ముజాహిద్ ఖాన్ ఉమ్రీ
కడుపు నిండినా, కళ్ళు నిండవు అంటుంటారు పెద్దలు. ఇది మానవుడి బలహీనత. దేవుడు ప్రసాదించిన వాటిని కృతజ్ఞతా భావంతో చూస్తే మనసు సంతోషంతో నిండిపోతుంది. సంతోషంగా వుండాలంటే మనలోని కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవాలి.
కృతజ్ఞతా భావం:
వాస్తవ దృష్టితో ఆలోచిస్తే, దేవుడు మనపై ఎంతో మేలు చేసాడని గ్రహిస్తాము. అందుకే దివ్యఖుర్‌ఆన్ ఈ విధంగా తెలుపుతుంది: ''మీరు గనక అల్లాహ్‌ా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిజంగా మానవుడు అన్యాయపరుడు, కృతఘ్నుడు.'' (ఇబ్రాహీం:34)
కోటీశ్వరుడైన ఒక రోగగ్రస్తుని చూసి కవి గాలిబ్ ఇలా అన్నాడు:
తంగ్ దస్తీ గర్ హో గాలిబ్
తందురుస్తి హజార్ నిఅమత్ హై
(పేదరికం వున్నా బాధలేదు, ఆరోగ్యముంటే అదే పది వేలు)
సంతోషంగా వుండటానికి ప్రవక్త(స) ఒక గొప్ప ఉపాయం తెలియజేశారు. ''ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం.'' (బుఖారీ)
సాధారణంగా అసంతృప్తి వల్లే మనిషి సంతోషానికి నోచుకోకుండా పోతాడు. సైకిల్ ఉన్న కాలంలో బైకు వుంటే బావుండని, బైకు వస్తే కారుపై తిరగాలని ఆశిస్తాడు. కారు వస్తే ప్లేను ఎక్కలేదని అసంతృప్తి చెందుతాడు. ప్లేను ఎక్కాలన్న ఆశ తప్పు కాదు. కాని దేవుడు సైకిల్ దగ్గర నుండి కారు వరకు చేర్చినందుకు మనం ఎంత వరకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామో అనేది ఆలోచించాలి.
కృతజ్ఞులయి వుంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని, కృతఘ్నులయిపోతే తన శిక్ష అత్యంత కఠినంగా వుంటుందని మీ ప్రభువు మిమ్మల్ని హెచ్చరించాడు. (ఇబ్రాహీం:6,7)
అభివృద్ధి
అయితే మనిషి ఎదగకూడదా!? అభివృద్ధి లోకి రాకూడదా? కష్టపడకూడదా? అనే సందేహం రావచ్చు. ఎందుకు
ఎదగకూడదు? ప్రగతి శిఖరాలను చేరుకునే ఆశలే కాదు, పథకాలు కూడా తయారు చేయాలి, వాటిని సాధించటానికి బాగా కష్టపడాలి. అయితే న్యాయం, సత్యం, నిజాయితితో ఈ కృషిని సాగిస్తే మనిషికి భయాందోళనలు ఉండవు. సంతోషంగా తన కృషిని కొనసాగించగలడు. దాంతో పాటు దైవ కృప, సహాయం కూడా అవసరమని మనిషి నమ్ముతూ ఉండాలి.
''మా కొరకు సాధన చేసే వారికి మేము మార్గాలను చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్‌ా సజ్జనులతో పాటే ఉంటాడు''. (అన్ కబూత్: 69)
ఈ లోకంలో సుఖసంతోషాలతో పాటు పరలోకంలో సాఫల్యం కోసం దుఆ (ప్రార్థన) చేయాలి. మచ్చుకు దివ్యఖుర్‌ఆన్‌లోని ఒక ప్రార్థన ఇది:
''ప్రభూ! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరక యాతన నుండి రక్షించు'' (బఖర: 201)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు