Saturday, March 29, 2025
Friday, March 28, 2025
Thursday, March 27, 2025
Wednesday, March 26, 2025
Monday, March 24, 2025
Sunday, March 23, 2025
Saturday, March 22, 2025
Thursday, March 20, 2025
Tuesday, March 18, 2025
Monday, March 17, 2025
Sunday, March 16, 2025
Saturday, March 15, 2025
Friday, March 14, 2025
Thursday, March 13, 2025
Wednesday, March 12, 2025
Sunday, March 9, 2025
Saturday, March 8, 2025
Friday, March 7, 2025
Thursday, March 6, 2025
Tuesday, March 4, 2025
నిన్ను నువ్వు గెలవడమే ఉపవాస లక్ష్యం
నిన్ను నువ్వు గెలవడమే ఉపవాస లక్ష్యం – ప్రపంచంలో ముస్లింలు ఏ మూలన నివసించేవారైనా అరబ్బులైనా, అమెరికన్లయినా, ఆఫ్రికన్లయినా, ఆర్యులైనా, ద్రావిడులయినా, రష్యన్లయినా, చైనీ యులైనా, శ్రీమంతులైనా, నిరుపేదలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పాలకులైనా, పాలితులైనా, రాజులైనా, సామాన్యులైనా – సర్వజనులూ విధిగా పాటించవలసిన మత ధర్మం ఉపవాసం. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ విధించిన నియమానుసారం ప్రతి సంవత్సరం రమజాన్ నెల సాంతం ఆచరించవలసిన విధానం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సి భాషలో ‘రోజా’ అని అరబీలో ‘సౌమ్’ అని, ఇంగ్లీషులో ‘ఫాస్ట్’ అని, తెలుగులో ఉపవాసం, వ్రతం, నోము అని అంటారు.
ఇస్లామ్ ప్రతిపాదించే ఆరాధనా భావన విస్తృతమయింది ఇందులో పూజా భావంకన్నా విధేయతా భావానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. స్వామికి స్తోత్రగానం చెయ్యడంతోపాటు ఆయన ఆజ్ఞాపాలన, అప్పగించిన సేవల నిర్వహణ, అప్పజెప్పిన సంబంధాల పరిరక్షణ ఇస్లామీయ ఆరాధనా భావంలో అంతర్భాగమయి వుంటాయి. అంటే సర్వసంగ పరిత్యాగం చేసి, ప్రపంచాన్ని దాని మానాన వదలిపెట్టి తపో సాధన చేసి సాధించేదేమీ లేదు. ప్రపంచ కార్యకలాపాల్లో నిమగ్నమయి, ప్రాపంచిక జీవితపు సమస్త బాధ్యతలను సక్రమంగా, సవ్యంగా నిర్వహించి దైవాజ్ఞ బద్ధంగా, దైవశాసన పాలన చెయ్యడం. దైవసంస్మరణకు దూరం చేసే ప్రపంచంలోనే మునిగి, దైవాన్ని విస్మరించకుండా అనునిత్యం దైవాన్ని సంస్మరిస్తూ జీవితం గడపడం- అదే ఆరాధన. అదే నిజమయిన పూజా భావం, అదే యదార్ధ ధ్యాన నిమగ్నత. అదే వాస్తవ తపస్సు, అదే అసలయిన ఆరాధన! ఇస్లామీయ ఆరాధానాభావం ఉద్దేశం మానవ జీవితమంతా దైవదాస్య దర్పణం కావాలన్నది.
దానికి అది సాధనా రూపాలను ప్రతిపాదిస్తుంది. అలాంటి ఓ సాధనే ఉపవాసం. రమజాన్ నెలలో ఇస్లామ్ అనుయాయులు పాటించే ప్రముఖ ఆరాధనా రూపం, రోజా-ఉపవాస వ్రతం. ఇస్లామ్- దైవవిధేయతా ధర్మం, మానవుని ఆది ధర్మం, సనాతన ధర్మమయినట్లే రోజా వ్రతం కూడా ఆది నుండీ ధర్మంలో అంతర్భాగంగా భాసిల్లుతూ ఉంటూ వచ్చింది. దాని నియమాలు ఆయా కాలాల్లో వేర్వేరుగా ఉన్నప్పటికీ అది సకల దైవ శాసనాంగాల్లోనూ విడదీయరాని అంశంగా అలరారుతూ వచ్చింది. ప్రవక్తలందరూ బోధించిన ధర్మంలో తప్పనిసరి విధిగానే విరాజిల్లింది. దివ్యఖుర్ఆన్ ఇస్లామీయ సముదాయానికి ఉపవాసవ్రతాన్ని విధిస్తూ ఈ సత్యాన్ని ఇలా ప్రకటించింది: ఏ విధంగానయితే గతించిన సముదాయాల ప్రజలకు ‘రోజా’ విధిగా నియమించబడిందో అదే విధంగా మీకూ విధిగా ఏర్పరచడం జరిగింది. (అల్‌ఖర: 183)
నమాజ్ ప్రతి రోజూ అయిదు పూటలా మనిషిని, నీవు అల్లాహ్ దాసుడవు, దైవాజ్ఞాపాలన నీ విధి అని గుర్తు చేస్తూ ఉంటే తాను దైవ దాసుడన్న చేతన మనిషిలో సదా పునరుజ్జీవిస్తూ ఉంటుంది. అలా బాధ్యతా భావంతో మెలిగేవానిగా మనిషి రూపొందుతూ ఉంటాడు. అయితే రోజా వ్రతం రమజాన్ నెల సాంతం, ప్రతి క్షణం మనిషిలో ఈ చేతనను, ఈ స్పృహను, సక్రియగా, సజీవంగా సముద్ధరిస్తూ ఉంటుంది. పైన పేర్కొన్న ఆయత్ లో రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించిన చోటనే రోజా వ్రతం ఉద్దేశ్యాన్ని ఖుర్ఆన్ ఇలా ప్రస్పుట పరుస్తుంది: “తద్వారా మీరు తఖ్వా (ధర్మనిష్ఠ) గుణం గలవారుగా రూపొందాలన్నది ఉద్దేశ్యం. (అల్ బఖర: 183)
అంటే రోజా వ్రతం ఉద్దేశ్యం మనిషిని కేవలం ఆకలిదప్పులకు గురి చేయడం కాదు, మనిషి తన సహజ వాంఛల్ని చంపుకుని సన్యాసిగా రూపొందాలన్నది కూడా కాదు, ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో, కొండగుహల్లోనో ధ్యాన నిమగ్ను డవడం అంతకన్నా కాదు; అసలు ఉద్దేశ్యం తఖ్వా గుణం పొందడం. మరి తఖ్వా అంటే ఏమిటి? సర్వ సంగ పరిత్యాగం కాదు, ఆకస్మాత్తుగా జ్ఞానోదయమయి, భార్యాపిల్లల్ని శయన మందిరంలో వదలి, సాంసారిక, సామాజిక బాధ్యతలకు చరమగీతం పాడి, భవబంధాలకు కటువుగా విడాకులివ్వడం కాదు, ఆధ్యాత్మిక వికాస సాధనకు భౌతిక వికాసాన్ని కాలదన్ని, శరీరాన్ని బాధలకు, యాతనలకు గురిచెయ్యడం శుష్కింపజేయడం అంతకన్నా కాదు.
మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోర్కెలు, ఆకాంక్షలు, ఆశంకలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళ పొదలు ముసురుకుని ఉంటాయి. ఈ దారిలో ఈ రకరకాల పరికి కంపల నుండి తప్పించుకుని నడవడం, విధేయతా పథాన ముందుకు సాగడమే తఖ్వా , ధర్మనిష్ఠ. ప్రపంచంలోనే జీవిస్తూ దైవం మోపిన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ, సాంసారిక కష్టసుఖాలను సమభావంతో అనుభవిస్తూ, సుఖదు:ఖాల మధ్య, ప్రాపంచిక లాలసల మధ్య, ఆశానిరాశల మధ్య, పేరాశ అత్యాశల మధ్య, కలిమిలేముల మధ్య, ఆకర్షణలు వికర్షణల మధ్య, గెలుపోటముల మధ్య, జీవితాన్ని ఏ ఒక్క వైపునకూ మొగ్గకుండా కాపాడుకుంటూ, ప్రాపంచిక భోగభాగ్యాలను ఆస్వాదిస్తూనే లోకాన్ని అంటీ ముట్టనట్టుగా దైవవిధేయతా మార్గాన నడవడమే ధర్మనిష్ఠ! ఈ ధర్మనిష్ఠను సృజించడానికే పరమ ప్రభువు రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు .
మానవ జీవితం దైవ దాస్యానికి ప్రతీకగా నిలవాలంటే ఎంతో శిక్షణ, సంస్కరణలు అవసరం. దీనికే ప్రతి దినం అయిదు పూటలా నమాజ్, సంవత్సరం మొత్తాన నెల రోజుల పాటు నిర్ణీతకాలంలో ఉపవాసవ్రతం విధిగా ఏర్పరచడం జరిగింది. ఒక విధంగా ఉపవాస వ్రతం నిర్బంధ శిక్షణ వంటిదే. మత్తుగొన్న మనసును, శరీరాన్ని తట్టి లేపి వేళకానివేళ నిర్దిష్ట కాలపరిమితిలో ఏవయినా అన్నపానీయాలు పుచ్చుకుని ‘సహిరీ’ నెరపమనడం క్రమశిక్షణకు ప్రారంభం. ఆ తరువాత సూర్యాస్తమయం వరకు ఉదర ఆవశ్యకతల్ని, ఇంద్రియ కాంక్షల్ని కేవలం దైవాజ్ఞాపాలన కొరకు నిగ్రహించుకొని నిర్ణీత సమయం రాగానే దైవ విధేయతను ప్రతిఫలించేలా ఉపవాస వ్రతాన్ని విరమించడం, అదీ ఒక నెల కాలం పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా దీన్ని పాటించడం ఉన్నత స్థాయి క్రమ శిక్షణను అలవరుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఎలా గెలవాలి నేర్పించడమే ఉపావాసల్ లక్ష్యం. అదెలాగో తెలుసుకుందాం!
హృదయ ఉపవాసం
హృదయానికి మార్గదర్శకం లభించడం మామూలు విషయం కాదు. అది సకల మార్గదర్శకాలకు మూలం. సర్వ సాఫల్యాలకు జీవం. మనిషి మూట కట్టుకునే సత్కార్యాల సుందర సౌధానికి అది మొట్ట మొదటి ఆధారం. ప్రాపంచిక జీవితం అతని ప్రతి కదలికకూ కారణం, ప్రేరణం హృదయ మార్గదర్శనమే. “శరీరంలో ఓ మాంసపు ముద్ద ఉంది. అది సక్రమంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఆది గనక రోగగ్రస్తమైతే పూర్తి శరీరం రోగగ్రస్తవ ఎవుతుంది. ఆది మరేదో కాదు మనిషి హృదయమే ” అని బోధించారు మానవ మహోపకారి ముహమ్మద్ (స). (ముస్లిం హదీసు గ్రంథం)
ప్రతి ప్రాణికీ హృదయముంటుంది. అందులో రెండు పార్శ్యాలు ఉంటాయి. ఒక పార్శ్యం విశ్వాసం వెలుగుతో, సచేతనంగా నిండుగా స్పందిస్తూ ఉంటుంది. పూర్తిగా దైవానికి లోబడి, నిత్యం దైవధ్యానంతో నిండి ఉంటుంది. ” దైవభీతి ఇక్కడున్నది, దైవభీతి ఇక్కడున్నది, దైవభీతి ఇక్కడున్నది ” (ముసనాడ్ అహ్మద్) అని దైవ ప్రవక్త (స) గారు చెప్పింది ఈ పార్శాన్ని ఉద్దేశించే. “హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసలుకునే ప్రతివ్యక్తికీ ఇందులో (ఖుర్ఆన్) హితబోధ గలదు ” (ఖాఫ్: 37) అని అల్లాహ్ సెలవిచ్చింది కూడా ఈ పార్శ్యాం గురించే.
మరొక పార్శ్యం రోగస్త్రమయి, అచేతనావస్థలో సకల మాలిన్యాలతో కలుషితమయి ఉంటుంది. ” వారి హృయాలలో రోగం ఉంది ” (బఖరః – 10) అని, “ వారి హృద యాలపై తాళాలు పడి ఉన్నాయా? ఖుర్ఆన్ గురించి వారు లోతుగా పరిశీలన ఎందుకు చేయడం లేదు ” (ముహమ్మద్: 24) అని. “వారి చర్మ చక్షువులకు అంధత్వం లేదు, వారి హృదయ చక్షువులకు అంధత్వం ఆవహించి ఉంది ” (హజ్జ్అ: 46) అ ని, ” వారికి హృదయాలు ఉన్నాయి కాని వారు వాటితో అర్థం చేసుకోరు ” (ఆరాఫ్: 179) అని అల్లాహ్ చెప్పింది ఈ చెడు పార్శ్యం గురించే. “మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయి” (బఖరః : 88) అని , ” నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలో ఉన్నాయి ” (ఫుస్సిలత్ని: 5) అని సత్య తిరస్కారులు తెలియజేస్తున్నదీ ఆ హృదయ స్థితే. ఈ హృదయం నుండే దైవప్రవక్త (స) అల్లాహ్ శరణు వేడుకున్నారు ” ఓ అల్లాహ్ విష్ప్రయోజనకరమైన విద్య నుండి, భక్తిరహిత హృదయం మండి, స్వీకృతికి నోచుకోని ప్రార్థన నుండి నేను నీ శరణు కోరుతున్నాను”. (నసాయి)
రమజాను నెలలోగాని, ఇతర నెలలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే హృదయాన్ని నాస్తికత్వం, బహు దైవారాధన, విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపాడుకోవాలి. మనసు నిండా తౌహీద్ సుగంధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలోచనలకు మన మది సుమవంతంగా మారాలి. అందులో ప్రేమపూలు, మానవత్వపు మందారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్ నామస్మరణతో అది నిత్య చైతన్య ధాత్రిగా విరాజిల్లాలి.
ఉపవాస వ్రతంలో అన్నపానీయాలను, లైంగిక కాంక్షల్ని నిర్ణీత కాలవ్యవధిలో విసర్జించడం మాత్రమే కాదు, నోటి ద్వారా, కంటి ద్వారా, చెవుల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అంటే చెడు మాటలు పలకడం, చెడు చూపులు చూడటం, చెడు విషయాలు వినటం, చెడు పనులు చేయటం, చెడు స్థానాలకు వెళ్ళడం, మానుకోవాలి. దీనివల్ల ఉద్రేకాలు, ఆవేశాలు నెమ్మదిస్తాయి. భావాల్లో సంతులనం ప్రాప్తమవుతుంది, మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది. ఆగ్రహంలో నిగ్రహం, సంభాషణలో మార్దవం, ప్రవర్తనలో సహనభావం, తగవులకు, జగడాలకు, పరుష వచనాలకు దూరంగా మెలగడం అలవడుతాయి. మంచిపట్ల మొగ్గుదల, చెడుపట్ల ఏవగింపు పుడతాయి.
నోటి ఉపవాపం:
” ఓ ప్రవక్తా! నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. విశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు ” (ఇస్రా: 53) అని అల్లాహ్ సెలవిచ్చినా, “ తన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతర ముస్లింలకు హాని కలిగించనివాడే ముస్లిం ” (ముత్తఫఖున్ అలైహి) ఆని మహాప్రవక్త (స) గారు నొక్కి వక్కాణించినా అది నోటి ఉపవాస గురించే. రమజాను కానివ్వండి ఇతర మాసం కానివ్వండి విశ్వాసి నోటిని అదుపులో పెట్టుకోవాలి. మనసు గృహమైతే నోరు గుమ్మం వంటిది. కాబట్టే ‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అన్నారు పెద్దలు. పాముకాటుకీ, నిప్పు వాతలకు మనిషి తట్టుకోగలడేమోగాని నోటి కాటుకి, మాటల తూటలకు మనిషి నిలువునా దహించుకుపోతాడు. ‘కోతలరాయుళ్ళ నాలుకలు కోసిన కోతలే నరకవాసులు’ (తిర్మిజీ) అని ప్రవక్త (స) చెప్పింది ఇందుకే. ఈ యదార్థం తెలిసిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ తన నాలుక నుద్దేశించి ” ఓ నాలుకా! నాలుగు మంచి మాటలు మాట్లాడి మూట కట్టుకో, కుదరకపోతే కనీసం దుర్భాషకు దూరంగా మసలుకో. ఆ విధంగానయినా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో ” అనేవారు.
“రేపు ప్రళయ దినాన నీతులు చెప్పి నీచంగా బ్రతికేవారి నాలుకలు అగ్గితో చేయబడిన కత్తెరలతో కత్తిరించడం జరుగుతుంది ” (ముస్నద్ అహ్మద్అ) అని మహాప్రవక్త (స) గారు హెచ్చరించారంటే ఎముక లేని ఈ నాలుక ఎన్ని అనర్థాలకు దారి తీయగలదో అర్థమవుతోంది. కనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి. అవసరమయినప్పుడు అవసరమయినంత, అవసరమయిన రీతిలో, అవసరమున్నవారితో మాత్రమే మాట్లాడాలి. ‘నోటి నుండి వెలువడిన మాట విల్లునుండి వెలువడిన బాణం తిరిగిరాదని’ మన పెద్దల నానుడి. నోరు ఉంది కదా అని పారేసుకుంటే గూబ పగిలిపోతుంది జాగ్రత్తా! అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు: “మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దాన్ని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు”. (ఖాఫ్: 18) దైవప్రవక్త (స) ఇలా తెలిపారు: “ఎవరైతే ఉపవాసం ఉండి కుడా అబద్దాలాడటం, అబద్ధాల ఆధారంగా బ్రతకడం మానుకోడో అటువంటి వ్యక్తి ఆకలిదాహాల పట్ల అల్లాహ్ కు ఎటువంటి ఆసక్తి లేదు”. (బుఖారీ) కాబట్టి సోదరులారా! నాలుకను అదుపులో పెట్టుకోవడంకంటే ఎక్కువ యోగ్యమైన విషయం ఏదీ లేదు. మన నాలుకే మన పాలిట నాకమూ కాగలదు, నరకమూ కాగలదు.
కంటి ఉపవాసం:
“వయన నైచ్యాన్ని, హృదయ హైన్యాన్ని సయితం ఆయన ఎరుగును ” (గాఫిర్: 19) నయనం హృదయ ప్రేరణం. మనసుకు చేరే మార్గం. లజ్జారహిత నేత్రాలు కళ్ళెం లేని గుర్రాలతో సమానం. వాటిని కంట్రోల్ పెట్టకపోతే కనబడిందల్లా తమదే అంటాయి. రమ్యంగా కనబడే ప్రతిదీ తమదేనన్న తలతిక్క తలపులకు తలుపులు తీస్తాయి. ఎదుటి వారి గౌరవాన్ని కాలరాచి, వారి రహస్య విషయాలను తరచి తరచి చూసే నికృష్ట నయనాలు ఘోరపాపాన్ని మూట గట్టుకుంటాయి. సాధారణంగా నేత్రాలు చెడుని మంచిగా తలంచి మోసపోతాయి. మనసులో దురుద్దేశం ఉరకలేస్తుంది. ఆ మార్గంలో దూసుకుపోవాలని పరితపిస్తాడు మనిషి. కొద్ది దూరం నడిచాక తెలుస్తుంది తాను అశ్లీల ఊబిలో దిగుబడి ఉన్నానని. బయటికి రావాలనుకున్న ప్రతిసారీ ఆ పాపపు ఊబి అతన్ని మరింత లోనికి లాక్కుంటుంది. కాబట్టి హృదయం, నోరుతోపాటు కళ్ళను కూడా నియంత్రణలో ఉంచాలి. మన కళ్ళను అశ్లీల దృశ్యాలనుండి కాపాడుకోవాలి. ”అల్లాహుమ్మ అరినల్ హఖ్ఖ హక్ఖన్ వర్జుక్నా ఇత్తిబాఅహు – వ అరినల్ బాతిల బాతిలన్ వర్జుక్నాఇజ్తినాబహు’ ఓ అల్లాహ్! మాకు సత్యాన్ని సత్యంగా చూసే సత్య దృష్టిని ప్రసాదించు, అసత్యాన్ని అసత్యంగా గుర్తించే విచక్షణా దృష్టిని అనుగ్రహించు”. (ఇబ్ను కసీర్) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు ” ఓ ప్రవక్తా! ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి వాల్చి ఉంచాలనీ, వారు తమ మర్మాంగాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు శ్రేయోదాయకమని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు “. (నూర్: 30)
చెవుల ఉపవాసం:
“ నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను హృదయం వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది “. (ఇస్రా: 36) చెడు ఆనకు అన్నది నోరు పాటించే ఉపవాసమైతే, చెడు వివకు అన్నది చెవులు పాటించే ఉపవాసం. బూతు పదాలను, బూతు సాహిత్యాన్ని, సంగీత ధ్వనుల నుండి చెవులను కాపాడుకోవాలి. ఎందుకంటే అసత్యాలు, అశ్లీల పదాలకు అలవాటు పడ్డ చెవుల్లో రేపు ప్రళయదినాన సీసం పోయడం జరుగుతుంది. అట్టి కర్ణపుటాలకు కరుణామయుని వచనాలు సోకవు. ఫలితంగా సత్యవాణి విన్నప్పుడు వారిలో ఉండాల్సిన సహజ స్పందన ఉండదు. అల్లాహ్ అమృతవాణి వారి కర్ణపుటాలను తాకి వెనక్కి వచ్చేస్తుంది. అటువంటి వారి కర్ణశక్తి మూలంగా వారికి ఎటువంటి శుభంగానీ, ప్రయోజనంగానీ కలగదు. దీనికి భిన్నంగా విశ్వాసుల చెవులు సత్యామృతాన్ని తనివితీరా గ్రోలడమేకాక మనిషిలోని మనసు తన్మయం చెందేలా చేస్తాయి. విశ్వాసుల ఈ విశేష లక్షణం గురించి ఖుర్ఆన్ ఇలా తెలుపుతుంది. ” ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి ఆశ్రువులు జలఝరి వలె ప్రవహించటం నీవు గమనిస్తావు. వారు ఇలా అంటారు: ”ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాసుకో!”. (మాయిదహ్: 83)
సత్యం విన్నప్పుడు సత్యపథంలో నడుస్తున్న హృదయాలకు మరింత శక్తి, స్థిరత్వం ప్రాప్తిస్తుంది. దీనికి బిన్నంగా, అసత్యం విన్నప్పుడు దాని తాలూకు దుష్ప్రభావాలు నిర్మలమయిన హృదయంలో తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ చెడు భావాలు మరింత ముదిరితే ప్రమాదం, అల్లాహ్ అటువంటి చెవులకు సీలు వేసేస్తాడు జాగ్రత్త!.
ఉదర ఉపవాసం :
” ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కేవలం అల్లాహ్ ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను మాత్రమే తివండి, త్రాగండి. అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి “. (బఖరః – 172) మనం తినే ఆహారం మన దేహంపై, మన ప్రవర్తనపై, మన సామాజిక జీవితంపై, కుటుంబ, ఆధ్యాత్మిక జీవనంపై ప్రభావం పడుతుంది. ధర్మ సంపాదన మనిషిలో మానవత్వాన్ని మంచిని పెంచితే, అధర్మ సంపాదన సకల అనర్థాలకు ఆలవాలంగా మారుతుంది.ధర్మ సమ్మతమైన ఆహార పదార్థాలను భుజించకుండా ఓ నిర్ణీత సమయం వరకు ఉండటం రమజాను ఉపవాసమైతే అధర్మ ఆహారం నుండి ఉదరాన్ని కాపాడుకోవటం సంవత్సరపు 12 నెలలు అనునిత్యం నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిర్విరామంగా పాటించాల్సిన ఉవవాసం. అల్లాహ్ నిషేధించిన అక్రమార్జనల్లో వడ్డీ వ్యాపారం మహాపరాధం. ” ఓ విశ్వసించిన ప్రజలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు పాఫల్యం పొంటానికిగాను అల్లాహ్ కు బయపడడి “. (ఆల్ ఇమ్రాన్తం: 131) ”తండ్రి లేవి బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టలను నరకాగ్నితో వింపుకుంటున్నారు. త్వరలో వారు మండే నరకాగ్నిలో ప్రవేశిస్తారు “. (నిసా: 10) దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. • స్వహస్తాలతో సంపాదించే సంపాదనకన్నా పరిశుద్ధ మయిన ఆహారం మరొకటి లేదు, అధర్మ సంపాదనతో పోషించబడిన శరీరం వరకాగ్నికి ఎక్కువ అర్హత కలిగి ఉంటుందన్నారు .. అక్రమార్జన, లంచం గురించి ఇలా హెచ్చరించడం జరిగింది. “ ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమ రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయడం కోసం అధికారులకులంచం చెల్లించకండి. అది ధర్మం కాదన్న సంగతి మీకూ తెలిపివదే “. (బఖరః – 188)
అల్లాహ్ మనందరని రమజాను మాసానికి సంబంధించిన ఒక్కో ఘడియను సద్వినియోగ పర్చుకునే తన పియ్రతమ దాసుల జాబితాలో చేర్చి, స్వర్గ ఎనిమిది ద్వారాల గుండా స్వర్గ ఆహ్వానం పొందే భాగ్యవంతుల్లో చేర్చి, జన్నతుల్ పీర్‌దౌసిల్ ఆలాలో మహా పవ్రక్త ముమహమ్మద్ (స) వారి పవిత్ర సాంగత్యాన్ని అను గహ్రించి, అల్లాహ్ దివ్వ ధర్శనంతో మన జీవితాల్ని ధన్యం చేయుగాక! ఆమీన్.
రమజాను మాసం ఓ మహదావకాశం! యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, ఛాయిజ్ ఈజ్ యువర్!!
కరుణకు ఆనవాలు కన్నీళ్లు
చివరికి (మానవులంతా) నీ ప్రభువు సన్నిధికే మరలిపోవలసి ఉంది. ఆయనే (మిమ్మల్ని) నవ్విస్తున్నాడు; ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే (మీ) జీవన్మరణాలకు మూలకారకుడు. ఆయనే కార్చబడే వీర్యబిందువుతో ఆడమగ జంటల్ని పుట్టిస్తున్నాడు. (ప్రళయ దినాన) పునర్జీవం ప్రసాదించడం కూడా ఆయన బాధ్యతే. ఆయనే ఐశ్వర్యం అనుగ్రహించేవాడు; ఆయనే దారిద్య్రం కల్గించేవాడు. (అన్-నజ్మ్: 42 48)
భావోద్వేగాయానికి ద్రవ రూపం కన్నీరు
కన్నీళ్లు, అశ్రువులు - జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి. కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు. ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది. కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర- పెయిన్ కిల్లర్. కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా మనసులో కన్నీటి అలజడులే ఎగిసి పడుతుంటాయి. బతుకు పోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం కన్నీరు. అనంతమైన విషాద జీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది. కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం. దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది. కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు కన్నీరు.
కన్నీటి రకాలు
భయం మరియు ఆందోళనతో కూడిన కన్నీళ్లు, కరుణ మరియు మృదుత్వంతో కూడిన కన్నీళ్లు, ప్రేమ మరియు తపనతో కూడిన కన్నీళ్లు, సంతోషం మరియు ఉత్సాహంతో కూడిన కన్నీళ్లు, బాధ మరియు భరించ సాధ్యం కానీ నొప్పితో కూడిన కన్నీళ్లు, అవమానం, అవమానం, ఆవేదనతో కూడిన కన్నీళ్లు కూడిన కన్నీళ్లు, ఎడబాటు మరియు దుఃఖంతో కూడిన కన్నీళ్లు, బలహీనత మరియు నిస్సహాయతతో కూడిన కన్నీళ్లు, కపట కన్నీళ్లు మరియు మొసలి కన్నీళ్లు, అరువుకు తెచ్చుకున్న కన్నీళ్లు (నియాహా) - కొన్ని సందర్భాల్లో ఏడవడానికి కొందరు స్త్రీలను రోజు కూలికి తీసుకు రావడం. సమర్థనతో కూడిన కన్నీళ్లు - ఎలాంటి సంబంధం లేకపోయినా ఒకరు ఏడుస్తూ ఉండటం చూసిన ఏద్వడం. సానుభూతి మరియు ఓదార్పుతో కూడిన కన్నీళ్లు. చేతబడి జరిగి, లేదా జిన్ను సోకిన కారంగా వచ్చే కన్నీళ్లు, కంటి సమస్యల వల్ల వచ్చే కన్నీళ్లు
కన్నీటి పారాయణం
ఆదం సంతానంలో, నూహ్‌తో పాటు ఓడలో ఎక్కినవారి సంతతిలో, ఇబ్రాహీం సంతతిలో, ఇస్రాయీల్ (యాఖూబ్) సంతతిలో వీరు అల్లాహ్ విశేషానుగ్రహం పొందిన దైవప్రవక్తలు. మేము సన్మార్గం చూపి ప్రత్యేకంగా ఎన్నుకున్న సత్పురుషుల్లోనివారు. వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటిధారలతో (అప్రయ త్నంగా అల్లాహ్ సన్నిధిలో) సాష్టాంగ పడుతుండేవారు. సజ్దాలో పడిపోయేవారు. (మర్యమ్: 58)
విశ్వాసుల ముందు ఖుర్ఆన్ పారాయణం జరిగినప్పుడు వారు దైవభీతితో కంపించిపోతారు. దైవశిక్ష ప్రస్తావన వినగానే విలపించటం మొదలు పెడతారు. కాని అవిశ్వాసులకు ఖుర్ఆన్ వినిపించినా వారిలో ఎలాంటి ప్రతిస్పందన ఉండదు. పైగా వారు ఖుర్ఆన్ పారాయణాన్ని అపహాస్యం చేస్తారు. ఆటపాటలతో దానిని నిర్లక్ష్యం చేస్తారు. దైవప్రస్తావన వినగానే భయంతో విలపించటం, ఆయన్ని కలుసుకోవాలని తాపత్రయ పడటం విశ్వాసుల లక్షణం.
దివ్య ఖుర్ఆన్ను పూర్తి ఏకాగ్రతతో, అర్థం చేసుకుంటూ పారాయణం చేసినప్పుడు లేదా విన్నప్పుడు భక్తీ పారవశ్యంతో హృదయం తాదాత్మ్యం చెందుతుంది. సహజంగానే మనిషి కంటతడి పెడతాడు. ఈ లక్షణాలు మనిషిలోని విశ్వాసాన్ని, దైవం పట్ల అతనిలోవున్న భీతిభావాన్ని సూచిస్తాయి. తాము స్వయంగా ఖుర్ఆన్ పారాయణం చేయటంతో పాటు ఇతరుల ద్వారా కూడా వినటం పుణ్యప్రదం.
మహాప్రవక్త ముహమ్మద్ (స) సహృదయులు, జాలి గుండె గలవారు. ఒకసారి ఆయన (స) ఇబ్నె మన్వూడ్తో "మస్వూద్! నాకు ఖుర్ఆన్ చదివి విన్పించు" అని కోరారు. దానికి ఇబ్నె మన్వూద్ (ర), 'దైవప్రవక్తా! ఖుర్ఆన్ అవతరించింది మీపైనే కదా! అలాంటప్పుడు మీకు నేను ఖుర్ఆన్ చదివి విన్పించడమేమిటి?' అని ఆశ్చర్యపోతూ అడిగారు. “నాకు ఇతరుల ద్వారా ఖుర్ఆన్ పారాయణం వినడం అంటే మిక్కిలి ఇష్టం" అని అన్నారాయన (స). ఇబ్నె మసూద్ (ర) అప్పుడు 'నిసా’ సూరా పారాయణం చేయటం మొదలెట్టారు. అలా పారాయణం చేస్తూ - "మేము ప్రతి అనుచర సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమవుతుంది?" అనే సూక్తి దగ్గరికి చేరుకోగానే “ఇక చాలు ఆపెయ్యి” అన్నారాయన (స). ఇబ్నె మన్పూద్ (ర) తల పైకెత్తి చూస్తే ఆయన కళ్ళ నుండి కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి (బుఖారీ).
కన్నీటి ప్రార్థన కరుణామయునికి ఇష్టం
వారికి చెప్పు: “మీరు దీన్ని విశ్వసించండి, విశ్వసించకపోండి. పూర్వం (దివ్యగ్రంథ) జ్ఞానం ప్రసాదించబడినవారి ముందు దీన్ని పఠిస్తే, వారు అప్రయత్నంగా సాష్టాంగపడి ‘మా ప్రభువు ఎంతో పరిశుద్ధుడు. ఆయన వాగ్దానం తప్పక నెరవేరుతుంది’ అంటారు. అంతేకాదు, వారు కంటతడి పెడుతూ బోర్లాపడి సాష్టాంగపడతారు. అది విన్న తర్వాత వారిలోని అణుకువ, భక్తిభావలు ద్విగుణీ కృతమయి పోతాయి.” (బనీ ఇస్రాయీల్:: 107-109)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రజి) కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నారు. (నమాజ్లో) ఆయన ఏడుస్తుంటే పొయ్యి పై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం రాసాగింది. (ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ దావూద్)
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును. (కీర్తన 126:5,6)
మన కన్నీరు తుడవబడాలి అంటే? కన్నీటి ప్రార్ధనే శరణ్యం. ప్రార్ధన శక్తివంతమైనదిగా ఉండాలంటే, తప్పక కన్నీరు కార్చాలి. లోకంలోని లోకవాసులు పాపాల వెంట, భోగభాగ్యాలు, కోరికల వెంట కళ్లెం లేని గుర్రాల్లా పరుగులు పెడుతుంటే, పరలోకాన్ని మరచి ఇహలోకమే శాశ్వతము భ్రమించి బతుకుతుంటే కన్నీరు కార్చక, హృదయ భారము లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్ధించడం ఒక విశ్వాసిగా మనకు ఏ విధంగానూ శోభించని విషయం.
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ఓ ప్రజలారా, ఏడవండి, ఏడుపు రాకపోతే, ఏడ్చినట్టు ముఖం పెట్టండి. ఎందుకంటే నరకంలోని ప్రజలు తమ కన్నీళ్లు తమ చెంపల మీదుగా ప్రవహించే వరకు, కన్నీళ్లు ఆగి రక్తం ప్రవహించే వరకు, కళ్ళకు పుండ్లు వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. (ఇబును మాజహ్ - ఈ హదీసు బలహీనమైనది)
అల్లాహ్ భీతితో వచ్చే కన్నీటి ఘనత
ఆధ్యాత్మిక సాధనలోనూ కన్నీటి పాత్ర కీలకమే. ప్రార్థనలు, వ్రతాలకంటే... సజల నేత్రాలతో భక్తుడు చేసే ప్రార్థనలే అల్లాహ్ ను రాజీ పరుస్తాయి.
1) అర్ష్ నీడ భాగ్యం
హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ ఏడుగురు : (1) న్యాయంగా పరిపాలిం చిన పాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిద్ లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) అందం, అంతస్థూ కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియ నంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసు కొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ - ముస్లిం)
2) అల్లాహ్ కు మిక్కిలి ప్రియమైం రెండు చుక్కలు రెండు మచ్చలు
హజ్రత్ అబూ ఉమామా సుదై బిన్ అజాన్ బాహిలీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: దేవునికి రెండు బొట్లు, రెండు మచ్చల కన్నా ఎక్కువ ప్రియమైన వస్తువు మరేదీ లేదు. ఒకటి దైవభీతి మూలంగా రాలిన కన్నీటి బొట్టు, రెండు దైవమార్గంలో (పోరాడినప్పుడు) చిందే రక్తపు బొట్టు. ఇకపోతే రెండు మచ్చల్లో ఒకటి దైవమార్గంలో పోరాడినప్పుడు (కలిగిన గాయం వల్ల) ఏర్పడిన మచ్చ. రెండోది ఏదయినా దైవవిధిని నిర్వర్తించి నప్పుడు కలిగిన మచ్చ. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ గా పేర్కొన్నారు).
3) స్వర్గం సొంతం అవుతుంది
” మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి; నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థాన మవు తుంది.” (అన్-నా’జి’ఆత్, 79:40-41)
4) ఒకటి కాదు రెండు స్వర్గాలు లభిస్తాయి
అల్లాహ్ శిక్షకు భయపడి ఏడ్వటం ఆరాధన అవుతుంది. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో కొన్ని ఆయతులు ఉన్నాయి.” మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గ వనాలుంటాయి.” (సూరహ్ రహ్మాన్, 55:46)
అంటే తీర్పుదినం నాడు తన ప్రభువుముందు నిలబడాలని, తన్ను తాను పాపాలకు దూరంగా ఉంచుతూ అహంకారానికి గురికాడు, ప్రాపంచిక వ్యవహారాల్లో పడి పరలోకాన్ని మరవడు. పైగా పరలోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ధార్మిక విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. నిషిద్ధాలకు దూరంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తికి ఒకటి కాదు రెండు స్వర్గాలు లభిస్తాయి.’
5) నరకాగ్ని ముట్టనయినా ముట్టదు
హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు : (పితకబడిన) పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకూ దైవభీతితో కంటతడి పెట్టినవాడు నరకానికి పోడు. అదేవిధంగా దైవ మార్గంలో లేపబడిన దుమ్ముధూళి, నరకధూమంతో కలవదు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్ గా పేర్కొన్నారు)
కంట తడి పెట్టేంత దైవభీతి ఉన్న వ్యక్తి ఘోరపాపాలకు ఒడిగట్టటాన్ని ఊహించగలమా? సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుని ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా మసలుకుంటూనే జీవితం గడుపుతాడు. అందుకే పితికినపాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోవటం ఎంత అసంభవమో అలాంటి మంచివ్యక్తి నరకానికి పోవటం కూడా అంతే అసంభవమని అంటే అది అతిశయోక్తి కాదు. అదేవిధంగా దైవమార్గంలో పోరాడే యోధునికి కూడా దేవుడు నరకాన్ని నిషిద్ధం చేశాడు. దైవమార్గంలో పోరాడటం వల్ల దుమ్ముధూళి కొట్టుకున్న యోధుని శరీరాన్ని నరకాగ్ని కూడా కాల్చలేదు.
పుట్టిన శిశువు చేసే తొలి పని ఏడుపు
ఓ చిన్న నలుసుగా అమ్మ కడుపులో పిండంగా ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన నవజాత శిశువు ఒక్కసారిగా గుక్కపట్టి ఏడుస్తుంది..తను ఈలోకంలోకి వచ్చిన వెంటనే ఏడుపుతోనే తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆకలి వేసినా.. వేయకపోయినా ఏడుస్తారు. అలా ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు. పుట్టిన బిడ్డ ఏడవకపోతే తల్లితో పాటు డాక్టర్లు కూడా ఆందోళన చెందుతారు. బిడ్డ ఏడవటానికి డాక్టర్లు రకరకాల టెక్నిక్ లు వాడతారు. బిడ్డ ఏడిస్తే హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటారు. నవజాత శిశువులు ఏడ్చినప్పుడు మీరు గమనించారా..? పెద్దవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ చంటిబిడ్డలు ఏడిస్తే కళ్ల వెంట నీళ్లు రావు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణముంది.. బిడ్డలు పుట్టినప్పుడు వారికి కన్నీటి నాళాలు పూర్తిగా ఏర్పడవు. కన్నీళ్ల పరిమాణం వారి కళ్ళ నుంచి కారడానికి సరిపోదు.అందుకే వారు ఏడ్చినా కన్నీళ్లు రావు. బిడ్డలు పుట్టిన రెండు లేదా మూడు నెలల వయస్సు తర్వాత కన్నీళ్లు ఏర్పడతాయి..ఆ తరువాతే వారికి కన్నీళ్లు వస్తాయి. మనసులో భావం చెప్పే గొప్ప సంకేతం. బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు. పసివాడి భావం కన్నీటితోనే తెలుపు. మాట వచ్చేవరకూ అమ్మకి కన్నీటి తోనే సంకేతం ఇచ్చు. మనసులోని భావo చెప్పడానికే భాష పసివాడి భాషే కంట వెంట కారే నీరు కన్నీరు.
ఈ నేపథ్యంలో ఓ అరబీ కవీ ఇలా అన్నాడు;
ఓ ఆదమ్ పుత్రుడా! నిన్ను నీ తల్లి జన్మనిచ్చినప్పుడు నువ్వేమో గుక్క ఆపకుండా ఏడుస్తూండేవాడివి.
నీ చుట్టూ జనం సంతోషంతో సంబరాలు చేసుకుంటూ మందస్మిత ముఖాలతో ఉన్నారు.
నీ కోసం నువ్వు ఎంత బాగా పరిశ్రమించాలంటే, రేపు నువ్వు మరణించిన నాడు నువ్వు మాత్రం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి.
నీ వంటి గొప్ప వ్యక్తి దూరమయ్యాడన్న పుట్టెడు దుఃఖంతో నీ చుట్టూ ఉన్న జన సందోహం దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలి.
గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం జల జలమంటూ కళ్ళ వెంట కన్నీరు మనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు. ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు. ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం. కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం.
కన్నీళ్లు ఇచ్చే ఆరోగ్యం
"ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి.కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఏడుపుతో ఒంట్లో నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. మానసికోద్వేగాల పరంగానూ ఉపయోగాలున్నాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతంగానే కాకుండా, మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ, దుఖం, కన్నీరు ఎదుటి వారిని తృప్తి పరుస్తుంది, శత్రువుల నుంచీ సానుభూతి సంపాదిస్తుంది, బంధాన్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుందన్నది తెలిసిందే. అయితే.. అది వ్యక్తిగత సంబంధాలనూ మెరుగుపరుస్తుందట. ఏడిస్తే శత్రువు కూడా కరిగిపోయే అవకాశం ఉందని, కన్నీరు మనుషులను దగ్గర చేస్తుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. అప్పుడప్పుడు కన్నీళ్లు తెప్పించే ప్రవక్తల గాథలు, సజ్జన పూర్వీకుల కథలు, చారిత్రిక హృదయ విదారక ఘట్టాలు చదువుతూ కంటి చెమ్మ ఆరకుండా చూసుకోవాలి.
ఏడుపు నాలుగు విధాల మేలు .. తెలుసా..?
మనలో కొంతమంది ఎవరైనా ఏడుస్తుంటే.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడని హేళన చేస్తూ ఉంటారు. కొంతమంది, పక్కవారు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఓదారుస్తూ ఉంటారు. వారి ఏడుపు ఆపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఏడవటమూ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లు పెడితే.. శరీరర, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఉన్నాయని అంటున్నారు. తట్టుకోలేని బాధే కాదు.. హార్మోనుల్లో మార్పులు, ఒత్తడి, ఒంటరిగా అనిపించినా.. తట్టుకోలేక కంటి నుంచి నీళ్లు వస్తాయి
బంధాలను బాల పర్చేది కన్నీరు
మనిషి శరీరం అల్లాహ్ తిరుగులేని డిజైనింగ్ నైపుణ్యానికి తార్కాణం. ప్రతి భాగానికీ ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. కన్నీటికి కూడా రెండు కీలక బాధ్యతలు అప్పగించాడు సృష్టికర్త ఒకటి... కంటిని కాపాడుకోవటం, రెండు... కన్నీరు కార్చే వ్యక్తిని రక్షించుకోవడం. మనం ఇబ్బందుల్లో ఉన్నామనడానికి కన్నీళ్లు ఒక సంకేతం. ఎంత గంభీరంగా వ్యవహరించినా... బుగ్గలపై తడివారల్ని ఆత్మీయులు తప్పక గమనిస్తారు. చనువుకొద్దీ, ప్రేమకొద్దీ గుచ్చిగుచ్చి అడుగుతారు. కారణం తెలుసుకుంటారు. సాంత్వన వాక్యాలు పలుకుతారు. మేమున్నామని ధైర్యం నింపుతారు. అదో సమస్యే కాదంటూ వాతావరణాన్ని తేలిక పరుస్తారు. ఆ మాటలు మనకు ఊరటనిస్తాయి. బతుకు పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. కన్నీరు కోరుకునేదీ ఆలూమగల అనురాగానికైనా, తల్లీబిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా... ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురవుతుంది. ఇద్దరి మధ్యా కనిపించని అడ్డుగోడలు మొలుస్తాయి.: అపార్ధాలు అగాధాల్ని సృష్టిస్తాయి. ఎదురుపడినా పలకరించుకోలేరు. మంచానపడినా పరామర్శించుకోలేరు. ఆ మౌనం ఏదో క్షణంలో బద్దలవుతుంది. ఏడుపు లావాలా పొంగుకొస్తుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి. పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కాంక్రీట్ పాత పగుళ్లను పూడుస్తాయి. ఆ చొరవ ఫలితంగా... బంధాలు మళ్ళీ వికసిస్తాయి. కన్నీళ్ల స్థానాన్ని ఆనందబాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకేనేమో 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమె కన్నీరు నించుటకు... తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్ణము' అంటారు మహాకవి శ్రీశ్రీ
ఆవేశాన్ని ఆలోచనగా మార్చే మంత్రజలం కన్నీరు.
చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్స్ లానూ పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు. అవతలి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇంకెవరో నమ్మకద్రోహానికి పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్పృహ చుట్టుముడుతుంది. ఓ పది నిమిషాల ఏడుపు తర్వాత ఆ నెగెటివ్ ఉద్వేగాలన్నీ కన్నీళ్లలో కలిసిపోతాయి. ఎంతో కొంత స్థిమిత పడతాం. మంచిచెడులు బేరీజ వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం.
రోదనం. కూడా ఓ ఔషధమే
గుండె మంట చల్లారాలంటే.. రెండుకకళ్లూ ఉప్పునీటి స్నానం చేయాల్సిందే. ఆ ప్రవాహంలో దుఃఖం చెత్తాచెదారంలా కొట్టుకుపోతుంది. మనసారా ఏడ్చినప్పుడు మెదడులోని చేదు జ్ఞాపకాలు మసక బారిపోతున్న భావన కలుగుతుంది. కన్నీళ్లతో పాటు కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ కూడా బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి బాగా ఏడ్చేశాక మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు మన కళ్లను పొడిబారనీయవు. బైక్కు ఇంజిన్ ఆయిల్.. నేత్రాలకు సహజసిద్ధమైన లూబ్రికెంట్స్ ఇవి. ఏడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడుస్తున్నప్పుడు మొహంలో రక్త ప్రసరణ పెరిగిపోయి, మేని సౌందర్యం మెరుగుపడుతుంది. కొత్త నిగారింపు వస్తుంది. మనం మనసారా నవ్విన ప్రతిసారీ 1.3 క్యాలరీలు కరిగిపోతాయని ఓ అంచనా. ఏడ్చినప్పుడు కూడా అన్నే క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు గుర్తించారు. తీవ్ర గాయాలైనప్పుడు, ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేస్తుంటాం. ఇదీ. ఒకందుకు మంచిదే. కన్నీళ్లలో ఓరకమైన పెయిన్ కిల్లర్ ఉంటుంది. అందుకే, ఏడుపు తర్వాత నొప్పి తీవ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. ఏడుపు కొన్నిసార్లు అలారమ్ వ్యవస్థలానూ పనిచేస్తుంది. ఏ దొంగలో ఇంట్లోకి చొరబడినప్పుడు ఏ దుర్మార్గుడో అఘాయిత్యానికి తెగబడినప్పుడు... ఆ స్థానంలో ఎవరున్నా వెంటనే అరిచేస్తారు. గట్టిగా ఏడ్చేస్తారు. ఏడుపులోని కీదు శబ్దానికి తీవ్రత ఎక్కువ. చాలా దూరం వినిపిస్తుంది. ఎవరో ఒకరు వస్తారు. తప్పక సాయం చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే లాఫింగ్ క్లబ్స్ లా క్రయింగ్ క్లబ్లూ పుట్టు కొస్తున్నాయి.
ఏడుపుకి కాదెవరూ అతీతం
ఏడుపు అనగానే ఆడవాళ్లే గుర్తుకొస్తారు. బీరకాయ పీచు చుట్టరికమైనా సరే, చావు కబురు తెలియగానే ఆమె ముందుగా ముక్కు చీదుకుంటుంది. కొడుకును అమెరికా పంపుతున్నా. కూతుర్ని అత్తారింటికి సాగనంపుతున్నా... ఆమె కళ్లలోంచి గంగ పొంగుకురావాల్సిందే. టీవీ సీరియల్స్లోనూ అంతే. ఏడుపుగొట్టు సీన్లన్నీ కోడళ్లూ, కూతుళ్ల పాత్రల ఖాతాలోనే పడతాయి. మగాడికి ఇలాంటి జంజాటమే ఉండదు..
ఆ గాంభీర్యానికి శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుడి అశ్రు గ్రంథులు చిన్నవి. అందులోనూ అతను టెస్టోస్టిరాన్ జీవి. ఆ హార్మోన్ పురుషుడి కంట కన్నీరు ఒలకనీయదు. కన్నీటి ఉత్పత్తికి సహకరించే ప్రొలాక్టిన్ హార్మోను మగాళ్లలో ఏమంత చురుగ్గా ఉండదనీ చెబుతారు. అన్నింటికీ మించి 'అబ్బాయిలు అస్సలు ఏడ్వకూడదు' అంటూ బాల్యం నుంచీ సమాజం చేసే హితబోధ... కన్నీటిని ఆనకట్టలా అడ్డుకుంటుంది. జీవన సంగ్రామంలో రాటుదేలిన వారికి కూడా ఓ పట్టాన ఏడుపు రాదు. అప్పటికే ఉద్వేగాలు మొద్దుబారి ఉంటాయి. దీంతో చిన్నాచితకా కష్టాలకు పెద్దగా స్పందించరు. స్పందించినా స్పందించినట్టు కనిపించరు. చెట్టంత మనిషి కదా! నలుగురిలో కళ్ళు తుడుచుకోడానికి అహం అడొస్తుంది అతనికి. దీనివల్ల మగజాతి ఆణిముత్యమనే పేరు స్థిరపడితే స్థిరపడొచ్చు కానీ, వ్యక్తిగా చాలా కోల్పోతారు. ఎందుకంటే, ఏడుపు వాంతి లాంటిది. తక్షణం కక్కేయాల్సిందే. దిగమింగిన కొద్దీ ఉద్వేగాలు పేరుకుపోతాయి. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం మొదలైన రోగాలకు కారణం అవుతాయి. ఆ ఒత్తిడిలో మద్యానికీ, మాదక ద్రవ్యాలకూ అలవాటుపడేవారూ ఉన్నారు. కాబట్టి, ఏడుపు రాగానే ఏడ్చేయడమే ఉత్తమం. నలుగురిలో బావురుమనడం బావుండదని అనిపిస్తే... ఏ వాష్రూమ్కి వెళ్లాలి. ఏకాంతంలో గుండె బరువు దించుకోవాలి. ఏ కష్టమూ లేకపోయినా ఏడుపులోని పాజిటివ్ ప్రయోజనాల్ని పొందడానికి... సెంటిమెంటు సినిమాలూ, విషాదాంత నవలలూ ఓ మంచి మార్గం. టైటానిక్, దేవదాసులాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు... మనసు ద్రవించిపోయి జలజలా కన్నీళ్లు రాలినా, అది నిజమైన దుఃఖం కాదు. కరుణ రసానుభూతిలో ఓ భాగం మాత్రమే. అంతిమంగా ఆనందాన్నే ఇస్తుంది. చాలాసార్లు ఆయా దృశ్యాలో, వాక్యాలో మనల్ని ఏడిపించాయని అనుకుంటాం. కానీ ఆ క్షణంలో గుర్తుకొచ్చే వ్యక్తులూ, సంఘటనలే ఆ కన్నీటి ప్రవాహానికి కారణమని అంటారు పరిశోధకులు. కొన్నిసార్లు, పక్కవాళ్లు ఏడుస్తుంటే మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఏడుపు హానికరం కాని అంటువ్యాధి. ఆనంద బాష్పాలు ముందుగా కుడి కంటి నుంచీ, విషాద బాష్పాలు ముందుగా ఎడమ కంటి నుంచీ జాలువారుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఎవరైనా ఏడిస్తే...
స్నేహితుడు... మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సహోద్యోగి... పనిచేస్తూ పనిచేస్తూ వెక్కివెక్కి ఏడ్చేస్తాడు. సమీప బంధువు... కుశలప్రశ్నలు అడగ్గానే బోరున విలపిస్తాడు. అవన్నీ ఊహించని సంఘటనలే అయినా, ఆ సమయంలో మనం హుందాగా వ్యవహరించాలి. ఎదుటి మనిషికి మనసారా ఏడ్చే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత, నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేకానీ అర్థంలేని సలహాలతో, ఆచరణయోగ్యం కాని సూచనలతో మరింత అయోమయానికి గురిచేయకూడదు. పసిపిల్లల్లా ఏడుపేమిటని ఎగతాళి చేయకూడదు. అత్యవసరమైతే తప్పించి, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. నలుగురిలో చర్చకు పెట్టకూడదు.
అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి సంకేతం. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా తదితర రుగ్మతల ప్రాథమిక లక్షణం. వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. హార్మోన్ల లోపానికి ఇదో సంకేతం కూడా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడ్వటం మామూలే. కానీ, ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం ఇంకా పెద్ద సమస్య. దీర్ఘకాలిక అనారోగ్యాలకు యాంటీ డిప్రెసెంట్స్ వాడేవారిలో కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. కొందరికి పుట్టుకతోనే ఆశ్రు గ్రంథులు మూసుకుపోయి ఉంటాయి. దీంతో ఓపట్టాన కన్నీళ్లు రావు. కొంతైనా తేమ లేకపోతే... కంట్లోని నలుసు బయటికొచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టు ముడతాయి. వీలైతే చికిత్సతో, అవసరమైతే శస్త్ర చికిత్సతో వైద్యులు ఇలాంటి లోపాల్ని సరిచేస్తారు.
జాగ్రత్త పడాల్సిన కొన్ని జాగాలు
ప్రత్యేకించి... ఇంటర్వ్యూ రూమ్, బాస్ క్యాబిన్, ఆఫీస్ డెస్క్, కాన్ఫరెన్స్ హాల్, ఎంప్లాయీస్ క్యాంటీన్ లాంటివి 'నో క్రయింగ్ జోన్స్' అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఉన్నంతసేపూ ఏడుపును దిగమింగుకోవడమే మంచిది. జాబ్ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైనప్పుడు, మొహం వేలాడేసుకుని ఏడుపు లంకించుకోకూడదు. ఉన్నతాధికారులతో సంభాషిస్తున్నప్పుడు కూడా మన వాదనను సమర్థంగా వినిపించాలే కానీ, కన్నీటిపర్యంతం కాకూడదు. ఎవరైనా మనవైపు వేలెత్తి చూపినప్పుడూ, మనకు జరిగిన అన్యాయాన్ని సూటిగా చెప్పాల్సి వచ్చినప్పుడూ... మాటకు మాట సంధించాలే కానీ, కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోకూడదు. ఇప్పటికీ ఏడుపును పిరికితనానికి ప్రతీకగానో, బలహీనుల లక్షణంగానో భావించేవారు ఎంతోమంది. ఏడ్చేవారిపై పలాయనవాదులుగా ముద్ర వేస్తుంది సమాజం.
మరణ స్మరణ మంచిదే
చావును తలుచుకోగానే కన్నీళ్లు పొంగుకొస్తాయి. ఆత్మీయులు గుర్తుకొస్తారు. మన పార్ధివదేహం ముందు వాళ్లంతా రోదిస్తున్న ఘట్టాన్ని ఊహించుకున్నప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. ఎదుటి మనిషి కన్నీటి విలువా అర్థం అవుతుంది. ఒకరు ఏడుస్తున్నారంటే, ఇంకెవరో ఏడిపిస్తున్నారనే అర్థం. ఏడుపు ఆరోగ్యకరమైతే కావచ్చు కానీ... ఏడిపించడం మాత్రం మానసిక రుగ్మత సంకేతమే. ఆ హింసను ఖండించాల్సిందే. బాధ్యుల్ని నిలదీయాల్సిందే. కంటి స్పందన గుండెను ఓదారుస్తుంది. భారం తగ్గిస్తుంది. అయితే రెప్ప చాటున నిలిచిన నీటిచుక్కతో సేలీ ఏమిటంటే- అది కారిపోతే నీరే గాని, నిలిచిపోతే నిప్పు కాబట్టి కారిపోవడమే ఓదార్పు. అలాగే, కన్నీరు ఎవరికోసమో అయితే అది దివ్యం. ఎవరివల్లనో' అయితే... అది చైన్యం. అందుకే ఎంతో అమూల్యం.
కన్నవారి కంట కన్నీరు మంచిది కాదు
పొత్తిళ్లలో ఉన్నప్పుడు గుండెలపై తన్నిన బిడ్డలు ఇప్పుడు సూటిపోటి మాటల బాణాలు హృదయాల్లో గుచ్చుతుంటే గాయపడి రోదిస్తున్నారు.. కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ లాగేసుకుని.. నీకూ.. మాకూ ఏం సంబంధమని ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక కన్నీరు కారుస్తున్నారు.. తాము కన్న బిడ్డలు తమ కళ్లముందే కర్కశులుగా మారడాన్ని భరించలేక కుమిలిపోతున్నారు.. తప్పెవరిది? జాలి, దయ బోధించని చదువులదా? సంస్కారం నేర్పని సమాజానిదా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలన్నీ మనసును కాల్చేస్తుంటే కరిగి.. కన్నీరై రాలిపోతున్నారు.. కొందరు.. బిడ్డలు మారకపోతారా! అనే ఆశతో కష్టాలు కడుపులో దాచుకుని బలవంతంగా బతుకీడుస్తుండగా.. కొందరు మాత్రం ఆత్మాభిమానంతో బిడ్డలపైనే పోరాటానికి దిగుతున్నారు. 'మాయమై పోతున్నాడు మనిషన్నవాడు' అంటూ ఓ కవి అన్న మాటలకు తామే రుజువంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
కడలి నుండి కెరటాలు, హృదయం నుండి ఆరాటాలు, ప్రేమ కోసం పోరాటాలు దూరమైపోవటం లేదే! మరి పెద్దల నుండి నేటి పిల్లలు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? చెట్టు నుండి పచ్చదనం, సూర్యుని నుండి వెచ్చదనం
చంద్రుని నుండి చల్లదనం ఇవేవీ విడిపోవాలని కోరుకోవటం లేదే! మరి నేటితరం కొడుకులు తమ తల్లితండ్రుల నుండి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? పగలు నుండి రాత్రి, జననం నుండి మరణం - ఇవేవీ ఒకదానికి విడిచి వేరొకటి ఉండాలని అనుకోవటం లేదే! మరి ఈ అన్నదమ్ములు ఎందుకు విడివిడిగా ఉండాలని అనుకుంటున్నారు? మూడు కాలాలు, పంచభూతాలు, ఎనిమిది దిక్కులు విశ్వకుటుంబం నుండి వేరైపోదామని అనుకోవటంలేదే! మన కుటుంబాలే ఎందుకు ముక్కలైపోతున్నాయి?
కన్నీరు కరుణకు ఆనవాలు
ఓసారి ఒక సహచరుడు కారుణ్యమూర్తి (స) వారి సమక్షంలో తన అజ్ఞాన కాలం నాటి బాధాకరమైన సంఘటనను విన్పించారు. "నాకు ఒక చిన్న పాప ఉండేది. మా ప్రాంతంలో లేని పౌరుషానికి పోయి, పుట్టగానే ఆడ శిశువులను చంపే ఆచారం ఉండేది. నా భార్య నాకు తెలియకుండానే నా కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఆ పసిపాప చిలిపి చేష్టలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసేవి. అలా నేను ఆ పాపను ప్రేమించనారంభించాను. ఇది గమనించిన నా భార్య ఫర్వాలేదులే అనుకొని 'తను నా కూతురే' అని రహస్యం బైటపెట్టింది. మరుక్షణమే నాలోని మృగం మేల్కొంది. నేను అదను చూసి పాపను తీసుకొని శ్మశానానికి బయలుదేరాను. 'నాన్నా! మనం ఎక్కడికి వెళుతున్నాము? అని తను పదే పదే ప్రశ్నిస్తున్నా అవేవి వినే స్థితిలో లేని నేను నేరుగా ఖనన వాటికకు చేరుకున్నాను.
పాపను ఓ ప్రక్క కూర్చోమని చెప్పి 'సమాధి' తవ్వడం మొదలెట్టాను. నాపై పడే మట్టిని ఆ చిన్నారి పాప తన చిట్టి చేతులతో శుభ్రం చేస్తూ 'ఎందుకు నాన్నా గుంత తవ్వుతున్నావు?' అని ఒకే ప్రశ్న మరీ మరీ అడుగుతోంది. నేను మాత్రం మానవత్వం మరచిన మృగాన్నయి, పితృవాత్సల్యం మరచిన పశువునై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేను పశువునై నా పని నేను చేసుకుపోతున్నాను. గుంత తవ్వటం పూర్తయింది.
నా శరీరంపై చోటు చేసుకున్న చెమట బిందువుల్ని తన బుల్లి బుల్లి చేతులతో తుడుస్తున్న ఆ చిట్టితల్లిని ఒక్కసారి పట్టి గుంతలో నెట్టేశాను. 'పాపం! తనకేమి తెలుసు, కన్న తండ్రే తన్ను కడతేర్చేందుకు కసాయి వాడయ్యాడు' అని. బిత్తర చూపులతో నా వంకే ... కాసేపు ... చూస్తుండి పోయింది!!
అయినా నాకు జాలి కలగలేదు, ఆ చిట్టి తల్లిని అలానే ఉంచి ఆమెపై మన్ను త్రోయడం మొదలెట్టేశాను. ఆ పసిడి నవ్వు పాపాయి 'నాన్నా!' అన్ని దిక్కులు పిక్కటిల్లేలా పెడబొబ్బలు పెడుతున్నా, ఆ బుజ్జి కళ్ళు కన్నీరు కారుస్తున్నా కనికరించక క్రూర పశువునై ఆ చిట్టి తల్లిపై మట్టి గడ్డలు వేస్తూనే ఉన్నాను. అ క్షణంలో ఉన్మాదిలా మారిన నేను నా చిట్టి తల్లితోపాటు 'నాన్నా! కాపాడు నాకు భయమేస్తోంది ... శ్వాస ఆడటం కష్టమవుతోంది ఇక మీదట నేను తప్పు చేయను ... ప్రామిస్! ...' అన్న ఆమె ఆర్తనాదాన్ని సయితం సజీవ సమాధి చేసేశాను. కన్నకూతురిని కాటి మట్టిలో కలిపేశాను.
నిర్దాక్షిణ్యమైన ఈ గాధను విని కారుణ్యమూర్తి (స) కళ్ళల్లోని అశ్రుజలధి కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. హృదయ విదారకమైన, గుండెల్ని పిండేసే ఆ వృత్తాంతాన్ని విన్న కారుణ్యమూర్తి (స) ఎక్కి ఎక్కి ఏడ్వసాగారు. ఆయన గడ్డం మొత్తం తడిసి ముద్దయింది" (ముస్నద్ దారమీ).
ముస్అబ్ బిన్ ఉమైర్ (ర) అనే ఒక సహాబీ ఉండేవారు. ఇస్లాం స్వీకారానికి పూర్వం నూనూగు మీసాల ఆ యువకుడు సిరిసంపదల్లో తులతూగాడు. ఒకసారి తొడిగిన దుస్తులు మళ్ళీ డగకుండా ఎంతో గారాబంగా పెరిగాడు. అతను సువాసన పూసుకుని ఏదైనా వీధి గుండా వెళితే ఆ సుగంధ పరిమళాలతో వీధి మొత్తం గుభాళించేది. అతని తల్లిదండ్రులు అతన్ని అత్యంత ఖరీదైన దుస్తులు తొడిగించేవారు.
అల్లాహ్ అతనికి ఇస్లాం స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. తను ముస్లిం అయ్యాడు. కన్నకొడుకు తాతముత్తాతల మతాన్ని విడిచి పెట్టినందుకుగాను తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. ఎంత ప్రేమగా పెంచారో దానికన్నా ఎక్కువగా ద్వేషించడం మొదలెట్టారు. సత్యధర్మమైన ఇస్లాం కోసం సర్వాన్ని త్యాగం చేసిన ఆ నవ యువకుడు ఒకసారి కారుణ్యమూర్తి (స) సన్నిధికి వచ్చాడు. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, అత్యంత ఖరీదైన బట్టలతో నిత్యం కళకళలాడుతూ ఉండే తన ఒంటిపై అతుకులు వేయబడిన దుస్తులు, గుండీలకి బదులు ముళ్ళు గుచ్చుకున్న బట్టలున్నాయి. ఆ నవ యువకుని ఆ పరిస్థితిని చూసి కారుణ్యమూర్తి (స) వారి కళ్లల్లో కన్నీరు ఉబికి వచ్చింది.
'ఏడిచి ఎన్నాళయినదీ ఎద'
హజ్రత్ ఇబ్రాహీం బిన్ -అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రహ్మలై) కథనం: ఓసారి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) ఉపవాసంలో ఉన్నప్పుడు (ఇఫ్తార్ వేళ) ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముస్అబ్ బిన్ ఉమైర్' అమరగతులయ్యారు. ఆయన నాకన్నా గొప్ప వారు. ఆయన అంత్యక్రియలు జరిపి నప్పుడు (తన దగ్గర) ఒక దుప్పటి మాత్రమే ఉంది. (అది కూడా ఎంత చిన్నదంటే) దాంతో ఆయన ముఖాన్ని కప్పితే ఆయన కాళ్లు బయటికి కనిపిం చేవి. కాళ్లను కప్పితే ముఖంపై ఆచ్ఛాదనం ఉండేది కాదు. ఆ తరువాత మాకు ఎంత సమృద్ధిగా ప్రాపంచిక సిరి సంపదలు వొసగబడ్డాయో మీరు చూస్తున్నారుగా! (లేక) దేవుడు ఎంత ఎక్కువగా సిరిసంపదలు ప్రసాదించాడో కనబడుతూనే ఉంది. కాని ఈ సిరిసంపదలు చూస్తుంటే మనం చేసుకున్న పుణ్య కార్యాలకు ప్రతిఫలం ప్రపంచంలోనే ఇవ్వబడుతుందేమోనని పిస్తోంది” అని చెప్పి అన్నం కూడా తినకుండా రోదించటం మొదలు పెట్టారు. (బుఖారీ)
ఓసారి కొంతమంది, చివరి శ్వాసలు లెక్కిస్తున్న జైనబ్ (ర) గారి పసి పిల్లాడిని ఎత్తుకొని కారుణ్యమూర్తి (స) వారి ముందు తెచ్చారు. పిల్లవాడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్నాడు. ఆ బాలుని ఒళ్ళో తీసుకున్న కారుణ్యమూర్తి (స) కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అక్కడున్న హజ్రత్ సాద్ (ర)కు ఆశ్చర్యమేసి – “ఓ దైవప్రవక్తా! ఏమిటిదీ? తమరు కంట తడి పెట్టడమా?" అని అననే అన్నారు. దానికి కారుణ్యమూర్తి (స) “ఇతరులపై జాలి చూపై వారిపైనే అల్లాహ్ జాలి చూపుతాడు" అని గద్గద స్వరంతో జవాబిచ్చారు. (బుఖారీ)
కారుణ్యమూర్తి (స) వారికి ఖురైషు ప్రజలు ఎక్కడ ముప్పు తలపెడతారోనన్న భయంతో ఓ రోజు బాబాయి అబూతాలిబ్ ఆయన్ను ఉద్దేశించి - "ముహమ్మద్! నీ బాబాయిని చూసి అయినా జాలి పడవయ్యా! నేను మోయలేని భారం నాపై మోపకు బాబూ!" అన్నారాయన ఆవేదనాభరిత కంఠంతో. అదొక సున్నితమైన ఘడియ. కాలం స్తంభించిపోయి కారుణ్యమూర్తి (స) వారి సమాధానంకై ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
ప్రవక్త (స) వారు పెదవి విప్పారు. "బాబాయి! దైవసాక్షి! మీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తెచ్చిపెట్టి ఈ మహాకార్యం మానుకోమన్నా అది జరిగే పని కాదు. వినండి! ఈ మహాకార్యం పూర్తయినా పూర్తి అవ్వాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణాలైనా పోవాలి” అన్నారు దృఢ సంకల్పంతో.
కారుణ్యమూర్తి (స) లేచి బయటికి నడిచారు. ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అది గమనించిన బాబాయి 'అబ్బాయి! నీవు చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ నేను నీతోనే ఉంటాను' అన్నారు అబూతాలిబ్. అది విన్న కారుణ్యమూర్తి ముఖారవిందం పువ్వులా వికసించింది.
అవతలి వ్యక్తుల వైఫల్యాలు చూసి సంతోషపడే కలియుగం ఇది. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారంటే.. చేయూతనివ్వాల్సింది పోయి, వారి ఏడుపులు చూసి ఆనందపడే రోజులివి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. నవ్వీ నవ్వీ కళ్లు తుడుచుకుంటారు మనలో చాలా మంది. అవును కన్నీళ్లకు అంత అద్భుత శక్తి. సంతోషమైనా, దు:ఖమైనా కళ్లలో కనిపించేస్తుంది. ఏ రకంగా ఏడుపు అంటే కళ్లలో నీళ్లు వచ్చినా మంచిదే. కానీ, ఒకరి మీద పడి ఏడవడం కాదు జీవితం. అలాగే ఒకరిని ఏడిపించడం సరి కాదు.
ముస్లిమేతరలతో మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఎలా ఉండేవారు?
(ప్రజలారా!) మీలో నుండే మీదగ్గరకు దైవప్రవక్త వచ్చాడు. మీరు నష్టపోవడం ఆయనకి ఎంతో బాధగా ఉంటుంది. మీ శ్రేయస్సునే ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. విశ్వాసుల పాలిట ఆయన గొప్ప వాత్సల్యమూర్తి, అమిత దయగలవాడు. (అత్-తౌబా: 128)
మహనీయ ముహమ్మద్ (స) సత్యోద్యమాన్ని ప్రారంభించినప్పుడు విశ్వవ్యాప్తంగా బహుకొద్ది మాత్రమే స్వచ్ఛమైన ముస్లింలు. మిగతావారంతా ముస్లమేతరులే. వారిలో ఆస్తికులూ ఉండేవారు, నాస్తికులూ ఉండేవారు. గ్రంథ ప్రజలూ ఉండేవారు. అంటే ఆయన ఎక్కువ సమయం ముస్లిమేతర సోదరులతో, ముస్లిమేతర బంధువులతో, ముస్లిమేతర ఇరుగు పొరుగుతో, ముస్లిమేతర సహవాసులతో, ముస్లిమేతర ప్రాంతాలతో, ముస్లిమేతర రాజ్యాలతోనే గడిపారు. ఆయన ఉన్నత నైతిక విలువలకి ముస్లిమేతరులు ఆశ్చర్యచకితులయ్యేవారు. స్మితపూర్వభాషి సత్యప్రవక్త ముహమ్మద్ (స). ఆయన మాటకన్నా మందహాసమే ముందుగా ఎదురొస్తుంది అనేవారు ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరూ. ఆయన ఆదర్శ ప్రవర్తనా ప్రభకు గులాములయి ఒక్కొక్కరుగా ఇస్లాం సత్య ధర్మ ఛత్రఛాయల్లోకి వచ్చి చేరాభారంభించారు. అలా 23 సంవత్సరాల ఆనతి కాలంలోనే మానవ చరిత్రలో మునుపెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఓ అద్భుత సమాజాన్నీ బలమైన పునాదుల మీద స్థాపించారు. చివరి హజ్ సమయానికి ఆయన అనుయాయుల సంఖ్య లక్షల్లోని మాటే. అంతిమ హజ్ లో పాల్గొన్న వారి సంఖ్య 1 లక్ష్ఝా 40 వేలంటారు. ఆయన తీసుకొచ్చిన మార్పుకి ఒక సామాన్య పౌరుని సాక్ష్యం అబిసీనియా రాజ దర్బారులో అందరి సమక్షంలో ఇవ్వబడినది.
ఆ కామన్ మ్యాన్ ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించినవారి తరఫున మాట్లాడుతూ ఇలా చెప్పనారంభించారు. "రాజా! మేము పూర్వం అజ్ఞానులుగా ఉండి, విగ్రహాలను పూజించే నాళ్లం. అశ్లీలతో ఊబిలో పీకల్లోతుకు దిగబడి ఉండేవాళ్ళం, కామం, క్రోధం, మోహం, మదం, మత్సర్యం, మద్య సేవనం, మగువ లోలత్వం, దొంగతనం, దోపిడి లాంటి అవలక్షణాలకి పుట్టినిల్లుగా ఉండేది మా సమాజం. ఇవి చాలవన్నట్లు బంధుత్వ సంబంధాల నిచ్చితికి పాల్పడటం మా దినచర్యగా ఉండేది. అలాంటి తమో చీకట్లలో ఎటూ పాలుపోక కొట్టుమిట్టాడుతున్న మా కోసం అల్లాహ్ మా మధ్య - స్వయంగా మాలో నుండే తపో కిరణమైన ఓ ప్రవక్తను ప్రభవింపజేశాడు. మేము ఆయన గౌరవప్రదమైన వంశాన్ని, ఆయన సత్యసంధతను బాగా ఎరిగినవాళ్ళమే. 'మేమంతా అల్లాహ్ ఒక్కడే మనందరి నిజ పూజ్యనీయుడిగా ప్రభువుగా నమ్మాలని, విగ్రహారాధనను పరిత్యజించాలని, పదా సత్యమే పలకాలని, విశ్వసనీయతను అలవర్చు కోవాలని, బంధుత్వాన్ని పటిష్ట పరచుకోవాలని ఆయన ఉపదేశించారు. అలాగే అవలక్షణాలకు, అనైతిక చేష్టలకు, అశ్లీల విషయాలకు, అక్రమార్జనకు, లంచానికి, అధర్మ ఆహార కంచానికి, పరపొందు మంచానికి దూరంగా మసలుకోవాలనీ, అనాథల సొమ్మును అన్యాయంగా తినకూడదని హెచ్చరించారు. మేము ఆయన్ని సత్య ప్రవక్తగా విశ్వసించాము, ఆయన తెలిపిన ప్రతి విషయాన్నీ మనసారా స్వీకరించాము.
అయితే ఈ కారణంగానే మా జాతి వారు ఆగ్రహించి మమ్మల్ని హింసించారు. తీవ్ర పరీక్షలకు గురిచేశారు. మేము సత్యధర్మాన్ని వదలి తిరిగి విగ్రహారాధన చేయాలని, ఘర్ వాపసీ చేసి తీరాల్సిందేనని ఒత్తిడి తెచ్చి మా జీవితాలను దుర్భరం చేసారు. చివరకు మేము వారి దౌర్జన్యాలు, దౌష్ట్వాలు భరించలేక మీ దేశానికి మిమ్మల్ని నమ్మి వచ్చి తల దాచుకున్నాము. మీరు ఉండగా మాపై ఎటువంటి జులుం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము" అని మాట పూర్తి చేశారు ఆ అసామాన్య పౌరుడే హజ్రత్ జాఫర్ (ర). ఆ బృందంలోని ప్రజలంతా పూర్వం ముస్లిమేతరులే!
మహనీయ ముహమ్మద్ (స) - తౌహీద్ ప్రధాన ధర్మ ప్రకటనలో అందమైన నిర్మాణానికి చివరి ఇటుక వంటివారు. మానవ లోకంలో ఇస్లాం ధర్మ పరంపర ఆది మానవులు మరియు ప్రవక్త అయిన ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయ్యింది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో మహనీయ ముహమ్మద్ (స) చివరివారు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందు వజ్ర సంకల్పులయిన ప్రవక్త నూహ్, ఇబ్రాహీమ్, మూసా, ఈసా (అలైహిముస్సలామ్) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఆయన్ను ఇస్లాం మత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం ధర్మం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన ఆదమ్ ప్రవక్తతో. ఆ విషయానికొస్తే సృష్టి చరాచరా లన్నింటిలో కానవచ్చే ధర్మం ఇస్లాం. ప్రకృతి అంతటి సహజమైన ధర్మం ఇస్లాం.
”అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైన్నే (ఉండండి)” (రూమ్: 30)
‘ఫిత్‌రహ్’ అంటే సహజత్వం లేక నైజం. అల్లాహ్ మానవుల్ని సహజ ధర్మం-ఇస్లాంపై, అల్లాహ్ ఏకత్వ భావన-తౌహీద్‌పై పుట్టించాడు.పుట్టుక రీత్యా ప్రతి మనిషి నైజంలో అల్లాహ్ ఏకత్వం-తౌహీద్ భావన అంతర్లీన మై ఉంది. జన్మతః ప్రతి మనిషి అల్లాహ్ విధేయుడిగానే (ముస్లింగానే) ఉంటాడు. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత పరిసరాల, పరివార, పండితుల, స్నేహితుల, సాహిత్య ప్రభావానికి గురవుతాడు. తాను కళ్ళు తెర చిన సమాజంలోని కుళ్ళు అతన్ని సహజ ధర్మం వైపునకు మళ్ళకుండా చేస్తుంది. ఇదే యదార్థాన్ని ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ”పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే పుడుతుంది. కానీ దాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదునిగానో, క్రైస్తవయనిగానో, అగ్ని పూజారిగానో మార్చి వేస్తారు”. (బుఖారీ)
పొతే, ముస్లిమేతరలతో మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఎలా ఉండేవారు? అనే విషయాన్ని ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
ముస్లిమేతర సోదరులతో సత్సంబంధాలు, సహజీవన భావాలకు సంబంధించి ఇస్లాం రెండు మౌలిక దృక్పథాలను మనముందుంచింది.
మొదటిది: విశ్వమానవ సోదరభావం
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (దివ్యఖుర్ఆన్ - 49 : 13)
ప్రవక్త మహనీయులు (స) వివిధ సందర్భాలలో, వివిధ రకాలుగా ఈ విషయాన్ని విడమరచి చెప్పారు.
“ప్రజలంతా ఆదమ్ బిడ్డలే. ఆదమ్ మట్టితో చేయబడ్డారు.” (మజ్మవుజ్జవాయెద్ - హదీసు నెం.13089).
దైవప్రవక్త (స) తన వీడ్కోలు హజ్డ్ సందర్భంగా ఇలా ఉపదేశించారు..
ప్రజలారా! మీరందరు ప్రభువు ఒక్కడే. ఒక అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, ఒక అరబ్బేతరుని అరబ్బుపై గానీ, ఒక ఎర్రవానికి నల్లవానిపైగానీ, ఒక నల్లవానికి ఎర్రవానిపైగానీ ఎలాంటి ఆధిక్యత లేదు - ఒక్క తఖ్వాతో తప్ప. మీలో ఎవరు ఎక్కువ తఖ్వాపరులో వారే అల్లాహ్ కు అత్యంత ప్రీతిపాత్రులు.(బైహాఖీ)
మానవులంతా ఒకే తల్లిదండ్రుల బిడ్డలన్న భావన రాగానే మానవ సోదర భావం దానంతట అదే జనిస్తుంది - వారు ఏ మతాన్ని నమ్మేవారయినా, ఏ వంశానికి చెందిన వారయినా, వారు తెల్లవారయినా, నల్లవారయినా - వారంతా అన్నదమ్ములే. అందుకే ఆయన (స) ఒకసారి ఈ విషయాన్ని విశదీకరిస్తూ, “ఆదమ్ సంతతి వారంతా అన్నదమ్ములే" అని నొక్కి వక్కాణించారు (అబూదావూద్).
రెండవ దృక్పథం: మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి, గౌరవనీయుడు
ప్రాపంచిక అనుగ్రహాలన్నీ ఒక వైపు.. మనిషి స్వేచ్చా మర్యాదలు ఒక్కటే ఒక వైపు. అది లేకుండా... అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఏమి లేనట్టే. ఏ మనిషి అయినా తనని తాను ప్రేమించుకుంటాడు. తనకో విలువ ఉందని ప్రగాఢంగా నమ్ముతాడు. ఎదుటి వాళ్లకు తనెంత మర్యాద ఇస్తున్నాడో, తనకూ అంత మర్యాద దక్కాలని కోరుకుంటాడు. ప్రతీ మనిషి తనకో విలువ, గౌరవం, మర్యాద, అభిమానం ఉన్నాయని నమ్ముతాడు. ఎప్పుడైతే ఈ నమ్మకాలకు భంగం కలుగుతుందో అపుడు ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. మనల్ని మనం ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరు. కనుకనే ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు; నీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో దాన్నే నీ సోదరుని కోసం ఇష్ట పడు. (నసాయి)
ప్రపంచంలో జరిగిన సంస్కరణోద్యమాల లక్ష్యం సమాజంలోని దురాచారాలను రూపుమాపడమే. ప్రజల్లో చైతన్యం కలిగించి, వారిలో మార్పు తీసుకురావడానికి సంఘసంస్కర్తలు అనేక ఉద్యమాలు చేపట్టారు. నాడు దళితులను అంటరానివారిగా చూపుతూ, వారిని సమాజంలో హీనంగా చూసేవారు. దీన్ని ఎదిరించిన సంస్కర్తలు ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అలాంటి సంఘ శ్రేయోభిలాషుల్లో తొలి వరుసలో దైవ ప్రవక్తలు ఉంటే, ఆ ప్రవక్తలందరిలోనూ అగ్రగణ్యులు మహనీయ ముహమ్మద్ (స). అలాగే సమాజంలో గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టిన రచనల్లో తొలి పంక్తిలో దైవ గ్రంథాలుంటే, దైవ గ్రంథాలన్నింటిలోనూ సింహ భాగం అల్లాహ్ అంతిమ ఖుర్ఆన్ సొంతం. శాశ్వత శాసనం అయిన దాని మాట ఏమిటంట,
"మేము ఆదమ్ సంతతికి గౌరవం వొసగాము, నేలపైన మాత్రమే గాకుండా నీటిలో కూడా వారికి వాహనాలను ప్రసాదించాము. ఇంకా, వారికి పరి శుద్ధమైన జీవనోపాధిని ప్రసాదించాము.” (బనీ ఇస్రాయీల్-70)
ఇస్లాం దృష్టిలోనయినా, ఇస్లాం ప్రవక్త (స) దృష్టిలోనయినా సంయుక్తంగా ఉన్న విషయం ఏమంటే; ఒక వ్యక్తి – అతను ముస్లిమయినా లేక ముస్లిమేతరుడయినా- మానవుడైన కారణంగా గౌరవించదగినవాడు, మర్యాద ఇవ్వదగినవాడు. జగతిలో ఉన్న జీవన ఒనరులు కేవలం ముస్లింలవి కావు; మానవులంతా వాటికి హక్కుదారులే.
ఇస్లామీయ దృక్కోణం నుండి ముస్లింల-ముస్లిమేతరుల మధ్య సౌహార్థ సంబంధాలకు పునాది వంటివి ఈ రెండు దృక్పథాలు. మహాప్రవక్త ముహమ్మద్ (స) తన సత్ప్రవర్తన ద్వారా, నియమాల ద్వారా దీనికి సంబంధించిన క్రియాత్మక నమూనాలు సమర్పించారు. అవేంటో చూద్దాం రండీ!
నాయకులు, పాలకులతో ప్రవక్త (స) వారి ప్రవర్తనా సరళి
మన మతి ఎట్లుంటుందో మన గతి అట్లుంటది. మన నోరు బాగుంటే మనం ఉండే ఏ ఊరైనా బాగుంటుంది. ఈ నిమిత్తం ఓ సంఘ నీతిని ప్రవక్త (స) బోధించారు:
మనిషి స్థాయి, గౌరవాన్ని బట్టి వ్యహరించాలి అని మహనీయ ముహమ్మద్ (స) ఆదేశించారు. (హాకిమ్)
తాను ప్రబోధించిన సుభాషితానికి స్వయంగా ఆయన కట్టుబడ్డారు. దైవప్రవక్త (స) ముస్లిమేతర సోదరులను సదా ప్రేమభావంతో పలకరించే వారు. వారితో గౌరవప్రదంగా వ్యవహరించేవారు. ఆయన (స) ఎందరో ముస్లిమేతర చక్రవర్తులకు, నాయకులకు ఉత్తరాలు వ్రాశారు. ఆ ప్రముఖులను అక్కడి ప్రజలు ఏ బిరుదుతో పిలిచేవారో, అదే బిరుదుతో వారిని సంబోధించారు. ఉదాహరణకు: రోము చక్రవర్తి హెరిక్లస్ ను 'అజీముర్రూమ్' అని సంబోధించారు. ఈరాన్ చక్రవర్తి 'కిస్రా'ను 'అజీముల్ ఫారస్!' అని వ్రాశారు. అబిసీనియా రాజు నజాషీని కూడా 'అజీముల్ హబష్!' అని సంబోధించారు (బుఖారీ). 'అజీమ్' అన్న పదంలో ఘనత వహించినవాడా! మాననీయుడా! అన్న భావాలు ఇమిడి ఉన్నాయి.
మనము చరిత్ర పుస్తకాల్లో అబూ జహల్ అని చదివే, ప్రసంగాల్లో వినే అతని అసలు పేరు, బిరుదు ఏమిటో తెలుసా? అమ్ర్ బిన్ హిషామ్ , అబుల్ హకమ్ బిరుదు. మక్కాలో అబూ జహల్ ఆయన (స)కు బద్ద విరోధి. ఆయన్ని వేధించటానికి, కష్ట పెట్టడానికి దొరికిన ఏ అవకాశాన్నీ అతను జారవిడిచేవాడు కాడు. అయితే అతనిలో సమస్యలకు సమాధానం వెతికే, వ్యవహారాలపై తీర్పులు ఇచ్చే విశిష్ట సామర్థ్యం ఉండేది. అతను ఒక నాయకుడిగా మంచి నేర్పరి, గొప్ప తీర్పరి. ఈ కారణంగా అక్కడి ప్రజలు అతన్ని 'అబుల్ హకమ్' అని పిలిచేవారు. అందువల్ల దైవప్రవక్త (స) కూడా అతన్ని అతను బతికున్నంత వరకూ 'అబుల్ హకమ్' అనే సంబోధించేవారు. (సీరత్ ఇబ్నె హిషామ్ : 1/389).
ముస్లిమేతరులైన బంధువులతో...
ముస్లిమేతరులైన ముస్లింల బంధువులతో, రక్త సంబంధీకులతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని గట్టిగా తాకీదు చేయబడింది. దివ్యఖుర్ఆన్లో పన్నెండు చోట్ల బంధుత్వ సంబంధాలను కాపాడాలని ఆజ్ఞాపించటం జరిగింది. సమీప బంధువు పట్ల సద్యవహారం చేయటంలో రెండింతల పుణ్యం ఉందనీ, దానం (సదకా) చేసినందుకు, బంధుత్వ హక్కును ఇచ్చినందుకు కూడా (మంచి ప్రతిఫలం లభిస్తుందని) మహనీయ ముహమ్మద్ (స) చెప్పారు (తిర్మిజీ). “తన జీవనోపాధి వికసించాలని, తనకు దీర్ఘాయుషు ప్రాప్తించాలని కాంక్షించేవాడు బంధుత్వ సంబంధాలను పరిరక్షించాల”ని ఆయన (స) వేరొక సందర్భంలో వక్కాణించారు (బుఖారీ).
బంధుత్వ సంబంధానికి ప్రాతిపదిక మతం కాదు, రక్త సంబంధమే. బంధువులు ముస్లింలయినా, ముస్లిమేతరులయినా - వారి పట్ల మంచిగా మెలగాలని ప్రవక్త (స) ఆదేశించారు.
ప్రవక్త సహచరులలో అనేకమంది పరిస్థితి ఎటువంటిదంటే, వారి తల్లి దండ్రుల్లో ఒకరు ముస్లిం అయివుంటే, మరొకరు ముస్లిమేతరులుగా ఉండేవారు. ఉదాహరణకు: మహనీయ అబూబక్ర్ (రజి) గారి తండ్రి మక్కా విజయం వరకూ ముస్లిం కాలేదు. కాని అబూ బక్ర్ (రజి) మాత్రం తన తండ్రి పట్ల సద్భావంతో మెలిగేవారు. హజ్రత్ అబూ హురైరా (రజి) గారి తల్లి ఇస్లాం స్వీకరించలేదు. పైగా ఆవిడ దైవప్రవక్త (స)ను దూషిస్తూ ఉండేది. అయినప్పటికీ ఆమె పట్ల ఉత్తమ రీతిలోనే మెలగమని ఆయన (స) అబూ హురైరాకు ఆదేశించారు. (అద్దుర్రుల్ మనూర్ : 6/521)
అబూ బకర్ కుమార్తె యగు అస్మా (ర.అ) వద్దకు ఒకసారి ఆమె కన్నతల్లి వచ్చింది (మదీనాకు). అప్పటికి ఆమె ఇంకా ముస్లిం కాలేదు. అస్మా గారు దైవ ప్రవక్త (స) సన్నిధికి వచ్చి, 'ముష్రిక్కు అయిన నా తల్లికి నేనేమైనా ఇవ్వగలనా?' అని అడిగితే “ఆమె పట్ల ఉత్తమంగా, ఉదారంగా వ్యవహరించు” అని ఆయన (స) ఆజ్ఞాపించారు (బుఖారీ).
ముస్లిమేతర పొరుగు
బంధుత్వ సంబంధం ముఖ్యమైన సంబంధమైనట్లే, ఇరుగుపొరుగు సంబంధం కూడా చాలా ముఖ్యమైనది. దివ్యఖుర్ఆన్లో రెండు రకాల పొరుగువారి ప్రస్తావన వచ్చింది. ఒకటి: బంధువులైన పొరుగువారు. రెండు: అపరిచితులైన పొరుగువారు (అంటే బంధుత్వం లేని పొరుగువారు)గా పేర్కొనటం జరిగింది.
కాబట్టి ఈ రెండు రకాల పొరుగువారితో ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశించటం జరిగింది. మహాప్రవక్త (స) గారు ఈ విషయాన్ని మరింత గట్టిగా నొక్కి వక్కాణించారు. “ఎవరి (కీడు)వల్ల పొరుగింటి వానికి రక్షణ లేదో అతను విశ్వాని కాజాలడు” అని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని ప్రవక్త (స) మూడుసార్లు ఒట్టేసి మరీ చెప్పారు (బుఖారీ).
తన ఇంటి గుమ్మానికి మరీ దగ్గరలో ఉన్నవారే పొరుగువారు. ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు - ముస్లిమేతరులన్న విచక్షణ పాటించలేదు. దైవ ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాల ప్రభావం వల్లనే ఆయన గారి సహాబా ముస్లిమేతరులైన పొరుగువారి పట్ల ప్రేమాదరణలతో మెలిగేవారు. తమ వల్ల వారికెలాంటి భౌతిక నష్టం మానసిక వ్యధ కలగకుండా జాగ్రత్త వహించేవారు.
ఒకసారి హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) ఇంట ఒక మేక కోయబడింది. ఆ రోజు ఆయన ఇంటికి రాగానే, 'నా పొరుగు వాడైన ఫలానా యూదు వ్యక్తికి మాంసం పంపారా? లేదా?' అని దర్యాప్తు చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు: “ప్రవక్త మహనీయులు (సఅసం) పొరుగువారి యెడల సద్భావంతో మెలగమని గట్టిగా తాకీదు చేసేవారు" (అబూ దావూద్). ఇరుగు పొరుగు వారిలో ఇంకొక రకం 'తాత్కాలిక పొరుగువారు'. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రైనులోనో, బస్సులోనో, విమానంలోనో మన ప్రక్కన కూర్చుని ఉండే వారన్నమాట. దివ్యఖుర్ఆన్ ఇలాంటి వారు 'సాహెబుల్ జంబ్'గా పేర్కొనబడ్డారు. అలాంటి వారి యెడల మర్యాదగా మెలగాలని కూడా ఆదేశించటం జరిగింది. ఈ ఆదేశం ముస్లింలు, ముస్లిమేతర సోదరులకు కూడా వర్తిస్తుంది.
సంతోషంలో, దుఃఖంలో పాల్గొనటం
ఒండొకరి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలంటే ఒకరింకొకరి సుఖదుఃఖాలలో పాలుపంచుకోవాలి. దైవప్రవక్త (స) ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకునేవారు. తన ఇరుగు పొరుగువారిలో ఏ ముస్లిమేతర సోదరునికయినా జబ్బు చేస్తే అతని పరామర్శ చేసేవారు. ఒక యూదు నవయువకుడు ఆయన (స) వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన పట్ల గల ప్రేమాదరణ వల్ల ఆయనకు సేవలు కూడా చేసేవాడు. అతను వ్యాధిగ్రస్తుడైనప్పుడు దైవప్రవక్త (స) ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. చివరికి ఆ నూనూగు మీసాల నవయువకుడు ఆయన సత్ప్రవర్తనకు మంత్రముగ్దుడయి - బొందిలోని ప్రాణం పోతున్న నాజూకు ఘడియల్లో సత్య ధర్మాన్ని స్వీకరించి చివరి శ్వాస వదిలాడు. అల్హందు లిల్లాహ్! (సహీహ్ బుఖారీ).
పరిచయస్తులైన ముస్లిమేతర సోదరుల అంత్యక్రియలలో కూడా ఆయన (స) పాల్గొన్నారు. అబూ తాలిబ్ మరణించినప్పుడు, ఆయన శవ యాత్రలో పాల్గొనడమేగాకుండా, ఖనన వాటిక వరకూ వెళ్ళారు (సుననె బైహఖీ). అలాగే ఆయన, ముస్లిమేతరుడైన తండ్రి అబూ తాలిబ్ అంత్యక్రియల ఏర్పాట్లు చేయమని ఆయన కుమారుడైన అలీ (రజి)ని ఆదేశించారు. ప్రవక్త (స) గారి ఈ ప్రబోధనల ప్రభావం ప్రియ సహచరులపై ఎంతగా పడిందంటే, వారు కూడా ముస్లింలుకాని తమ బంధువుల అంత్యక్రియలలో పాల్గొనేవారు.
ముస్లిమేతర సోదరులకు సంతాపం తెలియజేయటానికి, శోక సంతప్త హృదయంతో ఉన్న వారిని ఓదార్చడానికి కూడా ఇస్లాం అనుమతినిస్తోంది. "రోగులను పరామర్శించండి. రోగులను పరామర్శించేవాడు స్వర్గంలోని ఒక తోటలో ఉంటాడని మహాప్రవక్త (స) ప్రవచించారు (ముస్లిం). ఈ ప్రబోధనలో ఆయన ముస్లిం-ముస్లిమేతరుడన్న తారతమ్యం చూపలేదు. పరామర్శకు సంబంధించిన ఈ ఆజ్ఞ సర్వసామాన్యమైనది.
వాగ్దాన పాలన
వాగ్దానం ముస్లింలకు చేసినదైనా సరే, ముస్లిమేతరులకు చేసి ఉన్నా సరే. దానిని నెరవేర్చటం తప్పనిసరి. ఒకవేళ వాగ్దానానికి విరుద్ధంగా చేస్తే అది పాపం అవుతుంది. దీనికి సంబంధించిన గొప్ప ఉదాహరణ హుదైబియా ఒడంబడిక. మక్కాలో ముస్లింలుగా మారి మదీనాకు వలస వచ్చిన వారిని ముస్లింలు వాపసు చేయాలన్నది ఆ ఒడంబడికలోని షరతుల్లో ఒక షరతు. ఆ ఒడంబడిక ఓ కొలిక్కి వస్తుండగానే హజ్రత్ అబూ జందల్ (రజి) మక్కా నుండి పారిపోయి ముస్లింల వద్దకు వచ్చారు. ఆ సమయంలో అబూ జందల్ కాళ్లకు సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. తనను ఎలాగయినాసరే మదీనాకు తీసుకెళ్ళమని ఆయన దైవప్రవక్త (స)కు ప్రాధేయపడ్డారు. ముస్లింలు కూడా ఆయన పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు. అప్పుడు మక్కా రాయబారి సుహైల్ బిన్ అమ్ను వ్యక్తిగతంగా ఎంతగానో నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించారు. కాని అతను ససేమిరా అన్నాడు. అందువల్ల దైవప్రవక్త (స) అబూ జందల్ని వాపసు చేస్తూ, ఓర్పు వహించమని సూచించారు. అల్లాహ్ త్వరలోనే ఏదయినా మార్గం తెరుస్తాడని ధైర్యం చెప్పారు. (సీరత్ ఇబ్నె హిషామ్-2/302).
విందుకు ఆహ్వానించటం, ఆహ్వానాన్ని స్వీకరించటం
సామాజిక జీవితంలో పరస్పర సౌహార్థ సంబంధాలకు ఒక అవకాశం విందుకు ఆహ్వానించటం. అలాగే ఒకరు ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించాలి. మహాప్రవక్త (స) ముస్లిమేతర సోదరులను విందుకు ఆహ్వానించేవారు. ఆయన దైవప్రవక్తగా నియుక్తులైనప్పుడు బనూ హషిమ్ ప్రముఖులను భోజనానికి ఆహ్వానించారు. ఆ విందు భోజనానికి వచ్చిన వారు 30 మంది వరకూ ఉంటారని అనబడుతోంది. (అల్ బిదాయ వన్నిహాయ: 3/40).
అదే విధంగా ఆయన (స) ఆతిథి మర్యాదను ప్రోత్సహించారు. అతిథులను గౌరవించవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు-ముస్లిమేతరులన్న విచక్షణ చూపలేదు. ఆయన (స) వద్దకు వివిధ తెగలకు చెందిన అతిథి బృందాలు వచ్చేవి. ఆయన (స) వారికి ఆతిథ్యమిచ్చే వారు. బద్ర్ యుద్ధంలో ఖైదీలుగా పట్టుబడిన వారు ఎవరో కారు, శత్రు సైనికులు. అయినప్పటికీ వారి అన్నపానీయాలకై ఉత్తమ రీతిలో ఏర్పాట్లు చేయమని ఆయన తన సహచరులకు ఆదేశించారు. ఈ కారణంగానే సహాబా తాము సాదాసీదా అన్నం తిని యుద్ధ ఖైదీలకు మాత్రం స్వాదిష్టమయిన భోజన ఏర్పాట్లు చేసేవారు (మజ్మవు జ్జవాయెద్)
కానుకల ఇచ్చిపుచ్చుకోవడాలు
“పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. తద్వారా ప్రేమ పెంపొందుతుంది. మనస్పర్థలు దూరమవుతాయి” అని ప్రవక్త మహనీయులు (స) ఉద్బోధించారు (ముఅజ్జమ్ కబీర్ లిల్ తబ్రానీ). ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు-ముస్లిమేతరులన్న తారతమ్యం కనబరచలేదు. పైగా అందరికీ కానుకలు ఇస్తూ ఉండాలని అన్నారు. ఒకసారి దైవప్రవక్త (స) ఒక జత బట్టలను హజ్రత్ ఉమర్ (రజి)కు ప్రదానం చేశారు. ఆ దుస్తులు చాలా ఖరీదైనవి. అందువల్లనే ఆయన (స) వాటిని తొడగలేదు. 'మీరు మీ కోసమే ఇష్టపడనప్పుడు నాకు మాత్రం ఎందుకిచ్చారుని హజ్రత్ ఉమర్ (రజి) అడిగితే, “నీకు ఇచ్చింది నీవు తొడుక్కుంటానికి కాదు. దానిని అమ్మివేయి లేదా ఎవరికయినా కానుకగా ఇవ్వు" అని దైవప్రవక్త (స) చెప్పారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) మక్కాలోని ఒక వ్యక్తికి ఆ దుస్తులను బహుమానంగా ఇచ్చారు. ఆ వ్యక్తి అప్పటికింకా ముస్లిం కాలేదు (బుఖారీ).
ఒకసారి మక్కా నుండి ఒక 'నర్తకి' మదీనా వచ్చి ఆర్థిక సహాయం చేయమని అభ్యర్థించింది. దైవప్రవక్త (స) స్వయంగా ఆమెకు ఆర్థిక సాయం అందించటమేగాక, తన కుటుంబీకుల చేత కూడా సాయం చేయించారు. మరి చూడబోతే ఆమె ముస్లిం కాదు. ఆమె వృత్తిని ఇస్లాం ఇష్టపడదన్నదీ విదితమే (బుఖారీ).
ధన ప్రాణాల రక్షణ
రక్తం మా రక్తం వంటిది. వారి ధనం మా ధనం వంటిది' అని ఒక సందర్భంలో ఆయన (సఅసం) ఇలా అన్నారు.“ఎవరయితే ఏదయినా ఒక ఒడంబడికను (శాంతియుతమైన జీవితం గడిపేం దుకు ముస్లిమేతరునితో చేసుకున్న ఒడంబడికను) భంగ పరుస్తాడో, అతను స్వర్గం యొక్క సువాసనను కూడా ఆఘ్రాణించలేడు. నిజానికి దాని సువాసన నలభై ఏండ్ల ప్రయాణ దూరం నుండి వస్తూ ఉంటుంది.” (బుఖారీ)
“జాగ్రత్త! ఎవడయితే తాను ఒడంబడిక చేసుకున్న వాని (ముస్లిమేతర వ్యక్తి)పై దౌర్జన్యం చేశాడో, అతని హక్కును హరించాడో లేదా అతని సమ్మతి లేకుండానే అతని హక్కును లాక్కున్నాడో ప్రళయదినాన నేను అతని పక్షం వహిస్తాను” (అబూ దావూద్)
సాధారణ సమయాల సంగతి అలా ఉంచండి, యుద్ధం లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన (స) ఈ ప్రమాణాలను విధిగా పాటించేవారు. శత్రువు ఆయుధాలు పడవేసి ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు లేదా సంధికి సిద్దపడినప్పుడు అతని సొమ్ములకు ఎలాంటి నష్టం కలిగించరాదని చెప్పేవారు.
వ్యాపార సంబంధాలు
వర్తక సంబంధాలలో ఆయన (స) ముస్లిం-ముస్లిమేతరుల మధ్య ఎలాంటి విచక్షణ చూపలేదు. తొలికాలంలో అబూ సుఫ్యాన్, జుబైర్ బిన్ ముతామ్ అనే వర్తకులు ఇస్లాం స్వీకరించలేదు. అయితే ఆ సమయంలో కూడా ఆయన (స) వర్తకం కొరకు తన వర్తక సామగ్రిని వారికి ఇచ్చేవారు. వచ్చిన లాభాలలో ముందుగా నిర్ధారించుకున్న దాని ప్రకారం వాటా తీసుకునేవారు. మదీనాలోనైతే ముస్లింల వర్తక మంతా - సాధారణంగా యూదుల (బనూ ఖైనుఖా) మార్కెట్లోనే సాగేది.
దైవప్రవక్త (సఅసం) ముస్లిమేతరులతో క్రయ విక్రయాలు జరిపేవారు. ఆయన (స) పరమపదించిన సమయంలో కూడా ఆయనగారి ఒక రక్షా కవచం ఒక యూదు వ్యక్తి వద్ద తాకట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన (స) ఆ యూదు వ్యక్తి వద్ద మూడు 'సా'ల (అరేబియాలో అప్పటి ఒక కొలమానం) బార్లీ గింజలు అరువుగా కొనుగోలు చేశారు (బుఖారీ).
అలాగే ఆయన (స) ముస్లిమేతర వ్యక్తులను తన దగ్గర సేవకులుగా నియమించుకునేవారు. ఆయన (స) మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసినప్పుడు, ఎడారిలో దారి చూపగల నమ్మకస్తుడైన ఒక వ్యక్తి అవసరం ఏర్పడింది. ఆయన (స) ఎంతో బాధ్యతతో కూడుకున్న ఈ పని కోసం ఒక ముస్లిమేతర వ్యక్తిని వేతనంపై నియమించుకున్నారు (అహ్కామ్ అహ్లుజిమ్మహ్)
న్యాయం, సమభావం
ఆయన న్యాయ వ్యవహారం కేవలం తన సహచరుల పరకే పరిమితం కాలేదు, తన వ్యక్తిగత విషయంలో కూడా ఆయన (స) పూర్తిగా దీనికి కట్టుబడి ఉన్నారు. తాను ఎవరికయినా బాకీ పడి వుంటే రుణదాతకు అడిగే హక్కు కచ్చితంగా ఉంటుందని క్రియాత్మకంగా నిరూపించారు. ఒకవేళ బాకీ వసూలు విషయంలో రుణదాత కరకుగా మాట్లాడినా సహించి ఊరుకునేవారు. ఆయన (స) జైద్ బిన్ సానా అనే యూదు వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నారు. అతను వచ్చి దైవప్రవక్త (స) అంగీని పట్టుకుని లాగుతూ పరుష వాక్యాలు పలికాడు. 'నా రుణం తీరుస్తావా లేదా? ఎందుకు తీరుస్తావులే? బనీ ముత్తలిబ్ వంశస్తులంతా ఇంతే. దాటవేసే రకం' అన్నాడు. ఈ మాట వినగానే హజ్రత్ ఉమర్ (రజి) చివాలున లేచి నిలబడ్డారు. యూదు వ్యక్తిని ఒక్క తోపు తోశారు. అప్పుడు దైవప్రవక్త (స) ఉమర్ని వారిస్తూ, “ఉమర్! నేనయినా, ఇతనయినా నీ నుండి ఆశించింది ఇది కాదు. ఉత్తమ రీతిలో అప్పు తీర్చండి అని నీవు నాకు చెప్పాల్సింది, సరైన పద్ధతిలో అడగమని అతనికి సచ్చజెప్పాల్సింది. కాబట్టి ఇప్పుడు నువ్వెళ్ళి అతని అప్పు తీర్చిరా. నువ్వతన్ని భయపెట్టినందుకు బదులుగా ఇరవై 'సా'ల ఖర్జూరాలు అధికంగా ఇవ్వాలి" అని తాకీదు చేశారు (ముస్తద్రక్ హాకిమ్).
మన్నింపుల వైఖరి
ఒకసారి మక్కాలో తీవ్ర దుర్భిక్షం తాండవించింది. ప్రజలు మృత జంతువును సయితం తినాల్సిన అగత్యం ఏర్పడింది. మరి చూడబోతే ఆ జనులు ఎవరో కాదు, దైవప్రవక్త (స)ను, ఆయన ప్రియసహచరులను సంఘ బహిష్కరణ చేసి ఒక్కో ఆహారధాన్యపు గింజ కూడా వారికి చేరకుండా అడ్డుకున్నవారు. మక్కాలో ముస్లింలు నాలుగేండ్ల వరకూ ఈ కఠినమయిన ఆర్థిక ఆంక్షలను భరించారు. కాని ఆయన (స) మదీనాకు హిజ్రత్ చేసిన మీదట మక్కాలో కరువు కాటకాలొచ్చి అక్కడి ప్రజలు తిండికి తిప్పలు పడాల్సిన దుస్థితి దాపు రించింది.
ఆశీర్వచనాలు. కళ్లకి కనబడవు. అవి దివ్యతరంగాలై చెడుని పారదోలతాయి. అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయి. కమ్ముకున్న మాయని మటుమాయం చేస్తాయి. అందుకే ఏ పని మొదలు పెట్టినా ఆశీర్వచనాల కోసం అర్రులు చాచాలి. అనుభవజ్ఞులు, పెద్దవాళ్లు, తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు మెండుగా తీసుకోవాలి. ఆశీర్వచనాల పంట పండితే మనం తలపెట్టే పనులకు ఎదురుండదు. అపజయం మాట వినపడదు. జయం పరుగులు తీసి ముందుకు వస్తుంది. ఈ యదార్థం తెలిసిన మక్కా నాయకులు ఆయన (స) దగ్గరకు వచ్చి, 'తమరు బంధువుల యెడల ఉత్తమంగా మెలగమని బోధిస్తారు కదా! ఇప్పుడు మీ జాతి వారు దుర్భర దారిద్య్రంతో అంతమవుతు న్నారు. కాబట్టి తమరు ఈ దుర్భిక్షాన్ని దూరం చేయమని దైవాన్ని ప్రార్థించండి' అని కడు దీనంగా అభ్యర్థించారు. ఈ మాటలకు కారుణ్యమూర్తి (స) హృదయం కరిగి పోయింది. ఆయన (స) చేతులెత్తి వారి కష్టాన్ని తొలగించమని అల్లాహ్ న్ను వేడుకున్నారు. తరువాత మక్కాలో పుష్కలంగా వానలు కురిశాయి (బుఖారీ),
కాదేదీ విమర్శకు అనర్హం - కానీ...
విమర్శ అంటే, – పరిశోధించు, పర్యాలోచించు, విచారించు, వివేకించు, వివేచించు, శీలించు, శోధించు అని అర్థాలున్నాయి . ఒక గ్రంథంలోని, లేదా ఒక సాహిత్యప్రక్రియలోని, ఒక వ్యక్తి జీవితంలోని బాగోగులు కూలంకషంగా విచారించి, విశ్లేషించి వివరించడమే విమర్శ. అది ఎంత ప్రజ్ఞావంతంగా పక్షపాతరహితంగా, పవిత్రవంతంగా, హృదయపూర్వకంగా, సానుభూతి సహితంగా వుంటే సాహిత్యానికీ, సంఘానికీ అంత ఉపకారకారణమవుతుంది. “మంచి విమర్శ మంచి భావాలు నెలకొల్పుతుంది; ఒక మహాకావ్యం అవతరించడానికి అవకాశం కల్పిస్తుంది”. సద్విమర్శలు - వ్యక్తికయినా, వ్యవస్థకయినా, దేశానికయినా, ధర్మానికయినా - అవే అభివృద్ధికి సోపానాలు. అందుకే విమర్శ, పరామర్శ అంత మంచిగుండాలి అంటారు పెద్దలు.
విమర్శకుడు ఎలా ఉండాలి?
అన్ని పక్షాలూ విచారించి, సరైన న్యాయం వ్యక్తీకరించే న్యాయాధిపతి వంటి వాడు కావాలి విమర్శకుడు; తన కేసు ఎలా అయినా గెలవాలని వాదించే న్యాయవాదివంటివాడు కాకూడదు. రసజ్ఞుడు కావాలి; కేవలం దోషజ్ఞుడు కాకూడదు. ప్రజ్ఞావంతుడు కావాలి; పక్షపాతం కలవాడు కాకూడదు. గుణగ్రాహి కావాలి; మచ్చరగొట్టు కాకూడదు.
ఇక ద్వేషంతో చేసే కువిమర్శలంటారా --- ఓ సందర్భంగా కొందరు అలగా జనాలు ప్రవక్త ముహమ్మద్ (స) తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు. దానికి ఆగ్రహించిన ఆయన అభిమానులయిన ముస్లింలు శాంతి పూర్వకంగానే నిరసనలు తెలిపారు. ప్రభుత్వం కార్యాలయం ముందర ధర్నాకి దిగారు. వారి ఈ నిరసన తెలిపే హక్కును కూడా నీరు గార్చాలి అని చూసిన కుమతులు, కుత్సిత బుద్ధులు, పనికిమాలిన సుద్దులు చెప్పే ప్రయత్నం చేయడమేకాక, మంది బలంతో ఈ నిరసనోద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో .... వారి గుండెలకు తుపాకులు గురి పెట్టారు. అప్పుడు ఆ సమూహం ముక్త కంఠంతో చెప్పిన మాట చరిత్ర పుటలో భద్రమయి పోయింది... ''మీ మరతుపాకుల్లోని గుండ్లు అయిపోయాక మిగిలి ఉండే గుండెలు ఆ నీచ ప్రవృత్తులయిన నేరస్తుల పాలిట సింహ స్వప్నాలవుతాయి". ఆ తామస స్వభావులు తోలు తీసి డోలు వాయిస్తాయి. ముహమ్మద్ (స) వారి యెడల ముస్లింలకు ఉన్న అభిమానం అలాంటిది.
మహనీయ ముహమ్మద్ (స) వారిని అల్లాహ్ అంతిమ ప్రవక్తగా, తత్వవేత్తగా, వక్తగా, శాసనకర్తగా, సేనాధిపతిగా, భావాల (హృదయాల) విజేతగా, హేతుబద్ధమయిన నమ్మకాల ప్రస్థాపకుడిగా, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించినవాడిగా, 20 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడుగా, ఓ ఆధ్యాత్మిక సామ్రజ్య వ్యవస్థాపకుడుగా అభిమానించే 59 ముస్లిం దేశాలు, 180 కోట్ల మంది ముస్లింలు, వందలాది మంది ముస్లిమేతర చరిత్రకారులు, వేలాది మంది ముస్లిమేతర రచయితలూ, లక్షలాది మంది ముస్లిమేతర ప్రముఖులు, కోట్లాది మంది ముస్లిమేతర సామాన్యులు ఉన్నారు. అదే సమయంలో కొందరు చులకన చేసి ద్వేషించేవారూ, అనుచిత వ్యాఖ్యలు చేసేవారు, నోరుంది కదా అని ఏది పడితే అది వాగే చతురులు, వదరుబోతులు తక్కువేమీ కాదు. కొందరు అలా ఎందుకు చేస్తారు అంటే, అది అంతే! ఈగల్లో మధురమైన పానకాన్ని అందించే తేనెటీగలున్నట్లే, గాయాల మీద కూర్చుని చీము నెత్తురు త్రాగే, ఆ గాయాల్ని మరింత పుండులా మార్చే ఈగలున్నట్లే, మలమూత్రాల మీద కూర్చునే, కంపుకొడుతున్న శవాల మీద వాలే ఆ దుర్గంధాన్ని మరింత వ్యాపింపజేసే ఈగలున్నట్లే - మనుషుల్లో కూడా నలుగురు నాలుగు రకాలు. జీవిత యదార్థమేమిటంటే, ఎత్తు ఉంటే పల్లము ఉంటుంది. సుఖం ఉంటే దుఃఖమూ ఉంటుంది. కష్టంతోపాటే సౌఖ్యం సౌలభ్యం ఉంటుంది.
సరే, వారు కల్పించి ప్రచారం చేస్తున్న విషయాల పట్ల నీవు బాధ పడకు. వారి అంతర్‌బాహ్య విషయాలన్నీ మాకు బాగా తెలుసు. (యాసీన్: 76)
మొరగని కుక్కా లేదు ! విమర్శించని నోరూ లేదు .. ఈ రెండూ లేని ఊరే లేదు అన్నారు. అదేంటో గానీ, కొందరికి కొందరిని విమర్శించడం శునకానందం! మనం ఎంచుకన్న రంగం ఏదైనా మన గెలుపోటములు తెలియడానికి కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు ఎక్కడా జరగవు. మనం ఏమి చేసినా మొదట విమర్శ చేసేవారు ఉంటారు, మనల్ని తప్పు పట్టేవారు ఉంటారు, వెనక్కి లాగేవారు ఉంటారు. వాళ్ళకి భయపడి మన కర్తవ్యాన్ని వాయిదా వేయకూడదు. తప్పులు సరిదిద్దుకొని గెలుస్తాం అనే నమ్మకంతో మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే! ప్రియ ప్రవక్త (స) ప్రపంచంలో వెదజల్లిన సత్య సుపరిమళాలను పది మందికి పది కాలాల పాటు పనికొచ్చేలా పంచుకుంటూనే పోవాలి! మహనీయ ముహమ్మద్ (స) వారి సుచరితాన్ని చిత్తశుద్ధితో పరిచయం చేస్తూనే చివరి శ్వాస వరకు సాగుదాం!! ప్రపంచ గతిని, ప్రజల మతిని మార్చడం అల్లాహ్ పని!
ధర్మ రాహిత్యం ఒక సమీక్ష..!
”మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబింస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు”. (ఫుస్సిలత్: 40)
ధర్మ రాహిత్యం - నాస్తికత్వాన్ని అరబీలో ఇల్హాద్ అంటారు. ఇల్హాద్ అంటే, విషయాన్ని దాని సందర్భం నుండి తప్పించి వివరించడం. అలా తమ తప్పుడు విశ్వాసాలను, మిథ్యా సిద్ధాంతాలను నిజమయినవిగా రూఢీ చేసుకోవడానికి ఖుర్‌ఆన్ వాక్యాలకు వక్ర భాష్యం చెప్పేవారు, అల్లాహ్ నామాలు, గుణగణాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకునే వారు కూడా ఇందులో వస్తారు. అయితే నేడు ఈ పదం మత రాహిత్యం, నిజ దైవం యెడల నమ్మకం లేకపోవడం అన్న అర్థంలోనే ఎక్కువగా వాడబడుతున్నది.
విశ్వ ప్రభువయిన అల్లాహ్ సమస్త మానవాళి కోసం ఆకాశం నుండి అవతరింపజేసిన ధర్మ విశ్వాసాలు మూడు మౌలిక విషయాల మీద ఆధార పడి ఉన్నాయి. 1) తౌహీద్ – నిజ దేవుని ఏకత్వం. 2) రిసాలత్ – ఆ నిజ దేవుని తరఫున దౌత్యం. 3) ఆఖిరత్ – పరలోక జీవితం. ఈ మౌలిక విశ్వాసాల్లోని ఏ ఒక్క విషయాన్ని తిరస్కరించినా దాన్ని ఇల్హాద్ – నాస్తికత్వం అంటారు. ఇలాంటి వితండవాదం చేసే వారిని ఖుర్‌ఆన్ దహ్‌రియా అని కూడా నామకరణం చేస్తుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము చస్తుంటాము, బ్రతుకుతుంటాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు”. (జాసియహ్: 24)
ఇస్లాం ఏమంటుంది?
మూడు మౌలిక విషయాలను ఇస్లాం సమస్త మానవాళికి బోధిస్తుంది. 1) తౌహీద్: ఈ విశ్వానికి ఒక కర్త ఉన్నాడు, అయనే అల్లాహ్. ఆయన మాత్రమే నిజ ఆరాధ్యుడు. ఆయనే భువన గగనాలను, సృష్టి చరాచరాలను శూన్యం నుండి పుట్టించాడు. వాటిలో ఉన్న ప్రతి వస్తువు అవసరాలను సమకూర్చి పెట్టాడు. విశ్వ పరిపాలనా వ్యవస్థను ఆయనే నడుపుతున్నాడు.
2) రిసాలత్: సృష్టిలోని ప్రతి ప్రాణికీ దాని మంచీచెడుల విచక్షణను ప్రసాదించాడు. మానవులు మరియు జిన్నాతుల మార్గదర్శనార్థం అదనంగా 1 లక్ష 24 వేల మంది ప్రవక్తల్ని ప్రభవింప జేశాడు.
3) ఆఖిరత్: మరణంతో మనిషి జీవితం పరిసమాప్తం అవ్వదు. మరో లోకంలో అతన్ని బ్రతికించడం జరుగుతుంది, ఆదే పరలోకం. పరలోకంలో మనిషి చేసిన ప్రతి కర్మకు లెక్క తీసుకోబడుతుంది. వివిద దశలు దాటుకుంటూ మనిషి కర్మలకు అల్లాహ్ ఇచ్చే తీర్పు మేరకు ఒక వర్గం స్వర్గంలో ప్రవేశిస్తుంది, మరో వర్గం నరకం పాలవుతుంది.
పూర్వం ప్రజల్లో కొందరు పరలోకాన్ని, తీర్పు దినాన్ని, స్వర్గ నరకాలను తిరస్కరించిన వారుండేవారు. కానీ, నిజ దైవాన్ని, అల్లాహ్‌ను తిరస్కరించే వారు దాదాపుగా లేరు. ఈ కారణంగా పూర్తి మానవ చరిత్రలో ఏ దశలోనూ నాస్తిక భావన గట్టిగా వ్రేళ్ళూనుకో లేదు అని చెప్పాలి. ప్రపంచంలో ప్రవక్తల విధానం ఉండేది, లేదా అదే మార్గాన్ని భ్రష్టు పట్టించుకున్న బహు దైవారాధన, విగ్రహారాధన విధానం ఉండేది. ప్రపంచ మతాల్లో బౌద్ధ మతం ఎలాంటి దైవ భావన లేని (ప్రాంతాల వారీగా కొన్ని వ్యత్యాసాలున్నా) ఆస్తిక మతం అని చెప్పవచ్చు. అలాగే జైన మతంలో సయితం ఎలాంటి దైవ భావన లేదు అని చెప్పవచ్చు. ఇవి రెండు భారత విగ్రహారాధన మతం నుండి వేరయిన మార్గాలన్నది గమనార్హం! ఇలాంటి నాస్తిక భావన కలిగి ఉన్న వర్గాన్ని పూర్వం ‘దహ్రియహ్’ మరియు ‘దౌరియహ్’ అని కూడా పిలిచేవారు. వారిని గురించి ఖుర్ఆన్ ఇలా అంటుంది: ”మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలీదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు”. (అల్ జాసియహ్: 24)
గమనిక: దహ్రియా అనబడే ఈ తెగ విశ్వాసం ఏమిటంటే, ఈ ప్రాపంచిక జీవితమే తొలి మరియు తుది జీవితం అనీ, దీని తర్వాత మరో జీవితం లేదని, కాలపు చక్రభ్రమరణం వల్లనే ఇలా జరుగుతూ ఉందని, ”ప్రతి 36 వేల సంవత్సరాల తర్వాత ప్రతి వస్తువు తన సిసలైన స్థితిలోకి తిరిగి వస్తుంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది” అన్నది. అలాగే ఈ ప్రక్రియ వెనకాల ఏ సూత్రాధారిగానీ, వ్యూహ రచయితగానీ లేడు, దీనికి ఆది, అంతాలు కూడా లేవని వారంటారు.
నాస్తికాభివృద్ధి దశ:
తిరస్కార ధోరణి మనిషి నరనరాల్లో వ్రేళ్ళూకొని ఉంటుంది. దానికి కారణాలు రెండు. 1) సందేహం – అవగాహనాలేమి, అజ్ఞానం. 2) కాంక్ష, వాంఛ. అలాగే సమాజంలో నాస్తిక భావన ప్రబలడానికి కూడా ప్రాంతం, దేశాన్ని బట్టీ కొన్ని బలమయిన కారణాలే ఉంటాయి. ఉదాహరణకు – ఒక దశలో ఆస్తిక సమాజంలోని రాజులు, అధికారులు, మత పెద్దలు తమల్ని తాము దైవాలుగా ప్రకటించుకొని ఇష్టారాజ్యానికి కొనసాగించినప్పుడు, మూఢ న్మకాలను పెంచి పోషించినప్పుడు వారి కబంద హస్తాల్లో నలిగి పోయిన వారు, అలా నలిగి పోతూ చూసి బాధ పడిన వారు ఉద్వమించి నప్పుడు చోటు చేసుకునే పరిణామాల్లో ఒక పరిణామం నాస్తికత్వం. ”వెదురే లేకపోతే వేణువూ ఉండదు కదా!’ అన్నది వీరి దృక్పథం అయి ఉంటుంది.
మానవ చరిత్రలో ఇలాంటి తిరుగుబాటు చాలా సందర్భాల్లోనే చోటు చేసుకున్నప్ప టికీ 13-17 శతాబ్ది మధ్య కాలంలో ఇది ఉదృత రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈ ఉద్యమం చర్చీ వ్యవస్థకు వ్యతిరేకంగా చోటు చేసుకుంది. ఆ కాలంలో యూరప్‌లో రివిజన్ – పునర్విమర్శ, రీఫార్‌మేషన్ – సంస్కరణ ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమాల్లో చర్చీకి వ్యతిరేకంగా విమర్శాస్త్రాలు సంధించ బడ్డాయి. అదే సమయంలో మార్టన్ లూథర్ ప్రోటెస్ట్‌టెంట్ ఉద్యమం కూడా జరిగింది. ప్రోటెస్ట్‌టెంట్ ఈ వర్గపు విపరీత బుడ్డి వల్లనే ఒకప్పుడు వడ్డీని నేరంగా భావించే క్రైస్తవ సమాజంలో సయితం క్రమేణా అంతా వడ్డేమాయం అయి పోయింది. ఈ ఉద్యమ కారణంగా క్రైస్తవం రెండుగా చీలి పోయింది. అఫ్లాతూన్, అరస్తు సిద్ధాంతాలను కూడా సవాలు చేయడం జరిగింది. అది – ‘విశ్వానికి భూమి కేంద్రం అని చూర్యచంద్ర నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతుంటా”యన్నది. వారి సిద్ధాంతాలను తప్పు అని రుజువు చేసిన వారిలో, గెలీలియో, న్యూటన్ లియోనార్డ్ డావిన్స్, జియార్డీనో బ్రోనో, జోయాన్స్ కిప్లర్ మొదలయిన వారున్నారు.
డీయిజం: డీ అంటే లాటిన్ భాషలో డ్యూస్ – దేవుడు అని అర్థం. ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడు విశ్వాన్ని సృష్టించి తర్వాత దాని మానాన దాన్ని వదిలేశాడు, ఇక విశ్వం స్వతహాగా నడవాలి, దైవ ప్రవక్తలు లేరు, పరలోకం అస్సలే లేదు అన్నది. ఈ ఉద్యమానికి 200 సంవత్సరాల వరకు బాసటగా నిలచిన ఇతర ఉద్యమాలు – డియోడ్ హోమ్, మిడ్ లిన్‌టన్, ఆడమ్ స్మిత్ ఉద్యమాలు.
సెక్యూలరిజమ్ యూరప్‌లో:
యూరప్ దేశాల్లో నేడు సెక్యూలరిస్ట్ అంటే మత రహితుడు, నాస్తికుడు అనే భావనే ఉంది. ఎందుకంటే సెక్యూలరిజమ్ అంటేనే మత పరమయిన చట్టాలు మరియు ప్రబోధనల నుండి స్వేచ్ఛ పొందడం. ముక్తసరిగా చెప్పాలంటే ఒక మత రహిత దేశంలో అనేక మతాల వారు మతపరమైన స్వేచ్ఛతో జీవనం సాగించే సిద్ధాంతం. ఇది భారత దేశానికి సంబంధించినది అని చెప్పవచ్చు. ఇతర సెక్యూలర్ దేశాలు మతాన్ని రాజ్యం నుండి వేరు పర్చి పరిపాలన సాగిస్తున్నాయి. సెక్యూలరిజమ్ అభివృద్ధి మతాన్ని చావు దెబ్బ తీసిందని చెప్పక మానదు. ఎలా అంటే, మత విశ్వాసాలు వ్యక్తిగతం, మత ఆచారాలు చర్చీకి పరిమితం అనే సిద్ధాంతమే సెక్యూలరిజమ్. ఫలితం కొంత మంచి జరిగితే, ఎక్కువ చెడే జరిగింది. ఉదాహరణకు – ఫ్రీ సెక్స్, స్వలింగ సంపర్కం, వడ్డీ, వ్యభిచారం వంటి జుగుప్సాకర సామాజిక నేరాలను, నైతిక ఘోరాలను చట్టబద్ధం చేసింది సెక్యూలరిజమే. యూరప్ పౌరులు దైవాన్ని నమ్మడం బొత్తిగా వదిలేసారని కాదు, కానీ అది నామ మాత్రంగా ఉండి పోయింది. క్రియా రంగంలో మతాన్ని వారు తిలోదకాలిచ్చేశారు. దైవం పట్ల, దైవప్రవక్తల పట్ల, పరలోకం పట్ల వారు నమ్మేది అర్థ సత్యాలే అయినా చివరి వాటన్నింనీ వదిలేశారు.
ముస్లిం సమాజంలో ధర్మ రాహిత్యం -నాస్తిక బీజాలు:
15 -16 శతాబ్దాల్లో యూరప్ ప్రజలు తమ దేశాల నుండి బయలు దేరి తూర్పు, పడమరలలో గల దేశాల్లో విస్తరించడం ప్రారంభించారు. క్రీ.శ 1900 వరకూ వారు ప్రపంచపు అధిక భూభాగానికి ఆక్రమించుకున్నారు. అందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. అలా ఆక్రమించుకున్న దేశాల్లో వారు నాస్తిక బీజాలు నాడటం ప్రణాళిక బద్ధంగా ప్రారంభించారు – ఆ విధానమే లౌకిక వాదం. దీని ఫలితంగా – ముస్లిం సమాజంలో నాలుగు విధమయినటువంటి ప్రతిస్పందనలు చోటు చేసుకున్నాయి. 1) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా (గుడ్డిగా) అనుసరించడం. 2) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా త్రోసి పుచ్చడం. 3) పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) అనుసరించి ఇస్లామీయ విధి విధానాల్లో మార్పులు చేయడం. అంటే ఖుర్‌ఆన్ మరియు హదీసుల్లోని అనుకూల వచనాల్ని వక్రీకరించి లౌకి వాదాన్ని, నాస్తికత్వాన్ని బల పర్చడం. లేదా ఇస్లాం మౌలిక విశ్వాసాల్లో కొన్నింటిని నిరాకరించడం. 4) పాశ్చాత్య లౌకికవాదం ప్రవేశ పెట్టిన విధానంలో సకారాత్మక అంశాలను కుణ్ణంగా అధ్యయనం చేసి ఇస్లామీకరించడం.
ఈ ఇజాలను అంగీకరించారు? ఎవరు తిరస్కరించారు?
1) అనుకరించిన వారు: పాలక వర్గం వారి స్వప్రయోజనాల కోసం ఈ విధానాన్నే ఆశ్రయించింది. వ్యక్తిగతంగా వారు ముస్లింలే అయినా, ఆర్థికంగా, సాంఘీకంగా వారు ఒక నాస్తికునిలా మారి పోయారు, మారి పోతున్నారు, ఇకమీదట కూడా మారుతూను ఉంటారు. నోటితో వారు అల్లాహ్ ఒక్కడే శాసనాధికారి అంటున్నారు కానీ, క్రీయా జీవితంలో ఆనేక దేవుళ్లను పరోక్షంగా నమ్ముతున్నారు. అందులోనే దేశ భవిష్యత్తు దాగుందని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఈ కారణంగా కొంత కాలానికి ‘యథా రాజ తథా ప్రజ’ అన్న చందంగా ప్రజలు కూడా అడుగు తర్వాత కడుక్కోవచ్చులే అని ఆ అడసునే తొక్కారు, తొక్కుతున్నారు.
2) తిరస్కరించిన వారు: . పండితుల వర్గం – పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) పూర్తిగా త్రోసి పుచ్చారు. ప్రారంభంలో ఈ కోవకు చెందిన వారు మహ ఉద్దండ పండితులు. వారు అన్ని ఇజాలను కాచి వడిబోసిన వారు. కానీ క్రమేణా ఈ వర్గం తన పట్టును కోల్పోతూ వచ్చింది. కారణం వీరిలో కొందరు పై పేర్కొన్న మొదటి వర్గానికి ప్రభావితులయితే, కొందరు నాల్గవ వర్గానికి ఆకర్షితులయ్యారు. ఇలాంటి వారికి సాధారంగా సమాజం ఇచ్చే స్థాయి, గౌరవం ఏమిటంటే, నమాజు చదివించడం, ఖుర్‌ఆన్ పారాయణం పూర్తి చెయ్యడం, నికాహ్, అఖీఖా, జనాజా, పే ట్యూషన్లు చెప్పుకోవడం, సదివింపులు, గ్యారవీఁలు వంటి ధర్మంలో లేనివి చెయ్యడం – ఇదే వారి పనిగా భావిస్తారు సాధారణ ముస్లింలు. ఇది నిష్టూర సత్యం!
3) అతిక్రమణకు పాల్పడ్డ వారు: పాశ్చాత్య లౌకికవాదాన్ని (నాస్తికత్వాన్ని) అనుసరించి ఇస్లామీయ విధి విధానాల్లో మార్పులు చేయడం. అలా ఇస్లాం బోధించే మౌలిక విషయాలను త్రోసి పుచ్చినవారు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు – భారత దేశంలో సర్ సయ్యిద్ అహ్మద్ (రహ్మ) (తర్వాత ఆయన మారు మనస్సు పొందారు అని అంటారు). ఈజిప్టులో తాహా హుసైన్ మరియు జఅలూల్ మొదలయిన వారు. తర్వాతి తరాల్లో – గులామ్ అహ్మద్ పర్వేజ్, డాక్టర్ అబ్దుల్ వదూద్ మొదల యినవారు.
4) సంస్కరించిన వారు: పాశ్చాత్య లౌకికవాదం ప్రవేశ పెట్టిన విధానంలో సకారాత్మక అంశాలను కుణ్ణంగా అధ్యయనం చేసి ఇస్లామీకరించడం. వీరి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాచీన పండితుల వారసత్వాన్ని కాపాడుకోవడంతోపాటు, నూతన విద్యా విధానాలను సయితం బాగా ఆకళింపు చేసుకున్నారు. అంటే ఏక సమయంలో ధార్మిక పరిపక్వత మరియు వైజ్ఞానిక దృష్టి వీరి సొంతం. ఉదాహరణకు – మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అల్లామా షిబ్లీ నోమానీ, మౌలానా సులైమాన్ నద్వీ, ఉర్దూ మహా కవి ఇక్బాల్ (రహ్మ) మొదలయిన వారు.
నిజం లేని ఇజాల నిజ స్వరూపం:
ఇజం ఏదయినా – అది సోషలిజమయినా, కమ్యూనిజమయినా, క్యాపిటలిజమయినా – అన్నీ కేవలం మధురమయిన అపోహలు మాత్రమే. ఎందుకంటే, స్వయంగా ఈ ఇజాలు ప్రకారం ఒక జాతి ఆర్థిక కార్యక్రమం మరియు దాని విశ్వాసాలూ, దృక్పథాలు రెండు వేర్వేరు అంశాలు కావు. వాటి మధ్య దృఢమయిన అవినాభావ సంబంధం ఉంటుంది. వాటిని వేరు చేసి అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ ఇజాల అధినాయకులు ముస్లింలను నమ్మ బలికే మాట ఏమిటంటే, మీరు మేము చెబుతున్న ఈ ఇజాలను ఈ ఆర్థిక, సామాజిక వ్యవస్థగా స్వీకరించినప్పటికీ నిక్షేపంగా ముస్లింలుగా ఉండొచ్చు. మీ నమాజు, రోజా, ధ్యాన సాధనాల్లో ఎలాంటి లోటు రాదు. ఇది కేవలం ఆర్థిక, సామజిక వ్యవస్థ మాత్రమే. ఇది మనిషి యెక్క మతపరమయిన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవదు. కనుక మీరు భయ పడాల్సిన అవసరం లేదు అని. కానీ వారికి బాగా తెలుసు, ఒక సారి ముస్లింలు ఈ ఇజాల ఉచ్చులో పడి తమ ఆర్థిక, సామాజిక సమస్యలకు పరిష్కారంగా వాటిని స్వీకరించారా, అంటే వారు ఇకపై స్వచ్ఛమయిన ముస్లింలుగా జీవించడం దాదాపు అసాధ్యం. కొన్నేండ్లల్లోనే వారి మస్తిష్క ప్రకాళన (బ్రయిన్ వాష్ చేసి) వారిని తమ ఇజాల తత్వానికనుగుణంగా మలచుకోవడం, ఇస్లాం అవశేషాలేమయినా వారిలో మిగిలి ఉంటే వాటిని పూర్తిగా తుడిచి వేయడం అవలీలగా జరిగిపోతుంది. ఇజం ఏ దయినా అది కేవలం ఆర్థిక, సామాజిక ప్రణాళిక కాదు. ఎవరయితే దాన్ని ఆ విధంగా చిత్రిస్తారో వారు ఆత్మవంచనకయినా గురయి ఉండాలి, లేదా పర వంచనకయినా పాల్పడుతూ ఉండాలి. అయితే ముస్లిం దేశాల్లో అక్షరాల అదే జరిగింది.
సమాజం మీద దాని ప్రభావం:
ఫలితంగా అన్ని మతాలు దాదాపు అవి తమ స్వచ్ఛతను కోల్పోయాయి. దీని ప్రభావం ముస్లిం సమాజం మీద కూడా సహజంగానే పడింది. ఈ ఇజాలకు ప్రభావితులయి తౌహీద్ భావనను త్రోసి పుచ్చిన వారు కొందరయితే, రిసాలత్‌ను తిరస్కరించిన వారు కొందరు. పరలోకాన్ని తిరస్కరించిన వారు కొందరయితే, స్వర్గ నరకాలను తిరస్కరించిన వారు మరికొందరు. అయితే ఇస్లాం మౌలిక విశ్వాసాలను వీరు ఏమి చేయ లేకపోయారు. ఖుర్‌ఆన్‌ను సవాలు చేసేంత ధైర్యం అయితే వీరు పెద్దగా చెయ్య లేదు. కానీ ప్రవక్తల జీవితాల మీద బురద జల్లే పని మాత్రం పెద్ద ఎత్తునే చేశారు, చేస్తున్నారు. ఇక మీదట కూడా చేస్తుంటారు.
రాజకీయాల మీద దాని ప్రభావం;
రాజకీయ రంగంలో దాదాపు అన్నీ దేశాలు సెక్యూలరిజాన్ని అనుసరించడం నాస్తికత్వాన్ని లభించిన బహిరంగ విజయమని చెప్పవచ్చు. అటు పాశ్శాత్త ప్రపంచంగానీ, ఇటు తూర్పు దేశాలుగానీ, ముస్లిం దేశాలుగానీ సెక్యూలరిజాన్ని రాజకీయ వ్వవస్థగా తక్కువ ఎక్కువ అంగీకరించాయి. అలా అంగీకరించిన ముస్లిం దేశాలలో తుర్కీ మరియు తూనిష్ ముందంజలో ఉన్నాయి అని చెప్పవచ్చు. సెక్యూలరిజం పైకి చూడానికి అంత ప్రమాదకారిగా కనబడదు. కానీ అది సమాజానికిచ్చే చేదు ఫలాలు అన్ని ఇన్ని కావు. ఉదాహరణకు – మీరు మాకు తోడుగా వస్తే, కార్ఖానాలన్నీ మీకే అప్పజెప్పుతాము, రైతులకు భూములపై అధికారం కట్టబెడతాము, నిరుద్యోగ గ్రాడుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తాము, కామ వాంఛకు బానిసయి వారికి ఉదార సమాజాన్ని (పెర్‌మిసివ్ సొసైటీ) స్థాపించి ఇస్తాము, సారాయి, జూదం, మాదకద్రవ్యాల సేవనం సర్వసామాన్యం చేస్తాము. అంటూ అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా సమాజంలో సహజీవనం (పెళ్ళి లేకుండా లైకింగ సంబంధాలు), స్వలింగ సంపర్కం, అశ్లీలం, అరాచకాలు చోటు చేసుకుంటాయి. ఇదంతా ఎందుకు జరిగుతుంది అంటే, ఈ ఇజాలన్నీ నమ్మేది ‘భౌతిక పదార్థమే జీవితపు ఏకైక సత్యం’ అని. ‘మానవ మేధ కూడా పదార్థం యెక్క అభివ్యక్తికి ఓ రూపమే’ అని.
ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం:
నాస్తిక వాదం ప్రపంచానికి రెండు వ్యవస్థలను ఇచ్చింది. 1) ఆడమ్ స్మిత్ ప్రవేశ పెట్టిన క్యాపిటలిజం. 2) కార్ల్‌మార్క్ ప్రవేశ పెట్టిన కమ్యూనిజం. ఇవి పైకి పరస్పరం విరుద్ధ భావాలుగా అగుపించినా ఈ రెంటిలోనూ ఏకాంశం మత రహిత సమాజం. క్యాపిటలిజం – పెట్టుబడిదారి వ్యవస్థ ఫెడరలిజం వేరు కాదు. ఇది దానికన్నా కాస్త నయం అని చెప్పొచ్చు. పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రతి ఒక్కరికి సంపాదించే హక్కు ఉంటుంది. ఫెడరలిజంలో ఇది కుదరదు. ఒకడు నెయ్యితో దీపం వెలిగిస్తూ ఉంటే, మరొకడు పస్తులతో అల్లాడిపోతుంటాడు. వ్యక్తిగత ఆస్తి నిరాకరణ – మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. రష్యా మరియు చైనా కమ్యూనిస్టు దేశాలయినా చివరకు క్యాపిటలిజాన్ని స్వీకరించాయి. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఈ రెండింటికీ తల్లి వేరు నాస్తికత్వం అన్న విష భావనే. తేడా ఏమిటంటే, ఒక విధానంలో ధనికుడి కార్మికుడి పీల్చుకు తింటాడు. మరో విధానంలో ప్రభుత్వం ప్రజల ఆస్తి మీద పెత్తనం చెలాయిస్తుంది. ఈ ఇజాలు అవలంబించే ఆర్థిక విధానం ఎలాంటిది అంటే, భయంకరంగా దోపిడికి, దొంగతానికి పాల్పడి దోచుకున్న ఆ సొమ్మును ఎంతో నిజాయితీగా పంచుకునే వ్యక్తుల వంటిది. ఉదాహరణకు – సారాయి, జూదం, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వ్యాపారం వగైరా. అలాగే ఈ ఇజాలు పరిచయం చేసిన హీరోలను గమనిస్తే – ఒక వైపు వారిని లోక రక్షకులుగా చూపిస్తూనే మరో వైపు పరస్త్రీలతో విచ్చలవిడిగా శృంగారం చేసే రసికుడిగా కూడా చిత్రీకరిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
నైతికత మీద దాని ప్రభావం:
ఏ వ్యవస్థలోనయితే తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ బావన లేదో అది ఎలా మనిషిని రుజుమార్గం మీద నడిపించగలదు? చెప్పండి! పెద్దలు పిల్లల యెడల అవ్యాజానురాగం ఎందుకు కలిగి ఉండాలి? పిల్లలు పెద్దల్ని ఎందుకు గౌరవించాలి? ప్రభుత్వం కళ్ళు గప్పి ఏమైనా చెయ్యచ్చు. ఇలాంటి విపరీత ధోరణులు ప్రబలడానికి ముఖ్య కారణం ఈ ఇజాలు. పిల్లలు పోషణ అశ్రద్ధ వహించబడుతున్నా, వృద్ధాశ్రమాలు రోజురోజుకు పెరుతున్నాయన్నా, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే వంటివి ప్రబలుతున్నాయన్నా కారణం ఈ భౌతిక వాదాలే.
కుటుంబ వ్యవస్థ మీద దాని ప్రభావం:
కుటుంబ విలువల వలువలు ఊడబెరకడమే ఈ ఇజాల లక్ష్యం. వావి వరసలకు తిలోదకాలిచ్చే వీరు చివరికి పశువులుకన్నా హీనంగా తయారవుతారు. వావివరుసలు మరచి జంతు స్వేచ్ఛతో బతుకుతారు. ఎందుకంటే ఈ ఇజాల మనిషి ఆర్థిక సమస్యలు పరిష్కారమయితే మిగతా సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి అన్న సూత్రాన్ని అవి బలంగా నమ్ముతాయి గనక.
మనం ఏం చేయాలి?
1) మనల్ని మనం సంస్కరించుకోవాలి. మన విశ్వాసాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. మన క్రీయా జీవితాన్ని మన విశ్వాసానికి అనుగుణంగా మలచుకోవాలి.
2) సంఘ సంస్కరణ కోసం కృషి చెయ్యాలి. సహాయాన్ని కోరాలి.
3) రాజకీయ ప్రక్షాళన కోసం కట్టుదిట్టమయిన ప్రణాళికను అమలు పర్చాలి.
4) ఆర్థిక రంగంలో తగిన మార్పులు తీసుకు రావాలి. దాని కోసం ఓ సరికొత్త మార్క్‌ట్ ను మనం ప్రారంభించాలి.
5) మన నైతికతను, ప్రవర్తనా నియమావళిని మనం బాగు చేసుకోవాలి.
6) ప్రతి సమస్య పరిష్కారానికి గాను మనం ఖుర్‌ఆన్ మరియు హథీసుల్ని సంప్రదించాలి.
7) ధర్మ పండితులతోపాటు అన్ని రంగాల నిపుణులతో ఫలవంతమైన సంప్రదింపులు జరిపి ఓ నికార్సైన కార్య ప్రణాలికను తయారు చేసి అమలు పరిచేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి.
గమనిక:
పైన పేర్కొన్న ప్రతిపాదనల్లో కొన్ని వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నించేవి. కొన్ని కుటుంబ స్థాయిలో, కొన్ని సంఘ స్థాయిలో, కొన్ని రాజకీయ రంగంలో, కొన్ని ఆర్థిక రంగంలో – ఆయా రంగ నిపుణులు ప్రయత్నించాల్సిన విషయాలు.
ఆధునికంలో బానిసత్వ రూపాలు:
ఆటవికం నుండి మనిషి ఆధునికంలో అడుగు పెట్టే క్రమంలో కొన్ని పాత రాతారీతులకయ పాతరేసినా అవే కొంగ్రొత్త రూపంలో కోరలు చాచడం విడ్డూరం! అవన్నీ స్వేచ్ఛ పేరు మీద ప్రవేశ పెట్ట బడ్డాయి అన్నది గమనార్హం!! కమ్యూనిజం అయినా, క్యాపిటలిజమయినా వాస్తవంగా ప్రాచీన బానిసత్వపు సరికొత్త రూపాలే. ఒక చోటు నియంత ప్రభుత్వం, మరో చోట నిరంకుశ ప్రభువులు. మనుషులు గత్యంతరం లేక స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు బదులుగా బానిసత్వాన్ని కోరుకునేలా ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక చింతనాత్మక వాతావరణాన్ని సృజించాయి. ఆధునికం పేరుతో బరి తెగించి తిరగాడే సొసైటీ గర్ల్స్ ఏ ‘స్వేచ్ఛ’ పేరుతోనయితే తమ శరీరాలను ఇతరులకు అప్పజెప్పుతారో అది స్వేచ్ఛ కాదు పచ్చి బానిసత్వం.
నేడు యువత నోట తరచూ వినబడే మాట – ‘ఎవరడ్డు చెప్పనంత వరకు తప్పు కాదురో, నువ్వు బాధ పెట్టనంత వరకు తప్పు కాదురో, అంతా చేసినాక సొరీ చెప్పి ముగిస్తే తప్పేం కాదోయ్’ అన్నది. ఈ మాట మహా మోసపూరితమయినది. ఒక వ్యక్తి ఇంటి లోపల కూర్చుని మాదకద్రవ్యాల్ని, మత్తు పదార్థాల్ని సేవిస్తే తప్పు కాదనా? అతను చేస్తున్నది కరెక్ట్ అనా దీనర్థం? అల్లాహ్ సాక్షిగా! ఇది మాయావి అయిన షైతాన్ అందమైన నినాదం. అందమైన పేర్లు, మనోహరమయిన పదాలు, మనోజ్ఞమయిన పదబంధాలు, వినసొంపయిన నినాదాలు మనందరి బహిరంగ శత్రువయిన షైతాన్ ఎత్తుగడలోని అంతర్భాగాలు. ఇలాంటి పైపూత ప్రేరకాలకు, మోసపూరిత ఆకర్షణలకు ఆమడ దూరం ఉండేలా ముస్లిం యువతకు తర్ఫీదు ఇవ్వాలి.
చివరి మాట:
ఈ పూర్వ రంగంలో మనం సరిగ్గా, తొలి నాటి ముస్లింలు ఉన్న చోటనే నిలబడి ఉన్నాము. వారి కుడి ఎడమల రెండు దిశలా ఆనాటి గొప్ప సామ్రాజ్యాలు, పరస్పర విరోధి రాజ్యాలయినా రోము, పర్షియాల మధ్య చిక్కుకు ఉండగా నేడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా ఏ త్యాగమయినా వృధా పోదు. భూమీ ఆకాశం రెండూ దానికి ప్రత్యక్య సాక్ష్యాలు!
”ఎవరయితే అల్లాహ్‌కు సహాయ పడతారో, అల్లాహ్ కూడా వారికి తప్పక సహాయ పడతాడు. నిస్సందేహంగా అల్లాహ్ శక్తి గలవాడు, ఆధిక్యత గలవాడున్నూ”. (అల్ హజ్జ్: 40)
అపరాధాల అమ్మ మద్యం, మత్తు
విశ్వాసులారా! మద్యం, జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సార్థకమవుతుంది. (అల్-మాయిదా : 90)
మత్తు వదిలితేనే భవిష్యత్తు..
మనిషి ఆనందంగా జీవించడానికి మనందరి సృష్టికర్త అల్లాహ్ ఎన్నో వనరులను సమకూర్చాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనుగడ సాగించమని ఆశీర్వదించాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ, సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటానన్నాడు. కానీ, మనిషి అల్లాహ్ అనుగ్రహించిన స్వేచ్ఛాజీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. మహోన్నత వరాలుగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు. అరిషడ్వర్గాలకు బానిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు. అధర్మాన్ని అంటిపెట్టుకుని, అవినీతిని ఆసరాగా చేసుకుని ఎదగాలనుకుంటూ భంగపడుతు పడరాని పాట్లు పడుతున్నాడు. అలాంటి పడకూడని ప్రమాదాల్లో ఓ భయంకర ప్రమాదమే మద్యపానం, సారాయి సేవనం, మాదక ద్రవ్యాల వాడకం. చెడ్డ పనులు చేయకుండా మనసును నిగ్రహించుకోవాలి. అలా చేయకపోతే అలవాటుగా మారి ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మంచి పనుల విషయంలో మనిషి అందుకు భిన్నంగా వ్యవహరించాలి. చేయగా చేయగా మంచి పనులు అలవాటుగా మారీ జీవితాన్ని నందనవనం చేస్తాయి.
పై ఆయతులో, మత్తు పదార్ధం,మద్యం నిషిద్ధం అని క్రింది పది కారణాలతో వివరించబడింది:
1. జూదం, బహుదైవోపాసనా స్థలాలు, పాచికల ద్వారా జోస్యంతోపాటు మత్తు పదార్ధం, మద్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ మూడు విషయాలు హరామ్ కాబట్టి, మత్తు పదార్ధం, మద్యం కూడా హరామే.
2. మత్తు పదార్ధం, మద్యపానాన్ని రజస్ (అశుద్ధం) అని చెప్పబడింది మరియు ప్రతి అశుద్ధ వస్తువు హరామ్ - నిషిద్ధమే.
3. మత్తు పదార్ధం, మద్యం సేవించడం షైతాన్ చర్య అని చెప్పబడింది మరియు ప్రతి పైశాచిక చర్య హరామ్ - నిషిద్ధమే.
4. అల్లాహ్ మత్తు పదార్ధం, మద్యపానం నుండి దూరంగా ఉండాలని ఆదేశించాడు, కాబట్టి ఆజ్ఞాపాలన తప్పనిసరి, అవిధేయత హరామ్ - నిషిద్ధమే.
5. పరలోకం మరియు ఇహలోకం యొక్క విజయం మరియు క్షేమం, మోక్షం మత్తు పదార్ధం, మద్యపానానికి దూరంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి దానిని సేవించడం హరామ్ - నిషిద్ధమే.
6. మత్తు పదార్ధం, మద్యం మాధ్యమంగా షైతాన్ మీమధ్య విరోధం నాతుటాడు అని పేర్కొనబడింది. కాబట్టి దానికి దారి తీసే మత్తు పదార్ధం, మద్యం హరామ్ - నిషిద్ధమే.
7. మత్తు పదార్ధం, మద్యపానం కారణంగా, షైతాన్ విద్వేషబీజాలు నాటుతాడు. విద్వేషం, పగ హరామ్ - నిషిద్ధమే.
8. మత్తు పదార్ధం, మద్యం అల్లాహ్ నుండి దూరం చేస్తుంది. అల్లాహ్‌ను స్మరించుకోవడం మానేయడం హరామ్ - నిషిద్ధమే.
9. మత్తు పదార్ధం, మద్యం నమాజు ప్రార్థన నుండి నిరోధిస్తుంది. ప్రార్థనను నిరోధించడం హరామ్ - నిషిద్ధమే.
10- అల్లాహ్ చాలా స్పష్టంగా నిషేధాజ్ఞ జారీ చేశాడు. : "కాబట్టి మీరు మద్యం తాగడం మానేస్తారా?" అన్నాడు.
పై పది కారణాలతో మత్తు పదార్ధం, మద్యం హరామ్ - నిషిద్ధం అని తేట తెల్లం అవుతుంది. ఇక వితండవాదం చేసే మేథావులు అంటారా? తిమ్మిని బిమ్మిని చేయడం వారికి ఉగ్గుపాలతో అలవడిన వినాశకర విద్య కదా!
ఆధునిక సోకాల్డ్ పండితులు దాన్ని నిషేధాజ్ఞల జాబితాలో చేర్చకపోతే అది వారి ఖర్మ. దాని ద్వారా వారు చెప్పదలచిందేమిటీ? ఒక నీచమయిన పని, షైతాన్ చేష్ట కూడా ధర్మసమ్మతం కాగలదని వారు రుజువు చెయ్యదలుస్తున్నారా? సాఫల్యానికి దోహదపడే వస్తువులు పతనానికి కారణభూతమయ్యే వస్తువులు రెండునూ ధర్మసమ్మతమైనవేనని వారు చెప్పదలుస్తున్నారా? ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్.
సారాయి, జూదం వల్ల పొడసూపే మరిన్ని చెడుగులు యిక్కడ పేర్కొనబడ్డాయి. ఆ చెడుగులు సామాజికమైనవీ, ధార్మికమైనవీ కావచ్చు. అందుకే మద్యపానాన్ని "అపరాధాల అమ్మ"గా అభివర్ణించటం జరిగింది. అలాగే జూదం కూడా పరమ దరిద్రమైన వ్యసనం. ఈ వ్యసనానికి దాసోహమన్న వ్యక్తి ఎందుకూ పనికిరానివాడుగా మారిపోతాడు. గొప్ప గొప్ప జమీందారులు, శ్రీమంతులే దీని వాతన పడి బిచ్చగాళ్లుగా మారిపోయారు.
ఆఖరికి మీరు వీటిని ఇకనయినా మానుకుంటారా? లేదా? అని చెప్పి విశ్వాసులకు పరీక్ష పెట్టడం జరిగింది. నికార్సయిన విశ్వాసులంతా ఈ ఆయతు అవతరించగానే దేవుని అభిమతాన్ని పసిగట్టి మద్యసేవనాన్ని పరిత్యజించారు. "ఓ ప్రభూ! మేము వీటిని మానుకున్నాము" అని క్రియాత్మకంగా సమాధానమిచ్చారు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) కథనం:- నేను హజ్రత్ అబూ తల్హా (రజి) ఇంట్లో జనానికి సారాయి పోస్తుండేవాడ్ని. ఆ రోజుల్లో ప్రజలు ఖర్జూర సారాను త్రాగేవారు ఓ రోజు దైవప్రవక్త (సల్లం) చాటింపు వ్యక్తి ద్వారా "జనులారా! జాగ్రత్తగా వినండి, (ఈ రోజు నుండి) సారాయి నిషేధించ బడింది" అని చాటింపు వేయించారు. హజ్రత్ అబూ తల్హా (రజి) (ఈ చాటింపు విని) "వెళ్ళు, సారాయిని బయటికి తీసి కెళ్ళి పారబోయి" అని అన్నారు నాతో. నేను సారా (కుండల)ను బయటికి తీసికెళ్ళి పారబోశాను. ఆ రోజు మదీనా వీధుల్లో సారాయి (ఏరులా) ప్రవహించసాగింది. ఆ సందర్భంలో కొందరు "కడుపులో సారాయి కలిగి ఉన్నవారు నాశనమయ్యారు” అని అన్నారు. అప్పుడు దేవుడు ఈ సూక్తిని అవతరింపజేశాడు:- "సత్యాన్ని విశ్వసించి, సత్కర్మలు ఆచరించనారంభించిన వారు గతంలో తిని త్రాగిన వాటిని గురించి వారిని పట్టుకోవడం జరగదు. (అంటే అందులో అప్పుడు పాపమేమీ లేదు) అయితే ఇక నుండి నిషేధిత వస్తువులకు వారు దూరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిర చిత్తులయి సత్కార్యాలు చేస్తూ ఉండాలి”. (అల్-మాయిదా:93) (సహీహ్ బుఖారీ)
మధ్య సేవనం ఒక చూపులో
పుట్టుకైనా, చావైనా కష్టమైనా, సుఖమైనా దుఖమైనా, సంతోషమైనా సంతాపమైనా , లాభమైనా నష్టమైనా, విరహమైనా, వియోగమైనా రోగమైనా, రాగమైనా ఓటైనా, వేటైనా అయినా, మాటు ఆయినా పోటు అయినా, మునిగినా తేలినా - ఘట్టం ఏదైనా మందే కదా చుట్టమయ్యేది! చివరాఖరికి 'మందు' హాసమే కదా మిగిలేది! అన్నట్టుంది నేడు అనేక మంది వ్యవహారం. చుక్క, ముక్క లేనిదే ఏ పని జరగడం లేదు. కొందరికయితే పక్క కూడా కావాలి.
ఉద్యోగం వస్తే పార్టీ... పెళ్లి కుదిరితే పార్టీ... ప్రమోషన్ వస్తే పార్టీ... నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ అంటే.. ఆ పార్టీలో చుక్క, ముక్క తప్పనిసరి. వారాంతాల్లోనే కాదు, మామూలు రోజుల్లోనూ కిటకిటలాడే పబ్బులూ బార్లే అందుకు నిదర్శనం. చిన్నా పెద్దా లేదు. చేతిలో డబ్బుంటే బాలు తాగడాన్ని ఎవరూ తప్పనుకోవడం లేదు సరికదా సోషల్ స్టేటస్ గా బావిస్తున్నారు.
కొంత కాలం క్రితం వరకూ మద్యం తాగే అలవాటు ఉంటే పిల్లనివ్వడానికి జడిసేవారు. ఇప్పుడు ఆ నియమం పెట్టుకుంటే పిల్ల పెళ్లి చేయడం కష్టమే అనేటట్లుగా తయారైంది పరిస్థితి. మొదట స్నేహితులతో సరదాగా మొదలయ్యే 'ఎప్పుడైనా ఓసారి' కాస్తా కొన్నాళ్లకే 'అప్పుదప్పుడూ... అవుతుంది. ఆ తర్వాత 'వారానికోసారి' అయ్యి చివరికి ప్రతిరోజూగా మారుతుంది. మద్యం తాగడం అలవాటైనవారిలో చెప్పుకోదగ్గ శాతం వ్యసనపరులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వ్యసనం దాకా వెళ్లక్కరలేదు. అసలు మద్యం తాగడమే అనారోగ్యానికి ఆహ్వానం పలకడమని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఎవరికైనా సరే, వారి జీవితంలోకి సంపద రాకముందే, వారి జీవితంలోకి క్రమశిక్షణ, బాధ్యత, నిమగ్నత రావాలి. లేకపోతే ఆ సంపదే తల భారం అవుతుంది. ప్రస్తుతం ఈ తరానికి జరుగుతున్నది అదే.
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; విద్యా జ్ఞానాలు అంతరించి, అజ్ఞానం పెరిగిపోతుంది. వ్యభిచారం ఎక్కువయి పోతుంది. మద్యపానం సర్వసామాన్యమౌతుంది. పురుష జనాభా తగ్గిపోయి స్త్రీజనాభా పెరుగుతుంది. చివరికి యాభైమంది స్త్రీలను కనిపెట్టుకొని ఉండేందుకు ఒకే ఒక పురుషుడు ఉంటాడు." (బుఖారి, ముస్లిం)
అశుద్ధాలకు అమ్మ మద్యం, మత్తు
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) గారి ఉల్లేఖనం: మీరు అపరాధాలకు అమ్మ అయిన మత్తు, మద్యానికి దూరంగా ఉండండి. మీకు పూర్వం ఓ మహా భక్తిపరులుండేవాడు. ఆటను ప్రజల నుండి వేరైన ఏకాంత ప్రార్థనలు చేస్తూ నిష్ఠ నిబద్ధతలతో జీవించేవాడు. అదే ప్రాంతం నివాసం ఉండే ఓ జార స్త్రీ ఆయన్ను మోహించింది. ఎలాగోలా ముగ్గులో దింపాలని ప్రయత్నించింది. అందు నిమిత్తం ప్రణాళిక రచించి తన సేవకుణ్ణి పంపి - సాక్ష్యానికి సంబంధించిన ఓ ధర్మకార్యం ఉంది అని కబురు పెట్టి తన ఇంటికి రావాల్సిందిగా కోరింది. ఇదేమి తెలియని ఆ భక్తిపరుడు సేవాభావంతో బయలుదేరాడు పాపం! తీరా ఆమె నివాస గృహానికి చేరుకున్నాడు. నివాస గృహంలో తాను ప్రవేశించేకొద్దీ ఒక్కో తలుపు మూసి వేయబడేది. అలా ఆ స్త్రీ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. (మొహినిలా ముస్తాబయి కొలువుదీరి ఉంది ఆ స్త్రీ). ఆమెతోపాటు అక్కడ మద్యం పాత్ర, ఒక బాలుడు ఉన్నాడు. (వెకిలి నవ్వులు నవ్వుతూ ఇలా అంది) - నేను నిన్ను సాక్ష్యానికి సంబంధించిన ధర్మకార్యం కోసం పిలువ లేదు. చూడు వద్ద మూడే మార్గాలున్నాయి. నువ్వు నా కామ తాపాన్ని చల్లార్చాలి. లేదా ఈ బాలున్ని చంపాలి. లేదా మద్యం అయినా సేవించాలి. కాదు కూడదు, అపచారం అంటూ తప్పించుకోవాలంటే మాత్రం గుర్తుంచుకో! నేనే అరచి గోల పెట్టి నీ పరువుని బజారుకీడ్చుతాను.. ఆలోచించుకో! అంది. ఆ భక్తునిది ఏమి తోచని అయోమయ స్థితి. పరపొందు వ్యభిచారం హరామ్ - ఘోరపాపం. బాలున్ని చంపడం హరామ్ - ఘోరపాపం. మద్యం సేవించడం హరామ్ - ఘోరపాపం. ఏం చేయాలి. ఆ ... మొదటి రెండుకన్నా చివరిడి కాస్త నయం అనిపిస్తుంది అని మద్యం తాగడానికి సిద్ధమయ్యాడు. ఒక గ్లాసు రెండు గ్లాసులంటూ బాగా ముత్తెంకెంతగా తాగేశాడు. ఇక ఆ మైకంలో ఆ మహిళతో రమిచ్చాడు కూడా, ఆ బాలున్ని హత్య కూడా చేసేశాడు. కాబట్టి మత్తుని కలిగించే ప్రతి విషయం నుండి దూరం ఉండండి. అల్లాహ్ సాక్షి! చెబుతున్నా - మత్తు మొహం మరియు విశ్వాసం ఏక సమయంలో ఒక వ్యక్తి హృదయంలో ఇమడజాలవు. ఒకవేళ ఇమిడాయి అంటే, వాటిలో ఒకటి ఇంకొకటిని బయటికి గేమ్తెస్తుంది అన్నారు దైవప్రవక్త (స). (ఇబ్ను హిబ్బాన్, బైహాఖీ - స్థాయి హసన్)
ఇంతకంటే దారుణాన్ని విని ఉండరు
ఇన్ని రోజుల్లో కోర్టుకు వచ్చిన కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇదే. ఓ తల్లి చేసిన దారుణం గురించి హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఫిజ్ చేసిన వ్యాఖ్యలివి. నిందితురాలు కొర్కొరన్కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంత భారీ శిక్ష పడటానికి ఆమె చేసిన నేరం ఏంటంటే..
కొర్కొరన్ డ్రగ్స్ బానిసైంది. హెరాయిన్ తీసుకోకుంటే రోజు గడిచేదికాదు. అయితే డ్రగ్స్ కొనేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బు ఉండేదికాదు. అలాగని డ్రగ్స్ అలవాటు మానులేకపోయింది. రెండేళ్ల క్రితం కొర్కొరన్ డబ్బుల కోసం తన 11 ఏళ్ల కుమార్తెను డ్రగ్ డీలర్ వద్ద కుదువ పెట్టి అప్పు తీసుకుంది. ఇంతకంటే దారుణమేంటంటే తన కూతురును అత్యాచారం చేసేందుకు డ్రగ్ డీలర్కు అనుమతిచ్చింది. ఆ నీచుడు అభంశుభం తెలియని బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని హింసించి తన వాంఛలు తీర్చుకునేవాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలను వీడియోలు తీసేవాడు. కొర్కొరన్ తన కూతురును ఇంతటితో వదిలిపెట్టలేదు. కుమార్తెకూ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేది. పాపం ఆ చిన్నారి ప్రతిసారి వాంతి చేసుకునేంది. ఐదు నెలల పాటు ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవించింది.
అన్ని తెలిసి తెలిసి యవివేక తిమిరాన / మనుజులంత వింత మధువు ద్రావి
మమత మానవతలన్ మహిలోన వీడియు / అథములౌచు మిగుల నార్చుచుండ్రి.
గత ఇరవయ్యేళ్లలో మన దేశంలో మద్యపానం చేసేవారి సంఖ్య 50 శాతం పెరిగిందట. యువత అతిగా తాగుతోందనీ, అమ్మాయిలు కూడా ఏమీ తగ్గడం లేదనీ, పదిహేనేళ్లలోపే మద్యం రుచి చూస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందనీ అధ్యయనం చెప్పింది. ఆ తర్వాత వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కలు కూడా దాన్ని బలపరిచాయి. మూడో వంతు పురుషులు అలవాటుగా మద్యం పుచ్చుకుంటున్నారని తేల్చాయి.
ఎనర్జీ డ్రింక్ కాదు ఎలర్జీ డ్రింక్
మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూటికి దాదాపు 25 యాక్సిడెంట్లు మద్యం మత్తులో జరుగుతున్నవేనని సర్వేల్లో తేలింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది మందు అలవాటు మానుకోరు. మద్యం అనారోగ్యాలకు కారణమని చెబుతూనే ప్రభుత్వాలు రకరకాల బ్రాండ్ల పేరుతో వాటిని అమ్ముతుంటాయి. అసలు మద్యం సేవిస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలిస్తే దాని జోలికి కూడా వెళ్లరు.
మద్యం పేరు ఏదైనా శరీరంలో అది చేసే పని ఒకటే.. డబ్బున్న వాళ్ళు బార్లలో బీర్లు, బ్రాందీలు, విస్కీ, వైన్, జిన్ను అనునకుంటూ మద్యం త్రాగితే గ్రామాల్లో నివసించే వాళ్లు కాస్త ఖరీదు తక్కువలో దొరికే సారా, కల్లూ తాగుతారు. ఏం త్రాగినా శరీరంలో దాని ప్రభావం ఒకే రకంగా ఉంటుంది.
మద్యం త్రాగేవారి కాలేయం దెబ్బతిని "సిర్రోసిస్ ఆఫ్ లివర్" (Cirrhosis of Liver) అనే జబ్బు వస్తుంది. పొట్టనిండా నీరు చేరి క్రమంగా "బానపొట్ట” వస్తుంది. కాళ్ళ వాపులు వస్తాయి. మానవ శరీరంలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి, అది దెబ్బ తింటే మరణానికి చేరువ అవుతున్నట్టేనని గుర్తించాలి. బావిలో నీళ్ళూరినట్లు కాలేయంలో నీరు ఊరుతుంది. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే దగ్గర గల రక్తనాళాలు ఉబ్బిపోయి, రక్త స్రావం కూడా జరగొచ్చు. ప్రమాదంతోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
గుండెకు బోలెడు ముప్పు…
మద్యం సేవిస్తే గుండె కండరాలు దెబ్బతిని "గుండె విశాలంగా" మారుతుంది. గుండె వైశాల్యం క్రమంగా పెరుగుతుంది. చివరకు గుండె ఆగిపోతుంది. ఈ జబ్బుని "గుండె పెరగటం" (Cardiomegaly) అంటారు. ఇది చివరికి "హార్ట్ ఫెయిల్యూర్"కు దారి తీస్తుంది.
పొట్టలో పుళ్లు…
మద్యపానంతో పొట్టలో పుళ్లు ఏర్పడతాయి. గాస్ట్రైటిస్" (Gastritis) వస్తాయి. పొట్టలో క్యాన్సర్ . క్రమంగా ఆకలి మందగిస్తుంది. అన్నవాహికలో క్యాన్సర్ తీవ్రమయ్యే కొద్దీ అన్నం మింగుడు కూడా పడదు. తర్వాత దశలో కనీసం మంచి నీళ్ళు కూడా మ్రింగుడు పడవు. ఆ సమయంలో వైద్యులు కూడా చేయగలిగింది ఏమి ఉండదు.
నరాల క్షీణత..
మద్యం సేవించడం వల్ల "నరాల బలహీనత" వస్తుంది. కాళ్ళూ, చేతులో నొప్పులూ, మంటలూ పుడ్తాయి. ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గవు. నరాల నొప్పులు తగ్గుతాయని ఇంజెక్షన్లు వాడినా ఉపయోగం పెద్దగా ఉండదు.
తాగే వారికి మెదడు, నరాలు దెబ్బతింటాయి. మెదడులో కణాలు దెబ్బతింటాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. నిద్రపట్టడం తగ్గిపోతుంది. త్రాగేవారికి ఆహార పదార్థాల, విటమిన్ల లోపాలు కూడా వస్తాయి. “వెర్నిక్స్ ఎన్సెఫలోపతీ", "పాలీన్యూరైటిస్" (Polyneuritis), "నికోటినిక్ యాసిడ్" లోపంతో వచ్చే “ఎస్ కెఫలోపతీ" (Encephalopathy) మొదలైన జబ్బులు వస్తాయి.
ఒకేసారి మానేసినా ప్రమాదమే…
మద్యం అలవాటు ఉన్న వారు అతిగా త్రాగినా, అకస్మాత్తుగా మానినా, ఎక్కువ చలికి గురైనా, “డెలీరియం ట్రెమన్స్” (Delirium Tremens) అనబడు మెదడు వ్యాధి వస్తుంది. ఈ రోగం వల్ల నిద్ర ఉండదు. కాళ్ళూ, చేతులూ వణుకుతుంటాయి. భయం, దృష్టి, వినికిడికి సంబంధించిన భ్రమలు వస్తుంటాయి. ఎవరో బెదిరిస్తున్నట్లు మాటలు వినపడటం, ఎవరూ పిలవకపోయినా పిలిచినట్లు, పిలిస్తే వినపడక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోతుంది.
తీవ్రమైన భ్రమలు…
"ఎక్యూట్ హెలూసినోసిస్" (Acute Hallucinosis) అనే జబ్బుతో తీవ్రమైన భ్రమలు కలిగి, ఆ పరిస్థితి వారాలు మొదలుకొని నెలల తరబడి ఉండొచ్చు. ఈ సమస్య ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయి.
రక్తపోటు, పక్షవాతం రావడానికి త్రాగుడు కూడా ఒక కారణమని వైద్య పరిశోధనల్లో గుర్తించారు. మెదడు మీద సారా పనిచేయటంలో "ఆల్కహాలిక్ డెమెన్షియా" (Alcoholic Dementia) చివరి దశ. ఈ దశలో అన్ని పేర్లు మర్చిపోతారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుండవు.
మద్యపానంతో కండరాలు దెబ్బతింటాయి. “స్కెలిటల్ మయోపథీ" (Skeletal Myopathy) అనే సమస్యతో విపరీతమైన నీరసం, శారీరక శ్రమ చేయటానికి ఇష్టపడకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. చివరకు పనిచేసే స్థితిని కూడా కోల్పోతారు.
మద్యం తాగితే ఆ సామర‌్థ్యం తగ్గిపోతుంది…
మద్యపానం ఎక్కువైతే కాలేయం దెబ్బతినడం వలనా, పురుషుల సెక్సు హార్మోన్లు తయారు కావటం తగ్గిపోతుంది. పురుషులో వృషణాలు సన్నబడతాయి. మద్యపానం వల్ల సెక్స్ కోరికలు పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ తాగినప్పుడు లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. అది గమనించక చాలామంది మద్యం వల్ల పెరిగే కోరికనే సామర్థ్యంగా అపోహపడి, మరింతగా బానిస అవుతుంటారు. స్త్రీలలో వక్షోజాల పరిణామం పెరుగుతుంది. చివరకు సెక్సు సామర్థ్యం క్షీణించి వంధ్యత్వం వస్తుంది. నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, ఊపిరితిత్తుల్లో, క్యాన్సర్ ఉన్నవారు సారా తాగేవారయితే వారి జీవన ప్రమాణం బాగా తగ్గిపోతుంది. బ్రతకాల్సిన దానికన్నా ముందుగా చనిపోతారు.
మద్యం... మతి పోగొడుతుంది!
తాటి యీత కల్లు, ద్రాక్ష రసంబును, సార, నీర, వైను, స్కాచు, విస్కి రమ్ము, జిన్ను, బీరు, బ్రాందీల జెప్పరే మత్తునిచ్చునట్టి మద్యమనుచు. పేరు ఏదైనా మద్యం ,మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు, బోలెడంత.
మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎం.ఎల్.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం, కాస్త దుడుకుతనం కలుగుతాయి. ఆ హుషారును కొనసాగించడానికి మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే మద్యం కాస్తా 80 ఎం.ఎల్. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు నేరాలకూ దారితీస్తాయి. దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. ఓ మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు. మద్యం లైంగిక హింస, గృహహింస, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అగాధాన్ని పెంచుతుంది. నేరప్రవృత్తిని అధికం చేస్తుంది. నేరమనస్తత్వం (యాంటీసోషల్ పర్సనాలిటీ) ఉన్నవారిలో ఇతరుల బాధల పట్ల స్పందించే గుణం ఉండదు. అందుకే తాగినవారు నేరాల సమయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటారు.
దైవ ప్రవక్త స్ (స) ఇలా జాగురూక పర్చారు: నా సముదాయంలో కొందరు తప్పకుండా వస్తారు. వారు మద్యం, మత్తు పదార్థానికి పేరు మార్చి ఏమార్చి దాని ని హలాల్ చేసుకుంటారు. (ముస్నద్ అహ్మద్)
విశ్వాసం మిమ్మల్ని వీడి పోతుంది జాగ్రత్త!
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం - ప్రవక్త (స) ఇలా అన్నారు: “ ఒక మోమిన్ వ్యభిచారం చేసినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక మోమిన్ మద్యం సేవించినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక మోమిన్ దొంగతనం చేసినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. (బుఖారీ, ముస్లిం) అంటే విశ్వాసం ఆ నీతిమాలిన స్థితిలో వేరయిపోతుంది.
గాయాల తోడు తాగుబోతుల కూడు
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ (ర) ఉల్లేఖన ప్రకారం, నేను అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పడం విన్నాను, “ఎవరైతే మద్యం సేవిస్తారో, అతని నమాజు నలభై రోజుల వరకు అంగీకరించబడదు. ." అప్పుడు అతను పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. అతను మళ్లీ మద్యం సేవిస్తే, అల్లాహ్ నలభై రోజులు అతని ప్రార్థనను అంగీకరించడు. అతను తిరిగి మళ్ళి పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. (అంతటితో ఆగక) మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటే అల్లాహ్ కచ్చితంగా అతనికి నరకంలోని మనుషుల గాయాల తోడును తాగిస్తాడు.” (నసాయి, ఇబ్న్ మాజా)
స్వర్గ ప్రవేశం నిషిద్ధం
అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ నుండి మరొక కథనం- ప్రవక్త, సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మేలు చేసి ఎత్తిపొడుపు మాటల తూటాలతో దానగ్రహీత మనస్సు నొప్పించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు, . తల్లిదండ్రుల యెడల అవిధేయత కలిగినవాడు స్వర్గంలోకి ప్రవేశించడు. మద్యం, మత్తు పదార్థాలు సేవించేవాడు స్వర్గంలోకి ప్రవేశించడు” (నసాయీ, హదీథ్ నం. 5688)
అల్లాహ్ అభిశాపం తగులుతుంది
అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ (ర) కథనం - దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: “అల్లా మద్యాన్ని, మత్తు పదార్థాలను శపించాడు.
మద్యం, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు తాపించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు విక్రయించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు కొనిగొలు చేసే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు - ద్రాక్ష,ఇతరత్రా వస్తువుల నుండి పిండే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు తయారీదారుపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు మోసుకెళ్లే వ్యక్తిపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు ఎవరి కోసం మోసుకెళ్ళబడుతుందో వారిపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
(సునన్ అబి దావుద్, సంపుటి. 2, పేజీ. 161).
మనిషి మర్యాదను మంటగలిపే వెకిలి చేష్ట మద్యపాన సేవనం
హజ్రత్ అలీ (రజి) కథనం:- నా దగ్గర బద్ర్ యుద్ధ సొత్తు నుండి లభించిన ఒక ఒంటె ఉండేది. ఖుమ్స్ (యుద్ధసొత్తు) నుండి దైవప్రవక్త (సల్లం) ప్రసాదించిన మరొక ఒంటె కూడా నా దగ్గర ఉండేది. ప్రవక్త కుమార్తె హజ్రత్ ఫాతిమా (రజి)ను (వివాహమాడిన తరువాత) నా ఇంటికి పిలుచుకురావడానికి నిర్ణయించుకున్నప్పుడు, నేను బనీ ఖైనుఖా తెగకు చెందిన ఒక స్వర్ణకారునితో, అతను నా వెంట (అడవికి) వెళ్ళి అజ్జర్ గడ్డి తీసుకు రావాలని మాట్లాడుకున్నాను. అజ్జర్ గడ్డి స్వర్ణకారులకు అమ్మి ఆ డబ్బుతో నా పెళ్ళి విందు (వలీమా) చేసుకుందామని నేననుకున్నాను. ఆ సందర్భంలో నేను నా ఒంటెలకు సంబంధించిన అంబారీ, గడ్డిచిక్కం, త్రాళ్ళు తదితర సామగ్రిని సేకరించడం మొదలెట్టాను. నా ఒంటెలు రెండింటిని ఒక అన్సారీ ముస్లిం ఇంటి దగ్గర ఉంచాను. ఒంటెల సామగ్రి తీసుకొని వచ్చి చూస్తే నా ఒంటెల మూపురాలు కోయబడి ఉన్నాయి. వాటి పొట్టలు కోసి గుండెకాయలు తీసేసుకున్నారు. ఈ దృశ్యం చూసి నాకు ఏడ్పు వచ్చినంత పనయింది. ఈ పని ఎవరు చేశారని అడిగాను నేను. హజ్రత్ హమ్జా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రజి) అని జనం తెలియజేశారు. అప్పుడు హజ్రత్ హమ్జా (రజి) ఆ ఇంట్లో కొందరు అన్సారులతో కలసి మద్యం సేవిస్తున్నారు. నేను అక్కడ్నుంచి నేరుగా దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన దగ్గర హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రజి) కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) నా ముఖంలో కొట్టవచ్చినట్లు కన్పిస్తున్న నా మనోభావాన్ని చూసి “ఏమిటీ ఇలా తయారయ్యావు?" అని అడిగారు. “దైవప్రవక్తా! నాకీ రోజు కలిగినంత బాధ ఇదివరకెప్పుడూ కలగలేదు. హజ్రత్ హమ్జా (రజి) నా ఒంటెలపై దౌర్జన్యం చేశారు. వాటి మూపురాలు, పొట్టలు కోశారు. అక్కడ సమీపంలోనే ఒక ఇంట్లో కొందరు వ్యక్తులతో కలసి సారాయి త్రాగుతున్నారు” అని చెప్పాను నేను. దైవప్రవక్త (సల్లం) ఈ మాట వినగానే తమ దుప్పటి తెప్పించుకొని కప్పుకొని బయలుదేరారు. జైద్ బిన్ హారిస్ (రజి) కూడా ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త (సల్లం) హమ్జా (రజి) ఉన్న ఇంటికి వెళ్ళి లోపలికి రావచ్చా అని అనుమతి అడిగారు. లోపల ప్రవేశించడానికి అనుమతి లభించింది. చూస్తే వారంతా మద్య సేవనంలో మునిగి ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) అది చూసి హజ్రత్ హమ్జా (రజి)కు చీవాట్లు పెట్టారు. హజ్రత్ హమ్లా (రజి) కళ్ళు ఎరుపెక్కాయి. ఆయన సారా మత్తులో తూలుతూ తల పైకెత్తి దైవప్రవక్త (సల్లం) వైపు దృష్టి సారించారు. ఆయన మొదట దైవప్రవక్త (సల్లం) కాళ్ళ వైపు చూశారు. తరువాత మెల్లగా ఆయన నాభి వైపు, ఆ తరువాత ఆయన ముఖం వైపు చూశారు. ఆ తరువాత “మీరెంత? మీ విలువెంత? మీరు మా తండ్రిగారి బానిసలేగా!" అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) ఈ పరిస్థితి చూసి “హమ్జా (రజి) ఇప్పుడు పూర్తి మత్తులో మునిగి ఉన్నార”ని భావించి అక్కడ్నుంచి వెనక్కి మరలి పోయారు. మేము కూడా ఆయన వెంట అక్కడ్నుంచి బయలుదేరాము. (సహీహ్ బుఖారీ)
మాట తూలితే అదృష్టం వెక్కిరిస్తుంది అంటారు. కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ, నోరు జారితే తీసుకోలేము. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు హజ్రత్ అబ్బాస్ (ర) బేషరతుగా క్షమాపణలు చెప్పే ఉంటారు. . ఇంతకూ నోరు జారడం వల్ల ఆయన ఏమి సాధించినట్టు? ఇతరులను విపరీతంగా బాధించి అంతులేని మానసిక క్షోభకు కారణమైన మాటలకు, చేష్టలకు ప్రేరకం, అసలు కారణం ఆ సమయంలో ఆయన మద్యం సేవించి ఉండటమే. ఇది మద్య నిషేధం రాకముందు జరిగిన సంఘటన. . అంచేత మద్యం మత్తులో హజ్రత్ హమ్లా (రజి) వల్ల జరిగిన చేష్టలు నిలదీయదగిన విపరీత చేష్టలే, ఆయినా ప్రవక్త (స) ఆయన్ను ఏమి అనకపోవడం అనేది ఆయన ఫుల్లుగా త్రాగి మత్తులో తులతూగుతూ ఉండటమే కారణం. ఎందుకంటే ఆ సమయంలో ఏం చెప్పినా తలకెక్కదు గనక . బహుశా ఆయన హజ్రత్ అలీ (రజి)కి ఒంటెల నష్టపరిహారాన్ని చెల్లించి ఉండవచ్చు. అన్నారు ఇమామ నవవీ (రహ్మ).
మత్తులో స్వస్థత లేదు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించినట్లు హజ్రత్ ఉమ్మె సలమా (ర.అన్హా) తెలియజేశారు : "అల్లాహ్ ఏ వస్తువునయితే మీ కొరకు నిషిద్ధంగా ఖరారు చేశాడో అందులో మీ కొరకు వ్యాధి నివారణను కలిగించే గుణాన్ని పొందు పరచలేదు.” (దీనిని బైహఖీ సేకరించారు, ఇబ్నె అబ్బాస్ దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
మత్తులో పడవేసే వస్తువుల్లో 'రోగ నివారణ' లాంటి గుణాన్ని అల్లాహ్ ఏ మాత్రం పొందుపరచలేదని ఈ హదీసు స్పష్టపరుస్తోంది. కాబట్టి ఇలాంటి వస్తువులను చికిత్సగా ఉపయోగించటం కూడా అధర్మమే.
మత్తు మందు ఔషధం కాదు రోగం
హజ్రత్ వాయల్ హజ్రమీ (రజి) కథనం: తారిఖ్ బిన్ నువైద్ (రజి) దైవప్రవక్త సమక్షంలో ఔషధ నిమిత్తం తయారు చేసే మద్యం గురించి అడగ్గా "అది ఔషధం కానే కాదు, పైగా అదొక రోగం" అని ఆయన (స) సమాధాన మిచ్చారు. (దీనిని ముస్లిం, అబూ దావూద్, తదితరులు సేకరించారు) రోగానికి మందుగా మద్యాన్ని ఉపయోగించటం అధర్మం అని ఈ హదీసు చెబుతోంది. ఖుద్దుగా 'ఒక రోగం' అయిన వస్తువు రోగాన్ని ఎలా నయం చేస్తుంది?
మత్తు ఆదేశం
మత్తును కలిగించే ప్రతి వస్తువూ, 'ఖంర్ ' క్రిందికే వస్తుంది. మత్తును కలిగించే ప్రతి వస్తువూ హరామే (నిషిద్దమే)” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉద్బోధించినట్లు హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) తెలిపారు. (ముస్లిం)
మత్తును కలిగించే వస్తువు ద్రవ రూపంలో వున్నా, ఘన పదార్థంగా వున్నా, ఆల్కహాలు రూపంలో ఉన్నా, మరే రూపంలో వున్నా సరే అది నిషిద్ధం అనటంలో ఎలాంటి సందేహం లేదని పై హదీసు ద్వారా అవగతమవుతున్నది.
మోతాదు ఎంత
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రజి) చెప్పారు: ఏ వస్తువు యొక్క అధిక మోతాదు మత్తునిస్తుందో, దాని అల్ప మోతాదు కూడా నిషిద్ధమే. (అహ్మద్ మరియు 'నలుగురు' దీనిని సేకరిం చారు. ఇబ్న్ హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
ఎక్కువ మోతాదులో తీసుకున్న వస్తువు మనిషిని మత్తులో ముంచివేసినపుడు దాని తక్కువ మోతాదు కూడా నిషిద్ధమే మరి. అయితే హనఫీలు, బస్రాకు చెందిన ధర్మవేత్తల అభిప్రాయం మరోలా ఉంది. ద్రాక్ష, ఖర్జూరం తప్ప మత్తును కలిగించే స్థాయికి చేరని పానీయం ధర్మసమ్మతమేనని వీళ్లు భావిస్తున్నారు. కాని హదీసు మాత్రం వీళ్ల అభిప్రాయాన్ని త్రోసిరాజంటున్నది.
కొంచెం తాగినా ప్రమాదమేనా!
కొంచెం తాగుతున్నారా, అప్పుడప్పుడూ తాగుతున్నారా.... అన్నది విషయం కాదు. మద్యానికి ఎవరి శరీరం ఎలా? స్పందిస్తుందో తెలియదు. అందుకే తాగకుండా ఉండడానికే ప్రాధాన్యమివ్వమంటున్నాడు దాక్షన్లు. గతంలో అరవై ఏళ్లు దాటినవారిలో కప్పించే క్యాన్సర్లూ ఇతర ఆరోగ్య సమస్యలూ ఇప్పుడు ముప్ఫైల్లోనే కన్పించడానికి కారణం అదేనట.
ద్రాక్ష రసం త్రాగవచ్చా ?
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం ఎండు ద్రాక్షపండ్లను నీళ్ల (తోలు) తిత్తిలో వేసి రసం తయారు చేయబడేది. ఆయన (సఅసం) ఆ పండ్ల రసాన్ని ఆ రోజు, మరుసటి రోజు కూడా త్రాగేవారు. మూడవ రోజు కూడా సేవిం చేవారు. మూడో రోజు పొద్దుగూకేసరికి త్రాగి, ఇతరులకు కూడా త్రాగేందుకు ఇచ్చేవారు. అప్పటికీ మిగిలిపోతే పార బోసేవారు. (ముస్లిం)
ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే మహాప్రవక్త (స) ద్రాక్ష రసాన్ని సేవించేవారు. అయితే ఆ రసంలో మత్తును ఇచ్చే గుణం పొడసూపితే మాత్రం దాన్ని పారబోసేవారు. ఎండు ద్రాక్షపండ్ల నుంచి తీసిన రసం మూడు రోజుల వరకూ ఎట్టి పరిస్థితిలోనూ హలాల్ (ధర్మ సమ్మతం) అని దీని మతలబు ఎంతమాత్రం కాదు. మత్తును కలిగించకుండా ఉన్నంతవరకూ ఉపయోగించవచ్చన్న అర్ధంలో దీన్ని తీసుకోవాలి.
మహాత్ములకు మత్తు మకిలి అంటించే ప్రయత్నం
మత్తు పుట్టించు ద్రాక్షారసము వాడుకను బైబిల్ అనుమతించ లేదు. కానాలోని వివాహవిందులో క్రీస్తు చేసిన ద్రాక్షారసము ద్రాక్ష పండ్ల నుండి తీయబడిన స్వచ్ఛమయిన రసము. “ద్రాక్షగెలలో క్రొత్త రసము” పైగా బైబిల్ ఇలా అంటుంది;
“ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరు జ్ఞానము లేనివారు.”
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? మందు బాబులకే ఇంకెవ్వరికి? మందు కొడితే ఎవరికీ వారే మహారాజుల్లా ఫీలవుతారు. మరి మత్తు వదిలితే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్టు కొందరు మురికి కాలువలో పడి ఉంటారు.. కొందరు ఆరుబయట అంగాంగ ప్రదర్శనలతో దర్శనిమిస్తారు. కొందరు వీధి కుక్కల సరసన చేరి ఉండటం కనబడుతుంది.
మత్తుకి బానిసయిన వ్యక్తికీ ప్రపంచంలో విధించే శిక్ష
మద్యం సేవించిన వ్యక్తి గురించి దైవప్రవక్త (సఅసం) ఈ విధంగా ప్రవచించినట్లు హజ్రత్ ముఆవియా (రజి) చెప్పారు - "అతడు మద్యం సేవిస్తే కొరడా దెబ్బలు కొట్టండి. మలి సారి కూడా త్రాగితే మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టండి. మూడవసారి కూడా త్రాగితే మళ్లీ కొరడా దెబ్బలు కొట్టండి కాని నాల్గవసారి గనక మద్యం సేవిస్తే శిరచ్ఛేదనం చేయండి.” (దీనిని అహ్మద్ వివరించారు - వాక్యాలు కూడా ఆయన గారివే. 'నలుగురు' కూడా ఈ హదీసు ను ఉల్లేఖించారు. తిర్మిజీ వివరించిన తీరునుబట్టి అతన్ని వధించే విషయం రద్దు చేయబడిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అబూ దావూద్ స్పష్టమయిన కథనంతో జుహ్రీ నుండి సంగ్రహించారు.
మత్తు పదార్థాల తయారీకి ప్రత్యేక వసువులు ఉంటాయా?
హజ్రత్ ఉమర్ (రజి) కథనం : మద్యనిషేధాజ్ఞ అవతరించింది. ఆనాడు అయిదు వస్తువులతో అది ఉత్పత్తి చేయబడేది - ద్రాక్ష, ఖర్జూరం, తేనె, గోధుమలు, యవలు. మరియు ఖమ్ అంటే బుద్ధి వివేకాలను ఆవరించే అన్ని రకాల వస్తువులు. (బుఖారీ, ముస్లిం)
సారాయి ఉత్పత్తికి దోహదపడే అయిదు వస్తువుల ప్రస్తావన ఇందులో వచ్చింది. ఆనాడు మద్యం తయారీకి సాధారణంగా ఈ పదార్థాలనే ఉపయోగించేవారు. మనిషి బుద్ధి వివేకాలను క్రమ్మివేసి, మనోమస్తిష్కాలకు మత్తును, కిక్కును ఎక్కించే వస్తువులను ఆ రోజుల్లో 'ఖమ్'గా (ఈ రోజుల్లో గుడుంబా, నాటు సారాయిలాగా) వ్యవహరించేవారు. అందుకే మద్యం ఖర్జూరపండ్ల నుండి తీసినా, ద్రాక్ష ద్వారా ఉత్పత్తి చేసినా అది నిషిద్ధం అనటంలో సందేహానికి తావులేదు.
యువతపై తీవ్ర ప్రభావాలు
యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలురకాల సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంది. ఆది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట స్నేహితులతో సరదాగా ప్రారంభమై, తరవాత వ్యసనంలా మారుతుంది. చివకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్నాక మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. వాటివల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారు చెడుదారుల్లోకి వెళ్లకుండా వారే తగిన జాగ్రత్త వహించాలి.
తాగితే ఏమవుతుంది?
మద్యం తాగినప్పుడు రెండు రకాల ప్రభావం కన్పిస్తుంది. తాగిన వ్యక్తికి మానసికంగా కలిగే హాయి ఒక రకమైతే.. అది లోపలికి వెళ్లి శరీరంలో కలిగించే మార్పులు ఇంకో రకం. తాగేటప్పుడూ. ఆ తర్వాతా... రిలాక్స్ గా మత్తుగా ఉంటుంది. ఎవరేమనుకుంటారోననే సంకోచం లేకుండా తోచినట్లు ప్రవర్తిస్తారు. ఆ స్వేచ్ఛ వారికి అనందాన్నిస్తుంది. అది బాగుంది కదా అని ఇంకాస్త తాగితే మాట తడబడుతుంది చూపు వినికిడిలో తేడా వస్తుంది. దాంతో మనుషుల్ని వస్తువుల్ని గుర్తుపట్టలేరు. వాంతులవుతాయి, తల తిరుగుతుంది. కొంతమందికి విరేచనాలవుతాయి. రెండు రోజులపాటు తలనొప్పి వేధిస్తుంది. తరచూ మద్యం సేవించేవాళ్లు దానికి అలవాటుపడిపోతారు. దాంతో మొదట్లో ఉన్నంత కేక్ తర్వాత ఉండదు. అందుకని మోతాదు పెంచుతూ పోయి క్రమంగా దానికి బానిసలైపోతారు. తాగకుండా ఉండలేని దశకు చేరుకుంటారు. తాగి గమ్మున పడుకుంటే తెల్లారేసరికి మామూలైపోతుందనుకుంటారు. కానీ అలా జరగదు. కడుపులోకి చేరిన ఆ విషాన్ని తక్షణం. బయటకు పంపడానికి శరీరంలోని వివిధ అవయవాలు పెద్ద యుద్ధమే చేస్తాయి. మనం మరో విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు త్రాగుడు ప్రచారానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాల్లో, వీడియోల్లో ప్రచారం చేస్తున్నారు. అది అన్ని చోట్లా ప్రత్యక్షమౌతోంది. ‘మీరు తాగకపోతే ఇంకెందుకు బ్రతుకు’ అన్నట్లుగా సమాజం భావిస్తున్నది.
కారణాలు
అభం శుభం తెలియని పసి మనసులు మత్తిల్లుతున్నాయి! ఉరకల పరుగుల యువ మెదళ్లు జోగుతున్నాయి!! మానసిక ఒత్తిళ్ల ప్రభావమో.. తోటివాళ్ల ప్రోద్బలమో.. తల్లిదండ్రుల నిర్లక్ష్యమో.. దుర్మార్గుల స్వార్ధమో.. కారణమేదైతేనేం? పిల్లలనూ యువతనూ మత్తుమేఘాలు కమ్మేసుకుంటున్నాయి. చాటుమాటు అంగళ్లు దాటుకొని పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలకూ మాదకద్రవ్యాలు విస్తరిస్తున్నాయి. ఛాలెట్లో డ్రగ్స్, జామ కాయ కారంలో డ్రగ్స్ ….. కొందరు విద్యార్థులు వీటి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నట్టు వెలువడుతున్న కథనాలే దీనికి నిదర్శనం. దీంతో ఎక్కడ్నుంచి ఏ మాదకద్రవ్యం తమ చిన్నారులపై విరుచుకు పడుతుందోనని తల్లిదండ్రుల గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి.
ఎందుకంటే తెలిసో తెలియకో ఒకసారి మాదకద్రవ్యాల రుచి మరిగితే, అవి వ్యసనంలా మెదళ్లకు అంటుకుపోతే.. పిల్లల భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంది. మానసిక వికాసమే కాదు శారీరక ఆరోగ్యమూ కుంటుపడుతుంది. ఆలోచనా రీతులు, ఉచితానుచిత విచక్షణ, ప్రవర్తన తీరుతెన్నులను సమూలంగా మార్చేసే మాదకద్రవ్యాలు పిల్లలనే కాదు.. మొత్తం సమాజాన్నీ అతలాకుతలం చేస్తాయి. ఇప్పటికైనా మేల్కోకపోతే మన బంగారు భవిష్యత్తులు మన కళ్లముందే.. 'గమ్మత్తుగ మత్తులో చిత్తవటం ఖాయం.
మత్తు అనేక రకాలు
మద్యం మత్తును కలిగిస్తుంది. కాని కాసేపట్లో ఆ మత్తు దిగిపోతుంది. స్వార్థం కూడా మత్తును కలిగిస్తుంది. కాని అది అంత తొందరగా వదిలిపోయేది కాదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఎక్కే మత్తు అది. అవినీతి, దోపిడి, అహంకారం అనేవి మద్యం కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇవి ప్రమాదకరమైనవి, భయంకరమైనవి.
ప్రపంచంలో చాలామందికి డబ్బంటే వ్యామోహం. డబ్బే ప్రపంచాన్ని నడిపించేది. డబ్బే మనిషికి మనిషికి మధ్యన అంత:స్సూత్రంలా పనిచేస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించే దిక్సూచి అదే. కాని ఆ డబ్బే ఎందరినో విడదీస్తుంది. ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. కొందరు మద్యానికి బానిసలవుతారు. క్లబ్బుల్లో, మందుషాపుల్లో తాగి, జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. వాళ్ళకు కుటుంబం మీద, జీవితం మీద ఆలోచన అసలే ఉండదు. ఎప్పుడూ తాగడం, తూలడం, ఇలా.. కొందరికి డబ్బంటే వ్యామోహం. మరికొందరికి క్లబ్బంటే వ్యామోహం. కాని ఈ లోకంలో అందరికి స్వార్థమే అసలైన నిషా. స్వార్థం కోసం ఏ పనైనా చేస్తారు. ఎవరినైనా పడదోస్తారు. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు.
లోకంలో కొందరికి పదవి మత్తు ఉంటుంది. ఆ పదవి వల్ల అధికారం వస్తుంది. ఎవరినైనా శాసించవచ్చు. తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. అందుకే అధికారం లేనిదే జీవితమే లేదన్న భావనతో బతుకుతారు. కొందరికి పెదవి మత్తు. (శృంగారం అంటే వ్యామోహం). కాని ఈ లోకంలో అందరికి యవ్వనమే గొప్ప నిషానిస్తుంది. యవ్వనంపై అందరికి వ్యామోహమే. అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, వీడియో గేమ్స్, ఆన్లైన్ ఆప్స్ --- ఇవి కూడా మత్తు కోవకు చెందినవే.
సమాజంలో కొందరికి వధువు మత్తు, కొందరికి మధువు మత్తు. వధువు కోసం వేటలో ఉంటారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి. తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో ముందే అంచనాలు వేసుకుంటారు. పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి మధువంటే పిచ్చి. తాగుడుకి దాసోహం అంటారు. వధువు, మధువు కొందరికైతే, లోకంలో మరి కొందరికి చీకటి మత్తు. చీకటిలో చేసే పని ఏదీ ప్రపంచానికి తెలియదు. . దోపిడీ, అక్రమ రవాణా, దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు మొదలైనవి ఏవైనా కావచ్చు. అన్నింటికి చీకటే చిరునామా. చీకట్లోనే మేడలు నిర్మించబడతాయి. కూల్చబడతాయి కూడా. అందుకే.. చీకటి భలే మత్తు గలది.
పరిష్కారం ఏమిటి?
మీకు పెరుగుతున్న పిల్లలు ఉంటే, వారిని ఆటల్లోనూ, కొండలు ఎక్కడం, ఈతకొట్టడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనులను చేయించాలి. వారికి సత్గ్రంథ పఠనం, వేరే కళలు, దేనిమీదైనా ఆసక్తి కలిగేలా చూడాలి. వారు తమ తెలివితేటలు, మనోభావాలు చవిచూడకలగాలి. ఎప్పుడైతే వారు తమ చురుకుదనం, తెలివితేటలు, మనోభావాల ద్వారా వచ్చే సంతోషాన్ని ఆస్వాదిస్తారో, తమ శారీరక సుఖాల కోసం వారు వెతుక్కోవటం సహజంగానే అప్పుడు చాలా తక్కువ అవుతుంది. పిల్లలు చాలా ఆసక్తిగా అనేక ఇతర కార్యకలాపాలలో నిమగ్నం కావాలి. అప్పుడు సహజంగా వారికి మత్తు పదార్థాల అవసరం తగ్గుతుంది.
అధికశాతం ప్రపంచ దేశాలలో ఉన్న సార్వత్రిక ప్రభుత్వ పాలనా వ్యవస్థలలో ఏకగ్రీవంగా విఫలమైపోయిన “చట్టం” ఏదైనా ఉందంటే అది ఒక్క ‘మద్య నిషేధ చట్టమే’ అనటం అతిశయోక్తి కాదేమో! ప్రజాశ్రేయస్సును పెంపొందించే సాంఘిక వ్యవస్థను నిర్మించాల్సింది రాజ్యమేనని 38వ రాజ్యాంగ అధికరణ ఉద్బోధిస్తోంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యం కర్తవ్యమని, అందుకోసం మత్తుపదార్థాల సేవనాన్ని నిరోధించాలని 47వ అధికరణ నిర్దేశిస్తోంది. ఈ విద్యుక్తధర్మాల నిర్వహణలో ప్రభుత్వాల పనితీరును తరచిచూస్తే- కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లవుతుంది. ముఖ్యంగా యువభారతం భవిష్యత్తుకు అతిప్రమాదకరమైన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో సర్కారీ యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. దాంతో బడి పిల్లల నుంచి ఉన్నతోద్యోగుల వరకు చాలామంది మత్తుమందులకు బానిసలవుతున్నారు. శిక్షల భయం ఉన్నచోట తప్పు చేయడానికి ఎవరూ సాహసించరు. అటువంటి వాతావరణానికి మన దేశం మొహం వాచింది కాబట్టే అమానుష నేరగాళ్లెందరో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. జంకుగొంకు లేకుండా డ్రగ్స్ దందాలకు పాల్పడుతూ, జాతిని రోగగ్రస్తం చేస్తున్న పరమ దుర్మార్గులూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు.. పేరుకు కేసులు కడుతున్న పోలీసులు- అపరాధులకు తగిన శిక్షలు విధింపజేయడంలో చేతులెత్తేస్తున్నారు. దేశీయంగా మాదక రక్కస్ స్వైరవిహారానికి అదే ప్రధాన కారణమవుతోంది!
ప్రవక్త ముహమ్మద్ (స) ఆవిర్భవించాక 13 ఏళ్ల తరువాత గానీ మద్యాన్ని మీరు త్రాగటం మానేయ్యాలనే ఆజ్ఞ పూర్తి స్థాయిలో అవతరించలేదు. మరి ఆ పదమూడేళ్ళ కాలం దేనికంటే- ప్రజల ఆలోచన ధోరణిలో నైతికంగా మార్పును తీసుకురావటం. ఒకవేళ ముహమ్మద్ (స) ప్రవక్తగా ఎన్నికైన ప్రారంభ దినాల్లోనే మద్య నిషేధ చట్టం తీసుకొస్తే అప్పుడు కూడా అమెరికాలో జరిగిన పరిణామాల్లాంటివే సంభవించి ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ఆ చట్టం ప్రారంభంలోనే ముగిసిపోయి ఉండేదేమో! అందుకే ఆ పదమూడేళ్ళ కాలంలో నిషా స్థితిలో ఉండగా నమాజ్ దరిదాపులకు వెళ్లొద్దు (4:43) అని, మద్యపానం వల్ల లాభం కంటే కీడే ఎక్కువగా ఉంది (2:219) అని పూర్తి స్థాయిలో ఖండిచకపోయినా అది దేవునికి అయిష్టమైన విషయంగా తెలియజేస్తూ ప్రజల ఆలోచనలో మార్పు అన్నది వచ్చాక, పూర్తి స్థాయిలో మద్య నిషేధ చట్టం తేవటం జరిగింది (5:90). అది త్రాగటానికి, అమ్మకానికి వీలు లేదన్నప్పుడు ప్రజలు మనస్ఫూర్తిగా ఆ చట్టాన్ని గౌరవించించారు. ఆ తరువాత జరిగింది ఏమిటంటే నిత్యం మద్యం మత్తులో తూగుతూ ఉండే ఆ జాతి పుర వీధుల్లో సారాయి ప్రవహించింది. ఆ విధంగా చరిత్రలో మద్య నిషేధం అన్న చట్టం తీసుకొచ్చి విజయవంతంగా అయిన మరియు దానిని కొనసాగిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క ఇస్లాం మాత్రమే!
చక్కటి పరిష్కారం అల్లాహ్ ధ్యానం
ఎప్పటికి దిగిపోని మత్తు కలిగించే స్వార్థం, అవినీతి వంటి భయంకరమైన పదార్థాల ముందు మద్యం ఎంత? ప్రతి మనిషి తనకు తెలిసో, తెలియకో ధనం మత్తులోనో, అహం మత్తులోనో, పదవి మత్తులోనో తూలిపోతాడు. వాటిని వదిలించుకుని నిజమైన, నిస్వార్థమైన మనిషిగా ముందుకు నడవాలి. దానికి ఫలవంతమైన మార్గం అల్లాహ్ ధ్యానం.
మద్యం, జూదాల ద్వారా షైతాన్ మీమధ్య విరోధం, విద్వేష బీజాలు నాటి మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం, ప్రార్థనల నుండి నిరోధించగోరుతున్నాడు. కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి. దైవాజ్ఞలను, ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం (మీకే నష్టం), ఆదేశాన్ని యధాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. (అల్-మాయిదా : 91-92)
మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపజేసే ప్రక్రియ- అల్లాహ్ ధ్యానం. ఆందోళన, అలజడి లేని మనసును సాకారం చేసుకోవడానికి అల్లాహ్ ధ్యాన ప్రక్రియ ఉపకరిస్తుంది. సహజమైన ఆనంద స్థితిని ఆస్వాదించడానికి అల్లాహ్ ద్యాన మార్గం శ్రేష్టమైంది. వర్తమానంలో ఎలా జీవించాలో, అల్లాహ్ ప్రసాదించిన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అల్లాహ్ ధ్యానం నేర్పిస్తుంది. 'అల్లాహ్ జిక్ర్ ' అంటే అత్యున్నతమైన తాదాత్మ్య స్థితి. ప్రగాఢమైన అనుభూతి. ఎవరిని వారు ఉద్దరించుకోవడానికి ఉపయోగపడే కరదీపిక.
మనసు మర్కటం లాంటిది. నిరంతరం సంచరిస్తుంది. కళ్లెంలేని గుర్రంలా పరిగెడుతుంది. తెగిన గాలిపటమై స్వేచ్ఛా విహారం చేస్తుంది. అంతులేని ఆలోచనలతో, అంతుచిక్కని ఆవేదనలతో సతమతమవుతుంటుంది. అలాంటి సంచలితమైన మనసును ఒడిసిపట్టడానికి ధ్యానసాధన చేయాలి. మనసును పవిత్రం చేసి, పరిశుద్ధంగా ఆవిష్కరించేదే- ధ్యానం! అనిశ్చితికి, ఆశలకు దూరంగా వెళ్తూ, ప్రతి క్షణాన్ని లోతుగా అనుభూతి చెందడానికి ధ్యానం అపురూప మాధ్యమం. ధ్యానం ద్వారా మన శరీరమే శక్తి కేంద్రంగా భాసిస్తుంది.
అంతర్గత శక్తులన్నీ ఏకీకృతమై విలసిల్లుతాయి. శ్వాస మీద ధ్యాసను నిలపడం ద్వారా ధ్యానం సాకారమవుతుంది. గాఢమైన విశ్రాంతి స్థితిని ఆవిష్కరింపజేసుకోవడానికి ధ్యాన ప్రక్రియ ఆలంబనగా నిలుస్తుంది.
అనారోగ్యం లేని దేహం, ఒత్తిడి లేని మనసు, ప్రశాంత జీవన సంవిధానాల్ని అందరూ అభిలషిస్తారు. ఆ అభీష్టం నెరవేరాలంటే ముందు ఎవరిని వారు సంస్కరించుకోవాలి. అంతర్ముఖంగా, లోలోనికి చూస్తూ, అంతర్వాణిని వినగలగాలి. ఆంతరంగికమైన వెలుగును దర్శించాలి. సమాజం పట్ల ప్రేమాస్పద భావాల్ని పెంపొందించుకోవాలి. ఇలాంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం అద్భుత ఉపకరణం. ధ్యానం చేసే కొద్దీ జ్ఞానం ఉద్దీపన చెందుతుంది. జ్ఞానం వృద్ధి చెందితే, ఆత్మశక్తి బలోపేతమవుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనిషి ఇహపరాల విజయ కేతనాన్ని ఎగురవేయవచ్చు.
Subscribe to:
Comments (Atom)




