జగతికి జీవం జలమే... జగతికి బలమూ జలమే .. అందరికీ జీవనాధారం జలమే. ప్రతి నీటి చుక్క అమృతతుల్యం. మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు, మొక్కలకు జీవకోటి సమస్తానికి నీరు ప్రాణాధారం. అసలు జీవి ఆవిర్భావం జరిగిందే నీటిలో. ఇవాళ భూగ్రహమంతా విస్తరించిన కోట్లాది జీవరాశుల మూలం నీటిలో ఉంది. అందుకే జీవరాశుల (జంతువులు, మొక్కలు) శరీరాల్లో 60 నుండి 65 శాతం నీరే ఉంటుంది. అంతెందుకు, మొత్తం భూమి ఉపరితలాన్ని 71 శాతం నీళ్లే కప్పివేస్తున్నాయి. అంతరిక్షం నుండి చూస్తే నీలి వర్ణంలో కనపడే భూమిని బ్లూ ప్లానెట్ (నీలి గ్రహం) అంటారు. భూమి అస్తిత్వం, ప్రాణుల ఉనికి నీరు వలన, నీరు తోటి అని చెప్తే అతిశయోక్తి కాదు. ఖురాన్ లో ఇలా ఉంది:
భూమ్యాకాశాలు కలసిఉన్నప్పుడు మేము వాటిని విడదీయడాన్ని వారు చూడ లేదా? అలాగే ప్రతిప్రాణిని మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించ లేదా? మరి వారు (మాయీ సృష్టి చాతుర్యాన్ని) ఎందుకు విశ్వసించరు? (అంబియా - 30)
నీళ్ళ కోసం డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టినా గొంతు తడవని రోజులు మరెంతో దూరంలో లేవు. నేడు కన్నీటి కష్టాలుగా చెప్పుకోబడుతున్నవన్నీ రేపు నీటి కష్టాలుగా మారతాయి. ఈనాడు 20 రూపాయలకు కొనే లీటర్ వాటర్ కొన్నేండ్ల తర్వాత 200లకు అమ్ముడు పోతుందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. జలం అనే ఈ మహా ప్రసాదాన్ని కాపాడుకోకపోతే జన జీవనం అస్తవ్యస్థం కావడం ఖాయం!
“ధనం మూలం ఇదం జగత్' నేడు సర్వత్రా వినడుతున్న మాట. 'జలం మూలం ఇదం జగత్!' భవిష్యత్తులో వినబడే మాట. భూగర్భ జలాలను యుక్తాయుక్తాలను ఆలోచించకుండా తోడేస్తూ భావి తరాల వారికి నీటి చుక్క దొరకకుండా చేస్తున్నాం. మన దేశంలో 1951 నాటికి ఒక మనిషికి సగటున రోజుకు 14 వేల 180 లీటర్ల భూగర్భ జలం అందుబాటులో ఉండేది. 1991 నాటికి అది సగానికి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇంకా దిగజారి ఒక మనిషికి కేవలం 5 వేల 120 లీటర్ల భూగర్భ జలం మాత్రమే అందుబాటులో ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2025 నాటికి ఒక మనిషికి కేవలం 3వేల 545 లీటర్లు, 2050 నాటికి 3 వేల భూగర్భ జలం మాత్రమే మిగులుతుంది. దీనికి తోడు దేశంలోని రిజర్వా యర్లలోని నీటి నిల్వలు కూడా భారీగా తగ్గుతున్నాయి.
దేశంలో 91 రిజర్వాయర్లలో నీటి నిల్వలు 22 శాతం మేర తగ్గాయి. అటు భూగర్భ జలాలు తగ్గడానికి, ఇటు రిజర్వాయర్లలోని నీటి నిల్వలు తగ్గడానకి కారణం ముమ్మాటికీ మనిషే-మనమే. నీటి సంపద అత్యంత విలువయిన సంపద. దాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత మనందరిది. మనిషికి ప్రకృతి ఒనరుల్లో వాయువు తర్వాత నీటి అవసరమే అధికం. నీరు లేకుండా ఏ ప్రాణి బతకజాలదు.
పరిశుభ్రమైన జలాలను పరిరక్షించు కోవడంలో మనకు ఏమాత్రం శ్రద్ధ ఉండకపోవడం ఎంతో బాధాకరం. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా రానురాను జీవజలాలు కరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జలసంక్షోభం ముంచు కొస్తోందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి వనరులను సంరక్షించుకోవడం, ప్రకృతిని, పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడం వంటివన్నీ కేవలం నినాదప్రాయంగానే మిగులుతున్నాయి. అందులోనూ సర్వశక్తి సమన్వితుడైన మానవుడు జలవనరులను కాపాడుకోలేకపోవడమే కాక, వాటిని చేజేతులా విషతుల్యం చేస్తూ, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న చందంగా.. ఎంతోకాలంగా తన జీవితయాత్రను అభద్రతగానే సాగిస్తుండడం ఎంతైనా విచారకరం.
ఓ కవి అన్నట్టు -
గొంతు ఎండిపోయే పేగు మండిపోయే
గంగతల్లి జాడ లేదని
నీటి పైన ఆశే నీరుగారి పోయే
రాత మారు దారి లేదని
దాహం ఆరుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితో
ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.
ఖురాన్ మనల్ని జాగురూక పరుస్తోంది: “పోనీ, మీరు త్రాగే మంచి నీరు గురించి ఎన్నడయినా ఆలోచించారా? దాన్ని మేఘాల నుండి మీరు కురిపి స్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదు నీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు కృతజ్ఞతగా ఎందుకు మసలుకోరు”. (దివ్యఖుర్ఆన్- 56: 68-70)
కృతజ్ఞత అంటే వర ప్రదాతను గుర్తించి, ఆయన చెప్పినట్టు జీవిస్తూ వరాన్ని కాపాడుకోవడమేగా! ఒకవేళ మనం దేవుని మాటను ఖాతరు చెయ్యక ఇష్టారాజ్యంగా బతికితే ఏం జరుగుతుందో కూడా ఖుర్ఆన్ పూస గుచ్చినట్లు చెబుతుంది: “వారిని ఇలా అడుగు: “చూడండి మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే, మీ కొరకు నీటి ఊటను తెచ్చేదెవరో చెప్పండి!"(అల్ ముల్క్ 30)
‘ఉప్పొంగే నదుల జీవజలాలు.. ఉప్పు సముద్రం పాలు’ అని ఒక కవి అన్నట్లుగా మంచినీటి వనరులను, జీవ జలాలను సంరక్షించేందుకు మన దేశంలో ఎంతోకాలం నుంచి ఆశించినస్థాయిలో పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడంతో వర్షపు నీరంతా వ్యర్ధమైపోతోంది. ఎప్పటికప్పుడు జలవనరు లను సంరక్షించుకోవాలని మనకు మనం అనుకుంటు న్నామే తప్ప, ఆచరణలో ఆ కార్యక్రమాలన్నీ నామ మాత్రంగానే ఉంటున్నాయి. అడవులను సంరక్షించు కోవాలి. మొక్కలను విస్తారంగా నాటుతూ పరిరక్షిం చాలి. వృక్ష సంపదను కాపాడుకోవాలి. జలసంక్షోభం రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎంతో బృహత్తరమైన కార్యక్రమాలే. అయినా, రకరకాల పథకాలతో లక్షల కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు అన్నిటికన్నా ముఖ్యమైన జలవనరుల పట్ల నిర్లిప్తంగానే ఉంటుం డడం సముచితం కాదు.
నీటి కాలుష్యం:
నదీజలాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. నీటిని పొదుపు చేసుకోవాలి. విచ్చలవిడి నీటి వాడకాలను అదుపు చేసుకోవాలి. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైనదని గ్రహించాలి. జల సంరక్షణను కేవలం మాటల్లో కాక అదొక పవిత్రమైన బాధ్యతగా భావించాలి. అందుకు పాలకులతో పాటు ప్రజలంతా సంసిద్ధమవ్వాలి. . ఊరు వాడా అంతా ఏకమై ఎక్కడికక్కడ జలాలను, జలవనరులను సంరక్షించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, మేధావులు.. ప్రజలు అందరూ కలసి కదిలితేనే ‘జల సంరక్షణ' సాధ్యమవుతుంది. మన తరానికే కాక, భావితరాలకు కూడా మనం మార్గదర్శకమైనట్లుంటుంది.
ఖుర్ఆన్ స్వర్గాన్ని వర్ణిస్తూ ఇలా అంటుంది: “భయభక్తులు గలవారి కోసం వాగ్దానం చెయ్యబడిన స్వర్ణ విశిష్టత ఇలా ఉంటుంది. దుర్వాసనకు (కాలుష్యానికి) తావు లేని స్వచ్చమయిన నీటి కాలువలు అందులో ఉంటాయి”. (ముహమ్మద్; 15) స్వచ్చమయిన నీరు దేవుని మహదానుగ్రహం అన్న విషయం ఈ ఆయతు ద్వారా మనకు బోధ పడుతుంది. ఈ కారణంగా ప్రవక్త (స) నీటిని కాపాడే పలు సూచనలు చేశారు.
“నిల్వ ఉన్న నీటిలో మూత్ర విసర్జన చెయ్యకూడదు" అని (ముస్లిం) ఓ చోట అంటే, “ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చెయ్యరాదు" అని మరో చోట హెచ్చరించారు. (ముస్లిం) తద్వారా జలం కాలుష్య వాతన పడి ప్రాణ హాని కలిగిస్తుంది గనక. “నీరు లభించని పక్షంలో తయమ్ముమ్ చేసుకోండి. కానీ నీరు దొరికితే స్నానం చెయ్యండి, అందులో శుభం ఉంది" అని ఓ చోట సెలవిస్తే, “నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా నీటిని వృధా చెయ్యకు" అని వేరోక సందర్భంలో అన్నారు. “దానాల్లోకెల్లా జల దానం మహోత్కృష్టం” అని ఓ సందర్భంలో చెబితే, “మనిషి నిత్యావ సరాలను సాటి మనిషి నుండి ఆపి ఉంచడం దైవ అభిశాపానికి గురి చేస్తుంది" అని వేరొక సందర్భంలో సెలవిచ్చారు.
“దాహంతో నాలుక పిడచ గడ్డుకు పోయిన ఓ కుక్క దాహాన్ని తీర్చినందుకు పచ్చి వ్యభిచారిణి ని దేవుడు క్షమించి వదిలేశాడని" ఓ సారి చెబితే, 'కనీసం నీళ్ళు కూడా ఇవ్వకుండా ఓ పిల్లిని చంపేసిన పాపాని ఓ భక్తురాలిని శిక్షించాడు' అని వేకసారి తెలియజేశారు. అంతే కాదు మనిషి చేసే జల దానం అతని మరణానంతరం సయితం అతని పుణ్యానిచ్చే సాధనంగా ఉంటుంది అని శుభవార్తను కూడా అందజేశారు: “మనిషి మరణించాక అతని పుణ్యాన్ని చ్చే మార్గాలు ఏడు. 1) తాను నేర్పిన ప్రయోజనకర విద్య. 2) తాను ఏర్ప రచిన ఏరు లేదా కాలువ. 3) తాను త్రవ్వించిన బావి. 4) తాను నాటిన వృక్షం. 5) మస్జిద్ నిర్మాణం. 6) పుస్తక ప్రచురణం. 7) సజ్జన సంతానం". (బైహఖీ)
ఈ ప్రవచనంలోని ఏడు సాధనాల్లో మూడు పర్వావరణానికి సంబంధించినవయితే, రెండు నీటికి సంబంధించినవి. ఖురఆన్ ప్రకారం జల రహిత స్వర్గాన్ని మనం ఊహించ లేము. “సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు" (అన్నూర్: 45) అని ఖుర్ఆన్ అంటుంటే, అలాంటి కోటానుకోట్ల ప్రాణులతో నిండిన ప్రపంచం జల రహితంగా ఉండగలదా?
జలో రక్షితే రక్షితః!
ప్రవక్త ముహమ్మద్ (స) ఒక గ్లాసు నీళ్ళతో వుజూ చేసేవారు. మూడు లీటర్ల నీళ్ళతో స్నానం ముగించేవారు. (బుఖారీ)
ఓ సారి సఅద్(ర) గారిని వుజూ చేస్తూ చూసిన ఆయన “సఅద్! ఏమిటీ వృధా?" అని ప్రశ్నించారు. 'ఏమిటి, వుజూలో కూడా వృధా ఉంటుందా?” అని ఆయన సందేహం వెలిబుచ్చగా - "అవును,ఒకవేళ నువ్వు నది ఒడ్డున వుజూ చేసినా సరే” అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్)
నీటిని పొదుపు చేస్తే సమాజానికి మేలు చేసినట్లే. ప్రకృతి ఇచ్చిన సంపద, వరం నీరు. అంత విలువైన నీటిని వృథా చేయటం ఒక విధంగా పాపం. నీరు సమృద్ధిగా ఉంటే సాగు బాగుంటుంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు , ధాన్యం బాగా పండుతాయి. అందరికీ పని, ఆహారం దొరుకుతాయి. డబ్బు సంపాదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి ఉపయోగాలెన్నో. నీటికి సహజ వనరులైన చెరువులను, సరస్సులను, నదులను మనం సంరక్షించుకోవాలి. వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువుల, కల్తీ పురుగు మందుల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.
ప్రవక్త (స) నది ఒడ్డున కూర్చుని వుజూ చేయాల్సి వస్తే ఓ పాత్రలో నీళ్ళు తీసుకుని మితంగా వుజూ చేసి మిగతా నీటిని మళ్ళీ నదిలో పడేసే వారు. చివరిగా - వుజూలో అవయవాలను,ఒక్కోసారి, రెండేసి సార్లు, మూడేసి సార్లు కడగొచ్చు అన్న వెసులుబాటు సయితం నీటిని కాపాడే ఉద్దేశ్యంతోనే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మూడు సార్లకన్నా ఎక్కువ సార్లు వుజూ అవయవాల్ని కడగడాన్ని వృధాగా పేర్కొన్నారు ప్రవక్త (స).
ప్రకృతి అంటే సప్లై, డిమాండ్ నియమాల ప్రకారం మార్కెట్లో అమ్మడానికి ఉత్పత్తి చేసే సరుకు కాదు. వినియోగదారుల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థీకృతమైన మార్కెట్ కాదు. ప్రకృతి ప్రైవేట్ ఆస్తి కూడా కాదు, కాకూడదు. ప్రకృతి వనరుల నిర్వహణ, వినియోగం, పంపిణీ సూత్రబద్ధంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. అది ప్రజల ప్రస్తుత అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, ఆవరణ వ్యవస్థ విధ్వంసం కాని సుస్థిరాభివృద్ధి భవిష్యత్ తరాల మనుగడ, అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకున్నదై ఉండాలి. పర్యావరణం ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి స్థితిగా పరిగణించవచ్చు, కానీ సరుకుల చలామణీ ప్రవాహంలో దాన్ని భాగం చేయలేం. ప్రకృతితో మనకున్న సంబంధాన్ని అమానుషమైన లాభనష్టాల దృక్పథం నిర్దేశించకూడదు. అటువంటి ఏ ప్రయత్నమైనా ఘోరవిపత్తుకు దారితీస్తుంది.
నీటి నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకొని (నీటి శుద్ధి చేయడం, నాణ్యమైన నీటిని సరఫరా చేయడం, ఆనకట్టలు కట్టడం) ప్రైవేటు కంపెనీలు చేస్తున్నది సంరక్షణ కాదు, దోపిడి అన్న విషయం ప్రతిచోటా రుజువవుతున్నది. ఇవి నీటి మీద సహజసిద్ధమైన మానవ హక్కుల్ని రద్దు చేస్తాయి. పంటలు ఎండిపోయి, జనం దాహంతో అల్లాడుతుంటే అవి ఇష్టానుసారంగా నీటిని తోడేసి అమ్ముకుంటాయి. ఏ నిబంధనలూ పాటించకుండా భూగర్భ జలాలను దోపిడి చేస్తాయి.
తరిగిపోతున్న పచ్చదనం, విస్తరిస్తున్న ఎడారులు, ఒట్టిపోతున్న భూగర్భం, కేవలం దాహంతో మరణిస్తున్న కోట్లాది పశుపక్ష్యాదులు, మొక్కలు ఈ భూమ్మీద అత్యంత మేధోసంపన్న మనవజాతిని నిలదీస్తున్నాయి. వేరెవ్వరికన్నా ఎక్కువగా ప్రకృతి సూత్రాలు అర్థం చేసుకునే, భూమి గుండె సవ్వడిని చెవి ఒగ్గి వినగలిగే, ఆకాశం నుండి మేఘాలు చెప్పే ఊసులు ఆలకించే మానిషిని ఈ విపత్తు వెనక కారణం అడుగుతున్నాయి. మనిషే దీనికి కారణమా? మానవులు తమకు ఆవాసమైన భూమినే నాశనం చేస్తున్నారా? అవును. అయితే మనిషి తన మితిమీరిన తెలివితేటలతో చేయగలిగేది విధ్వంసమేనా? కాదు. మానవులు మనసు పెడితే ధ్వంసమైన భూభాగాలను పునర్నిర్మాణం చేయగలరు. ఉమ్మడి శ్రమతో ఎడారిలో నందనవనాలు పూయించగలరు.
ఇంతటి విధ్వంసానికి కారణం సహజ మానవ నైజం కాదు. మరి ఏమిటి? అందరికీ చెందిన ఉమ్మడి ప్రకృతి వనరులను కబ్జా చేసుకొని తమ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పి సంపదను పోగుచేసుకొన్న పిడికెడు మంది మొత్తం మానవజాతిని పరాయీకరించి, తోటి మనుషులనూ, ప్రకృతినీ కొల్లగొడుతున్నారు. ఉమ్మడి అనుభవంలో ఉన్న భూమిపై కొంతమంది యాజమాన్య హక్కును పొందినట్లుగానే ఇప్పుడు అందరికీ చెందిన నీటిని తమ సొంతం చేసుకొని మార్కెట్‌లో సరుకుగా అమ్ముకుంటున్నారు. కాబట్టి నీరు మనకు ఆహారం. నీరే మనకు ఆధారం. ప్రకృతితో ఇకనైనా పరిహాసాలు ఆపేసి, ప్రకృతి వనరులను అతి పవిత్రంగా చూసుకోవటం నేటి మన తక్షణ కర్తవ్యం.
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు