Tuesday, March 4, 2025
ముస్లిమేతరలతో మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఎలా ఉండేవారు?
(ప్రజలారా!) మీలో నుండే మీదగ్గరకు దైవప్రవక్త వచ్చాడు. మీరు నష్టపోవడం ఆయనకి ఎంతో బాధగా ఉంటుంది. మీ శ్రేయస్సునే ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. విశ్వాసుల పాలిట ఆయన గొప్ప వాత్సల్యమూర్తి, అమిత దయగలవాడు. (అత్-తౌబా: 128)
మహనీయ ముహమ్మద్ (స) సత్యోద్యమాన్ని ప్రారంభించినప్పుడు విశ్వవ్యాప్తంగా బహుకొద్ది మాత్రమే స్వచ్ఛమైన ముస్లింలు. మిగతావారంతా ముస్లమేతరులే. వారిలో ఆస్తికులూ ఉండేవారు, నాస్తికులూ ఉండేవారు. గ్రంథ ప్రజలూ ఉండేవారు. అంటే ఆయన ఎక్కువ సమయం ముస్లిమేతర సోదరులతో, ముస్లిమేతర బంధువులతో, ముస్లిమేతర ఇరుగు పొరుగుతో, ముస్లిమేతర సహవాసులతో, ముస్లిమేతర ప్రాంతాలతో, ముస్లిమేతర రాజ్యాలతోనే గడిపారు. ఆయన ఉన్నత నైతిక విలువలకి ముస్లిమేతరులు ఆశ్చర్యచకితులయ్యేవారు. స్మితపూర్వభాషి సత్యప్రవక్త ముహమ్మద్ (స). ఆయన మాటకన్నా మందహాసమే ముందుగా ఎదురొస్తుంది అనేవారు ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరూ. ఆయన ఆదర్శ ప్రవర్తనా ప్రభకు గులాములయి ఒక్కొక్కరుగా ఇస్లాం సత్య ధర్మ ఛత్రఛాయల్లోకి వచ్చి చేరాభారంభించారు. అలా 23 సంవత్సరాల ఆనతి కాలంలోనే మానవ చరిత్రలో మునుపెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఓ అద్భుత సమాజాన్నీ బలమైన పునాదుల మీద స్థాపించారు. చివరి హజ్ సమయానికి ఆయన అనుయాయుల సంఖ్య లక్షల్లోని మాటే. అంతిమ హజ్ లో పాల్గొన్న వారి సంఖ్య 1 లక్ష్ఝా 40 వేలంటారు. ఆయన తీసుకొచ్చిన మార్పుకి ఒక సామాన్య పౌరుని సాక్ష్యం అబిసీనియా రాజ దర్బారులో అందరి సమక్షంలో ఇవ్వబడినది.
ఆ కామన్ మ్యాన్ ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించినవారి తరఫున మాట్లాడుతూ ఇలా చెప్పనారంభించారు. "రాజా! మేము పూర్వం అజ్ఞానులుగా ఉండి, విగ్రహాలను పూజించే నాళ్లం. అశ్లీలతో ఊబిలో పీకల్లోతుకు దిగబడి ఉండేవాళ్ళం, కామం, క్రోధం, మోహం, మదం, మత్సర్యం, మద్య సేవనం, మగువ లోలత్వం, దొంగతనం, దోపిడి లాంటి అవలక్షణాలకి పుట్టినిల్లుగా ఉండేది మా సమాజం. ఇవి చాలవన్నట్లు బంధుత్వ సంబంధాల నిచ్చితికి పాల్పడటం మా దినచర్యగా ఉండేది. అలాంటి తమో చీకట్లలో ఎటూ పాలుపోక కొట్టుమిట్టాడుతున్న మా కోసం అల్లాహ్ మా మధ్య - స్వయంగా మాలో నుండే తపో కిరణమైన ఓ ప్రవక్తను ప్రభవింపజేశాడు. మేము ఆయన గౌరవప్రదమైన వంశాన్ని, ఆయన సత్యసంధతను బాగా ఎరిగినవాళ్ళమే. 'మేమంతా అల్లాహ్ ఒక్కడే మనందరి నిజ పూజ్యనీయుడిగా ప్రభువుగా నమ్మాలని, విగ్రహారాధనను పరిత్యజించాలని, పదా సత్యమే పలకాలని, విశ్వసనీయతను అలవర్చు కోవాలని, బంధుత్వాన్ని పటిష్ట పరచుకోవాలని ఆయన ఉపదేశించారు. అలాగే అవలక్షణాలకు, అనైతిక చేష్టలకు, అశ్లీల విషయాలకు, అక్రమార్జనకు, లంచానికి, అధర్మ ఆహార కంచానికి, పరపొందు మంచానికి దూరంగా మసలుకోవాలనీ, అనాథల సొమ్మును అన్యాయంగా తినకూడదని హెచ్చరించారు. మేము ఆయన్ని సత్య ప్రవక్తగా విశ్వసించాము, ఆయన తెలిపిన ప్రతి విషయాన్నీ మనసారా స్వీకరించాము.
అయితే ఈ కారణంగానే మా జాతి వారు ఆగ్రహించి మమ్మల్ని హింసించారు. తీవ్ర పరీక్షలకు గురిచేశారు. మేము సత్యధర్మాన్ని వదలి తిరిగి విగ్రహారాధన చేయాలని, ఘర్ వాపసీ చేసి తీరాల్సిందేనని ఒత్తిడి తెచ్చి మా జీవితాలను దుర్భరం చేసారు. చివరకు మేము వారి దౌర్జన్యాలు, దౌష్ట్వాలు భరించలేక మీ దేశానికి మిమ్మల్ని నమ్మి వచ్చి తల దాచుకున్నాము. మీరు ఉండగా మాపై ఎటువంటి జులుం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము" అని మాట పూర్తి చేశారు ఆ అసామాన్య పౌరుడే హజ్రత్ జాఫర్ (ర). ఆ బృందంలోని ప్రజలంతా పూర్వం ముస్లిమేతరులే!
మహనీయ ముహమ్మద్ (స) - తౌహీద్ ప్రధాన ధర్మ ప్రకటనలో అందమైన నిర్మాణానికి చివరి ఇటుక వంటివారు. మానవ లోకంలో ఇస్లాం ధర్మ పరంపర ఆది మానవులు మరియు ప్రవక్త అయిన ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయ్యింది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో మహనీయ ముహమ్మద్ (స) చివరివారు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందు వజ్ర సంకల్పులయిన ప్రవక్త నూహ్, ఇబ్రాహీమ్, మూసా, ఈసా (అలైహిముస్సలామ్) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఆయన్ను ఇస్లాం మత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం ధర్మం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన ఆదమ్ ప్రవక్తతో. ఆ విషయానికొస్తే సృష్టి చరాచరా లన్నింటిలో కానవచ్చే ధర్మం ఇస్లాం. ప్రకృతి అంతటి సహజమైన ధర్మం ఇస్లాం.
”అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైన్నే (ఉండండి)” (రూమ్: 30)
‘ఫిత్‌రహ్’ అంటే సహజత్వం లేక నైజం. అల్లాహ్ మానవుల్ని సహజ ధర్మం-ఇస్లాంపై, అల్లాహ్ ఏకత్వ భావన-తౌహీద్‌పై పుట్టించాడు.పుట్టుక రీత్యా ప్రతి మనిషి నైజంలో అల్లాహ్ ఏకత్వం-తౌహీద్ భావన అంతర్లీన మై ఉంది. జన్మతః ప్రతి మనిషి అల్లాహ్ విధేయుడిగానే (ముస్లింగానే) ఉంటాడు. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత పరిసరాల, పరివార, పండితుల, స్నేహితుల, సాహిత్య ప్రభావానికి గురవుతాడు. తాను కళ్ళు తెర చిన సమాజంలోని కుళ్ళు అతన్ని సహజ ధర్మం వైపునకు మళ్ళకుండా చేస్తుంది. ఇదే యదార్థాన్ని ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ”పుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మం మీదే పుడుతుంది. కానీ దాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదునిగానో, క్రైస్తవయనిగానో, అగ్ని పూజారిగానో మార్చి వేస్తారు”. (బుఖారీ)
పొతే, ముస్లిమేతరలతో మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఎలా ఉండేవారు? అనే విషయాన్ని ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
ముస్లిమేతర సోదరులతో సత్సంబంధాలు, సహజీవన భావాలకు సంబంధించి ఇస్లాం రెండు మౌలిక దృక్పథాలను మనముందుంచింది.
మొదటిది: విశ్వమానవ సోదరభావం
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (దివ్యఖుర్ఆన్ - 49 : 13)
ప్రవక్త మహనీయులు (స) వివిధ సందర్భాలలో, వివిధ రకాలుగా ఈ విషయాన్ని విడమరచి చెప్పారు.
“ప్రజలంతా ఆదమ్ బిడ్డలే. ఆదమ్ మట్టితో చేయబడ్డారు.” (మజ్మవుజ్జవాయెద్ - హదీసు నెం.13089).
దైవప్రవక్త (స) తన వీడ్కోలు హజ్డ్ సందర్భంగా ఇలా ఉపదేశించారు..
ప్రజలారా! మీరందరు ప్రభువు ఒక్కడే. ఒక అరబ్బుకి అరబ్బేతరునిపై గానీ, ఒక అరబ్బేతరుని అరబ్బుపై గానీ, ఒక ఎర్రవానికి నల్లవానిపైగానీ, ఒక నల్లవానికి ఎర్రవానిపైగానీ ఎలాంటి ఆధిక్యత లేదు - ఒక్క తఖ్వాతో తప్ప. మీలో ఎవరు ఎక్కువ తఖ్వాపరులో వారే అల్లాహ్ కు అత్యంత ప్రీతిపాత్రులు.(బైహాఖీ)
మానవులంతా ఒకే తల్లిదండ్రుల బిడ్డలన్న భావన రాగానే మానవ సోదర భావం దానంతట అదే జనిస్తుంది - వారు ఏ మతాన్ని నమ్మేవారయినా, ఏ వంశానికి చెందిన వారయినా, వారు తెల్లవారయినా, నల్లవారయినా - వారంతా అన్నదమ్ములే. అందుకే ఆయన (స) ఒకసారి ఈ విషయాన్ని విశదీకరిస్తూ, “ఆదమ్ సంతతి వారంతా అన్నదమ్ములే" అని నొక్కి వక్కాణించారు (అబూదావూద్).
రెండవ దృక్పథం: మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి, గౌరవనీయుడు
ప్రాపంచిక అనుగ్రహాలన్నీ ఒక వైపు.. మనిషి స్వేచ్చా మర్యాదలు ఒక్కటే ఒక వైపు. అది లేకుండా... అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఏమి లేనట్టే. ఏ మనిషి అయినా తనని తాను ప్రేమించుకుంటాడు. తనకో విలువ ఉందని ప్రగాఢంగా నమ్ముతాడు. ఎదుటి వాళ్లకు తనెంత మర్యాద ఇస్తున్నాడో, తనకూ అంత మర్యాద దక్కాలని కోరుకుంటాడు. ప్రతీ మనిషి తనకో విలువ, గౌరవం, మర్యాద, అభిమానం ఉన్నాయని నమ్ముతాడు. ఎప్పుడైతే ఈ నమ్మకాలకు భంగం కలుగుతుందో అపుడు ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. మనల్ని మనం ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరు. కనుకనే ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు; నీ కోసం దేన్నయితే ఇష్ట పడతారో దాన్నే నీ సోదరుని కోసం ఇష్ట పడు. (నసాయి)
ప్రపంచంలో జరిగిన సంస్కరణోద్యమాల లక్ష్యం సమాజంలోని దురాచారాలను రూపుమాపడమే. ప్రజల్లో చైతన్యం కలిగించి, వారిలో మార్పు తీసుకురావడానికి సంఘసంస్కర్తలు అనేక ఉద్యమాలు చేపట్టారు. నాడు దళితులను అంటరానివారిగా చూపుతూ, వారిని సమాజంలో హీనంగా చూసేవారు. దీన్ని ఎదిరించిన సంస్కర్తలు ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అలాంటి సంఘ శ్రేయోభిలాషుల్లో తొలి వరుసలో దైవ ప్రవక్తలు ఉంటే, ఆ ప్రవక్తలందరిలోనూ అగ్రగణ్యులు మహనీయ ముహమ్మద్ (స). అలాగే సమాజంలో గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టిన రచనల్లో తొలి పంక్తిలో దైవ గ్రంథాలుంటే, దైవ గ్రంథాలన్నింటిలోనూ సింహ భాగం అల్లాహ్ అంతిమ ఖుర్ఆన్ సొంతం. శాశ్వత శాసనం అయిన దాని మాట ఏమిటంట,
"మేము ఆదమ్ సంతతికి గౌరవం వొసగాము, నేలపైన మాత్రమే గాకుండా నీటిలో కూడా వారికి వాహనాలను ప్రసాదించాము. ఇంకా, వారికి పరి శుద్ధమైన జీవనోపాధిని ప్రసాదించాము.” (బనీ ఇస్రాయీల్-70)
ఇస్లాం దృష్టిలోనయినా, ఇస్లాం ప్రవక్త (స) దృష్టిలోనయినా సంయుక్తంగా ఉన్న విషయం ఏమంటే; ఒక వ్యక్తి – అతను ముస్లిమయినా లేక ముస్లిమేతరుడయినా- మానవుడైన కారణంగా గౌరవించదగినవాడు, మర్యాద ఇవ్వదగినవాడు. జగతిలో ఉన్న జీవన ఒనరులు కేవలం ముస్లింలవి కావు; మానవులంతా వాటికి హక్కుదారులే.
ఇస్లామీయ దృక్కోణం నుండి ముస్లింల-ముస్లిమేతరుల మధ్య సౌహార్థ సంబంధాలకు పునాది వంటివి ఈ రెండు దృక్పథాలు. మహాప్రవక్త ముహమ్మద్ (స) తన సత్ప్రవర్తన ద్వారా, నియమాల ద్వారా దీనికి సంబంధించిన క్రియాత్మక నమూనాలు సమర్పించారు. అవేంటో చూద్దాం రండీ!
నాయకులు, పాలకులతో ప్రవక్త (స) వారి ప్రవర్తనా సరళి
మన మతి ఎట్లుంటుందో మన గతి అట్లుంటది. మన నోరు బాగుంటే మనం ఉండే ఏ ఊరైనా బాగుంటుంది. ఈ నిమిత్తం ఓ సంఘ నీతిని ప్రవక్త (స) బోధించారు:
మనిషి స్థాయి, గౌరవాన్ని బట్టి వ్యహరించాలి అని మహనీయ ముహమ్మద్ (స) ఆదేశించారు. (హాకిమ్)
తాను ప్రబోధించిన సుభాషితానికి స్వయంగా ఆయన కట్టుబడ్డారు. దైవప్రవక్త (స) ముస్లిమేతర సోదరులను సదా ప్రేమభావంతో పలకరించే వారు. వారితో గౌరవప్రదంగా వ్యవహరించేవారు. ఆయన (స) ఎందరో ముస్లిమేతర చక్రవర్తులకు, నాయకులకు ఉత్తరాలు వ్రాశారు. ఆ ప్రముఖులను అక్కడి ప్రజలు ఏ బిరుదుతో పిలిచేవారో, అదే బిరుదుతో వారిని సంబోధించారు. ఉదాహరణకు: రోము చక్రవర్తి హెరిక్లస్ ను 'అజీముర్రూమ్' అని సంబోధించారు. ఈరాన్ చక్రవర్తి 'కిస్రా'ను 'అజీముల్ ఫారస్!' అని వ్రాశారు. అబిసీనియా రాజు నజాషీని కూడా 'అజీముల్ హబష్!' అని సంబోధించారు (బుఖారీ). 'అజీమ్' అన్న పదంలో ఘనత వహించినవాడా! మాననీయుడా! అన్న భావాలు ఇమిడి ఉన్నాయి.
మనము చరిత్ర పుస్తకాల్లో అబూ జహల్ అని చదివే, ప్రసంగాల్లో వినే అతని అసలు పేరు, బిరుదు ఏమిటో తెలుసా? అమ్ర్ బిన్ హిషామ్ , అబుల్ హకమ్ బిరుదు. మక్కాలో అబూ జహల్ ఆయన (స)కు బద్ద విరోధి. ఆయన్ని వేధించటానికి, కష్ట పెట్టడానికి దొరికిన ఏ అవకాశాన్నీ అతను జారవిడిచేవాడు కాడు. అయితే అతనిలో సమస్యలకు సమాధానం వెతికే, వ్యవహారాలపై తీర్పులు ఇచ్చే విశిష్ట సామర్థ్యం ఉండేది. అతను ఒక నాయకుడిగా మంచి నేర్పరి, గొప్ప తీర్పరి. ఈ కారణంగా అక్కడి ప్రజలు అతన్ని 'అబుల్ హకమ్' అని పిలిచేవారు. అందువల్ల దైవప్రవక్త (స) కూడా అతన్ని అతను బతికున్నంత వరకూ 'అబుల్ హకమ్' అనే సంబోధించేవారు. (సీరత్ ఇబ్నె హిషామ్ : 1/389).
ముస్లిమేతరులైన బంధువులతో...
ముస్లిమేతరులైన ముస్లింల బంధువులతో, రక్త సంబంధీకులతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని గట్టిగా తాకీదు చేయబడింది. దివ్యఖుర్ఆన్లో పన్నెండు చోట్ల బంధుత్వ సంబంధాలను కాపాడాలని ఆజ్ఞాపించటం జరిగింది. సమీప బంధువు పట్ల సద్యవహారం చేయటంలో రెండింతల పుణ్యం ఉందనీ, దానం (సదకా) చేసినందుకు, బంధుత్వ హక్కును ఇచ్చినందుకు కూడా (మంచి ప్రతిఫలం లభిస్తుందని) మహనీయ ముహమ్మద్ (స) చెప్పారు (తిర్మిజీ). “తన జీవనోపాధి వికసించాలని, తనకు దీర్ఘాయుషు ప్రాప్తించాలని కాంక్షించేవాడు బంధుత్వ సంబంధాలను పరిరక్షించాల”ని ఆయన (స) వేరొక సందర్భంలో వక్కాణించారు (బుఖారీ).
బంధుత్వ సంబంధానికి ప్రాతిపదిక మతం కాదు, రక్త సంబంధమే. బంధువులు ముస్లింలయినా, ముస్లిమేతరులయినా - వారి పట్ల మంచిగా మెలగాలని ప్రవక్త (స) ఆదేశించారు.
ప్రవక్త సహచరులలో అనేకమంది పరిస్థితి ఎటువంటిదంటే, వారి తల్లి దండ్రుల్లో ఒకరు ముస్లిం అయివుంటే, మరొకరు ముస్లిమేతరులుగా ఉండేవారు. ఉదాహరణకు: మహనీయ అబూబక్ర్ (రజి) గారి తండ్రి మక్కా విజయం వరకూ ముస్లిం కాలేదు. కాని అబూ బక్ర్ (రజి) మాత్రం తన తండ్రి పట్ల సద్భావంతో మెలిగేవారు. హజ్రత్ అబూ హురైరా (రజి) గారి తల్లి ఇస్లాం స్వీకరించలేదు. పైగా ఆవిడ దైవప్రవక్త (స)ను దూషిస్తూ ఉండేది. అయినప్పటికీ ఆమె పట్ల ఉత్తమ రీతిలోనే మెలగమని ఆయన (స) అబూ హురైరాకు ఆదేశించారు. (అద్దుర్రుల్ మనూర్ : 6/521)
అబూ బకర్ కుమార్తె యగు అస్మా (ర.అ) వద్దకు ఒకసారి ఆమె కన్నతల్లి వచ్చింది (మదీనాకు). అప్పటికి ఆమె ఇంకా ముస్లిం కాలేదు. అస్మా గారు దైవ ప్రవక్త (స) సన్నిధికి వచ్చి, 'ముష్రిక్కు అయిన నా తల్లికి నేనేమైనా ఇవ్వగలనా?' అని అడిగితే “ఆమె పట్ల ఉత్తమంగా, ఉదారంగా వ్యవహరించు” అని ఆయన (స) ఆజ్ఞాపించారు (బుఖారీ).
ముస్లిమేతర పొరుగు
బంధుత్వ సంబంధం ముఖ్యమైన సంబంధమైనట్లే, ఇరుగుపొరుగు సంబంధం కూడా చాలా ముఖ్యమైనది. దివ్యఖుర్ఆన్లో రెండు రకాల పొరుగువారి ప్రస్తావన వచ్చింది. ఒకటి: బంధువులైన పొరుగువారు. రెండు: అపరిచితులైన పొరుగువారు (అంటే బంధుత్వం లేని పొరుగువారు)గా పేర్కొనటం జరిగింది.
కాబట్టి ఈ రెండు రకాల పొరుగువారితో ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశించటం జరిగింది. మహాప్రవక్త (స) గారు ఈ విషయాన్ని మరింత గట్టిగా నొక్కి వక్కాణించారు. “ఎవరి (కీడు)వల్ల పొరుగింటి వానికి రక్షణ లేదో అతను విశ్వాని కాజాలడు” అని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని ప్రవక్త (స) మూడుసార్లు ఒట్టేసి మరీ చెప్పారు (బుఖారీ).
తన ఇంటి గుమ్మానికి మరీ దగ్గరలో ఉన్నవారే పొరుగువారు. ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు - ముస్లిమేతరులన్న విచక్షణ పాటించలేదు. దైవ ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాల ప్రభావం వల్లనే ఆయన గారి సహాబా ముస్లిమేతరులైన పొరుగువారి పట్ల ప్రేమాదరణలతో మెలిగేవారు. తమ వల్ల వారికెలాంటి భౌతిక నష్టం మానసిక వ్యధ కలగకుండా జాగ్రత్త వహించేవారు.
ఒకసారి హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) ఇంట ఒక మేక కోయబడింది. ఆ రోజు ఆయన ఇంటికి రాగానే, 'నా పొరుగు వాడైన ఫలానా యూదు వ్యక్తికి మాంసం పంపారా? లేదా?' అని దర్యాప్తు చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు: “ప్రవక్త మహనీయులు (సఅసం) పొరుగువారి యెడల సద్భావంతో మెలగమని గట్టిగా తాకీదు చేసేవారు" (అబూ దావూద్). ఇరుగు పొరుగు వారిలో ఇంకొక రకం 'తాత్కాలిక పొరుగువారు'. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రైనులోనో, బస్సులోనో, విమానంలోనో మన ప్రక్కన కూర్చుని ఉండే వారన్నమాట. దివ్యఖుర్ఆన్ ఇలాంటి వారు 'సాహెబుల్ జంబ్'గా పేర్కొనబడ్డారు. అలాంటి వారి యెడల మర్యాదగా మెలగాలని కూడా ఆదేశించటం జరిగింది. ఈ ఆదేశం ముస్లింలు, ముస్లిమేతర సోదరులకు కూడా వర్తిస్తుంది.
సంతోషంలో, దుఃఖంలో పాల్గొనటం
ఒండొకరి మధ్య సత్సంబంధాలు ఏర్పడాలంటే ఒకరింకొకరి సుఖదుఃఖాలలో పాలుపంచుకోవాలి. దైవప్రవక్త (స) ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకునేవారు. తన ఇరుగు పొరుగువారిలో ఏ ముస్లిమేతర సోదరునికయినా జబ్బు చేస్తే అతని పరామర్శ చేసేవారు. ఒక యూదు నవయువకుడు ఆయన (స) వద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన పట్ల గల ప్రేమాదరణ వల్ల ఆయనకు సేవలు కూడా చేసేవాడు. అతను వ్యాధిగ్రస్తుడైనప్పుడు దైవప్రవక్త (స) ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. చివరికి ఆ నూనూగు మీసాల నవయువకుడు ఆయన సత్ప్రవర్తనకు మంత్రముగ్దుడయి - బొందిలోని ప్రాణం పోతున్న నాజూకు ఘడియల్లో సత్య ధర్మాన్ని స్వీకరించి చివరి శ్వాస వదిలాడు. అల్హందు లిల్లాహ్! (సహీహ్ బుఖారీ).
పరిచయస్తులైన ముస్లిమేతర సోదరుల అంత్యక్రియలలో కూడా ఆయన (స) పాల్గొన్నారు. అబూ తాలిబ్ మరణించినప్పుడు, ఆయన శవ యాత్రలో పాల్గొనడమేగాకుండా, ఖనన వాటిక వరకూ వెళ్ళారు (సుననె బైహఖీ). అలాగే ఆయన, ముస్లిమేతరుడైన తండ్రి అబూ తాలిబ్ అంత్యక్రియల ఏర్పాట్లు చేయమని ఆయన కుమారుడైన అలీ (రజి)ని ఆదేశించారు. ప్రవక్త (స) గారి ఈ ప్రబోధనల ప్రభావం ప్రియ సహచరులపై ఎంతగా పడిందంటే, వారు కూడా ముస్లింలుకాని తమ బంధువుల అంత్యక్రియలలో పాల్గొనేవారు.
ముస్లిమేతర సోదరులకు సంతాపం తెలియజేయటానికి, శోక సంతప్త హృదయంతో ఉన్న వారిని ఓదార్చడానికి కూడా ఇస్లాం అనుమతినిస్తోంది. "రోగులను పరామర్శించండి. రోగులను పరామర్శించేవాడు స్వర్గంలోని ఒక తోటలో ఉంటాడని మహాప్రవక్త (స) ప్రవచించారు (ముస్లిం). ఈ ప్రబోధనలో ఆయన ముస్లిం-ముస్లిమేతరుడన్న తారతమ్యం చూపలేదు. పరామర్శకు సంబంధించిన ఈ ఆజ్ఞ సర్వసామాన్యమైనది.
వాగ్దాన పాలన
వాగ్దానం ముస్లింలకు చేసినదైనా సరే, ముస్లిమేతరులకు చేసి ఉన్నా సరే. దానిని నెరవేర్చటం తప్పనిసరి. ఒకవేళ వాగ్దానానికి విరుద్ధంగా చేస్తే అది పాపం అవుతుంది. దీనికి సంబంధించిన గొప్ప ఉదాహరణ హుదైబియా ఒడంబడిక. మక్కాలో ముస్లింలుగా మారి మదీనాకు వలస వచ్చిన వారిని ముస్లింలు వాపసు చేయాలన్నది ఆ ఒడంబడికలోని షరతుల్లో ఒక షరతు. ఆ ఒడంబడిక ఓ కొలిక్కి వస్తుండగానే హజ్రత్ అబూ జందల్ (రజి) మక్కా నుండి పారిపోయి ముస్లింల వద్దకు వచ్చారు. ఆ సమయంలో అబూ జందల్ కాళ్లకు సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. తనను ఎలాగయినాసరే మదీనాకు తీసుకెళ్ళమని ఆయన దైవప్రవక్త (స)కు ప్రాధేయపడ్డారు. ముస్లింలు కూడా ఆయన పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు. అప్పుడు మక్కా రాయబారి సుహైల్ బిన్ అమ్ను వ్యక్తిగతంగా ఎంతగానో నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించారు. కాని అతను ససేమిరా అన్నాడు. అందువల్ల దైవప్రవక్త (స) అబూ జందల్ని వాపసు చేస్తూ, ఓర్పు వహించమని సూచించారు. అల్లాహ్ త్వరలోనే ఏదయినా మార్గం తెరుస్తాడని ధైర్యం చెప్పారు. (సీరత్ ఇబ్నె హిషామ్-2/302).
విందుకు ఆహ్వానించటం, ఆహ్వానాన్ని స్వీకరించటం
సామాజిక జీవితంలో పరస్పర సౌహార్థ సంబంధాలకు ఒక అవకాశం విందుకు ఆహ్వానించటం. అలాగే ఒకరు ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించాలి. మహాప్రవక్త (స) ముస్లిమేతర సోదరులను విందుకు ఆహ్వానించేవారు. ఆయన దైవప్రవక్తగా నియుక్తులైనప్పుడు బనూ హషిమ్ ప్రముఖులను భోజనానికి ఆహ్వానించారు. ఆ విందు భోజనానికి వచ్చిన వారు 30 మంది వరకూ ఉంటారని అనబడుతోంది. (అల్ బిదాయ వన్నిహాయ: 3/40).
అదే విధంగా ఆయన (స) ఆతిథి మర్యాదను ప్రోత్సహించారు. అతిథులను గౌరవించవలసిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు-ముస్లిమేతరులన్న విచక్షణ చూపలేదు. ఆయన (స) వద్దకు వివిధ తెగలకు చెందిన అతిథి బృందాలు వచ్చేవి. ఆయన (స) వారికి ఆతిథ్యమిచ్చే వారు. బద్ర్ యుద్ధంలో ఖైదీలుగా పట్టుబడిన వారు ఎవరో కారు, శత్రు సైనికులు. అయినప్పటికీ వారి అన్నపానీయాలకై ఉత్తమ రీతిలో ఏర్పాట్లు చేయమని ఆయన తన సహచరులకు ఆదేశించారు. ఈ కారణంగానే సహాబా తాము సాదాసీదా అన్నం తిని యుద్ధ ఖైదీలకు మాత్రం స్వాదిష్టమయిన భోజన ఏర్పాట్లు చేసేవారు (మజ్మవు జ్జవాయెద్)
కానుకల ఇచ్చిపుచ్చుకోవడాలు
“పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. తద్వారా ప్రేమ పెంపొందుతుంది. మనస్పర్థలు దూరమవుతాయి” అని ప్రవక్త మహనీయులు (స) ఉద్బోధించారు (ముఅజ్జమ్ కబీర్ లిల్ తబ్రానీ). ఈ విషయంలో ఆయన (స) ముస్లింలు-ముస్లిమేతరులన్న తారతమ్యం కనబరచలేదు. పైగా అందరికీ కానుకలు ఇస్తూ ఉండాలని అన్నారు. ఒకసారి దైవప్రవక్త (స) ఒక జత బట్టలను హజ్రత్ ఉమర్ (రజి)కు ప్రదానం చేశారు. ఆ దుస్తులు చాలా ఖరీదైనవి. అందువల్లనే ఆయన (స) వాటిని తొడగలేదు. 'మీరు మీ కోసమే ఇష్టపడనప్పుడు నాకు మాత్రం ఎందుకిచ్చారుని హజ్రత్ ఉమర్ (రజి) అడిగితే, “నీకు ఇచ్చింది నీవు తొడుక్కుంటానికి కాదు. దానిని అమ్మివేయి లేదా ఎవరికయినా కానుకగా ఇవ్వు" అని దైవప్రవక్త (స) చెప్పారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) మక్కాలోని ఒక వ్యక్తికి ఆ దుస్తులను బహుమానంగా ఇచ్చారు. ఆ వ్యక్తి అప్పటికింకా ముస్లిం కాలేదు (బుఖారీ).
ఒకసారి మక్కా నుండి ఒక 'నర్తకి' మదీనా వచ్చి ఆర్థిక సహాయం చేయమని అభ్యర్థించింది. దైవప్రవక్త (స) స్వయంగా ఆమెకు ఆర్థిక సాయం అందించటమేగాక, తన కుటుంబీకుల చేత కూడా సాయం చేయించారు. మరి చూడబోతే ఆమె ముస్లిం కాదు. ఆమె వృత్తిని ఇస్లాం ఇష్టపడదన్నదీ విదితమే (బుఖారీ).
ధన ప్రాణాల రక్షణ
రక్తం మా రక్తం వంటిది. వారి ధనం మా ధనం వంటిది' అని ఒక సందర్భంలో ఆయన (సఅసం) ఇలా అన్నారు.“ఎవరయితే ఏదయినా ఒక ఒడంబడికను (శాంతియుతమైన జీవితం గడిపేం దుకు ముస్లిమేతరునితో చేసుకున్న ఒడంబడికను) భంగ పరుస్తాడో, అతను స్వర్గం యొక్క సువాసనను కూడా ఆఘ్రాణించలేడు. నిజానికి దాని సువాసన నలభై ఏండ్ల ప్రయాణ దూరం నుండి వస్తూ ఉంటుంది.” (బుఖారీ)
“జాగ్రత్త! ఎవడయితే తాను ఒడంబడిక చేసుకున్న వాని (ముస్లిమేతర వ్యక్తి)పై దౌర్జన్యం చేశాడో, అతని హక్కును హరించాడో లేదా అతని సమ్మతి లేకుండానే అతని హక్కును లాక్కున్నాడో ప్రళయదినాన నేను అతని పక్షం వహిస్తాను” (అబూ దావూద్)
సాధారణ సమయాల సంగతి అలా ఉంచండి, యుద్ధం లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన (స) ఈ ప్రమాణాలను విధిగా పాటించేవారు. శత్రువు ఆయుధాలు పడవేసి ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు లేదా సంధికి సిద్దపడినప్పుడు అతని సొమ్ములకు ఎలాంటి నష్టం కలిగించరాదని చెప్పేవారు.
వ్యాపార సంబంధాలు
వర్తక సంబంధాలలో ఆయన (స) ముస్లిం-ముస్లిమేతరుల మధ్య ఎలాంటి విచక్షణ చూపలేదు. తొలికాలంలో అబూ సుఫ్యాన్, జుబైర్ బిన్ ముతామ్ అనే వర్తకులు ఇస్లాం స్వీకరించలేదు. అయితే ఆ సమయంలో కూడా ఆయన (స) వర్తకం కొరకు తన వర్తక సామగ్రిని వారికి ఇచ్చేవారు. వచ్చిన లాభాలలో ముందుగా నిర్ధారించుకున్న దాని ప్రకారం వాటా తీసుకునేవారు. మదీనాలోనైతే ముస్లింల వర్తక మంతా - సాధారణంగా యూదుల (బనూ ఖైనుఖా) మార్కెట్లోనే సాగేది.
దైవప్రవక్త (సఅసం) ముస్లిమేతరులతో క్రయ విక్రయాలు జరిపేవారు. ఆయన (స) పరమపదించిన సమయంలో కూడా ఆయనగారి ఒక రక్షా కవచం ఒక యూదు వ్యక్తి వద్ద తాకట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన (స) ఆ యూదు వ్యక్తి వద్ద మూడు 'సా'ల (అరేబియాలో అప్పటి ఒక కొలమానం) బార్లీ గింజలు అరువుగా కొనుగోలు చేశారు (బుఖారీ).
అలాగే ఆయన (స) ముస్లిమేతర వ్యక్తులను తన దగ్గర సేవకులుగా నియమించుకునేవారు. ఆయన (స) మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసినప్పుడు, ఎడారిలో దారి చూపగల నమ్మకస్తుడైన ఒక వ్యక్తి అవసరం ఏర్పడింది. ఆయన (స) ఎంతో బాధ్యతతో కూడుకున్న ఈ పని కోసం ఒక ముస్లిమేతర వ్యక్తిని వేతనంపై నియమించుకున్నారు (అహ్కామ్ అహ్లుజిమ్మహ్)
న్యాయం, సమభావం
ఆయన న్యాయ వ్యవహారం కేవలం తన సహచరుల పరకే పరిమితం కాలేదు, తన వ్యక్తిగత విషయంలో కూడా ఆయన (స) పూర్తిగా దీనికి కట్టుబడి ఉన్నారు. తాను ఎవరికయినా బాకీ పడి వుంటే రుణదాతకు అడిగే హక్కు కచ్చితంగా ఉంటుందని క్రియాత్మకంగా నిరూపించారు. ఒకవేళ బాకీ వసూలు విషయంలో రుణదాత కరకుగా మాట్లాడినా సహించి ఊరుకునేవారు. ఆయన (స) జైద్ బిన్ సానా అనే యూదు వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నారు. అతను వచ్చి దైవప్రవక్త (స) అంగీని పట్టుకుని లాగుతూ పరుష వాక్యాలు పలికాడు. 'నా రుణం తీరుస్తావా లేదా? ఎందుకు తీరుస్తావులే? బనీ ముత్తలిబ్ వంశస్తులంతా ఇంతే. దాటవేసే రకం' అన్నాడు. ఈ మాట వినగానే హజ్రత్ ఉమర్ (రజి) చివాలున లేచి నిలబడ్డారు. యూదు వ్యక్తిని ఒక్క తోపు తోశారు. అప్పుడు దైవప్రవక్త (స) ఉమర్ని వారిస్తూ, “ఉమర్! నేనయినా, ఇతనయినా నీ నుండి ఆశించింది ఇది కాదు. ఉత్తమ రీతిలో అప్పు తీర్చండి అని నీవు నాకు చెప్పాల్సింది, సరైన పద్ధతిలో అడగమని అతనికి సచ్చజెప్పాల్సింది. కాబట్టి ఇప్పుడు నువ్వెళ్ళి అతని అప్పు తీర్చిరా. నువ్వతన్ని భయపెట్టినందుకు బదులుగా ఇరవై 'సా'ల ఖర్జూరాలు అధికంగా ఇవ్వాలి" అని తాకీదు చేశారు (ముస్తద్రక్ హాకిమ్).
మన్నింపుల వైఖరి
ఒకసారి మక్కాలో తీవ్ర దుర్భిక్షం తాండవించింది. ప్రజలు మృత జంతువును సయితం తినాల్సిన అగత్యం ఏర్పడింది. మరి చూడబోతే ఆ జనులు ఎవరో కాదు, దైవప్రవక్త (స)ను, ఆయన ప్రియసహచరులను సంఘ బహిష్కరణ చేసి ఒక్కో ఆహారధాన్యపు గింజ కూడా వారికి చేరకుండా అడ్డుకున్నవారు. మక్కాలో ముస్లింలు నాలుగేండ్ల వరకూ ఈ కఠినమయిన ఆర్థిక ఆంక్షలను భరించారు. కాని ఆయన (స) మదీనాకు హిజ్రత్ చేసిన మీదట మక్కాలో కరువు కాటకాలొచ్చి అక్కడి ప్రజలు తిండికి తిప్పలు పడాల్సిన దుస్థితి దాపు రించింది.
ఆశీర్వచనాలు. కళ్లకి కనబడవు. అవి దివ్యతరంగాలై చెడుని పారదోలతాయి. అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయి. కమ్ముకున్న మాయని మటుమాయం చేస్తాయి. అందుకే ఏ పని మొదలు పెట్టినా ఆశీర్వచనాల కోసం అర్రులు చాచాలి. అనుభవజ్ఞులు, పెద్దవాళ్లు, తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు మెండుగా తీసుకోవాలి. ఆశీర్వచనాల పంట పండితే మనం తలపెట్టే పనులకు ఎదురుండదు. అపజయం మాట వినపడదు. జయం పరుగులు తీసి ముందుకు వస్తుంది. ఈ యదార్థం తెలిసిన మక్కా నాయకులు ఆయన (స) దగ్గరకు వచ్చి, 'తమరు బంధువుల యెడల ఉత్తమంగా మెలగమని బోధిస్తారు కదా! ఇప్పుడు మీ జాతి వారు దుర్భర దారిద్య్రంతో అంతమవుతు న్నారు. కాబట్టి తమరు ఈ దుర్భిక్షాన్ని దూరం చేయమని దైవాన్ని ప్రార్థించండి' అని కడు దీనంగా అభ్యర్థించారు. ఈ మాటలకు కారుణ్యమూర్తి (స) హృదయం కరిగి పోయింది. ఆయన (స) చేతులెత్తి వారి కష్టాన్ని తొలగించమని అల్లాహ్ న్ను వేడుకున్నారు. తరువాత మక్కాలో పుష్కలంగా వానలు కురిశాయి (బుఖారీ),
కాదేదీ విమర్శకు అనర్హం - కానీ...
విమర్శ అంటే, – పరిశోధించు, పర్యాలోచించు, విచారించు, వివేకించు, వివేచించు, శీలించు, శోధించు అని అర్థాలున్నాయి . ఒక గ్రంథంలోని, లేదా ఒక సాహిత్యప్రక్రియలోని, ఒక వ్యక్తి జీవితంలోని బాగోగులు కూలంకషంగా విచారించి, విశ్లేషించి వివరించడమే విమర్శ. అది ఎంత ప్రజ్ఞావంతంగా పక్షపాతరహితంగా, పవిత్రవంతంగా, హృదయపూర్వకంగా, సానుభూతి సహితంగా వుంటే సాహిత్యానికీ, సంఘానికీ అంత ఉపకారకారణమవుతుంది. “మంచి విమర్శ మంచి భావాలు నెలకొల్పుతుంది; ఒక మహాకావ్యం అవతరించడానికి అవకాశం కల్పిస్తుంది”. సద్విమర్శలు - వ్యక్తికయినా, వ్యవస్థకయినా, దేశానికయినా, ధర్మానికయినా - అవే అభివృద్ధికి సోపానాలు. అందుకే విమర్శ, పరామర్శ అంత మంచిగుండాలి అంటారు పెద్దలు.
విమర్శకుడు ఎలా ఉండాలి?
అన్ని పక్షాలూ విచారించి, సరైన న్యాయం వ్యక్తీకరించే న్యాయాధిపతి వంటి వాడు కావాలి విమర్శకుడు; తన కేసు ఎలా అయినా గెలవాలని వాదించే న్యాయవాదివంటివాడు కాకూడదు. రసజ్ఞుడు కావాలి; కేవలం దోషజ్ఞుడు కాకూడదు. ప్రజ్ఞావంతుడు కావాలి; పక్షపాతం కలవాడు కాకూడదు. గుణగ్రాహి కావాలి; మచ్చరగొట్టు కాకూడదు.
ఇక ద్వేషంతో చేసే కువిమర్శలంటారా --- ఓ సందర్భంగా కొందరు అలగా జనాలు ప్రవక్త ముహమ్మద్ (స) తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు. దానికి ఆగ్రహించిన ఆయన అభిమానులయిన ముస్లింలు శాంతి పూర్వకంగానే నిరసనలు తెలిపారు. ప్రభుత్వం కార్యాలయం ముందర ధర్నాకి దిగారు. వారి ఈ నిరసన తెలిపే హక్కును కూడా నీరు గార్చాలి అని చూసిన కుమతులు, కుత్సిత బుద్ధులు, పనికిమాలిన సుద్దులు చెప్పే ప్రయత్నం చేయడమేకాక, మంది బలంతో ఈ నిరసనోద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో .... వారి గుండెలకు తుపాకులు గురి పెట్టారు. అప్పుడు ఆ సమూహం ముక్త కంఠంతో చెప్పిన మాట చరిత్ర పుటలో భద్రమయి పోయింది... ''మీ మరతుపాకుల్లోని గుండ్లు అయిపోయాక మిగిలి ఉండే గుండెలు ఆ నీచ ప్రవృత్తులయిన నేరస్తుల పాలిట సింహ స్వప్నాలవుతాయి". ఆ తామస స్వభావులు తోలు తీసి డోలు వాయిస్తాయి. ముహమ్మద్ (స) వారి యెడల ముస్లింలకు ఉన్న అభిమానం అలాంటిది.
మహనీయ ముహమ్మద్ (స) వారిని అల్లాహ్ అంతిమ ప్రవక్తగా, తత్వవేత్తగా, వక్తగా, శాసనకర్తగా, సేనాధిపతిగా, భావాల (హృదయాల) విజేతగా, హేతుబద్ధమయిన నమ్మకాల ప్రస్థాపకుడిగా, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించినవాడిగా, 20 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడుగా, ఓ ఆధ్యాత్మిక సామ్రజ్య వ్యవస్థాపకుడుగా అభిమానించే 59 ముస్లిం దేశాలు, 180 కోట్ల మంది ముస్లింలు, వందలాది మంది ముస్లిమేతర చరిత్రకారులు, వేలాది మంది ముస్లిమేతర రచయితలూ, లక్షలాది మంది ముస్లిమేతర ప్రముఖులు, కోట్లాది మంది ముస్లిమేతర సామాన్యులు ఉన్నారు. అదే సమయంలో కొందరు చులకన చేసి ద్వేషించేవారూ, అనుచిత వ్యాఖ్యలు చేసేవారు, నోరుంది కదా అని ఏది పడితే అది వాగే చతురులు, వదరుబోతులు తక్కువేమీ కాదు. కొందరు అలా ఎందుకు చేస్తారు అంటే, అది అంతే! ఈగల్లో మధురమైన పానకాన్ని అందించే తేనెటీగలున్నట్లే, గాయాల మీద కూర్చుని చీము నెత్తురు త్రాగే, ఆ గాయాల్ని మరింత పుండులా మార్చే ఈగలున్నట్లే, మలమూత్రాల మీద కూర్చునే, కంపుకొడుతున్న శవాల మీద వాలే ఆ దుర్గంధాన్ని మరింత వ్యాపింపజేసే ఈగలున్నట్లే - మనుషుల్లో కూడా నలుగురు నాలుగు రకాలు. జీవిత యదార్థమేమిటంటే, ఎత్తు ఉంటే పల్లము ఉంటుంది. సుఖం ఉంటే దుఃఖమూ ఉంటుంది. కష్టంతోపాటే సౌఖ్యం సౌలభ్యం ఉంటుంది.
సరే, వారు కల్పించి ప్రచారం చేస్తున్న విషయాల పట్ల నీవు బాధ పడకు. వారి అంతర్‌బాహ్య విషయాలన్నీ మాకు బాగా తెలుసు. (యాసీన్: 76)
మొరగని కుక్కా లేదు ! విమర్శించని నోరూ లేదు .. ఈ రెండూ లేని ఊరే లేదు అన్నారు. అదేంటో గానీ, కొందరికి కొందరిని విమర్శించడం శునకానందం! మనం ఎంచుకన్న రంగం ఏదైనా మన గెలుపోటములు తెలియడానికి కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు ఎక్కడా జరగవు. మనం ఏమి చేసినా మొదట విమర్శ చేసేవారు ఉంటారు, మనల్ని తప్పు పట్టేవారు ఉంటారు, వెనక్కి లాగేవారు ఉంటారు. వాళ్ళకి భయపడి మన కర్తవ్యాన్ని వాయిదా వేయకూడదు. తప్పులు సరిదిద్దుకొని గెలుస్తాం అనే నమ్మకంతో మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే! ప్రియ ప్రవక్త (స) ప్రపంచంలో వెదజల్లిన సత్య సుపరిమళాలను పది మందికి పది కాలాల పాటు పనికొచ్చేలా పంచుకుంటూనే పోవాలి! మహనీయ ముహమ్మద్ (స) వారి సుచరితాన్ని చిత్తశుద్ధితో పరిచయం చేస్తూనే చివరి శ్వాస వరకు సాగుదాం!! ప్రపంచ గతిని, ప్రజల మతిని మార్చడం అల్లాహ్ పని!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు