Thursday, April 9, 2026
చేతనయినంత...సమాజానికి కొంత
దైవమార్గంలో ఏం ఖర్చు పెట్టాలని కూడా వారు నిన్నడుగుతున్నారు. తమ అవసరాలకు పోగా మిగిలింది (చేతనయినంత...సమాజానికి కొంత) ఖర్చుచేయాలని చెప్పు వారికి. మీరు ఇటు ప్రపంచం గురించి, అటు పరలోకం గురించి యోచిస్తారని అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా వివరిస్తున్నాడు. (అల్-బఖరహ్: 219)
సర్వ స్తుతులు, సకల ప్రసంశలు అల్లాహ్ కే దక్కుతాయి, ఆయన మనకు విశ్వంలోని విశిష్టమయిన దేశాన్ని అనుగ్రహించాడు. భద్రత, శాంతి మరియు విశ్వాసం (ఈమాన్) అనే గొప్ప వరాలతో మనల్ని సత్కరించాడు. అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్ (స) పై, వారి కుటుంబీకులపై మరియు అనుచరులపై ఎల్లప్పుడూ ఉండుగాక! కరెక్టుగా 76 ఏళ్ల క్రితం జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర దేశం ఆవిర్భవించింది. కొద్దీ రోజుల క్రితమే మనమూ 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ శుభ సందర్భంగా దేశాన్ని మట్టిగా, మతంగా కాకుండా మనుషులుగా చూడటం నేర్చుకోవాలి. ‘స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్నా గురజాడవారి మాట మనందరికీ ఆచరజీయమవ్వాలి.
సాధారణంగా యుద్ధం జరుగుతున్న దేశాల్లో ప్రజలు భయం, ఆందోళన మరియు అస్థిరతకు గురవుతారు. జీవన పరిస్థితులు తలకిందులవుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఆహార కొరత, వస్తువుల అక్రమ నిల్వ మరియు ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల సమాజంలో గందరగోళం మరియు భయాందోళనలు వ్యాపిస్తాయి. ఒక్క యుద్ధం తప్ప మిగతా సమస్యలన్నిటితో మన గణతంత్ర భారత భవితవ్యం మరింత భారంగా తయారయింది. ఇన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నా అల్లాహ్ అపారమైన కరుణ వల్ల, ప్రజల విశ్వాసం వల్ల... మనం దేశంలోని అన్ని మూలల్లో (తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ) ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాము. మనం సాధారణ రోజువారీ జీవితాన్ని గడుపుతున్నాము. ప్రజలు భయం లేకుండా తమ వ్యాపార, విద్యా, ఉద్యోగ మరియు వినోద కార్యకలాపాలను కొనసాగి స్తున్నారు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:"ఎవరైతే తన ఇంట్లో భయం లేకుండా (శాంతిగా) నిద్రలేస్తాడో, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటాడో, ఆ రోజుకు సరిపడా ఆహారం అతని వద్ద ఉంటుందో, అతనికి ఈ లోకపు సంపద అంతా దక్కినట్లే." (తిర్మిజీ) మరి దేశం కూడా మన ఇల్లెగా...
మన బాధ్యత:
దైవభీతి (తఖ్వా): మనందరి సృష్టికర్త నిజ దైవం పట్ల భక్తిని కలిగి ఉండాలి.
దేశ అభిమానం: మన ప్రియమైన మాతృభూమి పట్ల అమిత వాత్సల్యం కలిగి ఉండాలి.
దేశ రక్షణ: దేశాన్ని రక్షించుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నించాలి, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి.
సఖ్యత - ఐక్యత: దేశ భద్రతకు భంగం కలిగించే ప్రయత్నాలను, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను ఎదుర్కోవాలి.
నమ్మకం: కుల మతాలకతీతంగా దేశం కోసం కష్టపడుతున్న నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తులపై సందేహాలు పెంచుకోకుండా వారిని సమర్థించాలి.
మనందరిది పడవ ప్రయాణం
నౌమాన్ బిన్ బషీర్ (రజిఅల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "అల్లాహ్ విధించిన హద్దులను పాటించేవారు మరియు వాటిని అతిక్రమించేవారి ఉదాహరణ ఒక ఓడలో ప్రయాణించే వ్యక్తుల వంటిది. వారు ఓడలో ఎవరికి ఏ చోటు దక్కాలో నిర్ణయించుకోవడానికి లాటరీ వేశారు. దానివల్ల కొందరికి పై అంతస్తు, మరికొందరికి క్రింది అంతస్తు దక్కాయి.
క్రింద ఉన్నవారు నీటి కోసం పైకి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు వారు, 'మనం మనకు దక్కిన చోటులోనే (ఓడ అడుగున) ఒక రంధ్రం చేస్తే, పైవారికి ఇబ్బంది కలగదు కదా' అని అనుకున్నారు. ఒకవేళ పైవారు వారిని వదిలేసి, వారు చేయాలనుకున్నది చేయనిస్తే, ఓడలో ఉన్నవారందరూ మునిగిపోతారు. కానీ వారు వారిని ఆపి, సరిదిద్దితే, వారూ బ్రతుకుతారు మరియు ఓడలో ఉన్నవారందరూ సురక్షితంగా ఉంటారు." (సహీహ్ బుఖారీ)
పాలకులతో ఎలా ఉండాలి?
ఉమ్మ్ సలమా (రజిఅల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "భవిష్యత్తులో మీపై కొందరు పాలకులు నియమించబడతారు. వారి పనులలో కొన్ని మంచివి (ధర్మానికి అనుకూలమైనవి), మరికొన్ని చెడ్డవి (ధర్మానికి వ్యతిరేకమైనవి) మీరు చూస్తారు. ఎవరైతే ఆ చెడును మనసులో అసహ్యించుకుంటారో, వారు బాధ్యత నుండి విముక్తులవుతారు. ఎవరైతే ఆ చెడును (మాటతో లేదా చేతతో) ఖండిస్తారో, వారు శిక్ష నుండి రక్షించబడతారు. కానీ ఎవరైతే ఆ చెడును చూసి సంతోషించి, వారిని అనుసరిస్తారో (వారే నష్టపోతారు)."
అప్పుడు సహాబాలు, "ఓ అల్లాహ్ ప్రవక్త! మేము వారిపై యుద్ధం చేయాలా?" అని అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), "వద్దు, వారు మీ మధ్య నమాజును కొనసాగించినంత కాలం వారిపై యుద్ధం చేయకండి" అని సమాధానమిచ్చారు. (సహీహ్ ముస్లిం)
ముఖ్య గమనిక
ఈ రెండు హదీసులు సమాజంలో 'నైతిక బాధ్యత' మరియు 'చెడును అడ్డుకోవడం' గురించి వివరిస్తాయి. మొదటి హదీసు సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెబితే, రెండో హదీసు పాలకుల విషయంలో ఓర్పును పాటిస్తూనే, ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది.
ఒక పౌరుడిగా తన దేశం పట్ల కలిగి ఉండవలసిన బాధ్యతలకు ఇస్లాం ధర్మం ఇచ్చే కొన్ని సూచనలు
1. దేశం పట్ల నిజాయితీ మరియు విశ్వసనీయతతో వ్యవహరించడం
ప్రేమకు ప్రధాన లక్షణం నిజాయితీ. ప్రవక్త గారి మక్కా ప్రేమ: ప్రవక్త ముహమ్మద్ (స) మక్కాను విడిచి వెళ్లేటప్పుడు ఇలా అన్నారు: "ఓ మక్కా! నువ్వు నాకు అత్యంత ప్రియమైన పట్టణానివి. నా ప్రజలు నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టకపోయి ఉంటే, నేను నిన్ను వదిలి వేరే ఎక్కడో నివసించేవాడిని కాదు."
ద్రోహానికి పాల్పడరాదు: "ఎవరైతే మోసం చేస్తారో, వారు మాకు చెందిన వారు కాదు." (హదీసు).
కపటత్వం (మునాఫిక్) లక్షణాలు: అబద్ధం చెప్పడం, వాగ్దానాన్ని ఉల్లంఘించడం మరియు నమ్మకద్రోహం చేయడం కపటత్వానికి చిహ్నాలు.
2. జాతీయ భద్రతకు సహకరించడం
అనుమానాలను వీడటం: ఇతరులపై అనవసరమైన అనుమానాలు పెంచుకోరాదు.
"ఓ విశ్వాసులారా! అధిక అనుమానాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపంతో సమానం." (అల్-హుజురాత్: 12).
సామాజిక రుగ్మతల నిర్మూలన: ఉగ్రవాద ముప్పులు, మాదకద్రవ్యాలు మరియు అంటువ్యాధుల నుండి దేశాన్ని రక్షించడంలో తోడ్పడాలి.
ముస్లిం నిర్వచనం: ప్రవక్త (స) ఇలా అన్నారు: "ఎవరి నాలుక మరియు చేతి వల్ల ఇతరులు సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన ముస్లిం."
దేశ శాంతి కోసం ప్రార్థన: ఇబ్రహీం (అలైహిస్సలాం) తన దేశం గురించి ఇలా ప్రార్థించారు:
"ఓ నా ప్రభువా! ఈ నగరాన్ని శాంతి నిలయంగా మార్చు." (అల్-బఖరా: 126)
పొరుగువారి భద్రత: ఎవరి పొరుగువారు అతని కీడు నుండి సురక్షితంగా ఉండరో, అతను నిజమైన విశ్వాసి కాదు. (బుఖారీ(
3. చట్టాన్ని గౌరవించడం
నాయకత్వానికి విధేయత: "అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి మరియు మీలోని నాయకులకు (అధికారులకు) విధేయత చూపండి." (అన్-నిసా: 59).
అవినీతికి దూరం: లంచం ఇచ్చేవాడిని మరియు తీసుకునేవాడిని ప్రవక్త (స) శపించారు.
మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించకండి. ఇతరుల సొత్తు కాజేసే ఉద్దేశ్యంతో ఆ వ్యవహారాన్ని అధికారుల దగ్గరకు తీసికెళ్ళకండి. (అల్-బఖరా: 188)
చట్టాల పాలన: ఆస్తి చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు పర్యావరణ చట్టాలను ప్రతి ముస్లిం తప్పనిసరిగా పాటించాలి.
4. దేశాభివృద్ధి మరియు పురోభివృద్ధిలో భాగస్వామ్యం
మంచి పనుల్లో సహకారం:"పుణ్యకార్యాల్లో మరియు దైవభీతి గల పనుల్లో ఒకరికొకరు సహకరించుకోండి; పాపకార్యాల్లో మరియు అక్రమాల్లో సహకరించుకోకండి." (అల్-మాయిదా: 2).
అభివృద్ధి కోసం ప్రార్థన: ప్రవక్త ముహమ్మద్ (స) మదీనా నగరం యొక్క ఆర్థిక సమృద్ధి మరియు ఆశీర్వాదాల కోసం ప్రార్థించారు.
యూసుఫ్ (అలైహిస్సలాం) ఉదాహరణ: హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) తన పరిపాలనా దక్షతతో ఈజిప్టు దేశాన్ని కరువు నుండి రక్షించి, ఆ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గురజాడ ప్రబోధించిన దేశభక్తి అత్యంత ఆచరణాత్మకమైనది. ఆయన "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అని ప్రకటించడం ద్వారా దేశం యొక్క సరిహద్దుల కంటే, ఆ సరిహద్దుల లోపల నివసించే మనుషుల క్షేమమే ముఖ్యమని చాటిచెప్పారు.
పంచభూతాలు నేర్పిన పాఠం
పంచ భూతాలు (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) జీవన మనుగడకు, విశ్వ సమతుల్యతకు మూలాధారాలు. ఇవి శరీరాన్ని, ప్రకృతిని ఆరోగ్యంగా, సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సద్వినియోగపరచుకుంటే, అవి మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును మరియు ప్రశాంతమైన, సుఖమయమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి. వీటి ప్రస్తావన ఎందుకు అంటారా? ప్రపంచ ప్రజల్ని ప్రక్రుతి వైపరీత్యాలు పొట్టన బెట్టుకుంటున్నాయి చాల మంది అంటున్నారు!! ఇందులో పిసరంత నిజం ఉన్న అది ఎంత పెద్ద అబద్ధం!!
అవును, మనుషులపై మనుషులు అణచివేతకు పాల్పడినప్పుడు నీరు ముంచి చంపుతుంది!! లక్షలకోట్లకు పడగలెత్తిన ఆసాములు ఎందరో ఉన్నా, ఎముకలు తినేసే చలిలో కప్పుకోవడానికి ఒక దుప్పటిని ఇవ్వలేనప్పుడు నిప్పు కాల్చి చంపుతుంది!! బిలియన్ల కొద్దీ ధనం ఉన్నా, గూడు లేని వారికి ఒక గుడారాన్ని (Tent) ఏర్పాటు చేయలేనప్పుడు ఆకాశం ప్రకోపించి కుబేరులే కకావికలమయ్యేలా మతులు పోయేలా మెరుపులు కురిపించి చంపుతుంది!! ఒక మనిషి సాటి మనిషిని ఆదుకోవడంలో విఫలమైనప్పుడు భూమి ప్రకంపించి నింగినంటే నిర్మాణాల్ని రెప్పపాటు నేలకూల్చి కాల క్రింద భూమి లేకుండా చేస్తుంది. ధర్మం మరుగై, న్యాయం కరువయి, కరుణ ఆవిరయి, దయా ధూపమయి, విలువలు వలువలు వీడినప్పుడు తుఫాను రూపామ్ ధరించి గాలి చంపుతుంది!!
పంచభూతాలొక్కటే ఎప్పుడూ మనల్ని చంపవు.. పంచభూతాలంటే పదవి కోసం ప్రాకులాడే ప్రపంచ దేశాధినేతలు కావు. అవి ఈ మనిషన్న వాడికంటే ఎంతో గౌరవప్రదమైనవి, ఉన్నతమైనవి.. అవి ఈ నీచ వృత్తి, అవినీతి ప్రవ్రుత్తి గల శక్తుల కంటే ఎంతో మేలైనవి!! ఆ మాటకొస్తే, పంచభూతాలు - కత్తితో గొంతు కోయడం కన్నామా? రాకెట్లతో దాడి చేయడం విన్నామా? విష వాయువులను ప్రయోగించడం చూశామా? ఊళ్లకు ఊళ్లను నాశనం చేయడం చదివామా? పంచభూతాలు మనిషి గౌరవ మర్యాదలను మంటగలుపుతాయా? పంచభూతాలు కుట్రలు పన్నుతాయా? నమ్మకద్రోహం చేస్తాయా? దుష్ట శక్తులతో జట్టు కడుతాయా?
మరి వీరికేమైంది? వీరు ఎలా తీర్పు చెప్తున్నారు? పంచభూతాలు నేరస్తులు కావు, అవి నీచమైనవి కావు, నియంత అంతకంటే కావు!! పంచభూతాలు పేదల ఆహారాన్ని, మందులను దొంగిలించవు!! పంచభూతాలు ఎవరికీ సహాయం అందకుండా అడ్డుకోవు!!
వారు ఎన్నో పొలాలు, తోటలు, సెలయేళ్ళు, మేడలు వదలివెళ్ళారు. వారు రంగ రంగ వైభవంతో అనుభవించిన ఎన్నో విలాసవస్తువులు వారి వెనుకే ఉండిపోయాయి. ఇదీ వారి (అహంకారానికి) పర్యవసానం. మేమా వస్తువులన్నిటికీ ఇతరుల్ని వారసులుగా చేశాం. వారి దుస్థితి చూసి ఇటు భూమీ ఏడ్వలేదు; అటు ఆకాశమూ ఏడ్వలేదు. వారికి కాస్త కూడా (బ్రతికి బయటపడే) అవకాశం ఇవ్వలేదు. (అద్-దుఖాన్: 25-29)
మాయమై పోతున్నడమ్మా … మనిషన్న వాడు - మచ్చుకైనా లేడు … చూడు మానవత్వము ఉన్నవాడు - నూటికో … కోటికో … ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని … కంటికి కనరాడు. - మాయమై పోతున్నడమ్మా … మనిషన్న వాడు అని కవి చెప్పింది ఇలాంటి మనిషి గురించే. ఆధ్యాత్మికతకున్న అర్ధమే తెలియక … అంధుడై పోతున్నడమ్మా - హిందు, ముస్లిం, క్రీస్తు, సిక్కు, పార్సీ నంటూ … తనను తాను మరిచెనోయమ్మ - మతములోకయితము అర్థమార్ధమరిసి … మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతుతున్నడమ్మా... మనిషన్న వాడు - మచ్చుకైనా లేడు … చూడు మానవత్వము ఉన్నవాడు. సీకటైతె జాలు … చిత్తుగా తాగేసి … వావి వరసలు కాస్తా … మరిగి పోతూ నరుడు.. కాబట్టి వీరిలా... వారిలా కాదు.. ఎవరిలా . మనిషి మంచితనంతో బతికితే చాలు. అదే మనం సర్వే జానా శుఖినోభవంతు అన్న మాటకు చేసే అతి గొప్ప సహాయం. అలాంటి మనుషులిని బతికించు కుందాం.. అల్లాంటి మానవత్వం పునాదుల మీద నమ సమాజ నిర్మాణానికి నడుం బిగించి - స్వతంత్ర సమరం అమరవీరులయిన అందరికి అద్భుత నివాళిని అర్పించుదాం! బతుకుదాం, బతకనిద్దాం, వీలయితే బతుకునిద్దాం! జై హింద్!!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు