Sunday, October 20, 2013

అర్కానుస్సలాహ్‌ (నమాజు యొక్క మూలాధారాలు)



అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: '' ఓ విశ్వాసులారా రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి తద్వారా మీరు సఫలీకృతులవుతారు.'' (హజ్‌-77) 
ఐ పి సి తెలుగు విభాగం

 ప్రతి విషయంలోని రుక్న్‌ అనేది పునాది లాంటిది. మరి నమాజులో రుకూ, సజ్దా మొదలైనవి నమాజు మూలాధారాలు అనబడతాయి.మరి నమాజులోని ఈ అర్కాన్లు సంపూర్ణంగా, సరైన భంగిమలతో, సరైన క్రమపద్ధతిలో, జిబ్రయీల్‌ (అ) నుండి  దైవప్రవక్త ముహమ్మద్‌(స)ను నేర్పిన విధానం ప్రకారం లేక పోయినప్పుడు ఆ నమాజు నమాజు కాజాలదు.  నమాజులో 13 అర్కాన్లు ఉన్నాయి. వాటన్నింటిని వేరువేరుగా ఇక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాము:

 సంకల్పం.
'  ప్రతి కార్యపు ప్రారంభంలో  మనసులో కలగాల్సిన భావనను సంకల్పం అంటారు, అంటే సంకల్పం చేసుకునే చోటు మనస్సు. కనుక మనసులో సంకల్పించుకోవడం అవసరం. నమాజు చదువుటకు నిలిచినపుడు తక్బీరె తహ్‌ారీమ పలికే టప్పుడు ఏ నమాజు, ఎన్ని రకాతులు అనేది హృదయంలో సంకల్పించుకోవాలి. అంతేగాని దానిని నోటితో పలకాల్సిన అవసరం లేదు.దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి''. (బుఖారి 1, ముస్లిం 1907)

 ఫర్జ్‌ నమాజులలో శక్తి గలవాడు నిటారుగా నిలవడం.

ఇమ్రాబ్‌ బిన్‌ హుసైన్‌(ర) ఈ విధంగా తెలియజేశారు:  నాకు మొలల వ్యాధి ఉండేది, నేను దైవప్రవక్త(స) వద్దకు వెళ్ళి నమాజ్‌ (ఎలా చదవాలనే)విషయం గురించి ప్రశ్నించాను, దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ''నమాజ్‌ను నిలబడి చేయండి. ఒకవేళ నిలబడి చేయలేకపోతే కూర్చుని చేయండి. ఒకవేళ కూర్చుని చేసే శక్తి కూడా లేకపోతే ప్రక్క ఆధారంగా పరుండి చేయండి.'' (బుఖారి 1066)
 మనిషి చక్కగా,నిటారుగా నిలబడి ఉంటే ఖియామ్‌ అనబడుతుంది. ఎలాంటి కారణం లేకుండా మోకాళ్ళను ముట్టుకునేలా మనిషి వంగితే అతని నమాజు భంగమైపోతుంది. ఎందుకనగా అతను నమాజులోని ఒక రుకున్‌(భాగం) అకారణంగా చేయలేదు. ఒకవేళ ప్రారంభంలో నిలబడి, తరువాత మనిషికి ఏదో ఒక కారణంగా నిలబడటం కష్టమైనప్పుడు అతను మిగతా నమాజు మొత్తం కూర్చోని చేయవచ్చును. ఇక్కడ ఫర్జ్‌ నమాజులలో మాత్రమే నిలబడటాన్ని తప్పనిసరి చేసారు. కావున మితగా నమాజులన్నింటికి ఈ షరతు వర్తించదు.అనగా మిగతా నమాజులలో నిలబడి నమాజ్‌ చేసే శక్తి ఉన్నా కూడా కూర్చొని చేస్తే అభ్యంతరం లేదు నమాజు అయిపోతుంది. కాకపొతే నిలబడి చదువుటకు వీలున్నవారు నిలబడి చదవటం ఉత్తమం.

 దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: ''నిలబడి నమాజు చేయడం ఉత్తమం, కూర్చొని చదివే వ్యక్తికి నిలబడి చదివే వ్యక్తిలోని సగం పుణ్యం లభిస్తుంది. పరుండి చదివే వ్యక్తికి కూర్చొని చదివే వ్యక్తికి లభించే పుణ్యంలో సగం పుణ్యం లభిస్తుంది''. ( బుఖారి 1065)

 తక్బీరతుల్‌ ఇహ్రామ్‌ (తక్బీరె తహ్రీమ)

 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:'' వుజూ నమాజుకు బీగంచెవి, మరియు తక్బీర్‌తో నమాజులో ఇతర కార్యాలు నిషిద్ధమవు తాయి. మరియు సలాంతో ఇతర కార్యాలు ధర్మసమ్మతమవుతాయి''.  (తిర్మిజి 3, అబూదావూద్‌61)
తక్బీరె తహ్రీమలో 'అల్లాహు అక్బర్‌' అనే పదం తప్పనిసరిగా పలకాలి. అలాగే అల్లాహ్‌ా సిఫాత్‌లను కలిపి పలకటంలో అభ్యంతరం లేదు. ఉదాహరణకు: 'అల్లాహు అల్‌అక్బర్‌' 'అల్లాహుల్‌ జలీలు అక్బర్‌'. కాని అల్లాహ్‌ా యొక్క సిఫాత్‌ కాకుండా ఉదాహరణకు ''అల్లాహువల్‌ అక్బర్‌'' అనటం, లేదా పదాలను మార్చి''అక్బరుల్లాహ్‌ా'' అని అనటం సమ్మతం కాదు. ఎందుకనగా మనకు దైవప్రవక్త(స) ఆదేశాలను అనుసరించాలని ఆజ్ఞాపించబడినది.మరియు దైవప్రవక్త(స) తక్బీరె తహ్రీమ లో ''అల్లాహు అక్బర్‌'' అనే పదాన్నే పఠించారు.
తక్బీరె తహ్రీమ  షరతులు:
   (అ) నిలబడి పలకాలి. నిలబడుతున్నప్పుడు, పూర్తిగా నిలబడక ముందే మధ్యలోనే పలికితే చెల్లదు.
   (ఆ)  ముఖం ఖిబ్లా వైపు ఉండాలి.
   (ఇ) అరబీ భాషలోనే పలకాలి. అరబీలో పలకటం సాధ్యం కాని వ్యక్తి మరియు వెంటనే ఆ పలుకులు నేర్చుకొనుటకు సాధ్యపడని వ్యక్తి కొద్ది రోజుల వరకు తాత్కాలికంగా అనువాదాన్ని పలుకవచ్చును కానీ వీలైనంత తొందరగా నేర్చుకొనటం తప్పనిసరి.
   (ఈ) చెవిటివాడు కాకపోతే పూర్తి పదం అతను వినేటట్లుగా పలకాలి.
   (ఉ) సంకల్పానికి ఇది జతై ఉండాలి.

సూరతుల్‌ ఫాతిహా చదవటం:
 ఎలాంటి నమాజు అయినా సరే ప్రతి రకాతుకి ఇది రుక్న్‌ (మూలం).

 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''ఎవరయితే నమాజులో ''ఫాతిహతుల్‌ కితాబ్‌'' (సూరతుల్‌ ఫాతిహా) పఠించలేదో అతని నమాజు నెరవేరదు.'' (బుఖారి 723)
 ''బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం'' సూర ఫాతిహాలోని ఒక ఆయతు. ''బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం'' పఠించకుండా సూర ఫాతిహా పఠిస్తే నెరవేరదు. దైవప్రవక్త(స) ''బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం''ను ఒక ఆయతుగా లెక్కించారని ఉమ్మెసలమా (ర) తెలియ జేశారు. ( ఇబ్ను ఖుజైమహ్‌ ఈ హదీసు ప్రామాణికమైనదని తెలిపారు)

సూరతుల్‌ ఫాతిహా చదువటకై షరతులు:
 (అ) చదివేవాడు వినగలిగేవాడైతే అతనికి వినబడేటట్లుగా చదవాలి.
 (ఆ) సూర ఏ క్రమంలో అవతరించబడిందో ఆ ప్రకారమే వాక్యాలన్నీ క్రమంగా, సరైన ఉచ్చారణతో చదవాలి.
 (ఇ) సూర అరబీలోనే చదవాలి. అనువాదం చదివితే నెరవేరదు.ఎందుకంటే అనువాదం ఖుర్‌ఆన్‌ కాదు. నమాజ్‌ చదివే వ్యక్తి ఏదో కారణంగా సూర ఫాతిహా చదవటం సాధ్యం కానప్పుడు అతనికి కంఠస్తం ఉన్న ఇతర ఏడు ఆయతులు చదవవచ్చు. ఒకవేళ ఖుర్‌ఆన్‌లోని కొంచమైనా కంఠస్తం లేనప్పుడు సూర చదివేటంత సేపు జిక్ర్‌ చేసి రుకూ చేయవలెను.
 (ఈ) సూరతుల్‌ ఫాతిహా ఖియామ్‌లో (నిలబడి) చదవాలి. సూర పూర్తిగా చదవక ముందే రుకూలో వెళ్తే అతని పారాయణం భంగమవును. అతను మళ్ళీ పూర్తి చేసుకోవాలి.

రుకూ:
 షరీఅత్‌ పరిభాషలో రుకూ అనగా వంగుట. రుకూ చేసేటప్పుడు రెండు అరచేతులు పైకి భుజాల వరకు ఎత్తి, పిదప రెండుకాళ్ళు ముదుకులపై రెండు అరచేతులను పెట్టి నడుమును వంచవలెను.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: '' ఓ విశ్వాసులారా రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి తద్వారా మీరు సఫలీకృతులవుతారు.'' (హజ్‌-77)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''తరువాత రుకూ చేయి నీవు రుకూ స్థితిలో ప్రశాంతత పొందే వరకు''(బుఖారి 724,ముస్లిం 397)

 రుకూ షరతులు:
 (అ) పైన తెలుపబడిన విధంగా వంగాలి. అంటే అరచేయి మోకాళ్ళ వరకు చేరాలి. ఆ వంగటం రుకూ ఉద్దేశంతో తప్ప మరేమీ ఉద్దేశం ఉండకూడదు. ఉదాహరణకు ఏదో భయం వలన వంగి తరువాత అలాగే రుకూలో సాగిపోదామనుకుంటే అతని రుకూ చెల్లదు. అతను పైకి నిలబడి తరువాత రుకూ సంకల్పంతో మళ్ళీ వంగాలి.
 అబూ హుమైద్‌ అస్సాదీ (ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని తెలుపుతూ: ''.....ఆయన(స) రుకూ చేసినప్పుడు తమ రెండు చేతులతో మోకాళ్ళను పట్టుకున్నారు. తరువాత వీపును చక్కగా ఉంచారు....'' అని తెలిపారు. (బుఖారి 794)
 (ఆ) ''తమానీనహ్‌'' (ప్రశాంతత) అంటే కనీసం రుకూలో చదవాల్సిన తస్బీహ్‌ా చదివినంత వరకు వంగి ఉండటం.

 అబూ సయీద్‌ అల్‌ ఖుద్రీ(ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: ''దొంగలలో అందరికంటె చెడ్డవాడు నమాజులో దొంగతనము చేసేవాడు'' నమాజులో దొంగతనము అంటే ఏమిటి అని అనుచరులు ప్రశ్నించగా దైవప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు:'' రుకూను, మరియు సజ్దాలను పూర్తిగా సరిగా చేయనివాడు.'' (అహ్మద్‌)
 రుకూ చేసే సరైన విధానం ఏమిటంటే రుకూ చేసేవాడు తన మెడ మరియు వీపును సరిసమానంగా పైకి క్రిందికి లేకుండా  ఉంచి వంగాలి. రెండు పిక్కలను ధృడంగా నిలబెట్టాలి, రెండు చేతులతో రెండు మోకాళ్ళను పట్టుకోవాలి మరియు మూడు సార్లు ''సుబ్‌హాన రబ్బియల్‌ అజీం'' అని పలికినంత వరకు అదే భంగిమలో ఉండాలి.

హుజైఫా(ర) ఈ విధంగా తెలియజేశారు:''నేను ఒక రాత్రి దైవప్రవక్త(స)తో పాటు నమాజు చేసాను...... తరువాత ఆయన(స) రుకూ చేసి ''సుబ్‌హాన రబ్బియల్‌ అజీం'' అని పలికారు, ఆ తరువాత సజ్దా చేసి ''సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా'' అని పలికారు.'' (ముస్లిం 772)

 రుకూ తరువాత నిటారుగా నిలబడటం. (ఖౌమా)
ఈ నిలబడటం రుకూను సజ్దా నుండి వేరుపరుస్తుంది:
 ''ఆయిషా(ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని వివరిస్తూ అన్నారు: రుకూ స్థితి నుండి తల పైకెత్తిన తరువాత అప్పటికప్పుడే సజ్దాలోకి వెళ్ళకుండా నిటారుగా నిలబడే వారు.'' (ముస్లిం 498)
 ఒక వ్యక్తి అశ్రద్ధగా నమాజు చేశాడు, దైవప్రవక్త(స) అతన్ని నమాజు విధానం నేర్పుతూ ఇలా అన్నారు: ''... తరువాత రుకూ నుండి తల పైకెత్తి ప్రశాంతంగా నిలబడు.'' (బుఖారి 724, ముస్లిం 397)
 నిటారుగా నిలబడుటకై షరతులు:
 (అ) రుకూ తరువాత ఆరాధనా ఉద్దేశంతో తప్ప ఇతర ఏ ఉద్దేశంతోనయినా నిటారుగా నిలబడరాదు.
 (ఆ) అల్లాహ్‌ పవిత్రను పొగిడేటంత సమయం వరకు ప్రశాంతంగా నిలబడాలి.
 (ఇ) ఎక్కువ సేపు అర్థరహితంగా నిలబడరాదు. సూరఫాతిహా చదివితే ఎంతసేపు అవుతుందో అంతకంటే ఎక్కువగా నిలబడరాదు. ఎందుకంటే ఈ రుక్న్‌ (రుకూ తరువాత నిలబడటం)కి సమయం తక్కువ.

ప్రతి రకాతులో రెండుసార్లు సజ్దా చేయటం:
 షరీఅత్‌ పరిభాషలో ''సజ్దా'' అంటే నమాజీ సజ్దా చేసే స్థలంపై నుదుటిని ఆనించటం.
 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ''.....రుకూ సజ్దాలు చేస్తూ ఉండండి...'' (హజ్‌ 77)
అశ్రద్ధగా నమాజు చదివిన వ్యక్తికి దైవప్రవక్త(స) ఉపదేశిస్తూ ఇలా అన్నారు: ''... తరువాత సజ్దా చేయండి. సజ్దా చాలా నింపాదిగా చేయండి. సజ్దాలోనుంచి తలపైకెత్తి హాయిగా కూర్చోండి. ఆ తరువాత రెండవ సజ్దా చేయండి. ఈ సజ్దా కూడా నింపాదిగా చేయండి....'' ( బుఖారి724, ముస్లిం 397)

సజ్దా షరతులు:
(అ) నుదురు భూమిని తగులుతున్నప్పుడు బహిర్గతంగా ఉండాలి.
(ఆ) ఏడు అవయవాలపై సజ్దా చేయవలెను.
దైవప్రవక్త(స) ప్రవచించారు:'' నాకు ఏడు ఎముకల (అవయవాల) ఆధారంగా 'సజ్దా' చేయమని ఆదేశించబడింది- తన చేతుల సైగతో తెలిపారు-నుదురు మరియు ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు.''  (బుఖారి779,ముస్లిం 490)
 కాకపోతే ఈ అవయవాలలో నుదురు తప్ప మరే అవయవాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.
 (అ) వీలైనంతవరకు పాదములను నిలబెట్టాలి. ఇలా చేయటం దైవప్రవక్త(స) విధానాన్ని అనుసరించటం అవుతుంది.
 (ఆ) కదులుతూ ఉండే బట్టలపై సజ్దా చేయరాదు.
 (ఇ) సజ్దా సమయంలో ఆరాధనా ఉద్దేశంతో తప్ప మరే ఇతర కారణంతో- ఉదాహరణకు భయం మొదలైన కారణాలతో
      సజ్దా చేయరాదు.
 (ఈ) సజ్దా చేసే స్థలంపై నుదురును ఆనిస్తూ తలభారాన్ని నుదుటిపై పడేలా చేయాలి.
 (ఉ) సజ్దా స్థితిలో కనీసం ఒక్కసారైనా దైవనామస్మరణ చేసేటంత సమయం వరకు ప్రశాంతంగా ఉండాలి.

 పూర్తి 'సజ్దా' విధానం ఏమిటంటే 'అల్లాహు అక్బర్‌' అంటూ 'సజ్దా' చేయాలి.సజ్దా చేసేటప్పుడు ముందుగా రెండు చేతుల్ని నేల మీద మోపి తర్వాత మోకాళ్ళు క్రింద పెట్టాలి. సజ్దాలో ముక్కును, నదుటిని, అరచేతుల్ని కాళ్ళ వ్రేళ్ళను నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు లేదా చెవులకు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. మోచేతులు ప్రక్కటెముకలకు తగలకుండా ఎడంగా ఉంచాలి. వీపుని ఏ మాత్రం వంచకుండా తిన్నగా ఉంచాలి. కాలి వ్రేళ్ళను వంచి ఖిబ్లా దిశగా ఉంచాలి. ఇలా సజ్దా చేస్తూ ''సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా'' అని మూడు సార్లు పఠించాలి.

 అబూ హుమైద్‌ అస్సాదీ(ర) దైవప్రవక్త(స) నమాజు విధానాన్ని వివరిస్తూ ఇలా అన్నారు:''...దైవప్రవక్త(స) సజ్దా చేసేటప్పుడు రెండు చేతుల్ని పూర్తిగా విప్పకుండా,పూర్తిగా ముడిచేయకుండా మధ్యలో ఉంచారు. మరియు తమ రెండు కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లావైపునకు వంచారు.'' (బుఖారి 794)
స్త్రీలకు పైన తెలుపబడిన నియమాలలోని కొన్ని నియమాలపై మినహాయింపు కలిగించబడినది. స్త్రీలు సజ్దా చేయు సమయంలో తన శరీరాన్ని అణుచుకోవలెను.

 ఒకసారి దైవప్రవక్త(స) వెళ్తుండగా ఇద్దరు మహిళలు నమాజు చదువుతుండటాన్ని గమనించారు. తరువాత వారిద్దరికి ఇలా అన్నారు: ''మీరు సజ్దా చేసేటప్పుడు మీ శరీరాన్ని భూమివైపు అణచండి ఎందుకనగా మీరు సజ్దా చేసే విషయంలో మగవారి లాంటివారు కాదు.'' (బైహఖీ 223/2)

రెండు సజ్దాల మధ్య కూర్చోవటం. (జల్సా)
 ప్రతి రకాతులో ఇలా రెండు సజ్దాల మధ్య కూర్చోవటం తప్పనిసరి.
నమాజులో అశ్రద్ధ వహించిన వ్యక్తిని దైవప్రవక్త(స)ఇలా ప్రవచించారు: ''...సజ్దాలోనుంచి తలపైకెత్తి హాయిగా కూర్చోండి...''
                                                                                   (బుఖారి 724, ముస్లిం 397)
 రెండు సజ్దాల మధ్య కూర్చునుటకై షరతులు:
 (అ) ఆరాధన ఉద్దేశంతో కూర్చోవాలి, ఇతర కారణాల వల్ల- ఉదాహరణకు భయం మొదలైన కారణాన అలా చేస్తే చెల్లదు.
 (ఆ) చాలా సమయం వరకు అనగా తషహ్హుద్‌లో కూర్చోవటంకంటే ఎక్కువగా సమయం కూర్చోకూడదు.
 (ఇ) కనీసం దుఆ చదివినంత వరకు ప్రశాంతంగా కూర్చోవాలి.

 ఆఖరి జులూస్‌:
   అనగా నమాజులోని చివరి రకాత్‌లో సలాంకి ముందు కూర్చోవటం.
 ఆఖరీ జులూస్‌లో తషహ్హుద్‌:

ఇబ్నె మస్‌వూద్‌(ర) ఈ విధంగా తెలియజేసారు:'' మేము దైవప్రవక్త(స)తో పాటు నమాజు చదివేటప్పుడు అస్సలాము అలల్లాహ్‌ా-అస్సలాము అలా జిబ్రయీల్‌, అస్సలాము అలా మీకాయీల్‌, అస్సలాము అలా ఫులాన్‌ అని అంటుండేవారము. అప్పుడు దైవప్రవక్త(స) మనవైపు ముఖం చేసి- నిశ్చయంగా అల్లాహ్‌ాయే శాంతి కావున మీలో ప్రతిమనిషి నమాజులో కూర్చున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహ్‌ా.... చదవాలి అని అన్నారు.''(బుఖారి5806,ముస్లిం402)
క్లుప్తమైన అత్తహియ్యాత్‌ పలుకులు: ''అత్తహియ్యాతు లిల్లాహి,అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, సలామున్‌ అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ వ అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌''.
 హదీసు గ్రంథాలలో 'అత్తహియ్యాత్‌' పలుకులు చాలా రకాలుగా తెలుపబడ్డాయి, అవన్నీ ప్రామాణికమైనవే. ఇమామ్‌ షాఫయి(రహ్మ) దగ్గర ఉత్తమమైన అత్తహియ్యాత్‌ పలుకులు:

ఇబ్నెఅబ్బాస్‌ (ర) ఈ విధంగా తెలియజేశారు, దైవప్రవక్త(స) మాకు తషహ్హుద్‌ పలుకులు ఖుర్‌ఆన్‌లోని సూరాను నేర్పినట్లు నేర్పించారు, ఆ పలుకులు : అత్తహియ్యాతుల్‌ముబారకాతు, అస్సలవాతుత్తయ్యిబాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌.'' ( ముస్లిం 403)

తషహ్హుద్‌ చదివేటప్పుడు క్రింద ఇవ్వబడే విషయాలను దృష్టిలో పెట్టుకోవలెను:
 1.అతను సక్రమంగా వినగలవాడైతే అతనికే వినబడేలా చదువ వలెను.
 2.క్రమంగా పలుకుల్నీ చదువుకుంటూ ముందుకు సాగవలెను. మధ్యలో చాలాసేపు వరకు నిశబ్దంగా ఉండటం, లేదా ఇతర దుఆలు చదవటం వలన నమాజు భంగం అవుతుంది, కనుక అతను మళ్ళీ తషహ్హుద్‌ను క్రమంగా చదవవలెను.
 3. తషహ్హుద్‌ కూర్చొని చదువ వలెను. ఏదైనా కారణం వల్ల కూర్చొని చదివే శక్తిలేకపోతే వీలుపడినట్లుగా చదువుకుంటే సరిపోతుందు.
 4.అరబీ భాషలోనే పఠించాలి. ఒకవేళ అరబీ భాష సాధ్యపడకపోతే దాని అనువాదాన్ని ఏభాషలోనైనా చదవవచ్చు కానీ వీలైనంత తొందరగా అరబీలోనే ఆ పలుకులు నేర్చుకోవటం వాజిబ్‌.
 5.తషహ్హుద్‌ చదివేటప్పుడు మఖారిజ్‌ అనగా ఉచ్చారణ విధానాలను దృష్టిలో పెట్టుకొని చదవవలెను. ఎందుకంటే సరైన ఉచ్చారణ లేకపోవటం వలన లేక అశ్రద్ధ వహించిన వలన పలుకుల అర్థం మారిపోతే అత్తహియ్యాతు చెల్లదు. అతను మళ్ళీ అత్తహియ్యాతు ప్రారంభం నుండి చదవాలి.
 6. తషహ్హుద్‌ పలుకులు  హదీసులలో తెలుపబడిన క్రమంలోనే చదువవలెను.

 ఆఖరి తషహ్హుద్‌ తరువాత దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించటం:
  అనగా పైన తెలుపబడిన తషహ్హుద్‌ పలుకులు పఠించిన తరువాత సలాం పలికే ముందు దరూద్‌ పఠించాలి.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ''నిశ్చయంగా అల్లాహ్‌ా, ఆయన దూతలు కూడా దైవప్రవక్త(స)పై కారుణ్యాన్ని పంపిస్తున్నారు, ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి.''(అహ్‌జాబ్‌56)

ఇబ్నె మస్‌వూద్‌(ర) ఉల్లేఖనంలో దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపించే విధానం గురించి ప్రశ్న ఏమిటంటే : ఓ దైవప్రవక్తా మేము నమాజు చదువుతున్నప్పుడు మీపై దరూద్‌ ఎలా పఠించాలి? దైవప్రవక్త(స) సమాధానంగా దరూద్‌ పలుకులు నేర్పించారు.... (హాకిం 988)
 పై ఉల్లేఖనం ప్రకారం దరూద్‌ పఠించే సందర్భంలో నమాజు ఒకటి. నమాజు చివర్లో కూర్చున్నప్పుడు తషహ్హుద్‌ చదివిన తరువాత దరూద్‌ పఠించటం వాజిబ్‌.

దైవప్రవక్త(స) ఇలా తెలియజేశారు: ''మీలో ఎవరయినాసరే దుఆ చేయసాగినపుడు తొలుత మీ ప్రభువును ప్రశంసించాలి, కొనియాడాలి. తరువాత దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపాలి. ఆ తరువాత మీరు కోరుకున్నదల్లా అర్థించవచ్చు.'' (తిర్మిజి,3475, అబూదావూద్‌ 1481)
 దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించే క్లుప్తమైన పలుకులు: '' అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌''.
 పూర్తి పలుకులు: ''అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌ వ అలా ఆలి ముహమ్మద్‌ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, వ బారిక్‌ అలా ముహమ్మద్‌ వ అలా ఆలి ముహమ్మద్‌ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఫిల్‌ ఆలమీన ఇన్నక హమీదుమ్మజీద్‌.''
 దరూద్‌ పఠించుటకై షరతులు:
1. వినే సామర్థ్యంగల వ్యక్తి అయితే అతను మాత్రమే వినేలా చదవాలి.
2.దరూద్‌లో ముహమ్మద్‌, రసూల్‌ లేక నబీ పదాలనే ఉపయోగించాలి. అహ్మద్‌ అనే  పదం ఉపయోగిస్తే చెల్లదు.
3.దరూద్‌ అరబీ భాషలోనే పఠించాలి.
4. దరూద్‌ పలుకుల్ని క్రమంగా పఠించాలి. మరియు తషహ్హుద్‌ తరువాతనే దరూద్‌ పఠించాలి.  తషహ్హుద్‌కి ముందు దరూద్‌ పఠిస్తే చెల్లదు.

 మొదటి సలాం:

సలామ్‌ పలికే విధానమేమిటంటే నమాజ్‌ చదివే వ్యక్తి కుడివైపు ముఖం  త్రిప్పి ''అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహ్‌'' అని పలకాలి.
అలీ(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: '' నమాజ్‌కు తాళం చెవి తహారత్‌, తక్బీర్‌ పలకటం వలన ఇతర కార్యాలు నిషిద్ధం అవుతాయి. మరియు సలాం పలకటంతో ఇతర కార్యాలు హలాల్‌ అవుతాయి.'' (అబూదావూద్‌61)
 సలాం పలుకుటకు చిన్న పదము: ''అస్సలాము అలైకుమ్‌'' ఒక్కసారి.
 సలాం పలుకుటకు పూర్తి పదము: ''అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహ్‌'' రెండు సార్లు. ఒకసారి కుడివైపు, రెండోసారి ఎడమ వైపు.
సఅద్‌(ర) ఈ విధంగా తెలియజేశారు:'' నేను దైవప్రవక్త(స)ని కుడివైపు, ఎడమవైపు సలాం పలుకుతుండగా చూసాను, నాకు ఆయన(స) వారి చంక తెల్లదనం కనిపించేది.'' (ముస్లిం 582)

ఇంతవరకు తెలుపబడిన కార్యాలన్నీ క్రమంగా పాటించాలి.
 క్రమంగా పాటించడమంటే సంకల్పం మరియు తక్బీరె తహ్రీమహ్‌తో ప్రారంభించాలి, తరువాత సూరతుల్‌ ఫాతిహ, రుకూ, నిటారుగా నిలబడటం, సజ్దా......... ఇలా ఒకదాని తరువాత ఒకటి క్రమంగా పాటించడం.
 ఒకవేళ నమాజ్‌ యొక్క అర్కానులు(మూలాధారాలు) ఉదేశ్యపూర్వకంగా ముందు చేసేది తర్వాత, తర్వాత చేసేది ముందు చేస్తే నమాజ్‌ భంగం అవుతుంది. ఒకవేళ అనుకోకుండా మరచిపోయి జరిగిపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ పూర్తి క్రమంగా చేయవలెను.

పరీక్ష 13
క్రింద ఇవ్వబడిన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) సజ్దా   (ఆ) తక్బీరతుల్‌ ఇహ్రాం  (ఇ) నుదురు (ఈ) రుకూ (ఉ) తర్‌తీబ్‌ (ఎ) రెండు మోకాళ్ళు  (ఏ) రెండుచేతులు
 (ఐ) అరబీ భాషలో (ఒ) రెండు పాదాలు (ఓ) ముఖం.
 1. ఏడు అవయవాలపైన సజ్దా చేయవలెను అవి: ..............మరియు..............మరియు...............మరియు.........
 2.తషహ్హుద్‌ నమాజు యొక్క అర్కానులలో ఒక రుకున్‌, దీనిని ..................లో మరియు..................గా చదవాలి.
 సరైన సమాధానం కనుక్కోండి.
3.సూరతుల్‌ ఫాతిహ పఠించడం రాదు:
    (అ) అతను సూర ఫాతిహ చదవాల్సిన అవసరం లేదు, వెంటనే రుకూ చేసేయవచ్చు.
    (ఆ) అతను కంఠస్తం చేసిన ఏ సూరాలోనైనా ఏడు ఆయతులు చదువవలెను.
    (ఇ) అతని వచ్చే ఏ భాషలోనైనా సరే ఆ సూరా యొక్క అనువాదం చదువ వచ్చును.
 4.రుకూ చేయుటకు వీపును సమానంగా ఉంచి.................. ఉంచితే సరిపోతుంది.
    (అ) రెండు చేతులు మోకాళ్ళపైన
    (ఆ) రెండు చేతులు తొడలపైన
    (ఇ) రెండు చేతులు పిక్కలపైన.
 5.చివరి తషహ్హుద్‌లో దైవప్రవక్త(స)పై దరూద్‌ పంపించుటకు క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఒకటి సరైనది కాదు.అది
    ఏది?
    (అ) అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్‌.
    (ఆ) అల్లాహుమ్మ సల్లి అలర్రసూల్‌.
    (ఇ) అల్లాహుమ్మ సల్లి అలా అహ్మద్‌.
 6.ఫర్జ్‌ మరియు నఫిల్‌ నమాజులలో ఖియామ్‌ ఒక రుకున్‌.
    (అ) అవును  
    (ఆ)  కాదు.
 7. నమాజ్‌ చదివే వ్యక్తి సజ్దా చేయునప్పుడు అతనికి సమీపంలో ఉన్న బట్టపైనే సజ్దా చేయవలెను.
    (అ) అవును
    (ఆ) కాదు
 8. నమాజు యొక్క అర్కానులను క్రమంగా పాటించకపోతే అతని నమాజు చెల్లుతుంది.
    (అ) అవును
    (ఆ) కాదు.
 9. ఒక స్త్రీ నమాజులో సలాం పలుకలేదు ఆమె నమాజు:
    (అ) చెల్లుతుంది.
    (ఆ) చెల్లదు.
 10. ''అక్బరుల్లాహ్‌'' అనే పదంతో నమాజ్‌ ప్రారంభిస్తే అతని నమాజు:
    (అ) చెల్లుతుంది.
    (ఆ) చెల్లదు.
 11.ఆయిషా నమాజులో సూరతుల్‌ ఫాతిహ చదువుతున్నప్పుడు ఒక పక్షి ఆమె తలపై ఎగురుతుండటాన్ని గ్రహించి భయంతో రుకూలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత అలాగే రుకూ పూర్తి చేసుకుంది. ఆమె నమాజు:
    (అ) సరైనది.
    (ఆ) సరైనది కాదు.

నమాజ్‌ కొరకు షరతులు


నమాజ్‌ కొరకు షరతులు
 నమాజు కొరకు షరతులు అంటే నమాజ్‌ చేయడానికి ముందు తప్పనిసరిగా చేసుకోవాల్సిన కార్యాలు. ఇవి నమాజ్‌లోని భాగాలు కాకపోయినప్పటికీ ఈ కార్యాలు చేయనిదే నమాజు నెరవేరదు.
 ఇమామ్‌ షాఫయి దగ్గర నాలుగు విషయాలను నమాజ్‌ షరతులు అంటారు.
(1) తహారత్‌ (పరిశుభ్రత)
(2) సమయం అయిందని తెలుసుకోవటం.
(3) సతర్‌ను పాటించటం.
(4) ఖిబ్లా వైపు ఉండటం
 తహారత్‌ (శుచీ శుభ్రత)
 శుచీ శుభ్రతల గురించి మనం తహారత్‌ అధ్యాయంలో తెలుసుకున్నాం. శుభ్రత చాలా రకాలుగా విభజించబడినది, సరైన పద్ధతిలో నమాజ్‌ చేయుటకు మనం  వీటన్నింటినీ వివరంగా తెలుసుకోవటం అవసరం, అవి:
1. హదసె అస్గర్‌ మరియు హదసె అక్బర్‌ నుండి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం. (ఏ అశుద్ధత గుసుల్‌(స్నానం)చేయడం ద్వారా మాత్రమే దూరమవుతుందో దాన్ని హదసె అక్బర్‌ అంటారు. మరియు ఏ అశుద్ధత వుజూ చేయడం వల్ల దూరమవు తుందో దాన్ని హదసె అస్గర్‌ అని అంటారు.)
 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''శుభ్రత లేనిదే నమాజు స్వీకరించబడదు.'' (ముస్లిం 224)
2. నజాసత్‌ (మలినాల) నుండి దేహాన్ని శుభ్రపరచడం: నజాసత్‌ మరియు దాని రకాలు గురించి తహారత్‌(శుచీశుభ్రత) అధ్యాయంలో తెలుసుకున్నాము.

 ఇబ్నె అబ్బాస్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) మక్కా లేక మదీనాలోని తోటలోగుండా వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వారి సమాధులలో శిక్షించబడుతున్న శబ్దాన్ని విన్నారు. వెంటనే ప్రవక్త(స) ఇక్కడ ఇద్దరు శిక్షింబడుతున్నారు, దైవప్రవక్త(స)  ఇలా అన్నారు ''వీరిద్దరు శిక్షింబడుతున్నారు కాని  పెద్ద కారణంగా శిక్షించబడటం లేదు''  తరువాత ఇలా అన్నారు ''జాగ్రత్తగా వినండీ, వీరిద్దరిలో ఒకరు మూత్ర విసర్జన చేసేటప్పుడు జాగ్రత్త వహించేవాడు కాదు. మరియు రెండవ వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. తరువాత దైవప్రవక్త(స) ఒక చెట్టు కొమ్మను తెప్పించి దానిని రెండు భాగాలుగా త్రుంచి వారిద్దరి సమాధులపై పూడ్చారు. మీరిలా ఎందుకు చేసారని ప్రశ్నించగా ఆయన(స) బహుశ ఆ కొమ్మలు ఎండిపోయేంత వరకు వారికి శిక్ష తగ్గవచ్చు అని సమాధానమిచ్చారు. (బుఖారి 213)
3.దుస్తుల పరిశుభ్రత:
 శరీరం మాత్రమే అశుద్ధత లేకుండా శుభ్రంగా ఉంటే సరిపోదు, నమాజు చదువుటకు ధరించే దుస్తులు కూడా అన్ని రకాల అశుద్ధత నుండి శుభ్రంగా ఉండాలి.

   ఖౌలహ్‌ బిన్తె యసార్‌ (ర) దైవప్రవక్త (స) వద్దకు వచ్చి ఓ దైవప్రవక్తా! నా దగ్గర ఒకటి కంటే ఎక్కువ బట్టలు లేవు. ఆ బట్టలోనే నా బహిష్టు రోజులు గడుస్తాయి, నేనేమి చేయాలని ప్రశ్నించారు. దైవప్రవక్త (స) ''నీ బహిష్టు కాలం ముగిసి నీవు శుభ్రత పొందాక ఆ బట్టను నీటితో కడిగి దానినే ధరించి నమాజు చదువు'' అని సమాధానమిచ్చారు. ఒకవేళ రక్తపు మరకలు వెళ్ళకపోతే? అని ఆవిడ మళ్ళీ ప్రశ్నించారు, అప్పుడు దైవప్రవక్త (స) నీవు రక్తాన్ని నీటితో కడిగేస్తే చాలు, ఒకవేళ దాని మరక పూర్తిగా వదలక పోయినా నీకేమి నష్టం కలగదని తెలియజేశారు. (అబూదావూద్‌ 365)
4. నమాజ్‌ చేయుటకు ఎంచుకున్న స్థలం శుభ్రంగా ఉండవలెను.
 నమాజు చేయటుకు ఎంచుకున్న స్థలం అంటే నమాజు చేసేటప్పుడు నిలబడేటప్పుడు, రుకూ సజ్దా చేసేటప్పుడు, చేతులు, నుదుటి, ముక్కు భూమిపై ఉంచేటప్పుడు అతను ధరించిన బట్టలు ఎంత దూరమైతే భూమిని తాకుతాయో ఆ ప్రదేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. ఈ షరతు విధించటానికి గల ఆధారం దైవప్రవక్త(స) జీవితంలో ఒకసారి ఒక పల్లెటూరు వాసి మస్జిద్‌లో ప్రవేశించి మూత్రవిసర్జన చేయసాగాడు, దైవప్రవక్త(స)నీరు తెప్పించి ఆ స్థలంపై కుమ్మరించమని ఆదేశించారు.

సమయం అసన్నమయిందని తెలుసుకోవటం.
 ఫర్జ్‌ నమాజు కొరకు సమయం నిర్ణయించబడిందని మనం ముందే తెలుసుకున్నాం. కావున ప్రతి వ్యక్తి తప్పనిసరిగా నమాజు నిర్ణీత సమయంలోనే చదువుకోవాలి. మరియు నమాజ్‌ చదివే వ్యక్తి నమాజు చదవబడే నిర్ణీత సమయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి. ఎందుకనగా నమాజ్‌ సమయం అసన్నమయిందన్న విషయం తెలుసుకోకుండానే నమాజ్‌ చదివితే అతని నమాజు స్వీకరించబడదు. తర్వాత అతను నమాజు సరైన సమయానికే చదివాడని తేలినప్పటికీ చదివేటప్పుడు నమాజు సమయం మొదలైందని తెలుసుకోలేదు కావున అతని నమాజు చెల్లదు.

సమయం అసన్నమైందని తెలుసుకునే మార్గాలు :
  క్రింద ఇవ్వబడిన మూడు విధానాలతో సమయాన్ని తెలుసుకోగలము.
 1. స్పష్టమైన జ్ఞానం: అనగా కొన్ని స్పష్టమైన ఆధారాలతో సమయాన్ని అర్థం చేసుకోవటం. ఉదాహరణకు సూర్యున్ని చూచి అది ఆస్తమిస్తున్నప్పుడు(మగ్రిబ్‌) నమాజ్‌కి సమయం అసన్నమయిందని గ్రహించడం.
 2. ఇజ్తెహాద్‌. అంటే మనిషి కొన్ని అస్పష్టమైన ఆధారాలను చూచి  తెలుసుకునే ప్రయత్నం చేయటం. ఉదాహరణకు: నీడను చూచి అది ఇంత పొడుగు సాగిందంటే ఫలాన నమాజు సమయం మొదలైందని అంచనా వేయటం.
 3.తఖ్లీద్‌. (ఇతరులను అనుసరించటం) ఒక వ్యక్తి అజ్ఞాని అతను ఆధారాల ద్వారా లేక ప్రయత్నాల వల్ల సమయాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడంటే అతను బాగా ఆధారాలు తెలుసున్న పండితున్ని అనుసరించాలి. లేక ఎవరన్న  కొన్ని ఆధారాల ద్వారా అంచనా వేయగలుగుతున్న వ్యక్తినైనా అనుసరించాలి.

 సమయానికి ముందే చేయబడిన నమాజుపై తీర్పు:
 ఎవరికయినా సమయానికి ముందే నమాజు చదివాడని తెలిస్తే అతను ఉద్దేశపూర్వకంగా చదివినా, లేక ప్రయత్నం విఫలమవ్వటంవల్లనో, లేక మరొకరిని అనుసరిస్తూ చదివినా అతని నమాజు చెల్లదు. అతను తప్పనిసరిగా  మళ్ళీ సమయానికి నమాజ్‌ చేయవలెను.

 సతర్‌ను పాటించటం:
 షరీయతు ప్రకారం శరీరపు ఏఏ భాగాలను తప్పనిసరిగా కప్పుకోవాలో, మరియు శరీరపు ఏఏ భాగాల వైపు చూడరాదో ఆ భాగాలను దాచటాన్ని ''సత్రుల్‌ ఔరహ్‌ా'' అని అంటారు.
 నమాజులో కప్పవలసిన శరీర భాగాల హద్దులు.
 పురుషులకు: మోకాళ్ళ నుండి నాభి వరకు
 స్త్రీలకు: మొహం మరియు అరచేతులు తప్ప మొత్తం శరీరము.

ఆయిషా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: '' ఎవరికయితే బహిష్టు అవుతుందో (అంటే ఏ స్త్రీ యుక్త వయస్సుకు చేరిందో) ఆమె వోణీ కుప్పుకునే దాకా అల్లాహ్‌ ఆమె నమాజును స్వీకరించడు.'' ( తిర్మిజి 277)
3.4.4 ఖిబ్లా వైపు ముఖం చేయడం:

 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: '' ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు, మీరు ఎక్కడ ఉన్నాసరే మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి.....'' (అల్‌ బఖర 150)

దైవప్రవక్త(స) నమాజు నేర్పిస్తూ ఇలా బోధించారు ''నీవు నమాజు చేయదలచినప్పుడు సవ్యంగా, చక్కగా  వుజూ చెయ్యి తరువాత ఖిబ్లా వైపు ముఖం తిప్పి 'అల్లాహు అక్బర్‌' అని తక్బీర్‌ పలుకు'' (బుఖారి 5897, ముస్లిం 397)
 దైవప్రవక్త(స) మదీనాకు హిజ్రత్‌ చేసిన ప్రారంభంలో ఖిబ్లా వైపు (కాబా వైపు)  ముఖం చేయాలని ఆదేశించబడినది.
పరీక్ష 12

 సరైన సమాధానమేదో కనుక్కోండి

 1.నమాజు షరతులలో ఒక షరతు తహారత్‌
 (అ) హదస్‌ నుండి శుద్ధత పొందుట.
 (ఆ) శరీరం, బట్టలు, స్థలం శుభ్రంగా ఉండాలి.
 (ఇ) పైన తెలుపబడినవన్నీ శుభ్రంగా ఉండాలి.
 2. పరుషుడు నమాజులో  కప్పవలసిన భాగాలు:
 (అ) పిడికిలి నుండి మొకాళ్ళ వరకు.
 (ఆ) నాభి నుండి మొకాళ్ళ వరకు.
 (ఇ) ముఖం మరియు మోచేతులు తప్ప మొత్తం శరీరం కప్పబడి ఉండాలి.
 3.స్త్రీలు సతర్‌ను పాటించే షరతు  అన్ని నమాజులలో వర్తిస్తుంది.
 (అ) అవును.
 (ఆ) కాదు.
 4.ఒక వ్యక్తి దొహర్‌ నమాజు సమయం ప్రారంభమైందని స్పష్టంగా తెలుసుకోకుండానే నమాజు చేసాడు. తరువాత అతను సరైన సమయానికే నమాజు చదివాడని రుజువైంది. అతని నమాజు:
 (అ) చెల్లుతుంది.
 (ఆ) చెల్లదు.

అజాన్‌

 అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌ా, హయ్య అలల్‌ఫలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌,     లా ఇలాహ ఇల్లల్లాహ్‌.

 అజాన్‌: ఫర్జ్‌ నమాజు సమయం అయిందని తెలియజేయటానికి మరియు ముస్లింలు నమాజ్‌ చేయటానికి ప్రోగు కావాలని తెలుపుటకు  ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఒక ఆరాధన (ప్రకటన)
  నిర్ణీత సమయంలో చేయు ఫర్జ్‌  నమాజు కొరకు మరియు చేజారిపోయిన ఫర్జ్‌ నమాజుల కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌. సామూహికంగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌ ముఅక్కదహ్‌, కాకపోతే జన సమూహంలో ఏ ఒక్కరూ అజాన్‌ పలికినా అందరి తరపునా అదే సరిపోతుంది. ఒంటరిగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకటం సున్నతె ఐనియ్యహ్‌. ఇస్లాం చిహ్నాలలో అజాన్‌ పలకడంలో చాలా గొప్ప విశిష్ఠత ఉంది.
 అజాన్‌ ప్రారంభం:  హిజ్రీ శకం మొదటి సంవత్సరంలో అజాన్‌ పలకడం  ప్రారంభమైనది.
 ఆధారం: అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: '' ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌(పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్‌ ధ్యానం వైపు పరుగెత్తండి, క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. '' ( సూరా జుముఅహ్‌: 9)
 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: '' నమాజు చదివే సమయం ఆసన్నమైనప్పుడు మీలో ఒకరు అజాన్‌ పలకాలి మరియు మీలో పెద్దవారు  ఇమామత్‌ చేయాలి.(బుఖారి:602, ముస్లిం:674)

అజాన్‌ పలుకులు:
 అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌ా, హయ్య అలల్‌ఫలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌,     లా ఇలాహ ఇల్లల్లాహ్‌.
 ఫజర్‌ నమాజులో అజాన్‌ పలికేటప్పుడు ''హయ్య అలల్‌ఫలాహ్‌'' తర్వాత ''అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌, అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌'' అని పలకాలి. ఈ విషయం 'బుఖారి,ముస్లిం మొదలగు గ్రంథాలలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢీ అయినది.
 అర్థం: అల్లాహ్‌ గొప్పవాడు అల్లాహ్‌ా గొప్పవాడు,అల్లాహ్‌ా గొప్పవాడు అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మద్‌(స) అల్లాహ్‌ా ప్రవక్త అని నేను సాక్య్షమిస్తున్నాను, ముహమ్మద్‌(స) అల్లాహ్‌ా ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను, రండి నమాజ్‌ వైపునకు, రండి నమాజ్‌ వైపునకు, రండి సాఫల్యం వైపునకు, రండి సాఫల్యం వైపునకు, అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరూ లేరు.
  ''అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌''  అంటే నమాజు నిద్రకంటే మేలైనది.

అజాన్‌ ఇవ్వుటకు షరతులు:
1. ముఅజ్జిన్‌ (అజాన్‌ పలికే వ్యక్తి) ముస్లిం,  పరుషుడు,  తెలివి, మరియు బాలిగ్‌ (యుక్త వయస్కుడు) అయి ఉండాలి.(మంచి, చెడులో తేడా గ్రహించ గల పిల్లవాడు  కూడా పెద్దవారి  ఆధర్యంలో అజాన్‌ పలికినా సమ్మతమే.)
2.అజాన్‌ పలుకులు క్రమంగా పలకాలి.
3. అజాన్‌ పలుకుల మధ్య పెద్ద విరామం ఉండకూడదు.
4. సామూహికంగా చేసే నమాజు కోసం అజాన్‌ పలుకుతున్నప్పుడు బిగ్గరగా శబ్దాన్ని పెంచి పలకాలి. సామూహికంగా నమాజు చేయబడిన మస్జిద్‌లో కాక ఇతర ప్రదేశంలో ఒంటరిగా నమాజ్‌ చేయుటకు కూడా బిగ్గరగా అజాన్‌ పలకడం సున్నత్‌ విధానం. అయితే సామూహికంగా నమాజు చేయబడే మస్జిద్‌లో ఒంటరిగా నమాజ్‌ చేయదలచిన వ్యక్తి నెమ్మదిగా అజాన్‌ పలుకులు పలకాలి, ఎందుకంటే బిగ్గరగా అజాన్‌ పలికితే ప్రజలు తరువాతి నమాజ్‌కు సమయం అసన్నమయిందని అపార్థం చేసుకునే ప్రమాదముంటుంది.
అబూసయీద్‌ అల్‌ ఖుద్రీ (ర)తో దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: '' నీవు గొర్రెలను, పల్లెలను ఇష్టపడుతున్నావనే విషయం నేను గమనిస్తున్నాను, నీవు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు లేదా పల్లెలో  ఉన్నప్పుడు నమాజ్‌ చేయుటకు అజాన్‌ పలికితే బిగ్గరగా శబ్దాన్ని పెంచి అజాన్‌ పలుకు. ఎందుకనగా అజాన్‌ పలికే వ్యక్తి శబ్దం ఎంత దూరం పోతుందో ఆలోపు ఉన్న మానవులు, జిన్నాతులు, మరియు ప్రతి ఒక్కటీ అతని గురించి పరలోకంలో సాక్ష్యం పలుకుతాయి. (బుఖారి-584)
5.నమాజు వేళలోనే అజాన్‌ చెప్పాలి. ఎందుకనగా నమాజు సమయానికి ముందు చేయబడదు,  నమాజు సమయం అయిందని తెలిపే ఈ అజాన్‌ పలుకులు సమయానికి ముందే పలకడం ధర్మసమ్మతం కాదని ధార్మిక పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాకపోతే ఫజర్‌ నమాజుకై అర్థరాత్రి నుంచే అజాన్‌ పలకవచ్చు,దీని గురించి మరిన్ని వివరాలు అజాన్‌లోని సున్నతులు అనే అధ్యాయంలో వస్తాయి.
 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''నమాజు సమయం అసన్నమయినప్పుడు మీలోని ఒకరు అజాన్‌ పలకాలి.''  (బుఖారి 603, ముస్లిం 674)
గమనిక: స్త్రీలు సామూహికంగా నమాజు చేయుటకు అజాన్‌ పలకడం సరికాదు. ఎందుకంటే వారు తమ గొంతు బహిర్గతం చేసినచో ఫిత్‌నా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే వారు ఇఖామత్‌ పలకటం శ్రేయస్కరం. ఇఖామత్‌ పలుకులు అక్కడే ఉన్నవారు నమాజ్‌ చేయుటకు సన్నద్ధం కావాలని నెమ్మదిగా పలుకుతారు, అజాన్‌ మాదిరిగా బిగ్గరగా పలకరు కావున స్త్రీలు ఇఖామత్‌ పలుకవచ్చు.

 అజాన్‌లోని సున్నతులు

1. ముఅజ్జిన్‌ (అజాన్‌ పలికే వ్యక్తి) ఖిబ్లా వైపు ముఖం చేసి నిలబడాలి.
2. ముఅజ్జిన్‌ చిన్న అశుద్ధత మరియు పెద్ద అశుద్ధత రెండింటి నుండి శుభ్రత పొంది ఉండాలి.వుజూ లేకుండా అజాన్‌ పలకడం అయిష్టకరమైన విషయం. మరియు జునుబీ (గుసుల్‌ తప్పనిసరి అయిన వ్యక్తి) అజాన్‌ పలకడంర మరీ హేయమైనది.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''పరిశుభ్రత లేకుండా అల్లాహ్‌ నామ స్మరణ చేయటానికి నేను ఇష్టపడను''.
                                                                                  (అబూదావూద్‌: 17)
3.''హయ్య అలస్సలాహ్‌'' అన్నప్పుడు మెడను కుడివైపు తిప్పి పలకాలి. మరియు ''హయ్య అలల్‌ ఫలాహ్‌'' అన్నప్పుడు మెడను ఎడమ వైపు తిప్పి పలకాలి. మెడను మాత్రమే తిప్పాలి శరీరాన్ని కాదు.
4.అజాన్‌ పలుకుల్ని మంచి కంఠంతో మంచి స్వరంతో పలకాలి, అజాన్‌ పలుకులు, హాజరు కానివారికి (నమాజ్‌ సమయం అసన్నమయిందని) తెలుపుటకు పలుకుతారు. కాబట్టి (తర్‌తీల్‌తో) అంటే పెద్ద కంఠంతో మంచి స్వరంతో అజాన్‌  పలికితేనే సందేశం వారి వద్దకు చేరుతుంది.
5.''తర్జీ'' అజాన్‌ పలకడం. ''తర్జీ'' అంటే షహాదతైన్‌ పలుకులను ముందు నెమ్మదిగా పలికి తరువాత బిగ్గరగా పలకడం.
6.ఫజర్‌ అజాన్‌ లో తస్వీబ్‌. ''తస్వీబ్‌'' అంటే ఫజర్‌ అజాన్‌లో 'హయ్య అలల్‌ ఫలాహ్‌' తరువాత ''అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌'' అని రెండుసార్లు పలకడం.
7.అజాన్‌ పలికే వ్యక్తి మంచి కంఠం, మంచి స్వరం గలవాడై ఉండాలి. అతని కంఠాన్ని విన్నవారి హృదయం మెత్తబడాలి, వారు నమాజు చదవటానికి సిద్ధపడాలి.
8. అసహ్యకరమైన రాగాలతో పాటల లాగా అజాన్‌ పలకరాదు.
9. అజాన్‌ పలికే వ్యక్తి మంచి నడవడిక మరియు న్యాయనిర్ణేతగా ప్రజలలో పేరుగాంచిన వాడై ఉండాలి.
10. ఫజర్‌ నమాజులో ఇద్దరు ముఅజ్జిన్లు ఉండటం సున్నత్‌ విధానం. ఒకరు ఫజర్‌కి ముందు మరొకరు ఫజర్‌ తరువాత అజాన్‌ పలుకుతారు.

 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ''బిలాల్‌(ర) రాత్రి ఉండగానే అజాన్‌ పిలుపు ఇస్తారు. మీరు ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌(ర) అజాన్‌ ఇచ్చే వరకూ తినవచ్చు త్రాగవచ్చు''. (బుఖారి 592, ముస్లిం 1092)
11. అజాన్‌ వినేవారు నిశ్శబ్దతను పాటించాలి, మరియు అజాన్‌ పలికేవానిలాగే అజాన్‌ వినేవారు సమాధానంగా పలకాలి.


         ముఅజ్జిన్‌ ఇలా పలికితే                                          సమాధానంగా ఇలా పలకాలి
    అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌                         అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌
    హయ్య అలస్సలాహ్‌                                            లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌
    హయ్య అలల్‌ ఫలాహ్‌                                           లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌
    అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌                                  అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌
    లా ఇలాహ ఇల్లల్లాహ్‌                                          లా ఇలాహ ఇల్లల్లాహ్‌


12. అజాన్‌ తరువాత దుఆ మరియు దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించాలి.  
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:'' ఎవరయితే అజాన్‌ పిలుపు విని ఈ దుఆ '' అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దవతిత్తామ్మతి, వస్సలాతిల్‌ ఖాయిమతి, ఆతి ముహమ్మదనిల్‌ వసీలత వల్‌ ఫజీలత, వబ్‌అస్‌హు మఖామన్‌ మహ్‌మూద నిల్లజీ వఅత్తహ్‌'' చేస్తాడో అతని కోసం ప్రళయదినాన నేను సిఫారసు చేయటం సమ్మతమై పోతుంది.(బుఖారి 579)
 అర్థం: ఓ అల్లాహ్‌! ఈ సంపూర్ణ పిలుపుకు, స్థాపించబడే నమాజ్‌కు అధిపతి అయినవాడా! ముహమ్మద్‌ (స )కు ప్రతిష్ఠాత్మక మయిన స్థానాన్ని(మఖామె మహ్మూద్‌) ఆధిక్యతను ప్రసాదించు. ఏ ప్రశంసాత్మకమయిన(ఉన్నత) స్థానం (స్వర్గంలో) ప్రసాదిస్తానని నీవు వాగ్దానం చేశావో ఆ స్థానంలో (ఆయన్ని) ప్రతిష్టంపజెయ్యి).అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ''...త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌ామూద్‌కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.'' ( అల్‌ ఇస్రా-79)
 ముఅజ్జిన్‌ అజాన్‌ తరువాత దుఆ మరియు దైవప్రవక్త(స)పై దరూద్‌ నెమ్మదిగా చదవాలి. ఎందుకనగా వినేవారు ఇవి కూడా అజాన్‌ పలుకులేనేమో అని అపార్థం చేసుకునే ప్రమాదముంది.

 ఇఖామత్‌:
 ఇఖామత్‌ అజాన్‌ లాగే ఉంటుంది, కాకపోతే క్రింద ఇవ్వబడిన కొన్ని తేడాలు అందులో ఉంటాయి.
1.అజాన్‌ పలుకులు రెండేసి సార్లు పలుకబడతాయి. ఇఖామత్‌ పలుకులు ఒక్కొక్కసారి మాత్రమే పలుకబడతాయి.
 ఇఖామత్‌ పలుకులు: అల్లాహ్‌ అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, ఖద్‌ ఖామతిస్సలాహ్‌, ఖద్‌ఖామతిస్సలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌.
2. అజాన్‌ పలుకులు నిధానంగా ప్రశాంతంగా పలుకబడతాయి, ఇఖామత్‌ పలుకులు తొందరగా పలుకబడతాయి.

ఖిబ్లా వైపు ముఖం చేయు విధానం:
  నమాజు చదివే వ్యక్తి కాబతుల్లాహ్‌ను దగ్గర నుండి చూస్తున్నాడంటే అతను తప్పనిసరిగా కాబా వైపు పూర్తి నమ్మకంతో ముఖం చేసి నిలబడాలి. ఒకవేళ నమాజు చేసే వ్యక్తి దూర ప్రదేశంలో ఉన్నాడంటే స్పష్టమైన ఆధారాల ప్రకారం ముఖం  ఖిబ్లా వైపు చేసి నిలబడాలి. ఆధారాలు దొరకనప్పుడు అంచనావేసి దాని ఆధారంగానే నిలబడి నమాజు చదివినా సరిపోతుంది.

 నమాజు విధానము:
 అల్లాహ్‌ ముస్లిములపై ఫర్జ్‌ నమాజులు విధిగా చేయాలని ఆదేశించినపుడు దైవదూత జిబ్రయీల్‌(అ) దైవప్రవక్త ముహమ్మద్‌(స) వద్దకు వచ్చి నమాజుల వేళలు, నమాజుల రకాతుల గురించి వివరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుపుతున్నాము:
   1. ఫజ్ర్‌ నమాజు: ఇందులో రెండు రకాతులు, రెండు ఖియామ్‌లు మరియు ఒక తషహ్హుద్‌ ఉంటుంది.
   2. దొహర్‌ నమాజు: ఇందులో నాలుగు రకాతులు, రెండు తషహ్హుద్‌లు ఉంటాయి. మొదటి తషహ్హుద్‌ రెండు రకాతుల
      తర్వాత రెండో తషహ్హుద్‌ చివర్లో ఉంటుంది.
   3.అస్ర్‌ నమాజు: ఇందులో నాలుగు రకాతులు. దొహర్‌ నమాజు లాగే ఉంటుంది.
   4. మగ్రిబ్‌ నమాజు: ఇందులో మూడు రకాతులు,రెండు తషహ్హుద్‌లు ఉంటాయి. మొదటి తషహ్హుద్‌ రెండు రకాతుల
      తర్వాత రెండో తషహ్హుద్‌ చివర్లో ఉంటుంది.
   5. ఇషా నమాజు: దొహర్‌ మరియు అస్ర్‌ నమాజుల లాగే ఈ నమాజు ఉంటుంది.
3.ఒక వ్యక్తి తప్పిపోయిన నమాజులను ఖజా చేయదలచినప్పుడు ఒక్క సారి అజాన్‌ పలికితే సరిపోతుంది కాని ప్రతి నమాజు కొరకు ఇఖామత్‌ ఇవ్వవలెను.

 దైవప్రవక్త(స) ఒక సారి ముజ్‌దలిఫహ్‌ ప్రాంతంలో మగ్‌రిబ్‌ మరియు ఇషా నమాజును కలిపి ఒకేసారి ఒక అజాన్‌ మరియు రెండు ఇఖామత్‌ (ఒక ఇఖామత్‌ మగ్రిబ్‌ కోసం మరో ఇఖామత్‌ ఇషా కోసం) పలికి చదివారు.(ముస్లిం1218)

 ఇఖామత్‌ కోసం షరతులు:
 అజాన్‌ పలుకుటకు ఉన్న షరతులే ఇఖామత్‌ పలుకుటకు వర్తిస్తాయి.

  ఇఖామత్‌ లోని సున్నతులు:
 అజాన్‌లో ఉన్న సున్నతులు ఇఖామత్‌లోనూ ఉన్నాయి. అజాన్‌ పలికిన వ్యక్తే ఇఖామత్‌ పలకటం ముస్తహబ్‌. ఇఖామత్‌ వినే వ్యక్తి ''అఖామహల్లాహు వ అదామహా'' అనటం సున్నత్‌ .

 ఫరజ్‌ కాని నమాజుల కొరకు పిలుపు:
 ఫర్జ్‌ నమాజుల కొరకు అజాన్‌ మరియ ఇఖామత్‌ సున్నతె ముఅక్కదహ్‌. మరి సామూహికంగా చేయబడే ఫర్జ్‌ కాని నమాజులు ఉదాహరణకు పండగల నమాజు,సూర్యచంద్ర గ్రహణాల నమాజులు, జనాజా నమాజు వగైరాలో అజాన్‌ మరియు ఇఖామత్‌ పలకటం సున్నత్‌ పద్ధతి కాదు, ఇలాంటి నమాజుల కోసం ''అస్సలాతు జామిఅహ్‌'' అని పిలుపునివ్వాలి.
అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స)వారి కాలంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ''ఇన్నస్సలాత జామిఅహ్‌'' అని పిలవబడింది.'' (బుఖారి 1003)

 పరీక్ష 11
 సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
 (అ) ఆఖిల్‌ (ఆ) బాలిగ్‌ (ఇ) అజాన్‌ (ఈ) ఇమామ్‌ (ఉ) పరుషుడు (ఊ) ఫజర్‌ (ఎ) ఇషా
1. ................ అంటే ఫరజ్‌ నమాజు కొరకు సమయమయిందని తెలియజేయటానికి మరియు ముస్లింలు నమాజ్‌ కొరకు హాజరు కావాలని తెలుపుటకు ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఓ ప్రత్యేక ఆరాధన.(ప్రకటన)
2. అజాన్‌ పలికే వ్యక్తి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి, మరియు...................అయి ఉండాలి,మరియు.................. మరియు ................................అయి ఉండాలి.
3. అజాన్‌లో .................... కొరకు ''అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌'' అనే పలుకు అదనంగా పలుకబడుతుంది.
 సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
4. అజాన్‌ పలికిన వాడే ఇఖామత్‌ పలకటం మంచిది కాదు.
 (అ) ఒప్పు   (ఆ) తప్పు
5.సమయానికి నమాజు చదువుటకు లేక ఖజా నమాజు చదువుటకు అజాన్‌ పలకటం......................
  (అ) వాజిబ్‌  (ఆ) సున్నత్‌

సలాత్‌


జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) గారి కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''అయిదు పూట నమాజు ఉపమానం ఎలాంటిదంటే, మీలోని ఓ వ్యక్తి వాకిలి ముందు స్వచ్ఛమయిన మంచి నీటి కాలువ ప్రవహిస్తూ ఉంది. అతను ఆ కాలువలో రోజుకి అయిదుసార్లు స్నానం చేస్తున్నాడు. అతని శరీరం మీద ఎలాంటి మైల ఉండగలదా?'' (ముస్లిం 668) వేరొక అబూహురైరా(ర) ఉల్లేఖనంలో ''అటువంటిదే నమాజు ఉపమానం. అల్లాహ్‌ా అయిదు పూటల నమాజు ద్వారా పాపాలన్నింటిని తుడిచివేస్తాడు.'' అని ఉంది. (ముస్లిం 667)

సలాత్‌: అంటే భాషాపరంగా దుఆ (ప్రార్థన) అని అర్థం.

 సలాత్‌: షరీయతు పరిభాషలో కొన్ని ప్రత్యేకమైన క్రియలు, మాటలు. అవి తక్బీర్‌ (అల్లాహు అక్బర్‌)తో మొదలయి తస్లీమ్‌ (అస్సలాము అలైకుమ్‌ వరహ్మతుల్లాహ్‌) తో పూర్తవుతాయి. సలాత్‌ నామకరణానికి కారణం అందులో అత్యధిక శాతం దుఆ ఉండటమే.

 నమాజ్‌ ఆదేశం పరమార్థం

   1. మనిషిని అతని జీవితంలోని అసలు లక్ష్యాన్ని ఎరుక పర్చడం.
   2. సకల విషయాల కారకుడు అల్లాహ్‌ా మాత్రమేనని సహాయం చేయడం, అనుగ్రహించడం,మేలు చేకూర్చడం, 
      బ్రతికించడం, చంపడం, ఆయన ఒక్కడికి మాత్రమే సాధ్యమన్న విషయాన్ని నమాజీకి గుర్తు చేయడం.
   3. నమాజు వల్ల అతని వల్ల జరిగిన పాపాలను ప్రక్షాళనం గావించుకునే సదవకాశం లభిస్తుంది.

జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) గారి కథనం: దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''అయిదు పూట నమాజు ఉపమానం ఎలాంటిదంటే, మీలోని ఓ వ్యక్తి వాకిలి ముందు స్వచ్ఛమయిన మంచి నీటి కాలువ ప్రవహిస్తూ ఉంది. అతను ఆ కాలువలో రోజుకి అయిదుసార్లు స్నానం చేస్తున్నాడు. అతని శరీరం మీద ఎలాంటి మైల ఉండగలదా?'' (ముస్లిం 668) వేరొక అబూహురైరా(ర) ఉల్లేఖనంలో ''అటువంటిదే నమాజు ఉపమానం. అల్లాహ్‌ా అయిదు పూటల నమాజు ద్వారా పాపాలన్నింటిని తుడిచివేస్తాడు.'' అని ఉంది. (ముస్లిం 667)

   4.ఆత్మకు కావాల్సిన అల్లాహ్‌ పట్ల విశ్వాసంతో కూడిన ఉపాధి నిరంతరాయంగా దానికి అందుతూ ఉండాలి. ఏ ముస్లిం అయితే నమాజులను క్రమం తప్పకుండా పాటిస్తాడో అతన్ని ఐహిక బాధలు, సమస్యలు బలహీన పర్చజాలవు. అతని ఆత్మ విశ్వాసంలో ఎటువంటయిన మార్పు రాదు.
నమాజు ఆదేశం:
 సలాత్‌ ఆదేశం, శాసనం రీత్యా అత్యంత ప్రాచీనమయిన ఆరాధన. ప్రవక్త ఇస్మాయీల్‌ (అ) గారి గురించి తెలియజేస్తూ అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: 

'''అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్‌ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు'' (మర్యం: 55)

 పోతే, దైవప్రవక్త ముహమ్మద్‌ (స)వారికి దైవదౌత్యం అనుగ్రహించబడినప్పుడు (మేరాజ్‌కి పూర్వం వరకు) అయన ప్రతి ఉదయం రెండు రకాతులు, ప్రతి సంధ్యా సమయం రెండు రకాతులు చేసేవారు. అల్లాహ్‌ా, ప్రవక్త(స) వారినుద్దేశించి ఇచ్చిన ఆదేశం యొక్క సారాంశం ఇదేనని కొందరు వ్యాఖ్యానించారు.

 ''.......నువ్వు నీ పొరపాట్ల  క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.'' ( గాఫిర్‌:55) 

 ఫర్జ్‌ నమాజులు
ప్రతి ముస్లింపై దైవంచే విధిగావించబడిన ఫర్జ్‌ నమాజులు అవి: ఫజ్ర్‌, జుహ్ర్‌, అస్ర్‌,  మగ్రిబ్‌, ఇషా.
 ఇవి విధిగావించబడిన తేది:
 ప్రవక్త(స)వారిని ఏ రాత్రయితే మస్జిదె హరామ్‌ నుంచి మస్జిదె అఖ్సా వరకు ఇస్రా చేయించి, అక్కడి నుండి గగనాలపైకి మేరాజ్‌ కోసం తీసుకెళ్ళడం జరిగిందో అదే రాత్రి అయిదు పూటల ఫర్జ్‌ నమాజులు ఆదేశించబడ్డాయి. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: 

 ''కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లాహ్‌ పవిత్రతను కొనియాడండి. భూమ్యాకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయం కూడా అల్లాహ్‌ పవిత్రతను కొనియాడండి'' (రూమ్‌:18)



 ''తనపై ఏ కార్యాలు విధి?'' అని అడిగిన పల్లెవాసిని ఉద్దేశించి దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''రేయింబవళ్ళల్లో అయిదు పూటల నమాజు' అది విన్న పల్లెవాసి ఇవి తప్ప ఇంకేమయినా ఉన్నాయా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు దైవప్రవక్త(స): లేవు. అయితే నఫిల్‌ ఆరాధనలు నువ్వు చేసుకుంటే తప్ప' అని బదులిచ్చారు. (బుఖారి 46, ముస్లిం 11)


నమాజు వదలిన వ్యక్తి గురించిన ఆదేశం:


 నమాజును వదిలే వ్యక్తి సోమరితనం లేదా నిర్లక్ష్యం వల్లనో నమాజు వదులుతాడు. లేదా దాన్ని వ్యతిరేకిస్తూ అయినా వదులుతాడు:

 ఇక నమాజు విధి అన్న విషయాన్ని అంగీకరిస్తూనే సోమరితనం వల్ల దాన్ని విడనాడే వ్యక్తిని  అధికారికంగా తౌబా చేసుకుని మరొక్కసారి అటువంటి పాపకార్యానికి పాల్పడకూడదని మాట తీసుకోవాలి.అయినా నెరవేర్చకపోతే అతన్ని వధించడం తప్పనిసరి అవుతుంది. అతని వధ ధర్మ పరిధులను అతిక్రమించినందుకు శిక్షగా భావించబడుతుంది. అయితే అతను ముస్లింగానే పరగణించబడతాడు. అతని మరణానంతరం శవసంస్కారంలోనూ,వారసత్వ ఆస్తి పంపిణిలోనూ ఇస్లామీయ షరీఅతునే అనుసరించాలి. ఎందుకంటే తాను పాపం చేసినా ముస్లింమే గనక.
 ఇక ఎవరయితే నమాజు విధి అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ వాగ్వివాదానికి దిగినా లేదా అవహేళనగా ఏదయినా అన్నా అతను అవిధేయతకు పాల్పడినవాడయి ఇస్లాం పరిధి నుండి వైదొలుగుతాడు. అధికారికంగా అతన్ని తౌబా చేయవలసింది ఉత్తర్వులు జారి చేయాలి. తౌబా చేసుకున్నాడా, నమాజు స్థాపించాడా సరి, లేదంటే అతను ఇస్లాం పరిధి నుండి వైదొలిగాడని అంగీకరించాలి. ఒకవేళ అదే స్థితిలో మరణిస్తే ఇస్లామీయ సాంప్రదాయాననుసరించి అతనికి స్నానం చేయించడంగానీ, జనాజా నమాజు చేయిపించడం గాని చేయకూడదు. అలాగే అతని శవాన్ని ముస్లింల  స్మశానంలో ఖననం చేయకూడదు. ఎందుకంటే అతను ముస్లింలోనివాడు కాదు.

జాబిర్‌ (ర) కథనం: నేను దైవప్రవక్త (స) వారు ఇలా చెబుతుండగా విన్నాను: ''మనిషికి మరియు షిర్క్‌,కుఫ్ర్‌కి మధ్యగల అడ్డు నమాజును వదలడమే''. (ముస్లిం 82)


ఫర్జ్‌ నమాజు వేళలు:

 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:  ''నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (నిసా:103) 

1. ఫజ్ర్‌ నమాజ్‌:

     - ఫజ్ర్‌ నమాజు వేళ ఉషోదయం నుండి మొదలవుతుంది
     - సూర్యోదయం వరకు ఉంటుంది.

 2. జుహ్ర్‌ నమాజ్‌

     - జుహ్ర్‌ నమాజు వేళ సూర్యుడు ఆకాశం మధ్య నుండి వాలినప్పటి నుండి ప్రారంభమవుతుంది. దాన్నే జవాల్‌ 
       అనంటారు.
     - ఎండలో వస్తువు నీడ దాని అసలు నీడకన్నా రెట్టింపు పొడవు అయ్యేంత వరకు ఉంటుంది.
 దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: '' పొద్దువాలినప్పుడు (జవాల్‌ జరిగినప్పుడు) జుహ్ర్‌ నమాజు వేళ మొదలవుతుంది. మనిషి నీడ అతనికంటే రెట్టింపు అయ్యేంత వరకు అంటే అస్ర్‌ వేళ కానంతవరకు ఉంటుంది''. ( ముస్లిం 612)

 3. అస్ర్‌ నమాజు:

     - జుహ్ర్‌ వేళ ముగిసిన తర్వాత అస్ర్‌ సమయం మొదలవుతుంది.
     - సూర్యాస్తమయం వరకు ఉంటుంది.


 దైవప్రవక్త(స) ఇలా అన్నారు: సూర్యాస్తమయాని పూర్వం ఎవరయినా అస్ర్‌ నమాజు ఒక రకాతు దొరికితే అతను అస్ర్‌ నమాజును పొందినట్లే. (బుఖారి 554, ముస్లిం618)

 మక్రూహ్‌ా: సూర్యుడు ఎర్రబడక ముందే అస్ర్‌ నమాజు చేసుకోవాలి. సూర్యుడు పసుపు పశ్చగా మారిన తర్వాత అస్ర్‌ నమాజు చేయడం మక్రూహ్‌ా. నమాజు వేళల్ని తెలిపే హదీసులో ఇలా ఉంది:


 దైవప్రవక్త(స) ఇలా అన్నారు: అస్ర్‌ నమాజు సమయం సూర్యుడు పసుపుపచ్చగా మారనంతవరకూ ఉంటుంది. 

                                                                                        (ముస్లిం612)
 4. మగ్రిబ్‌ నమాజు:
     - మగ్రిబ్‌ నమాజు వేళ సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది.
     - పశ్చిమ దిగ్మండలంపై అరుణకాంతి అదృశ్యమయ్యే వరకు ఉంటుంది.

 దైవప్రవక్త(స) ఇలా అన్నారు: '' మగ్రిబ్‌ నమాజు సమయం అరుణకాంతి పూర్తిగా అదృశయమయ్యేంత వరకు ఉంటుంది. 

 (ముస్లిం 612)
 5. ఇషా నమాజు:
 - మగ్రిబ్‌ వేళ ముగిగానే ఇషా సమయం మొదలవుతుంది.
 - ఉషోదయం వరకు ఉంటుంది. అయితే మూడోవంత రాత్రి వరకు ఆలస్యం చేయకూడదు.
 ఫజ్ర్‌ సాదిఖ్‌ - ఉషోదయం అంటే తూర్పు దిశన ఒక కాంతి ప్రసరిస్తుంది. తర్వాత ఆ కాంతి కొంచెం కొంచెం ఆకాశంపై విస్తరిస్తుంది. చివరికి సూర్యోదయం జరుగుతుంది.
 ఇవి అయిదు పూటల నమాజుల వేళలు. సమయం ఉంది కదా అని నమాజుని దాని ఆఖరి వేళ వరకు ఆలస్యం చేయడం సమంజసం కాదు. ఎందుకంటే వేళ దాటిపోయే ప్రమాదం ఉంటుంది గనక. దీనికి భిన్నంగా నమాజులను వాటి మొదటి వేళలో చేయడం ఉత్తమం.

 దైవప్రవక్త (స) వారిని శ్రేష్ఠకార్యాల గురించి ప్రశ్నించడం జరిగింది. అందుకాయన ''నమాజును దాని వేళకు చేయడం అంటే దాని ప్రారంభ సమయంలో చేయడం అన్నారు.'' ( బుఖారి 504)


దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: సూర్యోదయానికి ముందు ఎవరికయితే ఫజ్ర్‌ నమాజు ఒక రకాతు లభిస్తుందో అతను ఫజ్ర్‌ నమాజుని పొందినట్లే, మరి ఎవరయితే సూర్యాస్తమయానికి ముందు ఒక రకాతు అస్ర్‌ నమాజు లభించిందో అతను అస్ర్‌ నమాజును పొందినట్లే. ( బుఖారి554, ముస్లిం608) 


3.1.2 నమాజు మక్రూహ్‌ అయ్యే వేళలు:

 మక్రూహ్‌ా తహ్‌రీమీకి చెందిన ఈ వేళలు
 1. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు, జుమా రోజు మినహాయించి. అలాగే ఫజ్ర్‌ నమాజు తర్వాత నుండి సూర్యుడు ఒక బాణం పొడుగు పైకి ఎగబడే వరకు.
 2. అస్ర్‌ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

ఉఖ్బా బిన్‌ ఆమిర్‌(ర) ఇలా అన్నారు: దైవప్రవక్త(స) మూడు సమయాల్లో నమాజు సలపకూడదని శవాల్ని పూడ్చకూడదని మమ్మల్ని వారించేవారు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుని కాంతి బాగా తెల్ల బడేంత వరకు. మిట్టమధ్యాహ్నం వేళ నుండి పొద్దు వాలనంత వరకు. సూర్యుడు రెట్టింపయినప్పటి నుండి అస్తమించేంత వరకు.(ముస్లిం 831)

 ఈ నిషేధితం అనేది ఏ కారకం లేనప్పుడే. ఒకవేళ కారకం ఉంటే, ఉదాహరణకు తహియ్యతుల్‌ వుజూ, మస్జిద్‌, మరియు ఖజా నమాజు వీటి విషయంలో మినహాయింపు ఉంది.
  అనస్‌(ర) కథనం దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవరయిన ఏదయినా నమాజు చేయడం మరచిపోతే గుర్తురాగానే చేసుకోవాలి.దానికోసం ఆ నమాజుని చేసుకోవడం తప్ప వేరే పరిహారం ఏమిలేదు.(బుఖారి 572, ముస్లిం 684)
  '' దైవనామ స్మరణ కోసం నమాజును స్థాపించు'' (తాహా:14) 

 ఫర్జ్‌ నమాజులను తిరిగి చేయడం లేదా ఖజాను పూర్తి చేయడం:

తిరిగి చేయడం:
 అంటే ఫర్జ్‌ నమాజుల్లోని ఓ నమాజును చేసేశాక, అందులో లోటుపాట్లు జరిగాయని తెలిస్తే దాన్ని తిరిగి మళ్ళీ చేయాలి.
 ఇలా చేయడం ముస్తహబ్‌. ఉదాహరణకు: ఒక వ్యక్తి ఒంటరిగా జుహ్ర్‌ా నమాజు చేశాడు. తర్వాత అతను సామూహికంగా చేసే జుహ్ర్‌ నమాజును పొందాడు. అప్పుడు సున్నత్‌ పద్ధతి ఏమిటంటే అతను జుహ్ర్‌ా నమాజుని సమూహంతో కలిసి తిరిగి చేసుకోవాలి. అతను మొదట చేసిందే ఫర్జ్‌ అవుతుంది. తర్వాత చేసింది నఫిల్‌ అవుతుంది.

 జాబిర్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అల్‌ అస్వద్‌(ర) తన తండ్రి ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు: ఆయన తండ్రి యౌవనస్తుడిగా ఉన్నప్పుడు దైవప్రవక్త(స) వారితో కలిసి నమాజు చేశారు. మస్జిద్‌ ఓ మూలలో నమాజు చేయని ఇద్దరు వ్యక్తులు కంటపడ్డారు. వారిని పిలుచుకొని రావలసిందిగా ఆదేశించారు. వారిని తీసుకురావడం జరిగింది.అప్పుడు ప్రవక్త(స) వారినుద్దేశించి : ''మీరు మాతో నమాజు చేసేందు ఏ విషయం మిమ్మల్ని ఆపింది'' అని ప్రశ్నించారు. దానికి వారు:''మేము మా ప్రాంతంలో ముందే నమాజు చదువుకున్నాము'' అన్నారు. అందుకు దైవప్రవక్త(స) ఇక మీదట ఇలా చేయకండి మీలోని ఒక వ్యక్తి తన ప్రాంతంలో నమాజు చేసుకొని (వేరేచోట)నమాజు చేయిపించే ఇమామ్‌ను చూస్తే అతనితోపాటు నమాజు చేయాలి. అది అతని కోసం నఫిల్‌ అవుతుంది. అన్నారు. (అబుదావూద్‌:575)

 ఒకవేళ నమాజులో ఎలాంటి లోటు లేకపోతే తిరిగి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.

ఖజా:

అంటే నమాజు వేళ అయిపోయాక ఆ నమాజుని చేయడం లేదా ఒక రకాతు కూడా చేసేంత సమయం లేకపోవడం.
 అన్ని మస్లక్‌ల పండితులు ఈ విషయమయి ఏకీభవించారు. నమాజును వదిలేసిన వ్యక్తి దాని ఖజా చేసుకోవాలి. దాన్ని అతను మరచి వదలినా, తెలిసి వదిలినా, క్రింది వివరణతోపాటు:
తగు కారణం వల్ల, మరచిపోవడం వల్ల, నిద్ర వల్ల, నమాజు తప్పిపోతే పాపం కాదు, అతను తక్షణమే ఖజా చేయాల్సిన అవసరమూ లేదు. అయితే ఎలాంటి కారణం లేకుండా కావాలనే నమాజును వదలి వ్యక్తికి పాపం తగలడమేకాక ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ నమాజును పూర్తి చేసుకోవాలి.

 అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: దైవప్రవక్త(స)ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరయినా నమాజు నుండి నిద్రపొయినా, లేదా మరుపుకి గురయినా గుర్తు వచ్చినప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ''నీవు నా స్మరణ కోసం నమాజును స్థాపించు'' (ముస్లిం 684)


నమాజు ఎవరి మీద విధి :

 యుక్త వయసుకు చేరిన బుద్ధిమంతులయిన ప్రతి ముస్లిం స్త్రీ పురుషుని మీద నమాజు విధిగావించబడింది.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:'' ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకాగ్నికి తీసుకు వచ్చింది అని ప్రశ్నించడం జరుగుతుంది. వారిలా సమాధానం ఇస్తారు: మేము నమాజు చేసేవారము కాము''. (ముద్దస్సిర్‌:42,43)

 - యుక్త వయసుకు చేరని బాలునిపై నమాజు విధికాదు. అయితే పిల్లోడు ఏడేండ్ల వయసుకు చేరాక అతనికి నమాజును గురించి ఆదేశిస్తూ ఉండాలి. అతను పదేండ్ల వయసుకి చేరాక వదిలితే దండించాలి. ఉద్దేశం నమాజు అలవాటు చేయడమే.
 - హైజ్‌ మరియు నిఫాస్‌ వచ్చే స్త్రీలకు నమాజు ఫర్జ్‌ కాదు. వారికి గల అశుద్ధత కారణంగా వారు నమాజు చేయడానికి అనర్హులవుతారు గనక.
 - ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరిస్తే అతని వల్ల గతంలో తప్పిపోయిన నమాజుల్ని అతను తిరిగి పాటించాల్సిన అవసరం లేదు.

 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ముగ్గురిపై ఎటువంటి విధి లేదు. పడుకున్న వ్యక్తి నిద్రమేల్కొనంత వరకు.పిల్లోడు యుక్త వయసుకి చేరనంతవరకు. మతి స్థిమితం లేని వ్యక్తికి మతి స్థిమితం కలగనంత వరకు.'' ( అబూదావూద్‌ 4403)


 పరీక్ష 10


 ఖాళీ స్థలాలను పూరించండి:


 (ఎ) సరిసమానం అవ్వాలి (బి) నమాజ్‌ (సి) అజాన్‌ (డి) ఫర్జ్‌ (ఇ) పొద్దు వాలడం (ఎఫ్‌) ఫజ్ర్‌ (జి) కన్నా పొడుగు

  1.ఏ ముస్లింకి అయినా తెలిసి లేదా ఇతర ఏ కారణం వల్లనయినా సరే ..................వదలడం  అనుమతించబడలేదు.
  2. ఆరాధనల్లోని ఓ ఆరాధన అది తక్బీర్‌తో మొదలవుతుంది,తస్లీమ్‌తో ముగిస్తుంది. అది......................
  3. .....................నమాజు వేళ ఉషోదయం నుండి మొదలయి సూర్యోదయం వరకూ ఉంటుంది.
  4. జుహ్ర్‌ నమాజు సమయం సూర్యుడు.......................నప్పటి నుండి మొదలవుతుంది,ప్రతి వస్తువు నీడ 
     దానికి.......................... అయ్యేంత వరకు ఉంటుంది.
 సరైన సమాధానం ఎన్నుకోండి:

  1. ఎటువంటి భావనవాస్థితిలో నమాజును స్థాపిస్తాము:

     (అ) నిద్ర మత్తులో ఉన్నప్పుడు
     (ఆ) ఏకాగ్రత ఉన్నప్పుడు
     (ఇ) అహంభావానికి లోనయినప్పుడు
  2.మనం నమాజుని అన్ని మర్యాదలతో పరిపూర్ణ స్థాయిలో పాటిస్తే వచ్చే మార్పు ఏమిటి?
     (అ) సతతం శ్రమించే మన ఆత్మలు నెమ్మదిని,శాంతిని పొందుతాయి.
     (ఆ) సున్నితమైన మన హృదయాలు జడపదార్థాలుగా మారతాయి
     (ఇ) 
   3. మగ్రిబ్‌ నమాజు సమయం:
     (అ) సూర్యాస్తమయం తర్వాత మొదలయి అరుణ ఛాయలు తొలిగేంత వరకు ఉంటుంది.
     (ఆ) సూర్యాస్తమయం తర్వాత మొదలయి ఉషోదయం వరకు ఉంటుంది.    
     (ఇ) అరుణ ఛాయలు కనుమరగైనప్పటి నుండి ఉషోదయం వరకు ఉంటుంది.
  4.ఎలాగయితే ఆహారపానియాలు ఆత్మకు ఆహారమో అలాగే నమాజు మన దేహాలకు ఆహారం:
     (అ) అవును
     (ఆ) కాదు
  5. జమాఅత్‌తో చేసే నమాజు ముస్లిం సమైక్యతకు చిహ్నము.
     (అ) అవును
     (ఆ) కాదు
  6.ఫజ్ర్‌ నమాజు వేళ ఉషోదయం మొదలు ఉదయం 11 గంటల వరకు ఉంటుంది.
     (అ) అవును
     (ఆ) కాదు
  7. అస్ర్‌ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు నఫిల్‌ నమాజులు చేయడం మక్రూహ్‌ా.
     (అ) అవును
     (ఆ) కాదు
  8.సోమరితనం నమాజును వదిలే అనుమతిలోని ఓ అనుమతి.
     (అ) అవును
     (ఆ) కాదు
  

 19.ఖజా ఓ నమాజును దాని వేళలో ఎక్కువ పుణ్యం పొందే నిమిత్తం తిరిగి మళ్ళీ చేయడం.
     (అ) అవును
     (ఆ) కాదు

0.అయిదు పూటల నమాజులను నిరాకరించే వ్యక్తి కాఫిర్‌ అవుతాడు.

     (అ) అవును
     (ఆ) కాదు
  11. సూర్యుడు నడి ఆకాశం నుండి వాలినప్పటి నుండి జుహ్ర్‌ా నమాజు వేళ మొదలవుతుంది.
     (అ) అవును 
     (ఆ) కాదు.
  12. నడిరాత్రి సమయం నమాజు నిషేధించబడిన సమయం.
     (అ) అవును
     (ఆ) కాదు
  13. ఓ అబ్బాయి జుహ్ర్‌ నమాజు మస్జిద్‌లో చేశాడు. నమాజు అయ్యాక మరో జమాఅతును నమాజ్‌ చేస్తూ వారితో పాటు 
       పాల్గొని నమాజు చేశాడు. అతను రెండవసారి చేసిన నమాజు:
     (అ) ఖజా అవుతుంది
     (ఆ) తిరిగి మళ్ళీ చేయడం (ఇఆదా) అవుతుంది
  14.ఓ స్త్రీకి మగ్రిబ్‌ నమాజు మిస్‌ అయింది. మరియు ఇషా సమయం కూడా మొదలయిపోయింది. ఇక ఆమె మగ్రిబ్‌ 
      నమాజును.......................చేయాలి.
     (అ) ఇఆదా
     (ఆ) ఖజా
  15. ఖాలిద్‌ అనే వ్యక్తి మరణించాడు. అతను నమాజ్‌ ఫర్జ్‌ అన్న విషయాన్ని వ్యతిరేకించాడు. తౌబా కూడా చేసుకోలేదు. 
       అతన్ని ముస్లింల స్మశానంలో ఖననం చేయవచ్చు.
     (అ) చేయవచ్చు
     (ఆ) చేయకూడదు
  16. దలాల్‌ అనే అమ్మాయి అస్ర్‌ నమాజు పూర్తి చేసుకోగానే తన ఫజ్ర్‌ నమాజు చదవలేదని గుర్తు వచ్చింది. ఇప్పుడు 
      ఫజ్ర్‌ నమాజు చేసే.............................
     (అ) అనుమతి ఉంది
     (ఆ) అనుమతి లేదు