Sunday, August 21, 2022

Thursday, August 11, 2022

Tuesday, August 9, 2022

‘జన భారత్‌’ ‘జయ భారత్‌’ అవ్వాలంటే...

కోయిల తన భాష తను మాట్లాడుతుంది. అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది. అందుకే అది స్వాతంత్య్రం కోల్పోయి పంజరంలో ఉండాల్సి వస్తుంది. బందీ అయిపోతుంది. ఎవరి భాషను వారు మాట్లాడుతూ ఎవరి ఆలోచనా విధానాన్ని వారు కాపాడుకుంటూఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వారే ముందుకు పోతారు. నిజం మాట్లాడేవారు కష్టాల పాలవుతారేమోగానీపరాజితులు కారు. బానిసలుగా మిగలరు.


అహింస అనేది భారతదేశ సంస్కృతి, నాగరికతల్లో మొదటినుంచీ అంతర్భాగంగా ఉన్నదే. ఆదర్శంగా ఉన్న అహింసను స్వాతంత్ర్య సమరానికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ మహాత్ముడిదే. స్వాతంత్య్రోద్యమానికి- వందేమాతరం, జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలు, చర్జా, రాఖీ, ఉప్పు, ఖద్దరు వంటి శక్తిమంతమైన ప్రతీకలు అదనపు అస్త్రాలుగా తోడయ్యాయి. జనబాహుళ్యాన్ని స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా ఉద్ధృతంగా పాల్గొనేలా పురిగొల్పాయి. అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ సాధించిన సందర్భం చరిత్రలో మరొకటి లేదు. ఇప్పటికీ గాంధీజీ స్ఫూర్తితోనే ప్రపంచంలో పలు ఉద్యమాలు అహింసాయుతంగా సాగుతున్నాయి. అహింసతో అనుకున్నది సాధించవచ్చునని రాజకీయ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.


చెట్టపట్టాల్‌ పట్టుకుని

దేశస్తులందరు నడువ వలెనోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయ్ !

గురజాడ వారు  రాసిన గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంస్కర్తలుమేధావుల ఆకాంక్షనే గాక ఆలోచనా రీతిని తెలియజేస్తాయి. వందలాది మతాలుజాతులుభాషలు గల ఈ దేశం కలసి కట్టుగానే ముందుకు సాగాలని వారు స్పష్టంగా గుర్తించారు.  సామాన్యుల నుంచి సామ్రాట్టుల వరకూ ప్రగాఢమైన మత విశ్వాసాలు ఎప్పుడూ వున్నాయి. వాటి ప్రభావమూ వుంది.  అయినా 'ఏ మతమైనా బోధించదుగా ద్వేషాన్ని రూపుదిద్దుదాం భిన్నత్వంలో ఏకత్వాన్ని’ అన్న అల్లామా ఇక్బాల్ వారి మాట స్ఫూర్తిగా ముందుకు సాగాలి.



''దేశమంటే సామాన్యులు! సామాన్యుల విద్యవికాసాలపైనసాంస్కృతిక పునరుజ్జీవనం పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రజాచైతన్యం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుంది'' గ్రుండ్‌విగ్‌, (ఫోక్‌ స్కూల్‌ రూపకర్త: డెన్మార్క్‌) మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే... మనుషుల్ని చంపిమతాన్ని బతికిస్తామనే రోజులు  పోయిమనుషులిని చంపే మతాన్ని నాశనం చేసిమానవత్వాన్ని నిలబెడదామనే అచ్చే దిన్  రావాలి!

బహుళ జాతి దేశాన్ని ఏకతాటిపై నిలిపేందుకు మతం సరిపోదని స్వాతంత్య్ర ఉద్యమం కూడా సరిగ్గానే గ్రహించింది. ప్రతి మతాన్ని దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేస్తేనే భారతదేశం లాంటి పెద్ద దేశంవైవిధ్య భరిత దేశంఒక దేశంగా కలిసి ఉండగలదని మన పూర్వీకులు వారి అవగాహనలో ఖచ్చితంగానే ఉన్నారు. శాంతిస్ధిరత్వానికి సంబంధించిఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, 1947 నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగిందంటే లౌకికవాదం పట్ల మనకున్న నిబద్ధతే కారణమనేది వాస్తవం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందువులుముస్లింలుసిక్కులుక్రైస్తవులు కలిసి పోరాడారని మనం గుర్తుంచుకోవాలి. 1857లో భారతదేశ మొదటి స్వాతంత్య్ర సమరానికి నానా సాహిబ్‌బహదూర్‌ షా జఫర్‌మౌల్వీ అహ్మద్‌ షాతాంతియా తోపేఖాన్‌ బహదూర్‌ ఖాన్‌రాణి లక్ష్మీబాయిహజ్రత్‌ మహల్‌అజీముల్లా ఖాన్‌ఫిరోజ్‌ షా వంటి నాయకులు సంయుక్తంగా నాయకత్వం వహించారు. హిందువులుముస్లిములు కలిసి అత్యున్నత త్యాగం చేసిన సందర్భాలతో మన చరిత్ర నిండి ఉంది. అయోధ్య నేడు మతపరమైన ముఖ్య కేంద్రంగా మారినప్పటికీనాడు, 1857లో అయోధ్య లోని ప్రముఖ మౌల్వీ మౌలానా అమీర్‌ అలీసుప్రసిద్ధ హనుమాన్‌ ఆలయానికి చెందిన బాబా రామ్‌చరణ్‌ దాస్‌ కలిసి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనను నిర్వహించడంలో నాయకత్వం వహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కారణంగా వారిద్దరినీ పట్టుకుని ఒకేసారి అయోధ్య లోని ఫైజాబాద్‌ జైలులో ఉన్న కుబేర్‌ టీలా వద్ద చింత చెట్టుకు ఉరితీశారు.

భారతదేశం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అదుపు లేని ధరలురెక్క లొచ్చిన ద్రవ్యోల్బణంపాతాళానికి...డబ్బు విలువఆరుగాలం శ్రమించి పంట బకాయిల కోసం చకోర పక్షుల్లా హాలికులునిరసన హక్కు తీవ్రవాద కార్యకలాపాల మధ్య రేఖ మసకబారి హక్కులకై పోరాడే శ్రామికులపై తప్పుడు కేసులుకాలంచెల్లిన చట్టాలతో రాజద్రోహాలు చేతులకు సంకెళ్లు వేసి గొంతులను సమాధి చేసే రాజ్య క్రూరత్వానికి బలవుతున్న పోరాటయోధులు ఉద్యోగులకార్మికుల నిరసనలపై ఆర్డినెన్సులు సృజనాత్మకతపై దాడి అధ్యక్ష తరహా పాలన సాగించే అత్యున్నత కార్యాలయాలు గ్రామ పంచాయితీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలు ఒక్కటేమిటి పాలన అస్తవ్యస్తం వ్యవస్థల తీరు చూసి నిస్సహాయ స్థితిలో ఓ తరం ఇదే...ఇదే నేటి భారతం.

వాహనానికి ఇంధనం... దేహానికి రుధిరం ఎలాగో... దేశానికి యువతరం అలాగ. అందుకే అంటాడో కవి... 'యువతరం శిరమెత్తితే/ నవతరం గళమెత్తితే/ లోకమే మారిపోదా/ చీకటే మాసిపోదా...అని. ఇలాంటివారిని ఉద్దేశించి... 'కొంతమంది యువకులు రా/ బోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలుఅంటాడు శ్రీశ్రీ. లక్ష్యాన్ని సాధించడంలో చెరసాలలుఉరికొయ్యలకు సైతం ఎదురు నిలుస్తారు. నవసమాజానికి బాటలు వేస్తారు. 'మాకు గోడలు లేవు/ గోడలను పగులగొట్టడమే మా పనిఅంటూ ముందుకు సాగుతారు వీరు. నిజానికి యువత అంత శక్తిమంతమైనది. నవ సమాజ స్థాపన అయినా... జాతిహిత నిర్మాణమైనా యువశక్తితోనే సాధ్యం. దేశ సంపదభవితకు పునాది... యువత. ఏ దేశ పురోగమనంలోనైనా యువతరానిదే కీలకపాత్ర. 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌అని దేశాన్ని కదిలించిన భగత్‌సింగ్‌ 23 ఏళ్ల వయస్సులో... ' జై హింద్..! అంటూ  జన సామాన్యాన్ని  సయితం చైతన్యబాటలో కదిలించిన యువకిశో రాలు ఎందరో 20 నుండి 30 సంవత్సరాల లోపే...స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించారు. చెక్కుచెదరని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా యువత ఉన్నప్పుడే ఏ జాతి భవిష్యత్తయినా ఉజ్వలంగా వెలుగొందుతుంది.

గుండెల నిండా చేవకరాల నిండా సత్తువ నిండియున్న యువత ఎక్కువగా వున్న దేశం మనది. ఉత్తేజంలోనూఉత్పత్తిలోనూముందుండాల్సిన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన ఉత్పత్తి జరగడం లేదు. యువతలో ఆ ఉత్తేజమూ లేదు. పాలకుల వైఫల్యాల కారణంగా యువతలో శక్తిసామర్థ్యాలు ఉడిగిపోతున్న పరిస్థితి. దీనికి తోడు... దేశంలో వ్యాపింపజేస్తున్న సాంస్కృతిక కాలుష్యం కూడా యువతను పెడితోవ పట్టిస్తోంది.

భారతదేశంలో రోజురోజుకూ మతపరమైన ఏకీకరణ తీవ్రమవుతోంది. రణమాశరణమాఅని కొందరంటేశివం లేదా శవం అన్నది మరికొందరి నినాదం. భారతదేశంలోని మైనారిటీలపై ప్రత్యేకించి ముస్లిం సమాజంపై ద్వేషపూరిత వాతావరణాన్ని వెదజల్లుతున్నారు. హింసహింసను పుట్టిస్తుంది. కాబట్టిపాలస్తీనియన్ల డొమిసైడ్‌ (ఇళ్లను ధ్వసం చేయడం) లాంటి ఇజ్రాయిల్‌ విధానంలాగా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన నిరసనకారులను త్వరితగతిన అణగ తొక్కటానికిశిక్షించటానికి 'బుల్డోజర్‌ఒక కొత్త సాధనంగా ఉద్భవించింది. 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగించిన విషయాన్ని గమనించాలి. కానీ అప్పుడు దాన్ని మానవ సంహారం అన్నాం. ఇప్పుడు దీన్ని గుణపాఠం నేర్పడం అంటున్నారు.

భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల పెరుగుదలనిరుద్యోగంఆర్థిక సంక్షోభంతీవ్రమైన ఆర్థిక అసమానతలుపేదరికం లాంటి సమస్యల పరిష్కారం కోసం తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం ద్వారా... నిజ జీవిత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించటానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అవసరం. ఒక వైపు భారతీయుల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తూమరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని, భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలని ఏ    దేశాభిమాని అయినా  ఎలా ఆలోచించగలడు?

'సుస్థిర సంకల్పాల వెన్నుపూసలు/ ఎదురు దెబ్బలకు/ ఏ మాత్రం వంగిపోవుఅంటూ... నిరాశపై యుద్ధం చేయాలంటారు  డా: సినారె. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో యువకిశోరాలు రగిలించిన స్ఫూర్తిని అణువణువునా నింపుకోవాలి మనం. సృజనను చంపేసి వృద్ధాప్యం నింపిన సమాజంలో నవయవ్వనం చిగురించేలా 'కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులుకాదు- రాబోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలుఅని నిరూపించాలి. ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ ‘జన భారత్‌’ అనిపించుకుంటున్న మనం అదే నోట ‘జయ భారత్‌’ అనిపించుకొనే రోజూ రావాలి! మన దేశానికి ఇప్పుడదే కావాలి!!  


ఇంతవరకు మనం సాధించిన విజయాల స్ఫూర్తినే- మనం ఎక్కవలసిన శిఖరాలను అందుకోవడానికి ఇంధనంగా ఉపయోగించుకోవాలి. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ద్వారా మనం సంపాదించుకున్న స్వరాజ్యం సురాజ్యంగా మారాలనే చైతన్యం దిగువ స్థాయి నుంచే వికసించాలి. పేదరికం, నిరక్షరాస్యత, లింగపరమైన దుర్విచక్షణ, అవినీతి, అసమానతలను రూపుమాపడం మనందరి కర్తవ్యం కావాలి. మన జాతి సృజనాత్మక శక్తుల్ని ప్రయోగించి పటిష్ఠ, పురోగామి నవ భారతాన్ని సాధించాలి. అందరికీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించడం మన ప్రథమ కర్తవ్యం కావాలి. మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చి ఆ రంగంలో విప్లవం తీసుకురావాలి. నవ నిర్మాణ కృషిలో గ్రామీణ భారతం ముఖ్య పాత్రధారి కావాలి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి గ్రామాల్లో మౌలిక వసతులను వేగంగా విస్తరించాలి. భారత దేశం పట్ల ప్రేమాభిమానాలే భారతీయులను స్వాతంత్య్ర పోరాటంలో ఏకతాటిపై నడిపించాయి. వలస పాలకుల దోపిడి, అణచివేతల నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన అసమాన పోరాటాలు, త్యాగాలను సదా మననం చేసుకుంటూ... భావి భారతాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దాలి. సమానత్వం, సిరిసంపదలతో తులతూగే నవ భారతాన్ని నిర్మించాలి.

మహాత్మాగాంధీ 1942 ఆగస్టు 8న ప్రారంభించిన చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం... 1947 ఆగస్టు 15న వలస పాలన నుంచి భారతదేశం విముక్తం కావడానికి దారితీసింది. బొంబాయి గోవాలియా టాంక్ మైదానంలో 'విజయమో, వీరస్వర్గమో...' అని గాంధీజీ ఇచ్చిన పిలుపు- దేశమంతా ఒక్కటై బ్రిటిష్ పాలనకు చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచింది. తమను తామే పాలించుకుంటూ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే దృఢ సంకల్పం సమష్టిగా భారతీయుల్లో పాదుకుంది. అదే వారికి కొండంత ఆత్మస్థైర్యం, ఉత్సాహాలను ఇచ్చి ముందుకు నడిపింది. వలస పాలకులను దేశం నుంచి తరిమేయడానికి చోదక శక్తిగా పనిచేసింది. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన 80 ఏళ్లకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాం. దీన్నిబట్టి క్విట్ ఇండియా ఉద్యమ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘయానంలో స్వతంత్ర భారతం సాధించిన విజయాలను గుర్తు చేసుకుందాం. మనం దాటిన మైలురాళ్లను చూసి గర్వపడదాం. మన ముందున్న సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం.