Thursday, April 9, 2026

కూడు గూడు గుడ్డ అల్లాహ్ అద్భుత అనుగ్రహాలు

అల్లాహ్ మీకోసం మీగృహాలను ప్రశాంతనిలయాలుగా చేశాడు. ఆయన మీకోసం పశువుల చర్మాలతో తేలికపాటి గుడారాలు (కూడా) నిర్మించాడు. మీరు ప్రయాణంలో ఉన్నా, ఒకచోట బసచేసినా అవి (మోసుకెళ్ళ డానికి) తేలిగ్గా ఉంటాయి. ఆ పశువుల రోమాలతో, ఉన్నితో, వెండ్రుకలతో మీరు ధరించే, వాడుకునే వివిధ వస్తువులు తయారు చేస్తారు. అవి కొంతకాలం వరకు మీకు ఉపయోగపడుతున్నాయి. అల్లాహ్ తాను సృష్టించిన అనేక వస్తువుల ద్వారా మీకోసం నీడ ఏర్పాటు చేశాడు. ఆశ్రయం కోసం కొండలలో గుహలు నిర్మించాడు. ఎండవేడిమి నుండి కాపాడే దుస్తులు సృజించాడు. యుద్ధంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడే దుస్తులు సృజించాడు. మీరు విధేయులైఉంటారనే అల్లాహ్ మీకిలా అనేక ప్రయోజనాలు చేకూర్చి మేలుచేశాడు. (అన్-నహల్: 79-81) మనిషి గౌరవంగా జీవించడానికి కావలసిన ప్రాథమిక వసతులు కూడు, గూడు మరియు గుడ్డ. ఇస్లాం ధర్మం వీటిని కేవలం భౌతిక అవసరాలుగా మాత్రమే చూడదు, వీటిని అల్లాహ్ తన దాసులపై కురిపించిన 'అజీమ్' (గొప్ప) అనుగ్రహాలుగా పరిగణిస్తుంది. కూడు, గూడు, గుడ్డ అనేవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే కావు, ఇవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే సాధనాలు. ఈ మూడు అనుగ్రహాలు ఉన్నవారు ప్రపంచంలో ఎంతో భాగ్యవంతులు.
1. కూడు (ఆహారం మరియు పానీయం) ఇస్లాం ధర్మం ప్రకారం ప్రకారం, ప్రతి ప్రాణికి ఆహారాన్ని అందించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "భూమిపై తిరుగాడే ఏ ప్రాణి జీవనోపాధి బాధ్యత అయినా అల్లాహ్‌పైనే ఉంది." (హూద్: 6) ఆహార పానీయాలు విషయంలో ముఖ్యంగా మూడు మర్యాదల్ని పాటించాలి. ధర్మబద్ధమైన ఆహారం (హలాల్): కేవలం ఆహారం తినడమే కాదు, అది 'హలాల్' (ధర్మబద్ధమైన సంపాదన) ద్వారా వచ్చి ఉండాలని ఇస్లాం నొక్కి చెబుతుంది. సక్రమంగా సంపాదించిన డబ్బుతో అన్నం తింటే, అక్రమంగా సంపాదించిన డబ్బుతో మందులు తింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తే పుణ్యం లభిస్తుంది, భోగబాగ్యాలకు ఖర్చు చేస్తే రోగం వస్తుంది. ఏది ఏమైనా ధర్మ మార్గాన్ని అనుసరిస్తేనే ఆనందం, సంతృప్తి. మన లోపాలను సరిదిద్దుకో కుండా ఇతరుల లోపాలను ఎత్తి చూపడం ఒక మానసిక బలహీనత. మానసిక బలహీనతలు,మనో వికారాలు మనిషి ఏకాగ్రతను మరలిస్తాయి, బలహీనతలు సరిదిద్దుకుని, స్థిర చిత్తంతో ముందుకు సాగడమే జీవిత పరమావధి. కృతజ్ఞత: భోజనం ప్రారంభించే ముందు 'బిస్మిల్లాహ్' అని, ముగించిన తర్వాత 'అల్హమ్దులిల్లాహ్' అని అల్లాహ్‌ను స్తుతించడం ముస్లింల సంప్రదాయం. వృధా చేయరాదు: "తినండి, త్రాగండి కానీ వృధా చేయకండి" (అల్-అరాఫ్: 31) అని ఖురాన్ హెచ్చరిస్తోంది. 2. గుడ్డ (వస్త్రం మరియు అలంకరణ) వస్త్రం అనేది కేవలం నాగరికతకు గుర్తు మాత్రమే కాదు, అది అల్లాహ్ ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. "ఓ ఆదమ్ సంతతివారా! మేము మీ మర్మ స్థలాలను కప్పుకోవడానికి, అలంకరణ కొరకు మీకు వస్త్రాలను ప్రసాదించాము." (అల్-అరాఫ్: 26) మేలిమి దుస్తులు సిగ్గు బిడియాలు: వస్త్రధారణ అనేది మనిషిలోని సిగ్గు మరియు వినయాన్ని ప్రతిబింబించాలి. ఇస్లాం నిర్దేశించిన పద్ధతిలో శరీరాన్ని కప్పుకోవడం తప్పనిసరి. తఖ్వా వస్త్రం అత్యున్నతమైంది: పైన పేర్కొన్న ఖురాన్ ఆయతులో అల్లాహ్ ఇంకా ఇలా అన్నాడు: "అన్నింటికంటే ఉత్తమమైన వస్త్రం తఖ్వా (దైవభీతి) వస్త్రం". అంటే బాహ్య సౌందర్యం కంటే మన అంతరంగం పరిశుద్ధంగా ఉండటం ముఖ్యం. 3. గూడు (నివాసం మరియు ఆశ్రయం) మనుషులు ఎండ, వాన, చలి నుండి రక్షణ పొందడానికి ఇల్లు ఒక సురక్షితమైన కోట వంటిది. "అల్లాహ్ మీ ఇళ్లను మీకు ప్రశాంత నిలయాలుగా చేశాడు." (అన్-నహ్ల్: 80) శాంతి నిలయం: ఇల్లు కేవలం ఇటుకల నిర్మాణం కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, కరుణ మరియు ప్రశాంతతను ఇచ్చే స్థలం. ఇల్లు అంటే గోడల సముదాయం కాదు, ప్రేమతో నిండి ఉండే హృదయాల నివాసం. ఇల్లు ఒకటే కాదు – మనసు మమకారంతో ఉండే చోటేదైనా ఇల్లు అవుతుంది. ఇల్లు అనేది అద్దం - మన జీవితాన్ని, మన విలువలను ప్రతిబింబించే చోటు. ఇల్లు అంటే నలుమూలల మధ్య కాదు, మన ప్రేమ మధ్య ఉంది. ఇల్లు అంటే ఒక్క చోటు కాదు - అది మనం దాచుకున్న జ్ఞాపకాల నిలయం. నైతిక రక్షణ: ఇల్లు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యతను (Privacy) కాపాడుతుంది. పరాయి కంటి చూపు నుండి కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇల్లు ఒక కవచం. సామాజిక బాధ్యత: చుట్టూ అన్నీ ( కూడు, గూడు, గుడ్డ మరియు కావలసినంత ధనం ) ఉన్నా, మనుష్యులు ఎందుకు బాధతో, దు:ఖం తో ఉంటారు? ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటారు? అంటే, స్వచ్చమయిన విశ్వాస లేమితోపాటు సాధారణంగా మనుష్యులు మూడు రకాల భావనలతో, ఆలోచనలతో (కోరికలతో) ఉంటారు. అవి ఏమంటే, ఏ వస్తువైనా, జీవి అయినా, అది నాది, లేదా 'మనది, లేదా 'అందరిది అని. 1. ' నాది ' అంటే, నా ఇల్లు, నా బైకు, నా బిడ్డ, నా కొడుకు, నా భార్య లేదా నా భర్త అనే భందంలో, నా స్వంతం అనే భావనలో ఉంటారు. తమకు ఇష్టమైన వస్తువులపై , కుటుంభ సభ్యులపై అమితమైన ప్రేమతో ఉంటారు . నా వస్తువు లేదా నా వారు అనే స్వార్ధం ఉంటుంది. కుటుంభంలో తమను గుర్తించాలి, విలువను ఇవ్వాలి అని కోరుకుంటారు. తాము ఆ విధంగా భావించింది, తమకు కావాల్సింది, తాము కోరుకున్నది, తాము ఇష్ట పడినది, ఎప్పుడైతే తమకు కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో, అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి. మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు. మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది. దు:ఖం పొంగి పొర్లు తుంది. అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు. అనారోగ్యం పాలు కావచ్చు. ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు. లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు. దీనికి కడు పేదలు కోట్లకు పడగలెత్తిన కుబేరులు అన్న తేడా లేదు. 2. 'మనది ' అంటే , మన కుటుంభ సభ్యులది , మన స్నేహితులది , మన కాంప్లె క్ష్ వారిది లేదా మన కాలనీ వాసులది , లేదా మన ఉద్యోగులది , మన వర్గానికి సంభందించినది అనే భావన . ' నాది ' అనేది ఒక వ్యక్తికి సంభందించిన దైతే ' మనది ' అనేది ఒక సమూహానికి సంభందించినది . ఇక్కడ కూడా , ఎప్పుడైతే తాము అనుకున్నది జరుగకుండా , కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి . మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు . మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది . దు:ఖం పొంగి పొర్లు తుంది . అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు . లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు. ఇందులో కూడా ధనికులు, దరిద్రులు అన్న తేడా లేదు. 3. ఇక మూడోది 'అందరిది' . 'అందరిది' అంటే అందరూ సమానంగా అనుభవించాల్సింది . ఇవి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు, సంపదలు, వసతులు, సంక్షేమ పధకాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సదు పాయాలు, రక్షణ మొదలైనవాటిని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా, ఎప్పుడైతే తాము అనుకున్నది జరుగకుండా, కాకుండా పోతుందో లేదా కనపడకుండా పోతుందో లేదా దూరమై పోతుందో , అప్పుడు మనిషిలో ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి . మనస్సు ఒక చోట స్థిమితంగా ఉండదు . మనిషికి ఎనలేని బాధ కలుగుతుంది . దు:ఖం పొంగి పొర్లుతుంది. అదే రందితో మంచాన పడ వలసి రావచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు . ఆ కారణంగానే గుండె పోటు లేదా పక్ష వాతం రావచ్చు . లేదా మరి కొందరు ఆత్మ హత్యలు చేసు కోవచ్చు . ఇక మరి కొందరు , అసహనం పెరిగి అసాంఘీక శక్తులుగా మార వచ్చు . వీరు సాధారణంగా లీడర్లు , జాతీయ నాయకులై ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:"ఎవరైతే తన ఇంట్లో భయం లేకుండా (శాంతిగా) నిద్రలేస్తాడో, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటాడో, ఆ రోజుకు సరిపడా ఆహారం అతని వద్ద ఉంటుందో, అతనికి ఈ లోకపు సంపద అంతా దక్కినట్లే." (తిర్మిజీ) ఈ మూడు అనుగ్రహాల్ని మస్తుగా అనుభవిస్తున్న మనం ఈ అనుగ్రహాలకిగాను అల్లాహ్ కు వేనవేల కృతజ్ఞతలు తెలుపుకోవడమేకాక, ఈ అనుగ్రహాలను నోచుకోని అనేక మంది అభాగ్యుల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. సాదేమయిన కార్యాచరకు శ్రీకారం చుట్టాలి. పొరుగువారికి ఆకలిగా ఉన్నప్పుడు తాను కడుపునిండా తిని పడుకునేవాడు విశ్వాసి కాదని ప్రవక్త (స) హెచ్చరించారు. అంటే మన గూడులో మనం సుఖంగా ఉన్నప్పుడు, మనం నిండు వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు, మన కడుపారా భోంచేస్తున్నప్పుడు సమజాంలోని బడుగు బలహీన ప్రజల గురించి తప్పకుండా ఆలోచించాలి. అల్లాహ్ తన దాసులకు ప్రసాదించిన అతిపెద్ద అనుగ్రహాలలో 'ఇల్లు లేదా నివాసం' ఒకటి. అలవాటు పడిపోవడం వల్ల మనం ఈ గొప్ప వరాన్ని అప్పుడప్పుడు మరచిపోతుంటాము. మనుషులు అలసిపోయినప్పుడు విశ్రాంతి కోసం ఇళ్లకు చేరుకుంటారు. లోకంలో ఇల్లు లేని వారు ఎందరో ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పడుకునే ముందు ఈ దువా చదివేవారు: అనస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) నిద్రించడానికి తన మంచంపైకి వెళ్ళినప్పుడు ఈ విధంగా దుఆ (ప్రార్థన) చేసేవారు: "అల్-హమ్దు లిల్లాహిల్లజీ అతమానా వ సఖానా, వ కఫానా వ ఆవానా, ఫ కమ్ మిమ్మన్ లా కాఫియా లహు వ లా ముఅ్వీ" "మాకు ఆహారాన్ని మరియు పానీయాన్ని ప్రసాదించిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. ఆయనే మాకు సరిపోయినవాడు మరియు మాకు ఆశ్రయం కల్పించినవాడు. లోకంలో ఎందరో ప్రజలు ఉన్నారు, వారికి రక్షించేవారు (అవసరాలు తీర్చేవారు) ఎవరూ లేరు మరియు ఆశ్రయం ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు." (సహీహ్ ముస్లిం) ఈ మూడు అనుగ్రహాల పట్ల మన బాధ్యత కృతజ్ఞత-ప్రతి ముద్ద తింటున్నప్పుడు, తల దాచుకోవడానికి ఒక నీడ ఉన్నందుకు, వంటిపై బట్ట ఉన్నందుకు అల్లాహ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనసు కలుషితం అయితే స్వార్ధం తోడవుతుంది స్వార్ధ పూరితమైన వ్యక్తిత్వం పతనానికి దారి తీస్తుంది. కోరికలు అదుపులో ఉన్న మనసు సంతృప్తి తో సంపన్నమవుతుంది.… మనసు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే మానవత్వం వికసిస్తుంది. మనసు సానుకూల స్పందన కలిగి ఉంటే సంతోషాలకు నిలయం అవుతుంది. అలాంటి మనసున్న మనుషులు ఉండే ఇల్లు ఆనందాల హరివిల్లవుతుంది.. మౌనాన్ని మించిన బలం లేదు విజ్ఞానాన్ని మించిన ఆయుధం లేదు సహనాన్ని మించిన సంస్కారం లేదు. సహాయాన్ని మించిన ఔదార్యం లేదు. వీటిని ఆచరించిన వ్యక్తిత్వానికి మించిన సంపదే లేదు. ధర్మం వలన నిబద్ధత, జ్ఞానం వలన పరిశుద్ధత, వినయం వలన విధేయత, ఐహిక అనాసక్తత వలన ఆధ్యాత్మికత పొందగలిగిన వారే ప్రజ్ఞా వంతులు. సంతోషానికి ఆధారం విశాలమైన ఇల్లు సంతోషానికి ఒక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "ముస్లిం యొక్క సౌభాగ్యం (సంతోషం) మూడు విషయాలలో ఉంది: విశాలమైన ఇల్లు, మంచి పొరుగువాడు, సౌకర్యవంతమైన వాహనం." (అహ్మద్) - మన పూర్వీకుల ఇళ్లు మట్టితో, తాటి ఆకులతో ఉండేవి. వర్షం వస్తే కూలిపోతాయేమో అన్న భయం ఉండేది. కానీ నేడు మన ఇళ్లు అన్ని సౌకర్యాలతో సురక్షితంగా ఉన్నాయి. ఇంట్లో శుభం కలగాలంటే: అల్లాహ్ స్మరణ (జిక్ర్): అల్లాహ్ స్మరణ ఉండే ఇల్లు సజీవమైనది, లేనిది నిర్జీవమైనది (మృతదేహం వంటిది). ప్రవేశించేటప్పుడు అల్లాహ్ పేరు స్మరించడం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: "ఒక వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు అల్లాహ్ పేరు స్మరిస్తే, షైతాన్ తన అనుచరులతో 'మీకు ఇక్కడ రాత్రి బస లేదు, భోజనం లేదు' అని చెబుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు అల్లాహ్ పేరు స్మరించకపోతే, షైతాన్: 'మీకు రాత్రి బస దొరికింది' అని అంటాడు. భోజన సమయంలో కూడా అల్లాహ్ పేరు స్మరించకపోతే, 'మీకు బస మరియు భోజనం రెండూ దొరికాయి' అని అంటాడు." (ముస్లిం) ఇంట్లోని వారికి సలాం చేయడం: ఇంట్లో బరకత్ రావడానికి మరో కారణం, ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులకు సలాం చేయడం. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా సెలవిచ్చాడు: "మీరు ఇళ్లలో ప్రవేశించినప్పుడు, అల్లాహ్ తరపున నిర్ణయించబడిన శుభప్రదమైన మరియు పవిత్రమైన అభివాదాన్ని (సలాంను) మీలో మీరు తెలుపుకోండి." (సూరా అనూర్: 61) ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులకు సలాం చేయడం వల్ల బర్కత్ కలుగుతుంది. అబూ ఉమామా అల్-బాహిలి (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:"ముగ్గురు వ్యక్తులకు అల్లాహ్ స్వయంగా పూచీకత్తు (జామీన్) ఇస్తాడు (అంటే వారు అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటారు)." వారిలో ఒకరి గురించి ప్రవక్త ఇలా చెప్పారు: "సలాం చేస్తూ తన ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తి, అతను అల్లాహ్ యొక్క రక్షణ మరియు సంరక్షణలో ఉంటాడు." (అబూ దావూద్) ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పఠించాల్సిన దుఆ అబూ మాలిక్ అల్-అషరీ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "ఒక వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ విధంగా వేడుకోవాలి: 'అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి, వ ఖైరల్ మఖ్రజి, బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్నా, వ అలల్లాహి రబ్బినా తవక్కల్నా' (ఓ అల్లాహ్! నేను నీతో ఉత్తమమైన ప్రవేశాన్ని మరియు ఉత్తమమైన నిష్క్రమణను వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతోనే మేము ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే మేము బయటకు వెళ్ళాము మరియు మా ప్రభువైన అల్లాహ్ పైనే మేము నమ్మకం ఉంచాము.) - దీని తర్వాత తన కుటుంబ సభ్యులకు సలాం చేయాలి." (అబూ దావూద్) ఇళ్లలో శుభం కలగడానికి ఖురాన్ పఠనం ఇళ్లలోకి అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను (బరకత్) తీసుకువచ్చే మార్గాలలో ఖురాన్ పఠనం అత్యంత ముఖ్యమైనది. 1. సూరహ్ అల్-బఖరహ్ ప్రాముఖ్యత: అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:"మీ ఇళ్లను స్మశానాలుగా మార్చుకోకండి. ఏ ఇంట్లో అయితే 'సూరహ్ అల్-బఖరహ్' పఠించబడుతుందో, ఆ ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు." (ముస్లిం) 2. సూరహ్ అల్-బఖరహ్ చివరి రెండు వచనాల (ఆయాత్) గొప్పతనం: ఒకవేళ ఎవరైనా పూర్తి సూరహ్ అల్-బఖరహ్ పఠించలేకపోతే, కనీసం దాని చివరి రెండు వచనాలనైనా పఠించాలి. నుమాన్ బిన్ బషీర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:"నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించడానికి రెండు వేల ఏళ్ల పూర్వమే ఒక గ్రంథాన్ని రాశాడు. అందులోని రెండు వచనాలతో 'సూరహ్ అల్-బఖరహ్'ను ముగించాడు. ఏ ఇంట్లో అయితే మూడు రాత్రుల పాటు ఈ రెండు వచనాలు పఠించబడతాయో, ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా షైతాన్ రాలేడు." (తిర్మిజీ) సారాంశం: జీవకళ ఉన్న ఇల్లు: ఖురాన్ చదివే ఇల్లు ప్రాణం ఉన్న ఇంటిలా ఉంటుంది, చదవని ఇల్లు స్మశానంలా నిశ్శబ్దంగా, చీకటిగా ఉంటుంది. రక్షణ: సూరహ్ అల్-బఖరహ్ పఠనం వల్ల ఇల్లు మరియు కుటుంబ సభ్యులు షైతాన్ ప్రభావం నుండి రక్షించబడతారు. చివరి రెండు ఆయత్‌లు: పడుకునే ముందు సూరహ్ అల్-బఖరహ్ చివరి రెండు వచనాలు (ఆమన రసూలు...) చదవడం వల్ల అపారమైన పుణ్యం మరియు రక్షణ లభిస్తుంది. ఇళ్లలో నఫిల్ నమాజులు చదవటం వల్ల కలిగే శుభాలు ఇళ్లలోకి అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను (బరకత్) తీసుకువచ్చే మరో ముఖ్యమైన కారణం: ఇంట్లో నఫిల్ (ఐచ్ఛిక) నమాజులను ఎక్కువగా చదవడం. 1. ఇంటికి నమాజులో కొంత భాగాన్ని కేటాయించండి జాబిర్ (ర) కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (స) ఇలా అన్నారు:"మీలో ఎవరైనా మసీదులో తన (ఫర్జ్) నమాజును పూర్తి చేసుకుంటే, తన నమాజులో కొంత భాగాన్ని (నఫిల్ నమాజులను) తన ఇంటి కోసం కూడా కేటాయించాలి. ఎందుకంటే, ఆ నమాజు ద్వారా అల్లాహ్ ఆ ఇంట్లో శుభాన్ని (ఖైర్) ప్రసాదిస్తాడు." (ముస్లిం) 2. ఇంట్లో చదివే నఫిల్ నమాజ్ యొక్క గొప్పతనం ఇంట్లో చదివే నఫిల్ నమాజుకు లభించే పుణ్యం, మసీదులో లేదా ప్రజల ముందు చదివే దానికంటే 27 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులలో ఒకరు ఇలా తెలిపారు: "ఒక వ్యక్తి తన ఇంట్లో చదివే నఫిల్ నమాజ్, ఇతరుల ముందు చదివే నఫిల్ నమాజ్ కంటే శ్రేష్ఠమైనది. ఇది ఏ విధంగా అంటే, ఒంటరిగా చదివే నమాజ్ కంటే జమాఅత్‌తో (సమూహంగా) చదివే నమాజ్ ఎంత శ్రేష్ఠమైనదో, అటువంటి గొప్పతనం దీనికి ఉంది." (ఇబ్న్ అబీ షైబా) ఆపద కాలంలో ఇల్లు: ఒక సురక్షితమైన ఆశ్రయం సమాజంలోకల్లోలాలు, కష్టాలు మరియు చెడులు పెరిగినప్పుడు, ఇల్లు అనేది ఒక ధర్మబద్ధమైన ఆశ్రయంగా మరియు సురక్షితమైన స్థానంగా మారుతుంది. 1. మోక్షం లేదా సాఫల్యం పొందే మార్గం ఉక్బా బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు) ఇలా అడిగారు: "ఓ అల్లాహ్ ప్రవక్తా! మోక్షం (నజాత్) ఎలా లభిస్తుంది?" దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: "నీ నాలుకను అదుపులో ఉంచుకో, నీ ఇల్లు నీకు సరిపోవాలి (అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండు), మరియు నీ పాపాలను తలచుకుని కన్నీరు కార్చు." (తిర్మిజీ) 2. కల్లోలాల (ఫితనాల) నుండి రక్షణ అబూ మూసా అల్-అషరీ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:"కల్లోలాలు చెలరేగినప్పుడు ఒక మనిషికి కలిగే భద్రత ఏమిటంటే, అతను తన ఇంటికే పరిమితమై ఉండటం." (దైలమీ) చివరి మాట: జీవితం అనే పుస్తకం లో - సంవత్సరం అనే పుటల్లో - ఆశలు అనే రంగులతో -భవిష్యత్తు అనే కలంతో - ధర్మ దస్తూరి అనే నడవడికతో ఈ నూతన (2026)పేజీని మధురమైన అనుభూతులతో నింపాలని ఆ శుభకరుడయిన అల్లాహ్ ను వేడుకుంటున్నాను. చెక్కతో పాటే చెక్కను కోసే రంపం కూడా అల్లాహ్ సృష్టే, శిలతో పాటు శిలను శిల్పంగా మలిచే ఉలి కూడా అల్లాహ్ సృష్టే. నీరూ సృష్టే నీరుని దాటే పడవా సృష్టే. నిప్పు సృష్టే, భిన్న విభిన్న వస్తుసామగ్రిని తయారు చేసే నిప్పులకొలిమీ అల్లాహ్ సృష్టే. పరిష్కారం లేని సమస్యే లేదు, చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం ద్వారా ఏ సమస్యకయినా పరిష్కారం సాధ్యమే. గ్రంధ పఠనం ప్రహసనం కాకూడదు. గ్రంధాలలోని పరమార్థం గ్రహించి దైనందిన జీవితంలో ఆచరించి తోటి వారిని ప్రభావితం చేయగలిగితే పఠనానికి సార్ధకత చేకూరుతుంది. పరిణితితో ప్రయత్నించి చూడండి విజయం చిరునామా తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతుంది.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు