పాఠం 2
రమజాన్ ఉపవాసాల్లోని మర్మం
అల్లాహ్ తన దాసుల కోసం విధించే చట్టాలలో
ఎన్నో మర్మాలుంటాయి. ఆయన చేసే నిర్ణయాల్లో ఎన్నో రహస్యాలు నర్మగర్భితంగా నెలకొని ఉంటాయి.
ఆయన సృష్టిలో లెక్కలేనన్ని లక్ష్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ మర్మాలు, రహస్యాలు, లక్ష్యాలలో కొన్నిటిని
మానవ మెదడు అర్ధం చేసుకోవచ్చు, మరికొన్నిటిని అర్ధం చేసుకోలేక
పోవచ్చు. ఉపవాసం విషయానికి వస్తే దాని గురించి అల్లాహ్ నిర్ణయం ఇలా ఉంది:
"ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీ
పై విధిగా నిర్ణయించ బడింది-మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది.
! దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది." (55 2 : 183)
దీని ప్రకారం ఉపవాసం అనేది దైవభీతికి, ధర్మపరాయణతకు దారితీస్తుందని తెలుస్తోంది. ఉపవాసం పాటించే వ్యక్తి
అల్లాహ్కు అత్యంత సన్నిహితుడౌతాడని కూడా చెప్పవచ్చు. ఉపవాస స్థితిలో మనిషి కడుపు ఆకలితో
నకనకలాడిపోవచ్చు. అయితే దాంతోపాటు అతని హృదయమూ పరిశుద్ధమవుతుంది. సాయంత్రం పూట దాహం
తీర్చుకొని ఉపవాసం విరమించినప్పుడు అతని కండ్లు చెమ్మగిల్లుతాయి. ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు:
“ఓ యువకుల్లారా! మీలో మహర్ సొమ్ము చెల్లించగల స్తోమత వున్నవారు వివాహం చేసుకోవాలి.
ఎందుకంటే,
చూపులనూ, మర్మావయవాలను కాపాడుకోవటానికి
అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అదే. అలా చేసే స్తోమత లేనివారు ఉపవాసం పాటించాలి. అది
అతని కొరకు డాలు లాగా పనిచేస్తుంది."
ఉపవాసం శరీరంలోని అన్నవాహికను, ధమనులను సంకోచింపజేస్తుంది. ఇవి షైతాన్ ప్రసార మార్గాలుగా ప్రసిద్ధం.
ఏమైనప్పటికీ ఉపవాసం ఈ మార్గాల్లో షైతాన్ దౌష్ట్యాలను అరికడుతుంది. అలాగే ఉపవాసం లైంగిక
కోరికలను,
ఆలోచనలనూ, అవిధేయతా ప్రోత్సాహకాలను బలహీనపరుస్తుంది. 'ఆత్మ' భారాన్ని తగ్గించి అందులో
చురుకుదనం తీసుకువస్తుంది. ఒక ఉపవాసి తన లాగే ఉపవాసం పాటించే తోటి సామాజిక సోదరుల గురించి
ఆలోచిస్తాడు. తన చుట్టూ బ్రతికే నిరుపేదలనూ, అవసరాల్లో అలమటిస్తున్న
వారిని గుర్తిస్తాడు. వారికి తన సాను భూతిని ప్రకటిస్తాడు. తనకు చేతనయినంత వరకు వారికి
సాయం చేయటానికి ముందుకు వస్తాడు.
ఉపవాసాన్ని ఓ శిక్షణాకాలంగా కూడా భావించవచ్చు.
ఈ కాలంలో ఆత్మకు బలమైన శిక్షణ లభిస్తుంది. హృదయం పరిశుద్ధమవుతుంది. చూపులకు బిడియం
అలవడుతుంది. అవయవాలు సురక్షితమవుతాయి. ఉపవాసం అనేది దాసునికి అల్లాహు మధ్య సర్మగర్భంగా
ఉండే ఒక రహస్యం. ధృవీకృత హదీసు ఒకటి ఈ విషయాన్ని దైవప్రవక్త మాటల్లో ఇలా ప్రస్ఫుటం
చేసింది:
"అల్లాహ్ ప్రకటించాడు: మనిషి చేసే ప్రతి
సత్కార్యం అతని సొంతానిదే, ఒక్క ఉపవాసం తప్ప. అది నాది. నేనే
దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను." మనిషి ఉపవాసం పాటిస్తున్న సంగతిని ఒక్క అల్లాహ్
తప్ప మరెవరూ అర్ధం
చేసుకోలేరు. నమాజు, జకాతు, హజ్ లాంటి ఇతర ఆరాధనల
కంటే ఇది పూర్తిగా విభిన్నం. వాటిని పాటిస్తున్నప్పుడు జనం చూసి వారిని ఆరాధనపరులుగా
గుర్తించ గలరు. కాని ఉపవాసం పాటిస్తున్న వ్యక్తిని చూసి అతను ఉపవాసి అని తెలుసు కోవటం
అసంభవం. అంతటి రహస్యమైన ఆరాధన అది. అందుకే అల్లాహూ అది ఎంతో ప్రీతికరం.
ఉపవాసం మనిషిని అల్లాహ్ సామీప్యానికి తీసుకువెళ్తుందని
సదాచార సంపన్నులైన మన పూర్వీకులు వక్కాణించారు. పుణ్యకార్యాలు జుర్రుకునే పవిత్ర మాసంగా, సత్కార్యాల కోసం పరస్పరం పోటిపడే సువర్ణ సమయంగా ఈ నెలను భావిస్తారు
చాలామంది. అందుకే రమజాన్ నెల వచ్చిందంటే చాలు వారు సంతో షంతో కేరింతలు కొడతారు. అది
వెళ్ళిపోగానే దిగాలు చెందుతారు. మన పూర్వీకులు ఉపవాసపు పరమార్థాన్ని గ్రహించారు. అందుకనే
రమజాన్ నెల అంటే వారికి అమితమైన ప్రేమ. రమజాన్లో వారు మునుపెన్నడూ లేని రీతిలో ఆరాధన
చేసేవారు. నిరుపమాన త్యాగభావాన్ని కనబరిచేవారు. రాత్రిళ్లు ఎప్పుడూ నమాజులో నిలబడి
ఉండేవారు. రుకూలో వంగి వుండేవారు. అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగ ప్రణామం (సజ్జా) చేస్తూ
కనిపించేవారు. అల్లాహ్ జ్ఞాపకంలో కన్నీరు మున్నీరయ్యే వారు. అత్యంత అణకువతో అల్లాహ్
ను ప్రార్థించేవారు. అల్లాహ్ ధ్యానం, దైవగ్రంథ పారాయణం, ధర్మజ్ఞాన సముపార్జన, ధర్మబోధన, పరస్పర హితోపదేశం- శుభప్రద మైన రమజాన్ మాసంలో ఇవే వారి నిత్య
కృత్యాలు,
ప్రారంభకాలంలోని ముస్లింలకు ఉపవాసం ఆనందాన్ని, ఆత్మశాంతిని సమకూర్చేది. ఉపవాసంతో వారి హృదయాలు మరింత విశాలమయ్యేవి.
అందుకనే ఉపవాస లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ ఆత్మలకు శిక్షణనిచ్చుకునేవారు. ఉపవాసం
ద్వారా పొందే జ్ఞానంతో తమ హృదయాలను పరిశుద్ధపరచుకునేవారు. తమ నోళ్ళనూ, కళ్ళనూ పాపకార్యాల నుంచి పరిరక్షించుకుంటూ ఉండేవారు. దైవగ్రంథ
పారాయణం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు. విశ్వసనీయమైన ఎన్నో ఆధారాల ద్వారా
స్పష్టంగా ఈ విషయాలు తెలుస్తున్నాయి.
ఉపవాసం ముస్లింల ఐకమత్యానికి పట్టుగొమ్మలా
పరిఢవిల్లుతుంది. ప్రపంచంలోని ముస్లింలంతా ఒకే సమయంలో ఉపవాసం ప్రారంభించి, తిరిగి ఒకే. సమయంలో ఉపవాసాన్ని విరమించటం అందుకు ఓ సజీవ సాక్ష్యం, ఉపవాస కాలంలో సామాన్యంగా అందరూ సోదరభావంతో కలసి భోజనం చేస్తారు.
చెడు పోకడలనూ, దుష్కార్యాలను ఉపవాసం కడిగివేస్తుంది. దీని
గురించే ప్రవక్త (సఅసం) అన్నారు: "ఒక శుక్రవారం (జుమా) నుంచి మరో శుక్రవారం. ఒక
ఉమ్రా నుంచి మరో ఉమ్రా, ఒక రమజాన్ నుంచి మరో రమజాన్ వాటి మధ్య
జరిగే పాపాలకు పరిహారం అవుతుంది. అయితే ఆ మధ్యకాలంలో పెద్దపాపాల (కబాయిర్)కు పాల్పడి
ఉండకూడదు."
ఇక శారీరకంగా చూస్తే, ఉపవాసం దేహ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరం నుంచి మలినాలను
విసర్జింపజేస్తుంది. కడుపును సాంత్వన పరుస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. గుండెకు
నెమ్మదినిస్తుంది. ఆత్మను ఉత్తేజపరుస్తుంది. నడవడికను క్రమబద్ధం చేస్తుంది. ఉపవాసం
పాటించే వ్యక్తి ఆత్మ విసమ్రమవుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. కోరికలకు కళ్ళెం పడుతుంది.
అతని హృదయం అల్లాహ్ సామీప్యతను సంపాదిస్తుంది. ఫలితంగా అల్లాహ్ అతని ప్రార్ధనలను నెరవేరుస్తాడు.
ఉపవాసంలో మరో గొప్ప మర్మం దాగి ఉంది. అదేమంటే, దాసుడు అల్లాహ్ సంతోషం కోసం ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తాడు. అల్లాహ్
ప్రీతికోసం తన కోరికలను త్యజించుకుంటాడు. అన్నపానీయాలు మానేస్తాడు. ఉపవాసం మూలంగా ఒక
ముస్లిం కోరికలను జయించగలుగుతాడు. మనసుపై అదుపు సాధిస్తాడు. అసలు సగం ఓపిక ఉపవాసమే.
కనుక సరైన కారణం లేకుండా ఉపవాసం వదలిపెట్టే వ్యక్తికి తన మనసుపై అదుపు ఉండదు. అతను
కోరికలను జయించలేడు.
మొత్తానికి జీవితంలో కష్టాలను భరించటానికి, జిహాద్, త్యాగం లాంటి కఠోర ధర్మ
విధులను నిర్వర్తించటానికి కావలసిన నైతిక శక్తిని, బలాన్ని సాధించి పెట్టేది, అందుకు తగ్గట్టు క్రమశిక్షణను
ఇచ్చేదే ఉపవాసం. పూర్వం తాలూత్ అనే రాజు శత్రువులతో యుద్ధం చేయటానికి సైన్యంతో బయలుదేరాడు.
ఆ సమయంలో అతని సైన్యాన్ని అల్లాహ్ ఒక నది ద్వారా పరీక్షించిన సంఘటన చాలా ఆసక్తికరంగా
ఉంటుంది. నది ఎదురైనప్పుడు తాలూత్ తన సైనికులతో ఇలా అన్నాడు:
తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు
ఇలా ప్రకటించాడు : "చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు.
అందు లోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో
గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు." కాని కొద్ది మంది తప్ప మిగిలిన వారంతా
ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. (95 2: 249)
సహనం కలిగివుండేవారు. కోరికలను అదుపులో
పెట్టుకునే వారు మాత్రమే విజయం సాధించగలుగుతారు. దీనికి పూర్తి భిన్నంగా మనోవాంఛలకు
బానిసలయ్యే వారు జీవనపోరాటంలో వెన్నుచూపి పారిపోతారు.
ఉపవాస సారాన్ని మనం ఇలా క్లుప్తీకరించుకోవచ్చు
ఉపవాసం మనిషిలో దైవభీతిని కలుగుజేస్తుంది.
అల్లాహు వినమ్రునిగా మారుస్తుంది. కోరికలకు కళ్ళెం వేస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి
మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. త్యాగనిరతిని పెంపొందింపజేస్తుంది. అవయవాల మీదే
కాక అంతరంగంపై కూడా మనిషికి అదుపు లభిస్తుంది. మంచి ఆరోగ్యా న్నిస్తుంది. పాపాలను తుడిచిపెట్టేస్తుంది.
ముస్లింలలో సాంఘిక చైతన్యం అభివృద్ధి చెందుతుంది. సోదరభావం పెంపొందుతుంది. ఆకలిగొన్న
వారిపట్ల,
అవసరాల్లో ఉన్నవారి పట్ల దయాభావం జాగృతమవుతుంది.

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు