Thursday, April 9, 2026
అందరికంటే ఉత్తమ రక్షకుడు అల్లాహ్
అల్లాహ్ అందరికంటే ఉత్తమ రక్షకుడు - మరియు ఆయన కరుణించే వారందరిలోకీ గొప్ప కరుణామయుడు." (సూరహ్ యూసుఫ్: 64)
కాల ప్రవాహంలో క్షణాలు, గంటలు, క్షణాలు, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ అనంత కాలవాహినిలో బుర్భురప్రాయమైన జీవితం ఆవలితీరం చేరుకోవడానికి మనిషి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ఎరుక చేయండా వెదురీచితే చివరికి మిగిదేవి ప్రయాన నిరాశలే. విచక్షణతో జీవించడం తెలియకపోతే ఆయుర్దాయం ఎంతయినా వృథానే.
మానవ చరిత్రలో ఎవరూ ఎవరినీ కాపాడలేని సమయంలో ఎందరినో కాపాడినవాడు అల్లాహ్. అందరి ఆహారాన్ని, జీవనోపాధిని, కాలాన్ని మరియు స్థితిగతులను నిర్ణయించినవాడు అల్లాహ్. ఆయన కరుణాదృష్టి ఎల్లప్పుడూమానవాళి పైనే ఉంది. కష్టాల్లోనూ మరియు సుఖాల్లోనూ ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు.ఆయనకు తెలిసిన మన బాధల గురించి మనం ఆయనకే ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే, మన రహస్యాలన్నీ తెలిసినవాడు, మం గుండెల్లోని గుట్టును సయితం ఎరిగిన వాడు ఆయనే. ఆయనే ఆడమ్ (అ) దుఆను స్వీకరించి క్షమాభిక్ష పెట్టినవాడు. ఆయనే నూహ్ (అ) వారిని జల ప్రళయం నుండి కాపాడినవాడు. ఆయనే మూసా (అ) ఫిరౌను కబంద హస్తాల నుండి రక్షించినవాడు. ఆయనే ఫిరౌనుని అతని 70 వేళా సైన్యంతో సహా నట్టేట ముంచి చంపినవాడు. ఆయనే ఇబ్రాహీమ్ (అ) కోసం అగ్ని గుండాన్ని పూల వనఁగా మార్చినవాడు. ఆయనే కుంటి దోమతో నియంత నమ్రూద్ ని మట్టి కరిపించినవాడు.
"ఫల్లాహు ఖైరున్ హాఫిజౌన్ వహువ అర్హముర్ రాహిమీన్" తన ప్రియ పుత్రుడు యూసుఫ్ తన నుండి దూరమైనప్పుడు, తోడేళ్ళు అతన్ని తినేస్తాయని గుర్తుకు వచ్చినప్పుడు హజ్రత్ యాకూబ్ (అలైహిస్సలాం) ఈ మాట అన్నారు. తన ప్రాణపదమైన కుమారుడి ఎడబాటును తలచుకుని కూడా ఆయన "ఫల్లాహు ఖైరున్ హాఫిజౌన్ వహువ అర్హముర్ రాహిమీన్ అన్నారు. " అల్లాహ్‌యే ఉత్తమ రక్షకుడు." తన కుమారుడు తిరిగి వస్తాడో లేదో తెలియనప్పుడు కూడా ఆయన ఇదే "ఫల్లాహు ఖైరున్ హాఫిజౌన్ వహువ అర్హముర్ రాహిమీన్ " విశ్వాసాన్ని ప్రకటించారు..
మనం, మన పిల్లలు మరియు మన కుటుంబం, మన నివశించే ప్రవాస దేశం, స్వదేశం సురక్షితంగా ఉండాలంటే; అల్లాహ్‌ను స్మరించాలి. మనం వ్యాధుల నుండి, మహమ్మారుల నుండి రక్షణ పొందాలంటే; అల్లాహ్‌ను స్మరించాలి మన సంపద దొంగతనం కాకుండా, వృథా కాకుండా ఉండాలంటే; అల్లాహ్‌ను స్మరించాలి. మన పదవిని, మన ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే; అల్లాహ్‌ను స్మరించాలి. మనం సంతోషకరమైన, పవిత్రమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే; అల్లాహ్‌ను స్మరించాలి.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: " బిజ్జీ! నేను నీకు కొన్ని మాటలు నేర్పుతాను: నీవు అల్లాహ్ (ఆజ్ఞల)ను కాపాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీవు అల్లాహ్‌ను స్మరిస్తే, ఆయన నీకు ఎదురుగానే (నీ వెంటే) ఉంటాడు. నీవు ఏదైనా అడగదలుచుకుంటే అల్లాహ్‌నే అడుగు. సహాయం కోరదలుచుకుంటే అల్లాహ్‌నే కోరు. ఒకవేళ లోకమంతా కలిసి నీకు ఏదైనా మేలు చేయాలనుకున్నా, అల్లాహ్ నీ కోసం రాసి ఉంచింది తప్ప వారు ఏమీ చేయలేరు. అలాగే, లోకమంతా కలిసి నీకు ఏదైనా కీడు చేయాలనుకున్నా, అల్లాహ్ నీ రాతలో రాసింది తప్ప వారు ఏమీ చేయలేరు. కలములు ఎత్తబడ్డాయి, ప్రతులు ఎండిపోయాయి."
ఈ ఉపదేశం కేవలం ఇబ్న్ అబ్బాస్ (రజిఅల్లాహు అన్హుమా) కు మాత్రమే పరిమితం కాదు; ఇది రాజులు, మంత్రులు, అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారులు, కార్మికులు, రైతులు, తెల్లవారు, నల్లవారు, పురుషులు మరియు మహిళలు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు యువకులు - ఇలా లోకంలోని సమస్త మానవాళికి వర్తిస్తుంది.
కష్టాల నుండి గట్టెక్కడానికి ఇదే మార్గం. కీడు మరియు ఉపద్రవాల నుండి రక్షణ పొందే మార్గం ఇదే. పాపాల నుండి మరియు వ్యాధుల నుండి సురక్షితంగా ఉండే మార్గం ఇదే. ఇదే శాంతి మరియు సౌభాగ్యాల మార్గం. అల్లాహ్ పరిధులను గౌరవించు, అల్లాహ్ ఆజ్ఞలను పాటించు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు.
అల్లాహ్ సాక్షిగా! ఎవరైతే తన జీవితాన్ని మరియు యవ్వనాన్ని అల్లాహ్‌కు విధేయత చూపకుండా అతిక్రమణలు పాలపడుతూ గడుపుతారో, వారిని అల్లాహ్ రక్షించడు. తన సంపదను అల్లాహ్‌కు ఇష్టం లేని పనుల కోసం ఖర్చు చేసేవారిని అల్లాహ్ రక్షించడు. తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకుండా పాపాల్లో పీకల్లోతుకు మునిగిపోయేవారిని, తన ఇష్టానుసారం ప్రవర్తించేవారిని అల్లాహ్ రక్షించడు. షైతాన్ కు బానిసై రుజుమార్గం తప్పినవారిని అల్లాహ్ రక్షించడు. అల్లాహ్ విధించిన హద్దులను మీరుతూ, కేవలం ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయి పాపా ఊబిలో దిగబడి పోయినవారిని అల్లాహ్ రక్షించడు. అటువంటి వారు అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు, మరియు వారి జీవితా ల్ని కష్టాలు, రోగాలు మరియు అనర్థాలు పెను ప్రమాదమయి మంచెత్తుతాయి.
నిజానికి, అల్లాహ్‌కు అవిధేయత చూపడం వల్ల కలిగే నష్టం కేవలం వ్యక్తికే కాదు, తన కుటుంబం మరియు ఆస్తిపాస్తుల ద్వారా కూడా ఎదురుకావచ్చు. దీనిపై ఫుదైల్ బిన్ ఇయాద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "నేను అల్లాహ్‌కు అవిధేయత చూపినప్పుడు, ఆ ప్రభావం నా వాహనం (జంతువు), నా సేవకుడు, నా భార్య మరియు నా ఇంట్లోని ఎలుక ప్రవర్తనలో కూడా గమనిస్తాను."
అవును, నీ అడుగు తడబడితే అది ఒక పాపం వల్ల అని తెలుసుకో. నీ వాహనం ఆగిపోయినా, నీపై కష్టాలు మరియు ఇబ్బందులు విరుచుకుపడినా, నీకు సమస్యలు ఎదురైనా, నీ ప్రపంచం చీకటిమయమైనా... అవన్నీ అల్లాహ్‌కు చేసిన అవిధేయత వల్లనే అని గ్రహించు.
అదే సమయంలో, కష్టమైన మార్గాలు నీకు సులభమైతే, అసాధ్యమైనవి సుసాధ్యమై నీ సేవలో నిలిస్తే... అది నీవు అల్లాహ్ (ఆజ్ఞల)ను కాపాడినందుకు మరియు ఆయన సంతృప్తికే నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చినందుకు అల్లాహ్ నీకు ఇచ్చే బహుమతి అని తెలుసుకో!
ఉక్బా బిన్ నాఫీ (రజిఅల్లాహు అన్హు) గారి అద్భుత గాథ
అల్లాహ్‌ను నమ్మి, ఆయన ఆజ్ఞలను పాటించిన మహానుభావులకు అల్లాహ్ ఎలా అండగా ఉంటాడో చెప్పడానికి ఉక్బా బిన్ నాఫీ (రజిఅల్లాహు అన్హు) ఒక గొప్ప ఉదాహరణ. ఆయన క్రూర మృగాలను సైతం శాసించారు! అవును, మనుషులను కనికరించని, మాంసాహార క్రూర జంతువులతో ఆయన మాట్లాడారు.
ఈ గొప్ప సేనాని ఉత్తర ఆఫ్రికాను జయించడానికి వెళ్ళినప్పుడు, ట్యునీషియాలో 'కైరావాన్' నగరాన్ని నిర్మించమని తన సైన్యానికి ఆదేశాలిచ్చారు. అది సైన్యానికి ఒక బలమైన స్థావరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కానీ సైన్యం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలు, విశాలమైన లోయలతో నిండి ఉంది. అక్కడ సింహాలు, తోడేళ్ళు, పాములు మరియు హైనాలు నివాసం ఉంటున్నాయి.
సైనికులు తిరిగి వచ్చి ఉక్బా గారితో ఇలా అన్నారు: "మీరు మమ్మల్ని అసాధ్యమైన చోట నగరాన్ని నిర్మించమన్నారు. అక్కడ క్రూర మృగాలు, విష సర్పాలు ఉన్నాయి. వాటి వల్ల మాకు ప్రాణహాని ఉంది." అప్పుడు ఆయన ఏమాత్రం తడబడకుండా, వెంటనే అల్లాహ్ ముందు మోకరిల్లి రెండు రకాతుల నమాజు ఆచరించారు.
ఇటువంటి మహనీయులు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపుకు మళ్లడం చాలా వేగంగా జరుగుతుంది. కష్టాలను తొలగించేవాడు, అవసరాలను తీర్చేవాడైన ఆ పరమప్రభువును ఆశ్రయించడంలో వీరు ఏమాత్రం ఆలస్యం చేయరు. క్లిష్టమైన సమస్యలను 'రాజులకే రాజు' అయిన అల్లాహ్ దర్బారులో సమర్పించడంలో వీరు వెనుకాడరు.
ఉక్బా బిన్ నాఫీ గారు లేచి రెండు రకాతుల నమాజు చదివారు. ఆయన సైన్యంలో అల్లాహ్ ప్రవక్త ﷺ వారి అనుచరులు (సహాబాలు) 15 మంది ఉన్నారు. ఆయన వారందరినీ పిలిచి: "నేను దుఆ (ప్రార్థన) చేస్తాను, మీరు ఆమీన్ అనండి" అని చెప్పారు. ఆయన అల్లాహ్‌ను ఎంతో సేపు వేడుకున్నారు, వెనుక ఉన్న సహాబాలు మరియు సైనికులు 'ఆమీన్' అంటూ మద్దతు పలికారు.
అనంతరం, ఉక్బా గారు నడుచుకుంటూ వెళ్లి ఆ అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయిపై నిలబడ్డారు. అక్కడ ఉన్న జీవులన్నింటినీ ఉద్దేశించి గంభీరమైన స్వరంతో ఇలా ప్రకటించారు:
"ఓ సింహాలారా! ఓ క్రూర మృగాలారా! ఓ పాములారా! ఓ హైనాలారా! ఓ తేలులారా! ఓ తోడేళ్ళారా! మేము ముహమ్మద్ ﷺ అనుచరులం. 'లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్' అనే సందేశంతో ప్రపంచాన్ని జయించడానికి వచ్చాము. కాబట్టి, మమ్మల్ని విడిచిపెట్టి ఇక్కడి నుండి సురక్షితంగా వెళ్ళిపోండి. మేము ఇక్కడ స్థావరం ఏర్పరచుకోబోతున్నాము. దీని తర్వాత కూడా ఇక్కడ ఎవరైనా కనిపిస్తే, మేము వారిని చంపేస్తాం, అప్పుడు మమ్మల్ని నిందించకండి."
సైన్యమంతా ఆశ్చర్యంతో స్తంభించిపోయింది! 'ఏమిటి ఈయన సింహాలతో మాట్లాడుతున్నారా? తోడేళ్ళను పిలుస్తున్నారా? పాములను హెచ్చరిస్తున్నారా?' అని అనుకున్నారు. కానీ ఉక్బా గారు అల్లాహ్‌ను నమ్మిన గొప్ప నాయకుడు. ఆయన అల్లాహ్ హద్దులను కాపాడారు, అందుకే అల్లాహ్ ఆయనకు సమస్తాన్ని లొంగిపోయేలా చేశాడు.
కొద్ది క్షణాల్లోనే ఒక అద్భుతం జరిగింది! చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా... సింహాలు తమ పిల్లలను నోటితో పట్టుకుని, తోడేళ్లు తమ పిల్లలతో, పాములు తమ పిల్లలతో ఆ అడవిని వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. ఆ ప్రాంతమంతా ఖాళీ అయిపోయింది.
నా ప్రియమైన సోదరులారా!
ఆ క్రూర మృగాలు ఉక్బా గారి ఆదేశానికి లోబడి వెళ్ళిపోతున్నప్పుడు, కొందరు సైనికులు వాటిని చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఉక్బా గారు వారిని వారించి ఇలా అన్నారు: "వాటిని ఏమీ చేయకండి! అవి సురక్షితంగా వెళ్ళిపోయే వరకు వదిలేయండి. మనం అల్లాహ్ సాక్షిగా వాటికి అభయమిచ్చాము (అమాన్). అల్లాహ్ పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎలా ఉల్లంఘించగలం? వాటితో చేసిన ఒప్పందాన్ని ఎలా విస్మరించగలం?"
ఈ రోజుల్లో అల్లాహ్‌కు ఇచ్చిన మాటను తప్పేవారు, ఒప్పందాలను ఉల్లంఘించేవారు ఎంతమంది లేరు! తోటి మనుషులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కేవారు ఎందరో! వారి జీవితమంతా మోసం, కుట్ర మరియు అబద్ధాలతో నిండి ఉంది.
ఖురాన్ ఇలా చెబుతోంది: "ఎవరైతే అల్లాహ్‌తో చేసిన ఒప్పందాన్ని స్థిరపరిచిన తర్వాత ఉల్లంఘిస్తారో, అల్లాహ్ కలపమన్న బంధాలను తెంచివేస్తారో మరియు భూమిపై అరాచకాన్ని సృష్టిస్తారో.. అటువంటి వారే అసలైన నష్టజాతకులు." (సూరా అల్-బఖరా: 27)
చూశారా! ఉక్బా బిన్ నాఫీ గారు సుఖసంతోషాల్లో ఉన్నప్పుడు అల్లాహ్‌ను స్మరించారు కాబట్టే, కష్టకాలంలో అల్లాహ్ ఆయనను కాపాడారు. క్రూర మృగాలను సైతం ఆయనకు లొంగిపోయేలా చేశారు.
సిలా బిన్ అషీమ్ (రహిమహుల్లాహ్) గారి గాథ
మరో గొప్ప భక్తుడు సిలా బిన్ అషీమ్. ఆయన ఖుతైబా బిన్ ముస్లిం సైన్యంలో ఉండేవారు. ఇషా నమాజ్ తర్వాత నుండి తెల్లవారుజాము వరకు ఆయన అల్లాహ్ స్మరణలో, నమాజులో మరియు ప్రార్థనలలో మునిగిపోయేవారు.
వినోదాల్లో, పాటల్లో, ఆటల్లో సమయాన్ని వృథా చేసేవారికి.. కొండెములు, చాడీలు చెప్పుకునేవారికి.. సోషల్ మీడియా మాయలో పడి సమయాన్ని పోగొట్టుకునేవారికి ఈయన జీవితం ఒక గుణపాఠం.
ఒక రాత్రి, సైన్యమంతా నిద్రపోతున్నప్పుడు, సిలా గారు రహస్యంగా అడవిలోకి వెళ్లి నమాజ్ చదువుకుంటున్నారు. అప్పుడు అక్కడికి ఒక భయంకరమైన సింహం (లైత్) వచ్చింది. అరబ్బులు దాన్ని 'హైదరా' అని పిలిచేవారు - అది గర్జిస్తేనే జనం భయంతో వణికిపోయేవారు.
ఆ సింహం సిలా గారి చుట్టూ తిరుగుతోంది. కానీ ఆయన కొండంత ధైర్యంతో అల్లాహ్ ధ్యానంలో స్థిరంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆయన రక్షకుడైన అల్లాహ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన నమాజ్ ముగించి, సింహం వైపు తిరిగి ఇలా అన్నారు:
"ఓ మృగరాజా! నన్ను చంపమని నీకు అల్లాహ్ నుండి ఆదేశం ఉంటే, నన్ను చంపి తినేయ్! నాకు అల్లాహ్ తప్ప వేరే రక్షణ లేదు. ఒకవేళ నీకు అటువంటి ఆదేశం లేకపోతే, నన్ను నా ప్రభువుతో ఒంటరిగా వదిలేయ్." అప్పుడు ఆ సింహం ఒక పెంపుడు కుక్కలా తన తోకను ఆడిస్తూ, అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది.
మహాశయులారా! మనం ఎప్పుడైతే అల్లాహ్‌కు విధేయులమయ్యామో, ఆయన హద్దులను గౌరవించామో, అప్పుడు అల్లాహ్ క్రూర మృగాలను సైతం మనకు లొంగేలా చేశాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయనకు అవిధేయత చూపామో, అప్పుడు ఆయన మనపై ఎలుకలను (సాధారణ జీవులను) కూడా అధికారం చెలాయించేలా చేశాడు.
"అల్లాహ్‌యే ఉత్తమ రక్షకుడు మరియు ఆయన కరుణించే వారందరిలోకి అత్యంత కరుణామయుడు." (యూసుఫ్: 64)
అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం, ఆయన ఆదేశించిన వాటిని ఆచరించడం మరియు వారించిన వాటికి దూరంగా ఉండటమే.. ఈ లోకంలో మరియు పరలోకంలో మనిషికి రక్షణ మరియు భద్రతను ఇచ్చే మార్గం. ఒకవేళ భక్తుడికి ఏదైనా కష్టం వచ్చినా, అది అల్లాహ్ వద్ద అతని అంతస్తును పెంచడానికే అవుతుంది.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: "ముస్లిం (మోమిన్) విషయం ఎంత ఆశ్చర్యకరం! అతని ప్రతి పరిస్థితి అతనికి మేలు చేసేదే. ఇది కేవలం మోమిన్‌కు మాత్రమే సాధ్యం. అతనికి సంతోషం కలిగితే కృతజ్ఞతలు (షుక్ర్) తెలుపుతాడు, అది అతనికి మేలు. ఒకవేళ కష్టం వస్తే సహనం (సబ్ర్) వహిస్తాడు, అది కూడా అతనికి మేలు."
నేటి మన పరిస్థితి
మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడిని ఎంతో వేడుకుంటాం, కానీ ఆ కష్టం తీరిపోగానే ఆయన్ని మర్చిపోతాం! సముద్రంలో ఉన్నప్పుడు ఓడను కాపాడమని ప్రార్థిస్తాం, తీరానికి చేరగానే మళ్ళీ పాపాల్లో మునిగిపోతాం. ఆకాశంలో ప్రయాణించేటప్పుడు ఎంతో సురక్షితంగా ఉన్నామంటే... అది మనం పడిపోకుండా కాపాడుతున్న 'అల్లాహ్' వల్లనే!
మనం ఇహపరలోకాల్లో సుఖపడాలనుకుంటే, ప్రమాదాల నుండి బయటపడాలనుకుంటే, సంపద మరియు ఆరోగ్యంలో శుభం (బరకత్) కలగాలనుకుంటే.. అల్లాహ్‌ను స్మరించాలి. మన ఈమాన్ (విశ్వాసం)లో, మన పరిశుభ్రతలో, మం నమాజులో, మన ఆలోచనల్లో.. సర్వకాల సర్వావస్థలయందు అల్లాహ్‌ను స్మరించాలి. మనం అల్లాహ్‌ను ఇలా ప్రతి విషయంలోనూ స్మరిస్తే, ఆయన మనల్ని మన ప్రాణాల్లో, బుద్ధిలో, సంపదలో, ఆరోగ్యంలో మరియు మన సంతానంలో కాపాడుతాడు. మనం ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా.. ఆయన రక్షణ మనకు ముందు నుండి, వెనుక నుండి, కుడి నుండి మరియు ఎడమ నుండి తోడు ఉంటుంది.
అల్లాహ్ ఇచ్చే అత్యంత గొప్ప రక్షణ ఏమిటంటే..,, జీవితాంతం ధర్మ మార్గం మీద స్థిరంగా ఉండేలా దీవించడం, మరణ సమయాన ఆయన మనల్ని కాపాడటం. ఆ ప్రాణసంకట స్థితిలో, షైతాన్ రకరకాల సందేహాలతో మనల్ని మోసం చేయాలని చూస్తున్నప్పుడు, నాలుక మొద్దుబారిపోయినప్పుడు.. అల్లాహ్ మనల్ని కాపాడి స్థిరంగా ఉంచుతాడు. "విశ్వసించిన వారిని అల్లాహ్ ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరమైన మాట (కలిమా)పై దృఢంగా ఉంచుతాడు." (సూరా ఇబ్రాహీం: 27)
ప్రపంచ నలుమూలల యుద్ధ మేఘాలు క్రమ్ముకుంటున్న ఈ రోజుల్లో మనం విజ్ఞతతో వ్యవహరించాల్సిన మరియు వివేకంతో నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. వివేకవంతుడైన ముస్లిం కష్టాలు ఎదురైనప్పుడు తన రక్షకుడైన అల్లాహ్ వైపు మొగ్గు చూపుతాడు. సంక్షోభాలు సంభవించి నప్పుడు తన ప్రభువు వద్దకు పరుగెత్తుతాడు. తన కరుణామయుడైన ప్రభువు వద్ద క్షమాపణ కోరుతాడు మరియు ఆ గొప్పవాడైన అల్లాహ్ ముందు నిరంతరం దువా, మొర మరియు ప్రార్థనలు చేస్తాడు. ఏ పరిస్థితినైనా అల్లాహ్ పై నమ్మకంతో గుండె నిబ్బరంతో ఎదుర్కొంటాడు.
కావున దయామయుడైన ప్రభువుపై మంచి నమ్మకం కలిగి ఉండండి, ఆయనపై ఆధారపడండి మరియు మీ పనులను ఆయనకే అప్పగించండి. అది హృదయ ప్రశాంతతకు మరియు చింతలు తొలగిపోవడానికి కారణం అవుతుంది. అల్లాహ్ ఇలా అన్నాడు: "అల్లాహ్ పై నమ్మకం ఉంచే వానికి ఆయనే చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేస్తాడు. అల్లాహ్ ప్రతి దానికి ఒక పరిమితిని నిర్ణయించాడు." [అత్-తలాక్: 3]
అల్లాహ్ దాసులారా! ఇటువంటి పరిస్థితులలో మనం మన పాలకుల చుట్టూ ఏకతాటిపై ఉండాలి, వారితో విభేదించకూడదు. ధర్మబద్ధమైన విషయాలలో వారి మాట వినాలి మరియు వారు ఆజ్ఞలకు లోబడలి జీవించాలి. దేశంలోని అధికారిక సంస్థలు జారీ చేసే సూచనలను పాటించాలి.
అలాగే మనం పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాటిని అరికట్టాలి మరియు ప్రచారం చేయకూడదు. పుకార్లు మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి మరియు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకూడదు. నోటికి ఎంత వస్తే అంత వాగి సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో విషయాలను నిపుణులకు మరియు పాలకులకు వదిలిపెట్టడం మన బాధ్యత.
వార్తలకు అంతం లేదు...
వార్తలు ఎప్పటికీ ఆగవు... రాజకీయ విశ్లేషణలు అస్సలు నిలవవు... ఆ "బ్రేకింగ్ న్యూస్" (తాజా వార్తలు) పట్టీ మీ కళ్ళ ముందు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. ఇప్పుడే ఏం జరిగిందో తెలుసుకోకపోతే ఏదో ప్రళయం ముంచుకొస్తుందన్నట్లుగా అది మిమ్మల్ని వెంటాడుతుంది.
మన జీవితాల్లో సగం కాలం ఈ వార్తా ఛానళ్ల ముందే గడిచిపోయింది... ఏదో ఒక కొత్త వార్త కోసం మనం నిరీక్షిస్తూనే ఉన్నాం. కానీ నిజానికి, మన కరిగిపోతున్న ఆయుషే ఒక అతి పెద్ద "బ్రేకింగ్ న్యూస్" అని మనం గమనించడం లేదు. ఈ తెరలన్నింటినీ ఆపివేయండి.. మీ హృదయంలోని ప్రశాంతతను చుక్క చుక్కగా హరిస్తున్న ఈ గందరగోళాన్ని ఆర్పేయండి. మీ ఖురాన్ గ్రంథాన్ని తెరవండి.. ఎందుకంటే ఇవి కేవలం కొన్ని రోజులు మరియు కొన్ని గంటల ముచ్చట మాత్రమే...ఈ నెల (రమదాన్) గడిచిపోతుంది... లేదా మీరే ఈ లోకం నుండి నిష్క్రమిస్తారు. ఇవి "కొద్ది రోజులు" మాత్రమే. రమదాన్ సగం గడిచిపోయింది, మరి మీరు సాధించిందేమిటి?
చివరి మాట:
సమాజంలో విలువలు పడిపోతున్నాయని తెగ బాధ పడిపోతాం. ఎదుటివాడు చేసే తప్పులను ఎత్తి చూపేటప్పుడు వచ్చే ఉద్రేకం, ఆవేశం మనం కానీ, మనవాళ్లు కానీ తప్పుచేసినప్పుడు రావు. పైగా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే సమర్ధిస్తాం కూడా. సమాజంలో విలువలు పడిపోవడానికి కారణం ఎవరో కాదు అందరమూ. ప్రస్తుత సమాజంలో నడివీధిలో ఒక వ్యక్తిని మరొకడు నరుకుతున్నా, ఆడబిడ్డలను వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. తనవాళ్ళు కాదన్న నిర్లక్ష్యం, తమకేమైనా అవుతుందన్న భయం... అందుకు కారణం. ఇదే నేరాలు, ఘోరాలు పెరగడానికి ఊతమిస్తుంది. ఆర్థిక, అంగ, రాజకీయ బలాల ముందు చట్టాలు నీరుగారిపోతుండటంతో శిక్ష పడుతుందన్న భయం నేరస్థుల్లో పోయింది. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
కొంతమంది అంటుంటారు... మనం ఒక్కరం నీతిగా ఉంటే సరిపోతుందా అని సమాజం మారాలంటే అందరూ మారాల్సిన పనిలేదు. చేయించే వాడైనా, చేసేవాడైనా, చూసేవాడైనా, సమర్థించే వాడైనా, అది మంచి అని ప్రచారం చేసేవాడైనా... వీరిలో ఏ ఇద్దరు ఎదురు తిరిగి నీతికి నిలబడినా చాలు... మొత్తం సమాజం మారితీరుతుంది. ఆ ఇద్దరిలో మనమొకరం కావాలి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు