Monday, December 2, 2024

నిష్ఠ – నిబద్ధత – ఏకాగ్రత

నిష్ఠ – నిబద్ధత – ఏకాగ్రత విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. (వారి గుణగణాలు ఇలా ఉంటాయి:) వారు తమ నమాజులో ఎంతో అణుకువ, నమ్రత, నిష్ఠ, నిబద్ధత, ఏకాగ్రత లు పాటిస్తారు. (అల్-మోమినూన్1-2) కర్తవ్య నిష్ఠ పుట్టిన ప్రతీ మనిషి ఏదో ఒక కర్తవ్యం చేస్తూనే ఉండాలి. పిల్లలకు శ్రద్ధతో చదువుకొని జ్ఞానాన్ని పొందడం కర్తవ్యం. తల్లికి పిల్లల సంరక్షణ, భర్తకు సహకరిస్తూ, సహ ధర్మచారిణిగా ప్రవర్తించడం కర్తవ్యం. తండ్రికి కుటుంబ పోషణకు డబ్బు సంపాదించడం, తన కుటుంబాన్ని ఉన్నత నైతిక ప్రమాణాలతో నడిపించడం కర్తవ్యం. మనం చేసే పనిని అల్లాహ్ ఆనకు లోబడి, ధర్మబద్ధంగా చేయడమే మనందరి కర్తవ్యం. మనందరి జీవిత లక్ష్యాన్ని, ప్రప్రథమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ అల్లాహ్ ఇలా ఉపదేశిస్తునాడు: నేను మానవుల్ని, జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతో పుట్టించ లేదు. నేను వారినుండి ఉపాధి కోరడంలేదు. నాకు తిండి పెట్టమని అడగడం లేదు. నిశ్చయంగా అల్లాహ్ అందరి ఉపాధిప్రదాత. ఆయన మహాబలుడు, అద్భుత శక్తిసంపన్నుడు. (అజ్జారియాత్: 56-58)
విధిగా చేయవలసిన పనిని కర్తవ్యం అంటారు. ఇక నిష్ఠ అంటే పనిని నియమబద్ధంగా, శ్రద్ధతో మనసు లగ్నం చేసి, దీర్ఘకాలం చేసే పని. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పనిని గానీ, ప్రార్థననుగానీ నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో చేస్తూ, విముఖతతో ఉండటం సర్వ సామాన్యగా కనబడే దృశ్యం. వారు తమ హృదయాల్లో ఏం దాచారో, బయటికి ఏం వెలిబుచ్చు తున్నారో అంతా నీ ప్రభువుకు తెలుసు. ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. ఇహం లోనూ, పరంలోనూ సకలవిధాల ప్రశంసలు, స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. ఆయనకే (విశ్వ) పాలానాధికారం ఉంది. మీరంతా ఆయన వద్దకే మరలి పోవలసిఉంది. (అల్-ఖసస్: 69-70) ఒక్కసారి ఆలోచించండి! ముహమ్మద్‌ (స)! వారిని ఇలా అడుగు: “అల్లాహ్ ప్రళయం దాకా రాత్రిని మీపై ఆవరింపజేసి ఉంచితే, ఆయన తప్ప మరే దేవుడు మీకు పగటి వెల్తురు ఇవ్వగలడు? మీరు వినరా?” ఇంకా అడుగు: “అలాగే అల్లాహ్ ప్రళయం దాకా మీపై పగటి వెల్తురిని శాశ్వతంగా ఉంచితే, ఆయన తప్ప మరే దేవుడు మీరు విశ్రాంతి పొందడానికి రాత్రిని తెస్తాడు? దీన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” (ప్రతి రోజూ సంభవిస్తున్న) ఈ అద్భుత రేయింబవళ్ళు) మీకు కన్పించడం లేదా? మీరు విశ్రాంతి పొందడానికి, మీ ప్రభువు అనుగ్రహం అన్వేషించడానికి ఆయన మీకోసం రాత్రింబవళ్ళను సృష్టించాడు, మీరు కృతజ్ఞత చూపుతారేమోనని. ఇదంతా ఆయన అనుగ్రహమే. (అల్-ఖసస్: 71-73) సృష్టిలో అంతర్భాగంగా ఉన్న గాలిని అల్లాహ్ స్థభింపచేసినా, సకాలంలో వాన కురవకపోయినా, తెల్లారేసరికి ఉదయించే సూర్యుడు ఉదయించకపోయినా, జీవన విధానం స్థంభించి పోతుంది. అస్తవ్యస్తమై పోతుంది. వారి కోసం మరొక సూచనగా రాత్రి ఉంది. మేము దాని పైనుండి పగటిని తొలగిస్తున్నాం. అప్పుడు వారిపై చీకటి ఆవరిస్తుంది. సూర్యుడు తన నిర్ణీత కక్ష్యలో సంచరిస్తున్నాడు. ఇది మహా శక్తిమంతుడు, అసాధారణ వివేకవంతుడయిన దేవుడు రూపొందించిన (అద్భుత) పథకం.ز చంద్రుని కోసం మేము మజిలీలు (చంద్రకళలు) నిర్ణయించాము. అతను వాటిని దాటుకుంటూ చివరికి ఎండిపోయిన ఖర్జూరపు మట్టలా మారిపోతాడు. చంద్రుని పట్టుకునే శక్తి సూర్యునిలో లేదు. అలాగే రాత్రి పగటిని దాటిపోలేదు. సమస్తం ఒక్కొక్క కక్ష్యలో (అంటే తమ తమ నిర్ణీత కక్ష్యల్లో) సంచరిస్తున్నాయి. (యాసీన్: 37-40) పక్షులు కూడా తమ ముక్కు సహాయంతోనే పుల్లలు ఏరి గూడు కట్టుకొంటుంది. పిచ్చుకలు గడ్డి పరకలను ఏరి తెచ్చి అందంగా గూడు నిర్మించుకొంటాయి. చేతులు లేవు, టెక్నాలజీ తెలియదు. చదువుకోక పోయినా, నిరంతరం అన్వేషణలో ఉంటాయి. అవన్నీ తమ కర్తవ్యాలను, పనులను ఎంతో శ్రద్ధగా, నిష్ఠతో చేస్తూ ఉంటె, సృష్టిశ్రేష్టుల మైన మనం ఎందుకు మంచి విషయాల మీద మనసును లగ్నం చేయలేక పోతు న్నాము? ప్రకృతిలోని ప్రతీ అంశం మనకు జ్ఞానోదయమే అయినప్పుడు బుద్ధి తెచ్చుకొని మంచిగా మసలుకోవడమే కదా మనం చేయాలి! అతని పొరుగింటి స్నేహితుడు అతనితో ఇలా అన్నాడు: “ఏవిటీ, నిన్ను మట్టితో నీచమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? నా విషయానికి వస్తే, నేను మాత్రం అల్లాహ్ ను మాత్రమే నా ప్రభువుగా స్వీకరించాను. ఆయన దైవత్వంలో మరెవరికీ భాగస్వామ్యం కల్పించను. (అల్-కహఫ్: 37-38) కర్తవ్య నిష్ఠ వల్ల కలిగే ప్రయోజనాలు కర్తవ్య నిష్ఠ వల్ల - ప్రభువు ప్రసన్నత మన సొంతం అవుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం, ఆత్మ విశ్వాసం పెంపొందుతాయి. క్రమశిక్షణ, ఇతరులతో సాన్నిహిత్యం మెరుగవు తుంది. మనిషి ఔన్నత్యానికి, విజయానికి కర్తవ్య నిష్ఠ ఎంతో దోహదపడుతుంది. బంధుప్రీతితోనో, స్వలాభేక్షతోనో, ఇతరులు నుండి ఆర్థికంగా కాని, మరే రూపంలో నైనా ప్రతిఫలం ఆశించి చేసే పనులకు గుర్తింపు ఉండదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఏదైతే మనల్ని ఉన్నతంగా ఎదిగేలా చేస్తుందో అది మంచి కర్తవ్యం. ఏదైతే మనల్ని దిగజారుస్తుందో అది మన కర్తవ్యం కాదు. చెడు అలవాట్లు, భావనలు మనిషిని దిగజారుస్తాయి. కాబట్టి, కర్తవ్య నిర్వహణలో ధర్మంగా వ్యవహరించాలి. మనిషి తమోగుణం, రజోగుణం, సత్త్వ గుణం అనే మూడు గుణాలకు ప్రభావితుడై ప్రవర్తిస్తుంటాడు. మనసు, ఇంద్రియాలు ధర్మ కర్తవ్యం మీద లగ్నంచేసి నిగ్రహంతో పట్టుదలతో, చేసేవారు సాత్త్విక దృష్టి కలవారు. ఫలితంపై అధికాశక్తితో అవసరమైతే అధర్మంగానైనా చేసే కర్తవ్య నిర్వాహ‌కులు రాజస దృష్టి కలవారు. కలలుకంటూ, భయంతో, సందిగ్ధ స్థితిలో కర్తవ్యాన్ని పూర్తి చేసేవారు తామసిక దృష్టి కలవారు. ఎంతటి చిన్న కార్యమైనా, దానిని సాధించడానికి ఒకే ఉపాయం ఉండదు. అనేక ఉపాయాలు ఉంటాయి. అందుచేత కార్యమును సాధించడానికి ఎవరికి అనేక ఉపాయాలు తెలియునో అతడే కార్యసాధకుడు. ధర్మనిష్ఠాగరిష్టుడు, ధర్మనిష్ఠుడు, ధర్మాత్ముడు, ధర్మావలంబి, ధర్మనిరతుడు, ధర్మ నీతిజ్ఞుడు. అనుకున్నంతనే అన్నీ అయిపోవు కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే. ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాదించగలం. మనిషికి అల్లాహ్ మీద నమ్మకం తర్వాత ముందు తనపై తనకు నమ్మకం ఉండాలి. మన జీవితానికి మనమే శిల్పి. ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన విగ్రహంగా మారగలం, ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీమ్, ప్రవక్త మూసా, ప్రవక్త ఈసా (అలైహిముస్సలామ్) , అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) సైతం కష్టాలను ఓర్చుకొని వజ్ర సంకల్పులైన ప్రవక్తలుగా ఖ్యాతి పొందారు. మనమో అందమైన మానవ హారంగా మారాలంటే పువ్వులు. మాదిరి గుండెల్లో గుచ్చే సూది బాధను తట్టుకోవాలి. ఏది సాధించాలన్నా సంకల్ప బలంతో - బాధలు, అపజయాలను ఎదిరించక తప్పదు. వందల సార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు కాబట్టే థామస్ అల్వా ఎడిసన్ బల్బును తయారు చేశాడు. ప్రపంచానికి వెలుగులు పంచి చిరకీర్తిని సంపాదించుకున్నాడు. నిబద్ధత కనుక నీవు, అపమార్గం వదలివచ్చిన నీ అనుచరులు మీకివ్వబడిన ఆజ్ఞ ప్రకారం సన్మార్గంలో స్థిరంగా ఉండండి. హద్దుమీరి ప్రవర్తించకండి. మీరు చేస్తున్నదంతా మీ ప్రభువు గమనిస్తూనే ఉన్నాడు. ఆ దుర్మార్గులవైపు ఏమాత్రం మొగ్గకండి. అలా చేస్తే మీరూ నరకాగ్నికి సమిధలైపోతారు. అల్లాహ్ పట్టు నుండి కాపాడేందుకు మీకు ఎలాంటి స్నేహితుడుగాని, సంరక్షకుడుగాని, సహాయకుడుగాని లభించడు. (హూద్112-113) మాటలో.. ప్రవర్తనలో నిబద్ధత కలిగిన మనిషి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. నిబద్ధత అంటే- ఒక ధర్మానికి.. ఒక నియమానికి బద్ధుడై ఉండటం. వృత్తిలో ప్రవృత్తిలో నిబద్ధత గల వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. అభిమానిస్తుంది, ఆదరిస్తుంది, ఆదరువుగా నిలుస్తుంది.... అనుసరిస్తుంది: నిబద్ధత మానవ చరిత్రలో అనేకుల వ్యక్తిత్వానికి ఎంతో వన్నె తెచ్చి పెట్టింది. నిబద్ధత ఉన్నచోట నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. నిబద్ధత ఉన్న మనిషి నిర్భయంగా ఉంటాడు. ఎవరికీ తల వంచడు. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాడు. ఏ పని చేయాలన్నా, ఏ లక్ష్యం సాధించాలన్నా నిబద్ధత అతణ్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరు తమ ప్రభువు అల్లాహ్ యేనని పలికి, ఆమాట మీదనే స్థిరంగా ఉంటారో వారి (సహాయం) కోసం దైవదూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: “భయపడకండి. విచారపడకండి. స్వర్గప్రవేశం గురించి మీకు చేసిన వాగ్దానం గుర్తుచేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయా మయుడయిన అల్లాహ్ వైపున లభించనున్న ఆతిథ్యమిది.” (హామీమ్: 30-32) మహనీయ ముహమ్మద్ (స) ఆడిన మాట తప్పలేదు. ఖూలూ లా ఇల్లల్లాహ్ అన్న సద్వచనాన్ని త్రికరణశుద్ధిగా పాటించారు. సత్యస్థాపన కోసం భూ ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన మక్కా నగరం - ఆయన స్వీయ జన్మ స్థలాన్ని తృణ ప్రాయంగా వదిలేశారు. సంఘ బహిష్కరణకు, ఆప్తుల విరహావేదనకు గురి చేయ బడ్డారు. ఎన్నో అవమానాల్ని భరించారు, ఎన్నో చిత్రహింశలను సహించారు. చివరికి 23 సంవత్సరాల అనతి కాలంలోనే విశ్వజనావళిచే హృదయాల విజేతగా నీరా జనాలందుకున్నారు. సత్యసంధతకు సచ్ఛీలతకు నిబద్ధుడైన వ్యక్తిగా, వక్తగా, ప్రవక్తగా, మహా నేతగా, తిరుగులేని విజేతగా చిరకీర్తి పొందారు. నీ శత్రువే భవిష్యత్తులేని దౌర్భాగ్యుడు. (అల్-కౌసర్: 03) అన్న అల్లాహ్ మాట నిజమయింది. ఆయన్ను హింసించిన, బాధించిన, వేధించిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. నేడు వారి పేర్లు సయితం పెట్టుకునేందుకు ప్రజలు ఇష్ట పడటం లేదు. అదే అల్లాహ్ ఆయనకు ప్రసాదించిన ఘన గౌరవం, తొడిగించిన కీర్తికిరీటాలు కాలాతీతాలు. నేడు ప్రపంచంలో నివసిస్తున్న ముస్లింలలో ప్రతి ఐదుగురిలో ఒకరి పేరులో ముహమ్మద్ అన్న నామం ఇదొక ర్కామగా కనబడుతుంది, వినబడుతుంది. మేము నీపై నుండి వెన్నువిరిచే భారం తీసివేశాం. నీకోసం నీ(పేరుప్రతిష్ఠల) ప్రస్తావన ఉన్నతం చేశాం. (అలమ్ - నష్రహ్: 3,4) అల్లాహ్ ఆయనకు అనుగ్రహించిన ఘనకీర్తి ఎలాంటిదంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇవ్వబడే అజాన్ మరియు ఇఖామత్ రూపంలో అల్లాహ్ నామాంతరం ఆయన పేరు ఏడాదిలో 12 నెలలు, నెలలో 30 రోజులు, రోజులో 24 గంటలు, గంటలో 1,440 నిమిషాలు, నిమిషంలో 86,400 సెకన్లు ప్రశంసించ బడుతూనే ఉంటుంది. సుబ్హానాల్లాహ్! ఆయన సుచరితాన్ని చదివిన కోటానుకోట్ల మంది ప్రభావితులయ్యారు. అవుతున్నారు. ప్రళయం వరకూ అవుతూనే ఉంటారు. ఇది ఆగని పవిత్ర ప్రవర్తనా ప్రవాహం, నిత్యం వెదజల్లబడే సుగుణ సుగంధాలు సుపరిమళం. వ్యక్తే కాదు - ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా కొన్ని ఉన్నత ప్రమాణాలను పాటించాలి. -లక్ష్యసాధనలో అందరూ నిబద్ధత అనే గీత దాటకుండా ప్రయాణం చేయాలి. కుటుంబంలో, వ్యవస్థలో, సంస్థలో, రాష్ట్రంలో, ప్రాంతంలో, దేశంలో ఒకరో ఇద్దరో ప్రలోభాలకు లోనై ఏదేని ఒక విషయంలో ద్రోహానికి పాల్పడి కల్తీ చేశారనుకుందాం. అప్పుడు ఆయా కుటుంబాల, సంస్థల, ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల ప్రమాణాలు పడిపోతాయి.. పేరు చెడిపోతుంది. లక్ష్యాలు దెబ్బతింటాయి. అందరూ నిబద్ధత పాటిస్తేనే విజయగమ్యం -చేరుకోవడం సాధ్యమ వ్వడమే కాదు, సులభమవుతుంది! మనిషి మంచికే కాదు, చెడుకూ నిబద్ధుడై జీవించవచ్చు. అలాంటి స్వేచ్ఛ జిన్నులకు, మరియు మనుషులకు మాత్రమే ఉంది. కానీ అలాంటి వ్యక్తి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. అశాంతి... అల్లకల్లోలాలు ఏర్పడతాయి. విశ్వాసులారా! మద్యం, జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సార్థక మవుతుంది. మద్యం, జూదాల ద్వారా షైతాన్‌ మీమధ్య విరోధం, విద్వేషబీజాలు నాటి మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం, ప్రార్థనల నుండి నిరోధించగోరుతున్నాడు. కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి. దైవాజ్ఞలను, ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం (మీకే నష్టం), ఆదేశాన్ని యధాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. (అల్-మాయిదహ్: 90-92) దీనికి భిన్నంగా - మంచికి నిబద్ధుడైన మనిషి వల్ల సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రశాంతత నెలకొంటుంది. వ్యక్తి శక్తిగా, సామాన్యుడు మాన్యుడిగా, మనిషి మహాత్ముడిగా, మానవుడు మహానుభావుడిగా, మహాత్మగా, మహితాత్మునిగా పరివర్తన చెందడానికి ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (స) నెలకొల్పి వెళ్లిన నిబడ్దత నియమాలు దివ్య ఔషధంలా పని చేస్తాయి అందంలో ఎలాంటి సందేహం లేదు. మన భక్తిలోనూ నిబద్ధత ఉండాలి. శరీరం, వాక్కు, మనసు ఏకం కావాలి... అంతర్ముఖులమై.. అల్లాహుమ్మక్ఫినీ బి హ్లాలిక అన్ హరామిక్ వ అగ్నినీ బి ఫజలిక అమ్మన్ సివాక్ అని అద్వితీయ దేవుడైన అల్లాహ్ ను ప్రార్ధించాలి. కర్మలన్నింటినీ నిస్వార్ధంగా అల్లాహ్ కు అర్పణం చేయాలి. అర్పణం వల్ల దాసునికి దైవంతో గల బంధం, దాసునికి దైవ దాసులతో గల సంబందాలు బలపడతాయి. అప్పుడు అల్లాహ్ మనందరినీ ప్రేమిస్తాడు, మనందరినీ ప్రేమించవలసిందిగా సప్తాకాశాల్లోనూ, సప్త భూముల్లోని ప్రకటగావించడం జరుగుతుంది. ఫలితంగా సృష్టిలోని చరాచరాలన్నీ, విశ్వంలోని ఆణువణువూ మనల్ని ప్రేమిస్తుంది... ఆహా ఎంత భాగ్యం కదూ! ఆలోచిస్తేనే మనసు పులకరించిపోతుంది… ఆత్మ నిత్యానంద జగత్తులో ఓలలాడుతుంది… ఇదంతా మనలోని నిబద్ధత వల్లే సాధ్యమవుతుందన్నది అక్షరసత్యం..! ఏకాగ్రత! మనస్సు చంచలమైనది. స్వభావ సిద్ధంగా చంచలమైన మనస్సుకు బాహ్య పరిసరాలు కూడా తోడైతే అది ఆడించినట్లు ఆడడంతో జీవితం నిరర్థకమవుతుంది. నిద్ర లేచింది మొదలు పడుకొనే వరకూ ఆలోచన పరంపరల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. మానసిక ఏకాగ్రత లేనిదే ఏ పనీ చేయలేం. చంచల స్వభావం గల మనస్సు సామాన్యులనే కాదు, మహాత్ములను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది.మన మనస్సుకు గొప్ప శక్తి ఉంది. దానిని ఏకీకృతం చేయడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించగలం. సూర్య కిరణాలను ఒక కుంభాకార కటకం గుండా ఒక కాగితంపై పడేలా చేస్తే నిప్పు పుడుతుంది. ఆ కిరణాలకు అంత శక్తి ఎలా వచ్చిందంటే కిరణాలను ఏకీకృతం చేయడం వల్ల! ఈ రహస్యాన్ని మనం గుర్తించాలి. మన మనశ్శక్తినంతా ఒకే విషయంపై కేంద్రీకరించగలిగితే మనం ఆశించిన రంగంలో అత్యున్నత ఫలితాల్ని సాధించవచ్చు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: పార్థనా వ్యవస్థ నెలకొల్పండి. పేదల ఆర్థికహక్కు (జకాత్‌) చెల్లిస్తూ ఉండండి. నా ముందు మోకరిల్లేవారితో పాటు మీరు కూడా నా ముందు మోకరిల్లండి. ఏమిటీ, మీరు మంచిపనులు చేయమని ఇతరులకైతే హితబోధ చేస్తారు. కాని మిమ్మల్ని మీరు మరచిపోతున్నారే! మీరు గ్రంథ పఠనం కూడా చేస్తున్నారు కదా! (ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?). మీరు బుద్ధి నుపయోగించరా? (సరే, మీకేవైనా ఇబ్బందులుంటే) సహనం, ప్రార్థనల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి. ప్రార్థన (నమాజ్‌) కాస్త కష్టమైన పనే, సందేహం లేదు. కాని ఒకరోజు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉందని భావించే దైవభీతిపరులకు, ఏకాగ్రతా చిత్తులకు మాత్రం ప్రార్థన (నమాజ్‌) చేయడం కష్టమేమీ కాదు. (అల్-బఖరహ్: 43-46) నమాజు అంటేనే క్రమశిక్షణ, ఏకాగ్రత. క్రమశిక్షణ, ఏకాగ్రత అంటేనే నమాజు. జీవితంలో క్రమశిక్షణ లేనప్పుడు ఆనందం ఉండదు. ధనం ఒక్కటే సంతోషాన్నివ్వదు. సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా ఏదో కావాలనుకుంటూ లేనిపోని సమస్యలు తలకెత్తుకుంటాము. జీవితంలో క్రమశిక్షణను అవలంబించాలి. ఈ రోజు నేను ఈ పని పూర్తిచేస్తాను అని ఏకాగ్రతలో కూర్చుని పూర్తిచేయాలి. మనస్సు చంచలంగా ఉంటే, ఏమీ సాధించలేరు. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. లోకం కానని లోకమాన్యులైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మ్ మక్టోమ్ (ర) గారు వీరత్వం వల్ల సుకీర్తిని పొందలేదు. నిష్ఠ, నిబద్ధత, ఏకాగ్రత వల్ల అయ్యారు. ఉత్తమ ఆశయం మీద దృష్టి నిలపగలగడం వల్లే ఆయన ఎనలేని కీర్తిని సొంత చేసుకోగలి గారు. ఏ మనిషికైనా ప్రథమ ఆయుధం ఏకాగ్రతే. అది వెంట ఉంటే మిగిలిన శక్తులన్నీ తోడు నిలుస్తాయి. లక్ష్య సాధన సులువవుతుంది. గమ్యం దరి చేరుతుంది.కాని ఆ ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంటే? దృష్టి ఒక అంశం మీద నుంచి మరో అంశం మీదకు వెంటవెంటనే మరులుతూ ఉంటే? సమస్య ఉన్నట్టే. కలలు నెరవేరాలంటే- ఏకాగ్రత, నైపుణ్యం, ఆచరణ అవసరం. లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి కొండలు, లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. బలహీనమైన ఆలోచనలు, మూడ నమ్మకాలను వదిలిపెట్టాలి. విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరాలి. కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు, నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడమూ సరికాదు. చేతనైనంతలో నలుగురికీ సాయపడటంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది. అది ఆచరణలో పెట్టినప్పుడే జీవితానికి సార్థకత! నేడు మన మనః స్థితి ఎలా ఉందంటే, నమాజులో నమాజీల దృష్టిని మళ్ళించడానికీ, ఏకాగ్రతను భంగం చేయడానికీ ఒక చిన్న పక్షి కదలిక చాలు. ఒక ఫ్యాను తిరిగకపోతే చాలు, కరెంటు పొతే చాలు, చిన్నపాటి దోమ కుడితే చాలు. ఎంత గొప్పగా పారాయణం జరుగుతున్నా ఇక అంతే! చూపులు ఆ పక్షి వైపే! ఆలోచన ఆ ఫ్యాను గురించే, ఆవేదన ఆ కరెంటు గురించే. అలా ఉంటుంది మన ఏకాగ్రత! యువకులు, వయోజనులు అన్న తేడా లేకుండా, అందరికి ఉన్న సమిష్టి సమస్య ఇది. దీనికి ప్రధాన కారణం మనకు ఏకాగ్రతకు సంబంధించిన క్రమశిక్షణ కొరవడడమే! తేరా ఇమామ్ బె హుజూర్ తేరి నమాజ్ బె సురూర్ ఐసే ఇమామ్ సె గుజర్ ఐసి నమాజ్ సె గుజర్ - అన్నారు అల్లామా ఇక్బాల్ (రహ్మ). అల్లాహ్ కు కావలసింది ఏకాగ్రతతో కూడిన శరణాగతి మాత్రమే. ఆర్భాటాలతో కూడిన ఆరాధన కాదు. అల్లాహ్ అద్భుత నామ స్మరణను గుర్తెరిగి ఏకాగ్రతతో ధ్యానించిన వారిపై ఆయన కరుణ వర్షిస్తుంది. నమాజులో నమాజీలకే కాదు, జీవితంలో విద్యార్థులకు, ఉద్యోగినులు, గృహిణులకూ ఏకాగ్రత ముఖ్యమే. చేసే పనిని మధ్యలోనే ఆపేయడం లేదా పూర్తిచేసిన పనిలోనూ నాణ్యత లోపించడానికి కారణం ఏకాగ్రత కొరవడటమే. దశావధానులు, శతావధానులు అని ఉంటారు. అంటే, ఒకరు పది పనులు ఒకేసారి చేయగలరు. ఇంకొకరు, వంద పనులు ఒకేసారి చేయగలరు" అని దానర్థం. గుట్ నో పె రఖ్ కర్ హాథ్ ఖడే థె నమాజ్ మే ఆ జారహే థె లోగ్ జహన్ మే తమామ్ ఓర్ ఇక చదువు ఏకాగ్రత విషయానికొస్తే, నేటి లాగా ఆ నాటి కాలంలో తల్లితండ్రుల ఆర్థిక స్థాయి, సామాజిక స్థితిని బట్టి రకరకాల పాఠశాలలు లేవు. నాటి పాఠశాలల్లో రాజు కొడుకైనా, మిగతావారితో సమానంగా విద్యాక్షేత్ర దినచర్యలో పాల్గొని అన్ని సేవలు చేయాల్సి ఉండేది. ఎక్కడ కూడా తాను రాజు కొడుకునని, తాను మిగతా వారికన్నా ఉన్నతుడనన్న భావన రాకుండా ఆనాటి గురువులు చూసేవారు. అలాంటి అహంకృతి వచ్చినదంటే ఇక విద్య రాదని వారికి తెలుసు. సిరి, అధికారం ద్వారా ఉత్పన్నమయ్యే దర్పం, దంభం, అభిమానం విద్యార్థుల్లో ప్రవేశించకుండా వారిలో అహంభావాన్ని నిర్జింపజేసి, వినయశీలురుగా చేసి, చిత్త సంయమనాన్ని పెంపొందించి తర్వాత పాఠాలు బోధించేవారు. మరి నేడు ప్రాచీన పాఠశాల పద్ధతి లేదు. కాబట్టి వీరిలో అహంకారాన్ని అణచి, వినయ సంపదను పెంచడానికి వేరే మార్గమేదైనా ఉందా? అంటే ఉంది. బాలబాలికల ను, యువతను అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులున్న ఆసుపత్రులకు, గుడ్డి బధిర పిల్లలున్న ఆవాసాలకు తీసుకు వెళ్ళి అక్కడ వారికి కొంచెం సేవ చేయించాలి. ఎవరి శక్తికొలది వారు కొన్ని వస్తువుల ను తీసుకువెళ్ళి (వారికి కావలసినవి) వారికి ఇచ్చేటట్లు చూడాలి. ఈ విధంగా రోగుల రూపంలో, వృద్ధుల రూపంలో, వికలాంగుల రూపంలో ఉన్న దైవ దాసులకు సేవ చేసుకోవడం ద్వారా వారి అంతఃకరణం శుద్ధినొందుతుంది. పూర్వకాలపు విద్యార్థులు పాఠశాలల్లో గురు శుశ్రూష - శ్రద్ధగా చేసే సేవతో ఎలా అహంకార రాహిత్యాన్ని పొంది ఏకాగ్రతను సాధించేవారో, అదేవిధమైన అవధానాన్ని నేటి విద్యార్థులు సాధిస్తే ప్రయోజకులవగలరు. ఎందుకంటే, హృదయ వికాసం కొరవడిన వ్యక్తి ప్రమాదంలో పడతాడు. చదువంటే ఒక నైపుణ్యాన్ని సంపాదించుకోవడమో, ఒక పట్టాను పొందడమో, లేదా కొద్దిపాటి సమాచారాన్ని బుర్రలో దట్టించుకోవడమో అనుకుంటే పొరపాటు. విద్యార్థి కేవలం బుద్ధి మీదనే దృష్టిపెడితే మోసపోతాడు. బుద్ధి మనిషిని సమర్థంగా పెడత్రోవ పట్టించ గలదు. హృదయంలేని తెలివి అనర్థం. అది ఆత్మ వినాశకారి అవుతుంది. అందుకే విద్యార్థి పైన తెలిపిన మార్గం ద్వారా ఏకాగ్రతను, హృదయ విశాలతను పెంపొందించు కొని, నిజమైన సాధికారతను సాధించాలి. అలా విద్యార్థి సమర్థ వ్యక్తిగా, సామాజిక బాధ్యతగల పౌరుడిగా ఎదిగిననాడే మనం నవ సమాజాన్ని, సత్సంఘాన్ని నిర్మించగలం. ఆత్మావలోకనం... ఒక్క క్షణమైనా ఏ ఒక్క అంశంపైనా మనస్సును కేంద్రీకరించలేని మనం స్వతంత్రులమని గొప్పలు చెప్పుకుంటాం! మనల్ని మనం స్వేచ్ఛాజీవులుగా పరిగణించుకుంటాం; ఆలోచించండి! నిగ్రహం లేని మనస్సు మనల్ని పతనదిశగా పయనింపజేసి వినాశనానికి కారణమవుతుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సంరక్షిస్తుంది; సర్వస్వతంత్రుల్ని చేస్తుంది. మనుష్యులకూ, పశువులకూ మధ్య ఉన్న వ్యత్యాసం ఏకాగ్రతలోనే. ఏ పనిలో పొందిన విజయమైనా దీని పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికీ, మనిషికీ ఉన్న తేడాను నిర్ణయిస్తుంది. అధమస్థితిలోని మానవుణ్ణి ఉన్నత స్థితిలోని మానవుడితో పోల్చండి. వారి ఏకాగ్రతలోని భేదమే వారి మధ్యనున్న అంతరానికి ముఖ్య కారణం అని మీరే పసిగడతారు. కెహెనే కో తో హాథ్ బాంధే థె నమాజ్ మే పూచో తో దూస్రీ హీ తరఫ్ అప్నా ధ్యాన్ థా మంచి, చెడు ఆలోచనల సముదాయమే మన మనస్సు. మంచి ఆలోచనలు ఘన కార్యాలను సాధించడంలో దోహదపడతాయి. ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే మనం పవిత్రతను ఎలా పొందగలం? పవిత్రతను సంపాదించడానికి మనమంతా అడవుల్లోకీ, గుహల్లోకి వెళ్ళాలా? అంటే, మనస్సే గనుక మన అధీనంలో లేకపోతే మనం గుహల్లోకి వెళ్ళి ఏకాంతవాసం చేసినా ప్రయోజనం లేదు. అక్కడా అదే మనస్సు మనలో రకరకాల అలజడులను సృష్టిస్తుంది. అన్నిరకాల దురాలోచనల భూతప్రేతాలు మన మనస్సులోనే ఉండడం వల్ల మనం ఏకాంతానికై గుహాంతర్భాగంలోకి వెళ్ళినా అక్కడా ఆ భూతాలే ప్రత్యక్షమవుతాయి. మన మనస్సే మన అధీనంలో ఉంటే మనం ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా అక్కడే ఏకాంతం లభిస్తుంది. సర్వ కాల సర్వావస్థలయందు అల్లాహ్ యెడల తఖ్వా కలిగి జీవించు అన్నారు దైవ ప్రవక్త (స). మీ మనస్సును ఉన్నతమైన ఆలోచనలతో, ఆదర్శాలతో నింపి, రేయింబవళ్ళూ వాటిని మీ ముందు ఉంచండి. తత్పలితంగా మహోన్నతమైన కార్యాలు తప్పకుండా సిద్దిస్తాయి. ఎలా అంటారా? మనం జిమ్లో చేరగానే పెద్ద బరువులెత్తుదామని ఉబలాటపడతాము. కానీ ఎత్తలేక ఇబ్బంది పడతాము. దాంతో తక్కువ బరువులతో మొదలుపెట్టి క్రమంగా శక్తిని పుంజుకుంటూ... ఒక దశ తర్వాత పెద్ద పెద్ద బరువులనూ సులభంగా, చురుగ్గా ఎత్తగలుగుతాము. ఏకాగ్రత విషయంలో కూడా ఇదే సూత్రం. మన మైండ్ కూడా ఒక మజిలే అని భావించి సాధన చేస్తే ఇది సాధ్యమే! ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు తనలోని లోటుపాట్లను గుర్తించి సరైన దిశానిర్దేశం చేయగల గురువులు, స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి. అప్పుడు విజయానికి మార్గం మరింత స్పష్టమవుతుంది. బతుక్కి అసలైన అర్థమూ తెలిసివస్తుంది. జీవితానికి మించిన గ్రంథం లేదు: అనుభవానికి మించిన పాఠం లేదు. జీవితపదంలో ప్రతి అనుభవం నుంచీ పాఠం నేర్చుకోవాలి. ఒకసారి వేసిన తప్పు మళ్ళీ వేయకుండా జాగ్రత్త వహించాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: “అల్లాహ్ ను చూస్తున్నట్లు, లేదా కనీసం అల్లాహ్ మనలను చూస్తున్నాడు అనే విధంగా అల్లాహ్ ను ఆరాధించాలి.” ఆధ్యాత్మిక సాధనలోనూ దీక్ష ప్రారంభించగానే దైవానికి చేరువకావడం సాధ్యం కాదు. ముందుగా అల్లాహ్ పట్ల మనసును పూర్తిగా లగ్నం చేయాలి. మన భారాన్ని ఆయన చూసుకుంటాడన్న నమ్మకాన్ని అణువణువూ నింపకోవాలి. అప్పుడు అనవసర భయాలు, ఆందోళనలు తొలగి మనసు తేలికవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓపిక ఉన్నంత వరకు కాదు; ఊపిరి ఉన్నంత వరకు: పోరాడితేనే విజయతీరాలకు చేరగలం! కాలం మారింది, మారుతోంది. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు అన్నీ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వస్తున్నాయి. మారాల్సింది లోకం కాదు మనం మంచిగా మారాలి. నమాజును క్రమం తప్పకుండా వేళకు చేసే ప్రయత్నం చేయటం జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది. మనం విజయవంతం కావాలంటే ప్రతి నమాజును చివరి నమాజుగా , ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి ఒడిసి పట్టుకొని సద్వినియోగ పరచుకోవాలి. కాలాన్ని వృధా చేయకూడదు. నమాజు ద్వారా సమయ పాలన మనకు అలవడితే ఒత్తిడికి కారణమయ్యే అనేక అంశాలను ఇట్టే నియంత్రించవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, మనలో కర్తవ్య నిష్ఠ, ధర్మ నిబద్ధత,ఏకాగ్రత అనే సుగుణాలు గూడు కట్టుకుంటే ఇక విజయశ్రీ మన పాదాక్రాంతం అవ్వడం తథ్యం! అలాగే మనకు తెలిసిన మంచిని పది మందితో పంచుకుంటే మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు; అల్లాహ్ (సందేశం) వైపు (ప్రజలను) పిలిచి, సత్కార్యాలు చేసి, తాను దైవవిధే యుణ్ణని పలికినవాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది అవుతుంది? (33) ప్రవక్తా! మంచీ చెడూ ఒకటి కాజాలవు. కనుక నీవు అత్యంత శ్రేష్ఠమైన ‘మంచి’ ద్వారా చెడును నిర్మూలించు. అప్పుడు నీ గర్భశత్రువు కూడా నీకు ప్రాణమిత్రుడయి పోవడం నీవు చూస్తావు. ఈ సద్గుణం సహనశీలురకు తప్ప మరెవరికీ అబ్బదు. ఈ భాగ్యం అదృష్టవంతులకు తప్ప మరెవరికీ ప్రాప్తం కాదు. ఒకవేళ షైతాన్‌ నుండి నీకేదైనా దుష్టప్రేరణ కలిగినట్లఅన్పిస్తే నీవు దేవుని శరణువేడుకో. దేవుడు సమస్తం వింటున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు. (హామీమ్: 34-36) మనిషి ప్రకృతిలో పుట్టాడు. ప్రకృతిలో అతని కోసం ప్రభువు పెట్టిన భిక్షతోనే పెరిగాడు. ఎంత శక్తిమంతుడైనా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా ప్రభువు నిర్దేశించిన ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. తేడావస్తే ప్రపంచంలో కాకపోయినా రేపు ప్రళయ దినాన తాట తీయడం జరుగుతుంది. తన ప్రకృతి నియమాలను, షరతులను ఉల్లంఘించకుండా మనిషి లోలోపల ఓ జీవ గడియారాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అదే అతని అంతరాత్మ సాక్షి! మంచీచెడులను ఎలా తెలుసుకోవాలి అన్న విషయాన్నీ ఉటంకిస్తూ దైవ ప్రవకల్తా (స) ఇలా సెలవిచ్చారు: హజ్రత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్ (రజి) కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను సత్కార్యం, దుష్కార్యాల గురించి అడిగాను. దానికి ఆయన, "సత్కార్యమంటే ఉత్తమ నడవడిక. దుష్కార్యమంటే మదిని తొలిచేది, దాని గురించి ప్రజలు తెలుసుకుంటే బాగుండదని నువ్వు తలచేది" అని చెప్పారు. (ముస్లిం) పై హదీసులో పాపం గురించి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రధాన సూత్రం వివరించబడింది. అదేమిటంటే- ప్రతి చెడుపనినీ మనిషి అంతరంగం అసహ్యించుకుంటుంది. తాను ఆ చెడుపని చేస్తే ప్రజలు తనను నిందిస్తారేమోనని కూడా మనిషి లోలోపల భయపడతాడు. అలాంటి ప్రతిపనీ చెడ్డదే అవుతుంది. అయితే ఈ అంతరాత్మ ప్రబోధనం కూడా మనిషి హృదయం పూర్తిగా మలినం కాకుండా ఉన్నంతవరకు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి హృదయం పూర్తిగా మలినమైపోయి తన సహజత్వాన్ని కోల్పోతుందో అప్పుడు పెద్ద పెద్ద నేరాలు కూడా ఆ హృదయాన్ని కదిలించలేవు. ఆ హృదయం మనుషులెవరికీ భయపడదు. మనిషిలో వాసనశక్తి సరిగ్గా ఉంటే అతను దుర్వాసనను పసిగట్టగలుగుతాడు. కాని ఎల్లప్పుడూ దుర్వాసన మధ్య ఉండేవాడి వాసనశక్తి ఎంతగా పాడయిపోతుందంటే పెంటకుప్పలపై కూర్చున్నా కూడా అతనికి దుర్వాసన రాదు. మలినమయిపోయిన హృదయం సంగతి కూడా అంతే. చివరి మాట: ధర్మనిష్ఠ, నీతి, నిజాయితీ, నిబద్ధత, సంకల్ప బలం, ఏకాగ్రతతోపాటు హృదయంలోని విశ్వాసంలో ప్యూరిటీ, మెదడులోని ఆలోచనల్లో క్లారిటీ, శరీరావయాలతో చేసే సత్కర్మల్లో క్వాన్టిటీ + క్వాలిటీ ఇవే మనిషిని కీర్తి కిరీటాలు తొడిగించి నైతిక శిఖరాగ్రం మీద కూర్చోబెడతాయి.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు