Saturday, August 30, 2025

Sunday, August 10, 2025

కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం! / Let's protect the family system!

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం! ఈ సంతానం, సిరిసంపదలు ప్రాపంచిక జీవితపు అలంకారాలు. నీ ప్రభువు దృష్టిలో ఫలితంరీత్యా ఎంతో శ్రేష్ఠమైనవి, శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే. వాటి ద్వారానే మేలు ఆశించడానికి ఆస్కారముంది. (అల్-కహఫ్: 45-46)
కుటుంబం ఓ పరిచయం అమ్మ గుర్తొచ్చినా..నాన్న గుర్తొచ్చినా.. బాల్యం గుర్తొచ్చినా.. కళ్ళు పొడిగానే ఉన్నా.. కన్నీళ్లు రాకపోయినా, హృదయం మాత్రం ద్రవించిపోతుంది. ఆ కాలం మళ్ళీ రాదేం అని మనసు ఆక్రోశిస్తుంది.- కుటుంబం అంటే జ్ఞాపకాలు! అన్నా చెల్లెళ్ల మధ్య అల్లరి, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం, అక్క చెల్లెళ్ల మధ్య స్నేహం, తల్లి దగ్గర గారాబం, తండ్రి దగ్గర భద్రత, అన్న పట్ల అనురాగం, తమ్ముళ్ల పట్ల అనుబంధం.. ---ఓహ్.. కుటుంబం అంటే అపురూప భావనల సమాహారం!! ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు, వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు - కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వేళ, వెన్నల రాత్రుల్లో వినీలాకాశం క్రింద కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి. కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాల సప్త రంగుల హరివిల్లు!! విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం - కుటుంబం! తీపి తీపి దరహాసాలు, చేదు చేదు పరిహాసాలు, పులుపు పులుపు బులపాటలు, వగరు వగరు గుణపాఠాలు - సుఖ దుఃఖాల సంగమం - కుటుంబం.! కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లులనీ, జింక పిల్లల్ని, పులి పసికూనల్ని చూసినప్పుడు ఎంత ఆనందమేస్తుందో దానికి మించిన సంతోషం తల్లి, చెల్లి, అమ్మమ్మ, నాన్నమ్మలతో గడిపినప్పుడు కలుగుతుంది - కుటుంబం అంటే ఓ ఇంద్రజాలం! పూలలో ఉంటాయి వేలరకాలు, పక్షులలో ఉంటాయి లక్షవిధాలు. రేకులు ఉంటేనే పువ్వంటాము... రెక్కలు ఉంటేనే పక్షంటాము. అలాగే కుటుంబముంటేనే సంఘం, సమాజం అంటాము. కుటుంబం ఆంటేనే ప్రపంచం!! సంక్రాంతి, రంజాన్, బక్రీద్ - పండుగ ఏదైనా .. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పండగ అయినా చిన్న సంతోషాన్ని ఇచ్చిందా? లేదు కదా, అంటే కుటుంబం అంటేనే పండగ.! యె ఖాందాన్ హమారా ఛూట్ గయా జబ్ సే మజా హమేం కిసీ తెహ్వార్ మే నహీ ఆతా సంతోషాన్ని రెండింతలు చేసే, బాధను సగానికి తగ్గించే దివ్య సూత్రం - కుటుంబం. చేసే చిన్న చిన్న త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మహిమాలయం - కుటుంబం. ఒక్క మాటలో చెప్పాలంటే, కుటుంబం జీవితంలో భాగం కాదు.. కాజాలదు.. కాకూడదు…. కుటుంబమే జీవితం!! కుటుంబం గురించి ఓ మాట భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కటుంబం అంతే ముఖ్యం. వ్యక్తి వికాసంలో, ఎదుగుదలలో కుటుంబం ఎంతో ప్రముఖమైనది. కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం. కుటుంబ వ్యవస్థ ద్వారా మనిషి తన వ్యక్తిత్త్వాన్ని మెరుగు పరుచు కోగలుగుతాడు. మనం పెరిగిన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ధర్మం – ఇస్లాం – గురించి ఎంత కష్టపడుతున్నామో – దీనికంతటికీ కుటుంబ వ్యవస్థే దోహదపడుతుంది. ఒక మనిషి ఎదుగుదలకు కుటుంబం ఏంతో సహాయ పడుతుంది. అందువల్లే ఇస్లాం కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. కుటుంబ వ్యవస్థ మనిషి సామాజిక జీవనానికి కుటుంబమే మూలం. పుట్టుకతో, పెళ్లితో ఆ బంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో భాగమైన వ్యక్తి రకరకాల విధులు నిర్వహిస్తారు. అందులో దైహిక, సామాజిక, ఆర్థిక, లైంగిక, విద్య, సాంస్కృతిక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. దీని ఆరంభం ఆదిలోనే - ఆది దంపతులయిన హజ్రత్ ఆదమ్ మరియు హవ్వా (అ)లతో మొదలయింది. 20 కాన్పులలో 40 మంది సంతానం ఆ ఆది దంపతులది.... అందుకే కుటుంబం, వివాహం సమాంతర వ్యవస్థలని అంటారు. ప్రతి దశలోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. మన జీవితంలో అధిక భాగం కుటుంబంతోనే గడుస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మన మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది. మనం మన దినచర్య కుటుంబ సభ్యులతోనే ప్రారంభిస్తాం. కుటుంబ, సంఘ ధర్మం ఇస్లాం ఇస్లాం ధర్మం యొక్క సానుకూల ప్రాభవము తొలూత మీ నుండే మొదలవుతుంది. మిమ్మల్ని పుట్టించిన మీ నిజ సృష్టికరను మీకు పరిచయం చేసి, మీకు మీ ప్రభువుకి మధ్య బంధాన్ని అది బల పరుస్తుంది. మీతో మీకు ఉండాల్సిన సంబంధాన్ని చక్కబెడుతుంది. ఫలితంగా - మీలోని ప్రతిభాపాటవాలను అనునిత్యం నవీకరించు కుంటూ నిత్య చైతన్య కరదీపకలవుతారు మీరు. మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా, మీ ఆచరణలు అభివృద్ధికి బాటలు వేసేవిగా రూపాంతరం చెందుతాయి. తద్వారా మీరు మీ దేహాన్ని, మీ మేధనూ, మీ మనస్సును - వాటికి కీడు కలిగించేటటువంటి ప్రతి వస్తువు నుండి కాపాడుకున్న క్రియాశీలురుగా ఎదుగుతారు. మీలో చోటు చేసుకున్న ఈ మార్పు - మీ పరిసరాలను, మీ పరివారాన్ని ప్రభావితం చేస్తుంది. మీలో ఉన్న ఈ మేలు మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు, మీ ఇరుగుపొరుగు వారికీ, సామాన్య ప్రజలకు చేరి - సంక్షామ సమాజంగా ఉన్న వ్యవస్థను ఓ సంక్షేమ సమాజంగా మారుస్తుంది. కుటుంబ పరిణామ క్రమం సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందా? మార్పులేమైనా చోటు చేసుకుంటున్నాయా? అనే విషయానికొస్తే.. సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం నేటి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ, విద్యావ్యాప్తి, నగరీకరణ, వివిధ చట్టాలు, ఆర్థిక, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులొస్తున్నాయి. ఇకమీదట కూడా వస్తుంటాయి. జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది, అయితే ఈ మార్పు మనకి సంతోషం తెస్తుందా? లేదా ఇబ్బందిని తెస్తుందా? అనేదే అసలు ప్రశ్న. కొద్దిమంది అసలు మార్పుని ఇష్టపడరు. వారికీ ప్రస్తుతం వున్నా స్తితిలోనే అంతా వుండాలని కోరుకుంటారు. వచ్చే మార్పు వారిని ఎంతో ఇబ్బంది పెండుతుందేమో అని భయ పడతారు. వారికీ ఒక ఇల్లు మారాలన్న భయం. ఉద్యోగం మారాలన్న భయం. కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవాలన్న భయం. ఈ భయాల కారణంగా ఎలాంటి మార్పు లేకుండా, వారికీ ఎప్పుడు తెలిసిన పరిస్టితులలోనే వుండాలని కోరుకుంటారు. కాని అది అసాద్యం కదా! కాలం మారుతూ వుంటుంది. మారుతున్న కాలంతోపాటు మనం అభివృద్ధి చెందుతూ మారుతూవుండాలి.అయితే మార్పు అనేది మంచి చేసేదిగా ఉండాలే గానీ, చెడు, కీడు, పాడు చేసేదిగా ఉండకూడదు. నేడు మానవ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో అధికశాతం కీడును కలిగించేవే అయి ఉండటం కడు శోచనీయం! అలా కుటుంబ సువ్యవస్థను చడి చప్పుడు లేని చాప క్రింద నీరులా చేరి పాడు చేస్తున్నాయి కొన్ని వికారాలు. అలాంటి కొన్ని వికారాల్ని ఇప్పుడు తెలుసుకుందాం! 1) వివాహ విముఖత వినాశకర ఆలోచన వివాహమే వద్దు అన్నది. ఆర్ధిక స్వేచ్ఛ గల స్త్రీకి - ఆర్థికంగా పురుషునిపై ఆధారపడే పరిస్థితి లేనప్పుడు సహజంగానే ఒక ప్రశక్తి ఉత్పన్నమవుతుంది- తాను స్వయంగా సంపాదించగలుగుతున్నప్పుడు భర్తకు ఎందుకు లోబడి ఉండాలి? భర్త సేవలు ఎందుకు చేయాలి? సంసార బాధ్యతలు ఎందుకు మోయాలి? పెళ్లి చేసుకుని, భర్త సేవలు చేసే బాదరబందీలు ఎందుకు కొని తెచ్చుకోవాలి? అనే భావన నానాటికీ బలపడుతోంది. జీవితం అనేది అనుభవించటానికే ఉందిగాని, బరువులు మీద వేసుకోవటానికి కాదు. అందుకే చాలా మంది స్త్రీలు తమ మనుగడ కోసం మగవాళ్ళ అండదండలు అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారు, వస్తున్నారు. అలాగే కొందరు పురుషుల్లో సయితం వివాహ అంటే వెగటు సగటుగా కనబడుతూనే ఉంది. మగ ఆడ కలిసుండాలనుంటే దానికి పెళ్లే కావాలా? నుండి మొదలయి చర్మ శుఖం కోసం పురుషుడే కావాలా? స్త్రీయే కావాలా? అన్న దిగజారుడుతనం వైపు సాగుతొంది. 2) సహజీవనం - OYO దుష్కృతి అసహజమైన జీవన విధానానికి పెట్టుకున్న పేరు సహజీవనం. నవతరంలో వైవాహిక వ్యవస్థపై నమ్మకం సడలిపోతోంది. పెళ్లి చేసుకోకుండానే అబ్బాయి- అమ్మాయి లేదా స్త్రీ-పురుషుడు సహజీవనం సాగిస్తున్నారు. పిల్లల్ని కంటున్నారు. ప్రతి రెండు మూడేళ్లకోసారి తమ జీవిత భాగస్వామిని కర్చీఫ్ మాదిరిగా మార్చేస్తున్నారు. ముసలి తల్లి దండ్రులు సోషల్ సెక్యూరిటీ (అంటే పెన్షన్)పై బ్రతుకుబండి లాగుతూ చచ్చిపోతున్నారు. దయాదాక్షిణ్యాలు లేని సంతానం కనీసం వారి అంత్యక్రియలకు కూడా రావడం లేదు.. అందం, ఐశ్వర్యం, ధనం, బలం ఉందని విర్రవీగకూడదు. కుటుంబ విలువల్ని కాలరాయకూడదు. మిలే ఉరూజ్ తో మగ్రూర్ కభీ మత్ హోనా / బులందియో కే సభీ రాస్తే ఢలాన్ సే హైం 3) స్వలింగ సంపర్కం స్వలింగ సంపర్కం వల్ల కుటుంబానికి జరిగే నష్టం చెప్పలేనిది. అందుకే ఇస్లాం ఈ వినాశకర చేష్టను తీవ్రంగా ఖండించింది. అనంత కరుణామయుడయిన అల్లాహ్ సదూమ్ జాతి ప్రజలను వారు ఈ దుశ్చర్య కారణం కఠినాతికఠినంగా శిక్షించాడు. ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురిపించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు. (హూద్: 82-83) ఈ రోజు పరిస్థితి ఎలా తయారైందంటే, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో - నైతిక ప్రమాణాలను నీళ్ళొదిలేస్తున్నారు. ఇక మనం వారు తానా…అంటే …తందానా అనం కదా! అయినా కొంతమంది మార్పులు స్వాగతించాలి ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి అని అంటూ నీతిబోధ చేసే ప్రయతనం చేస్తుంటారు. మంచిది కానీ, కాలక్రమేణా మనుషులు జంతువుల్ని చేసుకుంటాము పెళ్లి అని అంటే దాన్ని కూడా స్వాగతించాలంటారా? ఎవరిష్టం వాళ్ళదే అంటారా? ఇష్టా ఇష్టాలు పక్కన పెడితే మనుషులకంటూ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అవి సృష్టికర్త ముందే ఏర్పాటు చేశాడు. దానికి విరుద్ధంగా చేసే దేనిని మనం ప్రోత్సహించకూడదు ఏకీభవించకూడదు. పై పేర్కొన్న మూడు పద్ధతులు కుటుంబ వ్యవస్థ పాలిటి గొడ్డలిపెట్టు వంటివే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబం గురించి కొందరి కాకి గోల పరిమితికి మించి సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో అంతకంటె రెట్టింపు సమస్యలు దేశం విషయంలో కలుగుతాయి. "మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని" అన్న వాదన వీరిది. "పిండి కొద్దీ రొట్టె" దేశంలో ఆహారోత్పత్తికి తగిన వనరులు లేనపుడు, ఉండటానికి తగున వసతులు లేనపుడు, ఉద్యోగాలకి తగిన ఖాళీలు లేనపుడు, రోగులకి తగినంత మందులు లేనప్పుడు లెక్కకు మించి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురవక ఏమవుతాయి ? అందరికీ అన్ని సౌకర్యాలు ఒనగూర్చాలంటే కుదిరేపనా ? ఇంకొందరి సందేహం. నిజంగా - ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు.. సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. కలిసే పంచుకునేవారు. రానురాను ఉద్యోగాలు, ప్రైవేసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారి పోయాయి. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అన్నట్టుగా జనాలు ఆలోచన మెుదలు పెట్టారు. ఆ తర్వాత అసలు అత్తామామలను ఎక్కడో పెట్టి.. భార్యాభర్తలు మాత్రం లైఫ్‌ని లీడ్ చేసే కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఇది కాస్త ఇంకా అధ్వాన్నంగా మారింది. అదే DINK లైఫ్‌స్టైల్. ఈ వికృతి వికారాలు ఎన్నో ఎన్నెన్నో... DINK లైఫ్‌స్టైల్ అంటే.. Double Income No Kids. సంపాదన ఎక్కువే ఉండాలి.. కానీ పిల్లలు మాత్రం వద్దు అనే దుస్సంప్రదాయం. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి! భార్యాభర్తలుగా అన్యోన్నంగా ఉండటం ప్రక్రుతి. పిల్లాపాపలతో ఉండటం సంస్కృతీ. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేది విపరీత కృతి. అసలు పిల్లలే వద్దనుకోవడం వినాశకర దుష్కృతి. జంటలు తమ ప్రైవేసీ కోసం ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. పిల్లలను కనకుండా దంపతులు బాగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇద్దరి సంపాదన ఉంటుంది. తర్వాత వాటితో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశానికి వెళ్తారు.. నచ్చిన తిండి తింటారు. అంటే ఇక వారి జీవితానికి వారే రాజు.. వారే రాణి అన్న భ్రాంతిలో బతుకుతుంటారు. నిజానికి ఈ కాన్సెప్ట్ ఇతర దేశాల్లో 1980లలోనే మెుదలైంది. కానీ భారత దేశం వంటి అనేక దేశాలతోపాటు అరబ్బు దేశాల్లోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు. ఇందుకోసం సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లలతోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. పిల్లలనే పచ్చని చిలుకలు తోడు లేకుంటే,,, పాడే కోయిల్లాంటి మనరాళ్లు, మునిమనవళ్లు లేకుంటే బతుకే బాదల బందీఖానా. కన్నీళ్లతో కాపురమే శరణ్యం అనాథ మరణం. అనామక ఖననం అని గమనించి, కనువిప్పు కలిగి, మార్పుకి కళ్ళు తెరవాలి నేటి యువకెరటాలు! అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్- పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు అని ఏక్ నిరంజన్ అని ఓ ప్రత్యేక నేపథ్యంలో అన్నాడో కవి. ఇక ఈ తరం వాలకం చూస్తుంటే - కొడుకు లేడు కూతురు లేదు కొడుకు, కూతుళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే ఏ బాధ్యత లేదు - ఏక్ నిరంజన్, మనవళ్లు లేరు, మనవరాళ్లు లేరు ఏక్ నిరంజన్ అన్నట్టే ఉంది వ్యవహారం! అంటే ఒకప్పుడు అనాథ పిల్లలుండేవారు. ఇప్పడు ఈ తప్పుడు విధానం వల్ల అనాథ అమ్మానాన్నలు అధిక మవుతారు. అమ్మానాన్న లేని పిల్లలు అనాథలయితే, పిల్లలే అసలొద్దనుకునేవాళ్లు అనాథాలకన్నా అధ్వాన్నమెగా!! జీవితపు తొలి సంధ్యలో సంసార మకరందాన్ని తనివితీరా ఆస్వాదించిన యువజంటలు వారి మలిసంధ్యలో మనవళ్లు, మునిమనవరాళ్లతో గడిపే క్షణాలు శాశ్వతంగా గుర్తుండిపోయే తీపి గుర్తులు ... ఈ భాగ్యానికి ఈ అభాగ్యులు దూరమే కదా ! సంతానమే సృష్టిలో సమతౌల్యానికి మూలం నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతిలో మనందరి ప్రభువయిన అల్లాహ్ నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ నియతి, నియమం వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ దీర్ఘకాలంలో మనుగడ సాగించజాలదు. ఆ విషయానికొస్తే, ఒకరిద్దరిని మినహాయించి దైవప్రవక్తలందరూ కుటుంబ జీవితం గడిపిన వాళ్ళే. సంతాన కాంక్ష కలిగి అల్లాహ్ ను దీనాతిదీనంగా వెడుకున్నవాళ్ళే. అలాంటిది నేటి తరం మన యువతరం ఎటు వెళుతుంది? ఏమిటి, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! (అల్-హదీద్: 16) ఒక్కసారి ఆలోచించండి! ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే మంచిది అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు 'ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు' అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం' అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే 'డ్యుయల్ ఇన్కం నో కిడ్స్' అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది దంపతులు.. పూర్వం రోజుల్లో జంటలు ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్లు. తర్వాత జనాభా బాగా పెరుగుతోందని 'ఇద్దరు లేదా ముగ్గురికి ' పరిమితం అయ్యారు. ఆ తర్వాత 'ఇద్దరే చాలు' అన్నారు. కొన్నాళ్లకు 'ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు' అనే పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నేండ్ల నుంచి అయితే 'వన్ ఆర్ నన్' అంటున్నారు. అదికాస్తా ఇప్పుడు 'ఓన్లీ నన్ (పిల్లలే వద్దు)' అయ్యింది. పలురకాల కారణాల వల్ల పిల్లలు వద్దు అనుకునేవాళ్లను 'డింక్ కపుల్స్' అని పిలుస్తారు. . "పెళ్లయిన వెంటనే నాకు పిల్లల్ని కనడం ఇష్టంలేదు. టైం దొరికిన ప్రతిసారి లైఫ్ పార్టనర్ తో కలిసి దేశవిదేశాలు తిరగాలని ఉంది" అని చెప్పింది. ఆమె చెప్పినదానికి కాబోయే భర్త కూడా రాజీ అయ్యాడు. అలా ఇద్దరూ పెళ్లి అనే బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత నుంచి ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తున్నారు. ఏడాదికి రెండు మూడుసార్లు ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఓ సతి తీర్మానం. “మనకు వచ్చే జీతంతో మనం ఇద్దరమే కంఫర్ట్ ఉండగలం. పిల్లలు పుడితే వాళ్లను పెంచడానికి, పోషించడానికి చాలా డబ్బు కావాలి. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు వద్దనుకుంటే ఏ సమస్యా ఉండదు. రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం ఇప్పుడు సంపాదిస్తున్న దాంట్లో కొంత పొదుపు చేసుకుంటే సరిపోతుంది" ఇది ఓ పతి జడ్జిమెంటు. ఇక్కడ చెప్పుకున్న రెండు జంటల్లానే ఇప్పుడు చాలామంది జంటలు నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద సిటీల్లో ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. అయ్యో.. హతవిధీ! చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు, నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు. మెదడే పెరిగి హృదయం తరిగి, నరుడే ఈనాడు వానరుడైనాడు. అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు. పిల్లలు వద్దు కానీ కుక్క పిల్లలు కావాలట పిల్లలు లేకపోవడాన్ని బాధాకరంగా ఎందుకు చూడాలి? నిజానికి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. పిల్లలు ఉండడం వల్ల వచ్చే ఆనందం కోసం వాళ్లు మరో మార్గాన్ని ఎంచుకుంటారు. రక్త మాంసాలున్న మనిషి పిల్లల్ని ఏమన్నా వీరు పట్టించుకోరుగానీ, కుక్క పిల్లల్ని ఏమైనా అంటే మాత్రం ఎక్కడ లేని పనికిమాలిన పౌరుషం పుట్టుకొచ్చేస్తుంది. వీరి జంతు ప్రేమ తగలెయ్యా! అందుకే వీళ్లలో ఎక్కువమంది పిల్లలకు బదులు కుక్క పిల్లల్ని పెంచుకుంటారు. వాటినే పిల్లల్లా చూసుకుంటారు. ఆహా! ఏమి ఔదార్యము? వెర్రి వెయ్యి రకాలు డింక్వాడ్: భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టపడరు. వీళ్లు కాలక్షేపం కోసం కుక్కల్ని పెంచుకుంటారు. డింకర్: డబుల్ ఇన్కం నో కిడ్స్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటారు. సింక్ సింగిల్ ఇన్కం, నో కిడ్. డింక్వాక్: డబుల్ ఇన్కం, నో కిడ్స్. వీళ్లు పిల్లుల్ని పెంచుకుంటారు. డినో: డబుల్ ఇన్కం నో ఆప్షన్స్ (లిమిటెడ్ లేదా ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉంటాయి.) డింకీ: డబుల్ ఇన్కం, నో కిడ్స్ ఎట్ (టెంపరరీగా పిల్లలు వద్దనుకుంటారు.) డింప్: డ్యూయల్ ఇన్కం, మనీ ప్రాబ్లమ్స్. జింక్: గ్రీన్ ఇన్న్డ్, నో కిడ్స్. సిన్బ్యాడ్: సింగిల్ ఇన్కం, నో బాయ్ ఫ్రెండ్, పూర్తి నిరాశ. కొత్త జంటలు: చాలామంది పెండ్లి జరిగిన కొన్నేండ్ల వరకు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు ఈ మధ్య. ఇద్దరూ పనిచేస్తున్నా భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బు దాచుకున్నాకే పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. వాళ్లను కూడా పిల్లల్ని కనేవరకు డింక్లుగానే పరిగణిస్తారు. అలాంటివాళ్లు ఈ దశలో ఇల్లు, కారు కొనడం లాంటివి చేస్తుంటారు. లేదంటే.. పెండ్లి కోసం చేసిన అప్పులు తీరుస్తుంటారు. కాబట్టి పిల్లల్ని పెంచేందుకు సిద్ధంగా ఉండరు. “మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు: ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు. తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి. దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము. (అల్-అన్ఆమ్: 151) పూర్వం సంతానాన్ని మూడు కారణాల చేత చంపేసేవారు. 1) లేమి, పేదరిక భయంతో. 2) అవమాన భయంతో. 3) మూఢ నమ్మకాల ప్రభావంతో. మరి నేటి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగానూ, ఒకింత విడ్డూరంగానూ ఉంది. వీరి సంతోషంలో వారు అడ్డు తగులుతున్నారని ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా స్వకామ, స్వక్షేమ, స్వలోభ దాహానికి పిల్లల్ని దారి కంపలుగా భావించి తొలగించుకోవాలనుకుంటున్నారు. విచిత్రమేమిటంటే, ఈ వేలం వెర్రి నిరుపేదలకన్నా ధనికుల్లో ఎక్కువగా ఉంది. పామరులకన్నా బాగా చదువు, కొలువున్నవారిలో ఎక్కువగా ఉంది. అల్లాహ్ పై వచనంలో - సంతాన హత్య మహా నేరం, ఆ నేరానికి మీరు పాల్పడకండి అన్నాడు. మరి సంతాన హత్య అంటే కేవలం భ్రూణ హత్యలు మాత్రమే కాదు, సంతానం కలిగిన మీదట చంపడం మాత్రేమే కాదు. అసలు సంతానమే వద్దనుకోవడం దానికి మించిన నేరం, మహా పాపం. నిజంగా దీన్ని మొత్తం మానవాళి హత్యగా పరిగణించాల్సి ఉంటుంది. డింక్ జీవన విధానపు విపరిణామాలు వయసొచ్చాక సమస్య - ఉడుకు రక్తం ఉరకలేస్తున్నప్పుడు ఎవరికీ ఎవరి అవసరమూ ఉండదు. కానీ.. ఒక వయసొచ్చాక నా అనుకునేవాళ్లు లేకపోతే.. బాగా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం సొంత పనులు కూడా. చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుండేది పిల్లలే. పిల్లలకు చిన్నప్పుడు అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల పల్ల వచ్చే సంతృప్తిని వీరు అసలు అనుభవించలేరు. భాగస్వామిని కోల్పోతే.. భార్యాభర్తలు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకేసారి చనిపోరు కదా! కాబట్టి వాళ్లలో ఒకరు చనిపోతే.. మిగిలినవాళ్లు ఆ వయసులో తోడులేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చేతిలో డబ్బు ఉండడం వల్ల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. కానీ.. తోడునిచ్చే నీడని మాత్రం కొనుక్కోలేం. కాబట్టి పిల్లలు ఉండడమే ఉత్తమం అంటున్నారు అనుభవజ్ఞులు. బంధం నిలబడాలంటే పిల్లలే ఆధారం లైఫ్ పార్టనర్ తో ఏదైనా గొడవైనా, ఇంకేదైనా సమస్య వచ్చినా విడిపోతుంటారు. కానీ,, పిల్లలు ఉంటే విడాకులు తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. విడాకులు తీసుకుంటే పిల్లలు తండ్రి లేదా తల్లి ప్రేమకు దూరమవుతారు. అందుకే భార్యాభర్తల్ని కలసి ఉండేలా చేసేది పిల్లలే అంటారు పెద్దలు. వారే లేకపోతె పెళ్లికి కట్టిన ఆ మావిడాకులు "మా" (మా అబ్బాయి, మా అమ్మాయి) అనే బంధం లేని కారణంగా ఒట్టి విడాకులుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు; “ఆచరణ రీత్యా అందరికంటే ఎక్కువ నష్టపోయే వారెవరో నేను మీకు తెలుపనా? ప్రపంచ జీవితంలో తమ కృషి, శక్తిసామర్థ్యాలన్నీ సన్మార్గం తప్పి వృధా అవుతున్నా సరే, తాము అంతా మంచే చేస్తున్నామని భావించే వారే ఎక్కువ నష్టపోయేవారు. (అల్-కహఫ్: 103-104) అయితే,, అనుకున్నంతనే అన్నీ అయిపోవు. కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే. ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం. ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి. నేటి యువతలో సహించే, భరించే గుణాలు అంతరించిపోతున్నాయి. వాటి స్థానంలో పంతాలు, పట్టింపులు, కోపతాపాలు తిష్ట వేసి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. కుటుంబ వ్యవస్థను కూకటి వ్రేళ్ళతో పెకళించ ప్రయత్నిస్తున్నాయి. సంసారపు సాగరంలో సాగక తప్పని జీవన యాత్రికులమే మనమందరం ఎవడి నావ వాడిదే...ఎవడి చుక్కాని వాడికే. ఏ శిక్షణా లేని అనుభవమూ తెలియని నావికులమే మనమందరం. సాగరమంటేనే మరి అలల ఒరవడి... ఒకదాని వెంట ఒకటి.. ఒకదాన్ని మించి ఒకటి... ఎప్పుడు ఏ ఉప్పెన ఎటునుండి ముంచుకొచ్చేనో! అయినా అది తప్పని ఎదురీత...భయపడి ఆగిపోయావా.. ధైర్యమని చుక్కానిని వదిలేసినా నట్టనడి సంద్రాన నిట్టనిలువునా మునిగిపోతాం! తల్లిదండ్రులుగా ఆత్మావలోకనం నేనతనికి అపార సిరిసంపదలు ప్రసాదించాను. అతడ్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకుల్ని కూడా ఇచ్చాను. సుఖసంతోషాలకు కావల్సిన జీవన సామగ్రి నంతా ఇచ్చాను. (అల్-ముదస్సిర్: 13) సంతానమంటే అనుగ్రహం మాత్రమే కాదు సంతానమంటే బాధ్యత కూడా. ఆ బాధ్యత గురించి మనందరిని నిలదీయడం కూడా జరుగుతుంది. ఆరోజు ఈ సౌఖ్యాలు, సిరిసంపదలను గురించి మిమ్మల్ని తప్పక నిలదీయడం జరుగుతుంది. (అత్-తకాసుర్: 8) మనం బాగుండి మన సంతానం కూడా బాగుంటే అది మన జీవిత అలంకారం. మనకు సంతానం పట్ల ప్రేమ మితిమీరినా, వారు త్రోవ తప్పినా అది మన జీవిత పరీక్ష. అదే మన ఆశలు, మన ఆశయాలు వద్దు గానీ ఆస్తులు మాత్రం కావాలనుకునే భార్యా పిల్లలుంటే - అది మన జీవిత ప్రమాదం. ఈ మూడింటిని అల్లాహ్ అందరికి అర్థమయ్యేలా ఖుర్ఆన్లో పేర్కొన్నాడు. 1) ఈ సంతానం, సిరిసంపదలు ప్రాపంచిక జీవితపు అలంకారాలు. (అల్-కహఫ్: 45) 2) నిశ్చయంగా, మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష. మరియు అల్లాహ్‌! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది. (అత్-తగాబూన్: 15) 3) ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మీ సహవాసులు మరియు మీ సంతానంలో మీ శత్రువులు ఉండవచ్చు! కావున మీరు వారిపట్ల జాగ్రత్త వహించండి. కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత (అని తెలుసుకోండి). (అత్-తగాబూన్: 14) ఈనాడు మన పిల్లలు ఇలా తయారవుతున్నారంటే దానికి ఎక్కడొక చోట మనం కూడా కారకులం ఏమో - ప్రతి తల్లిదండ్రులు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే, నేల మంచిదయితే పాడి - పంట. నేల చెడ్డదయితే పాడయిన పంట. అదే చెబుతున్నాడు అల్లాహ్. సారవంతమైన నేల తన ప్రభువు అనుజ్ఞతో పుష్కలంగా మంచి పంటనిస్తుంది. సారంలేని చవిటినేల నాసిరకాన్నే ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మేము కృతజ్ఞులయిన వారి కోసం మా సూక్తులు, సూచనలను మాటిమాటికి విశదీకరిస్తున్నాము. (అల్-ఆరాఫ్: 58) మమత-సమత మణిదీపమే అమ్మ, అవ్యాజానురాగ ఆపన్న హస్తమే నాన్న. ఒక విత్తనం మొక్కై, చెట్టై, మహావృక్షంగా మారి ఫలవంతం కావాలంటే మొట్టమొదట కావలసింది గాలి, నీరు, ఎండ, ఎరువు కాదు. కావలసింది సారవంతమైన 'భూమి'. ఆ తరువాతే మిగిలినవన్నీ. అలాగే ఒక పిల్లవాడు బుద్ధిమంతుడు, విద్యావంతుడు, విజ్ఞానవంతుడు కావాలంటే 'ఇల్లే' వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పే వేదిక కావాలి. తల్లి తండ్రులే అందుకు ఉత్తమ గురువులుగా మారాలి. నాన్న నమ్మకం ! అమ్మ నిజం ! నమ్మక, నిజాల ప్రతి రూపం సంతానం . బలాలు ఉన్నట్లే ఎంతటి పేరు ప్రఖ్యాతులున్న మనిషికైనా బలహీనతలూ కొన్ని ఉంటాయి. ఆవి అతడికి పరీక్ష పెడుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో ఇతరులకు పట్టిస్తుంటాయి. వారు ఆ బలహీనతలతో ఆడుకుంటారు. బలహీనతల కారణంగానే మనిషి మరొకరికి లొంగిపోతాడు. ఒకరికి తిండి బలహీనత మరొకరికి నిద్ర, ఇంకొకరికి శారీరక సుఖం... ఇలా ఎన్నో బలహీనతలు. మనిషిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. బలహీనతలను దాటిరావడానికి బలం కావాలి. ధైర్యం కావాలి. దైవశక్తి కావాలి. నిజమైన పరిపూర్ణుడైన మనిషిగా బతకాలంటే బలహీనతలు ఉండకూడదు. శరీరంలో, మనసులో తిష్ట వేసుకున్న వాటిని వెళ్లగొట్టాలి. ముందు అవి బయటకుపోతే అప్పుడు మంచి గుణాలతో నింపుకోవచ్చు. ఇక సంసారమంటేనె ఎడతెగనీ బాధ్యతల దాడి. బాధ్యతలెన్ని ఎంత బరువైనా.. కష్టాలే కూలదోసినా పడుతూ లేస్తూ... ఆటుపోట్లను అధిగమిస్తూ సంసార సాగరపు ఒడిదుడుకులను తట్టుకుంటూ. పరిస్థితులకు కాలానుగుణంగా ఎదురీదుతూ లక్ష్యాలవైపు ఉరికేవాడే విజయాన్ని పొందగలడు... ముందుకు సాగేకొలది లోతు పెరుగుతుండేది... ఎదురీదగలుగు పోటుగాడికది.. అంతులేని, వెలకట్టలేని ఆనంద నిక్షేపాల భాండాగారం... ఈదలేక వదిలేసే వారిని ముంచేసే విలయం... అంతిమంగా… ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కర లేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికం గా సంపాదించానా? ఖర్చు పెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్ధం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. ఆ అర్థం, కామానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉన్నట్టే. మనిషి జీవితం సార్థకం అయినట్టే. విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు సహాయంచేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (మీ కుటుంబాన్ని, పరివారాన్ని) స్థిరంగా ఉంచుతాడు. (ముహమ్మద్: 7) కుటుంబం బాగుంటేనే సమాజంలో అందరూ బాగుంటారు. అందులో మనం ఉంటాం. అన్యదా విపరిణామాలు వేరే విధంగా, విధ్వంశకరంగా ఉంటాయి జాగ్రత్త! కాబట్టి - విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీభార్యాపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. దానికి మానవులు, రాళ్ళు సమిధలవుతారు. అక్కడ దృఢకాయులైన, కఠిన (హృదయు లైన) దైవదూతలు (నరక నిర్వాహకులుగా) నియమితులై ఉంటారు. వారు అల్లాహ్ ఆజ్ఞల్ని ఏమాత్రం జవదాటరు. ఏ ఆజ్ఞ వచ్చినా తక్షణమే దాన్ని శిరసా వహిస్తారు. (వారు నరకవాసులతో) “అవిశ్వాసులారా! ఈరోజు మీరు సాకులు చెప్పకండి. మీరెలాంటి కర్మలు చేసుకున్నారో అలాంటి ప్రతిఫలమే మీకివ్వబడుతోంది” అనంటారు. కాబట్టి - విశ్వాసులారా! మీరు మనస్ఫూర్తిగా అల్లాహ్ కు క్షమాపణ కోరుకోండి. మీ ప్రభువు మీ పాపాలు మన్నించి, మిమ్మల్ని సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆరోజు అల్లాహ్ తన ప్రవక్తకు, అతనితోపాటు విశ్వసించినవారికి ఎలాంటి అవమానాలకు గురి చేయడు. (అత్-తహ్రీమ్: 6-8) పోతే దైవభీతిపరాయణులు అక్కడ స్వర్గవనాలు, భోగభాగ్యాలలో ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించే మాధుర్యాలను ఆస్వాదిస్తూ సుఖసంతోషాలలో తేలియాడుతారు. వారి ప్రభువు వారిని నరక యాతనల నుండి రక్షించాడు. “ఇక మీరు ఆచరించిన కర్మలకు ప్రతిఫలంగా (నేడు) హాయిగా తినండి, త్రాగండి.” అనబడుతుంది. వారక్కడ ఆసనాలపై దిండ్లకానుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన (విశాల) నేత్రాలుగల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాం. విశ్వాసులతోపాటు వారి సంతానం కూడా విశ్వాసంలో వారి అడుగుజాడల్లోనే నడచుకొని ఉంటే, వారిని కూడా మేము (స్వర్గంలో) వారి దగ్గరికి చేర్చుతాం. వారి సుకృత ఫలాన్ని మేము ఏమాత్రం తగ్గించం. ప్రతి మనిషీ తనకర్మలకు తాకట్టుగా ఉన్నాడు. (అత్-తూర్: 17-21)

సత్కారాల సుధాఝరి రమజాన్ / Ramadan is a time of blessings.

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు సత్కారాల సుధాఝరి రమజాన్ ”అల్లాహ్ భూభాగాల్లో మక్కా భూ భాగాన్ని మహోన్నతమైన భూభాగంగా ఎన్నుకున్నాడు. మాసాల్లో రమజాను మాసాన్ని మహిమాన్వితమైన మాసంగా ఎన్నుకున్నాడు. రోజుల్లో శుభప్రదమయినదిగా శుక్ర వారం రోజును ఎన్నుకున్నాడు. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ను ఘనతరమైనదిగా చేశాడు” అన్నారు ఖతాదః (ర). పై పేర్కొన్న విశిష్టతల్లో రెండు రమజాన్ సంబంధించినవే. అంది వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
విశ్వాస సోదరులరా! అల్లాహ్‌ మీ ధన, మాన, ప్రాణాలను కాపాడాలని మీరు కోరుకుంటున్నారా? మీకు దైవప్రవక్త నాయకులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి దీవెనలు పొందాలని ఉందా? ప్రపంచంలోని సంపదలకంటే గొప్ప సంపదను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ”ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన దానిని (ప్రజల వరకు) చేరవేయి….నిశ్చయంగా అల్లాహ్‌ ప్రజల (కీడు) నుండి నిన్ను తప్పక కాపాడుతాడు”. (మాయిదహ్‌; 67) ”అల్లాహ్‌ ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక! ఎవరయితే నా నుండి నా మాటను విని దాన్ని ఇత రుల వరకు చేర వేసాడో”. వేరోక ఉల్లేఖనంలో-”నీ మాధ్యమంగా అల్లాహ్‌ ఒకే ఒక్క వ్యక్తికి సన్మార్గం చూపినా అది నీ పాలిట ప్రపంచ సకల సంపద లకంటే ఎంతో మేలయినది” అని అన్నారు ప్రవక్త (స). రమజాను మాసం ధర్మబోధ మాసం కూడా. ఈ మాసం మార్గం మరచి బతకుతున్న అల్లాహ్‌ దాసుల్ని ఆయన మార్గం వైపునకు ఆహ్వానించాల్సిన బాధ్యత ఒక ముస్లింగా మనందరిపై ఉంది. మన ఈ బాధ్యతను మనం ఓ మంచి మాట ద్వారా అయినా నెరవేర్చగలము. ఒక కరపత్రాన్ని అందజేసి నిర్వర్తించ గలము. ఒక షార్ట్‌ మెసెజ్‌ పంపి అయినా చేయగలము. మన పిల్లాడు నిప్పు కుంపటిలో పడిబోతున్నాడని తెలిస్తే మనం ఎంతగానయితే తల్లడిల్లి పోతామో అలాగే మార్గం మరచి జీవిస్తున్నతోటి మానవుల విషయంలో సయితం మనం చలించిపోవాలి. ఇలా మనం చేసిన నాడు అల్లాహ్‌ కారుణ్య కడలి మన వైపు కదిలొస్తుంది. విశ్వాస సోదరులరా! అల్‌హమ్దులిల్లాహ్‌ మనం ఉపవాసాలు పాటిస్తున్నాము. ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నాము. తరావీహ్‌ ప్రార్థనల్లో ఎంతో నిష్ఠగా పాల్గొంటున్నాము. దానధర్మాలు విస్తృత స్థాయిలో చేస్తున్నాము. ఇఫ్తార్‌ కార్యక్రమాలూ జరుపుతున్నాము. తల్లిదండ్రులను సయితం కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. అల్లాహ్‌ దాసుల్ని అల్లాహ్‌ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాము. అయినా మన కర్మలు అల్లాహ్‌ సన్నిధానంలో ప్రవేశ పెట్ట బడటం లేదు. ఎందుకో తెలుసా? వినండి! ”ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్‌తో పాటు అన్యులను సాటి కల్పించని (షిర్క్‌ చేయని) ప్రతి వ్యక్తికి అల్లాహ్‌ క్షమాభిక్ష ప్రాప్తిస్తుంది. ఓ వ్యక్తికి తప్ప. అతనికి అతని సోదరునికి మధ్య పగ ఉంది. వారి విషయంలో ఇలా అనబడుతుంది: ”వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని. వీరికి వ్యవధి ఇవ్వండి – వీరు సంధికి రాని. వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని” అని. నిజంగా సంధికి మించిన సత్కార్యం లేదు. స్వయంగా అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ”నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. కావున మీ సోదరుల మధ్య సంధి చేయిపించండి”. (హుజురాత్‌; 10) వేరోక చోట – ”రాజీ పడటం ఎంతో ఉత్తమమయిన కార్యం”. (అన్నిసా: 127) అలాగే మన సమావేశ ఉద్దేశ్యాల్లో ‘ప్రజల మధ్య సంధి చేయించడం కూడా ఒకటి’ అని మనకు తెలుస్తుంది. ప్రవక్త (స) అనేక సందర్భాలలో అనేక సహాబా మధ్య సంధి కుదిర్చిన సందర్భాలున్నాయి. స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా సయితం ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదిర్చి, ఆ సంధి కుదర్చ డానికి అపార అనుగ్రహాల్ని ప్రసాదించి మరి వారిరువురిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. కాబట్టి నేడే ఈనాడే మనకు మన సోదరులకు మధ్య ఏదేని విషయంలో వివాదం ఉంటే, వారొచ్చి రాజికి రావాలని ఎదురు చూడటం మాని మనమే వెళ్ళి వారితో సంధి చేసుకోవాలి. ఈ రమజాను మాసం పూర్తయ్యే లోపు ఏ ధార్మిక కారణం లేకుండా ఎవ్వరితోనూ ఎలాిం వివాదం ఉండకూడదు. మనమే వెళ్లి వారికి సలామ్‌ చేద్దాం. ఆ నిమిత్తం అల్లాహ్‌ నేర్పిన దుఆను రమజాను మాసం చివరి క్షణం దాకా చేస్తూనే ఉందాం! ”రబ్బనఘ్ఫిర్‌ లనా వలి ఇఖ్వానినల్లజీన సబఖూనా బిల్‌ ఈమాన్‌, వలా తజ్‌అల్‌ ఫీ ఖులూబినా గిల్లల్‌ లిల్లజీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్రహీమ్‌”. వారిలా ప్రార్థిస్తారు: “ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందర్నీ క్షమించు. (యావత్తు)విశ్వాసుల పట్ల మాహృదయాల్లో ఎలాంటి అసూయాద్వేషాలు ఉంచకు. ప్రభూ! నీవు గొప్ప క్షమాశీలివి, అపార దయామయుడవు.” (అల్-హష్ర్: 10) ఆమీన్‌. విశ్వాస సోదరులరా! మీకెప్పుడయినా చేయి కాలిన అనుభవం ఉందా? లేదంటే వేలిగే దీపంలో కాసేపు వేలు పెట్టి చూడండి. చురుక్కుమంటుంది. మనస్సు చివుక్కుమంటుంది. అమ్మా! లేదా అబ్బా అన్న శబ్దం అప్రయత్నంగా మీ నోట వెలువడుతుంది. నరకాగ్నిని 70 సార్లు కడిగితే మిగిలిన వేడి మన ప్రపంచపు మొత్తం అగ్నిది. అ అగ్నిలోని కొంతలో కొంత గోరంతి దీప సెగకే విలవిల్లాడి పోతుంటే రేపు నరకాగ్ని సెగకు మనం తట్టుకోగలమా చెప్పండి! అక్కడేమో చర్మాలు కాలిన కొద్ది కొత్త చర్మాలు పుట్టుకొస్తుందాయే! అల్లాహ్‌ మనందరిన నరకాగ్ని నుండి కాపాడుగాక! విశ్వాస సోదరులరా! రమజాను మాసం నరక ముక్తి మాసం. ప్రవక్త (స) అన్నారు: ”ప్రతి రోజు అల్లాహ్‌ కొందరిని నరకాగ్ని నుండి కాపాడుతూ ఉంటాడు”. అలాగే ప్రవక్త (స) సెలవిచ్చిన మాట – ”మిమ్మల్ని మీరు నర కాగ్ని నుండి కాపాడుకోండి! ఒక్క ఖర్జూర ముక్కను దానం చేసి అయినా సరే”. అల్లాహ్‌ సుబ్హానహూ వ తఅలా ఖుర్‌ఆన్‌లో నరకాగ్నిన్ని వర్ణించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ అంటున్న మాట ఏమిటో తెలుసా? ”ఫ మా అస్బరహుమ్‌ అలన్నార్‌ – ఏ విషయం వారిని నరకాగ్ని విషయంలో దుస్సహనానికి పురిగొల్పింది”. (వారెలా నరకాగ్నిని భరించగలరు!?). (బఖరహ్‌: 176) కాబట్టి నరకాగ్ని యాతన మనల్ని కాపాడే ఎన్ని మార్గాల్ని ప్రవక్త (స) మనకు తెలిజేశారో వాటన్నింటిని అనుసరించి మనం మనల్ని, నరకాగ్ని బారి నుండి కాపాడుకోవాలి. మనల్ని నరకాగ్ని బారి నుండి కాపాడే సాధనాల్లో ఆడకూతుళ్ళ అగ్ర భాగాన ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ వారి యెడల ఉత్తమంగా వ్యవహరించి ఇహపర మేలును మూట కట్టుకోవాలి. విశ్వాస సోదరులరా! ప్రాంపంచిక విషయంలో మనిషి మహా ఆత్రగాడిలా వ్యహరిస్తాడు. ఒకవేళ అతనికి ఒక బంగారు లోయ దొరికితే ఇంకొకి ఉంటే బావుండు అంటాడు. రెండు లోయలు నిండా బంగారం దొరికితే మూడోది ఉంటే ఇంకా బావుండు అని అంటాడని స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా సెలవిచ్చాడు. ప్రాపంచిక పరిమిత ప్రాపర్ట్టీ విషయలో ఇంత ప్రాకులాడితే, పరలోక సిసలయిన, శాశ్వతమయి సత్కార్యాల సామగ్రి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో ఆలోచించండి! మరి మీకు అలాంటి లోయలు నిండిన పుణ్యాలు కావాలనుకుంటున్నారా? మహా పర్వతమంతటి పుణ్యాన్ని సొంతం చేెసుకోవాలనుకుంటున్నారా? ఒక పర్వతం మాత్రమే కాదు మాకు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు… మహా పర్వతాలు కావాలని కోరుకుంటున్నారా? అల్‌హమ్దులిల్లాహ్‌ ఆ ఏర్పాటు కూడా ఉంది, అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే జనాజా నమాజు చదివి జనాజా వెంట వెళ్ళకుండా ఆగిపోతే అతనికి ఒక ఖీరాత్‌ పుణ్యం లభిస్తుంది. ఒకవేళ దాని వెంట వెళితే అతనికి రెండు ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుంది. అది విన్న సహాబా ”ఖీరాత్‌ అంటే ఏమి?” అని ఆరా తీశారు. అందుకాయన (స) – ”ఖీరాత్‌లోని అత్యల్ప భాగం ఉహద్‌ కొండంతిదై ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (ముస్లిం). ప్రియా మిత్రులారా! రమజాన్ దానధర్మాల మాసం కూడా. ప్రవక్త ముహమ్మద్ (స) ప్రభంజనం కన్నా వేగంగా దానధర్మాలు చేసేవారు. కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి-దాతృత్వం! స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. అప్యాయంగా కొలుస్తుంది. ఆదర్శంగా భావిస్తుంది. దైవ ప్రవక్తలు, వారి సహచరులు, పుణ్యాత్ములు - ఎప్పుడో కీర్తిశేషులయ్యారు. అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు, శిలా శాసనాలు కావు- శీల స్వభావాలు! పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. దాన మూడు విధాలు అంటారు పెద్దలు. - శ్రియా దేయం. హ్రియా దేయం. భియా దేయం. దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్టుగా సంతోషంగా దానం చేయడాన్ని శ్రియా దేయం. అంటారు. 'అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం. దానం చేయడం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదు అంది ఖుర్ఆన్. ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుపడుతూ దానం చేయడం ప్రియాదేయమనే మాటకు తాత్పర్యం. ముఖ్యంగా అటుమాభిమానా ధనికులకు, ధర్మ పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి స్థాయికి తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం హ్రియా దేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- భియా దేయం. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సాత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని ధర్మ శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం, ఏ మాత్రం దక్కడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యం ఇది. ఈ మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుంది. చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు అల్లాహ్ కు, స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలి. అంతేకాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దానఫలం దక్కడు సుమా!.
విశ్వాస సోదరులరా! ఓర్పు సహనాల మాసం రమజాన్‌. ”నిశ్చయంగా సహనంతోనే సమస్య పరిష్కారం ముడి పడి ఉంటుంది” అని ప్రవక్త (స) వారు సెలవిచ్చి ఉన్నారు. స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా ‘ఓర్పు సహనాలు కలిగి ఉండమని, పరస్పరం సహనబోధ చేస్తూ ఉండాల’ని హితవు పలికాడు. అల్లాహ్‌ మనల్ని అనేక విధాలు పరీక్షిస్తాడు. భయంతో, ఆకలితో, సంపద లేమితో, సంతాన లేమితో, ఆప్తులను దూరం చేసి. ఆయన పెట్టే అన్ని పరీక్షల్లో మనం ఉత్తీర్ణులవ్వాలంటే మన వద్ద ఉన్న ఏకైక సాధనం సహనం. అలా సహనం వహించిన వారిపై ఆయన దీవెనలు కుండపోతగా కురుస్తాయి. అందరూ నడిచే దారిన నడవడం లోకసహజం. చిన్న దారిలో నడవడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు కాబట్టి చాలామంది. అలాగే చేస్తారు. అలాంటి వారి జీవితాలూ సాదాసీదాగానే. గడిచిపోతాయి. కానీ కొత్త మార్గం కనుగొని, లేదా ఏర్పరచుకుని వెళ్లడం, భిన్నంగా ఆలోచించడం లాంటి వాటికి పూనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇలా చేయడానికి సాహసం, సహనం ఉండాలి. ఎందుకంటే- కొత్త దారిలో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. తట్టుకుని నిలబడగలిగితేనే విజయాలూ పొందవచ్చు. నేడు అనేక దేశాల్లో ముస్లింలు దహనీయ స్థితికి లోనయి ఉన్నారు. బతకడానికి కనీస అవసరాలకు సయితం నోచుకోకుండా తల్లడిల్లి పోతున్నారు. కొందరి కళ్ళ ఎదురే వారి కుటుంబాలను తూటాలకు బలి చేస్తూ, ఆపాలని, వారిని కాపాడుకోవాలని మనసు ఎంత ఆరాట పడుతున్నా అడుగెత్తి అడుగు వేయలేని దీనావస్థలో ఉన్నారు పాపం! అల్లాహ్‌ వారందరికి ఉత్తమ సహనాన్ని ప్రసాదించాలని, వారి సమస్యలను తీర్చి వారిని గట్టున పడేయాలని, విశ్వం మొత్తంలో నివిసిస్తున్న విశ్వాసుల కోసం ప్రార్థనలు చేసి ప్రగాఢ సానుభూతిని చాల్సిన మాసం రమజాన్‌. అలాగే ఆర్థిక, నైతిక సహాయంతోపాటు ఒకవేళ మన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం మనపై అటువంటి ఆపదలు విరుచుకు పడినా అదరక, బెదరక ప్రాణ త్యాగం చేసైనా ధర్మోన్నతి కోసం పాటు పడతామని గట్టి సంకల్పం చేసుకోవాల్సిన మాసం. ఎందుకంటే, రమజాన్‌ ఓర్పు సహనాల మాసం మాత్రమే కాదు. అవి నశిస్తే సమర శర పరంపరలు సంధించే మాసం కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటి పోరాట పటిమ పేరే జిహాద్‌!

ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు / Memories of Isra-Miraj on the Muslim mind

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు ”తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభ వంతం చేశాము. ఎందుకంటే, మేమతనికి మా (శక్తికి సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలచాము. నిశ్చయంగా అల్లాహ్‌ా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1) గగన విహారం: రాత్రి వేళ మస్జిదె హరామ్‌ నుంచి మస్జిదె అఖ్సా వరకు దివి దూతలతో భువి ప్రవక్త ముహమ్మద్‌ (స) చేసిన ప్రయా ణాన్ని ఇస్రా అంటారు. అక్కడి నుండి ఏడు ఆకాశాల అధిరోహణను, అక్కడ తిలకించిన సంగతులను మేరాజ్‌ అంటారు. ఈ అద్భుత సంఘటన హిజ్రత్‌కు ముందు జరిగిందన్న విషయంలో పండితులందరి మధ్య ఏకాభిప్రా యం ఉంది. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం రాత్రిలోని అతి స్వల్ప భాగంలో జరిగిపోవడం ఒక అద్భుతమే. ఈ యాత్ర కొందరు పొరబడినట్టు ‘స్వప్నావస్థ’లో జరిగింది ఎంత మాత్రం కాదు. ఆయన (స) సశరీరంగా పూర్తి మెలకువలో ఈ యాత్ర చేసి వచ్చారు. ఇస్రా-మేరాజ్‌ మాట వినగానే గత తాలూకు జ్ఞాపకాలు మన మనో తెరలపై కదలాడుతాయి. మనలో అంతరించిన భావ చైతన్యం చిగుళ్లు పోసుకుని నవశక్తిగా ఉద్భవి స్తుంది. అవును, మనం సదా మేల్కొని ఉండాలన్నదే మేరాజ్‌ మధుర ఘట్ట సందేశం.
మేరాజ్‌ సందర్భంగా మానవ సమాజాన్ని పట్టి పీడించే అనేక రుగ్మతలను అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి చూపించి వాటికి విరుగుడును బోధించడం జరిగింది. మనిషి ఉపాసనారీతులన్నీ, పూజా పద్ధతులన్నీ ఏకైక దైవమయిన అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యే కించాలని, ఆయనతోపాటు ఇతరులను సాటి కల్పించి ఆరాధించ వలదని, తల్లిదండ్రుల యెడల అత్యుత్తమంగా మసలుకోవాలని, వారి తో చీదరించుకుంటూ మాట్లాడటం తగదని, బంధుమిత్రుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉం డమని, దుబారా ఖర్చుకు దూరంగా మసలుకో వాలని, సరదారాయుళ్లు షైతాన్‌ సోదరులని, అనవసరమయిన విషయాల జోలికి వెళ్ళకండ ని,దానం చెయ్యడంలో సయితం మధ్యేమార్గం మంచిదని, పిసినారితనం పరమ జుగుప్సాకర మైన గుణమని, మనిషి చెప్పే ప్రతిమాట, చేెసే ప్రతి పని లెక్కించబడు తుందని, కలిమి లేములు ఆ కరుణామయుని ఇష్టానుసారమే లభిస్తాయని, లేమి గురయితే కృంగి పోకూడ దని, కలిమి కలిగితే పొంగి పోకూడదని, అశ్లీ చేష్టలకు ఆమడ దూరంలో ఉండాలని, వ్యభి చార దరిదాపులకు సయితం వెళ్ళకూడదని, అనాథల ఆస్తులను స్వాహా చెయ్యడం పరమ నీచం అనీ, ఒండొకరి ధన, మానాలు దోచు కోవడం అన్యాయమని, వడ్డీ, చక్రవడ్డీల పేరు తో జలగల్లా పేదలరక్తం త్రాగొద్దని, సారాయి, జూదం, పాచికల జోస్యం, దైవేతరాల జోలికి పోవద్దని, మంచిని పెంచమని, చెడును తుంచమని ప్రబోధించడం జరిగింది. మేరాజ్‌ కానుకలు: మేరాజ్‌ శుభ సందర్భం గా ప్రవక్త (స) అనేక అద్భుత దృశ్యాలను చూశారు. వాటిలో దైవదూతల ఆరాధనా విధానం కూడా ఒకటి. దైవదూతల ప్రార్థనా రీతులన్నింటిని కలగలిపి ప్రసాదించినదే నమాజు. దైవదూతలు వేర్వేరు భంగిమల్లో దైవాన్ని కొలిస్తే, ఒక ముస్లిం ఒకే సమయం లో సర్వ భంగిమల్లో అల్లాహ్‌ాను ఆరాధిస్తాడు. మన పాలిట ఎంతటి గొప్ప కానుక నమాజు! సర్వ శ్రేష్ఠుడయిన అల్లాహ్‌ ఆ మహిమాన్విత విధానం నమాజు ప్రాశస్త్యాన్ని, ఈ మహా రాధన పట్ల ఏమరుపాటుకి లోనై జీవిస్తున్న తన దాసులకు ఎరుక పరుస్తున్నాడు: ”నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిస్సందేహంగా నమాజు చెడుల, అశ్లీల చేష్టల, మితిమీరిన ప్రవర్తన జోలికి పోకుండా నిరోధిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్‌ సంస్మరణ ఎంతో గొప్ప విషయం”.(ద్వియఖుర్‌ఆన్‌-29;45) అలాగే ఈ సందర్భంగా సూరతుల్‌ బఖరా లోని చివరి రెండు ఆయతులు ప్రసాదించ బడ్డాయి. షిర్క్‌ మహాపరాధానికి పాల్పడని విశ్వాసి పెద్ద పాపాలు మన్నించబడతాయి అని మాటా ఇవ్వబడింది. (ముస్లిం) దహకాండ ఇటు – ధీరకాంత అటు హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం-దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: అది ఇస్రా-మేరాజ్‌ నిమిత్తం దైవ దూత జిబ్రయీల్‌ నన్ను తీసుకెళ్ళిన రాత్రి. ఓ మలయ సౌరభం నన్ను తాకింది. అప్పుడు నేను: ‘ఓ జిబ్రీల్‌! ఈ సుగంధ పరిమళ సంగ తేమి?’ అని అడిగాను. అందుకు ”ఈ మలయ సౌరభం ఫిర్‌ఔన్‌ కుమార్తె యొక్క కేశాలంకరణి అయిన విశ్వాస మహిళ మరియు ఆమె బిడ్డలది” అని బదులిచ్చారు జిబ్రీల్‌ (అ). అది విని నేను ‘ఆమెకేమయ్యింది?’ అని వివరణ కోరగా – జిబ్రీల్‌ (అ) చెప్పనారంభించారు: (తర్వాతి కథనాన్ని కాస్త వివరణతో ఇక్కడ ఇస్తున్నాము). అది ఈజప్టు రాజ్యం. స్థలం నియంత ఫిర్‌ఔన్‌ రాజకోట. బృందావనం లో కూర్చుని ఉంది ఓ విశ్వాస మహిళ.ఏమి వర్చస్సు ఆమె వదనంలో! మూర్తీ భవించిన సత్యంలా ఉంది. ఆవిడే ధీరకాంత ఫిర్‌ఔన్‌ కూతురి కేశాలం కరిణి. ఆమె కేశాలను అలంకరిస్తూ ఆలోచిస్తూ ఉంది. సర్వ లోక ప్రభువు అల్లాహ్‌ ఉండగా ఓ పరిమి ప్రాంతానికి రాజైన ఫిర్‌ఔన్‌ ”నేనే మీ సర్వోన్నత ప్రభువుని” అనడం ఎంత దుర్మార్గం. జాతి వివక్ష జాఢ్యానికి గురై 70 వేల మంది పసికందుల్ని బలిగొన్న అతని నైచ్యం ఎంత దారుణం. ఇక ఈ పాప పరిపాలన భరించలేం. ఈ దాస్య శృ ఖలాలను ఇంకా సహించలేం. ‘దేవుడొక్కడే’ నినాదం ప్రాణాధికం. అదే కదా మహాత్ములందరూ అందించిన సందేశం. దాసి అయిన నాకు అర్థ మవుతున్న ఈ యాదార్థం, రాజయిన అతని బుర్రకెందుకు ఎక్కడం లేదు? ఇతని నిషేదాజ్ఞలు ప్రజా వాహిని ఆంతర్యంలోని వేళ్ళూనుకొని ఉన్న తౌహీద్‌ విప్లవాన్ని అరికట్టగలవా? ఇతని హింసా చర్యలు సత్య ధర్మ ద్వజవాహకులను ప్రతిఘటించగలవా? ఇలా అలోచిస్తుండగా-పర ధ్యానంలో ఆమె చేతి నుండి దువ్వెన (కేశాలంకరణ పరికరం) జారి పడింది.దాన్ని ఎత్తుకోబోతూ ఆమె ‘బిస్మిల్లాహ్‌ా’-అల్లాహ్‌ పేరుతో అంది. అది విన్న ఫిర్‌ఔన్‌ కూతురు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతూ – ఫిర్‌ఔన్‌ కుమార్తె: అంటే, ‘నా తండ్రా?’. ధీరకాంత: ‘కాదు, నా ప్రభువు, నీ తండ్రి ప్రభువయిన అల్లాహ్‌’. ఫిర్‌ఔన్‌ కుమార్తె: ఇది మరీ అన్యాయం, (ఇటీజ్‌ టూ మచ్) ధీరకాంత: ఇదే న్యాయం (దిసీజ్‌ ట్రూ మెసెజ్) ఫిర్‌ఔన్‌ కుమార్తె: మా నాన్నకు ఈ విషయం చేరవేయనా? ధీరకాంత: అవును, అది నా ప్రభువు నీ ప్రభువయిన అల్లాహ్‌ా నామమే. ‘సరే తెలియజయ్యి’. (తక్షణమే ఆగమేఘాల మీద వెళ్ళి ఆ వార్తను తన తండ్రి చెవిన పడేస్తుంది ఫిర్‌ఔన్‌ కూతురు). కోపంతో రగిలిపోతూ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? నన్ను దైవం కాదన్న ఆ అబల? అంటూ ఆమెను దర్బారులో హాజరు పర్చ వలసిందిగా ఫర్మానా జారీ చేశాడు ఫిర్‌ఔన్‌. ఫిర్‌ఔన్‌: ‘ఏమిటి? మేము కాక నీకు ఇంకో ప్రభువున్నాడా?’ అని నిప్పులు చెరిగాడు. ధీరకాంత: అవును; నా ప్రభువు, నీ ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే. ఫిర్‌ఔన్‌: నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలియదా? ధీరకాంత: బాగా తెలుసు. అధికారి: చట్టాన్ని ధిక్కరిస్తే పర్యవసానం ఏమవుతుందో తెలుసా? ధీరకాంత: బాగా తెలుసు. పశుబలం విజృంభిస్తుందని తెలుసు. ఇనుప లాఠీలు తాండవిస్తాయని తెలుసు. మృగ మనుషులు మంటలు గక్కుతారని తెలుసు. అమాయకులయినా సత్యప్రియుల రక్త ధారలతో పుడమి ఒడి తడిసి ముద్దవుతుందనీ తెలుసు. అధికారి: ఆఁ…అయితే తెలిసి తెలిసి ఎందుకు ధిక్కరిస్తున్నావు మహా రాజ దైవత్వాన్ని? ధీరకాంత: అదే మా లక్ష్యం. అదే సత్య సస్య విప్లవ నినాదానికి మూల సూత్రం. అధికారి: చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఉపన్యాసాలు కట్టబెట్టి బేషరతుగా లొంగిపో. ధీరకాంత: చాలించను, మీ బెదిరింపులకు చలించను. అధికారి: అందాక వచ్చిందా నీ అహంకృతి? ధీరకాంత: అక్కడే మొదలవుతుంది సత్యవాదుల సంస్కృతి. అధికారి: ఏ ప్రలోభం మాయ చేసింది నిన్ను. ధీరకాంత: ఇప్పుడిప్పుడే తెరుచుకుంది వెలుతురు కన్ను. అధికారి: శాసన ధిక్కారానికి ఫలితం అనుక్షణం మృత్యు భయం!? ధీరకాంత: ఆ మృత్యు కోరలతో ఆడుకోవడం మాకు ప్రియం. (సాంతం అప్రశాంతంగా వింటున్న ఫిర్‌వన్‌ కోపం కట్టలు తెంచుకుంది. రెచ్చిపోయి తెగ ఉరిమాడు. పిచ్చి కుక్కలా అరిచాడు. పచ్చి విషం కక్కాడు). బెదిరిపడ్డ ప్రభుత్వం ఏం చేస్తుంది? సత్య వీర నారీమణుల్ని బంధిస్తుంది. ఇరుకు చెరశాలలో చిత్రహింసలు పెడుతుంది. అప్పటికీ కక్ష తీరకపోతే ఉరి శిక్ష వేస్తుంది. అగ్నిగుండంలో నెట్టేస్తుంది. కాగే నూనె లో పడేసి వేంచేస్తుంది. అదే జరిగింది. ఉన్మాదిగా మారిన ఫిర్‌ఔన్‌ తక్షణమే ఓ తొట్టెలో నూనె కాగి ఆమెను, ఆమె బిడ్డలను అందులో పడేయవలసిందిగా ఆ జ్ఞాపించాడు. ఈ వార్త క్షణాల్లో ప్రజల కర్ణపుటాలకు తాకింది. ప్రజలు ఆ ధీరకాంత గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకడు: దిక్కు దిక్కుల ఉక్కు కరవాలాలు త్రిప్పుకుంటూ కంట పడిన క్రాంతి శక్తులను కటకటాల పాలు చేస్తున్నారు ఫిర్‌ఔన్‌ సేనలు. మరొకడు: కాగే నూనెలో పడేసి వేంచేస్తారట. ధీరకాంతను ఆమె సంతాన సమేతంగా కాల్చేస్తారట. ఏమిటీ దురంతం? (అప్పటి సామాన్య ప్రజా హృదయ ఘోష, ధీరకాంత ప్రాణ రక్షణ అభిలాష). ఇంకొకడు: అహింసాసూత్రం ఏమయిపోయింది? ఈ హింసా విజృంభణకు అంతమెప్పుడో? పట్టుదప్పిపోతున్నదా? సత్య సస్య విప్లవం చెదిరి పోనున్నదా?(సత్యప్రియుల అంతరంగాల్లో తెలియని కలవరం). చివరికి ఆ హృదయ విదారక ఘడియ రానే వచ్చింది. పెద్ద తొట్టెల్లో నూనె సలసలా కాగుతున్నది. ఆకాశమెప్పుడూ నీలంగా ఉంటుందనే అల్లాహ్‌ చెప్పాడు. కానీ; వానలేనీ ఎండ ఉంటుందని మాత్రం అనలేదే! వేదన లేని సంతోషముంటుందనిగానీ లేదా బాధారహిత ప్రశాంతత సాధ్యమనిగాని అనలేదే. అందుకే మనం నిరంత కఠోర పరిశ్రమలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. సత్యమార్గం మీద నిలకడ కలిగి జీవించాలనుకున్నప్పుడు ఇటువంటి హృదయ విదారక సంఘటలు చోటు చేసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఫిర్‌ఔన్‌: ఓ భీతిల్లిన హరిణీ! ఇప్పటికయినా మించిపోయింది లేదు. తప్పుకో. ‘నేనే నీ సర్వోన్నత ప్రభువు’నని ఒప్పుకో! ధీరకాంత: తొలగను. అంగుళం కూడా కదలను. మీ పశుబలానికి లొంగను. నేను సత్యకాంతను, నేను దైవప్రవక్త మూసా ప్రబోధించిన అహింసలో పెరిగిన ఆవేశాన్ని. అధికారి: మహారాజా! నింద! నింద! ధీరకాంత: ఛీ! నోర్ముయ్‌ పిరికిపంద. అధికారి: ఓహ్‌ చింత చచ్చినా పులుపు చావలేదన్న మాట. నీ పిల్లల్ని పెనుములో పడేసి వేంచేస్తామన్నా ఉద్రేకం తగ్గలేదన్న మాట. ధీరకాంత: ఉద్రేకం మీలాంటి మిథ్యావాదులకుండదూ! అది మా సత్య శక్తుల సొత్తు. ఫిర్‌ఔన్‌: ఏమిటీ నీ చివరి కోరికా? ధీరకాంత: రాజా! నాదో విన్నపం. ఫిర్‌ఔన్‌: ఏమిటా నీ అవసరం? ధీరకాంత: నా మరణానంతరం నా ఎముకల్ని, నా బిడ్డల ఎముకల్ని ఓ గుడ్డలో చుట్టి ఒకే చోట సమాధి చేస్తే నాకు మేలు చేసిన వారవు తారు. (పుండు మీద కారం జల్లినట్టు ఆ ధీరకాంత మాటలు తూటాల్లా పేలాయి). తలపెట్టిన కుతంత్రాలు తలక్రిందులవుతుంటే, పన్ని పన్నాగాలన్నీ మన్ను గరిచిపోతుంటే, నిరంకుశ నీచత్వం నివ్వెరబోయి చూసింది. కుళ్లిన కుహనాతత్వం కుక్క గొడుగులు తొడిగింది. తెగిపోతున్న దగా దైవత్వాన్ని జిగురు పెట్టి అతికించాలని, పాతబడిన చట్టాలకు పై పూతలు పూయాలని, ప్రబలుతున్న పరిపూర్ణ సత్య సంరంభాన్ని ప్రక్క దారులు పట్టించాలని కుట్రలు పన్నింది. ఫిర్‌ఔన్‌: కోపాన్ని ప్రదర్శిస్తూ-‘అలా చెయ్యడం మా ధర్మం’. తొట్టెలో నూనె సలసలా కాగుతోంది. కర్కశ సైనికులు ఆ మాతృ మూర్తి చూస్తుండగానే ఆమె కళ్ల ఎదుటే ఒక్కో బాలుడ్ని తీసుకెళ్ళి ఆ నూనెకి ఆహుతి చేసేశారు. చివరికి అంతిమ పరీక్షా సమయం ఆసన్న మయింది. పిల్లలందరూ ఆమె కళ్ళ ముందరే నూనెకి ఆహుతి అయ్యారు. నలుగురికి తర్వాత ఇక ఆమె వద్ద మిగిలింది పాలు త్రాగే ఓ పసికందు మాత్రమే. ఆ పసికందు విషయంలో ఆమె సహనం నశిం చింది. ఆ పసి బాలుడ్ని వారికి అప్పగించే సాహసం చెయ్యలేక పోయింది పాపం! సంధిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతున్న తన తల్లినుద్దేశించి ఆ పసికందు నోరు విప్పింది: ”ఓ నా ప్రియమైన అమ్మా! దేని కోసం ఎదురు చూస్తున్నావు. నన్ను బాగా ఒడిసి పట్టుకుని ఆ నూనెలో దూకెయ్యి! ఇహలోకపు ఈ యాతన పరలోకపు నరక యాతన ముందర ఏపాటిది?” అంతే, ఆ ధీరకాంత తన పసికందునితోపాటు తన దేహాన్ని ఆ నూనెకు ఆహుతి చేసుకోంది….!!! ప్రకృతి: దుష్టులు కాల్చింది విశ్వాసుల దేహాల్ని మాత్రమే. వారి సత్య శ్వాసను కాదు. ఆ ఊపిరే ఉప్పెనగా మారుతుంది. హింసావాదులు సత్యప్రియుల శాంతాన్ని అశక్తత అనుకుంటున్నారు. వారి సహనాన్ని చేతకానితనంగా తలపోస్తున్నారు. అదుగో! ఏమిటా జనప్రవాహం? అమ్మో! ఎన్నెన్ని ఉత్సాహ తరంగాలో! ఈ ప్రవాహానికి స్ఫూర్తి ఓ దళిత విశ్వాస మహిళయా? మిథ్యావాది కాదు; అక్షర సత్యవాది. ముష్కర పాలకుల రాక్షస కృత్యాలను అక్షణ బలంతో ఎదుర్కొన్న అపూర్వ సాహసమూర్తి. విశ్వాస బలమే ఆమె ఆయుధం. సహనమే ఆమె కవచం. సత్యమే ఆమె అస్త్రం, శస్త్రం. నేడు చిందిన ప్రతి నెత్తుటి బొట్టూ సరికొత్త విప్లవ శక్తులకు పురుడు పోస్తుంది. వారి ఉచ్ఛ్వాసనిశ్వాసలే సత్యా ప్రభంజనాలయి మిథ్యా వాదుల సువర్ణ సౌధాలను, నెత్తిన పెట్టుకున్న మకుటాలను తుత్తునియలు చేసి, దూది పింజల్లా ఊదేసి, వారి ముష్కర బర్బర ప్రభుత్వా న్ని తుదముట్టించే రోజొకటి తప్పక వస్తుంది. (ఇది జరిగిన కొన్నాళ్ళకే ఫిర్‌ఔన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఈజిప్టు ధాత్రిపై సత్య కేతనం సంపూర్ణ శోభతో రెపరెపలాడింది).
ఇస్రా ‌ సందర్భంగా దైవదూతల నాయకుల యిన జబ్రీల్‌ (అ) నోట ప్రవక్తలందరి నాయకులయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి విన్పించిన ఈ సజీవగాధ మనకు చెప్పకనే ఎన్నో విషయాలు చెబుతోంది. మహాప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఇస్రా ‌ ప్రయాణ సందర్భంగా స్వయంగా దైవదూత జిబ్రీల్‌ (అ) ఈ గాధని విన్పించడం వెనకున్న పరమార్థాన్ని అర్థ చేసుకుంటే ముస్లింల పట్ల నేటి అగ్రదేశాల వైఖరి వింతగా తోచదు. తన అంతిమ గ్రంథం ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”మేము ఏదో ఒక విధంగా తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము- భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడ యినా ఏ ఆపద వచ్చి పడినా, ‘మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందిన వారము, మేము మరలి పోవలసింది కూడా ఆయన వద్దకే కదా!’ అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గం పొందినవారు కూడా వీరే”.(బఖర: 155-157) ”మీలో ధీరోదాత్తులు ఎవరో, సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము”. (ముహమ్మద్‌; 31) ప్రతి ఏటా ఇస్రా – మేరాజ్‌ ఇచ్చే సందేశం: ”మీలో ఎవరు విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని,తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. (అయితే అల్లాహ్‌ ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నది) వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకూడదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరయినా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు దుర్మార్గులవుతారు”. (అన్‌ నూర్: 55) దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ భూమిని నా కోసం కుంచింపజేశాడు. నేను తూర్పు పశ్చిమ భూభాగాలను చూశాను. అతి త్వరలోనే నాకు చూపించబడిన భూభాగం వరకు నా అనుచర సమాజం రాజ్య విస్తరణ చేరుకుంటుంది”. (ముస్లిం) నేటి మన స్థితి ప్రసవ వేదన వంటిది. ఆ వేదన ఎంత తీవ్రతరమవుతుందో సహాయం కూడా అంతే సమీపంలో ఉంటుందన్న ఆశా భావంతో మనం సత్యధర్మ ధ్వజవాహకులుగా శాంతి స్థాపనకై కంక ణం కట్టాల్సి ఉంది.

ప్రేమించు... ప్రేమను పంచు .. ప్రేమగా జీవించు.. ! Love... Share love.. Live with love..!

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ. ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ. ప్రేమ దివ్య భావము, ప్రేమ దైవానుగ్రహము. ప్రేమ జీవరాగము, ప్రేమ జ్ఞానయోగము. మనసున పారే సెలయేరు ప్రేమ. అలసట తీర్చే చిరుగాలి ప్రేమ. హద్దులేవి లేనిది అందమైన ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే, తొలి ఉషస్సులో అరవిచ్చిన గులాబి పువ్వు మీద మెరిసే మంచు బిందువు అందం,వసంత కాలంలో వినబడే కోయిల తీయటి గానం, నిండు వెన్నెలలో నెలరాజు అందం, వీటిని కూడా మరిపించి మురిపించే అనర్వచనీయమైన అనుభూతి ప్రేమ ఆ అనుభూతిని అనుభవించి ఆనందిస్తే తప్ప బోధపడదు. ప్రేమించడం సులభమే. కానీ ప్రేమకు నిర్వచనం చెప్పడం కష్టం. ప్రేమకు భాష లేదు .అది హృదయాల సంగమం. కవి మాటల్లో చెప్పాలంటే, ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే, ప్రేమించ బడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది..!!
ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే.. ప్రేమ + ఆనందం...ప్రేమానందాన్ని ఎవరు కోరుకోరు?... అందరికీ కావాలి! ఒక్కొక్కరూ ఒక్కో దారిలో వెతుక్కుంటూ ప్రేమను ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము! కానీ ఈ ప్రేమ, ఆనందం ముఖ్యంగా 'మానవ సంబంధాల'తో ముడిపడి ఉంటుందనే విషయం మనలో ఎంతమంది గ్రహించగలుగుతున్నాము? ప్రేమ అంటే పట్టు- విడుపు. మనల్ని కన్నవారిని, మన తోబుట్టువులని, జీవితాంతం మన తోడుగా నడిచేవారిని, మనం కన్నవారిని, మన స్నేహితుల్ని,.. మన సహుద్యోగ్యుల్ని, స్వీయ, అన్య మతస్తుల్ని, స్వదేశీయుల్ని, విదేశీయుల్ని ... ఇలా జీవిత పయనంలో ఇంకా చాలా మందిని ప్రేమిస్తాం. మరి ఆ ప్రేమ పదికాలాల పాటు నిలిచి ఉండాలంటే మనకు పట్టు- విడుపు ఉండాలి. ‘నాది మాటల్లో చెప్పలేనంత ప్రేమ...' అవధుల్లేని ప్రేమను ఇలా వ్యక్తం చేస్తుంటాం కదా! మరి చేతల్లో చూపించాలంటే? దానికి ఏకైక మార్గం... ఆలింగనమే! ఏ సందర్భానికైనా ఇట్టే సరిపోతుంది. కావాలంటే చూడండి... అవతలివ్యక్తి కోపంతో ఉన్నా, బాధలో కూరుకుపోయినా, గెలిచినా, ప్రేమ వ్యక్తం చేయాలన్నా కౌగిలికి మించింది ఏముంటుంది? ఒక్క చమత్కార కౌగిలి... సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. బాధ, నిరాశలను తరిమేస్తుంది. కోపాన్ని పోగొట్టేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆలికి, అమ్మకి, అమ్మమ్మకి, నాన్నకి, నాన్నమ్మకి, తాతకి, అవ్వకి, కూతురికి, కుమారునికి, గురువుకి, విద్యార్థికి, స్నేహితునికి, బాదితునికి మనమిచ్చే కౌగిలి, వారు మనతో చేసే ఆలింగనం ... మాటలుండవు కానీ, 'నీకు నేనున్నా' అని చెప్పే ఒక బలమైన సంకేతంతో మన పరస్పర సత్సంబంధాలు బలోపేతం అవుతాయి. ప్రజల మధ్య అనుబంధాన్ని నిలిపి ఉంచడంలో ఈ 'ఆత్మీయ స్పర్శ'ది ఎంత ప్రధాన పాత్రో యిట్టె అర్థమవుతుంది. అది మాటలకు అతీతమైన భావోద్వేగాల్ని చేతల్లో చూపించమంటుంది. అలాగని ఈ ఆత్మీయ కౌగిలి పరిచయస్తులకే పరిమితమా కాదు. తన, పర అన్న తేడా లేకుండా, ఈ మతం, ఆ మతం అన్న తారతమ్యం చూపకుండా మానవత్వంతో ఎవరితోనైనా పంచుకోగల గొప్ప సాధనం. ఒకరికొకరిని ముడివేసే అద్భుత మంత్రం. కాబట్టి, మనసులోని ప్రేమను చెప్పడానికి ఖరీదైన బహుమతులే అవసరం లేదు. ఒక్క కౌగిలింత చాలు. ఆ ఆత్మీయస్పర్శ మాటలకందని ప్రేమనంతా ఎదుటివారికి అందించేస్తుంది. ఎదుటి వారు కోపంగా ఉన్నారా ... గెలుపును అరచేత పట్టుకొచ్చి నిల్చున్నారా ... ఒత్తిడితో సతమతమవుతున్నారా ... ఇచ్చేయండి ఓ చమత్కార .కౌగిలి. చిన్నదే కానీ... భరోసా, ఆనందం, తోడు అన్నీ దొరికేస్తాయి. పైగా ఇది టూ వే కమ్యూనికేషన్. ఎంత ఇస్తే... తిరిగి అంత దక్కించుకోవచ్చు. కావాలంటే ప్రయత్నించి చూడండి! మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. ప్రేమ అంటే మీ ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించుకునేందుకు దేవుడు ఇచ్చిన మహదావకాశం. ప్రేమ అనేది మీరు చేసే పని కాదు. అది మీరున్న తీరు. దీనికి ప్రేరకంగా మీరొక వ్యక్తిని ఉపయోగించవచ్చు, లేదా మీ అంతట మీరే ప్రేమమూర్తులు కావచ్చు. అది ఎవరి గుణమో కాదు, మీ గుణమే. మీలోని ఈ గుణాన్ని తెరవడానికి ఎదుటి వ్యక్తిని తాళం చెవిగా ఉపయోగిస్తున్నారంతే. ఆ వ్యక్తి లేకుండా కూడా మీరు ప్రేమలో ఉండవచ్చు. (నీవు ప్రేమపాత్రుడయ్యేందుకు) నేను నావైపు నుండి నీ మీద మమతా మమకారాలు ఆవరింపజేశాను. నీవు నా పర్యవేక్షణలో పోషించబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను. (తాహా: 39) ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి! మనిషికి దేవుడు ఇచ్చిన మహాదానుగ్రహం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేము! వంద సంవత్సరాల తర్వాత మనం వుండము. కాల చక్రంలో క్షణంలో వెయ్యో వంతు కూడా కాదు మన జీవితం. అండ పిండ బ్రహ్మాండాలతో నిండిన ఈ విశ్వ జగత్తులో మనిషిగా మనము గడ్డి పోచకు కూడా సమానులం కాము. కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమై న అవకాశాన్ని, ఈర్ష్యాసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు! ప్రతిరోజూ ప్రతి నిముషం, ప్రతి సెకనూ, మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగిరాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు! మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్లిపోవాల్సినవాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు! వాటిని వదిలేసి, మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నంచేసి, ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం “జీవిస్తున్నాం” అనే స్పృహతో, ప్రేమించుదాం ... ప్రేమను పంచుదాం .. ప్రేమగా జీవించుదాం.. !

ఏకాంతం + శాంతం = సుఖాంతం / Solitude + Peace = Happy Ending

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌ కూడా చేస్తూ ఉండు. ఇది నీకోసం అదనపు నమాజ్‌గా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతిస్థానం మీద అధిష్ఠింప జేయవచ్చు. (బనీ-ఇస్రాయీల్-79) సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరితెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ, నిరాశానిస్పృహలు ఉండవు. ఓ ఆనందం. ఒక సింహావలోకనం ఉంటాయి. పునరాలోచన, అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు: అంతర్వాహినులవుతాయి. హిరా గుహలో ప్రవక్త (స) వారి ఏకాంత ప్రార్థన - సమాజం గురించిన చింతన, ఖురాన్ అవతరణ
మహా ప్రవక్త (స) గారి వయసు 40 సంవత్సరాలకు దగ్గరవుతుండగా అల్లాహ్ ఆయన కోసం ఏకాంతాన్ని ప్రియంగా చేశాడు. తరచూ ఆయన సత్తు పిండి, నీళ్ళు తీసుకుని మక్కాకు రెండు మైళ్ళ దూరాన ఉన్న నూర్ పర్వతంపై గల హిరా గుహలోకి వెళ్ళేవారు. రమజాను మాసమంతా హిరా గుహలోనే ఆరాధన, అనుశీలనల్లో, సృష్టి రహస్యాల ఛేదనలో నిమగ్ను లయ్యేవారు. నిత్యం తన జాతి వారిలో తిష్ఠ వేసిన విగ్రహారాధన, మద్యపాన సేవనం, విషయ లోలత్వం లాంటి సామాజిక రుగ్మతల గురించి, వారి నైతిక దుస్థితి గురించి తీవ్రంగా మథన పడేవారు. ప్రవక్త (స) గారి ఏకాంతం కూడా అల్లాహ్ సూచనల్లోని ఒక సూచనే. దైవదౌత్యానికి మూడు సంవత్సరాల ముందు నుండే అల్లాహ్ తన ప్రవక్త (స) కోసం ఈ ఏకాంతాన్ని సమ్మతించాడు. ప్రవక్త (స) ఈ ఏకాంతంలోనే నెలలు గడిపేవారు. బ్రహ్మాండమైన ఈ విశ్వ కర్మాగారం వెనుక ఉన్న ఆ శక్తి ఏది? మానవుల ఆ నిజ స్వామిని ఆరాధించే సరైన పద్ధతి ఏమిటి? వీటిపైనే ఆయన తన మనసును కేంద్రీకరించారు. ప్రవక్త (స)గారి ఈ ఏకాంత జీవితం, నిజానికి అల్లాహ్ ప్రణాళిక యొక్క ఓ భాగమే. ఇలా అల్లాహ్ ఆయన్ను రాబోయే మహోన్నత కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. యదార్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా, మానవ జీవితపు యదార్థాలను ప్రభావితం చేసి, వాటిని ఓ రుజుమార్గం వైపునకు మళ్ళించవలసివస్తే, అతను లౌకిక ఆర్భాటాలు, జీవిత ఝంజాటాలు, ప్రాపంచిక వ్యామోహాలకు కొంతకాలం దూరంగా ఉంటూ ఏకాంతంలో గడపవలసి ఉంటుంది. అచ్చం ఈ సూత్రానికి అనుగుణంగా, అల్లాహ్, ముహమ్మద్ (స)కు మహోన్నత కార్యసాధనా బాధ్యతను అప్పగించి, తద్వారా ప్రపంచ సంస్క రణకు, చరిత్ర గతిని తిప్పడానికి ఎంచుకోదలిచాడు. దైవదౌత్య బాధ్యత ఆయనపై వేయడానికి మూడేళ్ళకు ముందే ఆ ఏకాంతవాసాన్ని ఆయనపై విధించడం జరిగింది. ఏకాంతంలో అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. విశ్వసృష్టి సూచనలను చూస్తూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని గూర్చి ఆలోచించే వారు. మహాప్రవక్త (స) ఈ ఏకాంతవాసంలో ఓ నెల్లాళ్ళు విశ్వ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ, దాని వెనుక దాగివున్న రహస్యం గురించి ఆలోచించేవారు. దైవాదేశం వస్తే ఆ రహస్యాన్ని బయట పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు.” తఖ్వ్వాపరులకు, సజ్జన సుభక్తులకు సాధకులకు ఈ ఏకాంతం ఎంతో అవసరమైంది. ముఖ్యమైంది. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలకి తాము చూడగలిగే యత్నం చేస్తారు. అప్పుడా స్థితిలో వారికి నిశ్చలత్వం. ఏకాగ్రచిత్తం, స్థితప్రజ్ఞత వస్తాయి. జీవితపు లోతుల్లోకి వెళ్లి దాని తత్వాన్ని, సత్యాలను చూసే, ప్రేమభావనను తెలుసుకునే దృష్టి ఏర్పడుతుంది. ఈ ఏకాంతం జీవిత అర్థ, పరమార్థాలను తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. సత్వ సాధనకు, సత్యశోధనకు ఇది సుగమమైన మార్గం. ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాదు. ఎవరూ లేకుండా ఒక్కరూ ఉండటమే. ఈ రెండింటిలో సామ్యం. అంతే: ఒంటరితనంలో చింత, ఏకాంతంలో చింతన ఏకాంతమంటే లోచూపు. చేసిన పనులను, వాటి మంచి, చెడులను విశ్లేషించుకోవటం. నడకను, నడతను డేగచూపుతో పరిశీలించటం. అంతవరకు సాగిన జీవితాన్ని ఒక మదింపు వేసుకునే సందర్భం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశమిచ్చి, అందుకు మనల్ని సమాయత్తం చేస్తుంది. ఆ విషయానికొస్తే... ఏకాంతం అదో అద్భుతం అశాంతితో నలిగిపోయేది ఒంటరితనం. ప్రశాంతతో వెలిగేది ఏకాంతం. నిస్సత్తువతో నీరుకార్చేది ఒంటరితనం. నిశ్శబ్దంలో నిమగ్నం చేసేది ఏకాంతం. నా చెంతలేరనే దిగులుతనం ఒంటరితనం. ఏ చింతలేని హాయితనం ఏకాంతం. సంతోషాన్ని వెతుక్కొనేది ఒంటరితనం. ఆనందాన్ని అనుభవించేది ఏకాంతం. మరుపు కోసం మత్తుని కోరుకొనేది ఒంటరితనం. మౌనంతో మైమరచిపోయేది ఏకాంతం. నిన్నటిని తలుచుకుంటూ రేపటి కోసం ఎదురు చూసేది ఒంటరితనం. ప్రస్తుతంలో పరవశిస్తూ పరిమళించేది ఏకాంతం. భరించలేనిది ఒంటరితనం ఆస్వాదించేది ఏకాంతం. పరధ్యానం లో మునిగిపోయేది ఒంటరితనం ధ్యానంతో నేర్చుకునేది ఏకాంతం. ఆత్మహత్యకి సైతం పురిగొల్పేది ఒంటరితనం అంతరాత్మని కూడా తట్టి లేపేది ఏకాంతం. అందుకే, ఎవ్వరూ కోరుకోనిది ఒంటరితనం మరెందుకో, అందరికీ చేతకాదు ఏకాంతం. రాత్రి ఏకాంత ప్రార్థన ఘనత దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు: "రాత్రిపూట తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంస నీయమైన ఉన్నతస్థానంలో ప్రతిష్ఠింప జేయటం అసంభవం ఏమీ కాదు." (బనీ ఇస్రాయీల్-79) "వారి (విశ్వాసుల) వీపులు పడకలకు ఎడంగా ఉంటాయి." (అస్ సజ్ దహ్:16) "(విశ్వాసులు ప్రపంచంలో) రాత్రివేళల్లో చాలా తక్కువ నిదురపోయేవారుగా ఉంటారు." (అజ్ జారియాత్-17) హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రజ లారా! సలాంను వ్యాపింప జేయండి. (ప్రజలకు) అన్నం తినిపించండి. ప్రజలు రాత్రి నిద్రలో ఉండే సమ యంలో నమాజు చేయండి. అలాచేస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశిం చగలరు. (తిర్మిజీ, హసన్; సహీహ్) అల్లాహ్ ను ప్రార్థించే వేళ ఈ ఏకాంతం దాసుని దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మనో నైర్మల్యాన్నిస్తుంది. సర్వోపగతుడైన ఆయనను మనోసీమలలో దర్శించేందుకు ఏకాంతం అద్భుత సాధనం, అంతర్ముఖచిత్తులమై అల్లాహ్ సుమనోహర నామాల, గుణాల చింతనకు, సృష్టిలోని అణువణువున ఆయన. నైపుణ్యాన్ని కాంచటానికి ఏకాంతం ఎంతగానో తోడ్పడుతుంది. మౌనస్థితిలో లౌకికానందాలను వీడుతూ, ఆ విశ్వరూప భావనను అవగతం చేసుకుంటాం. ఆసలైన ప్రేమ అనుభవైకవేద్యమవుతుంది. అది గొప్ప ఆనంద స్థితి. ఏకాంతమంటే ప్రకృతిలో విహారం, మెచ్చిన మంచి గ్రంథ పారాయణం, నచ్చిన సద్గ్రంథ శ్రవణం, పుస్తక పఠనం, ధ్యానం - జిక్ర్... ఖుర్ఆన్ కంఠస్థం ... ఎన్నెన్నో భావనలు. అది ఒంటరితనమే కానక్కరలేదు. సామూహికం కావచ్చు. జీవితపు ఉరుకుల, పరుగులలో తన కుటుంబసభ్యులతో, ఆత్మీయులతో, సంభాషించే సమయమే చిక్కదు. అప్పుడు వారితో మాత్రమే గడపటం కూడా ఏశాంతమే ఏకాంతం కలత చెందిన మనసులను తేట పరుస్తుంది. ఏకాంతాన్ని కోరుకున్న కొండ గుహ వాసులు – కహఫ్ ఏకాంతం అన్న ఒంటరిగా అన్న ఒక్కరు గా ఉండటం అని అర్థము వస్తుంది .ఏకాంతం అనేదానిలో ఒక్కరు అని చెప్పడానికి లేదు.. వారు ఇద్దరు ముగ్గురు గా కూడా ఉండవచ్చు!! అంటే ఒక లక్ష్యం కోసం, ఒక పథకం కోసం, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, జన సమూహం నుంచి ఈ ప్రవాహ వేగం యొక్క సుడుల,జడుల నుంచి పక్కకు జరిగి వారుగా …వారు అనుకున్న లక్ష్యం, కోసం విడిగా ఉండడాన్ని ఏకాంతo అంటారు. వారు ఏడుగురు మిత్రులు. వారందరి ఆలోచనా విధానం ఒక్కటే. విగ్రహారాధన, బహు దైవ భావన తప్పు. అల్లాహ్‌ వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించాడు. వారు తాము నమ్మిన ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లోనే దాచుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఎందుకంటే రాజు కూడా విగ్రహారాధకుడే కాబట్టి తమ విశ్వాసం గురించి చెబితే రాజు వేధింపులకు గురిచేస్తాడు. వారిలో ఒకడు మిగిలిన వారితో, ”మనం మన విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలుసు కాబట్టి తప్పక మన మీద చర్య తీసుకుంటాడు. ఒకవేళ రాజు చర్య తీసుకోకపోతే ప్రజలు రాజును బలహీనుడిగా భావించి పరిహసిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు, పట్టణాన్ని వదలి కొండ గుహల్లో ఎక్కడైనా ఏకాంత వాసాన్ని ఏర్పరచుకుందాం! . అక్కడ మనం స్వేచ్ఛగా మన విశ్వాసం ప్రకారం జీవించవచ్చు. ఎవరి జోక్యం ఉండదు” అన్నాడు. అలా వారు ఒక లక్ష్యంతో ఏకాంతాన్ని ఆశ్రయించారు. ఏకాంత మర్యాదలు 1) సిగ్గు బిడియాలు శాశ్వత ఆభరణాలవ్వాలి: మనిషి ఓ ఇంటి పెద్దకు, ఓ ఊరి పెద్దకు, ఓ జాతి పెద్దకు ఎంతగానయితే సిగ్గు పడతాడో దానికన్నా ఎక్కువగా తను అల్లాహ్‌కు సిగ్గు పడాలి. మనిషి తన మర్మస్థానాలను తన భార్య ముందు ఏకాంతంలో తప్ప కప్పి ఉంచాల్సిందిగా దైవ ప్రవక్త (స) హితవు పలికారు. మనిషి ఓత్రిగా ఉన్నప్పుడు నగ్నముగా ఉండవచ్చా? అని అడిగినప్పుడు - మనిషి అందరికన్నా ఎక్కువగా అల్లాహ్ తో సిగ్గు పడాలి అని సెలవిచ్చారు ప్రవక్త (స). 2) పార్థనలు ఎక్కువగా చేయాలి: హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే పురుషుణ్ణి అల్లాహ్ కరుణించుగాక! అతను లేచి నమాజ్ చేస్తాడు. తన భార్యను కూడా (నమాజ్ కోసం) మేల్కొలుపుతాడు. ఒకవేళ ఆమె లేవకపోతే ముఖం మీద నీళ్ళుచల్లి లేపటానికి ప్రయత్నిస్తాడు. అలాగే రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే స్త్రీని అల్లాహ్ కరుణించుగాక! ఆమె లేచి నమాజ్ చేస్తుంది. తన భర్తను కూడా (నమాజ్ కోసం) నిద్ర లేపుతుంది. ఒకవేళ అతను లేవకపోతే ముఖం మీద నీళ్లు చల్లి మరీ లేప టానికి ప్రయత్నిస్తుంది. (అబూదావూద్, దీని ఆధారాలు దృఢమైనవి) 3) అల్లాహ్ సమరం మరియు దుఆ చేయడంలో గడపాలి: అల్లాహ్ ప్రియతమ దాసులకు ఏకాంత ప్రార్థనలో కలిగినంత తన్మయం, తాదాత్మయం ఇతర ఏ ఆరాధనల్లోనూ కలుగదు. వారు ఏకాంత ఆరాధనా అమృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తారు. ముహమ్మద్ బిన్ యూసుఫ్ (రహ్మ) ఇలా అన్నారు: అనుగ్రహాలు ఇబ్బడిముబ్బడిగా పొందాలనుకున్నవారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఎక్కువ దుఆ చేయాలి. ఏకాంతం అనేది మన జీవితంలో అత్యంత గాఢమైన సమయం - జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే సమయం. ఒక తరంగా, మనం ఎంత సమయాన్ని విషయాలను ఆకళింపు చేసుకోవడంలో లేదా గ్రహించడంలో గడుపుతున్నామో, ఎంత సమయాన్ని వాటిని వ్యక్తీకరించడంలో గడుపుతున్నామో పరిశీలించుకోవాలి. ఒకవేళ మూడింట రెండు వంతుల సమయం ఆకళింపు చేసుకోవడానికి, మూడింట ఒక వంతు సమయం వ్యక్తపరచడానికి కేటాయిస్తే, ఆ వ్యక్తీకరణ లోతైనదిగా, ప్రతి ఒక్కరికీ విలువైనదిగా ఉంటుంది. ఏకాంత ప్రయోజనాలు 1) అల్లాహ్ స్మరణతో తన్మయం చెందటం: పూర్వం సజ్జనుల్లో ఒకరు ఒంటరిగా కూర్చుని, అల్లాహ్ ను స్మరిస్తూ, తన ప్రభువును వేడుకున్నాడు. ఆయన్ను ఇలా ప్రశినించడం జరిగింది: మీకు ఒంటరితనం తోచడం లేదా? అని. ఆయన ఇలా అన్నాడు: అల్లాహ్ తో గడిపే ఎవరికయినా నేను ఒంటరి అన్న భావన కలగడం సాధ్యమేనా? అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "నేను నా దాసునితో అతను నా గురించి ఊహించినట్టుగానే వ్యవహరిస్తాను. అతను నన్ను ఎక్కడ గుర్తుచేసుకున్నా నేను అతని తోడుంటాను.("అల్లాహ్ సాక్షి! మీలో ఎవరికైనా తన వస్తువు అడవిలో తప్పిపోయి తిరిగి దొరికితే అతను ఎంతగా సంతోషిస్తాడో, దాసుడు పశ్చాత్తాప పడినప్పుడు అల్లాహ్ అంతకన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.) ఎవరైనా నా వైపు ఒక జానెడు దగ్గరకు జరిగితే నేను అతనివైపు మూరెడు దగ్గరకు జరుగుతాను. ఎవరైనా నా వైపు మూరెడు దగ్గరకు జరిగితే నేనతని వైపు బారెడు దగ్గరకు జరుగుతాను. అతను నా వైపునకు నడిచి వస్తే నేనతని వైపునకు పరుగెత్తుకొస్తాను. (బుఖారీ ముస్లిం) "ఏ రోజయితే ఏ నీడా ఉండదో ఆ రోజున అల్లాహ్ ఏడుగురు వ్యక్తులకు తన అర్ష్ (మహా సింహాసనం) నీడలో స్థలాన్ని ప్రసాదిస్తాడు. ఆ అదృష్టవంతులో ఒకరు - ఏకాంతంలో అల్లాహ్ గుర్తు చేసుకిని కంట తడి పెట్టుకున్న వ్యక్తి. (తిర్మిజీ) 2) ఆత్మాప్రక్షాళనం: ఏకాంతం ఆత్మప్రక్షాళకు గొప్ప సమయం. ఇబ్న్ అల్-ఖయ్యిమ్ తన పుస్తకం (అల్-ఫవాయీద్)లో ఇలా అన్నారు: “మీ మీ హృదయాన్ని మూడు చోట్ల వెతుక్కోండి: ఖురాన్ వింటున్నప్పుడు, అల్లాహ్ స్మరణ సమావేశాలలో మరియు ఏకాంత సమయాల్లో. ఈ మూడు ప్రదేశాలలో మీరు దానిని కనుగొనలేకపోతే, మీకు హృదయమీ లేదని గ్రహించి, మంచిగా స్పందించే హృదయం ఇవ్వమని అల్లాహ్ ను వేసుకోండి. 3) ఆత్మ దర్శనానికి అనువైన సమయం: ‘నువ్వు అంటే మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, పంచ జ్ఞానేంద్రియాలు కాదు...దానం, ఐశ్వర్యం, మందీమార్బలం అసలు కానేకాదు. నువ్వెంతో నీకు తెలిపేదే, తెలిసి వచ్చేలా చేసేదే ఏకాంతం. ప్రతిరోజూ మన ముఖాన్ని, శరీరాన్నిమనం అద్దంలో వీక్షిస్తాము, ఎందుకంటేమనం ఇతరుల ముందు సర్వోత్తమంగా కనిపించాలని కోరుకుంటాము. ఆత్మపరిశీలన, స్వీయ విశ్లేషణ అనే లోపలి దర్పణాన్ని అనుదినమూ చూడటం, పైపై వాలకము వెనుక ఉన్న దాని సరైన ముఖచిత్రాన్ని నిర్ధారించడం మరింత ముఖ్యం కాదా? ముఖంపై ఒక చిన్న మొటిమ లేదా మచ్చ కూడా ముఖం యొక్క అందాన్ని పాడుచేసినట్లే, కోపం, భయం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి అవలక్షణాల మూలంగా ఆందోళన అధికమయి, ఆత్మ ప్రతిబింబాన్ని వైకల్య పరుస్తుంది. ప్రతిరోజూ ఈ వైకల్యాల నుండి మనల్ని మనం విముక్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మన అంతరాత్మ సౌందర్యం తేజరిల్లుతుంది. మనం విశ్లేషణ ద్వారా మానవ సమస్యలు మూడు విధాలుగా ఉంటాయని గమనిస్తాము: బాహ్య శరీరాన్ని బాధించేవి, మనస్సుపై దాడి చేసేవి, ఇంకా ఆత్మను కప్పివుంచేవి. రోగం, వృద్ధాప్యం, మరణం శరీరానికి ఎదురయ్యే ఇబ్బందులు. మానసిక వ్యాధులు దుఃఖం, భయం, కోపం, తీరని కోరికలు, అసంతృప్తి, ద్వేషం, భావోద్వేగ వ్యామోహం వంటి మానసిక క్యాన్సర్ వంటి వాటి ద్వారా దాడి చేస్తాయి. ఇక అవిద్య, అజ్ఞానం, ధర్మరాహిత్యం అనేది ఆత్మ రుగ్మత, అన్నిటికంటే ఇది అత్యంత హానికరమైనది, ప్రమాదకరమైనది. ఇది అన్ని ఇతర ఇబ్బందులు రావటానికి కారణమవుతుంది. ఆ రకంగా ఏకాంతం ప్రయోజనకర విద్యార్జనకు శుభవేళ. ఏకాంత పాపాలతో జర భద్రం! చీకటి బాగా దట్టమయ్యిందన్న తలంపు కొందరిని చెడు తలుపులు తెరిచేలా ప్రేరేపిస్తే, ఎవడూ గమనీమచడం లేదు అన్న ధీమా మరికోమదరిని పాప కార్యానికి పురిగొల్పుతుంది. నైతిక విలువల వలువలు వలిచేయాలని, కుటుంబ మర్యాదను మట్టిలో కలిపేయాలని, ఆధ్యాత్మిక ఆంక్షల్ని అతిక్రమించాలని, బరువు బాధ్యతలను మరచి బరితెగించి కోరికల మజాలు జుర్రుకోవాలని ఉసిగొల్పుతుంది. ఆ బలహీన క్షణంలో – ‘కామా తురాణాం నభయం నలజ్జ’ వంటి స్థితికి లొనవుతాడు మనిషి. మరి ఏకాంత పాపాలు చెడ్డ చావుకి దారి తీస్తాయి అన్నారు మన పెద్దలు. ఏకాంత సమయంలో మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు చూసినా, చూడకపోయినా, పట్ట పగలయినా, చిమ్మ చీకటయినా అల్లాహ్‌ మాత్రం చూస్తున్నాడు అని గ్రహించాలి. అధికారి గమనిస్తున్నాడనో, యజమాని చూస్తున్నాడనో కాదు, అల్లాహ్‌ చూస్తున్నాడన్న బావన మనలో ఉండాలి, మదిలో నిండాలి. అమ్మానాన్నలకు దూరంగా, ఆలుబిడ్డలకు దూరంగా నివసిస్తున్న మనలోనీ చాలా మంది అక్రమ సంబఖధాల కోసం అర్రులు చాచుతున్నాడు. మనం నీతికి నీళ్లు వదలి నీచంగా బ్రతుకుతూ మనవారు మాత్రం నికార్సయిన వారుగా ఉండాలనుకోవడానికి మించిన ఆత్మ వంచన, మూర్ఖత్వం మరొకటి లేదు. ఒంటరితనంతో సతమతమవుతున్న వారికి ఓ మంచి చిట్కా కోరి తీసుకునేది ఏకాంతం…వద్దన్నా వచ్చి హత్తుకునేది ఒంటరితనం…ఒంటరితనంలో వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో కానీ, బలవంతంగా వదిలివేయడం వల్ల గాని విడిగా ఉంటారు . ముసలితనంతో పిల్లలందరూ ఎక్కడెక్కడో సెటిలై ఒంటరిగా ఉంటారు కొందరు జంటలు. ఊ రుగాని ఊర్లో ,భాష గాని దేశంలో దారితప్పి ఒంటరితారు ఇంకొందరు. కొందరు సమాజానికి భిన్నంగా ఆలోచింస్తూ తోడు లేక ఆలోచనలోనూ, వ్యక్తిగగాను ఒంటరి అవుతారు మరికొందరు. కుటుంబం ఒకరిని వంటరిని చేస్తే,సమాజం మరొకరికి వంటరితనం నిర్దేశిస్తుంది.మతం ఒకరి ఏకాంతానికి మూలమయితే,మరొకరి ఏకాంతానికి కారణం మదం.ఏమీ లేవన్న దుః ఖంతో ఒకరు,అన్నీ ఉన్నాయన్న అహంకారంతో మరొకరు ఏకాకి అవుతారు. విషాదదుఃఖంతోనో ,ఓటమి దిగుళ్లతోనో, విచారంతోనో భయంతోనో ఒకరు ఏకాకి అయితే, మితిమీరిన స్వార్థంతోనో ఈర్ష్యా అసూయలతోనో, అహంభావంతోనో, ద్వేషంతోనో మరొకరు ఒంటరితనం కొనితెచ్చుకొంటారు. నిరాశానిస్పృహలు ఒకరిని ఏకాకి చేస్తే, విర్రవీగే విజయగర్వం మరొకరి వంటరిని చేస్తుంది. ఆవేశంలో ఒకరు, ఆగ్రహంలో ఇంకొకరు,ఆశయంలో ఒకరు,ఆదర్శంలో ఒకరు ఒంటరిగా మిగిలి పోతారు. ఏకాంత వేడుకోలు: సకల సమస్య, సకల రుగ్మతలకు చక్కటి పరిషారం ఈ ఏకాంత పార్థన - దుఆ. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్ - అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. అల్లాహ్ ఈ ఏకాంత వేడుకోలు గురించి తెలియజేస్తూ - ఒకవేళ ప్రవక్త యూనుస్ (అ) ఈ దుఆ చదివి ఉండకపోతే ప్రళయం వరకూ చేప కడుపులోనే ఉందిపోయేవారు అని సెలవిస్తున్నారు. అది రాత్రి చీకటి స్మూద్య్రా చీకటి, చేప కడుపు చీకటి - అంతటి భయంకర సస్థితిలో ఆయన్ను కాపాడింది ఈ దుఆ. చివరికి అతడ్ని ఒక చేప మింగేసింది.... అప్పుడతను దైవాన్ని స్మరించి ఉండకపోతే పునరుత్థానదినం దాకా ఆచేప కడుపు లోనే ఉండిపోయేవాడు. చివరికి మేమతడ్ని వ్యాధిగ్రస్త స్థితిలో ఇసుక మైదానంలో విసిరేశాం. అతనికి నీడ కోసం అక్కడ ఒక తీగచెట్టు మొలిపించాం. త. (అల్-సాఫ్ఫత్: 142-145) ఒంటరితనాన్ని దూరం చేసిన అద్భుత సంఘటన దైవప్రవక్త (సల్లం) ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) తెలియజేశారు: “మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణు తీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకు పోయింది. (అప్పటి వరకు అనుభవం కానీ భయంకర ఒంటరితనం వారిని తీవ్ర వేదనకు గురి చేసింది) దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కా ర్యాల ఆధారంగా అల్లాహు వేడుకో వడం తప్ప ఆ విపత్తు నుండి బయట పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయా నికి వచ్చారు. వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గాని త్రాపించేవాణ్ణి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగిం చడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లా డినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయం లోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద్ర మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖ ద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు.” అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ) ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు. తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో సాగాడు: "ఓ అల్లాహ్! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖ నంలో ఇలా ఉంది): మగవారు ఆడ వారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించే వాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసు కుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధ మయ్యింది. నేనామెను ఆక్రమించు కున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్కు భయపడు! అక్రమంగా కన్నె పొరను చీల్చకు" అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర్నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె కిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్ల యితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు.” రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు. ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: "ప్రభూ! నేను కొంత మంది పని మనుషులను జీతానికుంచు కున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చే శాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టు బడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు" అనడిగాడు. దానికి నేను, "నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు -అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు” అంటూ చిన్నబోయాడు. నేను "ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదల కుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్న తను దృష్టిలో పెట్టుకొనే చేసినట్లయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు.” దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి పోయి గుహద్వారం తెరుచుకో వటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ- ముస్లిం) చివరి మాట ఎంతటి సూదూర ద్వీపాన్నైనా ఆ ఏకాంత వాసాన్ని,చెట్టుచేమతో, పుట్టాగట్టుతో,వాగూవంకతో, ఏటితోకడలితో, నింగీ నేలతో, గొడ్డూగోదా పిట్టా చేపతో చెలిమి చేయగల సత్తా ఉన్న జీవే, మనిషి .అంతేకాదు, ఎంతటి ఏకాంతాన్నైనా సుందరస్వప్నంలా, అందమైన అనుభవంలా మార్చుకోగల సృజనశీలి. చమత్కారి. ఎంతయినా,మనిషికి మనిషి తోడు. మాటకి మాట సాయం. మనిషి సాటిమనిషినే కాదు. సమస్త జీవరాశితో ముడిపడిన ప్రకృతిని తోడుగా తీసుకొని ..బతక నేర్చిన వాడు! ఊహలని కల్పనలతో తన లోకం తాను నిర్మించుకోగల నేర్పరి.మరి, ఇప్పటికే ఎవరిగదుల్లో వాళ్ళం ఏకాంతంగా కూరుకుపోతున్నామని అనుకొంటున్నారా? ఎవరిచేతుల్లోని సెల్ పోనుల్లో, తెరల్లోకి కూరుకుపోయిన మనం, ఏకాంతంగా ఉన్నట్టా లేనట్టా? గదిగోడలు కాదు కానీ, మదిగోడలు ఎంత మందంగా ఉన్నాయో గమనించండి. వాస్తవానికి,మనుషులనీ మాటలని అవి ఆపగలవా? నిజంగానే ఆపేస్తున్నాయా? ఏకాంతం + శాంతం = సుఖాన్తమ్, స్వర్గం. / ఏకాంతం + పాపం = అశాంతం, నరకం.

శుభార్జన - శుభాభిలాష - తబర్రుక్ / Good luck - Good wishes - Tabarruk

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు శుభార్జన - శుభాభిలాష - తబర్రుక్ 'తబారకస్ము రబ్బిక జుల్‌ జలాలి వల్‌ ఇక్రామ్‌' - ఘనతా గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమయినది''. (అర్రహ్మాన్‌: 78) అరబీలో 'బర్‌కత్‌' అంటే శుభం, మంచి కొనసాగడం, వృద్ధి,వికాసం అని అర్థం. అల్లాహ్‌ శుభాలన్నింటికి కేంద్రం. సృష్టిరాశులన్నిలో శుభాన్ని పొందు పర్చేవాడు అల్లాహ్‌. ఏ వస్తువూ స్వతహాగా శుభప్రదం కాజాలదు. అల్లాహ్‌ దాన్ని శుభప్రదం చేస్తాడు. శుభార్జన ఆర్తి మానవ నైజంలో ఉన్న అంశం. ఈ కారణంగానే మనం ఖునూత్‌లో అల్లాహ్‌తో ఇలా దుఆ చేస్తాము: ''వ బారిక్‌ లీ ఫీమా ఆతైత'' -నీవు ప్రసాదించిన దానిలో మాకు శుభాన్ని ప్రసాదించు. హజ్రత్‌ ఆయిషా (ర.అ) జువైరియా బిన్త్‌ హారిస్‌ (ర,అ) గారి గురించి తెలియజేస్తూ - ''నేను ఆమె విం శుభవంతŠమయిన స్త్రీని చూడ లేదు. ఆమెను ప్రవక్త (స) వివాహం చేసుకొని ఆమె జాతి ప్రజలకు అల్లుడయ్యారన్న కారణంగా, అప్పి వరకూ బానిసగా ఉన్న ఆమె జాతికి చెందిన వంద కుటుంబాలను అణా పైసా తీసుకోకుండా విడుదల చేయడం జరిగింది''. (అబూ దావూద్‌) అంటే ఆమె స్వతహా గా శుభానికి కేంద్రం కాదు, ఆమె మాధ్యమంగా శుభం జరిపించాడు అల్లాహ్‌.
శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడు అల్లాహ్ యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్‌ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు. (ముల్క్: 01) యావత్తు విశ్వసార్వభౌమత్వం కలిగివున్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. (మోమినూన్: 14) అల్లాహ్, ఆయనే మీకోసం భూమిని నివాసస్థలంగా, ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. ఆయనే మీకు ఒక రూపాన్నిచ్చి ఎంతో అందంగా మలిచాడు. ఆయనే మీకు పరిశుద్ధ పదార్థాలను ఉపాధిగా ప్రసాదించాడు. (ఇలాంటి సృష్టికార్యాలన్నీ చేసిన) ఆ అల్లాహ్ యే మీ ప్రభువు, పరమ శుభ దాయకుడు, సర్వలోక ప్రభువు. ఆయన మాత్రమే స్వతఃసిద్ధ జీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. (కనుక) మీరు మీ జీవన విధానాన్ని ఆయన కోసం ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ప్రార్థించండి. సకల విధాల ప్రశంసలు, స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. (అల్-మోమిన్: 64-65) శుభం అని తలచు జయం నిన్ను వలచు ఉన్నతమైన భావజాలం.. మహోన్నతమైన విజయాన్నిస్తుంది. భావమే బలం.... శుభాన్ని కోరితే అదే ఎదురవుతుంది. మార్పు రావాల్సిందల్లా మన ఆలోచనల్లోనే! మంచినెంచితే.. మంచే పలకరిస్తుంది. అందుకు వేళయింది. వసంత రాకతో ప్రకృతంతా మారిపోతుంది. మనమూ మారిపోదాం. మన ఆలోచనల్ని మార్చుకుందాం. ఉన్నతంగా ఆలోచిద్దాం. మంచిగా మాట్లాడదాం. అప్పుడు అంతటా శుభమే! అన్నిటా జయమే! ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే విలువైనది, వదిలితే తిరిగి పొందలేనిది, జీవితాలను శాసించేది, ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది, కోరికలను సాకారం చేసుకోవడానికి సహకరించేది, అల్లాహ్ అమూల్య వరనిది కాలం.కాలగమనమే మన జీవనయానం. అటువంటి విశిష్టమైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే అనుకున్న లక్ష్యాలను సాధించగలడు. జీవనసార్థక్యాన్ని పొందగలడు. కాలాన్ని ఎలా సద్వినియోగించుకోవాళూ తెలిసివారే బుద్ధిమంతులు, ఇహపరాల సాఫల్య వంతులు. ధీమంతులు.. అంటే బుద్ధిమంతుల తమ కాలాన్ని సత్గ్రంథ పఠనం, సత్సంప్రదాయ భూషణం, సత్ప్రవర్తన భాషణం, సజ్జన సాంగత్యం వంటివాటితో గడిపి జ్ఞానాన్ని, శుభాన్ని పొందుతారు. సద్విషయాల పట్ల అవగాహన పెంచుకుని సభ్యతా సంస్కృతిని మెరుగు పరచుకొని, సుసంస్కారాన్ని వృద్ధి పరచుకుని సత్కీర్తిని, సుమధుర సంభాషణను సొంతం చేసుకుంటారు. శుభాభిలాష - శుభవాత్మలు గొప్పగా బతకాలని అందరికీ ఉంటుంది. జీవితం శుభాలు వెల్లువలా పోటెత్తాలన్న ఆశలు ఉంటాయి. బతుకు సంతోషాల సప్త రంగుల హరివిల్లవాలన్న ఆలోచనలు ఉండడమూ సహజమే! దీనికి లక్ష్యాలు సరిగ్గా నిర్దేశించుకోవాలి, అటువైపు మడమ తిప్పని ప్రయత్నం జరగాలి. వెలిగే దీపం వేయి దీపాలనయినా వెలిగిస్తుందనే సత్యాన్ని లోకానికి చాటిన మహానుభావులు ఎందరో! లోకానికి వెలుగులు పంచిన పవిత్రాత్మలు, శుబాత్మలు ఎన్నో ఎన్నెన్నో!! .అలాంటి మహాత్ములందరిలో అగ్రగణ్యులు దైవ ప్రవక్తలు. ప్రవక్త ఈసా (అ) వారి మాటగా ఖురాన్ పేర్కొంటున్న వచనం ఇది - “నేను అల్లాహ్ దాసుడ్ని. ఆయన నాకు దివ్యగ్రంథం ప్రసాదించాడు. ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైనవాణ్ణిగా చేశాడు. నేను బ్రతికున్నంతకాలం నమాజ్‌, జకాత్‌ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు. బిస్మిల్లాహ్ కీ బర్కత్ అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. భగవంతుని నామంతో ప్రారంభం కాని ప్రతి ముఖ్యమైన విషయం మొండి చేయి లాంటిదే. అంటే శుభరహితమయినదే అన్నారు దైవ ప్రవక్త (స). వాటిలో కొన్ని సందర్భాలు మరియు బిస్మిల్లాహ్ శుభాలను ఇప్పుడు తెలుసుకుందాము 1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ). 2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి, బుఖారీ). అయితే తిర్మిజిలో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’ 3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం). 5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం, అబూదావూద్). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది. ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి. శుభ గ్రంథరాజం ఖుర్ఆన్ మేమీ గ్రంథాన్ని కూడా అవతరింపజేశాము. ఇది ఎంతో శుభదాయకమైన గ్రంథం. కనుక మీరు దీన్ని అనుసరిస్తూ భయభక్తుల వైఖరి అవలంబించండి; మీరు కరుణించబడతారు. (అల్-అన్ఆమ్: 155) ''ఇదోక శుభప్రదమయిన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని (ఓ ప్రవక్తా) నీ వైపునకు పంపాము''. (సాద్‌: 29) సూరతుల్‌ బఖరహ్‌ శుభం: ''సూరతుల్‌ బఖరహ్‌ను చదవండి. దాన్ని తీసుకోవడం (పారాయణం, కంఠస్థం చేయడం) శుభప్రదం. దాన్ని వదిలేయడం పశ్చాత్తాపం. దాన్ని ఏ మాంత్రికుడూ దాట లేడు''. (ముస్లిం) గమనిక: ఖుర్‌ఆన్‌ శుభప్రదమయిన గ్రంథం-సందేహం లేదు. కానీ అల్మారాలో అలంకరించడం వల్ల, దాని ఆయతులు కాగితం మీద వ్రాసి నీళ్ళలో నాన్చి త్రాగడం వల్ల, కళ్ళకద్దుకోవడం వల్ల శుభం కలుగదు. దాన్ని చదవడం, వినడం, అవగాహన చేసుకోవడం, అమలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే సూరతుల్‌ ఫాతిహా, ముఅవ్వజతైన్‌ (అల్‌ ఫలఖ్‌, అన్నాస్‌) సూరాల వంటివి మరి కొన్ని సూరాల విశిష్ఠత హథీసుల ద్వారా తెలుస్తుంది. ప్రపంచంలో వెలుగు దివ్వెల విహారం ఈ విశ్వగ్రంథ పారాయణం కటిక చీకట్లలో కాంతి పుంజం, క్రాంతి కేతనం, విక్రాంతి నికేతనం, విశ్వశాంతి అభయ క్షేత్రం ఖుర్ఆన్. అల్లాహ్ వైపు నుండి మీ దగ్గరకు (అజ్ఞానాంధకారం దూరంచేసే) జ్యోతి వచ్చింది. (సన్మార్గం చూపే) దేదీప్యమానమైన దివ్యగ్రంథం కూడా వచ్చింది. దీనిద్వారా దేవుడు తన ప్రసన్నతాభాగ్యం కోరుకునేవారికి ముక్తిమార్గం చూపుతాడు. అదీగాక ఆయన తన అనుగ్రహంతో వారిని కారుచీకట్ల నుండి కాంతి వైపు తీసుకువెళ్తాడు; (అపమార్గం నుండి తీసి) రుజుమార్గంలో నడిపిస్తాడు. (అల్-మాయిదా: 15-16) శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడు అల్లాహ్ మానవాళికి మహా వరంగా ప్రసాదించిన శుభాల నిధి నిక్షేపం ఖుర్ఆన్. సృష్టిలోని శుభాలన్నిటికి సరోవరం ఖుర్ఆన్. సృష్టిలోని శుభాల సౌరభాలు ఈ సత్గ్రంథం సుగంధ మూలంగానే పరిమళిస్తున్నాయి. విశ్వ ప్రేమను విశ్వ జనుల హృదయ సీమల్లో నాటుతున్నాయి, అది ఏపుగా పెరిగేలా పెంచతున్నాయి... అలా పెరిగి ఆ సాత్విక ప్రేమను చరాచరాల్లో పంచుతున్నాయి. పేపరు కూడా పవిత్రంగా భావించబడిన వేళ దివ్య ఖుర్ఆన్ శుభం యొక్క అద్భుతాలలో ఒకటి ఏమిటంటే అది వ్రాయబడిన పేజీలు కూడా పరమ పవిత్రమైనవి, శుభావంతమయినవి అన్నది. ఎందుకంటే అందులో శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడయిన అల్లాహ్ వాక్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథం వ్రాయబడిన కాగితపు ముక్కలకే అంతటి స్థాయి ఉందంటే, , దానిని సాంతం కంఠస్థం చేసుకున్న, ఇతరులకు నేర్పించిన,దాని మార్గాన్ని అనుసరించి, దాని మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందిన హృదయ స్థాయి ఎంత గొప్పదయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! మీ హృదయసీమ తన్మయం, తాదాత్మ్యంతో తడిసి ముద్దవకపోతే అడగండి శుభాల వెల్లువ ఈ సత్గ్రంథం ”ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్‌: 204) ఓ సందర్భంలో ‘అల్లాహ్‌కు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్‌ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌) ”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్‌ లామ్‌ మీవ్‌’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్‌ ఒక అక్షరం, లామ్‌ ఒక అక్షరం, మీమ్‌ ఒక అక్షరం”. (తిర్మిజీ) ”ఏ సమూహమయినా సరే అల్లాహ్‌ గృహాల్లోని ఓ గృహం (మస్జిద్‌)లో సమావేశమయి ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్‌ా వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం) ”ఎవరినయితే ఖుర్‌ఆన్‌ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవ సరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ) పవిత్ర గ్రంథ పరలోక శుభాలు ”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయ ణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం) ”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ) కన్నవారికి కీర్తి కిరీటాలు ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కామతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’. (ముస్నద్‌ అహ్మద్‌) ముక్తి ప్రదాయిని ఈ అంతిమ దైవవాణి పవిత్ర ఖుర్‌ఆన్‌ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్‌ ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89) విజ్ఞానం శృతి మించి వినాశనం సృష్టిస్తున్న నేటి తరుణంలో, మతం మతి తప్పి మారణ హోమం రగలిస్తున్న నేటి యుగంలో, అస్పృశ్యత, అంటరానితనం, నిమ్నోన్నతా భావం అపశృతులు పలికిస్తున్న నేటి ఆధుని కంలో, ఉన్మాదం, ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తున్న నేటి కలికాలంలో, మారణాస్త్ర నిర్మూ లనమే సమస్త మానవ వికాసమనీ, అఖిల మానవాభ్యుదయమే విశ్వాస దళ ధ్యేయమని వక్కాణిస్తుంది ఖుర్‌ఆన్‌. ఈ కారణంగానే మేము ఇస్రాయీల్‌ సంతతి వారికి ఇలా ఉత్తర్వు జారీ చేశాము: ”ఎవరైనా ప్రతీకార హత్య (శిక్ష)గా లేక ధరణిపై కల్లో లం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషి నైనా చంపితే అతను యావత్తు మానవాళినీ చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళి ని కాపాడినట్లే”. (మాయిదా:32) శుభ శిఖరం సత్య ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన ద్వారా అల్లాహ్ మానవాళికి చేసిన మేళ్లు అగ్న్యం, అనన్యం, అసంఖ్యాకం. అల్లాహ్ విశ్వసించినవారిలో వారి జాతికి చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసి వారికి గొప్ప మేలు చేశాడు. ఆ ప్రవక్త వారికి దేవుని సూక్తులు విన్పిస్తూ వారి జీవితాల్ని తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథజ్ఞానం, వివేకాలు బోధిస్తున్నాడు. ఇదివరకు వారు పూర్తిగా అపమార్గంలో పడి ఉండేవారు. (ఆల్--ఇమ్రాన్162-164) ధరిత్రిపైన దయ – కరుణ – ప్రేమ – మమతల మల్లెలు చల్లేందుకు వచ్చిన మహనీయులు ముహమ్మద్‌ (స). మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి, వాటిలో ఒక నూతన శక్తిని నింపి మానవత్వపు మందారాలు పూయించడానికి ప్రభవించిన మహోపకారి మహా ప్రవక్త ముహమ్మద్‌ (స).ఆయన శుభాలు ఆయన మాతృ గర్భంలో ఉన్నప్పుడే పురుడు పోసుకున్నాయి. ఆయన జననం పుడమికే ఓ అనిర్వచనీయ పులకింత. మానవాళికే ఓ శుభోదయం. ఆయన తల్లి అమీనా బిన్త్ వాహబ్ గారు ఇలా అన్నారు: తను నా గర్భంలో ఉన్నప్పుడు స్త్రీలు సాధారణంగా అనుభవించే నొప్పి, బలహీనతను నేను అనుభవించలేదు. తనది సులభమైన, శుభవంతమైన గర్భం. విశ్వనాయకుడు (స ) రబీవుల్‌ అవ్వల్‌ 9వ తేది (క్రీ.శ 571 ఏవ్రిల్‌ నెల 20వ తేది) సోమవారం నాడు జన్మి చారు. ఇబ్ను సాద్‌ కథనం ప్రకారం- మహా ప్రవక్త (స ) గారి తల్లి ఇలా అభిప్రాయపడ్డారు: ”నేను ముహమ్మద్‌ (స ) ను ప్రసవించినప్పుడు నా నుండి అనిర్వచనీయమైన ఓ అద్భుత కాంతి వెలువడింది. అది సిరియా భవనాలన్నింటినీ వెలుగుతో నింపేసింది”. మరికొన్ని కథనాల ప్రకారం – ఆ సందర్భంగా కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. తరాల తరబడి మజూసీలు పూజించే అగ్ని ఒక్క సారిగా చల్లారిపోయింది. బుహైరా, సావా ప్రాంతాల్లోని విగ్రహాలు కూలిపోయాయి. ఆయా హలీమా ముహమ్మద్‌ (స) ద్వారా ప్రాప్తమయిన శుభాలను కళ్ళారా తిలకించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఆమె బాల ముహమ్మద్‌ (స)ను ఒడిలో తీసుకున్న మరుక్షణమే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. ఆమె గొర్రెలు లావెక్కాయి. వాటి పాలు రెట్టింపయ్యింది. గొర్రెలు మేసే చోట కూడా గడ్డి దట్టంగా మొలిచింది. పూర్వం అదే నేల బీడువారి ఉండేది. మహనీయ ముహమ్మద్‌ (స) పెరిగి పెద్ద వారవుతున్న కొద్దీ ఆ శుభాలు కూడా అధికమవ్వసాగాయి. ఆయన (స) వారి జడివానలాంటి శుభాలకు గొప్ప తార్కాణం మదీనా నగరం. అది ముంది యస్రిబ్ గా పిలువబడేది. అజ్ఞానాంధకారాలు నిండుగా ఉండేవి. అలాంటి నగరం ఆయన ఆగమనంతో మదీనా మునవ్వరహ్ - కాంతి నగరం అయింది. దివ్యావిష్కృతి దివ్వెలు ఆ నగరం నది వీధుల్లో వెలుగుల ముగ్గులు వేశాయి. నిత్యం రోగాలు, విపత్తులు. కరువుకటాకాలతో కకావికలమయ్యే ఆ పట్టణం తర్వాతి కాలంలో ప్రపంచ పచ్చనయిన ప్రగతికి పూల బాటలు వేసింది. అందుకు కారణం ఆయన (స) చేసిన ప్రార్థన కోసం కీలకమయినది. ”ఓ అల్లాహ్‌! వీళ్ళ తూకాల్లో శుభాన్ని ఒసగు. వీళ్ళ కొలతలైన ‘సా’ ‘ముద్‌’లలో సమృద్ధిని శుభాన్ని ప్రసాదించు”. (సహీహ్‌ ముస్లిం) ఓ అల్లాహ్‌! నువ్వు మక్కాలో ఎంతటి శుభాన్ని పెట్టావో దానికి రెండింతలు శుభాన్ని మదీనాలో పొందు పరచు". (బుఖారీ, ముస్లిం) మక్కా నుండి హిజ్రత్‌ చేసిన తర్వాత ప్రవక్త మహనీయులు(స) ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి ప్రక్కనే ఆయన నిర్మించిన మస్జిద్‌ ‘మస్జిదె నబవీ’ (ప్రవక్త మస్జిదు)గా ప్రసిద్ధి చెందింది. మదీనా నగరం హరమె నబవీ (స)గా, దారుల్‌ హిజ్రత్‌గా ఖ్యాతి గడించింది. ఇంకా అది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే మహా ప్రవక్త (స) మదీనా నగరాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన (స) ఇలా విన్నవించుకున్నారు: ”ఓ అల్లాహ్‌! ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలం (హరమ్‌)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం(మదీనా)లోని రెండు రాతి ప్రదేశాల నడుమ భాగాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను”. (సహీహ్‌ ముస్లిం) ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితంలో శుభం: అంతిమ దైవ ప్రవక్త(స) పుట్ట్టుక నుండి ప్రవక్త అయ్యేంత వరకు ఎన్నో శుభాలు. ఆయనకు ప్రవక్త పదవి ప్రసాదించ బడిన తర్వాత ఆ శుభాలు మరింతగా పెరిగి పోయాయి. పాలల్లో శుభం, నీళ్ళల్లో శుభం, నెయ్యిలో శుభం, ఖర్జూరాలలో శుభం, పిండిలో శుభం, మాంసంలో శుభం, సంతానంలో శుభం, సంసారంలో శుభం - ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు సంబంధించిన సకల వస్తువులు శుభవంతమ యినవే. సహాబా ప్రవక్త(స)వారి చెమట నుండి, ఎంగిలి నుండి, వెంట్రుకల నుండి శుభాన్ని అర్జించేవారు. ప్రామాణిక హథీసుల ద్వారా ఇది రూఢీ అయిన విషయం. ఓ పల్లెటూరి వ్యక్తి ప్రవక్త (స) వారికి దుప్పటిని బహూకరించాడు. ప్రవక్త దాన్ని కప్పుకున్నారు. అంతలోనే 'నా దుప్పటి నాకు తిరిగి ఇచ్చేయండి' అన్నాడా వ్యక్తి. అది గమనించిన సహాబా,'ఏమిటయ్యా! నువ్వు ముందేమో బహూకరించావు,అంతలోనే తిరిగి తీసుకుంటున్నావేంటి?' అని నిలదీయగా-''నేను (ప్రవక్త (స) వారి పవిత్ర శరీరాన్ని తాకిన) ఈ దుప్పి శుభాన్ని పొందాలని అలా చేశాను.ఈ దుప్పిలోనే నన్ను కఫన్‌ ఇవ్వాలన్నది నా ఆకాంక్ష'' అని వివరణ ఇచ్చాడు. (బుఖారీ) శుభ కామన మనకు ప్రతిదానిలో శుభం అవసరం. మనకు శుభాశీస్సులు అవసరమైన అత్యంత ముఖ్యమైన విషయాలు శుభం కోరుకోని వారు ఎవరుంటారు? చెప్పండి! వేయి శుభములు కలుగు నీకు.. నీ ఆశయే ఫలియించెలే.... జయ మంగళం నిత్య శుభ మంగళం... అని మనం ఆప్తులను సాగనంపడం పరిపాటే. పెద్దల చల్లని దీవేన శుభం చేకూరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. సంపదలను అందిస్తుంది. శత్రువును అంతమొందిస్తుంది. అంత మహిమాన్వితమైన శుభాశీస్సులు అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుందాం! జీవితానికి ఉపయోగపడేవి (శ్రేయస్సు), మనస్సుకి నప్పేవి (ప్రియము/ ప్రేయస్సు) రెండూ మనిషిని సమీపిస్తాయి. మూర్ఖుడు అప్పటికప్పుడు సుఖాన్నీ, లాభాన్నీ అందించే ప్రియమైనవాటిని ఎన్నుకొంటాడు. కానీ ధీరుడు అలా కాదు! ఏదైతే శుభకరమో, అవసరమో... అలాంటి శ్రేయస్సుని కలిగించేవాటిని ఎంచుకొంటాడు. ఆప్తులతో ఆయువులో శుభం హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు : తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదలను కోరుకుంటున్నవాడు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. (బుఖారీ- ముస్లిం) బంధువులతో మంచిగా మెలిగే వ్యక్తికి పరలోకంలో ఎలాగూ పుణ్యం లభిస్తుంది. దాంతోపాటు ఇహలోకంలోనూ అతనికి పై హదీసులో పేర్కొనబడిన రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉపాధిలో వృద్ధినొసగబడటమంటే దైవం తరపునుండి నిజంగానే అతని ఉపాధిలో అభివృద్ధి కనిపించవచ్చు లేదా అతని ఉపాధిలో శుభం కలుగుతుందన్న అర్థమైనా కావచ్చు. అదేవిధంగా ఆయుష్షులో పెరుగుదల అంటే నిజంగానే అల్లాహ్ అతని ఆయుష్షుని పొడిగించవచ్చు లేదా అతని ఆయుష్షులో శుభాన్ని ప్రసాదించవచ్చు. ఆయుష్షులో శుభం కలిగితే జీవితంలో మనిషి సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాడు. దీర్ఘాయుష్మాన్ కూడా గొప్ప దీవెనె హజ్రత్ అబూ సఫ్వాన్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ అమీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : దీర్ఘాయుషుతో పాటు సదాచరణ కలిగిన వ్యక్తి ఉత్తముడు. ప్రజలందరిలోకెల్లా (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు.) (సుననె తిర్మిజీ) విశ్వాసం (ఈమాన్), సదాచరణలతోపాటు దీర్ఘాయుషు లభించడం కూడా ఒక వరమే. దీనికి విరుద్ధంగా ఈ రెండింటిలో ఏది లోపించినా ఆయువు పెరిగిన కొద్దీ జీవితం పాపాల పుట్టగా తయారవుతుంది. ఇటువంటి దీర్ఘాయుషు మనిషి పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది. ఈ వరం విలువను గుర్తించనివారు చాలా నష్టపోతారు. ఆహారంలో శుభం: ''కలిసి భోంచేయండి. భోంచేసేటప్పుడు బిస్మిల్లాహ్‌ అనండి. తద్వారా మీకు అందులో శుభం ప్రసాదించ బడుతుంది''. (అబూ దావూద్‌) ''భోజనం మధ్యలో శుభం అవతరిస్తుంది. భోంచేటప్పుడు పక్కల నుండి భోంచేయండి. మధ్యలో నుండి తినకండి''. (తిర్మిజీ) ''మీరు మీ ఆహారాన్ని తూచండి. తద్వారా మీకు శుభం కలుగుతుంది'' అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌) గమనిక: అవసరానికి మించి వండటం, సరదాగా ఎక్కువ వండటం, బడాయి కోసం ఎక్కువ వండటం - అన్నీ నిషిద్ధమే. ఒకవేళ అవస రానికి తగ్గట్టు వండినా, మిగిలిపోతే దాన్ని పారేయకూడదు. ఇతరుల కు ఇచ్చి వేయాలి. సమయంలో శుభం హజ్రత్ సక్ర్ బిన్ వదాఅ గామిదీ సహాబీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) "దేవా! నా అనుచర సమాజం వేకువజాములో (చేసే ప్రయాణంలో) శుభాన్ని అవతరింపజేయి" అని ప్రార్థిం చారు. ఆయన ఏదయినా సైనిక పటాలాన్ని గాని లేదా సైనిక దళాన్ని గాని పంపినప్పుడు దాన్ని వేకువజామునే పంపేవారు. ఈ హదీసును తెలియజేసిన సక్ర్ (రజి) స్వయంగా ఓ వ్యాపారి. ఈయన కూడా తన వ్యాపార సామగ్రిని వేకువ జాము లోనే రవాణా చేసేవారు. (దైవప్రవక్త (సల్లం) ప్రార్ధన) ఫలితంగా ఆయన గొప్ప ధనికులయ్యారు. ఆయన సంపద వృద్దిచెందింది. (అబూ దావూద్, తిర్మిజీ, హసన్) ప్రయాణంగాని, వస్తు రవాణాగాని వేకువ జాములో మొదలయితే, అది లాభదాయ కంగానూ, శుభకరంగానూ ఉంటుందని పై హదీసుద్వారా బోధపడుతోంది. ఆ సమయంలో మనుషులు తాజాగా, హుషారుగా ఉంటారు. పనిచేసే శక్తి, ఓపిక వారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకనే ఆ సమయంలో చేసే పనులు చాలా తొందరగా పూర్తవుతాయి. ఇల్లు - ఇల్లాలు ఇల్లాలే ఇంటికి దీపం అయితే ఇల్లే ఇలలో స్వర్గమవుంటుంది. ఆమె చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ. ఉత్తమ ఇల్లాలి చిరునవ్వు భర్తకు ప్రాణవాయువులు. దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారు: భాగ్యం మూడు విషయాల్లో ఉంది. 1) సుగుణవతి అయిన సతీమణి. మీరు ఆమెను చూడగానే సంబరపడిపోతారు, ఆమె సత్ప్రవర్తనకు సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. మీరు లేనప్పుడు మీ ధన, మాన, సంతాన విషయంలో ఆమెను మీరు బలంగా నమ్ముతారు. 2) సౌఖ్యవంతమైన సవారీ, సౌకర్యవంతమైన వాహనం. 3) సకల సౌకర్యాల గల సువిశాలమైన ఇల్లు. (ఇబ్ను హిబ్బాన్) శుభాల వెల్లువ ఈ దుఆ అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక మినాల్ - ఖైరీ కుల్లిహీ 'ఆజిలిహి వ ఆజిలిహి మా'అలిమ్తు మిన్హు వమా లమ్ ఆ'అలం, వ అ'ఊజూ బిక మినష్ షర్రి కుల్లిహీ 'ఆజిలిహి వ ఆజిలిహి మా'అలిమ్తు మిన్హు వమా లమ్ ఆ'అలం.. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఖైరి మా సఅలక బిహీ అబ్దుక వ నబియ్యుక. వ అ'ఊజూ బిక మిన్ షర్రి మస్తఆజ బిక అబ్దుక వ నబియ్యుక. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత వమా కర్రబ ఇలైహా మిన్ కౌలిన్ వ అమల్. వ అ'ఊజూ బిక మినన్ నార్ వమా కర్రబ ఇలైహా మిన్ కౌలిన్ వ అమల్. వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖజాయిన్ ఖజయితహూ లీ ఖైరా. సహాబా - సజ్జన పూర్వీకులు ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రజలందరిలోకెల్లా ఉత్తములు నా తరానికి చెందినవారు. పిదప వారి తర్వాత వచ్చేవారు, ఆనక వారి తర్వాత వచ్చే వారు”. (బుఖారీ) ”నక్షత్రాలు ఆకాశానికి రక్ష. అవి రాలి పడ్డాయంటే ఆకాశంలో సంభవించాల్సింది సంభవించి తీరుతుంది. నేను నా సహాబహ్‌కు రక్ష. నేను గనక ఈ ప్రపంచ వేదిక నుండి నిష్క్రమిస్తే నా సహాబహ్‌ాకు చెయ్యబడిన వాగ్దానం నెర వేరుతుంది. నా సహాబహ్‌ నా సముదాయానికి రక్ష. వారు గనక నిష్క్రమిస్తే వారికి వాగ్దానం చెయ్యబడిన విషయాలు సంభవించి తీరతాయి”. అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). ( ముస్లిం) ముస్లిములందరూ శుభవంతులే వృక్షాలలో ఒక వృక్షం ఉంది. దాని శుభం ఒక విశ్వాసి శుభాన్ని పోలి ఉంటుంది అన్నారు దైవ ప్రవక్త (స). (బుఖారీ) జాతి, ఇంటి, ధర్మ పెద్దలు శుభం మీ పెద్దలతోపాటే ఉంటుంది అన్నారు దైవ ప్రవక్త (స). (తబ్రానీ) శుభ జలం జమ్ పృధ్విపై అత్యుత్తమ (పరిశుభ్రమైన, శుభకరమైన) నీరు జమ్ జమ్ నీరు; అది ఆకలిగొన్నవారికి తిండి/భోజనంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది. (సహీ తర్గీబ్ 1161. ఉల్లేఖనం: ఇబ్నె అబ్బాస్). తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది. జమ్ జమ్ నీరు ఏ సదుద్దేశ్యంతో తాగడం జరుగుతుందో అది పూర్తవుతుంది. (సహీ తర్గీబ్ 1164, 1165. ఇబ్నె అబ్బాస్, జాబిర్). ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది. శుభ క్షీర సేవనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరికయితే అల్లాహ్ ఏదేని ఆహారం తినిపించాడో, అతను ఇలా చెప్పాలి: ఓ అల్లాహ్ , ఇందులో మాకు శుభాన్ని ప్రసాదించు, దీనికన్నా మేలైన ఆహారాన్ని మాకు ప్రసాదించు. ఇక ఎవరికయితే అల్లాహ్ పాలు తాపించాడో వారు ఇలా అనాలి. ఓ అల్లాహ్, మాకు ఇందులో శుభాన్ని ప్రసాదించు. ఈ శుభ క్షీర పానీయాన్నే మరింత అధికంగా అనుగ్రహించు. ఎందుకంటే పాలకి సమానమైనది, దానికన్నా మేలైనది మరొకటి లేదు. (ముస్నద్ అహ్మద్) శుభ ఘడియలు ఘడియలు, దినాలన్నీ మంచివే. అయితే వీటికి ఒకింత ప్రాధాన్యత ఎక్కువ-జుమా దినం, రమాజును మాసం, జుల్‌హిజ్జా తొలి 10 రోజులు, లైలతుల్‌ ఖద్ర్‌, రాత్రి మూడోవంతు భాగం, సోమవారం, గురువారం మొదలయినవి. శుభవంతమయిన వస్తువులు: జైతూన్‌-ఆలివ్‌ (చెట్టు, కాయ, నూనె). పాలు, కలోంజీ, అజ్వా ఖర్జూరం, ఖర్జూరం చెట్టు, జమ్‌జమ్‌ జలం, తొలి వాన చినుకులు మొదలయినవి శుభప్రదమయిన స్థలాలు: మస్జిదె నబవీ (వ్రవక్త మస్జిదు) గొప్పతనం: భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తునుస్పష్టపరుస్తూ అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: 1) ”నా ఈ మస్జిద్‌లో నమాజు చేయటం – ఒక్క మస్జిదె హరమ్‌ తప్పించి – వేరితర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది”. (ముస్నదె అహ్మద్‌) 2) ”మస్జిదె హరమ్‌లో నమాజు చేయటం వేరితర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుకన్నా శ్రేష్ఠమైనది”. (ముస్నదె అహ్మద్‌) 3) ”మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే – 1) మస్జిదె హరమ్‌ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా”. 4) ”నా నివాస గృహానికి – (ఈ మస్జిద్‌లోని) నా వేదిక (మింబర్‌)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం”. (సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం) మస్జిద్‌లు- ముఖ్యంగా మస్జిదె హరామ్‌, అఖ్సా మస్జిద్‌, మస్జిద్‌ నబవీ. ఈ ప్రదేశాల్ని తాకడం వల్ల, అక్కడి మట్టిని మోసుకు రావడం, తినడం వల్ల శుభం కలుగదు. వాటిలో నమాజు చదవడం వల్ల, ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది. శుభార్జన – శుభాభిలాష లో అధర్మ విధానాలు ఈ మార్గం గుండా కొన్ని సంద ర్భాలలో షిర్క్‌ చోటు చేసుకునే, షిర్క్‌కి దగ్గర చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బర్‌కత్‌, తబర్రుక్‌ పూర్వపరాల్ని తెలుసుకోవడం మంచిది. అబూ వాఖిద్‌ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్‌) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్‌”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్‌ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. (తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు. కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్‌) పొందటం : కొత్తగా ధర్మంలో ప్రవేశ పెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్‌ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్‌ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్‌ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్‌ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు. కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్‌) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‌‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్‌ తరపున బరకత్‌ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్‌ కాదుగానీ, షిర్క్‌కు దోహదపడే ఒక సాధనమవుతుంది. ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్‌ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్‌ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు. అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్‌ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్‌ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్‌ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు. అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్‌ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు. కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్‌ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం? హెచ్చరిక: ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి సంబంధించిన వస్తువులతో తప్ప ప్రపంచంలో మరే వ్యక్తి సంబంధించిన వస్తువులతో శుభం పొందాలనుకోవడం అధర్మం. వారు ఎంతటి వారలయినా సరే. అలాగే ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వస్తువులు అని ప్రచారం కల్పించి పబ్బం గడుపుకుంటున్న వారి వద్ద అవి ప్రవక్త (స) వారి వస్తువులు అన్న ఒక్క ఆధారం కూడా లేదు అని పరిశోధన నిమిత్తమే ప్రత్యేకించబడిన పండితుల బృందం తీర్మానించింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడయినా అలా జరుగుతుందంటే అది ముమ్మాటికీ అధర్మమే. జమ్ము-కశ్మీర్‌లో హజ్రత్‌ బల్‌ దర్గాహ్‌ వంటి దుకాణాలు ఇతర చోట్ల సయితం తారస పడతాయి. అక్కడ ప్రవక్త (స) వారి వెంట్రుక ఉందన్న పుకారును షికారు కొట్టిస్తున్నారు నమ్నకాన్ని అమ్ముకునే నయవంచకులు. తస్మాత్‌ జాగ్రత్త! ‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్‌ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్‌ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్‌ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్‌ కోరుట కూడా తప్పు. కాబతుల్లా లోని హజర్ అస్వద్‌ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్‌ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.