Sunday, August 10, 2025

శుభస్య శీఘ్రం (మంచి చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి) / Good luck, do it quickly (if you want to do good, do it quickly)

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు శుభస్య శీఘ్రం (మంచి చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి)
విశ్వాసులారా! మీ సంతానం, సిరిసంపదలు మిమ్మల్ని దైవధ్యానం నుండి మర పింపజేయకూడదు. అలా చేసేవారే నష్టపోయేవారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి (మామార్గంలో) ఖర్చుపెట్టండి. మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమయి “ప్రభూ! నాకు మరికొంత గడువియ్యలేదే? ఇస్తే నేను దానధర్మాలు చేసి సజ్జనుల్లో చేరిపోతాను కదా?” అని అతను అనవచ్చు. అలాంటి దుస్థితి దాపురించక ముందే ఈ సత్కార్యం చేయండి. ఎవరికైనా ఆచరణగడువు ముగిసే సమయం వస్తే, ఇక అతనికి దేవుడు ఏమాత్రం అవకాశం ఇవ్వడు. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. (అల్-మునాఫిఖూన్: 9-11) ఏదైనా గడిచిపోయిన, జరిగిపోయిన, జారిపోయిన, కోల్పోయిన తరవాత ఏమనుకున్నా, ఏం చేసినా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పరిస్థితినే 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. అలాంటి పరిస్థితిలో పరిష్కారం కోసం వెతికేకన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డబ్బో వస్తువో కోల్పోతే ఏదోలా సంపాదించుకోగలం. కానీ గయా కల్ ఫిర్ ఆతా నహీ - మహత్తర సమయాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదైనా అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. మరో మారు వస్తుందో లేదో మనలో ఎవరికీ తెలీదు. రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మనిషికీ తెలియదు. అలాగే తనకు ఏ భూభాగంలో మృత్యువు కాటువేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. సమస్త విషయాలు దేవునికి మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సమస్తం ఎరిగినవాడు. (లుఖ్_మాన్: 34) అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని పైకెదగాలి. ఆ అవకాశం తప్పిపోయిన తరవాత దాని గురించి ఎంత వగచినా, ప్రయోజనం ఉండదు. ఆ అవకాశం వచ్చినప్పుడు తెగువ, చొరవ లాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వి నియోగం చేసుకోవాలి. కాలం ఎవరి కోసమూ ఆగదు. దాంతోపాటే మనమూ పయనిస్తూ వచ్చే మార్పులకు అనుగుణంగా నడచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోగలం. ప్రవాహం వచ్చి, చేయాల్సిన నష్టం అంతా చేసి వెళ్లిపోయాక వంతెన కట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. దీన్నే 'గతజల సేతు బంధనం' అంటారు. అలాంటి పరిస్థితి కలగకుండా ముందుగానే జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకోవాలనే బోధన ఉందీ నానుడిలో. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు-మాపు అని వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించమని చెబుతుంది 'శుభస్య శీఘ్రం' అనేమాట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొకటి. చదువుకునే వయసులో చదువు, తగిన వయసులో వివాహం.... ఇలా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగితేనే అందం.. ఆనందం. విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను స్థిరంగా ఉంచుతాడు. (ముహమ్మద్:7) ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుందన్నది అనాదిగా చెబుతున్న మాట. ధర్మం వల్లనే మనిషికి ఉత్తమ గతులు లభిస్తున్నాయని ఖుర్ఆన్, హదీసులు పేర్కొంటున్నాయి.. పరులకు కష్టం. నష్టం వాటిల్లకుండా, అల్లాహ్ వద్ద పుణ్య ఫలాపేక్షతో సత్యమార్గంలో కర్మను ఆచరించడమే ధర్మం. దీనివల్లే మనిషికి శాంతి, సౌఖ్యము, ముక్తి మార్గాలు చేరువవుతాయి. ధర్మాన్ని ఆచరించేవారన్నా, ఉపదేశించేవారన్నా, ప్రోత్సహించేవారన్నా అల్లాహ్ కు బహు ప్రీతి. వారి వెన్నంటే ఉంటాడు. మీరెక్కడున్నా ఆయన మీ వెన్నంటే ఉంటాడు. మీరు చేసే ప్రతిపనీ ఆయన చూస్తున్నాడు. ఆయనే విశ్వాసుల్ని కాపాడతాడు. ధర్మాత్ముల ప్రార్ధనలను వింటాడు. ధర్మ నాలుగు పాదాల నడయాడే లోకాలకు, లోకులకు మేలు చేస్తాడు. ఈ సందర్భంగా మనం నెత్తురోడుతున్న గాజాను మరచిపోకూడదు. … చుట్టూ శిథిలాలు.... అంతటా మృతదేహాలు... ధ్వంసం కాగా మిగిలిన ఆసుపత్రుల నేల మీద నెత్తుటి మడుగుల్లో మనుషులు... వాళ్లను కాపాడాలని కన్నీళ్లతో ప్రయాస పడుతున్న డాక్టర్లు... ఆపత్కాలంలో అందుబాటులో లేని అత్యవసర ఔషధాలు... కనీస వైద్య వసతులకూ దిక్కులేని దయనీయ పరిస్థితులు- ప్రస్తుతం గాజాలో కనిపిస్తున్న ఈ హృదయవిదారక దృశ్యాలు అక్కడి మానవతా సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాను స్థిమిత పరచగలదన్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. మొన్న మంగళవారం గాజాలోని ఎనభై ప్రదేశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో నాలుగొందలకు పైగా ప్రాణదీపాలు కొండెక్కిపోయాయి. ఆహార పదార్థాలు, తాగునీరు, నిత్యావసరాలు, మందులు, విద్యుత్ సరఫరాలను ఇజ్రాయెల్ స్తంభింపజేయడంతో ఇరవై లక్షల మంది గాజా వాసులు ఇప్పటికే నరకం చవి చూస్తున్నారు. అలాంటి ఆసహాయ వాతావరణంలో శరణార్థి శిబిరాలు, పాఠశాలలు వంటివాటిపై విరుచుకుపడిన కల్లోల జనకులుగా అపఖ్యాతికెక్కిన యూద రాబందువులు తన రాక్షసత్వాన్ని మరోసారి ప్రదర్శించాయి. తమకు చెప్పాకే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసిందన్న వైట్ హౌస్ వర్గాల ప్రకటన- హింసోన్మాద యూద మూకలకు వెన్నుదన్నుగా ఉంటోంది ఎవరో స్పష్టంగా వెల్లడిస్తోంది! స్వప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయ నాయకుడు ఆడుతున్న మృత్యుక్రీడ-మానవ నాగరికతకే మాయనిమచ్చ! ఈ అమానవీయ, దయనీయ ఘట్టాన్ని ఎవరు గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా చరిత్ర మాత్రం తప్పకుండా తన పుటల్లో భద్రపరచుకుంటుంది. ఇదే సమయంలో - స్వదేశీయ స్థితిగతుల్ని కూడా కాస్త నెమరు వేసుకోవాలి... ! చీమలకు చక్కర పాములకు పాలోసి... జీవకారుణ్యమే జీవితం అనే మనిషులే ... తోడ పుట్టిన వాళ్ళ ఉరవతలకినెట్టి .. కులమంటూ, మతమంటూ, ఇలా మీద కలహాల గిరి గీసి.. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి,,కోట్లకు పరిగెత్తి కోరికలు చెలరేగి మాయమై పోతున్నాడు మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు. ఒకటి విధ్వంశక మతమని, ఇంకొకటి విద్వాంసుల మతమని మైకెక్కి చెబుతున్న కొందరు బురదబుద్ధి ప్రబుద్ధులు వల్ల,,,, చరిత్రతో అసలు సంబంధమే లేని కొని అసత్య చిత్ర ప్రదర్శనల వల్ల ఉన్న ఆ కాసింత మానవత్వం మంటగలిసిపోతున్నది. (భవిష్యత్తులో) మీరు ధనప్రాణాల విషయంలో అనేక కఠిన పరీక్ష లకు గురికావలసి వస్తుంది. అదీగాక మీరు గ్రంథప్రజల నుండి, బహుదైవారాధకుల నుండి కూడా మనస్సు నొప్పించే మాటలు అనేకం వినవలసి వస్తుంది. కనుక అలాంటి స్థితిలో మీరు సహనం వహించి, భయభక్తులతో కూడిన జీవితం గడుపుతూ ధర్మమార్గం లో స్థిరంగా ఉండాలి. నిజంగా ఇది ఎంతో సాహసోపేతమైన కార్యం. (ఆల్- ఇమ్రాన్: 186) నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు. గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నిండు కుండ తొణకదు. ఇలాంటి ఉపమానాలెన్ని చెప్పినా మాట్లాడటం మానడు మనిషి భావ వ్యక్తీకరణకోసం అల్లాహ్ అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- ఉక్తి అంటే మాట. సృష్టిలో మరే జీవికీ అది లేదు. అందుకే దాన్ని ఆచితూచి వాడాలి. మనసులోంచి వచ్చినట్లుండాలి. మంచి మాట అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి..! . స్నేహం, వైరం, నిర్మలత్వం, కళంకం, పుణ్యం, పాపం, శాంతి, అశాంతి, మంచి, చెడు... అన్నీ మాటలనుబట్టే వస్తాయి. మాట మనసును నొప్పించనూ గలదు, ఒప్పించనూ గలదు. మన చేతలే కాదు, మాటలు కూడా ఇతరులకు బాధ కలిగించకూడదు. మహనీయ ముహమ్మద్ (స) వారి మాట మనందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. మంచి సమయం మించి పోతోంది పొద్దున్న లేద్దామనుకుంటాం కానీ లేవలేకపోతాం.. ఈ రోజు తప్పకుండా ఫలానా పనిచేయాలనుకుంటాం.. కానీ రేపు చేసేద్దాం లే.. అనుకొని వెనుకడుగు వేస్తాం. ఇలా ఒకటో రెండో విషయాల్లో కాదు, రోజువారీ అనేక అంశాల్లో పనులను వాయిదా వేసే అలవాటు చాలామందికి ఉంటుంది ఉంటుంది. ఈ విధంగా చేయడమంటే సమయాన్ని వృథా చేయడమే. ఒక విధంగా చెప్పాలంటే వాయిదాలు వేసే అలవాటు రోగంతో సమానం. అదే వాయిదాల వ్యాధి. అనేక సమస్యలకు అది కారణం అవుతుంది. నిజానికి ప్రతీ వందలో 90 మంది తమకు తెలియకుండానే వాయిదాలు వేస్తుంటారని, కానీ దీవల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువ. ముఖ్యమైన పనులు, కీలకమైన నిర్ణయాల సందర్భంలోనూ రేపు, ఎల్లుండి అనుకుంటూ కూర్చుంటే పోటీ ప్రపంచంలో, పుణ్య కార్యాల్లో పోటీ పడాల్సిన ఈ పవిత్రం మాసంలో విజయం సాధించడం కష్టం. నిశ్చయంగా తలచుకుంటే .. నిరంతర కృషీవలురు అయితే ప్రతి ఒక్కరూ ఒక సహాబీకి ప్రతిరూపంగా కాగలరు. ప్రతి ఒక్కరూ ఒక బిలాల్ (రజి) లా అవగలరు. ప్రతి మహిళా ఒక ఉమ్ముల్ మసాకీన్ - పెడల్ పెన్నిధి హజ్రత్ జైనబ్ (ర) లా అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ఒక సలీమాన్ ఫారసీ లా కాగలరు. ప్రతి ఒక్కరూ ఒక సుహాబ్ రూమీలా కాగలరు. ప్రతి ఒక్కరూ ఒక అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మ్ మక్గాతూమ్ (రజి) లా మారగలరు. ప్రతి ఒక్కరూ ఒక ఉవైస్ కర్ణీ లా జీవించగలరు. ప్రతి ఒక్కరూ ఒక ఖాలిద్ బిన్ వలీద్ లా సాధించగలరు. ఎవరైనా ఒకరు ఒకానొక గొప్ప పని చేస్తే దాని అర్థం “మిగతా అందరూ కూడా ఆ పనిని చేయగలరు” అని ..దీనినే “ఉపమాన ప్రమాణం” అంటాం ప్రతి ఒక్కరి దగ్గరా అన్ని శక్తులూ నిబిడీకృతంగా వున్నాయి .. అయితే, అవి ప్రకటితం కావడానికీ, యదార్థంగా రూపుదాల్చడానికీకావలసినవి “ఆత్మవిశ్వాసం” .. “తీవ్రవాంఛ” .. “లోకకల్యాణ ఆశయం”! అదీ మీ అందరికి ఉంది అని బలంగా నమ్ముతున్నాను. నాలో, మీలో మనందరిలో అలాటి అకుంఠిత దీక్షను అల్లాహ్ కలుగ జేయాలని, మనల్ని అజేయులుగా, పశుపతులుగా తీర్చి దిద్దాలని దీనాతి దీనంగా వేడుకుంటున్నాను. అల్లాహ్ యెడల అచంచల విశ్వాసం, ఆత్మవిశ్వాసంతోపాటు “తీవ్ర వాంఛ” అన్నది కూడా అత్యంత ముఖ్యం - ఈ రెండూ జతకూడితే అసాధ్యాలన్నీ అతి సహజంగా సుసాధ్యాలు అవుతాయి. అల్లాహ్ ప్రసన్నతతోకూడిన “లోకకల్యాణ ఆశయం” అన్నది కూడా కలిపితే జీవితం చరితార్థం అవుతుంది. “అత్యాచారం ఏదో, “శిష్టాచారం” ఏదో .. మనమందరం విధిగా తెలుసుకోవాలి... ప్రాపంచిక విద్యలన్నింటి కన్నా మౌలికమైనది .. మరి ముఖ్యమైనది .. “ఆధ్యాత్మిక విద్య”. “ఆధ్యాత్మిక విద్య” నేర్పే తోలి పాఠం తౌహీద్ ద్వారానే భిన్న సంస్కృతుల ప్రజలు, భిన్న జాతుల ప్రజలు కలిసి మెలిసి సరియైన సంఘ-జీవితాన్ని అనుభవించగలుగుతారు. “ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నదే ఆరోగ్యశాస్త్రానికి మూలం “ఆధ్యాత్మిక జీవితం” అన్నదే ఆనంద జీవితానికి సోపానం. కాబట్టి .. శ్రేయోదాయకమైన కర్మలను, మంచి పనులను, సత్కార్యాలను చేసేందుకు త్వరపడాలి” . పోటీపడేవారు దీన్ని సాధించడానికి పోటీపడాలి.(అల్-ముతఫ్ఫిఫీన్: 26) చివరికి ప్రతిమనిషీ ఓరోజు చావాల్సిందే. మీకర్మలకు ప్రళయదినాన పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. నరకానికి దూరంగా స్వర్గానికి పంపబడేవాడే నిజమైన కృతార్థుడు. ఐహిక జీవితం, (దాని సౌఖ్యాలు) ఒట్టి మోసపూరితమైన పైపై మెరుగులు మాత్రమే. (ఆల్-ఎ-ఇమ్రాన్:184-185) పుట్టిన ప్రతి ప్రాణికీ చావు తప్పదని తెలుసు. సంపద అస్థిరమని, అగ్రహం అనర్థ దాయకమని తెలుసు. ఏది మంచో ఏది చెడో తెలుసు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించడమూ తెలుసు. అదే మానవ నైజం. అన్నీ తెలుసనుకుంటున్న మనిషి తనను సృష్టించిన భగవంతుడికి ఏమీ తెలియదనుకునేంత చావు తెలివితేటలు గలవాడు!. మనిషి తాను స్వేచ్ఛా జీవిననుకుంటాడు కానీ నిజానికి సంఘజీవి- కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించుకోక తప్పదు. ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నపుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి. ఇంటి విషయాల్లో ఇతర కుటుంబసభ్యుల సలహాలకు విలువనివ్వాలి. మిత్రులతో కలసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి. తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు. కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రువులవుతారు. మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం. అలా కాకుండా దాని నియంత్రణలోకి వెళ్లిన వ్యక్తి కష్టాలపాలవుతాడు. అందుకని ఖుర్ఆన్ ఇలా హితోపదేశం చేస్తుంది. నిస్సందేహంగా ఆత్మప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనమవుతాడు. (అష్-షమ్స్:9-10) వచనం రీత్యా జ్ఞానబలంతో మనసును మంచి ఆలోచనలతో నింపుకొన్నవారు, అల్లాహ్ అనుగ్రహించిన ఆశాశ్వతమైన మానవ జీవితాన్ని సార్థకం చేసుకుని కీర్తిశేషులవుతారు. కాదు కూడదు అంటే అపకీర్తి మూటకట్టుకోక తప్పదు. భగభగమండే నరకాగ్నికి ఇంధనం కాక మానదు. మతులిని పోగొట్టే బీదరికం గురించి ఎదురు చూస్తున్నారా? లేదా మధమెక్కించే అధిక ధనం గురించి ఎదురు చూస్తున్నారా? ప్రాణాలకలన్నింటిని పాడు చేసే మహమ్మారి రోగం గురించి ఎదురు చూస్తున్నారా? ఎముకలుడిగి ఏమీ చేయలేని, ఏమి చేతకాని దయనీయ స్థాయికి నెట్టే ముసలితనం గురించి ఎదురు చూస్తున్నారా? ఏంటో ఇష్టంగా నిర్మించుకున్న ఆశల సౌధాల్ని ఒక్క కుదుపుతో నేలమట్టం చేసే మరణం గురించి ఎదురు చూస్తున్నారా? అగోచరంగా ఉన్న అతి భయంకర చెడు దజ్జాల్ ఉపద్రవం గురించి ఎదురు చూస్తున్నారా? లేదా ప్రళయం గురించి ఎదురు చూస్తున్నారా? మరి అందరి భరతం పట్టడానికి నిర్ణీతదినం ప్రళయం ఉండనే ఉంది. అప్పుడు ఒక వర్గం స్వర్గానికి, మరొక వర్గం నరకానికి పోవలసి ఉంటుంది. (అష్-షూరా: 7) ఏ విషయంలో ఎలా ఉన్నా, మంచి పనుల విషయంలో మాత్రం - ఆలస్యం అమృతం విషం!

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు