ఞాన కాలపు అహంభావం మిగిలి ఉంది. మీ సేవకులు మీ సోదరులు. అల్లాహ్ వారిని మీ ఆధీనంలో ఉంచాడు. కాబట్టి, ఎవరి ఆధీనంలోనైనా తన సోదరుడు (సేవకుడు) ఉంటే, అతను తాను తినే ఆహారాన్నే అతనికి పెట్టాలి, తాను ధరించే దుస్తులనే అతనికి తొడిగించాలి. వారి శక్తికి మించిన పనులను వారిపై మోపకండి. ఒకవేళ అటువంటి కష్టమైన పనిని వారికి అప్పగిస్తే, ఆ పనిలో వారికి సహాయం చేయండి."' (సహీహ్ బుఖారీ)
ముస్లింను దూషించడం:
ముస్లింలు అందరూ ఒకరికొకరు సోదరులు మరియు ఒకే శరీరం వంటివారు. కాబట్టి, ఒక ముస్లింను చెడు మాటలు అనడం లేదా దూషించడం చాలా పెద్ద పాపం. దీనివల్ల ఇస్లామీయ సోదరభావం దెబ్బతింటుంది మరియు పరస్పరం హృదయాలలో ద్వేషం, దూరం మరియు శతృత్వం ఏర్పడతాయి.
దూషించడం అనేది అత్యంత అసభ్యకరమైన మరియు నిర్లజ్జతో కూడిన పని. అంతేకాకుండా, దీనివల్ల గొడవ ముగిసిపోవడానికి బదులు ఇంకా పెరుగుతుంది. దీనివల్ల కొట్లాటలు, దాడులు మరియు చివరకు ప్రాణాలు తీసే వరకు పరిస్థితి వెళ్తుంది. హదీసుల వెలుగులో: సయ్యిదినా అబ్దుల్లా బిన్ మసూద్ (రజి) ఉల్లేఖించిన ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు: "ముస్లింను దూషించడం పాపం (ఫుసూఖ్) మరియు అతనితో పోరాడటం కుఫ్ర్ (అవిశ్వాసం)." (బుఖారీ)
ఈ హదీసులో ప్రవక్త ముహమ్మద్ (స) ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని తిట్టడాన్ని లేదా దూషించడాన్ని నివారించారు. ఒక ముస్లిం గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం లేదా అతడిని తక్కువ చేసి చూపడం 'ఫుసూఖ్' (పాపం) అని చెప్పబడుతుంది. షరియత్ ప్రకారం 'ఫుసూఖ్' అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను ఉల్లంఘించి, విధేయత నుండి బయటకు రావడం. ఇది సాధారణ అవిధేయత కంటే తీవ్రమైనది. ఇక ముస్లింను చంపడం 'కుఫ్ర్': "అతనితో పోరాడటం లేదా చంపడం కుఫ్ర్ (అవిశ్వాసం)" అని ప్రవక్త (స) హెచ్చరించారు. అయితే, ఇక్కడ 'కుఫ్ర్' అంటే ఇస్లాం నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోవడం అని అర్థం కాదు. దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. వినేవారు అటువంటి పని చేయడానికి భయపడాలని ప్రవక్త (స) ఈ పదాన్ని వాడారు. ఇది అవిశ్వాసుల లక్షణం కాబట్టి, ఆ చర్యను కుఫ్ర్‌తో పోల్చారు. (అయితే, ఒకవేళ ఎవరైనా ముస్లింను చంపడం ధర్మబద్ధమే అని నమ్మితే, అప్పుడు అతను నిజంగానే ఇస్లాం నుండి వెలుపలికి వెళ్ళినట్టు అవుతుంది).
సయ్యిదినా అబ్దుల్లా బిన్ అమర్ (రజి అల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (స) ఇలా అన్నారు:"ముస్లింను దూషించేవాడు నాశనానికి మరియు వినాశనానికి చేరువలో ఉన్నవాడితో సమానం." (తిర్మిజీ)
పరలోకంలో నష్టం (దివాలా తీయడం):
ఇతరులను దూషించేవారు ప్రళయ దినమునతాము ఎవరినైతే దూషించారో వారికి తమ పుణ్యాలను ఇచ్చుకోవాల్సి వస్తుంది. హజ్రత్ అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఈ హదీసులో ప్రవక్త ﷺ ఇలా వివరించారు: ప్రవక్త (స) (సహాబాలను ఉద్దేశించి) ఇలా అడిగారు: "దివాలా తీసినవాడు (ముఫ్లిస్) ఎవరో మీకు తెలుసా?" సహాబాలు ఇలా విన్నవించుకున్నారు: "అల్లాహ్ ప్రవక్త! మాలో దివాలా తీసినవాడు అంటే, ఎవరి దగ్గరైతే నగదు (దీనార్, దిర్హమ్) మరియు ఆస్తిపాస్తులు లేవో అతడు."దానికి ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: "నా ఉమ్మత్‌లో (అనుచరులలో) నిజంగా దివాలా తీసినవాడు ఎవడంటే: అతడు ప్రళయ దినమున (ఖయామత్ రోజున) తను చేసిన నమాజులు, ఉపవాసాలు మరియు జకాత్ పుణ్యాలతో వస్తాడు. కానీ, అతను ఈ లోకంలో: ఒకరిని దూషించి ఉంటాడు, ఒకరిపై నిందలు వేసి ఉంటాడు, ఒకరి సొత్తును (ధనాన్ని) అన్యాయంగా తిని ఉంటాడు, ఒకరి రక్తాన్ని చిందించి ఉంటాడు (హింసించి ఉంటాడు), మరియు ఒకరిని కొట్టి ఉంటాడు. అప్పుడు (న్యాయ నిర్ణయ సమయంలో) అతని పుణ్యాల నుండి కొంత భాగం ఆ బాధితుడికి, మరికొంత భాగం ఈ బాధితుడికి ఇవ్వబడుతుంది. ఒకవేళ బాధితుల హక్కులు తీరకముందే అతని పుణ్యాలన్నీ అయిపోతే, అప్పుడు ఆ బాధితుల పాపాలను తీసుకోని ఇతనిపై వేయడం జరుగుతుంది. ఆ తర్వాత అతడిని నరకంలో పడవేయడం జరుగుతుంది." (ముస్లిం)
షైతాన్‌ను తిట్టడం లేదా దూషించడం
అబూ తలీహ్ (రజి అల్లాహు అన్హు) ఒక సహాబీ నుండి ఉల్లేఖించిన దాని ప్రకారం: "నేను ఒకసారి ప్రవక్త (స) వెనుక ఒకే వాహనం (సవారీ) పై కూర్చుని ఉన్నాను. ప్రయాణంలో ప్రవక్త (స) వాహనం ఒక్కసారిగా తడబడింది (కాలు జారింది). అప్పుడు నేను (కోపంతో): 'తఇసష్ షైతాన్' (షైతాన్ నాశనం గాను!) అని అన్నాను." అప్పుడు ప్రవక్త ﷺ నన్ను ఇలా వారించారు:"'షైతాన్ నాశనం గాను' అని అనకు. ఎందుకంటే నువ్వు అలా అన్నప్పుడు, షైతాన్ గర్వంతో ఉప్పొంగిపోయి ఒక పెద్ద ఇల్లు అంత పరిమాణానికి ఎదుగుతాడు. 'నా శక్తి వల్లే ఇలా జరిగింది' అని వాడు విర్రవీగుతాడు. కానీ నువ్వు 'బిస్మిల్లాహ్' (అల్లాహ్ పేరుతో) అని అను. ఎందుకంటే నువ్వు అలా అన్నప్పుడు, వాడు అవమానంతో కుంచించుకుపోయి ఒక చిన్న 'ఈగ' అంత పరిమాణానికి తగ్గిపోతాడు." (ముస్నద్ అహ్మద్)
అంటే, షైతాన్ గర్వం: ఏదైనా పొరపాటు లేదా ప్రమాదం జరిగినప్పుడు షైతాన్‌ను తిట్టడం వల్ల వాడు భయపడడు, పైగా తన వల్లనే ఆ ప్రమాదం జరిగిందని భావించి మరింత అహంకారిగా మారతాడు. 'బిస్మిల్లాహ్' అనడం ద్వారా మనం అల్లాహ్ రక్షణను కోరుకుంటాము. అల్లాహ్ పేరు వినగానే షైతాన్ బలహీనపడిపోతాడు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు కోప్పడటం లేదా ఎవరినో తిట్టడం కంటే, అల్లాహ్‌ను స్మరించడం ఉత్తమమైన మార్గమని ప్రవక్త (స) మనకు నేర్పారు.
క్యా హన్సీ ఆతీ హై ముఝ్ కో హజ్రత్-ఏ-ఇన్సాన్ పర్
ఫెయిల్-ఏ-బద్ ఖుద్ హీ కరేన్ లానత్ కరేన్ షైతాన్ పర్
ప్రవక్త (స) గారి మందలింపు కూడా కారుణ్యమే
ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త (స) ఎవరినీ దూషించేవారు కాదు, ఎవరికీ చెడు మాటలు అనేవారు కాదు. అయినప్పటికీ, ఒకవేళ పొరపాటున ఎవరినైనా మందలించినా, దాని వల్ల వారికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అల్లాహ్‌తో ఇలా దువా (ప్రార్థన) చేసేవారు. సయ్యిదినా జాబిర్ (రజి) ప్రవక్త ﷺ ఇలా అనడం విన్నారు: "నిశ్చయంగా నేను ఒక మానవుడిని. నేను నా రబ్ (ప్రభువు) తో ఒక ఒప్పందం చేసుకున్నాను: ముస్లింలలో నేను ఎవరినైనా (కోపంలో) మందలించినా లేదా దూషించినా, నా ఆ మాటలను వారి పాపాల ప్రక్షాళనకు (పవిత్రతకు) మరియు పుణ్యానికి కారణంగా మార్చు అని." (సహీహ్ బుఖారీ)
మిథ్యా దైవాలను దూషించకూడదు
అల్లాహ్ తప్ప వేరే నిజ దైవం లేదని నమ్మడం ఇస్లాం ప్రాథమిక సూత్రం. అయితే, మన పవిత్ర ధర్మం ఇస్లాం ఇతర మతాల వారు ఆరాధించే మిథ్యా దైవాలను దూషించవద్దని ఆదేశించింది. ఎందుకంటే, మనం వారి దైవాలను దూషిస్తే, వారు కోపంతో మరియు అజ్ఞానంతో మన నిజ దైవమైన అల్లాహ్‌ను దూషించే అవకాశం ఉంది. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా సెలవిచ్చాడు: "వారు (అల్లాహ్‌ను వదిలి) ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారిని మీరు దూషించకండి..." (అల్-అన్ ఆమ్: 108)
కోడిపుంజును దూషించకూడదు
సయ్యిదినా జైద్ బిన్ ఖాలిద్ అల్-జుహనీ (రజి) కథనం ప్రకారం: ఒకసారి ఒక కోడిపుంజు ప్రవక్త ﷺ సమక్షంలో కూసింది. అప్పుడు ఒక వ్యక్తి దానిని శపించాడు (నిందించాడు). అది విని ప్రవక్త (స) ఇలా అన్నారు: "దానిని శపించవద్దు, ఎందుకంటే అది నమాజ్ కోసం (ప్రజలను) మేల్కొల్పుతుంది." (సహీహ్ ఇబ్ను హిబ్బాన్)
కాలాన్ని దూషించకూడదు
రాత్రింబవళ్లు గడవడం, కాలం మారడం వంటివి అల్లాహ్ ఆధీనంలో ఉంటాయి. అందుకే కాలాన్ని తిట్టడం లేదా నిందించడం నిషేధించబడింది. సయ్యిదినా అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (స) ఇలా అన్నారు:"మీరు కాలాన్ని దూషించకండి, ఎందుకంటే అల్లాహ్ యే కాలానికి కర్త (అంటే కాలం అల్లాహ్ ఆధీనంలో ఉంది)."
అల్లాహ్ ఆకాశాలకు, భూమికి ప్రభువు. ఆయనే కాలానికి మరియు స్థలానికి సృష్టికర్త. ప్రతి వస్తువుపై ఆయనకు పూర్తి అధికారం ఉంది. కాబట్టి, ప్రతి సృష్టి తన హృదయంలో అల్లాహ్ పట్ల అత్యంత గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగి ఉండాలి.
ఈ హదీసులో ప్రవక్త (స) అల్లాహ్ యొక్క మాటలను ఇలా తెలియజేస్తున్నారు:"ఆదాము కుమారుడు (మనిషి) నన్ను బాధపెడుతున్నాడు. అతను 'ఓ కాలమా! నీవు ఎంత చెడ్డదానివి (నాశనమైపో)' అని అంటున్నాడు. మీలో ఎవరూ అలా అనకండి. ఎందుకంటే 'కాలము' నేనే. . నేనే రాత్రింబవళ్లను మారుస్తుంటాను, నేను తలచుకుంటే వాటిని నిలిపివేయగలను కూడా." (సహీహ్ ముస్లిం)
కాలాన్ని నిందించడం అంటే ఏమిటి?: మనిషి తనకు ఏదైనా కష్టం లేదా నష్టం కలిగినప్పుడు, ఆ సమయాన్ని లేదా కాలాన్ని తిడుతుంటాడు. కానీ, కాలానికి తనకు తానుగా మేలు చేసే లేదా కీడు చేసే శక్తి లేదు.: ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన, అదృష్టం లేదా దురదృష్టం అన్నీ సృష్టికర్త అయిన అల్లాహ్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి, కాలాన్ని తిట్టడం అంటే పరోక్షంగా ఆ కాలాన్ని నడిపిస్తున్న అల్లాహ్‌ను నిందించడమే అవుతుంది. దీని అర్థం అల్లాహ్ అంటే కాలం అని కాదు. దీని భావం ఏమిటంటే - కాలంలో జరిగే మార్పులు, రాత్రింబవళ్ల రాకపొకలు అన్నీ అల్లాహ్ నియంత్రణలో ఉంటాయి. ఆయన ఇష్టపడితే ఈ విశ్వం యొక్క కదలికను ఎప్పుడైనా ఆపేయగలడు. కాబట్టి ఎవరైనా ఒక కారణాన్ని (సమయాన్ని) తిడితే, అది ఆ కారణానికి మూలకారకుడైన అల్లాహ్‌ను తిట్టినట్లే అవుతుంది. అందుకే ఇస్లాంలో కాలాన్ని దూషించడం నిషేధించబడింది.
జ్వరాన్ని దూషించకూడదు
ఏ వ్యాధిని లేదా కష్టాన్ని కూడా మనం తిట్టకూడదు, ఎందుకంటే అది అల్లాహ్ చిత్తం ప్రకారమే వస్తుంది. ఒక వ్యాధిని తిట్టడం అంటే అల్లాహ్ రాసిన తలరాతపై ఫిర్యాదు చేయడమే అవుతుంది. ముస్లింలకు వ్యాధులు మరియు కష్టాలు వారి పాపాలను కడిగివేసే మార్గాలు మరియు వారి స్థాయిని పెంచే సాధనాలు.
సయ్యిదినా జాబిర్ (రజి) కథనం ప్రకారం: ప్రవక్త (స) ఒకసారి ఉమ్మె సాయిబ్ (రజి అల్లాహు అన్హా) దగ్గరికి వెళ్లి, "నీకు ఏమైంది? ఎందుకు అలా వణుకుతున్నావు?" అని అడిగారు. దానికి ఆమె, "జ్వరం వచ్చింది, అల్లాహ్ దీనిని దీవించకపోవుగాక!" అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "జ్వరాన్ని దూషించకు. ఎందుకంటే, కమ్మరి కొలిమి ఇనుము మీద ఉన్న తుప్పును ఎలా వదిలిస్తుందో, జ్వరం కూడా మనిషి పాపాలను అలాగే వదిలిస్తుంది." (సహీహ్ ముస్లిం)
మరణించిన వారిని దూషించకూడదు
ఇస్లాం మరణించిన వారిని కూడా గౌరవించమని నేర్పుతుంది. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా (రజి అల్లాహు అన్హా) ప్రకారం ప్రవక్త (స) ఇలా అన్నారు: "మరణించిన వారిని తిట్టకండి. ఎందుకంటే వారు తాము చేసిన కర్మల (మంచి లేదా చెడు) ఫలితాన్ని అందుకోవడానికి ఇప్పటికే వెళ్ళిపోయారు." (సహీహ్ ఇబ్ను హిబ్బాన్)
మరో హదీసులో సయ్యిదినా ముఘీరా బిన్ షుబా (రజి అల్లాహు అన్హు) ప్రకారం ప్రవక్త (స) ఇలా అన్నారు:"చనిపోయిన వారిని దూషించకండి, ఎందుకంటే దానివల్ల మీరు బ్రతికున్న వారిని (వారి బంధువులను) బాధపెట్టినట్లు అవుతుంది." (సహీహ్ తిర్మిజీ)
ముస్లింల గౌరవ మర్యాదలను వారు బ్రతికున్నప్పుడే కాకుండా, మరణించిన తర్వాత కూడా కాపాడాలని ఇస్లాం కోరుకుంటుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారి లోపాలను లేదా వారు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వారిని తిట్టకూడదు. ముఖ్యంగా వారి జీవితంలో మంచి పనులు ఎక్కువగా ఉంటే, వారిలోని చిన్న చిన్న చెడులను ప్రస్తావించకూడదు. బ్రతికున్న వారికి బాధ కలగకూడదు: ఒక మరణించిన వ్యక్తిని దూషించడం వల్ల అతని బంధువులు, సోదరులు లేదా సంతానం మనస్తాపానికి గురవుతారు. దీనివల్ల బ్రతికున్న వారికి అనవసరమైన బాధ కలిగించినట్లు అవుతుంది.
గాలిని దూషించవద్దు
గాలి అనేది అల్లాహ్ యొక్క ఒక గొప్ప శక్తి. అది అల్లాహ్ ఆదేశం ప్రకారం కరుణను (వర్షాన్ని) లేదా శిక్షను తీసుకువస్తుంది. కాబట్టి గాలిని తిట్టడం సరైనది కాదు. ప్రవక్త (స) ఇలా అన్నారు: "గాలిని దూషించకండి. ఎందుకంటే ఇది అల్లాహ్ ఆజ్ఞతో వీస్తుంది. అది కరుణను లేదా శిక్షను తెస్తుంది. కాబట్టి మీరు అల్లాహ్‌ను ఆ గాలిలోని 'మేలు' (ప్రయోజనం) కోసం ప్రార్థించండి మరియు దానిలోని 'కీడు' నుండి రక్షణ కల్పించమని వేడుకోండి." (ఇబ్ను మాజహ్)
గాలి వల్ల మనకు ఏదైనా నష్టం కలిగినప్పుడు దానిని శపించకూడదు లేదా తిట్టకూడదు. ఎందుకంటే గాలి అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది. ఆజ్ఞను పాటించే సృష్టికి ఎటువంటి దోషం ఉండదు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇక్కడ ఉంది:
గాలి అల్లాహ్ యొక్క కరుణ: గాలి అనేది అల్లాహ్ యొక్క కరుణ మరియు ఉపశమనం (రహ్మత్). ఇది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం కరుణను లేదా శిక్షను మోసుకొస్తుంది.
కరుణగా గాలి: విశ్వాసుల (మోమినీన్) పట్ల ఇది కరుణగా మారుతుంది. ఇది ఓడలు సాఫీగా సాగడానికి తోడ్పడుతుంది, మేఘాలను ఒక్కచోటికి చేర్చి ప్రయోజనకరమైన వర్షం కురిపించేలా చేస్తుంది. అలాగే ఇది చల్లని పైరుగాలిని, ఆహ్లాదాన్ని అందిస్తుంది.
శిక్షగా గాలి: అవిశ్వాసుల (కాఫిర్ల) పట్ల ఇది శిక్షగా మారుతుంది. ఉదాహరణకు 'ఆద్' జాతిపై వచ్చిన తుఫాను గాలి వంటిది, అది తగిలిన ప్రతి వస్తువును నిర్జీవంగా (శిథిలావస్థకు) మార్చేసింది. పంటలను, చెట్లను పాడుచేయడానికి లేదా పశువుల నాశనానికి ఇది హెచ్చరికగా కూడా రావచ్చు.గాలిని తిట్టడానికి బదులు, ప్రవక్త (స) ఇలా నేర్పారు:
మేలు కోరండి: "ఓ అల్లాహ్! ఈ గాలి దేని కోసమైతే (వర్షం మొదలైన మేలు కోసం) పంపబడిందో, ఆ మేలును మాకు ప్రసాదించు" అని అడగాలి.
కీడు నుండి రక్షణ వేడుకోండి: "ఓ అల్లాహ్! ఈ గాలి దేని కోసమైతే (వినాశనం, ఆస్తి నష్టం వంటి కీడు కోసం) పంపబడిందో, ఆ కీడు నుండి మాకు రక్షణ కల్పించు" అని ప్రార్థించాలి.
పాపాత్ముడైన ముస్లింను దూషించడం
ఒక ముస్లిం పొరపాట్లు చేసినా లేదా దైవ విధేయతలో నిర్లక్ష్యం వహించినా, అతడిని తిట్టడం లేదా దూషించడం చేయకూడదు. ఎందుకంటే మనం అతడిని దూషిస్తే, అతను మరింత మొండిగా మారి, ధర్మానికి దూరమైపోయే ప్రమాదం ఉంది. ఇది అతడిని షైతాన్ మార్గంలోకి నెట్టడమే అవుతుంది.
హజ్రత్ అబు దర్దా (రజి) గారి హితబోధ: అబూ ఖులాబా (రహ్మ) ఒక సంఘటనను వివరించారు: హజ్రత్ అబు దర్దా (రజి) ఒక దారి గుండా వెళ్తుండగా, ఒక వ్యక్తి ఏదో పాపం చేసినందుకు ప్రజలు అతడిని తిడుతున్నారు. అది చూసి అబు దర్దా గారు ఇలా అడిగారు: "ఒకవేళ ఈ వ్యక్తి బావిలో పడిపోతే, మీరు అతడిని బయటకు తీయరా?"
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు