Monday, December 2, 2024
అల్లాహ్ నిషేధించిన విషయాలు ఏవి?
అల్లాహ్ పరిశుద్ధ వస్తువులనే ధర్మసమ్మతం చేశాడు. అశుద్ధ వస్తువులనే నిషేధించాడు.
ఈ వస్తువులలో మనకు మేలుందో అల్లాహ్ అలాంటి వస్తువులనే హలాల్ చేశాడు. ఏ వస్తువులలో మనకు కీడుందో అల్లాహ్ అలాంటి వస్తువులనే హరామ్ చేశాడు. అల్లాహ్ తన దాసులా కోసం, ఇతర సృష్టిరాశుల కోసం - వాటికి హాని కలిగించే వాటిని, నష్టం కలిగించే వాటిని ఎప్పటికీ ఇష్ట పడదు.
ఏ విషయాన్ని చేయడం వల్ల, చేయకపోవడం వల్ల ఎలాంటి పాపం అనేది ముట్టడో దాన్ని హలాల్ అంటారు. ఇక హరామ్ అంటే, దానికి పాల్పడే వ్యక్తిని శిక్షించడం జరుగుతుంది. దానిని పరిత్యజించిన వ్యక్తికి - అతని ఆ పరిత్యాగం అనేది అల్లాహ్ నిషేధితానికి అనుగుణంగా ఉంటే పుణ్యం లభిస్తుంది.
నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఆదేశిస్తున్నాడు. చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని వారిస్తున్నాడు. మీరు విషయం గ్రహించడానికి దేవుడు మీకిలా ఉపదేశిస్తున్నాడు (అన్-నహల్: 90)
హరామ్ ను మూడు విధాలుగా విభజించవచ్చు.
* మాటలకు, చేతలకు, వ్యవహార శైలికి, ప్రవర్తన నియమావళికి సంబంధించిన నిషేధితాలు.
* ఆహార పానీయాలు, మనిషి కడుపులోకెళ్లే ఇతర వస్తువులకు సంబంధించిన నిషేధితాలు.
* ధార్మిక వ్యవహారాలు, దాని చిహ్నాలకు సంబంధించిన నిషేధితాలు.
1) మాటలకు, చేతలకు, వ్యవహార శైలికి, ప్రవర్తన నియమావళికి సంబంధించిన నిషేధితాలు.
రండి, అల్లాహ్ తన దాసుల కోసం వేటిని ఇష్ట పడ్డాడో, వేటిని నిషేధించాడో, మాటల్లో చేతల్లో ఏవి అల్లాహ్ కు ఇష్టమైనవో, ప్రవర్తన నియమావళిలో ఏవి అల్లాహ్ కు అయిష్టమైనవో - ఖుర్ఆన్ స్పష్టమైన వాక్యాల వ్వారా తెలుసుకుందాం!
నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు: ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా వస్తువుని మీ దగ్గర భద్రపరిస్తే తిరిగి వారికి సురక్షితంగా అప్పగించండి. ప్రజల మధ్య ఏదైనా వ్యవహారం తీర్చవలసి వస్తే న్యాయంగా తీర్చండి. చూడండి అల్లాహ్ మీకు ఎంత మంచి హితోపదేశం చేస్తున్నాడో! ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. (అన్-నిసా: 58)
నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఆదేశిస్తున్నాడు. చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని వారిస్తున్నాడు. మీరు విషయం గ్రహించడానికి దేవుడు మీకిలా ఉపదేశిస్తున్నాడు (అన్-నహల్: 90)
* ఈ ఆయతులో అల్లాహ్ మూడు విషయాలను చేయాలన్నాడు, మరో మూడు విషయాలను విడనాడమన్నాడు.
* న్యాయంగా వ్యవహరించాలని అల్లాహ్ ఉపదేశించాడు.
* మాటల్లో చేతల్లో ఉదారతను, ఉత్తమ విధానాన్ని కలిగి ఉండాలని అల్లాహ్ ఉపదేశించాడు. ఇక ఆరాధనలో ఇహ్సాన్ అంటే, మనం అల్లాహ్ ను చూస్తున్నమన్నంత తన్మయానికి లోనయి ఆయన్ను ఆరాధించడం, లేదా ఆయన మనల్ని చూస్తున్నాడన్న భక్తీ, భయంతో ఆరాధించడం.
* బంధువుల పట్ల దయతో మెలగాలని, బంధుత్వ సంబంధాలను బలపర్చాలని, వారికి చేదోడువాదోడుగా ఉండాలని ఉపదేశించాడు.
* చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని అల్లాహ్ వారించాడు.
* మనిషి మేధ అసహ్యించుకునే విషయాలను, హేతుబద్ధం కానీ విషయాల జోలికి పోకూడదు అని అల్లాహ్ వారించాడు.
* ప్రజల మీద అతిక్రమణను, అత్యాచారాన్నీ, పెత్తనాన్ని, హక్కుల స్వాహాను అల్లాహ్ నిషేధించాడు.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (ర) గారి ఇలా సెలవిచ్చారు; నిశ్చయంగా ఈ ఆయతు ఇస్లాం ధర్మానికి సంపూర్ణ భాష్యం అని చెప్పవచ్చు.
హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ (ర) గారి కథనం - నేను ప్రారంభంలో దైవ ప్రవక్త (స) వారి యెడల నాకు గల లజ్జ కారణంగా నేను ఇస్లాం స్వీకరించాను. కానీ నిజంగా ఈ ఆయతు విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇస్లాం ధర్మాన్ని విశ్వసించాను. అది -
“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు:
ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు.
తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి.
దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము.
నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే.
న్యాయప్రాతిపదికపై తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని అల్లాహ్ మీకీ విషయాలు బోధిస్తున్నాడు.
అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి.
తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము.
వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి.
అల్లాహ్ విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని అల్లాహ్ మీకిలా హితోపదేశం చేస్తున్నాడు.
ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు.
మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (అల్-అన్ఆమ్: 151-153)
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా ఉపదేశించాడు:) “కుమారా! నీవు -
ప్రార్థనా (నమాజ్) వ్యవస్థ నెలకొల్పు.
(ప్రజలను) మంచిని గురించి ఆదేశించు, చెడు విషయాలనుండి వారించు.
కష్టాలు వచ్చినప్పుడు సహనం వహించు. ఇవి ఎంతో ధైర్యసాహసాలతో కూడిన విషయాలు.
జనమ్ముందు గర్వంతో మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నీల్గుతూ నడవకు. తననుతాను పొగడుకునే, మిడిసిపడే వాడ్ని దేవుడు ఏమాత్రం మెచ్చుకోడు.
నీ నడవడికలో మధ్యేమార్గం అవలంబించు.
నీ కంఠస్వరం కాస్త తగ్గించుకో. అన్ని స్వరాల కంటే గాడిద స్వరం అత్యంత కఠోరమయినది.” (లుఖ్_మాన్: 17-19)
2) ఆహార పానీయాలు సంబంధించిన నిషేధితాలు
* అల్లాహ్ మనకు చచ్చిన పశువుల్ని, చిందిన రక్తం, పందిమాంసాన్ని నిషేధించాడు. అలాగే గోర్లుండి మాంసాన్ని భక్షించే జంతువులు కూడా నిషిద్ధమే. ఇస్లామీయ జిబహ్ పధ్ధతి (హలాల్ పధ్ధతి) ప్రకారం కోయబడని ప్రతి జంతువు మాసం నిషిద్ధమే. అలాగే అల్లాహ్ పేరు తీసుకోకుండా కోయబడిన ఏ జంతువూ మాంసమైనా నిషిద్ధమే.
* ఇక సముద్ర జంతువులంటారా, అవి అన్ని హలాల్. దైవ ప్రవక్త (స) సముద్రం గురించి ఇలా అన్నారు: సముద్రం - దాని నీరు పరిశుద్ధమైనది, దాని మరణించిన జంతువు ధర్మసమ్మతమైనది. (అబూ దావూద్, తిర్మిజీ, నసాయి)
* ఆహారపానీయాల్లో అల్లాహ్ మనకు నిషేధించిన వాటిలో - మతిని పోగెట్టే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. (ఏ పానీయం, పదార్ధం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మత్తెక్కుతుందో దాని తక్కువ పరిమాణం కూడా నిషిద్ధమే). మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి, అతనికి ఆర్థికంగా దివాళా తీస్తాయి.
ఆయన మీకు చచ్చిన పశువుల్ని, రక్తాన్ని, పందిమాంసాన్ని,అల్లాహ్ యేతరులకు నైవేద్యం పెట్టిన పదార్థాలను, (అక్కడి మాంసా హారాన్ని) నిషేధించాడు. అయితే దైవాజ్ఞలు ఉల్లంఘించే ఉద్దేశ్యం లేకుండా, హద్దు మీరకుండా గత్యంతరంలేని పరిస్థితిలో మాత్రం (ఈ నిషేధితాలు) తినవచ్చు. అందులో తప్పు లేదు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. (/అల్-బఖరహ్: 173)
3) ధార్మిక వ్యవహారాలు, దాని చిహ్నాలకు సంబంధించిన నిషేధితాలు.
నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (అల్-మాయిదహ్: 03)
* ఈ ఆయతు బట్టి ఇస్లాం ధర్మ మూల విషయాల్లో, స్థిర సిద్ధాంతాల్లో మార్పు చెయ్యడానికి వీలు లేదు. యూదులలో ఓ వ్యక్తి ఉమర్ (ర) గారిని ఉద్దేశించి చెప్పిన మాట - ఒక వేళ ఈ ఆయతు వంటి ఓ ఆయతు మాపై అవతరించి ఉండి ఉంటే దాని అవతారం దినాన్ని ఓ మహోత్సవంగా, పండుగ దినంగా చేసుకుని ఉండేవారము. (బుఖారీ)
ధృవీకరించబడింది హదీసులో హజ్రత్ ఇర్భాజ్ బిన్ సారియహ్ (ర) గారి కథనం: దైవ ప్రవక్త (స) మమ్మల్ని ఉద్దేశించి ఓ అద్భుత హితబోధ చేశారు. ఆ హితబోధకు మా అందరి కళ్ళు చెమర్చాయి, మా అందరి హృదయాలు ద్రవించాయి. అప్పుడు మేము ప్రవక్త (స) వారినుద్దేశించి - యా రసూలల్లాహ్! ఈ మీ హితబోధ మా కోసం మీ చివరి హితబోదేమో అనిపిస్తుంది. ఈ సందర్భంగా తమరు మాకు ఏమైనా తాకీదు చేయాలనుకుంటున్నారా? అని విన్నవించుకున్నాము. దానికి ఆయన ఇలా అన్నారు; నేను మిమ్మల్ని ప్రకాశమానమైన మార్గం మీద వదిలాను. దాని రాత్రి పగటి వలే కమ్మటిమయమై ఉంది. నా తర్వాత పరమ దౌర్భాగ్యవంతుడే ఆ దారిని తప్పుతాడు. (ఇబును మాజహ్)
వేరొక సందర్భంలో దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు:
మా ధర్మ విషయం అందులోని లేని విషయాన్ని జొప్పిస్తే అది రద్దు చెయ్యబడుతుంది. (బుఖారీ, ముస్లిం)
అల్లాహ్ అవతరింపజేయని, దైవ ప్రవక్త (స) సెలవియ్యని నూతన పోకడలను ధర్మంలో ప్రవేశ పెడితే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైపునకే అది తిరిగి రద్దు చేయబడుతుంది. దైవ ప్రవక్త (స) ధర్మంలో ప్రవేశపెట్టబడిన ప్రతి నూతన పోకడ మార్గభ్రష్టత్వమే అని తీర్మానించారు. (సహీహ్ ముస్లిం)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు