Monday, December 2, 2024
మనం రక్షించబడాలంటే... ?
మనం రక్షించబడాలంటే... ?
అల్లాహ్ మాత్రమే మంచి రక్షకుడు. ఆయన అందరికన్నా ఎంతో కరుణామయుడు కూడా” (యూసుఫ్: 64)
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉప్పొంగిన జల ప్రళయంలో - నూహ్ (అ) మరియు ఆయన అనుచరుల్ని “బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహా” అని రక్షించింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా మండించబడిన అగ్ని గుండంలొంచి ప్రవక్తల పితామహులైన హజ్రత్ ఇబ్రాహీం (అ) వారిని “ఖుల్ నా యా నారూకూనీ బరధన్ వ సలామన్ అలా ఇబ్రాహీం” అని రక్షించింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్.
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా ఒక తల్లి అచంచల విశ్వసానికి, ఒక తండ్రి అనితర సాధ్య త్యాగానికి, ఒక పసిగుడ్డు ఆకలి దాహానికి - ఫలితంగా ఒట్టి నల్లరాతి నేలలో జమ్జమ్ జలనిధిని పెల్లుబికించి - తల్లీబిడ్డల్ని చావు నుండి రక్షించి - ఆ అమృత జలాన్ని ప్రళయం వరకు తిరుగు లేని అద్భుత జలంగా మార్చి ప్రపంచ విశ్వాసులందరికి ఓ బహుమానంగా ఇచ్చింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో తండ్రి మాటకు శిరసా వహించి - ప్రాణానాన్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యడానికి సంతోషంగా సిద్ధమయిపోయిన ప్రవక్త పుత్రోత్తములు - హజ్రత్ ఇస్మాయిల్ (అ) వారిని జిబహ్ కాకుండా కాపాడి - వారి త్యాగానికి ప్రతీకగా స్వర్గం నుండి పొట్టేలును దింపి - ప్రళయం వరకు రాబోవు విశ్వాసులందరు త్యాగోత్సవం జరుపుకునేలా దీవించింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్
· మానవ చరియత్రలోనే అంతకు ముందు కనీ వినీ ఎరుగని పద్ధతిలో అయినవారే అనంత లోకాలకు పంపించాలి అని పన్నిన కుట్రలో - విశ్వంలోని అత్యంత సుదరాంగుడు ప్రవక్త యూసుఫ్ (అ) వారిని - బావిలో, బజారులో, రాజ్ మహల్లో,, నిందలో, మందలో, చెరశాలలో రక్షించి - ఈజిప్తుకే రాజుని చేసింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా - నైలు నది 12 పాయలుగా చీల్చి ప్రవక్త మూసా (అ) మరియు ఆయన అనుయాయుల్ని రక్షించింది ఎవరు? కటిక ఎడారిలో ఒక సాధారణ బండరాయి గుండా 12 సెలయేర్లు పెల్లుబికించి, ఆహారంగా మన్ వ సల్వాని దింపి వారి బతుకులు ఎడారి పాలు కాకుండా రక్షించింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్.
· మానవ చరియత్రలోనే అంతకు ముందు కనీ వినీ ఎరుగని పద్ధతిలో మానవోత్తములైన - సుభక్తాగ్రేసరులైన ప్రవక్త ఈసా (అ) వారిని శత్రు సైన్యాలు శిలువ ఎక్కించాలని పన్నిన భయంకర కుట్రను భగ్నం చేసి ఆయన్ను రక్షించి సజీవముగా తన వైపునకు ఎత్తుకున్నది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్
· మానవ చరియత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా - ఒక్కడిగా మొదలయిన సత్యోద్యమాన్ని - లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న నినాదాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలన్న శుభ సంకల్పంతో వచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారిని అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూ ... అందరూ కలిసి ఆయన్ను హత్య చేయాలనుకున్నప్పుడు, సౌర్ గుహలో ఆయన తల దాచుకున్నపుడు, బద్ర్ మహా సంగ్రామంలో, ఉహద్, హునైన్ యుద్ధాలలో ఆయన్ను రక్షించి, తిరుగు లేని హృదయాల విజేతగా నిలబెట్టింది, నేడు ఆ సత్య విప్లవాన్ని శ్వాశించే అక్షరాలా 180 కోట్ల మంది ముస్లింలు, 59 ముస్లిం దేశాలు ఉండేలా దీవించింది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్.
· మన జననం మొదలు మరణం వరకూ, కనులు తెరిచింది మొదలు కనులు మూసేంత వరకూ మనల్ని అనుక్షణం - ప్రతీ క్షణం - మనం నిద్రిస్తున్నా , మేల్కొని ఉన్నా. నడుస్తున్నా, నిలబడి ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, మౌనంగా ఉన్నా, జాగురూకగా ఉన్నా, ఏమరుపాటులో ఉన్నా మనల్ని కంటి రెప్పకన్నా గొప్పగా కాపాడుతున్నది ఎవరు? అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్.
· ఇక మన ధన, మాన, ప్రాణాలకు రక్షణ కావాలన్నా, ప్రాణాధికంగా నమ్మే ధర్మానికి రక్షణ కావాలన్నా, మనం సల్లగా జీవించాలన్నా, నలుగురి మేలు చేయాలన్నా, మన బతుకు బంగారం అవ్వాలన్నా, మనం ఒకరి బతుకుని బంగారం చెయ్యాలన్నా - అల్లాహ్ కృప మనకెంతో అవసరం. అందుకే ప్రవక్త (స) అన్నారు;
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం: ఒకరోజు నేను (వాహనంపై) దైవప్రవక్త (సల్లం) వెనుక కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆయన నన్నుద్దేశ్యించి ఇలా అన్నారు : "అబ్బాయీ! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. (వాటిని నీవు సదా గుర్తుంచుకో) - నీవు అల్లాహ్ ను (అంటే ఆయన ఆదేశాలను) కాపాడు; ఆయన నిన్ను కాపాడతాడు. నీవు అల్లాహ్ (హక్కులను) గుర్తుంచుకో; ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు. (అంటే ఆయన రక్షణ, సహాయ సకారాలు నీ వెన్నంటే ఉంటాయి.) నీవు అర్థించదలచుకున్నప్పుడు అల్లాహ్నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే (సాధనాలు ఉపయోగించటం తోపాటు) అల్లాహ్ నే సహాయం కోసం అర్థించు. జాగ్రత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్ నీకోసం వ్రాసిపెట్టిన దానికంటే ఎక్కు వేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒకవేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమీ అది కలిగించ జాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (అంటే విధివ్రాత రాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది. (తిర్మిజీ.)
ప్రియ ప్రవక్త (స) ఈ పవిత్ర ప్రవచనాన్ని ప్రతి ముస్లిం తన హృదయ ఫలకం మీద ముద్రించుకోవాలి. దైనందిన జీవితంలో నిత్యం నెమరువేసుకుంటూ ఉండాలి. తనకు జీవితంలో ఎదురవ్వబోయే కష్టాల కడగండ్లు కరగాలంటే, బాధాకర స్థితి తొలగాలంటే, ఇబ్బందికర పరిస్థితి దూరమవ్వాలంటే ఈ పవిత్ర ప్రవచన ఓ మహా అస్త్రం. ఎలాంటి శస్త్రాన్నయినా ఇది ఛేదించగలదు
ఆయన సెలవిచ్చాడు : "మీరు ఎక్కడ వున్నా ఆయన మీతో వున్నాడు." (అల్ హదీద్ : 4)
1) ఆధ్యాత్మిక పరమైన రక్షణ
అల్లాహ్ తన దాసునికి విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించి స్వచ్ఛమైన తౌహీద్ పూదోటలో ఓలలాడేలా దీవిస్తాడు. అతన్ని అన్ని రకాల షిర్క్ - బహుదైవా భావన, విగ్రహారాధన, బిద్అత్ - నూతన పోకడల వేలం వెర్రి నుండి కాపాడుతాడు. అల్లాహ్ దాసునికి చేసిన మేళ్ళల్లో అగ్ర స్థానం - విశ్వాస భాగ్యానిదే అందంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భాగ్యం ఎలాంటిదంటే, కొందరు దైవ ప్రవక్తల సంతానానికి కూడా ప్రాప్తం కానీ మహాదానుగ్రహం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నీవు అనాథగా ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గవిహీ నుడవై ఉండగా ఆయన నీకు మార్గం చూపలేదా? నీవు నిరుపేదగా ఉండటం చూసి ఆయన నిన్ను ధనవంతుడ్ని చేయలేదా? (అజ్-జుహా: 6-8)
ధర్మ రక్షణకు సంబంధించిన ఈ దుఆను దైవ ప్రవక్త (స) తరచుగా చేస్తూ ఉండేవారు.
అల్లాహుమ్మహ్ఫజ్నీ బిల్ ఇస్లామి ఖాయిమా. వహ్ఫజ్నీ బిల్ ఇస్లామి ఖాయిదా. వహ్ఫజ్నీ బిల్ ఇస్లామి రాఖిదా. వాలా తుష్మిత్ బీ అదువ్వన్ వాలా హాసిదా. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ కుల్లి ఖైరిన్ ఖజాయినుహు బి యధిక. వ ఆవూజు బిక మిన్ కుల్లి షర్రిన్ ఖజాయినుహు బి యధిక. (సహీహుల్ జామె)
నేడు కొందరు ముస్లింలలో షిర్క్ బాగానే జొరబడి ఉంది. వాస్తవంగా విశ్వ సృష్టికర్త అయిన ఒక్క అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు. కానీ నేడు చాలా మంది ముస్లింలు అల్లాహ్ తో సమానంగా బాబాలను, ఔలియాలను ఆరాధిస్తున్నారు. వారినే ముష్కిల్ కుషా - ఆపద్బాంధవులుగా భ్రమిస్తున్నారు. గౌసే ఆజమ్ - మహోన్నత సహాయకులుగా నమ్మి తమల్ని తామే మోస పుచ్చుకుంటున్నారు. స్వీయా వంచనకు, పర వంచనకు పాల్పడుతున్నారు.
మనం మన జీవితాన్ని షిర్క్ తో మలీనం కాకుండా కాపాడుకుంటే అల్లాహ్ మన జీవితాన్ని మహాద్భుతంగా మలుస్తాడు. మనం సదా సత్యమార్గాన్ని అంటి పెట్టుకుని ఉండేలా దీవిస్తాడు. ఆయన ఇలా అంటున్నాడు:
సత్యాన్ని విశ్వసించి, అందులో బహుదైవారాధనా భావానికి ఏమాత్రం ఆస్కారమివ్వని వారికే శాంతీస్థిమితాలు ప్రాప్తమవుతాయి. అలాంటివారే సన్మార్గంలో ఉంటారు.” (అల్-అన్ఆమ్: 82)
కొందరయితే అన్య సమాజాల అపనమ్మకాలను అనుంగు ఆచారాలుగా భావించి - ఇండ్లకు, దుకాణాలకు, వాహనాలకు దిష్టి తగలకుండా, కీడులు వాటిల్ల కుండా ఉండటానికి ఎరుపు, ఆకుపచ్చ బట్టలలో టెంకాయ కట్టి,నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు,రాగి, ఇత్తడి రేకులు ఒకచోట కట్టి ఇళ్ళకు వ్రేళాడదీయడం జరుగుతుంది. ఇంకా మంత్రాలు, అంత్రాలు, వాస్తులు, జ్యోతిష్యం,శకునాలు, యమగండం, రాహుకాలం మొదలగు అధర్మమైన షిర్క్ (బహు దైవారాధన)కు సంభందించిన కార్యాలకు పాల్పడుతున్నారు. తమను పుట్టించిన అల్లాహ్ పై ఉంచవలసిన విశ్వాసం ఈ మూఢనమ్మకాల పై ఉంచి అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ఇంకా ఆరోగ్యాలు బాగలేకపోతే చేతులకు, మెడలకు, తాయెత్తులు, దారాలు, కడియాలు ధరిస్తున్నారు. ఇవన్నీ ఇస్లాంలో నిషేధించబడ్డాయి. వాటిని వ్రేళాడదీయడం వాటి పై నమ్మకం ఉంచడం ఘోరమైన పాపం.
కాని అల్లాహ్ ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్ ను అంత కంటే ప్రగాఢంగా(అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్ధాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. (తెలుసుకుంటే వారు ఈ షిర్క్,పాపానికి ఒడిగట్టరు). (ఖుర్ఆన్ అల్ బఖర 2:165)
వారు కాంతికి కళ్ళు తెరవాలి. నిజం నెగ్గు తేలాక - ఇహపరాల అపప్రధను తెచ్చిపెట్టే మూఢ నమ్మకాలను స్వస్తి పలకాలి. అల్లాహ్ - ఆయనకు మించిన గొప్ప రక్క్షకుడు ఎవరూ లేరు. ఫల్లాహు ఖైరున్ హాఫీజా వహువ అర్హముర్రాహిమీన్ అన్న యదార్థాన్ని వీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంతే మంచిది.
'కనుక ఒక్క అల్లాహ్ నే మనం ఆరాధించాలి, ఆయనకు ఇతరులను సాటి కల్పించి ఆరాధించ రాదు. దర్గాలకు వెళ్ళి సమాధులను ఆరాధించడం, అక్కడ సజ్జాలు చేయడం, కోరికలు నెరవేరడానికి దుఆలు చేయడం,సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దీపాలు,అగరుబత్తీలు, కర్పూరం, వెలిగించడం ఇవన్నీ అల్లాహ్ సుతరామూ ఇష్టపడని క్షమించరాని ఘోరమైన పాపాలు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: (విశ్వంలోని) ప్రతి అణువుకూ అల్లాహ్ యే సృష్టికర్త. ఆయనే సమస్త సృష్టిని పర్యవేక్షిస్తున్నాడు. భూమ్యాకాశాల నిక్షేపాలకు చెందిన తాళపుచెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ సూక్తులు తిరస్కరించేవారే చివరికి నష్టపోయేవారు.ప్రవక్తా! వారినిలా అడుగు: “అజ్ఞానులారా! అలాంటప్పుడు మీరు అల్లాహ్ ను వదలి ఇతరుల్ని ఆరాధించమని నాకు చెబుతున్నారా?”- “మీరు అల్లాహ్ కు ఇతరుల్ని సాటికల్పిస్తే మీరు చేసే (మంచి)పనులు (కూడా) వ్యర్థమవుతాయి, మీరు ఘోరంగా నష్టపోతారు” అని నీ దగ్గరకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలందరి దగ్గరకు దివ్యావిష్కృతి (వహీ) పంపబడింది” (అని వారికి చెప్పు.) (ప్రవక్తా!) నీవు మాత్రం ఒక్క అల్లాహ్ ను మాఆత్రమే ఆరాదిస్తూ కృతజ్ఞులయిన దాసులలో చేరిపో. (అజ్-జుమర్: 62-66)
దైవ ప్రవక్త (స) గారి మహితోక్తుల వెలుగులో మన భారత దేశ ముస్లిం జీవనాన్ని పరిశీలిద్దాం. పూర్వం భరత ఖండంలో ఉన్న నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లునైతేనేమీ, అఫ్గానిస్తాన్, కజకిస్తాన్, వజీరిస్తాన్, ఈరాన్, బర్మా, థాయిలాండ్ లాంటి పొరుగు దేశాలైతేనేమీ అన్నింటా మనకు కానవచ్చే దృశ్యం ఒక్కటే – అది బహుదైవారాధన.
నేడు ప్రతి గల్లీలోనూ ఓ జెండా చెట్టు పుట్టుకొచ్చింది. ప్రతి ఊరిలోనూ ఓ సమాధి (దర్గా) కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఇంటిలోనూ కొన్ని చిత్రపటాలు దర్శనమిస్తాయి. మరి ఈ దురాచారాల్ని సయితం ఇస్లామీయ సదాచారాలుగానే అభివర్ణి ద్దామా? రాతి శిల్పాలను, శవాలుగా మార్చుకొని, జాతరలని, ఉరుసులని పేరు పెట్టి, వినాయకుని నిమజ్జనం, దసరా, మధురైలోని నిప్పులు తొక్కే ఆచారం – వీటన్నింటినీ కలగూర గంపచేసి ‘పీర్ల పండగ’ అని నామకరణం చేసి, నైవేద్యాన్ని చక్కెర, బెల్లం, మలీదాగా మార్చి, అర్చనను ఫాతెహా రంగులు అద్ది, రావి చెట్టును జెండా చెట్టుగా రూపం ఇచ్చి చిందులు తొక్కడం ఇస్లాం ధర్మాన్ని చీల్చి చెండాడటం కాదా? అటు సప్త ఋషుల భార్యలుంటే, ఇటు పది మంది స్త్రీలు (దస్ బీబియోఁకి కహానీలు). అటు లక్ష్మి, కాళికాదేవీలుంటే, ఇటు ఉజ్లీ పరీ, కాలీ పరీలు. అటు అమ్మవారు అయ్యవార్లుంటే, ఇటు అమ్మా జాన్ బావాజాన్‌లు,. అక్కడ లక్ష్మి కుండలుంటే, ఇక్కట జాఫర్ కుండలు. అక్కడా పాయసమే, ఇక్కడా పాయసమే.
లక్ష్మి దుర్గాలని చెప్పేవారు, అమ్మవారు అయ్యవారు అనేవారు, మందిరానికి జాతరలకి వెళ్ళేవారు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు విగ్రహారాధకులు. కాఫిర్లు (ధర్మతిరస్కారులు) నరకవాసులు అయితే, పేర్లు మార్చి ఈ దురాచారాలన్నీ చేసే మనం స్వర్గానికి వెళతామా? ప్రవక్తగానీ, అల్లాహ్‌గానీ మనకేమన్నా ప్రమాణం చేసి ఉన్నారా? ఏమైనా రాయితీ కల్పించి ఉన్నారా? నేడు ఇన్ని చేస్తూ మనం చెప్పే మాటనే నాడు యూదులు సయితం చెప్పారు. అయితే వారు చెప్పిందల్లా నిజమైపోయిందా? చూడండి!
”యూదులు, క్రైస్తవులు తాము అల్లాహ్ (దేవుని) బిడ్డలమని, ఆయనకు ప్రియమైనవారమని అంటారు”. (దివ్యఖుర్‌ఆన్- 5: 18)
మౌలానా అల్తాఫ్ హాలీ (రహ్మ) గారి మాటల్లో చెప్పాలంటే-
అన్యులు శీలా ప్రతిమలను కొలిస్తే కాఫిర్
ఒకరిని దైవ కుమారుడు అంటే కాఫిర్
అగ్నికి సాష్టాంగ పడితే కాఫిర్
నక్షత్రాల్లో మహిమను నమ్మితే కాఫిర్
కానీ ముస్లింలకు సకల ద్వారాలు తెరువబడి ఉన్నాయి
వారు ఎవరిని పడితే వారిని ఎంచక్కా కొలవచ్చు
ప్రవక్తలను దైవ స్థాయికి చేర్చొచ్చు
ఇమాములను ప్రవక్తలకన్నా పై స్థాయిని ఇవ్వొచ్చు
సమాధుల వద్ద దీప ధూపాలతో మొక్కుబడులు చేసుకోవచ్చు
షహీద్లను కోరికలు తీర్చమని వేడుకోవచ్చు
ఇం త చేసినా - వీరి తౌహీద్ చెక్కు చెదరదు
వీరి ఇస్లాంకి ఎలాంటి నష్టం లేదు
వీరి ఈమానికి ఎలాంటి ప్రమాదం ఉండదు
ఏ సత్య ధర్మ ఆధారంగానయితే ప్రపంచంలో తౌహీదు పరిమళాలు ప్రసరించాయో
ఏ సత్య ధర్మ ఆధారంగానయితే ధర్మం నాలుగు పాదాల నింగీ నెలలో నడిచిందో
ఏ సత్య ధర్మ ఆధారంగానయితే షిర్క్ కారుమబ్బులు క్రమేపి కనుమరుగయ్యాయో
అదే సత్య ధర్మం భారతాన మార్చివేయబడింది
ఇస్లాం గర్వంగా భావించే తౌహీద్ ప్రాణవాయవు, అమూల్య సంపద
ఆ అమూల్య సంపదనే చేజార్చుకున్నారు ముస్లింలు
ఆ ప్రాణ వాయువునే కలుషితం చేసేశారు ముస్లింలు
అయినా వారికి బాధ లేదు - ”పైగా వారు, ఈ నరకాగ్ని మమ్మల్ని తాకనైనా తాకదు. కాకపోతే కొన్నాళ్ళు కాస్తంత బాధ కలిగిస్తుందంతే’ అంటారు. అలాగైతే, మీరు దేవునితో ఏదైనా ఒడంబడిక చేసుకున్నారా, దాన్ని ఆయన ఉల్లంఘించకపోవడానికి? లేక అల్లాహ్ విషయంలో మీరు మీకు ఏ మాత్రం తెలియని మాటలు అంటున్నారా?’ అని అడగండి వారిని. (దివ్యఖుర్‌ఆన్-2:80)
ఆకాశంలో చంద్రుడి మీద నుంచి మేఘాలు కదిలిపోతున్నప్పుడు చంద్రుడే కదులుతున్నట్టుగా భ్రమ కలుగుతుంది. అలా భ్రమపడేవారిని ఏదైనా ఓ చెట్టు కొమ్మ కిందకు తీసుకెళ్ళి ఆ చెట్టు రెండు శాఖల (కొమ్మల) మధ్య నుంచి చంద్రుడిని చూపిస్తే ఆ చంద్రుడు కదలకుండా అక్కడే ఉన్నట్టు కన్పిస్తుంది. అలా వారి భ్రమ తొలిగిపోతుంది.
”మీరు అల్లాహ్‌ను వదలి ఎవరిని (విగ్రహాలు, పీర్లు, ముర్షిద్లు, ఔలియాలు, దర్గాలను) ఆరాధిస్తున్నారో వారు మీలాంటి దాసులే. మీ నమ్మిక నిజం అయితే వారిని మొరబెట్టుకోండి, వారు మీ మొరలను ఆలకిస్తారేమో చూద్దాం. నడవడానికి (విగ్రహం, శవంగా ఉన్న) వాటికేమన్నా (సహజసిద్ధమైన) కాళ్ళున్నాయా? పట్టుకోవడానికి వాటికే మన్నా చేతులున్నాయా? పోనీ చూడానికి వాటికేమైనా కళ్ళున్నాయా? వినడానికి వాటికేమైనా చెవులున్నాయా?” (దివ్య ఖుర్‌ఆన్-7: 194, 195)
”మీరు వాటిని మొరపెట్టుకున్నా అవి మీ మొరల్ని ఆలకించలేవు. ఒకవేళ ఆలకించినా మీకు ఎలాంటి సమాధానమివ్వలేవు. (పైగా) అవి ప్రళయ దినాన మీ బహుదైవారాధన (షిర్క్)ను ఖండిస్తాయి”. (ఖుర్‌ఆన్-35:14)
”ఆఅల్లాహ్ ను వదలి మీరు పూజిస్తున్న మిథ్యా దైవాలు ఓ గడ్డిపోచకు కూడా యజమానులు కారు”. (దివ్య ఖుర్‌ఆన్-35: 13)
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (ఖుర్ఆన్ అన్ నిసా 4:48)
భౌతిక పరమైన రక్షణ;
అల్లాహ్ దాసుని ప్రాపంచిక ప్రయోజనాలను కాపాడుతాడు. అతని ధన మాన ప్రాణాలను, అతని భార్యాపిల్లల్ని, పరివారాన్ని రక్షిస్తాడు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: ప్రతి మనిషికీ ముందూ వెనుకా దేవుడు నియమించిన (అదృశ్య) గూఢచారులు ఉన్నారు. ఆయన ఆజ్ఞతో వారతడ్ని పర్యవేక్షిస్తుంటారు. అయితే ఏజాతి అయినా తనను తాను సంస్కరించుకోనంత వరకూ అల్లాహ్ దాని పరిస్థితి మార్చడు. ఇదొక యదార్థం. అలాగే ఏదైనా జాతికి అల్లాహ్ కీడు తలపెట్టదలచుకుంటే ఇక దానికి తిరుగే ఉండదు. అల్లాహ్ నిర్ణయానికి వ్యతిరేకంగా అలాంటి జాతిని ఏ శక్తీ ఆదుకోజాలదు. (అర్-రాద్: 11)
భౌతిక పరమైన రక్షణకు సంబంధించి దైవ ప్రవక్త (స) తరచూ ఈ దుఆ చేస్తూ ఉండేవారు. అల్లాహుమ్మహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌఖీ వ ఆవూజు బి అజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్ తీ" (అబూ దావూద్)
ఇలా మనం కూడా ఈ దుఆ ఎందుకు చేయాలంటే సమనిషికి ఆగర్భ శత్రువైన షైతాన్ మన మీద ముప్పేట దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సందు దొరికితే చాలు దారి తప్పించేద్దామని మాటు వేసుకొని మరి కూర్చుని ఉంటాడు. ఖుర్ఆన్ ఇలా అంటుంది:
నేనూ మానవజాతిని దారి తప్పించడానికి నీ రుజుమార్గంలో మాటువేసి కూర్చుంటాను. వీరిని ముందు నుంచి, వెనుకనుంచి, కుడినుంచి, ఎడమనుంచి అన్ని వైపులనుంచీ చుట్టుముట్టుతాను. వీరిలో చాలామందిని నీవు విశ్వసనీయులుగా, కృతజ్ఞులుగా చూడలేవు” అన్నాడు ఇబ్లీస్. (అల్-ఆరాఫ్: 16, 17)
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా చెప్పారు “నా అనుచర సమాజంలో 70 వేల మంది ముస్లింలు తీర్పు దినం నాడు ఎలాంటి కర్మల విచారణ లేకుండానే నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారు ఎవరు ప్రవక్తా! అని సహచరులు అడిగారు, వారెవరంటే! "మంత్రాలు, వాతల వైద్యము, జ్యోతిష్యం, హస్త సాముద్రికములు, వాస్తులు, శకునాలు, మొదలగు మూఢనమ్మకాలకు పాల్పడకుండా, వాటిపై నమ్మకం ఉంచ కుండా, కేవలం ఒక్కడైన అల్లాహ్ పై మాత్రమే విశ్వాసం ఉంచే, నమ్మకం ఉంచే, ధృఢమైన విశ్వాసులు వారు” అని అన్నారు. (బుఖారి,ముస్లిం, తిర్మిజీ,నసాయి)
మనస్సు పేరాశల నిలయం
నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభువు కారుణ్యభాగ్యం లభిస్తే తప్ప మనస్సు ఎల్లప్పుడూ చెడు వైపుకే పురిగొల్పుతుంది. నా ప్రభువు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” (యూసుఫ్-53)
ఈ దారిలో మనసు చేసే గారడీలు ఎన్నో! మనస్సు పేరాశల నిలయం, అత్యాశల ఆలయం. అదో అఖాతం, ఎంత పోసినా నిండదు. ఎంత దొరికినా తృప్తి చెందదు. కొంత కష్టపడి కొండంత లబ్ది పొందాలని తహతహలాడుతుంది. ఏ మాత్రం శ్రమ లేకుండానే అన్నీ దక్కాలని కూడా అర్రులు చాస్తుంది తరచుగా. ఏవీ ప్రాప్తం కాకపోయినా కనీసం పేరూ ప్రతిష్టలయినా తన సొంత మవ్వాలని ఉవ్విళ్ళూరుతాడు మనిషి.
మనసులోని కోరికల గుర్రాలు ఎటుబడితే అటు లాక్కువెళతామంటాయి; జీవితం మళ్ళీ మళ్ళీ దొరికే యోగం కాదంటాయి; దొరికింది దొరికినట్టే, అందింది అందినట్టే కాజేయమంటాయి; వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి ఈదులాడేయ్ అంటాయి. కెంపుల ఒంపు సొంపులెన్నో పొంగిపొర్లుతున్నాయి తనివితీరా ఆస్వాదించేయ్ అని కవ్విస్తాయి. మజాలు వీలయినంతమేరకు జుర్రుకోమంటాయి; సుఖాలు సాధ్యమయినంతవరకు ఆస్వాదించ మంటాయి; కొత్త కొత్త రుచులు చూడమంటాయి; జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించ మంటాయి.
వంశంలోని ఆచారవ్యవహారాలు, పెద్దలు నెలకొల్పిన సంప్రదాయాలు, కుటుంబంలోని నియమాలు మరో వైపునకు లాగుతాయి. ఆచారాలను కళ్ళు మూసుకుని పాటించమంటాయి; మూఢ విశ్వాసాలను గుడ్డిగా నమ్మమంటాయి; కుటుంబ నియమాలు పాటించకపోతే ముక్కు ఊడి పోతుందంటాయి; పరువు మంటగలుస్తుందంటాయి? ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ఎదురు తిరిగి ప్రశ్నించరాదంటాయి. మరో ప్రక్కన సమకాలీన శాసనాలు, చట్టాలు, ప్రభుత్వాలు తమ అడుగులకు మడుగులొత్త మంటుంటాయి. కానీ మనిషి వీటినన్నింటినీ పాటించగలడా? వీటిలో దేన్ని పాటించినా అతని జీవితం సుఖమయం అవుతుందన్న హామీ ఎక్కడిది? అందువల్ల పుట్టించి పోషిస్తున్న నిజ ప్రభువును, ఆయన ఆదేశాలను పాటించడంలోనే మనిషి ఇహపరాల సౌఖ్యం ఇమిడి ఉంది.
ఇబ్రాహీంని అతని ప్రభువు “నిన్ను నీవు (మాకు) సమర్పించుకో”అని ఆదేశించ గానే అతను (ఏమాత్రం తటపటాయించకుండా) “నన్ను నేను సర్వలోక ప్రభువుకు సమర్పించుకుంటున్నా”నని అన్నాడు. తరువాత అతను తన కుమారులక్కూడా ఈ (స్వయం సమర్పణ) విధానాన్నే ఉపదేశించాడు. యాఖూబ్ కూడా తన కొడుకులకు హితవు చేస్తూ “బిడ్డలారా! దేవుడు మీకోసం ఈ జీవనవిధానాన్నే నిర్ణయించాడు. కనుక చనిపోయే వరకూ (ముస్లిములు)గానే జీవించాలి” అన్నాడు. (131-132)
ఒక హదీసులో ఇలా ఉంది: నీవు దేవుని (హక్కులను) గుర్తుంచుకో; నీవు ఆయన్ని నీ ముందున్నట్లు గ్రహిస్తావు. ఆనంద ఘడియల్లో నువ్వు ఆయన్ని జ్ఞాపకముంచుకో. ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు. (అంటే నిన్ను ఆ కష్టాలనుండి గట్టెక్కిస్తాడు) నీ నుండి తప్పిపోయింది నీకు చేకూరేది కాదనీ, నీకు చేకూరింది నీ నుండి తప్పిపోయేది కాదని తెలుసుకో! ఇంకా ఈ విషయం కూడా తెలుసుకో! (దైవ) సహాయం సహనం వెంటే ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది. కష్టంతోపాటే సౌఖ్యం ఉంటుంది. (తిర్మిజీ)
ఈ మాట మనందరికీ కనువిప్పవ్వాలి ఈ పూట
(ఇక) అవిశ్వాసుల కర్మలు ఎండమావుల్లా నిరుపయోగమవుతాయి. దప్పిక గొన్నవాడు ఎడారి మైదానంలో ఎండమావిని చూసి, అక్కడేదో జలాశయం ఉందని భావిస్తాడు. తీరా ఆ ప్రదేశానికి చేరుకుంటే అక్కడసలు నీరే ఉండదు. పైగా (తీవ్రమైన దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి, కొనఊపిరితో కొట్టుమిట్టాడే స్థితిలో) అతనికక్కడ దేవుడు గుర్తుకొస్తాడు. (కాని) దేవుడు అతని లెక్క పూర్తిచేసి (దుష్కృతఫలం ఇవ్వడానికి) సిద్ధంగాఉంటాడు. (కర్మల)లెక్క చూడటానికి దేవునికి ఎంతోసేపు పట్టదు. (అన్-నూర్: 39)
మనలో చాలా మంది తెలిసో తెలియకో అపమార్గ అడుసునికి తొక్కుతున్నారు. ఎడారంటి ఆశల వెనుక పరిగెడుతూ పారేసుకోవడానికి విశ్వాస భాగ్యం ఏమయినా అంగడి సరుకా? ఒక్క సారి చేయి జారాక దాని తిరిగి పొందగలమా చెప్పండి! బ్రతుకుని బూడిదలో పోసిన పన్నీరుని చేసే షిర్క్ మరియు బిద్అత్ నే ప్రేమించాము. తౌహీద్ వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించాము. అమృతమ్ వంటి ధర్మ ధనాన్ని చెల్లించి ప్రతిగా కొన్నది ఏమిటి? అధర్మం, షిర్క్ అనే హాలాహలం. ఒక్క సారి ఆలోచించండి! ఎక్కడో కాదు మన శరీరంలో ఉన్న అల్లాహ్ అపార అనుగ్రహాలను కొనగలిగే ధనముందా ఈ లోకంలో? ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తల్ని పంపి మరీ ప్రబోధించిన పవిత్ర భావన తౌహీద్ విలువెంతో మరిచారా షిర్క్ బిద్అత్ ల మైకంలో? ఫలితంగా అల్లాహ్ రక్షణను పొంకుండా చేస్తున్న నూతన పోకడలతో,, కొంగ్రొత్త ఆచారాలతో, షిర్క్, బహుదైవారాధనలతో ఏ ఒక్కరూ అయ్యో! అని జాలి కూడా చూపని అయోమయ సస్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్నాము. తీరా కనులు తెరిచాకా కనులు మూసే వేళాయెరా… అని మరణ దూత పిలుపిస్తున్నాడు. వినండీ! ఆలాహ్ ఏమంటున్నాడో!
వి శ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నంకాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! (అల్-హదీద్: 16)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు