Monday, February 16, 2026

ఆత్మప్రబోధపు పాఠశాల రమజాన్

అంశం: *రమజాను మాసానికి స్వాగతం!* శీర్షిక: ఆత్మప్రబోధపు పాఠశాల రమజాన్ జ్ఞానులారా వినండి! రంజాన్ మాసం వచ్చేసింది, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్ళీ మన చెంతకు చేరింది. ఏడాది కాలం అజ్ఞానంలో, అజాగ్రత్తలో గడిచిపోయింది, మేల్కొనండి! జీవితం కదిలే మేఘంలాంటిదని తెలుసుకోండి.
ఉపవాసం అంటే కేవలం ఆకలితో అలమటించడం కాదు, అది పాపాలకు అడ్డుకట్ట వేసే ఒక రక్షణ కవచం. శారీరక వాంఛలను అదుపు చేసే ఒక ఆత్మీయ విముక్తి, దుర్గుణాల నుండి మనల్ని విముక్తి చేసే ఒక దివ్య శక్తి. పక్కింటి వారి హక్కులు కాపాడలేని వాడు ఉపవాసి కాడు, సోదరభావాన్ని, బంధుత్వాన్ని గౌరవించని వాడు ఉపవాసి కాడు. పరోక్ష నిందలు మోపేవాడు, చెడు మాట్లాడేవాడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు చేసేది ఉపవాసం కానే కాదు. రమజాన్ అంటే క్రమశిక్షణ నేర్పే ఒక గొప్ప పాఠశాల, దూరంగా ఉన్న మనసులను దగ్గర చేసే సోదర భావాల మాల. సమానత్వాన్ని, దాతృత్వాన్ని నేర్పే ఒక అద్భుత పాఠం, త్యాగాన్ని, ఆత్మీయతను చాటిచెప్పే ఆధ్యాత్మిక పయనం. ప్రవక్త (స) వారి అనుచరుల ఉపవాసం చూడండి.. వారి ఆత్మలు పరిశుద్ధమై చరిత్రలో ఎలా నిలిచిపోయాయో లోకపు వ్యామోహాలను వీడి వారు ఉపవాసాలు ఉన్నారు, ఉపవాస దీక్షలోనే వారు విజయ శిఖరాలు అధిరోహించారు. పగటి వేళ రణరంగంలో వారు గర్జించే సింహాల వంటి వారు, కానీ రాత్రి వేళ దైవ సముఖంలో కన్నీరు కార్చే భక్తులు వారు. ఆ పుణ్యాత్ములకు, ఈ పవిత్ర మాసానికి ఇవే మా ఘన స్వాగతాలు పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ ఊరు: కువైట్ సెల్: 00965 97266676 హామీ పత్రం: ఇది నా స్వీయ రచన

రమజాన్ మాస ఔన్నత్యం

ఆకాశ వీధిని చూస్తూ నా కళ్ళు భక్తితో మెరిశాయి, ప్రేమతో, విశ్వాసంతో కన్నీటి చుక్కలు రాలాయి. నా హృదయం దైవస్మరణలో పులకించి తన్మయత్వం పొందింది, విశ్వమంతా అల్లాహ్ కీర్తనలతో ప్రతిధ్వనిస్తోంది.
శుభ గడియల రాకను తెలిపిన నీకు పుణ్యం లభించుగాక, రంజాన్ వస్తూనే రంగురంగుల ఆనందాలను మోసుకొచ్చింది. ఏడాది గడిచి మళ్ళీ ఈ మాసం మన చెంతకు చేరింది, కాలం ఎంత వేగంగా కరిగిందో కదా అనిపిస్తోంది! విశ్వాసపు పరిమళాలు మనల్ని చుట్టుముట్టాయి, పరమాత్ముని ప్రసన్నం కోసం మనసులో తపన పెరిగింది. ఓ పుణ్యాత్ముడా! ఇది దాతృత్వపు మాసం, నిజాయితీతో ముందుకు రా, దైవం నీకు మేలు చేస్తాడు. దానధర్మాలలో వెనకాడకు, నమాజులతో గడపు, నీ నుదురు సజ్దాల (దైవ ప్రణామాల) గుర్తుగా మారాలి. విధిగా చేయాల్సిన ఆరాధనలను గౌరవంగా నిర్వర్తించు, ఖురాన్ పఠనంతో పుణ్య మార్గాన్ని ఎంచుకో. నీ నాలుకను అదుపులో ఉంచుకో, వ్యర్థమైన మాటలు వద్దు, అరవద్దు, ఎవరినీ నొప్పించకు, నీ ఉపవాసం భంగం అవ్వనివ్వకు. నీ సంపదలో కొంత దానమివ్వు, అది నిన్ను పేదవాడిని చేయదు, సత్క్రియలతో ఇచ్చే దానం సంపదను పవిత్రం చేస్తుంది. దైవ మార్గంలో ఇచ్చే ఒక్క చిరు ఖర్జూరం అయినా, దప్పికతో ఉన్న ఆర్తుని హృదయాన్ని తృప్తిపరుస్తుంది. 'లైలతుల్ ఖద్ర్' (పుణ్య రాత్రి) వైభవం నీకు తెలుసా? వెయ్యి మాసాల కంటే మిన్నగా లోకాన్ని వెలిగించే రాత్రి అది. ఈ ఉపవాస దీక్షలో మన హృదయం ఆనందంతో నిండుతుంది, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీకు మేలు కలగాలని కోరుతున్నాను. ప్రారంభం క్షమాపణలతో (మగ్ఫిరత్) మొదలవుతుంది, అల్లాహ్ కరుణ పొందని వాడు నిజంగా దురదృష్టవంతుడు. మధ్యలో దైవ కారుణ్యం (రహ్మత్) వెల్లివిరుస్తుంది, నిబద్ధతతో ఉపవాసం ఉన్నవారిపై ఆ దేవదేవుడు కృప చూపుతాడు. ముగింపులో నరకాగ్ని నుండి విముక్తి (ఇత్కున్ మినన్ నార్) లభిస్తుంది, ఆ భయంకరమైన అగ్ని నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. ఇస్లాంపై ద్వేషం పెంచుకునే వారికి దక్కేది నరకమే, మనం మాత్రం ఆ నరక ద్వారాల నుండి రక్షణ కోరుకుందాం. దేవదేవుని వేడుకుందాం... మనకు స్వర్గప్రాప్తిని ఇవ్వమని, ఆయన కరుణను, క్షమను మనపై కురిపించమని!

రంజాన్ మాస వైభవం!

శాంతి ప్రియ రమజాను నెలవంకను చూసి నా కళ్ళు చెమర్చాయి, ప్రేమతో, విశ్వాసంతో ఆనంద భాష్పవాలు రాలాయి. నా హృదయం దైవస్మరణలో తన్మయత్వం పొందింది, విశ్వమంతా అల్లాహ్ కీర్తనలతో ప్రతిధ్వనిస్తోంది. విశ్వాసపు పరిమళాలు మనల్ని చుట్టుముట్టాయి, ప్రభువు ప్రసన్నత కోసం మదిలో తపన మొదలయింది. ఓ పుణ్యాత్ముడా! ఇది దాతృత్వపు మాసం, నిజాయితీతో ముందుకు రా, దైవం నీకు మేలు చేస్తాడు. దానధర్మాలలో వెనకాడకు, నమాజులతో గడపు, విధిగా చేయాల్సిన ఆరాధనలను భక్తితో నిర్వర్తించు, ఖుర్ఆన్ పారాయణంతో నీ జీవితాన్ని నవనీతం చేసుకో నీ నాలుకను అదుపులో ఉంచుకో, వ్యర్థ మాటలు వద్దు, ఎవరినీ నొప్పించకు, నీ సంపదలో కొంత దానమివ్వు, చిత్తశుద్ధితో చేసే పుణ్యం సంపదను పవిత్రం చేస్తుంది. అవసరార్థుని హృదయాన్ని చల్ల బరుస్తుంది. మాస ప్రారంభం కారుణ్యంతో మొదలవుతుంది, మధ్యలో అల్లాహ్ క్షమాభిక్ష వెల్లివిరుస్తుంది, ముగింపులో నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది, అల్లాహ్ ప్రసన్నతా భాగ్యంతో జన్మ ధన్యమవుతుంది