Thursday, March 17, 2022

ఆలుమగల అనురాగ గోపురానికి గొడ్డలిపెట్టు అనుమానం

విశ్వాసులారా! మితిమీరిన అనుమానాలకు పోకండి. కొన్ని అనుమానాలు (మీకు) పాపాలుగా పరిణమించవచ్చు. (ప్రజల) రహస్య విషయాల వెనుక పడకండి. మీలో ఎవరూ ఇతరుల్ని పరోక్షంగా నిందించకూడదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? (ఇష్టపడరు.) చూశారా, మీరే దాన్ని అసహ్యించు కుంటారు. దేవునికి భయపడండి. దేవుడు ఎంతో క్షమాశీలి, దయామయుడు. (హుజురాత్ - 12)

ప్రతీ మనిషికి అనుమానం కలగడం సహజం . "అనుమానం పెనుభూతం ". అనుమానం వున్న మనిషి ఏ  ప్రయత్నము చేయలేడు ,విజయాన్ని సాధించలేడు ,అన్యాయాన్ని ఎదుర్కోలేడు.అనుమానం నివారణ చేసుకోవడం ముఖ్యం .లేకపోతే మనిషి అనుమానంతో కృంగి ,కృశించి చివరకు అంతమౌతాడు .



కొందరికి ప్రతీది అనుమానించడం పుట్టుకతోనే వస్తుంది .పెద్దలన్నారు "పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుందా " అని .ఇలాంటివారు భార్యా పిల్లలను ,బంధువులను ,స్నేహితులను ,సమాజాన్ని అనుమానిస్తూవుంటారు . అదే మనకు అందరిలో మంచిని చూడడం  అలవాటైతే, ప్రపంచంలో మన  అంత బలవంతులు  ఇంకొకరు ఉండరు.

అనుమానం రెండు విధాలు. 1) వూహాజనితమైన అనుమానం .  2)నిర్ధారణతో కలిగే అనుమానం .

1) వూహాజనితమైన అనుమానం -మనసులో మనిషి ఊహించుకొని ,తన ఊహలు ఆధార మైనా , నిరాధారమైనవా చూడడు .ఇది కలగగానే అనుమానించడం మొదలుపెడతాడు .ఎవరైనా అతనికి ఆధారాలతో చెబితే అప్పుడు అనుమానం పటాపంచలై సాధారణ వ్యక్తి అవుతాడు .

 2) నిర్ధారణలతో కలిగే అనుమానం -మనిషి తాను    మార్గంలో వెళుతున్నప్పుడు   క్రూర   జంతువులు ,దొంగలు ఆ మార్గంలో వున్నాయని ఇతరులతో  తెలుసుకొని తాను  గమ్యం చేరలేనని నిర్ధారణతో అనుమానిస్తాడు .                

 మనోవ్యాధికి మందు లేనట్టే మనిషి ఆలోచనలు సరైనవి కావని చెప్పినా వినరు చూశారూ, వారు మనోవ్యాధితో భాదపడుతన్నట్టు లెక్క  . ఈ పిచ్చి ఎంతగా ముదురుతుందంటే ... ఉన్నావా, అసలున్నావా? అని దైవాన్నే అనుమానిస్తాడు మనిషి.     

ఆలుమగలు కలతలు లేకుండా కలకాలం కలిసుండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం. నేటి కాలంలో చిన్న కారణానికే దంపతులు పరస్పరం విశ్వాసం కోల్పొయి దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమ అంటే  మళ్ళి మళ్ళి కావాలనిపించేదిగా ఉండాలి కాని అనుమానం అనే భూతంలో మన ప్రేమ నలిగిపోయి మానవ బంధాల మీదే విరక్తి వచ్చేదిగా మిగిలి పోకూడదు.

కొందరికి కొంత కాలం తర్వాత తమ  మీద తమకే అనుమానం పెరిగి అది తాము పెంచుకున్న మొక్కలను నరుక్కునే స్థితికి తీసుకు వెళ్ళేంత వరకు వస్తుంది ... ఈ అనుమానం భూతానికి ఆడ మగ తేడా లేదు ఎవరినైనా ఆవహిస్తుంది కాస్త చోటు ఇస్తే చాలు అల్లుకుపోతుంది... దాన్ని వదిలించు కోవడం చాలా కష్టం ... ఎంత చదువుకున్న వాళ్ళయినా దీనికి దాసోహమై పోతున్నారు... ఎన్ని వసంతాలు కలసి బ్రతికిన భార్యా భర్తలలో సయితం  చిన్న అనుమానం చాలు ఆ బంధం విచ్చిన్నమై పోవడానికి.... కలసి  పంచుకున్న సంతోషాలు కాని బాధలు కాని మర్చిపోయి తెగతెంపుల వరకు వచ్చేస్తున్న బంధాలు ఎన్నో.. ఎన్నెన్నో!

దాంపత్య జీవితం   - - అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం. దాంపత్య జీవితం - అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం.  కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో  విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం, నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు ఖుర్‌ఆన్‌ వచనాల, ప్రవక్త (స) వారి ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను,  స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. 

ఓ పల్లెటూరి వ్యక్తి దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''యా రసూలల్లాహ్‌! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు నల్లన'' అని భార్య మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తపర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ''రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?'' అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ''బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంద''ని సమాధానమిచ్చాడు. ''అదే విధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది'' అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం)

   హజత్ర్‌ ఆయిషా (ర) కథనం - ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ''నీకు తెలుసా! ముజజ్జిజ్‌ ముద్‌లజీ ఇప్పుడే జైద్‌ బిన్‌ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ''ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి'' అని అన్నారు (బుఖారీ, ముస్లిం) 

  అంటే - ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది. పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన ముద్లిజ్‌ తెగకు చెందిన ముజజ్జిజ్‌ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే  వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త (స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్‌ జైద్‌ (ర) నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్‌ బిన్‌ హారిసా (ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష  వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని, దాని గురించి తెలియని ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి.     

అనుమాన రహితులే ,ప్రపంచంలో కృషి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ,మహనీయులవుతారు , మహాత్ములౌతారు.  కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కాస్త అహాలను వీడి అనుమానాలను వదలి అపార్ధాలు మరచి కొద్దిగా అనుకూలంగా మెలిగితే ఎన్నో బంధాలు విడాకుల పాలు కాకుండా ఉంటాయి ... ఇద్దరిలో ఎవరికైనా కావాల్సింది కాస్త ఓదార్పు ... మరికాస్త నమ్మకం... నమ్మకం లేని చోట ప్రేమ అస్సలు ఉండదు... ఉందని అనుకుంటే అది పొరబాటే అవుతుంది... ప్రేమ ఉందని చెప్పినా అది నటనే... ఇన్నాళ్ళ కాపురం తరువాత నటన ఎంత వరకు అవసరమో ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ ఒక్కరైనా మీతో పాటు నడిచే మీ భార్య/భర్త తో పాటు పిల్లలు కూడా అదృష్టవంతులు అవుతారు....  నమ్మకం లో నుండి వచ్చే ప్రేమ శాశ్వతం... అనుమానంలో పుట్టిన ప్రేమ అబద్దం.... మరి ఈ అనుమాన భూతానికి పరిష్కారం ఏంటో ఎవరికి వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి.

విశ్వాసులారా! పురుషులు తోటిపురుషుల్ని హేళన చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. అలాగే స్త్రీలు తోటిస్త్రీలను గేలి చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. మీరు ఒకరి తప్పులు మరొకరు ఎత్తిచూపుకుంటూ పరస్పరం బురద చల్లుకోకండి. తప్పుడు పేర్లతో పిలుచుకోకండి. విశ్వాసభాగ్యం పొందిన తర్వాత చెడ్డపేరు తెచ్చుకోవడం చాలా తప్పు. ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు.  (హుజురాత్ -11) 


కనువిప్పు కలిగించే ఓ పిట్ట కథ 

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.

శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు.

ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది.

ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

 

 

 

   

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు