రమజాను మాసం కారుణ్య మేఘమయిన మనపై వాలింది. మహిమాన్విత ఋతువు. వరాల వసంతం. గౌరవ ప్రదమయిన నెల. అల్లాహ్ ఈ పవిత్ర మాసాన్ని తనివితీరా ఆస్వాదించేలా, సత్య ధర్మాన్ని సంఫూర్ణం గా అమలు పర్చేలా, సత్కార్యాలకు శ్రీకారం చుట్టేలా, సత్యోపదేశానికి సన్నద్ధులయ్యేలా, సత్య మార్గం మీద సహన స్థయిర్యాలు కలిగి జీవించేలా దీవించాలని మనః పూర్వకంగా కోరుకుంటున్నాము.
అది సహనం, నిగ్రహం చూపవలసిన మాసం. అవసరారులను ఆదుకోవాల్సిన మాసం. అగత్యపరులను, అభాగ్య జీవులను ఆదుకోవాల్సిన మాసం. అనాథలను అక్కున చేర్చుకోవాల్సిన మాసం. వితంతువుల బాగోగులు చూడాల్సిన మాసం. అది శుభాల శ్రావణం. అధి ప్రకాశ తోరణం. అది కారుణ్యవారుణి. అది అనుగ్రహ వర్షిణి. అది వరాల వాహిని. అది విశాంత ప్రశాంతతలో ప్రభాత గీతిక. అది విశ్వాస జన సమా జానికి చైతన్య దీపిక.
”విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరయితే రమ జాను ఖియామ్ (తరావీహ్ నమాజు) చేస్తారో వారి గత పాపాలన్ని మన్నించ బడతాయి”. (బుఖారీ, ముస్లిం)
రోజుకి అయిదు పూటల నమాజు విధి అంటే, మూడు నమాజులు రాత్రిలోనే ఉన్నాయి. రాత్రి ప్రార్థన విశిష్థతను తెలియజేస్తూ వ్రవక్త (స) ఇలా ఉపదేశించాడు: ”ఫర్జ్ నమాజు అనంతరం శ్రేష్ఠ స్థాయి నమాజు రాత్రి నమాజు (తహజ్జుద్)”. (ముస్లిం)
వేరోక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఓ ప్రజలారా! సలాంను సర్వ సాధా రణం చేసుకోండి. అన్నదానాలు చేపట్టండి. బంధుత్వ సంబంధాలను బల పర్చండి. ప్రజలు నిద్రిస్తుండగా రాత్రి పూట నమాజు చేయండి. స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశించండి”. (తిర్మిజీ)
”రాత్రి నమాజు రెండేసి రకాతులు” అని సెలవ్చిన ప్రవక్త (స) వారు చెప్పిన మరో అద్భుత విషయం – ”ఇమామ్‌తోపాటు ఖియామ్ చేసి ఇమామ్ నమాజు నుండి వెనుదిరిగేంత వరకూ ఆయనతోనే ఉంటే అలాంటి వ్యక్తి ఆ రాత్రి సాంతం ఖియామ్ చేసిన ఫుణ్యం వ్రాయ బడుతుంది” అన్నారు. (అహ్లుస్సునన్)
కాబట్టి ప్రవక్త (స) వారు ఆనవాయితీగా చేసినా 11 రకాతుల నమాజు ను సున్నత్‌గా భావించి, అంతటితోనే ఆగి పోకుండా ఇంకా ఎక్కువగా నఫిల్ ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయాలి. ముస్లిం సమాజంలో ఉన్న పాక్షికాలను ప్రస్తావించుకుంటూ, విభేదాలు సృష్టిస్తూ రమజాను పుణ్య కాలాన్ని హననం చేయడం ఎంత మాత్రం హర్షనీయం కాదు.
తరావీహ్ నమాజును ఒక పవిత్ర ప్రార్థనగా చెయ్యాలి. ఏదో బరువు దిందుకున్నట్లు తొందర తొందరగా చెయ్యడం సమంజసం కాదు. ఖుర్‌ఆన్ పారాయణంలో తర్‌తీల్ ఉంటేనే ఖుర్‌ఆన్‌కు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చినట్లు. తర్‌తీల్ అంటే ప్రతి అక్షరాన్ని దాని స్థానం నుండి స్పష్టంగా పలకడం. సరయిన అక్షర ఉచ్చారణ, వాక్య ఉచ్చారణ లేని పారాయణం నిషిద్దం అని తెలుసుకోవాలి. కొందరు ఒక్క చిన్న ఆయతు చదివి రుకూ చేసేస్తూ ఉంటారు. ఇది గర్హించదగిన విషయం. తరావీహ్ అసలు ఉద్దేశ్యం ఖుర్‌ఆన్‌ను ఎక్కువగా పారాయణం చెయ్య డం అని గ్రహించాలి.
షరీఅతు పరమయిన ఎలాంటి ప్రమాదం లేకపోతే స్త్రీలను సయితం తరావీహ్ నమాజులో పాల్గొనే అనుమతి ఇవ్వాలి. అలాగే తరావీహ్ నమాజు రమాజను మాసంతో ముడి పడి ఉన్న నమాజు గనక నఫిల్ నమాజే కదా అన్న నిర్లక్ష్యం తగదు. ఈ నమాజు ద్వారా అల్లాహ్ మన గత పాపాలను ప్రక్షాళించుకునే సువర్ణవకాశాన్ని రమజాను మనకు కల్పిస్తుంది.
”విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరయితే లైలతుల్ ఖద్ర్ ఖియామ్ చేస్తారో వారి గత పాపాలు మన్నించ బడ తాయి”. (బుఖారీ, ముస్లిం)
లైలతుల్ ఖద్ర్ అంటే ఏమనుకుంటున్నారు? అది వెయ్య మాసాల కన్నా ఘనమైనది. స్వయంగా ప్రవక్త (స) ఈ రాత్రి అన్వేషణలో మొదటి దశకంలో ఏతికాప్ పాటించారు. అందులో లేదు అని తెలిసి, తర్వాతి దశకంలో ఏతికాప్ పాటించారు. అందులో కూడా లేదని తెలిసి చివరి దశకంలో ఏతికాప్ పాటించారు. చివరి థకం లో ఉందని తెలిసినప్పి నుండి తుది శ్వాస ఆగేంత వరకూ ఆయన ఏతికాఫ్‌ను వదల లేదు. హజ్రత్ అయిషా (ర.అ) ఇలా అన్నారు: ”చివరి దశకం ప్రారంభవగానే ప్రవక్త (రాత్రి ప్రార్థనకై) నడుం బిగించేవారు. (చివరి దశకం సాంతం రాత్రి పూట సయితం లైంగిక వాంఛకు దూరంగా ఉండేవారు). రాత్రంతా మేల్కొనేవారు. ఇంటిల్లిపాదిని మేల్కొలిపేవారు”. (బుఖారీ)
రమ జాను మాసం మనందరి పాలిట మహదానుగ్రహం. ఒక వ్యక్తికి వంద కోట్లు ఫలానా రోజు దొరుకుతాయి అని ఖచ్చితమయిన సమాచారం అందితే ఆ వ్యక్తి ఆ దినం కోసం కళ్ళలో కొవ్వొత్తులు వెలిగించుకొని ఎలాగయితే ఎదురు చూస్తాడో అంతకాన్న ఎక్కువ ఆసక్తితో ఒ నిజమయిన విశ్వాసి రమజాను కోసం ఎదురు చూస్తాడు. చూడాలి కూడా.
ఎందుకంటే వరాలు కుండపోతగా కురిసే మాసం రమజాను గనక. మనిషి ఎంత కూడబెట్టుకున్నా ఏదోక నాడు అన్నింటి భూమి మీదే వదిలేసి కాటికి పయనమవ్వాల్సిందే, కాటి మట్టిలో కలిసిపోవాల్సిందే. అక్కడ మనిషి కూడబెట్టుకున్న వెండిబంగారాలుగానీ, వజ్రవైఢూర్యాలుగానీ, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఎత్తయిన భవనాలుగానీ, ఎంతో ప్రేమతో పెంచుకున్న దట్టమయిన తోటలుగానీ, పచ్చనయిన పొలాలుగానీ ఏవీ పనికి రావు, కేవలం సత్కర్మల సామగ్రి తప్ప. అలాంటి సామగ్రిని పుష్కలంగా మనకందించే మహిమాన్విత మాసం రమజాన్. అంతే కాదు ఈ మాసం ”ఫీహి లైలతున్” అందులో ఓ రాత్రి ఉంది. ఉంటే ఏమిటి? అన్నీ నెనలలో, అన్నీ వారాల్లో, అన్నీ రోజుల్లో ఉండే రాత్రేగా అంటున్నారా!? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ రాత్రికి సమానమయిన రాత్రి మరొకటి లేదు. అదే లైలతుల్ ఖద్ర్. ‘లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహ్ర్’ – అది వేయి మాసాలకన్నా ఘనతరమయిన రేయి. మాసాలంటే సామాన్య మాసాలనుకుందుదు, పొరబాటు; 84 సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరంత రాయంగా, నిరాటంకంగా ఆరాధనల్లో, అల్లాహ్‌ా నామస్మరణలో గడిపితే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా అధిక పుణ్యం ఈ ఒక్క రాత్రిని పొందితే లభిస్తుంది. ఈ రాత్రి పొందటం అంటే ఆషా మాషిగా, అల్లాటప్పగా పొందటం కాదు, భక్తిప్రపత్తులతో ఈ రాత్రని రమజాను చివరి భాగంలో తీవ్రంగా అన్వేషించాలి. ప్రవక్త (స) వారి గురించి మనకు అందే సమాచారం ప్రకారం చివరి థకం రాగానే ‘అహ్యా లైలహు, వ ఐఖజ అహ్లహు వ షద్ద మిఅజర్’ రాత్రిళ్ళు జాగారం చేసేవారు. తమ ఇంటిల్లిపాదిని మేల్కొలిపేవారు. నడుం బిగించేవారు. కంకణం కట్టుకునేవారు”. (ముత్ఫఖున్ అలైహి)
లైలతుల్ ఖద్ర్ ఎక్కువ అవకాశం 27వ తారీఖున ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ, అదే రాత్రి ఉంటుందని నిశ్చయం కాదు. చివరి థకంలోని బేసి సంక్య గల రాత్రుల్లో అన్వేషించాలి.
సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్పవిగా భావించేవారు. రమజాను చివరి థకం, జుల్‌హిజ్జహ్ తొలి థకం, ముహర్రమ్ మొధటి పది రోజులు. ఈ మూడు పదుల్లో రమజాను చివరి దశకానికి అగ్ర పీఠం కట్టబెట్టేవారు. కారణం ఈ పది రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ ఉండటమే. ఈ రాత్రి దైవ దూతల నాయకుడ యిన జిబ్రీల్ (అ) ఇతర దైవ దూతల తోడు దివి నుండి భువికి దిగి వచ్చి ఫజ్ర్ వేళ అయ్యేంత వరకూ ఉంటారు అంటుంది ఖుర్‌ఆన్. లైలతుల్ ఖద్ర్ చివరి దశకంలో బేసి సంఖ్య గల రాత్రుల్లో ఉంటుంది అని స్వయంగా ప్రవక్త (స) వారు తెలియజేశారు. ఇతరత్రా ఉల్లేఖనాల ద్వారా రమజాను 27వ తేదీ ఉండే అవకాశాలు ఎక్కువ గా ఉన్నా అన్య రాత్రులలో సయితం అన్వేషణ కొన సాగాలి. ఆ రాత్రికే పరిమితం అయి పోవడం సబబు కాదు. చివరి దశకంలోని ప్రతి రాత్రి-”అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ” అని దుఆ చేస్తూ ఉండాలి.
ఇమామ్ అహ్మద్ బిన్ హన్బల్ (ర) రమజాను మాసం ప్రారంభమవగానే అధిక శాతం సమయం మస్జిద్‌లోనే గడిపేవారు. ఏదో అవసరార్థం కొద్ది ఇంటికెళ్ళి వచ్చేవారు అంతే. తస్బీహ్, తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ చేసుకుంటూ, ఇస్తిగ్ఫార్ చేసుకుంటూ, ఖుర్‌ఆన్ చదువుకుంటూ ఉండేవారు. ఒకవేళ వుజూ భంగమయితే వెళ్ళి వుజూ చేసుకొని మళ్ళి వచ్చి మస్జిద్‌లోనే గడిపేవారు. ప్రజల్ని ఉద్దేశించి – ఇది పాప ప్రక్షాళనా మాసం. దీనికివ్వాల్సిన గౌరవాన్ని దీనికి ఇవ్వండి. అన్య నెలలో పాపాలకు పాల్పడి ఈ మాసంలో మీకు ప్రాప్తించిన పవిత్రతను పాడు చేసుకోకండి!! అని అంటూ ఉండేవారు.
ప్రవక్త (స) ఇలా అన్నారు: ఉపదేశించారు: ”మీరు అల్లాహ్ పట్ల ఎలా సిగ్గు కలిగి ఉండాలో అలా సిగ్గు కలిగి మసలుకోండి’ అన్నారు. అది విన్న సహచరులు – ‘అల్‌హమ్దు లిల్లాహ్‌ా మేము అల్లాహ్‌ా యెడల సిగ్గు కలిగే వ్యవరిస్తాము’ అన్నారు. అలా కాదు, అల్లాహ్ యెడల సిగ్గు కలిగి ఉండటం అంటే, మీ తలను (మేధను), దాంతో ముడిపడి ఉన్న వాటన్నింటిని(చెవులు, నోరు, కళ్ళు) చెడు నుండి కాపాడుకోవాలి. కడుపు దానితో ముడిపడి ఉన్న వాటన్నింటని (మర్మాంగం, కాళ్ళు, కడుపు) అధర్మ విషయాల నుండి కాపాడుకోవాలి”. (తిర్మిజీ) ఇదే నియమం రమజాను మాసంలో, అన్య మాసాల్లో మనం చేసే అన్ని ఆరాధనలకూ వర్తిస్తుంది.
రమజాను చివరి రాత్రి అల్లాహ్ ముస్లిం సముదాయానికి క్షమాభిక్ష పెడతాడు. వారికి చెందాల్సిన వెతనాన్ని ఆ రాత్రినే పంచి పెడతాడు.
అల్లాహ్ మనందరి తప్పిదాలను మన్నించి, ఇహపరాల మనల్ని సఫలీకృతుల్ని చేయుగాక! ఆమీన్

