Thursday, April 9, 2026

బంధుత్వ సంబంధాలను బల పరచుకోండి...ఆయురారోగ్యాలను పెంచుకోండి!

బంధుత్వ సంబంధాలను బల పరచుకోండి...ఆయురారోగ్యాలను పెంచుకోండి! ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ బంధుత్వం ఉంది. కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. పుట్టగానే తల్లిదండ్రులనే బంధం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్లతో రక్త సంబంధం ఏర్పడుతుంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య ఇలాంటి బంధుత్వాలు పుట్టుకతో సహజంగా ఏర్పడతాయి. కొన్ని బంధాలు మనిషి పెరిగి పెద్దయ్యాక ఏర్పరుచుకుంటాడు. స్నేహితులు, జీవిత భాగస్వామి ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అయితే, ఏ బంధం ఎప్పుడు, ఎందుకు ఏర్పడుతుందో ఊహించలేం. ఒకసారి ముడిపడిన బంధాన్ని తుంచుకోకుండా ఉండటం మన ప్రవర్తనలోనే ఉంటుంది. పసితనంలో అమ్మ తప్ప మరో బంధం తెలియదు. కాస్త పెద్దయ్యాక నాన్న, అన్నదమ్ములు అన్న స్పృహ కలిగి వారితో అనుబంధం పెరుగుతుంది. పెద్దయ్యే కొద్దీ సమాజంలోని రకరకాల వ్యక్తులతో బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే, బంధాలు ఏర్పడటం ఎంత సులభమో, వాటిని నిలుపుకోవడం అంత కష్టం. లౌకిక ప్రపంచంలో అందరూ తోడు కోరుకునేవారే! కానీ, ఒకానొక దశలో ఏ బంధం కోసం అంతగా ఎదురుచూశారో, అదే బంధాన్ని ప్రతిబంధ కంగా భావిస్తుంటారు. అవసరార్థం ఏర్పరుచుకున్న బంధాల్లో ఇలాంటి కప్పదాటు వైఖరులు కనిపి స్తుంటాయి. లౌకిక సమాజంలో ఇలాంటి ఉదంతా లు తరచుగా చూస్తూనే ఉంటాం. ఆస్తి కోసం సోదర బంధాన్ని వదులుకోవడా నికి సిద్ధపడతారు కొందరు. అదే ఆస్తిపాస్తులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని ఆప్యాయంగా పలకరించే సోదరికి కనిపించకుండా ముఖం చాటేసే వాళ్లూ ఉన్నారు. అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావించి పేగుబంధా న్ని మరచి వారిని వృద్ధాశ్రమాల్లో పడదోసే ప్రబుద్ధులూ కోకొల్లలు. ఏ బంధమూ శాశ్వతం కాకపోవచ్చు. కానీ, భౌతికంగా జీవించి ఉన్నంత కాలం వాటిని కాపాడుకోవడం మానవ ధర్మం. ఇస్లాం ధర్మ ఆదేశం కూడా.
"ఓ మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు, దాని నుండే దాని జంటను సృష్టించాడు. వారిద్దరి ద్వారా ఎందరో పురుషులను, స్త్రీలను భూమిపై వ్యాపింపజేశాడు. ఏ అల్లాహ్ పేరుతోనైతే మీరు ఒకరిద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి అల్లాహ్ పేరును ఒక సాధనంగా చేసుకుంటారో ఆ అల్లాహ్ కు బంధుత్వాల విషయంలో భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా ఉంచేవాడు." (సూరా అన్-నిసా: 1) ఇస్లాం గొప్ప నైతిక పునాదుల్లో, అతి ముఖ్యమైన సూత్రాలలో ఒకటి: ప్రజల మధ్య ప్రేమను, అనురాగాన్ని పెంపొందించడం మరియు ద్వేషాన్ని, విభేదాలను దూరం చేయడం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మీరందరూ కలిసి అల్లాహ్ తాడును (ధర్మాన్ని) గట్టిగా పట్టుకోండి, విభేదించకండి. అల్లాహ్ మీపై కురిపించిన అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి; మీరు ఒకప్పుడు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు, అల్లాహ్ మీ హృదయాలను కలిపాడు, తద్వారా మీరు సోదరులయ్యారు." (సూరహ్ ఆల్-ఇమ్రాన్: 103) . ప్రవక్త (స) ఇలా అన్నారు: "విశ్వాసులు ఒకరిపై ఒకరు జాలి చూపడంలో, ప్రేమించుకోవడంలో మరియు కరుణించడంలో ఒకే శరీరం లాంటివారు. శరీరంలోని ఏ ఒక్క అవయవానికి బాధ కలిగినా, మిగిలిన శరీరమంతా జ్వరం మరియు నిద్రలేని స్థితితో స్పందిస్తుంది." (బుఖారీ మరియు ముస్లిం) అంటే, పరస్పర కరుణ, దయ మరియు ప్రేమ అనేవి ఇస్లాం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇవే సమాజంలో శాంతిని నెలకొల్పుతాయి. ఈ గొప్ప ఉద్దేశం కోసమే ఇస్లాం బంధుత్వాలను కలుపుకోవాలని ఆజ్ఞాపించింది మరియు సంబంధాలను తెంచుకోవడాన్ని నిషేధించింది. బంధాలను తెంచుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో వివరించే కథలు మాఅన్వ చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. ఒక చిన్న అనుమానం, అపార్థం ఇద్దఋ వ్యక్తుల మధ్య ఉన్న సోదర బంధాన్ని తుంచివేసింది. వ్యక్తిగత బంధాలను నిలుపుకోవడం ఎంత ప్రధానమో, ఇతరుల అనుబంధాలనూ గుర్తించడమూ అంతే అవసరం. ఇహంలో అనుబంధాలను కాదనుకొని అల్లాహ్ తో బంధం కొనసాగిస్తామంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. పేరుగాంచిన గొప్ప ధర్మపరాయణుడయినా సమాజంతో, ప్రకృతితో సంబంధం కొనసాగిస్తాడు. తన ధార్మికత సమాజానికి ఉపయోగపడాలని భావిస్తాడు. ఆత్మీయులను తూలనాడుతూ, బంధుత్వ సంబంధాలను టేగ్ త్రుంచుతూ అల్లాహ్ కు సాష్టాంగ ప్రమాణాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అలాంటి వ్యక్తులతో బంధానికి అల్లాహ్ కూడా అంగీకరించడు. సత్యం, ధర్మం పాటిస్తూ, మానవీయ సంబంధాలను గౌరవించే వ్యక్తులనే అల్లాహ్ కూడా తన ప్రియతమా దాసులుగా, తన పక్షం వారీగా, కుడి పక్షంవారుగా చూస్తాడు. బంధుత్వాలను కలుపుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన ఆరాధన. అల్లాహ్ ఇలా అన్నాడు: "అల్లాహ్ కు మరియు బంధుత్వాల విషయంలో భయపడండి." అంటే అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించవద్దని మరియు బంధుత్వాలను తెంచుకోవద్దని అర్థం. బంధువులను కలుపుకునే వారిని అల్లాహ్ తన ప్రత్యేక కరుణతో సత్కరిస్తాడు. బంధుత్వాలను తెంచుకునే వారి గురించి ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: "బంధుత్వాలను తెంచుకునేవాడు స్వర్గంలో ప్రవేశించ లేడు." (బుఖారీ). అంతేకాకుండా, అల్లాహ్ ఇతర పాపాల కంటే అన్యాయం మరియు బంధుత్వాలను తెంచుకునే పాపానికి ఈ లోకంలోనే శిక్షను త్వరగా విధిస్తాడు. మహనీయ ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు: "నిన్ను అన్యాయం చేసిన వారిని క్షమించు, నిన్ను వదిలేసిన (నీతో సంబంధం తెంచుకున్న) వారిని కలుపుకో, నీకు కీడు చేసిన వారికి మేలు చేయి మరియు సత్యం నీకు వ్యతిరేకమైనా సరే నిజమే మాట్లాడు." (సహీహ్ అత్-తర్గిబ్.) ఈ హదీసు ఇస్లామీయ నైతికతకు ఒక గొప్ప నిఘంటువు వంటిది. ఇందులో నాలుగు ప్రధాన సూత్రాలు ఉన్నాయి: క్షమించే గుణం: నిన్ను ఎవరైనా బాధపెట్టినా లేదా నీకు అన్యాయం చేసినా, ప్రతీకారం తీర్చుకోగలిగే శక్తి ఉన్నప్పటికీ వారిని క్షమించడం గొప్ప మనస్తత్వం. ఇది మనిషిని మానసిక ప్రశాంతతకు గురిచేస్తుంది. సంబంధాలను కలుపుకోవడం: అవతలి వారు నిన్ను పలకరించకపోయినా లేదా నీతో సంబంధాలు తెంచుకున్నా, నీవే ముందుగా వెళ్లి వారిని కలుపుకోవడం "సిలత్-అల్-రహీమ్" (బంధుత్వాలను కలుపుకోవడం)లో ఉత్తమమైన మెట్టు. కీడుకు మేలుతో జవాబివ్వడం: ఒకరు నీకు హాని తలపెట్టినా, దానికి బదులుగా వారికి సహాయం చేయడం లేదా మంచి చేయడం వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు. సత్యం పలకడం: నిజం చెప్పడం వల్ల నీకు నష్టం జరుగుతుందని తెలిసినా, లేదా నీ తప్పు బయటపడుతుందని తెలిసినా సరే, ధైర్యంగా నిజాన్నే పలకడం విశ్వాసి యొక్క లక్షణం. బంధుత్వ సంబంధాలను గౌరవించడం అనేది సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం. ఉత్తమ గుణవంతుల లక్షణం. అబూ హురైరా (రజి) ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త (స) ఇలా అన్నారు: "అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని నమ్మేవాడు తన అతిథిని గౌరవించాలి. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని నమ్మేవాడు తన బంధుత్వాలను కలుపుకోవాలి. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని నమ్మేవాడు మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి." (బుఖారీ మరియు ముస్లిం). అంతేకాకుండా, బంధుత్వాలను కలుపుకోవడం స్వర్గ ప్రవేశానికి మరియు నరకాగ్ని నుండి రక్షణకు ఒక గొప్ప మార్గం. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "ఓ ప్రజలారా! సలాంను వ్యాపింపజేయండి, అన్నదానం చేయండి, బంధుత్వాలను కలుపుకోండి, ప్రజలు నిద్రిస్తున్నప్పుడు (రాత్రిపూట) నమాజ్ చేయండి; మీరు ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తారు." (తిర్మిజీ). నిజమైన బంధుత్వం అంటే ఏమిటి? బంధువులను కలుపుకోని వెళ్లడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. వారికి మంచి సలహాలు ఇవ్వడం, వారిని సన్మార్గం వైపు పిలవడం మరియు చెడు నుండి వారించడం. ప్రవక్త (స) తన దగ్గరి బంధువులందరినీ పేరుపేరునా పిలిచి ఇలా హెచ్చరించారు: "ఓ ఫాతిమా! నిన్ను నీవు నరకాగ్ని నుండి రక్షించుకో. అల్లాహ్ దగ్గర నేను నీకు ఏమీ చేయలేను. కానీ మన మధ్య ఉన్న బంధుత్వాన్ని మాత్రం నేను గౌరవిస్తాను."(ముస్లిం) బంధుత్వాలను కలుపుకోవడం వల్ల కలిగే లాభాలు: బంధుత్వాలను కలుపుకోవడం వల్ల కలిగే ఫలితాలు చాలా మధురంగా ఉంటాయి. అవి: రిజ్క్ (జీవనోపాధి) పెరుగుదల: సంపాదనలో శుభం కలుగుతుంది. దీర్ఘాయువు: ఆయుష్షు పెరుగుతుంది లేదా సమాజంలో మంచి పేరు (మరణానంతరం కూడా) మిగులుతుంది. ప్రేమ: కుటుంబంలో అనురాగం పెంపొందుతుంది. ప్రవక్త (స) అన్నారు: "తన జీవనోపాధి పెరగాలని, తన ఆయుష్షు ఎక్కువవ్వాలని కోరుకునేవాడు తన బంధువులను కలుపుకోవాలి." (బుఖారీ). చివరి మాట: విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా (ర.అ) కథనం - దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "బంధుత్వం అల్లాహ్ అర్ష్ ను పట్టుకుని వేలాడుతూ ఇలా అంటుంది: 'నన్ను కలుపుకున్న వారిని అల్లాహ్ తన కరుణతో కలుపుతాడు, మరియు నన్ను త్రెంచిన వారిని అల్లాహ్ తన కరుణ నుండి దూరం చేస్తాడు'." (సహీహ్ ముస్లిం) ఈ చిన్న హదీసులో చాలా లోతైన అర్థం దాగి ఉంది: అల్లాహ్ అర్ష్ తో అనుబంధం: బంధుత్వం అల్లాహ్ అర్ష్ ను పట్టుకుని ఉండటం అనేది దాని అత్యున్నత గౌరవానికి మరియు ప్రాముఖ్యతకు నిదర్శనం. ప్రతిఫలం మరియు శిక్ష: ఒక వ్యక్తి తన బంధువులతో ఎలా ప్రవర్తిస్తాడో, అల్లాహ్ ఆ వ్యక్తితో అలాగే ప్రవర్తిస్తాడు. మీరు మీ బంధువులకు ప్రేమను మరియు సహాయాన్ని అందిస్తే, అల్లాహ్ మీకు తన అనంతమైన కరుణను ప్రసాదిస్తాడు. బంధుత్వాలను తెంచుకోవడం అనేది కేవలం మనుషులను దూరం చేసుకోవడం కాదు, అది అల్లాహ్ యొక్క కరుణను కూడా దూరం చేసుకోవడమే అని ఈ హదీసు హెచ్చరిస్తోంది. అల్లాహ్ మనందరికీ బంధువులతో కలిసి మెలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన పాపాలను క్షమించి మనపై కరుణ చూపించుగాక.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు