Tuesday, March 4, 2025
ప్రేమించు... ప్రేమను పంచు .. ప్రేమగా జీవించు.. !
ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ. ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ. ప్రేమ దివ్య భావము, ప్రేమ దైవానుగ్రహము. ప్రేమ జీవరాగము, ప్రేమ జ్ఞానయోగము. మనసున పారే సెలయేరు ప్రేమ. అలసట తీర్చే చిరుగాలి ప్రేమ. హద్దులేవి లేనిది అందమైన ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే, తొలి ఉషస్సులో అరవిచ్చిన గులాబి పువ్వు మీద మెరిసే మంచు బిందువు అందం,వసంత కాలంలో వినబడే కోయిల తీయటి గానం, నిండు వెన్నెలలో నెలరాజు అందం, వీటిని కూడా మరిపించి మురిపించే అనర్వచనీయమైన అనుభూతి ప్రేమ ఆ అనుభూతిని అనుభవించి ఆనందిస్తే తప్ప బోధపడదు. ప్రేమించడం సులభమే. కానీ ప్రేమకు నిర్వచనం చెప్పడం కష్టం. ప్రేమకు భాష లేదు .అది హృదయాల సంగమం. కవి మాటల్లో చెప్పాలంటే, ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే, ప్రేమించ బడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది..!!
ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే.. ప్రేమ + ఆనందం...ప్రేమానందాన్ని ఎవరు కోరుకోరు?... అందరికీ కావాలి! ఒక్కొక్కరూ ఒక్కో దారిలో వెతుక్కుంటూ ప్రేమను ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము! కానీ ఈ ప్రేమ, ఆనందం ముఖ్యంగా 'మానవ సంబంధాల'తో ముడిపడి ఉంటుందనే విషయం మనలో ఎంతమంది గ్రహించగలుగుతున్నాము?
ప్రేమ అంటే పట్టు- విడుపు. మనల్ని కన్నవారిని, మన తోబుట్టువులని, జీవితాంతం మన తోడుగా నడిచేవారిని, మనం కన్నవారిని, మన స్నేహితుల్ని,.. మన సహుద్యోగ్యుల్ని, స్వీయ, అన్య మతస్తుల్ని, స్వదేశీయుల్ని, విదేశీయుల్ని ... ఇలా జీవిత పయనంలో ఇంకా చాలా మందిని ప్రేమిస్తాం. మరి ఆ ప్రేమ పదికాలాల పాటు నిలిచి ఉండాలంటే మనకు పట్టు- విడుపు ఉండాలి.
‘నాది మాటల్లో చెప్పలేనంత ప్రేమ...' అవధుల్లేని ప్రేమను ఇలా వ్యక్తం చేస్తుంటాం కదా! మరి చేతల్లో చూపించాలంటే? దానికి ఏకైక మార్గం... ఆలింగనమే! ఏ సందర్భానికైనా ఇట్టే సరిపోతుంది. కావాలంటే చూడండి... అవతలివ్యక్తి కోపంతో ఉన్నా, బాధలో కూరుకుపోయినా, గెలిచినా, ప్రేమ వ్యక్తం చేయాలన్నా కౌగిలికి మించింది ఏముంటుంది? ఒక్క చమత్కార కౌగిలి... సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. బాధ, నిరాశలను తరిమేస్తుంది. కోపాన్ని పోగొట్టేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఆలికి, అమ్మకి, అమ్మమ్మకి, నాన్నకి, నాన్నమ్మకి, తాతకి, అవ్వకి, కూతురికి, కుమారునికి, గురువుకి, విద్యార్థికి, స్నేహితునికి, బాదితునికి మనమిచ్చే కౌగిలి, వారు మనతో చేసే ఆలింగనం ... మాటలుండవు కానీ, 'నీకు నేనున్నా' అని చెప్పే ఒక బలమైన సంకేతంతో మన పరస్పర సత్సంబంధాలు బలోపేతం అవుతాయి. ప్రజల మధ్య అనుబంధాన్ని నిలిపి ఉంచడంలో ఈ 'ఆత్మీయ స్పర్శ'ది ఎంత ప్రధాన పాత్రో యిట్టె అర్థమవుతుంది. అది మాటలకు అతీతమైన భావోద్వేగాల్ని చేతల్లో చూపించమంటుంది. అలాగని ఈ ఆత్మీయ కౌగిలి పరిచయస్తులకే పరిమితమా కాదు. తన, పర అన్న తేడా లేకుండా, ఈ మతం, ఆ మతం అన్న తారతమ్యం చూపకుండా మానవత్వంతో ఎవరితోనైనా పంచుకోగల గొప్ప సాధనం. ఒకరికొకరిని ముడివేసే అద్భుత మంత్రం. కాబట్టి, మనసులోని ప్రేమను చెప్పడానికి ఖరీదైన బహుమతులే అవసరం లేదు. ఒక్క కౌగిలింత చాలు. ఆ ఆత్మీయస్పర్శ మాటలకందని ప్రేమనంతా ఎదుటివారికి అందించేస్తుంది. ఎదుటి వారు కోపంగా ఉన్నారా ... గెలుపును అరచేత పట్టుకొచ్చి నిల్చున్నారా ... ఒత్తిడితో సతమతమవుతున్నారా ... ఇచ్చేయండి ఓ చమత్కార .కౌగిలి. చిన్నదే కానీ... భరోసా, ఆనందం, తోడు అన్నీ దొరికేస్తాయి. పైగా ఇది టూ వే కమ్యూనికేషన్. ఎంత ఇస్తే... తిరిగి అంత దక్కించుకోవచ్చు. కావాలంటే ప్రయత్నించి చూడండి!
మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. ప్రేమ అంటే మీ ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించుకునేందుకు దేవుడు ఇచ్చిన మహదావకాశం. ప్రేమ అనేది మీరు చేసే పని కాదు. అది మీరున్న తీరు.
దీనికి ప్రేరకంగా మీరొక వ్యక్తిని ఉపయోగించవచ్చు, లేదా మీ అంతట మీరే ప్రేమమూర్తులు కావచ్చు. అది ఎవరి గుణమో కాదు, మీ గుణమే. మీలోని ఈ గుణాన్ని తెరవడానికి ఎదుటి వ్యక్తిని తాళం చెవిగా ఉపయోగిస్తున్నారంతే. ఆ వ్యక్తి లేకుండా కూడా మీరు ప్రేమలో ఉండవచ్చు.
(నీవు ప్రేమపాత్రుడయ్యేందుకు) నేను నావైపు నుండి నీ మీద మమతా మమకారాలు ఆవరింపజేశాను. నీవు నా పర్యవేక్షణలో పోషించబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను. (తాహా: 39)
ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి! మనిషికి దేవుడు ఇచ్చిన మహాదానుగ్రహం ఈ జీవితం! వంద సంవత్సరాల వెనక మనం లేము! వంద సంవత్సరాల తర్వాత మనం వుండము. కాల చక్రంలో క్షణంలో వెయ్యో వంతు కూడా కాదు మన జీవితం. అండ పిండ బ్రహ్మాండాలతో నిండిన ఈ విశ్వ జగత్తులో మనిషిగా మనము గడ్డి పోచకు కూడా సమానులం కాము. కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమై న అవకాశాన్ని, ఈర్ష్యాసూయలతో, వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు!
ప్రతిరోజూ ప్రతి నిముషం, ప్రతి సెకనూ, మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగిరాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు!
మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్లిపోవాల్సినవాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు! మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు!
వాటిని వదిలేసి, మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నంచేసి, ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం “జీవిస్తున్నాం” అనే స్పృహతో, ప్రేమించుదాం ... ప్రేమను పంచుదాం .. ప్రేమగా జీవించుదాం.. !
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు