Sunday, August 10, 2025
ఏకాంతం + శాంతం = సుఖాంతం / Solitude + Peace = Happy Ending
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
రాత్రివేళ తహజ్జుద్ నమాజ్ కూడా చేస్తూ ఉండు. ఇది నీకోసం అదనపు నమాజ్‌గా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతిస్థానం మీద అధిష్ఠింప జేయవచ్చు. (బనీ-ఇస్రాయీల్-79)
సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరితెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ, నిరాశానిస్పృహలు ఉండవు. ఓ ఆనందం. ఒక సింహావలోకనం ఉంటాయి. పునరాలోచన, అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు: అంతర్వాహినులవుతాయి.
హిరా గుహలో ప్రవక్త (స) వారి ఏకాంత ప్రార్థన - సమాజం గురించిన చింతన, ఖురాన్ అవతరణ
మహా ప్రవక్త (స) గారి వయసు 40 సంవత్సరాలకు దగ్గరవుతుండగా అల్లాహ్ ఆయన కోసం ఏకాంతాన్ని ప్రియంగా చేశాడు. తరచూ ఆయన సత్తు పిండి, నీళ్ళు తీసుకుని మక్కాకు రెండు మైళ్ళ దూరాన ఉన్న నూర్ పర్వతంపై గల హిరా గుహలోకి వెళ్ళేవారు. రమజాను మాసమంతా హిరా గుహలోనే ఆరాధన, అనుశీలనల్లో, సృష్టి రహస్యాల ఛేదనలో నిమగ్ను లయ్యేవారు. నిత్యం తన జాతి వారిలో తిష్ఠ వేసిన విగ్రహారాధన, మద్యపాన సేవనం, విషయ లోలత్వం లాంటి సామాజిక రుగ్మతల గురించి, వారి నైతిక దుస్థితి గురించి తీవ్రంగా మథన పడేవారు. ప్రవక్త (స) గారి ఏకాంతం కూడా అల్లాహ్ సూచనల్లోని ఒక సూచనే. దైవదౌత్యానికి మూడు సంవత్సరాల ముందు నుండే అల్లాహ్ తన ప్రవక్త (స) కోసం ఈ ఏకాంతాన్ని సమ్మతించాడు. ప్రవక్త (స) ఈ ఏకాంతంలోనే నెలలు గడిపేవారు. బ్రహ్మాండమైన ఈ విశ్వ కర్మాగారం వెనుక ఉన్న ఆ శక్తి ఏది? మానవుల ఆ నిజ స్వామిని ఆరాధించే సరైన పద్ధతి ఏమిటి? వీటిపైనే ఆయన తన మనసును కేంద్రీకరించారు.
ప్రవక్త (స)గారి ఈ ఏకాంత జీవితం, నిజానికి అల్లాహ్ ప్రణాళిక యొక్క ఓ భాగమే. ఇలా అల్లాహ్ ఆయన్ను రాబోయే మహోన్నత కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. యదార్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా, మానవ జీవితపు యదార్థాలను ప్రభావితం చేసి, వాటిని ఓ రుజుమార్గం వైపునకు మళ్ళించవలసివస్తే, అతను లౌకిక ఆర్భాటాలు, జీవిత ఝంజాటాలు, ప్రాపంచిక వ్యామోహాలకు కొంతకాలం దూరంగా ఉంటూ ఏకాంతంలో గడపవలసి ఉంటుంది.
అచ్చం ఈ సూత్రానికి అనుగుణంగా, అల్లాహ్, ముహమ్మద్ (స)కు మహోన్నత కార్యసాధనా బాధ్యతను అప్పగించి, తద్వారా ప్రపంచ సంస్క రణకు, చరిత్ర గతిని తిప్పడానికి ఎంచుకోదలిచాడు. దైవదౌత్య బాధ్యత ఆయనపై వేయడానికి మూడేళ్ళకు ముందే ఆ ఏకాంతవాసాన్ని ఆయనపై విధించడం జరిగింది. ఏకాంతంలో అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. విశ్వసృష్టి సూచనలను చూస్తూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని గూర్చి ఆలోచించే వారు. మహాప్రవక్త (స) ఈ ఏకాంతవాసంలో ఓ నెల్లాళ్ళు విశ్వ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ, దాని వెనుక దాగివున్న రహస్యం గురించి ఆలోచించేవారు. దైవాదేశం వస్తే ఆ రహస్యాన్ని బయట పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు.”
తఖ్వ్వాపరులకు, సజ్జన సుభక్తులకు సాధకులకు ఈ ఏకాంతం ఎంతో అవసరమైంది. ముఖ్యమైంది. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలకి తాము చూడగలిగే యత్నం చేస్తారు. అప్పుడా స్థితిలో వారికి నిశ్చలత్వం. ఏకాగ్రచిత్తం, స్థితప్రజ్ఞత వస్తాయి. జీవితపు లోతుల్లోకి వెళ్లి దాని తత్వాన్ని, సత్యాలను చూసే, ప్రేమభావనను తెలుసుకునే దృష్టి ఏర్పడుతుంది. ఈ ఏకాంతం జీవిత అర్థ, పరమార్థాలను తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. సత్వ సాధనకు, సత్యశోధనకు ఇది సుగమమైన మార్గం.
ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాదు. ఎవరూ లేకుండా ఒక్కరూ ఉండటమే. ఈ రెండింటిలో సామ్యం. అంతే: ఒంటరితనంలో చింత, ఏకాంతంలో చింతన ఏకాంతమంటే లోచూపు. చేసిన పనులను, వాటి మంచి, చెడులను విశ్లేషించుకోవటం. నడకను, నడతను డేగచూపుతో పరిశీలించటం. అంతవరకు సాగిన జీవితాన్ని ఒక మదింపు వేసుకునే సందర్భం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశమిచ్చి, అందుకు మనల్ని సమాయత్తం చేస్తుంది. ఆ విషయానికొస్తే...
ఏకాంతం అదో అద్భుతం
అశాంతితో నలిగిపోయేది ఒంటరితనం. ప్రశాంతతో వెలిగేది ఏకాంతం. నిస్సత్తువతో నీరుకార్చేది ఒంటరితనం. నిశ్శబ్దంలో నిమగ్నం చేసేది ఏకాంతం. నా చెంతలేరనే దిగులుతనం ఒంటరితనం. ఏ చింతలేని హాయితనం ఏకాంతం. సంతోషాన్ని వెతుక్కొనేది ఒంటరితనం. ఆనందాన్ని అనుభవించేది ఏకాంతం. మరుపు కోసం మత్తుని కోరుకొనేది ఒంటరితనం. మౌనంతో మైమరచిపోయేది ఏకాంతం. నిన్నటిని తలుచుకుంటూ రేపటి కోసం ఎదురు చూసేది ఒంటరితనం. ప్రస్తుతంలో పరవశిస్తూ పరిమళించేది ఏకాంతం. భరించలేనిది ఒంటరితనం ఆస్వాదించేది ఏకాంతం. పరధ్యానం లో మునిగిపోయేది ఒంటరితనం ధ్యానంతో నేర్చుకునేది ఏకాంతం. ఆత్మహత్యకి సైతం పురిగొల్పేది ఒంటరితనం అంతరాత్మని కూడా తట్టి లేపేది ఏకాంతం. అందుకే, ఎవ్వరూ కోరుకోనిది ఒంటరితనం మరెందుకో, అందరికీ చేతకాదు ఏకాంతం.
రాత్రి ఏకాంత ప్రార్థన ఘనత
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు: "రాత్రిపూట తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంస నీయమైన ఉన్నతస్థానంలో ప్రతిష్ఠింప జేయటం అసంభవం ఏమీ కాదు." (బనీ ఇస్రాయీల్-79)
"వారి (విశ్వాసుల) వీపులు పడకలకు ఎడంగా ఉంటాయి." (అస్ సజ్ దహ్:16)
"(విశ్వాసులు ప్రపంచంలో) రాత్రివేళల్లో చాలా తక్కువ నిదురపోయేవారుగా ఉంటారు." (అజ్ జారియాత్-17)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రజ లారా! సలాంను వ్యాపింప జేయండి. (ప్రజలకు) అన్నం తినిపించండి. ప్రజలు రాత్రి నిద్రలో ఉండే సమ యంలో నమాజు చేయండి. అలాచేస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశిం చగలరు. (తిర్మిజీ, హసన్; సహీహ్)
అల్లాహ్ ను ప్రార్థించే వేళ ఈ ఏకాంతం దాసుని దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మనో నైర్మల్యాన్నిస్తుంది. సర్వోపగతుడైన ఆయనను మనోసీమలలో దర్శించేందుకు ఏకాంతం అద్భుత సాధనం, అంతర్ముఖచిత్తులమై అల్లాహ్ సుమనోహర నామాల, గుణాల చింతనకు, సృష్టిలోని అణువణువున ఆయన. నైపుణ్యాన్ని కాంచటానికి ఏకాంతం ఎంతగానో తోడ్పడుతుంది. మౌనస్థితిలో లౌకికానందాలను వీడుతూ, ఆ విశ్వరూప భావనను అవగతం చేసుకుంటాం. ఆసలైన ప్రేమ అనుభవైకవేద్యమవుతుంది. అది గొప్ప ఆనంద స్థితి.
ఏకాంతమంటే ప్రకృతిలో విహారం, మెచ్చిన మంచి గ్రంథ పారాయణం, నచ్చిన సద్గ్రంథ శ్రవణం, పుస్తక పఠనం, ధ్యానం - జిక్ర్... ఖుర్ఆన్ కంఠస్థం ... ఎన్నెన్నో భావనలు. అది ఒంటరితనమే కానక్కరలేదు. సామూహికం కావచ్చు. జీవితపు ఉరుకుల, పరుగులలో తన కుటుంబసభ్యులతో, ఆత్మీయులతో, సంభాషించే సమయమే చిక్కదు. అప్పుడు వారితో మాత్రమే గడపటం కూడా ఏశాంతమే ఏకాంతం కలత చెందిన మనసులను తేట పరుస్తుంది.
ఏకాంతాన్ని కోరుకున్న కొండ గుహ వాసులు – కహఫ్
ఏకాంతం అన్న ఒంటరిగా అన్న ఒక్కరు గా ఉండటం అని అర్థము వస్తుంది .ఏకాంతం అనేదానిలో ఒక్కరు అని చెప్పడానికి లేదు.. వారు ఇద్దరు ముగ్గురు గా కూడా ఉండవచ్చు!! అంటే ఒక లక్ష్యం కోసం, ఒక పథకం కోసం, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, జన సమూహం నుంచి ఈ ప్రవాహ వేగం యొక్క సుడుల,జడుల నుంచి పక్కకు జరిగి వారుగా …వారు అనుకున్న లక్ష్యం, కోసం విడిగా ఉండడాన్ని ఏకాంతo అంటారు.
వారు ఏడుగురు మిత్రులు. వారందరి ఆలోచనా విధానం ఒక్కటే. విగ్రహారాధన, బహు దైవ భావన తప్పు. అల్లాహ్ వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించాడు. వారు తాము నమ్మిన ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లోనే దాచుకోవాలని నిర్ణ యించుకున్నారు. ఎందుకంటే రాజు కూడా విగ్రహారాధకుడే కాబట్టి తమ విశ్వాసం గురించి చెబితే రాజు వేధింపులకు గురిచేస్తాడు. వారిలో ఒకడు మిగిలిన వారితో, ”మనం మన విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలుసు కాబట్టి తప్పక మన మీద చర్య తీసుకుంటాడు. ఒకవేళ రాజు చర్య తీసుకోకపోతే ప్రజలు రాజును బలహీనుడిగా భావించి పరిహసిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు, పట్టణాన్ని వదలి కొండ గుహల్లో ఎక్కడైనా ఏకాంత వాసాన్ని ఏర్పరచుకుందాం! . అక్కడ మనం స్వేచ్ఛగా మన విశ్వాసం ప్రకారం జీవించవచ్చు. ఎవరి జోక్యం ఉండదు” అన్నాడు. అలా వారు ఒక లక్ష్యంతో ఏకాంతాన్ని ఆశ్రయించారు.
ఏకాంత మర్యాదలు
1) సిగ్గు బిడియాలు శాశ్వత ఆభరణాలవ్వాలి: మనిషి ఓ ఇంటి పెద్దకు, ఓ ఊరి పెద్దకు, ఓ జాతి పెద్దకు ఎంతగానయితే సిగ్గు పడతాడో దానికన్నా ఎక్కువగా తను అల్లాహ్‌కు సిగ్గు పడాలి. మనిషి తన మర్మస్థానాలను తన భార్య ముందు ఏకాంతంలో తప్ప కప్పి ఉంచాల్సిందిగా దైవ ప్రవక్త (స) హితవు పలికారు. మనిషి ఓత్రిగా ఉన్నప్పుడు నగ్నముగా ఉండవచ్చా? అని అడిగినప్పుడు - మనిషి అందరికన్నా ఎక్కువగా అల్లాహ్ తో సిగ్గు పడాలి అని సెలవిచ్చారు ప్రవక్త (స).
2) పార్థనలు ఎక్కువగా చేయాలి: హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే పురుషుణ్ణి అల్లాహ్ కరుణించుగాక! అతను లేచి నమాజ్ చేస్తాడు. తన భార్యను కూడా (నమాజ్ కోసం) మేల్కొలుపుతాడు. ఒకవేళ ఆమె లేవకపోతే ముఖం మీద నీళ్ళుచల్లి లేపటానికి ప్రయత్నిస్తాడు. అలాగే రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే స్త్రీని అల్లాహ్ కరుణించుగాక! ఆమె లేచి నమాజ్ చేస్తుంది. తన భర్తను కూడా (నమాజ్ కోసం) నిద్ర లేపుతుంది. ఒకవేళ అతను లేవకపోతే ముఖం మీద నీళ్లు చల్లి మరీ లేప టానికి ప్రయత్నిస్తుంది. (అబూదావూద్, దీని ఆధారాలు దృఢమైనవి)
3) అల్లాహ్ సమరం మరియు దుఆ చేయడంలో గడపాలి: అల్లాహ్ ప్రియతమ దాసులకు ఏకాంత ప్రార్థనలో కలిగినంత తన్మయం, తాదాత్మయం ఇతర ఏ ఆరాధనల్లోనూ కలుగదు. వారు ఏకాంత ఆరాధనా అమృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తారు. ముహమ్మద్ బిన్ యూసుఫ్ (రహ్మ) ఇలా అన్నారు: అనుగ్రహాలు ఇబ్బడిముబ్బడిగా పొందాలనుకున్నవారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఎక్కువ దుఆ చేయాలి.
ఏకాంతం అనేది మన జీవితంలో అత్యంత గాఢమైన సమయం - జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే సమయం. ఒక తరంగా, మనం ఎంత సమయాన్ని విషయాలను ఆకళింపు చేసుకోవడంలో లేదా గ్రహించడంలో గడుపుతున్నామో, ఎంత సమయాన్ని వాటిని వ్యక్తీకరించడంలో గడుపుతున్నామో పరిశీలించుకోవాలి. ఒకవేళ మూడింట రెండు వంతుల సమయం ఆకళింపు చేసుకోవడానికి, మూడింట ఒక వంతు సమయం వ్యక్తపరచడానికి కేటాయిస్తే, ఆ వ్యక్తీకరణ లోతైనదిగా, ప్రతి ఒక్కరికీ విలువైనదిగా ఉంటుంది.
ఏకాంత ప్రయోజనాలు
1) అల్లాహ్ స్మరణతో తన్మయం చెందటం: పూర్వం సజ్జనుల్లో ఒకరు ఒంటరిగా కూర్చుని, అల్లాహ్ ను స్మరిస్తూ, తన ప్రభువును వేడుకున్నాడు. ఆయన్ను ఇలా ప్రశినించడం జరిగింది: మీకు ఒంటరితనం తోచడం లేదా? అని. ఆయన ఇలా అన్నాడు: అల్లాహ్ తో గడిపే ఎవరికయినా నేను ఒంటరి అన్న భావన కలగడం సాధ్యమేనా? అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "నేను నా దాసునితో అతను నా గురించి ఊహించినట్టుగానే వ్యవహరిస్తాను. అతను నన్ను ఎక్కడ గుర్తుచేసుకున్నా నేను అతని తోడుంటాను.("అల్లాహ్ సాక్షి! మీలో ఎవరికైనా తన వస్తువు అడవిలో తప్పిపోయి తిరిగి దొరికితే అతను ఎంతగా సంతోషిస్తాడో, దాసుడు పశ్చాత్తాప పడినప్పుడు అల్లాహ్ అంతకన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.) ఎవరైనా నా వైపు ఒక జానెడు దగ్గరకు జరిగితే నేను అతనివైపు మూరెడు దగ్గరకు జరుగుతాను. ఎవరైనా నా వైపు మూరెడు దగ్గరకు జరిగితే నేనతని వైపు బారెడు దగ్గరకు జరుగుతాను. అతను నా వైపునకు నడిచి వస్తే నేనతని వైపునకు పరుగెత్తుకొస్తాను. (బుఖారీ ముస్లిం)
"ఏ రోజయితే ఏ నీడా ఉండదో ఆ రోజున అల్లాహ్ ఏడుగురు వ్యక్తులకు తన అర్ష్ (మహా సింహాసనం) నీడలో స్థలాన్ని ప్రసాదిస్తాడు. ఆ అదృష్టవంతులో ఒకరు - ఏకాంతంలో అల్లాహ్ గుర్తు చేసుకిని కంట తడి పెట్టుకున్న వ్యక్తి. (తిర్మిజీ)
2) ఆత్మాప్రక్షాళనం: ఏకాంతం ఆత్మప్రక్షాళకు గొప్ప సమయం. ఇబ్న్ అల్-ఖయ్యిమ్ తన పుస్తకం (అల్-ఫవాయీద్)లో ఇలా అన్నారు: “మీ మీ హృదయాన్ని మూడు చోట్ల వెతుక్కోండి: ఖురాన్ వింటున్నప్పుడు, అల్లాహ్ స్మరణ సమావేశాలలో మరియు ఏకాంత సమయాల్లో. ఈ మూడు ప్రదేశాలలో మీరు దానిని కనుగొనలేకపోతే, మీకు హృదయమీ లేదని గ్రహించి, మంచిగా స్పందించే హృదయం ఇవ్వమని అల్లాహ్ ను వేసుకోండి.
3) ఆత్మ దర్శనానికి అనువైన సమయం: ‘నువ్వు అంటే మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, పంచ జ్ఞానేంద్రియాలు కాదు...దానం, ఐశ్వర్యం, మందీమార్బలం అసలు కానేకాదు. నువ్వెంతో నీకు తెలిపేదే, తెలిసి వచ్చేలా చేసేదే ఏకాంతం. ప్రతిరోజూ మన ముఖాన్ని, శరీరాన్నిమనం అద్దంలో వీక్షిస్తాము, ఎందుకంటేమనం ఇతరుల ముందు సర్వోత్తమంగా కనిపించాలని కోరుకుంటాము. ఆత్మపరిశీలన, స్వీయ విశ్లేషణ అనే లోపలి దర్పణాన్ని అనుదినమూ చూడటం, పైపై వాలకము వెనుక ఉన్న దాని సరైన ముఖచిత్రాన్ని నిర్ధారించడం మరింత ముఖ్యం కాదా? ముఖంపై ఒక చిన్న మొటిమ లేదా మచ్చ కూడా ముఖం యొక్క అందాన్ని పాడుచేసినట్లే, కోపం, భయం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి అవలక్షణాల మూలంగా ఆందోళన అధికమయి, ఆత్మ ప్రతిబింబాన్ని వైకల్య పరుస్తుంది. ప్రతిరోజూ ఈ వైకల్యాల నుండి మనల్ని మనం విముక్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మన అంతరాత్మ సౌందర్యం తేజరిల్లుతుంది.
మనం విశ్లేషణ ద్వారా మానవ సమస్యలు మూడు విధాలుగా ఉంటాయని గమనిస్తాము: బాహ్య శరీరాన్ని బాధించేవి, మనస్సుపై దాడి చేసేవి, ఇంకా ఆత్మను కప్పివుంచేవి. రోగం, వృద్ధాప్యం, మరణం శరీరానికి ఎదురయ్యే ఇబ్బందులు. మానసిక వ్యాధులు దుఃఖం, భయం, కోపం, తీరని కోరికలు, అసంతృప్తి, ద్వేషం, భావోద్వేగ వ్యామోహం వంటి మానసిక క్యాన్సర్ వంటి వాటి ద్వారా దాడి చేస్తాయి. ఇక అవిద్య, అజ్ఞానం, ధర్మరాహిత్యం అనేది ఆత్మ రుగ్మత, అన్నిటికంటే ఇది అత్యంత హానికరమైనది, ప్రమాదకరమైనది. ఇది అన్ని ఇతర ఇబ్బందులు రావటానికి కారణమవుతుంది. ఆ రకంగా ఏకాంతం ప్రయోజనకర విద్యార్జనకు శుభవేళ.
ఏకాంత పాపాలతో జర భద్రం!
చీకటి బాగా దట్టమయ్యిందన్న తలంపు కొందరిని చెడు తలుపులు తెరిచేలా ప్రేరేపిస్తే, ఎవడూ గమనీమచడం లేదు అన్న ధీమా మరికోమదరిని పాప కార్యానికి పురిగొల్పుతుంది. నైతిక విలువల వలువలు వలిచేయాలని, కుటుంబ మర్యాదను మట్టిలో కలిపేయాలని, ఆధ్యాత్మిక ఆంక్షల్ని అతిక్రమించాలని, బరువు బాధ్యతలను మరచి బరితెగించి కోరికల మజాలు జుర్రుకోవాలని ఉసిగొల్పుతుంది. ఆ బలహీన క్షణంలో – ‘కామా తురాణాం నభయం నలజ్జ’ వంటి స్థితికి లొనవుతాడు మనిషి. మరి ఏకాంత పాపాలు చెడ్డ చావుకి దారి తీస్తాయి అన్నారు మన పెద్దలు.
ఏకాంత సమయంలో మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు చూసినా, చూడకపోయినా, పట్ట పగలయినా, చిమ్మ చీకటయినా అల్లాహ్ మాత్రం చూస్తున్నాడు అని గ్రహించాలి. అధికారి గమనిస్తున్నాడనో, యజమాని చూస్తున్నాడనో కాదు, అల్లాహ్ చూస్తున్నాడన్న బావన మనలో ఉండాలి, మదిలో నిండాలి. అమ్మానాన్నలకు దూరంగా, ఆలుబిడ్డలకు దూరంగా నివసిస్తున్న మనలోనీ చాలా మంది అక్రమ సంబఖధాల కోసం అర్రులు చాచుతున్నాడు. మనం నీతికి నీళ్లు వదలి నీచంగా బ్రతుకుతూ మనవారు మాత్రం నికార్సయిన వారుగా ఉండాలనుకోవడానికి మించిన ఆత్మ వంచన, మూర్ఖత్వం మరొకటి లేదు.
ఒంటరితనంతో సతమతమవుతున్న వారికి ఓ మంచి చిట్కా
కోరి తీసుకునేది ఏకాంతం…వద్దన్నా వచ్చి హత్తుకునేది ఒంటరితనం…ఒంటరితనంలో వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో కానీ, బలవంతంగా వదిలివేయడం వల్ల గాని విడిగా ఉంటారు . ముసలితనంతో పిల్లలందరూ ఎక్కడెక్కడో సెటిలై ఒంటరిగా ఉంటారు కొందరు జంటలు. ఊ రుగాని ఊర్లో ,భాష గాని దేశంలో దారితప్పి ఒంటరితారు ఇంకొందరు. కొందరు సమాజానికి భిన్నంగా ఆలోచింస్తూ తోడు లేక ఆలోచనలోనూ, వ్యక్తిగగాను ఒంటరి అవుతారు మరికొందరు.
కుటుంబం ఒకరిని వంటరిని చేస్తే,సమాజం మరొకరికి వంటరితనం నిర్దేశిస్తుంది.మతం ఒకరి ఏకాంతానికి మూలమయితే,మరొకరి ఏకాంతానికి కారణం మదం.ఏమీ లేవన్న దుః ఖంతో ఒకరు,అన్నీ ఉన్నాయన్న అహంకారంతో మరొకరు ఏకాకి అవుతారు. విషాదదుఃఖంతోనో ,ఓటమి దిగుళ్లతోనో, విచారంతోనో భయంతోనో ఒకరు ఏకాకి అయితే, మితిమీరిన స్వార్థంతోనో ఈర్ష్యా అసూయలతోనో, అహంభావంతోనో, ద్వేషంతోనో మరొకరు ఒంటరితనం కొనితెచ్చుకొంటారు. నిరాశానిస్పృహలు ఒకరిని ఏకాకి చేస్తే, విర్రవీగే విజయగర్వం మరొకరి వంటరిని చేస్తుంది. ఆవేశంలో ఒకరు, ఆగ్రహంలో ఇంకొకరు,ఆశయంలో ఒకరు,ఆదర్శంలో ఒకరు ఒంటరిగా మిగిలి పోతారు.
ఏకాంత వేడుకోలు: సకల సమస్య, సకల రుగ్మతలకు చక్కటి పరిషారం ఈ ఏకాంత పార్థన - దుఆ.
లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్ - అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి.
అల్లాహ్ ఈ ఏకాంత వేడుకోలు గురించి తెలియజేస్తూ - ఒకవేళ ప్రవక్త యూనుస్ (అ) ఈ దుఆ చదివి ఉండకపోతే ప్రళయం వరకూ చేప కడుపులోనే ఉందిపోయేవారు అని సెలవిస్తున్నారు. అది రాత్రి చీకటి స్మూద్య్రా చీకటి, చేప కడుపు చీకటి - అంతటి భయంకర సస్థితిలో ఆయన్ను కాపాడింది ఈ దుఆ.
చివరికి అతడ్ని ఒక చేప మింగేసింది.... అప్పుడతను దైవాన్ని స్మరించి ఉండకపోతే పునరుత్థానదినం దాకా ఆచేప కడుపు లోనే ఉండిపోయేవాడు. చివరికి మేమతడ్ని వ్యాధిగ్రస్త స్థితిలో ఇసుక మైదానంలో విసిరేశాం. అతనికి నీడ కోసం అక్కడ ఒక తీగచెట్టు మొలిపించాం. త. (అల్-సాఫ్ఫత్: 142-145)
ఒంటరితనాన్ని దూరం చేసిన అద్భుత సంఘటన
దైవప్రవక్త (సల్లం) ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) తెలియజేశారు: “మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణు తీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకు పోయింది. (అప్పటి వరకు అనుభవం కానీ భయంకర ఒంటరితనం వారిని తీవ్ర వేదనకు గురి చేసింది) దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కా ర్యాల ఆధారంగా అల్లాహు వేడుకో వడం తప్ప ఆ విపత్తు నుండి బయట పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయా నికి వచ్చారు. వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గాని త్రాపించేవాణ్ణి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగిం చడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లా డినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయం లోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద్ర మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖ ద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు.” అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ) ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు.
తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో సాగాడు: "ఓ అల్లాహ్! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖ నంలో ఇలా ఉంది): మగవారు ఆడ వారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించే వాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసు కుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధ మయ్యింది. నేనామెను ఆక్రమించు కున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్కు భయపడు! అక్రమంగా కన్నె పొరను చీల్చకు" అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర్నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె కిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్ల యితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు.” రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు.
ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: "ప్రభూ! నేను కొంత మంది పని మనుషులను జీతానికుంచు కున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చే శాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టు బడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు" అనడిగాడు. దానికి నేను, "నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు -అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు” అంటూ చిన్నబోయాడు. నేను "ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదల కుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్న తను దృష్టిలో పెట్టుకొనే చేసినట్లయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు.” దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి పోయి గుహద్వారం తెరుచుకో వటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ- ముస్లిం)
చివరి మాట
ఎంతటి సూదూర ద్వీపాన్నైనా ఆ ఏకాంత వాసాన్ని,చెట్టుచేమతో, పుట్టాగట్టుతో,వాగూవంకతో, ఏటితోకడలితో, నింగీ నేలతో, గొడ్డూగోదా పిట్టా చేపతో చెలిమి చేయగల సత్తా ఉన్న జీవే, మనిషి .అంతేకాదు, ఎంతటి ఏకాంతాన్నైనా సుందరస్వప్నంలా, అందమైన అనుభవంలా మార్చుకోగల సృజనశీలి. చమత్కారి. ఎంతయినా,మనిషికి మనిషి తోడు. మాటకి మాట సాయం. మనిషి సాటిమనిషినే కాదు. సమస్త జీవరాశితో ముడిపడిన ప్రకృతిని తోడుగా తీసుకొని ..బతక నేర్చిన వాడు! ఊహలని కల్పనలతో తన లోకం తాను నిర్మించుకోగల నేర్పరి.మరి, ఇప్పటికే ఎవరిగదుల్లో వాళ్ళం ఏకాంతంగా కూరుకుపోతున్నామని అనుకొంటున్నారా? ఎవరిచేతుల్లోని సెల్ పోనుల్లో, తెరల్లోకి కూరుకుపోయిన మనం, ఏకాంతంగా ఉన్నట్టా లేనట్టా? గదిగోడలు కాదు కానీ, మదిగోడలు ఎంత మందంగా ఉన్నాయో గమనించండి. వాస్తవానికి,మనుషులనీ మాటలని అవి ఆపగలవా? నిజంగానే ఆపేస్తున్నాయా?
ఏకాంతం + శాంతం = సుఖాన్తమ్, స్వర్గం. / ఏకాంతం + పాపం = అశాంతం, నరకం.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు