Tuesday, March 4, 2025

కరుణకు ఆనవాలు కన్నీళ్లు

చివరికి (మానవులంతా) నీ ప్రభువు సన్నిధికే మరలిపోవలసి ఉంది. ఆయనే (మిమ్మల్ని) నవ్విస్తున్నాడు; ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే (మీ) జీవన్మరణాలకు మూలకారకుడు. ఆయనే కార్చబడే వీర్యబిందువుతో ఆడమగ జంటల్ని పుట్టిస్తున్నాడు. (ప్రళయ దినాన) పునర్జీవం ప్రసాదించడం కూడా ఆయన బాధ్యతే. ఆయనే ఐశ్వర్యం అనుగ్రహించేవాడు; ఆయనే దారిద్య్రం కల్గించేవాడు. (అన్-నజ్మ్: 42 48)
భావోద్వేగాయానికి ద్రవ రూపం కన్నీరు కన్నీళ్లు, అశ్రువులు - జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి. కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు. ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది. కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర- పెయిన్ కిల్లర్. కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా మనసులో కన్నీటి అలజడులే ఎగిసి పడుతుంటాయి. బతుకు పోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం కన్నీరు. అనంతమైన విషాద జీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది. కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం. దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది. కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు కన్నీరు. కన్నీటి రకాలు భయం మరియు ఆందోళనతో కూడిన కన్నీళ్లు, కరుణ మరియు మృదుత్వంతో కూడిన కన్నీళ్లు, ప్రేమ మరియు తపనతో కూడిన కన్నీళ్లు, సంతోషం మరియు ఉత్సాహంతో కూడిన కన్నీళ్లు, బాధ మరియు భరించ సాధ్యం కానీ నొప్పితో కూడిన కన్నీళ్లు, అవమానం, అవమానం, ఆవేదనతో కూడిన కన్నీళ్లు కూడిన కన్నీళ్లు, ఎడబాటు మరియు దుఃఖంతో కూడిన కన్నీళ్లు, బలహీనత మరియు నిస్సహాయతతో కూడిన కన్నీళ్లు, కపట కన్నీళ్లు మరియు మొసలి కన్నీళ్లు, అరువుకు తెచ్చుకున్న కన్నీళ్లు (నియాహా) - కొన్ని సందర్భాల్లో ఏడవడానికి కొందరు స్త్రీలను రోజు కూలికి తీసుకు రావడం. సమర్థనతో కూడిన కన్నీళ్లు - ఎలాంటి సంబంధం లేకపోయినా ఒకరు ఏడుస్తూ ఉండటం చూసిన ఏద్వడం. సానుభూతి మరియు ఓదార్పుతో కూడిన కన్నీళ్లు. చేతబడి జరిగి, లేదా జిన్ను సోకిన కారంగా వచ్చే కన్నీళ్లు, కంటి సమస్యల వల్ల వచ్చే కన్నీళ్లు కన్నీటి పారాయణం ఆదం సంతానంలో, నూహ్‌తో పాటు ఓడలో ఎక్కినవారి సంతతిలో, ఇబ్రాహీం సంతతిలో, ఇస్రాయీల్‌ (యాఖూబ్‌) సంతతిలో వీరు అల్లాహ్ విశేషానుగ్రహం పొందిన దైవప్రవక్తలు. మేము సన్మార్గం చూపి ప్రత్యేకంగా ఎన్నుకున్న సత్పురుషుల్లోనివారు. వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటిధారలతో (అప్రయ త్నంగా అల్లాహ్ సన్నిధిలో) సాష్టాంగ పడుతుండేవారు. సజ్దాలో పడిపోయేవారు. (మర్యమ్: 58) విశ్వాసుల ముందు ఖుర్ఆన్ పారాయణం జరిగినప్పుడు వారు దైవభీతితో కంపించిపోతారు. దైవశిక్ష ప్రస్తావన వినగానే విలపించటం మొదలు పెడతారు. కాని అవిశ్వాసులకు ఖుర్ఆన్ వినిపించినా వారిలో ఎలాంటి ప్రతిస్పందన ఉండదు. పైగా వారు ఖుర్ఆన్ పారాయణాన్ని అపహాస్యం చేస్తారు. ఆటపాటలతో దానిని నిర్లక్ష్యం చేస్తారు. దైవప్రస్తావన వినగానే భయంతో విలపించటం, ఆయన్ని కలుసుకోవాలని తాపత్రయ పడటం విశ్వాసుల లక్షణం. దివ్య ఖుర్ఆన్ను పూర్తి ఏకాగ్రతతో, అర్థం చేసుకుంటూ పారాయణం చేసినప్పుడు లేదా విన్నప్పుడు భక్తీ పారవశ్యంతో హృదయం తాదాత్మ్యం చెందుతుంది. సహజంగానే మనిషి కంటతడి పెడతాడు. ఈ లక్షణాలు మనిషిలోని విశ్వాసాన్ని, దైవం పట్ల అతనిలోవున్న భీతిభావాన్ని సూచిస్తాయి. తాము స్వయంగా ఖుర్ఆన్ పారాయణం చేయటంతో పాటు ఇతరుల ద్వారా కూడా వినటం పుణ్యప్రదం. మహాప్రవక్త ముహమ్మద్ (స) సహృదయులు, జాలి గుండె గలవారు. ఒకసారి ఆయన (స) ఇబ్నె మన్వూడ్తో "మస్వూద్! నాకు ఖుర్ఆన్ చదివి విన్పించు" అని కోరారు. దానికి ఇబ్నె మన్వూద్ (ర), 'దైవప్రవక్తా! ఖుర్ఆన్ అవతరించింది మీపైనే కదా! అలాంటప్పుడు మీకు నేను ఖుర్ఆన్ చదివి విన్పించడమేమిటి?' అని ఆశ్చర్యపోతూ అడిగారు. “నాకు ఇతరుల ద్వారా ఖుర్ఆన్ పారాయణం వినడం అంటే మిక్కిలి ఇష్టం" అని అన్నారాయన (స). ఇబ్నె మసూద్ (ర) అప్పుడు 'నిసా’ సూరా పారాయణం చేయటం మొదలెట్టారు. అలా పారాయణం చేస్తూ - "మేము ప్రతి అనుచర సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమవుతుంది?" అనే సూక్తి దగ్గరికి చేరుకోగానే “ఇక చాలు ఆపెయ్యి” అన్నారాయన (స). ఇబ్నె మన్పూద్ (ర) తల పైకెత్తి చూస్తే ఆయన కళ్ళ నుండి కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి (బుఖారీ). కన్నీటి ప్రార్థన కరుణామయునికి ఇష్టం వారికి చెప్పు: “మీరు దీన్ని విశ్వసించండి, విశ్వసించకపోండి. పూర్వం (దివ్యగ్రంథ) జ్ఞానం ప్రసాదించబడినవారి ముందు దీన్ని పఠిస్తే, వారు అప్రయత్నంగా సాష్టాంగపడి ‘మా ప్రభువు ఎంతో పరిశుద్ధుడు. ఆయన వాగ్దానం తప్పక నెరవేరుతుంది’ అంటారు. అంతేకాదు, వారు కంటతడి పెడుతూ బోర్లాపడి సాష్టాంగపడతారు. అది విన్న తర్వాత వారిలోని అణుకువ, భక్తిభావలు ద్విగుణీ కృతమయి పోతాయి.” (బనీ ఇస్రాయీల్:: 107-109) హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రజి) కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నారు. (నమాజ్లో) ఆయన ఏడుస్తుంటే పొయ్యి పై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం రాసాగింది. (ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ దావూద్) కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును. (కీర్తన 126:5,6) మన కన్నీరు తుడవబడాలి అంటే? కన్నీటి ప్రార్ధనే శరణ్యం. ప్రార్ధన శక్తివంతమైనదిగా ఉండాలంటే, తప్పక కన్నీరు కార్చాలి. లోకంలోని లోకవాసులు పాపాల వెంట, భోగభాగ్యాలు, కోరికల వెంట కళ్లెం లేని గుర్రాల్లా పరుగులు పెడుతుంటే, పరలోకాన్ని మరచి ఇహలోకమే శాశ్వతము భ్రమించి బతుకుతుంటే కన్నీరు కార్చక, హృదయ భారము లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్ధించడం ఒక విశ్వాసిగా మనకు ఏ విధంగానూ శోభించని విషయం. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ఓ ప్రజలారా, ఏడవండి, ఏడుపు రాకపోతే, ఏడ్చినట్టు ముఖం పెట్టండి. ఎందుకంటే నరకంలోని ప్రజలు తమ కన్నీళ్లు తమ చెంపల మీదుగా ప్రవహించే వరకు, కన్నీళ్లు ఆగి రక్తం ప్రవహించే వరకు, కళ్ళకు పుండ్లు వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. (ఇబును మాజహ్ - ఈ హదీసు బలహీనమైనది) అల్లాహ్ భీతితో వచ్చే కన్నీటి ఘనత ఆధ్యాత్మిక సాధనలోనూ కన్నీటి పాత్ర కీలకమే. ప్రార్థనలు, వ్రతాలకంటే... సజల నేత్రాలతో భక్తుడు చేసే ప్రార్థనలే అల్లాహ్ ను రాజీ పరుస్తాయి. 1) అర్ష్ నీడ భాగ్యం హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ ఏడుగురు : (1) న్యాయంగా పరిపాలిం చిన పాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిద్ లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) అందం, అంతస్థూ కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియ నంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసు కొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ - ముస్లిం) 2) అల్లాహ్ కు మిక్కిలి ప్రియమైం రెండు చుక్కలు రెండు మచ్చలు హజ్రత్ అబూ ఉమామా సుదై బిన్ అజాన్ బాహిలీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: దేవునికి రెండు బొట్లు, రెండు మచ్చల కన్నా ఎక్కువ ప్రియమైన వస్తువు మరేదీ లేదు. ఒకటి దైవభీతి మూలంగా రాలిన కన్నీటి బొట్టు, రెండు దైవమార్గంలో (పోరాడినప్పుడు) చిందే రక్తపు బొట్టు. ఇకపోతే రెండు మచ్చల్లో ఒకటి దైవమార్గంలో పోరాడినప్పుడు (కలిగిన గాయం వల్ల) ఏర్పడిన మచ్చ. రెండోది ఏదయినా దైవవిధిని నిర్వర్తించి నప్పుడు కలిగిన మచ్చ. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్ గా పేర్కొన్నారు). 3) స్వర్గం సొంతం అవుతుంది ” మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి; నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థాన మవు తుంది.” (అన్-నా’జి’ఆత్, 79:40-41) 4) ఒకటి కాదు రెండు స్వర్గాలు లభిస్తాయి అల్లాహ్ శిక్షకు భయపడి ఏడ్వటం ఆరాధన అవుతుంది. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో కొన్ని ఆయతులు ఉన్నాయి.” మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గ వనాలుంటాయి.” (సూరహ్‌ రహ్మాన్‌, 55:46) అంటే తీర్పుదినం నాడు తన ప్రభువుముందు నిలబడాలని, తన్ను తాను పాపాలకు దూరంగా ఉంచుతూ అహంకారానికి గురికాడు, ప్రాపంచిక వ్యవహారాల్లో పడి పరలోకాన్ని మరవడు. పైగా పరలోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ధార్మిక విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. నిషిద్ధాలకు దూరంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తికి ఒకటి కాదు రెండు స్వర్గాలు లభిస్తాయి.’ 5) నరకాగ్ని ముట్టనయినా ముట్టదు హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు : (పితకబడిన) పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకూ దైవభీతితో కంటతడి పెట్టినవాడు నరకానికి పోడు. అదేవిధంగా దైవ మార్గంలో లేపబడిన దుమ్ముధూళి, నరకధూమంతో కలవదు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్ గా పేర్కొన్నారు) కంట తడి పెట్టేంత దైవభీతి ఉన్న వ్యక్తి ఘోరపాపాలకు ఒడిగట్టటాన్ని ఊహించగలమా? సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుని ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా మసలుకుంటూనే జీవితం గడుపుతాడు. అందుకే పితికినపాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోవటం ఎంత అసంభవమో అలాంటి మంచివ్యక్తి నరకానికి పోవటం కూడా అంతే అసంభవమని అంటే అది అతిశయోక్తి కాదు. అదేవిధంగా దైవమార్గంలో పోరాడే యోధునికి కూడా దేవుడు నరకాన్ని నిషిద్ధం చేశాడు. దైవమార్గంలో పోరాడటం వల్ల దుమ్ముధూళి కొట్టుకున్న యోధుని శరీరాన్ని నరకాగ్ని కూడా కాల్చలేదు. పుట్టిన శిశువు చేసే తొలి పని ఏడుపు ఓ చిన్న నలుసుగా అమ్మ కడుపులో పిండంగా ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన నవజాత శిశువు ఒక్కసారిగా గుక్కపట్టి ఏడుస్తుంది..తను ఈలోకంలోకి వచ్చిన వెంటనే ఏడుపుతోనే తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆకలి వేసినా.. వేయకపోయినా ఏడుస్తారు. అలా ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు. పుట్టిన బిడ్డ ఏడవకపోతే తల్లితో పాటు డాక్టర్లు కూడా ఆందోళన చెందుతారు. బిడ్డ ఏడవటానికి డాక్టర్లు రకరకాల టెక్నిక్ లు వాడతారు. బిడ్డ ఏడిస్తే హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటారు. నవజాత శిశువులు ఏడ్చినప్పుడు మీరు గమనించారా..? పెద్దవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ చంటిబిడ్డలు ఏడిస్తే కళ్ల వెంట నీళ్లు రావు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణముంది.. బిడ్డలు పుట్టినప్పుడు వారికి కన్నీటి నాళాలు పూర్తిగా ఏర్పడవు. కన్నీళ్ల పరిమాణం వారి కళ్ళ నుంచి కారడానికి సరిపోదు.అందుకే వారు ఏడ్చినా కన్నీళ్లు రావు. బిడ్డలు పుట్టిన రెండు లేదా మూడు నెలల వయస్సు తర్వాత కన్నీళ్లు ఏర్పడతాయి..ఆ తరువాతే వారికి కన్నీళ్లు వస్తాయి. మనసులో భావం చెప్పే గొప్ప సంకేతం. బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు. పసివాడి భావం కన్నీటితోనే తెలుపు. మాట వచ్చేవరకూ అమ్మకి కన్నీటి తోనే సంకేతం ఇచ్చు. మనసులోని భావo చెప్పడానికే భాష పసివాడి భాషే కంట వెంట కారే నీరు కన్నీరు. ఈ నేపథ్యంలో ఓ అరబీ కవీ ఇలా అన్నాడు; ఓ ఆదమ్ పుత్రుడా! నిన్ను నీ తల్లి జన్మనిచ్చినప్పుడు నువ్వేమో గుక్క ఆపకుండా ఏడుస్తూండేవాడివి. నీ చుట్టూ జనం సంతోషంతో సంబరాలు చేసుకుంటూ మందస్మిత ముఖాలతో ఉన్నారు. నీ కోసం నువ్వు ఎంత బాగా పరిశ్రమించాలంటే, రేపు నువ్వు మరణించిన నాడు నువ్వు మాత్రం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి. నీ వంటి గొప్ప వ్యక్తి దూరమయ్యాడన్న పుట్టెడు దుఃఖంతో నీ చుట్టూ ఉన్న జన సందోహం దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలి. గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం జల జలమంటూ కళ్ళ వెంట కన్నీరు మనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు. ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు. ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం. కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం. కన్నీళ్లు ఇచ్చే ఆరోగ్యం "ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి.కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఏడుపుతో ఒంట్లో నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. మానసికోద్వేగాల పరంగానూ ఉపయోగాలున్నాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతంగానే కాకుండా, మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ, దుఖం, కన్నీరు ఎదుటి వారిని తృప్తి పరుస్తుంది, శత్రువుల నుంచీ సానుభూతి సంపాదిస్తుంది, బంధాన్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుందన్నది తెలిసిందే. అయితే.. అది వ్యక్తిగత సంబంధాలనూ మెరుగుపరుస్తుందట. ఏడిస్తే శత్రువు కూడా కరిగిపోయే అవకాశం ఉందని, కన్నీరు మనుషులను దగ్గర చేస్తుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. అప్పుడప్పుడు కన్నీళ్లు తెప్పించే ప్రవక్తల గాథలు, సజ్జన పూర్వీకుల కథలు, చారిత్రిక హృదయ విదారక ఘట్టాలు చదువుతూ కంటి చెమ్మ ఆరకుండా చూసుకోవాలి. ఏడుపు నాలుగు విధాల మేలు .. తెలుసా..? మనలో కొంతమంది ఎవరైనా ఏడుస్తుంటే.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడని హేళన చేస్తూ ఉంటారు. కొంతమంది, పక్కవారు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఓదారుస్తూ ఉంటారు. వారి ఏడుపు ఆపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఏడవటమూ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లు పెడితే.. శరీరర, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఉన్నాయని అంటున్నారు. తట్టుకోలేని బాధే కాదు.. హార్మోనుల్లో మార్పులు, ఒత్తడి, ఒంటరిగా అనిపించినా.. తట్టుకోలేక కంటి నుంచి నీళ్లు వస్తాయి బంధాలను బాల పర్చేది కన్నీరు మనిషి శరీరం అల్లాహ్ తిరుగులేని డిజైనింగ్ నైపుణ్యానికి తార్కాణం. ప్రతి భాగానికీ ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. కన్నీటికి కూడా రెండు కీలక బాధ్యతలు అప్పగించాడు సృష్టికర్త ఒకటి... కంటిని కాపాడుకోవటం, రెండు... కన్నీరు కార్చే వ్యక్తిని రక్షించుకోవడం. మనం ఇబ్బందుల్లో ఉన్నామనడానికి కన్నీళ్లు ఒక సంకేతం. ఎంత గంభీరంగా వ్యవహరించినా... బుగ్గలపై తడివారల్ని ఆత్మీయులు తప్పక గమనిస్తారు. చనువుకొద్దీ, ప్రేమకొద్దీ గుచ్చిగుచ్చి అడుగుతారు. కారణం తెలుసుకుంటారు. సాంత్వన వాక్యాలు పలుకుతారు. మేమున్నామని ధైర్యం నింపుతారు. అదో సమస్యే కాదంటూ వాతావరణాన్ని తేలిక పరుస్తారు. ఆ మాటలు మనకు ఊరటనిస్తాయి. బతుకు పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. కన్నీరు కోరుకునేదీ ఆలూమగల అనురాగానికైనా, తల్లీబిడ్డల అనుబంధానికైనా, తోబుట్టువుల మమకారానికైనా... ఏదో ఒక దశలో కఠిన పరీక్ష ఎదురవుతుంది. ఇద్దరి మధ్యా కనిపించని అడ్డుగోడలు మొలుస్తాయి.: అపార్ధాలు అగాధాల్ని సృష్టిస్తాయి. ఎదురుపడినా పలకరించుకోలేరు. మంచానపడినా పరామర్శించుకోలేరు. ఆ మౌనం ఏదో క్షణంలో బద్దలవుతుంది. ఏడుపు లావాలా పొంగుకొస్తుంది. ఆ కన్నీళ్లు గుండెల్ని కరిగిస్తాయి. పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కాంక్రీట్ పాత పగుళ్లను పూడుస్తాయి. ఆ చొరవ ఫలితంగా... బంధాలు మళ్ళీ వికసిస్తాయి. కన్నీళ్ల స్థానాన్ని ఆనందబాష్పాలు భర్తీ చేస్తాయి. అందుకేనేమో 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమె కన్నీరు నించుటకు... తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్ణము' అంటారు మహాకవి శ్రీశ్రీ ఆవేశాన్ని ఆలోచనగా మార్చే మంత్రజలం కన్నీరు. చాలా సందర్భాల్లో కన్నీళ్లు ఎమోషనల్ స్పీడ్ బ్రేకర్స్ లానూ పనిచేస్తాయి. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఎవరో మోసం చేస్తారు. అవతలి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇంకెవరో నమ్మకద్రోహానికి పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్పృహ చుట్టుముడుతుంది. ఓ పది నిమిషాల ఏడుపు తర్వాత ఆ నెగెటివ్ ఉద్వేగాలన్నీ కన్నీళ్లలో కలిసిపోతాయి. ఎంతో కొంత స్థిమిత పడతాం. మంచిచెడులు బేరీజ వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. రోదనం. కూడా ఓ ఔషధమే గుండె మంట చల్లారాలంటే.. రెండుకకళ్లూ ఉప్పునీటి స్నానం చేయాల్సిందే. ఆ ప్రవాహంలో దుఃఖం చెత్తాచెదారంలా కొట్టుకుపోతుంది. మనసారా ఏడ్చినప్పుడు మెదడులోని చేదు జ్ఞాపకాలు మసక బారిపోతున్న భావన కలుగుతుంది. కన్నీళ్లతో పాటు కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ కూడా బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి బాగా ఏడ్చేశాక మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు మన కళ్లను పొడిబారనీయవు. బైక్కు ఇంజిన్ ఆయిల్.. నేత్రాలకు సహజసిద్ధమైన లూబ్రికెంట్స్ ఇవి. ఏడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడుస్తున్నప్పుడు మొహంలో రక్త ప్రసరణ పెరిగిపోయి, మేని సౌందర్యం మెరుగుపడుతుంది. కొత్త నిగారింపు వస్తుంది. మనం మనసారా నవ్విన ప్రతిసారీ 1.3 క్యాలరీలు కరిగిపోతాయని ఓ అంచనా. ఏడ్చినప్పుడు కూడా అన్నే క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు గుర్తించారు. తీవ్ర గాయాలైనప్పుడు, ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేస్తుంటాం. ఇదీ. ఒకందుకు మంచిదే. కన్నీళ్లలో ఓరకమైన పెయిన్ కిల్లర్ ఉంటుంది. అందుకే, ఏడుపు తర్వాత నొప్పి తీవ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. ఏడుపు కొన్నిసార్లు అలారమ్ వ్యవస్థలానూ పనిచేస్తుంది. ఏ దొంగలో ఇంట్లోకి చొరబడినప్పుడు ఏ దుర్మార్గుడో అఘాయిత్యానికి తెగబడినప్పుడు... ఆ స్థానంలో ఎవరున్నా వెంటనే అరిచేస్తారు. గట్టిగా ఏడ్చేస్తారు. ఏడుపులోని కీదు శబ్దానికి తీవ్రత ఎక్కువ. చాలా దూరం వినిపిస్తుంది. ఎవరో ఒకరు వస్తారు. తప్పక సాయం చేస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే లాఫింగ్ క్లబ్స్ లా క్రయింగ్ క్లబ్లూ పుట్టు కొస్తున్నాయి. ఏడుపుకి కాదెవరూ అతీతం ఏడుపు అనగానే ఆడవాళ్లే గుర్తుకొస్తారు. బీరకాయ పీచు చుట్టరికమైనా సరే, చావు కబురు తెలియగానే ఆమె ముందుగా ముక్కు చీదుకుంటుంది. కొడుకును అమెరికా పంపుతున్నా. కూతుర్ని అత్తారింటికి సాగనంపుతున్నా... ఆమె కళ్లలోంచి గంగ పొంగుకురావాల్సిందే. టీవీ సీరియల్స్లోనూ అంతే. ఏడుపుగొట్టు సీన్లన్నీ కోడళ్లూ, కూతుళ్ల పాత్రల ఖాతాలోనే పడతాయి. మగాడికి ఇలాంటి జంజాటమే ఉండదు.. ఆ గాంభీర్యానికి శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుడి అశ్రు గ్రంథులు చిన్నవి. అందులోనూ అతను టెస్టోస్టిరాన్ జీవి. ఆ హార్మోన్ పురుషుడి కంట కన్నీరు ఒలకనీయదు. కన్నీటి ఉత్పత్తికి సహకరించే ప్రొలాక్టిన్ హార్మోను మగాళ్లలో ఏమంత చురుగ్గా ఉండదనీ చెబుతారు. అన్నింటికీ మించి 'అబ్బాయిలు అస్సలు ఏడ్వకూడదు' అంటూ బాల్యం నుంచీ సమాజం చేసే హితబోధ... కన్నీటిని ఆనకట్టలా అడ్డుకుంటుంది. జీవన సంగ్రామంలో రాటుదేలిన వారికి కూడా ఓ పట్టాన ఏడుపు రాదు. అప్పటికే ఉద్వేగాలు మొద్దుబారి ఉంటాయి. దీంతో చిన్నాచితకా కష్టాలకు పెద్దగా స్పందించరు. స్పందించినా స్పందించినట్టు కనిపించరు. చెట్టంత మనిషి కదా! నలుగురిలో కళ్ళు తుడుచుకోడానికి అహం అడొస్తుంది అతనికి. దీనివల్ల మగజాతి ఆణిముత్యమనే పేరు స్థిరపడితే స్థిరపడొచ్చు కానీ, వ్యక్తిగా చాలా కోల్పోతారు. ఎందుకంటే, ఏడుపు వాంతి లాంటిది. తక్షణం కక్కేయాల్సిందే. దిగమింగిన కొద్దీ ఉద్వేగాలు పేరుకుపోతాయి. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం మొదలైన రోగాలకు కారణం అవుతాయి. ఆ ఒత్తిడిలో మద్యానికీ, మాదక ద్రవ్యాలకూ అలవాటుపడేవారూ ఉన్నారు. కాబట్టి, ఏడుపు రాగానే ఏడ్చేయడమే ఉత్తమం. నలుగురిలో బావురుమనడం బావుండదని అనిపిస్తే... ఏ వాష్రూమ్కి వెళ్లాలి. ఏకాంతంలో గుండె బరువు దించుకోవాలి. ఏ కష్టమూ లేకపోయినా ఏడుపులోని పాజిటివ్ ప్రయోజనాల్ని పొందడానికి... సెంటిమెంటు సినిమాలూ, విషాదాంత నవలలూ ఓ మంచి మార్గం. టైటానిక్, దేవదాసులాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు... మనసు ద్రవించిపోయి జలజలా కన్నీళ్లు రాలినా, అది నిజమైన దుఃఖం కాదు. కరుణ రసానుభూతిలో ఓ భాగం మాత్రమే. అంతిమంగా ఆనందాన్నే ఇస్తుంది. చాలాసార్లు ఆయా దృశ్యాలో, వాక్యాలో మనల్ని ఏడిపించాయని అనుకుంటాం. కానీ ఆ క్షణంలో గుర్తుకొచ్చే వ్యక్తులూ, సంఘటనలే ఆ కన్నీటి ప్రవాహానికి కారణమని అంటారు పరిశోధకులు. కొన్నిసార్లు, పక్కవాళ్లు ఏడుస్తుంటే మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఏడుపు హానికరం కాని అంటువ్యాధి. ఆనంద బాష్పాలు ముందుగా కుడి కంటి నుంచీ, విషాద బాష్పాలు ముందుగా ఎడమ కంటి నుంచీ జాలువారుతాయని పరిశోధకులు గుర్తించారు. ఎవరైనా ఏడిస్తే... స్నేహితుడు... మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సహోద్యోగి... పనిచేస్తూ పనిచేస్తూ వెక్కివెక్కి ఏడ్చేస్తాడు. సమీప బంధువు... కుశలప్రశ్నలు అడగ్గానే బోరున విలపిస్తాడు. అవన్నీ ఊహించని సంఘటనలే అయినా, ఆ సమయంలో మనం హుందాగా వ్యవహరించాలి. ఎదుటి మనిషికి మనసారా ఏడ్చే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత, నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలి. అంతేకానీ అర్థంలేని సలహాలతో, ఆచరణయోగ్యం కాని సూచనలతో మరింత అయోమయానికి గురిచేయకూడదు. పసిపిల్లల్లా ఏడుపేమిటని ఎగతాళి చేయకూడదు. అత్యవసరమైతే తప్పించి, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. నలుగురిలో చర్చకు పెట్టకూడదు. అకారణమైన ఏడుపు మానసిక అనారోగ్యానికి సంకేతం. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా తదితర రుగ్మతల ప్రాథమిక లక్షణం. వెంటనే మానసిక నిపుణులకు చూపించాలి. హార్మోన్ల లోపానికి ఇదో సంకేతం కూడా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడ్వటం మామూలే. కానీ, ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం ఇంకా పెద్ద సమస్య. దీర్ఘకాలిక అనారోగ్యాలకు యాంటీ డిప్రెసెంట్స్ వాడేవారిలో కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. కొందరికి పుట్టుకతోనే ఆశ్రు గ్రంథులు మూసుకుపోయి ఉంటాయి. దీంతో ఓపట్టాన కన్నీళ్లు రావు. కొంతైనా తేమ లేకపోతే... కంట్లోని నలుసు బయటికొచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టు ముడతాయి. వీలైతే చికిత్సతో, అవసరమైతే శస్త్ర చికిత్సతో వైద్యులు ఇలాంటి లోపాల్ని సరిచేస్తారు. జాగ్రత్త పడాల్సిన కొన్ని జాగాలు ప్రత్యేకించి... ఇంటర్వ్యూ రూమ్, బాస్ క్యాబిన్, ఆఫీస్ డెస్క్, కాన్ఫరెన్స్ హాల్, ఎంప్లాయీస్ క్యాంటీన్ లాంటివి 'నో క్రయింగ్ జోన్స్' అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఉన్నంతసేపూ ఏడుపును దిగమింగుకోవడమే మంచిది. జాబ్ ఇంటర్వ్యూలో అనుకోని ప్రశ్న ఎదురైనప్పుడు, మొహం వేలాడేసుకుని ఏడుపు లంకించుకోకూడదు. ఉన్నతాధికారులతో సంభాషిస్తున్నప్పుడు కూడా మన వాదనను సమర్థంగా వినిపించాలే కానీ, కన్నీటిపర్యంతం కాకూడదు. ఎవరైనా మనవైపు వేలెత్తి చూపినప్పుడూ, మనకు జరిగిన అన్యాయాన్ని సూటిగా చెప్పాల్సి వచ్చినప్పుడూ... మాటకు మాట సంధించాలే కానీ, కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోకూడదు. ఇప్పటికీ ఏడుపును పిరికితనానికి ప్రతీకగానో, బలహీనుల లక్షణంగానో భావించేవారు ఎంతోమంది. ఏడ్చేవారిపై పలాయనవాదులుగా ముద్ర వేస్తుంది సమాజం. మరణ స్మరణ మంచిదే చావును తలుచుకోగానే కన్నీళ్లు పొంగుకొస్తాయి. ఆత్మీయులు గుర్తుకొస్తారు. మన పార్ధివదేహం ముందు వాళ్లంతా రోదిస్తున్న ఘట్టాన్ని ఊహించుకున్నప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. ఎదుటి మనిషి కన్నీటి విలువా అర్థం అవుతుంది. ఒకరు ఏడుస్తున్నారంటే, ఇంకెవరో ఏడిపిస్తున్నారనే అర్థం. ఏడుపు ఆరోగ్యకరమైతే కావచ్చు కానీ... ఏడిపించడం మాత్రం మానసిక రుగ్మత సంకేతమే. ఆ హింసను ఖండించాల్సిందే. బాధ్యుల్ని నిలదీయాల్సిందే. కంటి స్పందన గుండెను ఓదారుస్తుంది. భారం తగ్గిస్తుంది. అయితే రెప్ప చాటున నిలిచిన నీటిచుక్కతో సేలీ ఏమిటంటే- అది కారిపోతే నీరే గాని, నిలిచిపోతే నిప్పు కాబట్టి కారిపోవడమే ఓదార్పు. అలాగే, కన్నీరు ఎవరికోసమో అయితే అది దివ్యం. ఎవరివల్లనో' అయితే... అది చైన్యం. అందుకే ఎంతో అమూల్యం. కన్నవారి కంట కన్నీరు మంచిది కాదు పొత్తిళ్లలో ఉన్నప్పుడు గుండెలపై తన్నిన బిడ్డలు ఇప్పుడు సూటిపోటి మాటల బాణాలు హృదయాల్లో గుచ్చుతుంటే గాయపడి రోదిస్తున్నారు.. కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ లాగేసుకుని.. నీకూ.. మాకూ ఏం సంబంధమని ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తెలియక కన్నీరు కారుస్తున్నారు.. తాము కన్న బిడ్డలు తమ కళ్లముందే కర్కశులుగా మారడాన్ని భరించలేక కుమిలిపోతున్నారు.. తప్పెవరిది? జాలి, దయ బోధించని చదువులదా? సంస్కారం నేర్పని సమాజానిదా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలన్నీ మనసును కాల్చేస్తుంటే కరిగి.. కన్నీరై రాలిపోతున్నారు.. కొందరు.. బిడ్డలు మారకపోతారా! అనే ఆశతో కష్టాలు కడుపులో దాచుకుని బలవంతంగా బతుకీడుస్తుండగా.. కొందరు మాత్రం ఆత్మాభిమానంతో బిడ్డలపైనే పోరాటానికి దిగుతున్నారు. 'మాయమై పోతున్నాడు మనిషన్నవాడు' అంటూ ఓ కవి అన్న మాటలకు తామే రుజువంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కడలి నుండి కెరటాలు, హృదయం నుండి ఆరాటాలు, ప్రేమ కోసం పోరాటాలు దూరమైపోవటం లేదే! మరి పెద్దల నుండి నేటి పిల్లలు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? చెట్టు నుండి పచ్చదనం, సూర్యుని నుండి వెచ్చదనం చంద్రుని నుండి చల్లదనం ఇవేవీ విడిపోవాలని కోరుకోవటం లేదే! మరి నేటితరం కొడుకులు తమ తల్లితండ్రుల నుండి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? పగలు నుండి రాత్రి, జననం నుండి మరణం - ఇవేవీ ఒకదానికి విడిచి వేరొకటి ఉండాలని అనుకోవటం లేదే! మరి ఈ అన్నదమ్ములు ఎందుకు విడివిడిగా ఉండాలని అనుకుంటున్నారు? మూడు కాలాలు, పంచభూతాలు, ఎనిమిది దిక్కులు విశ్వకుటుంబం నుండి వేరైపోదామని అనుకోవటంలేదే! మన కుటుంబాలే ఎందుకు ముక్కలైపోతున్నాయి? కన్నీరు కరుణకు ఆనవాలు ఓసారి ఒక సహచరుడు కారుణ్యమూర్తి (స) వారి సమక్షంలో తన అజ్ఞాన కాలం నాటి బాధాకరమైన సంఘటనను విన్పించారు. "నాకు ఒక చిన్న పాప ఉండేది. మా ప్రాంతంలో లేని పౌరుషానికి పోయి, పుట్టగానే ఆడ శిశువులను చంపే ఆచారం ఉండేది. నా భార్య నాకు తెలియకుండానే నా కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఆ పసిపాప చిలిపి చేష్టలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసేవి. అలా నేను ఆ పాపను ప్రేమించనారంభించాను. ఇది గమనించిన నా భార్య ఫర్వాలేదులే అనుకొని 'తను నా కూతురే' అని రహస్యం బైటపెట్టింది. మరుక్షణమే నాలోని మృగం మేల్కొంది. నేను అదను చూసి పాపను తీసుకొని శ్మశానానికి బయలుదేరాను. 'నాన్నా! మనం ఎక్కడికి వెళుతున్నాము? అని తను పదే పదే ప్రశ్నిస్తున్నా అవేవి వినే స్థితిలో లేని నేను నేరుగా ఖనన వాటికకు చేరుకున్నాను. పాపను ఓ ప్రక్క కూర్చోమని చెప్పి 'సమాధి' తవ్వడం మొదలెట్టాను. నాపై పడే మట్టిని ఆ చిన్నారి పాప తన చిట్టి చేతులతో శుభ్రం చేస్తూ 'ఎందుకు నాన్నా గుంత తవ్వుతున్నావు?' అని ఒకే ప్రశ్న మరీ మరీ అడుగుతోంది. నేను మాత్రం మానవత్వం మరచిన మృగాన్నయి, పితృవాత్సల్యం మరచిన పశువునై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేను పశువునై నా పని నేను చేసుకుపోతున్నాను. గుంత తవ్వటం పూర్తయింది. నా శరీరంపై చోటు చేసుకున్న చెమట బిందువుల్ని తన బుల్లి బుల్లి చేతులతో తుడుస్తున్న ఆ చిట్టితల్లిని ఒక్కసారి పట్టి గుంతలో నెట్టేశాను. 'పాపం! తనకేమి తెలుసు, కన్న తండ్రే తన్ను కడతేర్చేందుకు కసాయి వాడయ్యాడు' అని. బిత్తర చూపులతో నా వంకే ... కాసేపు ... చూస్తుండి పోయింది!! అయినా నాకు జాలి కలగలేదు, ఆ చిట్టి తల్లిని అలానే ఉంచి ఆమెపై మన్ను త్రోయడం మొదలెట్టేశాను. ఆ పసిడి నవ్వు పాపాయి 'నాన్నా!' అన్ని దిక్కులు పిక్కటిల్లేలా పెడబొబ్బలు పెడుతున్నా, ఆ బుజ్జి కళ్ళు కన్నీరు కారుస్తున్నా కనికరించక క్రూర పశువునై ఆ చిట్టి తల్లిపై మట్టి గడ్డలు వేస్తూనే ఉన్నాను. అ క్షణంలో ఉన్మాదిలా మారిన నేను నా చిట్టి తల్లితోపాటు 'నాన్నా! కాపాడు నాకు భయమేస్తోంది ... శ్వాస ఆడటం కష్టమవుతోంది ఇక మీదట నేను తప్పు చేయను ... ప్రామిస్! ...' అన్న ఆమె ఆర్తనాదాన్ని సయితం సజీవ సమాధి చేసేశాను. కన్నకూతురిని కాటి మట్టిలో కలిపేశాను. నిర్దాక్షిణ్యమైన ఈ గాధను విని కారుణ్యమూర్తి (స) కళ్ళల్లోని అశ్రుజలధి కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. హృదయ విదారకమైన, గుండెల్ని పిండేసే ఆ వృత్తాంతాన్ని విన్న కారుణ్యమూర్తి (స) ఎక్కి ఎక్కి ఏడ్వసాగారు. ఆయన గడ్డం మొత్తం తడిసి ముద్దయింది" (ముస్నద్ దారమీ). ముస్అబ్ బిన్ ఉమైర్ (ర) అనే ఒక సహాబీ ఉండేవారు. ఇస్లాం స్వీకారానికి పూర్వం నూనూగు మీసాల ఆ యువకుడు సిరిసంపదల్లో తులతూగాడు. ఒకసారి తొడిగిన దుస్తులు మళ్ళీ డగకుండా ఎంతో గారాబంగా పెరిగాడు. అతను సువాసన పూసుకుని ఏదైనా వీధి గుండా వెళితే ఆ సుగంధ పరిమళాలతో వీధి మొత్తం గుభాళించేది. అతని తల్లిదండ్రులు అతన్ని అత్యంత ఖరీదైన దుస్తులు తొడిగించేవారు. అల్లాహ్ అతనికి ఇస్లాం స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. తను ముస్లిం అయ్యాడు. కన్నకొడుకు తాతముత్తాతల మతాన్ని విడిచి పెట్టినందుకుగాను తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. ఎంత ప్రేమగా పెంచారో దానికన్నా ఎక్కువగా ద్వేషించడం మొదలెట్టారు. సత్యధర్మమైన ఇస్లాం కోసం సర్వాన్ని త్యాగం చేసిన ఆ నవ యువకుడు ఒకసారి కారుణ్యమూర్తి (స) సన్నిధికి వచ్చాడు. అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, అత్యంత ఖరీదైన బట్టలతో నిత్యం కళకళలాడుతూ ఉండే తన ఒంటిపై అతుకులు వేయబడిన దుస్తులు, గుండీలకి బదులు ముళ్ళు గుచ్చుకున్న బట్టలున్నాయి. ఆ నవ యువకుని ఆ పరిస్థితిని చూసి కారుణ్యమూర్తి (స) వారి కళ్లల్లో కన్నీరు ఉబికి వచ్చింది. 'ఏడిచి ఎన్నాళయినదీ ఎద' హజ్రత్ ఇబ్రాహీం బిన్ -అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రహ్మలై) కథనం: ఓసారి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) ఉపవాసంలో ఉన్నప్పుడు (ఇఫ్తార్ వేళ) ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముస్అబ్ బిన్ ఉమైర్' అమరగతులయ్యారు. ఆయన నాకన్నా గొప్ప వారు. ఆయన అంత్యక్రియలు జరిపి నప్పుడు (తన దగ్గర) ఒక దుప్పటి మాత్రమే ఉంది. (అది కూడా ఎంత చిన్నదంటే) దాంతో ఆయన ముఖాన్ని కప్పితే ఆయన కాళ్లు బయటికి కనిపిం చేవి. కాళ్లను కప్పితే ముఖంపై ఆచ్ఛాదనం ఉండేది కాదు. ఆ తరువాత మాకు ఎంత సమృద్ధిగా ప్రాపంచిక సిరి సంపదలు వొసగబడ్డాయో మీరు చూస్తున్నారుగా! (లేక) దేవుడు ఎంత ఎక్కువగా సిరిసంపదలు ప్రసాదించాడో కనబడుతూనే ఉంది. కాని ఈ సిరిసంపదలు చూస్తుంటే మనం చేసుకున్న పుణ్య కార్యాలకు ప్రతిఫలం ప్రపంచంలోనే ఇవ్వబడుతుందేమోనని పిస్తోంది” అని చెప్పి అన్నం కూడా తినకుండా రోదించటం మొదలు పెట్టారు. (బుఖారీ) ఓసారి కొంతమంది, చివరి శ్వాసలు లెక్కిస్తున్న జైనబ్ (ర) గారి పసి పిల్లాడిని ఎత్తుకొని కారుణ్యమూర్తి (స) వారి ముందు తెచ్చారు. పిల్లవాడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్నాడు. ఆ బాలుని ఒళ్ళో తీసుకున్న కారుణ్యమూర్తి (స) కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అక్కడున్న హజ్రత్ సాద్ (ర)కు ఆశ్చర్యమేసి – “ఓ దైవప్రవక్తా! ఏమిటిదీ? తమరు కంట తడి పెట్టడమా?" అని అననే అన్నారు. దానికి కారుణ్యమూర్తి (స) “ఇతరులపై జాలి చూపై వారిపైనే అల్లాహ్ జాలి చూపుతాడు" అని గద్గద స్వరంతో జవాబిచ్చారు. (బుఖారీ) కారుణ్యమూర్తి (స) వారికి ఖురైషు ప్రజలు ఎక్కడ ముప్పు తలపెడతారోనన్న భయంతో ఓ రోజు బాబాయి అబూతాలిబ్ ఆయన్ను ఉద్దేశించి - "ముహమ్మద్! నీ బాబాయిని చూసి అయినా జాలి పడవయ్యా! నేను మోయలేని భారం నాపై మోపకు బాబూ!" అన్నారాయన ఆవేదనాభరిత కంఠంతో. అదొక సున్నితమైన ఘడియ. కాలం స్తంభించిపోయి కారుణ్యమూర్తి (స) వారి సమాధానంకై ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ప్రవక్త (స) వారు పెదవి విప్పారు. "బాబాయి! దైవసాక్షి! మీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తెచ్చిపెట్టి ఈ మహాకార్యం మానుకోమన్నా అది జరిగే పని కాదు. వినండి! ఈ మహాకార్యం పూర్తయినా పూర్తి అవ్వాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణాలైనా పోవాలి” అన్నారు దృఢ సంకల్పంతో. కారుణ్యమూర్తి (స) లేచి బయటికి నడిచారు. ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అది గమనించిన బాబాయి 'అబ్బాయి! నీవు చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ నేను నీతోనే ఉంటాను' అన్నారు అబూతాలిబ్. అది విన్న కారుణ్యమూర్తి ముఖారవిందం పువ్వులా వికసించింది. అవతలి వ్యక్తుల వైఫల్యాలు చూసి సంతోషపడే కలియుగం ఇది. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారంటే.. చేయూతనివ్వాల్సింది పోయి, వారి ఏడుపులు చూసి ఆనందపడే రోజులివి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. నవ్వీ నవ్వీ కళ్లు తుడుచుకుంటారు మనలో చాలా మంది. అవును కన్నీళ్లకు అంత అద్భుత శక్తి. సంతోషమైనా, దు:ఖమైనా కళ్లలో కనిపించేస్తుంది. ఏ రకంగా ఏడుపు అంటే కళ్లలో నీళ్లు వచ్చినా మంచిదే. కానీ, ఒకరి మీద పడి ఏడవడం కాదు జీవితం. అలాగే ఒకరిని ఏడిపించడం సరి కాదు.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు