Thursday, April 9, 2026
ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ (స) వారి అభిమానులమవుదాం రండి!
అందం ఆదర్శమైతే ఆయనలా ఉంటుంది. కారుణ్యం కురులు విప్పితే ఆయనలా ఉంటుంది. నిజాయితీ నిండు వస్త్రాలు ధరిస్తే ఆయనలా ఉంటుంది.ధైర్యం ప్రభాకరునిలా ప్రకాశిస్తే ఆయనలా ఉంటుంది. ప్రేమ పండు వెన్నెలయి కురిస్తే ఆయనలా ఉంటుంది. క్షమ క్షీర సాగరమయి ఉప్పొంగితే ఆయనలా ఉంటుంది. దయ దివ్య దీపమై వేల కోట్ల దీపాలను వెలిగిస్తే ఆయనలా ఉంటుంది. మాట రాతి శాసనంలా మారి మానవ జగత్తునే మహాద్భుతంగా మార్చితే ఆయనలా ఉంటుంది. శిక్ష సంపూర్ణ సుశిక్షణగా రూపాంతరం చెందితే ఆయనలా ఉంటుంది. మమతానురాగం మెరులా మెరి సి వానై కుండపోతగా వర్షిస్తే ఆయనలా ఉంటుంది.
విలువలకు నిండు వలువలు ధరింపజేసి అద్వితీయ వ్యక్తిత్వం ఆయనది. కఠినాత్ముల్లో కరుణామృతాన్ని నింపిన నిరుపమాన నైపుణ్యం ఆయనది. కుఫ్ర్ కటిక చీకట్లను పటాపంచలు చేసి తౌహీద్ వెలుగుల్ని విశ్వమంతా వ్యాపింపజేసిన చరిత్ర ఆయనది. దాసులోని, తోటి దాసుల దాస్యం నుండి ముక్తిని కలిగించి వారిని నిజ దైవానికి దాసులుగా మలచిన ఘనత ఆయనది. మృగ మనుషుల్ని మానవ మహోపకారులుగా తీర్చిదిద్దిన గొప్ప నేర్పరి ఆయన. గొర్రెల కాపరుల్ని గుణ శ్రేణ గణంగా మార్చి మానవుల ధన, మాన, ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడే గొప్ప మానవతా కాపరులుగా మలచిన మహత్తు ఆయనది. తండ్రి మరణానంతరం సవితి తల్లితో సరసాలాడే సర్పాలు నిండిన సమాజాన్ని - తల్లి పాదాల క్రింద స్వర్గముంది అని గుర్చించేలా సద్బోధ చేసి సత్సమాజంగా తీర్చిదిద్దిన తర్ఫీదు ఆయనది.
కఠినమైన పనులు చేసి కాయలు కాసిన కార్మిక సోదరుల చేతులను ముద్దాడి, కార్మిక వర్గానికే కీర్తి కిరీటాన్ని తొడిగించి, చెమట తడి ఆరక ముందే శ్రామికుని శ్రమ ఫలితం- కూలి చెల్లించాలని పర్ఫానా జారీ చేసిన విశ్వ కార్మిక శ్రేయోభిలాషి ఆయన . తరతరాలుగా , యుగయుగాలుగా అన్యాయమై పోతున్న అబలలకు న్యాయం చేసిన గొప్ప తీర్పరి ఆయన. సతినే పతి చితిపై పేర్చి మంటలు పెట్టే పశుకృతిని ప్రక్షాళించి, పడతి పరలోక మోక్షానికి సాధనం అని ఘంటాపథంగా ప్రకటించిన ధీశాలి ఆయన. అలాంటి ఉన్నత వ్యక్తిని ప్రేమించడం, ఆయనచే ప్రేమించ బడటం... దీనికి మించిన భాగ్యం మరొకటి లేదు. ఉండబోదు కూడా. మరి అయన యెడల మనకున్న ప్రేమ ఎంత నిజమైనది అని మనకు ఎలా తెలుస్తుంది? అంటే ... ఆ పవిత్ర ప్రేమకు ఆరు లక్షణాలు.
1) ప్రవక్త ﷺ గారి సున్నత్‌ను మరియు మార్గదర్శకత్వాన్ని అనుసరించడం
అల్లాహ్ తలా ఖురాన్‌లో ఇలా సెలవిచ్చాడు: "ప్రవక్త మీకు దేనిని ఇచ్చారో దానిని తీసుకోండి, మరియు ఆయన దేనిని వారించారో (నిరోధించారో) దాని నుండి విరమించుకోండి." (సూరహ్ అల్-హషర్: 7)
అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా అన్నారు: "ఎవరు నన్ను అనుసరిస్తారో వారు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే, ఎవరు నా మాటను ధిక్కరిస్తారో వారు అల్లాహ్‌ను ధిక్కరించినట్లే." (బుఖారీ & ముస్లిం)
అనుసరణ మరియు ఆదర్శం:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఓ ప్రవక్త! వారితో ఇలా అను: 'ఒకవేళ మీరు అల్లాహ్‌ను ప్రేమిస్తున్నట్లయితే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు'." (ఆల్ ఇమ్రాన్: 31)
ప్రపంచంలోని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం:
దైవప్రవక్త (సల్లం) విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా ఎంతో ప్రియమైనవాడు. దైవప్రవక్త భార్యలు వారికి మాతృమూర్తుల్లాంటివారు. (అల్-అహ్జాబ్: 6)
2) ప్రవక్త ﷺ గారి జీవితాన్ని ఎక్కువగా స్మరించడం మరియు వారిని చూడాలని ఆశించడం
ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ (రహ్మ) ఇలా అన్నారు: "ఒక దాసుడు తన ప్రియతముని (ప్రవక్తను) ఎంత ఎక్కువగా స్మరిస్తాడో, వారి గొప్పతనాన్ని మనసులో స్థిర పరచుకుంటాడో, అంతగా ఆయనపై ప్రేమ మరియు వారిని చూడాలనే తపన పెరుగుతుంది."
సహీహ్ ముస్లిం హదీసు ప్రకారం: "నా తర్వాత వచ్చే నా ఉమ్మత్‌లో నన్ను అమితంగా ప్రేమించే వారు ఎవరంటే—తమ కుటుంబం మరియు ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకొని అయినా నన్ను ఒక్కసారి చూడాలని కోరుకునే వారు." అని ఉంది.
దరూద్ మరియు సలాం పంపడం: "నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన (దూతలు ప్రవక్తపై దరూద్ పంపుతారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్ మరియు సలాం పంపండి." (అల్-అహ్జాబ్: 56)
పిల్లలకు ప్రవక్త ﷺ ప్రేమను నేర్పడం: అలీ బిన్ హుసైన్ (రజి) ఇలా అన్నారు: "మేము ప్రవక్త ﷺ గారి యుద్ధ గాథలను (మగాజి), ఖురాన్ సూరాలను నేర్చుకున్నట్లుగా నేర్చుకునేవారం."
3) ఖుర్ఆన్ నేర్చుకోవడం మరియు దాని ప్రకారం నడుచుకోవడం
ఖుర్ఆన్ పారాయణం చేయమని అల్లాహ్ ప్రవక్తను ఆదేశించాడు. ప్రవక్త ﷺ నిలబడి ఉన్నా, కూర్చున్నా, పడుకున్నా ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఆయన ఇతరుల నుండి ఖుర్ఆన్ వినడానికి ఇష్టపడేవారు. ఇబ్న్ మసూద్ (రజి) ఖుర్ఆన్ పఠిస్తుంటే ప్రవక్త ﷺ కళ్ళు చెమర్చేవి. ఆయన ఖుర్ఆన్ను మధురమైన స్వరంతో పఠించేవారు మరియు మంచి స్వరంతో చదివేవారిని మెచ్చుకునేవారు.
ప్రవక్త ﷺ గుణగణాలు: ఆయిషా (రజి)ని ప్రవక్త గారి స్వభావం గురించి అడిగినప్పుడు, ఆమె "ఆయన సద్గుణాల దర్పణమే ఖుర్ఆన్" అని సమాధానం ఇచ్చారు.
4) ప్రవక్త ﷺ ప్రేమించిన వారిని ప్రేమించడం, ఆయన ద్వేషించిన వారిని ద్వేషించడం
ఇది ఈమాన్ (విశ్వాసం) యొక్క బలమైన పునాది. "ఎవరు అలీని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లే." అన్నారు ప్రవక్త (స). "ఎవరు హసన్ మరియు హుసైన్‌లను ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లే." అన్నారు ప్రవక్త (స). సహాబాలను, ప్రవక్త కుటుంబీకులను, అన్సారీలను ప్రేమించడం ఈమాన్‌కు సంకేతం అని ఆయన సెలవిచ్చారు.
5) అతిశయోక్తి పట్ల జాగ్రత్త వహించడం
ప్రవక్త ﷺ గారిని అల్లాహ్ ప్రసాదించిన స్థానం కంటే ఎక్కువగా పెంచకూడదు. ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు: "క్రైస్తవులు మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం)ను అమితంగా పొగిడినట్లు మీరు నన్ను పొగడకండి. నేను కేవలం అల్లాహ్ దాసుడిని. కాబట్టి నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని పిలవండి." (బుఖారీ & ముస్లిం)
6) బిదఅత్ (కొత్త పోకడలు) మరియు కోరికల పట్ల హెచ్చరిక
ప్రవక్త ﷺ పట్ల ప్రేమను వ్యక్తం చేసే పేరుతో ధర్మంలో లేని కొత్త పద్ధతులను (ఉదాహరణకు పుట్టినరోజు వేడుకలు మొదలైనవి) ప్రవేశపెట్టకూడదు. నిజమైన ప్రేమ అనుసరణలో ఉంది, ఆచారాలలో కాదు.
అబూ బకర్ (రజి) అన్నారు: "నేను అనుసరించేవాడిని (ముత్తబి) మాత్రమే, కొత్తవి సృష్టించేవాడిని (ముబ్తది) కాదు."
ఇబ్న్ మసూద్ (రజి) అన్నారు: "సున్నత్‌ను అనుసరించండి, కొత్తవి సృష్టించకండి, అది మీకు సరిపోతుంది."
ప్రయోజనాలు
అల్లాహ్ ప్రేమ మరియు క్షమాపణ: ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు.
మార్గదర్శకత్వం (హిదాయత్): ఆయనకు విధేయత చూపడం ద్వారానే సన్మార్గం లభిస్తుంది.
స్వర్గం: పరలోకంలో మనిషి తాను ప్రేమించిన వారితోనే ఉంటాడు.
శిక్ష నుండి రక్షణ: ప్రవక్త ﷺ మార్గంలో ఉన్నంత కాలం అల్లాహ్ శిక్ష నుండి రక్షణ ఉంటుంది.
విశ్వాస మాధుర్యం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అందరికంటే ప్రియమైన వారైనప్పుడు విశ్వాసంలో మాధుర్యం లభిస్తుంది.
ప్రవక్త సాక్ష్యం: ప్రవక్త ﷺ తన ఉమ్మత్‌లోని ప్రేమికుల గురించి గొప్పగా చెప్పారు.
సిఫారసు (షఫాఅత్): పరలోకంలో ప్రవక్త ﷺ గారి సిఫారసు లభిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు