పాఠం 1
దైవప్రవక్త (స) వారి ఉపవాస దివ్యోపదేశాలు
సర్వ స్తోత్రాలూ అల్లాహ్కే. ఆయన తన శాంతినీ, అనుగ్రహాలను తన ప్రవక్తపై, ప్రవక్త ఇంటివారలపై, సహచరులపై, విశ్వాసులందరిపై కురిపించాలని మా ప్రార్ధన.
ఇబ్బుల్ ఖయ్యిమ్ ఓ గొప్ప ఇస్లామీయ విద్వాంసులు.
ఆయన ఓ సందర్భంగా అంటారు, "రమజాన్ నెలలో దైవప్రవక్త
(స) వారి ఆదర్శం మనకు పరిపూర్ణ మార్గ దర్శకం. రమజాన్ మాసం తారసిల్లినప్పుడు ప్రజలు
పలు రకాల ఆరాధనల్లో నిమగ్నమవటమూ ఆ ఆదర్శంలో అంతర్భాగం. దైవదూత జిబ్రయీల్ (అలైహి) దైవప్రవక్త
(స)కు దివ్యఖుర్ఆన్ పాఠాలు బోధిస్తూ ఉండినది ఈ నెలలోనే జిబ్రయీల్ను కలిసినప్పుడు ఆయన
ప్రభంజనం కంటే అధికంగా ఔదార్యాన్ని ప్రదర్శించేవారని హదీసుల ద్వారా తెలుస్తుంది. సహజంగానే
ఆయన చాలా ఉదార స్వభావులు. అయితే రమజాన్ నెల రాగానే ఆయన ఉదారత్వం ఇంకా ఊపందు కునేది.
రమజాన్ నెల మొత్తం ఆయన దానధర్మాల్లో, సత్కార్యాలు చేయటంలో, దివ్యఖుర్ఆన్ పారాయణంలో, దైవారాధనలో, ధ్యానంలో, ప్రశాంతంగా అల్లాహ్ స్మరణలో
గడిపేసేవారు.
రమజాన్ మాసపు ఆరాధన కోసం ఆయన ఇతర నెలల్లో
కంటే ఎక్కువ సమ యాన్ని కేటాయించేవారు. రాత్రిళ్ళు ఎక్కువ సేపు ఆరాధనకే ప్రత్యేకించుకునేవారు.
ఒక్కోసారి రాత్రంతా అల్లాహ్ ఆరాధనలోనే గడిచిపోయేది. అయితే తన అనుయాయులను మాత్రం ఆయన
అంత విపరీతంగా ఆరాధన చేయవద్దని వారించేవారు. "మరి మీరు రాత్రంతా అదే పనిగా ఆరాధన
చేస్తూ పోవటం లేదా దైవప్రవక్తా?" అని ఆరాధనా ప్రియులైన
సహచరులు సందేహం వెలిబుచ్చితే, "నా శరీరం మీ శరీరాల వంటిది
కాదు. నేను నా ప్రభువు సన్నిధిలో ఉంటాను. ఆయనే నాకు భోజనం తినిపిస్తాడు, పానీయమూ త్రాపిస్తాడు" అని ఆప్యాయంగా వారికి బోధించేవారు
(ఈ హదీసు బుఖారి, ముస్లిం గ్రంథాలలో ఉంది). దైవప్రవక్త
(స) ఎడతెగకుండా ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు అనూహ్యమైన రీతిలో అల్లాహ్ ఆయనకు విజ్ఞానం, వివేకం, దివ్య సందేశ శక్తులు ప్రసాదిస్తూ
ఉండేవాడన్నమాట. 'ఆ శక్తిని ప్రాపంచిక మైన భోజన సామగ్రి
లాంటిదని ఊహించుకోనక్కరలేదు. అదే నిజమయితే దాన్ని అసలు ఉపవాసంగా భావించటానికి వీలు
ఎక్కడుంటుంది?
ప్రవక్త (స) నిత్యం తమ ప్రభువు ఆరాధన పట్ల
సంతుష్టులై ఉండేవారు. ఆయన హృదయ ద్వారాలు అంతిమ లక్ష్యం నిమిత్తం బార్లా తెరుచుకొని
ఉండేవి. ప్రభువు ధ్యానంలో ఆయన మనసు పరిపూర్ణ విశ్రాంతిని, సంతృప్తిని పొంద గలిగేది. ప్రభువు సామీప్యం మూలంగా ఆయన మానసిక
స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్నప్పుడు, ఇక ఆయన అన్నపానీయాలు
మరిచి పోయేవారు. వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తి మనిషిలో అంతర్గతమైన ఆత్మబలం మీద ఆధారపడి
ఉంటుంది. ఈ శక్తి భోజన పానీయాలతో నిమిత్తమయినది కాదు. ఆ శక్తితో ప్రభువు జ్ఞానాన్ని
చేరుకున్న మనిషికి ప్రపంచంలోని ఏ వస్తువూ హాని కలిగించజాలదు.
అల్లాహ్ ను ధ్యానించే, ఆయన్ను ఆరాధించేవారందరిలో కెల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి
వసల్లం అత్యుత్తములు, దైవారాధన, దైవధ్యానం, దివ్యఖుర్ఆన్ పారాయణం
విస్తృతంగా జరిగే శుభప్రదమైన మాసం రమజాన్. అందుకే దైవప్రవక్త (స) ఈ మాసంలో రాత్రులు
అల్లాహ్ను ప్రార్థిస్తూ, అల్లాహ్ పట్ల అత్యంత అణకువను కనబరుస్తూ
గడిపేవారు. ఆయన సహాయాన్ని, తోడ్పాటును, విజయాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని
కడు దీనంగా వేడుకునేవారు. సమాజులో దివ్యఖుర్ఆన్ లోని సుదీర్ఘమైన అధ్యాయాలను పారాయణం
చేస్తూ గంటల తరబడి అలాగే నిలుచొని ఉండేవారు. ఎంతో సేపు 'రుకూ' స్థితిలో వంగి ఉండేవారు.
అల్లాహ్ సమక్షంలో మోకరిల్లి (సజ్జా చేసి), అదే స్థితిలో చాలాసేపు
ఉండేవారు. ఆయనలో అల్లాహ్ ఆరాధన పట్ల కాంక్ష ఎంతో బలంగా ఉండేది. రాత్రి పూట ఆరాధనలో
ఎంత ఎక్కువ సేపు నిలబడితే ఆయనకు అంత ఎక్కువ ఆత్మ బలం. ఆధ్యాత్మిక శక్తి ఒనగూరుతూ ఉండేవి.
సర్వశక్తిమాన్యుడైన అల్లాహ్ ఆయన్ను సంబోధిస్తూ దివ్య ఖుర్ఆన్ గ్రంథంలో
ఇలా అన్నాడు: “ఓ వస్త్రమును కప్పుకున్నవాడా? కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు." (25 73: 1)
మరోచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు:
"రాత్రిపూట కొంతభాగం తహజ్జాద్ (సమాజు)లో
ఖుర్ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను "మఖామె మహమూద్"కు
(ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు." (95 17: 79)
ఉపవాస దినాలలోనూ దైవప్రపక్త (స) ఇస్లాం
ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తుండే వారు. ఉపవాసం ఉంటూనే అల్లాహ్ ధర్మోన్నతి కోసం పోరాడుతూ
(జిహాడ్ చేస్తూ) ఉండేవారు. ఉపవాస రోజుల్లోనే తన సహచరులకు శిక్షణా తరగతులు నిర్వహించే
వారు. ధర్మబోధనలు చేస్తుండేవారు. ఏదైనా లక్ష్యాన్ని గురిపెట్టుకొని దాన్ని సాధిం చాలనే
ఉద్దేశం లేకుండా దైవప్రవక్త (స) రమజాన్ మాసపు ఉపవాసాలు మొదలు పెట్టకపోవటం ఆయన ఆచరణల్లో
ఒకటి. రమజాన్లో ప్రతి రోజూ ఉషోదయానికి ముండే సహరీ ఆహారం తీసుకోవాలని ఆయన తన అనుచరులను
ప్రోత్సహిస్తుండే వారు, సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం
ఆయన తన సహచరులకు ఇలా ప్రబోధించారు:
"ఉషోదయానికి ముందే భోజనం ఆరగించండి. నిశ్చయంగా
ఆ వేళలో! (మీ కొరకు) శుభం ఉంది." (205)
ఉషోదయానికి ముందు ఉండే సమయాన్ని శుభప్రదమైనదిగా
పేర్కొనటం జరిగింది. ఎందుకో తెలుసా? అది రాత్రిలో చివరి
మూడో వంతు సమయం. అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చే సమయం. ఆయన తన దాసులకు క్షమాభిక్ష
పెట్టే సమయం అది. దివ్య ఖుర్ఆన్లో ఒకచోట ఇలా అనబడింది: "వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణకై (అల్లాహ్ను) వేడుకుంటూ
ఉంటారు." (51: 18)
మరోచోట ఇలా చెప్పబడింది: "వారు ఓర్పు వహిస్తారు. సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు.
దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేదు కుంటారు." (5 3:17)
అంతేకాదు, ఉపవాసం ప్రారంభించే ఉద్దేశంతో ఉషోదయానికి ముందు భుజించే ఆహారం
వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పగటిపూట విశ్వాసికి దాని వల్ల ఒంట్లో సత్తువ క్షీణించకుండా
ఉంటుంది. దాంతో పగలు దైవారాధన చేసుకోవ టానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
అలాగే స్థిరమైన వాస్తవం మరొకటుంది. దైవప్రవక్త
(స) పగలంతా ఉపవాసం పాటించినప్పటికీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే ఆయన ఆహారం తీసుకోవటంలో
త్వరపడేవారు. ఈ పద్ధతిని పాటించమని ఆయన తన అనుయాయు లకూ ఆదేశించి ఉన్నారు. ఖాళీగా ఉండే
కడుపు ఏదైనా తీపి పదార్థాన్ని తొందరగా గ్రహిస్తుంది. అందుకని సాధారణంగా ఆయన ఉపవాస విరమణ
కోసం కొన్ని ఖర్జూర పండ్లు, కాసిన్ని నీళ్ళు ఉపయోగించేవారు. పలు
ఉల్లేఖనాలు దైవప్రవక్త (స) ఇలా ప్రవచించినట్టు తెలుపుతున్నాయి:
“నిశ్చయంగా ఉపవాసి చేసే ప్రార్ధన తిరస్కరించబడదు."
అందుకని ఉపవాస సమయంలో ఆయన ఇహలోకంలోనూ, పరలోకంలోనూ తనకు శుభం ప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఉండేవారు.
సూర్యాస్తమయం అయిన వెంటనే మగ్రిబ్ నమాజు ఆచరించబడుతుంది కదా! ఆ సమాజుకు ముందే ఆయన ఉపవాస
దీక్షను విరమించేవారు. సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం, " ఈ దిశ నుంచి రాత్రి ప్రవేశించి ఆ దిశ నుండి అది నిష్క్రమిస్తే
ఇక ఉపవాసి తన దీక్షను విరమించాలి " అని ఆయన ప్రబోధిస్తుండేవారు.
ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ నెలలోనూ ప్రయాణాలు
చేసేవారు. ఈ కాలంలో ఆయన కొన్ని సార్లు ఉపవాసాలు ఉండేవారు. మరికొన్ని సార్లు ఉపవాసాలు
విడిచిపెట్టేవారు. ప్రయాణకాలంలో ఉపవాసం ఉన్నా లేకున్నా అది తమ ఇష్టమని దైవప్రవక్త
(స) తన సహచరులకు బోధించేవారు. అయితే యుద్ధ సమయాల్లో శత్రువులతో తలపడటానికి శక్తి కావాలి
కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉపవాసాన్ని విరమించాలని ఆయన వారికి ఆదేశించేవారు. 'బద్ర్' మహాపోరాటం జరిగింది. రమజాన్
నెలలోనే! ఈ పోరాటంలో ముస్లింలకు అల్లాహ్ నిరుపమానమైన విజయాన్ని చేకూర్చిపెట్టాడు. అయితే
ఖత్తాబ్ కుమారులు ఉమర్ (రజి) చెప్పిన ప్రకారం దైవప్రవక్త (స) రెండు యుద్ధాల్లో ఉపవాసం
ప్రారంభించారు. కాని తర్వాత దానిని మధ్యలోనే విరమించేసుకున్నారు. తిర్మిజీ, అహ్మద్ గ్రంథకర్తలు ఈ హదీసును తమ గ్రంథాల్లో క్రోడీకరించారు.
ఎంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఉపవాసం వదలివేయవచ్చు అనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు.
దీని గురించి ప్రామాణిక మైన ఆధారాలు కూడా ఏమీ లేవు. కొన్నిసార్లు దైవప్రవక్త (స) సంభోగానంతరం
అశుద్ధావస్థలో ఉండేవారు. అదే సమయంలో ఫజ్ నమాజుకు వేళ అయ్యేది. అటువంటి పరిస్థితిలో
ఆయన షరీఅత్బద్ధంగా స్నానం చేసి పరిశుద్ధులై ఉపవాస దీక్షను ప్రారంభించేవారు. దైవప్రవక్త
జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా జరిగివున్నాయి. కొన్ని సమ యాల్లో 'రమజాన్' ఉపవాసం పాటిస్తూ ఆయన తన
భార్యను ముద్దు పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఉపవాస స్థితిలో నీళ్లు త్రాగకూడదు, కాని నోరు పుక్కిలించటానికి అనుమతి ఉంది కదా! అలాగే ఉపవాస స్థితిలో
భార్యను ముద్దుపెట్టుకోవటంలోనూ తప్పు లేదని సోదాహరణంగా చెబుతుండేవారాయన.
ఒక వ్యక్తి నిజంగా మతి మరుపుకు లోనై తన
ఉపవాసాన్ని విరమించుకున్నట్ల యితే అతను మళ్ళీ ఆ ఉపవాసాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉండదని, అసలు అటువంటి పరిస్థితిలో ఉపవాస దీక్ష భగ్నమే కాదని, నిజానికి అల్లాహ్ స్వయంగా ఆ వ్యక్తికి తినిపించాడని, త్రాపించాడని దైవప్రవక్త (స) తీర్మానం చేశారు. ఉపవాస సమయంలో
తినటం,
త్రాగటం, కావాలని వాంతి చేసుకోవటం
వల్ల ఉపవాస దీక్ష. విరమించబడుతుందని ప్రవక్త ప్రవచనాలు మనకు ప్రబోధిస్తున్నాయి. అన్నపానీ
యాలు ఉపవాస దీక్షను నిర్వీర్యం చేసినట్లే భార్యతో సంభోగం కూడా ఉపవాస దీక్షను భగ్నం
చేస్తుందని దివ్య ఖుర్ఆన్ ద్వారా మనకు స్పష్టమయింది.
రమజాన్ నెల చివరి పదిరోజులు ఏకాంత ధ్యానం
(ఏతికాఫ్)లో, దైవారాధ నలో గడపటం కూడా దైవప్రవక్త (స)
వారి ఆచరణల్లో ముఖ్యమైనది. ఐహిక ఆసక్తులను విస్మరించి పూర్తిగా పది రోజుల పాటు నిరంతర
ఆరాధనలతో తన అంతరాన్ని అల్లాహ్ ఆరాధనలో నిలిపి ఉంచటానికి ఆయన ఈ దీక్షకు ఉపక్రమించే
వారు. ఈ సమయంలో ఆయన గారి మనోమయ జగత్తు సర్వం స్వర్గసాధనా కాంక్షతో నిండి ఉండేది. ఈ
పది రోజులూ ఆయన ప్రజలతో సంబంధాలు తగ్గించుకునేవారు. ఎక్కువ సమయం అల్లాహ్ ఆరాధనలోనే
వెచ్చించేవారు. ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రార్ధనల్లో, ఆరాధనల్లో నిమగ్నులై ఉండేవారు. ఆయన హృదయం అన్ని వేళలా ప్రభువు గుణగణాలను, విశేష లక్షణాలను ప్రస్తుతించటంలో లీనమై ఉండేది. ప్రస్ఫుటమైన
అల్లాహ్ చిహ్నాలను, ఆయన సృష్టించిన ఈ అనంత విశ్వాన్ని, భూమ్యాకాశాలలో ఆయన ఉంచిన వింతలనూ, విశేషాలనూ గుర్తు చేసుకుంటూ ఉండేది. ఈ విధంగా ఆయన ఎంత జ్ఞాన
సముపార్జన చేశారో, ఆయనకు ఎంత జ్ఞాన జ్యోతి ప్రసాదించ
బడిందో,
సృష్టికి సంబంధించిన ఎన్ని నిజాలు ఆయన హృదయ సీమలో ఆవిష్కృతం
అయి ఉంటాయో నిర్ణయించటం కష్టమే. సృష్టిలో అల్లాహు అత్యధికంగా ఎరిగిన వ్యక్తి, అల్లాహ్ పట్ల నిరుపమాన భయభక్తులు గలిగిన వ్యక్తి, అల్లాహ్ నే నమ్ముకొని, ఆయనపైనే ఆధారపడి
జీవించిన వారందరిలోకెల్లా ఉత్తముడైన వ్యక్తి ముహమ్మద్ (స) ఒక్కరే అన్న నిజాన్ని పై
సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మనుషుల్లో మహామనీషి ఆయన. అల్లాహ్ మార్గం కోసం తన సరస్వాన్ని
అర్పించిన ఘనుడు, త్యాగధనుడు.
అందుకే, కస్తూరి తన సువాసనలు వెదజల్లుతూ ఉన్నంత కాలం, కపోతాల కూని రాగాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నంతకాలం, కోయిల తన పాటలు ఆలాపిస్తూ ఉన్నంత కాలం అల్లాహ్ తన శాంతీకారుణ్యాలు ప్రవక్త ముహమ్మద్
(స)పై కురిపిస్తూ ఉండాలని వినయ పూర్వకంగా మా ప్రార్ధన,

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు