Friday, November 10, 2023

زندگی کے رنگ امنگوں کےسنگ

Monday, November 6, 2023

రక్తానుబంధం రక్షానుబంధంగా మారాలంటే…

రక్తానుబంధం రక్షానుబంధంగా మారాలంటే…

శుభకరుడు, గొప్ప గుణగనుడు, కరుణఘణఘనుడు అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు:

మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. అదేప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. తిరిగి వారిరువురి నుండి కోటానుకోట్ల మంది స్త్రీపురుషుల్ని ప్రపంచంలో విస్తరింపజేశాడు. మీరు ఒకరిద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి దేవుని పేరును ఒక సాధనంగా చేసుకుంటారు. అలాంటి దేవునికి భయపడండి. రక్త సంబంధీకులతో మీకు ఏర్పడివున్న సహజ బాంధవ్యాన్ని తెంచకండి. అల్లాహ్  మీ చర్యల్ని గమనిస్తు న్నాడన్న సంగతి మరచిపోకండి. (సూరతున్ నిసా: 1)

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

బంధుత్వాలు బహు భారమైన రోజులివి!  అన్నదమ్ములు, తండ్రితనయులు ..అన్ని బంధుత్వాలు, రక్త సంభంధాలు గాలిలో కొట్టుకు పోతున్నాయి!! ఆస్తి పాస్తుల పేర్లతో ,కలహాలతో..రక్తపాతాన్ని.. చవి చూస్తున్నాయి!! ఒకే రక్తం –  ప్రేమకు బదులు ద్వేషాన్నే రగిలిస్తున్నాయి..!! తీపి చుట్టరికాలు చేదు గుళికలై సహించరానివిగా పరిణమిస్తున్నాయి!! పలకరించుకోవడం..గగనమై..కలహించుకునడం.. నిత్య గుణమైంది.. బంధువులే  పీక్కు తినే రాబందువులు..అయిన కాలమిది!!

సమాచార, సాంకేతిక విప్ల వం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గదిగా మార్చేసింది. దేశవిదేశాల మధ్య గల వేల మైళ్ల దూరాన్ని చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయినా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరుగుతున్నా యి. మానవ సంబంధాలు మెరుగవుతూ కన్పించినా కుటుంబ సంబంధాలు కుంటు పడుతున్నాయి. ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు. విత్తునాటి చెట్టు పెంచితే… చెట్టు పెరిగి పళ్ళు పంచితే… తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మినట్టే… నేడు కన్నవారి యెడల వ్యవహరాయించడం జరుగుతుంది.  ఆకుచాటు పిందె ముద్దు.  తల్లిచాటు బిడ్డ ముద్దు.  బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు.  ఉగ్గుపోసి ఊసు నేర్పితే… చేయిబట్టి నడక నేర్పితే… పరుగు తీసి పారిపోయే ..  చేయిమార్చి చిందులేసే.. కర్కశులైన కొడుకులను కూతుళ్లను ఏమనాలి?

బంధువులు మూడు రకాలు

1) ఎవరు ఎలా ఉన్నా తాము మాత్రం అందరితో  మంచిగా ఉంటారు.

2) ఎదుటివారు బాగుంటే వీరూ బాగుంటారు. హానీ అయితే చేయరు.

3) పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా అందరి వెనకాల  గోతులు త్రవ్వుతూనే ఉంటారు. వీళ్ళను బంధువులు అనడం కన్నా రాబంధువులు అనడం సబబేమో.  చిన్న పెద్ద ప్రతి విషయానికి పొడుచుకు తింటూ ఉంటారు.

బంధువులెవరయినా అనుచితంగా ప్రవర్తిస్తూ బంధుత్వాలు తెగతెంపులకు పాల్పడినప్పటికీ బంధుత్వ హక్కులను నిర్వర్తించటంలోగాని, వారితో సత్సంబంధాలు పెట్టుకోవటంలోగాని తమ తరపునుంచి ఎలాంటి లోటూ రానివ్వకూడదు. ‘బంధుప్రేమ’ అంటే ఇదే. ఇస్లామీయ షరీఅత్లో బంధుప్రేమకు ఎంతో ప్రాముఖ్యముంది. బంధువుల పట్ల మంచిగా మెలగాలని ఇస్లాం తాకీదు చేస్తోంది. తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు ఇరువర్గాలవారూ బంధువుల క్రిందికే వస్తారు. వారందరితోనూ సద్భావంతో మెలగటం చాలా అవసరం.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు : దేవుడు సమస్త సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత ‘బంధుత్వం’ లేచి నిలబడి “(దేవా!) నేను బంధుత్వాల తెగత్రెంపుల బారినుండి నీ శరణు కోరుకుంటున్నాను” అని అంది. దానికి “అయితే నీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాడితో నేనూ సత్సంబంధాలు పెట్టుకుంటాను. నీతో తెగ త్రెంపులు చేసుకున్నవాడితో నేనూ తెగతెంపులు చేసుకుంటాను, ఇది నీకిష్టమే కదా!” అని అడిగాడు దేవుడు. దానికి బంధుత్వం “ఇష్టమే ప్రభూ!” అని అంది. అప్పుడు అల్లాహ్  “సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని అన్నాడు.

ఈ విషయం గురించి మీకు ప్రమాణం కావాలనుకుంటే దివ్య ఖుర్ఆన్లోని ఈ వాక్యాలు చదువుకోండి. “ఒకవేళ మీరు విముఖులైపోతే భూమి పై ఊ తేడా : క్రమము పేరు ఆని మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం బంధుత్వాల తెగత్రెంపులు చేసుకుంటారు. అల్లాహ్ శపించింది, అంధులుగానూ, బధిరులుగానూ చేసింది ఇలాంటి వారినే.” (ముహ మ్మద్ : 22, 23) (బుఖారీ – ముస్లిం)

బంధం బల పడితేనే అందం

హజ్రత్ అబూ హురైరా (రజి) గారి  కథనం – దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ్ ను,  అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన (ఇంటికొచ్చిన అతిథిని గౌరవించాలి. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అల్లాహ్ ను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనం వహిం చాలి.” (బుఖారీ – ముస్లిం)

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

కుమారులు లేక కుమార్తెలు చూపే సత్ప్రవర్తనకు తండ్రికన్నా తల్లి మూడు రెట్లు ఎక్కువ హక్కుదారు అవుతుందని తెలుస్తోంది. దీనికి స్త్రీ శారీరక బలహీనత ఒక కారణం కావచ్చు. ఈ శారీరక బలహీనత కారణంగా తల్లి తన సంతానంపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. రెండో విషయం ఏమిటంటే తల్లి తన సంతానం కోసం మూడు దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. ఈ కష్టాల్లో తండ్రి ఏ విధంగానూ పాలుపంచుకోడు. 1. తొమ్మిది మాసాలపాటు తల్లి బిడ్డను తన కడుపున మోస్తుంది. 2. జీవన్మరణాల సమస్య వంటి ప్రసవవేదనను భరిస్తుంది. 3. ప్రసవించిన తరువాత రెండు సంవత్సరాల పాటు బిడ్డకు పాలిస్తుంది. ఈ కష్టాలవల్ల రాత్రిళ్ళు ఆమె నిద్రపాడవుతుంది. ఆమె సౌందర్యం కళావిహీనమై పోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ఆమెకు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎడతెరిపి లేకుండా ఇన్ని కష్టాలు, బాధలు భరించాల్సి వస్తుంది. కనుకనే ఇస్లాం ధర్మం తల్లికి ఎంతో ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది.

“నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతోవ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు నినమ్రులై ఉండండి. ఇంకా, “ప్రభూ! బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు, నీవు వారిపై కరుణ జూపు” అంటూ ప్రార్థిస్తూ ఉండండ.”         (అల్ ఇస్రా: 33, 34)

ఇంకొకచోట ఇలా అన్నాడు:

“మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి) “నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లి దండ్రులకు కృతజ్ఞతలు తెలుపు (అని ఉపదేశించాము.)” (లుఖ్మాన్ : 14)

హజ్రత్ అబూ హురైరా (రజి) గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?” అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన ‘నీ తల్లి’ అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. అప్పుడు శ్రీప వ కూడా “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (స). ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ఆ తరువాత ఎవరు?” అని. అప్పుడు ఆయన ‘నీ తండ్రి’ అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: “దైవ ప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని ఆ వ్యక్తి అడగ్గా “నీ తల్లి. ఆ తరువాత నీ తల్లే. ఆ తరువాత కూడా నీ తల్లే. ఆ తరువాత నీ తండ్రి. తరువాత నీకు ఎవరెంత దగ్గరి వారయితే వారు” ఆయన చెప్పారు.

రక్తసంబంధీకులు ఎవరు?

దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులే ఒకరి కొకరు ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్  ప్రతి విషయాన్నీ ఎరిగినవాడు.(అన్ఫాల్ : 74-75)

రక్త సంబంధం అంటే, తల్లి వైపు మరియు తండ్రి వైపు బంధువులు. అంటే వారి తండ్రులు, తల్లులు, తాతలు మరియు అమ్మమ్మలు మొదలయినవారు.

కొడుకులు, కూతుళ్లు  వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు మరియు వారి పిల్లలు,  వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

మామలు, అత్తలు, మామలు, మేనత్తలు మరియు వారి పిల్లలు మొదలయినవారు.

బంధాన్ని బలపర్చడం ఎలా?

  1. దూరమయిన వారికి దగ్గరవ్వడం:

బంధువులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న నెపంతో తాము కూడా వారితో బంధుత్వాన్ని త్రెంచుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఇతర బంధువులు తమకు అపకారం తలపెట్టినప్పటికీ తాము మాత్రం వారితో ఉపకార భావంతోనే మెలగాలని తాకీదు చేయబడింది. బంధువులతో ఎల్లప్పుడూ మంచిగా మెలిగేవాడు దేవుని దృష్టిలో అత్యంత గౌరవనీయుడిగా, ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తి కోసం దైవం ఆకాశాల నుండి ప్రత్యేక సహాయకులను పంపుతాడు.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) వద్దకు వచ్చి, “దైవప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారితో సత్సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం నాతో తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా మెలగుతుంటే వారేమో నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారిపట్ల ఉదారవైఖరిని అనుసరిస్తుంటే వారు మాత్రం నాపట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు” అని దైవప్రవక్తకు తన గోడు వినిపించుకున్నాడు. అతని మాటలు విని ఆయన, ‘నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు వారి నోళ్ళల్లో వేడిబూడిదను పోస్తున్నావనుకో. నువ్వు మాత్రం వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో మెలగుతున్నంతకాలం దేవుని తరఫు నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయ కుడు నీ వెంట ఉంటాడు” అని అన్నారు. (ముస్లిం)

హెచ్చరిక: దీనికి భిన్నంగా బంధుత్వ తెగతెంపులకు పాల్పడేవాడు దేవుని దృష్టిలో అత్యంత నీచుడిగా పరిగణించబడతాడు. అతని పర్యవసానం కూడా కాలుతున్న బూడిద తింటున్న వాడి మాదిరిగా అత్యంత హీనంగా ఉంటుంది. దైవప్రవక్త (సల్లం) పై హదీసులో  ఇచ్చిన ఈ ఉదాహరణలోని ఆంతర్యం ఏమిటంటే, కాలుతున్న బూడిద తింటున్నవాడికి నోరు కాలినట్లే బంధుత్వాల తెగ త్రెంపులకు పాల్పడుతున్నవాడి పాపం కూడా పండుతూ ఉంటుంది. అయితే వారిపట్ల మంచిగా మెలగుతున్న వ్యక్తి మాత్రం నిందార్హుడు కాడు. అతని హక్కుల్ని కాలరాసి, అతణ్ణి బాధపెడుతున్నందుకు బంధువిచ్ఛిత్తికి పాల్పడిన వారే మహాపరాధులుగా పరిగణించ బడతారు

2) ద్వేషించిన వారిని ప్రేమించడం:

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర (రజి) గారే చేసిన కథనం ప్రకారం – దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదులుగా ఉపకారం చేసేవాడు (నిజ మైన) బంధుప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగత్రెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే (సిసలైన) బంధు ప్రియుడు. (బుఖారీ)

బంధుప్రేమ బంధువుల మధ్య ఎలాంటి సద్భావనను, సదభిప్రాయాన్ని కోరుకుంటుందో ఈ హదీసు వివరిస్తోంది. తమకు ఉపకారం చేసే బంధువులకు ఉపకారం చేయడంలో గొప్పేముంది? అది బంధుప్రేమ కాదు. ఒక ఉపకారికి ఉపకారం చేసినట్లవుతుంది అంతే! తోటి బంధువులెవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమతో బంధుత్వాన్ని త్రెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తాము మాత్రం విశాల హృదయంతో వారిని మన్నిస్తూ, వారి కీడుకు బదులుగా మేలు చేసి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగించడానికి ముందుకు రావాలి. అసలు సిసలైన బంధుప్రేమ అంటే ఇది! ఇస్లాం కోరేది కూడా ఇలాంటి బంధుప్రేమనే! ఇతరులు మనల్ని నీచంగా చూసినప్పుడు మనం వారిపట్ల సద్భావంతో మెలగటానికి అహం అడొస్తుంది. కాని ఆ అహంభావాన్ని అణచుకొని షరీఅత్ ఆదేశాల్ని పాటించాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మరోవైపు పరిపూర్ణ విశ్వాసాన్ని పొందాలంటే మనసులోని అహంభావాన్ని అణచుకోక తప్పదు.

3)బంధువుల యెడల దాతృత్వం

దానధర్మాలు చేసినప్పుడు ముందుగా తమ సన్నిహిత బంధువులను దృష్టిలో పెట్టుకోవాలి. వారు అవసరాల్లో ఉన్నారనుకుంటే వారికే ఇవ్వాలి. ఆ తరువాత కూడా సదఖా సొమ్ము మిగిలి ఉంటే దానిని ఇతరులకు కూడా దానం చేయవచ్చు. దీనికి భిన్నంగా ఇతరులను సుఖపెట్టి సొంత బంధువులనే విస్మరించటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు.

హజ్రత్ అనస్ (రజి) గారు  చేసిన కథనం : మదీనా నగరంలోని అన్సార్ ముస్లింలందరిలో హజ్రత్ అబూ తల్షా (రజి) గొప్ప ధనికులు. ఆయనకు అనేక ఖర్జూర తోటలుండేవి. ఆ తోటల్లో ఆయనకు ‘బైరహా’ తోట అంటే ఎంతో యిష్టం. అది మస్జిద్ నబవీకి ముందు భాగంలో ఉండేది. దైవప్రవక్త (స) తరచూ ఆ తోటలోకి వెళుతుండేవారు. అక్కడ దొరికే మంచినీళ్ళు త్రాగేవారు. ఆ కాలంలోనే –

“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు” అనే దైవసూక్తి (ఆలి ఇమ్రాన్ : 92)  అవతరించింది.

ఈ సూక్తి అవతరించినప్పుడు  హజ్రత్ అబూ తల్హా (రజి) దైవప్రవక్త ముందు ఇలా ప్రకటించారు: “దైవప్రవక్తా! మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (తన మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరని దేవుడంటున్నాడు. అలాగైతే నాకున్న సంపద మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత ప్రీతికర మైనది. దాన్ని నేను దైవమార్గంలో దానం చేస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా పరలోకంలోనూ దాని పుణ్యం నాకోసం నిల్వచేసి ఉంచ బడుతుందని ఆశిస్తున్నాను. దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మీరు దీనిని వినియోగించండి.” ఆయన మాటలు విని దైవప్రవక్త (స) “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపదే. నిజంగా ఇదెంతో లాభదాయక మైన సంపద. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. అయితే నువ్వు ఈ సంపదను (అభాగ్యులైన) నీ బంధువు లకు పంచిపెడితే సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి హజ్రత్ అబూ తల్హా (రజి) “మీరు చెప్పినట్లే చేస్తాను దైవప్రవక్తా!” అని అన్నారు. (ఆ తరువాత దైవప్రవక్త సలహాననుసరించి) ఆయన ఆ తోటను తన బంధువులకు, చిన్నాన్న, పెద్దనాన్న కుమారులకు పంచివేశారు.’ (బుఖారీ – ముస్లిం)

4) వారి వీపు వెనకాల వారి కోసం  దుఆ చేయడం:

దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు:  “తన ముందర లేని  తన సోదరుడి కోసం ఒక ముస్లిం చేసిన దుఆ స్వీకరించబడుతుంది.  అతనిపై ఒక ప్రతినిధి ధైవదూత ఉంటాడు; అతను తన సోదరుడికి మంచి కోసం ప్రార్థించినప్పుడల్లా, ప్రతినిధి దైవ దూత  ఆమీన్  అంటాడు. మరియు నీ  కోసం కూడా  అని దీవిస్తాడు”.    (ముస్లిం),

5)   పండితుల సలహా

ఇమామ్ అల్-నవవి (రహ్మ) ఇలా అభిప్రాయపడ్డారు:   “బంధుత్వ సంబంధాలను నిలబెట్టడం అనేది  వ్యక్తిని బట్టి ఉండాలి.   – కొని సార్లు దయగా ఉండటం. కొన్నిసార్లు ధన సహాయం  ద్వారా, కొన్నిసార్లు సేవ ద్వారా, మరియు కొన్నిసార్లు సందర్శించడం ద్వారా, ఏవైనా శుభ సందర్భాలు ఉంతే  శుభాకాంక్షలు తెలుపడం ద్వారా.

ఇమామ్ ఖుర్తుబీ ఇలా అభిప్రాయం పడ్డారు;  బల పర్చాల్సిన చేరిన సంబంధాలు రెండు విధాలు. సాధారణమైనవి మరియు నిర్దిష్టమైనవి, 1) సాధారణమైన బంధం : ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరుకోవడం,  పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండటం.  సలహా, సంప్రతింపులు జరపడం.  అందరి యెడల  న్యాయంగా వ్యవహరించడం,  సిఫార్సు చేయడం,  ఇతరుల  హక్కులను నెరవేర్చడం ద్వారా కొనసాగించాలి.

2) నిర్దిష్టమైన బంధం:  ఆర్థికంగా వారిని ఆదుకోవడం,  వారి స్థితిగతులను, మంచీచెబ్బరలను అడిగి తెలుసుకోవడం,   వారి పొరపాటలను,  తప్పులను పెద్ద మనసుతో క్షమించడం.

3) షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహ్మ) ఇలా అన్నారు: చరవాణి ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవడంకూడా బంధుత్వ సంబంధాలను నిలబెట్టుకోవడంలో భాగమే. వీడియో కాలింగ్, చాటింగ్, మెసేజ్  అన్నీ బంధాలను బాల పరచడమే అవుతుంది.

6) మంచిని గురించి ఆదేశించడం

”మన్‌ దల్ల అలా ఖైరిన్‌ ఫలహు క అజ్రి ఫాయిలిహి” – మంచికి మార్గం చూపిన వ్యక్తి మంచి చేసే వ్యక్తి లభించినంత పుణ్యం లభిస్తుంది అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (ముస్లిం)

మంచి చెయడానికి మనం పండితులం కానవసరం లేదు. మంచి మనసున్న మనుషులమయితే చాలు. నిజంగా మంచి చేయాలన్న సద్బుద్ధి కలగడమే గొప్ప విషయం. కాబట్టి   అలాంటి  గొప్ప ఆలోచన వచ్చినప్పుడు గోరంతి ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీయగలదన్న స్ప్రుహతో  మంచి చేసెయ్యాలి.

7) చెడును గురించి వారించడం

హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం : “(ప్రవక్తా!) నీ దగ్గరి బంధువు లను భయపెట్టు” అన్న దివ్య ఖుర్ఆన్ సూక్తి (అష్ షూరా : 214) అవతరించి నప్పుడు దైవప్రవక్త (సల్లం) ఖురైషు లందరినీ పిలిచారు. దాంతో (ఖురైష్ తెగకు చెందిన) సామాన్యులు, ప్రముఖు

లందరూ ఒకచోట సమావేశమయ్యారు. అప్పుడు ఆయన తన తెగవారికి దైవ సందేశాన్ని అందజేస్తూ ఇలా అన్నారు

“ఓ అబ్ద్ షమ్స్ వంశీయులారా! ఓ కాబ్ లుఅయ్యి వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. హాషిం వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. అబ్దుల్ ముత్తలిబ్ వంశీయులారా! మిమ్మల్ని మీరు

నరకాగ్ని బారినుండి రక్షించుకోండి. ఓ ఫాతిమా! నిన్ను నీవు నరకజ్వాలల నుంచి కాపాడుకో. ఎందుకంటే దైవశిక్ష నుండి మిమ్మల్ని కాపాడటానికి నాకు ఎలాంటి అధికారం లేదు. అయితే మీకు నాతో బంధుత్వం ఉంది కనుక (ఇహలోకంలో ఉన్నంతకాలం) బంధుత్వ సంబంధాలను మాత్రం కొనసాగిస్తాను.” (ముస్లిం)

8) బంధాన్ని బలపర్చమని ప్రోత్సహించడం

దైవప్రవక్త (స)  ఇలా ప్రవచించారు:  అల్లాహ్  మరియు ఆయన వదూతలు మరియు భూ ఆకాశ వాసులు, చివరికి రంధ్రంలోని చీమ,సముద్రంలోని  చేప  కూడా – ప్రజలకు  మంచిని బోధించే  గురువును ఆశీర్వదిస్తారు”

9) సంధి కుదర్చడం

సాధారణంగా ప్రజలు జరిపే రహస్య మంతనాలలో ఎలాంటి శ్రేయస్సు ఉండదు. అయితే దానధర్మాలను గురించి రహస్యంగా ఏదైనా హితోపదేశం చేస్తే లేదా మరేదైనా సత్కార్యం చేయడానికో లేక ప్రజల వ్వవహారాలు చక్కదిద్దడానికో ఎవరితో ఏదైనా అంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అది మంచి విషయమే. ఎవరైనా దేవుని ప్రసన్నత కోసం ఇలా చేస్తే మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. (అన్నిసా: 114)

వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు: “ఏది ఏమైనా(భార్యాభర్తల మధ్య) సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది.” (అన్ విసా : 128)

“మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి.” (అల్ అన్ఫాల్ : 1)

ఆయన ఇంకా ఇలా సెలవిస్తున్నాడు: “విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరిం చండి.” (అల్ హుజురాత్ : 10)

ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే (ఉద్దేశ్యంతో వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడేవాడు అబద్ధాలకోరు కాజాలడు. (ఒకరి నుండి మరొకరికి) మంచి మాటలే చేరవేస్తాడు. ఏది చెప్పినా మంచి ఉద్దేశ్యంతోనే చెబుతాడు. అన్నారు ప్రవక్త (స) . (బుఖారీ- ముస్లిం)

ఉమ్మె కుల్సూమ్ అంటున్నారు దైవప్రవక్త (సల్లం) ప్రజలకు మూడు విషయాల్లో తప్ప మరే విషయంలోనూ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్లు నేను వినలేదు. ఆ మూడు విషయాలు ఇవి: యుద్ధంలో, ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే సమయంలో, మనిషి తన భార్యతోగానిభార్య తన భర్తతోగాని (పరస్పరం సంతోషపెట్టే ఉద్దేశ్యంతో) సంభాషించుకున్నప్పుడు. (ముస్లిం)

10) అవిశ్వాస బంధువులతో ఉత్తమంగా మసలుకోవాలి

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) కుమార్తె అస్మా (రజి. అన్ హా) కథనం : దైవప్రవక్త(కు మరియు మక్కా బహు దైవారాధకులకు మధ్య జరిగిన హుదైబియా ఒప్పంద) కాలంలో ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ఉంది. నేను ఆమె వచ్చిన సంగతి దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను (బహుదైవారాధకురాలైన) మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అని అడిగాను. అందుకాయన “అవును, నువ్వు మీ అమ్మ పట్ల (తప్పకుండా) సత్ప్రవర్తనతో మెలగాలి” అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

బంధువులు బహుదైవారాధకులైనా, దైవతిరస్కారులైనా సరే వారితో సత్సంబంధాలు కొనసాగించటంలో మాత్రం ఎలాంటి లోటు రానీయకూడదు.. వారి హక్కుల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. వారికున్న ప్రప్రథమ హక్కు ఏమిటంటే వారికి విశ్వాసాన్ని, సదాచరణను బోధించి పరలోకంలో వారిని నరకాగ్ని బారినుంచి కాపాడాలి.

దైవప్రవక్త (స) మెల్లిగా కాకుండా బిగ్గరగా, “ఫలానా తెగవారు నా మిత్రులు కాజాలరు. అల్లాహ్  మరియు సదాచార సంపన్నులైన విశ్వాసులే నా మిత్రులు. అయితే ఆ తెగవారితో నాకు బంధుత్వముంది. కనుక నేను బంధుత్వ సత్సంబంధాలను మాత్రం తప్పకుండా కొనసాగిస్తాను” అని ప్రకటిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దు ల్లాహ్ అమ్ బిన్ ఆస్ (రజి) తెలియజేశారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

బంధుత్వ బంధాన్ని బలపరిస్తే కలిగే లాభాలు

1) స్వర్గ ప్రాప్తి – నరక ముక్తి

ఒక వ్యక్తి  దైవ ప్రవక్త (స) వారిని  స్వర్గంలో ప్రవేశింపజేసే,  నరకం నుండి దూరంగా ఉంచే ఒక కార్యం గురించి తెలుపమని  అడిగాడు: దానికి ఆయన – మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, షిర్క్ చెయ్యకండి, మరియు నమాజు స్థాపించండి,  జకాత్ చెల్లించండి  మరియు కుటుంబ బంధాలను బలపరచండి అని హితవు పలికారు.(ముస్లిం)

2) విశ్వాసం వికసిస్తుంది

అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరిం చండి.” (అల్ హుజురాత్ : 10)

3) అల్లాహ్ ఆగ్రహానికి దూరమవుతాము, అల్లాహ్ అనుగ్రహానికి దగ్గరవుతాము

బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యత నొక్కి వక్కాణిస్తూ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా సమస్త సృష్టిరాసులను సృష్టించిన తర్వాత ‘బంధుత్వం’ లేచి నిలబడి – ‘(దేవా!) నేను బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నం నుండి నీ శరణు వేడుకుంటున్నాను’ అని విన్నవించుకుంది. దానికి ”అయితే నిన్ను బల పర్చిన వాడిని నేనూ బలపరుస్తాను. నీతో తెగత్రెంపు లు చేసుకున్నవాడితో నేనూ తెగత్రెంపులు చేసుకుంటాను, ఇది నీకు ఇష్టమే కదా!” అని అడిగాడు అల్లాహ్‌. దానికి బంధుత్వం ‘ఇష్టమే ప్రభూ!’ అని అంది. అప్పుడు అల్లాహ్‌ా ”సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని దీవిం చాడు. (ముత్తఫఖున్‌ ఆలైహి)

4) ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల ను కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”. (బుఖారీ)

5) ఉత్తమ స్థితిలో మరణం

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదలను, మంచి స్థితిలో మరణాన్ని  కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”. (మజ్మవుజ్ జవాబుద్)

బంధుత్వ సంబంధాలు బలంగా లేకపోవడానికి కారణాలు

1) బంధుత్వ సంబంధాల  వల్ల  కలిగే పుణ్యాన్ని  మరియు దానిని తెంచడం వల్ల కలిగే నష్టం గురించి తెలియకపోవడం.

2) ధర్మ అవగాహనా రాహిత్యం

3) అహంకారం

4) పూర్వీకుల అంధానుసారణ – అమ్మా నాన్న శత్రుత్వాన్ని సంతానం వారసత్వంగా కొనసాగించడం.

5) చాలా కాలం  వరకు పలుకరించుకోకపోవడం.

6) తరచూ ఒండొకరిని కలిసి యోగక్షేమాలు తెలుసుకోకపోవడం.

7)  తీవ్ర స్థాయిలో కువిమర్శలకు దిగడం, నిందలు వేయడం.

8) పిసినారితనం, పేరాశ

9) ఆవారానికి మించి ఖర్చు చేయడం

10) వారసత్వపు ఆస్తి పంపకంలో జాప్యం వహించడం

11)  ప్రాపంచిక వ్యామోహం

12) ఆత్మ స్తుతి, స్వీయ ప్రశంస

13) భరించే గుణం లేకపోవడం

14) సందర్శించుకునేంత దగ్గరలో లేకపోవడం

15) ముఖ్యమైన విందుల్లో, శుభ కార్యాల్లో  ఆహ్వానించకపోవడం

16) అనవసరమైన సిగ్గు, మోతాదు మించిన మొహమాటం

17) వచ్చిన బంధువుల్ని సరిగా పట్టించుకోకపోవడం

నేటి  మన స్థితి

ఇంట్లో ఉన్న అత్తగారితో సజావుగా నడుచుకో లేని, సరిగ్గా మాట్లాడని కోడలు ఎక్కడో విదే శాల్లో ఉండే ఫ్రెండ్స్‌తో గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకుంటుంది. సమాజ సేవలో ఎంతో మందిని చేరదీసే అత్తగారికి కోడలంటే చిన్న చూపు. చాలా మంది కొత్త పరిచయాల కోసం పడే ఆరాటం, చూపే ఆసక్తి, ఉత్సాహం ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగు పర్చు కోవడాని కి ప్రయత్నించడం లేదు. నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్త సం బంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇంటర్‌నెట్‌లో కలి సిన వ్యక్తుల మధ్య ఉండ టం లేదు. ఆ వ్యక్తు లు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచ యం. వాళ్లు ప్రతక్ష్యం గా కూడా కలిసింది ఉండదు. అయినా వారి మధ్య ఎంతో నమ్మ కం, ఆత్మీయత, ప్రతి బంధం ఇలానే ఉండాలని లేదు. ప్రేమ, నమ్మ కం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిథ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి.
అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండ కూడదని కాదు, ప్రాధాన్యత ముందు తన వారికివ్వాలన్నదే. మనం ఇచ్చే ఆ ప్రాధా న్యత దైవాభీ ష్టం ప్రకారం ఉండాలన్నదే. విశ్వ శక్తి చైతన్య మూర్తి,  ఏడేడు లోకాలకె ఇలవేల్పు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరంతా అల్లాహ్ ను మాత్రమే  ఆరాధించండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకండి. తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి.” (అన్ నిసా : 36)

 

గురువు శిష్యులు అనుబంధం

గురువు  శిష్యులు అనుబంధం




“ప్రభూ! నాకు మరింతజ్ఞానం ప్రసాదించు” అని వేడుకో (తాహా: 114)

జీవితం అనే రంగస్థలంపై ఒక సారి ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేము. చివరి శ్వాశ ఆగెంత వరకు ఆడుతూనే ఉండాల్సిందే. అందునా ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని జీవులం. అలాంటి మనకు ఎంత కాలం జీవించామన్నది కాదు గొప్ప, ఎంత గొప్పగా జీవించామన్నదే గొప్ప అని చేయి పట్టి మరి నడిపించిన జగత్గురువులు ప్రవక్తలు.  ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు  వారే మహర్షులు… ఈ పరంపరలో దైవంచే నియమించబడిన తోలి గురువు ప్రవక్త ఆడం (అ) అయితే, అంతిమ గురువు మహనీయ ముహమ్మద్ (స).   అదే పరంపరను కోనసాగిస్తూ….

 

జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ బృందావనానికి  నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. మానవత్వం పరిమళించే విద్యాకుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది, వారు జాతికి అందిన అమూల్య వరాలుగా, ఆభరణాలుగా పరిఢవిల్లాలని మనస్సు నిండుగా యువతను దీవించే, ప్రజ్వలించే దివ్వె ఉపాధ్యాయుడు!

దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: అల్లాహ్ నన్ను హింసావాదిగా, నియంతగా, నిరంకుశ వాదిగా, పెత్తనం చెలాయించే వానిగా, కర్కశునిగా చేసి పంప లేదు. నిశ్చయంగా అయన నన్ను సౌమ్యునిగా, ఉపాధ్యాయునిగా, నిరాడంబరునిగా, సునిర్మల హృదయునిగా చేసి పంపించాడు. (సహీహ్ ముస్లిం)

కేవలం పుస్తకాలు ఔపోసన పట్టినంత మాత్రాన మనుషులు పండితులు కారు. దైవభీతిపరులే సిసలైన పండితులు. విద్యకొద్దీ వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగినకొలది మనిషిలో భక్తివిశ్వాసాలు పెంపొందాలి.

మానవాళికి  ఆది గురువులు ప్రవక్తలు

విప్లవ ఉద్యమాలను నడిపి మార్పు సాధించినవారు, సంస్కర్తలు ఇలా ఎందరో మనకు చరిత్ర అధ్యయనంలో కానవస్తారు. విభిన్న మత ధర్మాలను బోధించిన వారు ఉన్నారు. నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసిన వారు ఉన్నారు. కాని వారి బోధనలు, వారు సాధించిన విజయాల, ఫలితాలు పరిశీలిస్తే అందులో సమాజ శ్రేయోశుభాలు బహు కొద్దిగా మాత్రమే కానవస్తాయి. ఏదో ఒక జీవన రంగానికి మాత్రమే ఫలితాలు పరిమితమై ఉంటాయి. ఆ ప్రయోజనాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన ధోరణులు కూడా అక్కడ కనబడతాయి. మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా, అన్ని రంగాల్లో సంస్కరించినవారు కేవలం ప్రవక్తలు తప్ప మరెవ్వరూ లేరు. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను సమస్తాన్ని చక్కదిద్దినవారు ప్రవక్తలు మాత్రమే.

హజ్రత్ అబ్దుల్లాహ్‌బిన్ అమ్రూ (రజి) ఉల్లేఖనం ప్రకారం:- ‘ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) మస్జిదె నబవికి వెళ్లినప్పుడు, అక్కడ రెండు బృందాలు విడివిడిగా సమావేశమయ్యాయి. ఒక బృందం… దైవారాధనలో నిమగ్నమై ఉంది. రెండో బృందం నిరక్షరాస్యులకు చదువు చెప్పే పనిలో ఉంది. అది చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇరు బృందాలూ మంచిపని చేస్తున్నాయి. ఒక బృందంలోని సభ్యులు దైవారాధనలో ఉన్నారు. ఇది చాలా మంచిపని. అయితే దైవం తలిస్తే వారి ఆరాధన, వేడుకోళ్లు స్వీకరించవచ్చు, స్వీకరించకపోనూవచ్చు. రెండో బృంద సభ్యులు చేస్తున్న పని మొదటివారి కంటే ఇంకా ఉత్తమమైనది. ఎందుకంటే వీరు తెలియనివారికి జ్ఞానం, వివేకం, విచక్షణ తెలియచేస్తున్నారు. కనుక ఇది ఉత్తమకార్యం. నేనూ ఉపాధ్యాయునిగా, బోధకుడిగానే పంపబడ్డాను’ అని ప్రవచిస్తూ, ప్రవక్త రెండవ బృంద సభ్యులతో కూర్చున్నారు.

ఏ హృయంలోనయితే ధర్మశీలత, దైవభీతి ఉంటుందో అక్కడే ప్రవర్తనలో సౌందర్యం ఉంటుంది. మనుషుల్లో ప్రవర్తన అందంగా ఉన్నప్పుడే కుటుంబ జీవనంలో సామరస్యం ఉంటుంది. సంసారంలో సామరస్యం, సహిష్ణుతలు ఉన్నప్పుడే సమాజంలో క్రమశిక్షణ, గౌరవ భావం ఉంటుంది. సమాజంలో క్రమశిక్షణ, అందరి యెడల గౌరవ భావం ఉన్నప్పుడే దేశం, ప్రదేశంలోనయినా శాంతి పరిఢవిల్లుతుంది. మరే దేశం, ప్రాంతంలోనయితే ఇవన్నీ ప్రోగవుతాయో అది అల్లాహ్‌ కృపానుగ్రహాలకు ఆలవాలమవుతుంది.

ఆవుని చూస్తే సృష్టిలో చులకనగా చూసే గడ్డిపరకలను తిని, సృష్టికి శ్రేష్ఠుడైన వాడిని జీవించడానికి అవసరమైన ద్రవ్యాలను ఇస్తుంది. మనకు అవసరం లేకపోయినా అది వేరే రూపం నుండి సమాజానికి ఉపయోగపడతాయని అవు, గడ్డిని చూస్తే అవగతమవుతుంది. సృష్టిలో ఏది నిరర్థకం కాదు. ప్రతి దానిని  ఒక లక్ష్యంతోనే పుట్టించాడు అల్లాహ్. అవి గగన భువనాలు కావచ్చు, గడ్డి పరకలు – దానికన్నా అల్పమైనవీ కావచ్చు. ప్రతి దానికి ఓ ప్రయోజనం తప్పకుండా ఉంటుంది, ఉంది.

శిష్యులకు సద్గురువులు చేసే బోధలు కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. కొందరు అనుగ్రహభాషణాలతో, మరికొందరు ఆచరణాత్మకమైన పద్ధతుల్లో బోధిస్తారు. కోపాన్ని దిగమింగాలి. దుఃఖాన్ని అధిగమించాలి. మౌనాన్ని అనుభవించాలి. నిశ్చల ధ్యాన ఫలితాన్ని అందుకోవాలి.  జీవితంలో ఓ గురువు కష్టాన్ని దూరం చేస్తాడు. ఓ గురువు చిరకాల కోరిక సాధనను సులువుగా మారుస్తాడు. ఓ గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు. ఓ గురువు అపరిమిత జ్ఙానాన్ని అనుగ్రహించేస్తాడు.

హజ్రత్ అబూ ఉమామా (రజి), కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: మీలో అందరి కన్నా అల్పునిమీద నాకెంత విశిష్ఠత ఉందో- ఒక జ్ఞానికి మరో ఆరాధకుడి మీద అంత విశిష్ఠత ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ప్రజలకు మంచిని బోధించే వారి మీద దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇంకా దైవదూతలు, భూమ్యాకాశాల్లో ఉన్నవారు, ఆఖరికి చీమలు తాముండే రంధ్రంలో నుండి, చేపలు (నీళ్ళలో నుండి) వారి మీద దైవ కారుణ్యం వర్షించాలని ప్రార్థిస్తూ ఉంటారు. (తిర్మిజీ-హసన్)

సమాజంలో పిల్లలు అధిక మాత్రులు! వీరి ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయుడు ‘వజ్రాన్ని సాన బెట్టే ఒక సాధనం’ కావాలి! మారుతున్న పరిస్థితుల కనుగుణంగా, తగిన నూతన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో, తాను నిరంతర విద్యార్థిగా  ఉంటూ, సృజనాత్మక పద్ధతులతో యువతకు మార్గదర్శనం చేస్తూ, దేశ భవితను తీర్చి దిద్దాల్సిన గురువు బాధ్యత నేడు మరింత బృహత్తరమైనదని చెప్పక తప్పదు. విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి స్వావలంభనకు నెలవు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉత్తమ గురువులు ఉన్నత భావాలుగల శిష్యులనే కాదు, చుట్టూ ఉండే సమాజాన్ని ఉత్కృష్టంగా నిర్మించగలిగిన నాడే జాతి జీవనం మహోన్నతంగా సాగుతుంది.

భయాలను తొలగించాలి. ఉత్తములుగా మార్చాలి

ఎవరు ఔనన్నా, కాదన్నా ఒక్కటి మాత్రం వాస్తవం. గతంలో గురువులకు సమాజంలో దక్కిన గౌరవ మర్యాదలు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు దక్కడం లేదు. ఇది కొంతమందికి చేదుగా అనిపించవచ్చేమో కానీ, కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం ఇదే. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. విధి నిర్వహణలో ఉపాధ్యాయుల్లో అంకితభావం మరింత పెరగాల్సి ఉంది. కేవలం నైన్ టు ఫైవ్ పనిచేస్తే సరిపోదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువుదే. సకాలంలో సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధపరచడం, మంచి రిజల్ట్స్ సాధించడం గురువుల బాధ్యతల్లో ఒకటి మాత్రమే. కానీ, ప్రస్తుతం అవే సర్వస్వంగా మారిపోవడం దురదృష్టకరం. ఒక రకంగా ఉపాధ్యాయుడి బాధ్యతలను కుదించడమే ఇది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాల్సిందే. కానీ, విద్యతోపాటు చాలా అంశాలపై ముఖ్యంగా, భావి జీవితంలో విద్యార్థులు ఎదుర్కొబోయే సవాళ్ళను చెప్పి, అందుకు వారిని సన్నద్ధం చేయడం కూడా గురువుల బాధ్యతే. చిన్నచిన్న విషయాలకే కొందరు విద్యార్థులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.  పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న బాధాకరమైన ఇన్సిడెంట్లను చూస్తున్నాం. ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా ఉపాధ్యాయులే పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలి. సమస్యను, సవాళ్ళను ఎదుర్కొనే దృఢ సంకల్పం విద్యార్థుల్లో అలవడేలా గురువులే చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులను, వారి ఆర్థిక పరిస్థితిని, సమాజాన్ని అర్థం చేసుకునే రీతిలో విద్యార్థులకు తర్ఫీదునివ్వాలి. పెద్దయ్యాక ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాలి. కేవలం టీచర్లతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది జరిగినప్పుడు ఉపాధ్యాయుల పేరు, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.

గురువు నిర్మలుడై, శాంతస్వభావం కలిగి, సాధన సంపత్తి కలిగి, మితభాషిగా ఉండాలి. కామ క్రోధాలను వదిలిన వారై ఉండాలి. సదాచార ప్రవర్తకులై, జితేంద్రియులై ఉండాలి. అంతేకాదు, ధర్మ శాస్త్రం ఎంత తెలుసో, సంప్రదాయమూ అంతే తెలిసిన వారే ఉత్తమ గురువులు అని చెబుతారు పెద్దలు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా ఉండే గురువు అంతరంగంలో, బాహ్యంలో శుచిత్వం కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతుడు అవుతాడు. శిష్యులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. శిష్యులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, వారి లోపాలను గుర్తించి వాటిని అధిగమించే అవకాశాలూ కల్పిస్తాడు. శిక్షణ ఇవ్వడం మాత్రమే అవసరమైతే తానే స్వయంగా పూనుకొని శిష్యుడిని ఉద్ధరిస్తాడు. జిజ్ఞాసులై శిష్యునికి సమర్థుడైన గురువు, అలాగే సమర్థుడైన గురువు కు యోగ్యుడైన శిష్యుడు లభించడం ఒక అదృష్టమ్.  వ్యక్తి పట్టుదలకు, సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే, ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రవక్త ముహమ్మద్‌ (స) జీవిత లక్ష్యం కూడా ఇదే. ఆయన సందేశం మనిషి జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మనిషి అంతరంగంలో మార్పు సాధించింది. ఆరాధనా స్థలమైన మస్జిదు మొదలు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్టు వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు ఇంటి నుంచి యుద్ధరంగం వరకు అన్ని చోట్ల పాపభీతి, దైవభక్తి అలుముకున్నాయి. ప్రజల ఆలోచన విధానం మారింది. భావాలు మారాయి. భావావేశాల్లో మార్పు వచ్చింది. దృక్కోణం మారింది. అలవాట్లు మారాయి. ఆచరణలు మారాయి, ఆచారాలు, సంప్రదాయాలు మారిపోయాయి. హక్కులు, బాధ్యతల తీరుతెన్ను మార్పుకు గురయ్యాయి. మంచి, చెడు ప్రమాణాలు, ధర్మ బద్ధం, ధర్మ నిషిద్దం అన్న కొలమానాలు మారిపోయాయి. నైతిక విలువలు, సంవిధాన సూత్రాలు, శాసనాలు, యుద్ధ నియమాలు, శాంతి విధానాలు అన్నీ మారిపోయాయి. ఉపాధి మార్గాలు, దాంపత్య నియమాలు అన్నీ మారిపోయాయి. నాగరికత, సామాజిక జీవనాలకు సంబంధించిన సమస్త రంగాలు విప్లవాత్మక మార్పుకు గురయ్యాయి. జీవన రంగాన్నింటిని అలుముకున్న మార్పు ఇది.

ఈ మార్పులో ప్రతిచోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పులో ఎక్కడా చెడు మచ్చుకు కూడా కనబడదు. ఎక్కడా హాని అగుపడదు. ఎక్కడా విచ్ఛిన్నం లేదు. అన్ని వైపులా నిర్మాణమే. ఎటు చూసినా ప్రగతి వికాసాలే. నిజం చెప్పాలంటే మానవాళికి మార్గదర్శి అయిన ప్రవక్త ముహమ్మద్‌ (స) వల్ల మానవాళికి ఒక కొత్త ఉదయం ప్రాప్తమయ్యింది. విశ్వజనీన సోదరభావానికి పునాదులు పడ్డాయి. చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. ఆయన సాధించిన ఈ మహత్కార్యం చరిత్రలో సాటిలేనిది.

అజ్ఞాన, అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్‌ (స) జ్ఞానజ్యోతులు వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు. ‘జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం’ అని విశదీకరించారు.

విద్యావిజ్ఞానాలు మనిషిని ఇహపరలోకాల్లో ఉన్నతస్థానాలకు, సాఫల్య శిఖరాలకు చేరిస్తే, అజ్ఞానం, అవిద్య అతడిని అధఃపాతాళంలో కూరుకుపోయేలా చేస్తాయి. అందుకే ముహమ్మద్ ప్రవక్త (స) విద్యావిజ్ఞానాలకు పెద్దపీట వేశారు. వయోభేదం కాని, వర్గభేదం కాని, స్త్రీపురుషులన్న లింగభేదం కాని లేకుండా అన్ని వయసులవారు, అన్నివర్గాలవారు, వర్ణాలవారు, స్త్రీలు, పురుషులు అందరూ విధిగా విద్యార్జన చేయాలని నిర్దేశించారు. ‘విద్య’ అంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదు. విద్య విజ్ఞానాన్ని నేర్పాలి.

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది.

చదువు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాడంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాడని అర్థం. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు భారమైనా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఉత్తమ పాఠశాలల్ని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ పిల్లలకు మార్కులు, ర్యాంకులు మాత్రమే ముఖ్యం కాదు.. వారికి కొన్ని కనీస మర్యాదలు నేర్పించడం అత్యవసరమని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వారికి మంచి విద్యతో పాటు సత్ప్రవర్తన కూడా అలవడుతుంది.

గురువు అంటే కేవలం చదువు నేర్పిన వారే కాదని, మనకు జీవితానికి అవసరమైన అనేక అంశాలను నేర్పిన ప్రతి ఒక్కరినీ గురువుగానే భావించాలి, మాట్లాడ్డం దగ్గర్నుంచి పోట్లాడ్డం వరకూ అంతా సమాజం నుంచే నేర్చుకుంటున్నాము. తల్లిదండ్రుల అనురాగం గారంగా మారితే బిడ్డ భవిష్యత్ పాడవుతుందని, కానీ గురువు పెంచుకునే అనురాగం వారిని వృద్ధిలోకి తీసుకువస్తుంది, గురువు దృష్టిలో రాజు కొడుకైనా, సేవకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, రౌతు కుమార్తె అయినా సమానులే అని, విద్య నేర్పిన గురువుల పట్ల జీవితమంతా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటంతో పాటు, గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలలి.

శిష్యరిక విశిష్టత

తెలిసినవారూ, తెలియనివారూ ఇరువురూ సమానులు కాగలరా? (జుమర్ : 9)

మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించ బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. (ముజాదలహ్: 11)

అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (ఫాతిర్: 28)

హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: (ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించటం కోసం ఎవరయినా ఒక దారిన పడితే దేవుడు ఆ దారి గుండా అతని కోసం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. (ముస్లిం)

దైవ ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం చారు: ఆదం పుత్రుడు (మనిషి) చనిపోగానే అతని కర్మల పరంపర అంతటితో ఆగిపోతుంది. అయితే మూడు కర్మల పుణ్యం మాత్రం అతనికి (ఆ తర్వాత కూడా) లభిస్తూనే ఉంటుంది. ఆ మూడు ఇవి: (1) శాశ్వతంగా ఉండిపోయే దానం (సదఖయె జారియా), (2) తన తదనంతరం ప్రజలకు ఉపయోగపడే విద్య (3) తన శ్రేయస్సు కోసం ప్రార్ధించే సదాచార సంపన్నులయిన సంతానం. (ముస్లిం)

దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: జ్ఞానార్జనా ధ్యేయంతో బయలుదేరిన వ్యక్తి తిరిగొచ్చేవరకు దైవమార్గంలో ఉన్నట్లుగానే పరిగణించ బడతాడు. (తిర్మిజీ-హసన్) (సుననె తిర్మిజీలోని విద్యా అధ్యాయం)

విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూ ముహమ్మద్‌  (స), షైతాన్ వెయ్యి మంది భక్తులను బురిడీ కొట్టించగలడేమో కాని, ఒక్క పండితుడి (జ్ఞాని)ని బోల్తా కొట్టించడం వాడి వల్ల కాదు’ అని ప్రవచించారు.  ‘రాత్రివేళ ఒక గంట సమయాన్ని విద్యా సంబంధమైన చర్చల కోసం కేటాయించడం, ఆ రాత్రంతా (తెల్లవారేవరకు) దైవారాధన చేసిన దానితో సమానం’ అన్నారాయన.

విద్యార్థి మర్యాదలు

ఉపాధ్యాయుల పట్ల ఒకప్పుడు ఉండే  గౌరవ మర్యాదలు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. తోటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కొందరు యువకులు.. అంతటితో ఆగకుండా ఏకంగా టీచర్లను కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో  శిష్యులు తప్పక పాటించాల్సిన  కొన్ని మర్యాదల గురించి తెలుసుకుందాం!

మొదటిది: సహనం

జ్ఞానాన్ని ఆర్జించడం మహోన్నత విషయం. అది అవిరళ  కృషి   నిరంతర శ్రమ  అనే  వంతెన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.  జ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థి  చాలా   ఓపిక , సహన గుణం , ఓర్మి, కూర్మి కలిగి ఉండాలి.

రెండవది: చిత్తశుద్ధి

విద్యార్జన విషయంలో  నిజాయితీగా ఉండాలి. దైవ ప్రసన్నత, పరలోక మోక్షం పరమావధిగా ఉండాలి.  మిడిసిపాటు, పదవీ వ్యామోహం, ఐహిక లాలస విద్యార్జన లక్ష్యమయి ఉండకూడదు.

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు; పండితులతో పోటీ పడటానికి, లేదా మూర్ఖులతో  వాదోపవాదాలు జరపడానికి లేదా ప్రజల మన్ననలు పొంది వారిని తన వైపు తిప్పుకోవడానికి ఎవరైనా జ్ఞానాన్ని నేర్చుకుంటే, అల్లాహ్  అతనిని నరకంలో ప్రవేశపెడతాడు. (నసాయీ)

మూడవది: జ్ఞానానికనుగుణంగా ఆచరించడం

జ్ఞానానికనుగుణంగా  పని చేయడం అసలు జ్ఞాన ఫలమని తెలుసుకోండి, కాబట్టి తెలిసి కూడా ఆచరించనివాడు యూదులను పోలి ఉంటాడు. జ్ఞానం లేకుండా అమలు చేసే వారు  వారు క్రైస్తవులను పోలి ఉంటారు.

తౌరాత్‌ (ఆజ్ఞలు పాటించే) బాధ్యత మోపబడినవారు ఆ బాధ్యత నిర్వహించలేదు. వారిని పుస్తకాలుమోసే గాడిదతో పోల్చవచ్చు. (తౌరాత్‌జ్ఞానం తెలిసి కూడా అంధులై) అల్లాహ్ సూక్తుల్ని నిరాకరించినవారు అంతకంటే దిగజారిపోయారు. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్  సన్మార్గం చూపడు. (జుమా: 5)

నాల్గవది: శాశ్వత పర్యవేక్షణ

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనల్ని సదా గమనిస్తూనే ఉన్నాడు. మనం పది మందితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా  మనం అయన యెడల భక్తి భావం కలిగి ఉండాలి. అల్లాహ్ యెడల  భయం మరియు ఆశల మధ్య  మన జీవితమా సాగాలి. ఎందుకంటే  పక్షి రెండు రెక్కల ఎలాంటివో  ఒక ముస్లింకు అల్లాహ్ యెడల  ఆశాభయాలు  అలాంటివే.

ఐదవది: సమయపాలన

ఆరవది:  అనవసర విషయాల జోలికి వేళ్ళకూడదు.

ఏడవది: స్వీయ నియంత్రణ మరియు నైపుణ్యం, కార్యదీక్ష

ఎనిమిదవది: పుస్తక పఠనం

తొమ్మిదవది : మంచి  సహచరుడిని ఎంచుకోవడం

పదవది: గురువుతో తో మర్యాదగా ఉండండి.

ఒక్క మాటలో చెప్పాలంటే – గురువులకు శిశ్యులంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండాలి. శిష్యులకు గురువులంటే గౌరవం, విధేయత, వినయం, మర్యాద ఉండాలి.

 

ఇస్లాం ఒక సమీక్ష

ఇస్లాం  ఒక సమీక్ష



 ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణ జీవన సంవిధానంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది.

1. ఇస్లాం ఏకేశ్వరోపాసన (తౌహీద్కు)కు  సంబంధించిన ధర్మం. అది  ప్రజలందరికీ (వారినిని సృష్టించిన) ప్రభువు  తరఫు నుండి  అందజేయబడిన సార్వజనీన  సందేశం,  అది మానవాళికి వారి ప్రభువు తరఫు నుండి  చిట్టచివరి  గ్రంథాన్ని (ఖురాన్ ను)  అందజేస్తుంది.  మనసా వాచా కర్మణ - త్రికరణ  శుద్ధితో  దాన్ని స్వీకరించిస్తే, ఇస్లాం ఒక సంపన్న, సంపూర్ణ  జీవన సంవిధానంగా , తిరుగు లేని  ప్రపంచ నాగరికత అవుతుంది.

2. నిజ దైవ  భావన

విశ్వాన్ని మరియు విశ్వంలోని చరాచరాలన్నింటిని  సృష్టించిన ఒక నిజ  దేవుడిని నమ్ముతారు. వారు ఆయనను మాత్రమే ఆరాధిస్తారు, ఆయనతోఎవరినీ సహవర్తులుగా చేసి కొలవరు.  ఆ నిజ ఆరాధ్యుని పేరే  అల్లాహ్.   ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ  లేడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయనికి భాగస్వాములు లేదా  భార్యాపిల్లలు లేరు. ఆయన  మాత్రమే మొత్తం విశ్వాన్ని నియంత్రించేవాడు,  మరియు అయన  మాత్రమే అందరికీ జీవితాన్నిప్రసాదించే వాడు. ప్రజలందరూ వారి మరణానంతరం ఆయన వద్దకే తిరిగి వస్తారు.

3. ఇస్లాం భావార్థం

(1) ఇస్లాం అంటే సమస్త జీవారాసులను సృష్టించిన ఒకే నిజ దేవునికి (సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు) సమర్పణ విధేయత. (2) ఇస్లాం అంటే మనం శాంతిని పొందడం,  ఇతరులకు శాంతిని అందించడం. ఈ అర్థాల ప్రకారం, ఇస్లాం అనేది సమస్త మానవాళి కోసం  అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానం, తోలి మానవుడు మరియు ప్రవక్త అయినా హజ్రత్ ఆదమ్ (అ) మొదలు అంతిమ దైవ  ప్రవక్త ముహమ్మద్ (స) వరకు లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరి సందేశం సారం. 

4. ఇస్లాం చివరి ప్రవక్త

ఇస్లాం ధర్మాన్ని సమస్త మానవుల జీవన సంవిధానంగా పరిచయం చేస్తూ వచ్చిన ప్రవక్తల సంఖ్య అక్షరాల 1 లక్ష 24 వేల  మంది. ఈ పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ (స).   పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (571-632 CE). ఆయన శుభా జననం అరేబియా ద్వీపకల్పంలోని మక్కాలో జరిగింది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆయన  (ఖురేష్) అనే గొప్ప అరబ్ తెగకు చెందిన వారు.  ఆయన ఉన్నత నైతిక ప్రమాణాలతో ఆదర్శవంతమైన  జీవితాన్ని గడిపారు.  ఆయన నడక నడవడికను చూసిన జాతి వారు  ఆయన్ను సాదిక్ - సత్యవంతుడు మరియు అమీన్ - నమ్మదగినవాడు అని ప్రేమతో పిలిచేవారు.

అప్పటి ఆ సమాజంలో బహుదైవారాధన  సర్వసాధారణమైనప్పటికీ ఆయన ఎప్పుడూ విగ్రహాలను పూజించలేదు. ఆయన  తను ఒక ప్రవక్త అవ్వాలని ముందస్తు  ప్రణాళిక వేయలేదు, ఇష్టానుసారంగా ప్రవక్త అయిపోలేదు. వాస్తంగా అల్లాహ్ అయన ద్వారా తాన్ అంతిమ సందేసం అయిన దివ్య గ్రంథం "ఖురాన్" ను ప్రజలందరికీ తెలియజేయడానికి  ఆయన్ను  ఎంపిక చేసుకున్నాడు. ఖుర్ఆన్  అవతరణ  23 సంవత్సరాల వ్యవధిలో (610- 632 CE) ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై   దైవ దూతల నాయకులైన జిబ్రిల్ ద్వారా అరబిలో అవతరింపజేయ బడింది. ఆయనను ముస్లింలు విశ్వ జనులందరి కోసం విశ్వా ప్రభువు అల్లాహ్ పంపిం అప్రవక్తగా నమ్ముతారు.

 

5. మూలం మరియు వ్యాప్తి

ఇస్లాం అంతిమ సందేశం మక్కాలో సంపూర్ణమయింది.  అయితే  మొదటి ఇస్లామీయ  సువ్యవస్థ  మదీనాలో (మక్కాకు ఉత్తరాన 400 కిమీ) స్థాపించబడింది.  క్రీ.శ.623లో మహమ్మద్ ప్రవక్త మరియు ఆయన సహచరులు కొందరు అక్కడికి వలస వెళ్లారు.

 ప్రవక్త ముహమ్మద్ (స) మరణం తరువాత, ఆయన  సహచరులు మరియు వారి  అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇస్లాం సందేశాన్ని తెలియజేయడానికి కంకణం కట్టారు.

క్రీ.శ.636లో, ఇస్లాం పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలతోపాటు భారత దేశానికి కూడా  చేరుకుంది.

మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం ధర్మానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్ భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది సా.శ. 629 లో నిర్మింపబడినదని భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.

 క్రీ.శ.642లో ఇస్లాం పర్షియాకు చేరుకుంది. అదనంగా, ఇస్లాం ఏడవ శతాబ్దంలో చైనాకు చేరుకుంది.

6) ప్రవక్త ముహమ్మద్ (స) వారి అనుయాయులు

తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు 1.8 బిలియన్లు. ఇస్లాం భూమిపై రెండవ అతిపెద్ద మతం. వారు 50 దేశాలలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు.  ముస్లింలలో 20% మాత్రమే అరబ్బులు.

7) ఇస్లాం ధర్మ  గ్రంథం ఖుర్ఆన్

"ఖుర్ఆన్" ఇస్లాం ధర్మ  గ్రంథం. దీనిని "పవిత్ర  ఖుర్ఆన్"  "పరిశుద్ధ  ఖుర్ఆన్" అని పిలుస్తారు. దీనిని ముస్లింలు అల్లాహ్ అంతిమ  గ్రంథంగా పరిగణిస్తారు. అది అల్లాహ్  మానవాళి కోసం  పంపిన అన్ని మునుపటి గ్రంథాలను  (వ్యాఖ్యానాలు  మరియు మార్పులు లేకుండా వాటి అసలు రూపాల్లో) స్వీకరిస్తుంది.  ప్రవక్త ఇబ్రాహీమ్  (అ)కు ఇవ్వబడిన సుహుఫ్ (ప్రతులు), ప్రవక్త  దావూద్ (అ)కు ఇవ్వబడిన  జబూర్ (కీర్తనలు), ప్రవక్త మూసా (అ) కు ఇవ్వబడిన తౌరాత్ (తోరా) మరియు ప్రవక్త ఈసా (అ)కు ఇవ్వబడిన ఇంజీల్ (దేవుని సువార్త) వంటి దైవ గ్రంథాలను ధృవీకరిస్తుంది, వాటి సారాంశాన్ని సంరక్షిస్తుంది. 

ఖుర్ఆన్  భూమిపై ఉన్న  సురక్షిత  దైవ  గ్రంథం.  అది  మానవులచే మార్పుచేర్పులను  చేయబడకుండా అల్లాహ్ వాక్యాలను కలిగి ఉన్న ఏకైక గ్రంథం. అది సకల వక్రీకరణలు, వక్ర భావాల   నుండి భద్రపరచబడిన అద్వితీయ అద్భుత దైవ గ్రంథం. 

అది  దేవుని చట్టం మరియు అల్లాహ్  ఆజ్ఞలతో పాటు ప్రజలందరి కోసం  సార్వజనీన సందేశం.  జాతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నివసించే కోట్లాది  మంది ప్రజల హృదయాలను బలంగా ప్రభావితం చేసిన శక్తివంతమైన గ్రంథం . అలాగే  ప్రాంతానికి, భాషకి, జాతికి  అతీతంగా లక్షలాది మంది ప్రజలచే మొదటి నుండి చివరి వరకు  కంఠస్తం చేయబడి  భద్రపరచబదిన గ్రంథం. .

8)  ఇస్లాం ధర్మ  నిర్మాణం

ఇస్లాంను రెండు భాగాలుగా విభజించవచ్చు:- (1) ఇస్లామీయ విశ్వాసం  (2) ఇస్లామీయ ధర్మ శాస్త్రం  (చట్టం మరియు జీవన విధానం). వాటిని సాధారణంగా అరబిలో (అకీదః  మరియు షరీఅహ్) అని పిలుస్తారు.

అకీదః   అనేది ఇస్లాం  "నమ్మకం" అది ఇస్లాంలోని  అవిభాజ్యాంశం, కీలక  భాగం.  విశ్వాసం (ఈమాన్ఆ) ఆరు విధాలుగా ఉంటుంది. అవి -  అల్లాహ్ పై దృఢమైన విశ్వాసం.   ఆయన  మనల్ని - ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, మరణానంతర జీవితాన్ని, మంచీ చేదు విధివ్రాతలను  విశ్వసించమని ఆజ్ఞాపించాడు.

ఇస్లామీయ ధర్మ శాస్త్రం అనేది  "ఆచరణ" సంబంధితమైనది. అది  ఇస్లామీయ సువ్యవస్థ, చట్టం మరియు జీవన విధానం. ఇది ఖుర్ఆన్  మరియు ప్రవక్త ముహమ్మద్ (స) వారి (సున్నత్) బోధనలలో వివరించబడింది.

అది మూడు ప్రధాన శాఖలను నియంత్రించే నియమాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలను సూచిస్తుంది:

1-ఆచారాలు/ఆరాధనలు

2- నైతికత మరియు నీతి (ముస్లిం ప్రవర్తనలో అంతర్భాగంగా ఉండాలి)

3- వ్యక్తుల మధ్య లావాదేవీలు (సామాజిక/ఆర్థిక విషయాలు)

9. ఇస్లాంలో ఆరాధన (ఇస్లాం యొక్క 5 స్తంభాలు)

ఇస్లామీయ ధర్మ శాస్త్రంలో  పేర్కొన్న ఆచారాలు మరియు ఆరాధనలు. (ఇస్లాం ధర్మ 5 మూల స్తంభాలు)  ముస్లింగా మారడానికి, మీరు మొత్తం ఐదు స్తంభాలను తెలుసుకోవాలి.

(1) షహాదహ్   (విశ్వాస సంబంధిత  రెండు సాక్ష్యాలు).

(2) అల్లాహ్ కోసం  రోజువారీ  ఐదు పూటల ప్రార్థనలను స్థాపించడం.

(3) ప్రతి సంవత్సరం రంజాన్ మాసపు పూర్తి ఉపవాసాలు పాటించడం.  (ఉపవాసం).

(4) పేదవారికి  వార్షిక జకాత్ చెల్లించడం.

(5) మక్కాలో ఉన్న కాబా గృహాన్ని ఉద్దేశించి జీవితకాలంలో ఒకసారి హజ్ చేయడం.

హజ్ ప్రయాణం సుమారు ఒక వారం పాటు కొనసాగుతుంది మరియు  ప్రవక్త ఇబ్రహీం (అ) వారికి  సంబంధించిన అనేక సంప్రదాయాలను నిర్వహించడం అవసరం. (మస్జిద్  హరామ్  లోపల మరియు వెలుపల).

10. ఇస్లాంలో చేయవలసినవి మరియు చేయకూడనివి

ముక్తసరిగా చెప్పాలంటే,  మంచిని "చెయ్యండి" మరియు చెడు చేయడం మానుకోండి.
قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ (151)
“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు:
1) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు.
2- తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి.
3 - దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము.
4 - నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే.
5 - న్యాయప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని అల్లాహ్  మీకీ విషయాలు బోధిస్తున్నాడు.
6 - అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి.
7 - తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము.
8 - వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి.
9 - అల్లాహ్ విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని దేవుడు మీకిలా హితోపదేశం చేస్తున్నాడు.
ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు.
మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (151-153)

ఇస్లాంలో  ఘోర పాపాలు:

(1) విశ్వాన్ని మరియు అన్ని జీవులను సృష్టించిన దేవుని ఉనికిని తిరస్కరించడం (అంటే నాస్తికుడు). అదే విధంగా, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను  కాకుండా ఇతర సృష్టిరాసులపై  నమ్మకం మరియు ఆలాహ్  ఆరాధనలో వారిని  భాగస్తులుగా చేర్చడం (షిర్క్).

 (2) తల్లిదండ్రులకు అవిధేయత మరియు వారితో చెడుగా ప్రవర్తించడం.

(3) హత్య, ప్రజలను చంపడం మరియు ఆత్మహత్య చేసుకోవడం.

(4) వ్యభిచారం, వ్యభిచారం, స్వలింగ సంపర్కం మరియు లైంగిక వేధింపులు

(5) అనాథ సంపదను అక్రమంగా వినియోగించడం లేదా స్వాధీనం చేసుకోవడం.

(6) కొలతల్లో తూనికల్లో మోసం చేయడం. ఇతరులతో ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.

(7) న్యాయస్థానంలో  సాక్ష్యం చెప్పేటప్పుడు అసత్యం లేదా అబద్ధం చెప్పడం.

 (8) అవసరమైన వ్యక్తులకు రుణమిచ్చేటప్పుడు వడ్డీ వసూలు చేయడం.


11. ఆహార పానీయాలు

కింది వాటిని మినహాయించి సముద్రపు ఆహారంతో సహా అన్ని ఆహారాలు (అంటే ఇస్లాంలో హలాల్) తినడానికి అనుమతి ఉంటుంది:

(1)పంది మాంసం,

(2) మాంసం తినే ఏదైనా జంతువు.

(3) చనిపోయిన జంతువులు.

(4) ఇస్లామీయ  పద్ధతి ప్రకారం వధించబడని ఏదైనా జంతువు.

రక్తం మరియు ఆల్కహాలిక్ డ్రింక్స్ (ఉదా. వైన్) మినహా అన్ని పానీయాలు ధర్మసమ్మతమైనవి.  మత్తుపానీయాలు  తక్కువ తాగినా లేదా ఎక్కువ తాగినా మతి భ్రమించేలా  చేస్తాయి.

12. డ్రస్  కోడ్

మహిళలు: యుక్తవయస్సు వచ్చినప్పుడు మాత్రమే శరీరం మరియు తల వెంట్రుకలను కప్పి ఉంచే నిరాడంబరమైన  వస్త్రధారణ చేసుకోవాలి. పురుషులు: ప్రధానంగా నాభి (బొడ్డు ) నుండి మోకాళ్ల వరకు కప్పి ఉంచే నమ్రతతో కూడిన వస్త్రధారణ చేసుకోవాలి.

13. వారాంతం

ముఖ్యంగా ముస్లిం  దేశాలలో శుక్రవారం ముస్లింలకు విశ్రాంతి దినం. వారు మసీదులో సామూహిక శుక్రవారం ప్రార్థనలు చేయవలసి ఉంటుంది మరియు ఒక చిన్న ప్రసంగాన్ని వినవలసి ఉంటుంది.

14. పండుగలు

చంద్రమానం ప్రకారం రెండు వార్షిక పండుగలు   నిర్దేశించ బడ్డాయి.

ఈద్ అల్-ఫితర్: (3 రోజులు) రంజాన్ ఉపవాస నెల ముగింపులో.

ఈద్ అల్-అజ్హా : (4 రోజులు) (10వ-13వ తుల్-హిజ్జా) ఇది హజ్ ప్రయాణం  సంబంధించిన మాసం. .

ఇస్లాంలో మూడు పవిత్ర స్థలాలు మాత్రమే ఉన్నాయి:

(1) మక్కాలోని  మస్జిద్ హరామ్, ఇందులో కాబా ఉంది.

నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను  కీర్తించడానికి మరియు ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన  మొదటి ప్రార్థనా గృహం.

ప్రవక్త ఇబ్రాహీం (అ)  దానిని పునర్నిర్మించారు.  మరియు దాని అసలు పునాదిపై దాని గోడలను ఎత్తారు.

 ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు మక్కాలోని మస్జిద్ హరామ్ లోని కాబా వైపు ముఖం చేసి  ప్రార్థన చేస్తారు.

(2) మదీనాలోని ప్రవక్త  ముహమ్మద్ (స) వారి మస్జిద్

ఇస్లామీయ సువ్యవస్థ వైపునకు ప్రస్థానం తర్వాత నిర్మించిబడిన మొదటి మస్జిద్.

 మానవాళికి దేవుని సందేశాన్ని తెలియజేయడానికి ప్రారంభ స్థానం.

(3) ఫాలస్తీనా (జెరూసలేం)లోని అల్-అక్సా మసీదు, ఒకే ఒక్క నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన రెండవ మసీదు. ఇది ఇస్లాంలో మొదటి "కిబ్లా" కూడా. ప్రార్థన సమయంలో దిశ కాబాకు మార్చడానికి ముందు ముస్లింలు ఈ  దిశకు ముఖం చేసి ప్రార్థన చేసే వారు.

యుద్ధం అంతమవ్వాలి... శాంతి పరిఢవిల్లాలి!

యుద్ధం అంతమవ్వాలి...  శాంతి పరిఢవిల్లాలి!




وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ (63) يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ (64)

ముఖ్యంగా ఆయన విశ్వాసుల హృదయాలను పరస్పరం కలిపి నీకు కొండంత ధైర్యాన్నిచ్చాడు. నీవు ప్రపంచంలోని సంపద మొత్తం ఖర్చుపెట్టినా వారి హృదయాలను కలపలేవు. వారి హృదయాలను కలిపేవాడు అల్లాహ్  మాత్రమే. నిస్సందేహంగా ఆయన అపార శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ప్రవక్తా! నిన్ను, నీ అనుచరులైన విశ్వాసుల్ని ఆదుకోవడానికి ఆ ఒక్కఅల్లాహ్ యే  చాలు. (అంఫాల్: 63-64)

మీకు గుర్తుందా..గుర్తు ఉండే ఉంటుందని అనుకుంటాను..  రెండో ప్రపంచ యుద్ధంలో షిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాన్‌, ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కన్పించడం లేదు. బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌ అన్నట్టు ‘మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు’ దేశాధినేతలు ఇవి గుర్తెరగకపోవడం వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. చివరకు కన్నీళ్లు కూడా మిగలడం లేదు. బాంబుల ధాటికి అభివృద్ధి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నిర్మించిన భవనాలు, ఇళ్లు, ఇలా ఒక్కటేమిటీ అన్నీ భస్మీపటలమవుతున్నాయి. సామ్రాజ్యవాదం, రాజ్య విస్తరణ కాంక్ష, నిలువెత్తు అహంభావం, దోచుకోవాలనే తాపత్రయం, ప్రపంచాన్ని శాసించాలనే కుటిల బుద్ధి వంటి కారణాలు యుద్ధానికి దారి తీస్తున్నాయి. నాటి నాజీల నుంచి నేటి ఫుతిన్‌, ఫలస్తీనలోని  అక్రమార్కులయిన యూదుల   వరకు ఇదే జరుగుతోంది.

నరహత్య చెయ్యవద్దు” “దొంగలింపవద్దు” అన్నవి యూదులు చదివే “తోరా” గ్రంథపు “పది ఆజ్ఞల”లోని రెండు ప్రధాన ఆజ్ఞలు. ఈ రెండిటికీ వ్యతిరేకంగా పాలస్తీనా భూభాగంలో యూదులు నరహత్య చేసి, భూములు దొంగలించి సభ్య ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?

ఒకరు చేసిన దాడికి  ఎదురుదాడి అంటున్నారు. ఎంత మాత్రం కాదు.  గత డిసెంబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ నిరంతరం దాడులు చేస్తోంది. ఒక్క వెస్ట్‌ బ్యాంక్‌లోనే 260 మంది చనిపోయారు. అల్‌ అక్సా మసీదుపై ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయి. అల్‌-అక్సా మసీదులో పాలస్తీనా మహిళలతో ఇజ్రాయిల్‌ సైనికులు ఎలా ప్రవర్తించారో అందరూ చూశారు. పాలస్తీనా భూమి ప్రతి రోజూ ఆక్రమణకు గురవుతోంది. పాలస్తీనియన్లు ప్రతి రాత్రి అరెస్టు చేయబడుతున్నారు. ఇజ్రాయిల్‌ జైళ్లలో దాదాపు 5,000 మంది పాలస్తీనా ఖైదీలు ఉన్నారు. ఈ పరిస్థితి ఒక్క గాజాలోనే కాదు. ఇది వెస్ట్‌ బ్యాంక్‌లోనూ వున్నది. పాలస్తీనా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దురాక్రమణను ఎదుర్కొంటున్నారు.

మానవాళి పట్ల, ప్రపంచం పట్ల బాధ్యత ఉన్న వారెవ్వరైనా ఈ తరహా హింసాకాండను సమర్ధించరు. కానీ, ఇంత దారుణ హింసాకాండ తరువాత కూడా ఇజ్రాయిల్‌ను బైడెన్‌ వెనకేసుకు రావడంతో అమెరికా దుర్నీతి మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.

ఒకప్పుడు యుద్ధం గెలవడం కోసం ఆయుధాలు తయారు చేసేవారు. మరిప్పుడు ... ఆయుధ అమ్మకం కోసం యుద్ధాలు సృష్టిస్తున్నారు. యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం. శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి  కడుపున  యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్య సత్యమైంది.

యుద్దమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధం వేడిగాల్పులకు అవరోధమవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే అక్కడ శాశ్వతంగా తిట్టివేసిన చుట్టమైంది; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది. 

ఏ యుద్ధం అయినా  చివరిలో  అయినవారిని కోల్పోయిన తల్లులు, భార్యల దుఃఖారావాలూ, అర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి. అన్ని అనుభవాలున్నా, అన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ అటూ విజేతలే  ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న సత్యాన్ని మనిషి ఇప్పటికీ అర్థం కోలేదు. బతుకునిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వాన్నినికి, అమృతానికి దూరంగా  హాలాహలం దిశగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! ఇంకెంత కాలం? ఏ యుద్ధంలోనైనా తర్వాత మనిషి తినేది వట్టి కూడు కాదు, అక్షరాలా 'నెత్తురుకూడు'.

కత్తి పట్టి యుద్ధం చేసేది వినాశానానికి కాదు..కొత్త చరిత్ర లిఖించేందుకు అంటారు కొందరు. కానీ కత్తి వల్ల జరిగిన యుద్ధాలు, బాంబుల వల్ల జరిగిన యుద్ధాలు వినాశానాన్ని తప్ప కొత్త చరిత్ర లిఖించిన దాఖలాలు ఈ భూమండలం మీద లేవు. రగిలే కాంక్ష, చెలరేగే కత్తి, రివ్వును దూసుకొచ్చే బాంబు, చిందే నెత్తురు సువర్ణాధ్యాయాలను లిఖించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. రావు.

ప్రపంచ పటంలో ఆ నేల విస్తీర్ణం- సూదిమొన మోపినంతః జనగణనను ఆరంభిస్తే, ఆ జాతి జనాభా కొద్ది రోజుల్లోనే తేలిపోయేంత! అయితేనేం, వందల ఏళ్లుగా మొత్తం ప్రపంచ ఆలోచనా విధానాన్నే ప్రభావితం చేస్తున్న మహనీయులైన ఎందరో శాస్త్ర సాంకేతిక ప్రతిభావంతులకు, రాజనీతిజ్ఞులకు, మత ప్రవక్తలకు జాతిపరంగా ఆ నేల అమ్మ పేగుగా నిలిచింది. ప్రపంచానికి వెలుగులు పంచింది. కొత్త ఆలోచనలకు దారులు పరిచింది. విశ్వాన్ని తనవైపు విస్మయంగా పరికించేలా చేసింది. ఆ నేలను ఈవేళ యుద్ధ వాతావరణం కమ్ముకొంది. ఆ నేల నలుచెరగులా ఉఉన్మాదం. మదం పెనవేసుకున్న ఉగ్రవాదం కిరాతకంగా ఉరుముతోంది. ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ప్రజలు కకావికలమవుతున్నారు.

ఆ గడ్డ నెత్తురోడుతోంది. ఆ మట్టి కన్నీటి ప్రవాహాల్లో తడుస్తోంది. ఆ శిధిలాల గుట్టల్లోంచి, ఆ శవాలు గుంపుల్లోంచి రోదిస్తున్న మానవ చరిత్ర సన్నని స్వరం- ప్రళయ భీకర యుద్ధ ఘోషలో అణగారిపోతోంది. ఆధునిక యుగాల్లోని యుద్ధ పరిణామాలు ఆ రెండు దేశాలకే పరిమితం కావెన్నడూ! రణక్షేత్రాలు రక్తంతో మెరిస్తే- తక్కినవన్నీ కన్నీళ్లతో తడుస్తాయి. కవుల మాటల్లో- ఇది 'మనుజాళి, దనుజాళి మసిచరిత్ర. జ్ఞాన ధరిత్రి దీన చరిత్ర.

మారణాయుధాలు మానవతా సంక్షోభాలను సృష్టిస్తాయే తప్ప సామరస్యాన్ని నెలకొల్పలేవు. అమాయకుల నెత్తుటితో నిత్యం తడిసిముద్దయ్యే నేలలో శాంతికి స్థానముండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం- ప్రస్తుతం పశ్చిమాసియాను పట్టికుదిపేస్తున్న యుద్ధోన్మాదమే. 'గాజా ప్రజలపై మేము యుద్ధం చేయట్లేదు' అంటూనే చిన్నారులూ మహిళలతో పాటు ఎందరో ఆసహాయులను ఇజ్రాయెల్ దళాలు పొట్టనపెట్టుకుంటున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే 24గంటల్లో ఉత్తర గాజాను ఖాళీచేయాలంటూ పదకొండు లక్షల మంది మెడపై అవి కత్తి పెట్టాయి. సామాన్యులను దుర్భరావస్థల పాల్జేశాయి.

దట్టంగా పరచుకొన్న యుద్ధమేఘాలకు ఆజ్యం పోసిందెవరు? డిసెంబరు 20022లో మరోసారి ఇజ్రాయెల్ అధికార పీఠాన్ని బెంజమిన్ నెతన్యాహు అధిష్ఠించారు. ప్రధానమంత్రి పదవి కోసం పరమ అతివాద పార్టీలతో జతకట్టిన ఆయన- స్వదేశ చరిత్రలోనే అత్యంత మతఛాందస ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. పాలస్తీనియన్ల పొడను చీదరించుకునే జాత్యహంకారులకు మంత్రి పదవులిచ్చారు. వారి అండదండలతో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెమ్లలో ఇజ్రాయెలీ సెటిలర్లు అడ్డూ ఆపూ లేకుండా రెచ్చిపోయారు. మొన్న జూన్లోనే పాలస్తీనియన్లపై వాళ్లు 310 దాడులకు(ఇళ్లు తగలబెట్టడం వంటివి) తెగబడ్డారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో వెస్ట్ బ్యాండ్లోనే రెండొందల మంది పాలస్తీనియన్లను చంపేశారు. యూదు జాతీయవాదంలోంచి బుసలుకొడుతున్న ప్రమాదకర ఉగ్రవాదంగా దీన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సైతం ఛీత్కరించారు.  ఇది భారతీయులుగా మనకు ఒక హెచ్చరిక ఒక కనీవిప్పు కాగలగాలి.

వివరాల్లోకి వెళితే

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. నవంబర్ 2, 1917 న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ మంత్రి ‘ఆర్థర్ బాల్ఫోర్’ బ్రిటిష్ యూద వర్గానికి చెందిన ప్రముఖుడైన ‘లియోనెల్ వాల్టర్ రూత్స్ చైల్డ్’కు 67 అక్షరాలతో కూడిన ఒక ‘ఉత్తరం’ రాశాడు.

అప్పటివరకూ పాలస్తీనాలో ప్రశాంత జీవనం గడుపుతూ వస్తున్న ముస్లిములకు పాపం తెలీదు ఆ ఉత్తరం ద్వారా వారి జీవితాలు ఛిద్రం చేయ్యబడి, భవిష్యత్తులో వారి రక్తంతో తడిచిన నేలపైనే మరో దేశం నిర్మించబడుతుందని, తాము స్వతంత్రంగా నివసించిన భూమే తమ కోసం ఓ డెటెన్షన్ క్యాంప్ గా మారబోతుందని, తమ ఇళ్లు కూల్చబడి తమ భూములు లాక్కోబడతాయని, రాబోయే రోజుల్లో ఓ భయంకరమైన రక్తచరిత్ర సృష్టించబడుతుందని.

ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే- బ్రిటిష్ ప్రభుత్వం యూదుల కోసం పాలస్తీనా భూభాగంలో ఒక స్వంత దేశాన్ని నిర్మించి ఇవ్వటానికి నిర్ణయం తీసుకుందన్నది. ఆ ఉత్తరం పేరే- ‘బాల్ఫోర్ డిక్లరేషన్’.

కేవలం 1947 నుండి 1949 మధ్యలో 750000 మంది పాలస్తీనా ముస్లిములు తమ ఇళ్ల నుండి గెంటి వేయబడి బయట దేశాల్లో శరణార్ధులుగా మార్చబడ్డారు. గాజా పట్టీ అక్కడి ముస్లిములకు ఒక డిటెన్షన్ క్యాంప్ గా మార్చబడింది. దీనిని బట్టి ఏ విధమైన దౌర్జన్యం పాలస్తీనా ప్రజలపై జరిగిందో అంచనా వెయ్యవచ్చు.

1947 నుండి 49 మధ్యలో 15000 వేల మంది పాలస్తీనా ముస్లిములు దారుణంగా చంపబడ్డారు. వేల కొద్దీ ఇళ్లు నేలమట్టం చెయ్యబడ్డాయి. ఎంతో మంది కట్టుబట్టలతో భార్యా పిల్లల్ని తీసుకుని వేరే దేశాలకు కాలి నడకన వెళ్లిపోయారు.

ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పరిమితులతో సంబంధం లేకుండా సుమారు 78 శాతం పాలస్తీనా భూభాగాన్ని యూదులు ఆక్రమించారు. 

ఇంతపెద్ద రక్తపాతాన్ని సృష్టించిన యూదులు మే 15, 1948 న ఇశ్రాయీల్ దేశాన్ని ప్రకటించుకుంటారు. ఆరోజును గుర్తు చేసుకుంటూ ప్రతీ సంవత్సరం పాలస్తీనియన్లు “అక్బా” దినంగా జరుపుకుంటారు. అక్బా అన్న అరబీ పదానికి “ఘోర విపత్తు” అని అర్థం.

 

  ''హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చివేయటాన్ని వారు చూస్తున్నారు'' ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరు పాళ్లు యూదు దురహంకారే. 1948లో ఇజ్రాయిల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు. 1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు.

  పాలస్తీనా-ఇజ్రాయిల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా మధ్యవర్తిగా ఉన్న అమెరికా అర్ధం కానంత అమాయకంగా ఉందా? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయిలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు.

ఈ బూడిద గుట్టల మీద నీ అధికారం ఎన్నాళ్ళు సాగుతుంది తిరిగి మరలిపోయిన మనుషులు తప్పక తలెత్తుకుని వస్తారు పచ్చని చిగుళ్ళని మొలకెత్తించడానికి... ఆసుపత్రులు తెరచుకుని  మరల పురుళ్ళు పోసుకుంటాయి  బడి గంటలు మోగి  చినిగిన పైజామాలు ఎగదోసుకుంటు  పిల్లలు మరల పలకా బలపం పట్టి  తమ భవిష్యత్ చిత్రపటాన్ని లిఖించుకుంటారు  ఫీనిక్స్ పక్షిలా మరలా గాజా లేచి నిలబడుతుంది నువ్వెన్ని సార్లు బూడిద చేసినా ఎందుకంటే వాళ్ళు మనుషులు కదా?

వారి ముఖాల్లో చనిపోతున్నాం అనీ ఏడుపులు, పెడబొబ్బలు, బాధ, భయం మచ్చు కైనా కనబడడం లేదు.."దేశ స్వాతంత్ర పోరాట కాంక్ష" సర్వ సృష్టి కర్త అయిన "అల్లాహ్ మీద నమ్మకం తప్ప"

దురాక్రమణదారులకు పశ్చిమ దేశాల మద్దతు ఉంది. మాకు ఔదార్యం కాదు, డబ్బు కాదు. సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలి. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారం కాపాడబడాలి. మన పిల్లలు ఇతర పిల్లల్లాగే ఆడుకుంటూ పెరిగే అవకాశం ఉండాలి. అంతేగాని వారు ప్రతిరోజూ దాడుల్లో చనిపోకూడదు.