Sunday, August 10, 2025

విశ్వ మానవ ధర్మం ఇస్లామ్ / Islam is the universal human religion.

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు విశ్వ మానవ ధర్మం ఇస్లామ్ తాను తప్ప మరో నిజ ఆరాధ్యనీయుడు లేడని స్వయంగా అల్లాహ్ యే సాక్ష్యమిస్తున్నాడు. సర్వశక్తిమంతుడు, మహావివేకి అయిన ఆయన తప్ప మరో నిజ దేవుడు లేడని దైవ దూతలు, నీతిమంతులైన జ్ఞానసంపన్నులు కూడా సాక్ష్యమిస్తున్నారు. అల్లాహ్ దగ్గర (ఆమోదిత) ధర్మం ఇస్లాం మాత్రమే. కాని గ్రంథప్రజలు తమకు జ్ఞానసంపద లభించినప్పటికీ, పరస్పరం విభేదాలలో పడి మంకుతనంతో ఇలాంటి ధర్మాన్ని కాదని విభిన్న మార్గాలు అవలంబించారు.అల్లాహ్ సూక్తులు తిరస్కరించినవారిని అల్లాహ్ త్వరలోనే నిలదీసి లెక్క తీసుకుంటాడు. ప్రతి మనిషికీ ఒక ఆలోచన ఉంటుంది. దాని ప్రకారమే అతను జీవితాన్ని గురించి, సృష్టిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. మరి దానికనుగుణంగానే ఏదో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తాడు. దాన్నే తన విశ్వాసాలకు, శ్రద్ధాసక్తులకు కేంద్ర స్థానంగా చేసుకుంటాడు. మరి దానికనుగుణంగా తాను సమాజంలో ఆచరిస్తాడు. ఈ మూడింటినే విశ్వాసం, ఆరాధాన, నడవడి అని అనవచ్చు. ఈ మూడు వస్తువుల సమాహారానికి మరో పేరే దీన్ (ధర్మం). ఈ రకంగా చూచినప్పుడు ప్రతి మనిషికీ అతను ఏ మతావలంబీకుడైనా, నాస్తికుడైనా... ఒక దీన్ (ధర్మం) అనేది ఉంటుంది. ఇక ఇస్లాం అంటే ఏమిటి? నిఖిల జగతి వెనుక ఒకానొక శక్తిమంతు డున్నాడని, ఆయన సంకల్పమే దీని వెనుక పనిచేస్తోందనీ, ఆయనే దీనికి కర్త మరియు పోషకుడని మనిషి గుర్తించాలి. ఆయన సమక్షంలోనే ప్రతి ఒక్కరి లెక్క తేలవలసి ఉందని, ఆయన సన్నిధిలో సత్యంగా ఖరారయ్యేదే సత్యమని, ఆయన ఎదుట మిథ్యగా ఖరారయ్యేదే మిథ్య అని మనిషి నిష్కల్మష హృదయంతో నమ్మాలి. ఇదే ఇస్లాం అంటే.
మానవమూర్తి ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు; నిశ్చయంగా, అల్లాహ్ నాకు ప్రసాదించిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానం యొక్క ఉదాహరణ భూమిపై కురిసిన వర్షం లాంటిది. దానిలో కొంత భూ భాగం సారవంతమైనది, వర్షాన్ని తీసుకుని సమృద్ధిగా గడ్డి మరియు మూలికలను ఉత్పత్తి చేసింది.మరికొంత భూ భాగం లోతట్టు ప్రాంతం. (చెరువులు, చెలములు, మడుగులు, కుంటలు, కాలువలు, నదులు) - వంటిది. అది నీటిని నిలుపుకుంది. అల్లాహ్ దాని ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాడు. వారు దాని నీళ్లు తాగి, పొలాలకు నీళ్లు మళ్లించి మంచి పంటలు పండించారు. . ఇంకొంత భూభాగం బండరాతి నెల వంటిది. అది నీటిని నిలుపుకోలేదు, ఎలాంటి పంటను, పచ్చిక బయళ్లను ఉత్పత్తి చేయలేదు. (దాని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు). అల్లాహ్ ధర్మాన్ని అర్థం చేసుకుని,, అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన దాని నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి, మరియు ప్రయోజనం పొందలేకపోయిన వ్యక్తి ఉదాహరణ ఇది, (సహీహ్ ఇబ్ను హిబ్బాన్) మనషి నిజ దైవమైన అల్లాహ్ ను తెలుసుకోవడం అనేది. ఏమీ 'లేని' వాడు సర్వం 'కలిగి' ఉన్న వాడిని పోందడం వంటిదే! కాబట్టి ఎవరయితే ఈ సత్యాన్ని పొందుతాడో అతను తన పూర్తి అస్థిత్వంతో సహా ఓ క్రొత్త మనిషి అయిపోతాడు. అతని జీవితం ఓ కారుణ్య కడలిలో జలకాలాడుతుంది. అది ఎటువంటి పరిశోధనంటే, అది అతని మనో మస్తిష్కాలను తన అదుపులోకి తీసేసుకుంటుంది. అతనేది చూసిన, ఏది విన్నా దివ్య దృష్టితో చూస్తాడు. వింటాడు. అతని భావాలు భావనల జగత్తు ఇప్పటి వరకు అంధకారబంధురమై ఉండేది. ఇప్పడు అందులో శుభోదయ కిరణాలు ప్రసరించాయి. ఇప్పుడతని వ్యక్తిత్వం ధగధగా మెరిసిపోతోంది. పవిత్రమైన ఈ భావాల మూలంగా ఇప్పుడతను అపాంతం అల్లాహ్ వాడైపోతాడు. శ్రధ్ధ లేని అభ్యాసం,విద్య లేని వివేకం, నేర్పు లేని వికాసం, ఓర్పు లేని ఆవేశం, ఆశ లేని ఆశయం, ఇంధనం లేని వాహనం లాంటివి - అన్నీ మిళితమైతేనే వాహనమైనా, జీవితమైనా ముందుకు సాగేది. దేహం మీద మోహం, కామం (కోరిక)మీద ఆసక్తి, ధనం మీద ధ్యాస, భోగం మీద రక్తి - ఆధ్యాత్మిక ప్రమాణాలకు అడ్డంకులు. అధిగమించిన వాడు వివేకి, అనుసరించిన వాడు అవివేకి, రోగి. మానవాత్మ సాక్షి! దాన్ని తీర్చిదిద్ది పాపపుణ్యాల్ని గురించి తెలిపినవాడి సాక్షి! నిస్సందేహంగా ఆత్మప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనమవుతాడు. (అష్-షమ్స్: 7-10) సత్యం మాట్లాడే నైజం, మంచి ని కీర్తించే గళం, సహాయం చేసే తత్వం, ధర్మం ఆచరించే భక్తి, ప్రేమతో నిండిన నవ్వు -ఇవే పరిపూర్ణ జీవితానికి ప్రతీకలు అంటుంది ఇస్లాం. తత్ఫలితంగా సాటి సోదరుల పట్ల అతని ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వచ్చేస్తుంది. తోటి మానవ సోదరుల పట్ల ఇప్పుడతను ఒక దేవుని దాసుడుగా మెలుగుతాడు. ప్రజలు అహంభావం ప్రదర్శించిన చోట ఇతను అణకువను, వినమ్రతను ప్రదర్శిస్తాడు. ప్రజలు ప్రతీకార వాంఛతో పెట్రేగిపోతున్నచోట అతను మన్నింపుల వైఖరిని అవలంబిస్తాడు. ప్రజలు తమ స్వలాభాలకోసం బంధుత్వ సంబంధాలను విచ్చిన్నపరుస్తుంటే, ఇతనేమో సత్యం కొరకు సత్సంబంధాలను మెరుగుపరచుకుంటాడు. ప్రజలు దేన్నయినా ఆర్జించి సంతృప్తులైతే, ఇతను పరులకు ప్రయోజనం చేకూర్చి ఆనందిస్తాడు. ప్రజలు ప్రాపంచిక జిలుగు వెలుగుల వైపునకు ఎగబడుతుంటే ఇతను మాత్రం అగోచరమైన పారలౌకికంలో తనను లీనం చేసుకుంటూ ఉంటాడు - ప్రవక్త ద్వారా మనిషికి తెలుపబడిన పవిత్ర జీవితం ఇదే. ఎవరయితే ఈ విధంగా ఒకే దైవాన్ని అర్రదిస్తారో, ఒకే ప్రవక్తను అనుసరిస్తారో, ఒకే గ్రంథాన్ని ఆశ్రయిస్తారో, ఒకే ధర్మాన్ని ఆచరిస్తారో వారు సహజంగానే పరస్పరం సంఘఠితమవుతారు. తాము తమ కొరకు అవలంబిస్తున్న మేలును పరులకు కూడా అందించడానికి సమాయత్తమవుతారు. వారి బాహ్య జీవితం వారి అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక షైతానీ క్యారెక్టర్ (పైశాచిక గుణాలు) ఉన్న మనిషి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కోవకు చెందినవాడు ఏదయినా అవాంఛనీమయిన పరిస్థితి ఏర్పడినప్పుడల్లా నిర్లక్ష్యంగా ప్రతిస్పందిస్తాడు. అతను ద్వేషంతోనే ఎదిరిస్తాడు. కోపానికి సమాధానం కోపంతోనే ఇస్తారు. దీనికి భిన్నంగా దైవికమయిన క్యారెక్టర్ ఉన్న వాడెవడంటే, అతను దైవానికి భయపడుతూ ఉంటాడు. అతను భావావేశాలను నిగ్రహించుకుని, రాగద్వేషాలతో కూడిన మనోమయ భావాల నుంచి పైకి వచ్చి వ్యవహారం చేస్తాడు. అంతిమ దైవప్రవక్త (స) ప్రబోధించారు: నా ప్రభువు నాకేమని ఆజ్ఞాపించాడంటే నాకు దూరమైన వానితో నేను సన్నిహితం కావాలి. నాకు ఏదయినా దక్కకుండా చేసిన వాడికి నేను ఏదైనా ఇవ్వాలి. నాకు అన్యాయం చేసినవాడ్ని, నేను క్షమించాలి. (సహీహ్ అత్తర్జీబ్) ఇలాంటి ఆదేశాలు అనేకం ఉన్నాయి. వీటి ద్వారా బోధపడేదేమంటే విశ్వాసి (మోమిన్) అయినవాడు ఎదుటివారి వైఖరిని బట్టి గాక తన స్థాయికి శోభించే విధంగా ప్రవర్తించాలి. నకారాత్మక వైఖరి ప్రదర్శించ బడినప్పుడల్లా అతను, సకారాత్మకంగా ప్రతిన్పందిచాలి. ప్రజల మధ్య కలసిమెలసి జీవిస్తున్నప్పుడు అవాంఛనీయమయిన సంఘటనలనేకం ఎదురవుతుంటాయి. తాత్కాలికంగా మనిషిలో వ్యతిరేఖ భావాలు జనిస్తుంటాయి. అటువంటి సమయ సందర్భాలొచ్చినప్పుడల్లా మోమిని (విశ్వాసి) వ్యతిరేఖభావాలు లోలోనే దిగమ్రింగి. తనకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎదుటవారి యెదల ఉత్తమ రీతిలో మెలగాలి. ఇస్లాం మానవాళికి నిర్దేశించిన నైతికతలో విరిగిన హృదయాలను బాగుచేయడం మరియు ప్రజల మనో భావాలను పరిగణనలోకి తీసుకోవడం అనే నీతి ఒకటి. ఇది అత్యున్నత ఇస్లామీయ నైతికత మంచి మర్యాద. అల్లాహ్ నామాలలో అల్-జబ్బార్ (జోడించేవాడు) ఒకటి. ఆయన హృదయ పగుళ్లను, గాయ పడిన మనసులను బాగుచేసేవాడు. జబర్ అన్న పదానికి ఒక అర్థం కట్టు కట్టడం అని ఉంది. అంటే, పేదలను సంపన్నులను చేసేవాడు, అవసరమైన వారికి ప్రతి కష్టాన్ని సులభతరం చేసేవాడు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) వారిలో ఈ లక్షణం మెండుగా ఉండేది. మన సజ్జన పూర్వీకులు సయితం ఈ గుణాన్ని పుణికిపుచ్చుకున్న. అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని; తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో (చిరునవ్వు మోముతో) మంచిమాటలు పలకాలని; ప్రార్థనా వ్యవస్థ (నమాజ్‌) స్థాపించాలని; (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లిస్తూ ఉండా లని మేము ఇస్రాయీల్‌ సంతతి చేత ప్రమాణం చేయించాం. (అల్-బఖరహ్ : 83) సుదీర్ఘ వాదనలు కంటే చిన్నపాటి సర్దుబాటే పరిష్కారం, చిటపటల మాటలకంటే మందస్మిత మౌనమే సమాధానం, అరచి చేసే సహాయం కంటే అక్కున చేర్చుకొనే ఆదరణే ముఖ్యం - జ్ఞానం తో కూడిన అహం కంటే చదువు లేని సంస్కారం మిన్న. మన ప్రేమలో నిజాయితీ ఉండాలి, మన స్నేహంలో నమ్మకం ఉండాలి, మన మాటలో వినయం ఉండాలి, మన నవ్వులో స్వచ్ఛత ఉండాలి, మన గుణంలో సహనం ఉండాలి. ప్రేమ ఉన్న చోట రక్షణ ఉంటుంది, రక్షణ ఉన్న చోట బంధం ఉంటుంది, బంధం ఉన్న చోట ధైర్యం ఉంటుంది,ధైర్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది - ఇవన్నీ మిళితమైన జీవితం స్వచ్ఛంగా ఉంటుంది. ఆప్యాయత ఉంటే అనురాగం విలువ తెలుస్తుంది, ఆత్మీయత ఉంటే బంధం విలువ తెలుస్తుంది, మనం అనే భావం ఉంటే మానవత్వం విలువ తెలుస్తుంది - ఇవన్నీ మిళితమై ఉంటేనే విలువైన జీవితం వికసిస్తుంది. మంచి మాట, నగుమోము సంభాషణ కూడా పుణ్యా కారమే అన్నారు ప్రవక్త (స) . కాబట్టి మన సజ్జన పూర్వీకుల హృదయాలు పవిత్రంగా ఉండేవి. వారి సదా సత్యమే పలికేవారు. వారి ఆచరణ ఆదర్శవంతంగా ఉండేది. వారు అత్యంత నీతిమంతుడైన మరియు అత్యంత భక్తిగల ప్రవక్తను అనుసరించారు. వారు ఆయన సున్నత్ ను అనుసరించారు కానీ కొత్త ఆవిష్కరణలు చేయలేదు, బిద్అత్ కి పాల్పడలేదు. ఏ నాడూ అధర్మ అడుసు తొక్కలేదు. సృష్టికర్తను ధిక్కరించే ధైర్యం, ఆయన ఆదేశాలను జవదాటే సాహసం చేయలేదు. అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుండి ప్రతి ఒక్కరూ ఖర్చు చేశారు. అహం హద్దులు మీరితే బంధాలు బలహీనమవుతాయి, ఆశ హద్దులు మీరితే అనుబంధాలు అవహేళనకు గురవుతాయి, స్వార్థం హద్దులు మీరితే రక్తసంబంధాలు రక్తసిక్తం అవుతాయి, ద్వేషం వదిలి ప్రేమ భావం పెరిగితే బంధాలు అనుబంధాలు గా మారి తరతరాలు తరించి పోతాయి అంటుంది ఇస్లాం. సానుకూల దృక్పథం లేని మేధావి సమాజానికి చేటు, సంస్కారం లేని విజ్ఞాని మేధావి వర్గానికి చేటు,విలువలు లేని వ్యక్తిత్వం నడవడికకు చేటు - ఇవన్నీ అధిగమించిన జీవితమే అసలు గ్రేటు, పదిమందికి ఆదర్శం కూడా. కోపం ఉన్న మనిషి కి ప్రేమ ఎక్కువ, ఆవేశం ఉన్న మనిషి కి ఆలోచన తక్కువ, అహం ఉన్న మనిషి కి స్వార్థం ఎక్కువ, ద్వేషం ఉన్న మనిషి కి అవగాహన తక్కువ - ఎక్కువ తక్కువ ల ప్రవర్తన లో సమానత్వం లోపిస్తుంది. ఫలితంగా మనిషి ప్రవర్తన గాడి తప్పుతుంది. అలా గాడి తప్పిన మన ప్రవర్తనను తిరిగి గాడిలో పడేలా చేసుకోవడం మనందరి విద్యుక్త ధర్మం కోపం నిజాన్ని నిర్భయంగా చూడనివ్వదు, అహం ఆత్మ పరిశీలనకు అవకాశం ఇవ్వదు, వ్యసనం ధర్మాన్ని ఆచరింప నివ్వదు, దుర్గుణాల ప్రభావం దుష్ప్రభావాలకు చేరువ చేస్తాయి, ఆధ్యాత్మిక చింతన మాత్రమే మనసును ప్రభావితం చేస్తుంది. ఆశయ సాధనకు నిబద్ధత అవసరం, ఆవేశం అదుపునకు ఆలోచన అవసరం, కలల సాకారానికి సంకల్పం అవసరం, అహం అదుపునకు సహనం అవసరం, ఆకలి తీర్చే మానవతా, తప్పును ఓర్చే క్షమ, లోపం దిద్దే నైపుణ్యం, భేదం లేని సమభావం, కల్మషం లేని చిరునవ్వు - ఇవి మూర్తీభవించిన వ్యక్తిత్వం విలువలతో కూడిన సౌభ్రాతృత్వం అంటుంది ఇస్లాం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలానే మన మనోభావాలు కూడా సాగుతాయి. బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేక పోవడమే అసలు సమస్య. మీకు చాలా వేగంగా నడిచే ఓ వాహనం ఇచ్చామనుకోండి. కానీ దాన్నెలా నడపాలో మీకు తెలీదు అనుకోండి. అప్పుడు మీరు దాన్ని నడపడం మీకు, మీ చుట్టూ వున్న వాళ్ళకి కూడా సమస్యే. ఎందుకంటే మీరు వాహనం నడిపే పద్ధతి నేర్చుకోలేదు కాబట్టి. అంతే తప్ప, లోపం ఆ యంత్రంలో లేదు. మనిషి దహర్మ్యాన్ని సరిగా పాటించడం లేదు అంటే తప్పం ధర్మంలో ఎలాంటి తప్పు లేదు. మానవ శరీరం ఓ అద్భుతమైన సాధనం. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైనది. ఈ సాధనంలో ఏ లోపం లేదు. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే మనకు సమస్యగా మారింది. ఎందుకంటే మనం దాన్ని తెలుసుకోవడానికి గానీ, నియంత్రించడానికి గానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. వైఫల్యాలను అధిగమిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తప్పులను సరిదిద్దితే పరివర్తన కలుగుతుంది, మాటల్లో నమ్మకం కుదిరితే విశ్వసనీయత పెరుగుతుంది, వీటి ఆచరణ సాధ్యం చేస్తే వ్యక్తిత్వం విలువ పెరుగుతుంది. అందం రూపంలో కాదు మనసులో ఉండాలి, మాట వెటకారంగా కాదు మృదువుగా ఉండాలి, నవ్వు వెకిలిగా కాదు వెలుగులా ఉండాలి, సంస్కారం చదువుతో రాదు ప్రవర్తనతో వస్తుంది-ప్రయత్నిస్తే ఇవన్నీ ఆచరణలో సాధ్యమే. క్రోధం వచ్చినప్పుడు దృష్టి మరల్చుకో, మోహం కలిగినప్పుడు మనసు నియంత్రించుకో, అసూయ కలిగినప్పుడు ఆత్మ విమర్శ చేసుకో, ఆనందం కలిగినప్పుడు అందరితో పంచుకో - ఇవన్నీ ఆచరణ యోగ్యమే, కానీ చిత్తశుద్ధి అవసరం అంటుంది ఇస్లాం. తమకుతాము ముస్లింలుగా ప్రకటించుకునే కొందరి పనులను బట్టిగాని, వారి ప్రవర్తనను బట్టిగాని ఇస్లాం ధర్మానికి ఆ పేరు రాలేదు. ఇస్లాం అనేది సత్యబద్ధమైన, స్పష్టమైన విశ్వాసాల, పూర్ణమైన, మహోన్నతమైన ధర్మ శాస్త్రాల, ఉన్నతమైన, సర్వాన్గ సుందరమైన నైతికతల మేలిమి కలయిక. మానవ జీవితానికి సంబంధిన సకల మేళ్లు కలిగిన సంపూర్ణ జీవన సంవిధానం. ఎవరైతే ఈ విశ్వాసాలను, నైతికతను, ధర్మశాస్త్ర అనుసరణను కలిగి ఉంటారో, వారు ముస్లింలుగా పరిగణింపబడతారు. అలాంటప్పుడు ముస్లింల ప్రవర్తనను ఇస్లామీ సిద్ధాంతాల ఆధారంగానే తీర్పు చేయాలి తప్ప, ఎవరో కౌన్ కిస్కాగాళ్ళ ప్రవర్తనను బట్టి ఇస్లాంను అంచనా వేయకూడదు. ఎవరైనా సరే, తాము ముస్లింలమని చెప్పుకుంటూ, హింసాయుత కార్య కలాపాలకు పాల్పడితే, దానికి వారే బాధ్యులు తప్ప, అటువంటి వికృత్య చేష్టలతో, హింసాయుత ప్రవృత్తితో ఇస్లాం ధర్మానికి ఏమాత్రం సంబంధంలేదు. ఆ విషయానికొస్తే ప్రపంచంలోనే - పేరులో శాంతి గల ఏకైక ధర్మం ఇస్లాం. ఆ ధర్మాన్ని ప్రపంచ మానవాళికి అనుగ్రహుంచిన అల్లాహ్ నామాల్లోని ఓ నామం సలామ్ - శాంతి ప్రదాత. ఆ మానవతా ధర్మాన్ని విశ్వ జనావళికి చేరువ చేసిన ప్రవక్త - - రహ్మతుల్ లిల్ ఆలామీన్ - విశ్వ కారుణ్యమూర్తి, ఆయనపై అవతరించిన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ పేర్లలో ఒక పేరు రహ్మహ్ - నిలువెత్తు కారుణ్యం. అది మానవాళిని ఆహ్వానించే స్వర్గవనం పేరు దారుస్సలామ్ - శాంతి నిలయం. అది మనిషి ప్రాణానికిచ్చే విలువ ఎంత అద్భుతమైనదో ఒక్కసారి చూడండి! ఈ (హత్య) కారణంగానే మేము ఇస్రాయీల్‌ సంతతివారికి ఇలా ఒక ఉత్తర్వు జారీచేశాం:“ఎవరైనా ప్రతీకార హత్య(శిక్ష)గా లేక ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే.” (ఈ ఆజ్ఞ జారీ చేసినప్పటికీ వారి పరిస్థితి మారలేదు) మా ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు అనేకమంది వారి దగ్గరకు స్పష్టమైన హితోక్తులు తీసుకొచ్చారు. అయినా వారిలో ఇప్పటికీ అత్యధికమంది ప్రపంచంలో హద్దుమీరి ప్రవర్తించేవారే ఉన్నారు. (అల్-మాయిదహ్: 32) మానవ నాగరికతకు ప్రబల శత్రువుగా పరిణమించిన ఉగ్రవాదం మరోసారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. షైతాన్ ప్రేరేపిత ముష్కర మూకల మృగోన్మాదంతో సుందర కశ్మీరం మొన్న మంగళవారం మళ్లీ నెత్తురోడింది. పన్నెండు రాష్ట్రాలకు చెందిన పదుల కొద్దీ యాత్రికులను కాల్చిచంపిన ఉగ్రవాదుల కిరాతకత్వం, వికృత మారణకాండకు దిగిన ముష్కరుల రాక్షసత్వం- యావద్దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మానవతా సంక్షోభం. ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి హృదయాలను తుపాకులు ధ్వంసం చేశాయి. తీవ్రవాదానికి మతం లేదు, భౌగోళిక సరిహద్దులు లేవు. ఎక్కడ మనిషి ప్రాణం గణాంకంగా మారిపోతుందో, అక్కడ మన మౌనం కూడా నిశ్శబ్దమైన నేరంగా మారుతుంది. జాతి గౌరవం తుపాకీ ద్వారా కాదు. దయతో, మానవత్వంతో, బాధితుల పట్ల కలిగిన స్పందనతో నిలబడుతుంది. ఇది కన్నీటిని మాటలుగా, మౌనాన్ని పోరాటంగా మార్చే కాలం’. కశ్మీర్ లోయలో ప్రగతి వనాలు విరబూయాలంటే ముందు అక్కడ శాంతి నెలకొనాలి. ఇక ఉగ్రవాద దాడులను మతకోణంలో చూడడం, విద్వేషాన్ని మరింత పెంచేలా ప్రచారం చేయడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఉన్మత్తత ఆవహించిన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి మతమూ, ప్రాంతమూ అన్న విచక్షణ ఉండదు. తమ ఉన్మాదానికి అడ్డొచ్చిన ప్రతి మనిషీ తమకు శత్రువుగానే భావిస్తాయి. ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ముష్కరులను కఠినంగా శిక్షించాలి. వైఫల్యం పునరావృతం కాకుండా తగు కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మతం పేరిట ఉగ్రవాదం విలయతాండవం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించే వారు మౌనంగా ఉండడం భావ్యం కాదు. అసహనం, అతివాదం, హింస ధర్మ విరుద్ధమైనవి, ఏ మతమూ ఆమోదించని దుష్ట వర్తనలవి. ప్రపంచం ఏవిధంగా రపొందించబడిందంటే, ఇక్కడ అనేక సార్లు మనిషి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ ప్రపంచం పరీక్షాలయం అవడంచేత ఇదంతా తప్పదు మరి. అవాంఛనీయమైన పరిస్థితుల్లో సయితం సకారాత్మకంగా ప్రతిస్పందిచే వ్యక్తి మాత్రమే స్వర్గానికి అర్హుడు. మరెవరయితే నకారాత్మ కంగా భావాలకు నిలయమయ్యాడో అతను స్వర్గంలో ప్రవేశించే అర్హతను కోల్పోయాడు. ఇంకా స్వర్గంలో ప్రవేశించే వారెలా ఉంటారంటే, వారు ఆపద సమయాలలో నిస్పృహ చెందకుండా, భేదపడకుండా ఓర్పు వహిస్తారు. సంయమనంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఎవరి వల్లనయినా తమకు బాధ కలిగినా వారిని శపించరు సరికదా దీవిస్తారు. ఎవరితోనయినా వ్యవహారం చేయవలసివస్తే న్యాయబద్ధంగా వారి హక్కు లను నిర్వర్తిస్తారు. ఎవరయినా తమను విమర్శిస్తే ఆగ్రహోదగ్రులవకుండా ప్రశాంత మనస్సుతో వింటారు. సద్విమర్శను సహృదయంతో స్వీకరిస్తారు. ఒకరిపట్ల తమకు ఎన్ని ఫిర్యాదులున్నా సరే అతని పట్ల న్యాయ దృష్టి తోనే మెలగుతారు. ఎవరితోనయినా వారు ఏదయినా వ్యవహారం చేయవలసివస్తే ఎదుటివారు వీరిని సదాచార. సంపన్నులని గుర్తించేలా మెలగుతారు. అఖరికి ఎదుటవారి కొరకు వికృత వైఖరి, వేలం వెర్రి మూలంగా తమలో ద్వేషం, ప్రతీకార భావం పెల్లుబికినప్పటికీ దాన్ని వారు దిగమ్రింగి తమ వ్యతిరేకతను శ్రేయోభిలాష రూపంలో ప్రదర్శిస్తారు. వారు ప్రాపంచిక జీవితంలో దేవుని పుష్పంలా మారి పోతారు. ఆ పువ్వు నుండి సుగంధపరిమళం వెదజల్లబడతాయి. బడాలి కూడా. వారు కలిమిలోనూ, లేమిలోనూ తమ సంపద (దైవమార్గంలో) ఖర్చు పెడతారు. కోపోద్రేకాలు దిగమింగుతారు. ఇతరుల తప్పులు క్షమిస్తారు. ఇలాంటి సద్వర్తునులనే అల్లాహ్ ప్రేమిస్తాడు. అదీగాక అల్లాహ్ తప్ప మరెవరూ పాపాలు క్షమించేవారు లేరు గనక తమవల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, లేదా మరేదైనా పాపకార్యంగాని జరిగితే వెంటనే వారుఅల్లాహ్ ను స్మరించి క్షమాపణ చెప్పుకుంటారు. అంతేగాని, తాము చేసిన దానిపై మంకుపట్టు పట్టరు. అలాంటివారికి ప్రతిఫలంగా వారి ప్రభువు నుండి మన్నింపుతో పాటు సెలయేరులు పారే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. మంచి పనులకు ఎంత మంచి ప్రతిఫలం లభిస్తుంది! (ఆల్ -ఇమ్రాన్: 134-136) లోకంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒకదానికొకటి అడ్డు తగులుతూ ఉంటాయి. కోకిల గానం కాకులకు కర్ణకఠోరంగా ఉంటుంది. హంస రూపాన్ని చూసి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి. అంతమాత్రాన కోకిలకైనా హంసకైనా పోయేదేమీ లేదు. మనమూ కువిమర్శలకు ఏమాత్రం లొంగకూడదు. సత్యాన్ని గుర్తించాలి. విజయాన్ని సాధించాలి. కర్తవ్య నిర్వహణకు కావాల్సిన శక్తిని సంపాదించుకోవాలి. సుఖశాంతులు కావాలని మనం కోరుకుంటాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మన మనోనిగ్రహం నుంచే లభిస్తాయి. ఆ మనోనిగ్రహాన్ని దివ్య ఖుర్ఆన్ మనకిస్తుంది. మాటలు, చేతలు, ఆలోచనలు, గుణం, హృదయం - వ్యక్తిత్వానికి కీలకమైన ఈ అయిదింటిని యువతరం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. అలా మంచి పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకుని సమాజానికి సేవ చేయాలన్నది, దేశాన్ని ప్రగతి పథాన నడిపించాలన్నది, దేశ రక్షణకై ధర్మ పరిరక్షణకై ప్రాణాలను సయితం తృణప్రాణంగా అర్పించేయాలన్నది మనందరి ఆశ, ఆశయం అవ్వాలి. అంతిమంగా - మనసుల్ని గెలవాలి.. మానవత్వాన్ని బతికించుకోవాలి!

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు