మన మాట కావాలి పూబాట
మనిషి సంఘజీవి అన్నది వాస్తవం. నలుగురితో కలవడం, సమావేశమవ్వడం, ఎన్నో విషయాల గురించి పరస్పరం చర్చించుకోవడం, సమాలోచనను జరపడటం జరుగుతూనే ఉంటుంది. ఈ సమావేశాలు ధర్మపరమైనవి. సంఘపరమైనవి. అర్థ పరమైనవీ, రాజకీయ పర మైనవి - ఏవైనా కావచ్చు. “విశ్వసించిన ఓ ప్రజలారా! మీ సమావేశాలలో (వచ్చేవారికి) చోటు కల్పించండని మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పించండి" అన్న అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహించాలి.
“విశ్వాసులారా ! మీరు గనక పరస్పరం రహస్యంగా మాట్లాడేటప్పుడు పాపమూ దౌర్జన్యమూ, "దైవప్రవక్త పట్ల అవిధేయతకు సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికి, దైవభీతికి నంబంధించిన విషయాలు మాటాడుకొండి. (ముజాదలః - 9)
బాణంతో దెబ్బ తిన్న వృక్షం చిగురించవచ్చు. గొడ్డలితో నరికిన అరణ్యం మరలా పెరిగవచ్చు, కాని వాగ్బాణాలతో గాయపడిన హృదయానికి, సరైన ఔషధం ఈ లోకంలో లేదు. అందుకే ఒద్దికగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, అవసరమైనప్పుడు మౌనం వహించాలి. మౌనం కూడా ఒక అభివ్యక్తే. మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారమన్నది ప్రసిద్ధ నానుడి. అలా అని అన్ని చోట్లా మౌనం ఆభరణం కాదు. మాట్లాడటం తప్పనిసరి. కాని అతిగా, అనవసరంగా మాట్లాడటం అంటే కోరి కష్టాల్ని తెచ్చుకోవడమే.
మాట తూలితే అదృష్టం వెక్కిరించడం ఖాయమని షేక్స్పి యర్ (wiliam Shakespeare) ఏనాడో చెప్పాడు. మాటని వెనక్కి తీసుకోవడం అంత సులువు కాదు. ధనస్సు నుంచి వేరైన బాణం నోటి నుండి వెలువడిన మాట రెండూ తిరిగిరావు. ఒకసారి నాలుక నుండి జారిన ఒక దురదృష్టకరమైన మాటను ఏడుగుర్రాలతోనైనా వెనక్కి తీసుకురాలేరు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. మన మాటే, మనం ఏమిటో "చెబుతుంది. " నీ నడకలో సమతూకం పాటించు. నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు." (సూరహ్ లుఖ్మాన్) అన్న అల్లాహ్ వచనాన్ని దృష్టిలో ఉంచుకుంటే మరీ మంచిది.
“నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుంది" అని పెద్దలు అంటుంటారు. ఎదుటి వాళ్ళను మిత్రులుగా చేసుకోవడమైనా, శత్రువులుగా మార్చు కోవడమైనా, మన మాటల మీద ఆధార పడి వుంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం అవసరం. ఆచరణ సాధ్యంకాని అంశాల గురించి వాగాడంబరం అసలే అక్కరలేదు.
మాటలతో మాయ చేయవచ్చనుకుంటారు చాలా మంది, కాని వాగుడుకాయల డొల్లతనాన్ని వాళ్లకన్నా వేగంగా ఎదుటి వాళ్లు పసి గడతారు. ''చీటికి మాటికి ఒట్లు వేసే నీచుడికి ఏ మాత్రం లొంగకు. వాడు ఎత్తిపొడుస్తూ ఉంటాడు. చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు." (ఖలం: 10-11) అన్న ఖుర్ఆన్ వచనాన్ని సదా దృష్టిలో ఉంచుకున్నవారు, మంచిగా మాట్లాడటం, ఇతరుల హృదయాలను నొప్పించకుండా మాట్లాడటం కూడా ఓ కళ అని తెలిసిన వారు, వివేచనతో మాట్లాడగలరు.
మాటకీ - మాటకి మధ్య కాసింత మౌనానికి చోటు ఇవ్వగలరు. మాట్లాడటం కంటే అధికంగా వినాలి అధికంగా చూడాలి, దేవుడు రెండు కళ్ళూ రెండు చెవులు ఇచ్చి నాలుక మాత్రం ఒక్కటే ఇచ్చాడు.
ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచి మాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు. ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటివారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. మరియు అలాంటివారే బుధ్ధిమంతులు. (జుమర్ - 18)
ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది
మన నోటితో మానవతా పరిమళం నిండివుండే మాటలకి ప్రాణం పోయాలి. జగమంతా మనకు చేరువగా వుంటుంది. అప్పుడే ఇహ పరాల సాఫల్యం సామధ్యమవుతుంది. అంతిమ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: "ఎవరైతే రెండు దవడల మధ్య గలదాని (నాలుక) గురించి మరియు రెండు తొడల మధ్య గలదాని (మర్మాంగం) గురించి నాకు హామీ ఇస్తాడో నేను అతనికి స్వర్గం జమానతునిస్తాను.” (బుఖారి)
ఒక్క మాటలో చెప్పాలంటే, పలుకే బంగారం. మాటే మంత్రం. ఒకళ్ళని ఒప్పించాలన్నా మాటే, ఒకళ్ళని నొప్పించాలన్నా మాటే, ఒకళ్ళని మెప్పించాలన్నా కూడా మాటే. అటువంటి మాట ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలిస్తే ప్రపంచాన్ని కూడా మాటతో జయించవచ్చు.
అల్లాహ్ ఈ మాటను ఆచరణలో పెడితే - జీవితం శాంతిమయం అవుతుంది.
అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని; తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో (చిరునవ్వు మోముతో) మంచిమాటలు పలకాలని; ప్రార్థనా వ్యవస్థ (నమాజ్) స్థాపించాలని; (పేదల ఆర్థికహక్కు) జకాత్ చెల్లిస్తూ ఉండాలని మేము ఇస్రాయీల్ సంతతి చేత ప్రమాణం చేయించాం. (అల్ బఖర : 83)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు