Monday, February 16, 2026
ఆత్మప్రబోధపు పాఠశాల రమజాన్
అంశం: *రమజాను మాసానికి స్వాగతం!*
శీర్షిక: ఆత్మప్రబోధపు పాఠశాల రమజాన్
జ్ఞానులారా వినండి! రంజాన్ మాసం వచ్చేసింది,
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్ళీ మన చెంతకు చేరింది.
ఏడాది కాలం అజ్ఞానంలో, అజాగ్రత్తలో గడిచిపోయింది,
మేల్కొనండి! జీవితం కదిలే మేఘంలాంటిదని తెలుసుకోండి.
ఉపవాసం అంటే కేవలం ఆకలితో అలమటించడం కాదు,
అది పాపాలకు అడ్డుకట్ట వేసే ఒక రక్షణ కవచం.
శారీరక వాంఛలను అదుపు చేసే ఒక ఆత్మీయ విముక్తి,
దుర్గుణాల నుండి మనల్ని విముక్తి చేసే ఒక దివ్య శక్తి.
పక్కింటి వారి హక్కులు కాపాడలేని వాడు ఉపవాసి కాడు,
సోదరభావాన్ని, బంధుత్వాన్ని గౌరవించని వాడు ఉపవాసి కాడు.
పరోక్ష నిందలు మోపేవాడు, చెడు మాట్లాడేవాడు,
అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు చేసేది ఉపవాసం కానే కాదు.
రమజాన్ అంటే క్రమశిక్షణ నేర్పే ఒక గొప్ప పాఠశాల,
దూరంగా ఉన్న మనసులను దగ్గర చేసే సోదర భావాల మాల.
సమానత్వాన్ని, దాతృత్వాన్ని నేర్పే ఒక అద్భుత పాఠం,
త్యాగాన్ని, ఆత్మీయతను చాటిచెప్పే ఆధ్యాత్మిక పయనం.
ప్రవక్త (స) వారి అనుచరుల ఉపవాసం చూడండి..
వారి ఆత్మలు పరిశుద్ధమై చరిత్రలో ఎలా నిలిచిపోయాయో
లోకపు వ్యామోహాలను వీడి వారు ఉపవాసాలు ఉన్నారు,
ఉపవాస దీక్షలోనే వారు విజయ శిఖరాలు అధిరోహించారు.
పగటి వేళ రణరంగంలో వారు గర్జించే సింహాల వంటి వారు,
కానీ రాత్రి వేళ దైవ సముఖంలో కన్నీరు కార్చే భక్తులు వారు.
ఆ పుణ్యాత్ములకు, ఈ పవిత్ర మాసానికి ఇవే మా ఘన స్వాగతాలు
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
ఊరు: కువైట్
సెల్: 00965 97266676
హామీ పత్రం: ఇది నా స్వీయ రచన
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు