Sunday, August 10, 2025

బ్రతుకు విలువ తెలుసుకుంటేనే భవిష్యత్తు! The future is only possible if we know the value of life!

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు బ్రతుకు విలువ తెలుసుకుంటేనే భవిష్యత్తు! The future is only possible if we know the value of life! సత్కార్యాల్లో, దైవభక్తికి సంబం ధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాపకార్యాల్లో, హింసాదౌర్జ న్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. అల్లాహ్ కు భయపడండి. ఆయన (నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. (అల్-మాయిదహ్ : 2)
జీవితం అంటే సాధన, శోధన. జీవితం ఒక చలనం, సంచలనం. నిరంతర పురోగమనం. భవిష్యత్ లక్ష్యాల వైపుగా సాగే ఆరోహణా క్రమం. ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఓ శక్తి దాగి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే ఆధ్యాత్మిక చైతన్యం. అంతఃకరణాన్ని నిరంతరం పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష మనిషిలో సహజంగా ఉంటుంది. దానికి సత్య ప్రేరణను జత పరచాలి. ఆ ప్రేరణ ద్వారా సాధనను కొనసాగించాలి. మన అంతరంగం అనేక కల్మషాలమయం. అనంతమైన కాలుష్యాల నిలయం. మన చిత్త వృత్తులే మన ఆధ్యాత్మిక జాగృతికి అవరోధాలు.. ఆ ఆటంకాల్ని అధిగమించి, మన బలహీనతల్ని గుర్తించి, వ్యతిరేకతల్ని నిర్మూలించి ఆధ్యాత్మిక సాధనలో మమేకం కావాలి. మన చుట్టూ ఉన్న ప్రమాదం ఎంతో సౌందర్యభరితంగా ఉంటుంది. ఆ సౌందర్య జగత్తులో మనమూ భాగమే! అయితే బాహ్య సౌందర్యం కన్నా, ఆత్మ సౌందర్యం మిన్న! అంతరాత్మ వికసించనప్పుడు బాహ్య ఆడంబరాలు, ఆర్భాటాలన్నీ వృథా చర్యలే! జీవితం అంటే కార్యరంగం. మనమేంటో నిరూపించుకునే అద్భుత అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది. జీవనం, సాధన అనేవి పరస్పర ఆశ్రితాలు. జీవన మార్గంలో సాధనా సరళి సమ్మిళితం కావాలి. ఏ వ్యవహారాన్ని చేపట్టినా అది ఆధ్యాత్మిక సాధనలో భాగమేననే ఎరుకను కలిగి ఉండాలి. స్వయంకృషి, ఎవరిని వారు ఉద్దరించుకోవాలనే తపన, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అభీష్టం మనిషిని కార్యక్షేత్రంలో శక్తిమంతుణ్ని చేస్తాయి. ఏ పనీ చేయకుండా కేవలం ధ్యానంలోనే కాలం గడిపితే పురోగతి అసాధ్యం. నిరంతరం చింతనలోనే ఉంటే చింతలు తీరవు. దుర్గుణాల్ని విడనాడి, సత్కర్మల్ని చేపడుతూ అల్లాహ్ చెయ్యమ్మన్న ప్రతి మంచి దైవ ఆదేశంగా భావిస్తూ ఉంటే ఉత్తమ ఫలితాలు మనల్ని స్వాగతిస్తాయి! మనోవికాసం, వివేకం, సంయమనం, ఉత్తమ గుణ పరంపరతో జీవన ప్రస్థానాన్ని కొనసాగించాలి. సామాజిక సంస్కరణ అనే బృహత్తర లక్ష్యం మన మనో సంస్కరణ నుంచే ఆరంభమవుతుందనే మౌలిక సూత్రాన్ని ప్రతి వ్యక్తీ గుర్తించాలి. ఆహారం - ఆహార్యం అన్నం వల్లే జీవులు మనగలుగుతున్నాయి. అన్నం అంటే కేవలం రోజూ మనం తినే ఆహారమే కాదు. తాగే నీరు, పీల్చే గాలి, వినే శబ్దం. కనే దృశ్యం అన్నీ అన్నం కిందికే వస్తాయి. పంచ భూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు అన్నీ అన్నానికి అనుబంధాలు. మనిషి తినే ఆహారంపై అతడి జీవితం ఆధారపడి ఉంటుంది. జీవించడానికి అవసరమైనంత ఆహారమే తినాలి. తినడానికే జీవితాన్ని కుదువపెట్టకూడదు. అస్తిత్వాన్ని నిలుపుకోడానికి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి, ఔన్నత్యం పొందడానికి, హితకరమైన ఆహారాన్ని మితంగా స్వీకరించమంటారు నిపుణులు. ఆరోగ్యమైన శరీరం, మనసు.. ఆహార విహారాల పైనే ఆధారపడి ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి మంచి పనులను చేయిస్తాయి. తప్పుడు ఆలోచనలు హింసకు పురి గొలుపుతాయి. మనసు ఆలోచనల కర్మాగారం. యదార్ధాన్ని గ్రహించి, అసత్యాన్ని, అధర్మాన్ని, వ్యర్థ పదార్థాల్లా బయటికి పంపించాలి.నీతిలేని మనిషికి శాంతి ఉండదు. అలాంటి జీవితానికి అర్థమే ఉండదు. దానం, వాగ్దానం దానం, వాగ్దానం... చేసే ముందు ఆలోచించి చేయాలి. కీర్తికాంక్షతో చేయకూడదు. దానం చేసిన వెంటనే మరచిపోవాలి, ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి. అప్పుడే దానానికి, వాగ్దానానికి నిజమైన విలువ. గోరంత దానం చేసి కొండంత ప్రచారం కోరుకోవడం, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం.. మంచిది కాదు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. వాగ్దానం చేసిన తరవాత ఎన్ని కష్టాలొచ్చినా వాటికి ఎదురీది ప్రాణాలొడ్డి అయినా దాన్ని నెరవేర్చాలి. “నాలుగు లక్షణాలున్నాయి. అవి గనక ఎవరిలోనయినా ఉంటే అతను పక్కా కపట విశ్వాసి అవుతాడు. ఎవరిలోనయినా వాటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్లు లెక్క – దానిని అతను విడిచిపెట్టనంత వరకూ (ఆ అవగుణం కారణంగా అతను నిందార్హుడే). అవేమంటే; 1) అతనికేదన్నా అమానతు (సొత్తు)ను అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు.2) మాట్లాడితే అబద్ధం చెబుతాడు. 3) నమ్మి ఒడంబడిక చేసుకున్నప్పుడు నమ్మక (ద్రోహం చేస్తాడు. 4) పోట్లాట జరిగినపుడు దుర్భాషకు దిగుతాడు.” (బుఖారీ, ముస్లిం) సంక్షేమ రాజ్యానికి పునాది సజ్జన సంతానమే రాజ్య, దేశ, రాష్ట్ర, ప్రాంత, జాతి సంక్షేమానికి కావాల్సింది ఉత్తమ పౌరులు వారు ఎక్కడి నుంచో రారు. మన కృషితోనే తయారవుతారు. పిల్లల బాల్యమనేది వారిదైన ప్రత్యేక వ్యక్తిత్వం, గుణగణాలు రూపుదిద్దుకునే కీలక సమయం. ఆ వయసులో వారికి విలువలు నేర్పి గొప్పగా తీర్చిదిద్దగలిగితే మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషిస్తాయి. చిన్ననాటి నుంచే మనసులో ప్రేమ సహనశీలత, మానవతా విలువలు, మంచీ చెడుల విచక్షణ పెంపొందించగలిగితే పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారు. బిడ్డ సక్రమ పెరుగుదలకు- ఆహారం రెండు రెట్లు, తండ్రి నాలుగు చెట్లు, తల్లి ఆరు రెట్లు, గురువు ఏడు రెట్లు ప్రభావాన్ని చూపుతారని, విద్య, శీలం, వినయం లాంటి గుణాలను బాల్యంలోనే నేర్పితే వృద్ధాప్యంలో వారు దార్శకులుగా, గౌరవనీయులుగా ప్రశంసలు అందుకుంటారని పెద్దలంటారు. పిల్లలకు సహనం ఇతరులతో కలిసి మెలసి జీవించడమనే విలువలను నేర్పాలి. అప్పుడే సంఘం పట్ల ప్రేమతో, బాధ్యతతో జీవించే వ్యక్తులుగా ఎదుగుతారు. ఎంత పెద్ద వృక్షమైనా చిన్న విత్తనం ముందే ఎదుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, పెద్దలు కలిసి పిల్లల్లో విలువల్ని నాటాలి. భద్రతనిచ్చే ప్రేమను పంచే తల్లితండ్రులు సంరక్షణదారులుగా ఉంటే పిల్లలు మెరుగైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల్లో ఆస్థిరత, భయం, ఒంటరితనాలను పెంచుతుంది. పెద్దలు ప్రేమతో, ఓర్పుతో, దయతో వ్యవహరిస్తే పిల్లలు మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ప్రేమతో పెరిగిన బిడ్డలే భవిష్యత్తు ప్రపంచాన్ని బాధ్యతతో తీర్చిదిద్దగలుగుతారు. పిల్లలకు త్యాగం, దానం, ధర్మం, అహింస వంటివి కచ్చితంగా నేర్పాలి. అలాగని అక్కడితో సరిపెడితే అది సరైన పెంపకం కాదు. తాను, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న సమాజం నిర్భయంగా బతకాలంటే కావాల్సిన ధైర్యం, తెగువ, అనివార్య పరిస్థితుల్లో చూపాల్సిన కఠినత్వం కూడా అవసరమే. దేశం పట్ల, దాని భద్రత పట్ల ప్రతి ఒక్కరికీ అంకితభావం ఉండేలా పిల్లల పెంపకం ఉండాలి. మన విద్యావ్యవస్థ తమ పాఠ్యాంశాల్లో, శిక్షణలో ఈ అంశాన్ని చేర్చుకోవాలి. కర్తవ్య పరాయణత తలపెట్టిన సత్కార్యాన్ని నిజాయతీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. లోకంలో ప్రతి ఒక్కరికీ చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. వ్యక్తిగా తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వామి, కన్నబిడ్డల పట్ల కొన్ని బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా మరో రకం కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది. వాటన్నిటిని మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్లని మాత్రమే విజయం వరిస్తుంది.. కర్తవ్యపాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను, విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకుపోయేవాళ్లకు దైవసహాయం తప్పక లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకూ అవసరమైన కీలక శక్తి. ధర్మానికి హాని చేయకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్లంతా తప్పక ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారితో పాటు సమాజమూ పురోగతి చెందుతుంది.కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుటపడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతా పూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపున పుట్టినవారి కనీస బాధ్యత! మన మతి ఎంతో మన గతి అంతే మనిషి బుద్ధిజీవి. విచక్షణ, విజ్ఞానంతో ప్రవర్తించే తీరు మంచి స్థాయికి చేరుస్తుంది. మహోన్నత వ్యక్తిత్వంతో సమాజాన్ని పురోగతిలో నడిపించేవారి జీవితాలు ఎప్పటికీ అనుసరణీయ మార్గాలే! ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి చేర్చేదే- 'మంచిని అనుసరించి సాధించు' అనే మూలసూత్రం. ఎవరూ ఎప్పుడూ తమను తాము తక్కువగా ఊహించుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరినీ మళ్లీ మరోరకంగా మార్చి తయారు చేయడానికి వీల్లేదు. ఎవరి బలాలూ బలహీనతలూ వారివే. ఎవరినీ మరొకరితో భర్తీ చేయలేం. మన ప్రత్యేకతతోనే, మన వ్యక్తిత్వంతోనే మనం రాణించాలి... మనకి మనంగా ప్రకాశించాలి! సూర్యుణ్ని చంద్రుణ్ని పోల్చడం తగదు. వేర్వేరు వ్యక్తులకు భిన్న సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నత విద్య లేదని, ఉన్నత స్థితిలో లేనని, డబ్బు లేదని, హోదా లేదని. చాలామంది బాధపడిపోతుంటారు. ఆ బాధ నిరర్థకం. జీవితమంటే పక్క వాళ్లని అధిగమించడం కాదు, మిమ్మల్ని మీరు అధిగమించడం. ఒక అబూ బకర్ సిద్దీఖ్, ఒక ఉమర్ ఫారూఖ్, ఒక ఉస్మాన్ గనీ, ఒక అలీ బిన్ అబీ తాలిబ్, ఒక తల్హా, ఒక జుబైర్, ఒక బిలాల్, ఒక సుహైబ్ రూమీ, ఒక సల్మాన్ ఫారసీ, ఒక హస్సాన్ బిన్ సాబిత్ , ఒక ఖాలిద్ బిన్ వలీద్ - ఇలా ఎవరికీ వారు వైవిధ్య సామర్థ్యాలు గలవారే. ఎవరికి వారు, తమ తమ సామర్థ్యాలతో పోరాడు గనుకనే చివరకు ధర్మమే గెలిచింది! పంచభూతాలు- భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి.. ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూడలేం. అలాగే సృష్టిలోని సర్వ జీవరాశులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. జీవంలేని రాయి కూడా తనలో ఒక శిల్పాన్ని దాచుకుంటుంది. అయితే సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు. కష్టమనే ఉలితో చెక్కితే.. గెలుపు శిల్పం బయటపడుతుంది! 'మనలో అపారమైన శక్తి ఉంది. అది వెలికి రావడానికి కష్టపడాలి. కన్నీళ్లు రావాలి, స్వేదం చిందాలి, కొండల్ని పిండి చేసే నమ్మకంతో ముందుకు ఉరకాలి'. శిఖర అగ్రభాగాన సత్య కేతనం ఎగురవేయాలి! సంఘం లేనిదే మనం లేము మనుషులందరూ కలిస్తేనే సమాజం. ఒకరిపై ఒకరు ఆధారపడకుండా ఎవరూ మనుగడ సాగించలేరు. గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని వృత్తులవారు కలిస్తేనే అందరి అవసరాలు తీరతాయి. ఎవరి వృత్తి వారికి గౌరవప్రదమైంది. భేదభావాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే ప్రగతిరథం పరుగెడుతుంది. విభిన్న ఆలోచనలకు మెదడు మూలం. అదే మనిషి ప్రవర్తనా తీరును నిర్దేశిస్తుంది. విద్యార్థి తన అభిరుచులకు అనుగుణంగా చదువుకుని తగిన వృత్తి వ్యాపారాలను ఎంచుకుంటాడు. ఒకరికి వ్యవసాయం ఇష్టమైతే మరొకరికి వ్యాపారం మీద ఆసక్తి కలుగుతుంది. ఒకరు ఇంజినీర్ అయితే మరొకరు వైద్యుడిగా రాణిస్తారు. ఒక్కరు నేత పనిలో ఆరితేరితే మరొకరు నిర్మాణ రంగంలో ప్రతిభ చూపుతారు. మనిషికి కావాల్సిన మౌలిక అవసరాలన్నీ అమరాలంటే వివిధ వృత్తులవారు చేతులు కలపాల్సిందే. మనిషి చుట్టూ కుటుంబ రక్షణ ఉంటుంది. అవసరమైనప్పుడు సహాయ సహకారాలందించే మిత్రులుంటారు. అందరూ కలిసినప్పుడే ఆనందం. జీవితానికి సంపూర్ణత. వేర్వేరు అభిరుచులు, అసమానతలు ఎన్ని ఉన్నా మానవులందరికీ ముక్తి మార్గం ఒక్కటే.మనందరి సృష్టికర్త, స్వామీ, పాలకుడు, పోషకుడు, సామ్రాక్షుడైన అల్లాహ్ ను ధ్యానించి ఆరాధించడమనే ఏకసూత్రంతోనే మానవజన్మకు సాఫల్యం. సృష్టితాలు కోట్లకొలది ఉన్నా సృష్టికర్త అయినా అల్లాహ్ ఒక్కడే. భక్తుల స్థాయిని అనుసరించి భగవంతుడి స్థాయి మారదు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ పదవిని అలంకరించినా. అందరూ ధర్మపథంలోనే జీవనం సాగించాలి. సత్యాన్నే పలకాలి. ధర్మ మార్గాన్నే ఎంచుకోవాలి. ఎంతటి మేధావి అయినా ధర్మం తప్పితే అల్లాహ్ అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. దైవం ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే ఎవరికయినా శిక్ష తప్పదు. కోపం కొలిమి వంటిది ఒకరి కోపం మరొకరికీ అంటుకుంటుంది. కోపం వచ్చిందంటే మాటలు అదుపు తప్పుతాయి. దాంతో సహజంగానే ఎదుటివారికీ కోపం వచ్చేస్తుంది. ఎవరో ఒకరు తగ్గి కోపాన్ని ఉపశమింప జేసుకోవాలి. సాంత్వన కలిగించే మృదువైన మాటలు ఆగ్రహ జ్వాలలను చల్లార్చే నీటి గొట్టాల్లా పనిచేస్తాయి. మమత నిండిన సరళ పలుకులే సంసారాన్ని ప్రేమ సుధాపూర్ణం చేస్తాయి. ఒక చిన్న అదుపు తప్పిన మాట వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. సమయానికి తగు మాటలాడెనే అన్నట్లుగా మెలగుతూ కోపతాపాలను త్యజిస్తే... ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. ఆత్మహత్యలు, హత్యలు లాంటి అనేక నేరాలు మౌలికంగా కోప జనితాలే. కోపాన్ని క్రమశిక్షణా సాధనంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప శిక్షించే సాధనంగా కాదు. కోపం శాశ్వతమైన అనురాగాలను, అనుబంధాలను దూరం చేస్తుంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వివరించినట్లు - మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తూ చేసినవాడు కాదు యోధుడు, ఆగ్రహం కల్గినప్పు నిగ్రహం కలిగినవాడే నిజమైన ధీరుడు, శూరుడు. అంటే, కోపాన్ని అంతరాంతరాల్లోకి పోనివ్వకుండా ప్రశాంతజీవనం గడిపేవారు ధన్యులే! కోపం ప్రమాదకరమైనది. తన కోపమే తన శత్రువు. కోపం వల్ల ముక్కు వేడి నిట్టూర్పుల కొలిమి అవుతుంది. పెదాలు వణుకుతాయి. నొసలు ముడివడుతాయి. గుండె దడదడా కొట్టుకుంటుంది. పిడికిలి బిగుసుకుంటుంది. రక్తపోటు తీవ్రమవుతుంది. మనిషి శరీరంలో ఇన్ని రకాల మార్పులకు కారణమవుతుంది కోపం. కోపిష్టిని సమాజం నిరసిస్తుంది. దూరంగా ఉంచుతుంది. అలాంటి వారికి సన్నిహితులకన్నా శత్రువులే ఎక్కువవుతారు. కోపం ఒక క్షణికోన్మాదం అంటారు మానసిక వైద్యులు. ఇళ్లల్లో, ఆఫీసుల్లో, చట్టసభల్లో... మనిషి ఎక్కడ ఉన్నా కోపం వచ్చిందంటే అది అనర్థ హేతువే కోపగించుకునేది ఇతరుల మీదే అయినా దాని ఫలితం మాత్రం మనకే చేటు చేస్తుంది. (ముహమ్మద్‌!) అల్లాహ్ అనుగ్రహం వల్లనే నీవు వారి విషయంలో ఎంతో మృదు హృదయుడవయ్యావు. నీవు కోపిష్టి, కఠిన హృదయుడవై ఉంటే వారంతా నీకు దూరమయ్యే వారు. ఒక్కడూ నీ చెంతకు చేరేవాడు కాదు. కనుక నీవు వారిని క్షమించు. వారి పొరపాట్ల కోసం (దేవుని) మన్నింపు అర్థించు. నీవు తలపెట్టే పనుల విషయంలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లాహ్ మీద భారం వెయ్యి. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్నవారినే ప్రేమిస్తాడు. (ఆల్--ఇమ్రాన్: 159)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు