Sunday, August 10, 2025

ముస్లిం ఆదర్శ దినచర్య / Ideal Muslim Daily Routine

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు ముస్లిం ఆదర్శ దినచర్య సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే వరకు నమాజ్‌ వ్యవస్థ స్థాపించు. వేకువజామున కూడా ఖుర్‌ఆన్‌ పఠనం చేస్తూ ఉండు. వేకువ జాము ఖుర్‌ఆన్‌ పఠనం (దైవదూతల) సాక్ష్యానికి కారణమవుతుంది. (బనీ_ఇస్రాయీల్: 78-79) అల్లాహ్ నామ స్మరణ సహజంగానే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మనసుకు నిరంతర ప్రశాంతతనిస్తుంది. దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా 'పరీక్షలు'గా భావించి ఓపిగ్గా భరించే తత్వం అలవడుతుంది. ఆ దైవమే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢవిశ్వాసం ఏర్పడుతుంది. దైవం మీద మనసు లగ్నం చేయడం, నమాజు విధానం పట్ల శ్రద్ధ... మనలో ఏకాగ్రతను పెంచుతాయి. దేవుడి ముందు రుకూ సజ్దా చేయడమంటే అంటే, మదిలో ధర్మ దీపం వెలిగించడమే. మనలోనూ మన చుట్టూ ఉన్న చీకటిని తరిమికొట్టడమే! ఆ వెలిగే సత్యజ్యోతికి మరిన్నిజ్యోతులను వెలిగించే శక్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఆత్మలోని 'జ్యోతి'ని వెలిగించుకోగలిగితే అదే చైతన్యం. 'ఉపవాసం' అంటే కడుపు మాడ్చుకోవడం కాదు. ఈనాడు శాంతి ఎందుకు కరువైపోయింది? జీవితాలు ఎందుకు దుర్భరమైపోయాయి? సుఖనిద్రను ఎందుకు కోల్పాయాము? పరస్పర ప్రేమాభిమానాలు ఎందుకు లోపించాయి? అంటే, సమద్ధానం - మన దినచర్య సరిగా లేకపోవడమే. ప్రతిరోజూ మనం చేసే దినచర్య ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడే జీవితంలో లక్ష్యసాధన సులువవుతుంది. అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. ఇదే ఇతరులకు ఆదర్శమవుతుంది. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు మంచి దినచర్య అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లలు ఏ సమయానికి ఏమి చేయాలన్నదాన్ని నిర్ణయించి వారు దాన్ని పాటించేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు సమయ పాలన, క్రమశిక్షణ అలవడతాయి.
నేడు ప్రపంచ వ్యాప్తంగా 50కు మించి ముస్లిం దేశాలున్నాయి. 2024 సర్వే ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు 200 కోట్లు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన తొలి ధర్మంగా ఇస్లాం అవతరించనుంది. ఇది నిజంగా గర్వకారణం. కాని దాదాపు కొన్ని శతాబ్దాల పాటు అన్య సంస్కృతుల ప్రభావం వల్లనో, ముస్లీముల ఏమరుపాటు వల్లనో, ముస్లిం సంఘాల అలక్ష్యం వల్లనో, పండితుల జాప్యం వల్లనో ఇస్లామీయ ఆచారవ్యవహారాలు కాపుదల లేక రూపు చెడి నిత్య అలవాట్లుగా మారి పోయాయి. కడుపు కక్కురితికై కడగండ్లు మెండైనకొద్ది ముస్లిం సమాజ తేజస్సు క్రమేణా తగ్గుముఖం పట్టడం మొదలయింది. ఫలితంగా ఖుర్ఆన్ మరియు హాదీల యెడల ప్రమాణ్యబుద్ధి తొలగి పోతోంది. గత అల్లాహ్ ప్రవక్తల సత్య గాథలు స్వయంగా మనం చదవ డం, మన పిల్లలకు చెప్పడం గగనమైపోతోంది. మన సజ్జన పూర్వీకుల్ని తూర్పారబెట్టే తుంటరోళ్ళు రోజురోజుకి అధికమైపోన్నారు. ఖుర్ఆన్ మరియు హదీసును సహాబా ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోకుండా, పరిపక్వత లేని, పునాది రహిత స్వీయ పరిశోధన, స్వీయ వ్యాఖ్యానంతో ఇష్టమొచ్చిన పెడర్థాలు తీస్తూ, వారు అధర్మ అడుసు , పాపపు పేడ త్రొక్కి తాము త్రోవ తప్పడమే కాక ఇతర అనేక మందిని త్రోవ తప్పిస్తున్నారు. వివిధ వాల్స్ మీద, గోడల మీద పేడ పిడకల్లా, పీడ ఫలకలు చేపట్టి - ఇస్లాం ధర్మ మూ లాలను చెరపట్ట ప్రయత్నిస్తున్న వాగుడుకాయ ప్రబుద్ధులు ఎందరో. ఇస్లాం ధర్మ సంప్రదాయాలు మాయమై సాంకర్యం - బిద్అత్ ప్రబలుతోంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు నేటి నవ నాగరికత వాన పాములు కొన్ని - జుట్టు, కట్టు, గడ్డం, పరదా విషయంలో ఎదో కనికట్టు చేయాలని ప్రయత్నిస్తున్నారు.జీవితానికి సంబంధించిన అనేక అంగాల్లో, రంగాల్లో స్వధర్మాలు విడిచి పర సంస్కృతిని అవలంబిస్తూన్నారు. బుర్ఖా ధరించడం ఛాందసం కొందరు అభ్యుదయవాదులు దృష్టిలో. ఇక ముస్లిం దినచర్య గురించి ఇలా బురదబుద్ధి ప్రబుద్వాద్ధులు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారో వేరే చెప్పనక్కర లేదు. ఇస్లామీయ సత్య బద్ధ సంస్కృతిని వీడి పాశ్చాత్య దుష్కృతి అనే విష రీతి రివాజు జీర్ణంకావడం 'చేతనే కొందఱికిట్టి హైన్యగతి పట్టింది. మన సజ్జ పూర్వీకుల ఆధ్యాత్మిక చింత, సత్య తపన, దివ్యబోధలు, తిరుగులేని వాక్సుద్ధి, అపూర్వ మహిమలు వీరి చెవికి ఇంపుగా తోచవు. ఆ పాశ్చాత్త కంపే వీరికి మహా ఇంపు. కారణం ఏదైనా కావచ్చు. తెలియక చెడేవారు కొందరు, తెలిసినా ప్రమాదవశం చేత చెడేవారు కొందరు, తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానం చేత చెడేవారు కొందరు, చెడిన వారిచే చెరప బడేవారు కొందరు - ఇలా అధిక శాతం మంది ఏదో రకంగా చెడుకి ప్రభావితులయి చెడడం జరుగుతోంది. జీవితం క్షణభంగురం. అయినా దాన్ని అనుభవించాలి. అందులోని రసమాధుర్యాన్ని ఆస్వాదించాలి. అందుకు తగినట్లు జీవితాన్ని అందంగా మలచుకోగలగాలి. దీన్నే 'జీవనకళ అంటారు అశావాదులు. నేడు చాలామందిలో అది లోపిస్తోంది. దానికి కారణాలు అనేకం. మారుతున్న జీవన శైలి, మితిమీరిన కోరికలు లాంటివి అందులో ప్రధానమైనవి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించలేకపోయామని కుంగుబాటుకు లోనవడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. లక్ష్యం ఉండటంలో తప్పులేదు. దాన్ని సాకారం చేసుకోవడానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే సమస్యలన్నీ. అవస్థలన్నీ.. ఇంతకు చెప్పవచ్చేదేమంటే అధర్మాన్ని, అసత్య ఆచారాలను, అశ్లీల అలవాట్లను ఆశ్రయించడమంటే మనము నిర్వీర్యులమయి మన వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అన్నమాట. పెద్దలు సత్య ధర్మపాలనలో మాత్రమే శ్రేయమేయని హెచ్చరించారు. మహాత్ముల మార్గం తూచా తప్పక అనుసరించడం నేటి వారికి శక్యం కాకపోవచ్చు. శక్తివంచన లేకుండా ప్రయత్నించడమైనా మన కనీస ధర్మంగా భావించాలి. త్రోవనున్న వాడు ఎన్నడు . త్రోవ తప్పిపోడు. ఎన్నటికైనా గమ్య స్థానం చేరుతాడు అన్న యదార్థాని గమనించాలి. ఇక ఒక ముస్లింగా మన దినచర్య ఎలా ఉండాలో తెలుసుకుందాం! ఫజ్ర్ ప్రార్థనతో మన దినచర్య ప్రారంభమవ్వాలి - సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే వరకు నమాజ్‌ వ్యవస్థ స్థాపించు. వేకువ జామున కూడా ఖుర్‌ఆన్‌ పఠనం చేస్తూ ఉండు. వేకువ జాము ఖుర్‌ఆన్‌ పఠనం (దైవదూతల) సాక్ష్యానికి కారణమవుతుంది. (బనీ_ఇస్రాయీల్: 78) మహనీయ ముహమ్మద్ (స) వారు మస్జిద్ లో జమాత్ తో ఫజర్ నమాజు చేసి సూర్యోదయం వరకు అక్కడే కూర్చొని ఖుర్ఆన్ పారాయణం, దైవ స్మరణలో లీనమయ్యేవారు. అప్పుడుడప్పుడు అయన అనుచరులు చేసే ముచ్చట్లపై చిరునవ్వు చిందించేవారు కూడా. (సహీహ్ ముస్లిం) వేకువ జామున అనగా సూర్యోదయానికి అయిదు గడియలకు పూర్వమే పడక నుండి లేవాలి. దీనికే ఖుర్ఆన్ ఫజ్ర్ అని నామకరణం చేస్తుంది. అది ఉషఃకాంతులు ప్రకృతిలో ప్రసరించే తరుణం. దేహం నుండి కశ్మలం వెలువడి శుభ్రత, ఆరోగ్యం చేకూరే పవిత్ర సమయం. పశుపక్ష్యాది జీవకోని అంతా ఉల్లాసంతో లేచి కాల కృత్యాలు నివర్తించుకొని కళకళలాడుతూండే, తళతళా మెరుస్తుండే శుభ సమయం. మనస్సులోని మాంద్యం జాడ్యం తొలగి, పూర్ణచైతన్యం ప్రాప్తించే పవిత్ర వేళ. అ పవిత్ర ఘటికలలో కిటికీలు మూసికొని కంబళి ముసుగు చన్ని గుఱ్ఱుపెడుతూ నిద్రించడం మంచిదికాదు. అటువంటి శుభ సమయంలో కాలకృత్యాలు ముగించుకొని పరిశుద్ధులైనవారి పాపాలు ప్రక్షాళించబడతాయి. వారు అల్లాహ్ సంపూర్ణ రక్షణలో ఉంటారు. ఫజ్ర్ నమాజు వదిలేసి సూర్యోదయం అయినా నిద్రిస్తూన్న సోమరుల శిరస్సులు పగులగొట్టబడుతూనే ఉన్నట్టు మెరాజ్ సందర్భంగా ప్రవక్త (స) తెలియజేశారు. హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవ రయినా పడుకొని ఉన్నప్పుడు షైతాన్ అతని ముచ్చిలిగుంట పై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడిమీద, "ఇంకా చాలా రాత్రి ఉంది. హాయిగా నిద్రపో” అంటూ మంత్రించి ఊదుతాడు. అలాంటప్పుడు మనిషి గనక నిద్రలేచి అల్లాహ్ ను స్మరిస్తే (ఆ ముడులలో) ఒక ముడి ఊడి పోతుంది. ఆ తర్వాత అతను వుజూ కూడా చేస్తే రెండో ముడి ఊడి పోతుంది. ఆ తర్వాత అతను నమాజూ చేసుకుంటే ముళ్ళన్నీ ఊడిపోతాయి. దాంతో అతను ఎంతో హుషారుగా, నూతనోత్సాహంతో లేస్తాడు. లేకపోతే నిర్వేద మనసుతో, బద్దకంగా లేస్తాడు. (బుఖారీ-ముస్లిం) దీనికి తోడు సూర్యుని ఉషఃకాంతులు సోకనివారికి సమస్త రోగాలకు ఆట పట్టెన మలబద్ధం అంకురిస్తోంది. అతినిద్ర అతిభుక్తి అలసుల లక్షణాలన్న మాట మఱువరాదు. బుద్ధి వికాసంగా ఉండే ఆ సమయంలో విద్యార్థులు చదువుకోవడం లెక్కలు చేసికోవడం మంచిది. బుద్ధి సునిశితంగా పనిచేయడం చేత ధారణాశక్తి పెరుగుతుంది. పగటిపూట గంట సేపు చదివినా రాని పాఠం పావుగంటకే కంఠస్థమౌతుంది. ఎంతటి చిక్కు-పనుల విషయంలో నైనా ఆలోచిస్తే చక్కని ఉపాయాలు తోస్తాయి. కనుక 'ఆ సమయంలో ఇంద్రియాలను జోకొట్టి ఇంకా నిద్రిస్తే వాటి పటుత్వాన్ని ప్రకాశాన్ని ఉత్సాహశక్తిని బలాత్కారంగా అణగగొట్టేవాళ్ళం ఔతాము. హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:: పొద్దు ఖుద్దుగా చెప్పిన మాట - ఓ ఆదమ్ సంతానమా! నేను మీ జీవితంలో తొంగి చూస్తున్న కొత్త పొద్దు పొడుపుని, నూతన సృష్టిని. నా నుండి ఎంత లాభ పడాలో అంత లాభ పడండి. ఎందుకంటే, నేను ఒక సారి వెళ్లి పోయా నంటే, మళ్ళీ ప్రళయం వరకు తిరిగి రాను. మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ఓ ఆదమ్ సంతానమా! పగలు మీ పాలిట ఓ అపూర్వ అతిథి లాంటిది ... అలాగే రాత్రి కూడా. ఓ ఆదమ్ సంతానమా! "ఈ రోజు మీ పాలిట ఓ అపూర్వ అతిథి వంటిది. దానిని సత్కర్మలతో బాగా సత్కరించండి. మీరు దానిని విశిష్ట కర్మలతో ఘనంగా గడిపితే అది మిమ్మల్ని ప్రశంసిస్తూ, పొగుడుతూ మీ నుండి సెలవు తీసుకుంటుంది. ఒకవేళ మీరు దానితో చెడుగా వ్యవహరిస్తే అది మిమ్మల్ని తెగుడుతూ, తిడుతూ నిష్క్రమిస్తుంది. మీ రాత్రి కూడా అంతే." ఖుర్ఆనల్ ఫజ్ర్ సమయంలో పడక నుండి లేవాలి మానవుడు బడలినప్పుడు ఇంద్రియాలుసైతం బడలి విషయాల నుండి మరలగానే నిద్రపొందుతాడు. మితనిద్ర సుఖాన్ని ఆయువును వృద్ధి చేస్తుంది. పెందలకడ నిద్రించడం, వేకువనే లేవడం ఆరోగ్యదాయకం. రాత్రి జాగరణం నిద్రకు చేటు- పగటినిద్ర పనులకు చేటు ఔతుంది. పడక నుండి లేచీలేవకుండానే కాల్య కృత్యాలు ముగించకుండా ఎన్నడు... ఫోన్ చూడటం, బెడ్ కాఫీ త్రాగతం వంటివి చేయకూడదు. .. ఇది శీతల దేశీయుల ఆచారం. వారు వెచ్చని పానీయం త్రాగకుండా బయటకొక్క అడుగైనా పెట్ట జాలరు, చలితో శరీరావయవాలు కొంకరలు పోతూంటే నఖశిఖపర్యంతం బూట్లు, సూట్లు, కోట్లు, హేట్లు ధరిస్తారు. మంటలచే చలి బాపుకొంటారు. ముస్లింగా నిద్ర మేల్కొన్నందుకు ’అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅ‘ద మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్’ (బుఖారి). అని అల్లాహ్ కు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకొని విశ్వాస స్థితి మనకు లభించినందుకు గర్వించాలి. పడకనుండి లేవకమునుపే ఈ దైనప్రార్ధన చేసుకోవాలి. సమస్త జీవకోటియొక్క బుద్ధివృత్తులను ఎవ్వడు సర్వదా ప్రేరణ చేస్తూంటాడో అట్టి అల్లాహ్ అఖండ తేజస్సును గూర్చి ధ్యానించాలి. ఓ సర్వలోక ప్రభువా!! నేడు నిద్ర లేచినది మొదలు తిరిగి పండుకొనే వఱకు త్రికరణశుద్ధిగా విధ్యుక్త ధర్మ కర్మలను మాత్రమే ఆచరించే 'యోగ్యతను శక్తిని మాకు ప్రసాదించుమని వేడుకోవాలి. అహంకారము అణచి పాపదూరునిగా జేయుమని ప్రార్థిస్తూ మోకరిల్లాలి. చలింపని భక్తి తిరుగు లేనిశ్రద్ధ దయసేయుమని చేతులెత్తి అడుక్కోవాలి. అల్లాహ్ ఓ దయాకరా! మా తప్పిదాలు బ్రోవరా, మా జీవితాలు మలచరా! అని దీనాతిదీనంగా ప్రాధేయపడాలి యాహ్యా ఇబ్న్ ముఆద్ ఇలా అన్నారు: "రాత్రి చాలా పొడవుగా ఉంటుంది, కాబట్టి సోమరిలా నిద్రపోతూ, ఆకారణంగా జాగారం చేస్తూ వృధా పర్చుకొక్కండి. పగలు స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది, కాబట్టి దానిని పాపాలతో మురికి చేయకండి." మన సజ్జన పూర్వీకుల మాట: "ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచినప్పుడు, అతను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకోవాలి: మొదటిది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క విధులను నెరవేర్చడం. రెండవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన వాటిని పరిత్యజించడం. మూడవది: ఏ విషయంలోనైనా ఎవరితోనైనా వ్యవహరం చేస్తున్నపుడు వారితో న్యాయంగా నడుచుకుంటానని సంకల్పించుకోవాలి. నాల్గవ విషయం: తనకు మరియు తన ప్రత్యర్థికి మధ్య శాంతికి, సంధికి ప్రయత్నించడం. ఇలా గనక చేస్తే , నీతిమంతులు మరియు వివేకవంతుల, విజ్ఞుల, విజేతల జాబితాలో చేరే అవకాశం ఉంది. నమాజు చేయని వ్యక్తి నమ్మకద్రోహి మనందరి గొప్ప దాత, విధాత, ప్రభువు అయిన అల్లాహ్ ప్రసాదించినదే మనం తింటున్నాము. ఆయన నేలపైనే నడుస్తున్నాము, ఆయన అనుగ్రహించిన గాలినే పీల్చుకుంతున్నాము, విడ్డూరం ఏమిటంటే ఆయన చట్టాలనే ఉల్లంఘిస్తున్నాము. ఆయన జనాలని ధిక్కరిస్తున్నాము. ప్రతి దానికి భయపడే మనం, పెరటి చిన్న విషయానికి విలువనిచ్చే మనం అల్లాహ్ కు భయపడటం లేదు, ఆయన ఆదేశాలకు విలువ ఇవ్వడం లేదు. ఇది ద్రోహం కాకపొతే మరేమిటి చెప్పండి! నమాజ్ చేయని వ్యక్తి తన యజమాని పట్ల ద్రోహానికి పాల్పడుతున్నాడు. ఎందుకంటే, అతను కలిమా షహాదహ్ (విశ్వాస ప్రకటన) చెబుతూనే, తాను అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తానని సాక్ష్యమిస్తూనే నమాజు చేయకపోవడం ముమ్మాటికీ నమ్మకద్రోహమే, తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే! అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం! కూర్చొన్న చెట్టుకొమ్మను నరకదమే!.ఏరు దాటగానే తెప్పను తగలెయ్యడమే! తల్లిదండ్రుల మాట వినని అప్రయోజకుడు, అసమర్ధుడయిన కొడుకును అందరూ తిడతారు. తలా పిడికెడు మన్నెత్తి పోస్తారు కదా! ఇప్పుడు, తన ప్రభువు మాట వినని వ్యక్తిని ఏమనాలో? మీ హృదయాన్ని పరిశీలించుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, తన నిజమైన శ్రేయోభిలాషికి విధేయత చూపని వ్యక్తి ఇతరులకు ఎలా విధేయత చూపగలడో? ఒక్కసారి ఆలోచించండి! ఇలానే అల్లాహ్ ను విశ్వసిస్తున్నాను, ప్రవక్త (స) వారిని ప్రేమిస్తున్నాను అని కూతలకు పరిమితమయిన కోతలరాయుళ్ల గురించి అల్లామా ఇక్బాల్ (రహ్మ) చెప్పిన కవిత గమనార్హం! తబ ఆజాద్ పే నమాజ్ ఫజ్ర్ భారీ హై హమ్ సే కబ్ ప్యార్ హై హా నీన్ద్ తుమ్హే ప్యారీ హై నేడు మన పరిస్థితి ఎంతటి స్థితికి దిగజారిందంటే, ఇతర సముదాయాలు మనల్ని ఆలస్యంగా మేల్కొనే సముదాయంగా పరిగణించడం ప్రారంభించాయి. ఒక మహిళ తన కొడుకుతో ఇలా అంటుంది:బాబూ! ఉదయాన్నే లే! ముస్లింల మాదిరిగా ఏడు గంటల వరకు నిద్రపోకు. అల్లాహ్ మన పరిస్థితిపై దయ చూపుగాక! గుజర్ గయీ నమాజ్ ఫజ్ర్ ఔర్ తూ సోతా రహా కీమతీ వక్త్ కు ఖబోమే ఖోతా రహా సుబహ్ నమూదార్ హువి ఔర్ తూ బేదార్ న హువా ఉమర్ భర్ సోకర్ భీ తూ బేజార్ న హువా ఇబ్న్ ఖయ్యిమ్ (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్ తన అనుగ్రహాన్ని ఎవరి పైనైనా కురిపించదలచినప్పుడు, ఆయన అతని కోసం వినయ విధేయతల, అణుకువ, నమ్రత, సౌమ్యతల ద్వారాలు తెరుస్తాడు. అతను ఎలాంటి అవస్థలోనయినా తనను మాత్రమే ఆశ్రయించేలా దీవిస్తాడు, అతను తనలోని లోపాలు, వైకల్యాలు, వైఫల్యాలను, అజ్ఞానం, అవిధేయతను గుర్తించేలా చేస్తాడు. అది అతనికి తన ప్రభువు యొక్క అపారమైన దయ, ఆశీర్వాదం, కరుణ, అనుగ్రహం, దీవెనల మహత్యాన్ని, ఘనతను గ్రహించడానికి, నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అతనికి కావాల్సినంత శక్తిని, యుక్తి ఇస్తుంది. సజ్జనులలో ఒకరు ఇలా అన్నారు: “నేను నా అవసరాన్ని తీర్చమని అల్లాహ్ ను కోరినప్పుడు మరియు ఆయన దానిని నెర వర్చితే నేను ఒకింత సంతోషిస్తాను. ఆయన వెంటనే తీర్చకపోతే… నేను మరింతగా ఆనందిస్తాను. ఎందుకంటే ఇది నా ఎంపిక, అది అగోచరాలన్నీ తెలిసిన సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎంపిక”. ఫజ్ర్ నమాజ్ అనంతరం ఈ అద్భుత దుఆ తప్పక చదవాలి ఒకసారి దైవప్రవక్త (సల్లం) ఫజ్ నమాజ్ కోసం మస్జిదు బయలుదేరుతున్నప్పుడు జువైరియా (రజి. అన్హా) తాను నమాజ్ చేసుకునే చోట కూర్చొని (దైవధ్యానంలో నిమగ్నులై) ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) బాగా ప్రొద్దెక్కిన తరువాత (మస్జిద్ నుండి) ఇంటికి తిరిగొచ్చారు. ఆమె అప్పటి వరకు అక్కడే కూర్చొని ఉన్నారు. ఆమెను చూసి దైవప్రవక్త (సల్లం), “నేను మస్జిద్కు వెళ్ళినప్పటి నుండి నువ్వు ఇక్కడే కూర్చుని ఉన్నావా?” అని అడిగారు. “అవును, దైవప్రవక్తా!” అని సమాధాన మిచ్చారు జువైరియా (రజి. అన్హా). అప్పుడు దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: నేను నీ దగ్గరి నుండి వెళ్ళిన తరువాత నాలుగు వచనాలు ఒక్కొక్కటి మూడు సార్లు చొప్పున పఠించాను. వాటిని గనక ఈ రోజు నువ్వు చేసిన అల్లాహ్ ధ్యానంతో తూచితే అవే ఎక్కువ బరువును తూస్తాయి. ఆ వచనాలు: 1) సుబ్షానల్లాహి వ బిహమ్ దిహీ అదద ఖలిఖిహీ 2) సుబ్షానల్లాహి రిజా నఫ్సిహీ 3) సుబ్షానల్లాహి జినత అర్షిహీ 4) సుబ్షానల్లాహి మిదాద కలిమాతిహీ (ఇలా 3 సార్లు). (సహీహ్ ముస్లిం) హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: రెండు వచనా లున్నాయి. అవి పలకటానికి చాలా తేలికగా ఉంటాయి. కాని త్రాసులో మాత్రం చాలా బరువుని తూస్తాయి. ఇంకా అవి కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవే ‘సుబ్షానల్లాహి వబిహమ్డిహీ సుబహానల్లాహిల్ అజీమ్' (బుఖారీ-ముస్లిం) అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) తెల్లవారినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: (ఉదయం:) అల్లాహుమ్మ బిక అస్బహ్న వ బిక అమ్సైనా వ బిక నహ్య వ బిక నమూతు వ ఇలైక న్నుషూర్. (అబూ దావూద్) అయిదు పూటలా ఫర్జ్ నమాజు తర్వాత క్రింద పేర్కొనబడిన సూరాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత 3 సార్లు, జుహర్, అస్ర్, ఇషా తర్వాత ఒక్కో సారి చదవాలి. దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించాడు:"ఖుల్ హువల్లాహు అహద్...”, "ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్...”, "ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్...” (ఈ మూడు సూరాలూ 3 సార్లు) పఠించు. అన్ని రకాల కష్టాల నుండి సురక్షితంగా ఉంటావు” అని అన్నారు. (తిర్మిజీ-హసన్) వీటితోపాటు ఆయతుల్ కుర్సీ ఉదయం సాయంత్రాలతో పాటు అయిదు పూటలా నమాజు తర్వాత చదవడం చాలా మంచిది. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ఆన్ 2:255). అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారు: “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు” (సహీహ్ నసాయీ ) ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయంకాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం ) పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి) ఫజ్ర్ తర్వాత ఖుర్ఆన్ పారాయణం హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది” అంటే ఫజ్ర్ వేళ అల్లాహ్‌ దూతలు దివి నుండి భువికి దిగివస్తారు. (సహీహ్‌ తిర్మిజీ, సహీహ్‌ ఇబ్నుమాజా) హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్‌ ఖుర్‌ఆన్‌ (ఖుర్‌ఆన్‌ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు. (నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్‌: సహీహ్‌ అత్తర్గీబ్‌ వత్తర్హీబ్‌) హజ్రత్ ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో ఖుర్‌ఆన్‌ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు.” (బుఖారీ) చాప్త్ నమాజ్ ఇది అభిలషనీయమైన నఫిల్ నమాజ్, అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందే ఉద్దేశ్యంతో చదవటం ప్రవక్త (స) సాంప్రదాయం, సాధారణంగా ప్రవక్త (స) దీన్ని చదివే వారు. ఇది మూడువందల అరవైదాన ధర్మాలకు సమానం. (ముస్లిమ్) దీని సమయం సూర్యోదయం తరువాత నుండి పొద్దువాలే వరకు ఉంది. సరైన అభిప్రాయం ఏమిటంటే ఎండవేడెక్కిన వెంటనే చదువుకోవాలి. (ముస్లిమ్) అతి తక్కువ అంటే రెండు రకాతులు అతి ఎక్కువ అంటే 8 రకాతులు చదవవచ్చును. (తిర్మిజి, సహి) నమాజుకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రవక్త (స) ఆదేశం:- అల్లాహ్ ఇలా ఆదేశిస్తాడు ఓ ఆదమ్ కుమారా! దిన ప్రారంభంలో నా కొరకు నాలుగు రకాతులు చదువు సాయంత్రం వరకు నేను నీ సమస్యలన్నిటికి పరిష్కారంగా ఉంటాను (తిర్మిజి) దివారాత్రుల్లో 12 రకాతుల సున్నతె ముఅక్కద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం) సలాతుత్తస్బీహ్ సలాతుత్తస్బీహ్ గురించి ప్రామాణిక హదీసుల్లో పేర్కొనడం జరిగింది. ఒకసారి ప్రవక్త (స) అబ్బాస్ (ర)తో ఇలా అన్నారు. చిన్నాన్నగారూ! నేను మీకు ఒక ముఖ్య ఆరాధనను గురించి బోధిస్తాను. దాన్ని ఆచరిస్తే అల్లాహ్ (త) మీ పాపాలన్నింటినీ అంటే చేసినవి, ఇంకా చేయనివి, పాతవి, కొత్తవి, పొరపాటున చేసినవి, కోరిచేసినవి, పెద్దవి చిన్నవి, రహస్యంగా, బహిరంగంగా చేసినవి మొదలైన వాటన్నింటినీ క్షమించివేస్తాడు. సలాతుత్తస్ బిహ్ చదివే పద్దతి: నాలుగు రకాతులు చదవాలి ప్రతి రకాతులో సూరహ్ ఫాతిహా పఠించాలి. సూరహ్ ఫాతిహా తరువాత ఏదైనా సూరహ్ పఠించాలి. సుబ్షానల్లాహ్, వల్ హము లిల్లాహ్, వలాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అని 15 సార్లు పఠించండి. ఆ తరువాత రుకూలోకి వెళ్లండి. రుకూలో ఈ నాలుగు పదాలనే 10 సార్లు పఠించండి. ఆ తరువాత రుకూ నుండి తల ఎత్తి వీటినే 10 సార్లు పఠించండి. ఆ తరువాత సజ్జాలో వెళ్లి 10 సార్లు పఠించండి. ఆ తరువాత సజ్జా నుండి తల ఎత్తి 10 సార్లు పఠించండి. ఆ తరువాత సజ్జాలోకి వెళ్ళి 10 సార్లు పఠించండి. ఆ తరువాత సజ్జా నుండి తల ఎత్తి 10 సార్లు పఠించండి. ఇవన్ని ఒక రకాతులో పఠించబడే తస్బీహలు మొత్తం 75 అవుతాయి ఇదే విధంగా 4 రకాతుల్లోనూ పఠించండి. మీకు సాధ్యమైతే రోజుకు ఒకసారైనా చదవండి. రోజు చదివే తీరికలేకపోతే ప్రతి శుక్రవారం చదవండి. ప్రతి శుక్రవారం కూడా వీలు లేకపోతే సంవత్సరానికి ఒక్క సారైనా చదవండి. సంవత్సరానికి ఒక్క సారైనా వీలు కాకపోతే జీవితంలో ఒక్క సారైనా చదవండి. (అబూదావూద్ సహి 1297, తిర్మిజి సహిహ్ 481, 482) ఖైలూలా చేయడం ప్రవక్త (స) సంప్రదాయం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, వీలైతే, కాసేపు మేనువాల్చి కునుకు (ఖైలూలా) తీయాలి.అది రాత్రి ప్రార్థన చేయడంలో మంచిగా సహకరిస్తుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: "ఖైలూలా చేయండి , ఎందుకంటే షైతానులు ఖైలూలా చెయ్యడు" (సహీహ్ అల్-జామీ') అస్ర్ ముందు నాలుగు రకాతులు హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) "అస్రకు ముందు నాలుగు రకాతులు చేసేవారిని అల్లాహ్ కరుణించు గాక!" అని దీవించారు. (అబూదావూద్, తిర్మిజీ- హసన్) విద్యార్జన అవశ్యం మీ ప్రాపంచిక కార్యకలాపాల నుండి కొంత సమయం తీసి జ్ఞాన సముపార్జనలో వెచ్చించాలి. ఈ రోజు మనం విద్యార్జన అంటే పిల్లల పనిగా భావించడం విచారకరం! జ్ఞానాన్ని సముపార్జించడం ప్రతి ముస్లిం (స్త్రీ పురుషుల)పై తప్పనిసరి విధి. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రజి) తెలియ జేశారు: ప్రపంచం పాపిష్టిది, ప్రపం చంలో ఉన్నదంతా పాపిష్టిదే. దైవ ధ్యానం, దానికి సంబంధించినవి, ఇంకా ధర్మజ్ఞాని, జ్ఞానార్ధి తప్ప! (తిర్మిజీ-హసన్) తోటి ముస్లింల అవస్రాలను తీర్చడం ఖుర్ఆన్ అల్లాహ్ సెలవిచ్చాడు: (విశ్వాసులారా!) మేలు చేయండి. బహుశా దీని ద్వారానే మీరు సాఫల్యం పొందవచ్చు. (హజ్జ్: 77) హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (న) ఇలా ఉద్బోధించారు : ముస్లిం ముస్లింకు సోదరుడు. ఒక ముస్లిం తోటి ముస్లిం పై (ఎన్నటికీ) దౌర్జన్యం చేయడు, అతన్ని నిస్సహాయుడిగా వదలిపెట్టడు. (ఒక ముస్లిం) తన సోదరుని అవసరాలు తీర్చే పనుల్లో (నిమగ్నుడై) ఉంటే అల్లాహ్ అతని అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఎవరైనా ముస్లింను ఒక కష్టం నుంచి కాపాడితే, ప్రళయదినాన దేవుడు అతనికి ఎదురయ్యే కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైనా ఒక ముస్లిం (వల్ల జరిగిన పొరపాట్ల) పైప్ పరదా వేస్తే దేవుడు కూడా ప్రళయ దినాన అతని (తప్పుల్ని) మరుగు పరుస్తాడు. (బుఖారీ- ముస్లిం) బంధుత్వ సంబంధాలను బల పర్చాలి సమాజంలో మానవుడు ఒంటరిగా జీవించలేడు. పుట్టింది మొదలు మరణించే వరకు ప్రతి వ్యక్తి సమాజంలోని విభిన్న వ్యక్తులతో విభిన్న సంబంధాలను ఏర్పరచుకుంటాడు. సమాజంలో వ్రాయకుల మధ్య ఏదో ఒక రకమైన సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వీటిలో రక్త సంబంధాలు లేదా వివాహం ఆధారంగా ఏర్పడే బంధాలు దగ్గరగా ఉంటాయి. రక్తసంబంధం వల్ల లేదా వివాహం ద్వారా ఏర్పడే సంబంధాన్ని 'బంధుత్వం అంటారు. దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల ను కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”. (బుఖారీ) సత్సంబంధాలు పెట్టుకోవాలంటే అర్థం – మనకు ఉపకారం చేసే బంధువులకు మనం ఉపకారం చేయడం కాదు. మనతో మంచి గా ఉండే వారితో మనం మంచిగా ఉండటం కాదు. ప్రవక్త (స) వారి మాటల్లో చెప్పాలంటే: ”ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదు లుగా ఉపకారం చేసేవాడు నిజమైన బంధు ప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగ త్రెంపులు చేసుకున్నా వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే సిసలైన బంధుప్రియుడు”. (బుఖారీ) ధర్మబోధ మనందరి బాధ్యత దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే సన్మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించాడో అతనికి సన్మార్గాన నడిచిన వ్యక్తికి లభించిన పుణ్యం, అతన్ని అనుసరించిన వారి పుణ్యం కూడా లభిస్తుంది. అయితే వారి పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడడు”. ( ముస్లిం. తిర్మిజీ ) మనం చేయాల్సిదల్లా ఒకటే మనకు పరిచయం ఉన్న, పరిచయం లేని వ్యక్తుల వరకు ఇస్లాంను పరిచయం చేసే సాహిత్యాన్ని చేరవేయడమే. అలా చేరవేసిన మనం అల్లాహ్‌ వైపునకు ఆహ్వానించిన వారి జాబితాలో చేరగలం. ప్రవక్త (స) అన్నారు: బల్లిగూ అన్నీ వలౌ ఆయహ్‌’ – నా నుండి విన్న ఒకే ఒక్క మాటనయినా సరే ఇతరుల వరకు చేరవేయండి. కాబట్టి ఇందులోని ఒక కరపత్రాన్ని మనం చేరవేసినా అల్లాహ్‌ సందేశాన్ని ఆయన దాసుల వరకు చేరవేసిన వారమవుతాము. ఒక కరపత్ర మాధ్యమంగా ఇస్లాం స్వీకరించిన వారు ఎంత మంది లేరు. ఎవరో ఇచ్చిన పుస్తక ఆధారం గా ఇస్లాం స్వీకరించన వారు ఎంత మంది లేరు. చివరికి ఒక మంచి మాట మాధ్యమంగా ఇస్లాం స్వీకరిమచిన వారు ఎంత మంది లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మనమందరం ధర్మ బోధకులం. ధర్మబోధన మనందరి బాధ్యత. సాయంత్రం సంధ్యాసమయం సూర్యాస్తమయంతో రాత్రి ప్రారంభమవుతుంది, కాబట్టి సూర్యుడు అస్తమించగానే మగ్రిబ్ ప్రార్థన కోసం త్వరపడాలి, ఎందుకంటే మగ్రిబ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. సున్నత్ ప్రార్థనలను పూర్తి చేసిన తర్వాత, సాయంత్రం అజ్కార్ మరియు ప్రార్థనలను క్రమం తప్పకుండా చేసుకోవాలి. గొప్ప మన్నింపు ప్రార్థన (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్) షద్దాద్ బిన్ ఔస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : అన్నింటికన్నా ఉత్తమ మైన మన్నింపు ప్రార్థన (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్) ఇది. నువ్వు ఈ విధంగా ప్రార్థించు: “అల్లాహుమ్మ అంత రబ్బీ లా యిలాహ ఇల్లా అంత, ఖలఖ్ నీ వ అన అబ్దుక, వ అన అలా అహ్క వ వాదిక మస్తతాతు, అవూజు బిక మిన్ షర్రి మా సనాతు అబూవు లక బినీమతిక క అలయ్య, వ అబూవు లక బిజంబీ, ఫగ్ ఫిర్ ఫఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అంత.” (బుఖారీ) దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు - ఎవరైనా పగటివేళ పూర్తి నమ్మకంతో ఈ వాక్యాలు పఠించి సాయంత్రం కాకముందే మరణిస్తే అతడు స్వర్గానికి వెళతాడు. అదే విధంగా ఎవరైనా రాత్రిపూట పూర్తి నమ్మకంతో ఈ వచనాలు పఠించి తెల్లవారక ముందే మరణిస్తే అతను కూడా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (బుఖారీ) సాయంత్రం సంధ్యాసమయం సూర్యాస్తమయంతో రాత్రి ప్రారంభమవుతుంది, కాబట్టి సూర్యుడు అస్తమించగానే మగ్రిబ్ ప్రార్థన కోసం త్వరపడాలి, ఎందుకంటే మగ్రిబ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. సున్నత్ ప్రార్థనలను పూర్తి చేసిన తర్వాత, సాయంత్రం అజ్కార్ మరియు ప్రార్థనలను క్రమం తప్పకుండా చేసుకోవాలి. అల్లాహుమ్మ బిక అమ్ సైనా, వ బిక అస్’బహ్’నా, వబిక నహ్’యా వబిక నమూతు వ ఇలైకల్ మసీర్. [ఒకసారి]. (అబూ దావూద్ ). బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ వహువస్సమీఉల్ అలీమ్. {3 సార్లు చదవాలి} పడుకునే ముందు దుఆ ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ రెండు అరచేతులు కలిపి, పై మూడు సూరాలు చదివి, అందులో ఊదుకొని ముఖము, శరీర ముందు భాగం ఇంకా సాధ్యమైనంత వరకు మిగిత భాగంలో తుడుచు కోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. (బుఖారి). ప్రవక్త పడకపై వచ్చి తమ చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని ఇలా చదివేవారు: అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్ యా వేరే సందర్భంలో ఆయన ఇలా అన్నారు: నీవు నీ పడకపై వచ్చే ముందు నమాజు కొరకు చేసిన విధంగా వుజూ చేసి నీ కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదువుః అల్లాహుమ్మ అస్లమ్ తు వజ్ హీ ఇలైక వ ఫవ్వజ్ తు అమ్రీ ఇలైక వ అల్ జఅతు జహ్రీ ఇలైక రగ్బతౌఁ రహ్బతన్ ఇలైక లా మల్ జఅ వలా మంజా మిన్క ఇల్లా ఇలైక అల్లాహుమ్మ ఆమన్తు బికితాబికల్లజీ అంజల్త వ బినబియ్యికల్లజీ అర్సల్త. తహజ్జుద్ నమాజ్ (రాత్రిపూట నిద్రమేల్కొని చేసే నమాజు) తహజ్జుద్ నమాజ్ దైవ సామీప్యం పొందటానికి ఒక మార్గం లాంటిది. అది పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. చెడు పనులకు దూరంగా ఉండటానికి తోడ్పడుతుంది. (తిర్మిజీ) అర్థరాత్రి వరకు పడుకొని లేచి ఆ తర్వాత రాత్రి చివరి మూడో వంతు సమయంలో నమాజ్ చేయాలి. తహజ్జుద్కు సరైన వేళ అదే! (బుఖారీ-ముస్లిం) వితర్ నమాజును రాత్రిపూట చివరి సమాజుగా చేసుకోండి. (బుఖారీ) కుటుంబం కోసం సమయం కేటాయించాలి మహనీయ ముహమ్మద్ (స) ఇంట్లో ఒక మామూలు మనిషిగా తమ పనులు తాము చేసుకునేవారు, మేక పాలు పితకడం, తమ బట్టలు ఉతకడంలాంటి పనులు చేసుకునే వారు. చినిగిపోయిన తమ బట్టలు, బూట్లు కుట్టుకునే వారు. ఇంట్లో తమ కుటుంబీకులకు సహాయపడే వారు. ఆప్యాయతల పొదరిల్లులా ఒకప్పుడు కుటుంబాలు కళకళలాడేవి. మరి ఇప్పుడో ఎటు చూసినా చిన్న కుటుంబాలే. కన్న పిల్లలతోనైనా తల్లిదండ్రులు సరదాగా కాసేపు సమయాన్ని వెచ్చించ లేని పరిస్థితులు. ఉపాధి, జాబ్ల హడావుడి. తీరికలేని వ్యాపకాలు పని టెన్షన్లు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక చిరాకులు. కాస్త తీరిక దొరికితే చాలు ఎవరికి వారు సెల్ఫోన్లో ముచ్చట్లు. ఆదివారం వచ్చిందంటే వారమంతా అలిసిపోయాను ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలి అనే పరిస్థితి. సమయాన్ని కేటాయిస్తే సమస్యలు దూరం : నిద్ర, విధులు, ఇతర అవసరాలకు కొంత సమయం కేటాయించినట్లే కుటుంబానికీ కొంత టైమ్ వెచ్చించడం అవసరం. కనీసం రాత్రి పూటయినా ఫ్యామిలీ మెంబర్లందరితో కలిసి భోజనం చేయాలి. ఆ రోజు విశేషాలను పంచుకోవాలి. వారానికి ఒక్కసారి సినిమా, షికార్లు, ఇష్టమైన ప్రాంతానికి వెళ్లాలి. నెల లేదా 2 నెలలకోసారి బయటికి ప్రాంతాలకు వెళ్లాలి. ఇవి మానవ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయని మానసిక వైద్య నిపుణుల మాట.. సారాంశమేమంటే, దేశ కాల పరిస్థితులను అనుసరించి మంచివని తోచిన మన సజ్జన పూర్వుల సత్సాంప్రదాయాలను అవలంబిస్తూ ఇస్లాం ధర్మం యొక్క పూర్వపు ఔన్నత్యాన్ని, పూర్ణ వైభవాన్ని పునరుద్ధరణం చేయవలసినదిగా ముస్లిం సోదర ప్రజానీకానికి వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. అభిమాన సోదారుల్లరా! ధర్మం సాధించాలంటే ముందు దేహం కాపాడుకొమ్మని నీతివేత్తల సూక్తి, కనుక మనం ఆరోగ్యంగా ఉండడం, ఇరుగుపొరుగు వారి సుఖజీవనానికి శక్తి వంచన లేకుండా తోడ్పడడం - వీటి నిర్వహణకోసంమనం శరీరం దృఢంగా ఉండేటట్టు చూచుకోవాలన్న మాట. బలహీనమైన విశ్వాసి కంటే బలమైన విశ్వాసి గొప్పవాడు, అల్లాహ్ కు మిక్కిలి ప్రియమైనవాడు, మరియు ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది. (ముస్లిం) అన్నారు దైవప్రవక్త (స). నిత్యకృత్యాల నిర్వహణలో శరీరం మనకు సాయపడేటట్లు మన శరీర తత్వానికి తగిన ఆహార విహారాలు ఏర్పఱచుకొంటే దీర్ఘాయువు తప్పక కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, సౌభాగ్యం కూడా. ఎంత ధనం ఉన్నా జీర్ణశక్తి సుఖనిద్ర లేనివానికి శరీగదార్థ్యం ఉత్సాహశక్తి సన్నగిల్లుతాయి. నిత్య విచారాలవల్ల జీవితం మీద రోత కలుగుతుంది. చేరవలసిన ప్రథాన లక్ష్యానికి దగ్గఱ అవడానికి బదులు దూరం కావడం కూడా తటస్థిస్తుంది. అల్లాహ్ మనకు మంచి చెడ్డలు తెలుసుకొని ఎన్నుకొనే ఒకింత తెలివి ఒకింత స్వేచ్ఛ ఇచ్చినందుకు మనసా వాచా కర్మణా పరిశుదుడవయి ఆ పరమోన్నత ప్రభువు పవిత్రతను వేనోళ్ళ కీర్తించాలీ.. ధర్మ ఆచారవ్యవహారాల్లో అసత్యానికి, అధర్మానికి ఒడిగట్టకుండా ఎలా నడచుకోవడం నేర్చుకోవాలి. చివరి మాట హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబోధిం చారు : ఏడు రకాల అవస్థలు దాపురిం చకముందే మంచి పనులు చేయడానికి త్వరపడండి. మీరు (ధర్మాన్ని) మరచి పోయేటట్లు చేసే పేదరికం కోసం ఎదురుచూస్తున్నారా? హద్దుమీరి ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరుకుం టున్నారా? మీ ఆరోగ్యాన్ని పాడుచేసే రోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక బుద్ధిని, వివేకాన్ని చెడ గొట్టే వృద్ధాప్యం కోసం ఎదురు చూస్తున్నారా? లేక తృటిలో ఉసురుతీసే చావుకోసం ఎదురుచూస్తున్నారా? లేక కనిపించని కీడుల్లో అత్యంత హానికరమైన దజ్జాల్ (ఉపద్రవాగ్రేసరుని) రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక ప్రళయం కోసం హదీసు కిరణాలు ఎదురుచూస్తున్నారా? ప్రళయమైతే కడు భయంకరమైనది, చేదైనది. (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, 'హసన్'గా పేర్కొన్నారు.) హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరకు వచ్చి “ఓ దైవప్రవక్తా! ప్రతిఫలం రీత్యా ఎలాంటి దానం గొప్పది?” అనడిగాడు. దానికి ఆయన ఇలా అన్నారు : “నీవు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు సంపదపై వ్యామోహం కూడా ఉంది, (ఖర్చుచేస్తే) ఎక్కడ పేదవాణ్ణయిపోతానోనన్న భయంతోపాటు ధనవంతుణ్ణవ్వాలన్న ఆశ కూడా ఉంది, అలాంటి పరిస్థితిలో చేసే దానం (పుణ్యం రీత్యా గొప్పది), కాబట్టి నీవు దానధర్మాలు చేయడంలో ఆలస్యం చేయకు! ఆఖరికి ప్రాణం పీకలమీదకు వచ్చినప్పుడు వాడికి ఇంత ఇవ్వండి, వీడికి ఇంత ఇవ్వండి అని నువ్వు అన్నా లాభముండదు. ఎందు కంటే అప్పటికే అది ఒకడి (వారసుడి) సొంతం అయిపోయి వుంటుంది. (బుఖారీ - ముస్లిం) హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబో ధించారు : రేజీకటి తునకల్లాగా కమ్ము కునే ఉపద్రవాలు రాకముందే మీరు మంచిపనులు చేయడానికి త్వరపడండి. (అటువంటి ఉపద్రవ కాలంలో) మనిషి ఉదయంపూట విశ్వాసిగా ఉండి సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారి పోతాడు. సాయంత్రం వేళ విశ్వాసిగా ఉన్నవాడు ఉదయాని కల్లా అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాల కోసం తన ధర్మాన్నే అమ్ముకుంటాడు. (ముస్లిం)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు