Tuesday, March 4, 2025
ఉపవాస అంతరార్థం ఆత్మ ప్రక్షాళనం
సహజంగా ప్రతి మనిషిలో కొన్ని కోరికలు ఉంటాయి.తన ఇంట సిరి తోట పూయాలని, తన దారి విరి బాట అవ్వాలని, లోకాలన్నింటిని ఒకే సారి గెలవాలని ముచ్చట పడుతుంది మనసు. అవును, మనిషి మనసు కోరికలకు పుట్టునిల్లు. ప్రతి మనిషి మనసులో కలిగే తపన, ఆరాటమే కోరిక. అది అశగా ఉండొచ్చు. అత్యాశగా రూపాంతరం చెందవచ్చు. ఆశ మనిషి కీర్తి పెంచితే, అత్యాశ అన్నింటిని నట్టేటా ముంచుతుంది. చెలమను తోడినకొద్దీ నీరు ఊరినట్టు కోరికలు తీరిన కొద్దీ కొంగ్రొత్తవి ఊరుతూనే ఉంటాయి, ఊరిస్తూనే ఉంటాయి. అందుకే ”ఒకవేళ ఆదం పుత్రుని వద్ద బంగారం నిండిన ఒక లోయ ఉంటే, రెండు ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. ఒకవేళ అతని వద్ద రెండు బంగారు లోయలుంటే ఇంకొకటి ఉంటే ఇంకా ఎంత బాగుండు అని ఆశ పడతాడు. వాస్తవంగా ఆదమ్ పత్రుని కడుపును ఒక్క కాటి మట్టి తప్ప మరేది నింప జాలదు” అన్నారు మహనీయ ముహమ్మద్ (స). (ముస్లిం)
‘ఆస్తి మూరేడు – ఆశ బారేడు’ అన్నట్టు కోరికల్ని పెంచుకోవడం అంటే ఆగ్నికి ఆజ్యం పోసినట్టే. పెరగడమే కానీ, తరగడం ఉండదు. తృప్తి ఉండదు, శాంతి ఉండదు. మనుషుల్లో కరుణ ఉండదు. కరుణా మయుని పట్ల భయముండదు. కోరికలే గుర్రాలయితే, ఆ కోరికలే అసంఖ్యాకమయితే, అవే ‘కామా తరాణాం న భయం న లజ్జ’ స్థాయి కి చేరుకుంటే మనిషిని కబళిస్తాయి, శాంతిని మింగేస్తాయి. జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేస్తాయి.
కోరికలు తప్పుడు కోరికలు కానంత వరకు కోరికలుండటం తప్పు కాదు. పచ్చని సంసారాన్ని, చక్కని సంతానాన్ని కోరుకోని వారు ఎవ రుంటారు చెప్పండి. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత హోదాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా మనిషి కోరుకునే వాటిలో జర్-ధనం, జన్-స్త్రీ, జమీన్-భూమి తోపాటు కీర్తికండూతి కూడా ఉంది. ”స్త్రీలూ, కుమారులూ, పోగు చేయబడిన బంగారు రాసులూ, అచ్చు వేయబడిన మేలు జాతి అశ్వాలూ, పశువులూ, పంట పొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది” అని సెలవియ్యడంతో పాటు – ”ఇది ప్రాపంచిక సామగ్రి మాత్రమే. అత్యుత్తమ నివాసమయితే అల్లాహ్‌ా వద్దనే ఉంది” అన్న యదార్థాన్ని సయితం ఖుర్‌ఆన్ తెలియ జేస్తుంది. ఇలా అంటుంది: ”ఓ ప్రవక్తా! వారికి చెప్పు, వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభీతి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉం టాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రమయిన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నింటితోపాటు అల్లాహ్‌ా ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది”. (దివ్య ఖుర్‌ఆన్-3;14,15)
భయం – సహజమయిన గుణం భయం. నేల పగిలితే నింగికి భయం, నింగి ఉరిమితే నేలకు భయం. తప్పు చేెస్తే తప్పుటోళ్ళకు భయం. భయ పడితే పెడుతుంది భయం. ఒక్క మాటలో చెప్పా లంటే, మనిషికి తెలిసిన నిజం భయం.
మనిషి కష్టానికి భయ పడతాడు, నష్టానికి భయ పడతాడు. శత్రు వులకు భయ పడాతడు, మిత్రులకు భయ పడతాడు. సంతానానికి భయ పడతాడు, సహధర్మచారిణికి భయ పడతాడు. కొందరికి బతుకంటే భయం. కొందరికి చావంటే భయం. అసలు సంతాపం, దుఃఖం, భయం లేని ప్రపంచాన్ని మనం ఊహించ లేము. అది సాధ్యం కాదు కూడా. కానీ ఓ లోకం ఉంది. సత్కర్మల సామగ్రితో అక్కడికి చేరుకున్న వారికి ఎలాంటి దుఃఖముగానీ, బాధగాని, భయ ముగానీ కలుగదు. అదే స్వర్గలోకం! మహోన్నతుడయిన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”మరి ఎవరయితే ఆచరణలో అత్యుత్తమ రీతిని అవలంబించి తనను తాను అల్లాహ్‌ా సన్నిధిలో సమర్పించు కుంటాడో అతనికి తన ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. అలాంటి వారికి ఎలాంటి భయముగానీ, దుఃఖముగానీ ఉండదు”. (దివ్య ఖుర్‌ఆన్-2;112)
ఇక విశ్వాసి లక్షణం విషయానికొస్తే, ”అటు (అల్లాహ్ శిక్షిస్తాడన్న) భయం, ఇటు (అల్లాహ్ మనిస్తాడన్న)ఆశకి మధ్య అవస్థలో జీవించే వాడే విశ్వాసి” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స).
నిజం, వరాల వసంతం రమజాను మాసంలో మానవాత్మలు, అంతరాత్మలు సచేతనంగా, సజీవంగా,సశ్యశామలంగా కమనీయ కాంతులీనుతూ ఉంటాయి. నిత్య నిర్మల మనో వసంతాన్ని తలపిస్తూ ఉంటాయి. వందేళ్ళ జీవితానుభూతుల్ని చవిచూసిన పండు వృద్ధులయినా, విద్యాసాగర సంచితాన్ని ఔపాసన పట్టిన పండిత మహాశయులయినా, సందిగ్ధంలో సద్వివేకాన్ని, సద్వర్తనుల్ని సంప్రదించి సరైన సమయంలో జీవితాన్ని అతలాకుతలం చేసే అల్లకల్లోలాల అలల మధ్య నుండి బయట పడేయగల నిర్ణయాలు తీసుకునే స్ఫూర్తి, సమయస్ఫూర్తిగా గల సామాన్యులైనా తమకు ప్రాప్తమయిన ఈ శుభ ఘడియల్లో తనివితీరా ఓలలాడేందుకు పరితపిస్తూ కనబడతారు. తూనిగల్లా ఝమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్లలో, రంగు రంగుల దుస్తుల్లో భువన తారకల్లా మెరిపోతూ, పారిజాతాల్లాంటి పవిత్ర దరహాసంతో తేనెలొలుకు పలుకులతో తుళ్లుతూ వీధుల నిండా విహరించే చిన్నారి బాలబాలకల్లో ఒకే స్థాయి భక్తిభావాలు తొణికిసలాడుతూ దర్శనమిస్తాయి. అయిదు పూటల నమాజు సలపడం మానేసి, బజార్లలో బాతాఖానీలో , మాటల మాంత్రికుల నిపించుకునే సరదా సాహెబులు, సారాయి రాయుళ్ళు సయితం బుద్ధిగా ప్రార్థనల్లో పాల్గొంటూ తారసపడతారు. తలను నున్నగా దువ్వుకుని సాదాసీదా బట్టలేసుకుని వీపుకి పుస్తకాల బ్యాగు తగిలించుకుని, అటూ ఇటూ దిక్కులు చూడకుమడా రోడ్డు మీద ఎక్కడా ఆగి పెత్తనాలు చేయకుండా నేరుగా పాఠశాలకు వెళ్ళే చిన్నారి విద్యార్థులు సయితం రోజా వ్రతం పాటిస్తూ ముచ్చటేస్తారు. ఎముకలుడిగిన వయసుతతో బక్కచిక్కిన ముసలివారు సయితం ఎంతో నిష్ఠగా ఉపవాసాలు పాటిస్తూ పరవశించిపోవడం ఒక రమజాను మాసంలోనే కనబడుతుంది. ఇలా రకరకలా సుభక్త జనాలతో హరివిల్లు లోని రంగులన్నీ ఒకే చోట అలరారుతున్నట్లుంటుంది వరాల వసంతం రమజాను మాసం. సమాజ హితానికి, సంఘ క్షేమానికి, వ్యక్తి సంపూర్ణతకి కావలసిన, భక్తిభావనల్ని, ప్రేమాభిమానాన్ని, నమ్మకాన్ని, వ్యక్తా వ్యక్త స్వేచ్చని, అనురాగాన్ని, అనుబంధాన్ని, త్యాగాన్ని, పరస్పర సహ కారాన్ని, సుహృద్భావాన్ని రమజాను మాసం మనలో జనింప జేస్తుంది. ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రార్థించడమే మానవ జీవితానికి అర్థం. దైవప్రేమ తోడుంటే కుత్సిత మతులు ఎన్ని కుయుక్తులు పన్నినా ధర్మోన్నతి కోసం పాటు పడటమే పరమార్థం. ప్రార్థించడం అంటే అనుకున్నంత తేలికయిన విషయం కాదు! మనల్ని మనం దైవానికి పూర్తిగా అర్పించుకోనిదే అది సాధ్యం కాదు. అనునిత్యం మనం హృదయాన్ని దైవ ప్రేమతో వెలిగించే ఉంచాలి. మిథ్యా ఆలోచనలకు తావియ్యకూడదు.
అటు అలజడి ఇటు అలజడి. ఎటు అడుగిడితే అటు కోర్కెల అలికిడి, కాంక్షల పుప్పొడి, తనువు అనువణువు భావ తలంపుల ముళ్ళ తక్కిడి.మెదడులో నీచ నిప్పు కణికల రాపిడి. మనస్సులో తమస్సు తాండవపు సడి. దైవాన్ని మనల్ని పూర్తిగా అర్పించుకో వడం అంత సులభం కాదదని తెలుస్తూనే ఉంది. అందుకనే జడివానలాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కో వాలి. దైవ మహిమ ఏమిటో, ఆయన గుణవిశేషాలేమిటో, ఆయన శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలిసిన వారికే స్వయంగా ఆయన్నే చూస్తున్నామన్నంత తన్మయంతో ప్రార్థించడం చేతనవుతుందని తెలిసిన మనం నిత్యం మారుతుండాలి. మన ప్రవర్తనలో పరివర్తనకై పరితపిస్తూ ఉండాలి. ఉదయం సాయంత్రం దైవకీర్తినలో ఊయలూగాలి మన హృదయం. పొద్దుపై దైవ స్తుతి గీతికలు లిఖిస్తూ ప్రకాశించే ఉదయభానుడు, పగలూరేయీ ప్రతి క్షణం అల్లాహ్ ను ప్రశంసిస్తూ మీరు+నేను=మనం…… మనం ఎప్పుడూ ఇలానే ఉండాలి. పూలలో పరిమళాలై దాగుండాలి. మన ఈ విధేయత అవిధేయతగా రూపు దాల్చకూడదు. మనలో పొంగిపొర్లే భక్తిభావ తరంగాలు భుక్తి సహిత సుడి గుండాలవ్వకూడదు. మనసు మనకు చెప్పకనే త్రోవ తప్పుతుందేమో జాగ్రత్తగా మెలకువమై ఉందాం మనం!
ప్రియ పాఠకుల్లారా! రమజాన్ మనందరి పాలిట దైవం ప్రసాదిం చిన మహదావకాశం. మన కోరికలుకు కళ్ళె వేసి సరయిన దిశలో నడిపించే మహత్తర సమయం. మనలో దైవభక్తిని, నైతిక రీతిని, పరలోక భీతిని, స్వర్గ ప్రీతిని పెంపొందించే పూర్ణ మాసం రమజాన్. ఈ మాసపు కరుణానుగ్రహాలకు అర్హులయినవారే సౌభాగ్యవంతులు. ఈ మాసపు మేలుని జార విడుచుకున్న వారే పరమ దౌర్భాగ్య జీవులు. రమజాను మాసాన్ని వ్యర్థ కార్యకలాపాల్లో వృధా పరచిన వారిని దైవదూతల నాయకులు జిబ్రయీల్ (అ) వారు అభిశపించ గా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు ఆమీన్ అన్నారు. కాబట్టి చినుకు చనుకే వరదవుతుంది. కడవ కడవే కడలవుతుంది. మనం చేసే మంచికయినా, మనం చేసే చెడుకయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. అది మనల్ని గట్టునయినా పడేస్తుంది.లేదా నట్టేటయినా ముంచుతుంది. కాబట్టి అల్లాహ్ మన కర్మల లెక్కలు మనతో తీసు కోక ముందే మనం మన లెక్కలను సరి చూసుకోవాలి. సరి చేసుకో వాలి. సరిగ్గా సన్మార్గాన స్థిరంగా సాగి పోవాలి.
పరమ దయాళువు అయిన అల్లాహ్ మనందరికి ఇస్తున్న ప్రేమైక పిలుపు: ”మీరు మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, భుమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గ సీమ వైపునకు పరుగెత్తండి”. (అల్ హదీద్;21)
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు