Monday, December 2, 2024
అప్పు - తప్పు – ముప్పు
అప్పు - తప్పు – ముప్పు
విశ్వాసులారా! మీరు ఒక నిర్ణీత కాలానికిగాను అప్పు ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడుకుంటే ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. అయితే రుణపత్రం రాసే వ్యక్తి ఎవరికీ ఎలాంటి నష్టం కలగనీయకుండా న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్రాయాలి. అల్లాహ్ తనకు నేర్పిన విధంగా వ్రాయాలి. అతను దస్తావీజు వ్రాయడానికి నిరాకరించకూడదు. బాధ్యత పైబడిన వ్యక్తి (రుణగ్రస్తుడు) ఆ విషయం చెప్పి వ్రాయించాలి. అతను తన నిజప్రభువయిన అల్లాహ్ కు భయపడుతూ నిర్ణీత వ్యవహారంలో ఎలాంటి తగ్గింపు చేయకుండా వ్రాయించాలి..... అల్లాహ్ కు భయపడండి. చూడండి, ఆయన మీకు ఎలాంటి మంచి విషయాలు నేర్పుతున్నాడో! అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు. (అల్-బఖరహ్: 282)
మోయలేని బరువు అప్పు. శక్తికి మించిన బాధ్యత అప్పు. ఒకటో తేదీ వచ్చేసిందనే ఆనందాన్ని మింగేసేది అప్పు. గౌరవంగా బతుకుతున్నామనే భ్రమను బద్దలుకొడుతుంది అప్పు. అప్పుల కుప్ప పెరిగేకొద్దీ స్నేహితులు దూరం అవుతారు. ఆత్మీయులు మొహం తిప్పుకుంటారు. ఆ పరిస్థితి ఎవరికీ వద్దు. అత్యవసరమైతే తప్పించి అప్పుల జోలికి వెళ్లొద్దు. వెళ్లినా అందులోనే ఇరుక్కుపోవద్దు. విచిత్రమేమంటే, సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు అప్పిచ్చేవాడు బైక్ మీద తిరిగితే, అప్పు తీసుకునేవాడు కార్లో షికారు చేస్తాడు. కొందరంతే. అప్పులు చేయడానికే పుడతారు. అప్పులవారి కోసమే సంపాదిస్తారు. అప్పులు తీర్చలేకే చివరి మరణిస్తారు. అయినా, ఎవరూ పుట్టుకతోనే నేరస్థులు కానట్టే... పుట్టుకతోనే రుణగ్రస్తులూ కాదు. పరిస్థితులు ప్రేరేపిస్తాయి. అవసరాలు రెచ్చగొడతాయి. బాధ్యతలు ఉసిగొల్పుతాయి. ఇంకేముంది, అప్పుల దండయాత్ర మొదలవుతుంది.
అంగట్లో అరువు - తల మీద బరువు
హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రజి) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధనం - “(అరువుగా) పుచ్చుకున్న చెయ్యి తిరిగి ఇచ్చే వరకూ రుణపడి ఉంటుంది." (దీనిని అహ్మద్ మరియు నలుగురు ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని సహీహ్ ఖరారు చేశారు)
అప్పులు గుండె మీద నిప్పుల కుంపట్లు. అప్పులు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అప్పులు కలల్ని మింగేస్తాయి. ఇష్టంగా ఇల్లు కట్టుకోలేం. ధైర్యంగా పెళ్లి చేసుకోలేం. ప్రేమగా పిల్లల్ని కనలేం. ప్రశాంతంగా రిటైర్మెంటు తీసుకోలేం. ఒత్తిళ్లతో, అవమానాలతో, కోర్టు వాయిదాలతో అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి అప్పూ ఓ కొత్త శత్రువును సృష్టిస్తుంది. భార్యాపిల్లలు గౌరవించరు. సమాజం చిన్నచూపు చూస్తుంది. ఏ క్షణాన రికవరీ ఏజెంట్లు తలుపు తడతారో అనే భయం నిద్రలోనూ వెంటాడుతుంది. ఆ ముప్పేట దాడిలో మనిషి జీవచ్ఛవం అవుతాడు. అప్పులు వాళ్ల వేధింపులతో, అప్పు తీర్చలేకపోయామనే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేవారూ అనేకమంది. మనిషిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాపించే తప్పని తప్పు ఈ ఆప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
కుచ్ తో బాత్ హై జో ఆతీ హై ఖజా రుక్ రుక్ కే
జిందగి ఖర్జ్ హై ఖిస్తో మే అదా హోతీ హై
అప్పు పరిచయం
భాషాపరంగా - భాగాలు విడగొట్టడం
శాస్త్ర పరంగా
తిరిగి ఇస్తామన్న ఉద్దేశ్యంతో ధన, కనక వస్తువును తీసుకోవడాన్ని అప్పు - ఖర్జ్ అనంటారు.
అప్పు ఆదేశం
ఖుర్ఆన్, హదీసు మరియు ధర్మవేత్తలందరి ఏకాభిప్రాయంతో - అప్పు ఇవ్వడం, తీసుకోవడం అనుమతించబడినది.
మీలో ఎవరయినా అల్లాహ్ కు శ్రేష్ఠమైన రుణదానం అందజేసేవారు ఉన్నారా? ప్రతిఫలంగా ఆయన దాన్ని అనేక రెట్లు పెంచి తిరిగి మీకు అందజేస్తాడు.అల్లాహ్ యే మీ ఉపాధిని తగ్గించేవాడు. దాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆయనే. చివరికి ఆయన సన్నిధికే మీరంతా మరలి పోవలసి ఉంది. (అల్-బఖరా: 245)
రుణదాన ఉద్దేశ్యం
సత్కార్యాల్లో, దైవభక్తికి సంబంధించిన పనుల్లో పరస్పరం సహకరించుకోండి. అంతేగాని, పాపకార్యాల్లో, హింసాదౌర్జ న్యాల్లో మాత్రం ఎవరితోనూ సహకరించకూడదు. దేవునికి భయపడండి. ఆయన (నేరస్థుల్ని) చాలా కఠినంగా శిక్షిస్తాడని తెలుసుకోండి. (మాయిదహ్: 02)
ముస్లింలు పరస్పరం ధర్మం మరియు దైవభక్తి సంబంధించిన విషయాలలో సహకారం అందించడం, వారి మధ్య సోదర బంధాలను బలోపేతం చేయడం, వారి బాధలను తగ్గించడం మరియు పేదల అవసరాన్ని తీర్చడం, వారిపై గల అధిక ఋణభారాన్ని తొలగించడం వంటి శ్రేయస్కర లక్ష్య సాధనే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోరుకున్నది. రుణాల పేరిట జలగల్లా పేద ప్రజల రక్తాన్ని పీల్చి వారి బతుకుల్ని పిప్పి చేసే పాషాణ హృదయ వడ్డీ వ్యాపారులు చేసే ఆకృత్యాలను ఇస్లాం ఎండగడుతుంది.
అప్పున్న వ్యక్తికి ఆర్థిక సహాయం కోరే అనుమతి ఉంది
ఖబీ’సహ్ బిన్ ము’ఖారిఖ్ (ర) కథనం: నేను ఒకరి బాధ్యత తీసుకున్నాను, ప్రవక్త (స) వద్దకు వెళ్ళి అప్పు చెల్లించటానికి అడిగాను. దానికి ప్రవక్త (స), ”ఇక్కడ కొన్ని రోజులు ఉండు, మా దగ్గరకు ‘జకాత్ ధనం వచ్చిన వెంటనే ఇవ్వమని ఆదేశిస్తాం.” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ఇలా అన్నారు, ”ఓ ఖబీ’సహ్ కేవలం ముగ్గురు వ్యక్తులే అర్థించగలరు: 1. అప్పు బాధ్యత తీసుకున్నవాడు అతడు కూడా అప్పు ఎంత ఉందో అంతే అడగ గలడు, అంతకంటే ఎక్కువ అడగరాదు, 2. కష్టాలకు గురయిన వాడు, అతని ధన-సంపదలకు నష్టం వాటిల్లి, కరువు కాటకాలు మొదలైనవాటికి గురైతే, అతడు అవస రానికి కావలసినంత అడగగలడు. అవసరం తీరిపోయిన తర్వాత అతనికి అడిగే అర్హత లేదు, 3. అతనిపై పెద్ద కష్టం వచ్చిపడి, దానివల్ల అతడు పేదవాడైపోయాడు, తినే త్రాగే ఆధారం లేకుండా పోయింది. అతని కుటుంబానికి చెందిన సజ్జనులైన ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తి నిజంగానే పేద రికానికి గురయ్యాడని సాక్ష్యం ఇవ్వాలి. అతడు అవసర మున్నంత, అతని జీవితం నిలబడేంత అడగ వచ్చును. అతని అవసరం తీరగానే అర్థించడం తగదు. కేవలం ఈ ముగ్గురు వ్యక్తులే అర్థించగలరు. వీరు తప్ప ఇతరులు అర్థించటం నిషిద్ధం. అనవసరంగా అర్థించేవాడు అధర్మ సంపాదన తింటాడు. (ముస్లిమ్)
రుణదాత ఘనత
ఒక ముస్లిం మరొక ముస్లింకు రెండుసార్లు రుణంఇస్తే , అందులో ఒకసారి ఇచ్చిన రుణానికి అతనికీ సదఖా చేసిన పుణ్యం కూడా అదనంగా లభిస్తుంది అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ (స). (ఇబ్ను మాజహ్)
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు: నేను ఇశ్రా మేరాజ్ చేసిన రాత్రి - పై లోకాల్లో స్వర్గపు తలుపు మీద ఇలా అవ్రాసి ఉండటం చూశాను. దానానికి పదింతలు పుణ్యం, రుణానికి 18 రెట్లు పుణ్యం. ఏమిటి దానంకన్నా రుణానికి లభించే పుణ్యం ఎక్కువుందేమిటి? అని దైవ దూత జిబ్రయీల్ (అ) వారిని అడిగాను. అందుకాయన - సాధారణంగా దానం స్వీకరించే వ్యక్తి దగ్గర కొంత దానం ఉంటుంది. దానం కొన్ని సందర్భాలలో ధనికులకు కూడా లభించవచ్చు. అదే అప్పు అడిగే వ్యక్తి అత్యవసరం ఉంటే తప్ప అడగడు. (ఇబ్ను మాజహ్)
ఇతరుల అప్పు తీర్చేవాని ఘనత
హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: విశ్వాసికి ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని గనక ఎవడైనా దూరం చేస్తే, అల్లాహ్ పరలోకంలో అతడికి ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైనా (ఆర్థిక) ఇబ్బందుల్లో ఉన్న ఒక అభాగ్యునికి సౌలభ్యాన్ని చేకూరిస్తే అల్లాహ్ వారికి ఇహపరాల్లోనూ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైనా ఒక ముస్లిం (పాపాల)ను కప్పిపుచ్చితే, అల్లాహ్ ఇహలోకంలోనూ, పరలోకంలోనూ అతని పాపాలను కప్పిపుచ్చు తాడు. దాసుడు తన సోదరుడికి సహాయం చేస్తున్నంతకాలం అల్లాహ్ దాసునికి సహాయం చేస్తూ ఉంటాడు. (ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో - పరలోకంలో పొందాలనుకునే వ్యక్తి, విశ్వాసికి ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని గనక ఎవడైనా దూరం చేస్తే, అతని మీద ఉన్న అధిక భారాన్ని తొలగిస్తే ప్రతిగా అల్లాహ్ పరలోకంలో అతడికి ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఒక బరువును తొలగిస్తాడు. అలాగే అతనికి తన అర్ష్ నీడన చోటు కల్పిస్తాడు అని ఉంది.
అప్పు మూల సూత్రాలు మూడు
1- ఫార్ములా: ఇది ప్రతిపాదన మరియు అంగీకారం. నేను మీకు అప్పుగా ఇస్తున్నాను. నేను రుణం తీసుకున్నాను, ఫలానా సమయానికి తిరిగి చెల్లిస్తాను. లేదా అతను నా నుండి ఇంత పైకం అప్పుగా తీసుకున్నాడు వంటి మాట లేదా వ్రాతపూర్వక ఒప్పందం. ఇది ఇద్దరి ఏకాభిప్రాయంతో కూడిన ఒప్పందం.
2- రెండు ఒప్పంద పక్షాలు: రుణదాత మరియు రుణగ్రహీత. వీరికి కొన్ని షరతులున్నాయి. 1) వారు యవ్వనస్తులయి ఉండాలి. పిల్లల నుండి ఋణం చెల్లదు. 2) బుద్ధిమంతులై ఉండాలి. మతి చలించిన వారి, పిచ్చివారి రుణ చెల్లదు. 3) రుణమిచ్చే వ్యక్తి రుణ వస్తువుకి యజమాని అయి ఉండాలి. ఒకరి ఆస్తికి సంరక్షకునిగా ఉన్న వ్యక్తి ఆ సొమ్మును ఋణం ఇవ్వకూడదు.
3- రుణంగా ఇచ్చే వస్తువు ముందుండాలి. లేని వస్తువు ఋణం చెల్లదు.
రుణగ్రస్తుని పట్ల మృదువైఖరి అభిలషణీయం
ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందులతో సతమతమౌతుంటే పరిస్థితి చక్కబడే వరకు అతనికి అవకాశమివ్వండి. రుణం మాఫీ చేస్తే మరీ మంచిది. మీరు గ్రహించగల్గితే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది. మీరంతా చివరికి అల్లాహ్ సన్నిధికి చేరుకోవలసిన దినం గురించి కాస్త భయపడండి. (ఆరోజు) ప్రతివ్యక్తికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్-బఖరా: 280-281)
పేద రుణగ్రస్తుడికి తగిన వ్యవధి నివ్వడం పుణ్యప్రదం
హజ్రత్ హుజైఫా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు:- "మీ పూర్వీకులలో ఒక వ్యక్తి ఆత్మకు దైవదూతలు ముందుకు వచ్చి స్వాగతం చెప్పారు “(నిన్నింతగా స్వాగతించాలని మాకు ఆజ్ఞ జారీ కావడానికి కారణం) నువ్వేమయినా పుణ్యకార్యం చేసి ఉన్నావా?" అని అడిగారు ఆ దైవదూతలు అతడ్ని. దానికా వ్యక్తి “నేను నా సేవకుల్ని నిరుపేద (రుణగ్రస్తు)లకు తగిన వ్యవధినివ్వమని, ధనికుల్ని క్షమించమని ఆజ్ఞాపించేవాడ్ని" అని అన్నాడు. అందువల్లనే అల్లాహ్ అతని తప్పుల్ని క్షమించి అతని పట్ల మంచిగా వ్యవహరించమని దైవదూతలను ఆజ్ఞాపిం చాడు". (సహీహ్ బుఖారీ)
పేద రుణగ్రస్తుడికి కాస్త సొమ్మును మాఫీ చేయడం పుణ్యప్రదం
హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రజి) కథనం:- నేనొక రోజు మస్జిదులో అబ్దుల్లా బిన్ అబీ హద్ద్ (రజి)ని నాకివ్వాల్సిన బాకీ ఇవ్వమని నిలదీశాను. మేమిద్దరం (అరచుకుంటూ) బిగ్గరగా మాట్లాడుకోసాగాము. మా అరుపులు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న దైవప్రవక్త (సల్లం)కు విన్పించాయి. ఆయన వెంటనే లేచి తమ కుటీరం తెరను పైకెత్తి “కాబ్!” అని పిలిచారు. నేను “వస్తున్నానండీ” అన్నాను. అప్పుడాయన “నీకు రావలసిన అప్పులో కొంచెం తగ్గించుకో” అని చెప్పారు. చేత్తో సూచిస్తూ ‘సగం తగ్గించుకో' అన్నారు. “మీరెలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తా"నన్నాను నేను. “మరయితే లే వెంటనే అతని హక్కు నెరవేర్చు” (అంటే తాత్సారం చేయకుండా జరిగిన తీర్పు ప్రకారం ఆచరించు) అని ఆదేశించారు. (సహీహ్ బుఖారీ)
అప్పు తీసుకోవడం అవసరమే కాని దాన్ని ఉత్తమ పద్ధతిలో తిరిగి చెల్లించడం అంతకంటే మంచి విషయం
హజ్రత్ అబూహురైరా (రజి) కథనం:- ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లం) దగ్గరికొచ్చి తన అప్పు తిరిగిచ్చేయమని ఒత్తిడి చేయసాగాడు. ఆ సందర్భంలో అతను పరుష పదజాలాన్ని ఉపయోగించాడు. ప్రవక్త సహచరులు (రజి) ఈ మాటలు విని అతడ్ని దూషించడానికి ఉపక్రమించారు. అయితే దైవప్రవక్త (సల్లం) (వాళ్ళను వారిస్తూ) “అతడ్ని ఏమీ అనకండి, వదిలేయండి. తన సొమ్ము తీసుకోవలసిన వ్యక్తికి ఇలా కఠినంగా మాట్లాడే హక్కుంది" అని అన్నారు. ఆ తర్వాత ఆయన “అతను నాకిచ్చిన ఒంటె వయస్సు ఎంత ఉందో అంతే వయస్సు గల ఒంటెను అతనికి ఇచ్చి వేయండి” అని అన్నారు. అప్పుడు ప్రవక్త సహచరులు (రజి) “దైవప్రవక్తా! అతని ఒంటెలాంటి ఒంటె లేదు. మా దగ్గర ఉన్నవన్నీ అంతకంటే మంచి ఒంటెలే” అని అన్నారు. “ఆ మంచి ఒంటె ఇవ్వండతనికి. అప్పు తీర్చడంలో ఉత్తముడే మీలో ఉత్తముడు" అన్నారు ఆయన. (సహీహ్ బుఖారీ)
ధనికుడు అప్పు తీర్చడంలో ఆలస్యం చేయకూడదు
హజ్రత్ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా సెలవిచ్చారు:- “ధనికుడు అప్పు తీర్చడంలో ఆలస్యం చేయడం అన్యాయం. రుణగ్రస్తుడు తన రుణబాధ్యతను, దాన్ని తీర్చే స్తోమత గల వ్యక్తికి అప్పగించినపుడు రుణదాత (అందుకు అంగీకరించి), తన అప్పు గురించి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తినే అడగాలి". (సహీహ్ బుఖారీ)
ధనికులైనా, మధ్యతరగతి వ్యక్తులైనా, పేద ప్రజలయినా సౌకర్యం ఉంటే వీలైనంత త్వరగా అప్పు తీర్చేయాలి. ఎందుకంటే, ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అప్పు తీర్చాలి అని అనుకునే వ్యక్తి దాని కోసం తొందరపడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారినయినా పడవచ్చు లేదా తన సమస్య అయినా ఎదురవ్వచ్చు.. అలాగే ఎవరికీ ఎంత అప్పు ఇవ్వాలో వ్రాత పత్రంలో వ్రాసి వీలునామా చేసి పెట్టుకోవాలి.
ఉత్తమ ఋణం - ఉత్త రుణంగా మారిన వేళ..
అప్పు అంటే కొందరి దృష్టిలో - 'తమకు ఏదో అవసరం కలిగినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి గానీ, గ్రామస్థుల నుంచి గాని, లేక ఓ బ్యాంక్ లాంటి సంస్థలో గానీ మళ్లీ ఇస్తామనే భ్రమ పెట్టి, తీసుకొనిన ధనము, ధనేతర వస్తువు. ఆహా! ఎంత గొప్ప నిరవచం! పై నిర్వచనంలో 'మళ్లీ ఇస్తామనే భ్రమ పెట్టి' అన్న వాక్యం కొసమెరుపు. 'అప్పులు ఎలా చేయాలి? ఎవరి దగ్గర చేయాలి? ఎలా ఎగ్గొట్టాలి' అని వీరికి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలిసి ఉండదు. ఖర్జ్ హసనా .. అని తీసుకొని.. దాన్ని ఖర్జ్ హన్సనా గా మార్చుకొని - రుణదాత కనబడ్డప్పుడల్లా ఊరించి... కవ్వించి... నవ్వించి ... అరువు తెచ్చుకున్న నవ్వుల అత్తర్లు జల్లేసి జారుకుంటారు. వీరినుద్దేశించే బహుశా సిగ్గు లేని జన్మ అన్నారేమో పెద్దలు. చట్టాన్ని ఆసరాగా చేసుకొని రుణదాతను వేధించడం కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నది.
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
తియ్యగా ఉంటె తిన బుద్ధి అయ్యిందట…
అప్పు అవసరమే కానీ ...
ఒక అప్పు సురక్షితం, రెండో అప్పు ప్రమాదకరం, మూడో అప్పు దివాలాకు ఆమడ దూరం. కాబట్టి, మొదటి అప్పు తీరేవరకూ రెండో అప్పు చేయకూడదనే నియమం పెట్టుకోవాలి. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాలు... మొదలైన వాటికి కూడా చేబదుళ్లు తీసుకుంటున్నామంటే, క్రమంగా రుణ వలయంలో చిక్కుకుంటున్నామని అర్థం. అప్పులు తీర్చడానికో, వడ్డీలు కట్టడానికో మళ్లీ అప్పులు చేయడం రెండో తుపాను హెచ్చరికతో సమానం. అప్పు ఇచ్చినవాడు మేలు కోరుతాడు, అప్పు తీసుకున్నవాడు కీడు కోరుతాడు అంటారు.. ఎందుకో ఒకసారి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది.
ఈ అప్పులతో తప్పవు తిప్పలు..
కుళాయిలోంచి ధారాపాతంగా నీళ్లు పడుతున్నా బకెట్ మాత్రం నిండటం లేదంటే... ఎక్కడో చిల్లులున్నాయని అర్థం. నెలంతా కష్టపడుతున్నా, మొదటి వారంలోనే పర్సు ఖాళీ అవుతోందంటే... వృథా వ్యయాలు పెరిగిపోయాయని భావం. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత మిగుల్తోంది. ఆ మిగులును ఎటువైపు మళ్లిస్తున్నాం? ... అనే స్పష్టత ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సెల్ఫోన్, కారు, ఫర్నిచర్... ఇలా అత్యవసరం కాని వస్తువుల కోసం అత్యవసరంగా అప్పు చేయడం ఏమంత తెలివైన నిర్ణయం కాదు. నిజానికి ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ కొన్న మరుక్షణమే ఓ పదిశాతం పడిపోతుంది. నాలుగైదేళ్లు గడిచేసరికి నామమాత్రం అవుతుంది. మనం మాత్రం... ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఖర్చులు, వడ్డీల రూపంలో అసలు ధరకు రెట్టింపు మొత్తాన్ని సమర్పించుకుంటాం.
నేడు మన దేశంలో కార్ లోన్లకు గిరాకీ పెరుగుతోంది. ప్రత్యేకించి మధ్యతరగతి ఎగబడి తీసుకుంటోంది. నిజానికి అదో వ్యామోహ చట్రం. అప్పు చేసి మరీ కారు కొంటామా? ఏడాది తిరిగేసరికి అందులోనే కొత్త మోడల్ వస్తుంది. మనసు అటువైపు మళ్లుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత కారును (అతి తక్కువ విలువకు అప్పగించి తళతళలాడే కొత్తబండిని తెచ్చుకుంటాం. ఫలితంగా ఇంకొంత అప్పు పెరుగుతుంది. దీనికితోడు ఇంధనం, సర్వీసింగ్, బీమా, పన్నులు... ఇలా రకరకాల ఖర్చులు ఉండనే ఉంటాయి. ఒక్క కారే కాదు, ఏ జీవనశైలి ఉత్పత్తులనూ అప్పు చేసి కొనకూడదు. వాయిదా పద్ధతిని అసలు ఎంచుకోకూడదు. చేతిలో మిగులు సొమ్ము ఉంటేనే ఆ వైపుగా ఆలోచించాలి. అప్పు లేకపోతే చాలు, ఐశ్వర్యం ఉన్నట్లే ...అప్పులెనెవోడే అధినాయకుడు అని గుర్తెరిగి మసలుకోవాలి.
అదా హువా న ఖర్జ్ ఔర్ వుజూద్ ఖతమ్ హోగయా / మై జిందగీ కా దేతే దేతే సూద్ ఖతమ్ హోగయా
పులినోట్లో తల పెట్టడమే.
అడ్డూ అదుపూ లేని క్రెడిట్ కార్డు వినియోగం కూడా మనిషిని అప్పుల ఊబిలోకి తోసేస్తోంది. సకాలంలో బిల్లు చెల్లించకపోతే... వివిధ రూపాల్లో బాదుడు తప్పదు. ఈఎమ్ఐ కింద మార్చుకుంటే.. వడ్డీల మోత భారీగా ఉంటుంది. ఏ కొనుగోలుకైనా క్రెడిట్ కార్డు చిట్టచివరి చెల్లింపు మార్గం మాత్రమే. మన ఆర్ధిక పరిమితుల్ని మరిచిపోయి కార్డులు గీకేయడం... పులినోట్లో తల పెట్టడమే. అందుకే - ఆనలో అప్పులున్న వాడికి, వానలో చెప్పులున్నవాడికి వెనకాల నడవకూడదు అన్నారు పెద్దలు.
వాయిదా వేసుకోవాలి.
బ్యాంకు యాప్లో చిన్నపాటి క్లిక్ చాలు. క్షణాల్లో అప్పు మంజూరైపోతుంది. అంతే వేగంగా మన ఖాతాలో సొమ్ము పడిపోతుంది. డాక్యుమెంటేషన్ బాధ ఉండదు. జామీనూ అడగరు. ఈ రోజుల్లో పర్సనల్ లోన్ మరీ సులభమై పోయింది. దీంతో ఏ చిన్న అవసరం వచ్చినా... వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కూడా వడ్డీల వాయింపు బాగానే ఉంటుంది. కాబట్టి, తప్పనిసరైతేనే వాటి జోలికి వెళ్లాలి. విందులూ, విలాసాలూ, జీవనశైలి ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవడం సరికాదు. మరొక హెచ్చరిక. ప్రాణాల మీదికి వస్తున్నా సరే, లోన్ యాప్స్న ఆశ్రయించ కూడదు. అదొక విష వలయం. ఒక్కసారి చిక్కుకుంటే చచ్చినా బయటపడలేం. మనల్నే కాదు, మన సన్నిహితులనూ వెంటాడతారు. నడి బజారులో నిలబెడతారు. తలనిండా పేలున్నా, ఊరినిండా అప్పులున్నా బాధ తెలియదు. అంటారు ఎందుకో తెలుసా? అప్పులు ఎక్కువ చేసేవాడికి అది తప్పు అన్న స్పృహే ఉండదు గనక.
మంచి రుణం
కొన్ని అప్పులు అసలు అప్పులే కాదు. పరోక్షమైన పెట్టుబడులు. అప్పటికప్పుడు భారంగా అనిపించినా, దీర్ఘకాలంలో మంచి చేస్తాయి. సంపదను సృష్టిస్తాయి. వీటిని గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్తో పోల్చుకోవచ్చు. గృహరుణం కూడా ఈ జాబితాలోకే వస్తుంది. మహా నగరాల్లో ఇల్లు కొనడమంటే మాటలు కాదు. చేతిలోని కొద్దిపాటి సొమ్ముతో సొంతింటి యజమాని అనిపించుకోలేం. ఆ సమయంలో అప్పు అనివార్యం అవుతుంది. కాకపోతే, ఈఎమ్ఐ మరీ భారం కాకుండా చూసుకోవాలి. డిస్కౌంట్ ఇస్తున్నారనో, ధర తగ్గిస్తున్నారనో స్తోమతకు మించిన ఆస్తులను ఎంచుకోకూడదు. గృహ రుణానికి వెళ్లే సమయానికంతా మరో అప్పు లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, సగటు జీవి ఒకేసారి రెండు ఈఎమ్ఐల భారాన్ని భరించలేడు.
విద్యారుణం: విద్యారుణం కూడా మంచి అప్పే. చదువు నైపుణ్యాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది. మన కోసం తీసుకున్నా, మన పిల్లల కోసం తీసుకున్నా ఎడ్యుకేషన్ లోన్ హర్షించదగినదే!
వ్యాపార రుణం: సద్వినియోగం చేసుకోగలిగితే వ్యాపార రుణాలూ లాభదాయకమే. చిన్నాచితకా ఖర్చులు పోనూ పది శాతమైనా మిగులుతుంది. వ్యాపారమూ విస్తరిస్తుంది. కాకపోతే ఓ షరతు. ఆ రుణాన్ని వ్యక్తిగత అవసరాలు తీర్చుకోడానికో, పాత అప్పులు వదిలించుకోడానికో వాడకూడదు. దురాశతో స్టాక్ మార్కెట్కు మళ్లించరాదు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడమూ రిస్కే పొరపాటున మార్కెట్ కుప్పకూలిపోతే... అసలు తీర్చలేకా, వడ్డీ కట్టలేకా సతమతమైపోతాం.
గమనిక: ఆ ఈఎమ్ఐలు వడ్డీ రహిత - ఇస్లామీయ చట్టానికి లోబడి ఉంటేనే తీసుకోవాలి.
సంపద రెండు రకాలు:
ఆర్థిక కోణంలో మనుషుల్ని రెండు రకాలుగా విభజిస్తారు నిపుణులు. ఒకటి... అసెట్ రిచ్ - క్యాష్ పూర్. రెండు... క్యాష్ రిచ్ అసెట్ పూర్. కొందరికి ఆస్తిపాస్తులు చాలానే ఉంటాయి. కానీ చేతిలో నగదు ఉండదు. దీంతో అప్పుల పాలు అవుతారు. వడ్డీల దెబ్బకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొందరికి ఆస్తులు ఉండవు. కానీ నగదు మాత్రం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉండవు కానీ, దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టించలేక పోతారు. ఈ రెండూ ఆర్థిక విజేతల లక్షణాలు కావు. మధ్యేమార్గంగా... చేతినిండా నగదు ఉన్నవారు కొంత సొమ్మును స్థిరాస్తులుగా మార్చుకోవడం మంచిది. పుష్కలమైన ఆస్తులు ఉన్నవారు కొన్ని ఆస్తుల్ని నగదు చేసుకుని అత్యవసర నిధిని సృష్టించుకోవడం ఉత్తమం.
ప్రణాళిక ముఖ్యం
ఆర్థిక లక్ష్యాలు లేకపోవడం కూడా అర్ధంలేని అప్పులకు ఓ కారణమే. పదేళ్లలో ఇంటి రుణం తీర్చేయాలి, పాతికేళ్లలో రిటైర్మెంట్ ఫండ్ సమకూర్చుకోవాలి, పిల్లల చదువులకు కనీసం కొన్ని లక్షలు పక్కన పెట్టాలి... ఇలా మనకంటూ కొన్ని తీర్మానాలు చేసుకున్నప్పుడు, వాటి ప్రకారంగానే బడ్జెట్ రూపొందించుకుంటాం. చెత్త పెట్టుబడులతో రిస్క్ తీసుకోం. ఈఎమ్ఐ కొనుగోళ్లను ఇష్టపడం. జీవనశైలి ఖర్చుల్ని నియంత్రించుకుంటాం. అప్పుల జోలికే వెళ్లం.
రాష్ట్ర, దేశ క్షేమం కూడా ముఖ్యమే
సాధారణంగా, ప్రభుత్వాలు ఎడతెగక మరీ మరీ అప్పులు చేస్తూ వడ్డీలను పెంచుకుంటూ ఉంటాయి. ఇది సాధారణమే అయినప్పటికీ, అమితంగా అప్పులు చేయడం ప్రజలను ధవవంతులుగా చేసే బదులు దారిద్ర్యాన్ని, భద్రత లేనితనాన్ని మరింత అధికం చేస్తుంది. డానిష్ సామెత చెబుతున్నట్లు, “తిన్న రొట్టెకు డబ్బు చెల్లించడం కష్టం.”
బాధ్యతగల నాయకుడెవరైనా ఏం చేస్తారు? పురోగతిని పరుగులెత్తిస్తారు... అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తారు! అలాగే చేస్తారని.... రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులెత్తిస్తారని... నమ్మి, ప్రజలు పగ్గాలు అప్పగిస్తే... ఎలా పాలించాలో తెలియక, అభివృద్ధి చేతకాక... ఒప్పుల కుప్పగా ఎదగాల్సిన రాష్ట్రాన్ని, దేశాన్ని అప్పులదిబ్బగా మార్చారు! అన్నపూర్ణను దివాలా అంచులకు చేర్చారు! వెనిజువెలా, అర్జెంటీనా, గ్రీసు దేశాల సరసన నిలబెట్టారు! సమయానికి జీతాలివ్వక జీవితాలను అల్లాడించారు... ఈ బిల్లులు. ఆ బిల్లులంటూ, GSTలు అదనపు టాక్సలు అంటూ చెవులు చిల్లు పడేలా బెల్లు మోగించారు. సగటు పౌరుని వీపుకి వాతలు పెట్టారు.. పేదోడి నడ్డి విరగ్గొట్టారు.!! అప్పు ఎంతలా ఎదుగుతుంది అంటే – మనిషిని, దేశాన్ని అందనంత ఎత్తు నుండి -కనపడనంత లోతులో పడేస్తుంది.
అప్పు విషయంలో అపనమ్మకాలు
అప్పు తీసుకోవడానికి కూడా శుభ ఘడియలు మంచి రోజులు ఉంటాయంటారు. ఆ ప్రకారం…మంగళవారం, బుధవారం, శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వద్ద అప్పు చేయకూడదు. అలాగే మంగళవారం రోజున తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించటం చాలా మంచిది. సోమవారం, బుధవారం, ఆదివారం ఆదివారం రోజున అప్పు తీసుకోవడం వల్ల ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. అంటారు. అలాంటి నమ్మకాలకు ఇస్లాంలో చోటు లేదు. అలాగే కొందరు అప్పు కలిసొచ్చింది అని ... వారు కోట్లకు పడగలెత్తినా అప్పు తిరిగి ఇవ్వరు. ఇదో సిల్లీ నమ్మకం!
అప్పు తప్పు చేయకండి!
మార్కెట్‌లో కనిపించే ప్రతీదీ కొనేయడానికి తొందరపడకండి. మీకు ఏమి అవసరం, వాటికోసం నిజంగా ఎంత ఖర్చుపెట్టగలరు అనేవి ఆలోచించుకుని బడ్జెట్ వేసుకోండి. అంతకుమించి ఖర్చు పెట్టకండి. అనవసరమైన అప్పులు చేయకండి. “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. “ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.” అసూయ, అత్యాశ ఆర్థిక పతనానికి దారితీస్తాయి. అంతేకాదు, ఆధ్యాత్మిక విషయాల్ని హరించేస్తాయి. ఋణ బాధ్యత కుటుంబానికి, ఆరోగ్యానికి, ఆత్మీయతకు హానికరం కాగలదు. అప్పు ఋణస్థుణ్ణి మరింత పేదవానిగా చేయవచ్చు.
జహాన్ తక్ హోసకే కిసీ సే ఖర్జ్ మత్ లేనా
మియా ఖరజ్ దారీ ఖైర్ ఒ బర్కత్ చీన్ లేతి హై
అప్పు నుండి ఆదర్శ ప్రవక్త (స) శరణు కోరడం
హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.
“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మరణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు. (సహీహ్ బుఖారీ)
ఈ హదీసులో పేర్కొనబడిన కొన్ని అంశాలు
‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.
అప్పు గర్హించదగినది
రుణగ్రస్తుడై ఉన్న వ్యక్తి చనిపోయి అతని జనాజా (శవపేటిక)ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు తీసుకురావటం జరిగితే, “ఇతను (మృతుడు) తన అప్పును తీర్చడానికి ఆస్తి ఏదైనా వదలిపోయాడా?" అని దైవప్రవక్త (సఅసం) అడిగేవారు. అతను అప్పు తీర్చడానికి సరిపడే అంత ఆస్తి వదలిపోయాడని సమాధానం వస్తే ఆయన (స) అతని జనాజా నమాజు చేయించేవారు. అలాంటి సమాధానం రాకపోతే "మీరే మీ సహచరుని జనాజా నమాజ్ చేసుకోండి" అని చెప్పేసేవారు. కొంత కాలానికి దేవుడు (తన ప్రవక్త కోసం) విజయ ద్వారాలు తెరిచాడు. (అంటే పెద్ద ఎత్తున విజయప్రాప్తి రాసాగింది) అప్పుడాయన (సఅసం) ఇలా అన్నారు - "నేను విశ్వాసులకు వారి ప్రాణాలకన్నా సమీపంగా ఉన్నాను. కనుక (ఇకనుంచి) ఎవరయినా ముస్లిం చనిపోతే, అతను ఎవరికయినా బాకీ పడి ఉంటే, ఆ బాకీ నేను తీరుస్తాను" (బుఖారీ, ముస్లిం)
ఎవరయినా ముస్లిం రుణగ్రస్తుడై వున్న స్థితిలో చనిపోతే, అతని వారసులుగానీ, బంధుమిత్రులుగానీ అతని రుణాన్ని తీర్చే బాధ్యతను స్వీకరించకపోతే ఇస్లామీయ ప్రభుత్వమే బైతుల్మాల్ (ప్రభుత్వ ధనాగారం) నుండి దాన్ని తీరుస్తుందని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. మహనీయ ముహమ్మద్ (సఅసం) కు సమాజంలోని రుణగ్రస్తుల, అగత్యపరుల, నిరాధార జీవులపట్ల గల దయాదాక్షిణ్యాలు కూడా ఈ హదీసు ద్వారా వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాధికారులు తన రాజ్య ప్రజల పట్ల ఎంత బాధ్యతతో, మరెంత వాత్సల్యంతో మసలు కోవాలో కూడా ఈ హదీసు సూచిస్తోంది. అప్పు తీర్చటం ఎంత ముఖ్యమైన బాధ్యతో ఈ హదీసు నొక్కి చెబుతోంది. మనిషి తాను జీవించి ఉండగానే అప్పు తీర్చటం చాలా మంచిది. రుణగ్రస్తుడు చనిపోయినప్పుడు అతని జనాజా నమాజు చేయడానికి దైవప్రవక్త(సఅసం) అంగీకరించలేదంటే, అది చూచి బ్రతికి ఉన్నవారు దైవానికి భయపడి తమ అప్పులను తీర్చివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని ఆయన ఆశించి ఉండవచ్చు.
అప్పు బాధ్యత తీసుకున్న వ్యక్తి తన సంపద నుండే అప్పు తీర్చాలి
హజ్రత్ జాబిర్ (రజి) కథనం మాలోని ఒక వ్యక్తి చనిపోయాడు. మేము అతనికి (భౌతిక కాయానికి) సువాసన స్నానం చేయించాము. పూశాము. కఫన్ వస్త్రం తొడిగించాము. ఆ తరువాత అతన్ని (శవపేటికను) దైవ ప్రవక్త (సఅసం) సన్నిధికి తీసుకువచ్చి, "తమరు ఇతని అంత్యక్రియల ప్రార్ధన చేయించాలి" అని అభ్యర్థించాము. ఆయన(స) కొన్ని అడుగులు ముందుకు రావటానికి లేచారు. మరి అంతలోనే,
"ఇతను ఎవరికయినా ఏమైనా బాకీ పడి ఉన్నాడా?" అని దర్యాప్తు చేశారు. "రెండు దీనార్లు బాకీ పడి ఉన్నాడ"ని మేము విన్నవించు కున్నాము. ఇది వినగానే ఆయన (స) వెనక్కి వచ్చేశారు. అబూ ఖతాదా (రజి) ఆ రెండు దీనార్ల బాకీని చెల్లించే బాధ్యతను స్వీకరించారు. తరువాత మేమంతా ఆయన (స) వద్దకు వచ్చాము. "ఆ రెండు దీనార్ల రుణగ్రస్తుని రుణాన్ని తీర్చే బాధ్యత నాది" అన్న అబూ ఖతాద (రజి) గారినుద్దేశించి దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: చెప్పారు. "రుణగ్రస్తుని మాదిరిగా ఇది నీపై తప్పనిసరి అయిపోయింది. ఇక దీన్ని చెల్లించవలసిన బాధ్యత కేవలం నీదే. మృతుడు ఈ బాధ్యత నుండి విముక్తి పొందాడు. అవునా?" అని ఆయన (స) రెట్టించగా 'అవును' అని ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన (సఅనం) అతని నమాజ్ జనాజా చేయించారు." (అహ్మద్, అబూదావూద్, నసాయి)
ఈ హదీసు ద్వారా అనేక అంశాలు మన ముందుకు వస్తున్నాయి. (1) మృతుని తరపున రుణం చెల్లించే బాధ్యతను ఎవరయినా స్వీకరిస్తే అది సమంజసమే. (2) రుణం చెల్లిస్తానని పూచీగా ఉన్న వ్యక్తి ఆ పైకాన్ని మృతుని ఆస్తి నుండి తీసుకోజాలడు అతడు తన కష్టార్జితం నుండి దాన్ని చెల్లించవలసి ఉంటుంది. (3) అప్పులైనా లేదా ఇతర దాసులు హక్కులైనా వాటిని తీర్చనంతవరకూ, హక్కుదారులు లేదా రుణదాతలు వాటిని క్షమించి వదలి పెట్టనంత వరకూ అవి సమసిపావు. (4) అప్పు తీసుకోవటం ఎంతో సున్నితమైన, జఠిలమైన వ్యవహారం. సాధ్యమైనంతవరకు అప్పుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అప్పు తీసుకోవటం వినా మరో గత్యంతరం లేదనుకుంటే ఆ అప్పును వీలైనంత తొందరగా తీర్చివేసేందుకు ప్రయత్నించాలి.
రుణం మార్పిడి, భరోసా
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించినట్లు హజ్రత్ అబూ హురైర (రజి) తెలియజేశారు : "శ్రీమంతుడు రుణం చెల్లించటంలో తాత్సారం చేయటం అన్యాయం. రుణగ్రస్తుడు తన రుణం తీర్చే విషయమై శ్రీమంతుని హవాలా (రెఫరెన్సు) ఇస్తే (రుణదాత) దాన్ని అంగీకరించాలి" (బుఖారీ, ముస్లిం). అహ్మద్లోని ఒక ఉల్లేఖనంలో 'హవాలాను ఒప్పుకోవాలి' అని వుంది.
ఈ హదీసులో 'హవాలా' గురించి చెప్పబడింది. ఈ 'హవాలా'కు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి: ఒక వ్యక్తి రుణం విషయంలో పూచీగా ఉంటాడు. అంటే ఫలానా వ్యక్తికి ఇంత పైకం అప్పుగా ఇవ్వు. దీనికి బాధ్యత నాది అని అంటాడు. రెండు : తాను చెల్లించ వలసిన బకాయిని ఫలానా వ్యక్తి నుండి వసూలు చేసుకో అని అంటాడు. ఉదాహరణకు అఫ్సర్ - ఆరిఫ్ - ఇర్ఫాన్' అనే ముగ్గురు వ్యక్తులున్నారు. అఫ్సర్ అనేవాడికి ఆరిఫ్నుండి వెయ్యి రూపాయలు రావలసి ఉన్నాయి. ఆరిఫ్కు ఇర్ఫాన్ నుండి వెయ్యి రూపాయలు రావాలి. ఆరిఫ్, అఫ్సర్ను ఉద్దేశ్యించి నేను నీకు ఇవ్వవలసిన వెయ్యి రూపాయల బకాయిని ఇర్ఫాన్ నుండి తీసేసుకో అని అంటాడు. ఈ రకమయిన సర్దుబాటును షరియత్ ఆమోది స్తోంది. అయితే ఇర్ఫాన్ తాను ఆరిఫ్కు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నానన్న సంగతి నిజమేననీ, ఆ మొత్తం నీకు ఇస్తానని అఫ్సర్తో చెప్పాలి.
అరబ్బు దేశాల బ్యాంకులలో 'డ్రాఫ్టు'ను 'హవాలా'గా వ్యవహరిస్తారు. డ్రాఫ్టు తయారుచేసి ఇచ్చే బ్యాంకు పైకం జమచేసిన వ్యక్తికి ఒక రసీదు ఇచ్చి, ఈ రసీదు ఆధారంగా ఫలానా బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకోవచ్చని అంటుంది. ఇది అక్కడ హవాలా యొక్క అధునాతన పద్ధతి ఇది షరియత్కు అనువైనదే.
షహీద్ కి కూడా రుణ మాఫీ లేదు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు: అరువు,అప్పు తప్ప అమరవీరుని ప్రతి పాపం క్షమించబడుతుంది. (సహీహ్ అల్ జామె)
అప్పు తిరిగి ఇవ్వని వాడు దౌర్జన్యపరుడు , దొంగ
అప్పులు చేసి తిరిగి చెల్లించకూడదని నిశ్చయించుకున్న వ్యక్తి - ఈ డబ్బును తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యం లేకుండా అప్పు తీసుకుంటాడో అతను రేపు అల్లాహ్ తో కలుసుకున్నపుడు ఒక దొంగలా ముద్ర వేయబడి ఉంటాడు. (ఇబ్ను మాజహ్)
అప్పు చెల్లించి వాడికి శుభం - చెల్లించని వానికి అశుభం
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖించారు: “ఎవరైతే ను (అప్పుగా) తీసుకుని జనుల దాన్ని తిరిగి చెల్లించాలని పరితపిస్తూ తుంటాడో అతని అప్పును తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడు. మరెవరయితే వారి (జనుల) సొమ్మును కాజేయాలని సంకల్పించుకుంటాడో అతన్ని అల్లాహ్ వృధా పరుస్తాడు." (బుఖారీ) అందరూ మంచోళ్ళు కాదు. కొందరు ముంచేటోళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త!
మహర్ కూడా రుణమే
ఏ పురుషుడైనా సరే, చిన్న లేదా పెద్ద మహర్ తో స్త్రీని వివాహం చేసుకొ ని, ఆమెకు హక్కులు చెల్లించాలనే ఆలోచన లేకుండా, ఆమెను మోసం చేసి, చనిపోయి, ఆమెకు హక్కులు చెల్లించకుండా ఉంటే, అతను పునరుత్థాన దినాన దేవుడిని ఒక వ్యభిచారిలా కలుసుకుంటాడు అన్నారు దైవ ప్రవక్త (స). (సహీహ్ తర్ఘీబ్)
అప్పు భారాన్ని తొలగించే అద్భుతమైన దుఆ
ఋణభారంతో నలిగిపోతున్న ఒక వ్యక్తి దేవుని బెబ్బులీ హజ్రత్ అలీ (ర) గారి సన్నిధికి వచ్చి - నాపై చాలా ఋణం ఉంది. దాన్ని నేను తీర్చలేకపోతున్నాను. ఏదైనా పరిష్కార మార్గం ఉంటె సెలవియ్యండి అని విన్నవించుకోగా - ఆయన (ర) ఇలా అన్నారు: నాకు దైవ ప్రవక్త (స) నేర్పించిన అద్భుత వాక్యాలను నేను నీకు నేర్పిస్తాను. ఒకవేళ నీపై శీర్ పర్వతం అంతటి అప్పు ఉన్నా దాన్ని తీర్చే ఏర్పాటు అల్లాహ్ చేస్త్తాడు అని ఈ దుఆ నేర్పించారు: అల్లాహుమ్మక్ ఫినీ బిహలాలిక అన్ హరామిక, వ అగ్నినీ బిఫదొక అమ్మన్ సివాక్.
ఓ అల్లాహ్ ! నువ్వు హలాల్ చేసినది మాత్రమే నాకు సరిపోవాలి. నువ్వు హరామ్ చేసిన వాటి అవసరం నాకు రాకూడదు. నీ కృపాకటాక్షంతో నాకు ఎవ్వరి అవసరం రాకుండా చూడు: ఒక్క నీ అవసరం తప్ప. (తిర్మిదీ 3-180).
అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మినల్ హమ్మి వల్ హుజ్ని, వల్ ఇజి, వల్ కసలి వల్ బుఖ్లీ వల్ జుబ్ని, వదలఇద్ దైని, వ గలబతిర రిజాలి.
ఓ అల్లాహ్! నేను ఆందోళన మరియు దుఃఖాల నుండీ, దీనత్వం మరియు సోమరితము నుండీ, పిసినారితనము మరియు పిరికితనము నుండీ , అప్పుల భారం నుండీ మరియు నాపై ప్రజలు పెత్తనం చలాయించటం నుండి నీ శరణు కోరుకుంటున్నాను. (బుఖారీ).
విశ్వాసి వజ్రాయుధం దుఆ
అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనియల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వఅస్లిహ్ లీ దున్యాయల్లతీ ఫీహా మఆషీ, వఅస్లిహ్ లీ ఆఖిరతియల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతల్లీ ఫీ కుల్లి ఖైర్ ,వజ్అలిల్ మౌత రాహతల్లీ మిన్ కుల్లి షర్ర్.
“ఓ అల్లాహ్! నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి. అది నా వ్యవహారానికి ప్రాతిపదిక. ఇంకా, నా కొరకు ప్రపంచాన్ని సజావుగా చెయ్యి. అందులో నా జీవితం ఉంది. ఇంకా, నా కొరకు పరలోకాన్ని సజావుగా చెయ్యి. దాని వైపునకే నేను మరలవలసి ఉంది. ఇంకా జీవితాన్ని నా కొరకు, అన్ని రకాల శ్రేయాలలో సమృద్ధికి మూలంగా చెయ్యి. ఇంకా, మరణాన్ని అన్ని రకాల ఆపదల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” (సహీ ముస్లిం 2720) హజ్రత్ సల్మాన్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు : “మీ ప్రభువు ఎంతో ఉదాత్తుడు, బిడియం కలవాడు. తన దాసుడు తన సన్నిధిలో చేతులు చాచి అర్థించినపుడు వట్టి చేతులతో మరలించడానికి ఆయన సిగ్గుపడతాడు.” ( హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
‘అప్పు తీసుకోవడం పెళ్లి లాంటిది; తిరిగి ఇవ్వడం చావు లాంటిది.“అప్పు తీసుకోవడం, ఇవ్వడం స్నేహాన్ని పాడు చేస్తుంది.” అంటారు. కాబట్టి అప్పు చేయకపోవడమే ఒప్పు. అదే ప్రజలకు ప్రభువుకి మెప్పు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఈ అప్పు అనే తప్పు చేయకూడదు. లేదా తప్పదు ముప్పు! కాదు కూడదు అంటే చెప్పు, వదలగొడుతుంది అప్పు నీకు పట్టిన ధనవ్యామోహ తుప్పు!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు