Tuesday, March 4, 2025
“హమారా సంవిధాన్.. హమారా స్వాభిమాన్ ”
రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తవడాన్ని ఘనమైన వేడుకగా కొన్ని రోజుల క్రితమే చేసుకున్నాము. కనిపించని సింహంలా... ఆపన్నులపాలిట జీవరేఖలా 75 ఏళ్లుగా... స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అనుక్షణం ఊపిరిలూదుతోంది...మన రాజ్యాంగం! భారత రాజ్యాంగాన్ని... ఓటేస్తున్నప్పుడల్లా తలుచుకోవాలి. సభ సమావేశానికి బయల్దేరుతున్న ప్రతిసారీ గుర్తు చేసుకోవాలి. అన్యాయాన్ని ప్రశ్నించడానికి గొంతు సవరించుకున్నప్పుడల్లా స్మరించుకోవాలి. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత రాజ్యాంగ ప్రసాదించినవి. భారత పౌరుడి దృష్టిలో మువ్వన్నెల జెండా ఎంతో మహోన్నతమైన రాజ్యాంగము అంతే.
ఒక వ్యవస్థ 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు, ఒక్కసారి, నాటి పరిస్థితుల్ని గుర్తుచేసుకోండి. ముక్కలైన దేశం పచ్చిపుండులా విభజన గాయాలు, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ అంతులేని అంతరాలు. భవిత పట్ల అనిశ్చితి. ప్రపంచ దేశాల చూపులన్నీ మనవైపే. మేధావుల బుర్రల్లో అనేక ప్రశ్నలు... ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుందా? ఇంతమంది నిరక్షరాస్యులున్న చోట ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉంటుందా? భిన్న సిద్ధాంతాలూ, దృక్పథాలూ సంఘర్షించుకునే వాతావరణంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తారా? అటువంటి సందేహాలనన్నింటినీ, శంకలన్నింటినీ, సంశయాలన్నింటినీ పటాపంచలు చేసిన రాజ్యాంగం, నేడు మనల్ని ఉన్నత స్థానంలో స్థిర పరచి, దృఢ పరచింది. ఈ ఘనతను సాధ్యం చేసిన రాజ్యాంగ నిర్మాతలకే కాక, రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించి, గౌరవించిన కోట్లాది పౌరులకు కూడా చెయ్యెత్తి జై కొట్టాల్సిన శుభ ఘడియ ఇది.. ‘‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా’’ అని వేములపల్లి శ్రీకృష్ణ గారు అన్నట్టు - తెలుగువారం అయిన మనమందరం భారత స్వాతంత్ర సమరయోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు, వందల సంవత్సరాలుగా దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర జవానులకు, దేశ నాడి అయిన శ్రామిక జీవులైన కిసానులకు ఘన నివాళులు అర్పించాలి. జై జవాన్!… జై కిసాన్!.. జయహో భారత సంవిధాన్!... అని నినదించాలి!!!
ప్రభుత్వాలు... రైతులకు పెట్టుబడి డబ్బులిస్తున్నా. బడి వయసు పిల్లల అమ్మలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నా, వితంతువులకూ వయోధికులకూ నెలనెలా పింఛన్లు మంజూరు చేస్తున్నా. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రకటిస్తున్నా. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెస్తున్నా... ఇదంతా, రాజ్యాంగంలోని 'సంక్షేమ రాజ్య' భావనలో భాగమే పౌరుల సామాజిక, ఆర్ధిక వికాసానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిక సూత్రాల ద్వారా మార్గదర్శనం చేసింది. ఆసలైన భారతదేశం రాజకీయ రాజధానిలోనో, వాణిజ్య రాజధానిలోనో లేదు. వేలకొద్దీ గ్రామాల్లో ఉంది. పల్లె పండిస్తేనే పట్నం కడుపు నిండుతుంది. రైతు ఆనందమే దేశానికి సంతోషం. అందుకే గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి పిలుపునిచ్చారు.
మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రాజ్యాంగ సభకు చెందిన 15 మంది గౌరవనీయ మహిళలు క్రియాశీలంగా పనిచేశారు. వారు తమ అభిప్రాయాలతో చర్చల స్థాయిని పెంచేవారు. భిన్న నేపథ్యాలకు చెందిన వీరు చేసిన సూచనలు రాజ్యాంగానికి చక్కని దిశను సూచించాయి. మహిళలకు సమానహక్కులు కల్పించేందుకు అనేక ప్రపంచ దేశాలు ఎంతో సమయం తీసుకుంటే, మన దేశంలో రాజ్యాంగం అమలు తొలి రోజు నుంచీ మహిళలకు ఓటు హక్కును కల్పించడం మనందరికీ గర్వకారణం. పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించడం ఒక లెక్క. అన్న త్రీవిక్రమ్ గారి మాటలు గమనార్హం!
వినా స్త్రీయా జననం నాస్తి - స్త్రీ లేకపోతే జననం లేదు
వినా స్త్రీయా గమనం నాస్తి - స్త్రీ లేకపోతే గమనం లేదు
వినా స్త్రీయా జీవం నాస్తి - స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు
వినా స్త్రీయా సృష్టియేవ నాస్తి - స్త్రీ లేకపోతే సృష్టే లేదు
అని గొప్పగా చెప్పుకుంటాం..! కానీ నేటి సమాజంలో చెప్పుకోవడానికి ఆడవారి గొప్పదనం ఎంతుందో ఆడవారి పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అన్ని ఉన్నాయి..
అమ్మ కడుపులో నుంచే పుడతాం,.. అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలే వింటాం... అక్క చెల్లెల్లు జతగా పెరుగుతాం,... భార్యతో జీవితం పంచుకుంటాం,.. కూతురుని ప్రేమగా పెంచుకుంటాం..పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆడవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది..! కానీ వీళ్ళేవరు కాకుండా వేరే అమ్మాయిని మాత్రం తక్కువ చేసి మాట్లాడతాం, చులకనగా చూస్తాం, తప్పుగా ఆలోచిస్తాం..! తప్పు ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది అని ఆలోచించం, ఎవరైనా అడిగితే మౌనం వహిస్తాం, లేదంటే ఆ తప్పుని కూడా ఆడవారి మీదకే తోసేస్తాం..! మనలో ఆలోచన విధానం మారితేనే చాలా వరకు ఆడవారి మీద అత్యాచారాలు తగ్గుతాయి..!
మనం అందరం పీవీ సింధు, సైనా నెహ్వాల్, మిథాలి రాజ్ క్రీడల్లో రాణించి కప్పులు సాధిస్తే ఎంతో గర్వపడి వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ పోస్టులు పెడతాం కానీ మన ఇంటి అడపిల్లలని మాత్రం ఆటలు ఆడటానికి ప్రోత్సహించం..! ఎక్కడి వరకో ఎందుకు మన ఇంట్లో మన అమ్మ గురించి తెలుసుకుంటే చాలు ఆడవారిని ఎందుకు గౌరవించాలో అర్థం అవుతుంది..
ఇంట్లో అమ్మ - అందరికంటే ముందే నిద్ర లేస్తుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, మనం లేవగానే టీ కాఫీలు పెడుతుంది,అందరికి టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్ననానికి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది, పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్ళగానే, వండిన, తిని పడేసిన సామాన్లు కడుగుతుంది, బట్టలు ఉతికేస్తుంది, మళ్ళీ మనం సాయంత్రం రాగానే టీలు, కాఫీలు, స్నాక్స్ చేసి పెడుతుంది, మళ్ళీ వంట చేస్తుంది, అందరం తిన్నాక తింటుంది.. మళ్ళీ అన్ని కడిగేసి అందరం పడుకున్నాక పడుకుంటుంది, మళ్ళీ తెల్లరకముందే మన అందరికంటే ముందు లేస్తుంది..! ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, రోజు చూసే విషయాలే కానీ అమ్మ చేసే పనులు చెయ్యడం మాత్రం చూసి వదిలేసినంత తేలిక కాదు..!
ఒక్క రోజు కాస్త పని ఎక్కువై అలసిపోతే మగవాళ్ళం ఇంటికి వచ్చి పడుకుంటాం కానీ ఆడవారు అలసిన, ఆరోగ్యం బాగోకపోయిన ఏది ఏమైనా ఎంత పని అయిన వాళ్ళే చేసుకుంటారు..! అంతెందుకు ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా తాను లేచి టీ, టిఫిన్లు పెట్టిస్తే కానీ టీ తాగని టిఫిన్లు తినని ఇల్లు ఎన్నో ఉన్నాయి..! ఏ ఒక్క మగాడు కూడా ఇంట్లో అమ్మ భార్య చేసే పనులన్నీ ఒకే రోజు చెయ్యలేడు, ఒకవేళ అందులో సగం చేసిన ఆ కష్టం తెలిసి అమ్మకి, భార్యకి సెల్యూట్ కట్టకుండా ఉండలేడు..! ఆడవారు చేసే శ్రమ కనబడదు కానీ వారే లేకపోతే ఈ సృష్టిలో మానవ మనుగడే కనబడదు..! కాబట్టి ఇంట్లోని పనుల్లో కూడా ఆడవారికి సహాయపడదాం..!
దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ సెలవిచ్చాడు: "వారి (స్త్రీల) పట్ల సద్భావంతో మెలగండి." (నిసా: 19)
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ఉత్తమ నడవడిక గల వారే పరిపూర్ణ విశ్వాసులు. మీలో తమ భార్యల పట్ల, స్త్రీల పట్ల మంచిగా మెలిగేవారే అందరికన్నా శ్రేష్ఠులు.”(తిర్మిజీ)
భారత రాజ్యాంగం ఒక జీవశాస్త్రం. అది మానవ అభ్యుదయ సోపానం. ప్రజాజీవన సమన్వయ సముజ్వల ప్రభాసమాన దీపిక. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమ రాజ్యాంగంగా కొనియాడబడింది. ఇక మీదట కూడా వేనోళ్ళ కీర్తించబడుతూనే ఉండాలని బలంగా కోరుకుందాం!
రాజ్యాంగం ఆత్మ, ఎక్కడో ఉండదు, దేశ ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అక్షర రూపం భారత రాజ్యాంగం. ఐదు తరాలుగా, తరతరానికి మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ భారత రాజ్యాంగం సజీవ చిత్రంగా ముందుకు సాగుతోంది. భారత రాజ్యాంగానికి చేసిన సవరణల అమలు తీరు తెన్నులు మన నిత్యజీవితాలను ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబిస్తున్నాయి.
"రాజ్యాంగం కేవలం ప్రభుత్వం మాత్రమే పాటించాల్సిన ప్రామాణిక పత్రం మాత్రమే అయినట్లయితే ప్రజాస్వామ్యం చిక్కుల్లో పడుతుంది. అందుకే అది కిందిస్థాయికి చేరాలి." "రాజ్యాంగం గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే భారతదేశ ఐకృత.. భారతీయులకు గౌరవం- ఈ రెండు మౌలిక సూత్రాలను సాకారం చేసేదే రాజ్యాంగమని మనం భాష్యం చెప్పుకోవచ్చు..”
భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమూహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూల స్తంభాలుగా- అన్ని విధాలా ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా- దేశ ప్రజల జీవితాల్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. పేద, ధనిక అని తేడా లేకుండా ఓటు హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్నా అని రాజ్యాంగ చలవే. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, సంప్రదాయాలు... భిన్న మతాలు, వేల కులాలున్నా... దేశ విభజన, అల్లకల్లోల పరిస్థితులు అస్తవ్యస్త ఆర్థిక స్థితిగతులు... చైనా, పాక్లతో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు ఎమర్జెన్సీలాంటి దిగజారుడులు... ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, కశ్మీర్లలో పెచ్చరిల్లిన ఉగ్రవాదం... ఇలా విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా... భారతావనిలో ప్రజాస్వామ్యం నిలబడటం కాదు బలపడింది. కారణం... మన రాజ్యాంగం! జాతిగా నిలిపి... దేశంగా కలిపి ఉంచుతున్న రక్షాబంధం మన రాజ్యాంగం! అందుకే మన సంవిధానం.. మన స్వాభిమానం!!
ఏడు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆ రాజ్యాంగ ప్రతి-ఈ రోజుకు కూడా ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు, పౌరులకు కూడా నిత్యనూతనంగా ఉపయోగపడుతున్నది. మౌలిక సూత్రాలయిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం గట్టిదన్నుగా నిలిచి- ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడడంలో, సాధారణ పౌరులకు వారి ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేయడంలో మన రాజ్యంగం- యావద్భారత సమాజానికి దారిదీపంగా నిలిచింది.
భారతదేశంలో 140 కోట్ల మందిలో సుమారు 50 కోట్ల మంది యువకులే ఉండటం మనకు గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల చేతిలో ఉంది. కానీ పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని, నవ్యతను దెబ్బ తీస్తున్నారు. హక్కులు లేని పౌరసత్వం బానిసత్వంతో సమానం. ప్రజాస్వామ్యం అన్నాక హక్కులుండాలి. ఆ హక్కులకు బలమైన భరోసా అండాలి. మధ్యయుగాల్లో... దోచుకున్నవాడిదే సొత్తు. గెలుచుకున్నవాడిదే భూమి. నిలదీస్తే నాలుక తెగేది. ప్రశ్నిస్తే శాల్తీ మాయమైపోయేది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఈ విషయంలో భారతీయులు అదృష్టవంతులు. సాక్షాత్తూ రాజ్యాంగమే కష్టార్జితానికి భరోసా ఇచ్చింది. ఒకప్పుడు రాజ్యంలో రాజే చట్టం. రాజు మా టే శిలాశాసనం. మరిప్పుడో!! చట్టమే రాజు. చట్టమే ప్రభుత్వం. చట్టమే సర్వాధికారి. చట్టం అంటే- రాజ్యాంగం. మరి అలాంటి మహోన్నత చట్టాన్ని కొందరు చుట్టంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎంత ప్రమాదానికి దారి తీయగలదో కుమతులకు అర్థం కాకపోయినా, సుమతులు అర్థం చేసుకోగలరు. మంచి మార్పుకి శ్రీకారం చుట్టగలరు.
స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛను కలిగి ఉండటం మాత్రమే కాదు దేశం పట్ల బాధ్యతగా మెలగడం కూడా అన్నది. హక్కులు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. నీకు రావాల్సింది నువ్వెలా తీసుకోవాలో చెబుతాయి. బాధ్యతలు హుందాతనాన్ని బోధిస్తాయి. సమాజానికి నువ్వేం ఇవ్వాలో చెబుతాయి. ఈ యదార్థం కొందరికి పట్టినా, ఇంకొందరు పట్టించుకున్నా, అధిక శాతం మంది ఏదీ పట్టనట్టే ఉన్నారు. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడానికే తీరిక ఉండటం లేదు. అలాంటిది దేశం గురించి ఏం ఆలోచిస్తాం అనుకుని ఐదేళ్ళకోసారి ఎవరో ఒకరికి గద్దెని అప్పగించి బ్రతుకుని షరా మామూలుగా నెట్టుకొచ్చేస్తున్నాము.
ఇక, అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నవాళ్ళు ... కొందరు మహానుభావులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కూడా అధిక శాతమే మంది దాన్ని నిలుపుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు తప్ప ఓటేసిన ప్రజల కోసం పని చెయ్యడం లేదు. అవినీతి (corruption), బంధుప్రీతి (nepotism) అన్ని చోట్లా మనకి కనపడుతుంది. నేటి మన ఈ దుస్థితిని నాడే స్వప్నించారు మన కవి శ్రేష్ఠులు, కీర్తి శేషులు శ్రీ శ్రీ. అంతే కాదు దానికి చక్కటి ఉపాయం కూడా ఎరుక పర్చారు. పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే …..తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం. అన్నారు. ఇక వాడుక భాషకు అడుగుజాడ అయిన గురజాడ వారి మాటల్లో చెప్పాలంటే, 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...!'
"భిన్న ప్రాంతాల, భాషల, మతాల, సంస్కృతుల భారతీయ ప్రజానీకాన్ని ఏకం చేయడమే అసలైన సవాలు..దేశంలో ఐక్యతా భావం వెల్లివిరిసేలా ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ ఐక్యతా భావంతో నిర్ణయాలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలన్నది ఆలోచించాలి" అని అంబేద్కర్ అన్నారు. ఆనాడూ ఈనాడూ భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ని నిర్వచించే అసలైన శక్తి. వైవిధ్యాన్ని మనం వేడుక చేసుకుంటాం. ఆ వైవిధ్యాన్ని స్వీకరించడంలోనే దేశ పురోగతి దాగుంది. భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం మన జీవితాల్లో అంతర్భాగమవ్వాలి. అదే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మనమందించగల నిజమైన నివాళి అవుతుంది.
ఒకవైపు బ్లాక్ మార్కెట్, మనీ ల్యాండరింగ్ వంటివి దేశాన్ని వాణిజ్యపరంగా దెబ్బతీస్తూ వుంటే, మరోప్రక్క కులం - మతం, భాషలను ఉపయోగించి ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. అసాంఘిక జ్వాలలను ఎగదోస్తూ ఆ కాష్ఠంలో చలి కాచుకుంటున్నారు.
ఓ చిన్న ఉపమానం
జీవితం పట్ల అసంతృప్తితో ఉన్న కొందరు తమ - అసంతృప్తికి కారణం ఏమిటో అంతుబట్టక ఓ శ్రేయోభిలాషి తమ గురువు వద్దకు వెళ్లారు. ఎవ్వరమూ సంతృప్తికరంగా లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ గురువు గారు, ఏదో స్ఫురించినట్లు 'ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను' అంటూ వంటగదిలోకి వెళ్ళారు. కొంత సమయం గడిచాక, పెద్దపాత్రలో కాఫీ, రకరకాల కప్పులు తీసుకొని ప్రొఫెసర్ ముందుగదిలోకి వచ్చారు. కాఫీ తీసుకోండంటూ కాఫీని, కప్పుల్ని యువకుల ముందుంచారు. ఆ కప్పులు రకరకాల పదార్థాలతో చేసినవి; కొన్ని ప్లాస్టికవి, మరికొన్ని పింగాణివి, మట్టి కప్పులు, వెండి కప్పులు. రాగి కప్పులు, బంగారు కప్పులు, ఇంకొన్ని మణిమాణిక్యాలు పొదిగిన చాలా ఖరీదైనవి! వారందరూ చాలా ఖరీదైనవీ, అందంగా కనిపించే కప్పుల్లోనే కాఫీని పోసుకొని తాగటం ప్రారంభించారు. అప్పుడు ఆ గురువుగారు, ప్రశాంతంగా తనూ కాఫీ తాగుతూ 'చూశారా! మీరందరూ ఖరీదైన కప్పుల్లోనే కాఫీ పోసుకున్నారు. మామూలు కప్పుల్ని ఎవరూ ముట్టుకోలేదు. మీ జీవితంలో కూడా ఇలా చాలా ఖరీదైనవి, మన్నికైనవి కావాలనే తాపత్రయం వల్లే, మీకు ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. పైగా మీరు ఎంచుకున్న కప్పులను వేరే వాళ్ళ కప్పులతో పోల్చుకుంటూ మరీ కాఫీ తాగుతున్నారు. అలాగే మీ ఉద్యోగాలను, ఆదాయాన్ని, జీవనశైలిని ఇతరులతో బేరీజు వేసుకుంటూ అనుభూతి చెందుతున్నారు. నిజానికి తాగే కాఫీ ముఖ్యం కానీ, కప్పులు కాదు. ఆనందమయమైన జీవితమే 'కాఫీ', ఉద్యోగాలు, హోదాలు, ఆస్తులు, భద్రత, ఆడంబరాలు ఇవన్నీ కూడా 'కాఫీ' త్రాగడానికి ఉపయోగించే 'కప్పులు'; ఇవి కేవలం జీవితాన్ని అనుభవించడానికి చిన్న ఆధారాలు, ఉపాధులు మాత్రమే! కానీ అవే జీవితం కాదు. కేవలం ఇవే మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరోటి లేదు. నిజంగా అన్నీ తాము అనుకున్నవి అనుకున్నట్లు అమరి, సౌకర్యంగా ఉన్న వాళ్ళే ఆనందంగా ఉంటారనుకోవడం పొరపాటు; తమకు ఏది లభించినా, దానినే సౌకర్యంగా, సానుకూలంగా మలచుకోవడం వల్లే వాళ్ళంత ఆనందంగా ఉండగలుగు తున్నారు. నిరంతరం కళ్ళ ముందున్న దానిని నిందిస్తూ, పొందినదాన్ని అనుభూతి చెందకుండా దూరపు కొండలు నునుపని ఎదురుచూసే వాళ్ళు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేరు.
ప్రక్రుతి మనకు ఎన్నో పాఠాల్ని బోధిస్తుంది. అందులో ఓ పాఠం ఏమిటంటే, వెన్నెలకి ఏ మతము లేదు.. కోకిలదీ ఏ కులము కాదు ...గాలికి ఏ భాష రాదు... నీటికి ఏ ప్రాంతముండదు ... ఎల్లలు మనిషికే, మత కలహాలు మనిషివే. మనం చల్లని వెన్నెల్లా మారి స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించాలి. నీళ్ళల్లే మారి అందరి దాహ తీర్చాలి. ఐకమత్యమే జాతికి దైవ రక్ష.. అందుకే నిరంతరం సాగాలి మనందరి ఈ మహోన్నత దీక్ష...
అంతిమంగా....
మన కంటే పెద్దవారంటే గౌరవముండాలి, మన వయస్సు వాళ్లతో స్నేహంగా ఉంటూనే ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి, మన కంటే చిన్న వాళ్ళతో ప్రేమ, కరుణ ఉండాలి. మన ఈ కట్టుబాటు భాష, ప్రాంతం, మతం, జాతి అన్న అడ్డు కట్టల్ని తెంచుకున్న నాడు మానవత్వం గర్వంతో శిరసెత్తుకోని పరవశిస్తుంది. వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు అన్నారు పెద్దలు. ఒక దేహానికి ఉంటే కోరిక. అదే కోరిక దేశానికి ఉంటే ఉద్యమం, విప్లవం. మనం ఇష్టంగా అనుకునేది అదృష్ఠం ,బలంగా కోరుకునేది భవిష్యత్తు. సత్సమాజ నిర్మాణమే నీ ధ్యేయం…సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..అని శ్రీశ్రీ అన్న మాట మనందరి అస్త్రం, శస్త్రం అవ్వాలి.
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినారు మన స్వాతంత్ర సమర యోధులు. ప్రపంచమే వణికిపోయే పెను తుఫానులాగ వీచి ఆంగ్ల పాలనను ధిక్కరించినారు మన జాతి రత్నాలు. ఓ కవి చెప్పినట్టు శ్వాసలోన దేశమే మన గుండె ఘోష లోన దేశమే . దేశమంటేనే మీరు... మనమంటేనే దేశం! జై హింద్!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు