Monday, December 2, 2024
జ్ఞాన జ్యోతిని వెలిగించాలి... అజ్ఞాన పొరల్ని తొలగించాలి...!
జ్ఞానం – జ్ఞానమే జీవనసారం, జ్ఞానమే సదా సాఫల్య ద్వారం, జ్ఞానమే సతతం సమున్నతికి సోపానం- ఇహంలోనూ, పరంలోనూ. జ్ఞానం కాంతిపుంజం. జ్ఞానం సూర్యగోళం. సూర్యుడు ఉదయించగానే నీలి మేఘాలు బహు దూరాల నుంచి ముసురుకు వస్తాయి. వాయువు తోడయితే సూర్య ప్రకాశానికి తెరవేస్తాయి. జ్ఞాన ప్రభ భాసిల్లినప్పుడు మిథ్యాంధకారం అలుముకునేందుకు పరుగెడుతుంది.. వాతావరణం సహకరిస్తే సత్యజ్ఞానాన్ని కప్పివేస్తుంది.
జ్ఞానం నిజమయింది. జ్ఞానం సహజమయింది, ప్రకృతి సిద్ధమయింది. జ్ఞానజ్యోతిని కప్పి పెడితేనే అంధకారం ఆవరిస్తుంది- మనిషిలోనూ, సంఘంలోను. అంధకారాన్ని దూరం చెయ్యాలంటే జ్ఞాన కాంతిపైన కప్పుకున్న తెరల్ని, పొరల్ని చీల్చాలి... అప్పుడే అజ్ఞానపు చీకట్లు పటాపంచలవుతాయి.
జ్ఞానంతోనే జన జీవనంలో జాగృతి, జ్ఞానతోనే జన జీవన స్రవంతిలో శాంతి. జ్ఞానతోనే జాతుల పురోభివృద్ధి. జ్ఞానంతోనే జన గణ మన క్షేమ శ్రేయాలు. జ్ఞానం లేని జీవితం నిస్తేజం, నిర్జీవం, నిర్వీర్యం. సత్యజ్ఞానం లేని ఆంతర్యం దీపం లేని ఇల్లు. సత్యజ్ఞానం లేని హృదయం - జీవం లేని కళేబరం. సత్యజ్ఞానానికి స్పందించని గుండె చలనంలేని బండరాయి. సత్యజ్ఞానానికి పరితపించని మనస్సు కొడిగట్టిన దీపం.
జ్ఞానం ఎంతో గొప్పది. పరాత్పరుడైన అల్లాహ్ యే దానికి మూలం. అయన నామాల్లో అలీమ్, ఆలిమ్, అల్లామ్ - జ్ఞాన, విజ్ఞాన మూలాల్ని సూచించేవే. అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయనే. కనుక జ్ఞానప్రాప్తికోసం ఆయన్నే ప్రార్థించాలి. అగోచరాల జ్ఞానం ఆయనకు తప్ప మరెవరికీ లేదు. అందుకే దైవప్రవక్తలు సైతం జ్ఞానం ప్రసాదించమని ఆయన్నే వేడుకుంటారు.
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ప్రవక్తా! ఇలా అనండి: "ప్రభూ! నాకు మరింత జ్ఞానమొసగు.” (తాహా: 114)
తెలిసినవారూ, తెలియనివారూ ఇరువురూ సమానులు కాగలరా? (జుమర్: 9)
అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (ఫాతిర్: 28)
అలాగే - మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించ బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. (ముజాదలహ్: 11)
జ్ఞానులూ- అజ్ఞానులూ, పండితులూ- పామరులు ఎన్నటికీ సమానులు కాలేరు. విశ్వాసులకు, జ్ఞానవంతులకు ఇహపరాల్లోనూ గొప్ప హోదా, అంతస్తులు లభిస్తాయి. కేవలం పుస్తకాలు ఔపోసన పట్టినంతమాత్రాన మనుషులు పండితులు కారు. దైవభీతిపరులే సిసలైన పండితులు. విద్యకొద్దీ వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగినకొలది మనిషిలో భక్తివిశ్వాసాలు పెంపొందాలి.
ప్రవక్త (స) వారి మాటల్లో ధర్మ జ్ఞాన ఉపమానము
హజ్రత్ అబూ మూసా (రజి) గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ్ నాకిచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాలు నేలపై కురిసే వర్షం లాంటివి. ఆ నేలలోని కొంతభాగం సారవంతమైనది. అది (వర్షపు నీటిని పీల్చుకొని పచ్చిక, చెట్లు చేమలను మొలకెత్తించింది. నెలలోని మరికొంత భాగం గట్టినేల. అది (నీటిని పీల్చుకోలేక పోయినా) నిల్వచేసి మాత్రం ఉంచుతుంది. ఆ నీటితో అల్లాహ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చు తాడు. వారు ఆ నీటిని తాము స్వయంగా త్రాగటమేకాకుండా (తమ పశువులకు కూడా) త్రాపిస్తారు. ఇంకా పంట పొలాల కోసం కూడా వినియోగిస్తారు. మరోవైపు ఆ వర్షమే మెట్ట పల్లాలు లేని చదునైన నేలపై కూడా కురిసింది. కాని ఆ నేల వర్షపు నీటిని నిలిపి ఉంచటంగాని, పచ్చికను మొలకెత్తించటంగాని చేయజాలదు. ఈ (తొలిరెండు) ఉదాహరణలు దైవ ధర్మాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తికి వర్తిస్తాయి. దేవుడు నాకిచ్చి పంపిన జ్ఞానం, సన్మార్గాలతో అతనికి ప్రయో జనం చేకూర్చాడు. అతను (స్వయంగా ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించి (ఇతరుల క్కూడా) దాన్ని బోధించాడు. ఇక (మూడవ) ఉదాహరణ దేవుడు నాకిచ్చి పంపిన (ధర్మం) వైపు తలెత్తి అయినా చూడకుండా, అల్లాహ్ నాకిచ్చి పంపిన సన్మార్గాన్ని తృణీకరించిన వాడికి వర్తిస్తుంది. (బుఖారీ-ముస్లిం)
ప్రత్యక్ష జ్ఞానము - పరోక్ష జ్ఞానము
జ్ఞానం - నిప్పులో చేయి పెడితే కాలటం అనే నిప్పుకు సంబందించిన నియమం చర్మం అనే ఇంద్రియం ద్వారా మనము తెలుసుకుంటాము. గాండ్రించేది పులి అనీ ఓడ్రించేది గాడిదనీ చెవులతో విని తెలుసుకొంటాము. అలాగే అనేక వివరాలు కళ్ళతో చూసి తెలుసుకుంటాము. మరికొంత సమాచారం ముక్కుతో నాలుకతో తెలుస్తుంది. ఇలా పంచేంద్రియాలు ప్రకృతిలో వస్తువులతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయా వస్తువుల గురించి నేరుగా (ప్రత్యక్షంగా) తెలుసుకొంటాము.
అన్ని ప్రత్యక్షంగానే తెలుసుకోము. పరోక్షంగా కూడా అనేక విషయాలు తెలుసుకొంటాము. ఒక గ్లాసులో విషం పెట్టారనుకోండి. దీన్ని త్రాగితే చనిపోతారు. అని మీరు చెప్పారు. మీ “ ఎదురుగా ఉన్న ఆసామికి ప్రత్యక్ష జ్ఞానం మీదే విశ్వాసం ఉంది. దాన్ని త్రాగి తెలుసుకోవటం తప్ప ఇంకో మార్గం లేదాయనకు. అలా త్రాగితే ఆయనకు జ్ఞానం రాదు. కాని మనకు "వస్తుంది జ్ఞానం " విషం త్రాగితే చనిపోతారనేది ఆ జ్ఞానం" అయితే అది మనకు పరోక్ష జ్ఞానం మాత్రమే.
జ్ఞానార్జన ప్రాముఖ్యత
చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే దీపం కావాలి. ఈ అజ్ఞానం నివాసం ఎక్కడ అంటే అది మన హృదయమే దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించేకంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకరు నివృత్తి చేయలేరు.
ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు. మన అప్పు మరొకరు తీర్చగలరు. కాని మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం ఎంతో ముఖ్యమైనది అని నొక్కి వక్కాణిస్తుంది ఇస్లాం.
ముస్లిం అయిన ప్రతి స్త్రీ పురుషిని మీద విద్యార్జనమ్ జ్ఞాన సముపార్జన తప్పనిసరి విధి (బైహఖీ)
హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: జ్ఞానార్జనా ధ్యేయంతో బయలుదేరిన వ్యక్తి తిరిగొచ్చేవరకు దైవమార్గంలో ఉన్నట్లుగానే పరిగణించ బడతాడు.. (తిర్మిజీ-హసన్)
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రజి) తెలియ జేశారు: ప్రపంచం పాపిష్టిది, ప్రపంచంలో ఉన్నదంతా పాపిష్టిదే. దైవధ్యానం - దానికి సంబంధించినవి, ఇంకా ధర్మజ్ఞాని, జ్ఞానార్ధి తప్ప! (తిర్మిజీ-హసన్)
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్గా (రజి) తెలియ జేశారు: (ధర్మ) జ్ఞానాన్ని వెతుక్కుంటూ బయలుదేరే వారి కోసం దేవుడు వారు నడిచే మార్గం గుండా స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. విద్యార్థి చేసే పనుల పట్ల ప్రసన్నులై దైవదూతలు అతని గౌరవార్ధం తమ రెక్కలు ముడుచుకుంటారు. భూమ్యాకాశాలలో ఉన్న వారు, ఆఖరికి నీళ్ళలో ఉండే చేపలు కూడా జ్ఞానుల మన్నింపు కోసం ప్రార్థిస్తూ ఉంటాయి. చంద్రునికి ఇతర నక్షత్రాల మీద ఎంత విశిష్ఠత ఉందో జ్ఞానులకు ఆరాధకుల మీద అంత విశిష్ఠత ఉంది. జ్ఞానులు దైవప్రవక్తల వారసులు. దైవప్రవక్తలు తమ వారసుల కోసం దీర్ఘంలు, దీనార్లు (మొదలగు ధనసంపదలు) వదలి వెళ్ళరు. వారు కేవలం జ్ఞానం మాత్రమే వదలి వెళ్తారు. కనుక ఎవరయితే ఆ జ్ఞానాన్ని నేర్చు కుంటారో వారు ఓ గొప్ప భాగ్యాన్ని పొందినట్లే. (అబూదావూద్, తిర్మిజీ)
కళ్ళతో చూడాలి...కానీ, చెవులతో వినాలి కానీ..
కళ్ళకు రెప్పలు ఎందుకున్నాయంటే కళ్ళు తెరవడానికి, మూయడానికి. చెవులకు రెప్పలు వున్నాయా? లేవు. ఎందుకంటే చెవులకు సమస్య లేదు. కళ్ళకే సమస్య వుంది కనుక కళ్ళకు రెప్పలు వున్నాయు. కళ్ళతో ఏమి సమస్య అంటే మనం పనికిరానివన్ని చూస్తూనే వుంటాము. కనుక కనురెప్పలు ఎందుకున్నాయంటే అవసరమైనప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. అవసరం లేనప్పుడు కనురెప్పలతో కళ్ళను మూసేయండి. 80% ఈ ఆత్మ యొక్క శక్తి కళ్ళలో నుండి బయటకి వెళుతుంది. ఈ శక్తిని పనికొచ్చేవాటికి మాత్రమే ఉపయోగించాలి. అశ్లీల దృశ్యాలు, అనవసర విషయాలు చూడకూడదు. అంటే అవి పనికిరాని విషయం, చూడకూడని విషయం. నువ్వేం చేయాలి, నువ్వు ఏకాగ్రతతో దైవ ధ్యానంలొ కూర్చోవాలి. దానికంటూ మన జీవితంలో కొంత సమయాన్ని తప్పక కేటాయించాలి.
మహనీయ ముహమ్మద్ (స) చెప్పిన ఓ హదీసు భాగం ఏమిటంటే, నయన నైచ్యం చూపులు విసరడం, నాలుక నైచ్యం అశ్లీల భాషణం, హస్త నైచ్యం పట్టుకోవడం, పాద నైచ్యం (అశ్లీల బాటన) నడవడం, నోటి నైచ్యం ముద్దాడటం, హృదయ నైచ్యం అశ్లీల కాంక్షకు, కామ వంచకు ఆజ్యం పోయడం. చివరికి మనిషి మర్మాంగం పైవాటిని నిజమైనా చేస్తుంది, లేదా అబద్దమైనా చేస్తుంది. (ముస్లిం, ముస్నద్ అహ్మద్)
మన చెవులు ఎప్పుడూ చెత్త మాటలు వినకూడదు. మన కళ్ళు ఎప్పుడు చెత్త ద్రుశ్యాలు చూడకూడదు. మన పనులు మనవే. మన పనులు అయిన తరువాత మనం దైవ ధ్యానంలో నిమఘ్నం కావాలి. కనుక నీ దైనందిన కార్యకలాపాలు ముగిశాక కఠోర ఆరాధనలో లీనమై నీ ప్రభువుపైనే మనస్సు లగ్నంచెయ్యి (అలమ్ నష్రహ్:7-8)
ఎందుకంటే మనం కూడ ఒక సిద్దీఖ్ అబూ బకర్ (రజి)లా ఒక ఫారూఖ్ ఉమర్ (రజి)లా, ఒక గనీ ఉస్మాన్ (రజి)లా. ఒక దేవిని బెబ్బులి హజ్రత్ అలీ (రజి)లా, కావాలి. కనుక. గుర్తుంచు కోండి! పక్కింటి విషయాలు మీకు చెత్త. అలాగే, మీ ఇంటి విషయాలు పక్కింటివారికి చెత్త.చెత్త పేరితే వచ్చేది కంపు, ఆ కంపే కొందరికి మహా ఇంపు,... అదే మనిషి పాలిట ముంపు, కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ నిర్మోహమాటంగా తెంపు. లేదంటే తప్పదు నీకు తలవంపు.. కనుకనే దైవాదేశాలకు తలవంచు.
వద్దు. అతని (మనసు) మాట వినవద్దు. సాష్టాంగ పడి, సజ్డా చేసి నీ ప్రభువు సాన్నిధ్యం కోసం కృషి చెయ్యి. (అలఖ్: 19)
దైవప్రవక్త (స) వారి మాటల్లో జ్ఞాన విభజన
అబ్దుల్లాహ్ బిన్ ’అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జ్ఞానం మూడు రకాలు. 1) వివేకం నిండిన విస్పష్టమైన వచనం. 2) ధృవీకరించబడిన దైవ ప్రవక్త దృఢమైన ప్రవచనం, సత్సంప్రదాయం. 3) న్యాయవంతమైన ధర్మ విధులు... ఇవి కాకుండా తక్కినవన్నీ అదనపు జ్ఞానం కోవకు చెందినవే. (అబూ-దావూద్, ఇబ్నె-మాజహ్)
జ్ఞాన రకాలు
సర్వసృష్టికర్త అయిన నీప్రభువు పేరు స్మరించి పఠించు. ఆయనే మానవుడ్ని గడ్డకట్టిన రక్తంతో సృజించాడు. చదువు. నీ ప్రభువు మహోన్నతుడు. ఎంతో ఉదారుడు. ఆయన మానవునికి కలం ద్వారా అతను ఎరగని జ్ఞానం నేర్పాడు. (అల్-అలఖ్: 1-5)
కరుణామయుడే ఈ ఖుర్‌ఆన్‌ని (తన ప్రవక్తకు) నేర్పినవాడు. ఆయనే మానవుడ్ని సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు. (రహ్మాన్: 2-5)
ప్రతీ మనిషికి అల్లాహ్ పుట్టుకతో ఇచ్చిన జ్ఞానం వుండనే ఉంటుంది .దాని పరిధిని మనుషులు వ్యాపింప చేసుకుంటారు .ఇది రెండు రకాలుగా చెప్పవచ్చు .
1) ప్రాపంచిక జ్ఞానం. 2)పారమార్థిక జ్ఞానం .
1) ప్రాపంచిక జ్ఞానం -మనిషి ప్రపంచంలో కుటుంబం ,సమాజం ,దేశం కొరకు ఉపయోగించే జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానం అంటారు .ఈ జ్ఞానం తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు వుంటుంది .పేదవారికి తక్కువ స్థాయి లో వుంటుంది .ధనవంతులకు ఎక్కువ స్థాయి లో వుంటుంది .కీర్తి ప్రతిష్టలు గడించిన మహనీయులకు సర్వోన్నత స్థానంలో జ్ఞానం వుంటుంది .
2) పారమార్థిక జ్ఞానం -అల్లాహ్ సన్నిధి చేరడానికి అవసరమైన జ్ఞానం .ఈ జ్ఞానం కోసంమనిషి స్థబ్ధత నుంచి చైతన్య స్థితికి రావాలి .ఆ తర్వాత నిశ్చలత్వాన్ని సాధించాలి .అలాంటి నిశ్చల స్థితిలో బుద్ధి ,ఇంద్రియాలను నియంత్రిస్తుంది .మనిషిలోని మానసిక శక్తులన్నీ ఏకమౌతాయి .
మానవాత్మ సాక్షి! దాన్ని తీర్చిదిద్ది పాపపుణ్యాల్ని గురించి తెలిపినవాడి సాక్షి! నిస్సందేహంగా ఆత్మప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనమవుతాడు. (అష్-షమ్స్: 7-10)
జ్ఞానానికి మరో విభజన
జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం
జ్ఞానం: జ్ఞానం అనగా తత్ విషయ పరిజ్ఞానము. మనము ఒక వస్తువును చూస్తాము. అది ఫలానా అని తెలుస్తుంది.
విజ్ఞానం: మనకు తెలిసిన వస్తువు యొక్క మంచి, చెడు తెలుసుకుంటాము. దాన్ని గూర్చి కొంత పరిశీలన జరుగుతుంది.
సుజ్ఞానం: మనకు తెలిసిన జ్ఞానం యొక్క మంచి, చెడు తెలుసుకుని తదుపరి అందులో సరైన దానిని గూర్చి పరిశీలించి, దాని సంపూర్ణ అవగాహన, అనుభవాన్ని పొందడమే వివేచన.
ప్రజ్ఞానం: మనం పొందిన అనుభవ ఫలితంగా దాన్ని సుస్థిరం చేసుకుని, అదే మనముగా మార్పు చెందడం ప్రజ్ఞ లేక ప్రజ్ఞానము.
ఉదా: జ్ఞానం భౌతికము. ఒక పుష్పాన్ని, ఫలాన్ని తీసుకున్నప్పుడు, అది పుష్పమని, ఫలమని తెలుస్తుంది. విజ్ఞానములో ఆ పుష్పము, ఫలము యొక్క జాతి, రంగు, వాసన గ్రహిస్తాము. సుజ్ఞానములో దాన్ని మనం ఎలా వుపయోగించాలి, ధరించటానికా, తినడానికా, అమ్మడానికా లేక దానధర్మానికా , అని తెలుస్తుంది. ధరించటానికే, తినడానికే, అమ్మడానికే అయితే అది లౌకికము. అలా కాక దానిని దానధర్మానికి ఉపయోగిస్తే ఆధ్యాత్మికము.
విజ్ఞానం తెచ్చిన విప్లవం
విజ్ఞానం - మనిషి మాటలేమయినా చెప్పవచ్చు. కాని నిత్యజీవితంలో అందరూ ఆచరణలో వీలయినంత వరకు విజ్ఞానాన్ని పాటిస్తూనే ఉంటారు. 'అన్నమూ - సున్నమూ అంతా ఒకటే నాయనా' అనే వేదాంతి కూడా " అన్నమయితేనేమిరా! సున్నమయితేనేమిరా!! అయినా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా” అంటారుగాని ఒక 'బుట్టెడు సున్నము వేతాములే ఈ సారికి' అనుకోడు “అన్నం" శాస్త్ర పరిజ్ఞానంతో వచ్చిందే
“మంత్రము పఠించి లిప్తపాటులో హిమాలయాలు చేరెను.” అని నమ్మమనే మిత్రుడు నిజ జీవితంలో రైలు ఎక్కో, బస్సు ఎక్కో, ఇంకా జేబులు బరువుగా వుంటే విమానం ఎక్కో హిమాలయాలు చేర్తాడు గాని మంత్రం పాడి బయలుదేరడు." బస్సులు, రైళ్ళు, విమానాలు శాస్త్ర జ్ఞానంతో మనిషి సాధించుకొన్నవే.
రోగం వచ్చి గందరగోళం పడే వ్యక్తి ముడుపులు గట్టినా, తాయెత్తులు, ఇనుప రేకులు, రంగురంగుల దారాలు కట్టుకున్నా, రంగురాళ్లు ధరించినా, అంతటితో ఆగడు. వెంటనే డాక్టర్ దగ్గరకెళ్ళి వైద్యం చేయించుకొంటాడు. “వైద్యం” శాస్త్ర జ్ఞానంలో భాగమే.
" ఆఖరికి మాటలకే, మంత్రాలకే చింతకాయలు రాల్తాయని మనమెంత నచ్చచెప్పినా, నమ్మ పలికినా- చెప్పే మనమెంత గొప్ప పేరున్న వ్యక్తులమయినా, వినే ఏ మనిషీ చింతచెట్టు క్రింద కూర్చుని మాటల్తోన్ మాయ చేయాలని చూడడు. . రాయి తీసుకొని చెట్టుకేసి కొడ్తాడు. ఇదీ విజ్ఞానమంటే, కాబట్టి - జ్ఞానం అనే ఆయుధతో నీలో చెలరేగే సందేహాలను, సంశయాలను, శంకలను సంహరించు. . అలా నిరుత్సాహంగా కూలబడకు. లే!! జ్ఞాన జ్యోతిని పట్టు, అజ్ఞాన అంధకారాల్ని తరిమికొట్టు.
మనో నిగ్రహానికి మించిన మహాకార్యం మరొకటి లేదు
మనం ఇంద్రధనుస్సు రంగుల అందాలను కనుల పండుగగా చూసి ఆనందించగలుగుతున్నాం. కోకిలమ్మ పంచమ స్వర గీతికల మాధుర్యాలను వీనులవిందుగా విని తన్మయత్వం పొందగలుగుతున్నాం. షడ్రసోపేతమైన ఆహారాలలను నోరారా భుజించి సంతృప్తిని పొందగలుగుతున్నాం. కుసుమకోమలమైన పూబోడి స్పర్శాసుఖాలలో, ఆనంద సముద్రంలో ఓలలాడగలుగుతున్నాం. మనకు ప్రపంచాన్ని చూపించేవి కన్నులు, శబ్దాలను వినిపించేవి చెవులు, వాసనలను చూపించేది ముక్కు, రుచులను చూపించేది నాలుక, స్పర్శను తెలిపేది చర్మం. ఈ ఐదూ ‘జ్ఞానేంద్రియాలు’. వీటిని పంచేంద్రియాలు అని కూడా అంటారు.
మేమతనికి రెండు కళ్ళు, ఒక నోరు, రెండు పెదవులు ఇవ్వలేదా? (మంచికి, చెడుకు సంబంధించిన) రెండు స్పష్టమైన మార్గాలు అతనికి చూపలేదా? (బలద్: 8-10)
అయితే కొందరు కన్నులు ఉండి కూడా చూడలేరు. చెవులు ఉండి కూడా వినలేరు. ముక్కు ఉండి కూడా వాసన చూడలేరు. జిహ్వ ఉండి కూడా రుచి తెలుసుకోలేరు. చర్మం ఉండీ స్పర్శజ్ఞానం పొందలేరు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ జ్ఞానపంచమికి అధిపతి మెదడు. మెదడులో ఈ ఐదు ఇంద్రియాలకూ ప్రత్యేకంగా ఐదు కేంద్రాలు ఉన్నాయి. పంచేంద్రియాలనుంచి వాటి కేంద్రాలకు వార్తలు మోసుకురావటానికీ, కేంద్రాలనుంచి ఆజ్ఞలు తీసుకురావటానికీ తంతి తీగలవంటి నాడులు ఉన్నాయి. కాబట్టి ఈ బాహ్యమైన ఇంద్రియాలలోగానీ, కేంద్రాలనుంచి ఆజ్ఞలు తీసుకురావడానికీ తంతి తీగలవంటి నాడులు ఉన్నాయి. ఈ బాహ్యమైన ఇంద్రియాలలోగానీ, నాడులలోగానీ, మెదడు కేంద్రాలలోగానీ దోషాలుంటే, ఇంద్రియాలు ఉన్నా కూడా ఇంద్రియజ్ఞానం ఉండదు. పంచేంద్రియాలు శరీరంలో ఇతర మామూలు అవయవాల వంటివి కావు. ఇవి ప్రత్యేకమైన అవయవాలు. ఇవి మెదడులో భాగాలనే చెప్పాలి. ఈ ఇంద్రియాలలో ఏ మాత్రం ఒడుదుడుకులు వచ్చినా ఈ జ్ఞానేంద్రియం దెబ్బతింటుంది. కొన్ని వ్యాధులలో జ్ఞానేంద్రియాలలోనో, వాటి జ్ఞాన నాడులలోనో, మెదడులోని జ్ఞాన కేంద్రంలోనో మార్పులు రావచ్చు. ఈ మార్పులవల్ల ఆ ఇంద్రియ జ్ఞానంలో కూడా మార్పులు వస్తాయి. ఉదాహరణకు కంటిలోగాని, కంటి నాడిలోగాని, కంటి కేంద్రంలోగానీ మార్పులు వస్తే చూపులో మార్పులు వస్తాయి.
కనుల పండుగగా ఉండే దృశ్యాలు, వీనులవిందుగా వుండే శ్రావ్యాలూ, జిహ్వకు రుచిగా ఉండే భక్ష్యాలూ, ముక్కుకు ఇంపైన వాసనలూ, మేనుకు సుఖకరమైన స్పర్శల ఆనందాలు అనుభవించాలనే మానవుడు ఉవ్విళ్లూరుతుంటాడు. కానీ మన పూర్వీకులు, మహాజ్ఞానులూ ఇంద్రియాలను అరికట్టడానికి ప్రయత్నించేవారు. ఇంద్రియ నిగ్రహంవల్ల మనిషి ఉన్నత స్థాయిని చేరుకోగలడు. ఇంద్రియాలను నిగ్రహించి, అరిష్వర్గాలను జయించి, సుభక్తాగ్రేసరులు ముక్తిమార్గాన్ని అనే్వషిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ఆధునికులు కొందరు హేళన చేస్తారు. అనుభవించగల శక్తి ఉండి అనుభవించకపోవడమేమిటి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట శని ఉండటమేమిటని ఈ మేతావుల వాదం. ఏది ఎలా ఉన్నప్పటికీ పంచేంద్రియాలు మానవుడి విజ్ఞానాన్నీ, వివేకాన్నీ పెంపొందించి వికాసాన్ని కలిగించే మాట మాత్రం నిజం. కావున పంచేంద్రియాలకు సుఖం ఉంటే ఆరోగ్య పరంగా సంపూర్ణ మానవుడుగా పరిగణించవచ్చు.
మునుపెన్నడూలేని విధంగా మనం శక్తిని సముపార్జించాలి. అవసరమైతే మన ప్రవృతిని మార్చుకొని సరిక్రొత్త వ్యక్తిగా రూపాంతరం చెందాలి. అపరిమితమైన శక్తిని సముపార్జించుకొన్న వ్యక్తుల సమూహం సమాజంలో కేంద్రీకృతం కావాలి. వారి హృదయాలలో మహోన్నతుడైన అల్లాహ్ శ్రోతస్సూ నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఆ జ్వాల మన దేశ నాలుగు చెరగులా ఉన్న జనులలో రగిలించాలి. వారిని సుజనులుగా, సుభక్తాగ్రేసరులుగా, మనుషులుగా, మహర్షులుగా, మానవోత్తములుగా, మానవ మహోపకారులుగా, మహాత్ములుగా మలచాలి.
గౌరవ దృష్టి నేటి అవసరం
మనిషి తనకు ఉన్న విద్యావిజ్ఞానాలను కొంత ప్రదర్శించి కొందరు ప్రశంసించగానే ఉబ్బితబ్బిబ్బయినా ఫరవాలేదు. కాని 'నన్ను దెబ్బతీయడం ఎవడబ్బతరం' అని పొగరుమోతుగా తల ఎగురవేస్తేనే చిక్కు. ఆ స్వయోత్కర్ష స్థితిలో మనిషి ఎదుటివాణ్ణి ఖాతరు చెయ్యడు, తన మొదటివాణ్ణి లెక్క జెయ్యడు, తన నుదుటి వ్రాతనూ గుర్తుచేసుకోడు. తానే సర్వం, తానే ఆది, తానే అంతం అనుకుంటాడు. అహంకారం మండే వస్త్రం, అది ధరించినవాణ్ణి కాపాడదు. తానూ మండుతుంది, ధరించినవాణ్ణి దహించివేస్తుంది. అది మనిషికీ, సత్యానికీ మధ్య అడ్డు తెరగా నిలుస్తుంది, అహంకార జ్వాలలలో రగులుతూ మనిషి తానెన్నో అందాలతో అలరారుతున్నట్లు భ్రమపడినా దానివల్ల అంతరంగం మసిబారి, బాహ్యం వికృతంగా తయారయి అందరికీ దూరమయి, ఎవరికీ చేరువ కాకుండా పోతాడు మనిషి.
విజ్ఞానం వికసిస్తూ ఉంది నలువైపులా కానీ,
వివేకం కుంచించుకుపోతూ ఉంది ప్రతి రోజు ఇలా
అల్లాహ్ ఈ సృష్టి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషుల్లో కులతత్వపు అడ్డుగోడలెందుకు? ప్రతి మనిషికి సమానమైన హక్కులు అల్లాహ్ కల్పించాడు. ప్రతిఒక్కరు తమ కర్తవ్యాన్ని పవిత్రంగా, నిష్కల్మష హృదయంతో, నిస్వార్ధ భక్తితో నిర్వర్తించాలి. మనస్సు, ఆత్మ నిర్మలంగా ఉన్నప్పుడూ, తఖ్వాతో మన మనస్సు నిండినప్పుడు మన ఇంటి తొట్టిలోని నీళ్ళు కూడా జంజం జలంతో సమానం. తఖ్వాయే లేకపోతే మన హృదిని, మన భావ మలినాన్ని జమ్ జమ్ జలం కూడా - అందులో నిండా మునిగి జలకాలాడినా కడగజాలదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు;
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (అల్-హుజూరాత్: 13)
వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (బనీ_ఇస్రాయీల్: 85)
ప్రాణమున్న శరీరం కేవలం కాళ్ళు, చేతులు, రక్త మాంసాలతో కూడిన సమాహారం కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం కల్గిన ఆత్మకు శరీరం నివాసం. ఆత్మకు సహచరు లెవ్వరూ ఉండరు. ఆత్మ ఒంటిరిగానే వస్తుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది. బాహ్య శత్రువులను జయించటంకంటే ఆత్మను జయించటం ముఖ్యం. మానవుని సకల దుఃఖాల నుండి విముక్తి కలిగించే జ్ఞానం, దేనివల్లనైతే సత్వాన్ని తెలుసు కొంటామో, మనసుని అదుపులో పెట్టుకొంటామో, ఆత్మశుద్ధి జరుగుతుందో అదే జ్ఞానం.
ఇమామ్ ఘజాలీ (రహ్మ) ఇలా అన్నారు: ప్రజలు నాలుగు రకాలు:
1) తమకు తెలుసన్న విషయం తమకు తెలిసిన వారు. వీరు పండితులు - మేధావులు: వారిని అనుసరించండి.
2) తమకు తెలియదు అన్న విషయం తమకు తెలిసినవారు. వీరు విద్యార్థులు. వారికి జ్ఞానబోధ చేయండి.
3) తమకు ఏమీ తెలియదన్న విషయం తమకే తెలియని వారు. వీరు మూర్ఖులు - వీరికి దూరంగా ఉండండి.
4) తమకు తెలుసన్న విషయం తమకే తెలియని వారు. వీరు నిద్రావస్థలో ఉన్నవారు. వీరిని జాగురూక పర్చండి.
జ్ఞానార్జన ధ్యేయం ధర్మోన్నతి, దైవ ప్రసన్నత అవ్వాలి
ధర్మజ్ఞానాన్ని కేవలం దైవప్రసన్నత కోసం ఆర్జించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. ఒకవేళ ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మజ్ఞానాన్ని ఆర్జిస్తే అది మహానేరంగా పరిగణించ బడుతుంది. అలాంటివారు పరలోకంలో స్వర్గ సువాసన కూడా పొందలేరు. అయితే ఆశించకుండానే ఏమైనా ప్రతిఫలం దొరికితే అది వేరే విషయం. దాన్ని పుచ్చుకోవడంలో ఎలాంటి పాపం లేదు.
హజ్రత్ అబూహురైరా (రజి) గారి మరొక కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచించారు: దైవప్రసన్నత కోసం నేర్చుకునే విద్యని ఎవడైనా కేవలం ప్రాపంచిక ప్రయోజ నాల కోసం నేర్చుకుంటే అలాంటి వ్యక్తి ప్రళయదినాన స్వర్గసువాసన కూడా పొందలేడు. (అబూ దావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు)
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో నా అనుచర సమాజంలోని కొందరు ధార్మిక విద్య నేర్చుకుంటారు, ఖుర్‌ఆన్ పఠిస్తారు. ఇంకా, ‘మేము నాయకుల వద్దకు, ధనవంతుల వద్దకు వెళ్ళి ధనం సంపాదించి, ధర్మాన్ని వారి నుండి కాపాడుతాము,’ అని అంటారు. కాని అది జరగనిపని. ఎందుకంటే ముళ్ళచెట్టు నుండి ముళ్ళే లభిస్తాయి. అదేవిధంగా ధనవంతులు, నాయకుల వద్దకువెళితే పాపం చుట్టుకోవటం తప్ప మరేమీ లభించదు.” (ఇబ్నె మాజహ్)
అజ్ఞానం తెచ్చే అనర్థాలు
అజ్ఞానము వలన పుట్టేవి సంశయాలు, శంకలు, సందేహాలు, కామం (మితిమీరిన ఏదైన కోరిక), క్రోధం (కోపం), లోభం (పిసినారితనం లేదా స్వార్ధం). మోహం (ఆకర్షణ వలన కలిగే వలపు), మదం (అహంకారం), మాత్సర్యం (ఈర్ష్య, అసూయ, పగ, ) మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి ఇవి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధంచ సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి. మధ్యములను అధములుగా మారుస్తాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్టసంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానము అంటే ప్రతిదానినీ దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అంటే నిజాన్ని తెలుసుకోకుండా మన బుర్రలో ఉన్న ఆలోచనల ప్రకారం ఎదుటి దాన్ని నిర్ణయించడం. ఎలా అంటే అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం. అన్నీ మనకే కావాలని అనుకోవడం. అన్నిటికీ నేనే మూలం నా వలనే జరుగుతున్నాయి. అని భావించడం, భ్రాంతిలో జీవించడం.
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం. - "ప్రజలు బంగారం, వెండి గనుల వంటి వారు. అజ్ఞాన కాలంలో ఉత్తములు, ఇస్లామ్ లో కూడా ఉత్తములే. అయితే వారు ధర్మజ్ఞానం అర్జించి ఉండాలి. (ముస్లిమ్)
వివిధ వంశాలు వివిధ ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. ఒక వంశం చారు వీరత్వం కలిగి ఉంటారు. ఒక వంశంలో దయాకారుణ్యాలు ఉంటాయి. ఒక వంశంలో న్యాయం ధర్మం ఉంటాయి. ఒక వంశం వారు నీచులు, ద్రోహులు, పిసినారులు, వీరికివారు. దుర్మార్గులు ఉంటారు. వంశాల కుటుంబాల గొప్పతనం ఏమీ లేదు. వీటిపై అహకారం ఏమాత్రం తగదు. అయితే వీటికితోడు విశ్వాసం మంచి నడవడిక, సత్కార్యాలు, విద్యా జ్ఞానాలు ఉంటే ఎంతో ఉత్తమం. ప్రవక్త (స) ప్రజల్ని గనులతో పోల్చారు. గనుల్లో బంగారం ఉంటే ప్రజలు దాన్ని గుర్తించరు, కానీ ఆ బంగారాన్ని తీసి శుద్ధి చేసిన తర్వాత, ప్రజలు దాన్ని ఎంతో విలువైనవిగా చూస్తారు. అదేవిధంగా నునిషి ఏ కుటుంబం, వంశానికి చెందిన వాడైనప్పటికీ అతనిలో ఉత్తమ నడక, నడవడిక ఉన్నట్లయితే ప్రజలు అతన్ని ఇష్ట పడతారు.
అజ్ఞాన మూలంగా అల్లాహ్ ఎవ్వరినీ అందలం ఎక్కించింది లేదు, జ్ఞాన మూలంగా అల్లాహ్ ఎవ్వరినీ అవమానం పాల్జేసిందీ లేదు అన్నారు దేవుని బెబ్బులి హజ్రత్ అలీ (ర). మనిషి పాలిట అజ్ఞానికి మించిన శత్రువు లేడు. అజ్ఞానం మహా భయంకర విపత్తు అని కూడా ఆయన సెలవిచ్చారు.
ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది.
హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలిపారు ప్రళయ సూచనల్లో ఇవి కూడా ఉన్నాయి జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం అలుముకుంటుంది. మద్యసేవనం విపరీతంగా పెరిగిపోతుంది. వ్యభిచారం సర్వసామాన్యమవుతుంది. (సహీహ్ బుఖారీ)
హజ్రత్ అబూ మూసా అష్బరీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా తెలియజేశారు :- ప్రళయానికి ముందు ఓ కాలం వస్తుంది. అప్పుడు జ్ఞానం పైకి పోయి అజ్ఞానం క్రిందికి దిగుతుంది. హర్జ్ అధికమవుతుంది. హర్జ్ అంటే హత్యాకాండ, రక్తపాతం. (సహీహ్ బుఖారీ)
హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) అలా ప్రవచించారు - "ప్రళయ కాలం సమీపించినపుడు సత్కర్మలు తగ్గి పోతాయి; ప్రజల హృదయాల్లో పిసినారితనం, పేరాశలు తిష్ట వేస్తాయి: సర్వత్రా కలహాలు, కల్లోలాలు పెద్ద ఎత్తున చెలరేగుతాయి; హర్జ్ అధికమవుతుంది." ప్రవక్త అనుచరులు ఈ మాట విని "హర్ట్ అంటే ఏమిటి దైవప్రవక్తా?" అని జడిగారు. " హర్జ్ అంటే హత్యా రక్తపాతాల" న్నారు దైవప్రవక్త (సల్లం). ఈ మాట రెండు సార్లు అన్నారు.(సహీహ్ బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఆమ్ బిన్ ఆస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా తెలియజేశారు :- దేవుడు (ధర్మ జ్ఞానాన్ని) ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకెత్తుకోడు, జ్ఞానులు (అంటే ధర్మవేత్తలు) అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు. అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని మూర్ఖుల్ని నాయకులుగా చేసుకుంటారు. ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు. వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్యాలు (తీర్పులు) ఇస్తారు. ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే గాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు. (తిర్మిజీ)
క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం (పరిమాణం కాదు నాణ్యత ముఖ్యం )
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (ర) గారు తన కాలం నాటి ప్రజల్ని ఉద్దేశించి ఇలా అంటూ ఉండేవారు. మీరు శ్వాస పీల్చుకుంటున్న ఈ తరం - ధర్మవేత్తలు, ధర్మ పండితులు అధికంగానూ, ధర్మబోధకులు, వక్తలు తక్కువగానూ ఉన్న తరం. దఃర్మ సందేహాలు కూడా తక్కువే. . సందేహ నివృత్తికి మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు సదాచారణకు కాంక్షల మీద ఆధిపత్యం ఉంది. మీ తరం తర్వాత రాబోవు తరాల్లో ధర్మవేత్తలు, ధర్మ పండితులు తక్కువగానూ, ధర్మబోధకులు, వక్తలు అధికంగానూ ఉంటారు. ధర్మ సందేహాలు అధికమయిపోతాయి. సందేహ నివృత్తి శాతం తగ్గిపోతుంది. అప్పుడు కాంక్షలు సదాచారణల మీద పెత్తనం చెలాయిస్తాయి. చివరి కాలంలో కర్మల పరిమాణంకన్నా, సన్మార్గ నాణ్యత అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు ఎన్ని సత్కర్మలు చేశారు అన్నది కాదు, ధర్మానికి, దైవ ప్రవక్త (స) వారి సంప్రదాయానికి అనుగుణంగా చేశారా లేదా అనేది కీలకమయి ఉంటుంది. (అదబుల్ ముఫ్రద్)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు