Friday, December 26, 2025
Friday, December 19, 2025
Sunday, December 14, 2025
Friday, December 12, 2025
Sunday, December 7, 2025
Friday, December 5, 2025
Thursday, November 27, 2025
Friday, November 21, 2025
Friday, November 14, 2025
Friday, November 7, 2025
Friday, October 24, 2025
Friday, October 17, 2025
Thursday, October 9, 2025
Saturday, October 4, 2025
Friday, September 26, 2025
Sunday, September 21, 2025
నేటి పసి మొక్కలే రేపటి మహా వృక్షాలు
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్) ధర్మంపై నిలుపు.” అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). (రూమ్: 30)
"ప్రతి పిల్లవాడూ తన సహజ ధర్మంపైనే పుడతాడు. కాని అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, జోరాస్ట్రియన్గానో మార్చివేస్తారు." (సహీహ్ బుఖారీ)
పిల్లలు స్వచ్ఛతకు అద్దంలా వుంటారు. వారిని తమ ఇచ్ఛకు తగ్గట్టు పెద్దలు మార్చుకుంటారు. శాఖోపశాఖలై విస్తరించాలని పిల్లలు సహజంగా అనుకుంటారు. మొక్కై వంగనిది మానై వంగదని తమకి తెలిసినట్టు పెద్దలు కంచె కడతారు. పిల్లల్ని కుండీలో మొక్కల్ని చేస్తారు. అంటుకట్టి అద్భుతం అనుకుంటారు. "కుండీలో చెట్టు"లా యెప్పటికీ తమ అరచేతుల్లో వుండాలని కోరుకుంటారు. పిల్లలు నిర్మలంగా తెల్ల కాగితంలా వుంటారు. ఆ కాగితం మీద పెద్దలు యిష్టమొచ్చిన గీతలు గీసి, రాతలు రాసి వాళ్ల తలరాత బాగోలేదని తేల్చేస్తుంటారు. పిల్లలు వాళ్ల ప్రపంచాన్ని నిలుపుకోవడానికే కాదు, రద్దు చేసుకోవాడానికీ, పెద్దల ప్రపంచంలో కలవడానికి నిరంతరంగా నలిగి పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని మౌన పోరాటమే చేస్తు న్నారు.. ఆ మౌనాన్ని వీడేలా పిల్లలతో గొంతు కలిపేలా ఈ విషయాలన్నీ పిల్లల వైపు నుండి, పిల్లల అనుభవాల నుండి సహానుభవంతో రాసిందే ఈ వ్యాసం. పెద్దలుగా మనం చేసే కొన్ని బుద్ధి రహిత శుద్ధికి పిల్లలు కలుషితం కూడా అవుతారు. గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తాం.. దాంతో పాటే దుమ్ముకూడా వస్తుంది.. గమనించం. రేపటి తరం బాగుండాలంటే ముందుగా ఇవాల్టి తరం మారాలి. మారి తీరాలి. అంటే పెద్దలమయిన మనం మారాలి. మనతోనే అసలు మార్పుకి అంకురార్పణ జరగాలి. పిల్లల సుశిక్షణార్ట్ఘం పనికొచ్చే కొన్ని విషయాలను ఇక్కడ పొందుపర్చడం జరుగుతొంది. పెద్దలమన్న అహం వీడి ఆదరిస్తారని,ఆచరిస్తారని ఆశిస్తున్నాము.
1) సృష్టి సాంతంలో అంతర్లీనమై ఉన్న భావం తౌహీద్:
సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయి. వాటికి మనుగడకు కావాల్సిన తెలివితేటలు మాత్రమే వాటికి ఉంటాయి. ఆధ్యాత్మికతకూ వాటికీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పరోక్షంగా ఉంటుందని ఖుర్ఆన్ గ్రంథం రుజువు చేస్తుంది.
సప్తాకాశాలు, భూమి, భూమ్యాకాశాల్లోని యావత్తు సృష్టిరాసులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన ఔన్నత్యంతో పాటు ఆయన పవిత్రతను ప్రశంసించని సృష్టి అంటూ ఏదీ లేదు. కాని అవి చేసే దైవస్మరణను మీరు గ్రహించలేరు. ఆయన ఎంతో ఉదారుడు, గొప్ప క్షమాశీలి. (బనీ_ఇస్రాయీల్: 44) అయితే అల్లాహ్ వాటి జీవిత లక్షయం ఇది మాత్రమే అని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ మనుషులు, జిన్నాతుల గురించి, వారి జీవిత లక్ష్యం గురించి స్పష్టంగా విశద పర్చాడు:
నేను మానవుల్ని, జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతో పుట్టించ లేదు. నేను వారినుండి ఉపాధి కోరడంలేదు. నాకు తిండి పెట్టమని అడగడం లేదు. దేవుడే అందరి ఉపాధిప్రదాత. ఆయన మహాబలుడు, అద్భుత శక్తిసంపన్నుడు. (అజ్-జారియాత్: 56-58)
అల్లాహ్ మానవుణ్ణి సహజధర్మంపై దేవుని ఏకత్వపు భావనపై పుట్టించాడు. కాబట్టి మానవ నైజంలో అల్లాహ్ ఏకత్వం (తౌహీద్) అంతర్లీనమైవుంది. పుట్టుకరీత్యా ప్రతి మనిషీ అల్లాహ్ విధేయునిగానే ఉంటాడు. అతనిపై 'అలస్తు ప్రమాణ’ ప్రభావం ఉంటుంది. కాకపోతే మనిషి పుట్టిన తరువాత పరిసరాల ప్రభావానికి గురవుతాడు. అతను కళ్లు తెరచిన సమాజం అతన్ని సహజ ధర్మం వైపుకు పోనివ్వదు. అందువల్ల అతడు అవిశ్వాస స్థితిపైనే ఉండిపోతుంటాడు. పుడమి పై ఉన్న ప్రతి ప్రాణికి ఈ ప్రపంచానికి గల సంబంధమేంటో సరిగ్గా తెలుసుకోవ డానికి ఉపయోగపడే సాధనమే అఖీదా (మౌలిక విశ్వాసం), ఆధ్యాత్మికత. నిజానికి అది అందరికీ అవసరమైనది. ఎవరైనా దానికి దూరంగా ఉంటున్నారంటే అది వారి స్వయంకృతాపరాధమే అవుతుంది. ఈ కారణంగానే పిల్లల మరియు టీనేజరుల హృదయాలు ఏ భాగస్వామి లేని ఏకైక ఆరాధ్యుడయిన అల్లాహ్ పట్ల అంకితం అయి ఉండాలని ప్రవక్త (స) కాంక్షించేవారు. ఈ సందర్బంగా బాలుడు అయిన ఇబ్ను అబ్బాస్ (రజి) గారికి ఆయన చేసిన ఉపదేశం గమనార్హం.
మనిషి జీవితాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించవచు. 1) ఈమానియాత్ - మౌలిక విశ్వాసాలు. 2) ఇస్లామియాత్ - ఆరాధనలు. 3) ముఆమలాత్ - వ్యవహారాలు. 4) జరూరియాత్ - అవసరాలు. ఈ నాల్గింటి మార్గదర్శకత్వం ప్రవక్త వారి ఈ హదీసులో పేర్కొనబడినది. అలాగే మనిషి సాఫల్య సూత్రం కూడా చెప్పబడింది.
“నీవు అల్లాహ్ ధర్మాన్ని, ఆదేశాలను, మార్గదర్శకాలను (అఖీదా విషయంలో ) కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడతాడు. నీవు అల్లాహ్ ధర్మాన్ని, ఆదేశాలను, మార్గదర్శకాలను (ఆరాధానల విషయంలో) కాపాడు. నీవు అల్లా హ్ ను నీ ముందు పొందుతావు. (అంటే సర్వకాల సర్వావస్థలయందు అయన సహాయం నీ వెంట ఉంటుంది).(వ్యవహారాల విషయంలో) ఆనంద ఘడియల్లో నీవు ఆయన్ని జ్ఞాపకముంచుకో, ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు. (అవసరాల్లో) ఏదైనా అడగవలసినప్పుడు అల్లాహ్ తో మాత్రమే అడుగు. సహాయం కోర వలసినప్పుడు అల్లాహ్‌తో మాత్రమే సహాయం కోరు. తెలుసుకో! ప్రపంచవాసులంతా కలసి నీకేదైనా లాభం చేగూర్చుదలచితే అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ లాభం చేగూర్చలేరు. వారంతా కలసి నీకేదైనా నష్టం కలిగించాలన్నా అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ నష్టమూ కలిగించలేరు. (విధి వ్రాత వ్రాసే) కలములు లేపబడ్డాయి. (ఇక ఏమీ వ్రాయవు). ఆ పత్రాలు ఎండిపోయినవి (అంటే అందులో ఏ మార్పు కూడా ఇక జరుగదు. సహనం వెంటే సహాయం ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది“. (తిర్మిజి, సహీ ముస్నద్ అహ్మద్ ).
సత్యబద్ధమయిన అఖీదాను, స్వచ్చమయిన మౌలిక విశ్వాసాలను పిల్లల మనసులో బలంగా నాటాలి. తౌహీద్ ప్రాభవాన్ని ఉగ్గుపాలతోపాటు అందించాలి. అఖీదా విషయంలో మనం మన పిల్లలకు సరైన దిశానిర్దేశనం గనక చేయకపోతే - తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు వ్యక్తులు వారిని గద్దెల్లా ఎగరేసుకుపోతారు. స్వయంగా వారికి సయితం ఏ పిలుపు వినాలో, ఏ తలుపు వెనకాల ఏ తలపు దాగుందో, ఏ తలంపు ఎలాంటి తలవంపుకి కారణం కాగలదో వారికి అర్థం కాక త్రోవ తప్పే ప్రమాదం ఉంది.
తల్లిదండ్రులుగా మనం దేనిని తలనొప్పి అంటున్నామో, అది వాస్తవంగా తలనొప్పి కానే కాదు. మనం మన మనస్సును స్థిరపరచుకొని చూస్తే మీకు ఆ తలనొప్పి తలనొప్పిగా వుండనే వుండదు. దాని స్థానంలో మీకు పిల్లల బంగారు భవిష్యత్తు కన్పిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల తొలి గురువులు. కానీ కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లల పుట్టుక ముందు నుంచి అందుకు సిద్ధం అవుతారు. పిల్లలకు స్వతంత్ర వ్యక్తిత్వముందని గుర్తించే తల్లిదండ్రులు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటారు. పుట్టిన పిల్లలకు తమవంటూ అవసరాలుంటాయనీ, ఇష్టా ఇష్టాలుంటాయనీ, వాళ్లు ప్రపంచాన్ని తమదైన రీతిలో చూస్తారనీ, పరిశీలిస్తారనీ, తమదంటూ ఒక ప్రాపంచిక దృష్టి ఏర్పరచుకుంటారనీ ఎందరు గుర్తిస్తారు? ఆ మాటకొస్తే ఎందుకు గుర్తించాలి? అని గదమాయించేవారే అధికంగా కనబడతారు. పిల్లలను పెంచడం ఒక కళ. అది తలనొప్పి కానేకాదు. పిల్లలతో కలిసి 'ఎదగటం'లో ఆనందం ఉన్నది. జీవిత సార్థకత ఉన్నది.
2) ప్రార్థన ప్రబోధనం - సత్గ్రంథ పారాయణ ఉపదేశం
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోండా? 'అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం' అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీ కోసమే... నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.
యువతలో భావోద్రేక నియంత్రణ కోసం అత్యద్భుత సాధనం ఖుర్ఆన్ సత్గ్రంథ పారాయణం. నమాజు. ఎందుకంటే మనిషిని చెరబట్టేవి, చెడగొట్టేవి, తొడగొట్టేవి, పడగొట్టేవి ఈ ఆయతులో పేర్కొనబడిన విషయాలే. వాటన్నింటి నుండి ఖుర్ఆన్ మరియు నమాజు మనిషిని, ముఖ్యంగా యువతని కాపాడుతాయి.
ప్రవక్తా! నీ దగ్గరకు పంపబడిన (ఖుర్‌ఆన్) గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. నమాజ్‌ను నెలకొల్పు. నిస్సందేహంగా నమాజ్ (మనిషిని) చెడులు, అశ్లీలచేష్టల జోలికి పోకుండా నిరోధిస్తుంది. అల్లాహ్ స్మరణ ఎంతో గొప్పవిషయం. మీరు చేస్తున్నదంతా దేవునికి తెలుసు. (అల్-అన్కబూత్ : 45)
పిల్లలను సరిదిద్దాలంటే ముందుగా వాళ్ళ తల్లి దండ్రుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లలతో చేయించదగిన పనులూ, చేయించకూడని పనులూ పిల్లల భవిష్యత్తు గురించిన ఉచితమైన నిర్ణయాలూ, అనుచితమైన నిర్ణయాలనూ చక్కని సత్యబద్ధమయిన కథల ద్వారా వారికి బోధించాలి. ఆ విషయంలో ఖుర్ఆన్ కథామాలికలు చక్కగా పనికి కొస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల్ని అర్థం చేసుకోవటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే. సిద్ధాంతాలూ, తాత్త్విక చర్చలతో తలనొప్పి కలిగించకుండా ఆహ్లాదరకమైన రీతిలో చిన్న చిన్న కథలలో జీవిత సత్యాలను అలవోకగా అందించే ప్రయత్నం శక్తివంచన లేకుండా మనవంతు మనం చేయాలి.
“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. పది సంవత్సరాలకు చేరుకున్నప్పుడు దాని గురించి వారిని దండించండి”. (అబూ దావూద్).
సుభక్తుడు అంటే ఎవరు? అల్లాహ్ పై గాఢమైన ప్రేమ కలిగి, నిస్వార్థంగా జీవించే వాడే నిజమైన సుభక్తాగ్రే సరుడు. భక్తుడు కోరాల్చింది వరాలకన్నా ఎక్కువ అల్లాహ్ కరుణానుగ్రహాలను.
అయ్యూబ్ గాధ కూడా గుర్తుకుతెచ్చుకో. అతను (వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి) “ప్రభూ!) నేను జబ్బుపడ్డాను. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు” అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతని బాధ దూరం చేశాం. అతనికి మేము అతని భార్యాపిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలు కూడా ప్రసాదించాం. దైవభక్తులకు ఇదొక (మంచి) గుణపాఠం. (అల్-అంబియా: 83-84)
కానీ ఈ రోజుల్లో భక్తి స్వరూపం. మారిపోయింది. 'రోజూ క్రమం తప్పకుండా అయిదు పూటలా ప్రార్ధన చేస్తా... కావాలంటే తహజ్జుద్ నమాజు కూడా చేస్తా ... ఎలాగోలా నేను కోరింది నాకిచ్చేయి .. నాకు ఉద్యోగం వచ్చేలా చూడు'.నాకు పెళ్లయ్యేలా చూడు.. నేను లైఫ్ సెటిలయ్యేలా గొప్పగా దీవించు.. నేను బాగా స్థిరపడ్డాక హజ్జ్ ఉమ్రాలు కూడా చేస్తా.. ఇంటిల్లిపాదినీ చేయిస్తా... నాకొక కాంట్రాక్ట్ ఇప్పించు' లాంటి కోరికలు సాధారణమయ్యాయి. ఇవే తగ్గించుకుంటే మంచిదంటున్నాడు అల్లాహ్:
ప్రజల్లో మరికొందరు (గోడమీది పిల్లిలా) ఒడ్డుమీద నిల్చొని అల్లాహ్ ను ఆరాధిస్తారు. లాభం కన్పిస్తే తృప్తి పడతారు. కష్టం వచ్చిపడితే (ఇస్లాం నుండి) వెనక్కి మరలిపోతారు. ఇలా వారు (రెంటికి చెడ్డ రేవడిలా) ఇటు ప్రపంచాన్నీ, అటు పరలోకాన్నీ కోల్పోతారు. ఇదే అసలైన నష్టమంటే. ఆతర్వాత వారు (నిజ)దేవుడ్ని వదలి తమకు లాభంగాని, నష్టం గాని చేకూర్చలేని మిధ్యాదైవాల్ని ప్రార్థిస్తారు. ఇదే మార్గభ్రష్టత్వానికి పరాకాష్ఠ. (అల్-హజ్: 11-12)
ఇది భక్తి కానే కాదు. నాకు నువ్వు ఫలానా పని చేసిపెడితే, నేను నీకు మరేదైనా లాభం చేకూరుస్తా అనే లావాదేవీలు రాజకీయాల్లో , వ్యాపారంలో, ఏదేని వ్యవహారంలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అవి మన హృదయాల్లోనూ విషపు నాగు వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి. .అల్లాహ్ ను ప్రేమించేవారి కన్నా.. స్వార్థ రాజకీయాల కోసం, ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం, తుచ్ఛమయిన అవసరాల కోసం వాడుకునే వారి నే ఎక్కువగా చూస్తున్నాం. ఆరా "ధన" అంటే? ధనం కోసం ఆరా తీయడం కాదు! నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో అల్లాహ్ ను ప్రార్ధించడం! 'దానం, ధర్మం, సహాయం, గుప్పెడు మెతుకులు, గుక్కెడు తన్నీరు ఏదైనా సరే, చిత్తశుద్ధితో సాటి ప్రజలకు మనం ఇస్తే నేను తప్పక స్వీకరిస్తాను' అని ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పాడు అల్లాహ్.
“నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు కలవారి నుండి మాత్రమే ఏదయినా స్వీకరిస్తాడు. (అల్-మాయిదా: 27)
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యకార్యం అది ఆవగింజంతటిది అయినా అల్లాహ్ దాన్ని తన కుడి హస్తంతో స్వీకరించి మనం మన సంతానాన్ని ఎంత అన్యోన్యంగా పెంచుతామో దానికన్నా వేల రెట్లు అపురూపంగా పెంచి మహా పర్వతానికి సమానంగా చేస్తాడు. అదే మనం చేసే కర్మ మహా పర్వతాన్ని పోలి ఉన్నా అందులో ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి లేకపోతె దాని ధూళి రేణువంత పుణ్యం కూడా ఇవ్వడుగాక ఇవ్వడు. అందుకే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు - కొంచమైన నదియు కొదువ కాదు - విత్తనంబు మహా వృక్షంబునకు నెంత - అన్నారు వెనుకటికి మన పెద్దలు.
భక్తికి రూపం, పరిమాణం అవసరం లేదని స్పష్టం చేశాడు అల్లాహ్. కానీ మనం చేస్తున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆరాధనలో స్వార్థం పాత్రను పెంచుతున్నాం, భక్తిని తగ్గిస్తున్నాం. మనం చేసే ప్రార్ధనలకన్నా మన సొంత కోరికల జాబితా పెద్దదిగా తయారవుతోంది. భక్తి అంటే భయమో బంధమో కాదు... నిబద్ధత, ఆజ్ఞాపాలన , స్వయం సమర్పణ. భక్తి అంటే కేవలం వరాలు కోరుకోవడం కాదు- ధర్మమార్గంలో కృషి చేయడం కూడా. అంతఃకరణ శుద్ధితో నిస్వార్థ సేవయే భక్తికి మూలధనం. అందుకే గొప్ప ప్రార్ధన ఇలా ఉండాలి:
"ఓ అల్లాహ్! నీవు ప్రసన్నం అయ్యే వరకు నీకే స్తోత్రం. నీవు ప్రసన్నం అయ్యావంటే నీకే స్తోత్రం. నీవు ప్రసన్నం అయిన తరువాత కూడా నీకే స్తోత్రం."
ఎందుకంటే, అన్నిటికీ మించి అల్లాహ్ ప్రసన్నతా భాగ్యం లభిస్తుంది. అదే గొప్పవిజయం, పరమమోక్షం. (అత్-తౌబా: 72)
నీ అనుగ్రహం తప్పితే.. నాకు ఏమీ వద్దు ప్రభూ అని అనగలిగే స్థాయికి మనం ఎదగాలి. మన పిల్లలు సయితం ఎదిగేలా తర్ఫీదు ఇవ్వాలి. అండ పిండ బ్రహ్మాండాల్లోని జీవకోటికి జీవనోపాధిని అనుగ్రహించే ఆయన నమ్ముకున్న మనల్ని వదిలేస్తాడా? చెప్పండి! నిజంగా చెప్పాలంటే..
మీకు లభించిన భాగ్యాలన్నీ అల్లాహ్ ప్రసాదించినవే. (అన్-నహల్: 53) ఆ విషయానికొస్తే, మీరు అల్లాహ్ అనుగ్రహాలు లెక్కించ దలచుకుంటే వాటిని ఎన్నటికీ లెక్కించలేరు. నిజంగా ఆయన గొప్ప క్షమాశీలి, పరమ దయామయుడు. ఆయనకు మీ అంతర్‌బాహ్యాలన్నీ తెలుసు. (అన్-నహల్: 18-19)
ఆయన మహత్యాలుగానీ, వరానుగ్రహాలు గానీ, మన లెక్కలకు అందవు. అలాంటి పరమోన్నత ప్రభువు దగ్గర ప్రాపంచిక తుచ్ఛమైన కోరికల కోసం బేరాలాడకుండా, ఆయనతో ప్రేమబంధం పెంచుకోవాలి. భక్తి అంటే 'నీకిది- నాకది' అనే ఒప్పందం కాదు.. "నీ ఇష్టమే నా ఇష్టం' అన్న బేషరతు అంగీకారం!
3) వైద్యం కన్నా పత్యం మిన్న - భావోద్వేగ నియంత్రణ
టీనేజర్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్ లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్ కు ప్రాధాన్యం ఇస్తారు.
ఓసారి ఫజ్ల్ బిన్ అబ్బాస్ అను ఓ నవయువకుడిని ప్రవక్త తమ వెనక ఒంటెపై ఎక్కించుకున్నారు. అక్కడ ఖస్అమియా వంశానికి చెందిన ఓ అందమైన స్త్రీ వచ్చి ప్రవక్తతో ఏదో ప్రశ్న అడుగుతుంది. అప్పుడు ఆ నవయువకుడు తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అతని ముఖాన్ని మరో వైపు మరలించారు. (బుఖారీ).
భావోద్వేగ నియంత్రణ కష్టం..కానీ సాధ్యమే .. సాధ్యమే కానీ కష్ట. అనకూడదు. ఈ మాట ఏ తల్లిదండ్రుల నోటా ఇకమీదట వినబడకూడదు. ఎందుకంటే, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్రలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్ నెస్కు కారణాలివే అని అర్ధం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది.
ఏది ఏమయినా ముందు చూపు, ముందు జాగ్రత్త చాల అవసరం. అతి జాగ్రత్త కాదు. పదేళ్ళ పిల్లల గురించి “వారి పడకలను వేరుగా చేయండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏ కట్టుబాట్లు లేకుండా కొడుకులు, కుమార్తెలు టీవీ ఛానళ్ళు చూడనివ్వడం మనం చేసే అతి పెద్ద పొరపాటు. వాటిలో కొన్నికార్యక్రమాలు తుచ్ఛమైనవి అయితే మరికొన్ని ఆలోచన, నడతలో, నడకలో, నడవడికలో పెను ప్రమాదాల్ని తెచ్చి పెడతాయి. అలాగే ఏలాంటి పర్వవేక్షణ, అప్రమత్తత లేకుండా సెల్ ఫోన్ల ఉపయోగం విచ్చలవిడిగా జరుగుతుంటే, మనం ప్రవక్త గారి ముందుజాగ్రత్త పద్ధతిని స్మరించుకున్నట్టా? విస్మరించినట్టా? దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు.
టీనేజర్తో ఎలా ప్రవర్తించాలి? అంటే,
*మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్సవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.
*టీనేజర్స్ 'స్వేచ్ఛను కోరుకుంటారు. " అది అవసరం కూడా. అయితే: వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.
*టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.
తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి 'స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్," సపోర్ట్ ఉండాలి.
*ఎమోషన్సు ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా: ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజరు చూపించాలి.
*స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.
*టీనేజర్ ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.
*ఆలోచనలను పంచుకునే ఆలోచనలను వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా భరోసా ఇవ్వాలి
*జడ్జ్ చేయకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.
*మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ "ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్ సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు పెట్టాలి.
4) మనోభావాల్ని గౌరవించాలి? మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి
పిల్లల స్వేచ్ఛను, స్వతంత్ర భావాలను అణిచి వేయకూడదు. ఏదైనా విషయం పట్ల సొంత అభిప్రాయం ఉంటే చెప్పాలి. అదెలా ఉంటే బావుంటుందో కూడా చెప్పగలగాలి. ఆలోచనా పరిధిని పెంచాలి. ముఖ్యంగా పిల్లలు ఇండిపెండెంట్‌గా ఉండేట్లు వారికి సహకారం ఇవ్వాలి. అలా పెంచాలి. కమ్యూనికేషన్ కూడా ఇంటినుంచే అలవాటు చేయాలి. ముఖ్యంగా పిల్లల్లో న్యూనతాభావం కలగకుండా పెంచాలి.
ఓ రోజు మీ కొడుకె మీ వద్దకు వచ్చి “మత్తు సేవించటానికి , డ్రగ్స్ ఉపయోగించటానికి లేదా వ్యభిచారం చేయటానికి - (అల్లాహ్ మనందరిని వీటి నుండి కాపాడుగాక!) నాకు అనుమతివ్వండి అని అడిగాడే అనుకొందాం! అప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? చెంప చెళ్లుమనిపించము.. పళ్ళు రాలగొట్టము.. ఇంటి నుండు గెంటేయము.. ఆస్తిపాస్తుల నుండి వెలివేయము అంటారు అంతేగా! సామాన్యంగా ఇలాంటి దురాలోచన గల కుమారులు గానీ, కుమార్తెలు గానీ తమ తండ్రులతో సలహా తీసుకోరు, తమ స్నేహితులనే సంప్రదిస్తారు. అరకొర జ్ఞానంతో, అనుభవరాహిత్యంతో వారిచ్చే సలహాలనే ఎక్కువగా పాటిస్తారు. అలా కాకుండా మన పిల్లలు మన వద్దకు వచ్చి ఇ లా అడిగితె మనం ఏం చేస్తాం? ఎగిరి గంతేస్తాం.. వీలయితే తంతాం .. అంతేగా! కాని ఇలాంటి ఓ సమస్యే ప్రవక్త (స) వారికి ఎదురయ్యింది. ఆయన ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరించారో గమనించండి! అబూ ఉమామ (ర) ఉల్లేఖించారు: ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తా! నాకు వ్యభిచరించే అనుమతివ్వండి అని అడిగాడు. దానికి అక్కడున్న ప్రజలు అతడ్ని గద్దించి చీవాట్లు పెట్టారు. కాని ప్రవక్త అన్నారుః అతడ్ని నా దగ్గరికి తీసుకురండి. అతడు దగ్గరికి వచ్చాక, కూర్చోమన్నారు. అతడు కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారుః “నీవడిగిన విషయం నీ తల్లితో జరిగితే నీవు ఇష్టపడతావా?” లేదు, అల్లాహ్ సాక్షిగా! మీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డుపెడ్తాన్నాడు. అప్పుడు ప్రవక్త (స) “ప్రజలు కూడా తమ తల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడరు” అని చెప్పి “నీ చెల్లి, నీ కూతురు, నీ మేనత్త, నీ పినతల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడతావా” అని అడిగారు. ఆ యువకుడు అదే సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడు. తమ శుభ హస్తం అతని మీద పెట్టి ఇలా దీవించారు:
“అల్లాహ్! ఇతని పాపాల్ని మన్నించు. ఇతని హృదయాన్ని (దుష్ట, క్షుద్ర ఆలోచనల నుండి) శుద్ధ పరచు. ఇతని మర్మాంగాన్ని (శీలాన్ని) కాపాడు”. (అహ్మద్)
గమనించండి ప్రవక్త (స) యువకుని ఆలోచన విధానాన్ని ఎలా మళ్ళించారో, అతను ఆలోచించలేని కోణాలను ఎలా స్పష్ట పరిచారో. మాట్లాడి, తన ఆవేదన వెళిబుచ్చే స్వేఛ్ఛ ప్రవక్త ఇస్తారన్న నమ్మకం అతనికి ఉన్నందుకే సృష్టిలో అతి పరిశుద్ధులైన వారితోనే ఈ ప్రశ్న అడుగడానికి ధైర్యం చేశాడు. జీవితంలో ప్రతీ సమస్య మనిషికి రెండు దారులిస్తుంది.. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది. చెడ్డాడని, పాపపు ఊబిలో పడ్డాడని, కుటుంబ పరువుకు మకిలిని అద్దాడని, వద్దనుకుని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా.. కొంచెం కష్టమైనా సరే మార్చుకొని, మోస్కుని తీస్కెళ్ళి జీవితాంతం నవ్వుదామా? మనమే నిర్ణయించుకోవాలి.
ఈ రోజుల్లో సంతానంతో సంభాషించే, మాట్లాడే మరియు వారి ఆవేదనలు, అవసరాలను ప్రేమపూర్వకంగా వినే అవసరం చాలా ఉంది. కాని అది ప్రవక్త ముహమ్మద్ (స) పద్ధతి ప్రకారం జరగాలి. నియంత ధోరణిలో కాదు. ఫిర్ఔన్ అన్నాడు: ఫిరౌన్ (అతని మాటలు పట్టించుకోకుండా) “నేను మాత్రం నాకు సమంజసమని తోచిన సలహా మీకిస్తున్నాను. నేను మిమ్మల్ని సరైన దారినే నడిపిస్తున్నాను” అన్నాడు (మోమిన్: 29). ఈ పద్ధతి ద్వారా పిల్లలపై ఒత్తిడి వేస్తే దాన్ని వారు భరించలేరు.
5) ఆత్మవిశ్వాసమే అసలైన ఆస్తి..
ఆత్మవిశ్వాసం.. పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అసలైన ఆస్తి. కాన్ఫిడెంట్‌గా ఉంటేనే.. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనే ‘శక్తి’ లభిస్తుంది. అయితే.. ఇది రాత్రికి రాత్రే వచ్చేదికాదనీ, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే వారిపై వారికి నమ్మకాన్ని కలిగించాలి.
ప్రతి మనిషి గతాన్ని, చెడుని, కష్టాన్ని మర్చిపోయి కొత్త ఉత్సాహంతో కార్యసాధనకు ప్రయత్నించమని తెలియజేస్తుంది సూర్యోదయం. ధనసంపాదన విషయంలో పడి పెద్దలు ప్రకృతిని ఆస్వాదించడమే మర్చి పోయారు. పేరెంటింగ్ అంటే పిల్లలతో ప్రయాణమే. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. పిల్లలు ఏదైనా మంచి పని చేసినా.. చదువుల్లో శ్రద్ధ కనబర్చినా, మంచి మార్కులు వచ్చినా, గేమ్స్‌లో చురుగ్గా ఉన్నా.. ఇలా పలు సందర్భాల్లో వీలైనంత వరకూ వెల్ డన్, గుడ్ .. లాంటి ప్రశంసలు ఇవ్వాలి. చిన్న మెచ్చుకోలు కూడా వారిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక చిన్న అభినందన.. వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చిన్న విజయమైనా.. మీ ప్రశంస పెద్దగా ఉండాలి. అప్పుడే.. వారిలో పదేపదే ప్రశంసలు పొందాలనే భావన కలుగుతుంది. మీ అభినందనలే.. వారిలో సృజనాత్మకతను వెలికితీస్తాయి. కాబట్టి, మీ పిల్లలు చేసిన ప్రతి మంచి పనినీ అభినందించండి. దీంతో వారు మరిన్ని మంచి పనులు చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఆ ప్రయత్నంలో ఓడినా – గెలిచినా అభినందిస్తే.. వారిని మరో ప్రయాణానికి ప్రేరేపిస్తుంది.
పొరబాటున కూడా స్టుపిడ్, ఇడియట్, లైయర్.. అంటూ తిట్ట కూడదు. ఇలా నెగటివ్‌గా మాట్లాడితే వారిలో నేర్చుకోవాలనే కుతూహలం తగ్గిపోతుంది. ఇంతకంటే ఏమంటారు? అనే ధోరణి పెరుగుతుంది. దీనివల్ల వాళ్లు ఏ పని చేయరు. ఇదెంతో ఇబ్బందులకు దారి తీస్తుంది.
ఆటల్లో అయినా, చదువులో అయినా సరైన సమయాన్ని పాటించటం నేర్పించాలి. ముఖ్యంగా అలాంటి క్రమశిక్షణ, సమయపాలన ఉంటే వారెంతో మెరుగుపడతారు. అంటే ముందు పెద్దలకు క్రమశిక్షణ ఉండాలన్నమాట. ఇకపోతే ఏదైనా తప్పు చేస్తే దానికి తగిన వివరణ కోరాలి. నిజంగా తప్పు చేస్తే దానికి తగినట్లు గట్టిగా ఇంకోసారి చేయకూడదని మందలించాలి.
కొన్ని సందర్భాలలో గద్దించి, చిన్నచూపు చూచి, వారి ఇష్టం, కోరికలను అణచి, ఏ విషయంలోనూ వారి అనుమతిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటాము. పైగా నోరు మూయిస్తేనే చెప్పింది వింటారు అని కవరింగ్, కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాము.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ పాలపాత్ర వచ్చింది ఆయన పాలు త్రాగారు, అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు, ఎడమ ప్రక్కన పెద్దవారున్నారు, ప్రవక్త (స) అబ్బాయిని ఉద్దేశించి “ఈ పాత్ర నా ఎడమ ప్రక్క ఉన్నవారికి ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు అబ్బాయి ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! మీ నుండి పొందే నావంతు భాగంలో ఇతరులకు ప్రాధాన్యత’నివ్వను అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త (స) ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. (బుఖారి, ముస్లిం).
6) అభ్యాసంతోనే ఆత్మా విశ్వాసం
పిల్లల భవిష్యత్తు ఆనందం, ఆరోగ్యం ,విజయంలో విశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ఆత్మవిశ్వాసంతో పెరిగే పిల్లలు ఒత్తిడి, బాధ్యత, నిరాశలు, సవాళ్లు ,సానుకూల ,ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. జీవితంలో సంతోషమైనా, దుఃఖమైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పిల్లలకు ఎప్పుడూ ఉండాలి. విజయాన్ని అనుభవించడం ,వైఫల్యం నుండి కోలుకోవడం ద్వారా పిల్లలు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. మనం కాకపోతే మీ పిల్లల విజయాలను మరెవరు అభినందిస్తారు? ఆనందిస్తారు? అయితే దానికి కూడా ఒక పరిమితి ఉండాలి. మీ మితిమీరిన ప్రశంసలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బదులు అహంకార వైఖరిని కలిగిస్తాయి. కాబట్టి ఎక్కువ ప్రశంసలు ఇవ్వకుండా వారిని ప్రోత్సహించేలా చూసుకోవాలి.
పైన పేర్కొనబడిన ప్రవక్త (స) వారి హదీసులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. .
1) అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బాలుడు ప్రవక్త (స) వారికి అత్యంత సమీపంలో ఎలా కూర్చోగలిగాడు? అది కూడా అల్లాహ్ తరవాత సృష్టిలోనే అత్యంత శ్రేష్ఠులయిన మహామహితాత్ముని కుడి ప్రక్కన కొలువుదీరడమా? అదీ ఆ సభలో మహా ఉద్దండ సహచరులు ఉండగా.. నేటి పెద్దల సభల్లో ఈ అద్భుత దృశ్యం ఊహించనయినా ఊహించగలమా?
2) ప్రవక్త (స) స్వయం త్రాగిన తర్వాత సభలోని ఇతర ప్రముఖులకు, పెద్దలకు ఇవ్వడానికన్నా ముందు ఆ బాలుడి అనుమతి కోరడం అంటే ఎంత గొప్ప విషయంలో ఆలోచించండి. ప్రవక్త (స) వారు ఆ ఆదర్శ ప్రవర్తన ఆ బాలినిలో ఎంత ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని పెంచి ఉంటుందో ఊహించండి.
3) ప్రవక్త (స) స్వయంగా అనుమతి అడిగినా దానిని తిరస్కరించి, దానికి సరిపడ సాకు/కారణం చెప్పగలిగాడంటే, ప్రవక్త (స) గారి శిక్షణశాలలో పిల్లలకు ఎంతటి వాక్ స్వేచ్ఛ ఉండేదో గమనించండి. అదే స్థానంలో మనముంటే - సంస్కారహీనుడు అని కితాబు ఇచ్చేయడమే కాక్, పిడికిలి బిగించి, పళ్ళు కొరికి. కళ్ళు ఎర్రగా చేసి, కుదిరితే నాలుగు తగిలించేవారము కూడా కదండి!
4) పిల్లల సుశిక్షణ విషయంలో మాట కంటే క్రియ సంపూర్ణంగా, ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే ప్రవక్త (స) ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. అంటే ఆ పాలపాత్ర అతనికి ఇస్తూ అతడు చూపిన సాకును మెచ్చుకుంటూ అతనికి గౌరవం ప్రసాదిస్తున్నట్లు గ్రహించేలా ప్రవక్త (స) వ్యవహరించారు. సుబ్హానల్లాహ్!
.ఉసామా బిన్ జైద్ (ర) ఒక సైన్యానికే అధిపతిగా నిర్ణయించబడ్డాడు. అందులో పెద్ద పెద్ద సహాబా (ప్రవక్త సహచరులు)న్నారు. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు కూడా దాటలేదు.అలీ బిన్ అబీ తాలిబ్ (ర) ప్రవక్త (స) హిజ్రత్ చేసిన రాత్రి ఆయన పడకపై పడుకున్నారు. అది ఓ పెద్ద బాధ్యత, అందులో ధైర్యత్యాగాల అవసరముంటుంది. కాని ఈ రోజుల్లో మనలోని అనేకమందికి వారి సంతానంపై నమ్మకం లేదు. ఓ చిన్న బాధ్యత కూడా వారికి అప్పజెప్పరు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇంటర్మీడియట్ పూర్తైందంటే ఉన్నత చదువులకోసం ఇంటికి దూరంగా ఉండాల్సిందే. ఇంట్లో మాదిరిగా అక్కడ కూర్చున్న దగ్గరికే అన్నీ తెచ్చిపెట్టే అమ్మానాన్నలు ఉండరు. ఏదైనా వారే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస పనులు చేయలేక బద్దకించే విద్యార్థులు కొంతమంది హాస్టళ్లలో(వసతి గృహాల్లో) ఉండి చదవలేక మారం చేస్తుంటారు. వారిని బలవంతంగా చదివిస్తే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుతో ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఉన్నత చదువు కోసం గడప దాటే విద్యార్థులకు వేసవి సెలవుల్లో జీవన నైపుణ్యాలు(లైఫ్ స్కిల్స్ను) పెంపొందించాల్సిన అవసరముంది.
7) విశ్వాసి వజ్రాయుధం దుఆ
కష్టాలను దూరం చేసుకోవటానికే కాదు, ఈ లోకంలో సంతృప్తికర ఆనందాన్ని అంది పుచ్చుకోవాలన్నా, సుఖమయ సంతోషాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలన్నా, సంతానాన్ని సజ్జన సంతానంగా మలచమని అల్లాహ్ ను వేడుకోవాలన్నా మనిషికి దుఆ యే ఏకైక సాధనం. అంతే కాదు, దుఆ అత్యంత పుణ్యప్రదమైన ఒక ఆరాధన కూడా. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; “అల్లాహ్ దృష్టిలో ప్రార్ధన కన్నా గొప్ప ఆచరణ మరేదీ లేదు." (తిర్మిజీ - హసన్)
“ఒక్క ప్రార్థన తప్ప మరేదీ విధివ్రాతను మార్చ జాలదు." (తిర్మిజీ - హసన్)
“దాసుడు తన సన్నిధిలో చేతులెత్తి ప్రార్ధించి నప్పుడు అతన్ని ఒట్టి చేతులతో పంపటానికి మీ ప్రభువు అల్లాహ్ సిగ్గుపడతాడు.” (ఇబ్నె మాజా - సహీహ్) ఒక్క మాటలో చెప్పాలంటే, దుఆ ఆరాధనకు ఆత్మా వంటిది. కాబట్టి సంతానం మేలు కోసం ఖుర్ఆన్ లో అల్లాహ్ నేర్పిన కొన్ని దుఆలను ఇక్క ఇస్తున్నాము.
నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. (సూరా అల్ ఆహ్ ఖాఫ్ 46:15)
నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను (సూరా ఆలి ఇమ్రాన్ 3:36)
ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి (సూరా అల్ ఫుర్ఖాన్ 25:74)
నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). (సూరా ఇబ్రహీం 14:40)
మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి (సూరా అల్ బఖర 2:128)
”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు” (సూరా ఆలి ఇమ్రాన్ 3:38)
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు (సూరా ఇబ్రహీం 14:35)
8) సామాజిక బాధ్యత
తోటివారికి కష్టం వచ్చినప్పుడు చెమ్మగిల్లే కళ్ళు, సాయపడే చేతులు- ఈ సృష్టికి అలంకారాలు. 'ప్రార్థించే పెదవులకన్నా- సాయపడే చేతులు మిన్న' అన్నారందుకే: ఇంతకూ దానమో ధర్మమో సాయమో చేయాలంటే- ధనం ఉన్నవాడే కావాలని లేదు- మనసున్నవాడైతే చాలు. ఆ మాటకొస్తే మనసుతో జీవిస్తున్నవాడే మనిషి. మానవత్వం.... ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం వంటిది. ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, ఆహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. ప్రతిఫలాపేక్ష రహితంగా అందరికీ చేయూతనివ్వాలి. ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం పరలోక మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధలను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవత్వం లేని ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత లేని మానవత్వం అసంపూర్ణం. ఆ సంగతిని అర్ధం చేసుకున్న ఆధ్యాత్మికవాది సమాజసేవకు ముందుంటాడు. తద్వారా ఆసలైన ఆనందాన్నీ ఆత్మతృప్తినీ అనుభవిస్తాడు. సమూహ సంక్షేమాన్ని కోరుకుంటాడు. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు అందిస్తాడు. విపత్తు సమయాల్లో ఆసహాయులను ఆదుకుంటాడు. ఆహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తాడు.
మానవత్వం, ఆధ్యాత్మికతల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సుకు దోహదపడతాయి. వేర్వేరుగా కనిపించినా, నాణానికి బొమ్మా బొరుసుల్లా రెండూ అవిభాజ్యాలు. మనిషిగా పుట్టినంత మాత్రాన మానవత్వం సిద్ధించదు. సాటి మనుషుల మీద, ప్రాణుల మీద జాలి, దయ, కరుణ, సహనం, ప్రేమ చూపుతూ సాయపడటమే ఆసలైన మానవత్వం మనల్ని మనం తెలుసుకుంటూ, విశ్వంతో, విశ్వకర్తతో మనకున్న సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి.
చివరి మాట
ఈ ప్రపంచంలో అతిగొప్ప విజయం ఏమిటంటే మనం ఏ ఒక వ్యక్తిపై కూడా వీసమెత్తు ద్వేషభావం కూడా లేకుండా జీవించటమే. మనం సంపూర్ణంగా సకరాత్మక భావంతో నిండినప్పుడే ఈ ప్రపంచాన్ని వీడాలి. వీడేలా మన పిల్లల్ని తర్ఫీదు ఇవ్వాలి. సర్వే జనా సుఖినోభవంతు అనే విధంగా మన ప్రార్థన ఉండాలి.
వారిలా ప్రార్థిస్తారు: “ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందర్నీ క్షమించు. (యావత్తు)విశ్వాసుల పట్ల మాహృదయాల్లో ఎలాంటి అసూయాద్వేషాలు ఉంచకు. ప్రభూ! నీవు గొప్ప క్షమాశీలివి, అపార దయామయుడవు.” (అల్-హష్ర్:10)
Thursday, September 18, 2025
Saturday, September 13, 2025
Friday, September 12, 2025
అనుసరణ మరియు అతిశయోక్తికి మధ్య మహనీయ ముహమ్మద్ (స) వారి యెడల ప్రేమ
بسم الله الرحمن الرحيم
సమస్త స్తోత్రాలు అల్లాహ్ కు మాత్రమే అంకితం ఆయనే మనందరి కోసం అత్యున్నతమైన ప్రవక్తను పంపాడు,తన శ్రేష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. తన సంపూర్ణ షరీయత్‌ను మన కోసం నిర్దేశించాడు. నేను ఆయనను స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఆయనను ఎంత స్తుతించిన కీర్తించినా తక్కువే. అల్లాహ్ తసెలవిచ్చాడు:
] الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا [
నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (అల్ మాయిదా:3)
అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దేవుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను మరియు ఆయన సహచరులను కరుణించుగాక వారికి శాంతిని ప్రసాదించుగాక!
) يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ( [الأحزاب:70- 71]
కనుక విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సరైన మాటే పలకండి. అల్లాహ్ మీ పనులు చక్కబెడతాడు. మీపొరపాట్లు క్షమిస్తాడు. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయుడైనవాడు నిజంగా గొప్ప విజయం సాధించినట్లే. (అల్-అహ్_జాబ్: 70-71)
అల్లాహ్ తఆల మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన సందేశాన్ని ప్రజలకు అందించేందుకు సందేశహరుడిగా ప్రత్యేకించుకున్నాడు. ఆయనకు తన కృపానుగ్రహాలతో విశేష గౌరవాన్ని ప్రసాదించాడు. ఆయన పట్ల విదేయతను సమస్త సృష్టి జనులపై తప్పనిసరి చేశాడు. ఆయనను గౌరవించటం, ప్రేమించటం ప్రతి మానవునిపై విధిగా చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల చూపే ప్రేమ మన తల్లిదండ్రులు, సంతానం పై గల ప్రేమకంటే కూడా అధికంగా ఉండాలి. అంతేకాదు మన ప్రాణం కంటే కూడా మిన్నగా ఉండాలి.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
لا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ
మీలో ఎవరు నన్ను తన తండ్రి, తన కుమారుడు మరియు సమస్త జనులకంటే ఎక్కువగా ప్రేమించడో అప్పటివరకు అతను నికార్సయిన విశ్వాసి కాజాలడు. (బుఖారీ, ముస్లిం)
మహాశయులారా!
అబ్దుల్లాహ్ బిన్ హిషామ్ రజియల్లాహు అన్హు కథనం: మేము మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నాము. ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చేతిని పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు:
ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒక్క నా ప్రాణం మినహా మీరు నాకు ప్రతి వస్తువుకంటే ప్రియమైనవారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పందిస్తూ ఇలా బదులిచ్చారు: ముమ్మాటికికాదు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నేను నీకు నీ ప్రాణంకన్నా ప్రియతముడిగా మారనంత వరకు విశ్వాసం పూర్తవదు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు: ఇప్పుడు, అల్లాహ్ సాక్షిగా, మీరు నాకు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియమైనవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఇప్పుడు విశ్వాసం పూర్తయింది ఓ ఉమర్! (బుఖారీ హదీస్)
అభిమాన సోధరులారా! ప్రవక్త ప్రియసహచరులు రజియల్లాహు అన్హుమ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండేవారు. ఆ ప్రేమ వారి చెవులు, కళ్ళు, హృదయాలపై ప్రభావం చూపింది. వారు ఆ ప్రేమ కోసం తమ ప్రాణాలను, త్యాగం చేశారు. రక్తాన్ని అర్పణం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారికున్న ప్రేమ ఒట్టి నోటి మాటలది కాదు సత్యమైనది త్రికరణ శుద్ధితో కూడిన ఆచరణాత్మకమైనది.
ఆధారాలు లేని మాటలు, ఒకరిని అందలం ఎక్కించాలనే ఉబుసుపోక పొగడ్తలు కేవలం వదరుబోతులు వాదనలు మాత్రమే అవి నిజమైన ప్రేమను సూచించవు. కానీ, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు హిజ్రత్ సమయంలో ఎదురైన ఘటనలో అబూబకర్ రజియల్లాహు అన్హు చూపిన ధైర్యసాహసాలు ఆయన హృదయస్వచ్ఛతను, నిజంగా అనుభవించిన ప్రేమను తెలియజేస్తాయి. శత్రువులు వారిని వెతుకుతున్న సమయంలో, అబూ బకర్ (ర) కంగారు పడ్డారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రతిగా ఆయను కళ్ళు చెమర్చాయి. ఆగకుండా కన్నీళ్లు రావడం గమనించిన దైవ ప్రవక్త ప్రశ్నించారు: ఏమైందీ అబూ బకర్? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు అబూ బకర్ ఇలా సమాధానమిచ్చారు: 'అల్లాహ్ సాక్షిగా, నా ప్రాణం గురించి నేను దుఖించడం లేదు, మీకు ఏదైనా హాని కలగుతుందేమోనన్న భయంతో నేను ఏడుస్తున్నాను. (అహ్మద్ ఉల్లేఖనం, ఇమాం అల్బానీ దీనిని సహీహ్ ప్రామాణికమైనదిగా నిర్ధారించారు).
ఉహుద్ యుద్ధ దినాన ఒకానొక సందర్భంలో పరిస్థితి ముస్లింలకు ప్రతికూలంగా మారింది. బహుదైవారాధకులకు ఆధిపత్యం దక్కింది, అలాంటి క్లిష్ట సమయంలో శత్రువుల భీకరపోరు మొదలయింది. ముస్లింల కాసింత వెనుకడుగు వేయసాగారు. కానీ మధ్య దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యంగా ముందుకు సాగారు.అప్పుడు అబూ తల్హా రజియల్లాహు అన్హు ప్రవక్తను ఉద్దేశించి ఇలా అన్నారు:"నా తల్లిదండ్రులు మీ కోసం అర్పితమగు గాక! దయచేసి ముందుకు రాకండి శత్రుబాణం మిమ్మల్ని గాయపరచవచ్చు. నా ప్రాణం మీ ప్రాణానికి రక్షణగా ఉంటుంది. (సహీబుఖారీ సహీముస్లిం ఉల్లేఖనం)
శుభకరుల్లారా!
ఆయన్ను అల్లాహ్ ప్రవక్తగా విశ్వసించడం: దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పట్ల ప్రేమకు కొన్ని స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: ఆయనను విశ్వసించడం, ఆయన తెలిపిన సందేశాలను సత్యంమని అంగీకరించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇవన్నీ ముహమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని ఇచ్చిన సాక్ష్యానికి అసలైన అర్థాన్ని ప్రతిబింబిస్తాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قَالَ تَعَالَى: فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنْزَلْنَا وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ )التغابن8(
కనుక (మానవులారా!) అల్లాహ్ ను , ఆయన ప్రవక్తను, మేము పంపిన (ఖుర్‌ఆన్) జ్యోతిని విశ్వసించండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.
ఆయన్ను గౌరవించడం:
మహనీయ ముహమ్మద్ (స) యెడల ప్రేమను సూచించే లక్షణాలలో ముఖ్యమైనవి: ఆయన జీవించి ఉన్నప్పుడు మరియు మరణించిన తరువాత ఆయన యెడల గౌరవం చూపడం, ఆయన సున్నతులను గౌరవించడం. అల్లాహ్ఇలా సెలవిచ్చాడు.
]إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا * لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ [ [الفتح:8-9].
ఓ ముహమ్మద్ (స)! మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్త అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఎందుకంటే (మానవులారా!) మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయనకు మీ సహాయసహకారాలు అందజేయండి. ఆయన్ని గౌరవించండి. ఉదయం, సాయంత్రం దేవుని పవిత్రత స్మరిస్తూ ఉండండి. (ఫతహ్: 8-9)
ఇంకోచోట ఇలా సెలవిచ్చాడు
: ] فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ أُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ [ [الأعراف:157]
కనుక ఎవరు అతడ్ని విశ్వసించి సమర్థించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్థకజీవులు. వారినే విజయం వరిస్తుంది. (ఆరాఫ్: 157)
షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా رحمه الله అన్నారు: " التَّعْزِيرُ " అనే పదం ప్రవక్తకు సహాయం చేయడం, మద్దతు ఇవ్వడం, ఆయనకు హాని కలిగించే ప్రతి దాని నుండి ఆయనను సంరక్షించడం అనే అర్థాలను కలిగి ఉన్న ఒక సమగ్ర పదం.
" التَّوْقِيرُ " అనే పదం గౌరవం, ఆదరణ, ప్రశాంతతతో కూడిన స్థిరతను సూచించే సమగ్రపదం. ఆయన యెడల గౌరవంతో, వినయ వినమ్రలతో మెలగడం , ఆయన గౌరవాన్ని తగ్గించే ప్రతిదానినుండి ఆయనను కాపాడే విధంగా ఉండాలి.
మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ పట్ల ప్రేమను సూచించే లక్షణాలలో ఒకటి: ఆయన జీవిత చరిత్రను, ఆయన మార్గాన్ని తెలుసుకోవడం, ఆయన గుణాలను, నైతిక విలువలను లోతుగా పరిశీలించడం.
అల్లాహ్ తాయాలా ఇలా సెలవిచ్చాడు:
]لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا [ [الأحزاب:21].
విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవనసరళి)లో మీకు మంచి ఆదర్శం ఉంది. దేవుడ్ని, అంతిమదినాన్ని నమ్మి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించేవారికి ఈ ఆదర్శం ఎంతో ఉప యోగపడుతుంది. (అహ్జాబ్: 21)
అల్లామా ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తెలిపారు:ఈ ఆయతు దైవప్రవక్త యొక్క మాటలను, ఆచరణలను, స్థితిగతులను అనుసరించడంలో ఒక ప్రదానమైన మూల ఆధారంగా నిలుస్తుంది.
సున్నత్ ప్రచారం:
ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహివ సల్లం పట్ల ప్రేమను సూచించే ముఖ్యమైన లక్షణాలలో మరోకటి: ఆయన సున్నతులను ప్రచారం చేయడం, వాటిని రక్షించడం, వాటిపై అపారమైన శ్రద్ధ మరియు గౌరవాన్ని కలిగి ఉండటం.
అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం ప్రకారం: ప్రవక్త ఇలా అన్నారు: ఏ పురుషుడు తన కుటుంబ సభ్యులను(స్త్రీలను) మస్జిద్‌కు వెళ్లకుండా అడ్డుకోకూడదు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ కుమారుడు ఇలా అన్నాడు: మేము వారిని (స్త్రీలను) మస్జిద్‌కు వెళ్లకుండా అడ్డుకుంటాము. దానికి అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు తీవ్రంగా స్పందిస్తూ ఇలా అన్నారు: నేను నీకు అల్లాహ్ ప్రవక్త గురించి హదీస్ చెబుతున్నాను, కానీ నీవు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు! అబ్దుల్లాహ్ ఆ కుమారుడితో మరణించే వరకు మాట్లాడలేదు.(సహీ బుఖారీ ముస్లిం ఉల్లేఖనం మరియు అహ్మద్ తన పదాలతో ఉల్లేఖించారు)
అబ్దుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ఒక వ్యక్తి వేట నిమిత్తం రాళ్లను విసురుతండటం ఆయన చూశారు అప్పుడు ఆయన అతనితో ఇలా అన్నారు
ఇలా రాళ్లు చేయవద్దు ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ దీనిని నిషేధించారు. ఆపై ఇలా అన్నారు దానివల్ల వేట జయప్రదం కాదు. శత్రువును గాయపర్చలేరు. పైగా అది పల్లు రాలగొడుతుంది. , కళ్లను దెబ్బతీస్తుంది. తర్వాత, అదే వ్యక్తి మళ్లీ రాళ్లు విసురోతూ అబ్దుల్లాహ్ చూశారు. దానికి ఆయన తీవ్రంగా మండిపడుతూ ఇలా అన్నారు: నేను దైవప్రవక్త నిషేధించడాని హదీసు నీకు చెబుతున్నాను, కానీ నీవు ఇంకా రాళ్లు విసురుతూనే ఉన్నావా ? ఇకపై నేను నీతో అస్సలు మాట్లాడను. ( సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం కథనం)
మీరు విన్నదాన్ని నేను చెబుతున్నాను. అల్లాహ్‌ను నా కోసం, మీ కోసం క్షమాపణ కోరుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆయనను క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, దయగలవాడు.
రెండవ ప్రసంగం
సమస్త పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కి అంకితం. ఆయనకే శుభప్రద ప్రశంసలు, అందమైన స్తుతులు శోబిస్తాయి. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరూ లేరు, ఆయన ఏకైకుడు ఆయనకు భాగస్వామి ఎవ్వరూ లేరు ఆయన సత్యాన్ని పలుకుతాడు సరైన మార్గాన్ని చూపుతాడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ (స) ఆయన దాసుడు మరియు సందేశహరుడు, ఆయనపై ఆయన కుటుంబీకులపై ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!
దైవదాసులారా! అల్లాహ్’కు భయపడండి! తెలుసుకోండి నిశ్చయంగా అల్లాహ్ పట్ల భీతి అత్యుత్తమమైన విధానం మరియు అత్యంత దృఢమైనమార్గం.
విశ్వాసులారా ! నిస్సందేహంగా మహోన్నతమైన ప్రేమ మరియు దాని అత్యున్నత ద్వారం ఏమిటంటే అల్లాహ్ పట్ల విధేయత, సమర్పణ, అంగీకారం మరియు ఆజ్ఞాపాలన.
అల్లాహ్ తఆల ఇలా సెలవిచ్చాడు:
]قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ آل عمران:31
వారికిలా చెప్పు: “మీరు నిజంగా దేవుడ్ని అభిమానిస్తుంటే నన్ను అనుసరించండి; దేవుడు మిమ్మల్ని అభిమానిస్తాడు; మీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు ఎంతో క్షమించే వాడు, కరుణించేవాడు. (ఆల్ ఇమ్రాన్: 31)
అల్లామా ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ సెలవిచ్చారు: ప్రవక్త ముహమ్మద్ ﷺ పట్ల ప్రేమ అనేది ఆయన గురించి అతిశయోక్తులు చెబుతూ గాని, ఆయనను సాయం కోసం పిలుస్తూ గాని, మౌలిద్ వేడుకలు జరుపుతూ గాని, ఇళ్ళను నినాదాలు, శ్లోకాలు వ్రాసి అలంకరిస్తూ గాని ఉండదు. ఎందుకంటే సహాబా (రజియల్లాహు అన్హుమ్) అనేవారు అత్యున్నతమైన తరం, గొప్ప సమూహం. వారు ఎప్పుడూ ఈ తేదీని గుర్తించి మీలాద్ జరుపుకోలేదు, అది మంచి పనైతే వారు ముందుగానే చేసి చూపించేవారు.
మిత్రమా! నీకు తెలుసా? మౌలిద్ వేడుకను మొదట సృష్టించి ఆచరించిన వారు ఫాతిమీ రాజులు. వారు నాలుగవ హిజ్రీ శతాబ్దంలో దీనిని ఆరంభించారు. వారు తాము ప్రవక్త వంశానికి చెందినవాళ్లమని చెప్పుకున్నా, వాస్తవానికి వారు యూద మతానికి చెందిన బాతినీ అయిన అబ్దుల్లాహ్ బిన్ మైమూన్ అల్-ఖద్దాహ్ సంతానం. వారి రాజ్యంలో ప్రధానుడు, అధికారం అల్లా ఆయనతోనే" అని తప్పుడు చెప్పి తన్ను తానే దేవుడినని ప్రకటించాడు. అంతేకాక, అతడు అనేక బాతినీ తీగలను స్థాపించాడు.
సారాంశం:
మౌలిద్ అనే బిద్‌అత్ (కొత్త పోకడ) ఇక్కడి నుంచే పుట్టింది. ఇప్పుడు ఒక జ్ఞానవంతుడు ఇలా అనగలడా? అంటే – ఆ సత్యాన్ని సిద్దీఖ్ (అబూ బక్ర్ ర.అ.), ఫారూక్ (ఉమర్ ర.అ.), మరియు ఇతర సహాబాలు, సలఫ్ ఇమామ్‌లు కూడా గ్రహించలేకపోయారు, కానీ ఈ జహ్మీ, బాతినీ, ధర్మం వీడి దారి తప్పినవాళ్లు మాత్రమే గ్రహించారా?!
షైఖ్-ఉల్-ఇస్లాం ఇబ్ను తైమీయ్యా రహిమహుల్లాహ్ మౌలిద్ బిద్‌అత్ గురించి ఇలా అన్నారు: “ఈ ఆచారాన్ని సలఫ్ ఎప్పుడూ చేయలేదు, చేయడానికి అవసరమున్నప్పటికీ, అడ్డంకీ లేకపోయినా. ఇది పూర్తిగా మంచి పనై ఉండి ఉంటే, లేదా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నదై ఉంటే, సలఫ్ (సహాబాలు) మనకంటే ముందు దీనిని ఆచరించేవారు. ఎందుకంటే వారు మనకంటే ఎక్కువగా ప్రవక్త ﷺ పట్ల ప్రేమతో, గౌరవంతో ఉండేవారు, మరియు మంచి పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ప్రవక్త ﷺ పట్ల సంపూర్ణమైన ప్రేమ, గౌరవం అంటే ఆయనను అనుసరించడం, ఆయన ఆదేశాలను పాటించడం, ఆయన సున్నతును బహిరంగంగా మరియు అంతరంగంగా జీవనంలో నిలబెట్టుకోవడం, ఆయన తెచ్చిన సందేశాన్ని వ్యాప్తి చేయడం, దాని కోసం ఆత్మశుధ్ధిత్తో, సత్కర్మలతో, సత్య వాక్కుతో అవిశ్రావంతంగా పరిశరమించడం.
అందువల్ల, అల్లాహ్ దాసులారా! బిద్‌అత్ ధర్మంలో కొత్త ఆవిష్కరణల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త ఆచారం బిద్‌అత్, ప్రతి బిద్‌అత్ మార్గభ్రష్టత్వం, ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ వద్ద ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నారు: “అబూ అబ్దిల్లాహ్! నేను ఎక్కడి నుండి ఇహ్రామ్ కట్టాలి?”
ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ చెప్పారు: “ధీ-హులైఫా నుండి, అక్కడే ప్రవక్త ﷺ ఇహ్రామ్ కట్టారు.”
ఆ వ్యక్తి అన్నాడు: “కానీ నేను మస్జిద్ నబవి నుంచే ఇహ్రామ్ కట్టాలని అనుకుంటున్నాను.”
అప్పుడు ఇమామ్ మాలిక్ అన్నారు: “అలా చేయకు! నీకు ఫిత్నా (పరీక్ష/విపత్తు) వస్తుందని భయపడుతున్నాను.”
ఆ వ్యక్తి అన్నాడు: “ఫిత్నా ఏముంటుంది ఇందులో? నేను కొన్ని మైళ్ళు ఎక్కువగా నడుస్తాను అంతే!”
అప్పుడు ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ చెప్పారు: “రసూలుల్లాహ్ ﷺ చేయని ఒక పనిలో నువ్వు ఆయనకంటే ముందే చేరుకున్నావని అనుకోవడం కన్నా పెద్ద ఫిత్నా ఇంకేముంటుంది? నేను అల్లాహ్ వాక్యాన్ని విన్నాను:
فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَنْ تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ )النور:63(
ముస్లింలారా! దైవప్రవక్త పిలుపును మీరు ఒకరినొకర్ని పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో (ఏదో నెపంతో) చల్లగా జారుకునేవారెవరో దేవునికి బాగా తెలుసు. ఆయితే ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు తాము ఏదైనా ప్రమాదంలో చిక్కుబడతామే మోనని లేదా దుర్భరయాతనకు గురవుతామేమోనని తలచి భయపడాలి. (63)
ఓ అల్లాహ్! ప్రకాశవంతమైన ముఖకాంతి గలవాడైన, తెల్లని నుదుటి కాంతిగలవాడైన, అబ్దుల్లాహ్ కుమారుడైన ముహమ్మద్ ﷺ మీద, ఆయన కుటుంబం మీద, ఆయన సహాబా మీద, మరియు కియామత్ దాకా వారి మార్గాన్ని అనుసరించేవారి మీద నీ దయా-శాంతులు కురిపించు.
ఓ అల్లాహ్! మేము నీ దగ్గర నుండి హిదాయత్, సన్మార్గం తక్వా, పవిత్రత, ధనసంపద కోరుకుంటున్నాము. ఓ అల్లాహ్! మాకు హిదాయత్ చూపు, మమ్మల్ని ధర్మ దారిలో నడిపించు.
ఓ అల్లాహ్! మాకు మరియు మా తల్లిదండ్రులకు పుణ్యఫలాలతో మా కర్మల త్రాసును భారంగా చేయి. మమ్మల్ని స్వర్గవాసులలో చేర్చు.
ఓ అల్లాహ్! మా దారిగా ఉన్న మా ధర్మాన్ని సరిచేయి. మా జీవనోపాధి ఉన్న ఈ ప్రాపంచిక వ్యవహారాలను సరిచేయి. మా తిరుగు ప్రయాణం ఉండే పరలోకాన్ని బాగు చేయి. జీవితం మాకు ప్రతి మంచిపనిలో పెరుగుదల అయ్యేలా చేయి. మరణం మాకు ప్రతి చెడు నుండి విశ్రాంతి అయ్యేలా చేయి.
ఓ అల్లాహ్! యూద అక్రమార్కులను శిక్షించు. నేరగాళ్లైన జియోనిస్టుల మీద ప్రతీకారం తీర్చు. గాయపడిన అల్-అక్సాను ముస్లింల ఆధీనంలోకి తిరిగి తీసుకురా. ఓ అల్లాహ్! పాలస్తీన్ లోని మా ప్రజలకు నువ్వు సహాయకుడవై ఉండు. వారి రక్తాలను కాపాడు. వారి గౌరవాలను రక్షించు. వారికి నీ ప్రత్యేక సహాయాన్ని అందించు. వారి శత్రువుల కుట్రలను వారికే తిరిగి మళ్లించు.
ఓ అల్లాహ్! మా పాలకులను మరియు ముస్లింల నాయకులను నీవు ఇష్టపడే, సంతోషించే విషయాలలో విజయవంతం చేయి. వారి మాటలను హక్కు మరియు తక్వా మీద ఏకం చేయి. వారి హృదయాలను కలిపివేయి. వారిని శాంతి మార్గంలో నడిపించు. వారిచేత భూమికీ, ప్రజలకీ లాభం కలుగజేయి. ఓ అల్లాహ్! ఈ దేశాన్ని (మన దేశాన్ని) భద్రంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా, న్యాయం మరియు విశ్వాసం కలిగిన స్థలంగా, రక్షణ మరియు సురక్షిత నివాసంగా చేయి. అలాగే అన్ని ముస్లిం దేశాలను కూడా. మా చివరి పలుకు నీ స్తోత్రమే!
నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం!
మొదటి ఖుత్బా
الْحَمْدُ لِلَّهِ الْعَلِيمِ الأَكْرَمِ، الَّذِي عَلَّمَ بِالْقَلَمِ، عَلَّمَ الإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ، وَأَشْهَدُ أَن لَّا إلَهَ إلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، أَعَزَّ بِالْعِلْمِ وَأَكْرَمَ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُ اللَّهِ وَرَسُولُهُ، خَيْرُ مَنْ تَعَلَّمَ بِالْوَحْيِ وَعَلَّمَ، وَبَدَّدَ ظُلُمَاتِ الْجَهْلِ وَبَصَّرَ، صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إلَى يَوْمِ الدِّينِ، وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا.
నిజమైన మాట అల్లాహ్ గ్రంథం, మరియు ఉత్తమ మార్గదర్శనం ముహమ్మద్ ﷺ యొక్క మార్గదర్శనం. ధర్మంలో కొత్తగా కల్పించినవన్నీ చెడ్డవే బిద్‌అత్ కోవకు చెందినవే. ప్రతి బిద్‌అత్ మార్గభ్రష్టత్వం. ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి మార్గమే.
అల్లాహ్ దాసులారా! నేను నా స్వయానికి మరియు మీ అందరికీ అల్లాహ్ భయాన్ని (తక్వా) ఉపదేశిస్తున్నాను. రహస్యంగానూ, బహిరంగంగానూ సర్వకాల సర్వావస్థలయందు ఆయన మనల్ని గమనిస్తున్నాడన్న విషయాన్ని మరువకండి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ [النساء:131].
నీకు, నీకుపూర్వం గ్రంథం ఇవ్వబడిన వారికి కూడా మేము అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండాలనే ఆదేశించాం. (అన్-నిసా: 131)
విశ్వాస సోదరులారా!
జీవిత చక్రం తిరుగుతూనే ఉంది. గంటలు, రోజులు, నెలలు సంవత్సరాలు మంచులా కరిగిపోతూ ఉన్నాయి. మరణం సంభవించే వరకూ ఈ పరిణామ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. గతం మన ముందర అనేక పాఠాలను ఉంచుతుంది. నిద్రాణంలో ఉన్న మన హృదయాలను తట్టి లేపుతుంది. నిన్నమొన్ననే మనం గత విద్యా సంవత్సరాన్ని వీడ్కోలు పలికాము. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము. మన రోజువారీ జీవితం సహజస్థితికి వచ్చేసింది. చదువుల బండి కదులుతున్నది, కృషి, జాగ్రత్తలతో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆశలతో, ఉత్సాహంతో కొత్త జీవితం మొదలవుతుంది. విద్యాసంస్థలు తలుపులు తెరిచాయి, పిల్లలు విజ్ఞానానికి పరుగులు తీస్తున్నారు. వారి హృదయాలను భవిష్యత్ ఆశ కదిలిస్తోంది, జ్ఞానాసక్తి వారిని నడిపిస్తోంది. కృషి మరియు వారిని జ్ఞానం – ఆచరణలో నిజాయితీగా ముందడుగు వేయడంలో తోడ్పడుతోంది.
అల్లాహ్ దాసులారా!
జ్ఞానం అల్లాహ్ పై విశ్వాసానికి ఆధారం, ఆయనను తెలుసుకోవడానికి మార్గం. జ్ఞానం ప్రాధాన్యాన్ని సూచించడానికి మొదటి వహీ (దివ్యావిష్కృతి) ఇలా ప్రారంభమైంది:
اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ * خَلَقَ الْإِنْسَانَ مِنْ عَلَقٍ * اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ * الَّذِي عَلَّمَ بِالْقَلَمِ * عَلَّمَ الْإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ [العلق:1-5]
(ముహమ్మద్!) సర్వసృష్టికర్త అయిన నీప్రభువు పేరు స్మరించి పఠించు. ఆయనే మానవుడ్ని గడ్డకట్టిన రక్తంతో సృజించాడు. చదువు. నీ ప్రభువు మహోన్నతుడు. ఎంతో ఉదారుడు. ఆయన మానవునికి కలం ద్వారా అతను ఎరగని జ్ఞానం నేర్పాడు. [అలఅలక్:1-5]
దైవ ప్రవక్త (స) వారిపై అవతరించిన తొలి దైవవాణి "చదువు" అన్నది. దీన్ని బట్టి ఇస్లాం జ్ఞానానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో ఇట్టే అర్థమయిపోతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ [المجادلة:11]
మీలో (సత్యాన్ని) విశ్వసించి (ధర్మ)జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత హోదాలు ప్రసాదిస్తాడు. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు తెలుసు. [ముజాదిలా:11]
దైవ ప్రవకత (స) ఇలా అన్నారు:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «وَمَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا، سَهَّلَ اللهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الجَنَّةِ» [رَوَاهُ مُسْلِمٌ].
జ్ఞానసముపార్జన కోసం దాసుడు ఒక మార్గాన్ని అన్వేషిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గానికి మార్గం సులభతరం చేస్తాడు. [ముస్లిం]
విశ్వాస సోదరులారా!
కొత్త విద్యా సంవత్సరం జ్ఞానం విస్తరించే కాలం, ఆత్మలు సన్మార్గంలో నడిచే కాలం. జ్ఞానం ఆధారంగానే అల్లాహ్ ప్రజలకు ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. లేదా పతనావస్థకు గురి చేస్తాడు. జ్ఞాని – అజ్ఞాని ఎప్పుడూ సమానం కాజాలరు. జ్ఞానం అల్లాహ్ ప్రసన్నతను పొందడానికి అనువైన మార్గం. ప్రవక్త (స) ఇలా అన్నారు:
«(إنَّ الملائكةَ لتضعُ أجنحتَها رضًا لِطَالِبِ العِلْمِ» [رَوَاهُ أَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ
ధర్మ విద్యార్జన చేసే విద్యార్థి కోసం దైవ దూతలు తమ రెక్కలను పరుస్తారు. [అబూ దావూద్, తిర్మిధీ]
జ్ఞానం మనుషులు ప్రోగు చేసుకోవాల్సిన సంపదల్లో ఉత్తమ సంపద. హృదయాలు అనునిత్యం పరితపించాల్సిన గొప్ప కర్తవ్యం, మనో చీకట్లను, మనసులోని తమస్సును తొలగించే ఉషస్సు, గొప్ప తపస్సు. ఇది ప్రతి ఒక్కరి ధార్మిక అవసరం, జీవనావశ్యకత కూడా. జ్ఞానంతో మనిషి మనోధర్మం సరిదిద్దబడుతుంది, జ్ఞానంతోనే ప్రజలు తమ ప్రభువును తెలుసుకుంటారు. అలాగే ప్రాపంచిక విద్య, విజ్ఞానం ద్వారా కూడా ముస్లింలు లాభపడతారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, నిర్మాణాలు, ఉత్పత్తి, ప్రతి ఉత్పత్తి - అన్నీ జ్ఞానం ద్వారానే సాధ్యం. జ్ఞానంతోనే జాతులు ఎదుగుతాయి, దేశాలు గొప్ప కీర్తిని, గౌరవాన్ని పొందుతాయి.
విశ్వాస సోదరులారా!
కొత్త విద్యా సంవత్సరాన్ని నూతనోత్సాహంతో, ఆశాభావ దృక్పథంతో స్వాగతించండి. ప్రవక్త (స) ఎల్లప్పుడూ మంచి శకునాన్ని ఇష్టపడ్డారు, అపశకునాన్ని అసహ్యించుకున్నారు. ఆయన ఆలస్యము, సోమరితనం నుండి అల్లాహ్ రక్షణ కోరేవారు.
శిక్షకులు, ఉపాధ్యాయులారా! మీరు గొప్ప పని చేస్తున్నారు. మీరు జనం కోసం, సంఘం, సమాజము కోసం వెలుగు దీపాలుగా, కరుణ కమలాలుగా ఉన్నారు. మీ వద్దకు ముస్లింల పిల్లలు వస్తున్నారు. వారు మీ నుండి జ్ఞానం, సన్మార్గ ఉపదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి హృదయాలను గెలుచుకోండి. అల్లాహ్ ప్రేమలో వారిని పెంచండి. ఈమాన్ – ఇహ్సాన్ విత్తనాలు వారి మనసులో నాటండి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَمَنْ أَحْسَنُ قَوْلًا مِمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا [فصلت:33]
అల్లాహ్ (సందేశం) వైపు (ప్రజలను) పిలిచి, సత్కార్యాలు చేసి, తాను దైవవిధే యుణ్ణని పలికినవాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది అవుతుంది? [ఫుస్సిలత్:33] అందువల్ల, అల్లాహ్ మెప్పును కాంక్షిస్తూ మీ మాటల్లోనూ, చేతల్లోనూ నిజాయితీగా ఉండండి.
గౌరవనీయ ఉపాధ్యాయులారా!
మీ స్థానం మాకు తెలుసు. మీరు మానవాళికి మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు. మీ జీవిత కాలాన్ని మీరు కొవ్వొత్తిలా కరిగిపోతూ, విద్యా వాతావరణంలో విద్యార్థుల మధ్య గడుపుతున్నారు. వారిని ప్రయోజకుల్ని చేయడం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దే ప్రయతనం శక్తి మంచం లేకుండా చేస్తున్నారు. వారికి నీతికి విలువేమిటో, నాతికి వలువేమిటో నేర్పుతున్నారు, సన్మార్గం చూపుతున్నారు. ఉన్నత విలువలను వారికి బోధిస్తున్నారు. వారిలోని ఉన్నత నైతికతను ప్రోత్సహిస్తున్నారు. వారిని నవ సమాజ నిర్మాతలుగా, భావి భాగ్య విధాతలుగా మలుస్తున్నారు. కాబట్టి, విద్యార్థులను ఆనందంతో స్వాగతించండి, వారిని తక్కువగా అంచనా వేయకండి. వారి యెడల సద్భావం కలిగి ఉండండి. ఎందుకంటే ఈ రోజు వారు చిన్నవారు రేపు పెద్దవారవుతారు, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు అజ్ఞానిగా ఉన్న వ్యక్తి విద్యాబుద్ధులు నేర్చుకుని రేపు మహాజ్ఞాని అవ్వచ్చు. నేడు అలక్ష్యానికి ఏమరుపాటుకి లోనయిన వ్యక్తి కనువిప్పు కలిగి గొప్ప కార్యసాధకుడు కావచ్చు.
రెండవ ఖుత్బా
الْحَمْدُ لِلَّهِ عَلَى إِحْسَانِهِ، وَالشُّكْرُ لَهُ عَلَى تَوْفِيقِهِ وَامْتِنَانِهِ، وَأَشْهَدُ أَن لَّا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَعْظِيمًا لِشَأْنِهِ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ الدَّاعِي إِلَى رِضْوَانِهِ، صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ.
గౌరవనీయ విద్యార్థులారా!
ఇదిగో, జ్ఞాన శుభోదయాలు వచ్చేశాయి. మీరు కృషితో, నిజాయితీతో వాటిని స్వీకరించండి. మీ బంగారు భవిత కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండండి, అసభ్యంగా ప్రవర్తించవద్దు. సహనంతో, జాగ్రత్తగా ఉండండి. సోమరితనం, నిర్లక్ష్యాన్ని దూరంగా పెట్టండి. చెడ్డ స్నేహితుల నుండి జాగ్రత్త పడండి. విజ్ఞానాన్ని గౌరవించండి, పుస్తకాలను గౌరవించండి. మీరు నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకోండి. ముస్లిం సముదాయం మీరు నిజాయితీ గల పండితులు, వైద్యులు, ఇంజనీర్లు, సైనికులుగా ఎదగాలని ఆశిస్తోంది. అల్లాహ్ మీకు తోడుగా ఉండుగాక!
తల్లిదండ్రులారా!
మీరు పాఠశాల యొక్క భాగస్వాములు. మీ పిల్లల్లో జ్ఞాన పిపాసను పెంపొందించండి. ఉపాధ్యాయులను గౌరవించండి. ఎందుకంటే అద్భుతం విద్య ద్వారానే జరుగుతుంది. పాఠశాల యాజమాన్యంతో సహకరించండి, ఉపాధ్యాయులతో సత్సంబంధం కలిగి ఉండండి. ఇది మీ కుమారులు, కుమార్తెలకు మేలు చేస్తుంది. అల్లాహ్ ఈ విద్యా సంవత్సరాన్ని కువైట్ దేశానికి శుభవంతంగా, విజయవంతంగా మార్చుగాక!
ముస్లిం సోదరులారా!
అత్యున్నత జ్ఞానం ఖుర్‌ఆన్ మరియు సున్నత్ విద్య. ఇది ప్రవక్తల వారసత్వం. అందుకే మనం ధర్మజ్ఞానం కోసం శ్రద్ధ వహించాలి. మన దేశంలో ధార్మిక విద్యాసంస్థలు, ఖుర్‌ఆన్ మదర్సాలు విస్తరింఉన్నాయి. అల్లాహ్ కృపతో వాటిలో ప్రవేశం అందుబాటులో ఉంది.
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ ప్రవక్త (స) పై దురూద్ పంపండి. "అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుంమ్మజీద్".
إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త [ముహమ్మద్ (ﷺ)]పై దరూద్'లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి. (ఖుర్ఆన్ - 33 : 56)
“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”
దువా: అల్లాహ్ ఇస్లాం, ముస్లింలను బలపరచుగాక. బలహీన ముస్లింలకు సహాయపడుగాక. శత్రువులను నాశనం చేయుగాక. ఈ దేశాన్ని (కువైట్) భద్రముగా, శాంతియుతముగా చేయుగాక. మా నాయకులను సన్మార్గంలో నడిపించుగాక. మా తల్లిదండ్రులను క్షమించుగాక. మా అన్ని పాపాలను క్షమించుగాక. బాధలను తొలగించుగాక. రోగులను నయం చేయుగాక. నిర్బంధితులను విముక్తి చేయుగాక. సంతానం లేనివారికి సంతానం ప్రసాదించుగాక.
اللَّهُمَّ أَعِزَّ الْإِسْلَامَ وَالْمُسْلِمِينَ، وَانْصُرْ عِبَادَكَ الْمُسْتَضْعَفِينَ الْمُوَحِّدِينَ فِي كُلِّ مَكَانٍ، وَدَمِّرْ أَعْدَاءَ الدِّينِ، اللَّهُمَّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا مُطْمَئِنًّا سَخَاءً رَخَاءً وَسَائِرَ بِلَادِ الْمُسْلِمِينَ، اللَّهُمَّ وَفِّقْ أَمِيرَنَا وَوَلِيَّ عَهْدِهِ لِهُدَاكَ، وَاجْعَلْ عَمَلَهُمَا فِي رِضَاكَ، وَارْزُقْهُمَا الْبِطَانَةَ الصَّالِحَةَ النَّاصِحَةَ الَّتِي تَدُلُّهُمْ عَلَى الْخَيْرِ وَتُعِينُهُمْ عَلَيْهِ، اللَّهُمَّ اغْفِرْ لَنَا وَلِوَالِدِينَا كَمَا رَبَّوْنَا صِغَارًا، اللَّهُمَّ ارْزُقْنَا بِرَّهُمْ أَحْيَاءً وَأَمْوَاتًا، اللَّهُمَّ لَا تَدَعْ لَنَا ذَنْبًا إِلَّا غَفَرْتَهُ، وَلَا هَمًّا إِلَّا فَرَّجْتَهُ، وَلَا مَرِيضًا إِلَّا شَفَيْتَهُ، وَلَا مُبْتَلًى إِلَّا عَافَيْتَهُ، وَلَا مَحْرُومًا مِنَ الْأَوْلَادِ إِلَّا وَهَبْتَهُ، رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذَرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا.
Sunday, September 7, 2025
తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)
తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)
తౌహీద్ అంటే అల్లాహ్ వైపు ప్రయాణం చేసే వారికి మొదటి నిలయం, ఈ లోకంలోను పరలోకంలోను విముక్తి పొందే మార్గం. ప్రవక్తలు ప్రజలకు చేసిన మొదటి హితవు, తొలి ప్రేమైక పిలుపు కూడా ఇదే.
పవిత్ర ఖుర్‌ఆన్‌లో దయామయుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴿وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ﴾ (النحل: 36)
“మేము ప్రతి జాతికి ఒక దూతను పంపాము (ఇది చెప్పమని): ‘అల్లాహ్‌ను మాత్రమే పూజించండి, తాగూత్ నుండి దూరంగా ఉండండి’.”
తౌహీద్ అనేది మనిషి యొక్క మొదటి కర్తవ్యం. ప్రవక్త ﷺ, తన సహచరుడు ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) యెమెన్‌కి పంపేటప్పుడు ఆయనకు చేసిన ఉపదేశం ద్వారా ఈ యదార్థాన్నే వివరించారు: ఓ మఆజ్! “నీవు అహ్లుల్‌కితాబ్ (గ్రంథప్రజల) వద్దకు వెళ్తున్నావు. వారిని మొదట తౌహీద్ వైపునకు పిలవాలి.” (బుఖారీ)
అల్లాహ్ సృష్టిని వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. అందుకే ప్రవక్తలని, గ్రంథాలని పంపాడు. ఆ మహోన్నత లక్ష్యమే - తౌహీద్. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ﴾ (الذاريات: 56)
“నేను జిన్నులనూ, మనుషులనూ నన్ను ఆరాధించడానికి తప్ప మరి దేనికోసమూ సృష్టించలేదు.”
ఇబాదత్ (ఆరాధన)
ఇబాదత్ అంటే అల్లాహ్ ప్రేమించే మరియు సంతోషించే ప్రతి మాట, ప్రతి పని. అది బహిరంగమైనా, రహస్యమైనా. ఇక ఇబాదత్ యొక్క పునాది మరియు శిఖర భాగం తౌహీద్. మనం ఏది నాటుకుంటామో దాన్నే కోసుకుంటాము. తుమ్మ విత్తనామ నాటి మామిడి పండును ఆశించడం అత్యాశే కాదు, ఎన్నటికీ తీరని ఆశ. తౌహీద్ విత్తనాన్ని మనం మన మనోసీమలో నాటితే తాలూకు ఫలాలు మన కర్మతోటలో కాస్తాయి. ఇదే విషయాన్నిఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది: అల్లాహ్ శిష్టవచనాన్ని దేనితో పోల్చాడో మీరు గమనించారా? ఓ మేలుజాతి వృక్షం ఉంది. దాని వేళ్ళు నేలలో లోతుకు దృఢంగా పాతుకుపోయాయి. దాని శాఖలు ఆకాశం దాకా విస్తరించాయి. అనుక్షణం అది తన ప్రభువాజ్ఞతో సుమధుర ఫలాలు ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకోవడానికే అల్లాహ్ ఇలాంటి ఉదాహరణలు ఇస్తున్నాడు. (ఇబ్రాహీం: 24)
తౌహీద్ నిర్వచనం:
తౌహీద్ అంటే రుబూబియ్యహ్ (విశ్వసార్వభౌమత్వం)లో, ఉలూహియ్యహ్ (ఆరాధన)లో, మరియు అల్లాహ్ యొక్క నామాలు, గుణాలలో ఆయనను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం.
తౌహీద్ భాగాలు
తౌహీద్ అర్-రుబూబియ్యహ్ – సృష్టి, యాజమాన్యం, పోషణ మొదలైన వాటిలో అల్లాహ్‌ను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం.
తౌహీద్ అల్-ఉలూహియ్యహ్ – పూజలో, ప్రార్థననో, ఆరాధనలో అల్లాహ్‌ను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం.
తౌహీద్ అల్-అస్మా వ సిఫాత్ – అల్లాహ్ స్వయంగా లేదా ప్రవక్త ﷺ ద్వారా వివరించిన నామాలు, గుణాలను ఆయన కు మాత్రమే ప్రత్యేకించి, ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకుండా, పెడర్థాలు తీయకుండా, పోలికల్ని కల్పించకుండా, ఆధారాలతో రుజువయిన ఏ ఒక్క గుణ నామాన్ని నిరాకరించకుండా, వాటికి ఎలాంటి దృశ్య రూపంగానీ, ఊహాచిత్రంగానీ ఇవ్వకుండా విశ్వసించడం.
ఖుర్‌ఆన్ లో ఇలా ఉంది; ﴿رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا﴾ (مريم: 65)
ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్య వున్న సమస్త సృష్టితాలకే ప్రభువు. కనుక నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే (జీవితాంతం) స్థిరంగా ఉండు. నీ దృష్టిలో ఆయనకు సమానుడైనవాడు ఎవడైనా ఉన్నాడా?” (అల్-మర్యం: 65)
ఈ ఆయతులో మూడు అంశాలు ఉన్నాయి:
“ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్యనున్న వాటి యజమాని” → రుబూబియ్యహ్
“నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే (జీవితాంతం) స్థిరంగా ఉండు” → ఉలూహియ్యహ్
“- నీ దృష్టిలో ఆయనకు సమానుడైనవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకు సాటి ఎవరూ లేరు” → అస్మా వ సిఫాత్
తౌహీద్‌కు విరుద్ధమైనది షిర్క్
షిర్క్ అంటే అల్లాహ్‌కు భాగస్వామ్యాన్ని చేర్చడం. ఇది అల్లాహ్ నిషేధించినవాటిలో అత్యంత ఘోరమైన పాపం.
షిర్క్ రెండు రకాలుగా విభజించబడింది: 1) షిర్క్ అల్-అక్బర్ (పెద్ద షిర్క్): అల్లాహ్ తప్ప మరెవరినయినా ప్రార్థించడం, మొరపెట్టుకోవడం. ఇది మనిషిని ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది.
ఆధారం: ﴿إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ﴾ (النساء: 48)
అల్లాహ్ తనకు సాటి కల్పించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. అది తప్ప ఇతర పాపాలను ఆయన తలచుకుంటే క్షమిస్తాడు. అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో, గుణగణాల్లో, శక్తిసామర్థ్యాల్లో) సాటి కల్పించడమంటే ఘోరమయిన పాపం మూట కట్టుకున్నట్లే. (అన్-నిసా: 48)
షిర్క్ అల్-అస్గర్ (చిన్న షిర్క్):
ఇస్లాం నుండి బహిష్కరించదు కానీ షిర్క్ అనే పేరు పొందిన పనులు. ఉదాహరణ: అల్లాహ్ తప్ప వేరేవారి పేరిట ప్రమాణం చేయడం.
పెద్ద షిర్క్ మరియు చిన్న షిర్క్ మధ్య వ్యత్యాసం.
పెద్ద షిర్క్ క్షమించబడదు. చిన్న షిర్క్ అల్లాహ్ ఇష్టమైతే క్షమిస్తాడు.
పెద్దషిర్క్ ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, చిన్న షిర్క్ కాదు.
పెద్ద షిర్క్ మనిషి చేసిన అన్ని సత్కార్యాలను రద్దు చేస్తుంది. చిన్న షిర్క్ కేవలం ఆ కార్యాన్ని మాత్రమే రద్దు చేస్తుంది.
ఆరాధన అంగీకారానికి రెండు షరతులు
ఇఖ్లాస్ (చిత్తశుద్ధి): అల్లాహ్ కోసం మాత్రమే చేయడం.
ఇత్తిబా (అనుసరణ): ప్రవక్త ﷺ చేసిన, చూపిన, చెప్పిన విధంగానే చేయడం.
ఇస్లాం ధర్మస్థాయి
ఇస్లాం (ఆచరణ) – 5 స్తంభాలు:
షహాదత్ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడని, మహ్మద్ ﷺ ఆయన అంతిమ ప్రవక్త అని సాక్ష్యమివ్వడం)
సలాత్ (ఐదు పూటల నమాజులు)
జకాత్
రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు
హజ్
ఈమాన్ (విశ్వాసం) – 6 స్తంభాలు:
అల్లాహ్‌పై విశ్వాసం
ఆయన దూతలు-మలాయికపై విశ్వాసం
ఆయన గ్రంథాలపై విశ్వాసం
ఆయన ప్రవక్తలపై విశ్వాసం
అంతిమ దినంపై విశ్వాసం
కదర్ (మంచీచెడు విధివ్రాతల)పై విశ్వాసం
ఇహ్సాన్ (ఉత్తమ విధానం):
“నీవు అల్లాహ్‌ను చూస్తున్నట్టుగా ఆరాధన చేయాలి; నీవు అలా చేయలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకో.”
ముగింపు
ప్రతి ముస్లింకి తౌహీద్ అర్థాన్ని తెలుసుకోవడం, దాన్ని నేర్చుకోవడం, కుటుంబానికి బోధించడం, సమాజంలో ప్రచారం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి కాలంలో, ప్రతి ప్రదేశంలో విశ్వాసికి తౌహీద్ అత్యంత ప్రధానం, ప్రాణప్రదం గనక.
Friday, September 5, 2025
Saturday, August 30, 2025
Sunday, August 10, 2025
కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం! / Let's protect the family system!
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం!
ఈ సంతానం, సిరిసంపదలు ప్రాపంచిక జీవితపు అలంకారాలు. నీ ప్రభువు దృష్టిలో ఫలితంరీత్యా ఎంతో శ్రేష్ఠమైనవి, శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే. వాటి ద్వారానే మేలు ఆశించడానికి ఆస్కారముంది. (అల్-కహఫ్: 45-46)
కుటుంబం ఓ పరిచయం
అమ్మ గుర్తొచ్చినా..నాన్న గుర్తొచ్చినా.. బాల్యం గుర్తొచ్చినా.. కళ్ళు పొడిగానే ఉన్నా.. కన్నీళ్లు రాకపోయినా, హృదయం మాత్రం ద్రవించిపోతుంది. ఆ కాలం మళ్ళీ రాదేం అని మనసు ఆక్రోశిస్తుంది.- కుటుంబం అంటే జ్ఞాపకాలు!
అన్నా చెల్లెళ్ల మధ్య అల్లరి, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం, అక్క చెల్లెళ్ల మధ్య స్నేహం, తల్లి దగ్గర గారాబం, తండ్రి దగ్గర భద్రత, అన్న పట్ల అనురాగం, తమ్ముళ్ల పట్ల అనుబంధం.. ---ఓహ్.. కుటుంబం అంటే అపురూప భావనల సమాహారం!!
ఒంటరిగా ఉన్నప్పుడు వసంతాలు, వెన్నెల రాత్రులు కూడా ఇవ్వలేని అనుభూతులు - కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వేళ, వెన్నల రాత్రుల్లో వినీలాకాశం క్రింద కలిసి ఆడుకుంటున్న వేళ దొరుకుతాయి. కుటుంబం అంటే వెలకట్టలేని సంతోషాల సప్త రంగుల హరివిల్లు!!
విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం - కుటుంబం!
తీపి తీపి దరహాసాలు, చేదు చేదు పరిహాసాలు, పులుపు పులుపు బులపాటలు, వగరు వగరు గుణపాఠాలు - సుఖ దుఃఖాల సంగమం - కుటుంబం.!
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లులనీ, జింక పిల్లల్ని, పులి పసికూనల్ని చూసినప్పుడు ఎంత ఆనందమేస్తుందో దానికి మించిన సంతోషం తల్లి, చెల్లి, అమ్మమ్మ, నాన్నమ్మలతో గడిపినప్పుడు కలుగుతుంది - కుటుంబం అంటే ఓ ఇంద్రజాలం!
పూలలో ఉంటాయి వేలరకాలు, పక్షులలో ఉంటాయి లక్షవిధాలు. రేకులు ఉంటేనే పువ్వంటాము... రెక్కలు ఉంటేనే పక్షంటాము. అలాగే కుటుంబముంటేనే సంఘం, సమాజం అంటాము. కుటుంబం ఆంటేనే ప్రపంచం!!
సంక్రాంతి, రంజాన్, బక్రీద్ - పండుగ ఏదైనా .. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పండగ అయినా చిన్న సంతోషాన్ని ఇచ్చిందా? లేదు కదా, అంటే కుటుంబం అంటేనే పండగ.!
యె ఖాందాన్ హమారా ఛూట్ గయా జబ్ సే
మజా హమేం కిసీ తెహ్వార్ మే నహీ ఆతా
సంతోషాన్ని రెండింతలు చేసే, బాధను సగానికి తగ్గించే దివ్య సూత్రం - కుటుంబం. చేసే చిన్న చిన్న త్యాగాలు కూడా ఇష్టంగా అనిపించే మహిమాలయం - కుటుంబం. ఒక్క మాటలో చెప్పాలంటే, కుటుంబం జీవితంలో భాగం కాదు.. కాజాలదు.. కాకూడదు…. కుటుంబమే జీవితం!!
కుటుంబం గురించి ఓ మాట
భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కటుంబం అంతే ముఖ్యం. వ్యక్తి వికాసంలో, ఎదుగుదలలో కుటుంబం ఎంతో ప్రముఖమైనది. కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం. కుటుంబ వ్యవస్థ ద్వారా మనిషి తన వ్యక్తిత్త్వాన్ని మెరుగు పరుచు కోగలుగుతాడు. మనం పెరిగిన పరిస్థితులు, మన ఆలోచనలు, మన ధర్మం – ఇస్లాం – గురించి ఎంత కష్టపడుతున్నామో – దీనికంతటికీ కుటుంబ వ్యవస్థే దోహదపడుతుంది. ఒక మనిషి ఎదుగుదలకు కుటుంబం ఏంతో సహాయ పడుతుంది. అందువల్లే ఇస్లాం కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది.
కుటుంబ వ్యవస్థ
మనిషి సామాజిక జీవనానికి కుటుంబమే మూలం. పుట్టుకతో, పెళ్లితో ఆ బంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో భాగమైన వ్యక్తి రకరకాల విధులు నిర్వహిస్తారు. అందులో దైహిక, సామాజిక, ఆర్థిక, లైంగిక, విద్య, సాంస్కృతిక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి.
ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. దీని ఆరంభం ఆదిలోనే - ఆది దంపతులయిన హజ్రత్ ఆదమ్ మరియు హవ్వా (అ)లతో మొదలయింది. 20 కాన్పులలో 40 మంది సంతానం ఆ ఆది దంపతులది.... అందుకే కుటుంబం, వివాహం సమాంతర వ్యవస్థలని అంటారు. ప్రతి దశలోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. మన జీవితంలో అధిక భాగం కుటుంబంతోనే గడుస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మన మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది. మనం మన దినచర్య కుటుంబ సభ్యులతోనే ప్రారంభిస్తాం.
కుటుంబ, సంఘ ధర్మం ఇస్లాం
ఇస్లాం ధర్మం యొక్క సానుకూల ప్రాభవము తొలూత మీ నుండే మొదలవుతుంది. మిమ్మల్ని పుట్టించిన మీ నిజ సృష్టికరను మీకు పరిచయం చేసి, మీకు మీ ప్రభువుకి మధ్య బంధాన్ని అది బల పరుస్తుంది. మీతో మీకు ఉండాల్సిన సంబంధాన్ని చక్కబెడుతుంది. ఫలితంగా - మీలోని ప్రతిభాపాటవాలను అనునిత్యం నవీకరించు కుంటూ నిత్య చైతన్య కరదీపకలవుతారు మీరు. మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా, మీ ఆచరణలు అభివృద్ధికి బాటలు వేసేవిగా రూపాంతరం చెందుతాయి. తద్వారా మీరు మీ దేహాన్ని, మీ మేధనూ, మీ మనస్సును - వాటికి కీడు కలిగించేటటువంటి ప్రతి వస్తువు నుండి కాపాడుకున్న క్రియాశీలురుగా ఎదుగుతారు. మీలో చోటు చేసుకున్న ఈ మార్పు - మీ పరిసరాలను, మీ పరివారాన్ని ప్రభావితం చేస్తుంది. మీలో ఉన్న ఈ మేలు మీ తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు, మీ ఇరుగుపొరుగు వారికీ, సామాన్య ప్రజలకు చేరి - సంక్షామ సమాజంగా ఉన్న వ్యవస్థను ఓ సంక్షేమ సమాజంగా మారుస్తుంది.
కుటుంబ పరిణామ క్రమం
సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందా? మార్పులేమైనా చోటు చేసుకుంటున్నాయా? అనే విషయానికొస్తే.. సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం నేటి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ, విద్యావ్యాప్తి, నగరీకరణ, వివిధ చట్టాలు, ఆర్థిక, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులొస్తున్నాయి. ఇకమీదట కూడా వస్తుంటాయి.
జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది, అయితే ఈ మార్పు మనకి సంతోషం తెస్తుందా? లేదా ఇబ్బందిని తెస్తుందా? అనేదే అసలు ప్రశ్న. కొద్దిమంది అసలు మార్పుని ఇష్టపడరు. వారికీ ప్రస్తుతం వున్నా స్తితిలోనే అంతా వుండాలని కోరుకుంటారు. వచ్చే మార్పు వారిని ఎంతో ఇబ్బంది పెండుతుందేమో అని భయ పడతారు. వారికీ ఒక ఇల్లు మారాలన్న భయం. ఉద్యోగం మారాలన్న భయం. కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవాలన్న భయం. ఈ భయాల కారణంగా ఎలాంటి మార్పు లేకుండా, వారికీ ఎప్పుడు తెలిసిన పరిస్టితులలోనే వుండాలని కోరుకుంటారు. కాని అది అసాద్యం కదా! కాలం మారుతూ వుంటుంది. మారుతున్న కాలంతోపాటు మనం అభివృద్ధి చెందుతూ మారుతూవుండాలి.అయితే మార్పు అనేది మంచి చేసేదిగా ఉండాలే గానీ, చెడు, కీడు, పాడు చేసేదిగా ఉండకూడదు. నేడు మానవ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో అధికశాతం కీడును కలిగించేవే అయి ఉండటం కడు శోచనీయం! అలా కుటుంబ సువ్యవస్థను చడి చప్పుడు లేని చాప క్రింద నీరులా చేరి పాడు చేస్తున్నాయి కొన్ని వికారాలు. అలాంటి కొన్ని వికారాల్ని ఇప్పుడు తెలుసుకుందాం!
1) వివాహ విముఖత
వినాశకర ఆలోచన వివాహమే వద్దు అన్నది. ఆర్ధిక స్వేచ్ఛ గల స్త్రీకి - ఆర్థికంగా పురుషునిపై ఆధారపడే పరిస్థితి లేనప్పుడు సహజంగానే ఒక ప్రశక్తి ఉత్పన్నమవుతుంది- తాను స్వయంగా సంపాదించగలుగుతున్నప్పుడు భర్తకు ఎందుకు లోబడి ఉండాలి? భర్త సేవలు ఎందుకు చేయాలి? సంసార బాధ్యతలు ఎందుకు మోయాలి? పెళ్లి చేసుకుని, భర్త సేవలు చేసే బాదరబందీలు ఎందుకు కొని తెచ్చుకోవాలి? అనే భావన నానాటికీ బలపడుతోంది. జీవితం అనేది అనుభవించటానికే ఉందిగాని, బరువులు మీద వేసుకోవటానికి కాదు. అందుకే చాలా మంది స్త్రీలు తమ మనుగడ కోసం మగవాళ్ళ అండదండలు అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చారు, వస్తున్నారు. అలాగే కొందరు పురుషుల్లో సయితం వివాహ అంటే వెగటు సగటుగా కనబడుతూనే ఉంది. మగ ఆడ కలిసుండాలనుంటే దానికి పెళ్లే కావాలా? నుండి మొదలయి చర్మ శుఖం కోసం పురుషుడే కావాలా? స్త్రీయే కావాలా? అన్న దిగజారుడుతనం వైపు సాగుతొంది.
2) సహజీవనం - OYO దుష్కృతి
అసహజమైన జీవన విధానానికి పెట్టుకున్న పేరు సహజీవనం. నవతరంలో వైవాహిక వ్యవస్థపై నమ్మకం సడలిపోతోంది. పెళ్లి చేసుకోకుండానే అబ్బాయి- అమ్మాయి లేదా స్త్రీ-పురుషుడు సహజీవనం సాగిస్తున్నారు. పిల్లల్ని కంటున్నారు. ప్రతి రెండు మూడేళ్లకోసారి తమ జీవిత భాగస్వామిని కర్చీఫ్ మాదిరిగా మార్చేస్తున్నారు. ముసలి తల్లి దండ్రులు సోషల్ సెక్యూరిటీ (అంటే పెన్షన్)పై బ్రతుకుబండి లాగుతూ చచ్చిపోతున్నారు. దయాదాక్షిణ్యాలు లేని సంతానం కనీసం వారి అంత్యక్రియలకు కూడా రావడం లేదు.. అందం, ఐశ్వర్యం, ధనం, బలం ఉందని విర్రవీగకూడదు. కుటుంబ విలువల్ని కాలరాయకూడదు.
మిలే ఉరూజ్ తో మగ్రూర్ కభీ మత్ హోనా / బులందియో కే సభీ రాస్తే ఢలాన్ సే హైం
3) స్వలింగ సంపర్కం
స్వలింగ సంపర్కం వల్ల కుటుంబానికి జరిగే నష్టం చెప్పలేనిది. అందుకే ఇస్లాం ఈ వినాశకర చేష్టను తీవ్రంగా ఖండించింది. అనంత కరుణామయుడయిన అల్లాహ్ సదూమ్ జాతి ప్రజలను వారు ఈ దుశ్చర్య కారణం కఠినాతికఠినంగా శిక్షించాడు.
ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురిపించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు. (హూద్: 82-83)
ఈ రోజు పరిస్థితి ఎలా తయారైందంటే, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో - నైతిక ప్రమాణాలను నీళ్ళొదిలేస్తున్నారు. ఇక మనం వారు తానా…అంటే …తందానా అనం కదా! అయినా కొంతమంది మార్పులు స్వాగతించాలి ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి అని అంటూ నీతిబోధ చేసే ప్రయతనం చేస్తుంటారు. మంచిది కానీ, కాలక్రమేణా మనుషులు జంతువుల్ని చేసుకుంటాము పెళ్లి అని అంటే దాన్ని కూడా స్వాగతించాలంటారా? ఎవరిష్టం వాళ్ళదే అంటారా? ఇష్టా ఇష్టాలు పక్కన పెడితే మనుషులకంటూ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అవి సృష్టికర్త ముందే ఏర్పాటు చేశాడు. దానికి విరుద్ధంగా చేసే దేనిని మనం ప్రోత్సహించకూడదు ఏకీభవించకూడదు. పై పేర్కొన్న మూడు పద్ధతులు కుటుంబ వ్యవస్థ పాలిటి గొడ్డలిపెట్టు వంటివే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కుటుంబం గురించి కొందరి కాకి గోల
పరిమితికి మించి సంతానం కలిగితే కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో అంతకంటె రెట్టింపు సమస్యలు దేశం విషయంలో కలుగుతాయి. "మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని" అన్న వాదన వీరిది.
"పిండి కొద్దీ రొట్టె" దేశంలో ఆహారోత్పత్తికి తగిన వనరులు లేనపుడు, ఉండటానికి తగున వసతులు లేనపుడు, ఉద్యోగాలకి తగిన ఖాళీలు లేనపుడు, రోగులకి తగినంత మందులు లేనప్పుడు లెక్కకు మించి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సమస్యలు ఎదురవక ఏమవుతాయి ? అందరికీ అన్ని సౌకర్యాలు ఒనగూర్చాలంటే కుదిరేపనా ? ఇంకొందరి సందేహం.
నిజంగా - ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు.. సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. కలిసే పంచుకునేవారు. రానురాను ఉద్యోగాలు, ప్రైవేసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారి పోయాయి. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అన్నట్టుగా జనాలు ఆలోచన మెుదలు పెట్టారు. ఆ తర్వాత అసలు అత్తామామలను ఎక్కడో పెట్టి.. భార్యాభర్తలు మాత్రం లైఫ్‌ని లీడ్ చేసే కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఇది కాస్త ఇంకా అధ్వాన్నంగా మారింది. అదే DINK లైఫ్‌స్టైల్.
ఈ వికృతి వికారాలు ఎన్నో ఎన్నెన్నో...
DINK లైఫ్‌స్టైల్ అంటే.. Double Income No Kids. సంపాదన ఎక్కువే ఉండాలి.. కానీ పిల్లలు మాత్రం వద్దు అనే దుస్సంప్రదాయం. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి! భార్యాభర్తలుగా అన్యోన్నంగా ఉండటం ప్రక్రుతి. పిల్లాపాపలతో ఉండటం సంస్కృతీ. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేది విపరీత కృతి. అసలు పిల్లలే వద్దనుకోవడం వినాశకర దుష్కృతి. జంటలు తమ ప్రైవేసీ కోసం ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. పిల్లలను కనకుండా దంపతులు బాగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇద్దరి సంపాదన ఉంటుంది. తర్వాత వాటితో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశానికి వెళ్తారు.. నచ్చిన తిండి తింటారు. అంటే ఇక వారి జీవితానికి వారే రాజు.. వారే రాణి అన్న భ్రాంతిలో బతుకుతుంటారు.
నిజానికి ఈ కాన్సెప్ట్ ఇతర దేశాల్లో 1980లలోనే మెుదలైంది. కానీ భారత దేశం వంటి అనేక దేశాలతోపాటు అరబ్బు దేశాల్లోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు. ఇందుకోసం సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లలతోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. పిల్లలనే పచ్చని చిలుకలు తోడు లేకుంటే,,, పాడే కోయిల్లాంటి మనరాళ్లు, మునిమనవళ్లు లేకుంటే బతుకే బాదల బందీఖానా. కన్నీళ్లతో కాపురమే శరణ్యం అనాథ మరణం. అనామక ఖననం అని గమనించి, కనువిప్పు కలిగి, మార్పుకి కళ్ళు తెరవాలి నేటి యువకెరటాలు!
అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్- పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు అని ఏక్ నిరంజన్ అని ఓ ప్రత్యేక నేపథ్యంలో అన్నాడో కవి. ఇక ఈ తరం వాలకం చూస్తుంటే - కొడుకు లేడు కూతురు లేదు కొడుకు, కూతుళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే ఏ బాధ్యత లేదు - ఏక్ నిరంజన్, మనవళ్లు లేరు, మనవరాళ్లు లేరు ఏక్ నిరంజన్ అన్నట్టే ఉంది వ్యవహారం! అంటే ఒకప్పుడు అనాథ పిల్లలుండేవారు. ఇప్పడు ఈ తప్పుడు విధానం వల్ల అనాథ అమ్మానాన్నలు అధిక మవుతారు. అమ్మానాన్న లేని పిల్లలు అనాథలయితే, పిల్లలే అసలొద్దనుకునేవాళ్లు అనాథాలకన్నా అధ్వాన్నమెగా!! జీవితపు తొలి సంధ్యలో సంసార మకరందాన్ని తనివితీరా ఆస్వాదించిన యువజంటలు వారి మలిసంధ్యలో మనవళ్లు, మునిమనవరాళ్లతో గడిపే క్షణాలు శాశ్వతంగా గుర్తుండిపోయే తీపి గుర్తులు ... ఈ భాగ్యానికి ఈ అభాగ్యులు దూరమే కదా !
సంతానమే సృష్టిలో సమతౌల్యానికి మూలం
నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతిలో మనందరి ప్రభువయిన అల్లాహ్ నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ నియతి, నియమం వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ దీర్ఘకాలంలో మనుగడ సాగించజాలదు. ఆ విషయానికొస్తే, ఒకరిద్దరిని మినహాయించి దైవప్రవక్తలందరూ కుటుంబ జీవితం గడిపిన వాళ్ళే. సంతాన కాంక్ష కలిగి అల్లాహ్ ను దీనాతిదీనంగా వెడుకున్నవాళ్ళే. అలాంటిది నేటి తరం మన యువతరం ఎటు వెళుతుంది?
ఏమిటి, విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! (అల్-హదీద్: 16)
ఒక్కసారి ఆలోచించండి!
ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే మంచిది అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు 'ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు' అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం' అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే 'డ్యుయల్ ఇన్కం నో కిడ్స్' అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది దంపతులు..
పూర్వం రోజుల్లో జంటలు ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్లు. తర్వాత జనాభా బాగా పెరుగుతోందని 'ఇద్దరు లేదా ముగ్గురికి ' పరిమితం అయ్యారు. ఆ తర్వాత 'ఇద్దరే చాలు' అన్నారు. కొన్నాళ్లకు 'ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు' అనే పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నేండ్ల నుంచి అయితే 'వన్ ఆర్ నన్' అంటున్నారు. అదికాస్తా ఇప్పుడు 'ఓన్లీ నన్ (పిల్లలే వద్దు)' అయ్యింది. పలురకాల కారణాల వల్ల పిల్లలు వద్దు అనుకునేవాళ్లను 'డింక్ కపుల్స్' అని పిలుస్తారు.
. "పెళ్లయిన వెంటనే నాకు పిల్లల్ని కనడం ఇష్టంలేదు. టైం దొరికిన ప్రతిసారి లైఫ్ పార్టనర్ తో కలిసి దేశవిదేశాలు తిరగాలని ఉంది" అని చెప్పింది. ఆమె చెప్పినదానికి కాబోయే భర్త కూడా రాజీ అయ్యాడు. అలా ఇద్దరూ పెళ్లి అనే బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత నుంచి ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తున్నారు. ఏడాదికి రెండు మూడుసార్లు ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఓ సతి తీర్మానం.
“మనకు వచ్చే జీతంతో మనం ఇద్దరమే కంఫర్ట్ ఉండగలం. పిల్లలు పుడితే వాళ్లను పెంచడానికి, పోషించడానికి చాలా డబ్బు కావాలి. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు వద్దనుకుంటే ఏ సమస్యా ఉండదు. రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం ఇప్పుడు సంపాదిస్తున్న దాంట్లో కొంత పొదుపు చేసుకుంటే సరిపోతుంది" ఇది ఓ పతి జడ్జిమెంటు. ఇక్కడ చెప్పుకున్న రెండు జంటల్లానే ఇప్పుడు చాలామంది జంటలు నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద సిటీల్లో ఈ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది.
అయ్యో.. హతవిధీ!
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు, నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు. మెదడే పెరిగి హృదయం తరిగి, నరుడే ఈనాడు వానరుడైనాడు. అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు.
పిల్లలు వద్దు కానీ కుక్క పిల్లలు కావాలట
పిల్లలు లేకపోవడాన్ని బాధాకరంగా ఎందుకు చూడాలి? నిజానికి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. పిల్లలు ఉండడం వల్ల వచ్చే ఆనందం కోసం వాళ్లు మరో మార్గాన్ని ఎంచుకుంటారు. రక్త మాంసాలున్న మనిషి పిల్లల్ని ఏమన్నా వీరు పట్టించుకోరుగానీ, కుక్క పిల్లల్ని ఏమైనా అంటే మాత్రం ఎక్కడ లేని పనికిమాలిన పౌరుషం పుట్టుకొచ్చేస్తుంది. వీరి జంతు ప్రేమ తగలెయ్యా! అందుకే వీళ్లలో ఎక్కువమంది పిల్లలకు బదులు కుక్క పిల్లల్ని పెంచుకుంటారు. వాటినే పిల్లల్లా చూసుకుంటారు. ఆహా! ఏమి ఔదార్యము?
వెర్రి వెయ్యి రకాలు
డింక్వాడ్: భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టపడరు. వీళ్లు కాలక్షేపం కోసం కుక్కల్ని పెంచుకుంటారు.
డింకర్: డబుల్ ఇన్కం నో కిడ్స్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటారు. సింక్ సింగిల్ ఇన్కం, నో కిడ్.
డింక్వాక్: డబుల్ ఇన్కం, నో కిడ్స్. వీళ్లు పిల్లుల్ని పెంచుకుంటారు.
డినో: డబుల్ ఇన్కం నో ఆప్షన్స్ (లిమిటెడ్ లేదా ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉంటాయి.)
డింకీ: డబుల్ ఇన్కం, నో కిడ్స్ ఎట్ (టెంపరరీగా పిల్లలు వద్దనుకుంటారు.)
డింప్: డ్యూయల్ ఇన్కం, మనీ ప్రాబ్లమ్స్.
జింక్: గ్రీన్ ఇన్న్డ్, నో కిడ్స్.
సిన్బ్యాడ్: సింగిల్ ఇన్కం, నో బాయ్ ఫ్రెండ్, పూర్తి నిరాశ.
కొత్త జంటలు: చాలామంది పెండ్లి జరిగిన కొన్నేండ్ల వరకు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు ఈ మధ్య. ఇద్దరూ పనిచేస్తున్నా భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బు దాచుకున్నాకే పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. వాళ్లను కూడా పిల్లల్ని కనేవరకు డింక్లుగానే పరిగణిస్తారు. అలాంటివాళ్లు ఈ దశలో ఇల్లు, కారు కొనడం లాంటివి చేస్తుంటారు. లేదంటే.. పెండ్లి కోసం చేసిన అప్పులు తీరుస్తుంటారు. కాబట్టి పిల్లల్ని పెంచేందుకు సిద్ధంగా ఉండరు.
“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు: ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు. తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి. దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము. (అల్-అన్ఆమ్: 151)
పూర్వం సంతానాన్ని మూడు కారణాల చేత చంపేసేవారు. 1) లేమి, పేదరిక భయంతో. 2) అవమాన భయంతో. 3) మూఢ నమ్మకాల ప్రభావంతో. మరి నేటి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగానూ, ఒకింత విడ్డూరంగానూ ఉంది. వీరి సంతోషంలో వారు అడ్డు తగులుతున్నారని ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా స్వకామ, స్వక్షేమ, స్వలోభ దాహానికి పిల్లల్ని దారి కంపలుగా భావించి తొలగించుకోవాలనుకుంటున్నారు. విచిత్రమేమిటంటే, ఈ వేలం వెర్రి నిరుపేదలకన్నా ధనికుల్లో ఎక్కువగా ఉంది. పామరులకన్నా బాగా చదువు, కొలువున్నవారిలో ఎక్కువగా ఉంది. అల్లాహ్ పై వచనంలో - సంతాన హత్య మహా నేరం, ఆ నేరానికి మీరు పాల్పడకండి అన్నాడు. మరి సంతాన హత్య అంటే కేవలం భ్రూణ హత్యలు మాత్రమే కాదు, సంతానం కలిగిన మీదట చంపడం మాత్రేమే కాదు. అసలు సంతానమే వద్దనుకోవడం దానికి మించిన నేరం, మహా పాపం. నిజంగా దీన్ని మొత్తం మానవాళి హత్యగా పరిగణించాల్సి ఉంటుంది.
డింక్ జీవన విధానపు విపరిణామాలు
వయసొచ్చాక సమస్య - ఉడుకు రక్తం ఉరకలేస్తున్నప్పుడు ఎవరికీ ఎవరి అవసరమూ ఉండదు. కానీ.. ఒక వయసొచ్చాక నా అనుకునేవాళ్లు లేకపోతే.. బాగా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం సొంత పనులు కూడా. చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుండేది పిల్లలే. పిల్లలకు చిన్నప్పుడు అందించిన సంరక్షణకు గాను తిరిగి కృతజ్ఞత చూపించే పిల్లల పల్ల వచ్చే సంతృప్తిని వీరు అసలు అనుభవించలేరు.
భాగస్వామిని కోల్పోతే.. భార్యాభర్తలు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకేసారి చనిపోరు కదా! కాబట్టి వాళ్లలో ఒకరు చనిపోతే.. మిగిలినవాళ్లు ఆ వయసులో తోడులేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చేతిలో డబ్బు ఉండడం వల్ల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. కానీ.. తోడునిచ్చే నీడని మాత్రం కొనుక్కోలేం. కాబట్టి పిల్లలు ఉండడమే ఉత్తమం అంటున్నారు అనుభవజ్ఞులు.
బంధం నిలబడాలంటే పిల్లలే ఆధారం
లైఫ్ పార్టనర్ తో ఏదైనా గొడవైనా, ఇంకేదైనా సమస్య వచ్చినా విడిపోతుంటారు. కానీ,, పిల్లలు ఉంటే విడాకులు తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. విడాకులు తీసుకుంటే పిల్లలు తండ్రి లేదా తల్లి ప్రేమకు దూరమవుతారు. అందుకే భార్యాభర్తల్ని కలసి ఉండేలా చేసేది పిల్లలే అంటారు పెద్దలు. వారే లేకపోతె పెళ్లికి కట్టిన ఆ మావిడాకులు "మా" (మా అబ్బాయి, మా అమ్మాయి) అనే బంధం లేని కారణంగా ఒట్టి విడాకులుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు;
“ఆచరణ రీత్యా అందరికంటే ఎక్కువ నష్టపోయే వారెవరో నేను మీకు తెలుపనా? ప్రపంచ జీవితంలో తమ కృషి, శక్తిసామర్థ్యాలన్నీ సన్మార్గం తప్పి వృధా అవుతున్నా సరే, తాము అంతా మంచే చేస్తున్నామని భావించే వారే ఎక్కువ నష్టపోయేవారు. (అల్-కహఫ్: 103-104)
అయితే,,
అనుకున్నంతనే అన్నీ అయిపోవు. కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే. ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం. ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి. నేటి యువతలో సహించే, భరించే గుణాలు అంతరించిపోతున్నాయి. వాటి స్థానంలో పంతాలు, పట్టింపులు, కోపతాపాలు తిష్ట వేసి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. కుటుంబ వ్యవస్థను కూకటి వ్రేళ్ళతో పెకళించ ప్రయత్నిస్తున్నాయి.
సంసారపు సాగరంలో సాగక తప్పని జీవన యాత్రికులమే మనమందరం ఎవడి నావ వాడిదే...ఎవడి చుక్కాని వాడికే. ఏ శిక్షణా లేని అనుభవమూ తెలియని నావికులమే మనమందరం. సాగరమంటేనే మరి అలల ఒరవడి... ఒకదాని వెంట ఒకటి.. ఒకదాన్ని మించి ఒకటి... ఎప్పుడు ఏ ఉప్పెన ఎటునుండి ముంచుకొచ్చేనో! అయినా అది తప్పని ఎదురీత...భయపడి ఆగిపోయావా.. ధైర్యమని చుక్కానిని వదిలేసినా నట్టనడి సంద్రాన నిట్టనిలువునా మునిగిపోతాం!
తల్లిదండ్రులుగా ఆత్మావలోకనం
నేనతనికి అపార సిరిసంపదలు ప్రసాదించాను. అతడ్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకుల్ని కూడా ఇచ్చాను. సుఖసంతోషాలకు కావల్సిన జీవన సామగ్రి నంతా ఇచ్చాను. (అల్-ముదస్సిర్: 13)
సంతానమంటే అనుగ్రహం మాత్రమే కాదు సంతానమంటే బాధ్యత కూడా. ఆ బాధ్యత గురించి మనందరిని నిలదీయడం కూడా జరుగుతుంది. ఆరోజు ఈ సౌఖ్యాలు, సిరిసంపదలను గురించి మిమ్మల్ని తప్పక నిలదీయడం జరుగుతుంది. (అత్-తకాసుర్: 8)
మనం బాగుండి మన సంతానం కూడా బాగుంటే అది మన జీవిత అలంకారం. మనకు సంతానం పట్ల ప్రేమ మితిమీరినా, వారు త్రోవ తప్పినా అది మన జీవిత పరీక్ష. అదే మన ఆశలు, మన ఆశయాలు వద్దు గానీ ఆస్తులు మాత్రం కావాలనుకునే భార్యా పిల్లలుంటే - అది మన జీవిత ప్రమాదం. ఈ మూడింటిని అల్లాహ్ అందరికి అర్థమయ్యేలా ఖుర్ఆన్లో పేర్కొన్నాడు.
1) ఈ సంతానం, సిరిసంపదలు ప్రాపంచిక జీవితపు అలంకారాలు. (అల్-కహఫ్: 45)
2) నిశ్చయంగా, మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష. మరియు అల్లాహ్! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది. (అత్-తగాబూన్: 15)
3) ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మీ సహవాసులు మరియు మీ సంతానంలో మీ శత్రువులు ఉండవచ్చు! కావున మీరు వారిపట్ల జాగ్రత్త వహించండి. కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత (అని తెలుసుకోండి). (అత్-తగాబూన్: 14)
ఈనాడు మన పిల్లలు ఇలా తయారవుతున్నారంటే దానికి ఎక్కడొక చోట మనం కూడా కారకులం ఏమో - ప్రతి తల్లిదండ్రులు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే, నేల మంచిదయితే పాడి - పంట. నేల చెడ్డదయితే పాడయిన పంట. అదే చెబుతున్నాడు అల్లాహ్.
సారవంతమైన నేల తన ప్రభువు అనుజ్ఞతో పుష్కలంగా మంచి పంటనిస్తుంది. సారంలేని చవిటినేల నాసిరకాన్నే ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మేము కృతజ్ఞులయిన వారి కోసం మా సూక్తులు, సూచనలను మాటిమాటికి విశదీకరిస్తున్నాము. (అల్-ఆరాఫ్: 58)
మమత-సమత మణిదీపమే అమ్మ, అవ్యాజానురాగ ఆపన్న హస్తమే నాన్న. ఒక విత్తనం మొక్కై, చెట్టై, మహావృక్షంగా మారి ఫలవంతం కావాలంటే మొట్టమొదట కావలసింది గాలి, నీరు, ఎండ, ఎరువు కాదు. కావలసింది సారవంతమైన 'భూమి'. ఆ తరువాతే మిగిలినవన్నీ. అలాగే ఒక పిల్లవాడు బుద్ధిమంతుడు, విద్యావంతుడు, విజ్ఞానవంతుడు కావాలంటే 'ఇల్లే' వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పే వేదిక కావాలి. తల్లి తండ్రులే అందుకు ఉత్తమ గురువులుగా మారాలి.
నాన్న నమ్మకం ! అమ్మ నిజం ! నమ్మక, నిజాల ప్రతి రూపం సంతానం . బలాలు ఉన్నట్లే ఎంతటి పేరు ప్రఖ్యాతులున్న మనిషికైనా బలహీనతలూ కొన్ని ఉంటాయి. ఆవి అతడికి పరీక్ష పెడుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో ఇతరులకు పట్టిస్తుంటాయి. వారు ఆ బలహీనతలతో ఆడుకుంటారు. బలహీనతల కారణంగానే మనిషి మరొకరికి లొంగిపోతాడు. ఒకరికి తిండి బలహీనత మరొకరికి నిద్ర, ఇంకొకరికి శారీరక సుఖం... ఇలా ఎన్నో బలహీనతలు. మనిషిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. బలహీనతలను దాటిరావడానికి బలం కావాలి. ధైర్యం కావాలి. దైవశక్తి కావాలి. నిజమైన పరిపూర్ణుడైన మనిషిగా బతకాలంటే బలహీనతలు ఉండకూడదు. శరీరంలో, మనసులో తిష్ట వేసుకున్న వాటిని వెళ్లగొట్టాలి. ముందు అవి బయటకుపోతే అప్పుడు మంచి గుణాలతో నింపుకోవచ్చు.
ఇక సంసారమంటేనె ఎడతెగనీ బాధ్యతల దాడి. బాధ్యతలెన్ని ఎంత బరువైనా.. కష్టాలే కూలదోసినా పడుతూ లేస్తూ... ఆటుపోట్లను అధిగమిస్తూ సంసార సాగరపు ఒడిదుడుకులను తట్టుకుంటూ. పరిస్థితులకు కాలానుగుణంగా ఎదురీదుతూ లక్ష్యాలవైపు ఉరికేవాడే విజయాన్ని పొందగలడు... ముందుకు సాగేకొలది లోతు పెరుగుతుండేది... ఎదురీదగలుగు పోటుగాడికది.. అంతులేని, వెలకట్టలేని ఆనంద నిక్షేపాల భాండాగారం... ఈదలేక వదిలేసే వారిని ముంచేసే విలయం...
అంతిమంగా…
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కర లేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికం గా సంపాదించానా? ఖర్చు పెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్ధం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. ఆ అర్థం, కామానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉన్నట్టే. మనిషి జీవితం సార్థకం అయినట్టే.
విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు సహాయంచేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (మీ కుటుంబాన్ని, పరివారాన్ని) స్థిరంగా ఉంచుతాడు. (ముహమ్మద్: 7)
కుటుంబం బాగుంటేనే సమాజంలో అందరూ బాగుంటారు. అందులో మనం ఉంటాం. అన్యదా విపరిణామాలు వేరే విధంగా, విధ్వంశకరంగా ఉంటాయి జాగ్రత్త!
కాబట్టి - విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీభార్యాపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. దానికి మానవులు, రాళ్ళు సమిధలవుతారు. అక్కడ దృఢకాయులైన, కఠిన (హృదయు లైన) దైవదూతలు (నరక నిర్వాహకులుగా) నియమితులై ఉంటారు. వారు అల్లాహ్ ఆజ్ఞల్ని ఏమాత్రం జవదాటరు. ఏ ఆజ్ఞ వచ్చినా తక్షణమే దాన్ని శిరసా వహిస్తారు. (వారు నరకవాసులతో) “అవిశ్వాసులారా! ఈరోజు మీరు సాకులు చెప్పకండి. మీరెలాంటి కర్మలు చేసుకున్నారో అలాంటి ప్రతిఫలమే మీకివ్వబడుతోంది” అనంటారు. కాబట్టి -
విశ్వాసులారా! మీరు మనస్ఫూర్తిగా అల్లాహ్ కు క్షమాపణ కోరుకోండి. మీ ప్రభువు మీ పాపాలు మన్నించి, మిమ్మల్ని సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆరోజు అల్లాహ్ తన ప్రవక్తకు, అతనితోపాటు విశ్వసించినవారికి ఎలాంటి అవమానాలకు గురి చేయడు. (అత్-తహ్రీమ్: 6-8)
పోతే దైవభీతిపరాయణులు అక్కడ స్వర్గవనాలు, భోగభాగ్యాలలో ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించే మాధుర్యాలను ఆస్వాదిస్తూ సుఖసంతోషాలలో తేలియాడుతారు. వారి ప్రభువు వారిని నరక యాతనల నుండి రక్షించాడు. “ఇక మీరు ఆచరించిన కర్మలకు ప్రతిఫలంగా (నేడు) హాయిగా తినండి, త్రాగండి.” అనబడుతుంది.
వారక్కడ ఆసనాలపై దిండ్లకానుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన (విశాల) నేత్రాలుగల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాం. విశ్వాసులతోపాటు వారి సంతానం కూడా విశ్వాసంలో వారి అడుగుజాడల్లోనే నడచుకొని ఉంటే, వారిని కూడా మేము (స్వర్గంలో) వారి దగ్గరికి చేర్చుతాం. వారి సుకృత ఫలాన్ని మేము ఏమాత్రం తగ్గించం. ప్రతి మనిషీ తనకర్మలకు తాకట్టుగా ఉన్నాడు. (అత్-తూర్: 17-21)
సత్కారాల సుధాఝరి రమజాన్ / Ramadan is a time of blessings.
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
సత్కారాల సుధాఝరి రమజాన్
”అల్లాహ్ భూభాగాల్లో మక్కా భూ భాగాన్ని మహోన్నతమైన భూభాగంగా ఎన్నుకున్నాడు. మాసాల్లో రమజాను మాసాన్ని మహిమాన్వితమైన మాసంగా ఎన్నుకున్నాడు. రోజుల్లో శుభప్రదమయినదిగా శుక్ర వారం రోజును ఎన్నుకున్నాడు. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ను ఘనతరమైనదిగా చేశాడు” అన్నారు ఖతాదః (ర). పై పేర్కొన్న విశిష్టతల్లో రెండు రమజాన్ సంబంధించినవే. అంది వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
విశ్వాస సోదరులరా! అల్లాహ్ మీ ధన, మాన, ప్రాణాలను కాపాడాలని మీరు కోరుకుంటున్నారా? మీకు దైవప్రవక్త నాయకులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి దీవెనలు పొందాలని ఉందా? ప్రపంచంలోని సంపదలకంటే గొప్ప సంపదను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?
”ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన దానిని (ప్రజల వరకు) చేరవేయి….నిశ్చయంగా అల్లాహ్ ప్రజల (కీడు) నుండి నిన్ను తప్పక కాపాడుతాడు”. (మాయిదహ్; 67) ”అల్లాహ్ ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక! ఎవరయితే నా నుండి నా మాటను విని దాన్ని ఇత రుల వరకు చేర వేసాడో”. వేరోక ఉల్లేఖనంలో-”నీ మాధ్యమంగా అల్లాహ్ ఒకే ఒక్క వ్యక్తికి సన్మార్గం చూపినా అది నీ పాలిట ప్రపంచ సకల సంపద లకంటే ఎంతో మేలయినది” అని అన్నారు ప్రవక్త (స).
రమజాను మాసం ధర్మబోధ మాసం కూడా. ఈ మాసం మార్గం మరచి బతకుతున్న అల్లాహ్ దాసుల్ని ఆయన మార్గం వైపునకు ఆహ్వానించాల్సిన బాధ్యత ఒక ముస్లింగా మనందరిపై ఉంది. మన ఈ బాధ్యతను మనం ఓ మంచి మాట ద్వారా అయినా నెరవేర్చగలము. ఒక కరపత్రాన్ని అందజేసి నిర్వర్తించ గలము. ఒక షార్ట్ మెసెజ్ పంపి అయినా చేయగలము. మన పిల్లాడు నిప్పు కుంపటిలో పడిబోతున్నాడని తెలిస్తే మనం ఎంతగానయితే తల్లడిల్లి పోతామో అలాగే మార్గం మరచి జీవిస్తున్నతోటి మానవుల విషయంలో సయితం మనం చలించిపోవాలి. ఇలా మనం చేసిన నాడు అల్లాహ్ కారుణ్య కడలి మన వైపు కదిలొస్తుంది.
విశ్వాస సోదరులరా! అల్‌హమ్దులిల్లాహ్ మనం ఉపవాసాలు పాటిస్తున్నాము. ఖుర్‌ఆన్ పారాయణం చేస్తున్నాము. తరావీహ్ ప్రార్థనల్లో ఎంతో నిష్ఠగా పాల్గొంటున్నాము. దానధర్మాలు విస్తృత స్థాయిలో చేస్తున్నాము. ఇఫ్తార్ కార్యక్రమాలూ జరుపుతున్నాము. తల్లిదండ్రులను సయితం కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. అల్లాహ్ దాసుల్ని అల్లాహ్ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాము. అయినా మన కర్మలు అల్లాహ్ సన్నిధానంలో ప్రవేశ పెట్ట బడటం లేదు. ఎందుకో తెలుసా? వినండి! ”ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్‌తో పాటు అన్యులను సాటి కల్పించని (షిర్క్ చేయని) ప్రతి వ్యక్తికి అల్లాహ్ క్షమాభిక్ష ప్రాప్తిస్తుంది. ఓ వ్యక్తికి తప్ప. అతనికి అతని సోదరునికి మధ్య పగ ఉంది. వారి విషయంలో ఇలా అనబడుతుంది: ”వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని. వీరికి వ్యవధి ఇవ్వండి – వీరు సంధికి రాని. వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని” అని.
నిజంగా సంధికి మించిన సత్కార్యం లేదు. స్వయంగా అల్లాహ్ ఇలా అంటున్నాడు: ”నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. కావున మీ సోదరుల మధ్య సంధి చేయిపించండి”. (హుజురాత్; 10) వేరోక చోట – ”రాజీ పడటం ఎంతో ఉత్తమమయిన కార్యం”. (అన్నిసా: 127) అలాగే మన సమావేశ ఉద్దేశ్యాల్లో ‘ప్రజల మధ్య సంధి చేయించడం కూడా ఒకటి’ అని మనకు తెలుస్తుంది. ప్రవక్త (స) అనేక సందర్భాలలో అనేక సహాబా మధ్య సంధి కుదిర్చిన సందర్భాలున్నాయి. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఅలా సయితం ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదిర్చి, ఆ సంధి కుదర్చ డానికి అపార అనుగ్రహాల్ని ప్రసాదించి మరి వారిరువురిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. కాబట్టి నేడే ఈనాడే మనకు మన సోదరులకు మధ్య ఏదేని విషయంలో వివాదం ఉంటే, వారొచ్చి రాజికి రావాలని ఎదురు చూడటం మాని మనమే వెళ్ళి వారితో సంధి చేసుకోవాలి. ఈ రమజాను మాసం పూర్తయ్యే లోపు ఏ ధార్మిక కారణం లేకుండా ఎవ్వరితోనూ ఎలాిం వివాదం ఉండకూడదు. మనమే వెళ్లి వారికి సలామ్ చేద్దాం. ఆ నిమిత్తం అల్లాహ్ నేర్పిన దుఆను రమజాను మాసం చివరి క్షణం దాకా చేస్తూనే ఉందాం! ”రబ్బనఘ్ఫిర్ లనా వలి ఇఖ్వానినల్లజీన సబఖూనా బిల్ ఈమాన్, వలా తజ్‌అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లజీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్రహీమ్”. వారిలా ప్రార్థిస్తారు: “ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందర్నీ క్షమించు. (యావత్తు)విశ్వాసుల పట్ల మాహృదయాల్లో ఎలాంటి అసూయాద్వేషాలు ఉంచకు. ప్రభూ! నీవు గొప్ప క్షమాశీలివి, అపార దయామయుడవు.” (అల్-హష్ర్: 10) ఆమీన్.
విశ్వాస సోదరులరా! మీకెప్పుడయినా చేయి కాలిన అనుభవం ఉందా? లేదంటే వేలిగే దీపంలో కాసేపు వేలు పెట్టి చూడండి. చురుక్కుమంటుంది. మనస్సు చివుక్కుమంటుంది. అమ్మా! లేదా అబ్బా అన్న శబ్దం అప్రయత్నంగా మీ నోట వెలువడుతుంది. నరకాగ్నిని 70 సార్లు కడిగితే మిగిలిన వేడి మన ప్రపంచపు మొత్తం అగ్నిది. అ అగ్నిలోని కొంతలో కొంత గోరంతి దీప సెగకే విలవిల్లాడి పోతుంటే రేపు నరకాగ్ని సెగకు మనం తట్టుకోగలమా చెప్పండి! అక్కడేమో చర్మాలు కాలిన కొద్ది కొత్త చర్మాలు పుట్టుకొస్తుందాయే! అల్లాహ్ మనందరిన నరకాగ్ని నుండి కాపాడుగాక!
విశ్వాస సోదరులరా! రమజాను మాసం నరక ముక్తి మాసం. ప్రవక్త (స) అన్నారు: ”ప్రతి రోజు అల్లాహ్ కొందరిని నరకాగ్ని నుండి కాపాడుతూ ఉంటాడు”. అలాగే ప్రవక్త (స) సెలవిచ్చిన మాట – ”మిమ్మల్ని మీరు నర కాగ్ని నుండి కాపాడుకోండి! ఒక్క ఖర్జూర ముక్కను దానం చేసి అయినా సరే”. అల్లాహ్ సుబ్హానహూ వ తఅలా ఖుర్‌ఆన్‌లో నరకాగ్నిన్ని వర్ణించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ అంటున్న మాట ఏమిటో తెలుసా? ”ఫ మా అస్బరహుమ్ అలన్నార్ – ఏ విషయం వారిని నరకాగ్ని విషయంలో దుస్సహనానికి పురిగొల్పింది”. (వారెలా నరకాగ్నిని భరించగలరు!?). (బఖరహ్: 176) కాబట్టి నరకాగ్ని యాతన మనల్ని కాపాడే ఎన్ని మార్గాల్ని ప్రవక్త (స) మనకు తెలిజేశారో వాటన్నింటిని అనుసరించి మనం మనల్ని, నరకాగ్ని బారి నుండి కాపాడుకోవాలి. మనల్ని నరకాగ్ని బారి నుండి కాపాడే సాధనాల్లో ఆడకూతుళ్ళ అగ్ర భాగాన ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ వారి యెడల ఉత్తమంగా వ్యవహరించి ఇహపర మేలును మూట కట్టుకోవాలి.
విశ్వాస సోదరులరా! ప్రాంపంచిక విషయంలో మనిషి మహా ఆత్రగాడిలా వ్యహరిస్తాడు. ఒకవేళ అతనికి ఒక బంగారు లోయ దొరికితే ఇంకొకి ఉంటే బావుండు అంటాడు. రెండు లోయలు నిండా బంగారం దొరికితే మూడోది ఉంటే ఇంకా బావుండు అని అంటాడని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఅలా సెలవిచ్చాడు. ప్రాపంచిక పరిమిత ప్రాపర్ట్టీ విషయలో ఇంత ప్రాకులాడితే, పరలోక సిసలయిన, శాశ్వతమయి సత్కార్యాల సామగ్రి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో ఆలోచించండి! మరి మీకు అలాంటి లోయలు నిండిన పుణ్యాలు కావాలనుకుంటున్నారా? మహా పర్వతమంతటి పుణ్యాన్ని సొంతం చేెసుకోవాలనుకుంటున్నారా? ఒక పర్వతం మాత్రమే కాదు మాకు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు… మహా పర్వతాలు కావాలని కోరుకుంటున్నారా? అల్‌హమ్దులిల్లాహ్ ఆ ఏర్పాటు కూడా ఉంది, అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే జనాజా నమాజు చదివి జనాజా వెంట వెళ్ళకుండా ఆగిపోతే అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభిస్తుంది. ఒకవేళ దాని వెంట వెళితే అతనికి రెండు ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుంది. అది విన్న సహాబా ”ఖీరాత్ అంటే ఏమి?” అని ఆరా తీశారు. అందుకాయన (స) – ”ఖీరాత్‌లోని అత్యల్ప భాగం ఉహద్ కొండంతిదై ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (ముస్లిం).
ప్రియా మిత్రులారా! రమజాన్ దానధర్మాల మాసం కూడా. ప్రవక్త ముహమ్మద్ (స) ప్రభంజనం కన్నా వేగంగా దానధర్మాలు చేసేవారు. కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి-దాతృత్వం! స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. అప్యాయంగా కొలుస్తుంది. ఆదర్శంగా భావిస్తుంది. దైవ ప్రవక్తలు, వారి సహచరులు, పుణ్యాత్ములు - ఎప్పుడో కీర్తిశేషులయ్యారు. అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు, శిలా శాసనాలు కావు- శీల స్వభావాలు!
పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. దాన మూడు విధాలు అంటారు పెద్దలు. - శ్రియా దేయం. హ్రియా దేయం. భియా దేయం. దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్టుగా సంతోషంగా దానం చేయడాన్ని శ్రియా దేయం. అంటారు. 'అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం. దానం చేయడం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదు అంది ఖుర్ఆన్. ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుపడుతూ దానం చేయడం ప్రియాదేయమనే మాటకు తాత్పర్యం. ముఖ్యంగా అటుమాభిమానా ధనికులకు, ధర్మ పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి స్థాయికి తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం హ్రియా దేయం అవుతుంది.
ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- భియా దేయం. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సాత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని ధర్మ శాస్త్రం స్పష్టంగా చెప్పింది.
అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం, ఏ మాత్రం దక్కడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యం ఇది.
ఈ మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుంది. చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు అల్లాహ్ కు, స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలి. అంతేకాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దానఫలం దక్కడు సుమా!.
విశ్వాస సోదరులరా! ఓర్పు సహనాల మాసం రమజాన్. ”నిశ్చయంగా సహనంతోనే సమస్య పరిష్కారం ముడి పడి ఉంటుంది” అని ప్రవక్త (స) వారు సెలవిచ్చి ఉన్నారు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఅలా ‘ఓర్పు సహనాలు కలిగి ఉండమని, పరస్పరం సహనబోధ చేస్తూ ఉండాల’ని హితవు పలికాడు. అల్లాహ్ మనల్ని అనేక విధాలు పరీక్షిస్తాడు. భయంతో, ఆకలితో, సంపద లేమితో, సంతాన లేమితో, ఆప్తులను దూరం చేసి. ఆయన పెట్టే అన్ని పరీక్షల్లో మనం ఉత్తీర్ణులవ్వాలంటే మన వద్ద ఉన్న ఏకైక సాధనం సహనం. అలా సహనం వహించిన వారిపై ఆయన దీవెనలు కుండపోతగా కురుస్తాయి.
అందరూ నడిచే దారిన నడవడం లోకసహజం. చిన్న దారిలో నడవడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు కాబట్టి చాలామంది. అలాగే చేస్తారు. అలాంటి వారి జీవితాలూ సాదాసీదాగానే. గడిచిపోతాయి. కానీ కొత్త మార్గం కనుగొని, లేదా ఏర్పరచుకుని వెళ్లడం, భిన్నంగా ఆలోచించడం లాంటి వాటికి పూనుకునేవారు అరుదుగా ఉంటారు. ఇలా చేయడానికి సాహసం, సహనం ఉండాలి. ఎందుకంటే- కొత్త దారిలో ఇబ్బందులు, కష్టాలు ఎదురవ్వచ్చు. తట్టుకుని నిలబడగలిగితేనే విజయాలూ పొందవచ్చు.
నేడు అనేక దేశాల్లో ముస్లింలు దహనీయ స్థితికి లోనయి ఉన్నారు. బతకడానికి కనీస అవసరాలకు సయితం నోచుకోకుండా తల్లడిల్లి పోతున్నారు. కొందరి కళ్ళ ఎదురే వారి కుటుంబాలను తూటాలకు బలి చేస్తూ, ఆపాలని, వారిని కాపాడుకోవాలని మనసు ఎంత ఆరాట పడుతున్నా అడుగెత్తి అడుగు వేయలేని దీనావస్థలో ఉన్నారు పాపం! అల్లాహ్ వారందరికి ఉత్తమ సహనాన్ని ప్రసాదించాలని, వారి సమస్యలను తీర్చి వారిని గట్టున పడేయాలని, విశ్వం మొత్తంలో నివిసిస్తున్న విశ్వాసుల కోసం ప్రార్థనలు చేసి ప్రగాఢ సానుభూతిని చాల్సిన మాసం రమజాన్. అలాగే ఆర్థిక, నైతిక సహాయంతోపాటు ఒకవేళ మన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం మనపై అటువంటి ఆపదలు విరుచుకు పడినా అదరక, బెదరక ప్రాణ త్యాగం చేసైనా ధర్మోన్నతి కోసం పాటు పడతామని గట్టి సంకల్పం చేసుకోవాల్సిన మాసం. ఎందుకంటే, రమజాన్ ఓర్పు సహనాల మాసం మాత్రమే కాదు. అవి నశిస్తే సమర శర పరంపరలు సంధించే మాసం కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటి పోరాట పటిమ పేరే జిహాద్!
Subscribe to:
Comments (Atom)






