Thursday, April 9, 2026
అస్థిర కాలంలో సుస్థిర విశ్వాసం
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు; ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, మరియు నిరంతర మార్పులు దీని సహజ లక్షణాలు... ఇది సుఖఃదుఃఖాల గెలుపోటముల సమాహారం. మనం ఊహించని మలుపులతో కూడిన నిరంతర ప్రవాహం. నిత్య పరిణామశీలం. కష్టాలు ఎలాగయితే శాశ్వతం కావో, ఇలాగే సుఖాలు, సంతోషాలు తాత్కాలికమే. ఈ మార్పును అర్థం చేసుకుంటూ ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించి ముందుకు సాగిపోవడమే అసలు విజయం. సమస్యలు వచ్చినప్పుడు అవి శాశ్వతం కావని, కొత్తగా ప్రారంభించడానికి అదొక అవకాశమని గుర్తించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని నవీకరించుకోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా స్వీకరించి, వాటిని అవకాశాలుగా మార్చుకోవడం విజయానికి మార్గం. కష్టాలను, చిక్కు పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి.
మనం సంఘటనలు వేగంగా మారిపోయే కాలంలో జీవిస్తున్నాము. సంక్షోభాలు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నాయి. ఒక వార్త నుండి కోలుకోకముందే మరో వార్త దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు మరియు సంక్షోభాల దృష్ట్యా, ప్రతి వివేకవంతుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. వార్తలను అందరికంటే ముందుగా చేరవేసేవాడు లేదా విశ్లేషణలు చేసేవాడు నిజమైన విజేత కాదు; కానీ అల్లకల్లోల పరిస్థితుల్లో అల్లాహ్ ఎవరినైతే స్థిరంగా ఉంచుతాడో, ఎవరైతే తన నాలుకను అదుపులో ఉంచుకుంటారో మరియు విలువలు దెబ్బతిన్నప్పుడు వివేకంతో ప్రవర్తిస్తారో వారే నిజమైన విజేతలు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అల్లాహ్ విశ్వాసులకు ఒక దృఢవచనం ప్రాతిపదికపై ఇటు ఇహలోకంలోనూ, అటు పరలోకంలోనూ స్థిరత్వం ప్రసాదిస్తాడు. దుర్మార్గుల్ని ఆయన మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. అల్లాహ్ కు తానుతలచిన ప్రతిపనీ చేయగల శక్తిసామర్థ్యాలున్నాయి. (సూరా ఇబ్రాహీం: 27).
కాబట్టి అల్లాహ్ దాసులారా! స్థిరంగా ఉండండి. విషయాలను భావోద్వేగాలతో కాకుండా, షరియత్ (ధర్మం) ప్రాతిపదికన కొలవండి. సంక్షోభ సమయాల్లో ప్రజలు ఎదుర్కొనే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే: పుకార్లను నమ్మడం, వార్తలను వేగంగా వ్యాపింపజేయడం మరియు తమకు తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవడం.
అల్లాహ్ ఇలా అన్నాడు: విశ్వాసులారా! మీ దగ్గరకు ఎవరైనా దుర్జనుడు ఏదైనా (ముఖ్య)సమాచారం తీసు కొస్తే దాన్ని ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అలా చేయకుంటే మీరు ఏదైనా వర్గానికి పొరపాటున నష్టం కల్గించవచ్చు. ఆతర్వాత మీరు జరిగినదానికి విచారిస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదు సుమా! (సూరా అల్-హుజురాత్: 6).
వార్తల ధృవీకరణ: ఒక సామాజిక బాధ్యత
వార్తలను వినేటప్పుడు లేదా ఇతరులకు చేరవేసేటప్పుడు వాటిని ధృవీకరించుకోవడం (Verification) అనేది ప్రతి ముస్లిం యొక్క ప్రధాన బాధ్యత. ఒక విషయం నిజమని తెలిసినప్పుడు మరియు దాని వల్ల ఎటువంటి కీడు జరగదని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దానిని ఇతరులకు చెప్పాలి. అంట అనే అంటువ్యాధికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. ఈ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: "ఒక మనిషికి 'అంట (వారు అలా అంటున్నారు/వీరు ఇలా అనుకుంటున్నారు)' అనే పదం చాలా చెడ్డ వాహనం."
వదంతుల్ని వ్యాపింపజేయకూడదు.
వదంతులు (Fake News/Rumors) వ్యాప్తి చేయడం సమాజానికి చాలా ప్రమాదకరం. ఇవి ప్రజల్లో భయాందోళనలు, ఘర్షణలు మరియు సామాజిక అశాంతికి దారితీస్తాయి. ఎలాంటి సమాచారాన్నైనా ధృవీకరించుకోకుండా ఇతరులకు షేర్ చేయకూడదు. బాధ్యతాయుతమైన పౌరులుగా నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ప్రవర్తించాలి. ఎవరో అన్నారట, ఆ మాటలకు ఎటువంటి ఆధారాలు లేకుండా లేదా నిజానిజాలు తెలుసుకోకుండా ఒక విషయాన్ని ప్రచారం చేయడాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు "బిఅస" (చాలా చెడ్డది) అని ఖండించారు.
వాహనం (مطِيَّة): ఒక మనిషి ఒక చోటు నుండి మరో చోటుకి చేరుకోవడానికి వాహనాన్ని ఎలా ఉపయోగిస్తాడో, అలాగే తన మాటను ఇతరులకు చేరవేయడానికి ఈ నిరాధారమైన వార్తలను వాహనంలా వాడుకుంటాడు.
దుష్పరిణామాలు: ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల సమాజంలో పుకార్లు షికారు చేస్తాయి, గందరగోళం ఏర్పడుతుంది మరియు అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు.
మాటల జాగ్రత్త మరియు సత్యశీలత
అధికంగా మాట్లాడటం వల్ల నాలుక జారే ప్రమాదం (తప్పులు చేసే అవకాశం) పెరుగుతుంది. ఒక ముస్లిం తాను మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా విషయాన్ని ఇతరులకు చేరవేసేటప్పుడు సత్యం పలకాలని మరియు ఆ విషయం యొక్క నిజానిజాలను ధృవీకరించుకోవాలని ఆదేశించబడ్డాడు. తద్వారా అతను అబద్ధాల పాలు కాకుండా ఉంటాడు.
ఈ హదీసులో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు బోధించిన సారాంశం: "ఒక మనిషి అబద్ధాలకోరు అని అనిపించుకోవడానికి, అతను విన్న ప్రతి విషయాన్ని (ధృవీకరించుకోకుండా) ఇతరులకు చెప్పడమే సరిపోతుంది."
ముఖ్య అంశాలు:
పరిశీలన లేని ప్రచారం: ఒక మనిషి తాను విన్న ప్రతి విషయాన్ని ఎటువంటి పరిశోధన లేదా ధృవీకరణ లేకుండా ఇతరులకు చెబితే, అతను అబద్ధం చెప్పినట్లే లెక్క.
నిజం మరియు అబద్ధం: సాధారణంగా మనం వినే విషయాల్లో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. విన్నవన్నీ యథాతథంగా ఇతరులకు చెబితే, అందులో తెలియకుండానే అబద్ధాలు కలిసిపోతాయి.
అబద్ధం అంటే ఏమిటి?: అబద్ధం అంటే కేవలం కావాలని తప్పు చెప్పడమే కాదు, ఒక విషయం యొక్క వాస్తవానికి భిన్నంగా సమాచారాన్ని ఇవ్వడం కూడా అబద్ధమే అవుతుంది (అతను కావాలని చెప్పకపోయినా).
ప్రవక్త గారి హెచ్చరిక: ఈ హదీసు వార్తలను చేరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, విన్న ప్రతిదీ మాట్లాడకూడదని మనల్ని హెచ్చరిస్తోంది.
ధృవీకరణ ఆవశ్యకత: మనిషి తాను విన్న ప్రతి విషయాన్ని లోతుగా పరిశోధించాలి. ముఖ్యంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేరిట చెప్పబడే హదీసుల విషయంలో మరింత జాగ్రత్తగా, అవి సరైనవో కాదో తెలుసుకున్న తర్వాతే ఇతరులకు చెప్పాలి.
సంక్షోభాలను భయంతోనో, అతిశయోక్తులతోనో ఎదుర్కోలేము. వాటిని వివేకంతో, జ్ఞానంతో మరియు పండితుల సలహాలతో ఎదుర్కోవాలి. అల్లాహ్ ఆదేశించినట్లుగా, ఏదైనా భయానక వార్త లేదా శుభవార్త వచ్చినప్పుడు దానిని వెంటనే ప్రచారం చేయకుండా, బాధ్యతాయుతమైన వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాలి.
వారు ఏదైనా సంతోషకరమైన వార్తగాని లేక భయాందోళనలు కలిగించే వార్తగాని వింటే దాన్ని నలువైపులా వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారా వార్తను దైవ ప్రవక్తకు గాని లేదా తమ నాయకులకుగాని చేరవేస్తే దాన్ని గురించి వారు నిజానిజాలు తెలుసుకొని సరయిన నిర్ణయం తీసుకోగలుతారు. మీపై దేవుని అనుగ్రహం, ఆయన కారుణ్యం గనక లేకపోయిఉంటే మీలో కొందరు తప్ప అందరూ షైతాన్‌ని అనుస రించేవారు. (నిశా: 83)
ముస్లిం సమాజంతో కలిసి ఉండటం, ఐకమత్యంగా ఉండటం విశ్వాసంలో భాగం. విభేదాలు బలహీనతను తెస్తాయి, ఐక్యత బలాన్ని ఇస్తుంది. నేడు సోషల్ మీడియా వేదికలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే రణరంగాలయ్యాయి. మనం మంటలను ఆర్పే వారిలా ఉండాలి కానీ, వాటిని రగిల్చే వారిలా ఉండకూడదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
"కొందరు వ్యక్తులు మేలుకు తాళం చెవుల వంటి వారు, కీడుకు అడ్డుకట్ట వేసేవారు. మరికొందరు కీడుకు తాళం చెవుల వంటి వారు, మేలుకు అడ్డుకట్ట వేసేవారు. ఎవరి చేతుల ద్వారా అల్లాహ్ మేలును కలిగిస్తాడో వారు ధన్యులు."
ఖురాన్ మరియు ప్రవక్త చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది: కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత తప్పకుండా ఉపశమనం ఉంటుంది.
"నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం ఉంది." (సూరా అష్-షరహ్: 5-6).
అల్లాహ్ సమీప కాలంలోనే మనిషికి లేమి తరువాత కలిమి కూడా ప్రసాదించవచ్చు. (అత్-తలాఖ్: 7)
మీరు మీ ప్రభువును క్షమాపణ కోరుకోండి. ఆయన వైపు మరలండి. అలాచేస్తే ఆయన మీకు ఓ నిర్ణీతకాలం వరకు మంచి జీవనసామగి అనుగ్రహిస్తాడు. ప్రతి సహృదయునికీ తన సౌహార్ధత, సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు.
కష్టాలు తొలగిపోవడానికి మార్గాలు:
కష్టాలు మరియు ఆపదలు (బలా) తొలగిపోవడానికి గల ప్రధాన కారణాలలో పుణ్యకార్యాలు చేయడం మరియు సృష్టించిన ప్రాణుల పట్ల దయతో మెలగడం (అల్-ఇహ్సాన్) ముఖ్యమైనవి.
అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక హదీసులో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా సెలవిచ్చారు: "మంచి పనులు చేయడం వల్ల మనిషికి సంభవించే ఘోరమైన ప్రమాదాలు, వ్యాధులు మరియు వినాశనాల నుండి రక్షణ లభిస్తుంది. ఈ లోకంలో మంచి చేసేవారే పరలోకంలో కూడా గౌరవించబడే సజ్జనులు." (అల్బానీ దీనిని సహీహ్ అని ధృవీకరించారు)
ప్రస్తుత పరిస్థితుల మధ్య, మీ వద్ద ఎవరూ ఓడించలేని గొప్ప ఆయుధం ఒకటి ఉందని మర్చిపోకండి. అదే "దుఆ" (ప్రార్థన).
అల్లాహ్ తఆలా పవిత్ర ఖురాన్‌లో ఇలా సెలవిచ్చాడు:"ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా కష్టాన్ని కలిగిస్తే, ఆయన తప్ప దానిని తొలగించేవారు ఎవరూ లేరు. ఒకవేళ ఆయన నీకు మేలును కలిగిస్తే, ఆయన ప్రతి వస్తువుపై సర్వశక్తుడు." (సూరా అల్-అన్ ఆమ్: 17)
చివరి మాట
మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ. దుర్భల శత్రువు అని అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు. పాడు చేయగలడు. ఒక విధ్వంసమే సృష్టించగలడు. ఇప్పటికీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని నిలువరించటం ఎంతయినా అవసరం. నిలుపుదల దగ్గరే ఆగిపోకుండా వీలయినంతగా మేలు కలిగించే చర్యలు చేపట్టాలి. భవిష్యత్ తరాల వారికోసం నేను లేదా మనమెందుకు ఆలోచించాలి అనే ప్రశ్న తలెత్తుంది. ఇది మానవాళి ధర్మం, విధి, బాధ్యత కూడా. ఒక కుటుంబంలో ముందు తరాలవారు కూడా సుఖంగా, క్షేమంగా, సమృద్ధంగా జీవించాలని ఎట్లా కోరుకుంటున్నామో, మానవాళి మొత్తంగానే ఒక విశాలమైన కుటుంబం అని భావించే పెద్ద మనసు మనకుండటం అవసరం. దీనికి గొప్ప త్యాగాలు కూడా చేయ పనిలేదు. వ్యక్తిగత స్వార్థ సాధనలో కొంత సడలింపు, ఉదారత చాలు. భవిష్యత్ తరాల మేలుకోసం ప్రస్తుత తరం సహజ వనరుల వినియోగంలో అతిశయం, ఆడంబరం లేకుండా, వాటిని ప్రదర్శించకుండా ఉంటే చాలు. ఇవ్వాళి మనకు అందుబాటులో ఉన్న వనరులకు, నేటికి మనం సృష్టికర్తలం కాము. కనుక వాటికి శాశ్వత యజమానులమూ కాకూడదు. ఈ వనరుల వినయోగంలో తగినంత వివేచన కలిగి ఉండటం ముఖ్యమైంది. ఆ వివేచన ఏమంటే ఈ వనరులపై మనకే కాదు రాబోయే తరాలకు కూడా హక్కులున్నాయని గుర్తించటం, గుర్తింపుతో సరిపెట్టకుండా అంగీకరించటంతోనే పని అయిపోయిందని భావించకుండా ఆచరణలో పెట్టడం. ఆలోచనాపరులైన మానవులు ఎప్పుడూ అవసరమైన అనివార్యమైన సమయాల్లో సరైన నిర్ణయాలే తీసుకుంటారు. మరి మీ నిర్ణయమేంటి? అస్థిరాభివృద్ధా? సుస్థిరాభివృద్ధా!!
ఓ అల్లాహ్! ప్రపంచ దేశాల్ని, ముఖ్యంగా ముస్లిం దేశాల్ని అన్ని కీడుల నుండి రక్షించు. మా మధ్య ఐక్యతను ప్రసాదించు. ముస్లింలకు కీడు తలపెట్టే వారి కుట్రలను వారికే చుట్టుకునేలా చేయి. మా నాయకులను సన్మార్గంలో నడిపించు. అస్థిరత అంతమవ్వాలి. - సుస్థిరత వర్ధిల్లాలి! ఆమీన్.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు