Thursday, April 9, 2026
హిత శత్రువు-అహిత శత్రువు=అజాత శత్రువు
హిత శత్రువు-అహిత శత్రువు=అజాత శత్రువు
నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభువు కారుణ్యభాగ్యం లభిస్తే తప్ప మనస్సు ఎల్లప్పుడూ చెడు వైపుకే పురిగొల్పుతుంది. నా ప్రభువు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” (యూసుఫ్: 53)
"హిత శత్రువు" అంటే మేలు కోరేలా కనిపించేది, కానీ వాస్తవానికి హాని చేసే వ్యక్తి లేదా వస్తువు. ఇది బయటకు మంచిగా అనిపించినా, లోలోపల మన అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రమాదకరమైన అంశం. ఉదాహరణకు, ఒక లక్ష్యాన్ని సాధించేటప్పుడు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చేది, కానీ దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగించే విషయాలు హిత శత్రువులు.
అహిత శత్రువు: ఇది శత్రువని అందరికీ స్పష్టంగా తెలిసే ఉంటుంది, అంటే ప్రత్యక్ష శత్రువు. అంటే దాన్నుండి మేలును ఆశించడం శుద్ధ అవివేకం.
అజాత శత్రువు: శత్రువులు లేని వ్యక్తి.
ప్రతి మనసులోని తమస్సు - దురాత్మ షైతాను సైన్యంలో ఒకటి. అతను ఆదేశిస్తే అది పాటిస్తుంది. అయితే అల్లాహ్ సద్బుద్ధి వల్ల, కొన్నిసార్లు అది ఉషస్సును సంతరించుకొని షైతాను మాటను పాటించకుండా, ధైవదూత పిలుపుకు స్పందించి శుభాత్మగా, పవిత్రాత్మగా మారుతుంది.
ఇబ్ను అల్ కయ్యిమ్ తన పుస్తకం అల్ ఫవాయిద్ లో ఇలా అన్నారు: మనసు చక్కని ఉపమానం గానుగ వంటిది. దానిలో ఏదైతే వేస్తారో, అది తిరుగుతూ దాన్ని నలగ్గొడుతుంది. దానిలో మంచి వస్తువు, దాన్యం వేస్తే దానిని రుబ్బుతుంది. గాజు ముక్కలు, రాళ్లు వేస్తే వాటినీ రుబ్బుతుంది. విష మూలికలు వంటి హానికరమైన వాటిని వేస్తే, వాటినే రుబ్బుతుంది. అల్లాహ్ ఆ గానుగ నిర్వాహకుడు, యజమాని, దానిని నియంత్రించేవాడు. ఆయన ఒక దేవదూతను నియమించాడు; అతను ఆ మనసులోకి మేలు కలిగించే మేలిమి రకం వస్తువులను వేస్తాడు, దానివల్ల మనసు మంచి దిశగా తిరుగుతుంది. అలాగే ఒక షైతాను కూడా నియమించబడ్డాడు; అతను మనసులోకి హాని కలిగించే వస్తువులను వేస్తాడు, దానివల్ల అది చెడు దిశగా తిరుగుతుంది. ఒకసారి దైవ దూత ఆత్మను సమీపిస్తే, ఒక్కోసారి షైతాన్ దాని దగ్గరికి వస్తాడు. దైవ దూత వేస్తున్న మేలిమి అంటే - మంచి పనుల ప్రేరణ, అల్లాహ్ వాగ్దానంపై విశ్వాసం.షైతాను వేస్తున్న ‘హానికరమైన పదార్థం’ అంటే - చెడు పనుల వైపు ప్రలోభపెట్టడం, అల్లాహ్ వాగ్దానాన్ని నమ్మకుండా చేయడం. పిండి (ఫలితం) వేయబడే పదార్థాన్ని బట్టి వస్తుంది. హానికరమైన పదార్థాలు వేయాలనుకునే షైతాను, ఆ గానుగ మంచి పదార్ధంతో నిండకుండా ఖాళీగా ఉన్నప్పుడే వాటిని వేయగలడు. మెత్తనివానిని చూస్తే మొట్ట బుద్ది అన్నట్టు అది ఖాళీగా ఉండటం చూసి పనికిమాలిన చెత్తనంతా షైతాన్ వేస్తాడు. మనిషి కూడా ఆత్మ విషయంలో ఏమరుపాటుకి లోనయిన, మైమరపులో ఉన్న సమయంలో అదను చూసి పాప ఆయుధాలను పదును పెట్టి మరీ మెరుపుదాడి చేస్తాడు. కాలికివెస్తే మెడకు, మెడకువేస్తే కాలికి అతని బాగా అలవాటు ఉన్న విద్యే కదా! కర్రలేనివానిని గొట్జెయినా కరుస్తుంది అన్నట్టు మనసు మీద అదుపు లేని వానిని షైతాన్ కూడా ఇలానే దెబ్బ తీస్తాడు.
షైతాన్ అహిత శత్రువు మరియు మనసు - హిత శత్రువు ఇవి రెండూ మనిషికి అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. అయితే వీరిలో ఏది ఎక్కువ ప్రమాదకరం అనే విషయంలో పండితులు ఏకీభవించలేదు. ఒక అథర్‌లో ఇలా వచ్చింది: “నీ పాలిట అత్యంత ప్రమాదకర శత్రువు నీ రెండుభాగాల మధ్య ఉన్న నీ మనస్సే.” (ఈ వాక్యం బలహీనమైనది)
బహుశా అహిత శత్రువైన షైతాన్ మరింత తీవ్రమైన శత్రువు. ఎందుకంటే అతను చెడులన్నింటికీ మూలం గనక. అతని వల్ల చెడు మాత్రమే జరుగుతుంది. మేలు జరిగే ఆస్కారమే లేదు. కనుకనే అల్లాహ్ అన్నాడు;
మానవులారా! అల్లాహ్ వాగ్దానం సత్యమయినది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మహామోసగాడు కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా! షైతాన్ మీకు బహిరంగ శత్రువు. కనుక మీరు కూడా వాడ్ని శత్రువుగానే పరిగ ణించండి. వాడు తన అనుచరుల్ని నరకవాసుల్లో కలిపేయడానికి తన మార్గం వైపు పిలుస్తున్నాడు. (ఫాతిర్:5,6)
అతను బహిరంగ శత్రువు అని. అదేవిధంగా అతడే ఆదమ్ అలైహిస్సలాం మరియు హవ్వా వారి స్వర్గ బహిష్కరణకు కారణం అయ్యాడు. అంతేకాక ఖుర్‌ఆన్‌లో శైతాన్ గురించి అనేక హెచ్చరికలు వచ్చాయి. మ్యాచుకు కొన్ని ఆయతులు –
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మత మైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. (అల్-బఖరహ్: 168)
అంటే షైతాన్ అడుగుజాడల్లో నడిచి అల్లాహ్ ధర్మసమ్మతం (హలాల్) గావించిన వస్తువులను అనవసరంగా నిషిద్ధం (హరాం) చేసుకోకండి. మహాప్రవక్త (సఅసం) తెలిపారు: "నేను నా దాసులను ఏకదైవారాధ కులు (హనీఫ్) గానే పుట్టించాను. కాని షైతానులు వాళ్ళను వారి ధర్మం నుండి పెడత్రోవ పట్టించారు. వారి కోసం నేను సమ్మతించిన విషయాలను వారిపై నిషిద్ధంగా చేశారు" (సహీహ్ ముస్లిం).
విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ అడుగుజాడలలో నడవకండి." వాడు మీకు బద్ద విరోధి. మీ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తి మంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి. (అల్-బఖరహ్: 208)
ఇది విశ్వసించిన వారినుద్దేశించి చేయబడిన హితోపదేశం. మీరు ఇస్లాంలోకి రాదలిస్తే పూర్తిగా వచ్చేయండి. పాక్షికంగా వద్దు. మీకు నచ్చిన విషయాలను, ప్రయోజనకరమైన అంశాలను అమలుపరచి, మీ ఆశలు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న వాటిని వదలివేస్తామంటే కుదరదు. అలాగే పూర్వాశ్రమంలో మీరు వదలి వచ్చిన కాల్పనిక సిద్ధాంతాలను, ఆచార దురాచారాలను ఇస్లాంలో జొప్పించే ప్రయత్నం చేయకండి. ఇస్లాంను - సంపూర్ణంగా అవలంబించండి. సంపూర్తిగా మీరు ఈ ధర్మాన్ని అవలంబించిననాడు మీరంతట మీరే దురాచారాలకు, మిథ్యా వాదాలకు దూరం అయిపోతారు. నేను చేయగలనా అనే సందేహం మన జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది నేను మాత్రమే చేయగలను అనే అహంకారం జీవితాన్ని నగుబాటు చేస్తుంది నేను చేయగలను అనే దృఢ నమ్మకంతో కూడిన ప్రయత్నం మాత్రం జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది.
ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడానికి నిరాకరించినవాడు వేరే మాటల్లో ధర్మాన్ని పాక్షికంగా మాత్రమే అనుసరించగోరేవాడు- దాన్ని ఆరాధనల వరకే, మస్జిద్ నాలుగు గోడల వరకే పరిమితం చేయాలనుకుంటున్నా డన్నమాట! రాజకీయాల నుంచి, చట్టసభల నుంచి దాన్ని వేరుపరచాలనుకుంటున్నాడు. అలాగే ప్రజలు తమ ప్రాంతీయ అలవాట్లను, ఆచారాలను, సంస్కృతిని ఇష్టపడతారు. వాటిని వదులుకోవడానికి సుముఖంగా ఉండరు. ముఖ్యంగా వివాహాది విషయాలలో దుబారా ఖర్చు చేయటం, ముస్లిమేతర ఆచారాలను అవలంబించటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే షైతాన్ అడుగు జాడలను అనుసరించకండి అని బోధించబడింది. ఎందుకంటే షైతాన్ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి, ఇస్లాంకు విరుద్ధంగా ఉండే విషయాలనే అందమైన ఫిలాసఫీ ద్వారా మీకు నచ్చినట్లుగా సమర్పిస్తాడు. చెడులపై అందమైన గిలాపులను చుట్టి మీ ముందుంచుతాడు. బిన్అత్లను కూడా సత్కార్యాలుగా నమ్మబలుకుతాడు. అందుకే ఇస్లాంలోకి ప్రవేశించిన మీదట మనసు మెచ్చే విషయాలను దైవేచ్ఛకు దైవప్రవక్త (స) వారి సంప్రదాయానికి అప్పగించాలి. దైవప్రసన్నతతో సమరసం చెందని విషయాలను నిస్సంకోచంగా విడనాడాలి. షైతాన్ నాలుగు రంగాలలో ముఖ్యంగా ఎం,మనిషిని త్రోవ తప్పిస్తాడు. 1) అఖీదా విషయంలో - షిర్క్ ను విడనాడి తౌహీద్ కి కట్టుబడాలి, 2) ఆచరణలు, ఆరాధనలు, వ్యవహారాల విషయంలో - బిద్అత్ ను పరిత్యజించి సున్నత్ కు పట్టం కట్టాలి. 3) సంఘం, సమాజం, హక్కులు, బాధ్యతలు విషయంలో - దౌర్జన్యానికి, అవినీతికి దూరంగా ఉంటూ నీటికి, న్యాయానికి ఊపిరి పోయాలి.. 4) ధనార్జన విషయంలో - హరామ్ సంపాదనను వదలి హరామ్ ను మాత్రమే ఆశించాలి, ఆర్జించాలి, అనుభవించాలి.
అల్లాహ్ మీకు ఇచ్చిన దానిని తినండి. కాని షైతాను అడుగు జాడల్లో నడవకండి.నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు. (అన్ఆమ్: 142)
ముష్రిక్కులు షైతాన్ అడుగుజాడలలో నడుచుకుంటూ అల్లాహ్ ధర్మసమ్మతం చేసిన ఎన్నో వస్తువులను తమ కోసం నిషేధించుకున్నారు. అలాగే అల్లాహ్ నిషిద్ధంగా ఖరారు చేసిన వస్తువుల్ని తమ కొరకు ధర్మసమ్మతం చేసుకున్నారు. షైతాన్ను అనుసరించటమంటే ఇదే!
ఆదం సంతానమా! షైతాన్‌ని ఆరాధించవద్దని, వాడు మీకు బహిరంగశత్రువని నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? నన్నే ఆరాధించాలని, అదే సన్మార్గమని ఉపదేశించలేదా? అయినా వాడు మీలో అత్యధికమందిని దారి తప్పించాడు. మీకా (మాత్రం) జ్ఞానం లేదా? (యాసీన్: 60-62)
ఇక్కడ వాగ్దానం అంటే, మానవ సంతతిని హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) వెన్ను నుంచి తీసినపుడు తీసుకోబడిన ఖరారు (అహదె అలస్త్) అన్నమాట! లేదా దైవప్రవక్తల ద్వారా నిరంతరం మానవాళికి చేయబడుతూ వచ్చిన తాకీదు కూడా కావచ్చు. మరికొంత మంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతులోని 'వాగ్దానం' అంటే భూమ్యాకాశాలలో అల్లాహ్ నెలకొల్పిన సహేతుక నిదర్శనాలు అని అర్థం.
షైతాన్ మీ బద్దవిరోధి కావటం వల్లనూ, మిమ్మల్ని మార్గభ్రష్టుల్ని చేస్తానని శపథం చేసి ఉండటం వల్లనూ మీరు ఎట్టి పరిస్థితిలోనూ వాడి దాస్యం చేయరాదని మీకు తాకీదు చేయటం జరిగింది.
షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా! వాడు మీకు బద్ధ విరోధి.
తీర్పు ముగిసిన తరువాత షైతాన్ వారితో ఇలా అంటాడు: “నిశ్చయంగా మీకు అల్లాహ్ చేసిన వాగ్దానాలన్నీ నిజమయ్యాయి. కాని నేను చేసిన వాగ్దానాలలో ఒక్కటీ నిజం కాలేదు. అసలు మీ చేత బలవంతంగా ఏదైనా చేయించడానికి మీమీద నాకేదైనా శక్తి ఉంటే కదా! నేను మిమ్మల్ని నా మార్గం వైపు పిలిచాను. అంతే, మరేమీ చేయలేదు. మీరే నా పిలుపునకు స్పందించి వచ్చారు. కనుక మీరిప్పుడు అనవసరంగా నన్ను నిందించకండి. మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఇక్కడ మీ గోడు నేను ఆలకించలేను; నాగోడు మీరు ఆలకించలేరు. ఇంతకు ముందు మీరు నన్ను అల్లాహ్ కు సాటికల్పించారు. (నాక్కూడా దైవత్వం ఆపాదించారు. అది మీ నిర్వాకమే గాని, నాపని కాదు.) నేను దీన్ని ఖండిస్తున్నాను. అలాంటి దుర్మార్గులకు తప్పకుండా ఘోరమైన శిక్ష పడుతుంది.” (ఇబ్రాహీం: 22)
అంటే తన ప్రవక్తల మార్గాన్ని అనుసరించినవారే మోక్షం పొందుతారని అల్లాహ్ చేసిన వాగ్దానం నిజమైనది. దానికి ప్రతిగా నేను చేసిన నాగ్దానాలన్నీ బూటకమైనవి, మోసపూరితమైనవి అని షైతాన్ కుండబద్దలు గొట్టినట్లుగా చెబుతాడు. ఆ మాటే మరోచోట ఈ విధంగా ప్రస్తావించబడింది: "సైతాన్ మానవులకు (బూటకపు) వాగ్దానాలు చేసి, వారిలో అశలు రేకెత్తిస్తాడు. కాని పైతాన్ వాగ్దానాలన్నీ మోసంతో కూడుకున్నవే" (నిసా - 120)
నా మాటలు ప్రమాణబద్ధమైనవి కావు. నిరాధారమైనవి. అదీగాక నేను ఎన్నడూ మిమ్మల్ని బలవంతం చేయలేదు.నేను కేవలం మీరు పిలుపు ఇచ్చాను. ప సలేని నా మాటలను మీరు ఇట్టే నమ్మేశారు. మరోవైపు మీరు ప్రవక్తల ప్రామాణికమైన మాటలను త్రోసిపుచ్చారు. తప్పంతా మీదేగాని నాది కాదు. మీరు బొత్తిగా ఆలోచించ లేదు. స్పష్టమైన దైవ నిదర్శనాలను తేలిగ్గా కొట్టిపారేసి, బూటకపు వాదాన్ని గుడ్డిగా అనుసరించారు. ఈనాడు మీరు చిక్కుకుని ఉన్న ఆపద నుంచి నేను మిమ్మల్ని గట్టెక్కించలేను. అలాగే మీరు కూడా నన్ను చుట్టుముట్టి ఉన్న దైవాగ్రహం నుంచి కాపాడజాలరు.
మీరు నన్ను అల్లాహ్ కు భాగస్టునిగా చేశారన్న విషయాన్ని కూడా నేను త్రోసిపుచ్చుతున్నాను. ఒకవేళ మీరు ఆ పని చేసివుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. సకల ప్రాణులను పుట్టించినవాడే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయనకు సహవర్తులుగా నిలుడే అర్హత ఎవరికుంది? అని పైతాన్ ఖచ్చితంగా చెప్పేస్తాడు.
ఇక హిత శక్తి - మనసు ఎటువంటిదంటే... మనిషిని ఆ క్షణంలో ఆకర్షిస్తుంది. సమాజంలో చాలామంది విద్యార్థులు కానీ, మరెవరైనా కానీ లక్ష్యసిద్ధిలో హిత శత్రువు చేత పాడవుతారు. ఈ రోజు ఇది నేను ఖచ్చితంగా చదువుకుంటాను... అని నిర్ణయించుకుంటాడు. ఈలోగా క్రికెట్ మొదలౌతుంది. ఈ ఒక్క ఓవర్ చూస్తానంటాడు. అది మరీ ఓవర్ అయిపోతుంది. రేపటి నుండి ఒక్క నమాజు వదలకుండా పాటిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఏదోక ఆకర్షణలో పది దాని వాయిదా వేసుకుంటాడు. అల్లా వాయిదాల వ్యాధి బారిన పడతాడు. అది హిత శత్రువు. ఆ క్షణంలో దాని జోలికి వెళ్లకూడదు. అప్పటికి బాగున్నట్టుంటుంది. కానీ తర్వాత అదే ఓ బలహీనతగా మారి పోతుందిఅప్పటికి చాలా బాగున్నట్లు అనిపించినా ఆ క్షణంలో వినకూడనిది విన్నాడు. అనకూడనిది అన్నాడు. చేయకూడనిది చేశాడు, నడకూడని బాటలో నడిచాడు. తినకూడనిది తిన్నాడు. ఉండకూడని చోట ఉన్నాడు అంతే! పాడయిపోయాడు. . కొన్ని సందర్భాలలో జీవితం కూడా చేజారి పోయే ప్రమాదం ఉంటుంది.
మనసు చేసే మాయ
మనసు కొన్నిసార్లు మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది, మరికొన్నిసార్లు చిన్న సమస్యలను పెద్దవి చేసి భయపెడుతుంది, ఆధ్యాత్మికంగా, మానసికంగా మాయ (భ్రమ) కల్పిస్తుంది, నిజం కాని ఊహల ప్రపంచంలో విహరింపజేస్తుంది. వాస్తవం చిన్నదైనా, మనసు దానిని భూతద్దంలో చూపిస్తుంది. జరిగినదానికంటే జరగబోయే దాని గురించి, జరగని దాని గురించి ఎక్కువగా ఊహించుకుని బాధపడేలా లేదా సంతోషపడేలా ప్రేరేపిస్తుంది. మనసులో ఉండే ఆశలు, భయాలు మనల్ని నిరంతరం కదిలిస్తాయి. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి, భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలకు గురిచేస్తుంది. కొన్నిసార్లు మనసు, ఇహలోక జీవితం శాశ్వతమైనది, సుఖమైనది అనే భ్రమను కల్పిస్తుంది. నిజం కాని విషయాలను నమ్మేలా చేస్తుంది.
పూర్వం రైతు ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి అప్పుడు సుఖపడేవాడు. ఈవేళ పొద్దున మొదలుపెడితే సాయంకాలానికి డబ్బులు కనబడాలి. ఎలా సంపాదించావన్న దానికన్నా ఎంత సంపాదించవన్నది ప్రధానమై పోయిన నాడు విచక్షణ ఎలా ఉంటుంది? ఉద్యోగంలో కానీ, విద్యార్జనలో కానీ తేలికగా పాడు చేసేది ఏదంటే - అడ్డదారి అని ఒకంటుంది. అడ్డదారిలో కాదు, సంకల్ప శుద్ధి, సిద్ధి కలగాలంటే లోభకారకమైన విషయాలకు దూరంగా జరుగుతూ రహదారిలో వెళ్లు. సంపాదించిందేదయినా ధార్మికంగా సంపాదించు, ధార్మికంగానే ఖర్చుపెట్టు. అంతే తప్ప నీవు చేసేది నీకే నచ్చని రోజు, నీవు చేసేదానిని గురించి నీవే ధైర్యంగా నిలబడి మాట్లాడలేని రోజు, నీ పిల్లల దగ్గరకెళ్లి నీవిలా ఉండకూడదు’ అని చెప్పే అధికారం పోయిన రోజు... అటువంటి రోజు రాకుండా బతుకు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి, నీ మనవలకు చెప్పడానికి నీ అధికారం ఎప్పుడూ నిలబడాలి. ‘మీరెవరండీ మాకు చెప్పడానికి’ అని అన్పించుకునే రోజు రాకూడదు. ఆ రోజున... ఆఖరి రోజున... ఆ అల్లాహ్ తీర్పిచ్చే రోజున... ‘‘నీవు శరీరం ఇచ్చావు, ధర్మ శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులన్నీ చేశాను. ఎన్నడూ నేను చెడు చెయ్యలేదు’’ అని పరమ ధైర్యంతో గుండెల మీద చెయ్యి వేసుకుని వెళ్లిపోగలగాలి.
ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికెరుక. అన్నట్టు ఏ మనసులో ఏముందో ఏ ప్రాణికి తెలియకపోయిన -ఆ అందరి గుండెల్లోని గుట్టుని సయితం ఎరిగినవాడు అల్లాహ్. అలా యాళము మన్ ఖలక్ .. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. అన్న మాటంటే అలకెక్కువ అన్నట్టుంటే సమస్య తీరదు. మరింత జఠిలం అవుతుంది.
మనం ఏ పని మీద బయల్దేరినా, ఏ లక్ష్యం మనలో పెట్టుకున్నా మనకు ఎదురయ్యేవి,మనల్ని అడ్డుకునేవి, మనల్ని పాడుచేసేవి రెండుంటాయి-ఒకటి హిత శత్రువు, రెండవది అహిత శత్రువు. హిత శత్రువంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది. కానీ అది శత్రువు. పాడు చేసేస్తుంది. అహిత శత్రువు. అది కూడా శత్రువే. అది కూడ పాడు చేసేస్తుంది. ఒకటి తెలియకుండా, మరొకటి తెలిసి పాడు చేసేస్తాయి. అంటే ఇది పట్టుకుంటే నేను పాడయిపోతానని తెలుస్తుంటుంది. కానీ పట్టుకోకుండా ఉండలేని మన బలహీనతను ఆసరాగా చేసుకుని వశపరచుకుంటుంది.
మానవజాతి మంచి కోసం, మనిషి గొప్ప మనుగడ కోసం, లోక కళ్యాణం కోసం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు దివినున్న అల్లాహ్ ఒక పవిత్రాత్మనుప్రవక్తరూపంలో భువికి పంపాడు. ఆది మానవుడు మరియు ప్రవక్త హజ్రత్ ఆదమ్ (అ) నుంచి మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వరకూ అలా ప్రభవింపజేయబడిన వారే. అలాగే సజ్జనులు, సంఘ సంస్కర్తలు అనేకమంది మానవాభ్యుదయం కోసం, లోక శాంతి కోసం అహర్నిశలు పరిశ్రమింబుచారు. ఇక ఏ ప్రయోజనం కోసం, ఏ లక్ష్యం కోసం మనం జన్మించామో తెలుసుకోని దానికను గుణంగా నిజ దైవాన్ని ఆరాధిస్తూ, ఆయన ఆదేశ పాలనలో తరించడమే జీవితం. మనం పుట్టింది కేవలం ప్రేమించడానికి కాదు, ప్రేమను సాధించడానికి, సాధించిన ఆప్రేమను పది మందికి పంచడానికి, ప్రేమపూరిత వాతావరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచిపోషించడానికి.
జీవితం ఒక యుద్ధం
జీవితమంటే గొప్ప గొప్ప త్యాగాలూ, బాధ్యతలూ కాదు. చిన్నచిన్న ఆనందాలూ, కాస్త దయా, నిరంతరం చిరునవ్వూ-ఆదీ జీవితం" అన్నాడొక వేదాంతి. నిజమే. అదే జీవితం, కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమా? నేటి రోజుల్లో మనిషి జీవితం రోజురోజుకీ ఒక యుద్ధంలా మారుతోంది. ఇందులో ప్రత్యర్థి అంటూ ఎవరూ వుండకపోవచ్చు, పరిస్థితులు కావచ్చు. ఆకస్మిక విపత్తులు కావచ్చు. ఏది ఏమైనా నిరంతరం యుద్ధం చేయవలసిన పరిస్థితి మాత్రం అనివార్యంగా వుంటోంది.
యుద్ధం ఎందుకు చేయాలి? ఎవరితో చెయ్యాలి.
యుద్ధాలు కేవలం స్వార్థం కోసమే రావు. మనుగడకోసం కూడా మనం యుద్ధం చేయక తప్పదు. ఆయుధం చేపట్టాను, నేను యుద్ధం చేయను' అని కూర్చుంటే శత్రువు మనల్ని ఆక్రమించేస్తాడు. ఈ యుద్ధం మాతృ గర్భంలోనే మొదలయింది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. గర్భ చర్చిలో ప్రవేశించడానికి పోటీ పడే కొన్ని కోట కణాలతో పోరాడి ఒకటి రెండు కణాలు మాత్రమే లోపలి ప్రవేశిస్థాయి.. అదే మనం. అలా మొదలయిన మన జీవన పోరాటం - తర్వాత కూడా అనేక విషయాల కోసం ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. మన బాండీలో ప్రాణమున్నంత వరకు ఈ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.
మేము మానవుడ్ని అవిరళ కృషీవలునిగా, నిరంతర శ్రమజీవిగా పుట్టించాము. (అల్-బలద్:4)
చిన్న ఉపమానము -స్కూల్లో అప్పుడే జాయిన్ అయిన అయిదేళ్ళ కుర్రవాడు. ఆ కొత్త పరిస్థితులలో తాను ఇమడటం కోసం తనకు తెలియకుండానే యుద్ధం చేస్తాడు. ఈ విధంగా యుద్ధం, ఘర్షణ, పోరాటం అనేది మనిషి పుట్టినప్పటినుంచీ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఈ యుద్ధంలో కత్తులు, కఠార్లు, ఆయుధాలు ఇవేమీ వుండవు. తమ జీవితాలలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారందరూ నిరంతరం యుద్ధంచేసి గెలుస్తూ వచ్చినవాళ్ళే, యుద్ధం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ జీవితంలో నిరాసక్తత ప్రారంభమవుతుంది. మనం ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు. మానసికంగా మన మరణం కూడా సంభవించి వుండవచ్చు. కాని అక్కడనుండి తిరిగి జీవితాన్ని ప్రారంభించి మనం విజయం సాధించాలి. అలా సాధించినవాళ్ళే గొప్పవాళ్ళయ్యారు. చిన్న చూపు చూసినోడి ముందు, నువ్వెంతని వాగినోడి ముందు, పడు పడు పడు లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు నిలబడి తలబడి,కలబడి విజయాల వెంట పడు. అడగకెపుడూ ఎవరినయినా న్యాయము సాయము
జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. రంగం ఏదయినా తొలిమెట్టు ఎక్కి ఆగకుండా సాగడంతోనే విజయ సోపానం సాధ్యం. సమస్య ఏదయినా ఆ సమస్య సుడిగుండాల్ని దాటడంలోనే, కష్టాల కడగండ్లనీ ధైర్యంగా ఢీ కొట్టి నిలబడటంలోనే విజయం దాగుంటుంది. మనం చేపట్టే ఏ పని అయినా, పనిముట్లయినా పట్టిన పట్టు పట్టు విడవకుండా గట్టి పట్టుదలతో గమ్యం చేరేట్టు ఓ పట్టు పట్టాలి. పట్టు పురుగల్లే ఒకే చోట పది ఉండక చైతన్య దీపికలయి ప్రజ్వాలిల్లాలి. వెలగాలి, వెలుగుల్ని పంచాలి. టక్కరి శత్రువుల మెడలు వంచి, తలలు తుంచి, పొగరు వగరును దించి, దగామోసాలను దంచి, గర్వాహంకారాలను తగ్గించి జయశాలి అయి విజయకేతనం ఎగురవేయాలి. విశ్వాస బలముంది దైవ దూతల పక్క బలముంది అండగా అల్లాహ్ తోడుంది... ఇక అసత్యం, అధర్మం పాలిట నుడుగయ్యేలా, అన్యాయం, అవినీతిని ముంచి అట్టడగున సమాధి చేసే మహా మడుగయ్యేలా మన అడుడు- ముందడుగు ఉండాలి. హిత శత్రువును జయించి, అహిత శత్రువును మట్టి కరిపించి అజాత శత్రువుగా చిరస్థాయికి చేరుకొని చరిత్రలో నిలిచిపోయాలా మనకంటూ కొన్ని పుటల్ని నమోదు చేసుకోవాలి. మనం అందరి మేలును కోరే మహర్షులం కాలేకపోయినా, ఏ ఒక్కరికి హాని తలపెట్టని గొప్ప మనసున్న మనీషిగా బతికితే జీవితం ధన్యం.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు