Sunday, August 10, 2025

హిజ్రీ కొత్త సంవత్సరం ... కోటి ఆశలతో మనం / Hijri New Year... We are filled with millions of hopes.

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు హిజ్రీ కొత్త సంవత్సరం ... కోటి ఆశలతో మనం విశ్వాసులారా! దేవునికి భయపడండి. ప్రతి మనిషీ రేపటి కోసం తాను ఏం సంపాదించి సిద్ధపరచుకున్నాడో యోచించాలి. (కనుక) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మీరు చేస్తున్న పనులన్నీ దేవునికి తెలుసు. మీరు దేవుడ్ని మరచినవారిలా మారకండి. వారు దేవుడ్ని మరచిపోయినప్పుడు, దేవుడు వారిని తమనుతామే మరచి పోయినట్లు చేశాడు. అలాంటివారే దుర్జనులు. నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయే వారు ఎన్నటికీ ఒకటి కాజాలరు. స్వర్గానికి పోయేవారే సార్థక జీవులు. (అల్-హష్ర్: 18-19) మనం యుద్ధ వాతావరణం నుండి బయట పడి, జుల్ హిజా మాసాన్ని వీడ్కోలు పలికి, అల్లాహ్ మాసమైన ముఅహర్రం మాసపు పవిత్ర వాతావరణంలో శ్వాస పీల్చుకుంటున్నాము. నూతన సంవత్సరపు ఆరంభ ఘడియలలో ప్రతి విశ్వాసి తాను ఆశించిన కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న శుభ తరుణంలో తౌహీద్ కి కట్టుబడి జీవిస్తానన్న శుభ సంకల్పంతోపాటు ప్రవక్త పితామహులైన హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) వంటి అచంచల విశ్వాసం అల్లాహ్ యెడల కలిగి ఉండాలి.
ఒక్క విశ్వప్రభువు తప్ప (మిత్యా దైవాలన్నీ) ఇవన్నీ నాకు శత్రువులు. విశ్వప్రభువు - ఆయనే నన్నుసృష్టించాడు. ఆయనే నాకు (రుజు)మార్గం చూపించాడు. నాకు ఆహారపానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు. నేను జబ్బుపడితే స్వస్థత చేకూర్చేవాడు ఆయనే, నాకు మరణం కలిగించేవాడు ఆయనే, (పరలోకంలో) నన్ను పునర్జీవింపజేసేవాడు కూడా ఆ ప్రభువే. ఆయన తీర్పుదినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను” అన్నాడు ఇబ్రాహీం. (అష్-షుఅరా: 75-82)అన్న శక్తివంతమైన మాటను జ్ఞాపకం చేసుకొంటూ భక్తి నిండిన హృదయంతో,కృతజ్ఞతా భావంతో,సమర్పణగల స్వభావంతో అల్లాహ్ పవిత్ర సన్నిధిలో మోకరిల్లి, అల్లాహ్ చిత్తానుసారం ప్రవక్త ఇబ్రాహీమ్ (అ) చేసిన ప్రార్ధనను మనమూ తప్పక చేయాలి. (ఆ తర్వాత అతనిలా ప్రార్థించాడు:) “ప్రభూ! నాకు విద్యా వివేకాలు ప్రసాదించు. నన్ను సజ్జనులలో చేర్చు. భావితరాలలో నాకు సత్కీర్తి ప్రసాదించు. మహాభాగ్యాలతో నిండిన స్వర్గానికి వారసులయ్యేవారి జాబితాలో నన్ను చేర్చు. నాతండ్రిని క్షమించు. ఆయన దారితప్పాడు. మానవులు మళ్లీ బ్రతికించి లేపబడే రోజున నన్ను నవ్వులపాలు చేయకు. ఆరోజు సంతానం, సిరిసంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినవారికే ఆరోజు ప్రయోజనం ఉంటుంది.” దైవభీతి పరులకు స్వర్గం అతిచే రువగా తీసుకురాబడుతుంది. (అష్-షుఅరా: 83-89) కరుణ, కనికరం ఆభరణాలుగా, విజ్ఞానం, సంస్కారం సంపదలుగా, సాధన, ప్రయత్నం ప్రణాళికలుగా నమ్మకం, విశ్వాసం వ్యక్తిత్వంగా, కొనసాగించే జీవితం సదా శాంతిమయం. ధర్మం నాలుగు పాదాలపైన నడిచిన ప్రవక్తల యుగంలో సైతం, నమ్రుద్, ఫిరౌను, హామాను, అబూ జహాల్, అబూ లహబ్ వంటి దుష్టులు, దుర్మార్గులు, స్వార్ధపరులు ఉన్నారంటే ధర్మం ఒక్క పాదం మీద కుంటుతూ నడుస్తున్న ఈ యుగాన్ని గురించి చెప్పేదేముంది? కానీ యుగాలు మారినా, ప్రపంచంలో ఇంకా మనగలిగే పరిస్థితులకు కారణం అల్లాహ్ కృపానుగ్రహం. తర్వాత మానవాళి గురించి ఆలోచించే అద్భుత వ్యక్తుల అంతరంగ బలం. వారి బోధనలతో, వారి మార్గదర్శకత్వంలో నడిచి సొంత లాభం మానుకున్న మహనీయుల వల్లే. ఎంత కాదనుకున్నా, అది కుటుంబం ఇచ్చిన బలమే. ఆలంబనే. పెంపకంలోని సంస్కారమే. ఈ శుభ సందర్భంగా కొన్ని విషయాల్ని నెమరు వేసుకుందాం! సమయపాలన అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్నే 'సమయం' అంటారు. అది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు- ఏదైనా కావచ్చు. మనిషి ప్రతి చర్యను సమయం శాసిస్తుంది. ఏ సమయంలో ఏమి చెయ్యాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నీ దైవాభీష్టానికి, ధర్మానికి అనుసంధానమై ఉన్నంతకాలం సర్వత్రా సత్ఫలితాలే లభిస్తాయి. ధర్మానికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి. నేనే కాలాన్ని చేసినవాడను. మీరు కాలాన్ని తిట్టకండి అని స్వయంగా అల్లాహ్ సెలవిస్తున్నాడు అంటే కాలం ఎంత విలువైనదో తెలుస్తుంది. ఈ శిశిష్టల కారణంగానే అల్లాహ్ కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు: కాలచక్రం సాక్షి! మానవుడు ఘోరంగా నష్టపోయాడు. అయితే సత్యాన్ని విశ్వసించి (తదనుగుణంగా) సత్కార్యాలు చేస్తూ, సత్యం, సహనాలను గురించి పరస్పరం ఉపదేశించుకునేవారు మటుకు ఏమాతం నష్టపోరు. (అల్-అస్ర్: 1-3) కండ బలం కన్నా ఆత్మ బలం గొప్పది - ఆయుధ సమరం కన్నా అక్షర సమరం గొప్పది అహంకారం కన్నా ఆత్మాభిమానం గొప్పది - అవపోసన (అధ్యయనం)కన్నా అనుభవం గొప్పది - శాస్త్ర పఠనం కన్నా సంస్కార ఔన్నత్యం గొప్పది - సహన శక్తి, సమతుల్యత సదా అభిలషణీయం. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంమనే దానిని బట్టి మన జయాపజయాలు, సుఖ సంతోషాలు, కష్టాలు బాధలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సంతోషంగా ఉండాలంటే సమయ పాలన తప్పనిసరి. వేలకు నమాజు చేయడం, సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆఫీసుకు వెళ్లడం, సమయం ప్రకారం ఆయా పనులు చేసుకోవడం వంటివి మనలో ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. విజయానికి కారణం అవుతాయి. కాబట్టి గతం ఎలాగూ గడిచిపోయింది. ఈ కొత్త సంవత్సరం రోజు నుంచైనా ఖచ్చితమైన సమయ పాలనను పాటించాలి. అరబీలో ఓ సామెత ఉంది: సమయం కార్వాలం లాంటింది, దాన్ని నువ్వు సద్వినియోగ పరచుకోకపోతే అది నిన్నే సంహరిస్తుంది. విజ్ఞానం ఎంత ముఖ్యమో విచక్షణ అంతకంటే ముఖ్యం, విజ్ఞానం మనల్ని మేధావిని చేస్తే విచక్షణ వివేకవంతుడిని చేస్తుంది. విచక్షణ లేని విజ్ఞానం కథకుడు లేనికథ లాంటిది, రెండూ కలిసిన వ్యక్తిత్వం విలువలతో కూడిన విచక్షణా జ్ఞానం ప్రసాదిస్తుంది. రెండు మహా భాగ్యాలు - ఆరోగ్యం, తీరిక సమయం ఒకవేళ మీరు కొద్ది కాలం అనారోగ్యంతో ఉన్నా కూడా మీకు ఆరోగ్యం విలువ ఏంటో అర్ధమైయ్యుంటుంది. ఆరోగ్యంగా లేకపోతే ఇల్లు, కుటుంబం,వ్యాపారం, సంపద ఇవన్నీ ఉన్నా లేనట్టే.. అన్నీ తెలిసీ.. సరైన సమయానికి తినక.. ఏదో ఒకటి.. ఎప్పుడో ఒకప్పుడు.. ఎలానో ఒకలా తినేసి చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావురా.. అని పెద్దలు అంటుంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశ అభివృద్ధికి, సమాజ ఆరోగ్యానికి ఆ దేశ ప్రజల ఆయుర్దాయమే కొలమానం. ‘జీవితం ఒక ప్రవాహం. అదెప్పుడూ ముందుకే సాగాలి, వెనుకకు కాదు’. ‘వికసిత్‌ భారత్‌’ అని నినాదాలిస్తున్నా… ప్రజల ఆయుష్షు మాత్రం వెనకడుగు వేస్తోంది. భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం తగ్గినట్లు ఇటీవల వెలువడిన గణాంకాలు ఒకింత ఆందోళనకరమైనవే. ‘జీవితం ఓ ప్రయాణం అయితే, ఆయుష్షు దానికి ఇంధనం. అది క్షీణిస్తే.. మన గమ్యం ఆగిపోతుంది. పౌష్టికాహారం, కాలుష్య రహిత వాతావరణం, రక్షిత మంచినీరు, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, మానసిక ప్రశాంతత వంటి అనేక కారణాలు ఆయుఃప్రమాణాల మెరుగుదలకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్రతి మార్పు ఒక చిన్న అడుగుతో ప్రారంభమౌతుంది’ అంటారు. ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చి… కార్పొరేట్ల సేవలో తరిస్తున్న ప్రభుత్వాలకు, గణాంకాల వెనుక గోచరిస్తున్న ఈ హెచ్చరిక ఓ గుణపాఠం కావాలి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ‘ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే. ‘డబ్బుకు లేదే సిగ్గు, ఎగ్గు, న్యాయం…అదుంటే ఏ పనైనా ఖాయం’ నిజాన్ని నిలువునా పాతేయాలని… తిమ్మిని బమ్మిని చేసెయ్యాలని పాలక వర్గాలు భావిస్తుంటాయి. కానీ, వాస్తవాలు ఎప్పుడో ఒకప్పుడు పాతాళం నుంచైనా బయటకు వచ్చి నాటి తప్పులకు వారిని బోనులో నిలబెడుతుంటాయి. తీరిక సమయం లో స్క్రీన్ టైమ్ తగ్గించండి స్మార్ట్ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా, మీటింగ్లో ఉన్నా, ఇతరులతో మాట్లాడుతున్నా దానిని చెక్ చేయకుండా చాలా మంది ఉండలేకపోతున్నారు. దీంతోపాటు ఎప్పుడు చూసినా కూడా ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లేదా టీవీ చూస్తూ గంటలు గంటలు గడిపితే అదొక వ్యసనంగా మారుతుంది. ప్రస్తుతం చాలా మందిలో కళ్ల సమ్యలు, తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటికి ఇది కూడా కారణం అవుతోంది మమకారం తో కూడిన ప్రేమ తరంగాలు బంధాలకు ఎంత స్వఛ్ఛమో, కడదాకా కలిసుండే స్నేహ తరంగాలు మనసుకు ఎంత ముఖ్యమూ, పడి లేచే కడలి తరంగాలు సముద్రానికి ఎంత అందమో తారతమ్యాలు లేని అంతరంగాలు మన జీవన తరంగాలకి అంత ముఖ్యం. అహంతో మాట్లాడే మాటలు మనసును బాధిస్తాయి. ప్రేమతో మాట్లాడే మాటలు మనిషిని చేరతీస్తాయి అజ్ఞానంతో కూడిన మాటలు మనిషిని కృంగతీస్తాయి. ఆప్యాయతతో అలరించే మాటలు మనిషికి ఆత్మీయతను పంచుతాయి. మాటలో సంయమనం పాటిస్తే మనిషి గౌరవం పెరుగుతుంది. అలాంటి ఆప్యాయతతో అలరించే నాలుగు మాటలు - అమ్మానాన్నలతో, అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ముళ్లతో, కొడుకు కూతుళ్లతో, భార్య బంధువులతో మాట్లాడే తీరిక నేడు మనకు లేకుండా పోతోంది. ఇది చాలా ప్రమాదకరం ! మూఢ నమ్మకాలకు, షిర్క్ బిద్అత్ లకు దూరంగా.. బయటకు వెళ్లేటప్పుడు పిల్లి అడ్డం వస్తే అపశకునమని, తింటున్నప్పుడు ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందని, మనకు దిష్టి తగలకుండా ఉండాలంటే నల్లదారం కట్టుకోవాలని.. ఏదైనా అనారోగ్యం చేస్తే చేతబడి ప్రభావమని, గాలి తగిలిందని.. ఇలాంటి మూఢ నమ్మకాలు ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. ఇవి మీ ఎదుగుదలకు, మనుషుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆటంకంగా మారుతాయి. కాబట్టి వాస్తవికంగా ఆలోచించాలి. వాస్తవంలో జీవించాలి. మూఢ నమ్మకాలను, షిర్క్ బిద్అత్ లనువదిలితే మనం మరింత సంతోషంగా ఉండగలుగుతాము. కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడంమనకెంతో మేలు చేస్తుంది. బిద్అత్ వల్ల రేపు ప్రళయ దినాన అల్లాహ్ ప్రవక్త మనల్ని గుర్తించిన హౌజే కౌసర్ నుండి తరిమేయ బడ తాము. కాబట్టి - మరణం తరువాత ఏమి జరుగుతుంది అని ఆలోచించే కంటే, బ్రతికున్నంత కాలం ఎవ్వరినీ నొప్పించకుండా, ఏమీ ఆశించకుండా, వారి ప్రాధాన్యతలను విమర్శించకుండా, వారి లోని మంచిని గ్రహిస్తే మరణం తరువాత కూడా మంచే జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో శాంతి, సౌభాగ్యం లభిస్తాయి, మానవతా విలువలతో సంతోషం, సంయమనం . లభిస్తాయి. మంచి మాటలు మాట్లాడే క్రమంలో గౌరవం, మర్యాద లభిస్తాయి, మంచి, మానవత్వం, ఆధ్యాత్మిక తత్వం సమన్వయం చేసుకుంటే సంస్కారవంతమైన జీవితం లభిస్తుంది. మంచికి సంకేతం మార్పు మంచో, చెడో, సంతోషమో, సంతాపమో, కష్టమో, నష్టమో, విజయమో, వీర స్వర్గమో హిజ్రీ సంవత్సరాది ఎలాగూ గడచిపోయింది. ఇక నుంచైనా మనం మారాలి బ్రో అనుకుంటున్న యువత కొంగొత్త ఆలోచనలతో, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయిపోవాలి. గడిచిన కాలాన్ని జ్ఞాపకాల డైరీలో భద్రపరిచి.. ఈ రోజు నుంచే కొత్త డైరీనే కాదు, కొత్త లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు రెడీగా ఉండాలి యువతరం. ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. నేను మారాలి బ్రో.. టైమ్ వేస్ట్ చేయకూడదు అంటూ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. తేట నీటిలో ప్రతిబింబం, మంచి నీటిలో పరిశుద్ధం, వాన నీటిలో వెచ్చదనం, పారే నీటిలో మృదుత్వం ఎలా ఉంటాయో కల్మషం లేని మనసుతో కూడిన చిరునవ్వు అలా ప్రశోభిల్లుతుంది. దీనికి మానవత్వం తోడైతే మనిషి జన్మ సార్థకం అవుతుంది అలవాట్లు మార్చుకుందాం మన అలవాట్లను బట్టి కూడా సక్సెస్, ఫెయిల్యూర్, ఆనందం, ఆరోగ్యం వంటివి ఆధారపడి ఉంటాయి. ఇటీవల చాలామందిలో ఏజింగ్ హాబిట్స్ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తరచుగా తినడం వంటి అలవాటట్లవల్ల చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు, జుట్టు రాలిపోవడం, నడుము వంగిపోవడం, ముఖ వర్చస్సు తగ్గడం వంటి సమస్యలను పలువురు ఎదుర్కొంటున్నారు. దీంతో యవ్వన దశలోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నామని ఆందోళన చెందుతుంటారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా అలాంటి బ్యాడ్ హాబిట్స్ వదులుకోంవాలని దృఢ నిర్ణయం తీసుకోవాలి. సోమరి జీవితం సదా సంక్షోభం,కార్యశీలి గా సదా ప్రభావం అజ్ఞాని జీవితం సదా అంధకారం, జ్ఞాని గా సదా అభిలషణీయం మూర్ఖుని జీవితం సదా ప్రమాదం, వివేకం సదా సంస్కారం. వ్యసనాలకు బానిస అయిన జీవితం చీడపట్టిన వృక్షము లాంటిది ఆత్మవిశ్వాసం లేని జీవితం తెగిపోయిన గాలిపటం లాంటిది అత్యాశకు లోనయ్యే జీవితం అంతులేని అగాధం లాంటిది నిస్వార్థంగా నిలిచే జీవితం మాత్రమే నిండైన పచ్చని వృక్షం లాంటిది. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం,ఇంద్రియ నిగ్రహం కంటే ఆత్మ నిగ్రహం ముఖ్యం ఆత్మాభిమానం కంటే ఆత్మానుభవం ముఖ్యం. సంపన్న సౌభాగ్యం కంటే సంస్కార ఔన్నత్యం ముఖ్యం ముఖ్యమైనవి అన్నీ సమన్వయం చేసుకుంటే జీవితం అమృతవాహినే. జీవితాన్ని కొంతమంది ఆధ్యాత్మిక చింతన లో గడుపుతారు - కొంతమంది ధనార్జన,ఆడంబర సేవాభావం తో గడుపుతారు - కొంతమంది భోగి లాలస రసికత తో గడుపుతారు - కానీ జీవితం భిన్న భావాల సమ్మెళనం - అన్ని అనుభవాలను సమపాళ్లలో స్ప్రుసిస్తేనే జీవితం పరిపూర్ణం అవుతుంది. మనకు మనమే బాధ్యులం తెలిసో తెలియకో గత సంవత్సరం ఎం,మనం పలు విషయాల్లో పొరపాట్లు చేసి ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం వాటి గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు చేసిన పొరపాట్లను అంగీకరించి, ఇక నుంచి అలాంటివి చేయవద్దని నిర్ణయించుకోండి. మీవల్ల జరిగిన, జరగబోయే తప్పొప్పులకు మీరే బాధ్యులని అంగీకరించడం ద్వారా కొత్త సంవత్సరంలో మీరు సంతోషంగా ఉంటారు. సమస్యలను ఎదుర్కొంటూ, పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. మనసులో దాచుకున్న ప్రేమ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ వ్యక్తపరచకపోతే వ్యర్ధమే మస్తిష్కంలో మెదిలే ఆలోచనలు ప్రణాళికా బద్ధంగా ఆచరణలో పెట్టకపోతే అనర్ధమే మాట అయినా, ప్రేమ అయినా, ఆలోచన అయినా ఆచరణే ఆదర్శం. మనలో చాలా మంది ఉండే అలవాటు ఇతరుల తప్పులు ఎత్తి చూపడం. ఇక నుంచి ఇలాంటి వన్సైడ్ ఆలోచన మానుకోండి. ఇతరుల తప్పులకంటే ముందు మన పొరపాట్లను, తప్పులను గుర్తించాలీ. చక్క దిద్దుకునే ప్రయత్నం చేయాలి.
విశ్వాసులు పరస్పరం అన్నదమ్ముల్లాంటివారు. కనుక మీ అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. దేవునికి భయపడండి, మీరు కరుణించబడతారు. విశ్వాసులారా! పురుషులు తోటిపురుషుల్ని హేళన చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. అలాగే స్త్రీలు తోటిస్త్రీలను గేలి చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. మీరు ఒకరి తప్పులు మరొకరు ఎత్తిచూపుకుంటూ పరస్పరం బురద చల్లుకోకండి. తప్పుడు పేర్లతో పిలుచుకోకండి. విశ్వాసభాగ్యం పొందిన తర్వాత చెడ్డపేరు తెచ్చుకోవడం చాలా తప్పు. ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు. విశ్వాసులారా! మితిమీరిన అనుమానాలకు పోకండి. కొన్ని అనుమానాలు (మీకు) పాపాలుగా పరిణమించవచ్చు. (ప్రజల) రహస్య విషయాల వెనుక పడకండి. మీలో ఎవరూ ఇతరుల్ని పరోక్షంగా నిందించకూడదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? (ఇష్టపడరు.) చూశారా, మీరే దాన్ని అసహ్యించు కుంటారు. దేవునికి భయపడండి. దేవుడు ఎంతో క్షమాశీలి, దయామయుడు. (అల్-హుజూరాత్: 10-12) ఆశ మనిషిని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది అత్యాస మనిషిని పతనం దిశగా నడిపిస్తుంది దురాశ మనిషిని దుఃఖంలో ముంచుతుంది నిరాశ మనిషిలో ఆత్మన్యూనతా భావం పెంచుతుంది కానీ ఆశ లేని జీవితం సంద్రంలో దిక్సూచి లేని ఓడ లాంటిది. వర్తమానంలో మమేకం అవకపోతే భవిష్యత్తు కు ప్రణాళికలు సిద్ధం చేయలేము భవిష్యత్తు పై ఆశలు లేకపోతే జీవితం కొనసాగించలేము. అవసరం తో ముడిపడిన బంధాలు నీటి బుడగలు లాంటివి మనసుతో మమేకమైన బంధాలు పాలు నీళ్ళులాంటివి స్నేహం తో ముడిపడిన బంధాలు వెలుగును నింపే కొవ్వొత్తి లాంటివి. సహనం నశిస్తే తిరుగుబాటు మొదలవుతుంది-ఆలోచన నశిస్తే ఆందోళన మొదలవుతుంది సంస్కారం నశిస్తే అహంకారం మొదలవుతుంది సంయమనం పాటిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. జననం భూమి మీద శాశ్వతం కాదు, ఒక ఘటన మరణం శాశ్వత అంతం కాదు,ఒక విడిది జనన మరణాలు కర్మఫలాలకు తాత్కాలిక మజిలీలు పరలోక మోక్షం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే సాధ్యం. చివరి మాట : మనసు మంచిదైతే అది పవిత్రాలయం - మాట మంచిదైతే అది విద్యాలయం - నడత మంచిదైతే అది సంస్కార నిలయం - ఇన్ని మానవతా విలువలతో కూడిన దేహం నిత్యానందలయం. భగవంతుడిని భక్తితో ఆరాధించు - బాధ్యతను సంతృప్తిగా స్వీకరించు - కర్తవ్యాన్ని దక్షతతో నిర్వహించు - విజయాన్ని సాధనతో సాధించు - సంకల్పం, చిత్తశుద్ధి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆశించాలి, అంతేకానీ చేసిన సహాయానికి మాత్రం ఆశించకూడదు - ప్రయత్నానికి తగ్గ ఫలితం కోరుకోవాలి, కానీ సాధన లేని విజయాన్ని ఆశించకూడదు. మాట నోరు జార కూడదు - మనసు అదుపు తప్ప కూడదు - కాయం (శరీరం)భోగాలకు బానిస కాకూడదు - ఆత్మాభిమానం అహం గా మారకూడదు - అప్పుడే సఛ్ఛీలత, మానవతా విలువలతో మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది. మానవ మేధస్సు వలన మహోన్నతులు గా మారవచ్చు - పట్టుదల, సాధన వలన సత్ఫలితాలను పొందవచ్చు - సత్ప్రవర్తన, సంకల్ప బలం తో మహాత్ములు గా నిలబడవచ్చు- కానీ అల్లాహ్ యెడల భక్తితో, ధ్యానంతో, అల్లాహ్ దాసులా యెడల దయార్ద్ర హృదయంతో మాత్రమే మానవుడు అల్లాహ్ ప్రసన్నతను పొందగలడు. కాబట్టి విధి వ్రాతను నిందించకు, సరిదిద్దడానికి ప్రయత్నించు - ధర్మాన్ని విస్మరించకు,ఆచరణ బాధ్యతగా స్వీకరించు - ఆత్మను నిందించకు,కర్మల ద్వారా శుద్ధికి ప్రయత్నించు - ఆచరణ, ప్రయత్నము, సంకల్పము ఈమూడు మాత్రమే సకల సందేహాలను నివృత్తి చేయగలవు. ఇక సద్భావనతో సత్సంగం సాగిస్తే అన్నీ సానుకూలమే.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు