అనురాగాన్ని పెంచుదాం! అనుమానాన్ని త్రుంచుదాం!!
కనువిప్పు కలిగించే ఓ పిట్ట కథ
అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.
శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు.
ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది.
ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!
అనురాగ గోపురాన్ని కాపాడే కొన్ని సూత్రాలు
వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించుకోవడం తప్పనిసరి. మనం బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్లు క్రమంగా తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, వివాహ బంధాన్ని పోషించి బలపర్చుకోవడానికి క్రమంగా అనురాగం చూపించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. పెళ్లయి దశాబ్దాలు గడిచినా, వివాహ భాగస్వామికి తనమీద ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయనే భరోసా భార్యకు/భర్తకు అవసరం.
నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ ఎదుటివ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది. సాధారణంగా, భర్తల కన్నా భార్యలు ఎక్కువగా అనురాగాన్ని కోరుకుంటారు. భర్తకు భార్య మీద చాలా ప్రేమ ఉండవచ్చు. కానీ ఆ ప్రేమను కేవలం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేదా లైంగిక సంబంధానికి ముందు మాత్రమే చూపిస్తే, అసలు తన భర్తకు నిజంగా తనమీద శ్రద్ధ ఉందా అనే అనుమానం భార్యకు రావచ్చు. కాబట్టి ప్రతీరోజు వీలైనప్పుడల్లా అనురాగం చూపిస్తూ ఉండడం మంచిది.
మాటల్లో అనురాగం చూపించండి. “ఐ లవ్ యు,” “నువ్వు నాకు దొరికిన వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంటే ఎంత ఇష్టమో మీ భార్యకు చూపిస్తాయి. “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.” ఓ ప్రాచీన నానుడి. మీ అనురాగాన్ని మాటలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మీరు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో రాసి చెప్పండి, లేదా ఈ-మెయిల్, మెసేజ్ పంపండి.
చేతల్లో అనురాగం చూపించండి. కౌగిలించుకోవడం, గిల్లికజ్జాలాడటం , లేదా ఊరికే చేతులు పట్టుకోవడం లాంటివి మీరు నిజంగా తనను ప్రేమిస్తున్నారు కాబట్టే “ఐ లవ్ యు” చెప్పారని మీ భార్యకు తెలియజేస్తాయి. మృదువుగా తాకడం, ప్రేమతో చూడడం, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నిజమైన శ్రద్ధ ఉందని చూపిస్తాయి. అంతేకాదు, తనకు సహాయం చేయడానికి మీరు బ్యాగులు మోయడం, తలుపు తీసి ఉంచడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, లేదా వంట చేయడం లాంటివి కూడా చేయవచ్చు. చాలా సందర్భాల్లో, ఈ పనులు చేయడం ద్వారా మీరు తనకు సహాయం చేయడమే కాదు, మీ అనురాగాన్ని చేతల్లో చూపిస్తారు! అంటే
మనం మన ప్రేమను మాటల్లో మాత్రమే కాదు చేతల్లో చూపించాలి.పెళ్లికాక ముందు పరిచయమైన కొత్తలో తనమీద ఎంత శ్రద్ధ చూపించేవాళ్లో ఇప్పుడూ అంతే శ్రద్ధ చూపించడానికి ప్రయత్నించండి.
మీ భర్త/భార్య కోసం సమయం కేటాయించండి. మీరిద్దరు కలిసి సమయం గడపడం వల్ల మీ వివాహ బంధం బలపడుతుంది, అంతేకాదు తనతో సమయం గడపడం మీకు ఇష్టమని మీ భర్తకు/భార్యకు తెలుస్తుంది. నిజమే, మీకు పిల్లలుంటే లేదా ప్రతీరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటే, మీరిద్దరు కలిసి ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం మీరిద్దరు కలిసి కాసేపు వాకింగ్ చేసేలా ఏర్పాటు చేసుకున్నా మంచిదే.
మీ భర్త/భార్య అవసరాలు తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో ఒక్కో వ్యక్తి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. మీరు తనమీద ఎలా అనురాగం చూపించాలని మీ వివాహజత కోరుకుంటున్నారో, మీరు ఇంకా ఎక్కువ అనురాగం చూపించాల్సిన అవసరం ఉందేమో ఒకరితో ఒకరు మాట్లాడి తెలుసుకోండి. తర్వాత, తను కోరినట్టు చేయడానికి కృషిచేయండి. వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ వివాహజతను మీ మీద అనురాగం చూపించమని అడిగే బదులు, ‘నా భర్త/భార్య నా మీద ఇంకా ఎక్కువ అనురాగం చూపించాలంటే నేనేం చేయాలి?’ అని ఆలోచించండి.

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు