Tuesday, March 4, 2025
శుభార్జన - శుభాభిలాష - తబర్రుక్
'తబారకస్ము రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్' - ఘనతా గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమయినది''. (అర్రహ్మాన్: 78)
అరబీలో 'బర్‌కత్' అంటే శుభం, మంచి కొనసాగడం, వృద్ధి,వికాసం అని అర్థం. అల్లాహ్ శుభాలన్నింటికి కేంద్రం. సృష్టిరాశులన్నిలో శుభాన్ని పొందు పర్చేవాడు అల్లాహ్. ఏ వస్తువూ స్వతహాగా శుభప్రదం కాజాలదు. అల్లాహ్ దాన్ని శుభప్రదం చేస్తాడు. శుభార్జన ఆర్తి మానవ నైజంలో ఉన్న అంశం. ఈ కారణంగానే మనం ఖునూత్‌లో అల్లాహ్‌తో ఇలా దుఆ చేస్తాము: ''వ బారిక్ లీ ఫీమా ఆతైత'' -నీవు ప్రసాదించిన దానిలో మాకు శుభాన్ని ప్రసాదించు.
హజ్రత్ ఆయిషా (ర.అ) జువైరియా బిన్త్ హారిస్ (ర,అ) గారి గురించి తెలియజేస్తూ - ''నేను ఆమె విం శుభవంతŠమయిన స్త్రీని చూడ లేదు. ఆమెను ప్రవక్త (స) వివాహం చేసుకొని ఆమె జాతి ప్రజలకు అల్లుడయ్యారన్న కారణంగా, అప్పి వరకూ బానిసగా ఉన్న ఆమె జాతికి చెందిన వంద కుటుంబాలను అణా పైసా తీసుకోకుండా విడుదల చేయడం జరిగింది''. (అబూ దావూద్) అంటే ఆమె స్వతహా గా శుభానికి కేంద్రం కాదు, ఆమె మాధ్యమంగా శుభం జరిపించాడు అల్లాహ్.
శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడు అల్లాహ్
యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు. (ముల్క్: 01)
యావత్తు విశ్వసార్వభౌమత్వం కలిగివున్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు.
కాబట్టి అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. (మోమినూన్: 14)
అల్లాహ్, ఆయనే మీకోసం భూమిని నివాసస్థలంగా, ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. ఆయనే మీకు ఒక రూపాన్నిచ్చి ఎంతో అందంగా మలిచాడు. ఆయనే మీకు పరిశుద్ధ పదార్థాలను ఉపాధిగా ప్రసాదించాడు. (ఇలాంటి సృష్టికార్యాలన్నీ చేసిన) ఆ అల్లాహ్ యే మీ ప్రభువు, పరమ శుభ దాయకుడు, సర్వలోక ప్రభువు. ఆయన మాత్రమే స్వతఃసిద్ధ జీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. (కనుక) మీరు మీ జీవన విధానాన్ని ఆయన కోసం ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ప్రార్థించండి. సకల విధాల ప్రశంసలు, స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. (అల్-మోమిన్: 64-65)
శుభం అని తలచు జయం నిన్ను వలచు
ఉన్నతమైన భావజాలం.. మహోన్నతమైన విజయాన్నిస్తుంది. భావమే బలం.... శుభాన్ని కోరితే అదే ఎదురవుతుంది. మార్పు రావాల్సిందల్లా మన ఆలోచనల్లోనే! మంచినెంచితే.. మంచే పలకరిస్తుంది. అందుకు వేళయింది. వసంత రాకతో ప్రకృతంతా మారిపోతుంది. మనమూ మారిపోదాం. మన ఆలోచనల్ని మార్చుకుందాం. ఉన్నతంగా ఆలోచిద్దాం. మంచిగా మాట్లాడదాం. అప్పుడు అంతటా శుభమే! అన్నిటా జయమే!
ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే విలువైనది, వదిలితే తిరిగి పొందలేనిది, జీవితాలను శాసించేది, ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది, కోరికలను సాకారం చేసుకోవడానికి సహకరించేది, అల్లాహ్ అమూల్య వరనిది కాలం.కాలగమనమే మన జీవనయానం. అటువంటి విశిష్టమైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే అనుకున్న లక్ష్యాలను సాధించగలడు. జీవనసార్థక్యాన్ని పొందగలడు. కాలాన్ని ఎలా సద్వినియోగించుకోవాళూ తెలిసివారే బుద్ధిమంతులు, ఇహపరాల సాఫల్య వంతులు.
ధీమంతులు.. అంటే బుద్ధిమంతుల తమ కాలాన్ని సత్గ్రంథ పఠనం, సత్సంప్రదాయ భూషణం, సత్ప్రవర్తన భాషణం, సజ్జన సాంగత్యం వంటివాటితో గడిపి జ్ఞానాన్ని, శుభాన్ని పొందుతారు. సద్విషయాల పట్ల అవగాహన పెంచుకుని సభ్యతా సంస్కృతిని మెరుగు పరచుకొని, సుసంస్కారాన్ని వృద్ధి పరచుకుని సత్కీర్తిని, సుమధుర సంభాషణను సొంతం చేసుకుంటారు.
శుభాభిలాష - శుభవాత్మలు
గొప్పగా బతకాలని అందరికీ ఉంటుంది. జీవితం శుభాలు వెల్లువలా పోటెత్తాలన్న ఆశలు ఉంటాయి. బతుకు సంతోషాల సప్త రంగుల హరివిల్లవాలన్న ఆలోచనలు ఉండడమూ సహజమే! దీనికి లక్ష్యాలు సరిగ్గా నిర్దేశించుకోవాలి, అటువైపు మడమ తిప్పని ప్రయత్నం జరగాలి. వెలిగే దీపం వేయి దీపాలనయినా వెలిగిస్తుందనే సత్యాన్ని లోకానికి చాటిన మహానుభావులు ఎందరో! లోకానికి వెలుగులు పంచిన పవిత్రాత్మలు, శుబాత్మలు ఎన్నో ఎన్నెన్నో!! .అలాంటి మహాత్ములందరిలో అగ్రగణ్యులు దైవ ప్రవక్తలు. ప్రవక్త ఈసా (అ) వారి మాటగా ఖురాన్ పేర్కొంటున్న వచనం ఇది -
“నేను అల్లాహ్ దాసుడ్ని. ఆయన నాకు దివ్యగ్రంథం ప్రసాదించాడు. ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైనవాణ్ణిగా చేశాడు. నేను బ్రతికున్నంతకాలం నమాజ్, జకాత్ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు.
బిస్మిల్లాహ్ కీ బర్కత్
అల్లాహ్ నామ స్మరణ ఘనత చాలా గొప్పగా ఉంది. అందుకే ముస్లిం జీవితంలో వివిధ సందర్భాలలో “బిస్మిల్లాహ్” అని పలకాలని బోధించడం జరిగింది. భగవంతుని నామంతో ప్రారంభం కాని ప్రతి ముఖ్యమైన విషయం మొండి చేయి లాంటిదే. అంటే శుభరహితమయినదే అన్నారు దైవ ప్రవక్త (స). వాటిలో కొన్ని సందర్భాలు మరియు బిస్మిల్లాహ్ శుభాలను ఇప్పుడు తెలుసుకుందాము
1- పడుకునే ముందు బిస్మికల్లాహుమ్మ అమూతు వఅహ్ యా అనాలి. (బుఖారీ).
2- మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్ (తిర్మిజి, బుఖారీ). అయితే తిర్మిజిలో వచ్చిన హదీసులో ఉంది: ‘ఎవరైతే మరుగుదొడ్లో ప్రవేశించేకి ముందు “బిస్మిల్లాహ్” అంటారో వారి మర్మాంగాలను జిన్నులు చూడకుండా అడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది.’
3,4- ఇంట్లో ప్రవేశించేకి ముందు, భోజనం చేసేకి ముందు ఎవరు “బిస్మిల్లాహ్” అంటారో వారితో పాటు షైతాన్ వారింట్లో ప్రవేశించడు మరియు వారి భోజనంలో కూడా పాల్గొనడు. (ముస్లిం).
5- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయ్యి పెట్టి “బిస్మిల్లాహ్” 3సార్లు, “అఊజు బిల్లాహి వఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్” 7సార్లు చదవాలి. (ముస్లిం, అబూదావూద్). ఇలా చదువుతూ ఉండడం ద్వారా అల్లాహ్ దయతో నొప్పి మాయమైపోతుంది.
ఇంకా వుజూకు ముందు, భార్యభర్తలు కలుసుకునేకి ముందు, వాహనముపై ఎక్కేకి ముందు, జారి పడినప్పుడు, ఇంటి నుండి బైటికి వెళ్ళినప్పుడు, ఉదయసాయంకాలపు దుఆలలో ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి.
శుభ గ్రంథరాజం ఖుర్ఆన్
మేమీ గ్రంథాన్ని కూడా అవతరింపజేశాము. ఇది ఎంతో శుభదాయకమైన గ్రంథం. కనుక మీరు దీన్ని అనుసరిస్తూ భయభక్తుల వైఖరి అవలంబించండి; మీరు కరుణించబడతారు. (అల్-అన్ఆమ్: 155)
''ఇదోక శుభప్రదమయిన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని (ఓ ప్రవక్తా) నీ వైపునకు పంపాము''. (సాద్: 29)
సూరతుల్ బఖరహ్ శుభం:
''సూరతుల్ బఖరహ్‌ను చదవండి. దాన్ని తీసుకోవడం (పారాయణం, కంఠస్థం చేయడం) శుభప్రదం. దాన్ని వదిలేయడం పశ్చాత్తాపం. దాన్ని ఏ మాంత్రికుడూ దాట లేడు''. (ముస్లిం)
గమనిక: ఖుర్‌ఆన్ శుభప్రదమయిన గ్రంథం-సందేహం లేదు. కానీ అల్మారాలో అలంకరించడం వల్ల, దాని ఆయతులు కాగితం మీద వ్రాసి నీళ్ళలో నాన్చి త్రాగడం వల్ల, కళ్ళకద్దుకోవడం వల్ల శుభం కలుగదు. దాన్ని చదవడం, వినడం, అవగాహన చేసుకోవడం, అమలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే సూరతుల్ ఫాతిహా, ముఅవ్వజతైన్ (అల్ ఫలఖ్, అన్నాస్) సూరాల వంటివి మరి కొన్ని సూరాల విశిష్ఠత హథీసుల ద్వారా తెలుస్తుంది.
ప్రపంచంలో వెలుగు దివ్వెల విహారం ఈ విశ్వగ్రంథ పారాయణం
కటిక చీకట్లలో కాంతి పుంజం, క్రాంతి కేతనం, విక్రాంతి నికేతనం, విశ్వశాంతి అభయ క్షేత్రం ఖుర్ఆన్.
అల్లాహ్ వైపు నుండి మీ దగ్గరకు (అజ్ఞానాంధకారం దూరంచేసే) జ్యోతి వచ్చింది. (సన్మార్గం చూపే) దేదీప్యమానమైన దివ్యగ్రంథం కూడా వచ్చింది. దీనిద్వారా దేవుడు తన ప్రసన్నతాభాగ్యం కోరుకునేవారికి ముక్తిమార్గం చూపుతాడు. అదీగాక ఆయన తన అనుగ్రహంతో వారిని కారుచీకట్ల నుండి కాంతి వైపు తీసుకువెళ్తాడు; (అపమార్గం నుండి తీసి) రుజుమార్గంలో నడిపిస్తాడు. (అల్-మాయిదా: 15-16)
శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడు అల్లాహ్ మానవాళికి మహా వరంగా ప్రసాదించిన శుభాల నిధి నిక్షేపం ఖుర్ఆన్. సృష్టిలోని శుభాలన్నిటికి సరోవరం ఖుర్ఆన్. సృష్టిలోని శుభాల సౌరభాలు ఈ సత్గ్రంథం సుగంధ మూలంగానే పరిమళిస్తున్నాయి. విశ్వ ప్రేమను విశ్వ జనుల హృదయ సీమల్లో నాటుతున్నాయి, అది ఏపుగా పెరిగేలా పెంచతున్నాయి... అలా పెరిగి ఆ సాత్విక ప్రేమను చరాచరాల్లో పంచుతున్నాయి.
పేపరు కూడా పవిత్రంగా భావించబడిన వేళ
దివ్య ఖుర్ఆన్ శుభం యొక్క అద్భుతాలలో ఒకటి ఏమిటంటే అది వ్రాయబడిన పేజీలు కూడా పరమ పవిత్రమైనవి, శుభావంతమయినవి అన్నది. ఎందుకంటే అందులో శుభకరుడు, గుణకీర్తి ఘనాఘనుడయిన అల్లాహ్ వాక్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథం వ్రాయబడిన కాగితపు ముక్కలకే అంతటి స్థాయి ఉందంటే, , దానిని సాంతం కంఠస్థం చేసుకున్న, ఇతరులకు నేర్పించిన,దాని మార్గాన్ని అనుసరించి, దాని మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందిన హృదయ స్థాయి ఎంత గొప్పదయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! మీ హృదయసీమ తన్మయం, తాదాత్మ్యంతో తడిసి ముద్దవకపోతే అడగండి
శుభాల వెల్లువ ఈ సత్గ్రంథం
”ఖుర్‌ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్: 204)
ఓ సందర్భంలో ‘అల్లాహ్‌కు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్ అహ్మద్)
”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్ లామ్ మీవ్’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం”. (తిర్మిజీ)
”ఏ సమూహమయినా సరే అల్లాహ్ గృహాల్లోని ఓ గృహం (మస్జిద్)లో సమావేశమయి ఖుర్‌ఆన్ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్‌ా వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం)
”ఎవరినయితే ఖుర్‌ఆన్ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవ సరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ)
పవిత్ర గ్రంథ పరలోక శుభాలు
”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయ ణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం)
”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ)
కన్నవారికి కీర్తి కిరీటాలు
ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్ కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కామతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’. (ముస్నద్ అహ్మద్)
ముక్తి ప్రదాయిని ఈ అంతిమ దైవవాణి
పవిత్ర ఖుర్‌ఆన్ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్ ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89)
విజ్ఞానం శృతి మించి వినాశనం సృష్టిస్తున్న నేటి తరుణంలో, మతం మతి తప్పి మారణ హోమం రగలిస్తున్న నేటి యుగంలో, అస్పృశ్యత, అంటరానితనం, నిమ్నోన్నతా భావం అపశృతులు పలికిస్తున్న నేటి ఆధుని కంలో, ఉన్మాదం, ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తున్న నేటి కలికాలంలో, మారణాస్త్ర నిర్మూ లనమే సమస్త మానవ వికాసమనీ, అఖిల మానవాభ్యుదయమే విశ్వాస దళ ధ్యేయమని వక్కాణిస్తుంది ఖుర్‌ఆన్.
ఈ కారణంగానే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఇలా ఉత్తర్వు జారీ చేశాము: ”ఎవరైనా ప్రతీకార హత్య (శిక్ష)గా లేక ధరణిపై కల్లో లం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషి నైనా చంపితే అతను యావత్తు మానవాళినీ చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళి ని కాపాడినట్లే”. (మాయిదా:32)
శుభ శిఖరం సత్య ప్రవక్త ముహమ్మద్ (స)
ఆయన ద్వారా అల్లాహ్ మానవాళికి చేసిన మేళ్లు అగ్న్యం, అనన్యం, అసంఖ్యాకం.
అల్లాహ్ విశ్వసించినవారిలో వారి జాతికి చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసి వారికి గొప్ప మేలు చేశాడు. ఆ ప్రవక్త వారికి దేవుని సూక్తులు విన్పిస్తూ వారి జీవితాల్ని తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథజ్ఞానం, వివేకాలు బోధిస్తున్నాడు. ఇదివరకు వారు పూర్తిగా అపమార్గంలో పడి ఉండేవారు. (ఆల్--ఇమ్రాన్162-164)
ధరిత్రిపైన దయ – కరుణ – ప్రేమ – మమతల మల్లెలు చల్లేందుకు వచ్చిన మహనీయులు ముహమ్మద్ (స). మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి, వాటిలో ఒక నూతన శక్తిని నింపి మానవత్వపు మందారాలు పూయించడానికి ప్రభవించిన మహోపకారి మహా ప్రవక్త ముహమ్మద్ (స).ఆయన శుభాలు ఆయన మాతృ గర్భంలో ఉన్నప్పుడే పురుడు పోసుకున్నాయి. ఆయన జననం పుడమికే ఓ అనిర్వచనీయ పులకింత. మానవాళికే ఓ శుభోదయం.
ఆయన తల్లి అమీనా బిన్త్ వాహబ్ గారు ఇలా అన్నారు: తను నా గర్భంలో ఉన్నప్పుడు స్త్రీలు సాధారణంగా అనుభవించే నొప్పి, బలహీనతను నేను అనుభవించలేదు. తనది సులభమైన, శుభవంతమైన గర్భం.
విశ్వనాయకుడు (స ) రబీవుల్ అవ్వల్ 9వ తేది (క్రీ.శ 571 ఏవ్రిల్ నెల 20వ తేది) సోమవారం నాడు జన్మి చారు. ఇబ్ను సాద్ కథనం ప్రకారం- మహా ప్రవక్త (స ) గారి తల్లి ఇలా అభిప్రాయపడ్డారు: ”నేను ముహమ్మద్ (స ) ను ప్రసవించినప్పుడు నా నుండి అనిర్వచనీయమైన ఓ అద్భుత కాంతి వెలువడింది. అది సిరియా భవనాలన్నింటినీ వెలుగుతో నింపేసింది”. మరికొన్ని కథనాల ప్రకారం – ఆ సందర్భంగా కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. తరాల తరబడి మజూసీలు పూజించే అగ్ని ఒక్క సారిగా చల్లారిపోయింది. బుహైరా, సావా ప్రాంతాల్లోని విగ్రహాలు కూలిపోయాయి.
ఆయా హలీమా ముహమ్మద్ (స) ద్వారా ప్రాప్తమయిన శుభాలను కళ్ళారా తిలకించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఆమె బాల ముహమ్మద్ (స)ను ఒడిలో తీసుకున్న మరుక్షణమే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. ఆమె గొర్రెలు లావెక్కాయి. వాటి పాలు రెట్టింపయ్యింది. గొర్రెలు మేసే చోట కూడా గడ్డి దట్టంగా మొలిచింది. పూర్వం అదే నేల బీడువారి ఉండేది. మహనీయ ముహమ్మద్ (స) పెరిగి పెద్ద వారవుతున్న కొద్దీ ఆ శుభాలు కూడా అధికమవ్వసాగాయి.
ఆయన (స) వారి జడివానలాంటి శుభాలకు గొప్ప తార్కాణం మదీనా నగరం. అది ముంది యస్రిబ్ గా పిలువబడేది. అజ్ఞానాంధకారాలు నిండుగా ఉండేవి. అలాంటి నగరం ఆయన ఆగమనంతో మదీనా మునవ్వరహ్ - కాంతి నగరం అయింది. దివ్యావిష్కృతి దివ్వెలు ఆ నగరం నది వీధుల్లో వెలుగుల ముగ్గులు వేశాయి. నిత్యం రోగాలు, విపత్తులు. కరువుకటాకాలతో కకావికలమయ్యే ఆ పట్టణం తర్వాతి కాలంలో ప్రపంచ పచ్చనయిన ప్రగతికి పూల బాటలు వేసింది. అందుకు కారణం ఆయన (స) చేసిన ప్రార్థన కోసం కీలకమయినది.
”ఓ అల్లాహ్! వీళ్ళ తూకాల్లో శుభాన్ని ఒసగు. వీళ్ళ కొలతలైన ‘సా’ ‘ముద్’లలో సమృద్ధిని శుభాన్ని ప్రసాదించు”. (సహీహ్ ముస్లిం)
ఓ అల్లాహ్! నువ్వు మక్కాలో ఎంతటి శుభాన్ని పెట్టావో దానికి రెండింతలు శుభాన్ని మదీనాలో పొందు పరచు". (బుఖారీ, ముస్లిం)
మక్కా నుండి హిజ్రత్ చేసిన తర్వాత ప్రవక్త మహనీయులు(స) ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి ప్రక్కనే ఆయన నిర్మించిన మస్జిద్ ‘మస్జిదె నబవీ’ (ప్రవక్త మస్జిదు)గా ప్రసిద్ధి చెందింది. మదీనా నగరం హరమె నబవీ (స)గా, దారుల్ హిజ్రత్‌గా ఖ్యాతి గడించింది. ఇంకా అది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే మహా ప్రవక్త (స) మదీనా నగరాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన (స) ఇలా విన్నవించుకున్నారు:
”ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అ) మక్కాను పవిత్ర స్థలం (హరమ్)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం(మదీనా)లోని రెండు రాతి ప్రదేశాల నడుమ భాగాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను”. (సహీహ్ ముస్లిం)
ప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవితంలో శుభం:
అంతిమ దైవ ప్రవక్త(స) పుట్ట్టుక నుండి ప్రవక్త అయ్యేంత వరకు ఎన్నో శుభాలు. ఆయనకు ప్రవక్త పదవి ప్రసాదించ బడిన తర్వాత ఆ శుభాలు మరింతగా పెరిగి పోయాయి. పాలల్లో శుభం, నీళ్ళల్లో శుభం, నెయ్యిలో శుభం, ఖర్జూరాలలో శుభం, పిండిలో శుభం, మాంసంలో శుభం, సంతానంలో శుభం, సంసారంలో శుభం - ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు సంబంధించిన సకల వస్తువులు శుభవంతమ యినవే. సహాబా ప్రవక్త(స)వారి చెమట నుండి, ఎంగిలి నుండి, వెంట్రుకల నుండి శుభాన్ని అర్జించేవారు. ప్రామాణిక హథీసుల ద్వారా ఇది రూఢీ అయిన విషయం.
ఓ పల్లెటూరి వ్యక్తి ప్రవక్త (స) వారికి దుప్పటిని బహూకరించాడు. ప్రవక్త దాన్ని కప్పుకున్నారు. అంతలోనే 'నా దుప్పటి నాకు తిరిగి ఇచ్చేయండి' అన్నాడా వ్యక్తి. అది గమనించిన సహాబా,'ఏమిటయ్యా! నువ్వు ముందేమో బహూకరించావు,అంతలోనే తిరిగి తీసుకుంటున్నావేంటి?' అని నిలదీయగా-''నేను (ప్రవక్త (స) వారి పవిత్ర శరీరాన్ని తాకిన) ఈ దుప్పి శుభాన్ని పొందాలని అలా చేశాను.ఈ దుప్పిలోనే నన్ను కఫన్ ఇవ్వాలన్నది నా ఆకాంక్ష'' అని వివరణ ఇచ్చాడు. (బుఖారీ)
శుభ కామన
మనకు ప్రతిదానిలో శుభం అవసరం. మనకు శుభాశీస్సులు అవసరమైన అత్యంత ముఖ్యమైన విషయాలు
శుభం కోరుకోని వారు ఎవరుంటారు? చెప్పండి! వేయి శుభములు కలుగు నీకు.. నీ ఆశయే ఫలియించెలే.... జయ మంగళం నిత్య శుభ మంగళం... అని మనం ఆప్తులను సాగనంపడం పరిపాటే. పెద్దల చల్లని దీవేన శుభం చేకూరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. సంపదలను అందిస్తుంది. శత్రువును అంతమొందిస్తుంది. అంత మహిమాన్వితమైన శుభాశీస్సులు అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుందాం!
జీవితానికి ఉపయోగపడేవి (శ్రేయస్సు), మనస్సుకి నప్పేవి (ప్రియము/ ప్రేయస్సు) రెండూ మనిషిని సమీపిస్తాయి. మూర్ఖుడు అప్పటికప్పుడు సుఖాన్నీ, లాభాన్నీ అందించే ప్రియమైనవాటిని ఎన్నుకొంటాడు. కానీ ధీరుడు అలా కాదు! ఏదైతే శుభకరమో, అవసరమో... అలాంటి శ్రేయస్సుని కలిగించేవాటిని ఎంచుకొంటాడు.
ఆప్తులతో ఆయువులో శుభం
హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు : తన ఉపాధిలో
సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదలను కోరుకుంటున్నవాడు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. (బుఖారీ- ముస్లిం)
బంధువులతో మంచిగా మెలిగే వ్యక్తికి పరలోకంలో ఎలాగూ పుణ్యం లభిస్తుంది. దాంతోపాటు ఇహలోకంలోనూ అతనికి పై హదీసులో పేర్కొనబడిన రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉపాధిలో వృద్ధినొసగబడటమంటే దైవం తరపునుండి నిజంగానే అతని ఉపాధిలో అభివృద్ధి కనిపించవచ్చు లేదా అతని ఉపాధిలో శుభం కలుగుతుందన్న అర్థమైనా కావచ్చు. అదేవిధంగా ఆయుష్షులో పెరుగుదల అంటే నిజంగానే అల్లాహ్ అతని ఆయుష్షుని పొడిగించవచ్చు లేదా అతని ఆయుష్షులో శుభాన్ని ప్రసాదించవచ్చు. ఆయుష్షులో శుభం కలిగితే జీవితంలో మనిషి సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాడు.
దీర్ఘాయుష్మాన్ కూడా గొప్ప దీవెనె
హజ్రత్ అబూ సఫ్వాన్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ అమీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : దీర్ఘాయుషుతో పాటు సదాచరణ కలిగిన వ్యక్తి ఉత్తముడు. ప్రజలందరిలోకెల్లా (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు.) (సుననె తిర్మిజీ)
విశ్వాసం (ఈమాన్), సదాచరణలతోపాటు దీర్ఘాయుషు లభించడం కూడా ఒక వరమే. దీనికి విరుద్ధంగా ఈ రెండింటిలో ఏది లోపించినా ఆయువు పెరిగిన కొద్దీ జీవితం పాపాల పుట్టగా తయారవుతుంది. ఇటువంటి దీర్ఘాయుషు మనిషి పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది. ఈ వరం విలువను గుర్తించనివారు చాలా నష్టపోతారు.
ఆహారంలో శుభం:
''కలిసి భోంచేయండి. భోంచేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనండి. తద్వారా మీకు అందులో శుభం ప్రసాదించ బడుతుంది''. (అబూ దావూద్)
''భోజనం మధ్యలో శుభం అవతరిస్తుంది. భోంచేటప్పుడు పక్కల నుండి భోంచేయండి. మధ్యలో నుండి తినకండి''. (తిర్మిజీ)
''మీరు మీ ఆహారాన్ని తూచండి. తద్వారా మీకు శుభం కలుగుతుంది'' అన్నారు ప్రవక్త (స). (ముస్నద్ అహ్మద్)
గమనిక: అవసరానికి మించి వండటం, సరదాగా ఎక్కువ వండటం, బడాయి కోసం ఎక్కువ వండటం - అన్నీ నిషిద్ధమే. ఒకవేళ అవస రానికి తగ్గట్టు వండినా, మిగిలిపోతే దాన్ని పారేయకూడదు. ఇతరుల కు ఇచ్చి వేయాలి.
సమయంలో శుభం
హజ్రత్ సక్ర్ బిన్ వదాఅ గామిదీ సహాబీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) "దేవా! నా అనుచర సమాజం వేకువజాములో (చేసే ప్రయాణంలో) శుభాన్ని అవతరింపజేయి" అని ప్రార్థిం చారు. ఆయన ఏదయినా సైనిక పటాలాన్ని గాని లేదా సైనిక దళాన్ని గాని పంపినప్పుడు దాన్ని వేకువజామునే పంపేవారు.
ఈ హదీసును తెలియజేసిన సక్ర్ (రజి) స్వయంగా ఓ వ్యాపారి. ఈయన కూడా తన వ్యాపార సామగ్రిని వేకువ జాము లోనే రవాణా చేసేవారు. (దైవప్రవక్త (సల్లం) ప్రార్ధన) ఫలితంగా ఆయన గొప్ప ధనికులయ్యారు. ఆయన సంపద వృద్దిచెందింది. (అబూ దావూద్, తిర్మిజీ, హసన్)
ప్రయాణంగాని, వస్తు రవాణాగాని వేకువ జాములో మొదలయితే, అది లాభదాయ కంగానూ, శుభకరంగానూ ఉంటుందని పై హదీసుద్వారా బోధపడుతోంది. ఆ సమయంలో మనుషులు తాజాగా, హుషారుగా ఉంటారు. పనిచేసే శక్తి, ఓపిక వారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకనే ఆ సమయంలో చేసే పనులు చాలా తొందరగా పూర్తవుతాయి.
ఇల్లు - ఇల్లాలు
ఇల్లాలే ఇంటికి దీపం అయితే ఇల్లే ఇలలో స్వర్గమవుంటుంది. ఆమె చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ. ఉత్తమ ఇల్లాలి చిరునవ్వు భర్తకు ప్రాణవాయువులు. దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారు:
భాగ్యం మూడు విషయాల్లో ఉంది. 1) సుగుణవతి అయిన సతీమణి. మీరు ఆమెను చూడగానే సంబరపడిపోతారు, ఆమె సత్ప్రవర్తనకు సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. మీరు లేనప్పుడు మీ ధన, మాన, సంతాన విషయంలో ఆమెను మీరు బలంగా నమ్ముతారు. 2) సౌఖ్యవంతమైన సవారీ, సౌకర్యవంతమైన వాహనం. 3) సకల సౌకర్యాల గల సువిశాలమైన ఇల్లు. (ఇబ్ను హిబ్బాన్)
శుభాల వెల్లువ ఈ దుఆ
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక మినాల్ - ఖైరీ కుల్లిహీ 'ఆజిలిహి వ ఆజిలిహి మా'అలిమ్తు మిన్హు వమా లమ్ ఆ'అలం, వ అ'ఊజూ బిక మినష్ షర్రి కుల్లిహీ 'ఆజిలిహి వ ఆజిలిహి మా'అలిమ్తు మిన్హు వమా లమ్ ఆ'అలం.. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఖైరి మా సఅలక బిహీ అబ్దుక వ నబియ్యుక. వ అ'ఊజూ బిక మిన్ షర్రి మస్తఆజ బిక అబ్దుక వ నబియ్యుక. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత వమా కర్రబ ఇలైహా మిన్ కౌలిన్ వ అమల్. వ అ'ఊజూ బిక మినన్ నార్ వమా కర్రబ ఇలైహా మిన్ కౌలిన్ వ అమల్. వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖజాయిన్ ఖజయితహూ లీ ఖైరా.
సహాబా - సజ్జన పూర్వీకులు
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రజలందరిలోకెల్లా ఉత్తములు నా తరానికి చెందినవారు. పిదప వారి తర్వాత వచ్చేవారు, ఆనక వారి తర్వాత వచ్చే వారు”. (బుఖారీ)
”నక్షత్రాలు ఆకాశానికి రక్ష. అవి రాలి పడ్డాయంటే ఆకాశంలో సంభవించాల్సింది సంభవించి తీరుతుంది. నేను నా సహాబహ్‌కు రక్ష. నేను గనక ఈ ప్రపంచ వేదిక నుండి నిష్క్రమిస్తే నా సహాబహ్‌ాకు చెయ్యబడిన వాగ్దానం నెర వేరుతుంది. నా సహాబహ్ నా సముదాయానికి రక్ష. వారు గనక నిష్క్రమిస్తే వారికి వాగ్దానం చెయ్యబడిన విషయాలు సంభవించి తీరతాయి”. అన్నారు మహనీయ ముహమ్మద్ (స). ( ముస్లిం) ముస్లిములందరూ శుభవంతులే
వృక్షాలలో ఒక వృక్షం ఉంది. దాని శుభం ఒక విశ్వాసి శుభాన్ని పోలి ఉంటుంది అన్నారు దైవ ప్రవక్త (స). (బుఖారీ)
జాతి, ఇంటి, ధర్మ పెద్దలు
శుభం మీ పెద్దలతోపాటే ఉంటుంది అన్నారు దైవ ప్రవక్త (స). (తబ్రానీ)
శుభ జలం జమ్
పృధ్విపై అత్యుత్తమ (పరిశుభ్రమైన, శుభకరమైన) నీరు జమ్ జమ్ నీరు; అది ఆకలిగొన్నవారికి తిండి/భోజనంగా, రోగికి స్వస్థతగా పనిచేస్తుంది. (సహీ తర్గీబ్ 1161. ఉల్లేఖనం: ఇబ్నె అబ్బాస్).
తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.
జమ్ జమ్ నీరు ఏ సదుద్దేశ్యంతో తాగడం జరుగుతుందో అది పూర్తవుతుంది. (సహీ తర్గీబ్ 1164, 1165. ఇబ్నె అబ్బాస్, జాబిర్).
ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.
శుభ క్షీర సేవనం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరికయితే అల్లాహ్ ఏదేని ఆహారం తినిపించాడో, అతను ఇలా చెప్పాలి: ఓ అల్లాహ్ , ఇందులో మాకు శుభాన్ని ప్రసాదించు, దీనికన్నా మేలైన ఆహారాన్ని మాకు ప్రసాదించు. ఇక ఎవరికయితే అల్లాహ్ పాలు తాపించాడో వారు ఇలా అనాలి. ఓ అల్లాహ్, మాకు ఇందులో శుభాన్ని ప్రసాదించు. ఈ శుభ క్షీర పానీయాన్నే మరింత అధికంగా అనుగ్రహించు. ఎందుకంటే పాలకి సమానమైనది, దానికన్నా మేలైనది మరొకటి లేదు. (ముస్నద్ అహ్మద్)
శుభ ఘడియలు
ఘడియలు, దినాలన్నీ మంచివే. అయితే వీటికి ఒకింత ప్రాధాన్యత ఎక్కువ-జుమా దినం, రమాజును మాసం, జుల్‌హిజ్జా తొలి 10 రోజులు, లైలతుల్ ఖద్ర్, రాత్రి మూడోవంతు భాగం, సోమవారం, గురువారం మొదలయినవి.
శుభవంతమయిన వస్తువులు:
జైతూన్-ఆలివ్ (చెట్టు, కాయ, నూనె). పాలు, కలోంజీ, అజ్వా ఖర్జూరం, ఖర్జూరం చెట్టు, జమ్‌జమ్ జలం, తొలి వాన చినుకులు మొదలయినవి
శుభప్రదమయిన స్థలాలు:
మస్జిదె నబవీ (వ్రవక్త మస్జిదు) గొప్పతనం: భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తునుస్పష్టపరుస్తూ అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:
1) ”నా ఈ మస్జిద్‌లో నమాజు చేయటం – ఒక్క మస్జిదె హరమ్ తప్పించి – వేరితర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది”. (ముస్నదె అహ్మద్)
2) ”మస్జిదె హరమ్‌లో నమాజు చేయటం వేరితర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుకన్నా శ్రేష్ఠమైనది”. (ముస్నదె అహ్మద్)
3) ”మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే – 1) మస్జిదె హరమ్ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా”.
4) ”నా నివాస గృహానికి – (ఈ మస్జిద్‌లోని) నా వేదిక (మింబర్)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం”. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
మస్జిద్‌లు- ముఖ్యంగా మస్జిదె హరామ్, అఖ్సా మస్జిద్, మస్జిద్ నబవీ. ఈ ప్రదేశాల్ని తాకడం వల్ల, అక్కడి మట్టిని మోసుకు రావడం, తినడం వల్ల శుభం కలుగదు. వాటిలో నమాజు చదవడం వల్ల, ఖుర్‌ఆన్ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
శుభార్జన – శుభాభిలాష లో అధర్మ విధానాలు
ఈ మార్గం గుండా కొన్ని సంద ర్భాలలో షిర్క్ చోటు చేసుకునే, షిర్క్‌కి దగ్గర చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బర్‌కత్, తబర్రుక్ పూర్వపరాల్ని తెలుసుకోవడం మంచిది.
అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.
అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. (తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.
కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్) పొందటం :
కొత్తగా ధర్మంలో ప్రవేశ పెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు.
ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్‌ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు.
కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్ తరపున బరకత్ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్ కాదుగానీ, షిర్క్‌కు దోహదపడే ఒక సాధనమవుతుంది.
ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు.
అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు.
అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు.
కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం?
హెచ్చరిక:
ప్రవక్త ముహమ్మద్ (స) వారికి సంబంధించిన వస్తువులతో తప్ప ప్రపంచంలో మరే వ్యక్తి సంబంధించిన వస్తువులతో శుభం పొందాలనుకోవడం అధర్మం. వారు ఎంతటి వారలయినా సరే. అలాగే ప్రవక్త ముహమ్మద్ (స) వారి వస్తువులు అని ప్రచారం కల్పించి పబ్బం గడుపుకుంటున్న వారి వద్ద అవి ప్రవక్త (స) వారి వస్తువులు అన్న ఒక్క ఆధారం కూడా లేదు అని పరిశోధన నిమిత్తమే ప్రత్యేకించబడిన పండితుల బృందం తీర్మానించింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడయినా అలా జరుగుతుందంటే అది ముమ్మాటికీ అధర్మమే. జమ్ము-కశ్మీర్‌లో హజ్రత్ బల్ దర్గాహ్ వంటి దుకాణాలు ఇతర చోట్ల సయితం తారస పడతాయి. అక్కడ ప్రవక్త (స) వారి వెంట్రుక ఉందన్న పుకారును షికారు కొట్టిస్తున్నారు నమ్నకాన్ని అమ్ముకునే నయవంచకులు. తస్మాత్ జాగ్రత్త!
‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్ కోరుట కూడా తప్పు.
కాబతుల్లా లోని హజర్ అస్వద్ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు