Sunday, September 7, 2025

తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)

తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) తౌహీద్ అంటే అల్లాహ్ వైపు ప్రయాణం చేసే వారికి మొదటి నిలయం, ఈ లోకంలోను పరలోకంలోను విముక్తి పొందే మార్గం. ప్రవక్తలు ప్రజలకు చేసిన మొదటి హితవు, తొలి ప్రేమైక పిలుపు కూడా ఇదే. పవిత్ర ఖుర్‌ఆన్‌లో దయామయుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴿وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ﴾ (النحل: 36) “మేము ప్రతి జాతికి ఒక దూతను పంపాము (ఇది చెప్పమని): ‘అల్లాహ్‌ను మాత్రమే పూజించండి, తాగూత్ నుండి దూరంగా ఉండండి’.”
తౌహీద్ అనేది మనిషి యొక్క మొదటి కర్తవ్యం. ప్రవక్త ﷺ, తన సహచరుడు ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) యెమెన్‌కి పంపేటప్పుడు ఆయనకు చేసిన ఉపదేశం ద్వారా ఈ యదార్థాన్నే వివరించారు: ఓ మఆజ్! “నీవు అహ్లుల్‌కితాబ్ (గ్రంథప్రజల) వద్దకు వెళ్తున్నావు. వారిని మొదట తౌహీద్ వైపునకు పిలవాలి.” (బుఖారీ) అల్లాహ్ సృష్టిని వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. అందుకే ప్రవక్తలని, గ్రంథాలని పంపాడు. ఆ మహోన్నత లక్ష్యమే - తౌహీద్. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ﴾ (الذاريات: 56) “నేను జిన్నులనూ, మనుషులనూ నన్ను ఆరాధించడానికి తప్ప మరి దేనికోసమూ సృష్టించలేదు.” ఇబాదత్ (ఆరాధన) ఇబాదత్ అంటే అల్లాహ్ ప్రేమించే మరియు సంతోషించే ప్రతి మాట, ప్రతి పని. అది బహిరంగమైనా, రహస్యమైనా. ఇక ఇబాదత్ యొక్క పునాది మరియు శిఖర భాగం తౌహీద్. మనం ఏది నాటుకుంటామో దాన్నే కోసుకుంటాము. తుమ్మ విత్తనామ నాటి మామిడి పండును ఆశించడం అత్యాశే కాదు, ఎన్నటికీ తీరని ఆశ. తౌహీద్ విత్తనాన్ని మనం మన మనోసీమలో నాటితే తాలూకు ఫలాలు మన కర్మతోటలో కాస్తాయి. ఇదే విషయాన్నిఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది: అల్లాహ్ శిష్టవచనాన్ని దేనితో పోల్చాడో మీరు గమనించారా? ఓ మేలుజాతి వృక్షం ఉంది. దాని వేళ్ళు నేలలో లోతుకు దృఢంగా పాతుకుపోయాయి. దాని శాఖలు ఆకాశం దాకా విస్తరించాయి. అనుక్షణం అది తన ప్రభువాజ్ఞతో సుమధుర ఫలాలు ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకోవడానికే అల్లాహ్ ఇలాంటి ఉదాహరణలు ఇస్తున్నాడు. (ఇబ్రాహీం: 24) తౌహీద్ నిర్వచనం: తౌహీద్ అంటే రుబూబియ్యహ్ (విశ్వసార్వభౌమత్వం)లో, ఉలూహియ్యహ్ (ఆరాధన)లో, మరియు అల్లాహ్ యొక్క నామాలు, గుణాలలో ఆయనను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం. తౌహీద్ భాగాలు తౌహీద్ అర్-రుబూబియ్యహ్ – సృష్టి, యాజమాన్యం, పోషణ మొదలైన వాటిలో అల్లాహ్‌ను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం. తౌహీద్ అల్-ఉలూహియ్యహ్ – పూజలో, ప్రార్థననో, ఆరాధనలో అల్లాహ్‌ను ఒకే ఒక్క నిజ ఆరాధ్యునిగా విశ్వసించడం. తౌహీద్ అల్-అస్మా వ సిఫాత్ – అల్లాహ్ స్వయంగా లేదా ప్రవక్త ﷺ ద్వారా వివరించిన నామాలు, గుణాలను ఆయన కు మాత్రమే ప్రత్యేకించి, ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకుండా, పెడర్థాలు తీయకుండా, పోలికల్ని కల్పించకుండా, ఆధారాలతో రుజువయిన ఏ ఒక్క గుణ నామాన్ని నిరాకరించకుండా, వాటికి ఎలాంటి దృశ్య రూపంగానీ, ఊహాచిత్రంగానీ ఇవ్వకుండా విశ్వసించడం. ఖుర్‌ఆన్ లో ఇలా ఉంది; ﴿رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا﴾ (مريم: 65) ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్య వున్న సమస్త సృష్టితాలకే ప్రభువు. కనుక నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే (జీవితాంతం) స్థిరంగా ఉండు. నీ దృష్టిలో ఆయనకు సమానుడైనవాడు ఎవడైనా ఉన్నాడా?” (అల్-మర్యం: 65) ఈ ఆయతులో మూడు అంశాలు ఉన్నాయి: “ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్యనున్న వాటి యజమాని” → రుబూబియ్యహ్ “నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే (జీవితాంతం) స్థిరంగా ఉండు” → ఉలూహియ్యహ్ “- నీ దృష్టిలో ఆయనకు సమానుడైనవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకు సాటి ఎవరూ లేరు” → అస్మా వ సిఫాత్ తౌహీద్‌కు విరుద్ధమైనది షిర్క్ షిర్క్ అంటే అల్లాహ్‌కు భాగస్వామ్యాన్ని చేర్చడం. ఇది అల్లాహ్ నిషేధించినవాటిలో అత్యంత ఘోరమైన పాపం. షిర్క్ రెండు రకాలుగా విభజించబడింది: 1) షిర్క్ అల్-అక్బర్ (పెద్ద షిర్క్): అల్లాహ్ తప్ప మరెవరినయినా ప్రార్థించడం, మొరపెట్టుకోవడం. ఇది మనిషిని ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. ఆధారం: ﴿إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ﴾ (النساء: 48) అల్లాహ్ తనకు సాటి కల్పించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. అది తప్ప ఇతర పాపాలను ఆయన తలచుకుంటే క్షమిస్తాడు. అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో, గుణగణాల్లో, శక్తిసామర్థ్యాల్లో) సాటి కల్పించడమంటే ఘోరమయిన పాపం మూట కట్టుకున్నట్లే. (అన్-నిసా: 48) షిర్క్ అల్-అస్గర్ (చిన్న షిర్క్): ఇస్లాం నుండి బహిష్కరించదు కానీ షిర్క్ అనే పేరు పొందిన పనులు. ఉదాహరణ: అల్లాహ్ తప్ప వేరేవారి పేరిట ప్రమాణం చేయడం. పెద్ద షిర్క్ మరియు చిన్న షిర్క్ మధ్య వ్యత్యాసం. పెద్ద షిర్క్ క్షమించబడదు. చిన్న షిర్క్ అల్లాహ్ ఇష్టమైతే క్షమిస్తాడు. పెద్దషిర్క్ ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, చిన్న షిర్క్ కాదు. పెద్ద షిర్క్ మనిషి చేసిన అన్ని సత్కార్యాలను రద్దు చేస్తుంది. చిన్న షిర్క్ కేవలం ఆ కార్యాన్ని మాత్రమే రద్దు చేస్తుంది. ఆరాధన అంగీకారానికి రెండు షరతులు ఇఖ్లాస్ (చిత్తశుద్ధి): అల్లాహ్ కోసం మాత్రమే చేయడం. ఇత్తిబా (అనుసరణ): ప్రవక్త ﷺ చేసిన, చూపిన, చెప్పిన విధంగానే చేయడం. ఇస్లాం ధర్మస్థాయి ఇస్లాం (ఆచరణ) – 5 స్తంభాలు: షహాదత్ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడని, మహ్మద్ ﷺ ఆయన అంతిమ ప్రవక్త అని సాక్ష్యమివ్వడం) సలాత్ (ఐదు పూటల నమాజులు) జకాత్ రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు హజ్ ఈమాన్ (విశ్వాసం) – 6 స్తంభాలు: అల్లాహ్‌పై విశ్వాసం ఆయన దూతలు-మలాయికపై విశ్వాసం ఆయన గ్రంథాలపై విశ్వాసం ఆయన ప్రవక్తలపై విశ్వాసం అంతిమ దినంపై విశ్వాసం కదర్ (మంచీచెడు విధివ్రాతల)పై విశ్వాసం ఇహ్సాన్ (ఉత్తమ విధానం): “నీవు అల్లాహ్‌ను చూస్తున్నట్టుగా ఆరాధన చేయాలి; నీవు అలా చేయలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకో.” ముగింపు ప్రతి ముస్లింకి తౌహీద్ అర్థాన్ని తెలుసుకోవడం, దాన్ని నేర్చుకోవడం, కుటుంబానికి బోధించడం, సమాజంలో ప్రచారం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి కాలంలో, ప్రతి ప్రదేశంలో విశ్వాసికి తౌహీద్ అత్యంత ప్రధానం, ప్రాణప్రదం గనక.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు