Thursday, April 9, 2026

మధురాతి మధురం షాబాన్ మాస ఉపవాసం

ఆరాధన కోసం జీవితంలోని ఒక ప్రత్యేక కాలాన్ని లేదా ప్రత్యేక సంవత్సరాన్ని, లేదా ప్రత్యేక మాసాన్ని లేదా ప్రత్యేక వారాన్ని లేదా ప్రత్యేక దినాన్ని లేదా ప్రత్యేక రాత్రిని నిర్ణయించుకొని మిగతా జీవితమంతా (అల్లాహ్) ఆరాధన పట్ల అశ్రద్ధ చూపడం సరికాదు. మానవ పుట్టుక అసలు ఉద్దేశ్యమే అల్లాహ్ ను ఆరాధించడం కాబట్టి (ఆరాధనకు) యోగ్యమైన వయస్సు నుండి జీవితపు ఆఖరి క్షణాల వరకు గూడా అల్లాహ్ ను ఆరాధిస్తూ గడపాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ అతన్ని స్తుతిస్తూ వుండు. సాష్టాంగ పడేవారిలో చేరిపో. నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చే వరకు. నీ ప్రభువును ఆరాధిస్తూ వుండు”. (హిజ్ర్ : 98 – 99) అందుకే, ఎవరైతే తన జీవిత అసలు లక్ష్యం (అల్లాహ్ ను) ఆరాధించటం అని భావిస్తాడో అతనే సఫలీకృతుడు. అలాకాక, ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని కేవలం తన కోసం, తన ఇంటి వారికోసం ఇహలోకపు తళుకుబెళుకులు సమకూర్చుకోవడంగా భావిస్తాడో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొంద లేడు.
షాబాన్ నెల ఉపవాసాల మహత్యం ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరంతరంగా (ఏమాత్రం విడిచిపెట్టకుండా) ఉపవాసాలు వుండేవారు. ఆయన ఉపవాసాన్ని ఇక వదలరేమో అని మేము అనుకునేవాళ్ళం. అలాగే ఆయన (స) ఒకవేళ ఉపవాసం వదిలేస్తే చాలా రోజుల దాకా మానేసేవారు. చివరికి మాకు – ఆయన ఉపవాసం వుండరేమో అని అనిపించేది. నేను ఆయన్ని రమజాన్ తప్ప మరే నెలలోనూ పూర్తిగా ఉపవాసముండడం చూడలేదు. నేను ఆయన్ని – షాబాన్ నెల కన్నా ఎక్కువగా మరే నెలలోనూ ఉపవాసాలుండడం చూడలేదు. (బుఖారీ, ముస్లిం) ఆయేషా (రజియల్లాహు అన్హ) ఇలా సెలవిచ్చారు: దైవ ప్రవక్త (స)కు ఉపవాసాల కోసం అన్నిటి కన్నా ప్రియమైన నెల షాబాన్ నెల, తదుపరి ఆయన (స) రమజాన్ ఉపవాసాలు వుండేవారు. (అబూ దావూద్: 2431, సహీహ్ -అల్బానీ) నేను దైవ ప్రవక్త (స) ను షాబాన్ నెలలో కన్నా ఎక్కువగా ఏ నెలలోనూ ఉపవాసాలుండగా చూడలేదు. ఆయన దానిలో (షాబాన్ నెలలో) కొద్ది రోజులు తప్ప అన్ని రోజులు ఉపవాసముండేవారు, పైగా ఆయన దానిలో పూర్తిగానే ఉపవాసముండేవారు. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ) షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసముండడంలో దాగి వున్న మర్మం ఉసామా బిన్ జైద్ (రజి) దైవ ప్రవక్త (స)ను నేను మిమ్మల్ని షాబాన్ నెలలో ఉపవాసమున్నంతగా మరే నెలలోనూ చూడలేదు (కారణం ఏమిటి?) అని అడిగారు. దైవ ప్రవక్త (స) జవాబిస్తూ – “రజబ్ మరియు రమజాన్ నెలల మధ్య ప్రజలు ఉపవాసాల గురించి అశ్రద్ధ చూపే నెల ఇది. మరి చూడబోతే, ఈ నెలలోనే ఆచరణలు అల్లాహ్ వైపునకు లేపబడతాయి. మరి నా ఆచరణలు (నేను) ఉపవాసం వున్న స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్ట పడతాను” అని అన్నారు. షబే బరాత్ గురించి ఏది సత్యం? ఏది అసత్యం? షాబాన్ నెలలో ఉపవాసాల మహత్యం గురించి తెలుసుకున్నాక ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ నెల 15వ తారీఖు ప్రాముఖ్యత ఏమిటి మరి? వాస్తవం ఏమిటంటే – సత్యాసత్యాల గురించి ఏమాత్రం పట్టించుకో కుండా ఏ 3,4 విశిష్ఠ రాత్రుల గురించి వివరించడం జరుగుతూ వుంటుందో, వాటిలో షాబాన్ నెల 15వ తారీఖు రాత్రి కూడా ఒకటి. సాధారణంగా దీనిని ‘షబే బరాత్’ అని అంటూ వుంటారు. “అల్లాహ్ – షాబాన్ నెల 15వ తేదీ రాత్రి తన సృష్టితాల వైపునకు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు (ముష్రిక్) మరియు అసూయా పరుడు తప్ప మిగతా సృష్టితాలను అందరినీ క్షమిస్తాడు.” (తిర్మిజి, ఇబ్నె హిబ్బాన్, బైహఖీ) “నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ నెల 15వ తేదీ రాత్రి దాసులపై కరుణతో (దయతో) చూస్తాడు. నిజమైన విశ్వాసులు (మోమిన్)ను క్షమిస్తాడు, అవిశ్వాసులకు గడువు ఇస్తాడు మరియు అసూయాపరులను వారి మనసులను అసూయ నుండి శుద్ధి చేసుకొనే వరకు వదిలేస్తాడు”. (సహీహుల్ జామె లిల్ అల్బానీ : 1898) షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యాన్ని వివరించే ఒకే ఒక్క ప్రామాణిక హదీసు ఇది. ఇది తప్ప సాధారణంగా ఈ రాత్రి మహత్యాన్ని గురించి ధార్మిక సమ్మేళనాల్లో, పత్రికల్లో వివరించబడే హదీసులన్నీ అత్యంత బలహీనమైనవేకాక, కాల్పనికమైనవి కూడా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షరీయతు ఇలాంటి పనికిమాలిన మాటల నుండి ఎంతో పరిశుద్ధంగా వుంది. “ఎంతో శుభవంతుడైన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు ఇహలోకపు ఆకాశంపైకి అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు – నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్థనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకొనేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను”. ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది – “ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.” (బుఖారీ: 1145, 6321, 7494 ముస్లిం: 758) ఈ హదీసు ద్వారా – ప్రతి రాత్రికీ ఈ మహత్యం ఉందని తెలుస్తుంది. మరలాంటప్పుడు దీనిని కేవలం షాబాన్ నెల 15వ రాత్రికి ప్రత్యేకించడం తప్పు మరియు దైవ ప్రవక్త (స) పై అభాండం మోపడమే అవుతుంది. సలాతుల్ అల్ ఫియా ఏ వ్యక్తి అయినా ఈ రాత్రి 100 రకాతుల నమాజులు చదివి ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత ఇఖ్ లాస్ సూరా 10 సార్లు చదివితే – అల్లాహ్ అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఒకవేళ ‘లౌహే మహ్పూజ్’ లో అతను దురదృష్టవంతుడని వ్రాయబడివున్నప్పటికీ, అల్లాహ్ దానిని చెరిపేసి అదృష్టవంతుడని వ్రాస్తాడు. మరియు రాబోయే 1 సం॥ పాటు అతని పాపాలను లిఖించడం జరగదు. “అల్ మౌజుఆత్”లో ఇబ్నుల్ జౌజి ఈ హదీసును గూర్చి ఎన్నో పరంపరలను పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు : ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవ ప్రవక్త (స) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కలిగిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజు చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా (ఏదైనా) ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గూర్చే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు) ‘సలాతుర్రగాయిబ్’ ఇమామ్ నవవీ ఇలా సెలవిచ్చారు: ‘సలాతుర్రగాయిబ్’ గా పేరుగాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషాల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజ్ మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్ లు. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వీటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక. (అల్ మజ్మూఅ లిన్నవవీ: 3వ సంపుటం, 379వ పేజీ) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఇదొక కాల్పనిక తప్పుడు హదీసు. దీనిలో వచ్చిన పుణ్యానికి సంబంధించిన పదజాలం ద్వారా (ఇదొక కాల్పనిక హదీసని) స్పష్టంగా తెలుస్తుంది. (అంతేగాక) బుద్ధి జ్ఞానాలున్న ఏ ఒక్కరు కూడా దీని కాల్పనికతను గూర్చి సందేహించరు. పైగా దీని ఉల్లేఖకులు గూడా అపరిచితులు. (ఫవాయెద్ అల్ మజ్మూఅ: 53వ పేజీ) ముల్లా అలీ ఖారీ వివరించారు : “ఈ బిద్దత్ నమాజ్ మొట్టమొదటగా 448 హి.శ.లో బైతుల్ మఖ్దిస్ నందు సృష్టించబడింది. అగ్ని పూజారులు కొందరు ఇస్లాం స్వీకరించారప్పుడు, వాళ్ళు ముస్లిములతో కలసి నమాజు చేసేటప్పుడు తమ ముందు అగ్నిని మండించేవారు. ఇలా వాళ్ళు ముస్లిములను కూడా సంతృప్తి పరచేవారు మరియు తమ భ్రష్ట విశ్వాసాలపై కూడా ఆచరించేవారు. వీళ్ళు సలాతుల్ అల్ ఫియా నమాజును కూడా ఆవిష్కరించారు. షాబాన్ నెల 15వ రాత్రి వాళ్ళు నమాజు చదువుతూ తమ ముందు అగ్ని మండించేవారు. దీని ద్వారా వారి ఉద్దేశ్యం – అగ్ని ముందు ఎక్కువ సేపు గౌరవంగా నిలవడడం. ఇంకా ఈ అగ్నిని ఆసరాగా చేసుకొని దీని ముసుగులో ఎన్నో చెడు పనులు చేసేవారు. దీనితో ఆ సమయంలోని సజ్జనులు – వీళ్ళు భూమిలోకి దిగద్రొక్కబడతారేమో అని భయపడ్డారు. అందుకే వారు – ఈ బిద్ అత్ ఆచరించబడుతున్న ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళిపోయారు. అంతేగాక, దీని ముసుగులో వారు ఎన్నో నిషేధ కార్యాలను కూడా చేసేవారు“. (తొహ్ ఫతుల్ అహ్వజి- 3వ సంపుటం, 165వ పేజీ) షబే బరాత్ లో ఏం చేయాలి? ఈ రాత్రిలోని సువిశాల మన్నింపు యొక్క అర్హత పొందాలంటే- మనిషి ముందుగా తన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. లాభ నష్టాల యజమాని కేవలం అల్లాహ్ అని గట్టిగా విశ్వసించాలి. కష్టాలను తీర్చేవాడు కూడా కేవలం ఆయనే అని విశ్వసించి కేవలం ఆయనపైనే నమ్మకం వుంచాలి. తమ ఆశలు నెరవేర్చే కేంద్రంగా దర్బారులను, మజార్లను కాక కేవలం అల్లాహ్ ను చేసుకోవాలి. పీర్లకు, సన్యాసులకు భయపడకుండా కేవలం అల్లాహ్ కు భయ పడాలి. మ్రొక్కుబడులు కూడా కేవలం అల్లాహ్ తోనే చేసుకోవాలి. ఆయనను తప్ప మరెవరినీ వేడుకోకూడదు. దీనితోపాటు, తోటి ముస్లిముల పట్ల ఈర్ష్య, అసూయలను వదిలి హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మనిషి సాఫల్యానికి ఇవి ఎంతో అవసరమైన విషయాలు. ఇక దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడమైతే వృధా ఖర్చే. కనుక మన ధర్మం వారించిన ఈ విషయం నుండి గూడా దూరంగా వుండడం తప్పనిసరి. ఆలోచించదగ్గ విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి – “అల్లాహ్ తన దాసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముష్రిక్ మరియు అసూయపరులను తప్ప అందరినీ క్షమిస్తాడు”- అని ఏదైతే సెలవీయబడిందో, అదే మహత్యం సోమవారం మరియు గురు వారాలకు గూడా ఇవ్వబడింది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ప్రతి సోమ మరియు గురువారాల్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. తదుపరి షిర్క్ చేయని, తన సోదరుని పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని ప్రతి వ్యక్తిని క్షమించడం జరుగుతుంది. తమ మధ్య ఈర్ష్య, అసూయ కలిగివున్న ఇద్దరు వ్యక్తులు సంధి చేసుకొనే వరకు వారికి వ్యవధి నివ్వడం జరుగుతుంది“. (ముస్లిం : 2565)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు