Sunday, December 29, 2024

Thursday, December 26, 2024

Wednesday, December 11, 2024

Monday, December 2, 2024

నిజమైన మతధర్మ ప్రమాణాలు ఏమిటి?

భూమిపై ఎన్ని మతాలు, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో తెలుసా? వెబ్‌సైట్ (ది రిజిస్టర్) గణాంకాల ప్రకారం, వాటి సంఖ్య 4,300 మతాలు. యాదార్థమేమిటంటే, నిజం ఎప్పుడూ ఒక్కటే, అనేకం కాదు, కాజాలదు. ఆయా మతస్థులను, ఆయా సిద్ధాంతాలను అనుసరించే వారిని - మీరు ఎందుకు ఈ బాటన నడుస్తున్నారు? అడిగితె దానికి అందరూ ఇచ్చే సమాధానం మేము మా తాతముత్తాతలు ఒక సంప్రదాయం పాటిస్తుండగా చూశాం గనక, మేము వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటున్నాము అని. దానికి ఆధారంగా ప్రామాణికత లేని కొన్ని కథలను, మత పెద్దల మాటలను, వార్తలను పేర్కొంటారు. వారిలాంటి మానవులే వ్రాసిన గ్రంథాలను,సూత్రీకరించిన సిద్ధాంతాలను గుడ్డిగా నమ్ముతారు. వారు నమ్మిన వాటినే తరతరాలుగా నమ్మ బలుకుతూ వస్తున్నారు. అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండని అంటే “కాదు, మా తాత ముత్తాతలు అనుసరించినదాన్నే అనుసరిస్తాం” అంటారు వారు. మరి వారి తాతముత్తా తలు తెలివిహీనులైనా, సన్మార్గంలో లేకపోయినా (వారినే గుడ్డిగా అనుసరిస్తారా)? కాపరి పిలుపు తప్ప మరేపిలుపూ వినలేని పశువుల్లా వుంది (ఈ) తిరస్కారుల ధోరణి. వారు (సత్యం వినలేని) బధిరులు, (సత్యం పలకలేని) మూగలు, (సత్యం కానలేని) అంధులు. అందువల్ల వారికిక ఏ విషయమూ తలకెక్కదు. (అల్-బఖరహ్: 170-171)
ఇక్కడ ఇస్లాం ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుంది. సురక్షిత ఆకాశ గ్రంథం కలిగిన ఏకేశ్వరోపాసన (తౌహీద్వి) ధర్మం ఇస్లాం. ఖుర్ఆన్ మనిషి రచన కాదు. విషయ పరిజ్ఞానంలో స్థితప్రజ్ఞులయినవారు ఈ గ్రంథాన్ని వంశపారంపర్యంగా వారి హృదయాలలో భద్ర పరచుకుంటూ, మొత్తం ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు. ఇది గ్రంథ రూపమలోనూ లిఖించ బడి సురక్షితంగా ఉంది, అలాగే కోట్లాది ప్రజల హృదయాలలో సురక్షితంగా ఉంది. అదే విధంగా ప్రవక్త (స) ప్రబోధనలు మరియు ఖుర్ఆన్ వచనాలు మధ్య స్పష్టమైన తేడాను గమనిస్తారు. ప్రపంచంలో పవిత్ర గ్రంథం ,అని చెప్పబడే ఏ ఇతర గ్రంధమైనా, ఒక్క ఖుర్ఆన్ గ్రంథాన్ని మినహాయించి - మార్పుచేర్పులకు గురి కాకుండా ఉందా? మొదటి అక్షరం మొదలు చివరి అక్షరం వరకూ కోట్లాది ప్రజలచే కంఠస్థం చేయబడి ఉందా? తన మత ప్రవక్త ద్వారా పూర్తి ప్రమాణాలతో సహా రూఢీ అయిన, ఎలాంటి సందేహాలకు, సంకోచాలు, సంశయాలకు, శంకలకు తావు లేని ధర్మం ఒక్క ఇస్లాం తప్ప ఈ భూమండలం మీద మరేదైనా ఉందా? సత్యధర్మాన్ని స్పష్ట పరిచే కొన్ని ప్రమాణాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము. ఏ ఇద్దరు బుద్ధిమంతులు ఈ విషయాలను వ్యతిరేకించరు. సత్యధర్మం: దాని మూలం ఖచ్చితంగా ప్రజలందరి సృష్టికర్త తరఫు నుండి అయి ఉండాలి. ఆయనే స్వయంగా ప్రజలను తనను మాత్రమే ఆరాధించాలని చెప్పి ఉండాలి. తమ నిజ సృష్టికర్తతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు దానిని ప్రతిపాదించడానికి వీలు లేదు. ఒకవేళ మనిషిని ఒక యంత్రంతో పోల్చితే - ఆ యంత్రకర్తకే కదా దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుంది? ఆ విధంగా మనిషిని చేసిన ఆ నిజ రూపకర్తయే సత్యధర్మ దాత, నిర్మాత. ఆ రకంగా ఇస్లాం మాత్రమే సత్యధర్మము. ఎందుకంటే, ప్రజలకు సంబంధించి ప్రాపంచిక వ్యవహారాలైనా,పారలౌకిక విషయాలైనా అన్నింటిని చక్కబెట్టడానికి వారిని పుట్టించిన వారి ప్రభువు వారికి మహాద్భుతమైన ఓ గ్రంథరాజాన్ని ప్రసాధించాడు గనక. అదే పవిత్ర ఖుర్ఆన్. సత్యధర్మం : ఎలాంటి ప్రక్షిప్తాలకు, మార్పుచేర్పులకు, పరస్పర విరుద్ధ విషయాలకు, లోటుపాట్లకు ఆస్కారం లేని, అసంపూర్ణ అంశాలకు తావు లేని, తావు ఇవ్వనిధై ఉంటుంది. ఏమిటి, వారు ఖుర్‌ఆన్‌ గురించి లోతు అధ్యయనం చెయ్యరా? ఒకవేళ ఇది అల్లాహ్‌ నుండి గాకుండా మరెవరి నుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది కదా! (అన్-నిసా: 82) సత్యధర్మం: ఇసుమంత శంకకు, పిసరంత సందేహానికి తావు ఇవ్వని సత్య ప్రమాణాల మీద, బలమైన ఆధారాల మీద నిర్మితమై ఉంటుంది. అది తన పట్ల మనిషి నమ్మకాన్ని మరింత దృఢతరం చేస్తుందే గానే, సంశయాల సుడిగుండంలో నెట్టేసి, నట్టేటా ముంచేయదు. మనిషిని అతని మానాన వదిలేయదు. స్వచ్ఛమైన బుద్ధి దాని ప్రతి విషయంతో ఏకీభవిస్తుందే గానీ, విభేదించదు, వ్యతిరేకించదు. మీమాట నిజమైతే దానికి ప్రమాణం తీసుకురండి” అని అడుగు. (అల్-బఖరా: 111) అంటూ మాట సత్యతకు ప్రామాణికతను కోరుతుంది ఇస్లాం. సత్యధర్మం: అది ప్రజలందరి ధర్మం. అది జాతిని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్నిబట్టి, రంగును బట్టి, రూపును బట్టి వేరువేరుగా ఉండదు. అది కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకు, మతపీష్వాలకు, భిక్షువులకు, పాస్టర్లు, ఫాదర్లకు మాత్రమే తెలిసిన రహస్యాల మీద ఆధార పడిన మతధర్మమై ఉండదు. ఎలాంటి మధ్యవర్తిత్వం, ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా మిమ్మల్ని మీ నిజ ప్రభువుతో జోడించే ధర్మమే సత్యధర్మం. కొందరు ముస్లింలలో కానవచ్చే దర్గాల దుష్కృతికి ఇస్లాం సత్య ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు. కూటి కోసం కోటి విద్యల్లో ఇదో ముదనష్టపు విద్య అంతే. సత్యధర్మం: తన గ్రంథాన్ని వక్రీకరణల పాలు చెయ్యదు. దాని మూలాన్ని పోగొట్టుకోదు. భూ ప్రపంచంలో ఒక్క ఇస్లాం తప్ప తన పవిత్ర గ్రంథాన్ని వక్రీకరించకుండా కాపాడిన మతధర్మం మరొకటి లేదు. సత్యధర్మం: అది న్యాయశీల ధర్మం. అది ప్రజల ధన, మాన, ప్రాణాలను, హక్కులను కాపాడుతుంది. అది సామాజిక న్యాయాన్ని నిజం చేసి చూపిస్తుంది. శిక్షా బహుమానాలు ద్వారా అది న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సత్యధర్మం: అది సంపూర్ణ జీవన సంవిధానం. జీవితానికి సంబంధించిన అన్ని రంగాలను, అన్ని అంగాలను తనలో విలీన పరుచుకొని ఉంటుంది. అది మనిషి భౌతిక, ఆధ్యాత్మిక సకల అవసరాలను తీరుస్తుంది. అది దేశకాలాలకు అతీతంగా జాతులన్నింటికీ, సముదాయాలన్నింటికీ ప్రయోజనకరమైనది. అందరూ సులభంగా పాటించగలిగే ధర్మం. సత్యధర్మం: సద్గుణాలను బోధిస్తుంది, దుర్గుణాలను నిరోధిస్తుంది. సత్యధర్మం: శాస్త్రీయ పరిజ్ఞానాన్ని (సైన్స్)ను సమర్థిస్తుంది. తరతరాల చరిత్ర పరిణామంలో - చోటు చేసుకున్న శాస్త్రీయ పరిశోధలను ఖుర్ఆన్ లోని వచనాల ద్వారా లోకమే నివ్వరబోయేలా అది ధృవీకరించింది. సత్యధర్మం: అది ప్రపంచ ప్రజల మధ్య చాలా వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే మతధర్మం ఇస్లాం.

విధివ్రాత పట్ల విశ్వాసం మరియు ప్రయోజనాలు

విధివ్రాత అనేది సృష్టి ప్రారంభానికి పూర్వమే సృష్టి చరాచరాల గురించి మహోన్నతుడైన ఆలాహ్ నిర్ధారించిన అంశాలు. అవి ఎప్పుడు సంభవిస్తాయి, ఏ నిర్ణీత కాలంలో సంభవిస్తాయి, ఎలా సంభవిస్తాయి అన్న తదితర వివరాలు ఆయన వద్ద ఉన్న గ్రంథంలో లిఖిత పూర్వకంగా ముందే ఖరారు చెయ్యబడ్డాయి. విధివ్రాత పట్ల విశ్వాసం అనేది ఇస్లాం ధర్మంలో ఈమాన్ మూల సూత్రాలలో ఆరవ మూల సూత్రం. గోచరంగా, అగోచరంగా ఉన్న మంచీచెడు విధివ్రాతల పట్ల దృఢమైన విశ్వాసం లేకుండా ఏ ఒక్క దాసుని విశ్వాసం పరిపూర్ణం కాజాలదు. అతనికి ఒక సమస్య వచ్చిందంటే అది అతని తప్పు వల్లా కాదు, అలాగే అతను ఒక తప్పు చేశాడంటే కచ్చితంగా దాని తాలూకు దండన అతనికి ఉంటుందనీ కాదు. యదార్థమేమింటంటే, ప్రతి వస్తువుకి సంబంధించిన విధివ్రాతను అల్లాహ్ నిర్ధారించాడు, ఏది జరిగిన ఆయన ఆన, ఆయన ఆదేశం లేకుండా జరగదుగాక జరగదు.
గత ప్రవక్తల విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇలాగే ఉండేది. అల్లాహ్ జారీ చేసిన ఆజ్ఞకు తిరుగు లేదు. (అల్-అహ్_జబ్: 38) భూమిపైగాని లేదా మీపైగాని వచ్చిపడే ఏ ఆపదైనా దాన్ని సృష్టించడానికి పూర్వమే మేము దాన్ని గురించి గ్రంథంలో రాసిపెట్టాము. ఇలా చేయడం అల్లాహ్ కు చాలా తేలిక. (అల్-హదీద్: 22) హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివ్యక్తిలోనూ మంచి ఉంటుంది. మీ కొరకు ప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, అల్లాహ్ సహాయం కోరండి, నిస్పృహకు లోను కాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలా చేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగి ఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ క్రియకు దారులు తెరుస్తాయి.’ (ముస్లిం) విధివ్రాతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు 1) అల్లాహ్ సంపూర్ణ జ్ఞానం: విశ్వంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, ఒకవేళ జరిగితే ఎలా జరుగుతుంది - సర్వం అల్లాహ్ కు తెలుసు. "సృష్టించినవాడికి (తన దాసుల సంగతి) తెలియదా మరి? ఆయన ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. (అల్-ముల్క్: 14) 2) లౌహే మహ్ఫూజ్ -సురక్షిత గ్రంథము: భూమ్యాకాశాల సృజనకు 50 వేల సంవత్సరాల పూర్వమే అల్లాహ్ సకల జీవరాసుల విధివ్రాతను లౌహే మహ్ఫూజ్ -సురక్షిత గ్రంథములో వ్రాసి పెట్టాడు. భూమ్యాకాశాల్లో ఉన్న రహస్యాలన్నీ (ఆయన దగ్గర) ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయి. (అన్-నమల్: 75) 3) అన్నింటి సృష్టికర్త అల్లాహ్ యే: భూమ్యాకాశాలలో ఉన్నవాటన్నింటిని అల్లాహ్ సృష్టించాడు. ఆయన తప్ప వేరే నిజ సృష్టికర్త లేడు భూమ్యాకాశాలను వాటి మధ్యనున్న సమస్తాన్ని పుట్టించినవాడు అల్లాహ్ యే. ఆయనకు ఈ విషయంలో భాగస్వాములుగానీ, సహవర్తులుగానీ లేరు. ఆయనే విశ్వంలోని చరాచరాలన్నిటికి ప్రాణం పోసినవాడు. ఆయన ప్రతి వస్తువును ఒక నిర్ణీత ప్రమాణంలో పుట్టించాడు. అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి సంరక్షకుడు. (జుమర్ - 39: 62) 4) అభీష్టాలన్నింటిపై ఆయన అభీష్టానిదే ఆధిపత్యం: విశ్వజగత్తు చోటు చేసుకునే ఏ చిన్న పెద్ద విషయమైనా ఆయన ఆన లేనిదే జరగదు. అల్లాహ్ ఇచ్ఛ జరిగి తీరుతుంది. ఆయన తలచినది అవుతుంది మరియు ఆయన తలచనిది అవ్వదు. మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. (ఇన్సాన్ 76: 30) విధివ్రాత పట్ల విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక ముస్లింకి - తాను సాధించిన మరియు సాధించలేనిది, తనకు దక్కినది, దక్కలేనిది - ప్రతిదీ అల్లాహ్ యుక్తి, ఆయన న్యాయం మరియు దయకు లోపబడే జరిగిందని తెలుసు గనక - అది అతనికి ఓదార్పు, ప్రశాంతతను, సంతృప్తిని ఇస్తుంది. ద్వేషం, అసూయ, కోపం, ఓర్వలేనితనం, అసంతృప్తి, ఇతరులతో పోల్చి చూసుకునే - వంటి అవలక్షణాల నుండి అతన్ని దూరం చేస్తుంది. అల్లాహ్ తన దాసునికి మంచీ చెడులను వేరు పరచగలిగే ఇంగితజ్ఞానాన్ని, ఎంపిక స్వేచ్ఛను ఇచ్చాడు. అతను తనకు సంబంధించిన దాదాపు వ్యవహారాలన్నిటిలో స్వేచ్చాపరుడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "అతనికి మేము సన్మార్గం కూడా చూపించాం. అతను సన్మార్గం అవలంబించి (మాపట్ల) కృతజ్ఞుడై ఉన్నా లేక (అవిశ్వాస వైఖరి అవలంబించి) కృతఘ్నుడైపోయినా (అంతా అతని ఇష్టాయిష్టాలపై వదలిపెట్టాము)". (అద్-దహ్ర్: 03) విధివ్రాత పట్ల విశ్వాసం అనేది - అల్లాహ్ అన్ని విషయాలు ముందే వ్రాసేశాడు కదా అన్న సాకుతో ఐహిక కారకాలను అవలంబించకుండా, కార్యశూన్యులుగా ఉండిపోడానికి పూర్తి విరుద్ధం. ఇది అల్లాహ్ యెడల భరోసాకు పూర్తి వ్యతిరేకం. సాధ్యమైన కారకాలను అవలంబించి, కార్య దీక్తో, కార్య సాధనకై శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అల్లాహ్ సహాయాన్ని వేసుకోవడమే ధర్మము. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: పని చేయండి, ఎవరు దేని కోసం సృష్టించబడ్డారో అది వారి కోసం సులభమై పోతుంది. (బుఖారీ, ముస్లిం)

అల్లాహ్ నిషేధించిన విషయాలు ఏవి?

అల్లాహ్ పరిశుద్ధ వస్తువులనే ధర్మసమ్మతం చేశాడు. అశుద్ధ వస్తువులనే నిషేధించాడు. ఈ వస్తువులలో మనకు మేలుందో అల్లాహ్ అలాంటి వస్తువులనే హలాల్ చేశాడు. ఏ వస్తువులలో మనకు కీడుందో అల్లాహ్ అలాంటి వస్తువులనే హరామ్ చేశాడు. అల్లాహ్ తన దాసులా కోసం, ఇతర సృష్టిరాశుల కోసం - వాటికి హాని కలిగించే వాటిని, నష్టం కలిగించే వాటిని ఎప్పటికీ ఇష్ట పడదు. ఏ విషయాన్ని చేయడం వల్ల, చేయకపోవడం వల్ల ఎలాంటి పాపం అనేది ముట్టడో దాన్ని హలాల్ అంటారు. ఇక హరామ్ అంటే, దానికి పాల్పడే వ్యక్తిని శిక్షించడం జరుగుతుంది. దానిని పరిత్యజించిన వ్యక్తికి - అతని ఆ పరిత్యాగం అనేది అల్లాహ్ నిషేధితానికి అనుగుణంగా ఉంటే పుణ్యం లభిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఆదేశిస్తున్నాడు. చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని వారిస్తున్నాడు. మీరు విషయం గ్రహించడానికి దేవుడు మీకిలా ఉపదేశిస్తున్నాడు (అన్-నహల్: 90)
హరామ్ ను మూడు విధాలుగా విభజించవచ్చు. * మాటలకు, చేతలకు, వ్యవహార శైలికి, ప్రవర్తన నియమావళికి సంబంధించిన నిషేధితాలు. * ఆహార పానీయాలు, మనిషి కడుపులోకెళ్లే ఇతర వస్తువులకు సంబంధించిన నిషేధితాలు. * ధార్మిక వ్యవహారాలు, దాని చిహ్నాలకు సంబంధించిన నిషేధితాలు. 1) మాటలకు, చేతలకు, వ్యవహార శైలికి, ప్రవర్తన నియమావళికి సంబంధించిన నిషేధితాలు. రండి, అల్లాహ్ తన దాసుల కోసం వేటిని ఇష్ట పడ్డాడో, వేటిని నిషేధించాడో, మాటల్లో చేతల్లో ఏవి అల్లాహ్ కు ఇష్టమైనవో, ప్రవర్తన నియమావళిలో ఏవి అల్లాహ్ కు అయిష్టమైనవో - ఖుర్ఆన్ స్పష్టమైన వాక్యాల వ్వారా తెలుసుకుందాం! నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు: ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా వస్తువుని మీ దగ్గర భద్రపరిస్తే తిరిగి వారికి సురక్షితంగా అప్పగించండి. ప్రజల మధ్య ఏదైనా వ్యవహారం తీర్చవలసి వస్తే న్యాయంగా తీర్చండి. చూడండి అల్లాహ్ మీకు ఎంత మంచి హితోపదేశం చేస్తున్నాడో! ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. (అన్-నిసా: 58) నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఆదేశిస్తున్నాడు. చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని వారిస్తున్నాడు. మీరు విషయం గ్రహించడానికి దేవుడు మీకిలా ఉపదేశిస్తున్నాడు (అన్-నహల్: 90) * ఈ ఆయతులో అల్లాహ్ మూడు విషయాలను చేయాలన్నాడు, మరో మూడు విషయాలను విడనాడమన్నాడు. * న్యాయంగా వ్యవహరించాలని అల్లాహ్ ఉపదేశించాడు. * మాటల్లో చేతల్లో ఉదారతను, ఉత్తమ విధానాన్ని కలిగి ఉండాలని అల్లాహ్ ఉపదేశించాడు. ఇక ఆరాధనలో ఇహ్సాన్ అంటే, మనం అల్లాహ్ ను చూస్తున్నమన్నంత తన్మయానికి లోనయి ఆయన్ను ఆరాధించడం, లేదా ఆయన మనల్ని చూస్తున్నాడన్న భక్తీ, భయంతో ఆరాధించడం. * బంధువుల పట్ల దయతో మెలగాలని, బంధుత్వ సంబంధాలను బలపర్చాలని, వారికి చేదోడువాదోడుగా ఉండాలని ఉపదేశించాడు. * చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని అల్లాహ్ వారించాడు. * మనిషి మేధ అసహ్యించుకునే విషయాలను, హేతుబద్ధం కానీ విషయాల జోలికి పోకూడదు అని అల్లాహ్ వారించాడు. * ప్రజల మీద అతిక్రమణను, అత్యాచారాన్నీ, పెత్తనాన్ని, హక్కుల స్వాహాను అల్లాహ్ నిషేధించాడు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (ర) గారి ఇలా సెలవిచ్చారు; నిశ్చయంగా ఈ ఆయతు ఇస్లాం ధర్మానికి సంపూర్ణ భాష్యం అని చెప్పవచ్చు. హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ (ర) గారి కథనం - నేను ప్రారంభంలో దైవ ప్రవక్త (స) వారి యెడల నాకు గల లజ్జ కారణంగా నేను ఇస్లాం స్వీకరించాను. కానీ నిజంగా ఈ ఆయతు విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇస్లాం ధర్మాన్ని విశ్వసించాను. అది - “మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు: ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు. తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి. దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము. నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే. న్యాయప్రాతిపదికపై తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని అల్లాహ్ మీకీ విషయాలు బోధిస్తున్నాడు. అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి. తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి. అల్లాహ్ విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని అల్లాహ్ మీకిలా హితోపదేశం చేస్తున్నాడు. ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు. మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (అల్-అన్ఆమ్: 151-153) (లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా ఉపదేశించాడు:) “కుమారా! నీవు - ప్రార్థనా (నమాజ్‌) వ్యవస్థ నెలకొల్పు. (ప్రజలను) మంచిని గురించి ఆదేశించు, చెడు విషయాలనుండి వారించు. కష్టాలు వచ్చినప్పుడు సహనం వహించు. ఇవి ఎంతో ధైర్యసాహసాలతో కూడిన విషయాలు. జనమ్ముందు గర్వంతో మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నీల్గుతూ నడవకు. తననుతాను పొగడుకునే, మిడిసిపడే వాడ్ని దేవుడు ఏమాత్రం మెచ్చుకోడు. నీ నడవడికలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠస్వరం కాస్త తగ్గించుకో. అన్ని స్వరాల కంటే గాడిద స్వరం అత్యంత కఠోరమయినది.” (లుఖ్_మాన్: 17-19) 2) ఆహార పానీయాలు సంబంధించిన నిషేధితాలు * అల్లాహ్ మనకు చచ్చిన పశువుల్ని, చిందిన రక్తం, పందిమాంసాన్ని నిషేధించాడు. అలాగే గోర్లుండి మాంసాన్ని భక్షించే జంతువులు కూడా నిషిద్ధమే. ఇస్లామీయ జిబహ్ పధ్ధతి (హలాల్ పధ్ధతి) ప్రకారం కోయబడని ప్రతి జంతువు మాసం నిషిద్ధమే. అలాగే అల్లాహ్ పేరు తీసుకోకుండా కోయబడిన ఏ జంతువూ మాంసమైనా నిషిద్ధమే. * ఇక సముద్ర జంతువులంటారా, అవి అన్ని హలాల్. దైవ ప్రవక్త (స) సముద్రం గురించి ఇలా అన్నారు: సముద్రం - దాని నీరు పరిశుద్ధమైనది, దాని మరణించిన జంతువు ధర్మసమ్మతమైనది. (అబూ దావూద్, తిర్మిజీ, నసాయి) * ఆహారపానీయాల్లో అల్లాహ్ మనకు నిషేధించిన వాటిలో - మతిని పోగెట్టే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. (ఏ పానీయం, పదార్ధం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మత్తెక్కుతుందో దాని తక్కువ పరిమాణం కూడా నిషిద్ధమే). మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి, అతనికి ఆర్థికంగా దివాళా తీస్తాయి. ఆయన మీకు చచ్చిన పశువుల్ని, రక్తాన్ని, పందిమాంసాన్ని,అల్లాహ్ యేతరులకు నైవేద్యం పెట్టిన పదార్థాలను, (అక్కడి మాంసా హారాన్ని) నిషేధించాడు. అయితే దైవాజ్ఞలు ఉల్లంఘించే ఉద్దేశ్యం లేకుండా, హద్దు మీరకుండా గత్యంతరంలేని పరిస్థితిలో మాత్రం (ఈ నిషేధితాలు) తినవచ్చు. అందులో తప్పు లేదు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. (/అల్-బఖరహ్: 173) 3) ధార్మిక వ్యవహారాలు, దాని చిహ్నాలకు సంబంధించిన నిషేధితాలు. నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (అల్-మాయిదహ్: 03) * ఈ ఆయతు బట్టి ఇస్లాం ధర్మ మూల విషయాల్లో, స్థిర సిద్ధాంతాల్లో మార్పు చెయ్యడానికి వీలు లేదు. యూదులలో ఓ వ్యక్తి ఉమర్ (ర) గారిని ఉద్దేశించి చెప్పిన మాట - ఒక వేళ ఈ ఆయతు వంటి ఓ ఆయతు మాపై అవతరించి ఉండి ఉంటే దాని అవతారం దినాన్ని ఓ మహోత్సవంగా, పండుగ దినంగా చేసుకుని ఉండేవారము. (బుఖారీ) ధృవీకరించబడింది హదీసులో హజ్రత్ ఇర్భాజ్ బిన్ సారియహ్ (ర) గారి కథనం: దైవ ప్రవక్త (స) మమ్మల్ని ఉద్దేశించి ఓ అద్భుత హితబోధ చేశారు. ఆ హితబోధకు మా అందరి కళ్ళు చెమర్చాయి, మా అందరి హృదయాలు ద్రవించాయి. అప్పుడు మేము ప్రవక్త (స) వారినుద్దేశించి - యా రసూలల్లాహ్! ఈ మీ హితబోధ మా కోసం మీ చివరి హితబోదేమో అనిపిస్తుంది. ఈ సందర్భంగా తమరు మాకు ఏమైనా తాకీదు చేయాలనుకుంటున్నారా? అని విన్నవించుకున్నాము. దానికి ఆయన ఇలా అన్నారు; నేను మిమ్మల్ని ప్రకాశమానమైన మార్గం మీద వదిలాను. దాని రాత్రి పగటి వలే కమ్మటిమయమై ఉంది. నా తర్వాత పరమ దౌర్భాగ్యవంతుడే ఆ దారిని తప్పుతాడు. (ఇబును మాజహ్) వేరొక సందర్భంలో దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: మా ధర్మ విషయం అందులోని లేని విషయాన్ని జొప్పిస్తే అది రద్దు చెయ్యబడుతుంది. (బుఖారీ, ముస్లిం) అల్లాహ్ అవతరింపజేయని, దైవ ప్రవక్త (స) సెలవియ్యని నూతన పోకడలను ధర్మంలో ప్రవేశ పెడితే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైపునకే అది తిరిగి రద్దు చేయబడుతుంది. దైవ ప్రవక్త (స) ధర్మంలో ప్రవేశపెట్టబడిన ప్రతి నూతన పోకడ మార్గభ్రష్టత్వమే అని తీర్మానించారు. (సహీహ్ ముస్లిం)

పవిత్ర ఖురాన్‌లోని శాస్త్రీయ అద్భుతాలు

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మరియు విశ్వ సృష్టి మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో, విశ్వం పుట్టుక గురించి, గ్రహాల కదలిక గురించి లేదా భూమి గోళాకారంగా ఉందా లేదా చదునుగా ఉందా అనే దాని గురించి ఎవరికీ తెలియదు. ఆధునిక శాస్త్రం ఒక గొప్ప పేలుడు ఫలితంగా విశ్వం యొక్క సృష్టిని వివరిస్తుంది, మొత్తం విశ్వం ఒక ముద్దలాంటి పదార్ధంగా ఉండేది. దానిలో మహా విస్ఫోటం సంభవించింది, ఈ విస్ఫోటనం నక్షత్రాలు, గ్రహాలు మరియు గెలాక్సీల, అగ్ని పర్వతాల ఏర్పాటుకు దారి తీసింది. (దీన్ని ఆధునిక శాస్త్రంలో బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు). ఇది అచ్చం ఖుర్ఆన్ లోని ఈ అయతును పోలి ఉంది: భూమ్యాకాశాలు కలసిఉన్నప్పుడు మేము వాటిని విడదీయడాన్ని వారు చూడ లేదా? అ (అల్-అంబియా: 30) రతఖ్ అంటే మూయబడి ఉండటం అని అసలు అర్థం. ఫతఖ్ ’ అంటే తెరవటం, వేరుపరచటం అని అర్థం. ఆదిలో భూమ్యాకాశాలు పరస్పరం కలిసి ఉండేవి. మేము వాటిని వేరుపరచాము. విశ్వం యొక్క విస్తరణ 1925లో, అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ నక్షత్రాలు ఒకదానికొకటి దూరం అవుతున్నాయని సూచించే శాస్త్రీయ ఆధారాలను సమర్పించారు. ఇది గెలాక్సీలు మరియు మొత్తం విశ్వం నిరంతరం విస్తరిస్తున్నాయని సూచిస్తుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో కదులుతాయని మరియు అవి ఒకే సమయంలో తమ అక్షం చుట్టూ తిరుగుతాయని శాస్త్రీయ ఆధారాలను కూడా సమర్పించాడు. ప్రకృతి శాస్త్రవేత్తలు తమ సిద్ధాంతాలను ఇది దశాబ్దాలుగా జరిపిన . పరిశీలన మరియు అధ్యయనాల ఫలితాల ద్వారా నిర్ధారిస్తారు. భూమ్యాకాశాలు కలసిఉన్నప్పుడు మేము వాటిని విడదీయడాన్ని వారు చూడ లేదా? అలాగే ప్రతిప్రాణిని మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించ లేదా? మరి వారు (మాయీ సృష్టి చాతుర్యాన్ని) ఎందుకు విశ్వసించరు? (అల్-అంబియా: 30)
తిరిగి దేవుడు ఆకాశం వైపు దృష్టి సారించాడు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉండేది. ఆయన భూమ్యాకాశాల్ని ఉద్దేశించి “మీకు ఇష్టమున్నా లేకపోయినా ఉనికిలోకి రండి” అన్నాడు. దానికి అవి “మేము వినమ్రులై వచ్చేశాం” అన్నాయి. (హామీమ్: 11) రేయింబవళ్ళను సృష్టించినవాడు దేవుడే. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆయనే సృజించాడు. అవన్నీ తమ తమ నిర్ణీత కక్ష్యల్లో తేలియాడుతున్నాయి. (అల్-అంబియా: 33) మేము మా స్వశక్తితోనే ఆకాశాన్ని నిర్మించాం. మాకా సామర్థ్యం ఉంది. భూమిని కూడా మేమే (మీకు నివాసయోగ్యంగా) పరిచాము. (మీకు అనువైనదిగా) పరచడంలో మేమెంత నిపుణులమో చూడండి. (అజ్-జారియాt: 47-48) సమస్తం ఒక్కొక్క కక్ష్యలో (అంటే తమ తమ నిర్ణీత కక్ష్యల్లో) సంచరిస్తున్నాయి. (యాసీన్: 40) ఆకాశం విభిన్నరూపాలు విభిన్నరూపాలలో కన్పించే ఆకాశం సాక్షి! మీ అభిప్రాయాలు విభిన్నరకాలుగా ఉన్నాయి. (అజ్-జారియాత్: 7-8) ఈ పవిత్ర ప్రవచనం సూచిస్తున్నదేమిటంటే, ఆకాశంలో అనేక రహదారులు, మార్గాలు మరియు కక్ష్యలు ఉన్నాయి, ఈ గొప్ప విశ్వంలో శరీరాలను ఉంచే గురుత్వాకర్షణ మరియు సంక్లిష్ట విద్యుదయస్కాంత క్షేత్రాల నియమాలపై ఆధారపడే అద్భుతమైన, అత్యంత ఖచ్చితమైన విశ్వ వ్యవస్థచే నిర్వహించబడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కటి దాని కక్ష్య మరియు మార్గంలో కదులుతుంది. గొప్ప కాస్మిక్ ఫాబ్రిక్ "హుబుక్" అనే పదంతో ఈ ఆయతులో వర్ణించబడింది. అంటే ఆకాశం ఆ విద్యుదయస్కాంత క్షేత్రాలచే అల్లినట్లుంటుంది. పద్నాలుగు శతాబ్దాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ (స) పఠించిన మరియు నేటికీ భద్రపరచబడిన పవిత్ర ఖుర్ఆన్ లో చెప్పబడిన ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణల మధ్య సారూప్యతను చూసి ఒక వ్యక్తి ఆశ్చర్యపోవచ్చు. పవిత్ర ఖుర్ఆన్ విశ్వం యొక్క సృష్టి, సూర్యచంద్రుల కదలిక, భూమి యొక్క భ్రమణం మరియు రాత్రి పగలు ఏర్పడిన కథను అద్భుతమైన రీతిలో ప్రస్తావించింది. మేము మా స్వశక్తితోనే ఆకాశాన్ని నిర్మించాం. నిశ్చయంగా మేము దాన్నివిస్తరింప జేయగలము . (అజ్-జారియాత్:47) సప్తాకాశాలు, భూమి, భూమ్యాకాశాల్లోని యావత్తు సృష్టిరాసులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన ఔన్నత్యంతోపాటు ఆయన పవిత్రతను ప్రశంసించని సృష్టి అంటూ ఏదీ లేదు. కాని అవి చేసే దైవస్మరణను మీరు గ్రహించలేరు. ఆయన ఎంతో ఉదారుడు, గొప్ప క్షమాశీలి. (బనీ_ఇస్రాయీల్: 44) కాబా చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది విశ్వం యొక్క సృష్టికర్తతో మిమ్మల్ని అనుసంధానించే ప్రార్థన. విశ్వం మొత్తం ఆయనను స్తుతిస్తున్నట్లు మీరు భావిస్తారు. ఈప్రదక్షిణ అల్లాహ్ చట్టాలకు సృష్టి యావత్తు లొంగిపోయిందన్న విషయాన్ని సూచిస్తుంది. ప్రార్థన సామరస్యంగా ఉండే ఏకైక ధర్మం ఇస్లాం. (ఇది మస్జిద్ హరామ్ లోని కాబా చుట్టూ ప్రదక్షిణ చేసే రూపం). నక్షత్రాలు, గ్రహాలు మరియు ఎలక్ట్రాన్ల కదలిక సయితం గడియారపు ముల్లుకు వ్యతిరేక దిశలో ఉంటుంది. మానవ సృష్టి మరియు పిండం అభివృద్ధి పవిత్ర ఖురాన్ మనిషి యొక్క సృష్టి మరియు అతని పిండం అభివృద్ధి గురించి అద్భుతమైన వాస్తవాలు మరియు ఖచ్చితమైన వివరాలను పేర్కొంది. 1,400 సంవత్సరాల క్రితం ఈ వివరాలు తెలియవని, ఆ సమయంలో పిండశాస్త్రం ఉనికిలో లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు, సూరా అజ్-జుమర్ యొక్క 6వ వాక్యంలో తల్లి కడుపులో మూడు చీకట్లు ఉంటాయని పేర్కొనబడింది. మిమ్మల్ని ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి పొరలలో ఉంచి, ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఆయనే అల్లాహ్‌. ఆయనే మీ ప్రభువు, పోషకుడు, పాలకుడు, విశ్వ సామ్రాజ్యాధినేత. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎవరి వలలో పడి మోసపోతున్నారు? (అజ్-జుమర్: 6) గర్భంలో ఉన్న పిండం చుట్టూ చీకటి ముసుగులు ఏర్పడే మూడు పొరల ఉనికిని ఆధునిక శాస్త్రం కనిపెట్టడం ఆశ్చర్యకరం. ఇది శిశువును రక్షించడానికి బలమైన పిండ సంచిని ఏర్పరుస్తుంది. ఈ మూడు పొరలు ఉదర గోడ, గర్భాశయ గోడ మరియు ప్లాసెంటల్ మెంబ్రేన్. పవిత్ర ఖురాన్‌లో,మానవ సృష్టి మరియు అతని పిండం అభివృద్ధి గురించి అద్భుత వర్ణన ఉంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మేము మానవుడ్ని నాణ్యమైన మట్టితో సృజించాము. తరువాత అతడ్ని ఒక సురక్షిత ప్రదేశంలో కార్చిన బిందువుగా మార్చాము. తరువాత ఆ బిందువును నెత్తుటి ముద్దగా రూపొందించాము. తిరిగి ఆ నెత్తుటి ముద్దను మెత్తటి పిండంగా చేశాము. ఆ తరువాత దాన్ని ఎముకలుగా మార్చాము. ఆ ఎముకలపై మాంసం కప్పాము. ఆపై (అందులో ప్రాణం పోసి) ఓ నూతన సృష్టినే ఉనికిలోకి తెచ్చాము. కాబట్టి అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. (అల్-మోమినూన్: 12-14) సరిగ్గా ఈ వాక్యంలో పేర్కొన్న పిండం పెరుగుదల అభివృద్ధితో; ఇటీవలి శాస్త్రీయ ఆవిష్కరణలు ఒకేలా ఉండటం ఆశ్చర్యకరం! ఈ ఖచ్చితమైన వర్ణనతో మాట్లాడిన వ్యక్తి పిండాన్ని సృష్టించి, దాని అభివృద్ధిని నిర్ణయించిన వ్యక్తి అని, లేదా తన కళ్ళతో దాని నిర్మాణం మరియు అభివృద్ధిని చూసి మనకు వివరించిన వ్యక్తి అని మనకు ఈ ఆయతు నిశ్చయంగా సూచిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో ఈ విధమైనటువంటయి ఊహాగానాలు కూడా శాస్త్రీయంగా అసాధ్యం కాబట్టి, ఈ ఆయతు పిండాన్ని సృష్టించిన మరియు దాని అభివృద్ధిని వివరించిన ఖుర్ఆన్ అల్లాహ్ అద్భుత వాక్యం అన్న యదార్థాన్ని విశద పరుస్తుంది. పవిత్ర ఖుర్లోఆన్ లో ప్రస్తావించబడిన అద్భుతమైన వాస్తవాలలో ఒకటి - మాంసానికి ముందు ఎముకలు కూర్చబడిన వర్ణన. చూపు ఇంద్రియానికి ముందు వినికిడి ప్రస్తావన ఇదే విషయాన్ని నేటి ఆధునిక శాస్త్రం కనుగొన్నది. శిశువు ఎముకలు దాని మాంసం కన్నా ముందు ఏర్పడతాయి. వినికిడి శక్తి చూసే శక్తికన్నా ముందు ఏర్పడుతుంది. కాబట్టి అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. (అల్-మోమినూన్: 14) ఆపై అతడ్ని పరిపూర్ణ మానవుడిగా రూపొందించి అతని (శరీరం)లో తన ఆత్మను ఊదాడు. (ఒక్కసారి ఆలోచించండి.) ఆయన మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాన్నిచ్చాడు. కాని మీరు మాత్రం (ఆయనకు) చాలా తక్కువగా కృతజ్ఞత చూపుతున్నారు. (/అస్-సజ్దా: 09) మీకు వినే, చూసే శక్తులతోపాటు ఆలోచించేందుకు హృదయమిచ్చినవాడు దేవుడే కదా! కాని మీరు ఆయనకు చాలా తక్కువ కృతజ్ఞత చూపుతున్నారు. (అల్-మోమినూన్: 78) నిరాఘాటంగా సాగుతున్న కాలవాహినిలో మానవునికి తానొక గడ్డిపోచ విలువ కూడా లేనివాడిగా ఉండిన సమయం ఎప్పుడైనా ఎదురయిందా? మేము మానవుడ్ని పరీక్షించడానికి ఒక మిశ్రమబిందువుతో పుట్టించాం. దానికోసం మేమతడ్ని వినేవాడిగా, చూసేవాడిగా రూపొందించాం. (అద్-దహ్ర్: 1-2) నీరు వేర్వేరుగా ఉండటంలో అద్భుతం ఏమిటంటే అవి కలవవు ఆధునిక శాస్త్రం కనుగొన్న విషయం ఏమిటంటే, రెండు సముద్రాలు కలిసే చోట వాటి మధ్య ఓ తెర ఏర్పడుతుంది. ఈ తెర రెండు సముద్రాల నీరు ఒకదానిలో మరొకదాని నీరు కలవకుండా అడ్డుకుంటుంది. అన్నది ఇది రెండు సముద్రాలు కలిసే ప్రదేశములో జరిపిన పరిశోధనల ఆధారంగా రెండు సముద్రాల నీరు కలవవని వాటి మధ్యలో ఒక తెర ఉంటుందని ఆధునిక విజ్ఞానము తెలియజేస్తుంది. ఈ విషయాన్నే ఖుర్ఆన్ లోని ఈ ఆయతు - మహాసముద్రాలలో స్టేషన్లను నిర్మించడం మరియు వాటి నీటి నమూనాలను తీసుకునే మానవ సామర్థ్యం పునాదులు వేసుకోక ముందే, సాగర విజ్ఞాన శాస్త్రం - దాని ఉనికి అన్నదే లేని సమయంలో ప్రస్తావించింది. రెండు సముద్రాల జలాలు ఒకదానికొకటి కలగకుండా, ఒకదానికొకటి చెడిపోకుండా అల్లాహ్ రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పాటు చేశాడు. ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలసిపోయేలా వదలి పెట్టాడు. ఆయినా వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోలేవు. మరి మీరు మీ ప్రభువు శక్తిపరిధిలోని ఏ మహిమను నిరాకరించగలరు? (అర్-రహ్మాన్: 19-21) ఖుర్'ఆన్ లో పర్వతాల గురించి (భూవిజ్ఞాన శాస్త్రం) వాటిని మేకులుగా పేర్కొనడంలోని మర్మం భూగర్భ శాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత, మానవుడు ప్రకృతి యొక్క వివిధ కోణాలు మరియు దాని స్థలాకృతి గురించి గొప్ప జ్ఞానాన్ని సాధించాడు.పర్వతాలు ఒక చీలిక ఆకారంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు, ఎందుకంటే పర్వతాలు ఎంత ఎత్తుగా ఉంటాయో అంతకంటే ఎక్కువ రెట్లు భూమిలోనికి దిగబడియుంటాయి. అంటే వాటి దిగువ భాగం పర్వతాన్ని స్థిరీకరించడానికి మేకును పోలి ఉంటుంది. పర్వతాలు భూమిని కదలకుండా ఉంచడంలో మరియు సమతుల్యతను కాపాడటంలో కూడా వాటి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ 14 వందల సంవత్సరాల క్రితమే విజ్ఞాన భాండాగారమైన తన గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు; భూమండలం మిమ్మల్ని తీసుకొని దొర్లకుండా ఉండేందుకు ఆయన దానిమీద పర్వతాలను మేకులుగా పాతాడు. ఆయన (మీ కోసమే) నదుల్ని ప్రవహింపజేశాడు. మీరు దారి తెలుసుకోవడానికి వీలుగా సహజ మార్గాలు, ఇతర అనేక చిహ్నాలు కూడా ఏర్పరిచాడు. (అన్-నహల్: 15) మేము భూమిని విశాలపరచి నివాసయోగ్యంగా రూపొందించలేదా? దానిపై పర్వతాలను మేకులుగా పాతలేదా? (అన్-నబా: 6-7) ముగీరహ్ బిన్ షుఅబహ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హయాంలో సూర్యగ్రహణం అయ్యింది. అదే రోజు విశ్వాసుల మాత మారియహ్ (ర) గారి ద్వారా కలిగిన ఆయన కుమారుడు హజ్రత్ ఇబ్రాహీమ్ (ర) మరణించాడు. అప్పుడు ఆయన వయసు 18 నెలలు. గమనిక: దైవ ప్రవక్త (స) ఆ విషాద సమయంలో చెప్పిన మాట గమనార్హం. నిశ్చయంగా కళ్ళు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. మనస్సు శోక సంద్రం అయింది. అయినా - మా ప్రభవుకు ఇష్టమైన మాటే మా నోట వెలువడుతుంది. ఓ ఇబ్రాహీమ్! మేము నీ విరహంతో బాధ పడుతున్నాము. (బుఖారీ) మరో సందర్భంలో - ఆయన కుమారుని మరణతోనే సూర్యగ్రహణం చోటు చేసుకుంది అని కొందరనగా - ఆయన వారి అభిప్రాయాన్ని ఖండిస్తూ - నిశ్చయంగా సూర్యచంద్రులు - ప్రజల్లోని ఏ ఒక్కరి మరణంతో గ్రహణం చెందవు. యదార్థమేమింటంటే, అవి రెండూ అల్లాహ్ సూచనల్లోని రెండు సూచనలు. ఒకవేళ మీరు వాటికి గ్రహణం పట్టినట్టు గనక చూస్తే, లేచి నమాజు చేయండి అన్నారు. (బుఖారీ, ముస్లిం) అలా ఆయన (స) అప్పటి వరకు ప్రజల్లో ఉన్న అపోహాలను, మూఢ నమ్మకాలను నిర్మూలించారు.

ఖుర్ఆన్ శాశ్వత మహిమ

ఈ దివ్య గ్రంథంలో – సృష్టి ప్రక్రియ గురించి, సృష్టికర్త ఘనత ఔన్నత్యం గురించి హృదయాన్ని హత్తుకుని మదిలో ముద్రవేసే స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి. ఈ దివ్య గ్రంథంలో – ఏకదైవారాధనకు సంబంధించి హేతుబద్దమ యిన నిదర్శనాలూ ఉన్నాయి. బహుదైవారాధను ఖండించే సహేతుకమ యిన నిరూపణలూ ఉన్నాయి. ఈ దివ్యగ్రంథంలో – మానవుని పుట్టుకను గురించి, ఈ సువిశాలమైన విశ్వంలో మానవుని పుట్టుక లక్ష్యం ఏమిటో తెలియజేసే వాక్యాలూ ఉన్నాయి. ఈ దివ్యగ్రంథంలో – పూర్వప్రవక్తల మచ్చలేని జీవితాల గురించి, తమ తమ జాతులకు వారు అందజేసిన సత్యసందేశం గురించి సమాచారమూ ఉంది. దైవ సందేశహరులను ధిక్కరించిన జాతుల పర్యవసానం గురించి గుణపాఠమూ ఉంది. ఈ దివ్యగ్రంథంలో – చారిత్రక గాథలూ ఉన్నాయి. విశ్వాసులకు దైవవిధేయులకు ఇహపరలోకాలకు సంబంధించిన శుభవార్తలూ ఉన్నాయి. అవిశ్వాసులకు దైవధిక్కారులకు హెచ్చరికలూ ఉన్నాయి. ఈ దివ్యగ్రంథంలో – మానవుల హక్కులకు సంబంధించిన నీతి బోధనలూ ఉన్నాయి. మానవుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ధర్మశాసనాలూ ఉన్నాయి. నాగరిక, రాజకీయ, ఆర్థిక , సామాజిక విష యాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడే సూత్రాలూ ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ శాంతి సామరస్యాలకు సంబంధించిన ఆదేశాలూ ఉన్నాయి. ఈ దివ్యగ్రంథంలో – జనుల్లో ఉన్న అంధవిశ్వాసాలు, మూఢనమ్మ కాలు, పూర్వీకుల అంధానుకరణ మొదలయిన విషయాల్లోని ఘోరమ యిన తప్పుల్ని, అత్యాచారాలు, అన్యాయం, దౌర్జన్యం, అరాచకాలను స్పష్టమయిన ఆధారాల ద్వారా ఖండించడమూ జరిగింది. ఈ దివ్యగ్రంథంలో – ప్రాపంచిక జీవిత వాస్తవికత, మరణానంతర జీవితానికీ సంబంధించిన స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి. ఈ దివ్య గ్రంథం తొలి ప్రారంభ అవతరణకు 1458 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇందులో ఎలాంటి మార్పూ చేర్పూ జరగలేదు. ఇది నేటికీ సురక్షితంగా ఉన్న ఏకైక దివ్యగ్రంథం. అలాంటి మహిమాన్విత గ్రంథరాజ రాజసం గురించి కొన్ని అంశాలను ఇక్కడ పోదు పర్చడం జరిగింది. ఇది ఒక విధంగా మహా జ్ఞాన సాగరాన్ని కూజాలో బంధించడం వంటిదే... పూటకో విద్యాకుసుమం అందులో వికసిస్తూ ఉంటుంది. రోజుకో కొత్త విజ్ఞాన ఫలం చదువరులను ఊరిస్తూ ఉంటుంది, దివ్య ఖుర్ఆన్ జ్ఞానం దాని లోతుల్లోకి పోయేకొలది విలువైన ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు దొరుకుతూనే ఉంటాయి. ఏ అనువాదకుడైనా, మరే వ్యాసకర్త అయినా, వక్తయినా, ప్రబోధనకర్త అయినా ఆ ముత్యాలన్ని తన పద హారంలోనే ఇమిడిపోవాలని ఆశిస్తే అది అతని అమాయకత్వమే అవుతుంది. ఖుర్ఆన్ ప్రత్యేకతలు పవిత్ర ఖుర్ఆన్ శాశ్వత మహిమ. ఎంఎందుకంటే - భూమి మీద అవతరించిన ఆకాశ గ్రంథాలలో - అల్లాహ్ వాక్యాలు అక్షర పరంగానూ, అర్థ పరంగానూ ఎలాంటి మారుచేర్పులకు, మానవ జోక్యానికి గురి కాకుండా సురక్షితంగా ఉన్న ఏకైక దైవ గ్రంథం ఖుర్ఆన్ మాత్రమే. * పవిత్ర ఖుర్ఆన్ - స్వయంగా అల్లాహ్ ఈ గ్రంథ సంరక్షణా బాధ్యతను తానే స్వీకరించాడు. ఈ గ్రంథం తరం తర్వాత తరానికి గ్రంథం రూపంలోనూ, కంఠస్థం రూపంలోనూ చేరుతూ - ఎలాగైతే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి అవతరించినప్పుడు ఉండేదో నేటికీ అది అలాగే ఉంది. ఈ గ్రంథం తనకు పూర్వం అవతరించిన దైవగ్రంథాలన్నింటి సారాశాన్ని సంరక్షించే గ్రంథం. వారికి చెప్పు: “యావత్తు మానవులు, జిన్నులు ఏకమయి కఠోర తపస్సు చేసినా, పరస్పరం సహకరించుకున్నా, ఖుర్‌ఆన్‌లాంటి గ్రంథాన్ని ఎన్నటికీ రచించలేరు.” (బనీ_ఇస్రాయీల్: 88) పవిత్ర ఖురాన్ వచన రీత్యా, పఠన శైలి రీత్యా భద్రపరచబడింది. ఖుర్ఆన్ గ్రంథానికి గల సాహితీ కోణాలు అనంతం! వాటిని కొలవాలను కోవటం అవివేకం!! ఎల్లలు లేని విజ్ఞానవనం ఒక్క అంతిమ దైవగ్రంధానికి సొంతం. * దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన మీద అవతరించే దివ్యావిష్కృతిని (వహీని) లిఖిత పూర్వకంగా వ్రాసే నిమిత్తం కొందరి నియమించారు. ఉదాహరణకు - హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (ర), ఉబై బిన్ కఅబ్ (ర), జైద్ బిన్ సాబిత్ (ర) మొదలైనవారు. వీరు దైవ ప్రవక్త (స) వారి మీద అవతరించే ఖుర్ఆన్ గ్రంథాన్ని వ్రాసి భద్ర పర్చేవారు. దైవ ప్రవక్త (స) వారి మరణ సమయానికి - ఖుర్ఆన్ - ప్రతులు రూపంలో ఉండేది. దైవ ప్రవక్త (స) మరణానంతరం - హజ్రత్ అబూ బకర్ (ర) గారి పరిపాలనా కాలంలో - దాన్నో మహా కార్యంగా తీసుకుని - ఆ ప్రతులన్నింటినీ గ్రంథంగా చేయడం జరిగింది. * ఇస్లామీయ రాజ్య విస్తీరణ మరింత ఎక్కువగా పెరిగినప్పుడు - అనేక మంది ఇస్లాం ఛత్ర ఛాయల్లోకి వచ్చి చేరినప్పుడు - మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ఖుర్ఆన్ గ్రంథపు అనేక ప్రతులను తయారు చేసి ఆయా రాజ్యాల, ప్రాంతాల వైపునకు పంపే ఏర్పాటు చేసేవారు. అలాగే ఆయా ప్రాంతాలోని ప్రజలకు ఖుర్ఆన్ ఎలా చదవాలో నేర్పించడానికి ఖుర్ఆన్ పారాయణకర్తలను కూడా పంపేవారు. నేటి ముస్లింల చేతుల్లో ఉన్న ఖుర్ఆన్ వాకాయాలు 14 శతాబ్దాల క్రితం అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై అవతరించిన ఖుర్ఆన్ వాక్యాలు అచ్చం ఒకేలా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎలా సాధ్యమయిందంటే, తరం తర్వాత తరం ఖుర్ఆన్ పారాయణకర్తలు ఈ గ్రంథాన్ని కంఠస్థం చేస్తూ వస్తున్నారు అనేది ఒకటి. అలాగే చారిత్రకంగా ఈ గ్రంథం దైవ దూత హజ్రత్ జిబ్రయీల్ (అ) నుండి దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి వద్దకు, ఆయన నుండి తర్వాతి తరాలకు అదెలా చేరిందో సాక్ష్యాధారాలతో సహా గ్రంథస్తం చేయబడి ఉంది. అల్లాహ్ వద్ద నుండి ఈ గ్రంథాన్ని తీసుకు వచ్చినవారు హజ్రత్ జిబ్రయీల్ (అ) అయినప్పుడు అందులో ఒక్క పదం కూడా ఇటూ అటూ అయ్యే ఆస్కారమే లేదు. నేడు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం నాడు దైవ ప్రవక్త (స) వారిపై అవతరించిన ఖుర్ఆన్ రెండూ ఒక్కటే. ఖుర్ఆన్ మృదు మధుర పరాయణానికి ముగ్దుడయిన వలీద్ బిన్ ముజీరా - ఇలా అన్నాడు; అల్లాహ్ సాక్షిగా చుబుతున్నా - ఖుర్ఆన్ ధుని స్వర్ణకార సుమధుర ధ్వని. దాని తేజం అద్వితీయం, అమోఘం, అమేయం, అనన్య సాధ్యం, అఖండం, అనిర్వచనీయం. దాని పై భాగం ఫలవంతం. దాని క్రింది భాగం రసభరితం. దానిదే పై చేయి - శిఖరం దాని స్థాయి - విజయం దాని దారి, కీర్తి దాని చిరునామా. అది పైపైకి ఎగబ్రాకుతుందేగానీ, పతనం ఎరుగదు. దాని ముందర ప్రపంచ ఏ సాహిత్యమయినా దిగదుడుపే. తజ్వీద్ ఖుర్ఆన్ గ్రంథానికి సంబంధించిన ప్రత్యేక విద్య * ఖుర్ఆన్ పారాయణం తజ్వీద్ విద్యకు లోబడి జరుగుతుంది. ఈ విద్య - పవిత్ర ఖుర్ఆన్ ను ఎలా చదవాలో మరియు దాని అక్షరాలు మరియు పదాల ఖచ్చితమైన ఉచ్చారణను ఖచ్చితమైన పద్ధతిలో ఎలా పలకాలో తెలియజేసే శాస్త్రం. దైవ ప్రవక్త (స) నుండి ఎలాగైతే వారికి ఖుర్ఆన్ పారాయణం చేరిందో అలాగే పారాయణం చేయడానికి ముస్లింలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. అయితే ప్రత్యేక ఈ శాస్త్ర కూర్పు ఏదైతే ఉందో అది - హిజరీ శకం 154 వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుండి ఇది ఓ ప్రత్యేక విద్యా శాస్త్రంగా ప్రశిద్ధి చెందింది. అంటే ఈ శాస్త్ర కూర్పు జరిగి 1200 సంవత్సరాలకు పై చిలుకు అవుతుంది. ఆ విధంగా - లాటిన్ నుండి ఉద్భవించిన లేదా ప్రభావితమైన ఆరు యూరోపియన్ భాషలలోని ఫొనెటిక్స్ మరియు లింగ్విస్టిక్స్ శాస్త్రాల కంటే తజ్వీద్ శాస్త్రం 1,000 సంవత్సరాల కంటే ముందు ఉంది. * ఉపాధ్యాయుని నోటి నుండి అభ్యాసకుల చెవి వరకు ఖురాన్ యొక్క ఫ్రీక్వెన్సీ పఠనం, తరతరాలు, అంతరాయం లేకుండా, వైవిధ్యం లేకుండా పారాయణం చేయబడుతూ వస్తున్నదంటే ఇదిఎంతో అద్భుతమైన విషయం. అదే దివ్య్ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఇతర ఆకాశ గ్రంథాల నుండి ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. * ఒకరి నుండి మౌఖికంగా విని దాన్ని నేర్చుకోవడం, నేర్పించడం అనే ఈ అద్భుత ప్రక్రియ నేటి వరకూ కొనసాగడానికి - అల్లాహ్ కృపానుగ్రహాల అనంతరం - ఈ విద్య పట్ల ముస్లిం పండితుల శ్రద్ధాసక్తులే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లాహ్ వాక్యాన్నిభద్రపరచి యథావిధిగా మానవాళికి చేరవేయాలి అన్న గొప్ప సంకల్పం వారికుండేది. అలా చేరవేసే గొప్ప బాధ్యత తమపై ఉందని వారూ భావించేవారు. బలంగా దాన్ని ప్రపంచ మానవాళి వరకు చేరవేసే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేసేవారు. ఖుర్ఆన్ మరియు హదీసుకి మధ్య వ్యత్యాసం దైవ ప్రవక్త (స) వారి ప్రవచనాలు, ఆయన నేర్పిన విషయాలు - కేవలం అల్లాహ్ వాక్యాలు మాత్రమే కలిగిన ఖుర్ఆన్ గ్రంథంతో కలగాపులగం కాలేదు.. ధర్మ పండితులు మహనీయ ముహమ్మద్ (స) వారి ప్రవచనాలను, ఆయన ఆచరణలను, ఆయన మౌనం వహించి అనుమతించిన విషయాలను ప్రత్యేకంగా గ్రంథ రూపం ఇచ్చారు. వాటిని హదీసు గ్రంథాలంటారు. ఉదాహరణకు - ప్రవక్త (స) వారి మాటలు, ఆయన ప్రవచనాలను కౌలీ సున్నత్ - వాక్కు పరమైన సున్నత్ అని, నమాజు విధానం, నమాజు భంగిమలు, హజ్జ్ అర్కానులు, విధానం తదితర విషయాలను అమలీ సున్నత్ ఆచరణ పరమైన సున్నత్ అని, ఒకరు చేస్తుండగా, ఒక మాట అంటుండగా చూసి మౌనంగా ఉండటాన్ని - తఖ్రీరి సున్నత్ - అనుమతించిన సున్నత్ అని పండితులు నామకరణం చేశారు. * మహనీయ ముహమ్మద్ (స) వారి, మాటలను, ఆయన ఆచరణలను, ఆయన అంగీకారాన్ని - ''సున్నత్' అంటారు. ఇక ఏ గ్రంథంలోనైతే కేవలం అల్లాహ్ వాక్యం ఉందో (ఏ మనిషి మాట లేదో) దాన్ని పవిత్ర ఖుర్ ఆన్ అని పిలుస్తారు. * ఖుర్ఆన్ దివ్యగ్రంథాన్ని ఇతర మత గ్రంథాలతో ఏ విధంగానూ పోల్చకూడదు. ఇతర మత గ్రంథాలు ఆయా రచయితలు - దైవ ప్రవక్తలు చెప్పిన ధర్మ విషయాలను వారు తమ భాషలో, తమ శైలిలో, తమ సొంత వ్యాఖ్యతో గ్రంథస్థం చేశారు. * ఉదాహరకు - చర్చీకి సంబంధించిన కొత్త నిబంధనలు అన్న పేరుతొ ప్రశిద్ధిగాంచిన నాలుగు సువార్తలు - అవి వాటి రచయితల పేరుతోనే గుర్తించబడ్డాయి. (మత్తయి, మార్కు, లూకా, యోహన్న. అలాగే పాత నిబంధనలు 1400 సుదీర్ఘ కాలంలో 40 వేర్వేరు రచయితల ద్వారా వ్రాయబడింది. భూమండలం మీద పద పరంగానూ, అర్థ పరంగానూ ఎలాంటి మారుచేర్పులకు, హెచ్చుతగ్గులకు ప్రళయ వరకు ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది ఖుర్ఆన్ మాత్రమే. అది అల్లాహ్ వాక్యం. యుగాలు గడిచిన,తరాలు మారినా అది మార్పు చెందని శాశ్వత మహిమ. అందులో ప్రజలందరి ప్రభువు సందేశాలు ఉన్నాయి. అందులో ధర్మ శాస్త్రం, మరియు జీవితానికి అవసరమైన ఉత్తమ బోధనలు ఉన్నాయి. ముహమ్మద్‌ (స)! మేము నిన్ను యావత్తు మానవాళి కోసం (స్వర్గ)శుభవార్త అందజేసేవానిగా, (దైవశిక్ష గురించి) హెచ్చరించే వానిగా చేసి పంపాము. కాని చాలా మందికి ఈ వాస్తవం తెలియదు. (సబా: 28)

వేసవి కాలం - పాఠం గుణపాఠం

మానవులారా! మీ ఆరాధ్యదైవం ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడయిన ఆ దేవుడు తప్ప (మీకు) మరో సత్య దేవుడు లేనేలేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ళ చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుంచి కురిపించే వర్షపునీటిలో, తద్వారా ఆయన మృతభూమికి జీవంపోసే (చెట్లూ చామల్ని పచ్చదనంచేసే) పనిలో, పుడమిపై పలువిధాల జీవరాసుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో, గాలుల సంచారంలో, నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని ఆస్తిత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని తెలిపే) అనేకనేక నిదర్శనాలు ఉన్నాయి. (బకరః : 163-164) గల గల పారే సెలయేరులు మిల మీల మెరిసే తారకలు అందమైన పూదోటలు హాయిగొలిపే పిల్ల తెమ్మెరలు ఎగసిపడే కడలి కెరటాలు సాగిపోయే నీలిమేఘాలు కోయిల పాటల వసంతాలు మట్టి వాసనల వర్షాలు కొండల్లో దూకే జలపాతాలు కోనల్లో దాగే అందాలు ప్రకృతే భూలోక స్వర్గ సీమ. అదే విశ్వ సృష్టికర్త ఉనికిని తెలియజేసే అసలు చిరునామా! ప్రకృతి ఎప్పుడు వృధాగా ఉండదు. అది దాని ఉనికినిలోనికి వచ్చిన వాటి ని గురించిన సత్యాన్ని, మంచితనాన్ని, సౌందర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతిరోజు ప్రకృతి దేవుని మహిమను నూతనంగా, తాజాగా ప్రకటిస్తుంది. ఆ సృష్టి అందాన్ని రూపించిన సృష్టికర్తను చూస్తున్నామా, లేదా ఊరికనే అలా చూసి దాటి పోతున్నామా ?
సృష్టి పరిమళాలు నాసికలకు తగిలినప్పుడు, ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు - సబ్హానల్లాహ్, అల్హందు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ - అల్లాహు అక్బర్ అన్న స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే!. సొగసులు పరిమళించే పువ్వు యొక్క తేజస్సును, లేలేత కిరణాలతో మెరుస్తున్న సూర్యోదయ వైభవాన్ని, ఎగిసిపడుతున్న ధ్వని రాగాల సముద్ర కెరటాలను, పక్షుల కువకువలను, ఆకాశాన్ని తాకే చెట్ల వంటి అపురూపాలను మనం చూసినప్పుడు మన హృదయం ఆరాధనాతో నిండిపోవాలి. కృతఙ్ఞతతో మన మాది పొంగిపొర్లాలి. బొట్లుబొట్లుగా జారే నీటిబిందువులు, కరిగే మంచు ధారల కలయికలు ఏకమై, పర్వతాల దిగువ నున్న అందమైన జలపాతాలుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి, చిన్నచిన్న విషయాలలో కృతజ్ఞత మన రోజువారి జీవితంలో చూడగలిగితే మనం జీవించే జీవితకాలమంతా అల్లాహ్ సౌందర్యంగా అపురూపంగా చేయగలడు. ప్రతి విషయంలో అల్లాహ్ ను స్తుతించే భాగ్య జీవితాలుగా, పుణ్య ప్రాణులుగా ఆయన మనందరినీ స్థిరపరచి ఆశీర్వదించుగాక! ఎండాకాలం అంటే కొందరికి మనసు నిండే కాలం. వైశాఖమంటే మండే ఎండలు, చల్లని నీళ్ళు. పల్లెటూళ్ళలో కొత్తావకాయ పచ్చళ్ళు,తాటాకు పందిళ్ళు, పెళ్ళి సందళ్ళు. పిల్లలకైతే వేసవి సెలవలు, అమ్మమ్మల వూళ్ళు, కొత్త ఆటలు, స్నేహాలు. ఎండల్లో ఆడొద్దని, వడదెబ్బని అమ్మ చెప్పినా రెట్టించిన ఉత్సాహం తో వీధుల్లోకి పరుగులు - నిజంగానే కొందరికి ఎండాకాలం అంటే మనసు నిండే కాలం. కానీ - బయట ఎండలో - వయసు భారాన్ని లెక్కచేయని - ఇస్తిరి పెట్టి ముసలివాడు - బొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు. - ఎండ పేలిపోతున్న - కరు వ్యాపారుల బండి నీడ పట్టుకు కదలదు - శ్వాస ఆగిపోతున్న - బతుకు పోరాటం ఆగదు - చూపులు తిప్పుకుని - చల్లని వాకిళ్ళ వైపు చూస్తే చాలు - గడపలో నీటి కోసం పక్షులు, పిల్లులు, కాకులు, కుక్కలు పిడచగట్టుకుపోయిన నాలుకలతో అలసిసొలసి ఉండటం చూసి మనస్సును తరుక్కుపోతుంది. ..తేమ (ప్రాణం) ఉన్న ప్రతి జీవిలోనూ పుణ్యం ఉంటుంది అని పశు పక్ష్యాదులు పరమ శ్రేయోభిలాషి మాటలు జ్ఞప్తికి రాక మానవు. ”ఈ మూగ జీవాల విషయంలో అల్లాహ్‌కు భయ పడండి” అని మందలించారు. దాహంతో ఉన్న ఓ కుక్క దాహాన్ని తీర్చిన ఓ వ్యభిచారిణిని అల్లాహ్‌ మన్నించి స్వర్గాన్ని ప్రసాదించాడని, పిల్లిని చిత్రహింసలుపెట్టి చంపిన ఓ స్త్రీని అల్లాహ్‌ నరకం పాలు చేశాడు అని జంతువుల హక్కుల్ని ఎవరూ తెలియజేయనంత కరుణామయ పద్ధతిలో తెలియజేశారు కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స). ఎండా కాలం అనగానే మనకు గుర్తుకొచ్చేది - ఐస్ గడ్డ. అవును మంచు గడ్డ మన జీవితం - మంచు గడ్డలు అమ్మే వ్యక్తి ఎం కోరుకుంటాడు. ఇది కరిగిపోక ముందే అమ్మేయ్యాలి, అమ్ముడుపోవాలి అనేగా... మన జీవితం కూడా అంతే. ఆరు ఋతువులతో, అన్ని సౌకర్యాలతో అలరారినా - అంతంత మాత్రపు అవసరాలతో అతలాకుతల్మయినా - మనము రాజైనా, రౌతైనా, రైతైనా ఎదోకరోజు అందమైన మన ఈ జీవితం మనం ఎంత వద్దనుకున్నా అంతమయిపోక మానదు. జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది / గువ్వల్లే బతకాలని తారాజువ్వ చెబుతుంది నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చిపెడుతుందని / తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది మనిషి చిత్తం బహు విచిత్రమయినది. అతనికి ఏది ఒక పట్టాన నచ్చదు. ' పుర్రెకో బుద్ధి - జిహ్వకో రుచి ' - లోకో భిన్న రుచిః . ఒక మనిషికి రుచించినది ఇంకొకడికి రుచించదు ఇంకా చెప్పాలంటే కొన్ని సమయాలలో అసహ్యించుకుంటారు కూడా . . జగమెరిగిన సత్యమిది . ఇంపైన వాసనలను తన చుట్టూ ప్రసరింపజేసి అందరినీ ఆకర్షించే సంపెంగ వద్దకు తుమ్మెద చేరదట . సంపెంగ పుష్పాల మకరందాన్ని అది గ్రోలదట, కొందరికి - చెట్లు చిగురించి పూలు పూచే వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం అంటే ఇష్టం. మరికొందరికి - ఎండలు మెండుగా ఉండే గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం.అంటే మక్కువ. ఇంకొందరికి - వర్షాలు ఎక్కువుగా కురిసే వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. అంటే పిచ్చి. మిగిలిన కొందరికి - చెట్లు ఆకులు రాలే శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం అంటే మనసు. అందుకే - ఒక ఋతువులో మరో ఋతువును గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనల్ని పుట్టించిన అల్లాహ్కు మన మనస్తత్వం తెలుసు గనక - ఇస్లామీయ ఆరాధనలను ప్రకృతి అంట సహజంగా, వైవిధ్యంగా చేశాడు. ఆ విషయం ఇస్లామీయ ఆరాధనలు సునిశితంగా పరిశీలిస్తే యిట్టె అర్థమయి పోతుంది. సూర్యుడు కాంతి మరియు వేడికి మూలం అయితే; అందులో ఒక పాఠం మరియు సంకేతం ఉంది. దాని అఖండ సృష్టి మహాద్భుతం. అయినా అది ప్రతి రోజు పరమ దయగల అల్లాహ్ కు సాష్టాంగపడుతుంది. ఆయన అనుమతితో తప్ప ఉదయించదు. ఆయన ఆయన లేనిదే అస్తమించదు కూడా. ఒక్క సూర్యమే కాదు సృష్టిలోని చరాచరాలన్నీ ఆలాహ్ సమక్షంలో - వాటికి శోభించే రీతిలో సాజిదా చేస్తాయి. ఇదే యదార్థాన్ని అల్లాహ్ ఇలా తెలియజేశాడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ ముందు సాష్టాంగపడుతున్న విషయం నీవు గమనించలేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, అనేకమంది మానవులు, (దైవ)శిక్షకు అర్హులైపోయిన చాలా మంది మానవులు కూడా (సాష్టాంగపడుతున్నారు). అల్లాహ్ ఒక వ్యక్తిని నీచుడిగా, అల్పునిగా చేయదలచుకుంటే, ఇక అతడ్ని ఎవరూ గౌరవించరు.అల్లాహ్ తాను తలచిన పని తప్పకుండా చేస్తాడు. (హజ్: 18) వారు అల్లాహ్ సృష్టించిన ఏ వస్తువునీ పరికించి చూడలేదా? ఆ వస్తువుల నీడలు కుడి ఎడమల వైపు పడుతూ అల్లాహ్ ముందు ఎలా సాష్టాంగపడుతున్నాయో గమనించరా? ఈవిధంగా సృష్టిలోని అణువణువూ (దేవునిపట్ల) తన వినమ్రత వ్యక్తపరుస్తోంది. భూమ్యాకాశాల్లోని సమస్త జీవకోటి, దైవదూతలు అల్లాహ్ ముందు వినమ్రులై తలవంచుతున్నారు. వారు ఎలాంటి అహంకారం చూపకుండా పైనున్న తమ ప్రభువుకు భయపడుతుంటారు; తమకు జారీచేసే ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. (నహల్ : 48-50) సృష్టి సాంతం ఇంతలా అల్లాహ్ కు విధేయత చూపుతుంటే - సృష్టిశ్రేష్ఠుడయిన మానవుడు మాత్రం ఇష్టా రాజ్యంగా జీవితున్నాడు. అతని ఈ వైఖరిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తున్నాడు: ఓ మానవుడా! దయామయుడైన నీ ప్రభువుని గురించి నిన్నేవిషయం మోసంలో పడ వేసింది? ఆయన నిన్ను పుట్టించి, నీ అవయవాలు పొందికగా అమర్చాడు. నిన్ను తగిన విధంగా రూపొందించాడు. తాను తలచిన రీతిలో నిన్ను (అందంగా) మలిచాడు. (ఇన్ఫితార్: 6-8) “ఏవిటీ, నిన్ను మట్టితో నీచమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? (అల్-కహఫ్: 37) కొన్ని ముఖ్యమైన అంశాలు 1) వేసవిలో మగమారాజులు అర్థ నగ్నంగా ఉండటం మానుకోవాలి. పురుష పుంగవులు ఎందరో తమ తొడలు తెరిచి కూర్చుంటారు, ఇది ముమ్మాటికీ గర్హనీయం. పరదా మహిళకే కాదు మగవారికి కూడా ఉంటుందన్న యదార్థాన్ని గుర్తించాలి. అలాగే కొంత మంది మహిళలు, అమ్మాయిలు తమ ఇళ్లలోని మహ్రమ్ (పరాయి) పురుషుల ముందు ఛాతీపై దుపట్టా ధరించరు. ఇది కూడా ముమ్మాటికి సంస్కారానికి విరుద్ధమే! 2) ఫజ్ర్ ప్రార్థనను మిస్ చేయవద్దు: వేసవిలో రాత్రులు చిన్నవిగ, పగళ్లు పెద్దవిగా ఉంటాయి. నిద్ర సరిపోవడం లేదు అన్న సాకుతో ఫజ్ర్ నమాజును వేళకు చేయకపోవడం సమంజసం కాదు. అస్సలాతు ఖైరుమ్ మీనన్ నౌమ్ - హాయి నిద్ర కన్నా నమాజు గొప్పది అన్న ముఅజ్జిన్ పిలుపును మనం అల్లాహ్ ఇస్తున్న పిలుపుగా గ్రహించిన నాడు ఫజ్ర్ కోసం లేవడం చాల సులభమైపోతుంది. 3) ఎండా కాలంలో బయట ఎండలు మండిపోతున్నాయి అంటూ జుహర్ నమాజును వాయిదా వేసుకోవడమే, ఇంటి దగ్గరే చేసుకోవడమో చేస్తూ ఉంటారు. మరి కొందరయితే, ఇది ఎండ కాదు అల్లాహ్ శిక్ష అని నోరు జారుతుంటారు. ఇది తప్పు. ఎండా శిక్ష కాదు జీవకోటికి నిలువెత్తు రక్ష. అల్లహ్ ఏమంటున్నాడో కూడా కాస్త గమనించండి! వెనుక ఉండిపోయినవారు, దైవ ప్రవక్త (సఅసం) వెళ్ళిన తరువాత, తాము ఆ విధంగా (ఇంట్లో) ఉండిపోయినందుకు సంబరపడ్డారు. అల్లాహ్ మార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టం లేదు. పైపెచ్చు "ఇంత తీవ్రమైన ఎండవేడిలో బయలుదేరకండి" అని అన్నారు. (ఓ ప్రవక్తా!) "నరకాగ్ని ఇంత కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది" అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు! (తౌబహ్: 81) నరకాగ్ని తాపం ముందు ఈ వేసవి తాపం లెక్కలోకి రాదన్న సంగతిమనకు తెలిస్తే మనం ఎంతమాత్రం వెనుక ఉండేవారం కాదు. ప్రపంచంలోని ఈ వేడి నరకాగ్ని వేడిలో 70వ భాగం అని, ప్రపంచంలోని ఎండవేడికన్నా నరకాగ్ని వేడి 69 రెట్లు అధికంగా ఉంటుందని హదీసు ద్వారా తెలుస్తోంది (సహీహ్ బుఖారీ) 4) నీడ ఉన్న ప్రాంతాలను రక్షించండి, నీడనిచ్చే చెట్ల క్రింద మలమూత్ర విసర్జన చేయడం, చెత్తాచెదారం విసిరేయడం సబబు కాదు. పైగా మన ఈ చేష్ట వాళ్ళ అల్లాహ్ అభిశాపానికి గురవుతాము అన్న స్పృహ మనకుంది తీరాలి. ఎక్కువ మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పెంచి ప్రకృఏ పులకించేలా చేయాలి. 5) చెమట వాసనతో మసీదుకు వెళ్లవద్దు - ముస్లింలోని ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఉల్లి, వెల్లుల్లి తిన్నవారు మా మస్జిద్ దరిదాపులకు కూడా రారాదు. ఎందుకంటే మనుషులు వేటి మూలంగా ఇబ్బంది పడతారో దైవ దూతలు కూడా వాటి మూలంగా ఇబ్బంది పడతారు. ఉల్లి, వెల్లుల్లి లాంటి దుర్వాసన కలిగిన వస్తువులు పచ్చిగా ఉన్నవాటిని నమాజ్కు ముందు మస్జిద్కు వెళ్ళేటప్పుడు తినరాదు. దానివల్ల తోటి నమాజీలకు, దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉల్లి, వెల్లుల్లి అసలు తిననేకూడదని దీని భావం ఎంతమాత్రం కాదు. దాదాపు ప్రతి కూరలోనూ వీటి అవసరం ఉంటుంది. పచ్చివి తిని వెళ్ళకూడదు. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏమిటంటే, హలాల్ అయిన ఉల్లి, వెల్లుల్లి వంటి కూరగాయలే తిని వెళ్ళకూడదు అంటే, ఆరోగ్యానికి హానికరమైన, క్యాన్సర్ కి కీలక కారణమైన ఖైనీ, పాన్ పరాగ్, బీడీ, సిగరెట్ తాగి, తిన్న తర్వాత వెళ్లడం ఎంత గర్హనీయమో ఒక్క సారి ఆలోచించండి! 6) చల్లటి నీరు త్రాపించండి, వీలైతే వాటర్ కూలర్ ఏర్పాటు చేయండి! మరింత సౌకర్యం, గల సంపన్నులు విరివిరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక్, మంచి నీటి బావులు త్రవ్వి సమాజానికి, సంఘానికి అంకితం చేయడాం ఎంతో హర్షణీయం. 7) పునరుత్థాన దినం యొక్క భయానక విషయాలను గుర్తుంచుకోవాలి. : ఎండాకాలం వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రళయకాలపు భయానకతను గుర్తుంచుకోవాలి. ఈ రోజు సూర్యుడు వేల మైళ్ల దూరంలో ఉన్నాడు కానీ దాని వేడిని భరించలేనంతగా ఉంది కానీ యాభై వేల సంవత్సరాల సుదీర్ఘంగా ఉండే ఆ రోజు ఏమి జరుగుతుండో ఎప్పుడైనా ఆలోచించామా? సూర్యుడు ఒక మైలు దూరంలో వస్తాడు, నేల ఇనుము నేలగా మార్చివేయబడుతుంది అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో యోచించామా? ఏ ఎండకు ఆ గొడుగు పొద్దున్న వచ్చే ఎండ తూర్పు దిశనుండీ, మిట్టమధ్యాహ్నపు ఎండ నడినెత్తిమీద, సాయంకాలపు ఎండ పడమటిదిక్కునుండి తగులుతుంది కాబట్టి ఆయాసమయాలలో గొడుగును ఎటువైపు తిప్పిఉంచితే ఎండ తగలకుండా ఉంటుందో అటువైపు తిప్పిఉంచటాన్ని ఏ ఎండకు ఆ గొడుగు పట్టటమనే వాడుకను "" ఏ సందర్భానికి తగినట్లు ఆ విధంగా వ్యవహరించటం "" అనే అర్థం వచ్చేలా వాడటం వలన ఓ సామెత గా మారిపోయింది. ఇక రానురానూ, ఒకేమాట మీద నిలబడకుండా సందర్భానుసారంగా ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ స్వప్రయోజనాల కనుగుణంగా ప్రవర్తించే వైఖరిని సూచించటానికి ""ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం"" అనే వాడుక చిట్టచివరికి స్థిరపడిపోయింది. తాపం అనేక రకాలు - కానక తాపం, కామ తాపం... ఇక వయసు వేడి వలపు వాడిని దాటుకుంటూ ఎక్కడి రావాలో అక్కడికి వచ్చేసాం. ‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోయింది.. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్‌ పాలకుల తలరాత మార్చింది, . కొత్త వాళ్లు అధికారంలోకి వచ్చారు. అధిక శాతం . పాత వాళ్లే కొనసాతున్నారు. ఇకపై అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. చలి కాచుకునేందుకు మధ్య మధ్యలో మత కలహాలనీ, ప్రాంతీయ అభిమానం అనీ, జాతి అని, కులం అని, వర్గం అన, వర్ణం అని తగాదాల మంటలు రేపడమూ పరిపాటిగా జరిగిపోతూనేవుంటుంది. ఇస్లామీయ శాస్త్ర అధ్యయనం చేయకుండానే - ఇది చేసేయాలి, అది సరి చేసేయాలి అంటారు. మస్జీద్ లు ఇప్పటికీ తగులబడుతూనే ఉన్నాయి ... మూక హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో - 13 మూక హత్యలు చోటు చేసుకోగా, మరణించిన వారిలో 9 ముస్లింలు,1 క్రైస్తవ మహిళ, 3 దళితులూ, ఉన్నారు. ఇవే కాకుండా ఎన్నో మూక దాడులు, బుల్డోజర్లతో ఇల్లు కూలదోయటాలు జరిగాయి. జరుగుతున్నాయి.. మానవ చరిత్రలో మహామహులు మట్టిలో కలిసిపోయారు... స్వల్ప వ్యాధిలో అధికారంలో ఉండే ఈ నీచ రాజకీయనాయకులు ఎంత. వేసవి మంటలు ఆరిపోయినా -- ఈ పాపిష్టి రాజకీయ నాయకుల కడుపు మంటలు చల్లారడం లేదు. సమీప కాలంలో చల్లారేలా కనబడ్డం లేదు. ఎవరి వేడి ఎలా ఉన్నా, సగటు పౌరుని పౌరుష తాపం చల్లబడకూడదు. కానీ దేశ పరిష్టితులు దీనికి పూర్తి భిన్నంగా అగుపడుతున్నాయి. ఓ కవి - మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు..అన్న మాటలు అక్షరసత్యాలుగా కనిపిస్తున్నాయి. చీమలకు చక్కెర.. పాములకు పాలు పోసి జీవకారుణ్యమే జీవితం అని చెప్పుకొంటూ పోజులిచ్చే మనుషులు.. తన కళ్లెదుటే మరొక మనిషిని హత్య చేస్తున్నా పట్టించుకోకుండా పక్కకు జారుకుంటున్నారు. ఎవరైనా కాకిని, పిల్లిని సతాయిస్తే - వీడియో తీసి కాకి పట్ల క్రూరంగా వ్యవహరించిన కఠిన హృదయుడు, పిల్లి పట్ల కర్కశంగా వ్యవహరించిన పాషాణ మనస్కుడు అని ట్యాగ్ చేసే జనం - రక్త మాంసాలున్న సాటి మనిషిని ముక్కలుముక్కలుగా నరుకుతున్నా ఎందుకు నోరెత్తడం లేదు, అడుగెత్తి అడుగేసి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు చూసినప్పుడు - కాకుల్లో ఉన్న స్పూర్తి మనుషుల్లో లేకపోయే అనిపిస్తోంది. చివరిగా - భారత దేశం అనే చెట్టు కొమ్మకు పూచిన పువ్వులం మనమందరం - అనురాగం మనదవ్వాలి.ఒక గూటిని వెలిగిన దివ్వెలం మనమందరం - మమకారం మన సొంతం అవ్వాలి. జగమంతా కుటుంబం మనది అన్నంత కాకపోయినా కనీసం భారత దేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న సద్భావం ఉంటేనే మన గతి సద్గతి కాగలదు. కాదు కుదరదు అంటే, పగ ప్రతీకారాలు, భాష, ప్రాంత, మత దురభిమానాల తాప తాకిడి మానవత్వం నిలువెత్తు నిప్పు కుంపటిగా మారడం తథ్యం. అల్లాహ్ అందరినీ రక్షించుగాక! కాబట్టి - కత్తితో ఛేధించలేనిది..కరుణతో ఛేధించాలి / కక్షతో కాని పని..క్షమాబిక్షతో సాధించాలి / తెలిసి తెలియక కాలు జారితే / చెయూత నిచ్చి నిలపాలి మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి / లోపాలు లేని వారు ఎవరో చూపండి ! వెళుతూ .. వెళుతూ ... అర్థం కానీ మిస్టరీ అనుకునే జీవితాన్ని అర్థవంతమైన హిస్టరీగా ఎందుకు మలచుకోకూడదు? ఒక్క సారి ఆలోచించండి!

ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి?

స్త్రీ గొప్పదనం సృష్టి ప్రారంభమైన నాటినుంచి తన కన్నా బిడ్డల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ, తనవారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ఒకే ఒక్కరు " స్త్రీ". ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా ఒక అమ్మకు కొడుకే అందుకే చెప్పారు పెద్దలు అయితే పురుషాహంకార సమాజం కారణంగా మహిళలలు అనేక ఎదుర్కొంటున్నారు మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు కొన్ని - 1. కనీస మానవ హక్కులను దూరం చేయడం: జీవించే హక్కు, మాట్లాడే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు మొదలైనవన్నీ వారికి దూరం చేయడం. 2. ప్రాథమిక హక్కులైన విద్య, ఆర్థిక స్వతంత్రత, సమానహోదా మొదలైనవన్నీ నిరాకరించడం. 3. మహిళలపై సమాజవైఖరి, గృహహింస, పనిచేసే దగ్గర లైంగిక, మానసిక హింస. 4. చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి, వారిని బయటకు రాకుండా చేసి, వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. 5. లింగ అసమానత అన్ని రంగాల్లో పాతుకుపోయింది. 6. నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యం లేకపోవడం. 7. మహిళను వివిధ భౌతిక హింసలకు గురిచేయడం పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో ఈ జఠిల సమస్యకు ఇస్లాం ఏమైనా తరుణోపాయం కాగలుగుతుందా తెలుసుకుందాం! ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటో తేల్చుకుందాం!!
మహిళల హక్కుల విషయంలో ఇస్లాం ఒక మేలిమి మలుపు ఇస్లాం - విశ్వ ప్రభువు తరఫు నుండి విశ్వ జనులందరి కోసం ఎన్నుకోబడిన విశ్వ జనీన ధర్మం. వర్ణ, వర్గ, రంగు, రూపు, భాషా, ప్రాంతం, ఆడ, మగ అన్న తేడా లేకుండా - అందరి హక్కును సమానంగా, న్యాయబద్ధంగా అంగీకరించే ధర్మం ఇస్లాం. వారి హక్కులకు పూర్తి పూచి పుచ్చుకునే ప్రకృతి సిద్ధ ధర్మం ఇస్లాం. ఇస్లాంలో స్త్రీలు - వారు పసి పిల్లలయినా, యవ్వనస్తులయినా, , కూతురు అయినా, భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, అమ్మమ్మ అయినా, నాన్నమ్మ అయినా - వారందరికీ ఎంతో గొప్ప స్థానం ఉంది. అనేక సందర్భాల్లో దైవ ప్రవక్త (స) మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని నొక్కి వక్కాణించారు: మీరు మహిళల యెడల మంచిగా వ్యవహరించండి. (బుఖారీ, ముస్లిం). ధర్మ ఆదేశాలు వర్తించే విషయంలో - ''నిశ్చయంగా స్త్రీలు పురుషుల తోబుట్టువులు" అన్నారు. (అబూ దావూద్) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, మహిళల సామాజిక మరియు ఆర్థిక హక్కులు మంజూరు చేయబడ్డాయి. ఇవి సుదీర్ఘ పోరాటాలతో, ప్రాం త్యాగాలతో, ధర్నాలతో, ఆమరణ నిరాహారదీక్షలతో సాధించున్నవి కాదు, ప్రక్రుతి సిద్ధంగా పడుతుల్ ప్రభువయిన అల్లాహ్ వారికి జన్మతః అనుగ్రహించిన జన్మహక్కులు. వాటికి పురుషుల మాదిరిగానే ఇస్లాంలో హామీ ఇవ్వబడింది. ఈ హామీ అనేది భద్రత, రక్షణ, న్యాయం మరియు స్థిరత్వం రీత్యా ఉన్నత ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. తొలి మానవుడయిన ప్రవక్త ఆదమ్ (అ) వారికి పూర్వం నుండే ఉన్న ఇస్లాం ధర్మం - 1,440 సంవత్సరాల క్రితం పరిపూర్ణమయింది. అది మహిళల హక్కులకు సంబంధించి చారిత్రాత్మకమైన మేలిమి మలుపు. అరేబియా ద్వీపకల్పం మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష, ఆడ శిశుహత్య, స్త్రీల ఆర్థిక మరియు సామాజిక హక్కులను స్వాహా చేసుకోవడం, బాలికలను బలవంతంగా వివాహం చేసుకోవడం వంటి మహిళలకు హాని కలిగించే దౌర్జన్యపూరిత ఆచారాలు అమల్లో ఉండేవి. ఈ వికృత విధానాలన్నింటి ఇస్లాం నిషేధించింది. అన్ని రకాల వైవాహిక అవమానాల నుండి మహిళలను కాపాడింది. ఇస్లాం మహిళల సంపాదన, ఆస్తిపాస్తుల్ని రక్షిస్తుంది. వాటిని ఎవరూ వారి నుండి లాక్కోలేరు. ఇస్లాం మహిళల వారసత్వపు హక్కును ఆమోదించింది. ఆమె కుటుంబ స్థితిని బట్టి వారసత్వపు వాటాను నిర్ణయించే ఒక దైవిక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది ఒక గొప్ప సాంస్కృతిక, సాంఘిక, ఆర్ధిక మార్పు. మహిళలకు వారసత్వ హక్కును ఇవ్వని సమాజాలకు ఇది ఓ కనువిప్పు. పూర్వం - స్త్రీ పురుషుని ఆస్తిలో భాగంగా, భర్త చనిపోతే వారసత్వపు సొత్తుగా భావించేవారు. ఇస్లామీయ వారసత్వ చట్టం నేటికీ అనేక పాశ్చాత్య న్యాయస్థానాలలో చట్టపరమైన దిక్సూచిగా ఉంది అనేది నిర్వివాదాంశం. ఇస్లాం వివాహితులు, విడాకులు పొందిన మరియు వితంతువుల స్త్రీలకు స్పష్టమైన, నిర్దిష్టమైన హక్కులను కేటాయిస్తుంది. మరియు భార్యకు తన భర్తపై ఉన్న హక్కులకు సమానమైన హక్కులను ఆమెకు ఇస్తుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒక మెట్టు ఆధిక్యత ఉంది. దేవుడు శక్తిమంతుడు, వివేచనాపరుడు. (అల్-బఖరహ్: 228) మహిళల యెడల మంచిగా వ్యవహరించండి. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; ఎవరైతే ఇద్దరు ఆడ పిల్లల పోషణా బాధ్యతను స్వీకరించి,వారు యవ్వన దశకు చేరుకునేంత వరకు వారి బాగోగులను చక్కగా గమనిస్తారో - వారు రేపు ప్రళయ దినాన వచ్చినప్పుడు - నేను మరియు వారు ఈ రెండు వ్రేళ్ళలా ఉంటారు అని ఆయన తాన్ రెండు వెళ్ళను కలిపి చూపించారు.(ముస్లిం) స్త్రీకి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది ఇస్లాం స్త్రీలను తన స్వంత అస్తిత్వం మరియు స్వతంత్ర వ్యక్తిత్వం గల స్వేచ్చాయుత స్త్రీగా చూస్తుంది. ఆమె తన వంశం, కుటుంబ పేరుతోనే పిలువబడుతుంది. అనేక పాశ్చాత్య సమాజాలలో జరిగే విధంగా వివాహం తర్వాత తన ఇంటి పేరును మార్చుకోదు. మహిళలకు హక్కులున్నట్లే బాధ్యతలు కూడా ఉంటాయి. విధులు, బాధ్యతలు రూపేణా తప్ప స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎలాంటి ఉండదు. ఇస్లామీయ సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉంది సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర చాల కీలకం అన్న విషయాన్నిఇస్లాం గుర్తిస్తుంది. ఆమె సమాజ అభివృద్ధిలో పాలు పంచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ కర్తవ్య నిర్వహణలో ఎక్కడా ఆమె పురుషునితో విభేదించదు. పైగా ఒకరు మరొకరని బల పరుస్తారు, పూర్ణతను సాధిస్తారు. మహిళల కార్య పరిధి ప్రధానంగా పిల్లల ఆలనా పాలన, వారికి సుశిక్షణ ఇచ్చి సక్రమంగా పెంచడం కోసం ప్రత్యేకించబడింది. తద్వారా పిల్లలు సత్పౌరులుగా, సత్సమాజ నిర్మాతలుగా, భావి పౌరులుగా ఎదుగుతారు. సమాజ విచ్చిన్నానికి కాకుండా ఆదర్శ సమాజ నిర్మాణానికి బలమయిన పునాదులుగా రూపు దిద్దుకుంటారు. అయితే ముస్లిం మహిళలు సామాజిక మరియు రాజకీయ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించి, తనదైన బలమైన ముద్రనువేసే పూర్తి స్వేచ్ఛ, అధికారం వారికుంటుంది. దైవ ప్రవక్త (స) మహిళా శిక్షణార్థం, విద్యాబోధ నిమిత్తం ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించేవారు. మహిళలు సామూహిక నమాజు, ఈద్ నమాజు, ప్రమాణం, స్వఅభిప్రాయాన్ని తెలియజేయడం కోసం రావలసిందిగా ఆయన ప్రోత్సహించారు. స్వయంగా ప్రవక్త (స) ప్రాపంచిక విషయాలలో తన సహచరులతో సలహాసంప్రతింపులు జరిపినట్లే, తన సతీమణులు సలహాలు సయితం తీసుకోకునేవారు. అలాగే సంఘ ఇతర మహిళలు కూడా వారి వారి అవసరాలను ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి చెప్పుకునేవారు. అయన ఇచ్చిన సలహాలను, చూపిన పరిష్కారాలను అమలు పరచేవారు కూడా, ఎంతవరకంటే, ఒక సామాన్య బానిస మహిళ, పని మనిషి తన సమస్యను ప్రవక్త (స) వారి ముందర పెట్టడానికి భయ పడేది కాదు. సమాజాని సేవ, విద్య, నర్సింగ్, వైద్యం వంటి రంగాలలో ముందు తరాల సుశిక్షణ నిమిత్తం పని చేయాలని ఇస్లాం మహిళలను ప్రోత్సహిస్తుంది. అనేక సందర్భాల్లో, ప్రవక్త (స) స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించాలని తాకీదు చేశారు. పెరిగి పెద్దయ్యే వరకు ఆడపిల్లలను మంచిగా తర్ఫీదు ఇవ్వాలని, వారిని ఆదర్శ మహిళకు తీర్చిదిద్దాలని ఆయన అభిలషించారు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; ఎవరైతే ఆడపిల్లల విషయంలో పరీక్షకు గురి చేయబడి, ఓర్పు, నేర్పుతో వారిని చక్కగా పెంచి, వారు పెద్దయ్యే వరకు ధర్మమార్గంలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారో - వారికీ నరకాగ్ని నుండే కాపాడే కవచాలుగా ఆడ పిల్లలుంటారు> (బుఖారీ, ముస్లిం) ఆధునిక యుగంలో మహిళలు మరియు ఇస్లాం ఆధునిక యుగం మునుపటి చారిత్రక యుగాలకు భిన్నంగా వేగవంతమైన మార్పులను చూస్తోంది. మరి ఇస్లాం బోధనలు ప్రస్తుత మహిళల అవసరాలను తీరుస్తున్నాయా? ప్రపంచంలోని చాలా దేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న మూడు ప్రపంచ సమస్యలను మేము క్రింద ఇస్తున్నాము. ఇస్లాం వాటికి సమూల పరిష్కారాలను ఎలా చూ[పిందో క్లుప్తంగా అందిస్తున్నాము: 1 - స్త్రీ శరీరాన్ని దుర్వినియోగం చేయడం. 2 - వివాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు. 3 - గృహ హింస మరియు మహిళలపై వేధింపులు. 1) ఆడదాని శరీరం అంగడి సరుకు కాదు ఇస్లాం స్త్రీలను గౌరవించింది, శారీరక దుర్వినియోగం నుండి వారిని రక్షించింది. ఆమె దేహాన్ని విలాస వస్తువుగా చూడటాన్ని, ఆమెను వ్యభిచారం కుంపటిలోకి లాగడాన్ని, వారిని పురుషులకు ఎరగా వాడుకోవడాన్ని గర్హించింది, నిషేధించింది. అలాగే మగువ జీవితాన్ని నాశనం చేసే, ఆమె గౌరవానికి, ఆత్మాభిమానానికి భంగం కలిగించే నగ్నత్వాన్ని. అర్థ నగ్నత్వాన్ని, సంఘ నీతికి, నైతికతకు విరుద్ధమైన ప్రతి చర్య మరియు క్రియను ఇస్లారం నిషేధించింది. సిగ్గుమాలిన చేష్టల వల్ల ఆమె లైంగిక వేధింపులకు గురవ్వడమేకా, ఒక్కోసారి అపహరణకు, అత్యాచారానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. నేడు లైంగిక వ్యాపారం, వ్యభిచారంలో చిన్న వయసు గల ఆడపిల్లలు దించడం ద్వారా - అశ్లీల సాహిత్యం, బూతు సినిమాలు, నగ్న, అర్థ నగ్న చిత్రాల వెల్లువ అనేక సాంఘిక రుగ్మతలకు దారి తీసుతున్నది. ఫలితంగా - ప్రాణాంతక వ్యాధులు నేటి యుగాయానికి, రాబోయే తరానికి భయంకర శాపంగా మారనున్నాయి. ఆదం సంతానమా! మీరు మీ మర్మావయవాలను కప్పుకోవడానికి, మీ దేహానికి రక్షణగా, అలంకరణగా ఉపయోగపడటానికి మేము మీకు దుస్తులు ప్రసాదించాము. అయితే అన్నిటికంటే భయభక్తుల దుస్తులే ఎంతోశ్రేష్ఠమైనవి. ఇది (వస్త్రధారణ) దేవుని సూచనల్లో ఒక సూచన. మీరు విషయం గ్రహిస్తారని (ఇలా తెలుపుతున్నాం).” (అల్-ఆరాఫ్: 26) వ్యభిచారం దరిదాపులకు పోకండి. అది చాలా హేయమైనది, పరమచెడ్డదారి. (బనీ_ఇస్రాయీల్: 32) 2) వి వాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు లేని సమాజం నేడు ప్రపంచ అనేక దేశాల్లో ఉన్నట్టు - స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాన్ని ఇస్లాం అనుమతించదు. ఒక పురుషుడు మరియు స్త్రీకి మధ్య లైగిక సంబంధం వివాహం అనే పవిత్ర పద్ధతిలోనే ఏర్పడాలి. ఇస్లాం చెప్పే ఈ సువర్ణ సూత్రం నేడు ప్రపంచంలో పెచ్చుమీరుతున్న అనేక సామాజిక, సాంసారిక, దాంపత్య సమస్యలకు చక్కటి పరిష్కారం. వాటిలో ముఖ్యమైనవి: మహమ్మారి రోగాల వ్యాప్తి, వంశ మూలాలను కోల్పోవడం, అక్రమ సంతానం అధికమవ్వడం, అసలు తల్లిదండ్రులెవరో కూడా తెలియని అనామక, ఆశ్రయరహిత సంతానం పెరిగిపోవడం. ఇస్లామీయ బోధనలు వంశ వృక్ష, పరంపర పరిరక్షణను, పిల్లలు వారి తండ్రులు మరియు తల్లులతో ఉండాలన్న ఖచ్చితమైన నియతిని కలిగి ఉంటాయి. గొప్ప విషయం ఏమిటంటే, ఇస్లాం ప్రజల సృష్టికర్త తరఫు నుండి అందజేయబడిన కుటుంబ చట్టాల ఆధారంగా ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఉనికిలోకి రావాలని అభిలషిస్తోంది. ఆ కుటుంబ వాతావరణం - స్త్రీలను గౌరవించేలా, వారి మనో భావాలను గుర్తించేలా, వారి ఆత్మాభినాన్ని రక్షించేలా, వారి హక్కులను కాపాడేలా ఉండాలని కోరుకుంటంది. అలాగే మహిళకు తన భర్తను ఎన్నుకునే స్వేచ్ఛ, హక్కు హామీని ఆమెకిస్తుంది. ఆమె గౌరవార్థం వివాహ సందర్భంగా మహర్ ను భర్తపై తప్పనిసరి చేసింది. ఇస్లాం, పురుషుడు తన కుటుంబం మరియు పిల్లల ఆర్థిక బాధ్యత స్వీకరించాలని కోరుతుంది. అనివార్య కారణాల వల్ల విడిపోయినప్పుడు లేదా విడాకులు తీసుకున్నప్పుడు, భరణం పొందే హక్కు స్త్రీకి ఉంటుంది అంటుంది. గడువు ముగిసే వరకు ఆమెకు సంబంధించిన కూడు, గూడు, గుడ్డ ఏర్పాటు పురుషునిపై తప్పనిసరి అని గట్టి తాకీదు చేస్తుంది. ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (అర్-రూమ్: 21) దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: “యువకుల్లారా! మీలో వివాహం చేసుకునే శక్తి కలవారు వివాహం చేసుకోవాలి. ఆ శక్తి లేనివారు ఉపవాసవ్రతం పాటించాలి. ఉపవాసం కామవాంఛను అదుపులో ఉంచుతుంది. శీలాన్ని రక్షిస్తుంది. చెడు దృష్టిని కాపాడుతుంది " (బుఖారి, ముస్లిం) ఆయన ఇంకా ఇలా అన్నారు: ఒక వ్యక్తి వ్యభిచారం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక వ్యక్తి దొంగతనం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక వ్యక్తి మద్యం త్రాగేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. (అంటే ఆ స్థితిలో విశ్వాసం అతన్నుండి వైదొలుగుతుంది). (బుఖారీ) 3) గృహ హింస మరియు మహిళలపై వేధింపులు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొనే మిక్కిలి విచారకర సమస్యల్లో గృహ హింస కూడా ఒకటి. స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని ఆఫ్రికన్ దేశాలు ప్రపంచంలో అత్యధిక గృహ హింస మరియు అత్యాచార నేరాలను నమోదు చేశాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, గృహ హింస సంఘటనల కారణంగా సంవత్సరానికి $100 మిలియన్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇందులో పనికి హాజరుకాకపోవడం మరియు అనారోగ్య సెలవులు ఉన్నాయి. హింస ఫలితంగా మొత్తం వైద్య ఖర్చులు సంవత్సరానికి సుమారు $5 బిలియన్లు చేరాయి. స్పెయిన్‌లో, మహిళలపై హింసాత్మక సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. 2017 గణాంకాల ప్రకారం మహిళలపై హింస సంబంధిత కేసులు 158,000 కంటే ఎక్కువ నమోదవదయ్యాయి. దీనికి భిన్నంగా - దాంపత్య సంబంధ బాంధవ్యం - ప్రేమ, దయ, పరోపకారం, త్యాగం, నిబద్ధత, పరస్పర గౌరవం అనే పునాదులపై నిర్మితమవ్వాలని ఇస్లాం ధర్మం పిలుపునిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: “మీరు స్త్రీల పట్ల మృదువుగా వ్యవహరించండి. స్త్రీలు ప్రక్కటెముకలతో సృజించబడ్డారు. ప్రక్కటెముకలలో కూడా అన్నిటికంటే ఎక్కువ వంకరగా ఉండే పైఎముకతో సృజించబడ్డారు. మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. ఒకవేళ దాని మానాన వదిలేస్తే అది అలా వంకరగానే ఉంటుంది. కనుక మీరు స్త్రీలతో మంచిగా (మృదువుగా) మసలు కోండి." (బుఖారి, ముస్లిం) భార్య ముఖమ్మీద కొట్టరాదని, శరీరం కందిపోయే వస్తువులతో కొట్టరాదని, నిర్దయగా కొట్టరాదని దైవప్రవక్త (సల్లం) అన్నారు. అలాంటి వారిని ఆయన అస్సలు ఇష్ట పడేవారు కాదు. పగలు గొడ్డులా బాది, రాత్రవగానే కామాంధుల్లా ప్రక్క చేరే బుద్ధి ఎలా కలుగుతుందయ్యా మీకు? అని పురుషాహంకారులను మందలించిన సందర్భాలు ఎన్నో. ఎవరికైనా ఇద్దరు భార్యలుండి, వారిద్దరి హక్కుల్ని న్యాయంగా, సమానంగా, సమంజసంగా నిర్వర్తించకపోతే, తీర్పుదినాన అతను సగం శరీరం కోల్పోతాడు. ఆ స్థితిలోనే (అర్థశరీరంతో సమాధినుండి) లేస్తాడు" అన్నారు దైవప్రవక్త (స). (తిర్మిజి) కుదరని ఓపక్షంలో - దంపతులిద్దరు దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండలేమని భయపడినప్పుడు స్త్రీ తన భర్తకు ఏమైనా ఇచ్చేసి అతని నుండి వేరుపడ దలచుకుంటే వారిద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదరడంలో తప్పు లేదు. (బఖరః - 229) మహిళకు సంబంధించి మహనీయ ముహమ్మద్ (స) చేసిన మహితోక్తులు జీవితానికి సంబంధించిన సకల విషయాలలో పరమ ఆదర్శప్రాయులు మహనీయ ముహమ్మద్ (స). అయన - మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని ఆయన నొక్కి వక్కాణించారు. ముందు మీ అమ్మ ఒక వ్యక్తి దైవ ప్రవక్త పవిత్ర సన్నిధికి వచ్చి - ఇలా విన్నవించుకున్నాడు: ఓ దైవ ప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అత్యంత ఎక్కువ అర్హులు ఎవరు? దానికి: "నీ అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆ తర్వాత ఎవరు? అని మళ్ళీ అడగ్గా - "నీ తల్లి... అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆ పిదప ఎవరు? అని తిరిగి ప్రశ్నించగా - "నీ అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆనక ఎవరు? అని మళ్ళీ అడగ్గా ''నీ తండ్రీ" బదులిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం) మహనీయ ముహమ్మద్ (స) జీవిత కాలంలో ఎవ్వరినీ ఎప్పుడు కొట్ట లేదు. ఏ స్త్రీని కొట్టింది లేదు. ఏ సేవకుణ్ణి కొట్టింది లేదు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేటప్పుడు తప్ప. అలాగే ఆయన్నుండి ఎవరికీ ఎలాంటి హాని, ఇబ్బంది కలిగింది లేదు. ఆయన ఎవరితోనూ ఎలాంటి ప్రతీకారం తన స్వయం కోసం తీర్చుకుంది లేదు. అల్లాహ్ నిషేధితాలకు ఆ వ్యక్తి పాల్పడి ఉంటె తప్ప, అలాంటి స్థితిలో ఆయన అల్లాహ్ కోసం ఆ వ్యక్తికి దండన విధించేవారు. (ముస్లిం) ముహమ్మద్ (స) ఒక భర్తగా బాధ్యతాపరులైన గొప్ప నిజాయితీపరులు. వివాహం చేసుకోవాల్సిందిగా, ఉత్తమ కుటుంబాన్ని స్థాపించాల్సిందిగా, సంతానాన్ని - ఆడ మగ అనే వివక్ష చూపకుండా సత్పౌరులుగా తీర్చి దిద్దాల్సిందిగా ఆయన (స) యువకుల్ని ప్రోత్సహించేవారు. మహనీయ ముహమ్మద్ (స) - విద్య నేర్చుకోవాల్సిందిగా, పండుగ నమాజు వంటి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా ఆయన మహిళల్ని ప్రోత్సహించేవారు. అలాగే పురుషులు వారి బాధ్యతలను నిర్వర్తించినట్లే, స్త్రీలు - వారి బాధ్యతలను సజావుగా నెరవేర్చాలి అని హితవు పలికేవారు. ఇస్లాంలో మహిళలు కూడా అల్లాహ్ సమక్షంలో వారికి సంబంధించిన బాధ్యతల గురించి ప్రశ్నించబడతారు. వనితలు ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా - సాంఘిక, సాంసారికి బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడే వారు అన్ని రకాల అపమార్గాల నుండి, అపసవ్యతల నుండి, పొరపాట్ల నుండి కాపాడబడతారు. ఫలితంగా ఓ సత్సమాజం నిర్మాణంలో ఆమె బలమైన ముద్రను వేస్తుంది. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ప్రవర్తన రీత్యా ఉత్తములైన వారే విశ్వాసం రీత్యా పరిపూర్ణులు. మీ మహిళల యెడల ఉత్తములైన వారే మీలో పురుషోత్తములు. (తిర్మిజీ) దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నేను మరియు ఓ అనాథ పోషణ బాధ్యతను తీసుకున్న వ్యక్తి స్వర్గం ఇలా తోడుగా ఉంటాము - అని ఆయన తన చూపుడు వ్రేలుని, మధ్య వ్రేలుని కాస్త ఎడంగా ఉంచి చూపించారు. (బుఖారి) దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ యెడల తఖ్వా కలిగి జీవించు. నీ వల్ల ఒక తప్పు జరిగితే వెనువెంటనే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టు. ప్రజలతో మంచిగా మసలుకో. (తిర్మిజీ) చిరు విన్నపం! నేటి ముస్లిం మహిళ ఓ నగ్నసత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. భావితరం భవితవ్యం ఆమె చేతుల్లోనే ఉంది. ఆ చేతులతో ఒకసారి గీచిన 'గీతలు' అవి ధర్మానికి సంబంధించినవయినా, అధర్మానికి సంబంధించినవయినా సరే సమాధికి చేరేదాకా చెరిగి పోవు. ఆమె తన శిక్షణా సాధనంతో చరిత్ర దిశ, దశనే మార్చగలుగుతుంది. ఆ దిశ దైవానికైనా లేదా దుష్టశక్తికైనా అనుకూలమైనది కావచ్చు. ముస్లిం మహిళలు స్వయంగా ఇమామ్ హుసైన్ (రజి), ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై), ముహమ్మద్ బిన్ ఖాసిం, సలాహుద్దీన్ అయ్యూబి, ఇమామ్ గజాలి, ఇబ్నె తైమియా లాంటి మహనీయులు కాకపోవచ్చు. కాని అలాంటి మహనీయుల్ని తయారు చేయగల శక్తి స్వరూపిణులు అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. ముస్లిం మహిళ ముందుకొచ్చి ఇలాంటి "కింగ్మేకర్" పాత్ర వహించగలిగితే అత్యున్నత మానవీయ విలువలు, అసామాన్య నైతిక ప్రమాణాలతో భాసిల్లే నవతరాన్ని తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి ఒక్కటే షరతు. ఆమె ఖతీజా (రజి), ఫాతిమా (రజి), ఆయిషా (రజి), జైనబ్ (రజి)లను తన హీరోయిన్ లుగా, ఆదర్శప్రాయులుగా స్వీకరించాలి.

ఇస్లామీయ వాణిజ్యపు ప్రాథమిక సూత్రాలు

ఇస్లామీయ వాణిజ్యపు ప్రాథమిక సూత్రాలు మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ఇస్లాం ధర్మానికి మాత్రమే ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సత్య స్థిర ధర్మం అన్నారు. జీవ కోఠిలో అనాదిగా ఉన్న విధేయతా విధానమే ఇస్లాం కాబట్టి దీన్ని అల్లాహ్ ధర్మమని, ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు ఎంతో నిష్టగా పాటించిన జీవం సంవిధానమే ఇస్లాం గనక దేన్నీ ప్రవక్తల ధర్మమని అన్నారు. ధర్మమార్గాన ఉపాధి సంపాదించడం ప్రతి ఒక్కరి విధి. ఇస్లామ్‌ దీన్ని గురించి నొక్కి చెప్పింది. అల్లాహ్‌ ప్రవక్తలు, సందేశహరులు, పుణ్యాత్ములు ధర్మ మార్గాన్నే ఉపాధి సంపాదించేవారు. ఉపాధి రెండు విధాలుగా సంపాదించ వచ్చు. ఒకటి ధర్మమార్గాన, మరొకటి అధర్మమార్గాన. అధర్మమార్గాన ఉపాధి సంపాదించడం మహాపాపం. ధర్మ సంపాదనలో ఎంతో శుభం ఉంది. ఇందులో ఉభయలోకాల శుభాలు ఉన్నాయి. ధర్మ సంపాదన చేసేవారు ప్రజల దృష్టిలో ప్రియులు. అతన్ని అందరూ ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అల్లాహ్‌ కూడా అతన్ని ప్రేమిస్తాడు. ఖురాన్ లో ఇలా ఉంది; విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడి నప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరు గెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. " మీరు గనక తెలుసుకో గలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.
నమాజ్‌ ముగిసిన తరువాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి దైవానుగ్రహం (ఉపాధి) అన్వేషించవచ్చు. (ఆ సందర్భంలో కూడా) అల్లాహ్ ను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు సాఫల్యభాగ్యం లభించవచ్చు. వారు వ్యాపారసంరంభం, వినోదం చూడగానే నిన్ను నిలబడ వదిలేసి వాటి వైపు పరుగెత్తారు. వారికిలా చెప్పు: “ఈ వ్యాపారం, వినోదాలకంటే దేవుని దగ్గర ఉన్నవి అనేక రెట్లు శ్రేష్ఠమైనవి. దేవుడు అందరికంటే అత్యంత శ్రేష్ఠమైన ఉపాధిప్రదాత.” (ఖురాన్ -62: 8-11) పై ఆయతుల్లో అయిదు విషయాల ప్రస్తావన ఉంది. 1) క్రయవిక్రయాలన్నింటిపై నమాజుకున్న ప్రాధాన్యత. 2) వాణిజ్య, వ్యాపార విశిష్టత 3) ధర్మం పట్ల అశ్రద్ధ, అలక్ష్యం,ఏమరుపాటు, విస్మరణ మంచిది కాదు. 4) ప్రాపంచిక ప్రయోజనాలకన్నా పారలౌకిక శుభాలు గొప్పవి. 5) కారకాలు కాదు అసలు కారకుడు అల్లాహ్ మాత్రమే.ఆయనే నిజమైన ఉపాధిప్రదాత. వృత్తి ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది. ప్రవృత్తి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి. కమ్మరి వారు, మాదిగ వారు,స్వర్ణకారులు, వడ్ల వారు, ముదిరాజు/బెస్త వారు, రాజకులు, మేర వారు, గొల్ల వారు, కాపు వారు, గౌండ్ల వారు, కోమటి వారు. ఇందులో ఏ వృత్తి అధర్మం కానంత వరకూ తప్పు కాదు. లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరూ హలాల్ జీవనోపాధి కోసం పరిశ్రమించారు. కొందరు కూలీలుగా, మరికొందరు వడ్రంగులుగా, మరికొందరు మేకలు మేపే పని చేశారు. స్వయంగా మహనీయ ముహమ్మద్ (స) సయితం - అజ్యాద్ పర్వతాలపై ప్రజల మేకలను మేపారు.ఆయన వ్యాపారం చేశాడు. ఆయన నుబువ్వత్ కి పూర్వం - హజ్రత్ ఖదీజా (ర.అ) గారి సామగ్రితో సిరియా దేశానికి రెండుసార్లు ప్రయాణించాడు. ఆయన వ్యవసాయ పనులు కూడా చేసేవారు, మదీనా పరిసరాల్లో జురూఫ్ అనే ప్రదేశం ఉంది, అక్కడ ఆయన వ్యవసాయ పనులు చేశారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ కథనం - దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: హలాల్ జీవనోపాధిని ఆర్జించడం ఒక విధి తర్వాత. విధి. (అల్-సునన్ అల్-కుబ్రా, బైహకీ హదీస్ నం: 16695) మొదటి విధి అంటే, అర్కానుల్ ఇస్లాం. నమాజు, రోజా, జకాత్,హజ్జ్. ఈ విధుల తర్వాత తప్పనిసరి విధి హలాల్ జీవనోపాధి. నమాజ్‌ ముగిసిన తరువాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి దైవానుగ్రహం (ఉపాధి) అన్వేషించవచ్చు. అన్న అల్లాహ్ ఆదేశాన్ని శిరసా వహిస్తూ - అర్రాక్ బిన్ మాలిక్ (రహ్మ) శుక్రవారం ప్రార్థన పూర్తయ్యాక మసీదు తలుపు వద్ద నిలబడి ఇలా అనేవారు; ఓ అల్లాహ్ నేను నీ పిలుపు విని నీ సన్నిధికి వచ్చి వాలాను. నువ్వు విధిగావించిన నమాజును పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నీ ఆదేశానుసారమే భూమిలో హలాల్ జీవనోపాధి కోసం సంచరించబోతున్నాను. ఓ అల్లాహ్! నాకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించు నువ్వు ఉపాధిప్రదాతల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైన ఉపాధిప్రదాతవు. (తఫ్సీర్ ఇబ్న్ కసీర్) ధర్మ సంపాదన విశిష్టత ఏ వ్యక్తి అయితే - నిరపేక్షతా కోసం - పేదరికం నుండి కాపాడబడాలని, ఒకరి ముందర చేయి చాచే దౌర్భాగ్య స్థితిని తనకు రాకూడదని, తన పరివారాన్ని మంచిగా చూసుకోవాలని, ఇరుగుపొరుగు వారి యెడల దయతో వ్యవహరించాలని - ధర్మసమ్మతమైన జీవనోపాధిని అన్వేషిస్తాడో - రేపు ప్రళయ దినాన ఆటను అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు -- అతని మొహం పున్నమి చంద్రుని వలే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. (షబ్ అల్-ఇమాన్ బైహకీ హదీథ్ నంబర్: 9889. రచయిత ఇబ్న్ అబీ షైబా హదీథ్: 22186) మిఖ్‌దాద్‌ బిన్‌ మ’అది కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన చేతి సంపాదనతో చేసిన భోజనం కంటే మంచి భోజనం మనిషి ఎప్పుడూ చేయలేదు. దైవప్రవక్త, దావూద్‌ (అ) తన స్వహస్తాలతో పనిచేసి సంపాదించి భుజించే వారు.” (బు’ఖారీ) ‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సంపాదించే వాటిలో మీచేతి సంపాదనే అన్నిటి కంటే గొప్పది. అంటే చేతి సంపాదనే అన్నిటి కంటే ఉత్తమ సంపాదన. మీ సంతానం కూడా మీ సంపాదనే. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్) అధర్మ సంపాదన వద్దు జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు. అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం నరకంలో వెళ్ళటానికే తగినది.” (అ’హ్మద్‌, తిర్మిజి’, బైహఖీ-షు’అబిల్ ఈమాన్) అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు ఒక కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ కాలంలో మనిషి తాను ఆర్జించే సంపద ధర్మసమ్మత మైనదా లేక అధర్మమైనదా? అనే విషయాన్ని పట్టించుకోరు.” (బు’ఖారీ) అధర్మ సంపాదన అనర్థాలు అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ పరమ పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు. అల్లాహ్‌ (త) తన సందేశ హరులకు ఆదేశించినట్లే విశ్వాసులకూ ఆదేశించాడు: ”ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమయిన ఉపాధిని తినండి. సత్కార్యాలను ఆచరించండి.” (సూ. అల్-ముఅ’మినూన్, 23:51) అదేవిధంగా విశ్వాసులనుద్దేశించి, ”…ఓ విశ్వాసులారా! మేము మీకు జీవనో పాధిగా ఇచ్చిన పరిశుధ్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి …” (సూ. అల్ బఖరహ్, 2:172) ఆపైన ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఒకడు బహు దూరాన్నుండి ప్రయాణం చేసి కాబా పుణ్యస్థలానికి వస్తాడు, ధూళిలో పూర్తిగా మునిగి ఉంటాడు. వంటినిండా దుమ్ము పట్టి ఉంటుంది. అతడు తన రెండు చేతులూ చాచి, ”ఓ నా ప్రభూ! నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు” అని వేడుకుంటాడు. వాస్తవానికి అతడు తినేది అధర్మమైనది. అతడు త్రాగేదీ అధర్మమైనది. అతడు ధరించింది సయితం అధర్మమైనది. అధర్మ ఉపాధి ద్వారానే అతడి జీవితం గడుస్తుంది. మరి అతడి దు’ఆ ఎలా స్వీకరించబడుతుంది . (ముస్లిమ్‌) వాణిజ్య విశిష్టత రా’ఫె బిన్‌ ‘ఖదైజ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఏ సంపాదన అన్నిటికంటే పరిశుద్ధమైనదని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ మనిషి తన చేత్తో సంపాదించి తినటం, దగా మోసం లేని వ్యాపారం,” అని అన్నారు. (అ’హ్మద్‌) అబూ-స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నీతీ నిజాయితీ గల వ్యాపారి తీర్పుదినం నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసంలో ఉంటాడు. (తిర్మిజి’, దారు ఖుత్నీ) అల్లాహ్ దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: మీరు వ్యాపారాన్ని మీ వృత్తిగా చేసుకోండి, ఎందుకంటే - (మనిషి జీవనోపాధికి సంబంధించిన) పది భాగాలలో తొమ్మిది భాగాలను ఒక్క వ్యాపారం కలిగి ఉంటుంది. (ఇహ్యా అల్-ఉలూమ్: 2/62) బుఖారీ యొక్క ప్రసిద్ధ షర్హ్ ఉమ్దత్ అల్-ఖారీలో, అల్లామా ఐని ఇలా అన్నారు: అల్లాహ్ వ్యాపార అనుమతినిచ్చాడు. తన అనుహ్రాహాన్ని అన్వేషించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సహాబాలో మహా ఉద్దందులు వ్యాపారాన్ని తమ వృత్తిగా చేసుకున్నవారే. ఇమామ్ అహ్మద్ బిన్ హన్బల్‌ను కొందరు అడిగారు, ఒక వ్యక్తి వద్ద నాలుగు దిర్హామ్‌లు ఉన్నాయి, వాటిలో ఒకటి వ్యాపారం నుండి సంపాదించింది. ఒకటి సోదరుడి నుండి బహుమతిగా లభించింది. ఒకటి విద్య వేతనంగా లభించింది. మరొకటి ప్రభుత్వ ఖజానా నుండి లభించింది. వీటిలో ఉత్తమమైనది ఏది? అని. దానికాయన ఇలా జవాబిచ్చాడు: బట్టల వ్యాపారం ద్వారా సంపాదించిన దిర్హమ్‌. (అల్-అదాబ్ అల్-షరియా మరియు మన్హా అల్-మరైయా: 3/269) హజ్రత్ ఉమర్ (ర) సోమరుల్ని ఉద్దేశించి - మీరు ధర్మ సంపాదన కోసం శ్రమించకుండా ఒకే చోటు కూర్చుని 'ఓ అల్లాహ్! నాకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించు" అని అడగటం సబబు కాదు. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఏమీ వెండి బంగారాలు వర్షించవు కదా! (ఇహ్యా అల్-ఉలూమ్: 2/62) వ్యాపార సమయం ఉదయాన్నే పని ప్రారంభించడం శుభ సూచకం. ''దేవా! నా సముదాయం కోసం - వారి పగటి తొలి వేళలో శుభాన్ని ప్రసాదించు". అని ప్రవక్త (స) వేసుకునేవారు. సఖర్ గామిదీ అనే గొప్ప వ్యాపారవేత్త - తన వర్తక బృందాన్ని ఉదయం తెల్లవారుజామునే సాగనంపేవారు. ఫలితంగా గొప్ప లాభాల్ని గడించి - ప్రశిద్ధ వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచారు. (అబూ దావూద్ హదీస్: 2609. తిర్మిది హదీస్: 1212. ఇబ్న్ మాజా హదీస్: 2236) ఆదర్శ వ్యాపారి లక్షణం నమాజ్‌స్థాపన, జకాత్‌ చెల్లింపు (వగైరా) విధుల నిర్వహణ నుండి (ఐహిక వ్యామోహం,) వ్యాపార వ్యవహారాలు వారిని ఎన్నటికీ విస్మరింపజేయలేవు. వారు గుండెలు అదిరిపోయే, కనుగుడ్లు స్తంభించే ప్రళయదినం గురించి భయ పడతారు. అల్లాహ్ తమ సత్కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు తన ప్రత్యేక అనుగ్రహంతో మరింతభాగ్యం ప్రసాదిస్తాడన్న ఆశతోనే (వారీ విధులన్నీ పాటిస్తుంటారు). అల్లాహ్ తాను తలచిన వారికి అపరిమితంగా అనుగ్రహిస్తాడు. (నూర్: 37-38) వ్యాపార లావాదేవీలు జీవిత అవసరాల్లోని ప్రధానమైన అవసరం. ఇవి లేకుండా జీవితం నడవదు. ప్రతి దేశంలో ప్రతి జాతిలో వ్యాపారస్తులు ఉంటారు. వీరు ప్రాపంచిక లావాదేవీల్లో చాలా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వారు కేవలం ధనం కూడబెట్టటంలో ఉంటారు. వారికి కేవలం లాభం పట్ల మాత్రమే ఆశక్తి ఉంటుంది. ధర్మం అధర్మం అనేది ఏమాత్రం ఆలోచించరు. అయితే ఒక ముస్లిమ్‌ వ్యాపారికి ధర్మాధర్మాల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. అధర్మ మార్గాలను వదలి ధర్మమార్గాలను అనుసరించాలి. వ్యాపారవేత్తలు రెండు రకాలు 1) నిజాయితీగా వ్యాపారం చేసేవాడు అనేక ప్రాము ఖ్యతలు కలిగి ఉంటాడు. ఇటువంటివారు ప్రవక్తలు, పుణ్యాత్ముల సహవాసంలో లేపబడతారు. ఇహ్‌యా ఉల్‌ ఉలూమ్‌లో ఇలా ఉంది. ప్రవక్త (స), అనుచరులు కూర్చొని ఉన్నారు. ఒక వీర అనుచరుడ్ని చూచారు. ఉదయాన్నే తన వ్యాపారంలో నిమగ్నమయి పోయాడు. అది చూచిన ప్రజలు ”ఇతని యవ్వనం దైవమార్గంలో గడిపితే ఎంత బాగుండేది” అని అన్నారు. అది విని ప్రవక్త (స) ఇలా అనకండి, ఎందు కంటే ఒకవేళ ఈ పని తనకోసం, ఇతరుల నిరపేక్షా కొరకు చేస్తే, ఇదీ ఒక విధమైన జిహాద్‌ అవుతుంది. ఒకవేళ భార్యాబిడ్డల కొరకు చేసినా అప్పుడు కూడా దైవమార్గంలో జిహాద్‌ చేసినట్లే అని అన్నారు. అబూ-స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నీతీ నిజాయితీ గల వ్యాపారి తీర్పుదినం నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసంలో ఉంటాడు. (తిర్మిజి’, దారు ఖుత్నీ) 2) ‘ఉబైద్‌ బిన్‌ రఫా’అహ్ (ర) తన తండ్రిగారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు వ్యాపారులను అవిధేయులు, పాపాత్ములు, దుర్మా ర్గుల సహవాసంలో లేపడం జరుగుతుంది. కాని దైవ భీతితో, సత్కార్యాలు చేస్తూ, సత్యం పలికే వ్యాపారులు తప్ప. (తిర్మిజి’, ఇబ్నె-మాజహ్, దారమి) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఎవరైనా అధర్మ సంపాదనలో నుండి దానధర్మాలు చేస్తే అల్లాహ్‌(త) స్వీకరించడు. అధర్మ సంపాదనను తాను ఉపయోగించినా శుభం కలగదు, అధర్మ సంపాదన సంపాదించి వదలివెళితే నరక కారకం అవుతుంది, అల్లాహ్‌ (త) చెడును చెడుద్వారా తొలగించడు, చెడును మంచి ద్వారా తొలగిస్తాడు, అపరిశుద్ధత అపరిశుద్ధాన్ని దూరం చేయలేదు, అని ప్రవచించారు.” (అ’హ్మద్‌, షర్‌’హ్ సున్నహ్‌) ఇమామ్ అబూ హనీఫా (రహ్మ) గారి అపూర్వ సంఘటన అలీ బిన్ హఫ్స్ బజాజ్ ఉల్లేఖనం - నా తండ్రి హఫ్స్ బిన్ అబ్ద్ అల్-రహ్మాన్ అబూ హనీఫాకు వ్యాపార భాగస్వామి. ఇమామ్ అబూ హనీఫా ఆయనకు సరుకులు ఇచ్చి పంపేవారు. వస్తువులను పంపిన తర్వాత, ఫలానా ఫలానా వస్త్రంలో లోపం ఉందని, దానిని విక్రయించేటప్పుడు, లోపాన్ని చూపి విక్రయించాలని హెచ్చరించారు. కానీ మా నాన్న లోపాన్ని కొనుగోలుదారుకు తెలియజేయడం మర్చిపోయారు, అమ్మేశారు. తర్వాత తిరిగి ఇద్దామంటే కొనుగోలుదారు చిరునామా తెలియలేదు. ఇమామ్ అబూ హనీఫా (రహ్మ)కు ఈ విషయం తెలిసినప్పుడు, ఆయన ఆ నాగటూ మొత్తని దానం చేసేశారు. ఆయన దానం చేసిన ఆ నగదు అక్షరాలా ముప్పై వేల దిర్హామ్‌లు. (తజిక్రత్ అల్-నుమాన్: పేజి 208) కొలతల్లో తూనికల్లో తగ్గించి ఇవ్వడం మహా భయంకర ఆర్ధిక నేరం తూకం తగ్గించేవారికి వినాశం తప్పదు. వారు ప్రజల నుండి (సరుకు) తీసుకునే టప్పుడు పూర్తిగా తూచి లేక కొలచి తీసుకుంటారు; ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక భయంకర దినాన తాము లేపి ప్రవేశపెట్టబడతామని వారికి తెలియదా? ఆరోజు యావత్తు మానవులు విశ్వప్రభువు ముందు (తలలు వంచి) నిలబడతారు. (వారు తమ దుష్కార్యాలకు జవాబుచెప్పుకోవలసిన పనిలేదని భావిస్తున్నారా?) ఎంతమాత్రం కాదు. దురాత్ముల కర్మల వివరాలు కారాగారం చిట్టాలో ఉంటాయి. కారాగారం చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖిత గ్రంథం. తీర్పుదినాన్ని తిరస్కరించే ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. హద్దులు మీరే పాపాత్ముడు తప్ప దాన్నెవరూ తిరస్కరించరు. (అల్-ముతఫ్ఫిఫీన్: 1-9) ఎందుకంటే తూనికల్లో, కొలతల్లో ప్రజలకు మోసం జరుగు తుంది. వారి హక్కుల్లో ద్రోహం జరుగుతుంది. సరిగా తూయటం, కొలవటం అమానతు వంటిది. అమానతులో ఖియానత్‌ చేసేవారికి కఠిన శిక్షలు ఉన్నాయి. ప్రపంచంలో కరువుకు గురవుతారు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఓ ముహాజిరులారా! మీరు ఐదు విషయాలకు గురయితే మీకు ఎటువంటి మంచి లభించదు. మీరు వాటికి గురికావటం నుండి నేను అల్లాహ్(త)ను శరణుకోరుతున్నాను. 1. ఏ జాతిలో విచ్చలవిడిగా అశ్లీలం వ్యాపిస్తుందో, సిగ్గు లజ్జ లేకుండా పోతుందో ఆ జాతి ప్లేగు మరియు ఇతర ప్రమాదకరమైన రోగాలకు, అంతకు ముందులేని వ్యాధులకు గురవు తుంది. 2. ప్రజలు తూనికల్లో కొలతల్లో హెచ్చుతగ్గులు చేస్తే కరవుకాటకాలకు కఠిన హృదయులైన పాలకుల అత్యాచారాలకు గురవుతారు. 3. ‘జకాత్‌ ఇవ్వడం మానివేస్తే ఆకాశం నుండి వర్షం పడటం ఆగిపోతుంది. ఒకవేళ జంతువులే లేకపోతే ఒక్క చుక్క వర్షం కూడా పడి ఉండేది కాదు. 4. అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను హీనదృష్టితో చూచేవారిని శత్రువులకు గురిచేస్తారు. వారు వీరి ధనసంపదలను దోచుకుంటారు. 5. అదేవిధంగా పండితులు, నాయకులు అల్లాహ్‌ గ్రంథం ప్రకారం తీర్పులు చేయకపోతే పరస్పర పోరాటాలు ఉద్భవిస్తాయి. (ఇబ్నె మాజహ్, తర్‌’గీబ్‌ తర్‌’హీబ్‌) మరో ఉల్లేఖనంలో ఉంది, ”తూనికల్లో, కొలతల్లో హెచ్చుతగ్గులు చేసే జాతిపై అల్లాహ్‌ (త) ఉపాధిని ఆపివేస్తాడు.” (తర్‌’గీబ్‌) వ్యవహారాల్లో కొలతలకు, తూని కలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొలతలు, తూనికలు సరిగా ఉంటే ప్రతివ్యక్తి సంతోషిస్తాడు. అల్లాహ్‌ (త) కూడా సంతోషిస్తాడు. హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు అసహ్యించు కుంటారు. తూనికలు, కొలతల అసలు ఉద్దేశం ప్రతి ఒక్కరికీ వారి హక్కు పూర్తిగా ఇప్పించటమే. ఎటువంటి అన్యాయం జరక్కుండా ఉండటమే. ఖుర్‌ఆన్‌లో దీన్ని గురించి ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది. ఈ తూనిక వల్లే మానవుని వాక్కర్మలు ఒకటిగా ఉంటాయి. వీటివల్లే విశ్వ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. కొలతల్లో, తూనికల్లో హెచ్చుతగ్గులు చేయడం వాస్తవంగా ఇతరుల హక్కులను కొల్లగొట్టడమే. కొందరు ఇచ్చేటప్పుడు తగ్గిస్తారు. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటారు. ఇటువంటి వారు ఇతరుల ఆస్తులకు అన్యాయంగా ఆక్రమణకు పాల్పడతారు. ప్రాచీన జాతుల్లో షు’ఐబ్‌ (అ) జాతి ఒకటి. ఈ జాతి వ్యాపారం చేసేది. షు’ఐబ్‌ (అ) ఈ జాతిని సంస్కరణ గురించే పంపడం జరిగింది. మేము మద్యన్‌ ప్రజల వద్దకు వారి సోదరుడు షుఐబ్‌ను పంపాము. అతను తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మీ దగ్గరకు మీప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం వచ్చింది కనుక మీరు తూనికలు, కొలతలు పూర్తిగా పాటించండి. ప్రజలకు రావలసిన సరుకు తగ్గించి ఇవ్వకండి. ధరణిలో శాంతీసామరస్యాలు ఏర్పడ్డాక అరాచకం సృష్టించకండి. మీరు విశ్వాసులైతే (విషయం గ్రహించండి), అందులోనే మీ శ్రేయస్సు ఉంది.” (అల్-ఆరాఫ్: 85) షుఐబ్‌ బోధ వారికి ఏమాత్రం తలకెక్కలేదు.) వారతడ్ని తిరస్కరించారు. చివరికి వారిపై ఛాయాకృత ఉపద్రవం వచ్చిపడింది. అదొక భీకరదినాన (వచ్చిపడిన) శిక్ష. ఈ ఉదంతంలో కూడా గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే జనం కాదు. ఏమైనా నీప్రభువు గొప్ప శక్తిసంపన్నుడు, అమిత దయామయుడు. (అష్-షుఅరా: 181-191) అబద్దపు ఒట్టుతో వస్తువును విక్రయించడం నేరం అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అధికంగా ప్రమాణాలు చేయటం వల్ల సరకు అమ్ముడవుతుంది. కాని శుభం నశిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌) అబూ-జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ముగ్గురు వ్యక్తుల పట్ల అల్లాహ్‌ (త) ఆగ్రహంతో, వారితో మాట్లాడడు, వారివైపు చూడడు, వారిని పాపాల నుండి పరిశుద్ధపరచడు. వారి కొరకు కఠిన శిక్ష ఉంటుంది. ఈ ‘హదీసు’ కథకుడు, అబూ-జ’ర్‌ (ర), ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఈ నష్టపోయే దురదృష్టవంతులు ఎవరు’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), 1. అహంకారం వల్ల చీల మండల క్రింద వరకు తన పైజామాను వ్రేలాడగట్టే వాడు, 2. ఉపకారం చేసి ఎత్తి పొడిచే వాడు, 3. అసత్య ప్రమాణంచేసి తన సరకును అమ్మే వాడు అని ప్రవచించారు. (ముస్లిమ్‌) వ్యాపారులు విరివిరిగా దానధర్మాలు చేయాలి ఖైస్‌ బిన్‌ అబూ ‘గర్’జహ్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో మేము వ్యాపారులము, ‘సమాసిరహ్ ‘ అని పిలువబడే వారం. అంటే మమ్మల్ని తాజిర్‌ అన కుండా సమాసిరహ్ అనేవారు. దీని అర్థం దళారి (ఏజంటు). ఒకసారి ప్రవక్త (స) మా ప్రక్క నుండి వెళుతూ మాకు ఒక మంచి పేరు పెట్టారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ వ్యాపార సంఘ ప్రతినిధులారా! మీ వ్యాపారంలో వ్యర్థ ప్రేలాపనలు, అశ్లీల పలుకులు, అసత్య ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీరు దాన ధర్మాలను కూడా చేర్చుకోండి. అంటే వ్యాపార సరకుల్లో నుండి దానధర్మాలు చేస్తూ ఉండండి. అవి మీ పాపాలకు పరిహారంగా పనికి వస్తాయి.” (అబూ-దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె-మాజహ్) ఇచ్చిపుచ్చుకోవడంలో మెతక వైఖరి అవసరం ప్రతి విషయంలో నీతి, నిజాయితీ, సత్యసంధత, ఇంకా సద్ప్రవర్తన సున్నితత్వం మంచిగా మాట్లాడటం కూడా తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే దుర్మార్గులతో, చెడు స్వభావం గల వారితో ప్రజలు ఎటువంటి వ్యవహారం చేయరు. సద్ప్రవర్తన కష్టాలన్నిటినీ సులభతరం చేసి వేస్తుంది. అతన్ని అందరూ ప్రేమిస్తారు. నోరు మంచిదైతే ఊళ్లే ఏలవచ్చు.’ కొనుగోలు దారులతో మృదువుగా వినయ వినమ్రతలతో సహనం ఓర్పులతో ప్రవర్తించాలి. దీన్నే ముసాహలత్ అంటారు. అంటే చూడనట్టు ప్రవర్తించాలి. కొనుగోలు దారు ఇది కూడా ఒక రకమైన సత్కార్యమే. హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పూర్వీకుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు. మరణదూత అతని వద్దకు ప్రాణం తీయడానికి వచ్చాడు. ఆ వ్యక్తితో, ‘నీవేదైనా సత్కార్యం చేసి ఉన్నావా?’ అని ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు గుర్తులేదు,’ అని అన్నాడు. ఆ వ్యక్తితో, ‘నువ్వు బాగా ఆలోచించు. ఏదైనా గుర్తుకు రావచ్చు,’ అని అనటం జరిగింది. ఆ వ్యక్తి మళ్ళీ, ‘నాకు గుర్తుకు రావటం లేదు, అయితే నాకు కేవలం ఈ మాత్రం గుర్తుంది. అదేమిటంటే నేను అమ్మినపుడు కొన్నపుడు వారి పట్ల మంచిగా ప్రవ ర్తించే వాడిని. వారికి ఉపకారం చేసేవాడిని. నేను అడిగి నపుడు మంచి స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా మరికొంత వ్యవధి ఇచ్చే వాడిని. కష్టాల్లో ఉన్నవాడిని క్షమించే వాడిని.’ అల్లాహ్‌ (త) ఆ సత్కార్యం ద్వారా ఆ వ్యక్తిని స్వర్గంలోకి పంపాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌) వ్యాపారంలో సత్యం పాత్ర ప్రధానమైనది. అసత్యానికి, మోసానికి పాల్పడరాదు. వ్యాపార లావా దేవీల్లో ఎంతమాత్రం అసత్యం, మోసం పనికిరావు. ప్రవక్త (స) ప్రవచనం, నిజాయితీగల వ్యాపారి ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసం కలిగి ఉంటాడు. (తిర్మిజి’). మరో ఉల్లేఖనంలో ”అమ్మేవారికి, కొనేవారికి వారు విడిపోనంత వరకు అనుమతి ఉంది. ఒకవేళ ఇద్దరూ సత్యం పలికితే, వస్తువుల లోపాలను బయటపెడితే ఇద్దరికీ శుభం కలుగుతుంది. ఒకవేళ దాచి, అసత్యం పలికితే వారి వ్యాపారంలో శుభం ఉండదు.” ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రతిగా అల్లాహ్ వారికి రక్షణగా ఉంటాడు. . ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వారికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, స్వర్గ లోక ప్రాప్తి కలుగుతాయి. ‘ఇస్లాం ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’. ఇస్లాం ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడు, విస్మరించిన వ్యక్తి మహా రాజైనా అల్లాహ్ దృష్టిలో అల్పాతి అల్పుడే. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే. మానవజీవితానికి పరమ ప్రయోజనమైన ఇహపరాల మోక్షం.కేవలం ఇస్లాం ధర్మంతోనే సాధ్యం. తొలి ప్రాధాన్యత ధర్మానికే, తొలి స్థానం ధర్మానిదే. అంటే, సంపాదన అయినా, సంసారమయినా, ఆర్ధిక విధానాలైనా, రాజకీయ తీరుతెన్నులైనా, జాతీయం అయినా, అంతర్జాతీయం అయినా - ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః…!

అల్లాహ్ అత్యద్భుత బహుమతి అమ్మ పాలు

అల్లాహ్ అత్యద్భుత బహుమతి అమ్మ పాలు భూమ్యాకాశాల్లోని ఏవస్తువూ అల్లాహ్ కు కానరాకుండా మరుగుగాలేదు. ఆయనే (స్త్రీల) గర్భాల్లో మీ రూపురేఖల్ని తాను తలచినవిధంగా రూపొందించేవాడు. అపార శక్తి సంపన్నుడు, అద్భుత వివేచనాపరుడయిన ఆ స్వామి తప్ప (మీకు) మరో నిజ ఆరాధ్యుడు లేడు. (ఆల్-ఇమ్రాన్: 5,6) సృష్టికర్త అల్లాహ్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు...! తల్లి కడుపులో శిశువును సృష్టి చేయడంతోనే సృష్టికర్త పని అయిపోలేదు... పుట్టిన బిడ్డ తాగటానికి పాలను కూడా అమ్మ స్తన్యంలో నుంచి స్రవించే గొప్ప ఏర్పాటు చేశాడు. పసిబిడ్డకు గుక్కెడు పాలు - ఈ భూమిమీద దొరకవనా... ఆ ఏర్పాటు...? కాదు... కాదు... అమ్మపాలలో అమృతం ఉంటుంది గనుక పుడుతూనే బిడ్డ వాటిని తన వెంట తెచ్చుకునే ఆ అద్భుత ఏర్పాటు! ఎంత దయామయుడో కదా సృష్టికర్త...! ప్రతిదానికీ బాగా ఆలోచించి ప్రణాళిక బద్ధంగా ఈ సృష్టికార్యం జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే! సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ఋణం ఎన్ని సేవలు చేసినా తీర్చుకోలేనిది.. అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే.
అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: ”మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచి తనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లి తండ్రులకు కృతజ్ఞుడై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది” (ఖుర్‌ఆన్‌ 31:14) మనషికయినా, పశువుకయినా, పక్షికయినా, పురుగుకయినా, పాముకయినా - సృష్టి చరాచరాల్లో వేటికైనా అమ్మ అమ్మే.. అమ్మ ప్రేమ అందాల హరివిల్లు - ఆ తల్లి మనసు మమకారపు తేనె జల్లు. అమ్మ ఒక కమ్మని మాట, వినసొంపుగా వీనుల విందు, అనురాగానికి నిలువెత్తు ప్రతిబింబం, ప్రేమకు పట్టపు రాణి, నిస్వార్థం అనే పదానికి అర్థం అమ్మ, బందాలకు అనుబంధం అమ్మ, కనిపెంచిన మమకారానికి అనుభూతి అమ్మ, త్యాగానికి ప్రతీక అమ్మ. అందుకే ''అమ్మ అరికాళ్ళ క్రింద స్వర్గం ఉంది" అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ (స). ఇది ఇలా ఉంచి - ఒక్కసారి పాలిచ్చే పశువు గురించి, ఆ పశువును పుట్టించిన ప్రభువు గురించి ఆలోచించండి! పాలిచ్చే పశువులు తినే గడ్డి, ఆకులు తదితర వస్తువులు వాటి కడుపులోకి పోయి రక్తం, పేడ, మూత్రం, పాలుగా మారతాయి. రక్తం నరాలలోకి వెళ్ళగా, పేడ, మూత్రం వంటి వ్యర్థాలు బయటికి విసర్జించబడతాయి. వాటి మధ్యలో నుంచే తయారైన పాలు పొదుగులలోకి వెళతాయి. కాని ఆశ్చర్యకర మైన విషయం ఏమిటంటే ఆ పాలలో ఒక్క బొట్టు రక్తంగానీ, ఒక చుక్క వ్యర్థ పదార్థంగానీ కలవదు. పాలు ఎంతో స్వచ్ఛంగా, తెల్లగా ఉంటా యి. కమ్మగా, రుచికరంగా ఉంటాయి. శరీరానకి శక్తినిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. మనసుకు, మస్తిష్కానికి తృప్తినీ, హాయిని ఇస్తాయి. ఇదే విషయాన్ని విశదపరుస్తూ సర్వోన్నతుడయిన అల్లాహ్‌ ఇలా సెలవిస్తు న్నాడు: ”నిశ్చయంగా మీ కోసం పశువులలో గొప్ప గుణపాఠం ఉంది. వాటి కడుపులో ఉన్న పేడకు – రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది”. (అన్నహ్ల్ : 66) అల్లాహ్ తొలి వరం అమ్మ కమ్మనైన క్షీరం అమ్మ పాలు .. సృష్టి అద్భుతాల్లోని మహా అద్భుత క్షీర సాగరం. దానికి సాటి, మేటి, పోటీ అనేదే లేదు. . అమ్మ పాలకు మించిన అమృతం ఈ జగాన మరోకటి లేదు. వమాసాలు గర్భంలో ఉండి అందుకొన్న తొలి వరం కమ్మనైన అమ్మ క్షీరం. తల్లిపాల వలన కలిగే లాభాల జాబితాలో ప్రతీ రోజూ కొత్త విషయాలు చేరుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదరశోక (రెస్పి రేటరీ) మరియు జీర్ణ వ్యవస్థలకు సంబంధిం చిన ఇన్‌పెక్షన్ల నుండి పసిపాపలను తల్లిపాలు రక్షిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది ఎలా అంటే, తల్లిపాలలోని యాంటీ బాడీస్‌ ప్రత్యక్షంగా ఇన్‌ఫెక్షన్లతో పోరాడ తాయి. ఇన్‌పెక్షనని ఎదుర్కొనే తల్లిపాలలోని ఇతర లక్షణాలు మేలు చేసే బాక్టీరియా (నార్మల్‌ ఫ్లోరా) ఉండటానికి అనువైన వాతారవణాన్ని ఏర్పరుస్తాయి. ఆ విధంగా హానికలిగించే పరాన్న జీవులు, వైరస్‌లు, బాక్టీరియాలకు అడ్డుగా నిలుస్తాయి. అంతేకాకుండా నిరూ పితమైన మరో విషయం ఏమిటంటే, తల్లి పాలలోని అంశాలు అంటురోగ వ్యాధులకు వ్యతిరేకంగా ఇమ్యూన్‌ సిస్టమ్‌ని ఏర్పరచడమే కాకుండా దానిని సవ్యంగా పని చేసేలా చేస్తాయి. తల్లిపాలు అల్లాహ్ కృపచే ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి కనుక, పసిపిల్లలకు ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం, తల్లి పాలలో పోషక విలువలు మెండుగా ఉండటమే కాకుండా, బేబీ యొక్క అతి సున్నితమైన జీర్ణవ్యవస్థచే అవి సులభంగా జీర్ణం కాబడతాయి. ఆ విధంగా వాటిని జీర్ణం చేసుకోవడానికి బేబీకి తక్కువ శక్తిసరిపోవడం వలన, మిగిలిన శక్తి శరీరం యొక్క ఇతర విధుల,పెరుగుదల, అవయాల అభివృద్ధి కొరకు ఉపయోగపడు తుంది. కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుడతారు. అలాంటి పిల్లలను ప్రసవించిన తల్లుల పాలలో ఆ పిల్లల అవసరానికి సరి పోయేలా ఎక్కువ మోతాదులో కొవ్వు, ప్రొటీన్‌, సోడియం, క్లోరైడ్‌ మరియు ఐరన్‌ ఉంటాయి. ఇలాంటి పిల్లలలో ‘కళ్ళ’కు సంబంధించిన విధులు చాలా బాగా అభివృద్ధి చెందేది తల్లిపాల వల్లనేనని తెలుసుకున్నారు. అంతే కాకుండా అటువంటి పిల్లలు ఇంటెలి జెన్స్‌ పరీక్షలలో బాగా రాణించారు. తల్లిపాల వలన ఇంకా చాలా ఉపయోగా లున్నాయి. పుట్టిన బిడ్డ అభివృద్ధికి సంబంధిం చిన వాటిలో అతి ముఖ్యమైనది తల్లి పాలు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇందులో ఒమేగా – 3 ఆయిల్‌ అల్ఫాలైనోలీక్‌ యాసిడ్స్‌ ఉంటాయి. ఇది మెదడుకు మరియు రెటీనాకు చాలా ముఖ్యమైన మిశ్రమపదార్థమే కాకుండా, కొత్తగా పుట్టిన పిల్లల దృష్ట్యా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒమేగా-3కి సహజమైన మరియు పరిపూర్ణమైన స్టోర్‌ తల్లిపాలు. అంతే కాకుండా తల్లిపాల వలన దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయని, అవి ఏమి టంటే బ్లడ్‌ ప్రెషర్‌పై మంచి ప్రభావాన్ని కలిగి ఉండి, గుండెపోటు సమస్యను తగ్గిస్తుందని బ్రిస్టల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలియ జేశారు. మెడికల్‌ జర్నల్‌ ‘సర్క్యులేషన్‌’లో ప్రచురిం చిన పరిశోధనా ఫలితాలను బట్టి తల్లి పాల వలన పెరిగే బిడ్డలో గుండె సంబంధిత వ్యాధులు రావడం తక్కువని తెలుస్తుంది.తల్లి పాలలో పోలీ అను సాట్యురేటెడ్‌ ఫేటీ యాసిడ్ల పొడవాటి చైన్‌ ఉండటం వలన, అది ఆర్టెరీస్‌ గట్టి పడకుండా నిరోధిస్తుంది. తల్లి అమెరికాలోని చిన్న పిల్లల హాస్పిటల్‌ మెడికల్‌ సెంటర్‌ టీమ్‌కి నాయ కత్వం వహించిన డా.లిసా మార్టిన్‌, అనే ప్రొటీన్‌ హార్మోన్‌ అధిక మోతా దులో తల్లిపాలలో ఉన్నట్లు కనుగొన్నారు. రక్తంలో అధిక మోతాదులో ఉంటే హార్ట్‌ ఎటాక్‌ సమస్య తగ్గుతుంది. హార్ట్‌ ఎటాక్‌కు ఎక్కువగా కారణమయ్యే స్థూల కాయం కలవారిలో తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ హార్మోన్‌ వలన స్థూలకాయ సమస్య తల్లి పాలతో పెరిగిన పిల్లలలో తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. లెప్టిన్‌ అనే మరో హార్మోన్‌ను కూడా తల్లి పాలలో కను గొన్నారు. ఇదిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పసి పిల్లలకు పోషకాలున్న ప్రెష్ ఫుడ్ అమ్మ పాలు తల్లిపాలకు సంబంధించిన నిజాలు పైన చెప్పిన వాటితో పూర్తయి పోలేదు. బిడ్డ పెరుగుతున్నప్పుడు, ఆ పెరిగే థలను బట్టి, ఆ దశలకు సరిపోయే ఆహారం అవసరమౌ తుంది. దానికి తగ్గట్టుగా పాలలోని పోషక పదార్థాలు ఈ ప్రత్యేక అవసరాలకు సరిపోయే విధంగా మారుతూ ఉండాలి. ఆ విధంగానే బిడ్డ ఎదుగుదలను బట్టి తల్లి పాలలో ఉండే పదార్థాలు మారుతూ ఉంటాయి. తల్లి పాలు అన్ని సమయాలలో సరియైన ఉష్ణోగ్రత (వేడి)లో లభ్యమౌతాయి. మెదడు అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఎలా అంటే పాలు తనలో కలిగి ఉండే సుగర్‌ మరియు కొవ్వు (ఫ్యాట్) వలన. దీనితోపాటు, కాల్షియం వంటి మూలకాలు బిడ్డ ఎముకల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ‘పాలు’ అని పిలువబడుతున్నప్పటికీ, ఈ అద్భుత మిశ్రమ పదార్థంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆహారంతోపాటు, పసి పిల్లలకి నీటి రూపంలో ద్రవం కూడా కావాలి. తల్లిపాలకంటే పరిశుభ్రమైన నీరు గాని, ఆహారపదార్థాలు గాని తయారుకాలేదు. తల్లిపాలలోని 90 శాతం నీరు పరిశుభ్రమైన వాతావరణంలో బిడ్డ అవసరాన్ని తీరుస్తుంది. కొలొస్ట్రమ్ (ముర్రు పాలు) బ్రెస్ట్ ఫీడింగ్‌ విషయంలో ఇప్పటికీ చాలా మందిలో తగినంత అవగాహన ఉండడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది శిశువు జన్మించిన తరువాత తల్లిపాలు పట్టించడంలో అశ్రద్ధ చూపుతారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యం పొందడంలో తల్లిపాలది చాలా కీలక పాత్ర. తల్లిపాలలో కూడా మూడు దశలు ఉంటాయి. కొలొస్ట్రమ్, ట్రాన్సిషనల్ మిల్క్, మెచ్యూర్ మిల్క్ అనే మూడు దశలు ఉంటాయి. శిశువుకు జన్మనిచ్చాక వచ్చే తల్లిపాలు మందంగా ఉంటాయి. ఈ తొలి పాలనే కొలొస్ట్రమ్ అంటారు. తెలుగులో ముర్రు పాలు అంటాం. వైద్యులు, తల్లులు దీనిని ద్రవరూపంలో ఉన్న బంగారం అంటారు. గాఢమైన పసుపు రంగులో ఉండడమే కాకుండా, ఇవి శిశువుకు అమృతం లాంటివి. చాలా పోషకాలు, యాంటీబాడీస్ కలిగి ఉంటాయి. ఇవి బిడ్డను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. కొలస్ట్రమ్ బేబీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి. సాధారణ తల్లి పాలకంటే, దీనిలో అధికంగా ప్రోటీన్లు, ఎ-విటమిన్‌, సోడియమ్‌ క్లోరైడ్‌ మరియు యాంటీబాడీస్‌ ఉంటాయి. తక్కువ మోతాదులో కార్బో హైడ్రేట్లు, లిపిడ్లు మరియు పొటాషియం ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ చాలా చిన్నదిగా ఉంటుంది. అటు వంటి సమయంలో బిడ్డకు తక్కువ మరిమాణంలో ఎక్కువ పోషకాలున్న ఆహారం కావాలి. ఆ అవసరాన్ని కొలస్ట్రమ్‌ తీరుస్తుంది. బిడ్డకు జాండిస్‌ రాకుండా కాపాడుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి రోగ నిరోధక శక్తే బిడ్డను కాపాడుతుంది. ప్రసవించాక, ఈ కొలస్ట్రమ్‌ వ్యాధికారకాల నుండి బిడ్డను కాపాడుతుంది. ట్రాన్సిషనల్ మిల్క్ బిడ్డకు జన్మనిచ్చాక ముర్రు పాలు ఒకటి రెండు రోజుల వరకు వస్తుంటాయి. తదుపరి దశలో అంటే 2 నుంచి 5 రోజుల తరువాతి నుంచి రెండు వారాలు వచ్చే వరకు ఉండే పాలను ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు. పాలు పూర్తిస్థాయిలో పడడం, రొమ్ము వెచ్చగా ఉండడం, పాలు క్రమంగా తెలుపు రంగులోకి రావడం గమనిస్తారు. బేబీ అవసరాలకు సరిపడా పాలు అందుతాయి. తరచుగా పాలు పట్టేందుకు వీలు ఉంటుంది. మెచ్యూర్ మిల్క్ ప్రసవం తరువాత 10 నుంచి 15 రోజుల్లో ఈ దశ వస్తుంది. ఈ దశలో తల్లిపాలలో బేబీ అవసరాలకు తగిన పోషకాలు లభిస్తాయి. పాలల్లో కొవ్వు శాతం మారుతుంది. తొలుత ఒక రొమ్ము నుంచి పాలు పూర్తిగా పట్టాక మరొక రొమ్ముకు మళ్లడం వల్ల బేబీకి పోషకాలు సమతుల్యంగా అందుతాయి. అమ్మ పాలలో IQ (Intelligence quotient) మరియు EQ Emotional quotient సాధారణంగా అమ్మ పాలు కాకుండా పిల్లలకు మనం పెట్టె ఆవు, గేదె పాలల్లోగాని, డబ్బా పాల్లోగాని శిశువుకి కావాల్సినంత IQ (Intelligence quotient) మరియు EQ Emotional quotient ఉండదు. ఒక్క అమ్మ పాలలోనే అది సంపూర్ణంగా ఉంటుంది. ఇతర పిల్లల కంటే తల్లిపాలు త్రాగిన బిడ్డలోనే జ్ఞానాభివృద్ధి ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జేమ్స్‌ డబ్ల్యూ ఆండర్‌సన్‌ (కెంటకీ యూనివర్శిటీ ఎక్స్‌పర్ట్‌) తల్లిపాలు త్రాగిన పిల్లలకు, కృత్రిమ ఆహారాన్ని తీసుకున్న పిల్లలకు మధ్య తులనాత్మక అధ్యయనం చేశారు. తల్లిపాలు త్రాగి పెరిగిన పిల్లలలో ఐ.క్యూ 5 పాయింట్లు ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. 6 నెలల వరకూ తల్లిపాలు త్రాగిన పిల్లలకు ఇంటెలిజెన్స్‌కు ప్రయోజనం కలుగుతుంది. శిశువుకి మొదటి టీకా తల్లిపాలు తల్లిపాలు శిశువు ఎదుగుదలకి అవసరమైన పౌష్టికాహారం సమపాళ్ళలో అందిస్తుంది. ఇది వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుండి శిశువులను రక్షించేందుకు సహాయపడే యాంటీబాడీలు కలిగి ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మరియు విరేచనాలు వంటి అనారోగ్యాలు తగ్గిస్తాయి. శిశువు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాథమిక నెలలలో ఈ సహజ రక్షణ చాలా ముఖ్యం. అలాగే, తల్లిపాలతో పోషణ పొందిన పిల్లలలో భవిష్యత్తులో మాంద్యంలో, షుగర్ వ్యాధి, మరియు కొంతమంది చిన్నపిల్లల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక పరిస్థితులు తగ్గిస్తాయి. రొమ్ము పాలించడం తల్లి మరియు శిశువు మధ్య ఒక ప్రత్యేక భావోద్వేగ సంబంధాన్ని పెంచుతుంది. ఇది భద్రత మరియు భావోద్వేగ అనుభూతిని పెంపొందిస్తుంది. ఇది పిల్లల మానసిక అభివృద్ధికి ముఖ్యము మరియు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఫార్ములా ఫీడ్‌ల కంటే మెరుగైన రోగనిరోధక శక్తి ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమా, తామర మరియు అటోపిక్ చర్మ సంబ‌ధిత వంటి అలర్జీలు వచ్చే ప్రమాదం తక్కువ. కరుణామయుని కరుణానుగ్రహం కన్నతల్లి కమ్మనైన క్షీరం తల్లిపాల యొక్క మరొక అద్భుత అంశమేమిటంటే, రెండు సంవత్సరాల పాటు తల్లి పాలు త్రాగితే అది బిడ్డకు చాలా ప్రయోజనకారి అవుతుంది. ఈ విషయం ఈ మధ్య కాలంలోనే సైన్స్‌ ద్వారా కనుగొనబడింది. అయితే; ఈ విషయాన్ని అల్లాహ్ 1432 సంవత్సరాల క్రితమే క్రింది ఖుర్‌ఆన్‌ వాక్యం ద్వారా తెలియజేశాడు: ”పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి”. (ఖుర్‌ఆన్‌ 2:233) ఇదే విధంగా, బిడ్డ అవసరాలకి అన్ని విధాల సరిపోయే సరియైన పోషకాలుండే పాలను, ఆ పాల ఉత్పత్తిని తల్లి నిర్ణయించ లేదు. పాలలో వివిధ పోషక పదార్థాల స్థాయిని కూడా తల్లి నిర్ణయించలేదు. ఇది సర్వ శక్తిమంతుడైన అల్లాహ్‌కే తెలుసు. ప్రతీ జీవి యొక్క అవసరాలు, ప్రతీ జీవిపై చూప వలసిన కరుణ గురించి ఆయనకే తెలుసు. కరుణామయుల్లోకెల్లా మహా కరుణామయుడు, సంరక్షకుల్లోకెల్లా అత్యద్భుత సంరక్షకుడు అల్లాహ్, గనుకనే ఆయన తల్లి శరీరంలో పాలను సృష్టించింది. కాబట్టి ఏదో అనుకోకుండా తయారు కాలేదు ఇది. ఈ సృష్టినంతటినీ ఓ పద్ధతిలో సృష్టించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఒక్కే ఒక్కడు అనడానికి గొప్ప తార్కాణం. అపోహలను మానండి అమ్మ పాలును అందించండి తల్లిపాల గురించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వీటివలన కొంత మంది శిశువులు తల్లి పాలకు దూరం అవుతున్నారు. అటువంటి తల్లులకు ఈ సందర్భంగా అవగాహన చెయ్యవలసిన అవసరం ఉంది. కొంత మంది పిల్లలు పాలు త్రాగిన వెంటనే వాంతి చేస్తారు. తాగేటప్పుడు నోటితో కొంత గాలిని పీల్చడం వలన ఇలా జరుగుతుంది. ఇది ప్రమాదం కాదు. దీనిని వైద్య భాషలో పోసెట్టింగ్ అంటారు. తల్లిపాలు పెట్టిన వెంటనే నేల లేదా మంచంపై పడుకోబెట్టకుండా, భుజంపై వేసుకొని కొంతసేపు ఉంచాలి. ఎక్కువగా కదల్చరాదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీరు అవసరం లేదు. బిడ్డకు అవసరమైన నీరు తల్లిపాలలో ఉంటాయి. శిశువుకు విరేచనాలు అయితే కొంతమంది తల్లులు పాలు పెట్టరు. డాక్టరు సలహా మేరకు పట్టించడం ఆపాలే తప్ప, సొంతగా ఆపనవసరం లేదు. తల్లి గర్భవతిగా ఉన్నా కూడా బిడ్డకు పాలివ్వవచ్చు. కొన్ని పరిస్థితులలో ఒకటి రెండు రోజులు బిడ్డకి అందించక పోయినా తరువాత వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. పాలిచ్చే తల్లి అవసరం మేరకు పండ్లు తీసుకోవాలే తప్ప ఎక్కువ పండ్లు తల్లి తీసుకోనవసరం లేదు.మరో పెద్ద అపోహ ఏంటంటే సిజేరియన్ అయిన వెంటనే తల్లి లేవకూడదని పాలు తాగించరు. అలాకాక తల్లి పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే డాక్టర్ సూచన మేరకు నర్సుల సహాయంతో బిడ్డకు పాలు ఇవ్వాలి. శిశువు పుట్టిన తరువాత తల్లి నుండి వచ్చే పాలు సరిపోవని బయట పాలు అందిస్తారు, అలా చేయకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. అమ్మతనానికి మించిన అందం ఉందా? మన దేశంలో కొంత మంది తల్లులు బిడ్డకు పాలు పెట్టడం వలన తమ అందం పోతుందని పాలివ్వరు. అమ్మతనానికి మించిన అందం ఈ ప్రపంచంలో ఉందా? ప్రకృతిలో ఏ జంతువు ఇలా ఆలోచించదు. బిడ్డకు బయట నుండి డబ్బా పాలు అందిస్తారు. ఇది చాలా తప్పు. ప్రకృతి ప్రసాదించిన గాలినే పీల్చుతాం. ప్రకృతి అందించిన నీటినే త్రాగుతాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకోగలమా అలానే తల్లి పాలకు కూడా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విదేశాల నుండి తీసుకొచ్చిన పాల పొడులు కూడా అమ్మ పాలకు మించిపోవు. తల్లులందరూ బాగా ఆలోచించాలి. పిల్లలకు పెద్దయిన తరువాత ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవ్వాలనుకుంటారు. కానీ వాటి కంటే పిల్లలకు ఇచ్చే మొదటి ఆస్తి తల్లిపాలనే విషయం గుర్తెరగాలి. పాలివ్వడం వలన అందం ఏం తరగదు. ఇంకా పెరుగుతుంది. బిడ్డకు పాలిస్తే తల్లికే లాభం బిడ్డకు పాలివ్వడం వలన తల్లికి కూడా లాభాలున్నాయి. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువ పెరుగుతుంది. పాలివ్వడం వలన బరువు తగ్గుతారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రక్తపోటు, టైప్ 2 మధుమేహం వంటి రోగాలు భవిషత్తులో రాకుండా అడ్డుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత తమ శిశువులకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఉండే దేశం క్రొయేషియా. ఇక్కడ 98 శాతం మంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇంకా రువాండా, చిలీ, బురుండి వంటి దేశాలలో ఉండే తమ పిల్లలకు పాలిచ్చే తల్లులు 80 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులలో అనగా ఉద్యోగరీత్యా, బయట పనులు చేయడం వలన తమ శిశువుకు పాలు అందివ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రసవానంతర సెలవులు ఇస్తున్నారు. అలానే ప్రైవేటు రంగంలో కూడా కనీసం ఆరు మాసాలు వేతనంతో కూడిన సెలవివ్వాలి. పాలిచ్చే అమ్మ పొలం పనులకు కూలీ పనులకు, ఆ ఆరు మాసాలు వెళ్లకుండా ఇంటిలోని యజమానులు, కుటుంబ సభ్యులు సహకరించాలి. ఈ సంవత్సర లక్ష్యాలు ఆరోగ్య కేంద్రాలు, పని ప్రదేశాలలోని మహిళా ఉద్యోగినులకు మద్దతుకై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన చర్యలు, ప్రసూతి అర్హతలు మరియు ఇతర సహాయ చర్యల సమాచారాన్ని తెలియపరచడం, ఈ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగినులను ప్రోత్సహించే కార్యక్రమాలను బలోపేతం చేయడం. ఆఫీస్‌లలో మాతృత్వ సెలవులు మరియు తల్లిపాలు ఇవ్వడానికి విరామ సమయం ప్రకటించాలి. ముగింపుగా, తల్లి పాలు ఒక ఆహార ఎంపిక మాత్రమే కాదు. ఇది శిశువుల మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన హెల్త్ ఇన్‌ర్వెన్షన్ అని చెప్పాలి. భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచడానికి తల్లి పాల తల్లులకు మద్దతు అందించడం ముఖ్యం. జర పైలం తల్లో! బిడ్డకు తల్లి స్తన్యం ఇవ్వటం అన్నది ఎంత సహజ విషయమే అయినా... అందులో కొంత అజ్ఞానం, అమాయకత్వం కూడా కొంతమంది విషయంలో ఉందని కొన్ని దశాబ్దాల ముందే కాదు నేటి తల్లుల గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. తల్లులు బిడ్డను పక్కలో పడుకోబెట్టి పాలు ఇచ్చేవాళ్ళు... ఇస్తున్నారు. బిడ్డ పాలు తాగుతుండగనే తల్లులు నిద్రపోయేవాళ్ళు.. పోతున్నారు కూడా! దానివల్ల పాలధారల వేగానికి పిల్లలు ఉక్కిరిబిక్కిరై శిశు మరణాలు కూడా సంభవించేవి... నేటికీ సంభవిస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్లు ‘తల్లులు కూర్చుని పిల్లలకు పాలు పట్టాలని ఆ వెంటనే భుజాన ఎత్తుకుని వెన్ను చరచాలని... త్రేన్పు వచ్చేదాకా అలా చేయాలనీ చెబుతున్నారు. ఈ విషయం అప్పటి, ఇప్పటి చాలా మంది తల్లులకు తెలియదు. కాన్పు అయిన మొదటిరోజు తల్లి స్తన్యం నుంచి స్రవించే ముర్రుపాలలో పిల్లలకు రోగనిరోధక శక్తిని అందించే గుణం, ఇన్‌ఫెక్షన్స్ నుంచి, చెడు బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి రక్షించే శక్తి ఉంటుందని గైనకాలజిస్టులు, పిడియాట్రిషియన్లు చెబుతున్నారు. కానీ గతంలో ఆడవాళ్ళు ‘అవి మురికిపాలని’ పిండి పారేసేవాళ్ళే గానీ పిల్లలకు తాగించేవాళ్ళు కాదు. దానివల్ల... ఆ అజ్ఞానంవల్ల... పిల్లలకు ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకమీదట జరగకుండా జాగ్రత్త పడాలి!!