అల్లాహ్ ను ఖురాన్ మరియు హదీసుల్లో పేర్కొనబడిన ఏ పవిత్ర పేరు పెట్టయినా పిలవచ్చు. సృష్టికర్త, కరుణామయుడు, పాలకుడు, పోషలుడు, విశ్వ కార్య నిర్వాహణా కర్త... ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటి మాత్రం నిజం. ఈ సృష్టి వెనకాల అనంతమైన శక్తి ఉంది. ఈ భూమ్మీద కోట్ల జంతువులు ఉన్నాయి. మరియు కొన్ని బిలియన్ల మనుషులు ఉన్నారు. ఇంతమందిలో ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండడం ఎలా సాధ్యమైంది ? దేవుడు మాత్రమే అది చేయగలడు. అనంతమైన సృజనాత్మకతకి దైవం మూలం. మనం రోజు సార్లు అల్లాహ్ ను ఆరాధిస్తే ఓ అనిర్వచనీయమైన అనంతమైన శక్తి మనంలో చోటు చేసుకుంటుంది. . మనకు రోజు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలు వస్తాయి. మన ప్రార్థనలు పరిష్కారాలు ఇస్తాయి.
ఈనాడు సమాజంలో భక్తి పాత్ర తరిగి భుక్తి పాత్ర పెరిగింది. ప్రతి పని వెనుక, ప్రతి మాట వెనుక, ఏదో ఒక ప్రాపంచిక ప్రయోజనం ఉంటుందని, ఉండాలని ఆశించే వారికి నమాజు మహిమ అర్ధం కాదు. అలాంటి వారికి వారి చిత్తశుద్ధి లేని ప్రార్ధనల వల్ల మోక్షం కూడా లభించదు. ప్రార్ధన అంటే రుకూ, సజ్దాలా వంటి వివిధ భంగిమలు మాత్రమే కాదు. ఎందుకంటే ? అజ్ఞానం, అహంభావాల వల్ల మూసుకుపోయున అంతశ్చక్షువుల్ని తెరిపించడమే ప్రార్ధన ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటి ధారలతో సాష్టాంగ పడుతుండేవారు. ఆ తరువాత అనర్హులు, అయోగ్యులు వారికి వారసులయ్యారు. వారు నమాజుని వదిలేసి మనోవాంఛలకు బానిసలైపోయారు." (విద్యుఖుర్ఆన్ 19:58,59)
“మరికొందరు మా సూక్తులు విన్పించి హితోపదేశం చేయగానే సజ్జా చేస్తారు." (వికుర్ఆన్ 3215)
(కరుణామయుని నిజ భక్తులు) అసత్యానికి ఎన్నడూ సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వారు పనికిమాలిన విషయం మీదుగా పోవలసివస్తే దాన్ని పట్టించుకోకుండా హుందాగా, గౌరవప్రదంగా దాటి వెళ్తారు. వారికి వారి ప్రభువు సూక్తులు విన్పించి హితోపదేశం చేయడం జరిగితే వారు అంధులుగా, బధిరులుగా వాటిపై పడిపోరు. (దివ్య ఖుర్ఆన్ 23: 79)
అల్లాహ్ పవిత్ర నామాల్లో అలీమ్, ఆలిమ్, అల్లామ్ అనే నామాలు కూడా ఉన్నాయి. అంటే జ్ఞానానికి మూలం అల్లాహ్ అని అర్థం. ఎంతటి ఉద్దండ పండితుడైనా తనకు తెలిసిన విషయాన్ని సౌమ్యంగా తెలియజేసి, ఎంతో వినయంగా చివర్లో వల్లాహు అఅలము బిస్సవాబ్ (అల్లాహ్ కు మాత్రమే వాస్తవ జ్ఞానం ఉంది) అని చెప్పటం ఆనవాయితీ. మన శరీరంలో ఎన్నో పనులు వాటికవే జరుగుతాయి. మన శరీరంలోనే కాదు, ఈ ప్రకృతిలో ప్రతిదీ అల్లాహ్ ఆనతో దానికి అదే జరుగుతుంది. చీమల్లో, చెట్లలో, కీటకాలలో, జంతువుల్లో మరియు మనుషుల్లో విజ్ఞానాన్ని మనం చూస్తాం. మన శరీరానికి, ఆ చీమలకి ఎవరూ ఈ జ్ఞానాన్ని నేర్పలేదు. ఈ జ్ఞానానికి మూలం దైవం. మనం ప్రార్థన చేస్తే అల్లాహ్ యొక్క జ్ఞానకృపలతో అనుసంధానమయ్యి మనలోకి మరింత జ్ఞానాన్ని వచ్చేలా చేస్తుంది. మనం ఆరాధన ద్వారా అల్లాహ్ కు దగ్గర అయినప్పుడు గొప్ప ఆలోచనలు, భావాలు, మంచి మాటలు మన జీవితాన్ని ప్రభావంతంగా మలచడమే కాక ఈ ప్రపంచం మీద గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
“తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని స్మరిస్తారు. ఆహంకారంతో విర్రవీగరు. వారు రాత్రిళ్ళు బాగా మేల్కొని దైవారాధనలో గడుపుతారు. ఆశతో, భయంతో తమ ప్రభువును వేడుకుంటారు." (కలం 92 100 ఒక మనిషి నమాజుని తెలిసో తెలియకో సక్రమంగా చేయకపోతే.... ఏమిటి? ఇలాగేనా నమాజు చేసేది? అని కసురుకోకండి. నమాజు ముగిసాక పక్కన తీసుకెళ్ళి చక్కగా విడమరచి చెప్పండి. ఒకసారి ఒక గిరిజన వ్యక్తి దైవప్రవక్త(స) దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన మస్జిద్లో కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తికి మూత్రం వచ్చింది. మస్జిద్ మర్యాదలు పాపం అతనికి తెలియవు. అక్కడే నిలబడి మూత్రం పోయసాగాడు. అతన్ని దండించే ఉద్దేశ్యంతో నలువైపుల నుంచి అక్కడున్న ప్రవక్తగారి సహచరులు చుట్టుముట్టారు. ఈ దృశ్యాన్ని గమనిస్తున్న ప్రవక్త(స), "అతన్ని మధ్యలో ఆపకండి. ఒక దోలు నీరు తెచ్చి పోయండి. అల్లాహ్ మిమ్మల్ని ఉనికిలోకి తీసుకు వచ్చింది. సౌలభ్యాల కోసమేగాని సంకట స్థితిని సృష్టించడానికి కాదు సుమా!" అని మందలించారు.(బుఖారీ)
మనందరికీ చుట్టూ ఒక చట్రం ఉంటుంది. ఆ చట్రంలో ఆలోచనలు, ఎమోషన్స్ మరియు శక్తి నిండి ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ చట్రం శుభ్రపడుతుంది. దృఢంగా మారుతుంది. అలాంటి చట్రం మనకు ఎన్నో లాభాలు చేకూర్చుతుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. మానసిక ప్రశాంతతను రోగనిరోధకశక్తిని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. దీనికిగాను మనం అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు ఆశ,భయం, ప్రేమ మదినిండా గూడు కట్టుకోవాలి. ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా అంటుంది; విశ్వాసులారా! మీరు గనక భయభక్తుల వైఖరి అవలంబిస్తే అల్లాహ్ మీకు మంచీ చెడుల విచక్షణాజ్ఞానం ప్రసాదిస్తాడు; మీలో ఉన్న చెడుగులు తొలగిస్తాడు; మీ తప్పులు మన్నిస్తాడు. అల్లాహ్ అపార దయామయుడు. (అన్ఫాల్ - 29)
ఓ మనిషి తాగుడికి అలవాటుపడి, లేదా ఇతర వ్యసనాలకి బానిసై జీవించాడు. తరువాత పశ్చాత్తాపం చెంది మస్జిద్ కు వస్తే అతని ఈ భయం భక్తీ ఎన్నాళ్ళు ఉంటుందనీ? ఇది ఉడతా భక్తి లాంటిదేనని వెక్కిరించకండి. అతనిలో వచ్చిన ఆ మార్పుకి అతన్ని అభినందించండి. మరింత మంచిగా మారేందుకు దోహదపడే ప్రోత్సాహాన్నివ్వండి.
"ఇక్రమా'నే తీసుకోండి. ఇతను ఇస్లాం మరియు ముస్లిములకు బద్ద విరోధి. దైవ విరోధి అయిన అబూజహల్ కుమారుడు. ముస్లింగా మారక పూర్వం తన తండ్రిలానే దైవప్రవక్త(స) ను అదేపనిగా వేధిస్తుండేవారు. మక్కా విజయం అనంతరం దైవప్రవక్త(స)కు భయపడి మక్కా నుండి యమను పారిపోయాడు. అప్పటికే ఇస్లాం స్వీకరించిన అతని భార్య యమన్ వెళ్ళి దైవ ప్రవక్త(స) గారి మన్నింపుల వైఖరిని గురించి వివరించింది. తన భర్త చేత ఇస్లాం స్వీకారం చేయించి దైవప్రవక్త(స) గారి సమక్షంలో తీసుకు వచ్చింది. దైవప్రవక్త(స) "ఇక్రమా" ను చూడగానే ఆనందంతో లేచి గబగబా అతని వైపుకు వెళ్ళారు. ఆ తొందరలో ఆయన(స) భుజంపైన కండువా సయితం జారి పోయింది. ఆ సమయంలో ఆయన నోట వెలువడిన మాటలివి! | " ఓ మరలి వచ్చిన వాడా! నీ రాక శుభప్రదమవుగాక! " (మిశ్కాత్)
అవును! హృదయం లోపల పశ్చాత్తాప భావం ఏర్పడ్డాక అంత త్వరగా చెదిరిపోదు. కాకపోతే ఒక మనిషిలో ఉన్నది. స్వచ్ఛమైన విశ్వాసమా? లేదా పరిసరాల ప్రభావమా? లేక ప్రదర్శనా భావమా? అని సందేహం కలగవచ్చు. ఆరాధనను కేవలం ఓ ఆచరణా రీతిగా చూసే సమాజంలో ఇలాంటి అనుమానాలు రావటంలో ఆశ్చర్యం లేదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు : " వారు ప్రార్ధన చేయడానికి లేస్తే వళ్ళు విరుచుకుంటూ చాలా బద్దకంతో లేస్తారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టవలసి వస్తే ఏడ్పు ముఖంతో చాలా అయిష్టంగా ఖర్చు పెడతారు. "(దివ్య ఖుర్ఆన్ - 9:54)
మానవునికి మేమేదైనా అనుగ్రహిస్తే అతను మాకు విముఖుడయి పోతాడు. పైగా అహంకారంతో విర్రవీగుతాడు. కాని అదే కష్టమొచ్చినప్పుడు సుదీర్ఘప్రార్థనలు చేస్తాడు. (ఫుస్సిలత్- 51)
మనలో చాలామంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అల్లాహ్ ను ఆరాధిస్తారు. దేవుడు అద్భుతాలు చేసి మన కష్టాలని తొలగిస్తాడని అనుకుంటాము, సందేహం లేదు. కానీ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే అల్లాహ్ మనకు ఆలోచన, శక్తి, జ్ఞానం ఇచ్చి మన సమస్యలను మనమే పరిష్కరించుకునేలా చేస్తాడు. ఆలోచనలకు తగినట్టు ప్రవర్తించడం మన బాధ్యత. అల్లాహ్ మనకు శరీరాన్ని ఆత్మను ఇచ్చాడు వాటి ద్వారా మనకు కావలసిన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. మనం బద్ధకంగా పడుకుని లేదా కాలయాపన చేస్తూ, లోకాన్ని, లోకుల తీరుని చూస్తూ గడిపేస్తూ అల్లాహ్ వచ్చి మన సమస్యలను తీర్చేస్తాడు అనుకోవడం పొరపాటు. దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటి మీద పనిచేయడం మన బాధ్యత.
కొన్నిసార్లు తెలియకుండానే మనం నెగిటివ్ ఆలోచనల్ని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. మనం ప్రతి రోజూ అయిదు సార్లు అల్లాహ్ ను ఆరాధిస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పోయేలా చేసి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది ఆధ్యాత్మికంగా స్నానం చేయడం లాంటిది. ఇది మన ఆత్మని నూతన శక్తితో నింపి రోజు ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఖురాన్ ఇలా అంటోంది; (సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన (నమాజ్) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసిఉందని, ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే దైవభీతిపరులకు మాత్రం ప్రార్థన (నమాజ్) చేయడం కష్టమేమీ కాదు. (బఖరః - 45-46)
కాని వీటన్నిటికీ అతీతంగా ఏర్పడే భక్తి భావన భాషకి అందదు. లోకం కళ్ళతో చూస్తే అది అర్ధం కాదు. ప్రాపంచిక విషయాలన్నిటికీ అతీతంగా అల్లాహ్ పట్ల ఏర్పడే భక్తి ఓ నిరంతర ధ్యానం.
" విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. వారు తమ నమాజులో ఎంతో అణకువ, నమ్రతలు పాటిస్తారు. పనికి మాలిన విషయాలకు చాలా దూరంగా ఉంటారు. తమ సంపద నుండి జకాత్ (పేదల ఆర్ధిక హక్కు, చెల్లిస్తారు...వారు తమ అప్పగింతలు, ప్రమాణాలు, ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. తమ నమాజులను క్రమం తప్పకుండా, నియమబద్ధంగా పాటిస్తారు.
అలాంటి వారే మహోన్నత స్వర్గానికి వారసులవుతారు. వారక్కడ కలకాలం (హాయిగా) వుంటారు. (దివ్యఖుర్ఆన్ 23: 10-11)
ఇలాంటి ధ్యాన స్థితిలో మనం ఉన్నామా? ఉంటే గనక మన జీవితం ధన్యం

