Sunday, August 10, 2025

ఔలియా అల్లాహ్ ఎవరు? మనం ఆ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? / Who are the Auliya Allah? What do we need to do to reach that level?

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు ఔలియా అల్లాహ్ ఎవరు? మనం ఆ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఔలియా అల్లాహ్ ఎవరు? వినండి! అల్లాహ్ స్నేహితుల (ఔలియా అల్లాహ్)కు " భయముగానీ, దుఃఖంగానీ ఉండదు. వారు విశ్వసించిన వారై, (వెడుల విషయంలో అల్లాహ్ కు) భయపడేవారై ఉంటారు.. వారిటు ప్రపంచంలో, అటు పరలోకంలోనూ సంతోషంగా ఉంటారు. అల్లాహ్ మాటలు ఎన్నటికీ మారవు. ఇదే గొప్పవిజయం. (యూనుస్: 62-65) వలీ అనే పదం; పవిత్ర ఖురాన్‌లో వివిధ క్రియా రూపాల్లో, క్రియా నామవాచక రూపాల్లో, మరియు యాక్టివ్ పార్టిసిపుల్ మరియు పాసివ్ పార్టిసిపుల్ రూపాల్లో ప్రస్తావించబడింది వలీ అనే పదం పవిత్ర ఖురాన్‌లో రెండు వందల ముప్పై మూడు సార్లు ( దాని వివిధ రూపాల్లో పునరావృతమైంది. 'ఔలియా' అనే పదం 'వలీ' అనే పదానికి బహువచనం. అరబీ నిఘంటువులో 'వలీ' అర్థం: మిత్రుడు, సహాయకుడు, మార్గదర్శకుడు, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియా పట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఇవే కాకుండా వేరే అర్థాల్లో కూడా వలీ అన్న పదం ఖురాన్ లో వచ్చింది: వలీ - అంటే మద్దతుదారుడు మరియు మిత్రుడు, వలీ - అంటే ప్రభువు మరియు పూజించబడేవాడు. వలీ - అంటే కుమారుడు, వలీ -అంటే సహచరుడు, వలీ - అంటే విగ్రహం మరియు ప్రతిమ. వలీ - అంటే దగ్గరి బంధువు. వలీ - అంటే వారసుడు మరియు వారసత్వంలో సజాతీయుడు. విశ్వాసులు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. అవిశ్వాసులు షైతాన్‌ మార్గంలో పోరాడు తారు. కనుక మీరు (దైవమార్గంలో) షైతాన్‌ అనుచరమూకతో పోరాడండి. షైతాన్‌ పన్నే కుటిల పన్నాగాలన్నీ చాలా బలహీనమైనవని తెలుసుకోండి. (అన్-నిసా: 76) విశ్వసించినవారికి అల్లాహ్ యే సహాయకుడు, శ్రేయోభిలాషి. ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి ప్రవేశపెడ్తాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి పిశాచశక్తులే నేస్తాలు. వారిని ఈ పిశాచ శక్తులు వెలుగు నుండి తీసి చీకటిలోకి తీసికెళ్తాయి. వారే నరక వాసులు. నరకంలోనే వారు ఎల్లకాలం పడివుంటారు. (అల్-బఖరహ్: 257)
ఇస్లామీయ పరి భాషలో “ఔలియా అల్లాహ్" అర్థం: "చిత్తశుద్ధితో అల్లాహ్కు మరియు ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి విధేయత కనబరచి, చెడుల నుండి తమను కాపాడుకొని అల్లాహ్ సామీప్యం పొందెందుకు నిరంతరం పాటుపడినవారు.” అల్లాహ్ స్వయంగా తరువాతి ఆయతులో 'ఔలియా అల్లాహ్'ను నిర్వచించాడు. వారు విశ్వసించిన వారై, (వెడుల విషయంలో అల్లాహ్ కు) భయపడేవారై ఉంటారు.. (యూనుస్: 63) దీన్నిబట్టి అవగతమయ్యే దేమిటంటే దైవసామీప్యం పొందగోరేవారు నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే (వలీ అల్లాహ్ యే). కాని జనులు మాత్రం దీన్ని ఒక ప్రహసనంగా మార్చారు. మహిమలు చూపేవారే అల్లాహ్ 'ప్రియతములు' కాగలుగుతారని భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే 'వలీల'కు స్వకల్పిత మహిమలను ఆపాదించారు. అల్లాహ్ సామీప్యం పొందటానికీ -మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానయినా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే అది దైవేచ్ఛ, దైవప్రణాళిక అనుకోవాలి. అంతేగాని, అది ఆ వలీ తరఫు నుంచి జరిగింది ఏమీ కాదు. అలాగే ఒక ధర్మ నిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా ఏదన్నా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తితత్పరతను శంకించనవసరం లేదు. ఎవరి అంతర్యాల్లో ఎంత భక్తి ఉందో అల్లాహ్ కే బాగా తెలుసు. రహ్మతుల్లాహి అలైహ్ ఔలియా పేర్ల ప్రక్కనే కాదు మరణించిన ప్రతి ముస్లిం పేరు ప్రస్తావన అనంతరం - కీర్తిశేషులు అన్న వ్యవహారిగా పదంలానే- రహ్మతుల్లాహి అలైహి" అని వ్యాయడం ఆనవాయితీ. . అనగా "అల్లాహ్ శుభాశిస్సులు, కృపానుగ్రాహాలు అతనిపై సదా ఉండుగాక! ఉదాహరణకు - అహ్మద్ బతికున్నాడనుకోండి = అతని పేరు ప్రస్తావించగా తర్వాత హఫీజహుల్లాహ్ - అల్లాహ్ ఆయన్ను రక్షించుగాక! అని అంటాము. అదే అహ్మద్ మరణినిస్తే - (రహిమహుల్లాహ్ - రహ్మతుల్లాహి అలైహ్) అంటే అల్లాహ్ ఆయన్ను కరుణించుగాక! అని దీవించండం పరిపాటి. ఔలియా అల్లాహ్ గుణాలు కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: "వినండి! అల్లాహ్ స్నేహితులకు భయముగాని, దుఃఖంగానీ ఉండదు-వారు విశ్వసించినవారై (చెడుల విషయంలో) అల్లాహ్కు భయపడేవారై ఉంటారు” (సూరతు యూనుస్:62-63) అల్లాహ్ ఇలా తెలియజేసాడు: "వల్లాహు వలియ్యుల్ ముత్తఖీన్” (మరియు అల్లాహ్ దైవభీతి కలవారికి సన్నిహితుడు) ( సూరతుల్ జాసియా:19) 'భయము' భవిష్యత్తుకూ, 'దుఃఖం' గతానికీ సంబంధించినది. వారు అల్లాహ్ కు భయ పడుతూ జీవితం గడపటం వల్ల ప్రళయ దినపు భీతావహ స్థితి గురించి అంతగా భయపడవలసిన అవసరం ఉండదు. పైగా వారు తమ విశ్వాసం (ఈమాన్), భయభక్తుల (తఖ్వా) మూలంగా అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశపెట్టుకుని ఉంటారు. దైవానుగ్రహం తమపై ఉంటుందన్న భరోసా వారికి ఉంటుంది. అలాగే ఇహలోకంలో తాము వదలిపోయిన దాని గురించిగానీ, తాము జుర్రుకోలేకపోయిన సుఖాల పట్ల గానీ వారికి ఎలాంటి చీకూ చింతా ఉండదు. ఎందుకంటే ఇదంతా దైవేచ్ఛకనుగుణంగా జరిగిందన్న సంగతి వారికి బాగా తెలుసు. అందువల్ల వారి అంతర్యాలలో ఎలాంటి అసంతృప్తి, వ్యాకులత జనించదు. పైగా దైవేచ్ఛపై వారి హృదయాలు పూర్తిగా రాజీపడిపోతాయి. ప్రపంచంలో శుభవార్త అంటే సత్య కలలు లేక మరణ సమయంలో దైవదూతలు వారికి అందజేసే శుభవార్త కావచ్చు. ఖుర్ఆన్ హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢీ అవుతోంది. మరోక చోట అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఎవరయితే అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంధులతోనూ, షహీదులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు" (సూరతున్ నిసా:69) వలియుల్లాహ్ అవ్వాలంటే ఏం చేయాలి? మొదటి షరతు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వలీ యొక్క షరతులలో ప్రథమైనది - అల్లాహ్ ను , ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను మరియు అంతిమ దినాన్ని శంకు తావు లేవి విశ్వాసం కలిగి ఉండాలి. ఖుర్ఆన్: .” అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మనస్పూర్తిగా విశ్వసించి, ఇకదానిపై ఎలాంటి అనుమానానికి ఆస్కారమివ్వకుండా అల్లాహ్ మార్గంలో ధన ప్రాణాలొడ్డి పోరాడేవారే నిజమైన విశ్వాసులు. వారే సత్యవంతులు. (అల్-హుజూరాత్: 15) మీ ముఖాలు తూర్పు లేక పడమరకు తిప్పుకోవడమే పుణ్యకార్యం కాదు. అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దైవదూతలను, దేవుడు పంపిన (అంతిమ)గ్రంథాన్ని, ఆయన ప్రవక్త లను హృదయపూర్వకంగా విశ్వసించి, అల్లాహ్ మీది ప్రేమాభిమానాలతో మీకత్యంత ప్రియమైన ధనాన్ని బంధువుల కోసం, అనాథలకోసం, నిరుపేదల కోసం, బాటసారుల కోసం, సహాయార్థుల కోసం, బానిసల విముక్తి కోసం ఖర్చు చేయాలి; ప్రార్థనావ్యవస్థ నెలకొల్పాలి; జకాత్‌ చెల్లించాలి; ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి; కష్టకాలంలో, (సత్యా సత్యాల మధ్య జరిగే) పోరాటంలో సహనం వహించాలి. ఇలాంటి సత్కార్యాలు చేసే వారే సన్మార్గగాములు. వారే (దేవునిపట్ల) భయభక్తులు కలిగినవారు. (అల్-బఖరహ్: 177) రెండవ షరతు దైవప్రవక్త ముహమ్మద్ (స) అనుసరణ: ఓ ప్రవక్తా! వారికిలా చెప్పు: “మీరు నిజంగా అల్లాహ్ ను ప్రేమిస్తుంటే నన్ను అనుసరించండి; అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు; మీ పాపాలు క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడు.” చెప్పు: “అల్లాహ్ ఆజ్ఞల్ని, ప్రవక్త హితవుల్ని పాటించండి. వీటిని తిరస్కరిస్తే గుర్తుంచుకోండి, సత్యతిరస్కారుల్ని అల్లాహ్ ఎన్నటికీ ప్రేమించడు.” (ఆల్ -ఇమ్రాన్: 31-32). ఇమామ్ ఇబ్న్ తైమియా (రహ్మ) ఇలా అన్నారు: “అల్లాహ్ పై ఆయతులో స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో, అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ దైవ ప్రవక్తను అనుసరించనివాడు ఆయన స్నేహితులలో చేరలేడు. చాలా మంది తమ గురించి లేదా ఇతరులు గురించి వారు అల్లాహ్ స్నేహితులు అని భావిస్తున్నప్పటికీ, వారి క్రియా జీవితం రీత్యా వారు అల్లాహ్ స్నేహితులు కారు. . మరో సందర్భంలో ఇబ్న్ తైమియా ఇలా అన్నారు: “దైవ ప్రవక్తను మరియు ఆయన తీసుకువచ్చిన వాటిని విశ్వసించి, ఆయనను అంతర్గతంగా మరియు బాహ్యంగా అనుసరించేవాడు తప్ప మరెవరూ అల్లాహ్ స్నేహితుడు కాలేరు. అల్లాహ్ ను ప్రేమిస్తున్నానని మరియు ఆయన స్నేహితుడిని అని చెప్పుకుంటూ, ఆయనను అనుసరించనివాడు అల్లాహ్ స్నేహితులలో ఒకడు కాదు. దీని భిన్నంగా ఆయనను వ్యతిరేకించేవాడు అల్లాహ్ శత్రువులలో ఒకడు మరియు షైతాన్ స్నేహితుడు.” - ఖుర్ఆన్ లో ఇలా ఉంది; "ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో అల్లాహ్కు భయపడుతూ ఆయన (శిక్షల) నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు” (సూరతున్ నూర్:52) మూడవ షరతు: అల్లాహ్ యెడల నిజమైన భయం, భక్తి: ప్రతిష్ఠాలయానికి న్యాయసమ్మతమైన ధర్మకర్తలు దైవభీతి పరాయణులే - తఖ్వాపరులే అవుతారు. కాని చాలామంది ఈవిషయాన్ని ఎరగరు. (అల్లాహ్ ను నమ్మని, తఖ్వా లేని వారు) ప్రార్థనాలయంలో ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం మినహా వారు చేసే ప్రార్థన మరేముంది? “కనుక మీ సత్యతిరస్కారానికి ప్రతిఫలంగా (మా)శిక్ష చవిచూడండి.” (అల్-అన్ఫాల్: 34-35) అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవనీయుడు. అల్లాహ్ సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (అల్-హుజూరాత్: 13) అల్-సఫారీనీ ఇలా అన్నారు: పండితుల అభిప్రాయం మేరకు - వలీకి నాలుగు షరతులు వర్తిస్తాయి: మొదటిది: అతను సృష్టి మరియు సృష్టికర్త మధ్య వ్యత్యాసాన్ని, సత్య ప్రవక్త మరియు ప్రవక్త అని చెప్పుకునే అసత్యవాదికి మధ్య తేడాను గుర్తించదానికి అవసరమైన ధర్మ ప్రాథమిక విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. రెండవది: అతను షరీఅత్ నియమాల గురించి జ్ఞాన పరంగా మరియు అవగాహన పరంగా మంచి నిష్ణాతుడైన పండితుడై ఉండాలి. మూడవది: సద్వర్తనుఁడై ఉండాలి. అంటే , షరీఅత్ మరియు మనిషి మేధ సూచించిన ప్రశంసనీయమైన నైతికత విలువలనను కలిగి ఉండాలి. అలాగేనిషేధించబడిన మరియు అల్లాహ్ ఇష్టపడని వాటికి దూరంగా ఉండాలి, దైవ ఆదేశాలను పాటించడం, ఆచరించడంలో నిజాయితీగా ఉండాలి. అతని అనుసరణ మరియు అనుకరణ సత్యబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. నాల్గవది: అల్లాహ్ భీతి, భక్తి మరియు స్వీయ పరిశీలన నిత్యం అతనిలో ఉండాలి. తానూ తనని మహాత్మునిగా కాకుండా అల్పునిగా భావించాలి. సృష్టిని, సాటి ప్రజల్ని దయతో చూడాలి, సదా వారి మేలును కోరుకోవాలి. ధర్మ సౌందర్యాన్ని స్వతహాగా తానూ గ్రహించడమే కాక, వాటి ప్రచారానికి, ప్రసారానికి అవిరళంగా పరిశ్రమించాలి. స్వీయ లోపాలు మరియు బలహీనతలను తెలుసుకొని వాటిని బలాలుగా మలచుకోవాలి. గతాన్ని ఒక పాఠంగా, వర్తమానాన్ని ఒక అవకాశంగా, భవిష్యత్తుని ఒక లక్ష్యం చేసుకొని ఎపుడు ఏం జరుగుతుందోనన్న కాసింత ఆందోళన కూడా అతనిలో ఉండాలి. ఎవరయినా వలియుల్లాహ్ అవ్వడానికి రెండు మూల సూత్రాలున్నాయి. 1) ఈమాన్ 2) తఖ్వా. ముక్తసరిగా చెప్పుకోవాలంటే, హదీస్ జిబ్రయీల్ లో పేర్కొనబడిన మూడు ధర్మ శ్రేణులు. 1) ఇస్లాం. 2) ఈమాన్. 3) ఇహ్సాన్. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: “మేము ఒక రోజు దైవ ప్రవక్త సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి సమావేశంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తల వెంట్రుకలు మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట (యొక్క ఆనవాళ్ళు) కనబడట్లేదు. పైగా మాలో ఎవరూ అతనిని ఎరుగరు కూడ. చివరికి అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, ఆయన చేతులు తొడలపై పెట్టుకొని కూర్చున్నాడు. ఇంకా ఇలా అడిగాడు. ఓ ముహమ్మద్…! (సల్లల్లాహు అలైహి వసల్లం ) ఇస్లాం గురించి తెలుపండి?.దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ” ఇస్లాం అంటే నీవు అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం ) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిస్తూ నమాజు స్థాపించాలి, ‘జకాత్’ (ధర్మదానం) చెల్లించాలి, పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాలు పాటించాలి, స్థోమత కల్గివున్నప్పుడు ‘హజ్’ పవిత్ర కాబా (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే..’ అన్నాడు. అతని వాక్యాలకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తున్నాడు. తనే దుృవీకరిస్తున్నాడు. ఆ వ్యక్తి మరలా ‘ఈమాన్‘ గురించి తెల్పండి? అని ప్రశ్నించాడు. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు అల్లాహ్ ను ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మేలైనా చెడైనా) ను విశ్వసించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి ‘అవును మీరు చెప్పింది నిజమే..’ అన్నాడు. ఆ వ్యక్తి మరలా ‘ఇహ్ సాన్‘ గురించి తెల్పండి? అని ప్రశ్నించాడు. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు పరిపూర్ణ మనస్సుతో అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆరాధించు.. ఒకవేళ నీవు ఆయనను చూడక పోయినా ఆయన నిన్ను గమనిస్తూన్నాడని గ్రహించు”. ఆ వ్యక్తి మరలా ‘అయితే ప్రళయం గురించి (ఎప్పుడు వస్తుంది) తెల్పండి.? అని ప్రశ్నించాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “( ప్రళయం ఎప్పుడు వస్తుందనేది) ప్రశ్నించబడే వారికి ప్రశ్నించే వారికంటే ఎక్కువ ఏమి తెలియదు. ఆ వ్యక్తి మరలా ‘అయితే దాని చిహ్నాలను తెల్పండి ? అని అన్నాడు.. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ” బానిసరాలు తన యజమానిని కంటుంది, చెప్పులు, వస్త్రాలు కూడా లేని (మేకల) కాపరులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు : (ఈ సంభాషణ తరువాత) ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను కాసేపు (అక్కడే వున్నాను. అప్పుడు దైవ ప్రవక్త (స) నాతో ఇలా చెప్పారు: ఓ ఓ ఉమర్..! ఆ ప్రశ్నికుడు ఎవరో తెలుసా..? ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత), మీ ధర్మాన్ని మీకు బోధించటానికి మీ వద్దకు వచ్చారు” అని సెలవిచ్చారు. (ముస్లిం) ఔలియాల కరామతులు: మొజిజా అనేది అల్లాహ్ తన ప్రవక్తలకు మద్దతు ఇచ్చే నిమిత్తం మరియు వారు ప్రజలను సవాలు చేసే నిమిత్తం అనుగ్రహించబడే అసాధారణ, అనితర సాధ్య సంకేతం, మహిమ. కరామత్ విషయానికొస్తే, అది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన సుభక్తులలో ఒకరి ద్వారా చేయిపించే అసాధారణమైన మహిమ, మొజిజా మరియు కరామత్ మధ్య చాలా చాల వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు - * మొజిజా ప్రకటన మరియు ప్రచారం మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రదర్శించే ప్రవక్తకు దాన్ని బాహాటంగా ప్రకటించాలన్న ఆదేశం ఆల్లాహ్ తరఫు నుంచి ఉంటుంది. కరామత్ విషయం అలా కాదు. దాని సదరు (వలీ) వ్యక్తి దాచాలి, రహస్యంగా ఉంచాలి. ఆ కరామత్ ను దాచాలన్న ఆదేశం ఆ వలీకి ఉంటుంది. * మొజిజా ప్రయోజనం, ఫలం ఇతరులకు కలుగుతుంది. కరామత్ అధికశాతం ఆ వ్యక్తి వరకు పరిమితమయి ఉంటుంది. * మొజిజా సృష్టికి అతీతంగా ఉంటుంది. కరామత్ కొన్ని సార్లు మాత్రమే అలా ఉంటుంది. * తాము దైవ ప్రవకట్లని బహుదేవతారాధకులకు నిరూపించడానికి ప్రవక్తలు మొజిజాను ఉపయోగిస్తారు. ఎందుకంటే వారి హృదయాలు కఠినంగా ఉంటాయి గనక. కరామత్ - సదరు వలీ మనసు స్థిమిత పడటానికి, విశ్వాసం బలపడటానికి, ఆందోళన దూరమవ్వడానికి ఉద్దేశించబడినదయి ఉంటుంది. * ఇక కొన్ని సృష్టికి అతీతంగా ఉండే అంశాలు, భిన్నంగా ఉండే విషయాలు కొందరు అవిశ్వాసులు, పాపాత్ముల చే మీద కూడా జరుగుతాయి . వాటిని ఇస్తిద్రాజ్ అంటారు. అంటే, వారిని శిక్షించే ముందు అల్లాహ్ వారికి ఇచ్చే ఒకవిధమయినటువంటి గడువు. కరామత్ అంటే: 'గొప్ప సన్మానం' మరియు ఒక వ్యక్తికి అతని ఉత్తమ జీవితం వల్ల బహుమానంగా సన్మానించడాన్ని 'అల్కరామహ్' అంటారు. హజ్రత్ ఇమామ్ అబ్దుల్ ఖాదిర్ జీలాని (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలియజేశారు: “వలీ కావడానికి ఒక ముఖ్యమైన షరతు ఏమంటే? అతను తన అద్భుతాలను బహిర్గతం చేయకపోవడమే” (గున్నియతుత్ తాలిబీన్ 2/163). ఇస్లామీయ పరిభాషలో కరామత్ అంటే: ఒక అద్భుతమైన కార్యం ఒక పుణ్యాత్ముడి ద్వారా జరిగితే దానిని "కరామతుల్ ఔలియా" అంటారు. పుణ్యాత్ముల జీవిత కాలంలో జరిగే అద్భుతాలు విశ్వసించదగినవి. కనుక వారితో మన కొసం అల్లాహ్ ను ప్రార్థించాలని కోరడం ధర్మం, కాని ఔలియాల మరణానంతరం వారి సమాధుల వద్దకు పోయి మొరపెట్టుకోవడం, మొక్కుబడులు చెల్లించడం వంటి కార్యాలు ధర్మం కావు. 'కరామతుల్ ఔలియా ఇస్లాం సహజ జీవన అనుగుణంగా ధర్మానికి పటిష్టవంతం చేయడానికి కొందరు పుణ్యాత్ముల ద్వారా అనుకోకుండా 'కరామత్లు' జరుగుతాయి. మరియు అల్లాహ్ తలుచుకున్నపుడే ' కరామత్'ను పుణ్యాత్ములకు అనుగ్రహిస్తాడు. పుణ్యాత్ములు తలుచుకున్నప్పుడెల్లా 'కరామత్లను బహిర్గతం చేయలేరు. వారికి ఆ శక్తి లేదు, ఉండదు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: విశ్వప్రభువు అయినా అల్లాహ్ తలచనంత వరకూ మీరు ఏది కోరుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. (అత్-తక్వీర్: 29) పైన ఇవ్వబడిన 'ఔలియా అల్లాహ్' గుణాలకు అనుగుణంగా జీవితాలను గడిపే ప్రతి ఒక్కరిని 'ఔలియా అల్లాహ్' అని నమ్మవచ్చు. ఆ పుణ్యాత్ముల ద్వారా జరిగిన 'కరామత్ల' (అద్భుతాల) ను నమ్మాలి. ఒక స్వచ్ఛమైన ముస్లింగా మనం ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా రూఢి కాబడిన - కరామత్ లను అద్భుతాలను యధాతథంగా విశ్యసిస్తాము. ఉదాహరణకు: హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం), మర్యం (అలైహస్సలామ్), మరియు కహఫ్' వారి అద్భుతాల ఆధారాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. మరియు ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) గారు బనీ ఇస్రాయీల్ జాతిలో మరియు ఇతర జాతులలో కొన్ని అద్భుతాలు జరిగినట్లు తెలియజేసిన పలు విషయాలు హదీసు గ్రంథాలలో స్పష్టంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం విశ్వసిస్తాము. ఆ తరువాత సహాబాల ద్వారా మరియు తాబయీన్ల ద్వారా జరిగిన అద్భుతాలు ప్రామాణికమైన చరిత్ర ఉంటే వాటిని విశ్వసిస్తాము, మరియు ప్రళయం వరకూ పుణ్యాత్ముల ద్వారా వెలువడే కరామత్ - అద్భుతాల పట్ల నిజమైన ఆధారం ఉంటే, వాటిని కూడా నమ్ముతాము. మాహాత్ములకు మరణం లేదా? (భూమండలంపై ఉన్నవారంతా నశించి పోవలసినవారే- ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే) (సూరతుర్ రహ్మాన్:26-27) కొంత మంది ప్రజలు ప్రవక్తలకు, పుణ్యాత్ములకు మరియు షహీదులకు మరణం లేదు వారు తమ సమాధులలో సజీవంగా ఉంటారనీ భావిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చనిపోలేదని నమ్మేవారు కూడా చాలా వరకు ఉన్నారు. కాని వారి గురించి అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచిపోయారు. ఏమీ? ఒక వేళ అతను మరణిస్తే, లేక హత్య చేయబడితే, మీరు వెనుకంజవేసి మరలిపోతారా? మరియు వెనుకంజవేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతఫలాన్ని ప్రసాదిస్తాడు" (సూరతు ఆల ఇమ్రాన్: 144) మరొక చోట అల్లాహ్ ఇలా తెలియజేసాడు: (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా, వారు కూడా మరణిస్తారు. ఆ తరువాత నిశ్చయంగా పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో, మీ వివాదాలను విన్నవించుకుంటారు.” (సూరతుజ్ జుమర్:30–31) ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక దైవ ప్రవక్త మాత్రమే. అంటే దైవదౌత్యం మూలంగా ఆయనకు ఈ లోకంలో విశిష్ఠత ప్రాప్తించింది. అంతమాత్రాన ఆయన మానవ సహజమైన విషయాలకు అతీతులు కారు. కనుక ఆయనకు మరణం కూడా ఏనాటికైనా అసంభవమైన విషయమేమీ కాదు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన రోజు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్డు) ఇలా అన్నారు: "ఎవరైతే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఆరాధిస్తారో, వారు ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) గతించిపోయారని తెలుసుకోవాలి. కాని ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తారో, ఆయన నిత్యుడు, సజీవుడు అని తెలుసుకోవాలి” (బుఖారీ) గమనిక: ప్రవక్త ఈసా (అలైహిస్సలామ్) ప్రళయానికి దగ్గరలో ఆకాశం నుండి దిగివచ్చి ఈ భూలోకంలో కొన్ని సంవత్సరాలు ఉండి సహజ మరణం పొందుతారు అని ప్రామాణిక హదీసు ద్వారా తెలుస్తుంది. పుణ్యాత్ములు మరియు షహీదులు: కొంత మంది ప్రజలు పుణ్యాత్ములకు మరియు షహీదులకు మరణం లేదు. వారు తమ సమాధులలో సజీవంగా ఉంటారనీ భావిస్తారు. మరియు అనేక మంది సామాధి చేయబడిన పుణ్యాత్ములు మన మాటలను మరియు మన దుఆలను వింటారు, మన కష్టాలను దూరం చేస్తారు, మనం వారిని వేడుకుంటే వారు అల్లాహ్ వద్ద మనకోసం వారు సిఫారసు చేస్తారనే విశ్వాసాలకు గురికాబడి, ఆ సమాధుల వద్దకు పోయి, అనేక విధాలుగా వారిని ఆరాధిస్తారు. తమ విశ్వాసాలకు ఆధారంగా ఖుర్ఆన్ నుండి కొన్ని ఆయతులను చూపుతారు: "అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.” (సూరతుల్ బఖరా: 154) మరొక చోట ఇలా ఉంది: "అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు జీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం. ఇవ్వబడుతుంది" (ఆల ఇమ్రాన్:169) అల్లాహ్ మార్గంలో అమరగతి నొందిన వారిని మృతులని అనకూడదు. ఎందుకంటే వారి గౌరవార్థం ఇలాంటి మాటలు అనరాదన్న మాట! ఈ సమాధి జీవితాన్ని "బర్జఖ్ జీవితం" అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఈ జీవితం వివిధ స్థాయిల్లో ప్రవక్తలకు, విశ్వాసులకు చివరికి అవిశ్వాసులకు కూడా ఇవ్వబడుతుంది. అమరగతుని ఆత్మ - కొన్ని ఉల్లేఖనాల ప్రకారం విశ్వాసి ఆత్మ కూడా ఒక పక్షి రూపంలో ఉండి స్వర్గంలో తాను కోరినచోట విహరిస్తూ ఉంటుంది. (ఇబ్నే కసీర్, తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ తెలుగు: 105) మరి ఆ జీవితాన్ని స్థూలంగా ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రశ్న. సమాధులలోకి వారి ఆత్మలు తిరిగి పంపబడతాయనీ, దైవానుగ్రహాలను ఆస్వాదిస్తూ వారు అందులో హాయిగా ఉంటారని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. స్వర్గంలో పండ్లు ఫలాల సువాసనను. పీల్చుతూ వారు సుఖంగా, సంతృప్తికరంగా ఉంటారని మరి కొందరు వ్యాఖ్యానించారు. అయితే హదీసు ద్వారా మూడో విషయం కూడా తెలియవస్తుంది. అదేమిటంటే వారి ఆత్మలు పచ్చని పక్షుల ఉదరాల్లోకి ప్రవేశపెట్ట బడతాయి. అవి స్వర్గంలో తింటూ త్రాగుతూ, అందలి అనుగ్రహాలను తనివితీరా ఆస్వాదిస్తూ ఉంటాయి. (ఫతుల్ ఖదీర్ - నహీహ్ ముస్లిం, తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ తెలుగు: 314) పైన ఇవ్వబడిన రెండు ఆయతులలో కూడా అల్లాహ్ తెలియజేసిన విషయం ఏమనగా? పుణ్యాత్ముల స్వర్గ జీవిత వాస్తవికత గురించి మరియు వారు పొందే అనుగ్రహాల వాస్తవికత గురించి మాత్రమే. కాని వారు మన మాటలు లేక మన మొరలు, మన దుఆలు వింటారు, మా కొరకై అల్లాహ్ యందు దుఆలు లేక సిఫారసు చేస్తారనే విషయం పూర్తి అవాస్తవం. పైగా వారి జీవితం పరలోక జీవితం. భూలోక జీవితానికి సంబంధించినది కానే కాదు. ఆ జీవితాన్నే 'బర్జఖ్ జీవితం' అంటారు. ప్రవక్త ముహమ్మద్ (స) పై 'దరూద్ దుఆ’ చదవడం ప్రతి ముస్లింపై ఉన్న ప్రాధిమిక హక్కు: అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా ఆదేశించాడు: "నిశ్చయంగా అల్లాహ్ ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి 'సలాములు' పంపుతూ ఉండండి.” (సూరతుల్ అహ్జాబ్:56) అల్లాహ్ మరియు దైవదూతలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉన్నత సోపానాల కోసం ప్రార్థిస్తున్నారు. కాబట్టి భూవాసులు కూడా ఆయన కోసం ప్రార్థిస్తూ ఉండాలనీ, ఆయనకు 'సలాం' పంపిస్తూ ఉండాలని అల్లాహ్ ఆదేశించాడు. ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: "జుమా రోజు నాపై అత్యధికముగా 'దరూద్ దుఆ' చదవండి. మీ దరూద్ నావద్దకు చేర్పబడుతుంది." (అబూదావూద్, ఇబ్నుమాజా) సహీహ్ బుఖారీలో ఒక హదీసు ఇలా ఉంది: "దైవప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వ సల్లం) 'సలాం' పంపే పద్ధతి మాకు తెలిసిందే (అంటే అత్తహియ్యాత్ పఠించే సమయంలో 'అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు....' అని చదువుతాము. కాని మేము 'దరూద్' ఎలా పంపేది?" అని ప్రియ సహచరులు (రదియల్లాహు అన్తుం) సందేహపడగా, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజాలో పఠించే 'దరూదే ఇబ్రాహీం'ను నేర్పారు.” మరియు హదీసు గ్రంథాలలో క్లుప్తమైన పదాలు కూడా ఉన్నాయి, అవి: “సల్లల్లాహు అలా రసూలిల్లాహి వసల్లం" మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం ప్రతి అజాన్ పలుకుల తరువాత 'దరూద్ దుఆ' తో సహా 'వసీలా దుఆును చదవుతాము. "ఎవరైతే ఆ దుఆను ప్రతి ఆజాన్ తరువాత చదువుతారో వారి కొరకు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయ దినాన సిఫారసు చేస్తారు.” (బుఖారీ:579) కాని "అస్సలాతు వస్సలాము అలైక యా రసూలల్లాహ్” అని ప్రవక్త (నల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా వింటున్నారు, ఆయన బ్రతికే ఉన్నారు, మన సభలలో, సమావేశాలలో ప్రత్యేక్షమవుతారు అనే నమ్మకంతో పంపే సలాము గానీ, అలాగే మార్కెట్ లో దొరికే రూఢి కానీ దరూద్ ధర్మసమ్మతం కాదు. పుణ్యాత్ముల మరణానంతరం వారి ఉన్నత స్థానాల కొరకు దుఆ చేయడం ధర్మం: మనం సహాబాల పట్ల మరియు తాబయీన్ల పట్ల, పుణ్యాత్ముల పట్ల మరియు అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి ఉన్న ముస్లిములందరికి ఉన్నత స్థాయిని ప్రసాదించమని ప్రార్థనలు చేస్తూ ఉండాలి. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: వారు ఇలా వేడుకుంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మా కంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణాప్రదాతవు.” (సూరతుల్ హష్:10). పుణ్యాత్ముల కొరకు అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదించాలని మనం ప్రార్ధించాలి. కాని ప్రవక్తలను లేక పుణ్యాత్ములను మొరపెట్టుకోవడం, వారు మన నష్టాలలో, కష్టాలలో ఆదుకుంటారనే షిర్క్ మరియు బిర్అత్ విశ్వాసాలు 'అహ్లుసున్నత్ వల్ జమాఅత్'కు సంబంధించినవి కానే కావు.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు