Tuesday, September 27, 2022

కలిమి + లేమి = జీవితం


అద్ధం  జీవితం. -అబద్దమాడకు 
యుద్ధం జీవితం ఆధైర్యపడకు 

ఒకేసారి ఒకే క్షణంలో - అటు అంతఃపురంలో 
పుత్రోదయ పరమోత్సాహం - ఇటు పట్టణ చివర 
మురికివాడలో పూరి గుడిసెలో ఏ దిక్కూ లేని 
తల్లి చింకి బట్టల పొత్తిళ్ళలో - పసిబిడ్డ  ఆక్రందనం. 

దిక్కుమాలిన ఆ తల్లి తన బిడ్డను చూసి 
బాబూ! ఈ భూమంతా దుఃఖమయం. వేదన-హింస-బాధ 
అక్రమం అన్యాయం-పగ-ద్వేషం - ప్రేమరాహిత్యం నాయనా! 
నేను నీకు ఇచ్చేందుకు నాదగ్గర కన్నీళ్ళు తప్ప 
మరేమి లేవు తండ్రీ! పాలుకు బదులు కన్నీళ్ళతో 
కదుపు నింపుకొని జీవించగలవా బిడ్డా! చలికి వణికే నిన్ను 
కప్పేందుకు నా వట్టి చేతులు తప్ప పట్టు బట్టలు లేవు 
నా చేతులు నీకు వేడినిస్తాయా బాబూ! 
నా ఒడి నీకు బడి కాగలదా నాన్నా!



ఒకేసారి ఒకే ఘడియలో అటు అట్లూరు మండలంలోని 
ఆడకూతురు పుట్టినందుకు ఆనందోత్సవాలు-ఇటు 
పల్లెటూరులో చెట్టు క్రింద పేద తల్లి పాకి బట్టల మధ్య 
వెక్కిళ్ళతో ఎర్రబడ్డ పసికూన చెక్కిళ్ళు 
పేదైన ఆ తల్లి తన కూతురుని చూసి

ప్రియాతి ప్రియమైన నా చిట్టి తల్లీ! 
నీకు ఇచ్చేందుకు ఈ పేద తల్లి దగ్గర 
ఒక్క ప్రేమతప్ప ఇంకేమీ లేదమ్మా!
 స్త్రీగా నేను అనుభవిస్తున్న విషాద జీవితాన్ని 
పంచుకోవడానికి ఆత్మలోకాన్ని వదలి ఈ లోకానికి 
ఎందుకు వచ్చావు తల్లీ? దుర్భర దారిద్ర్యంలో జీవితం 
గడిపే ఈ తల్లి కడుపున ఎందుకు పుట్టావమ్మా?!

స్త్రీ ఒక అబలని తలచి, అంగాంగ కొలతలు కొలిచి 
అతివను అంగడి బొమ్మను చేసిన కుళ్ళు సమాజంలో 
ఒంటరిగా నడవలేక, పశువుల్లో బ్రతకలేక 
ఊరు వల్లకాడాయే - రక్షణే కరువాయే 
మమతలకు తావే లేని మానవ సంబంధాల్లో 
కట్నం, లంచం అర్హతలైన మృగ పెత్తనాలు నీలి నీడల్లో 
మగ్గుతున్న మగువల మధ్య మరో స్త్రీగా ఎందుకు జన్మించావు తల్లీ!?

ఆ తల్లి తన కొడుకును గుండెలకు గట్టిగా హత్తుకుంది. 
ఈ తల్లి తన కూతురిని బాహువుల్లో బిగబెట్టుకుంది. 
ఇద్దరు తల్లులది ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం 
మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు 
ఇద్దరూ పసికూనల చుట్టూ చేతులు వేశారు; 
గతంలో మాదిరిగా తాము మళ్ళీ ఒకటి కావాలని......

ఆ ఇద్దరు తల్లులు కళ్ళు పైకెత్తి దైవాన్ని వేడుకున్నారు 
దురదృష్టవంతులైన ఈ ప్రాంత ప్రజల మీద 
మానవత్యం మరచిన ఈ మానవాళి మీద 
దయ చూపు ప్రభూ! అని

అప్పుడే అదే క్షణం ఒక మేఘం చంద్రుణ్ణి కప్పివేసింది 
తళుక్కున ఒక మెరుపు తీగ భూమిని తాకింది
గగన శిఖరం పైనుంచి ఒక గర్జన వినబడింది. 
అది ఆదిమధ్యాంతరహితుడి ఓదార్పులా ఉంది

"కలత చెందకండి....కంగారు పడకండి.. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు' దారిద్య్రం భయంతో మీ సంతానాన్ని (గొంతు నులిమి హతమార్చకండి. వారు భువన తారలు వారికి ఉపాధినిచ్చే బాధ్యత మాది. మీకు ఆహారమిచ్చే బాధ్యత కూడా మాదే, ప్రతి జీవి ఉపాధి మా చేతిలోనే ఉంది. వారు రేపటి ఆశాదీపాలు- వారిని ఆర్పివేయకండి. వారు మీ పాలిట దివ్య వరాలు. వారిని గుండెలకు హత్తుకోండి. గుర్తుంచుకోండి! అజ్ఞానం, అధైర్యం, మూర్ఖత్వంతో తమ సంతానాన్ని బలిగొనేవారు వారే ఘోరంగా నష్టపోతారు". (దివ్య ఖురాన్ / బనీ ఇస్రాయీల్: 31) 

ఒకేసారి - ఒకే నిమిషం అటు మరికివాడలో 
ఇటు పల్లెటూరులో ఇద్దరు తల్లులూ ఈ శబ్దాన్ని
విన్నారు. నిజాన్ని గ్రహించారు. ఊరట చెందారు. 
లెంపలేసుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ 
చంటి పిల్లలిద్దర్ని చచ్చినా చంపుకోబోమన్నారు. 
దైవానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 
తమ పిల్లలు తమకు దక్కినందుకు ఆనందభరితులయ్యారు. 
అమాంతంగా సజ్జాలో పడిపోయారు.... సుల్తానల్లాహ్ అంటూ.....

జోరుగాలి వీస్తోంది ఆ గాలి నుంచి ఓ రాగం వినబడుతోంది....

అద్దం జీవితం విసిరిపారేయకు 
యుద్ధం జీవితం విసుగు చెందకు

అంతలో చంద్రుడి పైనుండి మబ్బు తొలిగింది. చంద్ర కిరణాలు పూరి గుడిశెలపైన - అందున్న రెండు తల్లుల ప్రార్థనాస్థలాలపైన పడ్డాయి మీ తౌబాకు మేమే సాక్ష్యం అంటూ అల్విదా అంటూ .....శుభవార్తను విన్పించి మరీ వెళ్లాయి!


ఎవరు తమ ప్రభువు అల్లాహ్ యేనని పలికి, ఆమాట మీదనే స్థిరంగా ఉంటారో వారి (సహాయం) కోసం దైవదూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: “భయపడకండి. విచారపడకండి. స్వర్గప్రవేశం గురించి మీకు చేసిన వాగ్దానం గుర్తు చేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయా మయుడయిన ప్రభువు  వైపున లభించనున్న ఆతిథ్యమిది.” ((దివ్య ఖురాన్/ 41: 30-32)

స్నేహమెంత మధురం...

సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ


స్నేహితుడు - ఈ పదంలో ఉన్న అక్షరాలు ఇతర అక్షరాల్లాంటివి కావు. ఇందులోని ప్రతి అక్షరానికి ఒక అర్ధం ఉంది.

స -  సచ్చీలత, సత్య సంధత

న -  నీతి, నిజాయితి, హితోపదేశం

త - త్యాగ నిరతి డాబు దర్పం లేకపోవడం

స్నేహం - అదో నీడ లాంటిది... ఎండ తీవ్రత పెరిగినకొద్దీ అవసరం అధికమవుతూనే ఉంటుంది. స్నేహ అది అస్తమించని రవి తేజం... అది కరిగిపోని మంచు పర్వతం... కరిగి పోదు... తరిగి పోదు. భూఫలాలు, పూలు రుతువును బట్టి కాస్తుంటాయి. స్నేహం అది అనుక్షణం ఫలాలిచ్చే మహా వృక్షం... అన్ని వేళలా సుగంధ పరిమళాల్ని వెదజల్లే పూవనం.



ఇది స్నేహమైతే, నిజమైన స్నేహితుడెవడు??? అతడే అనునిత్యం నిన్ను కనురెప్ప వలే కాపాడువాడు. నీ లోపాలను - ఎంచనివాడు. నీ తప్పిదాలను క్షమించువాడు. నీవు చెప్పిన ప్రతీది వినువాడు. నీ గుట్టును రట్టు చేయనివాడు. నీ పొరపాట్లను దిద్దుకునే ఉంటాడు. అవకాశం ఇచ్చువాడు. నువ్వు లేనప్పుడు నీదైన ప్రతి వస్తువును కాపాడువాడు. నీ మనో వేదనను ముఖ కవళికలతో పసి గట్టువాడు. నీపై ఉన్న బరువును తొలగించువాడు. ఆపద సమయంలో నిన్ను ఆదుకొనువాడు. కష్ట సమయంలో అండగా నిలుచువాడు. నీ విజయంతో ఆనందించువాడు. పరాజయం పాలైతే ధైర్యం చెప్పేవాడు.

బహుశా అటువంటి స్నేహం కోసం నీవు పరితపిస్తున్నట్లున్నావు.... కానీ చేరుకోలేకపోతున్నానన్న బాధ నిన్ను దహించి వేస్తున్నట్లుంది.... నిరాశ చెందకు.... అధైర్య పడకు..... సహనం వహించు.... ప్రయత్నించు.... నీ కోరిక నెరవేరుతుంది.... నీ మొర ఆలకించ బడుతుంది... నీ గమ్యం నీకందుతుంది.... అది సమీపంలోనే ఉంది... నీకై నిరీక్షిస్తుంది... ఖచ్చితంగా నీవు శిఖరానికి చేరుకుంటా వంటుంది... ఆత్మానందంతో ఉత్సాహభరితం అవుతుంది నీ జీవితం... నీవు ఊహించిన దానికంటే ఎంతో గొప్పవాడు నీ స్నేహితుడు.

'అతన్నెలా పొందగలను' అని ఆలోచిస్తున్నావా??? ఆలోచించడం మానుకో.... అన్వేషణ ప్రారంభించు.... ఈ మార్గంలో అలుపెరగని కృషి సడలని పట్టుదల ఉండాలి మరి!... అతన్ని చేరుకునేందుకు ఓ వారథి నిర్మించాలి నీవు... అది చాలా బలమైనదై ఉండాలి... అతి భయంకరమైన తుఫానులకు ఎదురొడ్డి నిలబడ గలగాలి... సమస్యల సుడిగుండాలకు చెదరకుండా ఉండాలి... కోరికల సుడిగాలులకు బెదరకుండా ఉండాలి....!

అలా నీవు చేసిన రోజు... కురిసిన ప్రతి చినుకు స్వాతి ముత్యం అవుతుంది... నీ బ్రతుకు సంతోషాల హరివిల్లవుతుంది... మనో భూమి పచ్చని సుగుణాల పూతోట అవుతుంది... అది నీకు బంగారు పంటను అందిస్తుంది... అప్పుడు నీలోని ప్రతి అవయవం తనదవుతుంది. నీ కళ్ళు తను కనమన్నవే కంటాయి... ఈ చెవులు తను  దాని వినమన్నదే వింటాయి... నీ మెదడు తను చెప్పిందే ఆలోచిస్తుంది... నీ చేతులు తను ధర్మం అన్నదే చేస్తాయి... నీ కాళ్ళు తను చూపిన బాటనే  నడుస్తాయి... నీ మదిలో కదిలే ప్రతి కదలిక తన ఆదేశ ప్రకారమే ఉంటుంది..... అదే అసలు స్నేహానికి పరాకాష్ట!

ఇక ఆ స్నేహితుడెవడు? ఆ వారథి ఏది? అంటున్నావా? ఆ పరమ మిత్రుడే... అల్లాహ్... 'నిఅమల్ మౌలా వ నిఅమన్నసీర్' ''ఆయన అందరికంటే మంచి మిత్రుడు, మంచి సహాయకుడు కూడా. ఆ వారధియే.... నమాజు, ప్రార్ధన.... 'ఇస్తయీనూ బిస్సబ్రి వస్సలాహ్ ' - సహనం వహించి, ప్రార్ధన చేస్తూ (ఆ మిత్రుని) సహాయం అర్ధిస్తూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించేవారికి తోడుగా

ఇక నేనేం చేయాలంటావా? అదీ అతని నోటనే విను...! "ఎవరు తమ ప్రభువు అల్లాహ్ యేనని పలికి, ఆ మాట మీదనే స్థిరంగా
ఉంటారో వారి (సహాయం) కోసం దైవ దూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: 'భయ పడకండి, విచార పడకండి. స్వర్గ ప్రవేశం, ప్రభువు దర్శనం గురించి మీకు చేయబడిన వాగ్దానం స్మరించి ఆనందించండి. మేము ఇహ లోకంలోనూ మీకు తోడుగా ఉన్నాము. పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాము. స్వర్గంలో మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడయిన దేవుని వైపున లభించనున్న ఆతిథ్యమిది". (హామీమ్ సజ్జా 30-32)

మానవ శ్రేయోభిలాషి అయిన మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు తమ ఆఖరి ఘడియల్లో చెప్పిన రెండు మాటల్ని బాగా గుర్తుంచుకో!

"అల్లాహుమ్మ రఫీఖల్ అలా”
(ఓ అల్లాహ్! మహోన్నతమైన నీ నేస్తాన్నే ఆశిస్తున్నాను).
 
"ఖుర్రతు ఐనీ ఫిస్సలాత్
(నా కంటి చలువ నమాజులోనే ఉంది!!)

శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా


సోదర సోదరీమణులారా!

నేడు ఎటు చూసినా అశ్లీలత, నీతి బాహ్యత, విశృంఖలత్వం పెచ్చరిల్లినట్లు కానవస్తుంది. స్త్రీ పురుషులు కలిసి విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఒక నిజమైన విశ్వాసి, ముఖ్యంగా తన ఇల్లూ వాకిలినీ, కుటుంబీకులను వదలి దూరదేశంలో జీవన పోరాటం సాగిస్తున్న యువతీయువకులు తమ శీలాన్ని, మాన మర్యాదలను రక్షించుకోవటానికి సదా అప్రమత్తులై ఉండాలి -  అందుకే ఈ సందర్భంగా దైవ ప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) గారి సౌశీల్యాన్ని గురించి చెప్పదలిచాము.



దైవ ప్రవక్త యూసుఫ్ (అ) ప్రవక్తల వంశంలో పుట్టారు. తండ్రి యాకూబ్ (అ) ఆ అబ్బాయిని ఎంతో ప్రేమతో పెంచేవారు. దీన్ని ఇతర సోదరులు ఓర్చుకోలేకపోయారు. విహార యాత్ర పేరుతో యూసుఫ్ (అ) ను అడవికి తీసుకెళ్ళి బావిలో పడవేశారు. దారిన పోయే ఒక వర్తక బిడారు ఆ పసి వాణ్ణి ఈజిప్టు దేశానికి తీసుకెళ్ళి ఒక బాని సగా అమ్మివేసింది. ఆ అబ్బాయిని ఈజిప్టు అధికారి (అజీజ్) కొనుగోలు చేశాడు.

యూసుఫ్ (అ) అందాన్ని, గుణగణా లను చూసి అజీజ్, అతని భార్య జులైఖా  మురిసిపోయేవారు. ఆ దంపతులకు సంతానం లేదు. అందుచేత వీలైతే ఈ అబ్బాయినే దత్తపుత్రునిగా చేసుకుందామన్న ఆలోచన కూడా వారికుండేది. 

యూసుఫ్ వయసు పెరిగేకొద్దీ ఆయన అందం కూడా పెరిగింది. మరోవైపు అజీజు భార్య జులైఖా  ఉద్దేశం కూడా మారిపో యింది. ఆ బానిస అబ్బాయిపై జులైఖా మనసు పారేసుకుంది. ఎలాగైనా అతన్ని పొందాలనుకుంది. అదను చూసి వల పన్నింది. ఇంట్లో భర్తగానీ, సేవకులుగానీ లేని సమయం చూసి, ఆ దొరసాని బాగా ముస్తాబై రాజ భవనం తలుపులు మూసే సింది. " రా... రమ్మం" టూ యూసుఫ్ (అ) ని సమీపించింది.

ఆలోచించండి! యూసుఫ్ (అ) యుక్త వయస్కుడు. ఆ ఇంట్లో ఒక నౌకరు. పరువం ఉరకలు వేస్తోంది. కళ్ళు చెదిరే అందాలతో, వయ్యారాలతో యజమానురాలు మరో వైపు తనను మోహిస్తోంది. కవ్విస్తూంది. తన కోరిక తీర్చకపోతే వ్యవహారం దారుణంగా ఉండగలదని  హెచ్చరిస్తోంది.... ఒకవైపు కామంతో కళ్ళు మూసుకుపోయిన దొరసాని! మరోవైపు తండ్రి నేర్పిన సంస్కారం! దైవభక్తి! - వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ.

ఎట్టకేలకు ఆయనలోని సౌశీల్య మూర్తి' దే పైచేయి అయింది. ఆయన ఇలా అన్నారు; - " నన్ను మంచి స్థితిలో ఉంచిన స్వామికి నేను ద్రోహం తలపెట్టను. నేను అల్లాహ్ శరణు కోర్తున్నాను". కాని బరితెగించిన ఆ ఆడది ఇక ఏమీ వినే స్థితిలో లేదు. యూసుఫ్ (అ)ని వెంటాడింది. యూసుఫ్ బయటికి పరుగులు తీశారు. సరిగ్గా అదే సమయంలో ఆమె భర్త అజీజ్ ఎదురు పడ్డాడు. క్షణాల్లో జులైనా ప్లేటు ఫిరాయించింది. "నీ దురుద్దేశంతో కన్నే సిన వాడ్ని చెరసాలపాలు చేయటమో, లేక మరేదైనా కఠిన శిక్ష విధించటమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది?" అంటూ శిక్ష కూడా ప్రతిపాదించింది. కాని అజీజుకు అసలు సంగతి బోధపడింది. సంస్కారం లేని ఈ ఆడవాళ్ళు పురికొల్పే పాడు పనులు చేయటం కన్నా చెరసాల జీవితమే మిన్న అని యూసుఫ్ (అ) కూడా కోరుకున్నారు. ఆ విధంగా చేయని నేరానికి జైలుకు వెళ్ళారు. కాని శీలం' విషయంలో రాజీ పడలేదు.

నిజం నిప్పులాంటిది. రాజు గారికి యూసుఫ్ (అ) లాంటి మేధావి అవసరం ఏర్పడింది. యూసుఫ్ సేవలు రాజ్యానికి అవసరమని భావించగానే ఆయన్ని జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు రాజు. కాని యూసుఫ్ అందుకు ఒప్పుకో లేదు. తనపై వల విసిరిన అంతఃపుర మహి కల కేసును తేల్చమని ఆయన పట్టుపట్టారు. జులైఖా తన తప్పును ఒప్పుకుంది. యూసుఫ్ (అ) నిర్దోషి అని సాక్ష్యమిచ్చింది. రాజుగారు యూసుఫ్ను చేరదీశాడు.

కీలకమైన రాజ్యాధికారాలను యూసుఫ్కు కట్ట బెట్టాడు. ఒక బానిసగా అమ్ముడుపోయిన దేశంలోనే యూసుఫ్ (అ) అత్యున్నత అధికారిగా వెలుగొందారు. నిస్వార్ధమైన తన ప్రతిభతో ఈజిప్టు రాజ్యాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడారు. సౌశీల్యానికి, పారిశుద్ధ్యానికి, శ్రేయోభిలాషా భావానికి దేవుడు ఇచ్చే 'ప్రతిఫలం' ఎంత గొప్పదో చెప్పకనే చెప్పారు.

"అవును. భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా చేయదు". (యూసుఫ్-90)

జీవనోపాధి కోసం అనేక ప్రాంతాల్లో, దేశాల్లో   కాలు మోపిన సోదర సోదరీమణులారా! మీ జీవితం మచ్చలేనిదిగా ఉండాలి. మీ శీలానికి కళంకం అంటకూడదు. మీ శీలాన్ని కాపాడుకోవలసింది. ఎవరో కాదు, స్వయంగా మీరే. వందల, వేల   కిలోమీటర్లు దూరంగా ఉంటూ మీ కుటుంబీకుల నుంచి మీరు 'దేన్ని' ఆశిస్తున్నారో 'దాన్నే' మీ కుటుంబీకులు కూడా మీ నుండి ఆశిస్తున్నా రన్న సంగతిని మరువకండి.


'ఏప్రిల్ ఫూల్' ఒక వెకిలి చేష్ట / మేడిపండు నాగరికత మనకొద్దు



సయ్యిద్  అబ్దుస్సలామ్ ఉమరీ 

ప్రపంచ ముఖచిత్రం రోజురోజుకీ మారిపోతూ ఉంది. నేటి మన యువతరం ఎక్కువగా ఏదో ఆందోళన, భయం, కంగారు, మానసిక ఒత్తిడితో సతమతమవుతూ ఉంది. ఏమి చేయాలో తోచక సిగరెట్లు, మద్యపానం, మాదకద్రవ్యాలపై ఆధారపడటమో, నిస్పృహకు లోనై తమనితాము వంచించుకొని, ఇతరులను మానసిక క్షోభకు గురి చేయడమో చేస్తున్నారు. ఇలాంటి చెడు అలవాట్లకు జతగా చేరిన మరో - మూర్ఖ ఆచారమే 'ఏప్రిల్ ఫూల్'




పాతదైనంత మాత్రాన ప్రతీదీ పనికిరానిది కాదు. కొత్తదైనంత మాత్రాన ప్రతీదీ గొప్పది కాదు. పాత కొత్తల మేలు కలయికే జీవితంలో అనుసరించవలసిన అసలు మార్గం. సమయం సందర్భాన్ని బట్టి ఉచితానుచితాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తమ ఆలోచనలో వైఖరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే మార్పు  చైతన్యానికి చిహ్నం! చైతన్యం జీవానికి చిహ్నం!! 

ఈ సందర్భంగా వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాలలో  పతాక శీర్షికతో  అనేక వార్తలు ... .ఎందరో  సత్పౌరుల్ని  కలతకు గురి చేస్తాయి. కాకపోతే లోపలి పేజీల్లో ఎక్కడో చెప్పబడుతుంది. 'ఏప్రిల్ ఫూల్!' అని. అయితే పరిహాసానికి ఇలాంటి వార్తలే కావాలా!? ఈ వార్తను ప్రచురించిన ఆ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గం ఆలోచనలు ఎంత ప్రమాదకరమైన దిశలో పయనిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఇది.

అలాగే విన్న ప్రతి మాటలోని నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పేయటం, లేక దాన్ని నిజమని తలపోయడం మనకు ఏ విధంగానూ శోభించదు. ఎందుకంటే-'మనిషి అబద్దాలకోరు' అని చెప్పడానికి విన్న ప్రతి మాటను (ఉచితానుచితాలు తెలుసుకోకుండా) ప్రచారం చెయ్యడం ఒక్కటి చాలు' అన్నారు. అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స).

'అబద్ధం చెడు గుణాలన్నిటికీ మూలం' అన్నారు వెనుకటికి పెద్దలు. అబద్ధం చెప్పే ఈ దురలవాటుని ప్రపంచ మతాలన్నీ తప్పు  పట్టాయి. బుద్ధి వివేకాలు సైతం ఈ మాటను సమర్ధిస్తాయి.
అదే సత్యసంధతను తీసుకోండి. అది మానవ ప్రగతికి, లోకాభివృద్ధికి ఆయువు పట్టులాంటిది. సత్యం లోకంలో జరిగే మేళ్ళన్నింటికి సరోవరం. అది దైవ దౌత్యపు ఉత్పత్తి స్థానం. దైవ భీతికి చిహ్నం. సత్పురుషులు సేద తీరే ఆలయం. సత్యసంధతే గనక లేకపోతే నేడు మనకు అందుబాటులో ఉన్న మంచి సూత్రాలన్నీ కాలం చెల్లిన సిద్ధాంతాలుగా మిగిలిపోయి ఉండేవి. ఈ కారణంగానే ఇస్లాం ధర్మ శాస్త్రం -ప్రతి భక్తుడు సత్యసంధతను తన ఆభరణంగా స్వీకరించి,  నీతి, నిజాయితీగా బ్రతికేందుకు కృషి చేయాలని వక్కాణిస్తోంది. అబద్ధం, అపహాస్యం, అపనింద, అపవాదాలకు ఆమడ దూరంలో ఉండాలని హితవు చేస్తోంది. ఎందుకంటే- సత్యసంధత మంచి వైపు తీసుకెళుతుంది. సత్కార్యం స్వర్గానికి గొనిపోతుంది. (బుఖారీ)  ఇక 'స్వర్గం' అంటారా! అది ప్రతి భక్తుడి యొక్క సత్కార్యాలకు ప్రతిఫలంగా ప్రాప్తించే శాంతి నిలయం!! దారుస్సలాం!!! 

మహా ప్రవక్త (స) వారికి సైతం అబద్ధాలకోరంటే మహా అసహ్యం. కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్ధాన్ని పేర్కొన్నారు. అబద్ధం- అది అవిధేయత వైపు తీసుకెళుతుంది. అవిధేయత నరకానికి గొనిపోతుంది. (బుఖారీ) 

నరకం మహా భయంకర నివాసం. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తీ దాన్నుండి అల్లాహ్  శరణు కోరుకుంటాడు. దాన్నుండి శాయశక్తులా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ఆ సత్య స్వరూపుడు చేసే హితవును కాస్త గమనించండి! "విశ్వాస భాగ్యం పొందిన ప్రజలారా! అల్లాహు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి' (తౌబా: 119)

కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్ధాన్ని పేర్కొన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). అవి: (1) కపటి - అతనికి ఏదైనా వస్తువు అప్పగిస్తే
ద్రోహానికి పాల్పడతారు. (2) నోరు తెరిస్తే అబద్ధం చెబుతాడు. (3) మాట ఇచ్చి తప్పుతాడు. (4) గొడవకు దిగితే (పచ్చి బూతులు తిడుతూ) నోరు పారేసుకుంటాడు.' (ముస్లిం)

అయితే నేడు అత్యంత బాధాకరమైన విషయం. ఏమిటంటే- పాశ్చాత్య దుష్కృతి  మోజులో పడి, గాడి తప్పి ప్రవర్తిస్తోంది మన యువతరం. మానవ జీవితాల్లో వెగటును నింపి, మానవతను ఛిన్నాభిన్నం చేసి, జీవితాల్లో శాంతి తృప్తి అన్నవి లేకుండా చేసిన పాశ్చాత్య విష సంస్కృతి నేటి మన యువతరానికి ప్రోగ్రసివ్ నాగరికతగా తోచడం కడు శోచనీయం! పాశ్చాత్య సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్న మరో ఫూల్ ఆచారమే 'ఏప్రిల్ ఫూల్'! 

ఈ వెర్రి పోకడ కారణంగా ఎంత మంది ప్రజలు మనోక్షోభకు గురయ్యారు? ఎంత  మంది మానమర్యాదలు మంటగలిశాయి? ఎన్ని ఆర్థిక నష్టాలు జరిగాయి? ఎందరి జీవితాలు ఈ పెనుభూతానికి బలయ్యాయి? పైపై దృష్టిగలవారికి విడమరచి చెప్పినా ఇది బోధపడదు. ఇలా చేసే వారి వైఖరిని ప్రవక్త (స) తీవ్రంగా ఖండించారు. "ప్రజల్ని నవ్వించేందుకు అబద్ధమాడే వ్యక్తి నాశనంగాను, నాశనంగాను" అని గర్హించారు. హజ్రత్ ఉమర్ (ర.జి) గారు ఇలా అభిప్రాయ పడ్డారు: 'విశ్వాస శిఖరానికి చేరుకోవాలంటే మాట వరుసకైనా, అబద్ధం అనకూడదు. హద్దు మీరిన పరిహాసం వల్ల మనిషి ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఇతరుల్ని అపహాస్యం పాలుజేసి నవ్వుకునే వ్యక్తి కన్నా- తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకునేవాడు మరొకడుండడు.

ఇక ప్రియప్రవక్త(స) వారి విషయానికొస్తే అప్పుడప్పుడు మహాప్రవక్త(స) వారి మాటల్లో హాస్యం తొణికిసలాడేది అన్న మాట నిజమే. అయితే ఆయన (స) చెప్పే ప్రతి మాటలోనూ సత్యం ఉట్టిపడుతూండేది. తరచూ ఆయన(స) "నిశ్చయంగా నేనూ  హాస్యమాడుతాను ...   సత్యం తప్ప మరో మాట  నా నోట పలుకను” (తబ్రానీ) అనేవారు. పోతే శిక్ష అంటారా! మేరాజ్ సందర్భాన ప్రవక్త(స) చూసిన అనేక దృశ్యాల్లోని ఒక దృశ్యానికి వివరణ చెబుతూ దైవదూతలు ఇలా అభిప్రాయపడ్డారు: "మేము సమీపించిన మూడవ వ్యక్తి అతని దవడను, ముక్కు రంధ్రాన్ని, కంటిని, మెడ వెనుక భాగం వరకూ చీలేయబడుతూ ఉంది. అతడు ఎవరంటే ఉదయం తన ఇంటి నుండి బయలు దేరినప్పటి నుంచి అబద్ధాలు చెబుతూ (తిరుగుతూ ఉండేవాడు. అతడు చెప్పిన అబద్ధాలు ( లోకం ) నలుదిక్కులా (ఆకాశం అంచులదాక) వ్యాపించేవి." (బుఖారీ)


ఇతరులు మనల్ని ఆట పట్టించటాన్ని, అవహేళన చేయటాన్ని మనం ఎలాగైతే ఇష్టపడమో, మనం ఇతరుల్ని అపహాస్యం చేయడం, ఆట పట్టించడం, ర్యాగింగ్ చేయడం వారికీ సుతరామూ ఇష్టం ఉండదు. "వ్యక్తి తన కోసం దేన్నయితే ఇష్టపడతాడో తన సోదరుడి కోసం కూడా దాన్నే ఇష్టపడాలి. అప్పుడే అతను   నిజ ముస్లిం అవుతాడు "  (తబ్రానీ)  అని ప్రవక్త(స) చెప్పే వున్నారు. అంతగా నవ్వాలనే అనుకుంటే - కాలే కడుపుల మంటను పిడికెడు అన్నంతో చల్లార్చి నవ్వండి. బట్టలు లేక అర్ధనగ్న శరీరాలతో చితికి పోయిన బ్రతుకులకు నిండు బట్టలు తొడిగించి నవ్వండి. తల దాచుకోవటానికి పూరి గుడిసె అయినా లేక ఫుట్పాత్ పై పడి అల్లాడే అభాగ్యులకు ఆశ్రయం కల్పించి నవ్వండి. అప్పుడు మీ సంతోషానికి పుణ్యమూ లభిస్తుంది, మీ ఆనందానికి ఓ అర్ధమూ ఉంటుంది. అంతే గాని పాశ్చాత్య నాగరికత మోజులో పడి మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకండి. ఏప్రిల్ ఫస్ట్ లాంటి ఫూల్స్ ఆచారాలకి దూరంగా ఉండండి. దైవశిక్షకు భయపడండి. పగ ద్వేషాలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పండి. ఇలా గనక మీరు చేస్తే ఇటు మనుషులూ సంతోషిస్తారు. అటు దేవుడూ  మెచ్చుకుంటాడు. మార్పు అవసరమే. మారేందుకు సిద్ధమవ్వండి. గతం గతః. మంచి
భవిష్యత్తుకు బాట వేయవలసిన అవసరం, సమయం ఆసన్నమయ్యాయి అని గుర్తించండి, చివరి మాటగా ఆ మాధవుడి మాటను స్వీకరించండి! 

"మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి (ప్రతి ఇంద్రియం) విషయంలోనూ విచారణ జరుగుతుంది." (బనీ ఇస్రాయీల్: 34)

Friday, September 23, 2022

ఆత్మహత్య మహా నేరం

ఈ విశ్వంలో, ప్రతి మానవుడు ఆనందం, ఉల్లాసం, ఉత్తేజం, శాంతి, సౌఖ్యం, సౌలభ్యం మరియు ఆరోగ్యంతోపాటు నొప్పి, బాధ, ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, నష్టాలుఅనారోగ్యం, విపత్తులు, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ అవస్థలు, దురవస్థలు  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ చిత్తానికి లోబడి ఉంటాయి అని ఒక విశ్వాసి బలంగా నమ్ముతాడు. నమ్మాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు: (ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్  మా అదృష్టంలో రాసింది తప్ప (కీడుగాని, మేలుగాని) మాకేదీ జరగదు. ఆయనే మా సంరక్షకుడు, సహాయకుడు. విశ్వాసులు ఆయన్నే నమ్ము కుంటారు.” (తౌబహ్ -51)

పరిస్థితి అనుకూలమైనా, అననుకూలమైనా, విశ్వాసి ప్రవర్తన ఎలా ఉండాలి? అన్నదానికి  సంబంధించి ఖురాన్ మరియు హదీసులలో పుష్కలమైన మార్గదర్శకత్వం ఉంది.హజ్రత్ సుహైబ్ బిన్ సినాన్ రూమీ నుండి ఉల్లేఖనం. అల్లాహ్  ప్రవక్త (స)  ఇలా అన్నారు: "విశ్వాసి విషయం చాలా  విచిత్రమైనది. అతను చేసే ప్రతి పనిలో అతనికి మంచే  ఉంటుంది. కష్టం, నష్టం కలిగినప్పుడు అతను ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే అది అతనికి మంచే చేస్తుంది.   కలిమి స్థితి కలిగి  కృతజ్ఞతతో ఉంటే, ఈ కృతజ్ఞత అతనికి మంచే చేస్తుంది.  (సహీహ్ ముస్లిం)

ఆత్మహత్య అంటే ఏమిటి?

''ఏళ్లు ముదిరి.. కీళ్లు కదిలి.. బతుకంటే కోర్కె సడలి''.. కాదు; కాదు.. చికిత్సకు లొంగని రుగ్మతతో.. అందని అన్నంతో.. వైద్యంతో.. ఏలాగౖతేనేమ్‌? రూపం ఏదైతేనేమ్‌? అంతిమంగా జీవి 'విగతం' కావడం మరణం! అదే చివరి చరణం కాబోదు!! కానీ, కావాలని.. తనను ప్రేమించే వారి అభీష్టాలకు విరుద్ధంగా..తనకు తాను అర్థంతరంగా.. అర్థం లేకుండా..బలవంతంగా.. అంతులేని బాధననుభవిస్తూ.. తన తనువు చాలించుకోవడం.. అదే ''ఆత్మహత్య''. దానిని 'మహా పాతకం' అని అభివర్ణించారు పెద్దలు.



ఆత్మహత్య అనేది ఓ  పిరికితనం.  ధైర్యం లేని వ్యక్తులు ఒడిగట్టే ఓ క్షణిక చర్య. బలహీన క్షణంలో  నిరాశకు గురైన వ్యక్తులు -  జీవిత సమస్యలు,  కష్టాలు, పరీక్షలు మరియు బాధ్యతల నుండి తప్పించుకోవడానికి చేసే అనాలోచిత పని. ముమ్మాటికీ ఇది గర్హనీయం,  అనైతికం  మరియు చట్టవిరుద్ధ, ధర్మ విరుద్ధ మార్గం.

 దురదృష్టవశాత్తు, నేడు   ప్రజల్లో అత్యాశ వల్లనో, అవమాన భయంతోనో,  విశ్వాస లేమి మూలంగానో  ఒకానొక  బలహీన క్షణంలో  ఈ ఆత్మహత్య జాధ్యం రోజురోజుకి పెరిగిపోతోంది.  పాశ్చాత్య దేశాలలో, నైతిక మరియు సామాజిక వ్యవస్థ యొక్క గందరగోళం కారణంగా, ఆత్మహత్య సంఘటనల నిష్పత్తి చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ఆత్మహత్యను ప్రైవేట్ మానవ హక్కుగా గుర్తించాలి అని డిమాండ్ చేసే దౌర్భాగ్య స్థితి ఏర్పడింది.

ఏటా పది లక్షల మంది ప్రజానీకం ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతోంది. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు నిహతులవుతున్నారు. ఆత్మహత్యలో సఫలీకృతులైన వారి కన్నా.. యత్నించి విఫలమైన వారి సంఖ్య అందుకు ఇరవై రెట్లు! అంటే ప్రతి మూడు సెకండ్లకు ఒక ఆత్మహత్యా యత్నం ఈ భూమండలం మీద ఏదో ఒక మూలన అనునిత్యం జరుగుతూనే ఉందన్న మాట!

ఆత్మహత్య ఎందుకు నిషిద్ధం?

ఆత్మహత్య గురించి  ఇస్లాం బోధనల సారాంశం ఏమిటంటే, ఈ చర్య  నిషేధించబడింది. ఈ నిర్వాకానికి పాల్పడే వాడు పాపి, నరకవాసి. ఖురాన్, హదీసు వెలుగులో వైశ్య నిర్ధారణకు ముందు , ఇస్లాం ఆత్మహత్యను  ఎందుకు అంత పెద్ద నేరంగా పరిగణించిందో చూద్దాం.

యదార్థమేమిటంటే, మన ఈ  శరీరం మరియు జీవితం  మన  వ్యక్తిగత ఆస్తి  కాదు, దాని మనం సంపాదించనూ లేదు. అది  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు అప్పగించిన గొప్ప అమానతు.  జీవితం అల్లాహ్  మనకు ప్రసాదించిన  గొప్ప అనుగ్రహం, అదే  అన్ని ఇతర అనుగ్రహాలను మూల ఆధారం. అందుకే ఇస్లాం, శరీరం మరియు ఆత్మ  రక్షణ గురించి  ఆదేశిస్తూ, సమాజంలోని సభ్యులందరికీ ప్రాణాలను రక్షించడం తప్పనిసరి చేసింది. ఈ (హత్య) కారణంగానే మేము ఇస్రాయీల్‌ సంతతివారికి ఇలా ఒక ఉత్తర్వు జారీ చేశాం:“ఎవరైనా ప్రతీకార హత్య(శిక్ష)గా లేక ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే.” (మాయిదహ్: 32) 

మానవ జీవితం పూర్తి భద్రత మరియు శక్తితో ప్రకృతి కర్మాగారానికి ఉపయోగపడాలని ఇస్లాం అభిలషిస్తోంది.  దానికి తగ్గ బోధనలు, సూచనలు ఇస్తుంది.  ఇస్లాం ఆత్మహత్యను హరామ్‌గా ప్రకటించడానికి ఇదే కారణం. ఇస్లాం ఏ వ్యక్తికి తన జీవితాన్ని నాశనం చేసుకునే అనుమతిని, అధికారాన్ని ఇవ్వదు.

జీవన్మరణాల కు నిజమైన  ప్రభువు అల్లాహ్. ఒక వ్యక్తిని చంపడం మొత్తం మానవాళిని చంపినట్లు వర్ణించబడినట్లే,  ఒకరి స్వంత జీవితాన్ని అంతం చేయడం లేదా  అకారణంగా వినాశనం పాలు చేయడం  కూడా సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు నచ్చని చర్య. ఖురాన్ ఇలా అంటుంది:  మీరు మీ చేజేతులా నాశనం కొనితెచ్చుకోకండి. సత్కార్యాలు చేయండి. సత్కార్యాలు చేసేవారినిఅల్లాహ్  తప్పకుండా ప్రేమిస్తాడు. (అల బఖరః - 195)

మరో చోట ఇలా ఉంది; (అన్యాయం, అక్రమం, హత్య, ఆత్మహత్యల ద్వారా) మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి. అల్లాహ్  మీ విషయంలో ఎంతో దయామయుడని తెలుసుకోండి. అన్యాయం, అక్రమాలతో ఇలా చేసేవాడ్ని మేము త్వరలోనే నరకాగ్నిలో విసరి వేస్తాం. ఇది అల్లాహ్ కు  ఏమంత కష్టం కాదు. మిమ్మల్ని వారిస్తున్న ఘోరమైన పాపాలను మీరు మానుకుంటే మేము మీ చిన్నచిన్న పాపాల్ని మీ కర్మలచిట్టా నుండి తొలగిస్తాం. పైగా మిమ్మల్ని ప్రతిష్ఠాకరమైన (స్వర్గ)ధామంలో ప్రవేశింపజేస్తాము. (నిసా: 29-31)

ప్రవక్త (స) ఇలా అన్నారు: మీ శరీరానికి మీపై హక్కు ఉంది మరియు మీ కళ్ళకు మీపై హక్కు ఉంది.(బుఖారీ) ఈ వచనం దృష్ట్యా - మనం శరీర రక్షణ, శరీరావయవాల సంరక్షణ తప్పనిసరి అని తెలుస్తుంది.

ఆత్మహత్యకు పాల్పడే వారికి రెట్టింపు శిక్ష ఉంటుంది

ఒక వ్యక్తి గాయపడి వాటి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. "నా దాసుడు తొందరపడి తనను తాను చంపుకున్నాడు, ఇతనికి పరలోక ప్రవేశం ఉండదు" అంటాడు అల్లాహ్. (బుఖారీ 2:445)

ఊపిరాడకుండా చేసుకొని చనిపోయినవాడు నరకంలో కూడా ఊపిరాడని శిక్షలోనే ఉంటాడు. కత్తితో పొడుచుకొని చనిపోయినవాడు నరకాగ్నిలో సదా తనను తాను పొడుచుకుంటూనే ఉంటాడు. " (బుఖారీ 2:446)

ఒకడు ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో పునరుత్థాన దినాన అదే వస్తువుతో హింసించబడతాడు. (బుఖారీ 8:73)

ఎన్నో అక్రమ వ్యవహారాలకు శిక్ష నరకమే అయినా ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మళ్లీ మళ్లీ ఈ బాధను అనుభవించేలా  నరక శిక్ష ఉంటుంది.  ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తికీ ఇది రెట్టింపు శిక్షలా ఉంటుంది.

ఆత్మహత్య చేసుకోమని ఆదేశించే  పెద్దల ఖండన

అనవసరంగా మానవ ప్రాణాలకు హాని కలిగించే మత  పెద్దలకు, గురువులకు, నాయకులకు, పాలకులకు చట్టవిరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా విధేయత చూపడం నిషేధం. ఉన్నతాధికారుల ఆదేశాలే, మత పెద్దల ఆజ్ఞలే, నాయకుల సైగలే  ఆత్మహత్యకు కారణమం అన్నది ఆత్మాహుతికి పాల్పడే యువకుల మాట. ఏం జరుగుతుందంటే, నాయకుని  విధేయత అనేది వారి మనస్సులలో బలంగా నాట బడుతుంది.  కానీ ఇస్లాంలో ఈ రకమైనటువంటి  విధేయతకు కొన్ని పరిమితులు, నియమాలు, షరతులు ఉన్నాయని పాపం ఆ యువతకు  తెలియదు.  నాయకునికి ఒకింత ఆధిపత్యం, అధికారం కలిగి ఉంటాడు. అంత మాత్రానికే  స్వంత ప్రాణాలను,  ఇతరుల విలువైన జీవితాలను నాశనం చేయడం చాలా అజ్ఞానం, మూర్ఖత్వం మరియు పూర్తి ఆటవికం. అట్టి  నాయకులు మరియు వారి అనుయాయుల  గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏం చెప్పారో  చూద్దాం.

హజ్రత్ అలీ (ర) ఉల్లేఖన ప్రకారం, దైవ ప్రవక్త (స) ఒక సైన్యాన్ని పంపి, దానికి అన్సార్ల నుండి ఒక వ్యక్తిని సేనానిగా నియమించి, సైన్యాన్ని కమాండర్ ఆజ్ఞను వినమని, అతనికి విధేయత చూపమని ఆజ్ఞాపించారు

 (అనుకోకుండా) ఆసేనాని  ఏదోక  విషయంలో వారితో కోప్పడ్డాడు. అదే కోపంతో (ఊగిపోతూ) ఇలా అన్నాడు: నా కోసం కలప సేకరించండి. సైన్యం కలపను సేకరించినప్పుడు, అతను ఇలా అన్నాడు: అందులో నిప్పుని రాజేయండి. వారు మంటలను రాజేశాక , సేనాని  ఇలా అన్నాడు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు కట్టుబడి ఉండమని మిమ్మల్ని ఆదేశించలేదా?

దానికి సైన్యం ఎందుకు కాదు! అవును అని సమాధానం ఇచ్చింది. అప్పుడు కమాండర్: అయితే ఇప్పుడే  ఈ అగ్నికి మిమ్మల్ని మీరు ఆహుతి చేసుకోండి అని ఆదేశించాడు.

ఉల్లేఖకులు  ఇలా అన్నారు: దీనిపై వారు లేచి నిలబడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోనారంభించారు. వారిలో కొందరు ఇలా అన్నారు: మేము అగ్ని నుండి రక్షణ పొందడానికే కదా  అల్లాహ్ ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వసల్లం)ని అనుసరించాము.  (అలాంటప్పుడు మనం ఎందుకు ఇందులో  ప్రవేశించాలి)? వారు ఈ  విధమైనటువంటి తర్జనభర్జనల్లో ఉండగా, సేనాని  కోపం చల్లారింది మరియు మంటలు ఆర్పీవేయబడ్డాయి. అనంతరం  వారు తిరిగి వచ్చి ఈ సంఘటనను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ప్రస్తావించారు. సాంతం విన్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ''ఒక వేళ వారు అందులో ప్రవేశించి ఉన్నట్లయితే,  దాని నుండి వారు ఎప్పటికీ బయటకు రాలేకపోయేవారు, ఎందుకంటే మంచి విషయాలలో మాత్రమే విధేయత తప్పనిసరి. (ముస్లిం)

హదీసుల వెలుగులో, ఆ ఆత్మాహుతి దళాలు  వారి నిర్వాకాలను ఓ సారి సమీక్షించు కోవాలి.  వారు తమ కమాండర్లు మరియు అమీర్‌లు, పెద్దలు అని పిలవబడే వారి విధేయత  మత్తులో మునిగి, మతం పేరుతో పౌర జనాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ఎంత వరకు సబబు? ఇలాంటి దుశ్శిక్షణ, దుర్మార్గం వల్ల   వారు ఇతర వ్యక్తులను చంపడమే కాకుండా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హెచ్చరిక  ప్రకారం తమను తాము నరకానికి ఇంధనంగా మార్చుకుంటున్నారు. రేపు ప్రళయ  దినాన అల్లాహ్ కు  ఎలా ముఖం  చూపిస్తారు? అని ఆలోచించాలి.  

ఆత్మహత్యకు గల కారణాలు

జీవితంలోని ఎత్తుపల్లాలు  అందరికి ఒకేలా ఉండవు.  కొందరికి ఎంతటి బాధనైనా తట్టుకునే ధైర్యం ఉంటే, మరికొంత మంది చిన్న ప్రమాదంతో కలత చెంది దిక్కుతోచని స్థితిలో పడిపోతారు.

* ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, అవాంఛిత గర్భం, వరకట్న వేధింపులు, నయంకాని జబ్బులు, అనారోగ్యం, తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆర్థిక ఇబ్బందులు,రాజకీయ అస్థిరత, మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం, ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం, అనువంశిక, జన్యులోపాలు, కుటుంబంలో ఏవరి అండదండలు లేకపోవడం వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం, మోసపోవడం, మతిస్తిమితం సరిగ్గా లేకపోవటం, మద్యానికి బానిస కావడం, భార్యాభర్తల మద్య గొడవలు, మనస్పర్థలు,  ఒకరినొకరు అర్థం చేసుకొకపోవడం వంటివి కొన్ని కారణాలని చెప్పవచ్చు.

* ఇంత నిశితంగా భూమిని సూర్య చంద్రాది సకల గ్రహాలను మోసేవాడు మనభారం మోయలేడా ఒకసారి ఆలోచించండి, ఎటొచ్చి మనలో కొందరు దైవాన్ని  నమ్మక పోవడం ఆయనపై ఆయనశక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచకపోవడమే ఒక కారణం!

 

ఉపాయ మార్గాలు

* ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడక్కడ వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు.

* పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు... చిన్న విషయానికే ఆవేశం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి.

* బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తు తెచ్చుకోవాలి.

* సమస్యలను అవి ఎంత జఠిలమైనవైనా సరే  తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.

* ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు ఆధ్యాత్మిక జీవనం అలవరచాలి. పూర్తిగా లౌకికంగానే పెంచకూడదు. వారి సమస్యలను మీ సమస్యలుగా తీసుకోండి వారికి మీరు పూర్తి ధైర్యం ఇవ్వండి దేనికైనా మేమున్నాం అనే భరోసాను ఇవ్వండి తమ కుటుంబాల నుండి సంపూర్ణంగా మద్దతు భరోసా లేకపోవడం వల్లనే వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజు మన కళ్ళముందు తిరిగే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే దానికి కారణం అతనికి ఇంట్లో వాళ్ల మద్దతు సమాజం మద్దతు లేకపోవడమే, అదే గనుక అతనికి ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి రాదు, అతన్ని ఒంటరివాన్ని చేసి అతని భాధలు కష్టాలు,అతనిపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకోక పోవడంతో, మానసికంగా ఒంటరివాడై తనను ఎవ్వరు పట్టించుకోవడం లేదు అనీ ఇక ఎందుకు బ్రతకాలి అనే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. కాని ఇది సరైన మార్గం కాదు, అలాంటి సమయంలో వారికి స్థైర్యాన్ని ఇవ్వడంలో కుటుంబం సమాజం ముందుండాలి.

* ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు ప్రతీ సమస్యను శోధించి సాధించాలి, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారు అర్ధాంతరంగా అసువులు బాయడం సరైంది కాదు, ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు ఒకరి చావుతో సమస్యలు తీరిపోవు. కనిపెంచిన తల్లితండ్రులను లేదా మీ కడుపున పుట్టిన పిల్లల్ని అనాదలుగా చేయకండి, వారి ఆశలు అడియాశలు చేయకండి వారి కలలు కల్లలు చేయకండి!

* తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు ధైర్యం, నమ్మకం, భరోసా, ఇవ్వండి వారి కష్టనష్టాలు మీవిగా భావించి వారికి అండగా నిలవండి. మనో ధైర్యాన్ని ఇవ్వండి, మంచి మార్గంలోకి రావడానికి ఆసరా ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, అన్నీటికీ మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి ఆత్మహత్యలు నివారించండి.

 

 

 

 

 

 

 

 

 

 

నర విజయానికి నిచ్చెన నిజాయితీ, నిబద్ధత / The ladder to success is hone...

Thursday, September 15, 2022

సాధన సాధ్యతే సర్వం / Practice is everything

Monday, September 12, 2022

మోక్షం ఎలా సాధ్యం / How is salvation possible

Wednesday, September 7, 2022

Friday, September 2, 2022

అల్లాహ్ పరిచయం / Introduction to Allah