Sunday, November 20, 2022

హజ్‌ అంటే…

హజ్‌: ఇంటిని వదలడం, బంధుమిత్రులకు దూరమవడం, కృపాకరుడి దరికి చేరడం, మృత్యువును గుర్తు చేసుకోవడం, అనుగ్రహాలు వర్షంలా కురిసే శుభప్రదమైన ఇంటి వైపునకు పయనించడం.




హజ్‌: అక్కడికి షైతాన్‌ కూడా వస్తాడు. అతని సైన్యమూ ఉంటుంది. హద్దులు మీరే వారూ ఉంటారు. ప్రజలందరూ కలుస్తారు. ప్రతిజ్ఞ మళ్ళీ ధృవ పరచడం జరుగుతుంది ప్రతిజ్ఞకు సాక్ష్యమూ తీసుకోబడుతుంది.
ఇహ్రాం: అలంకరణను వదలటం, కఫన్‌ మాదిరి వస్త్రాన్ని ధరించడం, మృత్యువుకై సదా సిద్ధమవటం, బీదవారిలా కనిపించటం, ఏక దైవారాధనా భావాన్ని మరింత పటిష్టం చెయ్యటం, గుడ్డలే కాక మనసుని అన్ని మాలిన్యాల నుండి కాపాడుకోవటం,
సత్య సందేశాన్ని అందజేస్తామని సంకల్పించుకోవటం, కష్టాల్ని బాధల్ని కలసికట్టుగా ఎదుర్కోవటం, సత్కార్యాల్లో ఒండొకరికి చేయూత నివ్వటం.
తల్‌బియా: లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌, లబ్బైక్‌ లా షరీక లక లబ్బైక్‌, ఇన్నల్‌ హమ్ద వన్నిఅమత లక వల్‌ ముల్క్‌, లా షరీక లక. ఇది అల్లాహ్‌ా ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే నినాదం. ఇది మంచిని పెంచే సూత్రం. చెడును నివారించే మహాస్త్రం. విన్నాము, విధేయులమయ్యాము, హాజరయ్యాము అన్న మాటకి నిర్వచనం.
తవాఫ్‌ : తవాఫ్‌ చేస్తూ జీవితం కూడా ఇలాగే ఆగని పయనం అని గుర్తించటం, అను గ్రహాలు ప్రసాదించమని కోరటం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము, అలసి పోయాము, మమ్మల్ని క్షమించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరడం.
సయీ: ఆజ్ఞాపాలన, అమ్మ (హాజిరా) అడుగుజాడల్లో నడవటం, అల్లాహ్‌ ప్రసన్నతకై పరుగిడటం. సయీ అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. సత్పలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యాన్ని పదింతలు చేస్తుంది. పాపాలని కడిగివేస్తుంది. స్వర్గపు హోదాలను పెంచుతుంది.
అరఫాలో విడిది: హష్ర్‌ మైదానాన్ని తలపించే సువిశాలమైన భూమి. స్పష్టంగా నీలాకాశం. అల్లాహ్‌ నామ స్మరణలో లీనమైన మనసు… రేపటి బహుమానం కోసం ఉబలాటం. కాలం చుట్టివేయబడింది. సమయం ఇమిడి పోయింది. చరిత్ర పునరావృ తమయింది. దాగినది బహిర్గతమయింది. ప్రపంచం నోరు మూసుకుంది. సప్తలోకాలు తదేకంగా ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాయి. సత్యం వచ్చేసింది. అసత్యం నిష్క్రమించింది. అజ్ఞానం తొక్కివేయబడింది. అపమార్గాలు మూసి వేయబడ్డాయి.
 రమీ: అసత్యాన్ని విసిరివేయటం! అసత్యాన్ని తరిమి కొట్టడం! పాశవిక ప్రవృత్తిని వదలివేస్తానని ప్రతిన బూనటం! ఏమీ లేక పోయినా ఈ చిన్న చిన్న కంకర రాళ్ళతో దుష్ట శక్తులపై పోరాడుతానని ప్రతిజ్ఞచెయ్యటం! స్వార్థపరుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దాగి ఉన్న దొంగలనీ అంతం చేసే వరకూ నిద్రపోనని వాగ్దానం చెయ్యటం!
హల్ఖ్‌:   పాపాలని వదలి వేస్తున్నానని తప్పులతో నిండిన శరీరాన్ని శుద్ధ పరచుకుం టాననీ, ఎలాగైతే తల వెంట్రుకల్ని తీసేసానో అలాగే తన జీవితంలో ఉన్న లోపాల్ని దూరం చేసుకుంటాననీ, అవసరమైతే తలనే పణంగా పెట్టగలనని సంకేతం ఇవ్వటం.
నహ్ర్‌: త్యాగధనుడు హజ్రత్‌ ఇబ్రాహీం (అ)కు అనుసరణగా, చెడు మనస్తత్వానికి వ్యతి రేకంగా, తండ్రి ఆజ్ఞాపాలనకు గుర్తుగా, కొడుకు ఇస్మాయీల్‌ (అ) వినయానికి ప్రతీకగా ఇచ్చే ఖుర్బానీ.

Friday, November 18, 2022